బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి)ఖబుర్లు–వరలక్ష్మివ్రతం

IMG_0376b

ప్రతీ ఏడాదీ చేసినట్లుగానే ప్రొద్దుటే 8.00 గంటలకల్లా మొత్తం 9 పిండివంటలూ చేసి వరలక్ష్మిపూజ విజయవంతంగా పూర్తిచేసింది మా ఇంటావిడ-చి.సౌ.సూర్యలక్ష్మి–గాడ్ బ్లెస్ హెర్.

బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–హూష్ కాకి

D29637532

మనం చిన్నపిల్లల్ని ఊరుకోపెట్టడానికి, ” హూష్ కాకి ఎత్తుకు పోయిందీ” అంటాము. ఇక్కడ నిజంగానే కాకి ఎత్తుకుపోయింది!! ఈ నాటి సాక్షి లో వార్త.

బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    ఈ వేళ సాయంత్రం, మా ఇంటావిడ , నిమ్మకాయలూ, దబ్బకాయలూ తెమ్మంటే మార్కెట్ కి వెళ్ళాను. అక్కడ ప్రక్కనే ఒక అతను పనసపొట్టు కొడుతున్నాడు అంటే తెలుసు గా –-పచ్చి పనసకాయని కత్తితో చిన్న చిన్నముక్కలుగా కోయడం–అది ఒక ప్రొఫెషనల్ జాబ్, అందరూ చేయలేరు.చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది. ప్రక్కనే ఒకాయన తన కుమారుడికి వివరిస్తున్నారు, పనసకాయ అంటే ఏమిటీ,అలా పొట్టుగా తయారైనదానిని, ఆవ పెట్టి కూర ఎలా చెస్తారో అన్నీను. నాకైతే విచిత్రంగా అనిపించి, ఆయననూ, ఆ అబ్బాయినీ పలకరించాను. చెప్పానుగా నాకు కొత్తవారితో పరిచయం చేసికోవడం చాలా ఇష్టం.

    వారు గత 5 సంవత్సరాలనుండీ ఉద్యోగ రీత్యా లండన్ లో ఉంటున్నారుట, శలవలకి , ఆ అబ్బాయి అమ్మమ్మ గారింటికి వచ్చాడుట. ” మా వాడికి ఇవన్నీ విచిత్రంగా కనిపిస్తున్నాయీ, అందుకని వివరిస్తున్నానూ ” అన్నారు. అలా కొంచెం సేపు ఖబుర్లు చెప్పుకున్నాము. ఇప్పటి జనరేషన్ వారికి ఇలాంటివి చాలా తెలియదు, తరవాత తరానికైతే అస్సలు అడగఖర్లేదు అన్నారు. ” మనం ఇంట్లో శ్రధ్ధ తీసికుని, మన సంస్కృతీ,ఆచారవ్యవహారాలూ ఓపిగ్గాచెప్తే వింటారూ, ఇప్పటి వారిలో ఉన్న సుగుణం అదేనండీ” అన్నాను. ఇన్టర్నెట్ లో ఇస్తున్న వివరాలు చూస్తూంటే ఎంత సంతోషం వేస్తోందో !! వికిపీడియా చూస్తే తెలుస్తోంది అక్కడ లేని సంగతి లేదు.మనకి ఓపిక ఉండాలి అంతే.

    ఇంతలో ఆ అబ్బాయి తాతగారు వచ్చారు. నన్ను ఆయనకి పరిచయం చేశారు. ఆయన ముంబైలో బి.ఏ.ఆర్. సీ లో 35 సంవత్సరాలు పనిచేశారుట. అంటే ఇన్నాళ్ళూ అక్కడే ఉండి, ప్రస్తుతం రాజమండ్రీ కి వచ్చారు. ఆయన నాపేరూ, ఇంటిపేరూ అడిగి ” మీరు వైదీకులా, నియోగులా “ అన్నారు. అంటే నేనన్నానూ, ” మీరు ముంబైలో ఉన్న 35 సంవత్సరాలూ ఈ ప్రశ్న ఎవరినైనా ( తెలుగు వారిని) అడిగారా”. అంటే “ఇక్కడ అందరూ అడిగే మొదటి ప్రశ్న ఇదేనండీ, మీరెవరూ, మీశాఖ ఏమిటీ ఫలానా ఫలానా...” అంటే నేనన్నానూ ” ఇక్కడ అడిగితే మీకు ఇష్టం ఉంటే చెప్పండి, అంతేకానీ, ఇన్ని సంవత్సరాలూ ఎప్పుడూ అడగని ఈ ప్రశ్న మీరెందుకు ఇంకోళ్ళని అడుగుతారూ“అన్నాను.దానికి ఆయన నవ్వేసి, ” ఎక్కడుంటే అక్కడ వాతావరణానికి సర్దుకోవాలిగా “ అన్నారు. నా ఉద్దేశ్యంలో మనం ఎక్కడున్నా మన ప్రిన్సిపుల్స్ ని కాంప్రమైజ్ చేయఖర్లేదని. 45 ఏళ్ళుగా లేని కొత్త అలవాట్లు చేసికుని లేనిపోనివి కొనితెచ్చుకోవడం ఎందుకూ?

    రాత్రి జీ టివీ లో “లక్ష్మి టాక్ షో” అని ఓ ప్రోగ్రాం వచ్చింది. ఈ వేళ్టి అతిథి జయ సుధ. ఆవిడ చెప్పినవన్నీ తన నటన లాగే చాలా సహజం గా ఉన్నాయి. ఒక ప్రశ్నకి సమాధానం గా ఒక సంగతి చెప్పారు. తనూ, జయప్రదా, శ్రీదేవీ , –ముగ్గురూ తెలుగేతరులనే వివాహం చేసికున్నారూ. అందరూ బహుశా ” పొరుగింటి పుల్లకూరే” ఇష్ట పడ్డారేమో అని.నాకైతే ఆ ఇంటర్వ్యూ చాలా నచ్చింది.తను రాజకీయాల్లోకి ఎందుకు రావలిసి వచ్చిందీ, తను క్రైస్తవ మతం ఎందుకు పుచ్చుకున్నారూ,లాంటి ప్రశ్నలకి నిజాయితీ గా వివరించారు. ఒక్కటి మాత్రం నవ్వు వచ్చింది–” మీకు ఎప్పుడూ మీ వారితో దెబ్బలాట రాలెదా ” అన్నదానికి ” ఎందుకు రాలెదూ, ఎన్నోసార్లు వచ్చిందీ, వెళ్ళిపోతానని చాలా సార్లు బెదిరించాను, నాకు కారు డ్రైవింగు రాదు, ఏ ఆటో లోనో, టాక్సీలొనో వెళ్తే వాడు ఎక్కడికో తీసికెళ్తాడేమో అని భయమూ, లెకపోతేనా ఎప్పుడో పారిపోయేదానినీ” అంటూ చాలా బాగా చెప్పారు.

    ఈ రెండు రోజులూ టి.వీ. న్యూస్ చూస్తూంటే ఓ విధమైన రోత పుడుతోంది. అసెంబ్లీ లో వాళ్ళు కొట్టుకునే విధం చూసి. మన రాజకీయ నాయకులు ఎన్ని పుటాలు వేసినా బాగుపడరండీ. ప్రజల సొమ్ము ఎలా వ్యర్ధం అవుతోందో మన అసెంబ్లీ కార్యక్రమాలు చూస్తే అర్ధం అవుతుంది.ఎలా ప్రజలని దోచుకుందామా అనేకానీ,ఇంకో ధ్యాస లెదు. మన దురదృష్టం ఇలాంటి వాళ్ళనే ఎన్నుకోవలసి వస్తూంది.ఎప్పటికి బాగుపడతామో, ఆ భగవంతుడే మనల్ని కాపాడాలి.!!

బాతాఖానీ ఖబుర్లు–46

    పూణే వచ్చిన సందర్భంలో, మా ఇంటావిడ ముంబై లోమా అమ్మాయి దగ్గర ఉండవలసివచ్చింది. నెను 1983 దాకా పనిచేసిన చోటు కాకుండా ఇంకో ఫాక్టరీ కి నా ట్రాన్స్ఫర్ వచ్చింది. ఇక్కడంతా కొత్తా నాకు.1999 ఫిబ్రవరీ దాకా నాకు, ముంబై పూణే లమధ్యలో తిరగడంతోటే సరిపోయింది, మా అమ్మాయి డెలివరీ సందర్భంలో. జనవరి లో భోగి నాడు మాకు ఓ మనవరాలు పుట్టింది.

    నెను పూణే రావడం మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది. ఇంక హాస్టల్ భోజనమూ అవీ తప్పుతాయిగా. మా అమ్మాయి పాపం నాలుగు సంవత్సరాల కాలెజీ చదువూ, హాస్టల్లో ఉండే చదువుకుంది. అబ్బాయికి సుఖపడే యోగం ఉంది. హాస్టల్ నుండి మకాం మార్చేశాడు. ఇంక ప్రతీ రోజూ కాలేజీకి వెళ్ళడానికి, బస్సుల్లో వెళ్ళడం, చికాకైపోతూందని, ఓ బైక్కు కొనమని అడిగాడు. కండిషన్ ఏమిటంటే ప్రతీ రోజూ నన్ను ఫాక్టరీ దాకా దిగపెట్టడం!! అది తనే అన్నాడు.ఇంకా 20 ఏళ్ళు నిండలెదూ,ఇప్పటినుంఛీ బైక్కు ఎందుకూ, ఆ ట్రాఫిక్కూ అదీ ఎక్కువగా ఉంటుందీ అని వాయిదా వేద్దామన్నా కుదరలెదు.బజాజ్ బైక్కు ఒకటి కొనిచ్చాను. దానితో సరిపోయిందా, ఇంట్లో ఉన్న కంప్యూటర్ చాలా ఔట్ డేటెడ్ అని కొత్తది కొనమన్నాడు. తప్పుతుందా !! ఇంక ప్రతీ శనివారమూ వాడి ఫ్రెండ్స్ ఓ అరడజను మంది భోజనానికి వచ్చేశేవారు, అదీ చెప్పాపెట్టకుండా. మా ఇంటావిడకి కాలెజీ అయిన తరువాత ఫోన్ చేసేవాడు–” అమ్మా, ఇంట్లోనే ఉంటావుకదా, మా ఫ్రెండ్స్ వస్తామంటున్నారూ, రమ్మనమంటావా” అంటూ. వద్దని ఏ తల్లి అంటుందీ? సడెన్ గా ముంబైనుంచి మా అమ్మాయి దగ్గరనుండి ఫోన్ వచ్చేది , నెలల పిల్లతో చేసికోవడం కష్టం కదా, ఏ అవసరం వచ్చినా రమ్మనెది. మా అబ్బాయి వాళ్ళ అమ్మని, ఖడ్కీ స్టేషన్ లో ట్రైన్ ఎక్కించేవాడు, మా అల్లుడు కల్యాణ్ స్టేషన్లో రిసీవ్ చేసికునేవాడు.

    మా ఇంటావిడకు ఆ ఏడాది అంతా పూణే–ముంబై లమధ్య తిరగడంతోటే సరిపోయింది.మనవరాలి మొదటి పుట్టినరోజు అవగానే మా అమ్మాయికి మూడు నెలల పాటు యూ.ఎస్. వెళ్ళవలసివచ్చింది. మనవరాలిని మేము తెచ్చేసుకున్నాము. అల్లుడు ప్రతీ శుక్రవారం, తన బైక్కు మీద పూణే వచ్చేసి,పాపని తీసికొని, వాళ్ళ పేరెంట్స్ ఇంటికీ వేళ్ళేవాడు. 1998 కే మా అల్లుడి పేరెంట్స్ ఢిల్లీ నుండి పూణే కి మకాం మార్చేశారు. ఆదివారం సాయంత్రం పాపని మా దగ్గర వదిలెసి, తిరిగి ముంబై వెళ్ళిపోయేవాడు. వారం లో మా అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పాపం వాళ్ళే మా మనవరాలిని ఆడించేవాళ్ళు.

    ఇంక నన్ను ఫాక్టరీలో పర్చేస్ డిపార్ట్మెంట్ కి వేశారు-అంతకుముందెప్పుడూ అలాంటి దానిలో పనిచేయలెదు, అంతా కొత్త. అయినా ధైర్యంగా, అందరిదగ్గరకూ వెళ్ళి పని నేర్చుకున్నాను. గవర్నమెంట్ పర్చేస్ లలో బోల్డన్ని రూల్సూ, మెడకెస్తే, కాలికీ, కాలికేస్తే మెడకీ. కానీ పనిమాత్రం చాలా ఇంటరెస్టింగ్ గా ఉండేది.ముందు, అక్కడ పనిచేసేవాళ్ళందరికీ, నామీద, నా పనిమీదా అంత నమ్మకం ఉన్నట్లుగా కనిపించలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా నా పని నెను చేస్తూ, అందరి విశ్వాసాన్నీ సంపాదించాను.ఆరు నెలలు గడిచేసరికి, మొత్తం ఫాక్టరీ అందరికీ తలలో నాలికలా తయారైయ్యాను. అందరికీ నాతో అవసరమే. ఎప్పుడు ఎవరు ఏమి కావాలని అడిగినా ” కాదు” అని ఎప్పుడూ అనలేదు. ” నో” అని చెప్పి ఆ అడిగినవాడిని బాధపెట్టడం ఎందుకూ? సరేనంటే వాడు సంతోషంగా వెడతాడు. పని మన ” పేస్ ” లోనే చేయడం.కానీ అందరినీ అస్తమానూ సంతృప్తి పరచలెముగా, మీటింగు లలో ఒక్కొక్కప్పుడు పని అవడం లేదూ అని కంప్లైంటులు చేసేవారు. ఓ సారి మా జి.ఎం గారు, ఇవన్నీ విని మీటింగ్ అయిన తరువాత తనని కలుసుకోమన్నారు. అక్కడ అడిగారు–” మామూలుగా మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి ఎంత సమయం పడుతుందీ” అని. అంటే చెప్పాను -” జి.ఎం . సాంక్షన్, టెండర్ ప్రొసిజర్ అన్నీ కలిపి మొత్తం నెల పడుతుందీ” అని. ఐతే నా అఫీసుకి ఏదైనా కావలిసినా అంత టైమూ పడుతుందా అన్నారు. అంటే –” నో సార్, మీ ఆఫీసుకైతే రెండు రోజుల్లో తెప్పించగలనూ “ అన్నాను.ఎలాగా అన్నారు.జి.ఎం .శాంక్షన్ వచ్చేసింది కాబట్టి, మిగిలినవన్నీ రెండు రోజుల్లో అయిపోతాయి, అనగానే ఆయనకు అర్ధంఅయింది, మొత్తం ఫాక్టరీకి కావలిసిన వస్తువులన్నీ అడగడానికి 50 సెక్షన్లున్నాయి, కానీ అవి తెప్పించడానికి ఓ సెక్షనే ఉందీ, అందువల్లే ఒక్కొక్కప్పుడు ఆలశ్యం అవుతూంటుందీ అని.ఆరోజు నుండీ పెర్మిషన్ ఇచ్చేశారు– నీ పధ్ధతి ప్రకారమే చెయ్యి. మీటింగుల్లో ఎవరైనా అడిగినా నేను చెప్తాను వాళ్ళకి, ఇందులో ఉన్న కష్టం ఏమిటో. అప్పుడు తెలిసింది ఫాక్టరీ జి.ఎం. సహకారం ఉంటే పనిచేయడం ఎంత శులభమో.

బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–EMIs

    1992 తరువాత ఆర్ధిక సంస్కరణల ధర్మమా అని ఈ.ఎం.ఐ లు ఒక ఫాషన్ అయ్యాయి. ఇదివరకటి రోజుల్లో అయితే ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనాలంటే, దానికి కావలిసిన డబ్బు చేకూర్చుకోవడమూ, తీరా అంత డబ్బూ పోగైన తరువాత ఏదో అనుకోని ముఖ్యమైన ఖర్చు రావడమూ, ఈ డబ్బు దానికి ఖర్చైపోవడమూ. అలాగే జీవితమంతా గడిచి పోయింది.నెను మొట్టమొదట టి.వీ. కొనడానికి, మా క్రెడిట్ సొసైటీ లో లోన్ తీసికుని కొన్నాను.ఆ లోన్ జీతం లో కట్
చేసేవారు. ఒకవిధంగా అదికూడా ఈ.ఎం.ఐ లాంటిదే. ఆ రోజుల్లో అందరూ కొంటున్నారు కదా అని ఫ్రిజ్ కొందామని వెళ్తే ఆ రోజుల్లో కొన్ని బాంకులు కొన్ని కంపెనీలతో లింక్ పెట్టుకొని, ఆ కంపెనీల వస్తువులకే అప్పు ఇచ్చేవారు. అందువలన ఫ్రిజ్ కొనడం పడలెదు. ఎవరైనా అడిగినా ” మాకు ఫ్రిజ్ అంటే అంత ఇష్టం లేదండీ” అంటూ, ఓ వెర్రి సాకు చెప్పేవాడిని!! వచ్చే జీతం సంసారం సజావుగా గడపడానికే సరిపోనప్పుడు ఈ వస్తువులన్నీ లగ్జరీ ఐటం ల లాగే కనిపించేవి. అదృష్టం ఏమిటంటే మా ఇంటావిడ కానీ, పిల్లలు కానీ ఎప్పుడూ నన్ను ఇరుకున పెట్టలెదు–ఇలాంటివి కావాలని !! పూణే లో ఉన్నంత కాలం, ఫ్రిజ్ కొనుక్కునే అవకాశమే రాలెదు– కారణం అంత డబ్బు ఎప్పుడూ స్పేర్ లో ఉండేది కాదు. అలాంటిది నాకు వరంగాం ట్రాన్స్ఫర్ అయిన ఏడాది లోపులో అంత డబ్బూ ఒక్కసారే ఇచ్చేసి “ఆల్విన్” ఫ్రిజ్ కొన్నాము. ఆరోజు నిజంగా మా ఇంట్లో పండగే, మొట్టమొదటిసారిగా పూర్తి డబ్బు ఇచ్చి ఓ వస్తువు కొనుక్కోడంలో ఉన్న మజా ఏమిటో తెలిసింది !! ఇదంతా నేనేదో ఘనకార్యం చేశాననడానికి చెప్పటంలేదు, వాయిదా పధ్ధతి కాకుండా వస్తువు కొనడంలో ఉన్న ఆనందం/ సంతోషం ఎలా ఉంటాయో చెప్పాలని మాత్రమే. మీ ఇళ్ళలో ఉన్న మీ నాన్న గారిని కానీ, తాత గారిని కానీ అడిగి చూడండి–వాళ్ళు చెపుతారు.

    అలాంటిది ఈ రోజుల్లో ఎవరైనా ఏ వస్తువైనా– అది ఇల్లు కానీండి, కారు కానివ్వండి, ఇంట్లోకి కావలిసిన ఏవస్తువైనా సరే– అలా కొనకలుగుతున్నారా? ఏమైనా అంటే ఈ రోజుల్లో అన్నింటికీ ఖరీదులు ఎక్కువా అంటున్నారు, కానీ మీ జీతాలు కూడా అలాగే ఉన్నాయిగా బాబూ. వీటికి సాయం క్రెడిట్ కార్డులు, వాళ్ళైతే గూబ పగిలేటట్లుగా వడ్డీ వసూలు చేస్తారు. అయినా సులభ వాయిదాలంటూ మనం కొంటూనే ఉంటాము. ఉద్యోగం రాగానే ముందుగా ఓ బైక్కూ, కారూ, ఫ్లాట్టూ కొనేయాల్సిందే. అవి మనచేత కొనిపించడానికి ఈ బాంక్ వాళ్ళు ఎప్పుడూ రెడీ గా ఉంటారు, గుంత కాడ నక్కల్లాగ!!ఫ్లాట్ కొనగానే సరి కాదుగా, దానిలోకి కావలిసిన హంగులన్నీ కావాలిగా!! అన్నీ కలిపి తడిపి మోపిడౌతుంది. ఊళ్ళో మనవాడింట్లో అందరూ వీడి ప్రయోజకత్వమే అనుకుంటారు. అబ్బో మన వాడు ఉద్యోగంలోకి వచ్చీరాగానే అప్పుడే ఇల్లుకూడా కొనేశాడుట, మంచి పెళ్ళికొడుకూ అని మార్కెట్ లో మంచి డిమాండ్ వచ్చేస్తుంది. జరిగేదేమిటంటే మనవాడికి పెళ్ళి అయేసరికే అప్పుల ఊబిలో ఉంటాడు. ఆ వచ్చే పిల్లకూడా ఉద్యోగం చేస్తేకానీ, ఈ అప్పులు తీరవు. ఈ మధ్యన వచ్చిన ఆర్ధిక మాంద్యం లాంటి దేమైనా వచ్చిందా అంతే సంగతులు, మింగలేరూ ,కక్కలేరూ.

    ఇదివరకనుకునేవారూ ఎప్పటికైనా చనిపోతే స్వంత ఇంట్లోనే పోవాలని. కారణం ఏమిటంటే అద్దె ఇంట్లో ఉంటే అతని ” డెడ్ బాడీ” ని ఇంట్లో ఉండనిచ్చేవారు కాదు. అందుకనే “ అంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనక్కాల చచ్చేడూ “ అనే వారు, అంటే స్వంత ఇల్లు లేదని !! ఈ కారణం వలన ఇంటి యజమాని ఎలాగోలాగ తల తాకట్టు పెట్టైనా ఓ ఇల్లు నిలబెట్టుకునే వాడు,అదీ మరీ ఎక్కువ అప్పు చేయకుండా. బాగా వయస్సు పైబడ్డవాళ్ళుంటే అద్దెలకు ఇళ్ళు దొరికేవి కాదు.

    పొనీ ఈ రోజుల్లో అప్పు చేసి ఓ ఫ్లాట్ కొన్నామనుకుందాము, దానికి ఓ 15–25 సంవత్సరాలదాకా ఈ.ఎం.ఐ లు కడుతూండాలి. పోనీ కొన్ని సంవత్సరాలు ఎలాగో

పొదుపు చేసి ఆ అప్పు తీరుద్దామనుకుని బాంక్ వాడి దగ్గరకు వెళ్తే వాడు ఈ లెఖ్ఖలూ, ఆలెఖ్ఖలూ చెప్పి ముందరి 5 సంవత్సరాలూ వడ్డిక్రిందే డబ్బు కట్టామని తేలుస్తాడు, అంటే మన అప్పు అప్పులాగే ఉందన్నమాట.ఇన్నాళ్ళూ ఆ బాంక్ వాళ్ళ జీతాలు మనం ఇచ్చామన్నమాట !! అందుకనే ఈ బాంక్ ఎక్జిక్యూటివ్ లు, వాళ్ళ జీతాలకొసం మనని వాడుకుంటున్నారన్నమాట.రోజుకో ఫోన్ కాలూ, ” మీకు జీవితంలో ఏదైనా కొనాలనుకుంటే మేము అప్పు ఇస్తామూ” అని. పోనీ ఇన్ని కష్టాలూ పడి ఓ ఫ్లాట్ కొన్నామే అనుకోండి దాంట్లోనే నచ్చినా నచ్చకపోయినా నోరు మూసుకొని ఉండాల్సిందే. అద్దె ఇల్లు అయితే ఆ గొడవే ఉండదు, మనకి నచ్చకపోతే ఇంకో ఇల్లు చూసుకొంటాము. ప్రపంచం లోని ఇళ్ళన్నీ మనవే !! మనవాడు కట్టే ఈ.ఎం.ఐ 15–25 సంవత్సరాల అద్దె అన్నమాట. పైగా స్వంత ఇల్లని పేరొకటీ , ఆ ఇంటి కాగితాలు(ఒరిజినల్స్) మనం పాతిక సంవత్సరాల తరువాతే చూడడం.దీంట్లో ఇంకో జస్టిఫికేషన్ చెప్తారు, మనం ఇంటిమీద ఇన్వెస్ట్ చేసినది పాతిక సంవత్సరాల తరువాత డబులో, ట్రిపులో అవుతుందీ అని. ఓ సంగతి మర్చిపోతున్నాము మనం ఈ పాతిక సంవత్సరాలూ మనం కట్టినది (వడ్డి తో సహా) మాత్రమే మనకి వస్తూందీ అని. ఇందులో మనకి ఏదో లాభం వచ్చేసిందనడానికి ఏమీ లెదు.

    చెప్పేదేమిటంటే మనం ఈ విష వలయంలో చిక్కుకుపోయాము. బయట పడలేము. ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఆస్థేమిచ్చారనేవారు, ఇప్పుడు ఈ.ఎం.ఐ లు ఇంకా ఎన్ని మిగిల్చాడూ అంటున్నారు !!

బాతాఖానీ ఖబుర్లు –45

    మా అమ్మాయి పెళ్ళిచెసి, పిల్లని అప్పగించెసిన తరువాత అంతా శూన్యం అయిపోయినట్లనిపించింది.భగవంతుని దయ వలన అత్తవారింట్లో అమ్మాయి ఎలా ఉంటుందనే శంక. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ లెదు. అమ్మాయి మా దగ్గర లేకుండా ఉండడం నాలుగు సంవత్సరాల క్రితమే, అంటే తను ఇంజనీరింగు చదవడానికి, పూణే వెళ్ళినప్పుడే ప్రారంభం అయింది.ఎప్పటికైనా అమ్మాయి పరాయి ఇంటికి వెళ్తుందని తెలుసును, అన్నింటికీ సిధ్ధపడతాము, అయినా అదో ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్, వచ్చేస్తుంది.ఇది ప్రతీ తండ్రీ ఎప్పుడో అప్పుడు అనుభవించాల్సిందే. ఈ సందర్భంలో శ్రీ శంకరమంచి సత్యం గారు వ్రాసిన అమరావతి కథలలో ” అంపకం “ అనే కథ చదవండి.ఇంకో ఇంటినుండి మనం ( అంటే ఈ తండ్రులూ అనే ప్రాణులు) ఓ అమ్మాయిని తెచ్చేసుకున్నాము కదా, దానికి ఈ రూపంలో జరిమానా అన్నమాట !! అయినా జీవితం సాగుతూనే ఉంటుంది. ఈ మధ్యన పూణే వెళ్ళినప్పుడు మా అమ్మాయితో ఓ రెండు గంటల పాటు ఖబుర్లు చెప్పే అవకాశం వచ్చింది, మా ఇంటావిడ చెప్పినట్లుగా, ఈ పన్నెండు సంవత్సరాలలోనూ, తనూ, తన కాపురమూ ఎలా ఉన్నాయని అడగవలసిన అవసరం కలగలెదు–మా అల్లుడూ, అతని తల్లితండ్రులూ అంత మంచివారు . గాడ్ బ్లెస్ దెం .

    అమ్మాయి ఇంజనిరింగు చదవడానికి పూణే వెళ్ళిపోయినా, మా అబ్బాయి మా దగ్గరే ఉండడం బట్టి ఎక్కువగా పిల్లలు దూరం అయేరనిపించలేదు. దేముడి దయ వలన మా అబ్బాయి కూడా క్లాస్ 12 లో, మరీ వాళ్ళ అక్క, బావగార్లలాగ 98, 99 % లు తెచ్చుకోలేదు. 95–96 % తో సరిపెట్టేశాడు. నాకైతే పూణే లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగులోనే ( మా అమ్మాయి చదివిన కాలెజీ ) మా అబ్బాయి కూడా చదివితే బాగుంటుందనిపించింది. కాంప్టీషన్ వలన తనకి కావలిసిన సబ్జెక్ట్ లో దొరకలెదు. అయినా చేరాడు ( బహుశా మా కోరిక తీర్చడానికేమో).

    1997 జూలై కల్లా మా అబ్బాయీ, అమ్మాయీ వాళ్ళదారిన వాళ్ళు వెళ్ళిపోయారు,ఒకళ్ళు కొత్తజీవితం ప్రారంభించడానికీ, రెండో వాళ్ళు పై చదువులకీ. ఇంక మేమిద్దరమూ, మా అమ్మగారూ మిగిలాము వరంగాం లో.పిల్లలిద్దరినీ ఓ సరైన గాడిలో పెట్టామనే అనుకుంటాము. అబ్బాయి విషయం లోనే కొంచెం భయ పడ్డాము– చిన్నప్పటినుండీ, అంటే లోయర్ కెజీ నుండి, క్లాస్ 12 దాకా పూర్తి గ్రామీణ వాతావరణంలో చదివాడు, పూణే లాంటి పేద్ద నగరంలో ఎలా నెగ్గుకొస్తాడా అని. హాస్టల్లో సీట్ దొరకకపోవడం వల్ల, బయట రూం తీసికోవాల్సి వచ్చింది. ఎలాగైనా అమ్మాయితో ఒకలాగ ఉండేది, అబ్బాయితో ఇంకోలాగ!! ఏది ఏమైనా భగవంతుడి దయతో, అబ్బాయి కూడా హాస్టల్లో సీట్ సంపాదించాడు. . అమ్మాయి టైములోలాగానే, ప్రతీ నెలా పూణే వెళ్ళేవాడిని, శలవలకి తను వచ్చేవాడు. ఒకసారి వచ్చినప్పుడు, తనతో చెప్పాను, బ్లాక్ ఎండ్ వైట్ టి.వీ, మార్చి,కలర్ ది తీసుకుంటున్నానూ అని.ఇంటావిడతో చెప్తే వద్దంటుందేమోనని భయం. చెప్పకుండా వెళ్ళాను. మాఇంటావిడ వచ్చి ‘ మీ నాన్నగారు ఎక్కడరా అని అడిగితే నాకు తెలియదూ అన్నాడు. సాయంత్రం ఓ టైము గడిచేసరికి ఇంక ఖంగారు పుట్టింది, ఎప్పుడూ చెప్పకుండా బయటకు వెళ్ళరూ, ఏమైపోయానో అని.మా ఫ్రెండు డాక్టరుగారింటికి వెళ్ళి, అన్ని చోట్లా వెదకడం మొదలెట్టారు. ఇంతట్లో ఓ తెల్ల వ్యాన్ లో ఎల్.జి. వాళ్ళ కలర్ టి.వీ .పెట్టుకుని ఇంటికి వచ్చాను. ఆ తెల్ల వ్యాన్ ఎదో ఏంబ్యులెన్స్ అనుకొని ఇంకా ఖంగారు పుట్టిందిట. సంగతి తెలిసికొని మా ఇంటావిడా, డాక్టరుగారూ చివాట్లు పెట్టారు.

    1998 లో మా అమ్మాయికి సూడిదలు తీసికొని బొంబాయి వెళ్ళాము. ఆ ముహుర్తం కూడా మా మామగారే పెట్టారు. సూడిదల కార్యక్రమం పూర్తిచెసికునే సరికి,

ఫోన్ వచ్చింది– మా మామగారు సడెన్ గా హార్టెటాక్ వచ్చి స్వర్గస్తులయ్యారని.వెంటనే విశాఖపట్నానికి ప్రయాణం అయి వెళ్ళాము. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా చాలదు. ఆయన సహాయమే లేకుంటే తణుకు లో ఇల్లు కట్టుకునేవాడిని కాదు. ఎంత నమ్మకం లేకపోతే అంతంత డబ్బు ముందుగా ఖర్చు పెట్టగలుగుతారు? అంటే డబ్బు సహాయం చేశారు కదా అని ఆయనెదో చాలా మంచివారనడంలేదు, స్వతహాగా ఆయన స్వభావమే అంత..బహుశా ఆయన జీవించి ఉంటే ఆయనమీద గౌరవంతోనైనా , తణుకులో ఇల్లు ఉంచుకునేవాడినేమో. అక్కడే కాకుండా, రాజమండ్రీ లో కూడా ఓ ఫ్లాట్ బుక్ చేసికొని ఉంచి, చాలా భాగం డబ్బు కట్టేశాము. ఇంతలో నాకు పూణే ట్రాన్స్ఫర్ వచ్చింది.

బాతా ఖాని-తెరవెనుక (లక్ష్మిఫణి) ఖబుర్లు.

    ఈ వేళ పొద్దుట అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళాను.శుక్రవారం నాడు అలంకరణలూ అవీ చేస్తారు, దర్శనమూ అవీ పూర్తి అయేసరికి బాగా ఆలశ్యం అవుతుంది.అందువలన శనివారం నాడు ఉదయం 9.00 దాటేదాకా గుడిలో కార్యక్రమాలు మొదలవ్వవు. మొదట్లో నెను ప్రతీ రోజూ 8.00 గంటలలోపునే వెళ్ళేవాడిని. కానీ ఈ తంతు చూసేటప్పడికి నా ప్రోగ్రాం కూడా 9.00 గంటలకే మార్చాను.

అందరూ వరుసగా నిలబడతారు, పూజారి గారు పూజలూ అవీ చేసి అందరికీ తీర్థం అదీ ఇస్తారు. ఈ వేళ పొద్దుట ఆ కార్యక్రమం జరుగుతూంటే ఓ సెల్ ఫోన్ మోగడం మొదలెట్టింది. అందరికీ చిరాకు పుట్టింది, అయినా ఎవరూ మాట్లాడలేదు. అది అలా మోగుతూనే ఉంది. ఇంక నేనే ఊరుకోక, ఆ సెల్ ఫోన్ మూసెయ్యొచ్చుకదా అన్నాను. ఆ పెద్దమనిషికి పేద్ద కోపం వచ్చేసింది!! ఎవరికీ లేని పట్టింపు మీకే ఎందుకూ అన్నాడు. అంటే నేనుచెప్పానూ, ” మాస్టారూ, గుడికి వచ్చేది ఏదోధ్యానం చేసికోవడానికి, అంతే కానీ మీ సెల్ ఫోన్ వినడానికి కాదు, అంత అర్జెంట్ వ్యవహారాలెమైనా ఉంటే ఆ సెల్ ఫోన్ ని ” వైబ్రేషన్” మోడ్ లో పెట్టుకోవచ్చుగా. ఎవరికీ గొడవుండదూ “ అన్నాను. ఏమనుకొన్నాడో ఆ సెల్ ని ఆఫ్ చేసేశాడు. ఆ తరువాత ఆ గుడికి సంబంధించిన వారన్నారూ, ” ఈయనతో ఎప్పుడూ ఉండే గొడవేనండి ఇది, తెలిసున్నవాడూ, అందువలన మేమెవరమూ చెప్పలేకపోయాము”.

చాలా మందికి అలవాటు ఎక్కడికెళ్ళినా సెల్ ఫోన్లు అలా అరుస్తూనే ఉంచుతారు. లేకపోతే ఊళ్ళో వాళ్ళు వినేటట్లుగా పెద్ద పెద్ద గా మాట్లాడడం, ఎంత అసహ్యం గా ఉంటుందో. అవతలివాళ్ళకి చిరాకు పుట్టనట్లుగా ఉండడం అనే సంస్కారం ఒకళ్ళు చెప్పేది కాదు. స్వతహాగా రావాలి. కొంతమంది ఉంటారు చిత్ర విచిత్రమైన రింగ్ టోన్స్

అందరికీ తెలియాలనుకునేవారు, ఏవేవో అరుపులూ, కేకలూ సడెన్ గా వింటే ఉలిక్కి పడతాము. వాళ్ళకి ఇక్కడా అక్కడా అని ఉండదు, సినిమా హాళ్ళలోనూ, ఆఖరికి హాస్పిటళ్ళలో కూడా వీళ్ళ దారి వీళ్ళదే. రైలు ప్రయాణంలో అయితే ఇంక వీళ్ళని పట్టేవాళ్ళుండరు. మన అదృష్టం బాగుంటే సిగ్నల్ ఉండదు.ఇదివరకు చార్జింగ్ అయిపోవడం వలన మాట్లాడలేకపోయేవారు. ఈ మధ్యన రైల్వే వాళ్ళు, ప్రతీ చోటా చార్జింగ్ కి ప్లగ్ పాయింట్లు పెట్టారు.ఇంక కంపార్ట్మెంట్ అంతా వెతుకుతారు, ఎక్కడ పాయింట్ ఖాళీ గా ఉందా అని, అక్కడ వాళ్ళ సెల్ ఫోన్ పెట్టేసి, దానికి అక్కడ కూర్చున్నవాళ్ళని కాపలా పెడతారు. పోనీ అదేదో వాడే కూర్చోవచ్చుగా !!

    ఆ మధ్యన 3 టైర్ లో సైడు న రెండు బదులు, మూడు బెర్త్ లు వేయడం మొదలెట్టారు. ఆ మధ్యలో బెర్త్ వచ్చినవాడికి కూర్చోడానికి అక్కడ కాదు, పక్కనే.ప్రయాణీకుల సంఘాలు అభ్యంతరం చెప్పేటప్పడికి ఈ మధ్యన మళ్ళీ మాములుగా చేసేశారు. బ్రతికి పోయాము. దక్షిణ మధ్య రైల్వే లో ఓ విచిత్రం చూశారా? ఏ రైల్వే స్టేషన్లోనూ ( విజయవాడ, హైదరాబాద్ లతో సహా) ఓవర్ బ్రిడ్జ్ కీ మెట్లే తప్ప రాంప్ లు ఉండవు. దీని వలన వయస్సులో పెద్దవాళ్ళైన మాలాంటి వాళ్ళకి ఓ అసౌకర్యం ఉంది. కూలీ దొరికినా దొరక్కపోయినా పరవాలెనట్లుగా ” వీల్స్ ” ఉన్న సూట్ కేసులే తీసికెళ్ళడం మొదలెట్టాము. కానీ ఈ రాంప్ లేని ఓవర్ బ్రిడ్జ్ ల మూలంగా, అక్కడ ఎత్తికెళ్ళే ఓపిక లేక చచ్చినట్లు కూలీని పెట్టుకోవలసి వస్తోంది. మామూలుగా ఏసి కోచ్ ప్లాట్ఫారానికి ఆ మూలో ఈ మూలో ఉంటుంది. ఇంక ఆ కూలీ అడిగినంతా ఇవ్వవలసివస్తూంది. ఇదేదో కూలీలూ, రైల్వే వాళ్ళు కలసి ఆడే నాటకంలా ఉంది !! ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లో అవేవో కొన్ని స్టేషన్లని ఆధునికరణ చేస్తామంటున్నారు,ఓవర్ బ్రిడ్జి లకి రాంపులు పెడితే చాలు.

    కొంతమందుంటారు వాళ్ళ లగేజీ చూస్తూంటే మొత్తం ఇల్లంతా మార్చేస్తున్నారేమో అనిపిస్తుంది,ఉండేవి మూడు టికెట్లు, వాళ్ళ సామానంతా ఎక్కడ పడితే అక్కడ బెర్త్ ల క్రింద దూర్చేయడం.ఇంకెవ్వడికీ ఖాళీ ఉండకుండా చేయడం.అవతలవాళ్ళకి కూడా సామాన్లుంటాయి అనే ఇంగితజ్ఞానం ఉండదు వీళ్ళకి. అందరూ అలా ఉండరు, ఈ మధ్యన ఒకాయనని చూశాను, సామాను చాలా ఉండడం వలన రెండు బెర్త్ లు ఎక్కువగా తీసికున్నారు !!

    ఈ వేళ ఓ టెలివిజన్ చానెల్ ” కలర్స్ ” లో ఓ మంచి ప్రోగ్రాం చూశాను ” ఇండియా గాట్ టాలెంట్ “ అని. దానికి శేఖర్ కపూర్, కిరణ్ ఖేర్, సోనాలి బెంద్రే జడ్జీలు. అన్నిరకాల టాలెంట్లనీ ప్రదర్శిస్తున్నారు. చాలా బాగుంది. మాములుగా ఉండే వాటికన్నా భిన్నంగా ఉంది.శని, ఆది వారాలు రాత్రి 9.00 గంటలకి, వీలుంటే చూడండి.

బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు -44

    మేము మా అమ్మాయికి వివాహం చేయడానికి నిశ్చయించుకొన్నప్పుడు, మా మిత్రులు కొంతమంది పైకి చెప్పకపోయినా, లోలోపల దీనికి ఆమోద ముద్ర వేయలెదేమో ననిపించింది. ఇందులో వారినీ తప్పు పట్టలేము. కానీ తల్లితండ్రులుగా మేము మా అమ్మాయి గురించి ఆలోచించాలికానీ, మిగిలిన వారి గురించికాదుగా.

    23 సంవత్సరాలు మేము అడిగినట్లుగా చదువుకుని, తనకోసమై ఏమీ కోరుకోకుండా, తన జీవిత భాగస్వామి విషయంలోనే తన ఆలోచన మాతో పంచుకుంది. అలాగని, ఏమీ మమ్మల్ని బలవంత పెట్టలేదు, మాకిష్టమైతేనే ఆ అబ్బాయితో వివాహం చేయమంది.

మాకు తను చెప్పిన పాయింట్లు ( ఆ అబ్బాయి గురించి) నచ్చాయి. మేమూ ఆ అబ్బాయిని 5 సంవత్సరాలు చూశాము. ఎదో పట్టుదలలకి వెళ్ళి మాకు నచ్చిన సంబంధమే, సాంప్రదాయాలకి కట్టుబడి చేస్తే, అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళౌతాము. ఎవరో మధ్యవర్తి తెచ్చిన సంబంధం గురించి మనకేమి తెలుస్తుంది చెప్పండి? అమ్మాయీ, అల్లుడూ సుఖంగా కాపురం చేస్తే చూడాలని ఏ తల్లితండ్రులకి ఉండదు?

కొంతమందిని చూశాము–వారి పిల్లలు తమకిష్టమైన వారిని పెళ్ళిచేసికుంటామన్నప్పుడు పేద్ద హడావిడి చేసేసి, -” మేం చూసిన సంబంధం చేసికుంటే సరే సరి, లేకపోతే నీకూ, మాకూ ఏం సంబధం లేదు, నువ్వు మాకు కొడుకు/కూతురు కావు, నువ్వు పుట్టలేదే అనుకుంటాము “ అని వారిని బయటకు పంపేయడం, ఏడాది తిరగకుండా , వీళ్ళు ఏ అమెరికా లోనో ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళడమూ. ఇలాంటి హిపోక్రసీ మాకు నచ్చదు.అదేదో ముందరే ఒప్పుకుంటే అందరికీ బాగుంటుందిగా!

    మా అబ్బాయి క్లాస్ 12 పరీక్షలు పూర్తి అయిపోగానే పూణే లో వివాహం చేయడానికి అన్ని ఎరేంజ్మెంట్లూ పూర్తి చేశాను. మంగళ సూత్రాలూ, మట్టెలూ, యజ్ఞోపవీతాలూ, మధుపర్కాలూ, మా మామగారు తణుకు నుండి తీసుకువచ్చారు. మిగిలినవన్నీ పూణే, జలగాం లలో కొన్నాము.ఎత్తి పెట్టినట్లుగా పూణే వెళ్ళి వివాహం చేయడం కొంచెం శ్రమే అయింది. ముందుగా నేనూ, మా అబ్బాయీ విలువైన వస్తువులన్నీ ట్రైన్ లో తీసికెళ్ళిపోయాము. ఆ తరువాత, మా ఇంటావిడా, అత్త మామలూ వాన్ లో వచ్చారు.

    వివాహానికి మా వైపునుండీ, అబ్బాయి వైపునుండీ అందరు చుట్టాలూ వచ్చారు. వివాహం ఓ తెలుగు పురోహితుడు గారు చేయించారు. పంజాబీ పధ్ధతిలోనూ, మేము నిశ్చయించిన ముహూర్తానికి మన సాంప్రదాయం ప్రకారం వివాహం పూర్తి చేశాము.రాత్రి ముహూర్తం, తెల్లవారెసరికి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు.

సర్వేజనా సుఖినోభవంతూ. ఇప్పుడు మాకు ఓ మనుమరాలూ, మనవడూ. అంతా క్షేమం !!

నాచేత ఓ మంచి పని చేయించినందుకు ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞుడిని.

బాతాఖానీ ఖబుర్లు–43– బస్ ఇత్నాహీ కాఫీ

    పూణే నుండి వరంగాం తిరిగి వచ్చి మా ఇంటావిడతో సంప్రదించాను, ఏం చెయాలని. మాఇంట్లో పెద్దవాళ్ళు–మా అమ్మగారూ, మా మామ గారూ–వారిని అడిగితే అన్నారూ ” పిల్లలిద్దరూ ఇష్టపడుతూంటే ఏమీ ఇంక ఆలోచించకుండా చేసెయ్యి “. అంత పెద్ద వయస్సులొ ఉన్నవారే అలాగంటే ఇంక ఆలస్యమెందుకూ అనుకొన్నాము.ఇంకో విషయ మేమంటే ఆ అబ్బాయి గురించి అంతకు ముందు 5 సంవత్సరాలనుండీ మాకు తెలుసు, చదువులోననండి, ప్రవర్తనలోననండి. మా అమ్మాయీ, తనూ పూణే లో చదువుతూండేటప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడా కలసి తిరగడం కానీ, ఎవరి నోట్లోనూ పడడంగానీ చేయలేదు. ఈ లోపులో ఆ అబ్బాయి నాన్న గారు మా డిపార్ట్మెంట్ నుండీ రిటైర్ అయి ఢిల్లీ వెళ్ళిపోయారు. వెళ్ళేలోపల మా ఇద్దరి మధ్యా ఎలాంటి మాటలూ జరగలేదు, కాంటాక్ట్ కూడా ఏమీలేదు.

    మా అమ్మాయీ, ఆ అబ్బాయీ నేను పూణే వెళ్ళినప్పుడు మాత్రం చెప్పారు, అతని తల్లితండ్రులు త్వరలో పూణే వాళ్ళ అమ్మాయీ, అల్లుడూ దగ్గరకి వస్తున్నారూ అని. సరే ఈ అవకాశం ఉపయోగించుకుని, వారిని కలిసి, వారి అభిప్రాయం కూడా తెలిసికోవాలనుకున్నాను. నేనూ, మా అమ్మాయీ, వారి అల్లుడుగారింటికి వెళ్ళాము.

ఏం మాట్లాడాలో తెలియదు, ఎలామొదలెట్టాలో తెలియదు. అంతకుముందు ఎప్పుడూ ఇలాంటివి అలవాటు లేదు. సినిమాల్లోనూ, నవలల్లోనూ చూసినవీ, చదివినవీ గుర్తుచేసికొని, పేద్ద గొప్పగా ” ఐ వాంట్ టు ఆఫర్ మై డాటర్’స్ హాండ్ టు యువర్ సన్” అన్నాను. దానికి సమాధానంగా వారు టిపికల్ పంజాబీ స్టైల్లో ” క్యూ నహీ, మైనే కబ్ మనా కియా” అన్నారు. ఒప్పుకున్నారో లేదో అర్ధం అవలెదు !!కానీ ఆ తరువాత వారు అన్న మాటల బట్టి అర్ధం అయిందేమంటే వారికి, ఎటువంటీ అభ్యంతరమూ లేదని, ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేద్దామూ అన్నారు. అమ్మయ్యా ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడిన పిల్లలిద్దరికీ వారి వారి పెద్దల అనుమతితో పెళ్ళిచేయడం లో ఉన్న ఆనందం ఏమిటో తెలిసింది.పెళ్ళి అంటే రెండు మనసులేకాదు, రెండు కుటుంబాలుకూడా కలవాలి. అప్పుడే దానికి అందం..

    మా ఇంటావిడకి ఈ శుభవార్త ఫోన్ లో చెప్పేశాను.ఇంక ఈ ఎంగేజ్మెంట్ కి సన్నాహాలు చేయడమే తరవాయి. పిల్లలిద్దరికీ ఫైనల్ పరీక్షలు,మా అబ్బాయేమో క్లాస్ 11 పరీక్షల హడావిడిలోనూ ఉండబట్టి, అవి అయిన తరువాత పూణే లోనే చేద్దామనుకున్నాము. ఓ నెల దాటిన తరువాత మేంముగ్గురం(నేను, ఇంటావిడ, అబ్బాయి) పూణే వెళ్ళి, మా ఫ్రెండ్ విశ్రాంత వాడిలో ఉండేవాడు–అతనింట్లోనే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాము

    వివాహం మాత్రం మా అబ్బాయి క్లాస్ 12 పరీక్షలైన తరువాత పూణే లోనే చేద్దామని నిశ్చయించుకొన్నాము. ఈ లోపులో అమ్మాయికి కావలిసినవి కొనడమూ, మిగిలిన ఎరేంజ్మెంట్స్ పూర్తి చేసికోవడమూ అవుతాయి కదా. ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఒకరోజు వారి దగ్గరనుండి ఫోన్ వచ్చింది–ఒకసారి పెళ్ళి లోపులో ఢిల్లీ వచ్చి వారిని కలుసుకోమని! మళ్ళీ ఇదేమిటని మేమిద్దరమూ కొంచెం ఖంగారు పడ్డ సంగతి నిజం. ఏం అడుగుతారో ఏమిటో అని. అయినా అన్నింటికీ సిధ్ధ పడి, ఢిల్లీ ప్రయాణం అయ్యాము. మా కజిన్ వసంత్ విహార్ లో ఉండేవారు, వీళ్ళేమో రోహిణీ లో . ఊరికి ఈ మూల ఒకరు, ఆ మూల ఇంకొకరు.మా కజిన్ వాళ్ళకి కూడా ఖంగారు పుట్టింది, ఎందుకు పిలిచారో అని, పంజాబీ లకి చాలా చాలా కోరికలుంటాయీ, ఏం అడుగుతారో అంతా మీ అదృష్టం మీద ఆధార పడుతుందీ… అన్నారు. ఇంతదాకా వచ్చిన తరువాత ఏమైతే అదే అవుతుందని, వాళ్ళింటికి వెళ్ళాము.బ్రహ్మాండంగా డిన్నరూ అదీ ఏర్పాటు చేశారు.భోజనం అదీ అయిన తరువాత పెళ్ళి ఎక్కడ చేయడమూ లాంటి వాటి మీద మాటలు అయ్యాయి. అడిగెదేదో తొందరగా అడిగేస్తే ఓ సంగతి తేలిపోతుందికదా అని నేనూ, మా ఇంటావిడా ఒకే టెన్షన్ పడ్డాము.

ఆఖరికి వారు చెప్పడం మొదలెట్టారండీ–-మా వాళ్ళందరూ అంటే వీరికంటే వయస్సులో పెద్దవారందరూ పెళ్ళికి వస్తారూ, పూణే లో ఉన్న మా స్నేహితులందరినీ

పిలుస్తామూ, మాములుగా పంజాబిలందరూ తిండిపుష్టి కలవాళ్ళూ, అందువలన మీరు డిన్నర్ లో మా ప్రత్యేక వంటకాలు చేయించండీ, ఏమీ అభ్యంతరం లేదుకదా “ అన్నారు. మాకైతే ఏం చెప్పాలో తెలియలెదు. ఈ మాత్రం దానికేనా ఏమేమో ఊహించుకున్నాము. ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అన్నాము. అంటే వారన్నారూ ” బస్ ఇత్నాహీ కాఫీ. ఆప్ కీ లడ్కీ అబ్ హమారీ హోగయీ “

    మెము తిరిగి మా కజిన్ వాళ్ళింటికి వెళ్ళి ఈ సంగతి చెప్తే వాళ్ళుకూడా ఆశ్చర్యపోయారు, ఇంత మంచివాళ్ళింట్లోకి పిల్ల వెళ్తూంది, సుఖపడుతుంది,?b>అన్నారు. మీరు చాలా అదృష్టవంతులూ అని చెప్పారు.

బాతాఖానీ ఖబుర్లు–42 ” ఏక్ దూజే కేలియే ”

    మా అమ్మాయి పుణే ఇంజనీరింగ్ కాలెజీ లో మూడవ సంవత్సరం పరీక్షలైపోగానే క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వచ్చింది. ఆ రొజున నెను కూడా అక్కడే ఉన్నాను. ఆ తరువాత ఒక ఆరు నెలలు గడిచాక ఇంటికి వచ్చినప్పుడు అడిగింది, ” డాడీ, మీరు చెప్పారుగా, చదువు అయిపోయి ఉద్యోగం రాగానే నాకేది కావలిసి వస్తే అది అడగొచ్చని, అడగనా ” ” మా ఫ్రెండ్ విశాల్ , నాకు నచ్చాడు, అతనికీ క్యాంపస్ లో ఉద్యోగం వచ్చింది “ అంతే చెప్పింది.

    తల్లితండ్రులుగా మాకు ఎంతో గౌరవం చదువులో తెచ్చింది.ఫలానా అమ్మాయి తల్లితండ్రులు వాళ్ళు అనేటట్లుగా మాకు ఓ గుర్తింపు తెచ్చింది. అప్పటిదాకా ఏదీ అడగలేదు, అందువలన తను ఇంజనీరింగు కి వెళ్ళే ముందర చెప్పాము నువ్వు ఇప్పటిదాకా మాకు కావలిసినట్లుగా చదివి జీవితంలో పైకి వచ్చావు, చదువు పూర్తి అయినతరువాత నీకు ఏమి కావల్సినా అడగొచ్చు అని చెప్పాము, నీ కోరిక తీర్చే బాధ్యత మాది అన్నాము. దీనికంతటికీ ఓ 5 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ ఉంది……..

    మా అమ్మాయి 11 క్లాస్ లో ఉండగా ఓ రోజు స్కూల్ నుండి వచ్చి, నన్ను మా క్వార్టర్ టెరేస్ మీదకు తీసికెళ్ళి ” డాడీ, నాకు ఫలానా అబ్బాయంటే చాలా ఇష్టం, పెళ్ళంటూ చేసికుంటే ఆ అబ్బాయినే చేసుకుంటానూ “ అంది. అప్పటిదాకా తన చుట్టూ ఓ పరిధి గీసికొని అందులోకి ఎవరినీ రానివ్వని, మా అమ్మాయి, తనతో చదువుకునే ఓ అబ్బాయి గురించి అలా చెప్పిందంటే అతనిని ఎంతగా ఇష్టపడిందో చెప్పఖర్లేదు. వచ్చిన గొడవల్లా ఎక్కడంటే ఆ అబ్బాయి, మా ఫాక్టరీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాయన కుమారుడు!! సరే ఆలోచిస్తామూ అని అప్పటికి ఆ విషయం వాయిదా వేశాము.మా ఇంటావిడతో చెప్పాను, తను షాక్ అయింది--” ఇదేమిటండీ, ఇంకా చదువు కూడా పూర్తికాలెదు, ఇప్పటినుండీ ఈ గొడవేమిటండీ, వాళ్ళు పంజాబీలు కదా, మనతో సంబంధం కలుపుకుంటారా” అని ఒకే టెన్షన్ పడిపోయింది. ఇక్కడ మా అమ్మాయి నాతో మాట్లాడే సమయం లోనే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేశాడు– పెళ్ళంటూ చేసికుంటే ఫలానా అమ్మాయినే చేసుకుంటానూ ” అని.

    ఇంక ఇంట్లో ప్రతీ రోజూ ఇదే గొడవ, ఇలా కాదని ఓ రోజు నేనూ, మా ఇంటావిడా, మా అమ్మాయిని తీసికొని, వాళ్ళ బంగళా కి వెళ్ళాము. అందరం కలసి చాయ్ తీసికుంటూంటే, ఈ ఇద్దరూ మళ్ళీ మొదలెట్టారు ” మేము ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నామూ, మీకేమిటి అభ్యంతరమూ” అని. దానికి ఆ అబ్బాయి అమ్మగారు చాలా సంయమనం తో, ఎక్కడా ఓర్పు పోగొట్టుకోకుండా ” చూడండి, పిల్లలూ, ముందుగా చదువులు పూర్తి చేయండి, ఆ తరువాత ఉద్యోగం సంపాదించండి, ఆ తరువాత ఆలోచిస్తాము, ఉద్యోగం లేకుండా పెళ్ళిళ్ళు చేసికుంటే, తిండి సంపాదించుకోవడం కోసం రాళ్ళు కొట్టుకోవాలి.అయినా మీది పెళ్ళి చేసికునే వయస్సా”అని చాలా నచ్చచెప్పారు. అబ్బే వింటేనా. ముందుగా మాకు అంగీకారం చెప్పండి, అప్పుడు నమ్ముతాము మిమ్మల్ని అన్నారు. అంటే మేము నలుగురమూ అంటే పేరెంట్స్ ఒక్కటే చెప్పాము. మీ ముందరి టార్గెట్ క్లాస్ 12 పరీక్షలు, దానికి మీరిద్దరూ పోటీ పడి చదివి ఎవ్వరూ ఊహించనంతగా మార్కులు తెచ్చికొని, ఓ మంచి ప్రొఫెషనల్ కోర్స్ లో చేరి, జీవితంలో ఒక పొజిషన్ తెచ్చుకోండి, అప్పటికీ మీ ఇద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారూ అంటే, అప్పుడు మాకు ఏమీ అభ్యంతరం ఉండదూ , అప్పటిదాకా మీరు కూడా ఈ విషయం పక్కకి పెట్టి చదువు మీద శ్రధ్ధ చూపించండి” అని చెప్పాము. ఇదేదో ” ఏక్ దూ జే కేలియే “ సినిమా కథ అనుకుంటున్నారా, కాదండి బాబూ, మాఇంట్లో జరిగినదే.