బాతాఖానీ-తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు-టెలిఫోన్లు

    మా చిన్నప్పుడు టెలిఫోన్లు అనేవి ఎప్పుడూ చూడలేదు.ఆరోజుల్లో ఎక్కడికైనా సమాచారం పంపాలంటే టెలిగ్రాములే గతి. ఓ గులాబీ రంగు కాగితం మీద వ్రాసేవారు.మన సందేశం లో ఉన్న పదాల్ని బట్టి ఛార్జీలుండేవి. క్రమంగా వాటిని ట్చైపు చేసి గులాబిరంగు కాగితం మీద అంటించేవారు. సాధారణంగా పురిటి ఖబురో, లేక ఎవరైనా స్వర్గస్థులైనప్పుడో ఈ టెలిగ్రాములు పంపేవారు. అందువలన పల్లెటూళ్ళలో ఎప్పుడైనా ఈ టెలిగ్రాములొచ్చేయంటే అందరికీ హడావిడిగా ఉండేది. పైగా ఊరంతా చెప్పుకొనేవారు –ఫలానా వాళ్ళింటికి టెలిగ్రాం వచ్చిందిటా అని !!
అంటే మన సుఖదుఖాలలో అందరూ పాలుపంచుకొనేవారు !!
ఎప్పుడైనా దూర ప్రదేశాలకి మాట్లాడాలంటే పోస్టాఫీసు కి వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేయవలసివచ్చేది. బుక్ చేసి అక్కడే వేచిఉండడం.ఒక్కొక్కప్పుడు గంటల పైన కూడా వేచిఉండవలసివచ్చేది.
మేము వరంగాం లో ఉన్నప్పుడు ఎస్.టి.డి మొదట్లో మాఫాక్టరీ జి.ఎం కి మాత్రమే ఉండేది. బయట ఓ హొటల్ లోనూ, ఇంకో రెండు కిరాణాకొట్లలోనూ ఉండేది. ఎప్పుడైనా మనకి ఫోన్లు వస్తే, ఆ ప్రోగ్రాం అంతా ముందుగానే మనం ఫిక్స్ చేసికొనిఉండాలి. ఆ టైముకి మనం ఆఆ కొట్టుకో, హొటల్ కో వెళ్ళి అక్కడ పడిగాపులు పడడం.పైగా ఆఫోన్లూ అవి కాబిన్ లో ఉండేవికాదు. మనం మాట్లాడేదంతా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేది.మా అమ్మాయి పెళ్ళి టైములో నాకు బాగా గుర్తు-మా కాబోయే వియ్యంకుడిగారితో ఇంగ్లీష్/హిందీ లో మాట్లాడవలసివచ్చేది.మేము మాట్లాడినదంతా , మేము ఇంటికి చేరేలోపలే కాలనీ అంతా టాంటాం అయేది !! ఇదో పెద్ద న్యూసెన్స్ ఆ రోజుల్లో.

    ఇంకో సంగతేమంటే ఆరోజుల్లో డబ్బున్నవాళ్ళే ఇంట్లో ఫోన్లు పెట్టుకుంటారనుకొనేవాడిని. మా పెద్దన్నయ్య గారి ఫ్రెండ్ శ్రీ రంగయ్యనాయుడు గారు కేంద్రంలో కమ్యూనికేషన్స్ మంత్రి అయినప్పుడు, మా అన్నయ్యగారికి రాజమండ్రీ లో ప్రయారిటీ కనెక్షన్ వచ్చింది. నాక్కూడా కావాలేమో అని అడిగారు.నాకు అంత తాహతు లెదేమోనని అఖర్లేదన్నాను. ఆ తరువాత కొద్ది రోజులకి మాకు వరంగాం లో కాలనీలో టెలిఫోన్లు వచ్చాయి. ముందుగా పెట్టుకున్నవాళ్ళలో నేనుకూడా ఒకడిని.బాగా ఎంజాయ్ చేశాము.

    ఆ తరువాత 1998 లో పూణే వచ్చేసిన తరువాత అప్పటికి టెలిఫోన్లు బాగా సుళువుగానే ఇచ్చేవారు.మొట్టమొదట “సెల్” ఫోన్లు వచ్చినప్పుడు వాటి ఖరీదూ, కాల్ ఛార్జెస్సూ చాలా ఎక్కువగా ఉండేవి. అయినా బి.పి.ఎల్ వారి కనెక్షన్ తీసికొని మా అబ్బాయి సెకండ్ ఇయర్ లో ఉండగా వాడికిచ్చాము.తను కాలేజీ కి బైక్ మీద వెళ్ళేవాడు, వాడి బాగోగులు తెలిసికోవడానికి
మా ఇంటావిడ నాచేత కొనిపించింది! వాళ్ళ ఫ్రెండొకరు మాతో అన్నారూ ” మీరు హరీష్ ని స్పాఇల్ట్ బ్రాట్ చేస్తున్నారూ ” అని. మేము నవ్వేసి ఊరుకొన్నాము.ఇంజనీరింగు లో ఉన్న అబ్బాయికి సెల్ ఫోన్ ఇవ్వడమే ఒక వింతగా చూసిన రోజులు గుర్తుచేసికొంటే, ఈ రోజుల్లో స్కూలుకెళ్ళే చిన్న చిన్న పిల్లలు కూడా చేతిలో సెల్ ఫోన్లు, వేళ్ళాడతీసికోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

    మొదట్లో ఈ సెల్ల్ ఫోన్లు తీసికోవాలనే ఆసక్తి ఉండేదికాదు. కొంచెం ఖరీదు కూడా ఎక్కువే ఉండేవి. కూరల కొట్టువాడి దగ్గరనుండి ప్రతీవాడి దగ్గరా సెల్ ఫోన్లు చూసేటప్పటికి నాకూ ఒకటి కొనాలని మనసెసింది.ముందుగా మా ఇంటావిడ ఒక రిలయన్స్ కనెక్షన్ తీసికొని నాకు ప్రెజెంట్ చేసింది. అదో గొప్ప విషయం లా ఉండేది.ఆ ఫోన్ చాలాకాలం నాదగ్గర ఉండలేదు.మా అబ్బాయి ఎం.బి.ఏ చేయడానికి గుర్గాం వెళ్ళినప్పుడు వాడికిచ్చేసింది. నా సెల్ ఫోన్ మూణ్ణాళ్ళ ముచ్చటైపోయింది.తరువాత ఇంటినిండా లాండ్ లైన్లు రెండు, సెల్ ఫోన్లు ఓ అరడజనూ
తయారయ్యాయి. మాఫ్రెండనేవారు “మీ ఇల్లొక ఎస్.టి.డి బూత్ లాగ ఉంది” అని!

    ఈ మధ్యన చూస్తూంటే ఏమిటేమిటో సువిధాలు–హాండ్స్ ఫ్రీ–దానిని ఉపయోగించేవారిని చూస్తే ఒకొక్కప్పుడు నవ్వొస్తుంది.మొదటి సారి చూసినప్పుడు టక టకా అని గట్టిగా మాట్లాడేస్తున్నాడు, నవ్వడం, అరవడం అదిచూసి ” పాపం మతిస్థిమితం తప్పిందేమో “ అనుకొన్నాను.ఆ సందర్భం లోనే ఒకసారి నా ఎదురుగా వస్తున్నవాదు ” హల్లో ” అన్నాడు, నన్నేమో అనుకొని నేను కూడా “హల్లో” అన్నాను. మాఇంటావిడ చివాట్లేసింది–“మిమ్మల్ని కాదు, అతనెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడూ ” అని.ఒక్కొక్కప్పుడు, మనకి ఎదురుగా ఉండేవాడు చేయెత్తి ఏదో అంటాడు, మననేమో అనుకొని మనం కూడా చేయెత్తుతాము, అప్పుడు తెలుస్తుంది, ఆ పెద్దమనిషి మనని అస్సలు చూడలేదని. అప్పుడేం చేస్తామూ–ఆ ఎత్తిన చెయ్యిని జుట్టుసర్దుకోడానికో, లేక ఇంకేదో చేయడానికో మార్చేస్తాము !!ఓ వెర్రి నవ్వు నవ్వెసి, మన వాళ్ళదగ్గర మన పరువు నిలపెట్టుకోవడానికి.ఇలా చాలా మందికి అవుతుంది, చెప్పుకోవడానికి సిగ్గు పడతారు.

    ఈ రోజుల్లో అయితే ఐ ఫోన్లూ, బ్లాక్ బెర్రీలూ –ఎన్నిరకాలో.వాటికి కెమేరాలూ, వాటితో ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టెంట్ ఫొటోలూ, వీడియోలూ ఒకటెమిటి రిలయన్స్ వాళ్ళ ప్రకటన లాగ
దునియా ముఠ్ఠీ మే !!

బాతాఖానీ ఖబుర్లు–41

    ఏమిటో మా పిల్లల్ని గురించి, మాగురించి వ్రాయడం మానేసి, ఇన్నాళ్ళూ పిట్టకథల్లోకి వెళ్ళిపోయాను. ఏమిటో రాజమండ్రి వదలి పూణే వచ్చేటప్పడికి, అదీ ప్రతీ రోజూ పిల్లల్ని చూస్తూండడం
వలన కాబోలు, ఆ విషయాల గురించి ఎక్కువ వ్రాయలేదు.

    పూణే లో మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువు బాగానే జరుగుతోంది. చెప్పానుగా మా ఫ్రెండు వాళ్ళని లోకల్ గార్డియన్ గా ఉంచామని, వారేకాకుండా , మా అన్నయ్య గారి అబ్బాయి
నేవీ లో పనిచేస్తూ , దగ్గరలోఉన్న లొనావాలా లో ఉన్న ఐ.ఎన్.ఎస్ . శివాజీ లో ఉండేవాడు, వీకెండ్స్ లో పూణే వచ్చినప్పుడు మా అమ్మాయి క్షెమం అడిగేవాడు.ఒక విషయం మరిచిపోయాను– ఈ అబ్బాయి ఎన్.డీ.ఏ లో చదువుతూండగా నేనూ, మా అమ్మాయీ ఒకసారి తనని చూడడానికి ఖడక్వాస్లా వెళ్ళాము.మాకు మొత్తం ఎకాడెమీ అంతా చూపించాడు.
అప్పుడు అర్ధంఅయింది మన దేశ రక్షణకి, మన పిల్లలు ఎలాంటి ట్రైనింగ్ పొందుతారో.వాళ్ళ చేతిలో మన సరిహద్దులు ఎప్పుడూ సురక్షితంగానే ఉంటాయి. నాకు ఒక్క విషయం లో చాలా గర్వంగా ఉంది, మా చిన్నన్నయ్యగారు హైదరాబాద్ లో రక్షణ శాఖవారి రిసెర్చ్ లాబ్ లో పనిచేసేవారు, వాళ్ళ అబ్బాయి నేవీలో ఉండేవాడు, నాకు పళ్ళ విషయంలో సహాయం చేసిన ఓ కజిన్
ఆర్మీ లో డాక్టర్ గా ఉండేవాడు. ” చంద్రుడికో నూలుపోగు లాగ ” నేను, రక్షణ శాఖ వారి ఆయుధాల కర్మాగారాల్లో పనిచేశాను.
. దురదృష్టవశాత్తూ ,మా చిన్నన్నయ్య గారినీ, వాళ్ళ అబ్బాయినీ దేముడు తనదగ్గరకు తీసికెళ్ళిపోయాడు.

    మా డాక్టరమ్మ గారు కూడా పూణే లోనే ఉండడం వలన మాకు ధైర్యం గా ఉండేది. వీరందరూ కాకుండా, మా ఫాక్టరీలోని ఏ.జి.ఎం గారి అబ్బాయి కూడా మా అమ్మాయిగురించి శ్రధ్ధ తీసికొనేవాడు. మా అమ్మాయి మా నుండి దూరం గా ఉన్నదనే భయం కాని, బాధ గానీ ఎప్పుడూ ఉండేదికాదు. ఇదే కాకుండా నేను ప్రతీ నెలా పూణే వెళ్ళి కలుసుకొనేవాడిని.ఒక్కటే వర్రీ ఆరోజుల్లో, ఎప్పుడైనా తనకి డబ్బు పంపవలసి వచ్చినప్పుడు మాత్రం, కొంచెం శ్రమ అనిపించేది–నా ఉద్దేశ్యము ఆరోజుల్లో ఇప్పుడున్నటువంటి బాంక్ ట్రాన్స్ఫర్లూ, ఏ.టి.ఎం లూ ఉండేవికావు.
ఎస్.బి.ఐ. లో డ్రాఫ్ట్ తయారుచేసి పోస్ట్ ద్వారా, మాకు తెలిసిన వారికి పంపడం, మా అమ్మాయి అక్కడకు వెళ్ళి తీసికోవడమూ. ఇదొక్కటే చాలా తలనొప్పి గా ఉండేది.పాపం ఒక విషయం ఒప్పుకోవాలి–ఏదో కాలేజీ లో చదువుతూందన్నమాటే కానీ, ఎప్పుడూ నేను తలకి మించిన భారం అని ఎప్పుడూ అనుకొనేటట్లుగా డబ్బు అడగలేదు.ఇప్పటి చదువులూ, ఖర్చులూ చూసిన తరువాత నేను తనకి చాలా అన్యాయం చేసేననిపిస్తుంది.ఐనా కానీ అప్పుడూ, ఇప్పుడూ కూడా ఆ విషయంలో మా అమ్మాయి కంప్లైంట్ చేయలేదు. అది నేను చేసికొన్న అదృష్టం.

    అన్ని సెమిస్టర్లూ మంచి మార్కులతోనే పాస్ అయేది. తనకి సంగీతం మీద చాలా ఇష్టం అని చెప్పానుగా, ఆ రోజుల్లో పూణే లో ప్రముఖ గాయకుడు శ్రీ సురేష్ వాడ్కర్ సంగీత ట్రైనింగ్ క్లాసులు చెప్పేవారు.దానికి వెళ్దామని ఆసక్తి చూపించింది. మేము ఆ విషయంలో మాత్రం చెప్పాము ” అమ్మా, ఆ క్లాసులకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పడికి రాత్రిళ్ళు బాగా ఆలశ్యం అవుతుందేమో, పైగా మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి చదువులు ముఖ్యం,హాస్టల్లో రాత్రిళ్ళు 9.00 గంటలకల్లా గేటు మూసేస్తారూ, ఎక్కడికో వెళ్ళి నిద్ర పోవాలీ ఆలోచించు”. ఇప్పటి రోజుల్లో జరుగుతున్న టి.వీ. షోలు చూసి బహుశా మేము తీసికొన్న స్టెప్ తప్పేమో అని ఒకోసారి చాలా గిల్టీ గా ఫీల్ అవుతూంటాము.అప్పుడు ఆ ట్రైనింగ్ కి వెళ్ళుంటే, ఏమో ఈరోజున మా ఇంట్లో కూడా ఓ సునితో, ఇంకో చిత్రా ఓ ఉండేదేమో– పాపం చాలా బాగా పాడేది. మేము తల్లితండ్రులుగా తనుకోరిన ఈ కోరిక తీర్చలేకపోయాము. మే బి అవర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ కారణమేమో!

బాతాఖానీ –తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–నమ్మకాలు

    నాకు దేముడంటే చాలా నమ్మకం ఉంది. ఆ మధ్యన మా ఫ్రెండ్ ఒకాయన హైదరాబాద్ నుండి వచ్చారు. నాకు ఆయన మార్కెట్లో కనిపించి పేరు పెట్టి పిలిచారు. సరేనని నేనుకూడా ఆయనని గుర్తు పట్టాను.1983 వరకూ పూణే లో ఉండగా ఆయనతో పరిచయం ఉంది.ఇద్దరం రిటైర్ అయ్యాము. ఆయన హైదరాబాద్ లోనూ, నేను పూణే లోనూ సెటిల్ అయ్యాము.ఇంటికి తీసికొచ్చి , చాయ్ తాగి ఖబుర్లు మొదలెట్టాము. ఇలా వచ్చారు ఏమైనా పనిమీద వచ్చారా అని అడిగాను. దానికి ఆయన ” ఇక్కడ ఓ కాన్ఫరెన్స్ జరుగుతోందీ, దానికి వచ్చానూ అన్నారు. సరే ఆ వివరాలుకూడా తెలిసికోవాలిగా.అదేదో ” అంధవిశ్వాస్ విమోచన్ సమితి” ట. వారు ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాల్ని పోగొట్టి వారిలో సైంటిఫిక్ ఆలోచనలు రేకెత్తిస్తారుట.

    మా ఇంట్లో హాల్లో ఎదురుగా శ్రీవెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫొటోలు ఉంటాయి. వాటిని నేను 40 సంవత్సరాలనుండీ ఉంచాను. ఎవరైనా మా ఇంటికి వచ్చేవారు, హాల్లో సిగరెట్లుకూడా కాల్చడానికి వెనుకాడుతారు ఆ ఫొటోలు అక్కడ ఉండడం వలన. ఆయనన్నారూ,వాటిని చూపించి –“ఇదిగో ఇలాంటి మూఢ విశ్వాసాలని రూపు మాపడమే మా సంస్థయొక్క ప్రధాన ఉద్దేస్యం” అన్నారు.నాకు దేముడి మీద నమ్మకం ఉంటే మీకేమిటి నష్టం అన్నాను.అంటే ఆయనన్నారూ ” ఇదిగో ఇలా మనలాంటి చదువుకున్నవాళ్ళు ఈ మూఢనమ్మకాల్ని ఎంకరేజ్ చేయడం వలనే దేసం వెనక్కి పడిపోతూందీ,సైన్స్ ని నమ్మాలి కానీ, ఇలా కనిపించని దేముడినేమిటీ” అన్నారు.

    నాకు కనిపించని దేముడుమీద చాలా నమ్మకం ఉంది.అలాగని ఎదో పెద్ద పెద్ద పూజలూ అవీ చేయను, ఉపవాసాలుండను.ఎప్పుడైనా ఉండవలసివచ్చినా కాఫీ ఏదో తాగుతాను. మా అమ్మమ్మ గారు ఒకసారి చెప్పారు– ఉపవాసాలుంటే కాఫీ అదీ తాగకూడదని ఎక్కడా లేదూ, పైగా నీకు దానిమీదే దృష్టి ఉంటుందీ, అందుకని నీకు కావలిసినది తీసేసుకొని నీ పూజలు చేసికో. అప్పుడు పూజైనా దిక్షతో చెస్తావూ –అని చెప్పారు.అప్పటినుండీ ఏదైనా పూజ లాంటిది చేయవలసివచ్చినా నేను కాఫీ తీసికొనే చేస్తాను. ఇప్పటి దాకా నాకు ఎలాంటి సమస్యా రాలెదు. మనకి భక్తి, నమ్మకం ముఖ్యం గానీ ఇలాంటివన్నీకాదని నా నమ్మకం.

    నేను 1963 నుండీ తిరుమల కొండ కాలి నడక తోనే వెళ్తున్నాను. అదో నమ్మకం, మొక్కు ఏమీ కాదు ఓపిక ఉన్నన్నాళ్ళూ నడిచే ఎక్కుదామని అనుకున్నాను మనస్సులో. ఒకేఒకసారి
మా అమ్మాయిని బెంగుళూరు లో ఉద్యోగం లో చేర్పించి, అక్కడనుండి తిరుపతి మీదుగా వరంగాం తిరిగి వెళ్దామని రిజర్వేష్న్లూ అవీ చేసికొన్నాను.బెంగుళూరు లో బస్సెక్కి బయలుదేరాను, ఉదయమే, అలిపిరి దగ్గర దిగిపోయి కొండ మీదకు నడిచి వెళ్దామని నా ఉద్దేశ్యం.దురదృష్టవశాత్తూ, అక్కడకు వచ్చేటప్పడికి నిద్ర పట్టేసింది. కళ్ళుతెరిచేటప్పడికి బస్సు తిరుమల చేరిపోయింది. చాలా బాధ వేసింది, నడిచి ఎక్కలెకపోయానే అని.

    చేసేదేమీలేక సామాను అంటే ఓ వి.ఐ.పి సూట్కేసు, అదేదో లాకర్(ప్రైవెట్) లో పెట్టి రసీదు తీసికొన్నాను.ఆ తరువాత జుట్టుతీయించుకొని స్నానం చేసి, నా పర్సూ, అవీ ఓ జోలా బాగ్(అంటే భుజానికి వేళ్ళాడేసుకొనేది )లో పెట్టి , ఓ న్యూస్ పేపర్ తీసికొని, సావకాశంగా క్యూ కాంప్లెక్స్ (వైకుంఠం ) లో కూర్చున్నాను.సావకాశం అని ఎందుకన్నానంటే నా తిరిగివెళ్ళే టికెట్ గూడూరు నుండి ఆ మర్నాడు మధ్యాహ్నానికి. ఎక్కడా హడావిడి లేకుండా తాపీగా , కంపార్ట్మెంట్ తలుపులు తీయగానే, పేపర్ లోపల పెట్టి మెల్లిగా నడవడం మొదలుపెట్టాను. అక్కడ ఎటువంటి రష్షూ లెదు, అందరూ తాపీగానే వెళ్తున్నారు. అకస్మాత్తుగా నా వెనక్కాల క్యూ లో తొక్కిసిలాట లాంటిది ప్రారంభం అయి, నన్ను తోసుకొని ఓ నలుగురు నాముందుకు వెళ్ళిపోయారు. సరేనని వాళ్ళకి దారిచ్చి నెను పక్కకి తప్పుకొన్నాను. దృష్టి అంతా త్వరలో దర్శనం అయ్యే ఆదేవదేముడుమీదే ఉంది.సడెన్ గా చూసేసరికి, నా భుజాన్నున్న బాగ్ పక్కని కోసేసి ఉంది!! చూసుకుంటే అందులోని నా పోచ్ (అందులో డబ్బూ, నా టికెట్టూ, లాకర్ వాడిచ్చిన రసీదూ) అన్నీ ఉన్నాయి.

    ఇంకేముందీ గోవిందా అయిపోయింది నాపని. ఎవర్నడిగితే ఎవరు చెప్తారూ తీశామని, కళ్ళంబట నీళ్ళొచ్చాశాయి, చేసేదేమీ లేదు. ఆ క్యూ లోంచి బయటకు రావడానికి మార్గం లేదు. దర్శనం అయితేనే కానీ బయటకు రాలేము.చివరకు మిగిలింది నా చిరిగిన బ్యాగ్గూ, మెరిసే గుండూ!!ఎలాగోలాగ దర్శనం పూర్తి చేసికొని ఆ క్యూలోంచి వచ్చాను.దృష్టి అంతా దేముడిమీద ఎక్కడుంటుందీ, నన్ను క్షేమంగా ఇల్లు చేర్చమని ఆ భగవంతుడిని ప్రార్ధించేను.

    ముందుగా ఆ లాకర్ వాడి దగ్గరకు వెళ్ళాను , చెప్పాను నా సంగతంతా, అతనేమో రసీదు లేకుండా , తాళం చెవిలేకుండా , నా వస్తువులెలా ఇస్తాడూ. చివరకు అతనిని బతిమాలి, బామాలి, ఆ లాకర్ తాళం బద్దలుకొట్టడానికి ఒప్పించేను. నేను తిరిగి వెళ్ళి ఆ లాకర్ ఖరీదు వంద రూపాయలూ అతనికి ఎమ్.ఓ. చెసే కండిషన్ మీద. నన్ను ఎలా నమ్మేడో ఇప్పటికీ తెలియదు.ఆ సూట్కేసు తీసికొని జేబిలో నయా పైస లెకుండా ( మొత్తం డబ్బు అంతా పోయినట్లే ), అప్పుడు సడెన్ గా జ్ఞాపకం వచ్చింది, మా ఇంటావిడ నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా
బట్టల సందులో ఓ వెయ్యి రూపాయలదాకా దాస్తుంది ( ఎమర్జెన్సీ కోసం). అక్కడ ఉన్నట్లు జ్ఞాపకం వచ్చింది కానీ ఆ సూట్కేసు తాళం తీయడం ఎలా? ఆ రోజుల్లో వి.ఐ.పి వాళ్ళు పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చేవారు వాళ్ళ తాళాలు ఎంత స్ట్రాంగో.

    ముందుగా పోలీసు స్టేషన్కి వెళ్ళాను.,కంప్లైంట్ ఇద్దామని, ఆ ఇనస్పెక్టర్ ” ఈమధ్యన ఇవి మామూలైపోయాయండీ, ఏమీ చేయలేకపోతున్నామూ ” అంటూ స్వాంతన పలుకులు చెప్పి, రెండు ఉచిత అన్నదానం టికెట్లూ, క్రిందకు వెళ్ళడానికి ఓ పాతిక రూపాయలూ చేతిలో పెట్టాడు !!ఎక్కడైనా ఎవరైనా పోలీసులకి చేతిలో పెడతారు ఇక్కడ నాకు ఉల్టా , పైగా నా వి.ఐ.పి సూట్కేసు తాళం తీయించుకోవడానికి మార్గం కూడా చెప్పారు !!కింద తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయం దగ్గరలో ఉన్న పువ్వుల దుకాణం దగ్గరలోఉన్న , గొడుగులు బాగుచేసేవాడు– పైగా అతనిదగ్గరకు వెళ్ళి ఈ ఇనస్పెక్టర్ గారి పేరు చెప్పాలిట !! ఇలా ఉంటుంది పోలీసు నెట్వర్క్ !!

    ఈ కార్యక్రమాలన్నీ చేసికొని, సాయంత్రానికి గూడూరు వెళ్ళి , మళ్ళీ టికెట్ కొనుక్కొని ( నంబర్ లేకుండా డూప్లికేట్ టికెట్ ఇవ్వనన్నారు ), నా పెరునే రిజర్వ్ అయిన బెర్త్ లో నేనే మళ్ళీ టికెట్ కొనుక్కొని తిరుగు ప్రయాణం అయ్యాను. నా గొడవంతా అక్కడ ఉన్నవాళ్ళతో చెప్పాను.అందరూ విని వాళ్ళకి తోచిందేమిటో చెప్పారు. నా నమ్మకమేమిటంటే , ఎప్పుడూ నడిచి వెళ్ళేవాడిని ఆ సారి ఒళ్ళు కొవ్వెక్కి మెట్లమీద నుండి నడవకుండా వెళ్ళడం వల్లే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడని.నమ్మేవాళ్ళు నమ్ముతారు.
అందులో ఓ కుర్రాడు పై బెర్త్ మీదున్నాడు–‘ అంకుల్ ఇదంతా ట్రాష్, మీ అజాగ్రత్తవల్లే పోకొట్టుకున్నారూ, అని చెప్పి నాకు ప్రయాణాల్లో తీసికోవలసిన జాగ్రత్తల మీద ఓ లెక్చర్ కూడా ఇచ్చాడు.నేనన్నానూ ” ఎవరి నమ్మకాలు వారివీ, వాటిమీద ఆర్గ్యూ చేయకూడదూ, నీకైనా అవ వచ్చూ” అని. అదేం ఖర్మమో విజయవాడ దాటిన తరువాత చూసుకొన్నాడు ఆ అబ్బాయి తను కొత్తగా కొనుక్కున్న ” నైకీ ” బూట్లు అందరం చూస్తూండగానే మాయం అయిపోయాయి. రైళ్ళలో తుడిచే కుర్రాళ్ళు వస్తారు చూశారూ, వాడు సంచీలో దాచేసి పారిపోయాడు.ఇంక ఈ అబ్బాయి మళ్ళీ నాకు లెక్చర్ ఇవ్వలేదు.

    నేను చెప్పొచ్చేదేమిటంటే ఇంకొకళ్ళ నమ్మకాల్ని పరిహాసం చేయకండి. మిమ్మల్నేం నమ్మమని చెప్పడం లేదుకదా . వాళ్ళదారిని వాళ్ళని వెళ్ళనీయండి.
సర్వేజనా సుఖినోభవంతూ !!

బాతాఖాని-తెరవెనుక(లక్ష్మిఫణి )ఖబుర్లు–వస్త్రధారణ

    మా నాన్నగారు ఎప్పుడూ ఖద్దరు లాల్చీ, పంచె, కండువా తోనే ఉండేవారు. అంతకుముందు తరం వారు తలకి ఒక పాగా కూడా పెట్టుకొనే వారు.
వేసుకున్న వస్త్రాలని బట్టి అవతలి వారిమీద గౌరవం చూపించేవారు. మేము కాలేజీ లో చేరేవరకూ నిక్కరే గతి. అదేదో యూనిఫారం అనుకోకండి. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఆ ఇంటిపెద్ద ఓ తాను బట్ట తీసి అందరికీ దానితోనే బట్టలు కుట్టించేవారు.

ఆడవారైతే పరికిణీ, ఓణీ లతో కలకలలాడుతూ ఉండేవారు. పంజాబీ డ్రెస్స్ అయితే స్కూల్లో ఏ.సి.సి కో, ఎన్.సి.సి కో వెసికొనేవారు.కొంచెం పెద్దవారు నిండుగా 6 గజాల చీరలో నుదుట పెద్ద కుంకుం బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిలాగ ఉండేవారు. మన గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇటువంటి దృశ్యాలే కనిపించేవి.
నగరాలలో కొంచెం సల్వార్ కుర్తా వేసికొనేవారు. సినిమాలలో కూడా మన హీరోయిన్లు చూడడానికి చక్కగా ఉండేవారు. ఒక్క వాంప్ పాత్రధారిణి కి కొంచెం
వేషధారణ ఇంకోలా ఉండేది. షర్మిలా టాగోర్ అదేదో హిందీ సినిమాలో బికినీ లో కనిపించేసరికి పత్రికలవాళ్ళు గోల పెట్టేశారు. అలా ఉండేది మనవాళ్ళ వేషధారణ.

ఆడవారి వస్త్రాలు క్రమక్రమంగా చిన్నవి అయిపోయి సినిమాలలో ప్రస్తుతం ఉన్నా లేనట్లే కనిపిస్తున్నాయి! కాల మహిమ! ఏ హీరోయిన్ అయినా సరే అడిగితే, ప్రేక్షకులకి ఎలా కావాలంటే మేము అలాగే వేస్తున్నామని ఓ స్టేట్మెంటూ !! వీళ్ళని ఇలా చాలా రోజులు చూస్తే ఒకరోజుకి వెగటు పుట్టుకొస్తుంది. వీళ్ళ మొహాలె ఎవడూ చూడడు.
ఇప్పుడు ఆఫీసులకెళ్ళేవారు జీన్స్ వాటిమీద ఓ టాప్పో ఏదో వేసికున్నప్పుడు చాలా డీసెంట్ గా కనిపిస్తారు.అదొక డిగ్నిటీ కూడా వస్తుంది.ఇక్కడ మహరాష్ట్రలో పాత తరం ఆడవారు 9 గజాల చీర కట్టేవారు.

ఇక్కడ పూణే లో చాలా మంది అమ్మాయిలు స్కూటర్లమీదే ప్రయాణం చేస్తారు. కళ్ళు తప్పించి మిగిలిన మొహం అంతా కప్పేటట్లుగా ఓ స్కార్ఫ్ కట్టేస్తారు. ఓ టెర్రరిస్ట్ లా కనిపిస్తారు!!నాగపూర్ లో అనుకుంటా పోలీస్ కమిషనర్ గారు ఓ ఆర్డర్ పాస్ చేశారు. ఇలా రోడ్డు మీద మొహం పూర్తిగా కప్పేసుకుంటే వారిని అరెస్ట్ చేస్తామని, దానివలన ఏమీ ప్రయోజనం లేకపోయింది, ఆ ఆర్డర్ విత్ డ్రా చేసేశారు.మొహానికి గుడ్డ , వాతావరణ కాలుష్యం నుండి కాపాడుకోవడానికి కట్టుకుంటారు

మామూలుగా ఆఫీసులకెళ్ళేవాళ్ళు, ఏవో ఫార్మల్స్ లోనో వెళ్తూంటారు. వారంలో ఒకరోజు కాజుఅల్స్ లో వెళ్తారు.అదీబాగానే ఉంటుంది. మా ఫ్రెండ్స్ కొంతమందిని చూస్తూంటాను. అవేవో కాప్రీలూ, పువ్వుల టీ షర్టులూ వేసికొని దసరా బుల్లోడిలా తయారై వచ్చేస్తూంటారు. అంటే దానర్ధం, ఈమధ్యనే ఆయన విదేశాలకి వెళ్ళైనా ఉండాలి, లేకపోతే వాళ్ళ కొడుకో, కూతురో బయటనుంచి వచ్చైనా ఉండాలి ! నేను చెప్పేదేమిటంటే అలా డ్రెస్ వేసికోవద్దని కాదు– మార్నింగ్ వాక్ కి వెళ్ళేటప్పుడో లేక ఈవెనింగ్ వాక్ కి వెళ్ళేటప్పుడో అలాంటివి వేసికుంటే బాగుంటుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా హాఫ్ చెడ్డిలే. ఒకానొకప్పుడు మన ఎన్.టి.రామారావు గారు గుండమ్మ కథలో వేసికున్నారు అది ఇప్పుడు ఫాషన్ అయిపోయింది.ఇదివరకటి రోజుల్లో మన పోలీసులు, శానిటరీ ఇనస్పెక్టర్లూ, రెవెన్యూ ఇనస్పెక్టర్లూ వేసికొనే వారు.ఇప్పుడు వాళ్ళుకూడా పాంట్లలోకి మారిపోయారు.
,p>     ఇన్నీ రాశాను నేను వేసికొనే బట్టల గురించి కూడా వ్రాయాలిగా.రిటైర్ అయ్యేదాకా నేను టైలర్ చేత కుట్టించిన బట్టలే వేసుకొనేవాడిని. ఆ తరువాత పిల్లల ధర్మమా అని బ్రాండెడ్ బట్టలలోకి మారాను. అదృష్టం కొద్దీ రాజమండ్రీ లోకూడా దొరికేవి.ఇంక కొద్ది రోజులలో పూణే తిరిగి వచ్చేద్దామనుకుంటున్నాము. మా ఇంటావిడకి ఇప్పటినుండీ టెన్షన్ ప్రారంభం అయింది.ఇన్నాళ్ళూ రాజమండ్రీ లో, చేనేత చీరలు ( బండార్లంక, పుల్లేటికుర్రూ, వెంకటగిరీ ) కొనుక్కునేది.ఒకటి చూశాను, ఆ చీరలకి ఇక్కడ పూణే లో ఇస్త్రీలకి చాలా ఖర్చవుతుంది. అయినా తప్పదు కదా!

నాకు మా ఫ్రెండ్స్ లాగ పువ్వుల షర్టులూ అవీ వేసికొనే ప్రాప్తం లేదు.ఎందుకంటే మావాళ్ళు నలుగురూ సాఫ్ట్ వేర్ లో పనిచేస్తున్నా సరే, బయటకు వెళ్ళరు. పోనీ వాళ్ళెవరైనా బయట ఉంటే మేము కూడా ఎవరిదో పురిటికో దేనికో బయటకు వెళ్ళొచ్చుకదా అని పాస్ పోర్ట్ లు కూడా తీసికొని ఉంచుకున్నాము.అబ్బే అలాంటి ఆలోచన మా వాళ్ళకి లేదు.
చేసికున్నవాడికి చేసికొన్నంత !! .

బాతాఖానీ – తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు–ఏ.టి.ఎం కష్టాలు

    ఈ మధ్యన భారత ప్రభుత్వం వారు ఓ ప్రకటన చేశారు.ఇదివరకటిలాగ కాకుండా ఇప్పుడు ఏ బాంక్ ఏ.టి.ఎం నుండైనా డబ్బు తీసికోవచ్చనీ దానికి ఎటువంటి ఫీజూ తీసికోరనీ.
ఇదివరకైతే బోల్డంత ఫీజు తీసికొనేవారు. మా ఇంటికెదురుగా ఎచ్.డి.ఎఫ్.సి వాళ్ళ ఏ.టి.ఎం లో నా స్టేట్ బాంక్ కార్డ్ తో ఒకసారి తీసికుంటే వాళ్ళు, 50 రూపాయలు తీసికొన్నారు.ఇంతకంటే ఆటో లో వెళ్ళినా నాకు 40 రూపాయలతో అయిపోయేది. అప్పటినుండి బుధ్ధిమంతుడిలాగ ఏ కార్డైతే ఉందో అదే ఏ.టి.ఎం లలో మాత్రమే డబ్బు తీసికొనేవాడిని.

    నాకు సంతకం చేయడం లో తేడా వస్తుంది. చాలా సార్లు నా చెక్కులు బౌన్స్ అయ్యాయి. అందువలన అప్పటినుండీ చెక్కులమీద సంతకాలు పెట్టడం మానేశాను. ఏ.టి.ఎం ల ద్వారానే
నా కార్యకలాపాలు లాగించేస్తున్నాను.

    ఒకసారి హైదరాబాద్ లో ఎవరికో ఇవ్వాల్సివచ్చి పది వేలరూపాయలు డ్రా చేశాను. ఆ తరువాత ఎప్పుడో చెక్ చేసికుంటే మా బాంక్ వాళ్ళు నా అకౌంట్లో రెండుసార్లు పదివేలచొప్పున తీసేశారు. అంటే నాకొచ్చే పెన్షన్ తినేశారు !! ఇంట్లో చెప్తే మా ఇంటావిడ ఖంగారు పడుతుందని చెప్పలేదు. మా వియ్యపరాలుగారు ఎస్.బి.ఎచ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఎవరిదో చెప్పకుండా నా సమస్య చెప్పాను ఆవిడకి ( లేకపోతే వాళ్ళ వియ్యపరాలు కి చెప్పేస్తే !!). ఆవిడ చెప్పారు– అకౌంట్ ఉన్న బాంక్ కి వెళ్ళి ఈ స్లిప్పులు జోడించి కంప్లైంట్ చేస్తే, వాళ్ళు చెక్ చేసి మన డబ్బు మనకి ఇచ్చేస్తారూ అన్నారు. సరేనని ఆవిడ చెప్పిన ప్రకారం చేసిన ఒక వారానికి నా డబ్బులు ఏమైతేనే నా అకౌంటు లోకి తిరిగి వచ్చాయి. అప్పుడు చెప్పాను ఇంట్లో ఈ కథంతా.

    ఆ తరువాత రాజమంద్రీ వెళ్ళినప్పుడు ఒకసారి 13,000 వేలు డ్రా చేద్దామని ఏ.టి.ఎం కి వెళ్ళి కార్డ్ పెట్టి నొక్కితే ఆ డబ్బులు-రెప రెప మని చప్పుడు చేసికుంటూ, ఆ స్లాట్ దాకా వచ్చి
వెనక్కి వెళ్ళిపోయాయి. పోన్లే నేనంటే అంత ఇష్టం లేదేమో అని ఊరుకొన్నాను. అంతలో మషీన్ స్టాప్ అయిపోయింది.సరేనని ఇంకో ఎస్.బి.ఐ కివెళ్ళి ప్రయత్నిస్తే ఆ 13,000 రూపాయలూ, నా అకౌంటు లోంచి డెబిట్ అయిపోయాయి. ఇదేంటో నా పెన్షన్ కీ ఏ.టి.ఎం లకీ ఏదో శత్రుత్వం ఉందని నిశ్చయించేసుకొన్నాను. ఈ సారి నా డబ్బులు తిరిగి రావడానికి 25 ఫోన్లూ( రాజమండ్రి, పూణే ల మధ్య ), 60 రోజులూ పట్టింది.

    అప్పటినుంచీ ఏ.టి.ఎం లో వెయ్యి రూపాయలకు మించి ఒకేసారి ఎప్పుడూ తియ్యలేదు!! పోతే వెయ్యే పోతుంది మరీ వేల మీద పోతే రోడ్డెక్కాలి. ఇదండీ మన ఏ.టి.ఎం లూ, వాటి
అల్లర్లూ. నా సలహా ఏమిటంటే ప్రతీ వారూ కూడా వీలున్నప్పుడల్లా బేలెన్శ్ చెక్ చేస్తూండండి. మన బాంకులమీద అంత నమ్మకం పెట్టుకోవద్దు. మన బాంకుల వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళకి ఎడా పెడా అప్పులిస్తారు. వాళ్ళు జెండా ఎత్తేస్తే నెత్తిమీద గుడ్డ వేసికొని వాటికి అదేదో ” ఎన్.పీ.ఏ ” అనో మరేదో పేరు పెట్టి నోరు మూసుకుంటారు. అదే మనలాంటి వాడికి ప్రపంచం లో ఉన్న అన్ని రూల్సూ చెప్తారు. బాంకుల వాళ్ళు ప్రతీ ఏడాదీ చూపించే లాభాలు మనలాంటివాళ్ళ దగ్గర దోచేసినవే !!

    ఇంక పోస్ట్ ఆఫీసుల కొస్తే అదో గోల. నాకు పూణే లో ఒక టర్మ్ డిపాజిట్ ఉంది మూడు సంవత్సరాలది. అది ఈ 2009 మార్చ్ లో మెచ్యూర్ అవుతుందని, పూణే వాళ్ళ సలహా మీద
రాజమండ్రి ట్రాన్స్ఫర్ కి పెట్టుకొని జనవరిలో పాస్ పుస్తకం సబ్మిట్ చేసి, మార్చ్ 20 వ తారీఖున రాజమండ్రీ పోస్టాఫీసుకి వెళ్ళాను. వాళ్ళు ఇంకా రాలేదన్నారు. మూడు నెలలయింది, ఇంత ఆలశ్యం ఎందుకైయిందని అడిగితే ” మాకేమీ తెలియదు పూణే వెళ్ళి అడగండి” అన్నారు. నెట్ లో పూణే వాళ్ళ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ” మా దగ్గర తగినంత స్టాఫ్ లేరూ , ఇంకొక నెల పడుతుందీ” అన్నారు. అంటే నా అమౌంట్ మచ్యూర్ అయిన నెల తరువాత దాకా ఆగాలన్న మాట. ఇలా కాదని పూణే లో ఉన్న పోస్ట్ మాస్టర్ జెనరల్ పెర్సనల్ నంబర్ పట్టుకొని ఆయనని రెక్వెస్ట్ చేశాను. సంగతంతా చెప్పాను,అంతే మూడు రోజుల్లో నా డబ్బు ట్రాన్స్ఫర్ అయి నా చేతికొచ్చింది.

    నేను చెప్పేదేమిటంటే మనకి ఇలాంటి సమస్య ఏదైనా వస్తే ఊరికే వీళ్ళనీ వాళ్ళనీ ఆడగడం కాదు– ఆ డిపార్ట్మెంట్ హెడ్ కే కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ దాకా ఇలాంటి విషయాలు
వెళ్ళవూ, వెళ్తే తప్పకుండా సహాయం చేస్తారు. ఆల్వేజ్ అప్రోచ్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఆయన తప్పించుకో లేరు. జనరల్ గా మన పని శులభం అవుతుంది.
ఏదో నాకైన అనుభవాలు మీతో పంచుకుంటే ఎవరికైనా ఉపయోగ పడుతాయేమో నని ఈ బ్లాగ్గు.

బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–ఆర్ధిక మాంద్యం

    నిన్న టివి లోనూ, ఈ వేళ సాక్షి దిన పత్రిక లోనూ ఒక వార్త చూసి చాలా బధ పడ్డాను. హైదరాబాద్ లో మహరాష్ట్ర కి చెందిన ఒక యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసికొన్నాడని. కారణం –ఆర్దిక మాంద్యం. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే మాట. ఆర్ధిక మాంద్యం ఒక్ ” బజ్ వర్డ్ ” అయిపోయింది. మా చిన్నతనం లోకానీ, ఉద్యోగం లో ఉన్నప్పుడు కానీ ఈ మాట ఎప్పుడూ వినలేదు. ఈ మధ్యన చదువుతున్నాము, కానీ దీని అసలు అర్ధం ఏమిటో నాకూ తెలియదు.

మా చిన్నప్పుడు మధ్య తరగతి కుటుంబం లోనుండి వచ్చిన వాళ్ళు, ఏదో ఓ డిగ్రీ తీసికోవడం, ఆ తరువాత బి.ఈ.డీ ట్రైనింగ్ అయి ఎక్కడో టిచర్ గా చేరిపోవడమూ, డిగ్రీ లేనివాళ్ళు, సెకండరీ గ్రేడ్ ట్రైనింగో, లేక పీ.టీ ట్రైనింగో అవడమూ. ఎవరికీ ఏమీ సమస్య ఉండేదికాదు. పెళ్ళి సంబంధం వచ్చినా ఏదో కట్నం, దానితో పాటు రాలీ సైకిలో, హంబర్ సైకిలో ఇచ్చేవారు. కొంచెం డబ్బున్నవాళ్ళైతే ఆ సైకిలుకి ఓ డైనమో లైటు కూడా ఉండేది !! ఈ స్కూళ్ళలో కాకుండా కొంతమంది, కొచెం దూరం వెళ్ళడానికి సిధ్ధం అయితే, హైదరాబాద్ లో సెక్రటేరియట్ లోనో, లేకపోతే ఏ.జీ ఆఫీసులోనో సెటిల్ అయిపోయేవారు. వాళ్ళ తల్లితండ్రులు కూడా ఎంతో గర్వంగా చెప్పుకొనేవారు– మా వాడు హైదరాబాదు లో పనిచేస్తున్నాడూ అని.పెళ్ళి సంబంధాలు కూడా పుష్కలంగా వచ్చేవి.

మా రోజులు అంటే 1962 తరువాత సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు దొరకడం ప్రారంభం అయ్యాయి. ఆ రోజుల్లో అంటే చైనా యుధ్ధం తరువాత ఇక్కడా పూనా లో డిఫెన్స్ అకౌంట్ లోనూ, మా ఆర్డినెన్స్ ఫాక్టరీలలోనూ ఎక్కడ చూసినా మన ( దక్షిణ భారతీయులే) వాళ్ళే కనిపించేవారు. మరీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు- ఏదో క్లెర్కులుగానూ, సూపర్వైజర్లు గానూ. ఎంత చెప్పినా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకంటే, మా వాటికి గ్లామర్ ఎక్కువగా ఉండేది, కారణం–జీతాలూ, టైముకి డి.ఏ లూ — పెళ్ళి 1974 లో అయేటప్పడికి నా జీతం 500 రూపాయలు, కట్లు పోగా చేతికి వచ్చేది 350. హాయిగా ఇద్దరికీ సరిపోయేది. ఇప్పుడున్నటువంటి మాల్సూ , అవీ ఉండేవికాదు. చేతిలో డబ్బుంటే ఏదైనా కొనుక్కోవడం, లేకపోతే తూర్పు తిరిగి దండం పెట్టడం. ఓ పిల్లో పిల్లడో వచ్చిన తరువాత, మన సో కాల్డ్ లక్షరీలు ( అంటే సినిమాలూ, హొటళ్ళూ ) బంద్.ఆ పిల్లల చదువులూ, వాళ్ళ బాలారిష్టాలూ వాటితో సరిపోయింది. కొద్దిగా రిస్క్ తీసికొనేవాళ్ళు, ఇన్స్టాల్మెంట్లమీద కొద్దిగా సరుకులు జమా చేసికొనేవాళ్ళు. నాకు ఇంట్లో ఫ్రిజ్ తీసికోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. దానిమీద డబ్బు పెట్టే ధైర్యమూ ఉండేదికాదు. స్కూటర్లూ, మోటార్ సైకిళ్ళ సంగతి నాకు తెలియదు.

90 ల దశకం వచ్చేటప్పడికి ఎకనామిక్ రెఫార్మ్స్ ధర్మమా అని మొత్తం పిక్చరే మారిపోయింది.ఐ.టీ ధర్మమా అని ఎక్కడచూసినా లక్షల్లో జీతాలూ, గ్లోబలైజేషనో అదేదో పేరుచెప్పి ఎక్కడ చూసినా హరితమే హరితం.ఎవరిని అడిగినా సత్యమ్ లో ఉన్నాననో, విప్రో లో ఉన్నాననో, వీటికి అంతులేదు. మమ్మల్ని చూసి ” సర్కారీ నౌక్రీ మే హై క్యా ? ” అని అదేదో క్రైమ్ లా చూసేవారు. సంబంధాలు చూసే వాళ్ళు కూడా సాఫ్ట్ వేర్ వాళ్ళనే ఆకర్షించేవారు. గవర్నమెంట్ ఉద్యోగస్థులకి పెళ్ళి అవడమే గగనంగా మారిపోయింది. ఏవరూ లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్లు ఆఖరి ప్రిఫరెన్స్ గా మా వాళ్ళు( గవర్నమెంట్ పక్షులు) ఉండేవాళ్ళు !!నాకు ఇల్లుకట్టుకోవాలని ఆలోచన రావడానికి పాతికేళ్ళు పట్టింది.ఏదో అప్పోసప్పోచేసి ఇల్లు కట్టుకున్నాను. మా ధ్యేయం ఎలా ఉండేదంటే, ఓ ఇల్లు కట్టడం, పిల్లలని ఏ ఇంజనీరో, డాక్టరో చేయడం,వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం.అన్నీ పూర్తయితే మంచిదే.

ఈ రోజుల్లో ఎవరిని అడిగినా ” మీకెవరికీ ఈ రోజుల్లోవాళ్ళలాగ ఓ యాంబిషన్ లేదు, డ్రైవ్ లెదు, రిస్క్ తీసికొనే ధైర్యం లేదూ” అనేవాళ్ళే. నేను నలభై రెండేళ్ళు సర్వీస్ చేసి ఆఖరి రోజున నాకు మా వాళ్ళు “లాస్ట్ పే సర్టిఫికెట్” ఇస్తే మా పిల్లలకి చూపించాను. నా మొదటి జీతం 202.50పైసలు.ఆఖరి జీతం 20,202 రూపాయలు మాత్రమే. ఇదే ఇంకో చోటైతే కార్పొరేట్ సెక్టర్ లో అయితే నా సర్వీసుకి ఆకంపెనీ చైర్మన్ అవాలి.గవర్నమెంటు లో ఉన్న రూల్స్ చిత్రంగా ఉంటాయి.అక్కడ మెరిట్ కి అంత విలువ లెదు. మిగిలిన చాలా ఫాక్టర్లుంటాయి.దాని సంగతి వదిలేయండి, నాకెప్పుడూ విచారం లెదు.నాకెదో అపకారం జరిగిపోయిందీ అని.. ఆ ఉద్యోగం నాకు తల్లి లాంటిది–నాకూ, నాకుటుంబానికీ రెండుపూటలా తిండి పెట్టింది,పిల్లలకి చదువు చెప్పించింది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయించింది, ఉండడానికి ఓ ఇల్లు కట్టీంచింది— ఇవన్నీ అన్నదీ నేను కాదు ,మా పిల్లలు. అప్పటికే వాళ్ళు ఉద్యోగస్థులయ్యారు, జీతాలు కూడా అయిదంకెలలో తెచ్చుకుంటున్నారు. నాకూ, మా ఇంటావిడకూ చాలా సంతోషం వేసింది, మన పిల్లల కాళ్ళు ఇంకా భూమి మీదే ఉన్నాయి వాళ్ళకేమీ ఫర్వాలేదూ అని.

నేను చెప్పేదేమిటంటే జీతాలూ, ఖర్చులూ ఇప్పుడూ ఉన్నాయి, అప్పుడూ ఉన్నాయి, తేడా యేమిటంటే మనుష్యులలో వేసిన వెర్రి తలలు.ఈ రోజుల్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే , జీతం అయిదంకెల్లో ఉంటుంది, వాడనుకుంటాడూ, అర్రే మానాన్న ఈ జీతం సంపాదించడానికి అన్నేళ్ళు పట్టిందీ, మనం ఓ ఏడాదిలో ఓ కారూ, ఓ ఫ్లాట్టూ కొనేసి మన సత్తా ఏమిటో చూపిద్దాం అందరికీను. అనే ఓ ప్రలోభం లో పడతాడు.అకస్మాత్తుగా ఉద్యోగాలు ఊడిపోయేసరికి మన వాడికి వళ్ళంతా చెమట్లు పట్టేస్తుంది. ఈ కొన్న వస్తువులకి వాయిదాలెవడు కడతాడూ , క్రెడిట్ కార్డుల అప్పు ఎవరు తీరుస్తాడూ. వాళ్ళ నాన్నని అడిగే ధైర్యం లేదు. అప్పులు చెసే ముందర ఆయనతో చెప్పాడా లేదు , అందరినీ ఆశ్చర్యంలో ముంచేద్దామని ఈ అప్పులన్నీ చేసి తనే మునిగిపోయాడు. మన ఖర్చులమీద నియంత్రణ ఉంటే ఈ గొడవలన్నీ ఉండేవి కాదుగా . ఈ ఆర్దిక మాంద్యం కొత్తగా వచ్చినదేమీ కాదు. ఎప్పుడూ ఉండేదే. మనుష్యులూ, వాళ్ళ జీవిత పంథాలూ మారుతున్నాయి. ఇదివరకటి తరానికి దానిని ఎదుర్కునే ధైర్యం ఉండేది. ఇప్పటి వాళ్ళకి అది లోపించింది ( అందరికీ కాదు, ఆత్మహత్యలు చేసికొనే సచిన్ లాంటి వాళ్ళకి )

తేలిందేమిటంటే ” యాంబిషనూ, డ్రైవూ ” కాదు కావల్సినవి, జీవితాన్ని తీర్చి దిద్దుకొనే నేర్పు. అదుంటే చాలు ” ఆర్ధిక మాంద్యం” గో టూ హెల్

కొసమెరుపేమిటంటే ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగస్థులు పెళ్ళి సంబంధాల మార్కెట్ లో డిమాండ్ లో ఉన్నారు. ” దునియా గోల్ హై “ .

.. .

బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–రిటైర్మెంట్ బ్లూస్

   మాకు ఇక్కడ పూణే లో ప్రస్తుతం ఏమీ పనులు లేవు. అందువలన ఏదో కాలక్షేపానికి స్నెహితులని కలుసుకోవడం లో గడుపుతున్నాము. ఆ సందర్భం లో ఈ వేళ నేను, నాకంటే రెండు సంవత్సరాలు ముందు రిటైర్ అయిన మా ఫ్రెండు ని కలుసుకున్నాను. ఈ మధ్యలో నా తరువాత రెటైర్ అయిన ఓ ఫ్రెండ్ ని, సాయంత్రం ఓ రెండేళ్ళలో రిటైర్ అయ్యే మా పాత కొలీగ్ నీ కలుసుకున్నాను. పొద్దుటనుండీ వాళ్ళతో నా అనుభవాలు పంచుకుందామని ఉంది.నేను రిటైరు అయ్యి నాలుగున్నర సంవత్సరాలు అవుతోంది.

    రిటైరు అయ్యేనాటికి, పిల్లల పెళ్ళిళ్ళూ ( కొడుకు అయినా, కూతురు అయినా ) అవీ అయిపోతే సమస్యే ఉండదు.లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళూ అన్నీ అయేసరికి ఇంకా ఓ నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. అప్పటి దాకా ఏదో రకమైన ఒత్తిడి లోనే ఉంటాము.మన బాధ్యతల నుండి తప్పించుకోలేము కదా.అంటే 35-40 ఏళ్ళు సర్వీసు లో ఉండి ఏదో రెస్ట్ తీసికోవచ్చనే మన కలలు కలగానే మిగిలిపోతాయి.సర్వీసు లో ఉన్నంత కాలం గవర్నమెంట్ క్వార్టర్స్ లోనే మా జీవితం గడిచిపోయింది. అదృష్టం ఉన్నవాళ్ళు, బాగా ప్లాన్ చేసి ఓ ఇల్లు నిలపెట్టుకుంటారు. దానిలో భార్యా, భర్తా పెన్షన్ తో ( ఆరవ వేతన కమిషన్ ధర్మమా అని బాగానే ఉంది ) హాయిగా గడిపేయ వచ్చు. మన అవసరాలు కూడా చాలా లిమిటెడ్ గానే ఉంటాయి. కొంతమందికైతే ఆరోగ్యరీత్యా తినే తిండి లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.ఎవరి అదృష్టాన్ని బట్టి ఎలా రాసిపెడితే అలా ఉంటారు.

    నేను అర్ధం చేసికొన్నదేమంటే, మన జీవితం మన మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. ఈ వేళ మా ఫ్రెండ్స్ ని చూసిన తరువాత తేలిందేమిటంటే, మనం సమస్య లకి భయ పడి వాటికి దూరంగా పారిపోవాలనుకుంటే, అవి మనని ఇంకా భయ పెట్టి ఓ “డిప్రెషన్” లోకి తీసుకుపోతాయి. ఇన్నేళ్ళు జీవితం లాక్కొచ్చేము కదా ఇంకా ఎవరిని చూసి, ఏం చూసి భయ పడాలి?
భగవంతుని దయ వలన మన ఆరోగ్యం బాగా ఉంటే చాలు (చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి ), మేజర్ రోగాలుండకుండా చూసుకోవాలి.ఇవన్నీ చెప్పడం సులభమే అనొచ్చు.గవర్నమెంట్ సర్వీసు లో ఉన్న మాలాంటి మధ్య తరగతి ఉద్యోగుల గురించి మాత్రమే ఈ బ్లాగ్. పెద్ద పెద్ద ఆఫీసర్ కేడర్ లో రిటైర్ అయిన వాళ్ళు బాగానే ఉంటారు. పైగా రిటైర్ అయిన తరువాత ఏదో ఒక
ప్రైవేటు కంపెనీ ( ఉద్యోగం లొ ఉన్నప్పుడున్న పరిచయాల మూలంగా ) లో ఏదో కన్సల్టెంట్ గా చేరుతారు.మనం ఏదైనా అడుగుతే ” జుస్ట్ ఫర్ టైం పాస్ ” అంటారు. అంత హిపోక్రసీ ఎందుకో నాకు తెలియదు.మా కజిన్ ఒకడున్నాడు స్వతహాగా చాలా డబ్బున్నవాడు– అయినా సరే ఎంత దూరమైనా ఎక్కడైనా సరే వాళ్ళిచ్చే డబ్బు సరీగ్గా ఉంటే ఉద్యోగం లో చేరిపోతాడు.అతనికి టైం పాస్ అవడానికి మార్గాలేలేవా? అదంతే. ఈ డబ్బు సంపాదనకి అంతు లేదా? మనతో తీసికెళ్ళం. పోనీ మన పిల్లలేమైనా మననుండి ఆశిస్తారా, అదీలేదు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకూ, మా కొలీగ్స్ అందరి పిల్లలూ భగవంతుని దయ వలన బాగానే పైకి వచ్చారు. కొంతమందనొచ్చు డబ్బంటే చేదా అని. దానికీ ఒక లిమిట్ ఉండాలి కదండీ. మనకి సంతృప్తి అనేది ఒకటుండాలి. లేకపోతే ఈ పరుగుకి అంతుండదు.

    ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేను ఈవేళ కలుసుకున్న వాళ్ళలో ఒకరి అబ్బాయి పెళ్ళి అవాలి, ఇంకొకడు తన పెన్షన్ వ్య్వవహారం లో ఏదో తేడా వచ్చిందిట, దానిగురించి చెప్పాడు ఇంకొకడు
తను ఇంకా ఇల్లు కొనుక్కోలేదనీ, ఏడాది తరువాత ఏంచేయాలో తెలియడం లేదనీ గోల పెట్టాడు.పొద్దుటనుండీ ఇవన్నీ విని విని నాకు ఎప్పుడూ లేనిది డిప్రెషన్ వచ్చేసింది.ఇలా కాదని, మాకు దగ్గరలోనే ఉన్న మా ఫాక్టరీ క్వార్టర్స్ కి వెళ్ళాను.అక్కడ నాతో పనిచేసిన ఓ ముగ్గురు కుర్రాళ్ళు కనిపించారు. నన్ను చూడగానే ” బాస్ మీరు రిటైర్ అయి నాలుగేళ్ళయ్యిందంటే నమ్మ బుధ్ధి కావడంలేదు, ఆఫీసులో పని చేసేటప్పుడూ ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, ఉండేవాడివి, ఇప్పుడూ అలాగే ఉన్నావూ”, చాలా సంతోషం వేసింది. మేము మాట్లాడుతూంటే ఇంకో నలుగురు పలకరించారు, వాళ్ళూ ఇదే మాట.నేనన్నానూ, నాకూ సమస్యలున్నాయీ, కానీ నేను దేనికీ భయపడలేదు ఎప్పుడూ.అస్తమానూ నవ్వుతూ ఉంటే ఆరోగ్యం బాగుంటుందని ఎవరో చెప్పారు
అందువల్ల నవ్వుతూనే ఉంటాను.. పళ్ళు లేకపోవడం వల్ల మొహం కొంచెం క్యూట్ గా కనిపిస్తుందీ
అన్నాను.మనమీద మనం జోక్ వేసికొని ఇతరులని నవ్వించకలిగితే మనకి ఎదురుండదు.మా చిన్నప్పుడు రిటైర్ అయ్యేరంటే వాళ్ళని అందరూ తాత గారనేవారు, మరీ 58 ఏళ్ళకే ముసలాడు అనడం బాగుండదేమో నని నా అభిప్రాయం. ముసలాడిని ముసలాడనడం తప్పా అంటారు, మన మిత్రులు కొంతమంది. ఒకటి చెప్పండి, వీళ్ళు మీకు ఏమి తక్కువా? ఒక విషయం మర్చిపోతున్నారు-రిటైర్ అయిన వాళ్ళు, తమ విధులన్నీ నిర్వర్తించి,-ప్రభుత్వానికీ, కుటుంబానికీ-
ఇప్పుడు, వాళ్ళు వేసిన విత్తనాలు పెరిగి, ఫలిస్తుంటే చూసి సంతోషిస్తారు కానీ ,మీకు ఏలాటి కాంప్టీషన్ గా లేరుకదా.

    ఏదో రోగం వచ్చి మంచం పడితే, ఎలాగూ మీకు వాళ్ళతో మాట్లాడడానికి టైముండదు.. అలాగని మూల పడేస్తారనికాదు, ఒకలా చూస్తే, మా రోజులకంటే, ఇప్పుడే పిల్లలు వాళ్ళ తల్లితండ్రుల గురించి శ్రధ్ధ తీసికుంటున్నారనిపిస్తుంది.అంత మంచి గుణాలున్నవాళ్ళు, ఎంతమంది వాళ్ళ తల్లితండ్రులతో క్వాలిటీ టైము గడుపుతున్నారూ, ఒక్కసారి ఆలోచించండి.పొద్దుటనుండీ సాయంత్రం దాకా ఖబుర్లు చెప్పమనడం లేదు. సాయంత్రం ఆఫీసునుండి రాగానే ‘ హాయ్ ” అంటే ఆ ” ముసలి” ( మీ భాషలో ) తండ్రి ఎంత సంతోషిస్తాడూ.

    సాయంత్రం అయేసరికి రిటైర్ అయిన ప్రతీ వాడూ ఒకచోట కలుసుకుంటూంటారు. అక్కడ ఖబుర్లన్నీ ఒక్కలాగే ఉంటాయి. అందుకనే నేను వీలున్నంతవరకూ అలాంటి చోటకి వెళ్ళను. మన సమస్యలే కాకుండా ఊళ్ళో వాళ్ళ సమస్యలుకూడా ఎందుకూ మనకి? మనం చేసేది ఏమీ లేదు, మనం అర్చేవాళ్ళమూ కాదు , తీర్చేవాళ్ళమూ కాదు
నాకు రిటైర్ అయి నాలుగున్నరేళ్ళు అయిందనిపించదు. ఇంకా సర్వీసులో ఉన్నట్లే అనిపిస్తుంది.నా పాలసీ ఒకటే– జరిగిపోయినదానిని గురించి ఆలోచించను, జరగబోయేదాని గురించి భయ పడను– ఎందుకంటే అది మనచేతిలో లేదు. ఈవేళ ఎలా ఉన్నావూ అనేదే . ” అప్నా హాథ్ జగన్నాథ్”. అయితే దీని కన్నింటికీ మన సహధర్మచారిణి సహకారం ఉండాలి. ఆ విషయం లో నేను చాలా అదృష్టవంతుడిని. ” మే గాడ్ బ్లెస్ హెర్ “.

బాతాఖానీ-తెరవెనుక (లక్ష్మిఫణి)ఖబుర్లు–తిండి అలవాట్లు

   

మా చిన్నప్పుడు ఎప్పుడినా రాత్రిళ్ళు అన్నం లాంటిది మిగిలిపోతే, దానిని తరవాణీ లో వేసి, మర్నాడు పొద్దుటే పిల్లలకి పెట్టేవారు ( ఆ రోజుల్లో ఫ్రిజ్ లూ అవీ ఉండేవికావుగా ), ఇంట్లో పిల్లలు లేకపోతే ఏ మాధవ కబళం వాడికో వేసేసేవారు.భోజనాలు పొద్దుటే 10 గంటలకల్లా అయిపోయేవి. మధ్యాహ్నం మూడింటికి ఏదైనా తాయిలాలు చేసేవారు. బయట వస్తువులు అవీ తినడం అలవాట్లు లేవు.శనివారం, ఆదివారం ఎవరికైనా రాత్రి ఉపవాసాలుంటే వాసినిపోలులూ, దిబ్బరొట్టెలూ లాంటివి చేసే వారు దాంట్లోకి ఏదో ఊరగాయ నలుచుకోవడానికి.

ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అందరూకూడా బయట తినుబండారాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అన్నప్రాశన అయిన మర్నాడు నుండీ కుర్కురేలూ, చాకోలూ, బర్గర్లూ ఒకటేమిటి,రకరకాలు. నాకో అనుమానం–చిన్నపిల్లలు ఆ కుర్కురేలకి ఎందుకు ఎడిక్ట్ అవుతారో, దానిలో ఏమైనా కలుపుతారా? ఏమో? ఇంకోటి మరచిపోయాను, చిన్న పిల్లలకి అవేవో
ఫ్రూట్లూప్సూ, కార్న్ ఫ్లేక్సూ. అవిలేకపోతే వాళ్ళకి రోజు వెళ్ళదు. ఇదంతా ” గ్లోబలైజేషన్ ” మహిమా ?

నేను సర్వీసు లో ఉన్న 42 సంవత్సరాలలోనూ మొదటి తొమ్మిది సంవత్సరాలు ( పెళ్ళికి పూర్వం ) వదిలేస్తే మిగిలిన 33 ఏళ్ళూ, మాఇంటావిడ చేతి వంటే తిన్నాను. ప్రతీరోజూ ఫాక్టరీకి
డబ్బా ( మన భాషలో కేరీయర్ ) తీసికెళ్ళడమే. ఆ అలవాటు ఎంతగా అయిందంటే, మాఇంటావిడ నేను రిటైర్ అయిన తరువాత కూడా కొన్ని రోజులు డబ్బా ఇచ్చేసి, ఏదో మూలకి వెళ్ళి తినేయమనేది !!

పిల్లలకి ఇంట్లోనే ఏదైనా చేసి తినిపిస్తే బాగుంటుందేమో. ఈ రోజుల్లో భార్యా భర్తలు ఇద్దరూ పనిచేస్తేనే కానీ కంఫర్టబుల్ గా జీవితం గడపలేకున్నారు. బహుశా ఇదో కారణమేమో, ఈ ఇన్స్టెంట్ ఫుడ్లు మనజీవితం లో చోటు చేసికోవడానికి.ఈ జంక్ ఫుడ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ముందు తల్లితండ్రులు ఆ అలవాటు మానితే పిల్లలు వారిని అనుసరిస్తారేమో, ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. కొందరు అనొచ్చు– వీడికి తన చిన్నతనంలో ఇలాంటివి ఎప్పుడూ దొరకలేదూ అందుకనే ఇప్పటి వాళ్ళని చూస్తే దుగ్ధా అని.ఈ వాతావరణ కాలుష్యానికి తోడు ఈ తిండి అలవాట్ల ధర్మమా అని బాగుపడుతున్నవాళ్ళు డాక్టర్లూ, ఆ చిరుతిళ్ళు తయారుచేస్తున్న కంపెనీలూ, నష్టపోతున్నది మన పిల్లలూ, వారి భవిష్యత్తూ.

వీటికి సాయం ఆ సాఫ్ట్ డ్రింకులు –కోకాకోలాలూ, పెప్సీలూ, మాజాలూ ఎట్సట్రా ఎట్సట్రా…వీటి ధర్మమా అని చిన్నా పెద్దా లకి ఒబేసిటీ ప్రోబ్లం లూ. మళ్ళీ వాటికోసం జిమ్ములూ, డబ్బున్నవారైతే ఇంట్లోనే అన్నిరకాల వ్యాయామాలకి ఎవేవో కొని ఇల్లంతా ఓ గోడౌన్ లా చేయడం. పోనీ అవేనా రోజూ చేస్తారా అంటే అదీలేదు.
ఇదివరకటి రోజుల్లో మన ముందు తరం వారు వారి తిండి అలవాట్ల వల్లే వాళ్ళ ఆయుషు అంతగా ఉండేది.టైముకి ఓ పధ్ధతి ప్రకారం తినడం, చివరివరకూ చేశారు. కొంతమంది అనొచ్చు
–ఆరోజుల్లో ఈ పెస్టిసైడ్లూ అవీ ఉండెవికాదు, కల్తీలేని తిండి దొరికేది అని.బహుశా అదో కారణం అవొచ్చు.తిండి ఎలా ఉన్నా పధ్ధతి లో కూడా ఉందికదా?ఈ రోజుల్లో చిన్నపిల్లలకి ఓ చేతిలో
టి.వి రిమోట్టూ ( కార్టూన్లు చూడడానికి), రెండో చేతిలో ఎదో తినే ప్లేటూ. పిల్లలని ఆ టి.వి. ముందుంచుతే ఎలాగోలాగ పేచీ పెట్టకుండా తినేస్తాడని మనం కూడా అదే ఎంకరేజ్ చేస్తున్నాము.

టీవీల్లో ప్రకటనల ధర్మమా అని ( అవికూడా చిన్నపిల్లలచేత చేయిస్తారు ) మన పిల్లలు కూడా వాటిమీదకు ఎగ బడుతున్నారు. ఈ మధ్యన ఎక్కడో చదివాను– టీవీ ల్లోనూ, సినిమాల్లోనూ, చిన్నపిల్లలచేత పనిచేయించే ప్రొడ్యూసర్ల మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తున్నారని, దీనిని, చిన్న పిల్లల తిండి మీద చేసే ప్రకటనల వాళ్ళ మీద కూడా అమలుచేయాలి.
ఈ కుర్కురేలూ అవీ నగరాలకే కాదు, చిన్న చిన్న గ్రామాలకి కూడా పాకేయి

ఒకప్పుడు దూర్దర్శన్ రోజుల్లో అదేదో సీరియల్ వచ్చేది డ్రగ్స్ మీద వాటి దుష్ప్రభావాలూ అవీ చూపించారు. కొంత కాలం కింద వాళ్ళెవరో సాఫ్ట్ డ్రింకులమీద ఏవేవో ఇన్వెస్టిగేషన్లు చేసి వాటిలో
పురుగు మందులూ అవీ ఉన్నాయన్నారు.కొంత కాలం అవి తాగడం మానేశారు, మళ్ళీ మామూలే.ఇప్పుడు వస్తున్న జంక్ ఫుడ్ మీద ఎవరూ ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయలేదు?
మన ప్రభుత్వాల నిజాయితీ దీనిలో తెలుస్తోంది.

.

బాతాఖానీ-తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు–పెళ్ళి బహుమతులు.

    ఇదివరకటి రోజుల్లో పెళ్ళిళ్ళు అయిదు రోజులు జరిగేవి.అవి తరువాత మూడు రోజులకి దిగాయి. మా రోజులు వచ్చేసరికి ఒకరోజుకి అయ్యాయి.ఇప్పుడైతే గంటల్లోకి వచ్చాయి. ఏదో హాలో,హొటలో కుదుర్చుకోవడం, అక్కడ ఇంకా మిగిలిన గిరాకీలు కూడా ఉంటారు కనుక, మనం ఆ హాల్ ని కొన్ని గంటలకే బుక్ చేసికోవాలి.మన టైము అయ్యేసరికి, తరువాత వాళ్ళు రెడీ అవుతారు

    మా చిన్నప్పుడైతే ఎవరింట్లోనైనా పెళ్ళి అయితే, నాలుగు రోజులు ముందుగా వెళ్ళేవాళ్ళం. పెళ్ళి అయిదు రోజులూ కలిపి మొత్తం పది రోజులూ అంతా పండగ వాతావరణమే,చుట్టాలూ, వాళ్ళతో బాతాఖానీలూ బలేగా ఉండేది. ఆ పదిరోజులకీ గాడిపొయ్యిలు తవ్వించి, వంటబ్రాహ్మల్ని పెట్టి విందు భోజనాలూ అవీను.ఇప్పుడు ఆ హంగామా ఏమీలేదు.ఒక్కొక్కప్పుడు పెళ్ళిళ్ళు ఏదో కొండమీద కూడా చేస్తున్నారు. మాది అలాగే అయింది

    మేము వరంగాం లో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ ఒకతని కూతురు పెళ్ళి అయింది. అక్కడ వాళ్ళకి ముహూర్తాలు మన లాగ అర్ధరాత్రీ అపరాత్రీ ఉండవు. రెండే ముహూర్తాలు– ఒకటి మిట్టమధ్యాహ్నం 12 గంటలకీ, రెండోది సాయంత్రం ఆరు గంటలకీ.పెళ్ళి కూడా తమాషాగా ఉంది, ముందుగా మనం ఇచ్చే గిఫ్టులు, నోట్ చేసికోవడానికి ఒక క్యూ ఉండేది.దానిని మైక్ లో చెప్పేవారుకూడానూ.ఆ తరువాత స్తేజ్ మీద ఏవో మంత్రాలు చదవడం,అందరూ ” సావధాన్ శుభమంగళ్ ” అంటూ చప్పట్లు కొట్టడం.అంతే.చిత్రం ఏమిటంటే, ఆ పెళ్ళిలో మాఫ్రెండ్ ( పెళ్ళికూతురి తండ్రి) కూడా నాతోనే నుంచొని చప్పట్లు కొట్టడం !!

    ఎక్కడినా హొటల్ లో పెళ్ళి అయినప్పుడు కొన్ని గమ్మత్తులు కూడా జరుగుతూంటాయి. మా ఫ్రెండొకాయన ఒక పెళ్ళికి వెళ్ళబోయి, ఇంకొకళ్ళ పెళ్ళికి వెళ్ళి ,బహుమతీ కూడా ఇచ్చి వచ్చాడు.చూశాడుట ఇక్కడేమిటీ మనకి తెలిసిన వాళ్ళెవరూ లేరేమిటీ అనుకుంటూ, స్టేజ్ మీదకు వెళ్ళే క్యూ లో నుంచొని ఆ తరువాత తన టర్న్ వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో గిఫ్ట్ పెట్టి వచ్చాడు.అప్పుడు గమనించాడు తను వెళ్ళవలసిన పెళ్ళి అది కాదని, అయినా చేసేదేమీలేక, భోజనం చేసి వచ్చాడు. ఈ మధ్యన మా ఇంటావిడని రాజమండ్రి లో ఎవరో ఏదో నోముకి పిలిచారు.సరేనని వెళ్ళింది. పిలిచిన వాళ్ళ ఇల్లు సరీగ్గా తెలియదు, ఏదో ఎవరి ఫ్లాట్ ముందరో చెప్పులూ అవీ ఉన్నాయి కదా అని అక్కడ లోపలికి వెళ్ళింది. అక్కడ వాళ్ళు, పెళ్ళికూతురికి మీది కట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఈవిడ వచ్చిందికదా అని ( పిలవని ముత్తైదువ ) బోల్డు సంతోషపడిపోయి చేతిలో వాయినం అవీ పెట్టేశారు.

    కొన్ని మొహమ్మాటం పిలుపులు ఉంటాయి. ఏదో అక్కడ ఉంటున్నాముకదా అని పిలుస్తారు. వాళ్ళెవరూ మనకి తెలియదు. అయినా చేతిలో ఏదో పెట్టాలి. ఇదివరకటి రోజుల్లో అయితే, ఏవేవో స్టీల్ సామాన్లు పెట్టేవారు, చాలా సార్లు ఒకే వస్తువు ఓ అరడజను దాకా ఉండేవి.పిల్ల కాపరానికి కావల్సిన స్టీలు సామానంతా వచ్చేది.ఆ తరువాత కుక్కర్లూ, మిక్సీలూ, డిన్నర్సెట్లూ
అన్నీకూడా రెండేసి, ఒక్కొక్కప్పుడు మూడేసీ కూడా వచ్చేవి. ఆ తరువాత ఇది చాలా గొడవ అయిపోతూందని, గిఫ్ట్ వోచర్లిచ్చేవారు.తెలిసున్నవాళ్ళనైతే అడగొచ్చు, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వొచ్చు.

    ఇంక ఆఫీసుల్లో పిలిచినప్పుడు, అక్కడ అంతా చందా వసూలు చేసి అందరితరఫునా ఒకే గిఫ్ట్ కొంటారు.దీనివలన సమస్య ఏమిటంటే, అందరూ కలిసేనా వెళ్ళాలి, లెదా ఆ గిఫ్ట్ కొని తీసికొచ్చేవాడు వచ్చేదాకా వేచిఉండాలి.ఆ వచ్చేవాడు ఆడుతూ, పాడుతూ ఎప్పుడో వస్తాడు. ఇంతలో పుణ్యకాలం వెళ్ళిపోతుంది.మనం ఎక్కడైనా బాగా తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్తే ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేబదులు, ఇదివరకటి రోజుల్లో నూట పదహార్లు,వెయ్యినూటపదహార్లూ ఇచ్చేవాళ్ళు.ఇప్పుడేమయ్యిందంటే మనం వెళ్ళే మొహమ్మాటం పిలుపులు వెయ్యినూటపదహార్లు ఎక్కువా, నూటపదహార్లు మరీ తక్కువగానూ ఉంటున్నాయి. అందుకని వయా మీడియా గా మనిషికి వంద చొప్పున మనం వెళ్ళేశాల్తీలని బట్టి లెఖ్ఖేసి ఓ కవరులో పెట్టి ఇవ్వడం.ఆ గృహస్థుకి మన తరఫునుండి సహాయం అనుకుంటాము కానీ , ఆ పాకెట్లన్నీ పెళ్ళికూతురో, పెళ్ళికొడుకో తీసేసుకుంటారు

    ఏవో కారణాలవల్ల మనం ఒక్కళ్ళే వెళ్ళాం అనుకోండి, గిఫ్ట్ తీసికుంటారు, కానీ వాళ్ళు పెళ్ళి సందర్భం గా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ లాంటి పాకెట్టో, బాగ్గో, మగవాళ్ళకి ఇవ్వరు. మనకి జేబురుమ్మాలే గతి !!.

బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు–కుక్కల భయం

      నాకు కుక్కలంటే మహా భయం. చెప్పుకోడానికి ఏమీ సిగ్గు పడను. నాకు చాలా మంది చెప్పారు–కుక్కంటే భయ పడకూడదు, అరిచినా సరే, ఏమీ కదలకుండా నుంచో, అదే భయ పడి పారిపోతుందీ, ఎట్సట్రా, ఎట్సట్రా..ఈ ధైర్యం జనరల్ గా కుక్కలను పెంచేవాళ్ళే చెప్తారు.యజమాని కాబట్టి వాడిని ఏమీ చెయ్యకపోవచ్చు. ఆ కుక్కకి మనమీద " ఎలీజియెన్స్" ఎందుకు ఉంటుందీ ?. నేను చాలా సార్లు ప్రయత్నించాను భయ పడకూడదని, అలా 60 ఏళ్ళు గడచిపోయాయి, కానీ ఆ భయం పోలేదు. ఈ వయస్సులో ఏమీ సాహస కృత్యాలు చేయాలని కోరికా లేదు.దానివలన ఇంకోళ్ళకి ఏమీ నష్టం లేదుగా!!

      నా పోలిక మా అమ్మాయికి పూర్తిగా వచ్చింది.పాపం వెర్రి తల్లి వాళ్ళ నాన్నే తనకి ఓ ఇన్స్పిరేషన్ ఇలాంటి విషయాలలో మాత్రమే !! ఈ వేళ " ఫాదర్స్ డే " అని, ఓ కార్డూ,ఓ గిఫ్టూ ఇచ్చింది.మేం ఇద్దరమే మా కుటుంబం లో కుక్కలకి భయ పడేవాళ్ళం. మిగిలిన వాళ్ళందరూ, ( మా ఇంటావిడతో సహా ) మమ్మల్ని ఏడిపించేవారే.మా అబ్బాయైతే, వాళ్ళ అమ్మాయి కోసం ఓ కుక్క పిల్లని పెంచుకుందామంటూంటాడు. ఇంక నాకు రాజమండ్రి నుండి పూణే వచ్చే యోగం ఉన్నట్లులేదు.

            నేను ఉద్యోగం లో ఉన్నప్పుడు , ఎప్పుడైనా మొదటి షిఫ్ట్ కి పొద్దుటే 6.00 గంటలకి చేరాలంటే చీకట్లో 5.00 గంటలకే లేచి వెళ్ళవలసివచ్చేది. చీకటంటే భయం లేదు.ఈ కుక్కలే, రోడ్డు మొదట్లో ఓ కుక్క అరవడం మొదలెడితే, ఆ ఇలాఖాలో ఉన్న అన్ని కుక్కలూ అరవడం మొదలెడతాయి. నాకు చిత్రహింస లా ఉండేది.మా క్వార్టర్ కి బయట నుంచునేవాడిని, ఆ తెల్లవారుఝామున ఆ రోడ్డు మీద వెళ్ళే పాలవాళ్ళో, పనిమనుష్యులో వచ్చేదాకా ఆగి, వాళ్ళకు తెలియకుండా, చీకట్లో వాళ్ళని ఫాలో అయ్యేవాడిని. ఎప్పుడైనా చూసినా, వాళ్ళలాగే నేనుకూడా ఎవరింట్లోనో పనికి వెళ్తున్నాననుకొనేవారు. అయినా నాకేమిటి, ఆ ఫర్లాంగు దూరమూ, నాకు వాళ్ళ రక్షణ ఉంటూందిగా. ఊరికే వాళ్ళ భావాల్ని కించపరచడం ఎందుకూ ? రాత్రిళ్ళు, అలాంటి తోడు దొరికేది కాదు.పాలవాళ్ళూ, పనిచేసేవాళ్ళూ ఉండరు కదా, అలాంటప్పుడు, మా ఇంటావిడ పాపం, పిల్లల్ని పక్కవారికి అప్పజెప్పి, నాకోసం అక్కడ వెయిట్ చేసేది.ఇలా ఉండేది నా బ్రతుకు !!

      మేము వరంగాం లో ఉన్నప్పుడైతే ఇంకో గోల. మా ఫోర్మన్ ఒకాయనకి రెండు పేధ్ధ కుక్కలుండేవి. ఒకదానిని చెయిన్ తో కట్టేసి పట్టుకునేవాడు.రెండో కుక్కని మామూలుగా ఒదిలేసేవాడు. వీటితో రోడ్డుమీద " వాకింగ్ " కి రావడం –అదో స్టేటస్ సింబలూ. ఎప్పుడైనా ఆయనను రోడ్డు మీద చూసినప్పుడు, పోనీ మన ఫోర్మన్ కదా అని చెయ్యేత్తి "హల్లో" అన్నాను
వాళ్ళ యజమానిని ఏదో చేసేస్తాననుకుందో ఏమో, ఆ రెండో కుక్క నామీదకెగిరింది.నాకు బ్లడ్ ప్రెషరూ అలాంటివి ఏమీ లేవు, కానీ ఆక్షణంలో నాకు అవన్నీ వచ్చేశాయి.ఏదో ఆయన అడ్డుకున్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఆ కుక్కగారి చేతిలో నా పని అయిపోయేది.అప్పటినుంచీ ఆయన ఎక్కడ కనిపించినా, ఆయనెవరో నాకు తెలియనట్లుగా పక్కనుంచి వెళ్ళిపోయేవాడిని.

      ఇవన్నీ ఇలాగుండగా, మా డాక్టర్ ఫ్రెండ్ దేష్పాండే గారికి ఓ కుక్కని పెంచుకోవాలనే ఓ మహత్తర ఆలోచన వచ్చింది.ఆయనకు తెలుసు, నా భయాలన్నీ.అందుకని నేను ఎప్పుడు వాళ్ళింటికి వెళ్ళినా, దాన్ని కట్టేస్తూంటారు. దానికో పేరూ " గోల్డీ "అని. మేము వెళ్ళగానే " దెఖో ఫణిబాబూ అంకుల్ ఆయా " అంటూ దానితో ఖబుర్లూ. ఒక్క విషయం– ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నదానిని "కుక్క " అనకూడదు. పెరుతోనే పిలవాలి. లేకపోతే వాళ్ళ " ఫీలింగ్స్ " హర్ట్ అవుతాయి. గుర్తు పెట్టుకోండి. ఈ కుక్కల జనాలకి ( యజమానులనాలి కాబొలు), ఊరు వదలి బయటకు వెళ్ళడానికి కుదరదు.అంతేకాదు మనం ఎప్పుడినా వాళ్ళని ఇన్వైట్ చేస్తే, " మాకు కుదరదు, మా గోల్డీ యో, మరేదో ( కుక్క అనకూడదుగా) కి భోజనం టైమో మరేదో అని తప్పించేసుకుంటారు.పోన్లెండి అదే నయం. దానిని మన ఇంటికి తీసికొస్తే అదో గోలా !

      ఒక్కకొప్పుడు మనం ఉండే సొసైటీ ల్లో కుక్కలున్నవాళ్ళు,దానిని బయటకు తీసికెళ్ళి, మళ్ళీ వాళ్ళ ఫ్లాట్ లోకి తీసికెళ్ళడానికి, ఏ లిఫ్ట్ లోనో వెళ్తున్నారనుకోండి, ఆలిఫ్ట్ లో మనం చిక్కడిపోయామో అంతే సంగతి .ఇలా నాకు రెండు మూడుసార్లు అయింది.. నాలుగో అంతస్థనా సరే, నేను మెట్లమీదనుండి నడిచే వెళ్తాను.అక్కడ రాజమండ్రి లో మా వదిన గారింట్లో ఆవిడ ఓ కుక్కని పెంచుకుంటూంది.ఎప్పుడు వెళ్ళినా దాన్ని కట్టేస్తే కానీ ,వాళ్ళింట్లోకి వెళ్ళను., ఎవరేమనుకున్నా సరే !!!!

%d bloggers like this: