బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఈవేళ మా నాన్నగారి ఆబ్దీకం పెడదామని శ్రీ రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము. గత 12 సంవత్సరాలనుండీ ( అంటే పూణె తిరిగివచ్చినప్పటినుండీ) అక్కడే పెడుతున్నాను. మరీ మనవైపు ఉన్నట్లు ఉండదనుకోండి,అలాగని మరీ తూతూ మంత్రం కూడా కాదు.పరవాలేదు.అయినా మనం ఆ రోజు స్వర్గస్థులైన మన పెద్దవారిని తలుచుకుని వారికి తర్పణాలు వదలడం ముఖ్యం.ఎక్కడి పధ్ధతి అక్కడిది.No issue.మొదట్లో 150 రూపాయలుచ్చుకునేవారు, అలా క్రమక్రమంగా పెంచి ప్రస్తుతం 400/- చేశారు.రాజమండ్రీలో ఉన్నప్పుడు,క్రిందటిసారి గోదావరి గట్టున ఉండే రాఘవేంద్ర మఠంలో చేశాను. అక్కడ 1000/- రూపాయలుచ్చుకున్నారు. కానీ పధ్ధతంతా, మనం ఇంట్లో ఎలా పెడతామో అలాగే చేశారు. నాలుగు కూరలూ, నాలుగు పచ్చళ్ళూ, గారెలూ, అప్పాల తో భోజనం.సాయంత్రం ఫలహారానికి ఇంటికి కూడా ఇచ్చారు.అగ్నిహోత్రం అదీ పెట్టి చేయించడం వలన అదో రకమైన సంతృప్తీ.అదే రోజుకి ఎంతమందున్నా, ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేయించడంతో అదో పెర్సనల్ టచ్ వచ్చింది.

    ఇక్కడ అలా కాదు. ఓ రోజుముందుగా బుక్ చేసికోవడం, ఆ రోజు 10.30 కి మనం అక్కడ రెడీగా ఉండాలి.గత 12 సంవత్సరాలనుండీ పెడుతున్నానన్నానుగా, అదేరోజు పెట్టే కొంతమందితో పరిచయం అయింది.ప్రతీ ఏడాదీ, కలుసుకోవడం
కలిసిన ప్రతీసారీ ఒకే Standard dialogue- nice to see you again! ఆ మనిషి ఆసారి కలవకపోతే, టపా కట్టేశాడేమో అనుకోవడం అందులో ఒకాయన ( తమిళుడు), ఖాళీ టైములో ఏంచేస్తూంటావూ అన్నారు. ఛాన్సు దొరికితే ఊరుకుంటానా- ఇదిగో రోజుకో టపా తెలుగులో వ్రాసి, తెలుగువారందర్నీ బోరుకొట్టేస్తున్నానూ-అనగానే అచ్చా తెలుగులో ఎలా వ్రాయకలుగుతున్నావూ అనగానే, కంప్యూటర్ మీద నాకున్న ప్రావీణ్యం చెప్పేటప్పటికి, నేనేదో expert అనుకున్నాడు పాపం.ఇంకా ఏవేవో టెక్నికల్ విషయాల్లోకి వెళ్తూంటే, ‘చూడండీ, మీకు తమిళంలో వ్రాయడం నేర్పుతాను.బస్. అంతేకానీ
మరీ నన్ను ఇరుకులో పెట్టి ఏవెవో విషయాలు అడగొద్దూ’అని చెప్పేశాను. సో నాకో ‘శిష్యుడు’ ( నాకంటే పెద్దాయనే!) దొరికారు.మనకు తెలిసినదేదో ఇంకోరితో పంచుకోవడంలో ఉన్న ఆనందం ఇంతా అంతా కాదు!.అయినా ఇన్నేళ్ళనుండీ, ముగ్గురం మాత్రం ప్రతీసారీ కలుసుకుంటున్నాము. క్రిందటేడాది, నేను రాజమండ్రీ లో పెట్టడంవలన నేను కనిపించకపోయేసరికి, పోయాననుకున్నారుట! లేదు మహప్రభో ఇప్పటివరకూ బాగానే ఉన్నానూ అని చెప్పి ఓసారి నవ్వుకున్నాము.పెన్షనర్స్ ప్రతీ ఏడాదీ నవంబరు లో బ్యాంకు(పెన్షను తీసికునే బ్యాంకు) కి వెళ్ళి, మేము బ్రతికే ఉన్నామూ అని ఓ living certificate/ live certificate ఇవ్వాల్లెండి. దాని పెరేదో ఎప్పుడూ గుర్తుండదు. ఏదైతేనేమిటిలెండి బ్రతికే ఉన్నామూ అని వాళ్ళెదురుగా ఓ ఫారం మీద సంతకం పెట్టాలి. ఇదిగో ఈ నవంబరులో అక్కడికోచోటికి వెళ్ళాలి. ఈ సర్టిఫికెట్ గురించి ఎందుకు చెప్పానంటే, రాఘవేంద్ర మఠంలో నా పాతస్నేహితుల్ని కలిసినప్పుడు అది గుర్తొచ్చింది!

    ఇంక అసలు కార్యక్రమానికి వస్తే, ఈవేళ్టి తిథికి చాలా మందొచ్చారు.ఓ పాతికమందిదాకా ఉంటారు. ఈ పన్నెండేళ్ళనుండీ వెళ్తూండడంతో, అక్కడి పురోహితుడేం చెప్తారో, ఏం చేయాలో బాగా గుర్తుండిపోయాయి. పైగా తెలియనివాళ్ళకి గైడెన్స్ కూడా ఇచ్చేటంతటి expertise వచ్చేసింది!ఇదివరకు,అన్నీ ఆ పురోహితుడే సర్దేవారు-అంటే దర్భలు ఇవ్వడం,దోనెల్లో బియ్యం,నువ్వులూ పెట్టడం వగైరా. ఇప్పుడు వాళ్ళుకూడా తెలివిమీరారు. ఎవర్నో ఒకర్ని పిలవడం, వాళ్ళకి ఈ పని అప్పగించేయడం!ప్రతీదాంట్లోనూ outsourcing! హిందీలోనూ, కన్నడంలోనూ చేయిస్తారు.అర్ధం అయినవాళ్ళకి అవుతుంది. లేనివాళ్ళకి వాళ్ళవాళ్ళ అదృష్టం.పక్కవాడేం చేస్తున్నాడో చూడ్డం, వాడేంచేస్తే చేసేయడం!జంధ్యం అటూ ఇటూ మార్చడం లాటివన్నమాట.

    మనం ఎవరి అబ్దీకం పెడుతున్నామో, వారి పేరూ,వారి తండ్రి,తాత పేరూ చెప్పాలిగా. అవన్నీ మామూలుగానే అయ్యాయి.ఓ పెద్ద మనిషి ( మొదటిసారి వచ్చుంటాడు) ఈ పేర్లన్నీ చెప్పమన్నప్పుడు, పాపం అతనికి వినబడలేదో, లేక అర్ధం అవలేదో, తన చాచా ( పినతండ్రి ) పేరుకూడా చెప్పాడు.ఆయన అక్కడే వెనక్కాల ఈ తతంగం అంతా పరిశీలిస్తూ కూర్చున్నారు, సడెన్ గా ఆయనపేరుకూడా మెన్షన్ చేసేటప్పటికి, ఉలిక్కి పడి ‘ मॅ जिंदा हूं बाबा !’ అంటూ ఒకటే గోల!
అందరికీ ఒకటే నవ్వు!మళ్ళీ ఆచమనం చేయించి, దానికేదో ప్రాయశ్చిత్తం చేయించారు! ఇదిగో ఇలాటివి కూడా జరుగుతూంటాయి!

    ఆబ్దికం పెడుతున్నాముకదా అని మరీ సీరియస్సుగానూ, గ్రిమ్ గానూ ఉండఖ్ఖర్లేదు.స్వర్గస్థులైన వారిమీద గౌరవం, అభిమానమూ ఉండడం ముఖ్యం. మధ్యలో ఇలాటి sidelights ! ఈ కార్యక్రమం అంతా ఓ గంటన్నర పట్టింది. ఆ తరువాత ఒంటిగంటకి పక్కా కన్నడ వంట ( మరీ ఏమీ ఎక్కువేం లేవూ- ఓ కూర, పచ్చడి, చిత్రాన్నమో ఏదో అంటారు అదీ,చారు, పల్చగా జావ లా ఉన్న ఓ స్వీటూ) పెట్టి అయిందనిపించారు.

    క్రిందటిసారి మా అమ్మగారి అబ్దీకం పెట్టినప్పుడు, నాలుగు గంటలు continuous గా కూర్చునేటప్పటికి, మర్నాడు మోకాళ్ళు పట్టేసి, నాలుగు రోజులపాటు ‘గృహనిర్భంధం’ లో ఉండవలసివచ్చింది.ఈసారి అలాటి లక్షణాలేమీ కనిపించడంలేదు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- టి.వీ. జ్ఞాపకాలు-1

    మాకు పూణె లో 1973-74 లలో అనుకుంటా, బ్లాక్ ఎండ్ వైట్ టి.వి లు వచ్చాయి. మేము అప్పటికి ఫాక్టరీ క్వార్టర్లకి వెళ్ళలేదు. కలస్ అని ఒక చోట ఉండేవాళ్ళం. శనాదివారాలు, ఓ కొట్టువాడు, రోడ్డుమీదవెళ్ళే ప్రతీవారూ చూసేటట్లుగా, ఓ బ్లాక్ ఎండ్ వైట్ టి.వి లో కార్యక్రమాలు చూపించేవాడు.అప్పుడప్పుడు, బయట వాక్ కి ( అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది, భార్యతో బయట షికారుకెళ్ళడంలో మజాయే వేరుగా ఉండేది!),వెళ్ళినప్పుడు ఏవో, హిందీ సినిమా పాటలూ, సినిమాలూ చూసేవాళ్ళం. ఎప్పటికైనా సరే, ఇంట్లోకి ఓ టి.వి. కొనేశాయాలని అప్పుడే అనుకున్నాను.మనం అనుకుంటే సరిపోతుందా, జేబులో డబ్బులుండొద్దూ? ఇప్పటిలాగ, ఆరోజుల్లో ఏమైనా క్రెడిట్ కార్డులా, బ్యాంకు లోన్లా?
అప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలాగ, దుకాణాల్లో ఎక్కడైనా వాయిదాలమీద ఎవడైనా ఇస్తాడేమో అని ప్రయత్నించాము. అబ్బే మన మొహం,జీతం ( రూ.1000/- మాత్రమే) చూసి ఎవడిస్తాడండీ? కట్లూ వగైరాలు పోయి చేతికి వచ్చేది ఎంతా? ఓ ఆరువందలు!

    అప్పుదు తెలిసింది,మా ఫాక్టరీ క్రెడిట్ సొసైటీ లో అప్పిస్తారనిన్నూ, దాన్ని జీతంలోంచి తీసుకుంటారనిన్నూ.నాకు అప్పిచ్చేవాడు దొరకాలేకానీ, తీర్చడం ఫరవాలేదు.చేతిలోకి ఎంతొస్తే దాంట్లోనే బ్రతుకుతాం.అప్పటికే ఓ పాపకి తల్లితండ్రులమైనా, అదో ధైర్యం! ఇంట్లోకి ఓ వస్తువొస్తుందని ఉత్సాహం! మొత్తానికి రూ.3000 ఇచ్చారు. ఆ డబ్బు పుచ్చుకుని, నేను పెళ్ళికి పూర్వం రికార్డులూ అవీ తీసికెళ్ళే కొట్టుకి వెళ్ళి, ఓ క్రౌన్ టి.వి. కి ఆర్డరు ఇచ్చేశాను.ఖరీదు- రూ.3050/-
ఫాక్టరీకి వెళ్ళి డబ్బావాలా చేత ఓ చీటీ పంపేశాను, సాయంత్రానికల్లా మనింటికి టి.వీ. వచ్చేస్తోందోచ్ అని! సాయంత్రం, క్రౌన్ కంపెనీ ఇంజనీర్ వచ్చి,మా ఇంట్లో టి.వి. ఇన్స్టాల్ చేశాడు. అక్కడికేదో సాధించేసిన ఫీలింగు. మర్నాటినుండి, ఎప్పుడు బయటకి వెళ్ళినా అందరూ మనవైపే చూస్తున్నారనే ఫీలింగోటి, ఎందుకంటె, మా కాలనీ లో అప్పటికి ఎవరిదగ్గరా టి.వి. ఉండేది కాదు!

   ఆ రొజుల్లో బొంబే నుండే కార్యక్రమాలు వచ్చేవి. భాష అర్ధం అయినా అవకపోయినా, రాత్రి 10.30 దాకా అన్ని కార్యక్రమాలూ చూడడం. Whats Good Word అని ఓ కార్యక్రమం, సబీరా మర్చెంట్ నిర్వహించేవారు. అద్భుతం! టి.వీ. వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలిసింది. సిధ్ధార్థ్ బాసు క్విజ్ కార్యక్రమం చాలా బాగుండేది. గురువారాలు ఛాయా గీత్ టైముకల్లా, చుట్టుప్రక్కలుండేవాళ్ళందరూ వచ్చేసేవారు. అందరూ స్నేహితులే, ఎవర్ని వద్దంటాం? ఒకటిమాత్రం ఒప్పుకోవాలి,ఎప్పుడూ దగ్గరలో ఉన్న స్నేహితుల్ని మాత్రం ఎప్పుడూ పిలిచేవారం కాదు.రమ్మన్నా, వద్దన్నా వచ్చేవారు రాకమానరు. దూరంగా ఉండే స్నేహితుల్ని మాత్రం ఆదివారాలు సినిమా, కం భోజనానికి పిల్చేవాళ్ళం.

    ఆ సందర్భంలోనే,టి.వీ. వచ్చిన మొదటాదివారం, ఆగస్టు 15,1975 టి వి లో ‘వక్త్’ ( Waqt) సినిమా వేస్తున్నాడని, మా ఫ్రెండుని ఫామిలీతో రమ్మన్నాము. టి.వీ. మీద దుమ్మూ, ధూళీ పడకూడదని, మా ఇంటావిడ, దానిమీద ఓ క్లాత్ వేసేది.మాకేం తెలుసూ, ఆ టి.వి. వాల్వ్ సెట్ అనిన్నూ, దాంట్లొకి వెంటిలేషన్ కోసం, చిల్లులు పెట్టాడనీనూ. కొంతసేపు సినిమా అయిన తరువాత, పొగలూ,శగలూ రావడం మొదలెట్టాయి, ఠప్ మని చప్పుడుతో అదికాస్తా బొమ్మ ఆగిపోయింది! అది ఆగిపోవడం కంటే, ఇంటికొచ్చినవాళ్ళూ, మా ఫుకట్ ప్రేక్షకులూ నవ్వుకుంటారేమో అని భయం. అందరితోనూ, ఫణిబాబు కొన్న టి.వీ. మంచి క్వాలిటీది కాదూ అని యాగీ చేస్తారేమో అనో భయం.ఏమిటో ఎప్పుడూ ఊళ్ళోవాళ్ళేమనుకుంటారో అనే భయం.ఆ మధ్యవర్గపు ఫీలింగులు ఇప్పుడు లేవనుకోండి.

    క్రౌన్ టి.వీ వాడికి ఫోను చేసిన అరగంటలో వారి ఇంజనీర్ వచ్చి, మా ఇంటావిడ లోపల్నించి కాఫీ తెచ్చేలోపల రిపేర్ పూర్తిచేసేశాడు. లోఖండే అని ఒకతను వచ్చేవాడు. ఈ మధ్యన తనిష్క్ యాడ్ లో ఆమీర్ ఖాన్ ని చూస్తూంటే, అతనే గుర్తుకొస్తాడు. తేడా ఏమిటంటే ఇక్కడ ఆమిర్ ఖాన్ కాఫీ త్రాగుతాడు, అక్కడ మా లోఖండే త్రాగేవాడుకాదు. ఇతనిలాగ అతను ఎం.డి. కాడు, Partner మాత్రమే! ఆ క్రౌన్ టి.వీ తో మా కుటుంబ అనుబంధం ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు! ఎన్నెన్ని మంచి కార్యక్రమాలొచ్చేవో? ఇప్పడు, టి.వీ ల్లో కార్యక్రమాలు కుటుంబం అంతా కలిసి చూడ్డమే పడదనుకోండి, అధవా అందరూ కలిసినా, అందరిదీ తలో టేస్టూ!అయినా అనుకుంటాం కానీ, ఆ రిమోట్ మన చేతిలో ఉంటుందా ఏమిటీ? ఏది కనిపిస్తే అది చూడడం.

    1983 లో నాకు వరంగాం transfer అయినప్పుడు, ఆ ఊళ్ళో టి.వి. లేదని, దీన్ని అమ్మేద్దామని బేరం పెడితే, మాకు దగ్గరలోనే ఉండే బేకరీ అతను, రు.1000/- కి తీసికుంటానన్నాడు.దాన్ని తీసికెళ్ళేరోజుమాత్రం, ఇంట్లో మేమందరమూ చాలా సెంటిమెంటల్ అయిపోయాము ఏదో ఇంట్లోవారే పోయినట్లు!ఓ వారం రోజులపాటు ఏమీ తోచలేదు. నిజం చెప్పాలంటే బెంగ పెట్టేసికున్నాము!ఎంతవరకూ వచ్చిందంటే, మా టి.వీ కొన్నతని ఇంటికి వెళ్ళి మా టి.వీ చూసేదాకా! ఇంకా మా టి.వీ. అంటే కొనుక్కున్నతను కాళ్ళిరగ్గొడతాడు! చెప్పొచ్చేదేమిటంటే ప్రాణం లేని వస్తువైనా, సంవత్సరాలు గడిచేకొద్దీ దానితో మన జీవితాలు ఎంతలా ముడిపడిపోతాయో అని!
ఇది నా మొదటి టి.వీ. కథ. అప్పుడే అయిపోలేదు.ఇంకో రెండింటిగురించి మరో టపాలో. దానికీ కారణం ఉంది చివర్లో చెప్తాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…

    ఈవేళ ప్రొద్దుటినుండీ, మన చానెళ్ళలో దేముడికి సంబంధించిన విశేషాలు మొదటగా ప్రభుత్వం వారు జీతాలు సరీగ్గా ఇవ్వడంలేదని అర్చకులూ,మిగిలిన సిబ్బందీ సమ్మె చేయడంతో, దాదాపు ఆంధ్రదేశంలోని చాలా దేవాలయాల్లో, అభిషేకాలు ఆపేశారుట. ప్రసాదాలు తయారుచేయడం ఆపేశారుట. ఇదివరకటి రోజుల్లో ఇలాటివేవీ వినలేదు. ఇదిగో ప్రభుత్వం వేలెట్టిన ప్రతీదానిలోనూ ఏదో ఒక గొడవే. రెండోది మేడారం జాత్ర సందర్భంలో హుండీ లో భక్తులు వేసిన కానుకలు లెఖ్ఖపెట్టేటప్పుడు చూపిన చేతివాటం.ఆ విషయంమీద ఈ.ఓ. ని అడిగితే, మామూలు సమాధానమే- ఎంక్వైరీ కమిటీ వేస్తారూ, అదివచ్చిన తరువాత దోషుల్ని శిక్షిస్తారూ అని! ఇలాటి ప్రకటనలు, రికార్డు చేసేసి, ఆ సీ.డీ. పెట్టేస్తారనుకుంటా!

   మధ్యాన్నం అదేదో చానెల్ లో ఈ రోజుల్లో చిన్న పిల్లలకి వాడే వస్తువుల్లో ఉండే డేంజర్ల గురించి.ఇదివరకటిరోజుల్లోనే హాయండి బాబూ. ఇన్నిన్ని సరుకులూ ఉండేవికావు. ఏదో దొరికిన గ్రైపువాటరునే వాడేసి, ఎలాగోలాగ పిల్లల్ని పెద్ద చేసేశాము.ఆ గ్రైపువాటరు అసలు, సీన్ లోంచి ఎప్పుడు మాయం అయిపోయిందో కూడా తెలియదు.ఆ రోజుల్లో ఓ లంగోటా కట్టేసి ఉంచేసేవారు. ఇప్పుడల్లా కాదుగా, ఏవేవో రకరకాల డైపర్లూ వగైరా.ఉన్న ఒక్క పడగ్గదిలోనూ, పరుపులు తడవకూడదూ, పోనీ తడిసినా, ఆరేసుకోడానికి ఇప్పుడున్న ఎపార్ట్మెంట్లలో ఎండెక్కడినుంచి వస్తుందీ? దాంతో రాత్రంతా ఓ డైపరు కట్టేసి పసిపిల్లల్ని పడుక్కోపెట్టేయడం. పైగా డాక్టర్లనబడేవారి ద్వారా వ్యాపార ప్రకటనలోటీ.

   సున్నిపిండీ, కొబ్బరినూనె కూడా ఎప్పుడు మాయం అయ్యాయో తెలియదు!పైగా ఈ రోజుల్లో డాక్టర్లుకూడా ఏవేవో కారణాలు చెప్పేసి ( ఒకళ్ళు ఎలర్జీ అనీ, ఇంకోళ్ళు ఇంకోటేదో అనీ)సున్నిపిండి వాడకాన్ని మాయం చేసేశారు. యుగాల తరబడి
ఈ సున్నిపిండులూ, నూనెలూ, ఆముదాలూ వాడలేదా, పసిపాపలు శుభ్రంగా పెరిగి పెద్దవలేదా
? ఎవడో ఏ అమెరికాలోనో, బ్రిటన్ లోనో చెప్తాడు,అంతే మనం మానేస్తాం! వాడికి సున్నిపిండి దొరకదుకాబట్టి, దానికి ఏదో కారణం చెప్పి, చిన్నపిల్లలకి వాడకూడదూ అన్నాడు. మనం ‘ఓహో ఇంగ్లీసోడు చెప్పేడూ నిజమే కాబోసూ..’అనుకోవడం. శుభ్రంగా నలుగుపెట్టి అమ్మమ్మలూ, నానమ్మలూ వాళ్ళ కాళ్ళు జాపుకుని ఆ కాళ్ళమీద దోసిళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించి, ఓ చీరలో చుట్టబెట్టి శుభ్రంగా వళ్ళంతా తుడిచేసి, సాంబ్రాణి పొగ వేసి, అమ్మదగ్గర పాలు త్రాగి హాయిగా పడుక్కునేవారు!

    ఇప్పుడో- స్నానానికి టబ్బులు, తోమడానికి షాంపూలూ ( టియర్ లెస్ ట!), సబ్బులూ. ఆ తరువాత ఎండబెట్టడానికి అదేనండి తుడవడానికి, టర్కిష్ టవళ్ళూ, ఆ తరువాత లోషన్లూ, క్రీమ్ములూ, పౌడర్లూ. వీటన్నిటినీ పట్టించేసి, ఓ డైపరు చుట్టేసి, ఓ బాటిల్లో పాలు పెట్టేస్తే, పాపం ఆ బుజ్జిపాపాయే చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటోంది!తనకీ తెలుసును, ఈ ప్రపంచంలో తనకి పాలు పట్టే తీరిక ఎవరికీ లేదని! ఎలాగోలాగ బ్రతికి బట్ట కట్టాలిగా! తుమ్మితే డాక్టరూ, దగ్గితే డాక్టరూ, అవేవో వ్యాక్సీన్లూ. అవన్నీ ఉండకూడదనడంలేదు. ఏమిటో ఈ మాయదారి రోగాలు, ఇదివరకు అన్ని ఉండేవి కావా, లేక వచ్చిన రోగాలన్నిటికీ మందులుండేవి కావా? ఏమిటో ఏదీ అర్ధం అవదు.

   ఆ పిల్లో పిల్లాడో రెండు మూడేళ్ళొచ్చేసరికి, అంటే తినడం ప్రారంభించేసరికి చాకోలూ, నూడిళ్ళూ ( ఈ మధ్యన అవేవో ఫూడిళ్ళుట!), బర్గర్లూ, పిజ్జాలూ, రియల్ జ్యూసులూ.ఇంకో ఏడొచ్చేటప్పటికి ఓ చేతిలో రిమోట్, ఇంకో చేతిలో ఐఫోన్. వారంరోజుల క్రితం వార్తల్లో వచ్చింది-ప్రపంచంలో అతి ఖరీదైన కారు ‘ బుగాటీ ‘ మనదేశంలోకి వస్తోందీ ఖరీదు పన్నెండు కోట్లనిన్నూ. ఈవేళ వచ్చేసిందిట. ఈ వారం రోజుల్లోనూ నాలుగు కోట్లు పెరిగి అదికాస్తా పదహారు కోట్లుట!

   ఆ కారుని కొనేవాళ్ళు లేరని కాదు,పోనీ కొన్నారే అనుకుందాం, ఏం చేస్తారూ వాడి కొడుక్కో కూతురుకో ఇస్తారు. వాళ్ళేమో చక్కగా ఏ ఫుట్ పాత్లమీద నిద్రపోయేవారిమీదనుంచో నడిపించేసి మాకేం తెలియదూ అనడం. మన రోడ్లమీద అంతంత వేగం ( 450 కే.పి.ఎచ్ ట!) అవసరమా అని! కొనుక్కునెవారు కొనుక్కుంటారూ మధ్యలో నీ నస ఏమిటీ అనకండి. కార్లలో వెళ్ళేవారైతే , ఆ కారుతో( ఢీకొడితే) క్షణంలో నుసైపొతారు. వచ్చిన గొడవల్లా నిరంతరం నడుస్తూ ఉండే నాలాటి పాదచార్లకే! అంత స్పీడుతో వెళ్తూంటే, అది నామీదే ఎక్కఖర్లేదు, పక్కనుంచి జుయ్యిమంటూ వెళ్ళినా, నాలాటి అర్భకుడు కాస్తా ఎగిరిపడి, ఏ కాలో చెయ్యో విరక్కొట్టుకుంటాడు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–BBC Test Match Special లోని కొన్ని ఆణిముత్యాలు…

    కొంతమందికి ఒక గొప్ప టాలెంటుంటుంది.వారు ఏ విషయం గురించి మాట్లాడినా, అవతలివారు శ్రధ్ధగా వినేటట్లు చేయడం. ప్రతీ రోజూ జి తెలుగు చానెల్ లో ‘గోపురం’ అనే కార్యక్రమం నిర్వహిస్తూన్న డా.ఎం.సంధ్యాలక్ష్మి గారొకరు.ప్రతీ రోజూ ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం మీద అందరికీ అర్ధం అయే భాషలో, చెప్పడం. అలాగని ఆవిడ ఏమీ ఆధ్యాత్మక విషయాలు వినేవారిమీద బలవంతంగా రుద్దడం లేదు. ఆవిడ చెప్పే ప్రతీ విషయానికీ, సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తున్నారు.దేముడంటే నమ్మకం లేనివారు కూడా నచ్చినా నచ్చకపోయినా కన్విన్స్ అవుతారు. అవక, తాము పట్టిన కుందేళ్లకి మూడే కాళ్ళంటే, అది వాళ్ళ ఖర్మ!!

   అలాగే సోనీ చానెల్ లో సోమవారం నుండి గురువారం వరకూ ‘కే.బి.సి-4’ నిర్వహిస్తున్న అమితాబ్ బచ్చన్. మొదటి రెండు వెర్షన్లకంటే కూడా బాగా చేస్తున్నారు.మధ్యలో కొంతకాలం షారూఖ్ ఖాన్ నిర్వహించినా కూడా, ఆ కార్యక్రమం అంత విజయవంతం కాలేక పోయింది.అలాగే శ్రీ గరికపాటి నరసింహరావు గారొకరు, ఆయన ప్రవచనాలు ప్రత్యక్షంగా వినడం ఒక అలౌకికానందం.చాగంటి వారివి ప్రత్యక్షంగా వినే అదృష్టం ఇంకా కలుగలేదు.

   అలాగే కాలేజీలో చదువుకునేటప్పుడు, మాకు ఇంగ్లీషు కి వచ్చే శ్రీ గొట్టుముక్కల కృష్ణమూర్తి గారూ, శ్రీ ఆర్.రామకృష్ణరావుగారూ, తెలుగు నేర్పే శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారూనూ. వారు చెప్పే విధానంలోనే ఉందనుకుంటాను.
నాకు జీవితంలో లెఖ్ఖలంటే కొంతైనా ఆసక్తి కలిగించినవారు మా ప్రిన్సిపాల్ శ్రీ గరిమెళ్ళ రమేశం గారు. వాహ్వ్ అదండీ చెప్పడం అంటే. అలాగే అంతకు పూర్వ ప్రిన్సిపాల్ గారు, శ్రీ పెద్దాడ రామచంద్రరావుగారు. మొత్తం బి.ఏ, బి.ఎస్.సీ, బీ.కాం విద్యార్ధులందరికీ మా కాలేజీ హాల్లో కూర్చోపెట్టి, షేక్స్పియర్ డ్రామా చెప్పేవారు.అద్భుతం.

    అలాగే రేడియోల్లో తెలుగు వార్తలు చదివే శ్రీ పన్యాల రంగనాధరావుగారూ, ఇంగ్లీషు వార్తలు చదివే మెల్విల్ డి మెలో, చక్రపాణి, రేడియో సిలోన్ లో వచ్చే శ్రీ గొపాల్ శర్మా. అమీన్ సయానీ గురించి చెప్పడానికైతే మాటలే చాలవు! అలాగ
కామెంట్రీలు చెప్పే వారిలో సారొబిందూ సాన్యాల్, డికీ రత్నాగర్. దేవ్ రాజ్ పురీ. బి.బి.సీ నుంచైతే Brian Johnston, John Arlot, Alan Mcgilvray, Richie Benaud, AFS Talyarkhan.వీళ్ళందరూ చెప్తూంటే, కళ్ళకు కట్టినట్లుగా చెప్పేవారు.

    ఇప్పుడు క్రికెట్ కామెంటరీ వినడం అంటేనే చిరాకొస్తోంది.అరుణ్ లాల్, రవి శాస్త్రి ల కామెంటరీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అసలు వీళ్లందరికీ వొకాబ్యులరీ లో ట్రైనింగిస్తేనైనా బాగుపడతారేమో? ఎప్పుడు విన్నా ఒకటే గోల!
ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ మధ్యన నెట్ లో వెదుకుతూంటే, నా all time favourites ( పైన చెప్పిన వారు), 1960-90 లలో బీ.బీ.సీ లో ఇచ్చిన కొన్ని మచ్చుతునకలు దొరికాయి. మీలో ఎవరికైనా ( అంటే ఈ తరం వారికి) అసలు సిసలైన కామెంటరీ ఎలా ఉండాలో వినాలంటే ఈ లింకు నొక్కి వినండి.
కొంతమందనొచ్చు, స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళు దాటినా, ఇంకా ఆ బ్రిటిష్ వారినే పొగుడుతున్నారూ అని!టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సలాం ! ఆ లింకులో పెట్టిన ఒక్కో దానిమీదా నొక్కుకుంటూ వినేసి ఆనందించేయండి. క్రికెట్ కామెంటరీ
ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుస్తుంది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

  ఈవేళ మధ్యాన్నం టి.వి. చూస్తూంటే, ఎన్ డి.టి.వి లో ఓ కార్యక్రమం చూశాను. దానిలో కామన్వెల్తు క్రీడలూ, దానిలో జరిగిన అవినీతి గురించి చర్చ విన్నాను. ఆ సందర్భంలో ఒక కొత్త సైటు గురించి తెలిసింది. వీలుంటే మీరుకూడా
ఒకసారి చూడండి…దాంట్లో నాకు జలగాం లో జరిగిన ఒక అనుభవం గురించి వ్రాశాను ఇక్కడ.
.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టైం పాస్

    ఓ ట్రైను నిండా పసుప్పచ్చ జండాలు ఎగరేసుకుంటూ, మన వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు.అక్కడ సోనియా గాంధీని కలుసుకుని,తెలంగాణా విషయం తొందరగా పరిష్కరించమని చెప్పటానికిట.నిన్న కే.సి.ఆర్ చెప్పనే చెప్పారు ఇదంతా ఓ డ్రామా, స్టంటూ అని.ఈవేళ టి.వీ. లో చూస్తూంటే, ఏడవాలో నవ్వాలో తెలియలేదు. మనవాళ్ళందరూ పెద్ద పెద్ద నినాదాలు చేసికుంటూ, సోనియమ్మ ఇంటివైపు వెళ్ళడం, అక్కడేమో పోలీసులు వీళ్ళని అరెస్టు చేయడం. వీళ్ళరిచే అరుపులు ఆ హిందీ వాళ్ళకేమైనా అర్ధం అవుతాయా ఏమైనా? ఏదో, మేమూ తెలంగాణాకోసం చేయవలసిన ప్రయత్నం చేస్తున్నామూ అని చూపించుకోడం కాకపోతే ఏమిటీ? అప్పుడేమో బాబ్లీ డాం అని మహరాష్ట్రలో తెలుగువారి ఆత్మగౌరవం మంట కలిసిందో అని గోల పెట్టారు, ఇప్పుడేమో ఢిల్లీ !

   ప్రతీవాడూ తెలుగువారి ఆత్మగౌరవం గురించి మాట్లాడేవాడే! తెలుగులలితకళాతోరణానికి, వాడెవడో డబ్బులిచ్చాడుట, దాంతో రాజీవ్ గాంధీ పేరు తగిలించారుట. ఏమయ్యిందిట? రేపెప్పుడో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే, ఆ వచ్చేవాళ్ళెవరో, ప్రతీదాని పేరూ ఎలాగూ మారుస్తారు, కొంచం ఓపిక పట్టొచ్చుగా.ఆగస్టులో తెలుగు భాషా దినోత్సవానికి ఓ రెండు గంటలపాటు రావడానికి వీలు కుదరని ప్రతీ వాడూ, తెలుగుభాష గురించీ, ఆత్మగౌరవం గురించీ మాట్లాడేవాడే! పైగా నిన్న అదేదో చానెల్( ఏ.బి.ఎన్ అనుకుంటా)’ తెలుగుకళాతోరణం మైన్టైన్ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బేలేకపోతే, అయిదుకోట్లమంది తెలుగువారిని ఒక్కొక్కడినీ రెండేసి రూపాయలిమ్మన్నా, కోటానుకోట్లు వసూలైఉండేవికావా…’ అని పాపం వాపోయాడు! ఇదేమన్నా రెండురూపాయలకి కిలో బియ్యం స్కీమా ఏమిటీ?

   అప్పుడెప్పుడో రాంగోపాల్ వర్మ ‘బెజవాడ రౌడీలు’ అని తను తీసే సినిమాకి పేరు ఎనౌన్స్ చేసేటప్పటికి, బెజవాడలో ఉండే సో కాల్డ్ ‘ఆత్మగౌరవనీయులైన’ హిస్టరీ షీటర్సందరూ, ‘హాత్తెరీ, బెజవాడ రౌడీలంటాడా…’ అని చేతిలో మైకులు పుచ్చుకుని, టి.వీ.చానెళ్ళలో మన ప్రాణం తీశారు.మరి ఈవేళ మధ్యాన్నం నుండీ ‘ నాన్ స్టాప్ కవరేజ్ ఆన్ బెజవాడ గ్యాంగ్ వార్…’ అని వాడెవడో చానెల్ వాడు చేస్తున్నదేమిటిట?

   ఇంకోడెవడో (ఎన్ టివి అనుకుంటా) యోగా గురించి ఒ చర్చా కార్యక్రమం పెట్టాడు. అక్కడెక్కడో ఎవరో అమ్మాయి ‘యోగా’ పేరుతో, సొకాల్డ్ అసభ్యకరమైన ప్రదర్శన ఇస్తోందని. ఆ వంకతో, మన చానెల్ వాడు, వీళ్ళు మాట్లాడుతున్నంతసేపూ ఆ ‘అసభ్యకరమైన’ క్లిప్పింగులే చూపించుకున్నాడు.అదేమిటో పేద్ద విషయమైనట్లు,వాళ్ళెవరో ఏదో చేస్తున్నారని ఏడవడం కంటే, ఇప్పుడు వస్తూన్న తెలుగు సినిమాల్లో చూపిస్తున్నవాటి గురించి, ఒక్కడంటే ఒక్క చానెల్ వాడైనా అడుగుతాడా? ఏమైనా అంటే ‘కలాపోసన’ అంటారు.ప్రతీరోజూ చానెళ్ళలో వచ్చే రాబోయే సినిమాల ప్రొమోలు చూస్తే చాలు, అవిమాత్రం ఏమైనా తక్కువా?

   అక్కడ కర్ణాటకలో ఇంకంటాక్స్ వాళ్ళు, గాలి గాళ్ళ వెనక్కాల పడ్డారంటే మరి పడరూ? పాపం యడ్డీ కోసం, డబ్బులెక్కణ్ణించి వచ్చాయో తెలియొద్దూ? పోనీ ఈ ఐ.టీ వాళ్ళైనా సరీగా ఉంటారా, అక్కడ మాయావతి చాలా పవిత్రురాలూ( ఇంకం టాక్స్ విషయంలో) అని తేల్చేశారు! శుభం భోయా !
ఇంకా ఎన్నెన్ని వింతలూ విశేషాలూ చూడాలో రోజంతా? మళ్ళీ ఇంకో టపాలో !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ‘మర్చిపోయాను…’

    ప్రపంచంలో అత్యంత సుఖాన్నీ(ultimate ecstasy), ఆనందాన్నీ ఇచ్చే ప్రక్రియ ఈ ‘మర్చిపోవడం’ అనేది! ఇందులో కూడా రకాలున్నాయి. కొన్ని జెన్యూన్, కొన్ని సెలెక్టివ్ !సెలెక్టివ్ అంటే, మనం ఏదైనా వినకూడదనుకుంటామనుకోండి, కూల్ గా విననట్టో, వినిపించనట్టో నటించేయడం అదన్నమాట. అలాగే మనం ఏదైనా డెలిబరేట్ గా చేయకూడదనుకున్నామనుకోండి, ‘మర్చిపోయాను’ అనేయడం! ఇలా చేసేవాళ్ళున్నారే,వాళ్ళు సృష్ఠి, స్థితి లయాల లాగ నిర్వికార్, నిరాకార్, నిర్లజ్ లతో,చెప్పెస్తారు మర్చిపొయాను అని. కావలిసిస్తే ‘ఒట్టు’ ‘By God’ ‘कसं सॅ’ అని మూడు భాషల్లోనూ చెప్పేయగల సమర్ధులు!తెలుగులో’ అమ్మమీద ఒట్టు’,’God promise’అని ఇంగ్లిషులోను, ‘ मा कि कसं’ అని హిందీలోనూ చెప్తారు. అవసరం అయితే మన మీద కూడా ఒట్టు పెట్టేస్తారు వాడిదేం పోయిందీ? గొంతుక్కిందుండే యాడమ్సో, ఈవో యాపిల్ కూడా నొక్కుకుని మరీ వక్కాణిస్తారు నిఝంగా మర్చిపోయానూ అని. ఇంత హడావిడి చేసేడంటే, వాడు మర్చిపోలేదన్నమాటే!

అసలు ఈ మర్చిపోవడం అనేది quantify చేయలేము. కాదు అని నిరూపించలేము, సుప్రీం కోర్టుకెళ్ళినా ఎపిలుండదు ! చిన్న క్లాసులకెళ్ళే చిన్న పిల్లల్ని చూస్తూంటాము, నెలలో ఓ రెండుమూడు సార్లు వాటర్ బాటిలో, గొడుగో లేక ఐ.డి. కార్డో స్కూల్లో మర్చిపోయామంటారు. వాళ్ళనేం చేయగలం? నోరుమూసుకోడం, ‘ కాదమ్మా అలా మర్చిపోతూండకూడదూ, బంగారు తల్లివి కదూ’ అని బుజ్జగించి, మళ్ళీ ఆ మర్చిపొయిన సరుకు కొనిపెట్టడం.వాళ్ళ మూడ్ బాగున్నంతకాలం ఫరవాలేదు, మళ్ళీ మనల్ని ఓ ఆటాడిద్దామనుకుంటే మళ్ళీ ‘మర్చిపోవడం’ ! తూర్పు తిరిగి దండం పెట్టడం తప్పించి ఏమీ చేయలేము! మన నుదిటివ్రాతమీద ఆధారపడి ఉంటుంది!

పరీక్షలకి కుర్రాడో కుర్రదో వెళ్ళేరనుకొండి, పరీక్ష్ పేపరు ఎంత ఈజీగా ఉన్నాసరే, సరీగ్గా వ్రాయకపోతే ‘ ఏమిట్రా, దీనికి ఆన్సర్ రాయలేదా’అన్నామనుకోండి,‘మర్చిపొయానూ’ అని చిద్విలాసంగా చెప్పేస్తాడు. పోనీ వీడి జ్ఞాపక శక్తి తక్కువైపోతూంది అనుకుని, ఈ మధ్య మార్కెట్ లొకి వస్తూన్న ‘మీ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే’ ఏ మందో మాకో తెచ్చి ఇద్దామనుకుంటామనుకోండి, అదికూడా వేసికోవడం’ మర్చిపోయే ‘ ఘనులు! నెను ఆటైపులొకే వస్తాను! చదివేవాడిని, కానీ అదేంఖర్మమో పరీక్షల్లో వ్రాయడం ‘మర్చిపోయేవాడిని’! ఆ స్థితుందే అదో అలౌకికానందం!

భార్య బజారుకెళ్ళి ఏ కూరలో, సరుకులో తెమ్మని పంపించిందనుకోండి, వాటిల్లో ఒకటో రెండో సరుకులు డెఫినెట్ గా ‘మర్చిపోతాము’. పోనీ అదంతా ఓ లిస్టు వ్రాసుకుని వెళ్ళడానికి నామోషీ!ప్రతీసారీ అలాగే అవదు. భార్య చెప్పింది కొనాలనుకున్నా, ఏదో కారణం చేత కొనకూడదనుకున్నామనుకోండి, ఈ ‘మర్చిపోవడం’ మన రెస్క్యూ కి వస్తుంది! ఇంటికి తెచ్చిన సరుకులు చూసి ‘అదేమిటండీ క్యాజూలూ కిస్మిస్స్లూ చెప్పానుగా, తీసుకురాలెదేమిటండీ’ అంటుంది. ‘అర్రే మర్చేపోయానే!’ అని ఓ మాటనేస్తే సరిపోతుంది! కాదూ కూడదూ అని దెబ్బలాడితే, మనం కూడా అఫెన్సివ్ లోకి దిగిపోయి ‘ మర్చిపొయానంటే వినవే. కావాలంటే మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాలే’అని ఢాం ఢూం అని చూడండి, మీ అదృష్టం బాగుందా, ‘పోన్లెండి మళ్ళీ ఏం వెడతారు అంత దూరం, తరువాత చూసుకుందాము’ అనొచ్చు. లేదా ‘వెళ్ళి తీసుకు రండి’ అనికూడా అనొచ్చు.అలాటప్పుడు మనది ఫ్లాప్ షో అయిపోతుంది. ఆలోచించి చేస్తూండాలి ఈ ‘మర్చిపోవడం’ . బజారుకెళ్ళి, ఇడ్లీపిండి తెప్పించికుని, బ్రేక్ ఫాస్ట్ కి వారంలో అయిదు రోజులు ఇడ్లీలే వేస్తూంటుంది. ఓ రోజుముందరే చెప్తూంటుంది, మర్నాటికి ఇడ్లీ పిండి లేదూ, వచ్చేటప్పుడు తీసుకురండీ అని. ప్రతీ రోజూ ఇడ్లీలేలా అనుకుంటూ, కన్వీనియంటుగా ఆ రోజు ఇడ్లీ పిండి తేవడం ‘మర్చిపోతాను’! కనీసం ఆరోజునేనా మెనూ మారి ఏ ఉప్మాయో ఇంకోటో చేస్తుందికదా అని!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఒత్తిళ్ళు

    నాకు మా ఫాక్టరీ వాళ్ళిచ్చిన పెన్షనర్స్ పాస్ ( ఐ.డి. కార్డ్) మొన్న వర్షంలో తడిసిపోవడంతో, ఈవేళ కొత్త పాస్ తీసికుందామని ఫాక్టరీకి వెళ్ళాను. ఎలాగూ వెళ్ళాను కదా అని, నేను చివరిగా పనిచేసిన సెక్షన్(పర్చేస్) కి వెళ్ళాను.
నా తరువాత ఇప్పటికి, గత ఐదేళ్ళలోనూ ఆరుగురు వచ్చారుట నేను పనిచేసిన సీటులోకి. అంతకుముందు నేను అదే సీటులోఆరున్నర సంవత్సరాలు పనిచేశాను, వివిధ జనరల్ మేనేజర్ల క్రిందా! అదేదో నా ఘనత అని చెప్పనూ, కాని
ఈవేళ చూసిన తరువాత మాత్రం అనిపించింది, నామీద అప్పటి వారికి ఎంత నమ్మకం ఉండేదో. ప్రస్తుతం ఉన్నతను ఈ నెలాఖరుకి వాలంటరీ రిటైర్మెంటు తీసికుంటున్నాడుట. కారణం- పని వత్తిడి !అతను ఎంత వత్తిడికి గురయ్యాడంటే ఆ మధ్యన ఆత్మహత్య చేసికోపోయాడుట! వామ్మోయ్ అదేమిటో ఎప్పుడూ నాకలాటి వత్తిడే రాలేదు. I enjoyed my job throughout my 42 years of service! No complaints.

    నేను ఉద్యోగంలో చేరినప్పుడు, నా పై అధికారి ఒకే ఒక్క మాట చెప్పారు- నీకు ఏ పని ఇచ్చినా సరే, దాంట్లోని రూల్సూ రెగ్యులేషన్సూ ముందరే తెలిసికో. ఒకసారి నీకు పని సుళువలు తెలిస్తే, ఎవ్వరూ నిన్ను ఏమీ అనలేరు అని.
Once you know the job thoroughly,you never need to be on your backfoot. అదే సూత్రం నా ఉద్యోగంలో పాటించాను! భగవంతుడి దయతో అన్నీ బాగానే జరిగాయి. ఆయనే ఇంకోటికూడా చెప్పారు- Nobody dies of overwork in Government! అని! అది నిజమే అనిపించింది. వాళ్ళిచ్చే జీతం ఊరికే ఇస్తారుటండీ? మనం ఏ పనివాడినైనా కూలికి పెట్టుకుంటే,అతనిచేత ముక్కుపిండి పని చేయించుకుంటాము. మరి అలాటప్పుడు మనం మాత్రం మనం చేసే ఉద్యోగానికి న్యాయం చేయకపోతే ఎలాగ?

    ప్రెవేటు రంగంలో ఎలా ఉంటుందో మాత్రం నాకు తెలియదు. ఈ రోజుల్లో ఎవరిని చూసినా, work pressure అని ఓ గోల పెట్టేస్తూంటారు. మరి వాళ్ళిచ్చే వేలల్లోనూ లక్షల్లోనూ జీతాలు పుచ్చుకునేటప్పుడు, అది మాకు చాలా ఎక్కువా అని ఒక్కడేనా అంటాడా? ఎవరిదగ్గరైనా సరే ‘మంత్రసాని పనికి’ ఒప్పుకున్న తరువాత దేనికైనా సిధ్ధ పడాల్సిందే!మీ పైవాడు మీమీద అజ్మాయిషీ చేస్తాడు,కారణం-వాడిపైవాడు వాణ్ణి పీకుతూంటాడు.ఈ రోజుల్లో ఎక్కడ చూసినా టార్గెట్టులూ, డెడ్ లైన్లూనూ! ఓ సరదాలేదు, ఓ ఆటలెదు, ఓ పాటలేదు స్కూళ్ళలో వెళ్ళే విద్యార్ధుల దగ్గరనుంచీ ప్రతీవాడికీ ఏదో రకమైన ఒత్తిడే. టీచర్లిచ్చిన ప్రాజెక్టులు చేయాలని పిల్లలకి ఒత్తిడి.పిల్లలు స్కూలునుండి వచ్చేసరికి, అమ్మా నాన్నా ఆఫీసులనుండి రారూ. ఏ రాత్రో వచ్చిన తరువాత చల్లగా చెప్తుంది కూతురో కొడుకో. మమ్మీ ఓ ప్రాజెక్టిచ్చారూ, రేపు తీసుకురమ్మన్నారూ అని. పాపం ఆ తల్లి ఇంట్లో వంట సంగతే చూసుకుంటుందా, పిల్లల ప్రాజెక్టే చూస్తుందా?
ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయవలసి రావడంతో,పిల్లలు కొద్దిగా పై క్లాసుల్లొకి వచ్చేసరికి,పిల్లలసంబంధిత చదువులగురించి కూడా, వాటాలు వేసేసికుంటున్నారు.లాంగ్వేజీ, సైన్సూ భార్యా, మిగిలినవి భర్తా అంటూ.దాంతో ఈ ప్రాజెక్టుల గోల భార్యకే పడుతుంది! ఒక్కోప్పుడు ఈ ఒత్తిళ్ళని చూస్తూంటే జాలేస్తోంది.

    గతవారంలో మా మనవడి పాస్పోర్ట్ వ్యవహారంలో, వెళ్ళానని చెప్పానుగా, అప్పుడు క్యూలో ఉన్న ఒక అబ్బాయి, పాపం భయపడుతూ అన్నాడు- నేను పూర్తిచేసిన ఫారం తీసికుంటాడో లేక రిజెక్టు చేస్తాడో- అని. అప్పుడు అతనికి చెప్పాను
వాడి మూడ్ బాగుంటే యాక్సెప్ట్ చేస్తాడూ,నీ అదృష్టం బాగోక వాడు ఇంట్లో దెబ్బలాడి వస్తే ఆ విసుపూ కొపం నీమీద చూపించి, ఏవో సిల్లీ కారణాలు చెప్పి రిజెక్టు చేస్తాడు అని. గవర్నమెంటులో ప్రతీ దానికీ ఓ డిస్క్రిషన్ అనేది ఉంటుంది. ప్రతీ రూలుకీ ఏదో ఒక ఎక్సెప్షన్ ఉంటుంది.కానీ ఎవడూ దాన్ని అత్యవసర పరిస్థితిలో తప్ప ఉపయోగించరు.ప్రతీ విషయంలోనూ ఉపయోగించేస్తే ఇంక ఆ రూల్స్ ఎందుకూ? ముందర దబాయించేస్తారు, మనం కొద్దిగా ఓపిక వహించి,మీ పై అధికారి దగ్గరకు వెళ్తానూ అనండి, దారిలోకి వస్తాడు. వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఈ గొడవలన్నీ పడ లేక, ఎలాగోలాగ పని పూర్తయితే చాలూ అనుకొని, వాడికి తృణమో పణమో ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇదీ బాగుందే అనుకుని వాడుకూడా ఈ చిరుతిళ్ళకి అలవాటు పడిపోతాడు. అలాగని ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ అలాగే ఉండదు. ప్రతీ చోటా కలుపుమొక్కలుంటాయి. వీరి ధర్మమా అని మొత్తం డిపార్ట్మెంటుకి చెడ్డ పేరొస్తుంది.

    ఆ మధ్యన, పే కమిషను వచ్చిన తరువాత, ప్రభుత్వోద్యోగులకి జీతాలు రెండు మూడింతలు పెరిగాయి. మా ఫ్రెండొకరు, ‘చూశారా, మనం అంతంత తక్కువ జీతాల్తో రిటైరయ్యామూ, ఇప్పుడు మన గ్రేడ్ వాడికి మూడింతలు పెరిగిందీ’అని.అప్పుడు నేనన్నానూ,’ మాస్టారూ, వాళ్ళు పనిచేసో, చెయ్యకో ప్రొద్దుటనుండి ఎనిమిది గంటలు కూర్చుంటున్నారూ, పైగా వాడి పైవాడికి సమాధానం చెప్పుకోవాలీ, మన సంగతి ఏమిటీ, ఏ పనీ చేయకుండానే ఎంతో కొంత ఇస్తున్నారుకదా, అదికూడా ఇదివరకటికంటే ఎక్కువే. దేనికైనా సంతృప్తనేది ఉండాలీ, అంతేకానీ అవతలివాడిని చూసి ఏడవకూడదూ’అని. నేను రైటేనంటారా? ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   నేను వీలున్నంతవరకూ మా ఇంటి దగ్గరలోని అయ్యప్ప,అమ్మవారి దేవాలయాలకి వెళ్తూంటాను.కానీ అదేమిటో ఈ దసరాల్లో అమ్మవారి గుడికి వెళ్ళడం పడలేదు మొదట్లో. అందుకోసమని ప్రత్యేకంగా నవమి రోజున వీలుచేసికుని అమ్మవారి గుడి( బెంగాలీ వారి ఆద్వర్యంలో) గుడికి వెళ్ళేటప్పటికి, మా బెంగాలీ ఫ్రెండొకరు Arre bobaa toom hamraa momdir me gayaa ! అన్నాడు. నాయనా నువ్వంటే ఏదో పండగరోజుల్లో వస్తావు కానీ, నేను ప్రతీ రోజూ వస్తానూ అంటే నమ్మడే! ఇంతట్లో ఆ గుడి పూజారీ,వాచ్ మన్నూ వచ్చి నొమస్కార్ సాబ్ అంటూ పలకరించేటప్పటికి, ‘ఇప్పుడైనా నమ్ముతావా’అన్నాను. పూజా రోజుల్లో పండాల్ కి వెళ్ళడం నేను వీలైనంతవరకూ అవాయిడ్ చేస్తాను. కారణం మరేమీ లేదు,బయటి వాళ్ళెవరొచ్చినా సరే, బెంగాలీ మిత్రులు మాత్రం ఒకళ్ళతో ఒకళ్ళు వారి మాతృభాషలోనే,మాట్లాడుకుంటారు. అది తప్పనడం లేదు, పోనీ ఇంకో భాషవాడు వచ్చాడూ, వాడి సౌకర్యంకోసమైనా కామన్ భాషలో మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని!Somehow I feel leftout.అందుకోసం నా దారిన నేను ప్రొద్దుటిపూటే వెళ్ళి దర్శనం చేసికుంటూంటాను! భక్తుంటే చాల్దా ఏమిటీ, ఎప్పుడు వెళ్తేనే?

   అక్కడినుండి అయ్యప్ప గుడికి వచ్చాను. అక్కడా ఇదే అనుభవం! Oh! yo came tow over demple! అదేమీ వాళ్ళని గేలి చేస్తూ అనడం లేదు, ఇంకోలా అనుకోకండి. ఎవరి ప్రొనన్సిఏషన్ వాళ్ళది! అక్కడికి మనమేమీ పేద్ద పండితుల మనడం లేదు. ఏదో సందర్భం వచ్చిందికదా అని వ్రాశాను!వాళ్ళకీ అదే సమాధానం చెప్పి, అక్కడుండే పూజార్ల ధర్మమా అని, నేను ప్రతీ రోజూ వస్తానూ అని నిరూపించుకున్నాను.మాకు దగ్గరలో ఎక్కడా తెలుగువారిచే నిర్వహింపబడే దేవాలయాలు లేవు. ఉన్న నాలుగైదూ మాకు దూరంగా ఉన్నాయి. అందువలన దగ్గరలో ఉండే దేముళ్ళతోనే సరిపెట్టేసికుంటున్నాను!ఆ దేముళ్ళు కూడా ఏమీ అనుకుంటున్నట్లులెదు! వెళ్ళిపోతూంది రోజు.

   మనవాళ్ళేమైనా తక్కువ తిన్నారేమిటీ, ఏదైనా పండక్కో, పూజకో వెళ్తే తెలుస్తుంది, మనవాళ్ళలో ఓ సుగుణం ఉంది, మాట్లాడే నాలుగు ముక్కల్లోనూ మూడున్నర ఆంగ్ల మాటలే ఉంటాయి!దాంతో తెలుస్తుంది, అమ్మయ్య మన తెలుగువారి కార్యక్రమానికే వచ్చామూ అని!మనం ఎక్కడా నిరాశ పడఖ్ఖర్లేదు.ఇతర భాషలవాళ్ళకి అర్ధం అవదేమో అనుకుని మరీ బాధ పడిపోతూంటారు! అలాగని నేను ఏదో ఆంగ్ల పదాలు లేకుండా, వ్రాస్తున్నానని కాదు, అదేమిటో ఏదో వ్రాద్దామనుకుంటానూ, దానికి తెలుగు పదం ఛస్తే గుర్తుకు రాదు! అందుకే మా అబ్బాయి గ్రంధాలయం లో పెట్టిన పుస్తకాలు, అందులోనూ పాత తరం వారివి- ఉదాహరణకి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కందుకూరి వీరేశలింగం గారూ వ్రాసిన పుస్తకాలు చదవడం మొదలెట్టాను.ఆ మధ్యన శ్రీ విశ్వనాధ వారి ‘వేయి పడగలు’ పూర్తి చేశాను.నా మట్టి బుర్రలోకి కొంతైనా గుంజు నింపుదామనే ప్రయత్నం లో! ఏ మాటైనా అర్ధం కాపోతే, మా మాస్టారుని( అదేనండీ మా ఇంటావిడ) అడిగేస్తూంటాను. ప్రతీ రోజూ, శంకరయ్య గారి ప్రహేళికలూ, గళ్ళనుడికట్టూ పూరిస్తూంటుందిగా! ఏమిటేమిటో చదువేస్తూంటుంది.

    క్రిందటి వారంలో మా ఇంట్లోనే ఉన్నాము. ఇదివరకైతే డెస్క్ టాప్ మా గదిలోనే ఉండేది కాబట్టి, రాత్రి పన్నెండింటిదాకా ఏదో కెలుకుతూ ఉండేవాడిని. ఆ డెస్క్ టాప్ కాస్తా వాళ్ళు కొత్తగా పెట్టిన ఆఫీసులోకి మార్చేశారు. రాత్రిళ్ళు వెళ్దామంటే
ఆ కాంపౌండు నిండా కుక్కల్ని వదిలెస్తూంటారు. నాకేమో కుక్కలంటే భయమాయిరి
!ఇంక ఎలాగా? మా అబ్బాయి, తన లాప్ టాప్ ఉపయొగించుకోమన్నాడు. తను అనడం అంటే అన్నాడు కానీ, నాకు ఉపయోగించుకోడం రావాలిగా! నాకెమో మౌస్ ఉంటేనే కానీ బండి కదల్దు.అదేమిటో మెయిల్ చెక్ చేసికోడానికే అరగంట పట్టింది.ఎక్కడో నొక్కితే ఏదో తెరుచుకుంటుంది. ఇంక టపాలు వ్రాయడం ఎక్కడ? పైగా నాకొచ్చిన పధ్ధతిలో ఒంటి వేలుతోనే టైపు చేస్తాను. మా వాళ్ళందరికీ నవ్వూ!నా ఇష్టంవచ్చినట్లు చేస్తాను, మీకేం అంటూ దెబ్బలాడేస్తూంటానులెండి.ఇంక ఈయన్ని బాగుచేయడం మన తరంకాదూ అని వదిలేశారు.ఓ గంటసేపు దానితో కుస్తీ పట్టి వదిలేశాను.ఇదౌతున్నంతసేపూ మా ఇంటావిడ, గుమ్ముగా కూర్చుంది. నాకు విసుగెత్తి ఆ లాప్ టాప్ ని వదిలేసి, నా పుస్తకమేదో పుచ్చుకుని కూర్చున్నాను. ఈవిడ నేను అలా వెళ్ళడం చూసి,’యంత్రం.కాం’ ఓపెన్ చేసేసి,గళ్ళనుడికట్టో ఇంకోటేదో టైపు చేసేసి పంపించేసిందికూడానూ!
వామ్మోయ్ మనం కష్టాల్లో పడ్డాం రా బాబూ అనుకున్నంతసేపు పట్టలేదు,’ ఏమండీ వీలున్నప్పుడు ఓ లాప్ టాప్ కొందామండీ, అప్పుడు ఎంచక్కా మనిద్దరం కూడా టపాలు వ్రాసుకోవచ్చూ’ అని అననే అనేసింది!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    రోడ్డుమీద ఓ బండిలో, ఓ పాలిథిన్ బ్యాగ్గులో పెట్టి ఎన్నో పువ్వులమొక్కలు పెట్టుకుని అమ్ముతూ వెళ్తూంటారు, ప్రతీ రోజూ చూస్తూంటాము. చూడ్డానికి చాలా బాగుంటాయి.ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎపార్టుమెంట్లవడం తో, ఇదివరకటి రోజుల్లోలాగ, గార్డెన్లూ అవీ ఉండడం లేదు.అందుకోసమని, ఇదిగో ఇలా రోడ్లమీదొచ్చేవాళ్ళ దగ్గరే కొనుక్కోవాల్సివస్తోంది. ఏదో ఒక మొక్క సెలెక్ట్ చేసికుని,బేరం ఆడి,కొనుక్కుంటాము. ఇంట్లో అప్పటికే కుండీలు ఉన్నాయా సరే, లేకపోతే ఎక్కడికో వెళ్ళి వాటిని కొనుక్కోవడంతో ప్రారంభం అవుతుంది, మన ప్రాజెక్టు! ఆ తరువాత వాటిలోకి కావలిసిన మట్టి. ఈ రోజుల్లో మట్టెక్కడ కనిపిస్తుందీ? ఎక్కడ చూసినా కాంక్రీటే కదా! మళ్ళీ ఆ మొక్కలమ్మినవాడినే కాళ్ళట్టుకుని, ఓ సిమెంటు బస్తాడు మట్టిని కూడా తెమ్మంటాము. వాడు ఊరికే ఏమీ ఇవ్వడు, దానికీ ఓ రేటు. ఏదో మొత్తానికి తిప్పలు పడి ఆ కొనుక్కున్న మొక్కని కుండీలో వేస్తాము.ఇంట్లో వాళ్ళందరికీ ఆర్డరు పడుతుంది-ప్రతీ రోజూ దాంట్లో, మర్చిపోకుండా నీళ్ళు పోయాలని. మనం కొన్నప్పుడే ఉన్న మొగ్గలు ఓ రెండుమూడు రోజుల్లో, ఎలాగైతేనేం ముక్కుతూ మూలుగుతూ పువ్వులు పూస్తాయి.ఆ తరువాతనుండి మొదలౌతాయి మన పాట్లు.ప్రతీ రోజూ నీళ్ళు పోసినా సరే, మళ్ళీ మొగ్గేయదు, పైగా ఆకులకి ఏదో పురుగు కూడా పడుతుంది.పురుగు పట్టినంత చోటా, కత్తిరించేయడం, చివరకి అలా కత్తిరించుకుంటూ పోయాక మిగిలేది, మనమూ,ఆ మట్టీ, కుండీనూ! ఏమిట్రా ఇలా అయిందని, ఆ అమ్మినవాడిని అడిగితే, ఏదో వచ్చిందీ,దానికి మందుంటుందీ, కావలిసిస్తే ఇస్తానూ అంటాడు. ఏమిటో మా ఇంట్లో, మా ఇంటావిడ ఎన్నెన్నో కొంది. ఒక్కటీ ఓ పదిహేను రోజులు మించి బ్రతకలేదు.మేము రాజమండ్రీ వెళ్ళే ముందర, టెర్రేస్ మీద ఓ పది పదిహేను దాకా మొక్కలు వేసింది,అవన్నీ మేము వెళ్ళగానే ఎండిపోయాయి, నీళ్ళు పొయకపోతే అవిమాత్రం ఏంచేస్తాయి?

చిత్రం ఏమిటంటే, మేము తిరిగివచ్చేటప్పటికి, మా అబ్బాయీ మనవరాలూ మొక్కలు పెంచడం మొదలెట్టారు. అంటే ఏం లేదులెండి, కొత్తిమిర లాటిది. ప్రతీ రోజూ టెర్రెస్ మీదకు వెళ్ళడం, ఆహా ఓ రెబ్బొచ్చిందీ, ఓహో ఇంకో ఆకొచ్చిందీ అంటూ మురిసిపోవడం. ఈ మాత్రం శ్రధ్ధ వాళ్ళ అమ్మ వేసిన మొక్కలమీదుంటే, ఈపాటికి ఓ పేద్ద గార్డెన్ తయారైఉండేది! మేము వరంగాం లో ఉండేటప్పుడు మాత్రం ఓ పేద్ద గార్డెన్ ఉండేది.ఆ గార్డెన్ ముచ్చటా తీరిందిలెండి. ఇప్పుడు లేకపోవడంతో దానిమీదకు మనసు పోయింది.

నాకో విషయం చిత్రంగా అనిపిస్తుంది- మనం కిరాణా షాపులో రవ్వా, మైదా, శనగపిండీ కొనుక్కుంటామా, కొన్నప్పుడు బాగానే ఉంటుంది, కొన్ని రోజులకి పురుగుపట్టేస్తుందెందుకో? అప్పటికీ, అవేవో ఎయిర్ టైట్ సీసాల్లోనో, డబ్బాల్లోనే పెడుతూంటాము. ఆ కొట్టువాడెమో ఎలా పెట్టినా, ఓ పురుగూ పట్టదూ పుట్రా పట్టదూ అదేమిటో? మా ఇంటావిడ ఫ్రిజ్ లో పెట్టడం మొదలెట్టినప్పటినుంచీ పరవా లేదు. చివరకి తేలిందేమిటంటే, ఫ్రిజ్ లో పళ్ళూ కూరగాయలకంటె, ఈ డబ్బాల సంఖ్య పెరిగిపోయింది!

చిన్న పట్టణాల్లో చూస్తూంటాము, రోడ్ సైడున కొట్లు పెట్టుకుని, పెన్నులూ, పిల్లల ఆటవస్తువులూ అమ్ముతూంటారు. ఆ కొట్టువాడు ఓ పెన్ను చేతిలో పెట్టుకుని అటు తిప్పీ ఇటుతిప్పీ గట్టిగా నొక్కేసీ వ్రాసేసి, ‘చూడండి మా పెన్ను ఎంత స్ట్రాంగో, స్టర్డీయో’ అంటాడు. తీరా మనం ఇంటికి వెళ్ళి అలా చేస్తే, అదికాస్తా పుటుక్కున విరిగూరుకుంటుంది! అలాగే వాళ్ళమ్మిన ఏరో ప్లేన్లూ, హెలికాప్టర్లూనూ, అక్కడ బాగానే ఎగురుతాయి. ఇంటికి వెళ్ళి పిల్లలచేతిలో పెట్టి ఎగరేద్దామని చూస్తే
అది చచ్చినా కదల్దు! తీర్థాల్లోనూ, ఇప్పుడొచ్చే జాత్రాల్లోనూ అమ్మే వస్తువులన్నీ చాలా భాగం అలాటివే. డిజిటల్ వాచీల హవా ఉంది కొన్నాళ్ళు, ఏ ఫుట్ పాత్ మీద చూసినా, పదిహేను రూపాయలకీ, పాతిక రూపాయలకీ వాచీలొచ్చేసేవి.
ఇప్పుడు ప్రతీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్టూ, సగానికంటె తక్కువ రేట్లలో దొరికేస్తుంది. వాళ్ళెలా అమ్ముతారో, జనం ఎలా కొనుక్కుంటున్నారో ఆ బ్రహ్మ కే తెలియాలి.

మధ్యతరగతి వాళ్ళేమో, బ్రాండూ, దిబ్బా అంటూ వేలకివేలు పోసి కొంటారు.అలాగని అవేమీ ఉధ్ధరించేయడం లేదు.మొన్నెపుడో నా సెల్ ( మామూలు బేసిక్ దే,హైఫై కాదు)అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. దాంట్లో ఉన్న ముఖ్యమైన నెంబర్లు గాయబ్ అయిపోయాయి. కొని రెండేళ్లు కాలేదు. ఎల్.జీ. వాడి కొట్టుకి వెళ్తే, అక్కడ ఓ యాభై మందిదాకా చూశాను. అంటే హైఫై సెట్లు కూడా అలాగే తగలడ్డాయన్నమాట! తేలిందేమిటంటే, మన రాత బాగుంటే, ఫుట్ పాత్ మీద కొన్నదైనా మన్నుతుంది,బ్రాండెడ్డే కానఖ్ఖర్లేదు అని!వచ్చిన గొడవేమిటంటే ఫుట్ పాత్ మీద కొనడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ! ఎవరైనా చూస్తే…. అలాగే ఫైవ్ స్టార్ హొటల్లో కంటే, టప్రీ ల్లో ఇచ్చే చాయ్ చాలా రుచిగా ఉంటుంది.
పేద్ద పేద్ద హొటళ్ళలో చెఫ్ఫో స్టువార్డో వచ్చి ఓ పుస్తకంలో మనం ఇచ్చే ఆర్డరు వ్రాసుకుని, ఓ గంటపోయిన తరువాత తీసుకొచ్చినా నొరుమూసుక్కూర్చుంటాము.అయిదు రూపాయల కాఫీకి పాతిక రూపాయలు వసూలు చేసినా పరవాలేదు!ఏమైనా అంటే స్టేటస్సూ, డిగ్నిటీ వగైరా వగైరా…. ఏమిటో వెళ్ళిపోతూంది జీవితం….