బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— Are we on the right track…….

    ఈ రోజుల్లో మార్కెట్టుల్లో చూస్తూంటాము, కూరగాయలనండి, పళ్ళనండి ప్రతీ చోటా ఏదో మందూ మాకూ ఉపయోగించి, అనవసరమైనవన్నీ వాడేసి, పండ బెట్టేయడం. ఒకటికి రెండు సార్లు పాలిష్ చేసేసి, తాజా గా ఉన్నట్లు మనల్ని నమ్మించేయడం. ఎక్కడ చూసినా ఫెర్టిలైజర్లూ, కెమికల్సూనూ. చివరకి ఇదివరకటి రోజుల్లోలాగ ఉండే కూరగాయలూ, పళ్ళూ కావాలంటే అవేవో “organic variety” అని ఖరీదెక్కువైనవేవో కొనుక్కోడం. ఎక్కడ చూసినా hybrid. మన జీవితాలుకూడా అలాగే అయిపోయాయి ! ప్రతీ దాంట్లోనూ పోటీ,అవతలివాడికంటే మనం, మన పిల్లలూ ఓ ఆకు ఎక్కువే ఉండాలీ అనే కానీ, ఈ పోటీ ప్రపంచం లో మనం పోగొట్టుంటున్నదేదో ఒక్కళ్ళైనా ఆలోచించారా? జవాబు–NO–

    ఇదివరకటి రోజుల్లో, ఓ పసిపాప ని చూస్తే ముద్దొచ్చేది. ఇప్పుడూ వస్తోంది, కానీ ఏ వయస్సొచ్చేదాకా? ఏదో నోట్లో ఓ మాటొచ్చేదాకానూ. ఇంక అక్కడనుంచి కష్టాలు ప్రారంభం పాపం ఆ పసిపాపకి. రెండు మూడేళ్ళొచ్చేదాకా ఏదో ఫరవాలేదు. అక్కడనుంచి ప్లేస్కూళ్ళూ, కేజీలూ, డాన్సులూ, పాటలూ ఒకటేమిటి, తల్లితండ్రులకి తాము తీర్చుకోలేని ambitions అన్నీ, ఆ పిల్లలద్వారా తీర్చుకోడం. టి.వి. లలో వచ్చే ఏ చిన్న పిల్లల ప్రోగ్రామైనా చూడండి, అందులో పాల్గొనే చాలామంది పిల్లలు, తమ వయస్సు కంటె, ఎక్కువ వయస్సులా కనిపిస్తారు. పైన చెప్పినట్టు, మార్కెట్ లో దొరికే కూరలకీ, పళ్ళకీ, వీళ్ళకీ తేడా ఏమీ కనిపించదు. అయిదారేళ్ళ పిల్ల పదేళ్ళ పిల్లలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

    ఆరోజుల్లో ,చిన్న పిల్లల హావభావాల్లో ఉండే పసితనం, అమాయకత్వం అన్నీ ఎక్కడకి మాయం అయిపోయుంటాయంటారు ? They just vanished.. మనలో చాలామందికి చిన్నప్పటి మధుర జ్ఞాపకాలుండాలి, కానీ మన పిల్లలకి మాత్రం ఉండకూడదు. వాళ్ళని robots లా తయారుచేసి, ఇంటికి ఎవరైనా వస్తే, బాబూ/అమ్మా ఓ ఇంగ్లీషు పద్యం పాడమ్మా అనడం. ఇంకవాళ్ళుకూడా, ప్లేస్కులుకి వెళ్ళేదాకా రోజంతా టి.వి. ముందరే కూర్చోడం. ఆ పసిపాపకి ఆకలేసినప్పుడు చెప్పడం రాదుకానీ, టి.వి. లో ఏదైనా “షీలాకీ జవానీ” లాటి పాటల మ్యూజిక్కొచ్చేటప్పటికి మాత్రం గుర్తుపట్టేయడం, వాళ్ళ అమ్మా నాన్నలు అబ్బో మావాడికి ఎంత తెలివితేటలో అనుకుంటూ సంబరపడిపోవడం! వాణ్ణి ఏ కోచింగు స్కూల్లోనో చేర్పించేయడం, వీలైనన్ని కార్యక్రమాల్లో పోటీ చేయించేయడం.అలాగే ఆటల్లో కూడానూ. ఇవన్నీ ఉండకూడదనడం లేదు. But at what cost…? ఆటల్లో వివిధ రకాల categories లలో ( under 15, under 19,…) ఉంటాయి. దేంట్లోనూ, వాటిలో పాల్గొనే పిల్లలు వారి వయస్సుకి తగ్గట్టుండరు. ఇదివరకటి రోజుల్లో, పధ్ధెనిమిదేళ్ళొచ్చినా ఇంకా మూతి మీద మీసం ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఓ ఇద్దరు ముగ్గురు పిల్లల తండ్రిలాగే కనిపిస్తారు! దీనికంతటికీ కారణం, మనం పిల్లలకి పెట్టే తిండి కూడా ఓ కారణం.

    ఇంకోటి, ఇదివరకటి రోజుల్లో, ఎవరింటికైనా వెళ్తే, అక్కడుండే చిన్నపిల్లాడిని పలకరించడం ఓ ముచ్చటగా ఉండేది, కారణం వాళ్ళు మాట్లాడే ముద్దుమాటలూ అవీనూ. కానీ ఇప్పుడు ఎవరినైనా పలకరించాలన్నా భయమే! ఏం మాట్లాడితే ఎటువంటి retort వస్తుందో అనే భయమే! దానికి మన సినిమాలు కూడా, వాళ్ళకి చేతనైనంత చేస్తున్నారు. పిల్లలు చేసేది తల్లితండ్రులు చూస్తునే ఉన్నా, వాళ్ళకీ భయమే, ” అలా అనకూడదమ్మా…” అంటే , తను చూసిన ఏ ఎపిసోడ్ లోంచి రిఫరెన్సిస్తాడో అని!

    ఎన్నో సంవత్సరాల క్రితం శ్రీ బాపూగారు సృష్టించిన ” బాపూ బొమ్మ”లు ఇప్పుడు, కాగడా పెట్టివెదికినా కనిపించరంటే అతిశయోక్తి కాదు. అసలు ఆ కాన్సెప్టే లేదు.అలాగని ఆడపిల్లలందరూ, పరికిణీ ఓణీ లే వేసుకోవాలని కాదు, ఆయన చిత్రించిన బొమ్మల్లోని అందం, అమాయకత్వం, సొగసూ ఇప్పుడెవరికైనా కనిపిస్తున్నాయా? అందుకే పాపం ఆయనకూడా అలాటివి వేయడం మానేశారు! పదహారేళ్ళ ఆడపిల్లంటే, ఇంటికే ఓ అందం వచ్చేది. టి.వి.ల్లో వచ్చే ఏ కార్యక్రమం చూడండి, ఊరికే పేరుకే ” చిన్నపిల్లలు” అంటారు. కానీ వాళ్ళల్లో ఎవరూ చిన్నపిల్లల్లా కనిపించరు. అంతదాకా ఎందుకూ, ఓ పెళ్ళికూతుర్ని చూస్తే, ఆ సమయం లో ఆ పిల్ల పడే సిగ్గూ, అవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపిస్తాయా? ఎప్పుడు పెళ్ళవుతుందా, ఎప్పుడు వీడి పని పడదామా అనే కనిపిస్తుంది.

    ఈరోజుల్లో చిన్న పిల్లల వయస్సుకీ, వారు మాట్లాడే మాటలకీ పొంతే లేదు. ఇంక తల్లితండ్రులు కూడా వహ్వా మనవాడి ఐక్యూ ఎంతుందో అనే మురిసిపోవడమే కానీ, Are we on the right track అని ఆలోచించే టైమే లేదు. వాళ్ళని అనీ ఏం లాభం లెండి? వాళ్ళుమాత్రం ఏం చేస్తారు? నూటికి తొంభై మార్కులొచ్చినా, సీటొస్తుందో లేదో తెలియదు. తీరా చదివు పూర్తైన తరువాత ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు. Adolescence అనే మాటకి అర్ధం ఏ డిక్షనరీలోనూ కనిపించదు, కారణం అసలు అదేమిటో తెలిస్తే కదా !!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– గుర్తుకొచ్చాయంటే రావు మరీ…..

   దీపావళి పండగొచ్చిందీ, వెళ్ళింది కూడానూ. శలవలకి అమ్మాయీ,అల్లుడూ, పిల్లలతో హాలిడేకి యు.కె. వెళ్ళారు. ప్రతీ దీపావళికీ వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళేవారు. రాజమండ్రీ కాపరంలో అయితే, ఏకంగా అక్కడికే వచ్చి దీపావళి చేసికున్నారు. ఏదో మాకు తోచిందేదో చేతిలో పెట్టి ఆశీర్వదించడం. ఏదో నాలుగు సిల్వర్ కాయిన్లు నలుగురికీ ఇవ్వడం, చిన్న పిల్లలకి డబ్బుతో సరిపెట్టేయడం. రిటైరయినప్పటినుండీ ఇదే తంతు.ఈసారి అయితే మెయిల్స్ లోనూ, ఫేస్ బుక్ లోనూ, ఫోనుద్వారానూ గ్రీటింగ్స్ !!

ఇక్కడ అబ్బాయీ,కోడలూ, నవ్యా, అగస్థ్య ఉన్నారుగా, మాఇంటికి వెళ్ళాము, దీపావళి గడపడానికి. ఇక్కడ మేముండే ఇంట్లో , మా ఇంటావిడ తనకు తోచిందేదో ( కజ్జికాయలు) తయారుచేసి, పూజచేసికుని అక్కడకి వెళ్ళాము. ఏమిటో ఈ రోజుల్లో జరిగే దీపావళి సంబరాలు చూస్తూంటే, invariable గా ఇదివరకటి దీపావళి సంబరాలు గుర్తొచ్చేస్తాయి ! ఎప్పుడు చూసినా ఈయనకేమీ పనిలేదూ, తన చిన్నప్పుడు ఎలా చేసికునేవారో, ఇప్పుడెలా చేసికుంటున్నారో అని చెప్పడం తప్ప, అని అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాను, ఆ జ్ఞాపకాలు తెచ్చుకోడం తప్ప చేసేదేమీ లేదు. ఇప్పటివాళ్ళు ఏమేమి మిస్సవౌతున్నారో మీ ఇంట్లో ఉండే పెద్దాళ్ళని అడగండి తెలుస్తుంది!

ఆ రోజుల్లో దీపావళి వస్తోందంటేనే, పది పదిహెను రోజులముందునుంచీ హడావిడి ప్రారంభం అయ్యేది. మతాబులూ, చిచ్చుబుడ్లూ, సిసింద్రీలూ ఇళ్ళల్లో తయారుచేసికోడమే కానీ, బజారుకెళ్ళి కొన్నదెవరు? సూరేకారం, బీడూ , గంధకమూ లాటివన్నీ అమ్మనడిగి, ఓ పాత చేట తీసికుని, దాంట్లో ఎండబెట్టడం, ఇంట్లో ఉన్న న్యూసు పేపర్లతో, మతాబులకి గొట్టాలు చేసికోడం, సిసింద్రీలకైతే ఈ న్యూస్ పేపరు ఉపయోగించదు, కొద్దిగా దళసరిగా ఉండాలి కాగితం. వీటన్నిటినీ చుట్టి అంటించడానికి లైపిండోటీ. సిసింద్రీలు ఇళ్ళల్లో అందరూ తయారుచేసికోవడం వచ్చెది కాదు, దానితో ఎక్కడెక్కడ ఎవరెవరు అమ్ముతున్నారో తెలిసికుని, ముందుగానే ఆర్డరివ్వడం. అవికూడా వందా, రెండొందలూ కాదు, ఏకంగా వెయ్యి !

బజారుకెళ్ళి తెచ్చేదేమిటయ్యా అంటే, తాటాకు టపాకాయలు ( మామూలువీ, ఎలట్రీవీ నూ), ఓ తుపాకీ దాంట్లోకి కాప్పులూ, విష్ణుచక్రాలూ, కాకరపువ్వొత్తులూ, ఇంకొంచం డబ్బులు దొరికితే, ఓ పాము బిళ్ళల ప్యాకెట్టూ, మెగ్నీషియమ్ తీగా. నాన్నలతో మార్కెట్ కి వెళ్ళామా, అంతే సంగతులు అదొద్దూ,ఇదొద్దూ అనడమే! అప్పుడు ఎందుకు అలా అనేవారో, పెళ్ళై పిల్లల్ని కన్న తరువాత తెలిసిందనుకోండి. ఓ సంచీ నిండా తెచ్చుకుని,ఎండ పెట్టుకోడం.

ఇంక దీపావళికి ముందురోజు దిపాలు పెట్టుకోడానికి ప్రమిదలు, నూనె రెడీ. దీపావళి రోజుకి గోంగూర కాడలూ, నునె లో ముంచి వత్తులు చేసికోడానికి ఓ కొత్త సైను గుడ్డా.దీపావళి సాయంత్రం, దిబ్బూ దిబ్బూ దీపావళి అంటూ వాటిని నేలకెసి కొట్టి ఆర్పేయడం, కాళ్ళు కడుక్కుని, అమ్మ పెట్టే తాయిలం తినేసి, ఓ తిప్పుడుపొట్లం పుచ్చుకుని దాన్ని తిప్పుకుంటూ ఓ గంట గడిపి, తరువాతే బాణాసంచాకల్చుకోడం. ఇళ్ళల్లో తయారుచేశారేమో, చిచ్చుబుడ్లూ,మతాబులూ, నిల్చి మరీ కాలేవి.

అసలు తయారుచేయడానికి ఉపయోగించే, గంధకం (sulphur) వాసన ఎంత ఘాటుగా ఉండేదండీ? మనింట్లో కూడా దీపావళి చేసికున్నామూ అని, కార్తిక పౌర్ణమి దాకా తెలిసేది! నిన్న మా మనవరాలూ, మనవడూ దీపావళి బాణాసంచా కాల్చిన తరువాత, అస్సలు వాసనే లేదూ. ఉన్నదల్లా స్మోక్ మాత్రమే. I certainly missed that nostalgic pungent odour of sulphur ! ఎంతంతో డబ్బెట్టి కొన్నవైనా సరిగ్గా కాలేయా అంటే అదీ లేదూ, మధ్యలో తుస్సుమనడం. మళ్ళీ వెలిగించడం.

అన్నిటిలోకీ ముఖ్యంగా అనిపించిందేమిటంటే, ఇదివరకటి రోజుల్లో, ఇంటి చుట్టూరా ఓ పెద్ద కాంపౌండు వాలూ, దాని పొడుగునా దీపాలూ, బాణాసంచా కాల్చుకోడానికి అరుగులూ, వాటిమీద నుంచుని కాల్చడాలూ. మరి ఇప్పుడో, ఇంట్లో దీపం పెట్టడానికి, ఉన్న ఎపార్ట్మెంటుకున్న నాలుగు కిటికీలు మాత్రమే. గుమ్మంలో పెట్టడమనే కాన్సెప్టే లేదు. కారణం మనకీ, పక్కనుండే ఫ్లాట్టు వాడికీ మధ్యలో ఖాళీ ఉంటేనా? పోనీ ఏ బాల్కనీలోకో వెళ్ళి కాల్పిద్దామా అంటే, రవ్వలు కిందవాడి బాల్కనీ లో పడ్డాయని వాడు దెబ్బలాటకొస్తే, అదో గొడవా. ఇంక మిగిలిందేమిటయ్యా అంటే ప్రతీ సొసైటీలోని సెల్లార్లు ! మళ్ళీ అక్కడ కూడా గొడవే. మన బాణాసంచా జాగ్రత్తగా ఓచోట పెట్టామనుకుంటాము, కానీ ఎవడో వెసిన క్రాకర్ వాటిమీద పడితే ఇంక అంతే సంగతులు , అర నిముషంలో ఊ..ఫ్… చివరకి మా పిల్లలు టెర్రేస్ మీదకెళ్ళి కాల్చుకొచ్చారు!

కొద్దిగా చదువూ సంధ్యా వచ్చిన తరువాత, పత్రికలు కొనడం. దీపావళి వస్తోందంటే చాలు ప్రతీ పత్రికా యువ, జ్యోతి, ఆంధ్రజ్యోతి, ప్రభ పేద్ద పేద్ద దీపావళి ప్రత్యేక సంచికలు వేసేవారు. వాటిమీద వడ్డాదిపాపయ్యగారూ, బాపూగారూ వేసిన అద్భుత చిత్రాలు,కొన్నిటికి సువాసనలు కూడా వచ్చేవి కునేగా మరికొళుందు అనే సెంటు పూసేవారు! ఇప్పుడా పత్రికలూ లేవూ, ప్రత్యెక సంచికలూ లేవూ.
ఇంకో విషయం ఏమిటంటే, ప్రస్తుత కాలంలో దీపావళి సామాన్లు కొండానికి వెళ్ళాలంటేనే భయం ! ఎక్కడ ఏ తీవ్రవాది బ్లాస్టులు చేస్తాడో, మర్నాడు పేపర్లలో మన పేర్లూ, ఫుటోలూ పేపర్లకెక్కుతాయో ( అదికూడా మన బాడీని ఐడెంటిఫై చేస్తేనే) అని! ఇంత built in insecurity తో, అమ్మయా దీపావళి అయిందయ్యా బాబూ అనుకోవడమే కానీ, మళ్ళీ మళ్ళీ దీపావళి అని పాటలెవరు పాడుకుంటున్నారు ?
ఇన్నిన్ని మధుర జ్ఞాపకాలు మర్చిపోమంటే మర్చిపోగలమా మరి ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– నాకెందుకసలూ…..

    మామూలుగా ఈ మధ్యన వార్తల్లో చూస్తూంటాము, ఏదో ఓ సినిమా వస్తుంది, అదేమో రికార్డులు బద్దలుకొట్టేస్తుంది. ఎక్కడనుంచో, ఎవరో ఒకరొచ్చి, ఫలానా సినిమా కి మూల కథ నాదే, మక్కికి మక్కీ కాపీకొట్టేశారూ, ఓ నయా పైసాకానీ, కనీసం క్రెడిట్లలో నా పేరుకానీ ఇవ్వనే లేదూ అని. ఏదో కొంతమందైతే కోర్టులక్కూడా ఎక్కుతూంటారు. అప్పుడెప్పుడో అమెరికాలో భారతీయ సంతతికి చెందిన కావ్యా విశ్వనాథన్ వ్రాసిన ” How Opal Mehta Got Kissed, Got Wild, and Got a Life ” అనే పుస్తకాన్ని, అందులో, మరో నలుగురు ప్రఖ్యాత రచయితలు వ్రాసిన పుస్తకాల్లోంచి, కొన్ని భాగాలు యతాతథంగా కాపీ ( plagiarism. అనో ఏదో అంటారుట) కొట్టినందుకు, పేద్ద గొడవ జరిగింది. ఆ సందర్భం లో ప్రచురించిన ఒక వ్యాసం ఇక్కడ చదవండి.

    స్వంతంగా వ్రాసే ఓపిక లేకపోతే, ఏదో ఏ యాభై ఏళ్ళ క్రిందటిదో, దేంట్లోంచో చూసేయడం తమ పేరుతో వ్రాసేయడం. ఎవరికీ అంత పురాతన పుస్తకాలు చదివే ఓపికా ఉండదు. కానీ ఈ internet వచ్చిన తరువాత జనాలు ( ఈ కాపీ కొట్టిన వాళ్ళు) వీధిన పడిపోతున్నారు. మరీ ఇదేమిటీ అని అడిగితే, అవునూ రామాయణం, మహా భారతాలు లాటివి, ఎవరికి తోచిన పధ్ధతి లో వాళ్ళు రాయడం లేదా అని ఓ ఆర్గ్యుమెంటోటీ ! అవన్నీ పురాణాలు, ఎవరిదారిన వారు వాటిని intrepret చేసికుంటారు. కానీ కథల్ని కూడా చేస్తే ఇదిగో ఆ కావ్యా లా అవుతుంది !

    ప్రస్తుత విషయానికొస్తే, మా ఇంటావిడ ఈ మధ్యన పుస్తకాలు మరీ ఎక్కువ చదివేస్తోంది లెండి , ఇంకేం పని లేదా అని అడగడం తరవాయి, మీక్కావలిసినవన్నీ చేసి పెడుతున్నా కదా, ఇంకా నేనేదో సుఖపడిపోతున్నానని ఏడుపెందుకూ అంటుంది. పోనిద్దురూ ఎవరి గొడవ వాళ్ళది. చెప్పొచ్చేదేమిటంటే, ” స్త్రీల కథలు–1, 1901-1980 ” అనే పుస్తకం చదివి, అందులోని ఒక ఆసక్తి కరమైన విషయం కనిపెట్టింది.

    శ్రీమతి కె.విమలా దేవి అన్నావిడ ఓ కథ వ్రాశారు – శీర్షిక ” మా అమ్మ”–( పేజీ59 ). ఈ కథని “గృహలక్ష్మి” నవంబరు 1938 సంచికలో ప్రచురించారు (ట).
ఇక్కడ చిత్రం ఏమిటంటే అదే కథ ( పైన చెప్పానే మక్కికి మక్కీ) ని, ఇంకో అదనపు పేరా చేర్చి, శ్రీమతి సత్యవతి అన్నావిడ ” మా నాన్న”( పేజీ 65) అనే శీర్షికతో తిరిగి వ్రాశారు ఆ కథని భారతి” అక్టోబర్ 1938 సంచిక లో ప్రచురించారుట.

    పుస్తకం లో మొత్తం 30 కథలున్నాయి. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఒకరి కథని ఒకరు కాపీ కొట్టారా, లేక ఒకే వ్యక్తి రెండు పేర్లతో వ్రాసి పంపారా, లేక, ఈ పుస్తకాన్ని ప్రచురించిన సంపాదకులు డా. కె. లక్ష్మీనారాయణ గారు, ఎవడు చూసొచ్చాడు లెద్దూ అని, అసలు ఆ విషయమే పట్టించుకోలేదా అని !

    అసలు ఇలాటివన్నీ మీకెందుకూ, మీదారిన మీరేదో “గాలి” కబుర్లు వ్రాసుకుంటూ కూర్చోక అంటారా నోరుమూసుక్కూర్చుంటాను …. అసలు వ్రతాలూ, నోములూ, స్త్రీల కథలూ మీకెందుకూ అనడక్కండి. పుస్తకం చదివి నా దృష్టికి తెచ్చింది, మా ఇంటావిడ !!

   ఇంకో సంగతండోయ్… ఈవేళ హారం లో “కళా గౌతమి” అనే పత్రిక గురించి చదివాను. రాజమండ్రీ అన్నా, గోదావరన్నా నాకైతే చాలా అభిమానం. అందులో, శ్రీ అంపశయ్య నవీన్ గారు వ్రాసిన ” కళా తపశ్వి చిట్టిబాబు” అనే వ్యాసం కనిపించింది. నా అభిమాన వీణా వాయిద్య శిఖామణి శ్రీ చిట్టిబాబు గారి గురించేమో అని చూస్తే, తీరా ఆ వ్యాసం ప్రఖ్యాత రచయిత శ్రీ బుచ్చిబాబు గారి గురించి
వెంటనే doubt clear చేసికోడానికి శ్రీ నవీన్ గారికి ఫోను చేశాను. ఈ వంకపెట్టి ఆయనతో ఓసారి మాట్లాడొచ్చు కదా అని! ఆయనేమో, నేను వ్రాసింది బుచ్చిబాబు గారి గురించండి బాబూ అన్నారు. వెంటనే, రాజమండ్రి ఫొను చేసి ఆ పత్రిక ఎడిటర్ గారికి చెప్పాను విషయం. పాపం ఆయనకూడా ఆ ” ముద్రారాక్షసానికి” విచారం వ్యక్తం చేశారు !

    ఇదిగో ఇలాటివే తిన్న తిండరక్క చేసే పనులంటే !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ప్రతీదీ చెప్పిన వెంటనే చేశాయాలంటే ఎలా….

    మీలో చాలామందికి గుర్తుండే ఉంటుందనుకుంటాను, 1984 లో శ్రీ రాజీవ్ గాంధీ మనదేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. అప్పుడు ఆయనకున్న అర్హతల్లా, శ్రీమతి ఇందిరా గాంధీ కొడుకుగా పుట్టడమే. అంతకంటే, ఆయన ప్రత్యేకంగా దేశానికి చేసిన సేవ ఏమీ లేదు. మనదేశం లో ఉన్న సదుపాయం ఏమిటంటే, ఏ ప్రాముఖ్యం ఉన్న మనిషికో, భార్యగానో, కొడుగ్గానో, కూతురుగానో, మేనల్లుడిలానో, మేనకోడలుగానో పుట్టేస్తే చాలు. మిగిలినదంతా, మన ” వందిమాగధులే” చూసుకుంటారు. This facility is exclusive property of our politicians only…. ఆ రాజకీయనాయకుడికి పైన వివరించినవారెవరూ లేకపోతే, వాడి ఖర్మ ! ఉండాలే కానీ, వాళ్ళని ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులూ చేయడానికి, మనవాళ్ళు చేయగలిగినంత చేస్తూనే ఉంటాము. స్వతంత్రం వచ్చిన దగ్గరనుండీ, ఇలాటి కేసులు కావలసినన్నున్నాయి. ఇది మనదేశ సౌభాగ్యానికున్న ఒక ప్రత్యేక గుణం !

    అయినా ఈ టపా మన దేశం చేసికున్న అదృష్టాల గురించీ, దౌర్భాగ్యాల గురించీ కాదులెండి. పైన చెప్పిన సదరు రాజీవ్ గాంధీ గారు, ప్రధాన మంత్రి అయీ అవగానే పాపం ఏదో దేశసేవ చేసేసి, దీన జనోధ్ధరణా వగైరా చేసేద్దామని నిశ్చయించేసికున్నారు. పైగా ఉడుకు యువ రక్తం ఓటీ. మన దేశం లో సమస్యలకేమైనా లోటేమిటీ? పైన కాశ్మీరు నుండి కింద కన్యాకుమారి దాకా, వెదకాలే కానీ కావలిసినన్నున్నాయి! ఏ పనీలేని… పిల్లి తల గొరిగాట్ట.. అలాగే మన నాయకులకి సమస్యే ఉండఖ్ఖర్లేదు, గాల్లో సృష్టించగలరు. ఎలా అని అడక్కండి, ఈ నాయకులందరూ తాంత్రికుల దగ్గరా, బాబాల దగ్గరా నేర్చుకున్న విద్య లెండి. వాళ్ళకి కూడా కొదవ లేదు. ఉన్న మాట చెప్పుకోవాలిలెండి, అప్పటిదాకా ఉన్న సమస్యలన్నీ, పాపం ఆ రాజీవ్ గాంధీ సృష్టించినవి కాదు, వాళ్ళమ్మగారూ, తాతగారూ సృష్టించినవీ, ఇంకోళ్ళెవరిచేతో సృష్టించబడి, వారి అమ్మ,తాత గార్లచేత resolve చేయబడనీయనివీనూ ! ఒకచోట అస్సాం గొడవా, ఇంకోచోట పంజాబ్ గొడవా, కాశ్మీరు సమస్యైతే మన గంగమ్మ తల్లిలా జీవనది లాటిది. భారత దేశం ఉన్నన్నాళ్ళూ ఉంటూనే ఉంటుంది.

    సదరు రాజీవ్ గాంధీ గారు, ఏదో ప్రధాన మంత్రయ్యారూ, ఆగస్టు పంద్రా తారీఖు రోజున ఎర్రకోట బురుజుల మీద నుంచుని, ఓ అరగంట మాట్లాడేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే, ఎన్నో ఏళ్ళనుండీ ఆగస్టు పంద్రా తారీఖు ముందర రోజు రాత్రి మన ప్రెసిడెంటు గారూ, మర్నాడు ప్రొద్దుట తెల్లారేటప్పటికి ఎర్ర కోట బురుజులమీదనుంచి ప్రధాన మంత్రీ, ఘోషిస్తూనే ఉంటారు– మేము ఫలానా చేస్తామూ, ఇంకోటేదో స్కీము పెట్టామూ అని. అవేమైనా పెట్టారా చేశారా ? ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారూ, మనం వింటూంటామూ. వాళ్ళ speech writers రాసిందేదో శుభ్రంగా చదివేయడమే ! ఏదో జరిగిపోతుందీ, రాత్రికి రాత్రి దేశమంతా బాగుపడిపోతుందీ అనుకోడం మన బుధ్ధితక్కువ. వాళ్ళేదో కాలక్షేపానికి చెప్తూ ఉంటారు, ప్రతీ దాన్నీ నమ్మేయడమే హన్నా !!

   మన రాజీవ్ గాంధీ గారు, over enthusiasm తో , ముందుగా అస్సాం పంజాబులకెళ్ళి వాళ్ళకున్న దీర్ఘకాల సమస్యలన్నిటికీ ఓ accord సంతకాలు పెట్టేశారు. మిగిలిన నాయకులందరూ నెత్తి బాదుకున్నారు. ఇదేమిటీ ఈ కుర్రాడూ, మనం చెప్పినట్టు వింటాడు కదా అని ప్రధాన మంత్రి చేస్తే, మన అస్థిత్వాన్నే పికేసేటట్టున్నాడూ అని. ఇన్నాళ్ళూ ఈ సమస్యల గురించి వాళ్ళకి తెలియకనా, తెలుసు, కానీ ప్రతీదీ solve చేసేస్తూ పోతే, మనకి కాలక్షేపం ఎలా, అనుకుని చూడు నాయనా, తప్పమ్మా అలా చేసేయకూడదూ అని ఏదో నచ్చచెప్పారు, పాపం ఆయనకూడా , అదీ నిజమేగా, ఎన్నెన్ని పెండింగులో ఉంచితే అంత మంచిదీ అనే ఓ నీతిపాఠం నేర్చేసికున్నాడు ! కథ కంచికీ అనుకుంటే మీరు కరెక్టు కాదు, ఆ కథే నా ఈ టపాకి inspiration

    మొన్నెప్పుడో మా ఇంటావిడ ఓ టపా వ్రాసింది. ఆవిడకి నన్ను దుమ్మెత్తి పోయడం తప్ప ఇంకో పని లేదు, అనడం కాదు కానీ, అసలు వాళ్ళత్తగారేదో చెప్పిందీ, వాటినన్నిటినీ ఇలా పబ్లిక్కుగా వ్రాసేయాలా ? అయినా తను చెప్పిందంతా, చెప్పగానే చేసేయకుండా, నా దారిన నేనేదో నాకు తోచినప్పుడే చేస్తానూ అని కదా ఆవిడ ఘోషా. అవునూ, చేస్తానూ, ఆవిడ చెప్పిందల్లా అక్షరాలా కరెక్టే ! కానీ అందులో నిఘూడమైన రహస్యం తెలియడం లేదే తనకీ ! ఏదో మాటవరసకి అనుకుందాం, ఆవిడ చెప్పీ చెప్పగానే చేసేస్తానూ అని, నష్టం ఎవరికీ, ఆవిడకే కదా ! ప్రతీదీచెప్పినవెంటనే చేసికుంటూ పోతే, ఇంక చెప్పడానికి ఏం ఉంటుంది కొన్ని రోజులు గడిచేటప్పటికీ? తనకీ కాలక్షేపం ఉండొద్దూ? ఏదో తన మంచే దృష్టిలో పెట్టుకుని అలా చేస్తాను కానీ, ఆవిణ్ణి కష్ట పెట్టడం నాకేమైనా హాబీయా ఏమిటీ? పోనీ నా అంతట నేనే ఏదో initiative తీసికుని తెద్దామా అనుకుంటే, నేనెమైనా చెప్పానా అంటుంది. తెస్తే ఓ తప్పు. తేకపోతే ఇంకో తప్పు. తుమ్మడమూ తనే, చిరంజీవా అనుకోడమూ తనే. ! ఇదండీ విషయం !!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

www.indianexpress

ఏమిటో మా అన్నా సాహెబు గారి టీం అంతా గందరగోళం అయిపోయింది! ఒకళ్ళేమో, కాశ్మీరు లో అదేదో జనవాక్య సేకరణ చేస్తే బావుంటుందంటాడు. ఇంకో ఆయనేమో, తన్నులు తిన్నాడు. నేనేం తక్కువా అంటూ, కిరణమ్మగారు తను, ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడల్లా, ఎవరైతే తనని ఆహ్వానించారో, వాళ్ళందరినుంచీ, ముక్కుపిండి, పూర్తి ఫేర్ లు వసూలు చేసింది, తనేమో హాయిగా కన్సెషన్ లో ప్రయాణాలు చేసింది. అదేదో పేపరు వాళ్ళు ఈ విషయమంతా గుట్టురట్టు చేసేటప్పటికి, అదేమీ లేదూ, పేద పిల్లల చదువులకోసమే అలా వసూలు చేశానూ, అంటుంది. మరి ఈమాటేదో ముందరే చెప్పొచ్చుగా, ఎవరో పట్టుకున్న తరువాత కాదుగా. ఇంక ఈ గొడవలన్నీ భరించలేక, మా అన్నా సాహెబ్ గారేమో శుభ్రంగా ” మౌన వ్రతం” లోకి వెళ్ళిపోయారు! ఇదే హాయి కదూ, ప్రతీ అడ్డమైనవాడికీ సమాధానం చెప్పుకోనఖ్ఖర్లేదు! మనం కూడా ఇళ్ళల్లో భార్యలకి సమాధానం చెప్పలేకపోతే, హాయిగా నోరుమూసుక్కూర్చుంటాము. అడిగి అడిగి తన నోరే నొప్పెడుతుంది !

ఈ సందర్భం లో నిన్నటి Indian Express లో వచ్చిన వ్యాసం , నాకైతే చాలా నచ్చేసింది…. పైన ఇచ్చిన పి.డి.ఎఫ్ మీద ఓ నొక్కు నొక్కండి...

   ఆయనెవరో స్వాములారేమో, చందా రూపం లో వచ్చినడబ్బంతా, ఓ ఎకౌంటూ పాడూ లేకుండా లాగించేస్తున్నారనంటున్నారు. అన్నా గారి ఉద్యమం సమయంలో, కావలిసినంత మంది ఏవేవో, టోపీలూ అవీ తయారు చేసి డబ్బులుచేసికున్నారు. పైగా మన దేశం లోని ” అతిరథ మహారథు” లందరూ, Status Symbol లా ప్రతీ సోషల్ నెట్వర్కు లోనూ, హోరెత్తించేశారు. పైగా అక్కడెక్కడో ఈజిప్టు లోనూ, లిబ్యా లోనూ జరిగిన ” ప్రజా ఉద్యమాలు” గురించి మాట్లాడడమే. అక్కడి ఉద్యమాలకీ, ఇక్కడి ఉద్యమా లకీ తేడా ఏమిటంటే, మనది ప్రజాస్వామ్యం, వారిదేమో నియంతృత్వం. దానికీ, దీనికీ సహస్రాలు తేడా ఉంది. మన దేశం లో 65 ఏళ్ళ క్రితం స్వాతంత్రోద్యమం జరిగిందంటే, కారణం అందరి గోలూ దేశ స్వాతంత్రమే. మరి ఇప్పుడో, ప్రతీ ఉద్యమం వెనుకా ఓ రాజకీయ పార్టీ ఉంటుంది. వాళ్ళు అధికారం లోకి వస్తే, ఎంత నొక్కేయొచ్చా అని అనుకుంటారు కానీ, మన సంగతెవడిక్కావాలి? అయినా సరే గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఎవడి వెనక్కాలో ఫాలో అయిపోవడమే! అప్పుడెప్పుడో ఓ టపా వ్రాశాను- ఈ విషయం మీద. పైన ఉన్న వ్యాసం చదివిన తరువాత, ఫరవాలేదు, నేను మరీ ఏదో మహాపాపం చేయలేదూ అనిపించింది !!!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–something is missing somewhere….

   మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఇంట్లో ఉన్న అందరి మధ్యా సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవో? ఓ అన్నా చెల్లెలనండి, అక్కా తమ్ముడనండి, ఓ అక్కా చెల్లెలనండి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్లో ఉన్నవాళ్ళమధ్యా, బయటున్న చుట్టాల మధ్యా, అభిప్రాయ బేధాలుండొచ్చు, కానీ ఒకళ్ళనొకళ్ళు ద్వేషించేవారు కాదు. కానీ అదేమిటో ఈ రోజుల్లో
ఏదో ఇంటి పెద్ద ఉన్నన్నాళ్ళూ, ఒకళ్ళ యోగక్షేమాలొకళ్ళు తెలిసికుంటున్నారు. ఆ పెద్దాళ్ళు పైలోకాలకి వెళ్ళగానే ” ఎవరికి వారే యమునా తీరే..” అన్నట్లైపోతోంది. అంటే అభిమానాలు తగ్గాయా, లేక ప్రతీవారి బాధ్యతలూ పెరిగి, కుశలాలు తెలిసికోడానికే టైముండడం లేదా? ఏదో ఇంకో ఊళ్ళోనో, ఇంకో దేశం లోనో ఉండేవాళ్ళ సంగతైతే అర్ధం చేసికోవచ్చు, కానీ ఒకే ఊళ్ళో ఉంటున్నా ఇదే పరిస్థితి!

   పైగా చుట్టాలకంటే, ఫ్రెండ్సే ముఖ్యం అంటున్నారు. ఈ రిలేషన్లు ఇలా strain అయిపోవడానికి కారణాలు ఏమిటంటారు? ఎప్పుడో పున్నానికీ, అమావాస్య కీ కలుసుకున్నా, ఏదో ఫార్మాలిటీ గా మాట్లాడుకోడమే కానీ, ఇదివరకటి ఆత్మీయతలూ, అభిమానాలూ కనిపించడం లేదు! అలాగని సినిమాల్లోనూ, టి.వీ ల్లోనూ చూపించినట్టుగా, ఏవో పాటలు పాడమనీ, డ్యాన్సులు చేయమనీ కాదు. ఏదో మరీ మోనో సిలబుల్లలో కాకుండా మాట్టాడే మాటైనా నాభినుంచీ వస్తోందా? ఏదో పెద్దాళ్ళున్నారు కాబట్టి ఈ మాత్రమైనా కలుస్తున్నారు.

   ప్రతీవాడూ చెప్పేది ఒకటే మాట ఈమధ్యన టైమే ఉండడం లేదండీ, పిల్లల చదువులూ వాటితోనూ అనే. ఇదివరకుండేవి కావా ఈ సో కాల్డ్ చదువులూ బాధ్యతలూనూ. ఇంతకంటే ఎక్కువే ఉండేవి. పైగా రాబడి తక్కువా, ఖర్చులెక్కువా. అయినా ఎక్కడో అక్కడ అప్పో సొప్పో చెసి, బాధ్యతలు తీర్చుకునేవారు. ఏ సిటీలోనో ఉన్నాడా ,చుట్టాల బెడదా, ఎవడిదో చదువుకోసమో, వైద్యం కోసమో వచ్చే చుట్టాలోరు. పైగా ఎవరిని కాదన్నా వాళ్ళకే కోపాలూ. కాదూ అనే ధైర్యం ఎక్కడుండేది?

   ఈ మధ్యన ఒకరు ఫోను చేసి, ఎవరికో ఓ ఇల్లు చూడమన్నారు. కారణం వాళ్ళింటికి ఓ చుట్టం ఉద్యోగరీత్యా వచ్చాడుట, అప్పటికింకా కంపెనీ వాళ్ళిచ్చిన హొటల్లో కాలక్షేపం చేస్తున్నాడుట, ఆ హొటల్ ఫెసిలిటీ అయిపోగానే, వీళ్ళ నెత్తిమీద కూర్చుంటాడేమో అని భయం! ఇలా ఉంటాయి. అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళూ మాట దేముడెరుగు, తల్లికి కూడా కొడుకుతో మాట్లాడాలంటే భయమే. ఏం మాట్లాడితే ఏం గొడవో అని! తల్లితండ్రులూ, పిల్లలూ ఒకే ఊళ్ళో విడివిడిగానే ఉంటున్నా, ఎప్పుడో సడెన్ గా కొడుకొచ్చి, ” అమ్మా భోజనం పెట్టవే. ఎన్నో రోజులయిందీ నీ చేతి వంట రుచ్చూసి..” అంటే ఎంత సంతోషిస్తుందో కదా ఆ వెర్రి తల్లి? “ఏం ఇంట్లో నేను తిండి పెట్టడం లేదా, అమ్మ గుర్తొచ్చిందీ..” అంటుందేమో పెళ్ళాం అని భయం! మళ్ళీ ఎందుకొచ్చిన గొడవలే అని ఆ కొడుకూ నోరుమూసుక్కూర్చుంటాడు! అలాగే తమ్ముడో, అన్నో వస్తే ఎంత బావుంటుందీ?

    ఇదివరకటి రోజుల్లో వాళ్ళు వెళ్ళే ఊళ్ళల్లో చుట్టాలనేవారు ( దూరపు చుట్టమైనా సరే) ఉన్నారూ అని తెలిస్తే చాలు, వెళ్ళిపోడమే.కానీ ఈ రోజుల్లోనో, ఏ హొటల్లోనో దిగడం, ఏదొ ఫార్మాలిటీ కోసం ఓసారి పలకరించి వచ్చేయడమూ.

   All said and done, something is missing somewhere..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు — Customer Relation Management…….

   ఏమిటో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రతీ వాళ్ళూ అదేదో CRM అంటూ హోరెత్తించేస్తున్నారు. పైగా ఐటి లో మనవాళ్ళందరూ, బయటి కంపెనీలకి ఊడిగమే(దాన్నేదో ఫాషనుగా outsourcing అంటారుట!) చేయడంతో, దీని ప్రాముఖ్యం ఇంకా ఎక్కువైపోయింది. అక్కడికేదో ఈ వ్యవహారం అంతా ఈమధ్యనే కనిపెట్టినట్టు, పెద్ద పెద్ద పోజులోటీ! నేను పుట్టక పూర్వం నుంచీ ఉండేది ఈ concept. అప్పుడేదో మాకు ఇంగ్లీషు అంతబాగా రాదుకనుక, దానికో పేరు పెట్టకలేకపోయాము ! ఇప్పుడో, ప్రతీ దానికీ ఓ పేరూ, గోత్రమూనూ! చేసేది ఏ పనైనా సరే, దానికో hi-fi పేరెట్టేసి, వాటన్నిటికీ ఓ Training programme ఓటి పెట్టిస్తే చాలు, ఆ ట్రైనింగిచ్చేవాళ్ళ కడుపులూ నిండుతాయి, ట్రినింగు పుచ్చుకునేవాళ్ళకీ కాలక్షేపం అవుతుంది! వాటిమీద పుంఖానుపుంఖాలుగా మార్కెట్ లోకి వచ్చే పుస్తకాలూ అమ్ముడైపోతాయి!

   ఆ మధ్యనెక్కడో చదివాను, మాజీ కాప్టెన్ అనిల్ కుంబ్లే కి ఏవేవో consultancy services ఉన్నాయిట, మరి ఇప్పుడు క్రికెట్టునుండి రిటైరయిన తరువాత సంపాదనుండొద్దూ, ఆ పేరూ ఈ పేరూ చెప్పేసి, మన క్రికెట్టాటగాళ్ళకి ఫలానా ఫలానా వాటిల్ల్లో ట్రైనింగిస్తే ఇంకా బావుంటుందీ అన్నాట్ట! ఇదివరకల్లా ఈ ట్రైనింగులు తీసికునే ఆడేవారా? ఈ మధ్యన ఇంగ్లాండు లో మనవాళ్ళు ఓడిపోయేసరికి, ఇదే మంచి అవకాశమూ అనుకున్నాడు! ఏమిటో వడ్డించేవాడు మనవాడైతే… అన్నట్టుగా, ఈ కుంబ్లేగారు అదేదో కర్ణాటక ఎసోసిఏషన్ కి అద్యక్షుడో ఏదో కదా, అంతా మనవాళ్ళే!

   ఏ కొట్టుకైనా వెళ్తే, వాడి బిహేవియర్ మనకి నచ్చితే, ఇంకోసారి వెళ్తాము. లేకపోతే ఇంకో కొట్టు చూసుకుంటాము. ఇదివరకటి రోజుల్లో ఫలానా కొట్టుకే వెళ్ళేవాళ్ళు, దానికేమీ ప్రత్యేక కారణమంటూ ఉండేది కాదు, వాడి దగ్గర అరువు దొరికేది. ఎన్నిరోజులు బాకీ చెల్లగొట్టకపోయినా అడిగేవాడు కాదు. అక్కడికేదో వాడు త్యాగం చేసేస్తున్నాడని కాదు, మనం కొనే వస్తువుకి, వడ్డీతో కలిపి పద్దు రాసేసేవాడు! అందుకని ఓ రెండు నెలలు ఆగకలిగేవాడు! కొన్ని కొట్లలో చూసేవారం ఓ పేద్ద బోర్డు– “అరువు లేదు. రొఖ్ఖం మాత్రమే..” అని. డబ్బిచ్చి కొనుక్కునేవాళ్ళు తప్ప ఇంకోళ్ళు వెళ్ళేవారు కాదు. వాడి CRM అలా తగలడిందన్నమాట! ఈ మధ్యన ఎక్కడ చూసినా సూపర్ షాప్పీలూ, మాల్సూనూ.వాళ్ళకి ఏ క్రెడిట్ కార్డిచ్చినా పనైపోతుంది. దీనితో ఈ మధ్యన మామూలు కిరాణా కొట్లవాళ్ళు కూడా, ఈ క్రెడిట్ కార్డులూ, అవేవో బొత్తిగా తెచ్చే కూపన్లూ యాక్సెప్ట్ చేస్తున్నారు! వాడేదో CRM లో ట్రైనింగైనట్టున్నాడు!

   చిన్నప్పుడు కిరాణా కొట్టుకి వెళ్తే, సరుకులన్నీ తీసికున్న తరువాత, ఓ బెల్లం ముక్క పెట్టేవాడు. కారణం మరేమీ లేదు- బెల్లం ముక్క కోసమైనా మనం ప్రతీసారీ ఆ కొట్టుకే వెళ్తామని! వాడేమీ ట్రైనింగవలేదు CRM లో ! ఈ మధ్యన చాలా మెడికల్ షాప్పుల్లో, పదిశాతం రాయితీ ఇస్తున్నారు. వాడెవడో మొదలెట్టాడు, పోటీగా అందరూ మొదలెట్టేశారు. మాకు దగ్గరలో ఉన్న ఓ మెడికల్ షాపుకి వెళ్తే, వాడు ఇవ్వలేదు. ఎందుకూ అని అడిగితే, మీరు ప్రతీ సారీ ఇక్కడకే వస్తే ఇస్తామూ, మొదటిసారికే ఇవ్వడం కుదరదుగా అన్నాడు. మళ్ళీ వాడి మొహం చూడలేదు. హాయిగా నాకు పదిశాతం డిస్కౌంటిచ్చేవాడి దగ్గరకే వెళ్తాను కానీ, వీడి దగ్గరెందుకూ? చిత్రం ఏమిటంటే, నాకు డిస్కౌంటివ్వనని ఏ కొట్టువాడైతే చెప్పాడో, వాడి పక్కనే ఇంకో మెడికల్ షాపు తెరిచారు, వాడేమో డిస్కౌంటిస్తున్నాడు. అందరూ ఆ కొట్టుకే వెళ్తూంటే ( నాతో సహా), ఈ పాతకొట్టువాడు గోళ్ళూ కొరుక్కుంటున్నాడు, అమ్మకాలు లేక!

   మామూలుగా ప్రతీ శనివారమూ కొబ్బరి కాయ కొడుతూంటాను. మా ఇంటి పక్కనుండే కొట్టువాడిని, ఏం నాయనా, ఈ కొబ్బరికాయ పాడైపోతే, రిప్లేస్మెంటు ఇస్తావా అని, వాడన్నాడూ, లోపలెలా ఉంటుందో నాకేం తెలుసునూ, పాడైపోతే ఇంకోటి కొనుక్కోడమే అన్నాడు. ఇంకో కొట్టువాడు అయితే, పాడైపోతే ఇంకోటిస్తానూ, ఫ్రీ గానూ. నూటికో కోటికో
ఒక్కోప్పుడు పాడైపోతాయి కానీ, ప్రతీసారీ అలా అవదుకదా. అందుకే వాడలాగన్నాడు. కానీ మొదటి కొట్టువాడు, ఈమాత్రం దానికి పేద్ద ఇస్యూ చేసేశాడు. ఇదివరకటిలా కాదుగా, ఈ ఊళ్ళో కొబ్బరికాయ పధ్ధెనిమిది రూపాయలు. ఖరీదెక్కువ కదా అని శనివారం నాడు కొట్టకపోతే, ఆ శ్రీ వెంకటేశ్వరస్వామికి మళ్ళీ కోపం వస్తే, వామ్మోయ్ !

   ప్రతీ కంపెనీ వాళ్ళూ, ఈ మధ్యన Customer Care అని ఓ Call Centreలు తెరిచేశారు. అక్కడ వాళ్ళు చేసే నిర్వాకాలేమిటో భగవంతుడిక్కూడా తెలియదు. మనింట్లో ఏదో పనిచేయకపోతే, మన ఖర్మ కాలి వీళ్ళ అవసరం పడుతుంది. అదేదో 1800 1234567 0011 లాటిదేదో నెంబరుంటుంది. నూటికి తొంభై సార్లు ఈ నెంబరు “ఎంగేజ్ ” వస్తుంది. మన అదృష్టం బాగుండి, అది ఆన్సర్ చేయబడితే ఇంక మొదలూ… ఒకటి నొక్కండీ, ఇంకోదానికి రెండు నొక్కండీ.. అలా వరసగా ఎక్కాలు చెప్పుకుంటూ పోతాడే కానీ, ఓ ప్రాణం ఉన్న వాడితో మాట్లాడడానికి కుదరదు. తీరా కుదిరితే, ఆ మహామహులెప్పుడూ ” Your Call is very important for us.All our Customer Associates are busy with other customers. Please hold on…” అనే మెసేజే !!

   మరింక ఎందుకూ, ఈ CRM లూ, వల్లకాళ్ళూ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– easier said than done….

    నా చిన్నప్పుడు, అమలాపురంలో మొట్టమొదటి సారిగా Electricity రావడం ఇప్పటికీ గుర్తు. మా నాన్నగారు, మా ఇంటికి పెట్టించారు. ఇప్పుడు ఇదేమిటీ ఈయన పాత సోదంతా మళ్ళీ మొదలెడతాడా అని ఖంగారు పడకండి! అలాటి దురుద్దేశ్యాలేమీ లేవు. ఆరోజులలో ఉండే పరిస్థితులూ, ఇప్పటి పరిస్థితుల గురించే ఈ టపా. ముందుగా ఓ వైరింగోటి చేయాలిగా, దానికోసం ఇంట్లో గోడవారే, సన్నటి చెక్క మేకులేసి కొట్టి, దాంట్లో అవేవో వైర్లు పెట్టి, మళ్ళీ దానిమీద ఇంకో సన్నటి చెక్కది వేసేసి మళ్ళీ దానిమీద మేకులు దిగ్గొట్టే వారు.
ఈ ఎలెట్రీ వైరింగు వలన ఓ సదుపాయం కూడా ఉండేది. ఎంతైనా ఆరోజుల్లో, ఇంటినిండా ఫుటోలే! ఆ గోడవారే, హాయిగా కావలిసినన్ని ఫొటోలు వేళ్ళాడదీయడానికి వీలుగా ఉండేది.
కావలిసొస్తే, గోడకేసిన రంగే, ఆ వైరింగు మీదా వేసేవారు, గోడ రంగుతో కలిసి పోయి అసలు అక్కడేదో ఉందా అనికూడా తెలిసేది కాదు.

   బయట దగ్గరగా ఉండే స్థంభం నుంచి, ఓ వైరోటి లాక్కుని, కనెక్షన్ తీసికునేవారు. ఇంటిముందర పోలు నుంచి వైరుందీ అంటే వాళ్ళింట్లో కరెంటున్నట్లే అని తెలిసేది. కాల క్రమేణా, జనాభా పెరిగిందీ, దానితో పాటు మిగిలినవన్నీ కూడా అభివృధ్ధి చెందాయి. వీటిలో మొట్టమొదటగా, వీధి దీపాల వైరింగు. ఇదివరకటి రోజుల్లో, రోడ్డు మీదనుంచి, ఏ బస్సో,లారీయో వెళ్తున్నప్పుడు, వాటిమీదుండే లగేజీకి ఈ వైర్లడ్డం వచ్చేవి. ఒక్కోప్పుడు, యాక్సిడెంట్లు కూడా జరిగేవి. దానితో underground cables వచ్చి, ఈ బైట వేళ్ళాడే వైర్ల గొడవ తగ్గింది. హై టెన్షన్ వాటికి బయటే ఉంటున్నాయనుకోండి.

   అలా క్రమంగా ఇళ్ళల్లో కూడా, concealed wiring చేయించుకోడం ఓ ఫాషనైపోయింది. ఎక్కడకక్కడ స్విచ్చిలు తప్ప వైరింగు కనిపించదు. చూడ్డానికి మహ బాగ్గా ఉంటుంది, కానీ ఎక్కడో ఎప్పుడో లోపల ఏ వైరో తగలడిందనుకోండి, ఉత్తి వాసనొస్తుంది తప్ప, ఎక్కడ పాడయిందో ఛస్తే తెలియదు. ఈ లోపులో మన అదృష్టం బాగో పోతే, కొంపంతా తగలడిపోయినా ఆశ్చర్యం లేదు. పేద్ద పేద్ద కాంప్లెక్సుల్లో ఎప్పుడైనా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడల్లా నూటికి తొంభై పాళ్ళు, ఈ concealed wiring ధర్మమే! ఎందుకంటే బిల్డర్స్ అంత మంచి క్వాలిటీ వైరింగు ఛస్తే చేయరు. మనం ఏ ఫ్లాట్టో పుచ్చుకున్నప్పుడు, మరీ గోడంతా తవ్వి చూపించమనలేము కదా, ఇదిగో ఈ ఒక్క పాయింటూ ఆ బిల్డర్, exploit చేసి, ఏ నాసిరకం వైరో ఉపయోగించి, మన ప్రాణం తీస్తాడు. వాడి సొమ్మేం పోయిందీ, బయట కనిపించే స్విచ్చిలూ, ప్లగ్ పాయింట్లూ వాడు చెప్పినట్లు, బ్రాండెడ్ వే ఉపయోగిస్తాడు. వాడు సొమ్ము చేసికునేదల్లా ఈ concealed wiring లోనే.

    ఈ గొడవంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, కిందటి వారం లో మా ఫ్లాట్ ( స్వంతది) లో సడెన్ గా ఓ రోజు ఏదో కాలుతున్న వాసన రావడం మొదలెట్టిందిట, కోడలేమో, పిల్లలతో ఉంది, అబ్బాయేమో బయటకెళ్ళాడు, మొత్తానికి పక్కవాళ్ళ సహాయంతో, ఓ ఎలెట్రీ మెకానిక్కు ని రప్పించారు. వాడేమో, కొంపలో ఉండే వైరింగంతా పీకి పందిరేసి, మొత్తానికి లోపల వైరింగు సరీగ్గానే ఉందని తేల్చేశాట్ట. అయినా వాసన పోకపోయేసరికి, చూస్తే తేలిందేమిటయ్యా అంటే, ఓ ట్యూబ్ లైటు చోక్కు మాడిపోతూందట! ఏదో బాగుచేశారనుకోండి, కానీ ఈ concealed wiring వల్ల వచ్చే తిప్పలు చూశారా? లోపలేముందో తెలిసి చావదు. అలాగే, పైకి కనిపించకూడదని ప్లగ్ పాయింట్లూ, స్విచ్చిలూ బాగా కిందకి పెట్టించుకోడం. ఇంట్లో మా అగస్థ్య లాటి పిల్లాడుంటే, మళ్ళీ అదో గొడవా! పైగా ఈరోజుల్లో పిల్లలు చాలా హైపరాయె. వాళ్లకి ఏ వైరు కనిపించినా, ఏ ప్లగ్ పిన్ కనిపించినా, దాన్ని ఏ ప్లగ్ పాయింట్లోకో దోపేసి, స్విచ్చిలు వేసేస్తూంటారు. అలాటప్పుడు, నాలాటి వాళ్ళకి బి.పి. రైజైపోతుంది. పోనీ పిల్లలకి అందుబాటులో లేకుండా, లోపలెక్కడో పెట్టి తాళం వేయొచ్చుగా అంటే వినరూ. ఈ చిన్న పిల్లలకేమో ఇదో ఆటా !

   ఇవన్నీ, అబ్బో ఈ వయస్సులో మేము చేయలేనివన్నీ, ఏణ్నర్ధానికే నేర్చేసికున్నారూ అని సంతోషించాలా, లేక వీడు ఎప్పుడు పెద్దాడౌతాడా అనుకోవాలా? మేము అక్కడకి వెళ్ళినప్పుడల్లా ఇదే గొడవ. అల్లరి చూడ్డం వల్లే అసలింత భయపడిపోతున్నారూ, అసలు చూడ్డమే మానేస్తే? అలా ఎలా వీలౌతుందీ, వాణ్ణి చూడ్డానికే కదా, మమ్మల్ని రాజమండ్రీ నుంచి తెచ్చేసికున్నాడూ? ఏమిటో ఊరికే ఆలోచిస్తూ కూర్చుంటే, అన్నీ భయాలే. చూడ్డం మానేయడం కంటే, ఆలోచించడం మానేయడం హాయేమో.Easier said than done !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– just ..taken for granted….

   ప్రపంచంలో అందరికీ ఉన్న గుణం ఏమిటంటే, ప్రతీ విషయాన్నీ, చాలా వ్యవస్థలనీ, take it for granted గా తీసేసికోడం ఈ విషయంలో ఆడవారు మాత్రం, అదీ “అమ్మ” తనం వచ్చిన తరువాత మాత్రమే rare exceptions.. అదేమిటో ప్రతీ “అమ్మ” నీ మనం అందరమూ take it for granted గా అదేదో మన హక్కులా తీసేసికుంటాము. పాపం ఆ వెర్రి తల్లి, ఎటువంటి అభ్యంతరమూ లేకుండా అన్నిటినీ భరిస్తుంది. ఈ విషయంలో తండ్రులు మాత్రం, కొద్దికాలం భరించినా, ఏదో ఒక రోజు బి.పి. రైజు చేసేసికుని చెప్పేస్తారు.కానీ తల్లికి మాత్రం పిల్లలు ఎప్పుడూ పసివాళ్ళలాగే చూస్తుంది. అదే బలహీనతని మనం అందరమూ exploit చేస్తాము.

   అసలు పుట్టినప్పటినుంచీ మొదలవుతుంది ఈ స్వభావం. చిన్న పిల్లల్ని చూడండి, ఇంటినిండా ఆట సామాన్లేసికుని కూర్చుంటారు. లోపల పెట్టడానికి అమ్మే కావాలి. ప్రొద్దుటే నిద్ర లేచిన తరువాత, దుప్పట్లు మడత పెట్టడానికి బధ్ధకం, పోనిద్దూ భార్య చేస్తుందిలే, పనా పాటా అనుకోడం. అక్కడకేదో ఆడపిల్లలు బుధ్ధిమంతులనడం లేదు, పెళ్ళయ్యేదాకా వాళ్ళూ అదే పధ్ధతి. సడెన్ గా పెళ్ళై, ఇంకో సామ్రాజ్యానికి వెళ్ళడంతోటే, అన్నీ మారిపోతాయి! అదేమైనా హార్మోనల్ ఛేంజా అంటే, నాకూ తెలియదు!

   ఇప్పుడంటే ప్రతీ ఇంటికీ సెప్టిక్ టాయ్లెట్లొచ్చాయి కానీ, ఇదివరకు లేవుగా, ఆ రోజుల్లో పంచాయితీ బోర్డు వాళ్ళు, ఎవరినో పంపేవారు, night soil ఎత్తడానికి. ఎలాగూ వాడొస్తాడులే అనుకోడం, ఏ కారణం చేతైనా ఆ మనిషి రాకపోతే ఉండేది మన పని. అలాగే .పని మనుష్యులూ, పాల వాడూ, బట్టలుతికేవాళ్ళూ, ఆసుపత్రిల్లో పనిచేసే వారూ, నర్సులూ, సాయంకాలం పూట ఆ రోజుల్లో వీధి దీపాలు వెలిగించేవారూ, బస్సు డ్రైవర్లూ, కండక్టర్లూ, చివరాఖరికి పోలీసులూ ఒకళ్ళేమిటి, ప్రతీ వాడినీ మనం అందరమూ take it for granted గా తీసేసికోడమే! పైన చెప్పిన ఏ ఒక్కరు, రాకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేయకపోయినా మనం ఎక్కడుంటామో ఆ భగవంతుడికే తెలియాలి!

   ఇదేదో trade union వాళ్ళలా మాట్లాడడానికి కాదు ఈ టపా, మనలో ఎంతమంది, వాళ్ళ కష్ట సుఖాల గురించి ఆలోచిస్తాము? మన గొడవలే మనకుంటే, ఇంకోళ్ళ విషయాలు ఆలోచించడానికి టైమెక్కడిది మహాశయా అని అడక్కండి. నిజమే, ఉద్యోగంలో ఉన్నప్పుడు నేనూ ఈ విషయాల గురించి ఆలోచించేవాడిని కాదు. కానీ రిటైరయిన తరువాత, పైగా ప్రతీ రోజూ ప్రవచనాలు వినడంతో ఎప్పుడూ వీటి గురించే ఆలోచనలు. పోన్లెండి, మీలాగే మేమూ రిటైరయిన తరువాత పెట్టుకుంటామూ ఇలాటి వ్యాపకాలూ, ఇంక మమ్మల్నొదిలేయండీ అనొచ్చు. కానీ రిటైరే అవనఖ్ఖర్లేకుండా, ఏదో మీ వంతు మీరూ చేయొచ్చు– పైన చెప్పాను చూడండి– నిద్ర లేవగానే దుప్పట్లు మడత పెట్టడమూ, మనం స్నానం చేయగానే, తరువాతివారు జారి పడకుండా, బాత్రూం లో ఓ చీపురేయడమూ, మరీ భార్య చెప్పేవరకూ ఆగఖ్ఖర్లేకుండా, వెసికున్న షర్టు ఏ కాలరు దగ్గరో మాపు పట్టగానే, ఉతకడానికి వేసేయడమూ, ఇంట్లో ఉన్న న్యూసు పేపర్లు మరీ పేరుకుపోకుండా, ఏ రద్దీవాడికో అమ్మేయడమూ, భోజనానికి ముందు కంచాలూ, గరిటెలూ పెట్టడమూ, కనీసం మన కంచం మనమే తీయడమూ వగైరా ..వగైరా…

   ఇదేమిటీ సడెన్ గా ఈయనేమిటీ ప్రవచనాలు మొదలెట్టాడూ అనుకుంటున్నారా? అవునండి, చివరకి ఇప్పటికి జ్ఞానోదయం అయింది.though late than never! ప్రతీ దానికీ భార్యని take it for granted గా తీసేసికుంటే, ఎప్పుడో సడెన్ గా ఓ రోజు చెప్పేస్తుంది ” మీకు చాకిరీ ఇంక చేయలేనూ…” అని. మరప్పుడేం చేస్తాం? అందుకే చెప్తున్నా, మరీ లేట్ కానీయకండి, పైన చెప్పినవేవీ మరీ పేద్ద పేద్ద పనులు కాదు. అప్పుడప్పుడు గోడకి ఏ బూజో ఉంటే, మనమూ తీయొచ్చు, ప్రతీ దానికీ భార్యే అఖ్ఖర్లెదు. పైగా ఇందులో ఓ సౌకర్యం కూడా ఉంది– వాళ్ళు లేకపోతే మనకి జీవితమే లేదూ అని అనుకోనఖ్ఖర్లేకుండా, వాళ్ళకీ తెలియచేయడం! ఏదో ముందర కొద్దిగా కష్టంగా ఉన్నా అలవాటైపోతుంది! పైగా మనమీద టపాలు వ్రాయడమూ తగ్గుతుంది! చూశారా ఎక్కడో మళ్ళీ ఆ male ego తొంగి చూసేస్తోందీ. అసలు ఇదే కదా కారణం మనకున్న ఆ take it for granted కి మూల కారణం !

    అంతదాకా ఎందుకూ, ఏ రోడ్డుమీదో వెళ్ళేటప్పుడు చూస్తూంటాం, అరటిపండు తొక్కలు పడుండడం, మర్నాడు ఏ కార్పొరేషనువాడో వచ్చి తీస్తాడులే అని వదిలేయఖ్ఖర్లేకుండా, మనం తీసేస్తే ఏమీ ప్రాణం పోదు! అయినా సరే, వాడే రావాలీ, వాడిది కదా ఈ పనీ అనుకోడం! ఈవేళ ప్రొద్దుటే, కొద్దిగా పెందరాళే రమ్మన్నాడు కదా అని, ఏడు గంటలకే బయలుదేరాను. బస్సులో కండక్టరు తో కబుర్లు మొదలెట్టాను, మీ డ్యూటీ ఎప్పుడు ప్రారంభం అవుతుందీ అంటే, అయిదింటికీ అన్నాడు. వామ్మోయ్ ఏదొ ఓ రోజున ఈ బస్సువాళ్ళు రాకపోతే మన గతి ఆటోల పాలే కదా! అలాగే పోలీసులున్నంతకాలం, వాళ్ళని పట్టించుకునే నాధుడు లేడు. అదేదో సినిమాలో లాగ ఎప్పుడో, తిక్కరేగి వాళ్ళు డ్యూటీలోకి రావడం మానేస్తే తెలిసొస్తుంది మన పని! అందుకే ప్రతీ దాన్నీ take it for granted గా తీసేసికోడం అంత ఆరోగ్య లక్షణం కాదు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– excess baggage……

   మరీ ఈ రోజుల్లో కాదనుకోండి, ఏదో పక్కింట్లో ఉన్నవాళ్ళో, ఎదురింట్లో ఉన్నవాళ్ళో, చివరాఖరికి అదే కాలనీ లోనో, సొసైటీలోనో ఉండేవారితో, సంబంధ బాంధవ్యాలూ, ఇచ్చి పుచ్చుకోడాలూ లాటివి ఉన్నప్పటి రోజుల్లో అన్నమాట- ఒకళ్ళింట్లో ఏదైనా పిండివంటో, ఓ కూరో, పులుసో,పచ్చడో వాళ్ళు తమతో సంబంధబాంధవ్యాలున్న వాళ్ళింటికి తీసికెళ్ళి ఇవ్వడం ఓ పధ్ధతి ఉండేది. పెళ్ళై ఇంకో ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఇదే కంటిన్యూ అయేది. ఏదో ప్రతీ రోజూ అమ్మ చేసేదే తినఖ్ఖర్లేదు కదా అని, ఇంట్లో పిల్లలకి కూడా నచ్చేది.ఇంటి మగాడిక్కూడా నచ్చినా నోరెత్తి చెప్పేధైర్యం ఉండేది కాదు. ఆవిడెవరో చేసింది రుచిగా ఉందీ అంటే మళ్ళీ ఏం గొడవొస్తుందో అని నోరెత్తేవాడు కాదు! కానీ ఆ పక్కావిడ మర్నాడు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా, మరీ తనకి కూడా నచ్చేసిందీ అని చెప్పుకోడానికి కొద్దిగా మొహమ్మాటంగా ఉండి, పిల్లలకీ, మీ భాయ్ సాబ్ కీ బాగా నచ్చిందీ అని చెప్పేవారు. ఇది ఉభయతారకం ! కానీ దీనివల్ల ఆ తరువాతొచ్చే పరిణామాలే కొంచం కష్టాలు తెచ్చేవి.

ఎప్పుడు వాళ్ళింట్లో, ఈ పక్క భాయ్ సాబ్బులూ, పిల్లలూ నచ్చిందన్న పాపానికి, వాళ్ళచే నచ్చబడిన కూరో పిండివంటో చేసినప్పుడల్లా ఓ గిన్నె నిండా తెచ్చి ఇచ్చేవారు. ఏదో for a change నచ్చిందన్నారే కానీ, ఇలా నెలలో రెండేస్సార్లు తెచ్చి ఇస్తే, దాన్ని చెల్లించడం ఎలా? పైగా ఆ కాలనీకో, సొసైటీకో పనిమనుషులు కామన్ గా ఉండేవారు. మన అదృష్టం బాగోపోతే, ఈ కేసు లో కూడా అలాగే అయితే మన పని గోవిందాయే! ఏదో తెచ్చిచ్చింది కదా అని కడుపునిండా మెక్కుతామా ఏమిటీ? ఏదో కొంతవరకూ లాగించేసి, మిగిలినదంతా ఏ డస్టు బిన్నులోకో ( ఇంట్లో ఉండేది) పడేయడం. మన ఖర్మ కాలి ఈ విషయం పనిమనిషి చూసిందంటే అక్కడకి చేరేస్తుందీ విషయం. ఒకళ్ళ కాలికీ, ఇంకోళ్ళ మెడకీ ముడేసే విషయంలో వీళ్ళు ( పనిమనుషులు) మహా ఘనులు!

మామూలుగా మనం ఏ తీర్థయాత్రలకో వెళ్ళినప్పుడు, వాళ్ళెవరికో ఇవ్వాలీ, వీళ్ళెవరికో ఇవ్వాలీ అనుకుంటూ, ఊరికే ప్రసాదాలూ, కాశీ తాళ్ళూ కొనేయడం. పోనీ తీర్థయాత్రలనుంచి తిన్నగా ఇంటికొస్తారా అంటే అదీ లేదూ, ఆ ఊరూ ఈ ఊరూ తిరిగి మెల్లిగా ఓ పదిరోజులకి కొంప చేరతారు. మరి తెలిసిన జనాభా కోసం కొన్న ప్రసాదాల మాటేమిటీ, భార్యా భర్తా ఓ న్యూసు పేపరుని, చిన్న చిన్న ముక్కలుగా చింపి, ఓ దాంట్లో ఆ తెచ్చిన ప్రసాదం ముక్కా, ఇంకో దానిలో పసుపూ, కుంకం, వీటన్నిటినీ మళ్ళీ ఇంకో కాగితంలో పొట్లం కట్టి, దానికో కాశీ తాడు చుట్టి, పిల్లలచేత, ఆ కాలనీ లో తెలిసిన వారందరికీ పంపడం. తీరా, అలా ఇవ్వబడినవాళ్ళు, పొట్లం తెరిస్తే ముక్కు వాసనొస్తున్న ఓ లడ్డూ ముక్కో, వడముక్కో ఉంటుంది. పోనీ తిరుపతి ప్రసాదం కదా అని కళ్ళకద్దుకుని నోట్లో వేసికుందామనుకుంటే, అదేమో వాసనా. పోనీ పడేద్దామనుకుంటే, ఆ దేవదేముడికి ఎక్కడ కోపం వస్తుందో అని భయం. అన్నేసి ప్రసాదాలు కొనడం ఎందుకూ, ఊళ్ళన్నీ తిరిగొచ్చేదాకా దాన్ని అంత పదిలంగా ఉంచడమెందుకూ, పోనీ ఉంచారే, అదెలా ఉందో ఓ సారి చూసిస్తే, వాళ్ళ సొమ్మేం పోయిందీ? ప్రసాదం ఇవ్వలేదే అని ఎవరైనా గొడవెట్టారా? ఏమిటో ఈ అలవాట్లెప్పుడు మానుతారో ఏమిటో? ఇదివరకటి రోజుల్లో అయితే, తిరుపతి లడ్డూ, పదిరోజులైనా పాడైపోకుండా ఉండేది. మరి ఇప్పుడో? క్వాలిటీ మారిపోయింది.

అలాగే కోడలు పుట్టింటినుంచి వచ్చేటప్పుడు తెచ్చే సారె ఒకటి. ఇదివరకటి రోజుల్లో అటుకులూ, పంచదార చిలకలూ, మినపసున్నీ, మిఠాయుండలూ, సున్నిపిండీ, తాటాకు బుట్టల్లోనో, బిందెల్లోనో తెచ్చేవారు. వాటన్నిటినీ ఆ చుట్టుపక్కలవాళ్ళందరికీ పంచిపెట్టేవారు. అదో ముచ్చట. ఆరోజుల్లా ఇప్పటికీ కొందరు చేస్తున్నారు.కానీ వాటి క్వాలిటీ అప్పటిలా లేదు కదా, వచ్చిన గొడవల్లా ఏమిటంటే, వాళ్ళింట్లో తినగా మిగిలినవో, తినలేకపోయినవో ఎవరింటికో వెళ్ళినప్పుడు వాళ్ళకి తీసికెళ్ళడం! ఎందుకు చెప్పండి అవతలివాళ్ళను అలా హింసించడం? వర్షాలూ వరదలూ వచ్చినప్పుడు నదుల్లోని excess water పల్లం లోకి పోయినట్లు, ఇలా ఏ పెళ్ళామో పుట్టింటినుంచి తెచ్చిన ఫలహారాలు ఇంకోళ్ళకివ్వడం!

అలాగే ఇంకోటి, ఏ పెళ్ళికో, గృహప్రవేశానికో శుభలేఖలు వేయించడం. ఊరికే ఆబగా వేయించేయడం. వాటన్నిటికీ ఎడ్రసులు వ్రాసి పోస్టు చేసే ఓపికుండదు. పోనీ పిల్లదో పిల్లాడిదో పెళ్ళి కదా, వాళ్ళిచ్చుకుంటారూ అనుకుంటే, వాళ్ళేమో ఇంకా తెలివిమీరిపోయారు, ఏదో ఒకటి స్కాన్ చేసేసి, ఫ్రెండ్సందరికీ పంపేయడం. ఏదో కొత్త పెళ్ళికొడుకూ, పెళ్ళి కూతురూ ఏ హనీమూన్నుకో వెళ్ళినప్పుడు ఈ మిగిలిపోయిన శుభలేఖలన్నీ బయట పడతాయి. పోనీ ముందరే చెప్పొచ్చుగా, అన్నఖ్ఖర్లేదూ అని. అవేమైనా ఊరికే వచ్చాయా, ఒక్కో కార్డుకీ ఎంతంత ఖర్చయిందో, ఆ ఇంటి పెద్దకి తెలుసు. మరి ఈ మిగిలిపోయిన కార్డులన్నీ ఏం చేయడం? అటూ ఇటూ పడేయలేరూ, మరీ పాతన్యూసుపేపర్లవాడికీ ఇచ్చేయలేరూ, ప్రతీ చోటా సెంటిమెంటోటీ. వీటన్నిటినీ ఓ పేద్ద ప్యాకెట్టులో పెట్టి అటక మీద పెట్టడమే! ఇదివరకటిలా ఈ రోజుల్లో అటకల్క్కడివీ, అదేదో లాఫ్టో, సింగినాదమో దానిమీద పెట్టడం!

ఇదిగో ఇలాటివే excess baggage….. అంటే.