బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– గూబ గుయ్యిమనడం అంటే తెలుస్తోంది…

    గూబ గుయ్యిమనడం, ఎప్పుడో చిన్నప్పుడు, పాకబడిలో, మాస్టారికి, ఏ కోపం వచ్చినప్పుడో, లేదా నాన్నగారికి, పరీక్షలో మార్కులు తక్కువొచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడో, వేసిన చెంపదెబ్బలకి, అనుభవం అయేది. మళ్ళీ, అప్పటికి, ఈరోజుల్లో తెలుస్తోంది. ఓవైపున మన భారత ప్రభుత్వం వారేమో, నోటిలెక్కలు కట్టేసి, అదేదో, ద్రవ్యోల్బణం ( inflation) సింగిల్ డిజిట్ లోకి వచ్చేసిందీ అంటున్నారు.. కానీ, మార్కెట్ కి వెళ్ళడానికే భయంగా ఉంటోంది. గుప్తుల “ స్వర్ణయుగం” లో , మరీ అంతకాకపోయినా, ఓ మూడునాలుగేళ్ళ క్రితం వరకూ, మరీ పెళ్ళి విందులోలాగ కాకపోయినా, సంసారపక్షం గా, ఓ కూరా, పప్పూ, పచ్చడి లతో కడుపునిండా భోజనం చేసేవాళ్ళం. అతిథులెవరైనా వస్తే, మహా అయితే, ఇంకో కూర,, ఓ స్వీటూ, అదనంగా ఉంటే సరిపోయేది.. ఒకానొకప్పుడు, అతిథులనిబట్టి, పప్పుపులుసూ, వీలునిబట్టి, కందిపప్పు వేయించి, పచ్చడీ, దాంట్లో నలుచుకోడానికి ఉల్లిపాయల పులుసూ… హో… ఏం భోగంగా ఉండేదండీ. ఏ పోపులోనో వేసిన శనగపప్పు బద్దో, పంట్లో గుచ్చుకుని, ఆ తరువాతెప్పుడో , సావకాశంగా, నాలుకతో సుతారంగా, బయటకి తీసి మళ్ళీ నవలడం, అసలా రుచే వేరు. శనగపప్పుతో పాఠోలీ చేస్తే, ఆ రుచి మర్చిపోగలమంటారా? ఎంత లగ్జరీ అంటే, “ చెడిన కాపరం ఎలాగూ చెడిందీ, చంద్రకాంతలు చేయవే భామామణీ.. “ అన్నట్టు అప్పుడప్పుడు చంద్రకాంతాలూ, పెసరట్టూ, ఉప్మా అయితే సరే సరి… ఇలా రకరకాల వంటకాలూ అవీనూ.
ఇంక మినప్పప్పు విషయానికొస్తే, శనివారం ఫలహారాలకి వాసినపోళ్ళూ ( ఇడ్లీలు), పోలాలమావాశ్యకి పొట్టెక్కబుట్టలూ, ఆరారగా నోట్లో వేసికోడానికి మినపసున్నుండలూ, మధ్యాన్నం చాయ్ తో తినడానికి, ఓ కారప్పూసో,కారబ్బూందో… ఇలా చెప్పుకుంటూ పోతే, అన్నిరకాల పప్పులతో, ఎన్నోరకాల పదార్ధాలు చేసికుని, మనం తిని, ఇంటికొచ్చినవారికి పెట్టి, హాయిగా ఉండేవాళ్ళం.అసలు ముద్దపప్పో, మామిడికాయ దొరికేరోజుల్లో, మామిడికాయతోనో, ఆ తరువాత, సంవత్సరం పొడుగునా ఎండిన మామిడి ఒరుగులతోనో, పప్పు, అందులోకి నెయ్యీలేకుండా అసలు ముద్ద దిగేదా? అలాటి మధురస్మృతులన్నీ, ఊరికే గుర్తుచేసికోడానికే సరిపోతాయి.

    అలాటిది, ఇప్పుడు, వీలునిబట్టి, పోపులోకి కూడా , శనగపప్పు వాడితే, ఏం ముంచుకొస్తుందో అనే భయం. కారణం- పప్పుల ధరలన్నీ, చెప్పాపెట్టకుండా, ఆకాశాన్నంటేశాయి. . ప్రతీరోజూ పేపర్లలో వార్తలోటీ, ఇవేళ 50,000 టన్నుల దాచుంచిన పప్పులు స్వాధీనం చేసికున్నారూ అంటూ. పోనీ, అవేమైనా మనకి దొరుకుతాయా అంటే అదీ లేదూ, అవన్నీ Public Distribution System లో కవరయినవారికే, ఇస్తారుట. ఆ భోగం మనకైతే లేనే లేదాయె.పోనీ, ఈ ధరలు పెరగడానికి, వ్యాపారస్థులే కారణమూ, నియంత్రించడానికి ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తోందీ అంటారు. అప్పుడెప్పుడో ఉల్లిపాయలధరలు , కోయకుండానే, కన్నీళ్ళు తెప్పించాయి. ఇప్పుడేమో పప్పులూ.

    ఈ విషయం వదిలేయండి, ప్రభుత్వం వారు, చాపకిందనీరు లా, చెప్పాపెట్టకుండా, ధరలు పెంచేయడం మాటేమిటీ? మన రైల్వే మంత్రి , బడ్జెట్ లో రైళ్ళ టిక్కెట్ల ధరలు పెంచడం మానేసి, జైట్లీతో,నువ్వు పన్నులు పెంచేసి, అందులో కొంత నాకిచ్చేసేయమ్మా అంటాడు. ఉదాహరణకి, ఏణ్ణర్ధం క్రితం, మేము పూణె నుండి సికిందరాబాద్, శతాబ్ది లో వెళ్ళడానికి ఇద్దరికీ కలిపి, సీనియర్ సిటిజెన్ రాయితీలతో , ఓ 700- 800 తో పనైపోయేది. ఇప్పుడో, రాయితీతో ఒక్కోరికి 700 పైగా అవుతోంది. విషయం ఏమిటా అని చూస్తే, బేసిక్ రేటు అలాగే ఉంచేసి, మిగతావన్నీ ఎడా పెడా పెంచేశారు. అలాగే, పెట్రోల్ ధరలు తగ్గించడం తరవాయి, రాష్ట్రప్రభుత్వాలు, ఏదో రూపంలో, సర్ ఛార్జి పేరుతో, లీటరుకి, 2-3 రూపాయలు పెంచేయడం. పైగా డబ్బున్నవాళ్ళే పెట్రోలూ, డీసెలూ వాడతారూ, ఆంఆద్మీకి ఏమీ ఉండదూ… అని ఓ సమర్ధింపోటీ. డీసెల్ పెంపు కారణంతో, రవాణాఖర్చు పేరుచెప్పి, మిగిలిన ధరలన్నీ పెరిగిపోవడమూ. పైగా, వీటితోపాటు, ప్రతీవాడూ, పూజలు చేయించే పురోహితులదగ్గరనుండి, క్షవరం చేసేవాళ్ళూ, చివరాఖరికి బట్టలుకుట్టేవాళ్ళూ.. ఇలా ఒకరేమిటి అందరూ.. “ పెట్రోల్ ధరలు పెరిగాయి కదండీ… “అనేవాడే. ప్రభుత్వాల లెక్కల ప్రకారం మాత్రం, inflation మైనస్సులోనే ఉంటుంది.

    ఇదివరకటిరోజుల్లో, నాకు గుర్తున్నంతవరకూ, 1971 లో బంగ్లాదేశ్ కాందిశీకుల్ని పోషించడానికి, కొంత సర్ ఛార్జీ వసూలుచేశారు. కానీ, ఇప్పుడు, రైతులఅత్మహత్యల మొదలు, స్వఛ్ఛ భారత్ అభియాన్, గంగా అభియాన్, ఇంకో సింగినాదం అభియాన్ పేర్లతో ఎడాపెడా వసూలు చేసేస్తున్నారు. పోనీ వీటివలన ఆత్మహత్యలు ఆగాయా, లేక దేశమంతా అద్దంలా మెరిసిపోతోందా అంటే, అదీ లేదూ.

    ఈలోపులో , శంకుస్థాపనలు, విదేశ పర్యటనలూ , పేరు చెప్పి, కోటానుకోట్లు ఖర్చుపెట్టడం మాత్రం మానడంలేదు, మన ప్రియతమ నాయకులు…

    సర్వేజనా సుఖినోభవంతూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–శ్రీ వెంకటేశ్వర ఆశీర్వచనాలు…

IMG_0035

   తెలుగు భాషాభిమానం అనండి, లేదా మిగిలిన భాషల్లో అంతగా ప్రావీణ్యం లేకపోవడం వలన అనండి, ఎందుకంటే, కొంతకాలం ఇంగ్లీషు బ్లాగుల్లో వ్రాశాను, ఎవరి దృష్టీ పడకపోవడం వలననండి, మొత్తానికి, వచ్చిన భాషలోనే వ్రాసుకోవడం ఉత్తమం అనుకుని, 2009 లో, నా బ్లాగు మొదలెట్టాను. మొదట్లో, ఎవరిగురించో ఎందుకనుకుని, నా గురించి నేనే, ఏ విషయమూ దాచుకోకుండా, అన్ని విషయాలూ వ్రాయడం మొదలెట్టాను, ” పోనిద్దూ.. మన స్వంత విషయాల మీద ఎవరికి ఆసక్తి ఉంటుందీ…” అనుకుంటూ… చిత్రం ఏమిటంటే, పోనీ ఏదో పెద్దాయన రాస్తున్నాడూ, చదివితే పోలేదూ.. అనుకున్నారో ఏమో, చాలామంది చదవడం మొదలెట్టారు. ఇంకో కారణం కూడా, నా భాష అయుండొచ్చు. భాషమీద పట్టున్న, పెద్దపెద్ద రచయితలు, పదునైన మాటలు ఉపయోగిస్తారు. కానీ, నాకైతే అలాటిది రాదే, ఏం చేయడం అనుకుని, మనం సాధారణంగా కబుర్లు చెప్పుకునేటప్పటి భాషలోనే రాయడం ప్రారంభించాను. పేరుకూడా ” బాతాఖాని కబుర్లు” అన్ని పేరుపెట్టాను. నా అదృష్టం బాగుండి, చాలామందికి నచ్చింది. బ్లాగులోకంలో, ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకునే, అదృష్టం, ఆ భగవంతుడే కల్పించారని భావిస్తాను. ఏదో 900 పైగా పోస్టులు పెట్టాను.
నా అభిమానులని హింసించడం ఎందుకని, టపాలు తగ్గించి, అంతర్జాల పత్రిక గోతెలుగు.కాం లో , గత 100 వారాలనుండీ, వ్రాస్తున్నాను.వారు, నా గోల భరించలేక, నాకు ఓ ” కాలమ్ ” కేటాయించేశారు . ఎటువంటి ఆంక్షలూ లేకుండా, నాకు పూర్తి స్వతంత్రం ఇచ్చేశారు. అలాగని, అనవసరవిషయాల్లో వేలెట్టకుండా, రాస్తున్నాను.

    గత రెండు సంవత్సరాలనుండీ, బ్లాగు, అంతర్జాల పత్రికా, కాకుండా, అందరికీ దగ్గరయ్యే, వేదిక ఏదైనా ఉందా అని ఆలోచిస్తే, ముఖపుస్తకం భేషుగ్గా ఉంటుందని, దాంట్లోకి వచ్చేశాను. ఈ వేదికలో, అందరూ ప్రతీరోజూ, పెట్టే పోస్టులకంటే, different గా ఉండే విషయం అయితే బాగుంటుందనుకున్నాను. ఎలాగూ, ఈ తరం వారికి, అలనాటి ప్రముఖుల గురించి, అంతగా తెలిసుండదూ, పోనీ వారిగురించి గుర్తుచేస్తే , ఎలా ఉంటుందీ అనుకుని, అన్నిరంగాల్లోని ప్రముఖుల జయంతి / వర్ధంతి, తారీకులు వెదికి, ఏ రోజుకారోజు , సంబంధిత సమాచారం పెడుతున్నాను, నచ్చుతున్నాయనే భావిస్తూ.. ఎప్పుడో ఎవరో ” ఇంక ఆపండి మహాప్రభో.. enough is enough అనేదాకా.

   ఇదంతా ఎందుకు వ్రాశానంటే, తెలుగు భాషకి సంబంధించినంతవరకూ, నేను చేస్తూన్న కార్యక్రమం ఇదీ. ఎవరికో నచ్చుతుందనీ, సెహబాసీ వస్తుందని ఎప్పుడూ ఆశించలేదు. కానీ, ఎప్పుడైనా, ఎవరికైనా ఓ గుర్తింపు లాటిది వస్తే సంతోషంగానే ఉంటుంది. అదీ పరాయి రాష్ట్రమైతే ఇం….కా….. బాగుంటుంది కదూ… సరీగ్గా నావిషయంలో ఇదే జరిగింది. ఆమధ్యన, పూణె ఆంధ్రసంఘం ప్రముఖుడు, శ్రీనివాస్ గారు, ఫోను చేసి, అక్టోబర్ లో ” తెలుగుభాషా దినోత్సవం ” జరుపుదామనుకుంటున్నామూ, మీ అభిప్రాయం చెప్పండీ అన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా, మాతృభాష గురించి పట్టించుకుంటున్నారూ, అంటే సంతోషమేగా.

   అక్టోబర్ 3, ముహూర్తం అన్నారు. ఆ సందర్భంలో, పూణె లోని తెలుగు ప్రముఖలకి, ఓ ” చిరు సన్మానం ” కూడా చేద్దామనుకున్నారుట. ఆ ముగ్గురిలోనూ, నేను కూడా ఉండడం, నా అదృష్టం, ఆ భగవంతుడి ఆశీర్వాదం, పూణే ఆంధ్రసంఘం వారి సహృదయమూనూ.

   తిరుమల తిరుపతి దేవస్థానం, అధ్యక్షులు, శ్రీ చదలవాడ కృష్ణమూర్తిగారి, చేతులమీదుగా, సత్కరించబడడం, నా జీవితంలో మరుపురానిరోజుగా భావిస్తున్నాను. ఏజన్మలోనో చేసికున్న పుణ్యఫలం . బ్లాగులోకంలోనూ, ముఖపుస్తకం లోనూ, ఉన్న ఊరిలోనూ, గుర్ర్తింపు తెచ్చుకోడం, నేను చేసికున్న అదృష్టం, మీ అందరితోనూ, నా సంతోషం పంచుకుందామనే ఈ టపా….

   ఈ సందర్భంలో, ఆ సభలో సమయం కేటాయించి, ఫొటోలు తీసి ( మీ అందరికీ చూపించుకోవద్దూ ..మరీ) నాకు వెంటనే పంపించిన శ్రీ కొంపెల్ల వెంకట శాస్త్రిగారికీ, నాగురించి మంచి మాటలు ( నిజమో, కాదో ఆ భగవంతుడికే తెలియాలి ) చెప్పిన శ్రీ శ్రీనివాస్ గారికీ ధన్యవాదాలు.

   సర్వే జనా సుఖినోభవంతూ…
.