బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొత్తానికి మన దేశాధ్యక్షురాలు శ్రీమతి ప్రతిభా తాయ్ పాటిల్ గారు, తమకి ఇవ్వబోయిన ఇంటిస్థలాన్ని వదులుకున్నారుట! శుభం !!ఈమధ్యన రాజ్యసభకి మన ప్రభుత్వం వారు, సచిన్ తెండూల్కర్ నీ, రేఖానీ నామినేట్ చేశారుట ! వీరిద్దరూ ఏమి ఉధ్ధరిస్తారో చూడాలి! ఆ మధ్యనెప్పుడో, మన మెగా స్టార్ గారినీ రాజ్యసభకి పంపారు. వీళ్ళకి జీవితాంతం పెన్షన్ వచ్చేలా చేయడం తప్ప ఇంకో ఉద్దేశ్యమేమీ ఉందనుకోము. ఆ మధ్యనెప్పుడో హేమా మాలిని రాజ్యసభలో ఓ ప్రశ్న అడుగుతూండగా చూశాను. ఆవిడ పదవీ కాలం పూర్తయినట్టుంది, ఇప్పుడు రేఖా, అవునూ, మన మీడియా వాళ్ళకి పనేమీ లేదనుకుంటా, జయా బచ్చన్, రేఖా రాజ్యసభలో ఉండడంతో, వాడెవడో చానెల్ వాడి హెడ్ లైన్–” మరో సిల్ సిలా..” అని! వీళ్ళకి ఎందుకుట అసలు?

   ఈవేళ ఆదివారం ప్రొద్దుటనుంచీ మంచి కార్యక్రమాలు చూసే అదృష్టం కలిగింది. Very rare !! ఓ చానెల్ లో దాసరి నారాయణరావు గురించి, ఆయన తీసిన పాత సినిమాల క్లిప్పింగులూ, అలాగే కృష్ణకుమారి గురించి ఓ అరగంట కార్యక్రమం, మధ్యాన్నం విప్రనారాయణ సినిమా, ప్రొద్దుట సినారే గారితో ఇంటర్వ్యూ, చివరగా రాత్రి అక్కినేని గారితో ఇంటర్వ్యూ. వామ్మోయ్ ఒకేరోజులో ఇన్నిన్ని మంచి ప్రోగ్రాములా?

   నిన్న ఏమీ పనిలేక నెట్ కెలుకుతూంటే ఓ మంచి కార్యక్రమం దొరికింది. చాలా మంది చూసే ఉంటారు. లేకపోతే మాత్రం ఓసారి చూడండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, “ప్రవచనాలు” చెప్పడం లోనే దిట్ట అనుకున్నాను ఇన్నాళ్ళూ! కానీ ఈ గంటన్నర కార్యక్రమం చూశాక, అలాటివారు, ఏ విషయాన్నైనా అనర్గళం గా చెప్పేయగలరని తెలిసింది.
కార్యక్రమం పది భాగాల్లో ఉంది. ఒక్కోటీ పది నిముషాలకంటే తక్కువ. మొదటి భాగం ఇక్కడ. చివరి భాగం ఇక్కడ. మధ్యలోవి మీరే చూసుకోండి.

బతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “దాచుకోడం ….”

    ఈ “దాచుకోడం” అనే స్వభావం చాలా మందిలో చూస్తాము. కొందరికి మాట ” దాచుకోడం ” అలవాటూ, కొంతమందికైతే, ప్రతీ వస్తువూ ” దాచుకోడం” అలవాటూ. ఏదిఏమైనా ఈ “దాచుకోడం” అనేది ఓ in-built గా ఉండిపోతుంది. పుటాలెసినా వాళ్ళు బాగుపడరు. ఒకళ్ళకి పెట్టరు, ఇంకోళ్ళని అనుభవించనీరు. అలాగే వెళ్ళిపోతాయి వాళ్ళ జీవితాలు. పైగా తాము ఎంతో తెలివైనవారిమనే ఓ దురభిప్రాయం కూడా ఏర్పరచేసికుంటారు. కానీ ఇలాటి వారి ప్రవర్తన అవతలివారికి ఎంత ” అసహ్యం” గా ఉంటుందో అనేది మాత్రం వీళ్ళకి ఛస్తే తెలియదు! కనీసం తెలిసినా, దులిపేసికుని పోతారు

ఏదో ఇంట్లో ఒకళ్ళకైనా, పంచుకోడం అనే స్వభావం అంటూ ఉంటే, కొంతవరకూ పరవాలేదు. ,కానీ భార్యా భర్తలు ” దాచుకునే” category లోకి వస్తే, పిల్లలూ అలాగే తయారవుతారు. ఆ జనరేషన్ అంతా అలాగే కంటిన్యూ అయిపోతుంది.. beyond economic repairs అన్న మాట ! కానీ, పిల్లలు పై చదువులకి బయటి ప్రాంతాలకెళ్ళి ఏ హాస్టల్ లోనో ఉంటూన్నప్పుడు, పిల్లో/పిల్లాడో భోజనం టైములో వేసికుంటాడని ఏ పచ్చడో, సాయంత్రంపూటల్లో తింటాడని, ఏదో నాలుగు రోజులుండేటట్టు ఏ పిండివంటలో ఇచ్చి, “జాగ్రత్త నాయనా, ఊరికే ఫ్రెండ్సందరికీ పంచిపెట్టేయకు, జాగ్రత్త చేసికుని ఆరారగా తింటూ ఉండూ, నీ పెట్టెకో, కబ్బోర్డుకో ఓ తాళం కూడా వెయ్యే..” అని అంపకాలు పెట్టిమరీ ఇస్తుంది, “దాచుకోడం” category ఆవిడ ! అలా ఎలా కుదురుతుందీ, నలుగురూ కలిసి ఉండే చోటా? ఇంకోళ్ళని చూసి మొత్తానికి , ఆ చిన్నప్పటినుంచీ ఉన్న ఆ అలవాటు కొద్దిగా సడలించుకుని, అందరితోనూ పంచుకోడం అలవాటు చేసికుంటాడు. లేకపోతే వాడు ఆ హాస్టల్లో odd man out అయిపోతాడు. పోన్లెండి ఏ కారణమైతేనేం, మార్పంటూ వస్తుంది.

ఏదైనా సరే మనకున్నది ఇతరులతో పంచుకున్నప్పుడే సంతోషం. అంతేకాని ప్రతీ దానికీ, ఎక్కడలేని ” యావ” ఉండకూడదు. అందుకనేమో, ఈ రోజుల్లో చిన్నప్పటినుంచే నేర్పుతూంటారు, ప్రతీదీ share చేసికోవాలని. కొంతలో కొంత బాగుపడుతున్నారనే అనుకుందాం! కానీ ఒక్కొక్కప్పుడు చూస్తూంటాము, ఆఫీసుల్లో కొంతమందిని, ఏ న్యూ ఇయర్ కో కంపెనీల వాళ్ళు డయరీలూ, పెన్నులూ లాటివి.ఏదొ పెద్ద పొజిషన్ లో ఉన్నాడు కదా, ఆ ఆఫీసులో ఉండే అందరికీ ఇస్తాడూ, అని ఓ పదో పదిహేనో డయరీలూ, పెన్నులూ ఇచ్చివెళ్తాడు. పాపం మన ” ఆఫీసరు” గారికి, ఇంకోళ్ళతో పంచుకోడం, అలవాటు లేదాయే, ఆ వచ్చినవన్నీ తన డ్రాయరు లో పెట్టి తాళం వేస్తాడే తప్ప, పోనీ ఇంకోళ్ళకి ఇస్తే వాళ్ళూ సంతోషిస్తారని మాత్రం తట్టదు! పోనీ అవేమైనా ఈయన డబ్బెట్టి కొన్నాడా అంటే అదీ లేదూ. అన్నేసి డయరిలు నెత్తినేసి కొట్టుకుంటాడా? లేకపోతే పోయేటప్పుడు కూడా తీసుకుపోతాడా? ఏమిటో డయరీలని కాదు, ఊరికే ఉదాహరణకి చెప్పాను. చివరకి రిటైరయినప్పుడు, కబ్బోర్డు ఖాళీ చేస్తూంటే, కనిపిస్తాయి, ఎప్పడెప్పడివో డయరీలూ, రీఫిల్స్ ఎండి పోయిన బాల్ పెన్నులూ, ఎవడు బాగు పడ్డట్టూ ? పోనీ ఇంటికైనా తీసికెళ్ళాడా అంటే అదీ లేదూ, ఇంట్లో భార్యకి ఏ చాకలి పద్దు రాసుకోడానికో , పిల్లల రఫ్ వర్కు కో అయినా ఉపయోగించేవి ! అసలు అలాటి పంచుకోడం అనే గుణం లేనివాడికి ఎంతచెప్తే లాభం ఉంటుంది చెప్పండి?

ఇంకొంతమందుంటారు- మనం పైఊళ్ళకి వెళ్తూంటాము,మరీ ఒఠ్ఠి చేతుల్తో వెళ్తామా ఏమిటీ ఏదో ఇంట్లో అందరూ తింటారని ఏదో ఒకటి తీసికెళ్తాము కదా, ఆ ప్యాకెట్టు తీసేసికుని, పిల్లలకి కూడా అందకుండా, దాచేస్తుంది కానీ, ఛస్తే ఇంకోళ్ళతో ఆఖరికి ఇంటాయనతో కూడా పంచుకోదు! చివరకి ఆ వెర్రిబాగులమనిషి, అడగనే అడుగుతాడు, పాపం ఆయనకి తిండి యావ- వాళ్ళేదో తీసుకొచ్చినట్టున్నారూ, ఓ ప్లేటులో వేసి తెస్తే అందరూ తింటారు కదే! అని. చివరికి ఏమీ చేసేది లేక, ఆవిడ ఆ ఫ్రిజ్జులోనో, ఇంకెక్కడో ” దాచేసిన” పాకెట్టులోంచి, అక్కడున్న నలుగురికీ, లెఖ్ఖేసి నాలుగంటేనాలుగే తెస్తుంది. ఆ స్వీట్లు తెచ్చినవాళ్ళనుకుంటారు, అర్రే మనం కిలో కదా తెచ్చిందీ,ఇదేమిటీ ఈవిడ అంత కక్కూర్తిగా దాచేసిందీ, అని మొహమ్మాటానికి తీసికోడం మానేస్తారు, పోనిద్దురూ పిల్లలు తింటారూ అని. పుటుక్కుమని ఆ మిగిలినవి, తీసేస్తుంది.

ఇంకో రకం ఉంటారు, ఎవరైనా తీసికొస్తే చాలు, ఆ తెచ్చిందేదో పక్క వాళ్లకీ, భోజనాలు చేసే టైములో డైనింగ్ టేబుల్ మీదా పెట్టేయడం. అదేమిటండీ, ఇంట్లో వాళ్ళు తింటారని మేము తెస్తే, ఇదేమిటీ మాకే పెట్టేస్తున్నారూ అంటారు. ఏదో ఊరికి వెళ్తే, రోజంతా ఇంట్లోనే కూర్చోము కదా, ఏదో పాత పరిచయం ఉన్నవాళ్ళని కలుసుకుందుకు వెళ్తాము. ఏదో, చాలా కాలం తరువాత వచ్చేరూ అని, వెళ్తూంటే, ఓ జాకెట్టు పీసూ, ఓ కిలో స్వీట్లూ చేతిలో పెడతారు. ఇంటికెళ్ళిన తరువాత, అవేమీ పెట్టిలో పెట్టి దాచుకోము కదా, పైగా ఏ చీమలో పట్టినా, పాకం అంతా కారినా అదో గొడవా,దీంతో, ఆ ఇంటావిడకిచ్చి, అందరూ తింటారులే, ఏ ఫ్రిజ్జ్ లోనో ఉంచు అని చేతిలో పెడతాము. ఇంకా ఆ స్వీట్స్ కి మనది అదే “ఆఖరి చూపు” ! మనం అక్కడున్నన్ని రోజులూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా, ” మీరు మొన్న వాళ్ళెవరింటికో వెళ్ళినప్పుడు, తెచ్చిన స్వీట్లు..” అంటూ, ఓసారి పెడితే ఏం పోయిందిట వాళ్ళ సొమ్మూ? పోనీ వాళ్ళేమైనా డబ్బెట్టి కొన్నవా, వీళ్ళొచ్చారుకాబట్టే కదా ఇంట్లోకి వచ్చేయీ, అని కూడా అనుకోకుండా దాచేసికోడం ! ఓ పండనండి, పువ్వనండి, ఏదో నాలుగు పూటలు తిండి పెడుతున్నామూ, అందువలన, వీళ్ళ ” సంపాదన” అంతా మాకే ఇవ్వడం విధాయకమూ అనుకుంటూంటారు!

అలాగని అందరూ అలా ఉంటారని కాదు, కొంతమందైతే, ఊళ్ళోవాళ్ళకోసమే బతుకుతూంటామనుకుంటారు. ఇంట్లో ఏం చేసినా, రోడ్డుమీద పోయేవాడిని కూడా పిలిచి పంచుకునే స్వభావులు. అందుకే అంటారు, బతికినన్నాళ్ళూ పదిమంది చెప్పుకోవాలి కానీ, అమ్మయ్యా ఓ గొడవొదిలిందిరా బాబూ అని కాదు. ఇప్పటికే ఈ టపా మరీ పెద్దదయిపోయింది. “మాట” దాచుకునే వారి గురించి ఇంకో టపాలో…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– తిక్క శంకరయ్యలు….

   మాట్టాడడం అనేది ఓ కళ. అందరికీ అబ్బదు. కొంతమంది చూడండి, ఎంతసేపైనా మాట్టాడాలనిపిస్తుంది. కొంతమందితో, అసలు ఎందుకు పలకరించానురా బాబూ అనుకుంటాము.

   స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ కొందరు గురువులు, చెప్పిన పాఠాలు ఎన్నేళ్ళైనా గుర్తుండి పోతాయి, దానికి కారణం వారు బోధించిన పధ్ధతీ, వారి మాటతీరూ, వారు చూపించిన ప్రేమాభిమానాలూనూ. చెప్పొచ్చేదేమిటంటే, ఎవరితొనైనా మాట్లాడాలంటే ఈ గుణాలన్నీ ఉండాలి అని. చిన్నప్పుడు నేర్చుకున్న ఈ ప్రవర్తన నూటికి తొంభై మందిలో హత్తుకుపోతాయి. అలాటివారు, జీవితంలో ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించుకుంటారు. కానీ ఆ మిగిలిన పది శాతం ఉన్నారే, వారిని గురించన్నమాట ఈ టపా !

   మన బస్ స్టేషన్లలో చూస్తూంటాము ఓ పరకో పాతికో ప్లాట్ ఫారాలుంటాయిబోర్డులు కూడా ఉంటాయనుకోండి, ఏ కొత్తవాడికో, ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో ఛస్తే తెలియదు. అంతా అయోమయం, అధ్వాన్నంగా ఉంటుంది. పోనీ ఎంక్వైరీ కి వెళ్దామా అంటే, సామాన్లెవడైనా కొట్టేస్తాడేమో అని భయం, అలాగని కూర్చున్న సీట్ వదిలేస్తే మళ్ళీ దొరుకుతుందో లేదో అని భయం, పోనీ ఆ సామాన్లనన్నింటినీ మోసుకెళ్ళే ఓపికా ఉండదు.ఇదిగో ఇలాటి విపత్కర పరిస్థితుల్లో ఓ “పెద్దమనిషి” లాటివాడు కనిపించాడనుకోండి, ఈయన్ని అడిగితే ఏమైనా తెలుస్తుందేమో అని పలకరించడం. సాదా సీదా మనిషైతే, తనూ కొత్తవాడిననో, లేదా తనక్కూడా తెలియదనో చెప్పేస్తాడు. గొడవ లేదు. ఇంకో మనిషిని అడుగుదామా అనుకుని, ఇంకోణ్ణి కెలుకుతాము. ” నేనేమైనా ఏపి.ఎస్.ఆర్.టి.సి వాణ్ణనుకున్నారా, నాకుమాత్రం ఏం తెలుస్తుందీ, కావలిస్తే ఇంక్వైరీకి వెళ్ళి అడగండి…” అని మొహం చిటపటలాడుతూ సమాధానం ఇస్తాడు. తెలిస్తే చెప్పొచ్చూ, లేకపోతే తెలియదనేస్తే, ఆయన్నేమైనా తినేస్తామా ఏమిటీ? అలా ఉంటుంది ఒక్కొక్కళ్ళ ప్రవర్తన.సౌమ్యంగా సమాధానం చెప్తే ఆయన సొమ్మేమీ పోదు, తాము ఎంత తిక్కశంకరయ్యో ప్రపంచం అంతా తెలిసికోవాలి ! ఎవరినైనా ఖర్మ కాలి టైమెంతయిందండీ అని అడగండి, సరైన వాడు సమాధానం చెప్తాడు. ఈ రెండో రకం వాళ్ళు “భూతంలా అంత పెద్ద గడియారం కనిపిస్తూంటే, కనిపించి చావడం లేదా..” అని.

   ఎప్పుడైనా ఏ పచారీ కొట్టుకో వెళ్తామనుకోండి, సాధారణంగా మనం ఫలానా వస్తువుందా అని అడిగితే, ఉందనో, లేదనో, అదీకాకపోతే తెప్పిస్తాననో చెప్తాడు. కానీ, కొన్ని చోట్ల చూస్తూంటాము, అసలలాటివి మా కొట్లోనే ఉంచమూ అంటాడు, అక్కడికేదో మనం ఏ sub standard బ్రాండోఅడిగేమన్నట్టు పోజెడతాడు. పక్కవాళ్ళ దృష్టిలోకూడా మనం అపహాస్యం పాలవుతూంటాము! నేను రాజమండ్రీ లో, “కోతికొమ్మచ్చి” పుస్తకం కొనాలని, ఓ ప్రఖ్యాత పుస్తకాల షాప్పు కి వెళ్ళి అడిగితే, “అలాటి పుస్తకాలు మా కొట్లో పెట్టమండి..” అని సమాధానం వచ్చింది! పోనీ ఎన్నో సాహిత్య విలువలున్న షాప్పూ, లైటు గా ఉండే పుస్తకాలు పెట్టరేమో అనుకుందామా అంటే అదీ కాదూ, వాళ్ళ షో కేసులో సినిమా పుస్తకాలూ, కొక్కోక శాస్త్ర పుస్తకాలూ కావలిసినన్నున్నాయి ! ఇంకో కొట్టుకి వెళ్ళి రమణ గారి పుస్తకం వచ్చిందా అని అడగ్గానే, ముళ్ళపూడి వారా, శ్రీరమణ గారా అని అడిగాడు.అదీ తేడా!
ఎప్పుడు పుస్తకాలు కావలిసివచ్చినా, రాజమండ్రీలో ఉన్న ఏణ్ణర్ధమూ ఆ కొట్టుకే వెళ్ళేవాడిని.

    ఈ సోదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈవేళ ప్రొద్దుట, బయటకి వెళ్తూ లిఫ్ట్ లో మా పై అంతస్థులో ఉండే ఆయన్ని కలిశాను. ఎప్పుడూ ఏదో గ్రైండర్ చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. ఎవరో చెప్పగా విన్నాను- ఇడ్లీ,దోశా లాటివి చేసి బయటి ఆర్డర్లుకూడా తీసికుంటూంటారూ అని.ఎప్పుడైనా అవసరం వస్తే దగ్గరలోనే ఉంటారూ, కావలిసినవేవో తెప్పించుకోవచ్చూ అనుకుని, పైగా ఆయన చేతిలో, ఓ పెద్ద స్టీలు డబ్బా, ఇంకో ప్లాస్టిక్ డబ్బా కూడా చూసి, ఎవరికైనా డెలివరీ చేయడానికి తీసికెళ్తున్నారేమో అనుకుని, హిందీలోనే ” మీ ఇంట్లో ఏమైనా తయారు చేస్తూంటారా…” అన్న పాపానికి నాకొచ్చిన సమాధానం.. ” మా ఇంట్లో సిగరెట్టులు, ఘుట్కా లాటివి తయారుచేయమూ...’ అని! ఇదెక్కడి గొడవరా బాబూ, వాటన్నిటిని గురించీ ఎక్కడడిగానూ, అని ఆలోచించాను. మళ్ళీ ఇంకోసారి అడిగాను ఇడ్లీ దోశా లాటివీ అని.” చేస్తూంటామూ, పిల్లలు తినాలన్నప్పుడు, తప్పా...”. ఏమిటో అర్ధం అవలేదు నాకు
అసలు ఏం తప్పు మాట్టాడేనో అని. తనిష్టం వచ్చినవి చేసుకోనీ, ఏ గంగలో దూకనీ అసలు నాకెందుకూ?

   జోక్కు ఏమిటంటే, స్టీలు డబ్బా, కారు డిక్కీ లో పెట్టుకుని తను కారులోనూ, బస్సెక్కుదామని నేనూ బయలుదేరాము. బస్ స్టాప్ కి వెళ్ళే దారిలో, ఓ హొటల్ లాటిదుందిలెండి, ఆ మనిషి, తన కారు ఆపి ఆ డబ్బాలను హొటల్లో డెలివర్ చేయడం !! నేను అడిగినప్పుడు చెప్పొచ్చుగా, మేము చిన్న చిన్న ఆర్డర్లు తీసికోమూ అని, గొడవుండదు. ఇదిగో ఇలాటి వాళ్ళనే తిక్కశంకరయ్యలంటారు.

    అలాటి వారినుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదీ, కానీ తెలిసికోడం ఎలా ? ఓ నాలుగైదు అనుభవాలయితే అదే తెలుస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలీ అని!

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

   అదేమిటో కొందరు ఎక్కడైనా కాలెడితే, ఎక్కడలేని ఉపద్రవాలూ వచ్చేస్తూంటాయి. నేనూ, ఇంటావిడా 2004 లో దక్షిణ దేశ యాత్ర చేసి వచ్చిన ప్రాంతాలన్నీ, “సునామీ” వచ్చేసి కొట్టుకుపోయాయి ! ఆ తరువాత ఈ మధ్యన ఉప్పాడ వెళ్ళేటప్పటికి, కొద్దిరోజులకే అక్కడ కూడా “సునామి” హెచ్చరిక వచ్చేసి, ఉపద్రవం జరగబోతూ ఆగిపోయింది! తేడా ఏమిటంటే, మేము ఇద్దరమూ కాకుండా, ఇంకోరు( మా కజినూ, భార్యా) కూడా ఉండడం వల్లనేమో ఉపద్రవం వస్తూ వస్తూ ఆగిపోయుండొచ్చు !

   కిందటేడాది అబ్బాయీ,కోడలూ మనవరాలూ,మనవడితో ఇక్కడకు దగ్గరలో ఉన్న దివేఘర్ అని, కొంకణ్ తీరం లో ఉన్న ఒక రిసార్ట్ కి వెళ్ళాము. అక్కడి ప్రత్యేకత , సువర్ణ గణపతి విగ్రహం గురించి, మా ఇంటావిడ ఓ టపా కూడా పెట్టింది. మా పాదమహిమ వలన ఇక్కడ జరిగిన ఉపద్రవం ఏమిటంటే, ఆ సువర్ణ గణపతి విగ్రహాన్ని ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు ! చెప్పానుగా ఇద్దరం వెళ్తేనే గొడవంతా, పిల్లలు కూడా ఉండడం తో ఆ ఉపద్రవం తప్పిపోయినట్టే. విగ్రహ దొంగల్ని పట్టుకున్నారుట !

    Moral of the story ఏమిటంటే… లోకకల్యాణార్ధం నేనూ మా ఇంటావిడా కలిసి మాత్రం ఎక్కడికీ వెళ్ళకూడదూ అని !! అలాగని, అస్సలు వెళ్ళకూడదని కాదూ, ఎవరో ఒకరిని తోడు తీసికునే వెళ్ళమనీ… freedom fighters కీ వాళ్ళకీ రైళ్ళల్లో వెళ్ళేటప్పుడు తోడుండాలంటారు అలాగన్నమాట !!

   ఈమధ్యన http://www.tenderleaves.com/ తరపున మా అబ్బాయి హరీష్, కోడలు శిరీష చిన్న పిల్లలకి ఓ summer camp నిర్వహిస్తున్నారని ఆ మధ్య ఓ టపా వ్రాశాను. అక్కడ జరుగుతున్న కొన్ని కార్యక్రమాల ఫొటోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కాడా( కొత్త బంగారు లోకం..!!) చూడండి.

   ఈ హడావిడిలో ఉండి టపాలు వ్రాయడం కొద్దిగా వెనక్కి వెళ్ళింది…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “పాత” బొమ్మలకే ప్రాణం వస్తే….

   ఈరోజుల్లో ఎక్కడ చూసినా కలరే కలరు. అసలు Black & White గురించే మర్చిపోయారు. చాలామంది దగ్గర ఇప్పటికీ, ఎన్నో ఏళ్ళ క్రితం తీయించుకున్న ఫొటోలు ఉండే ఉంటాయి. ఆ రోజుల్లో ఫొటోలు తీసికోడానికి ఎంత కథా, ఎంత కమామీషూ ఉండేదో!! అసలు ఫొటోలకి దిగడమే ఓ పండగలాగుండేది. ఫొటోలకి దిగేముందర హడావిడీ, కుటుంబ సభ్యులందరూ కలవాలి, వాళ్ళల్లో ఇంటల్లుళ్ళకి ” అలకలు” రాకూడదూ, ఆడాళ్ళందరికీ ఏ “ఇబ్బందీ” ఉండకూడదూ, మరి అలాటిదేదైనా వచ్చిందో, వాళ్ళ “స్నానం” అయ్యేదాకా ఆగాలి, మొత్తానికి ఇవన్నీకలిసొచ్చి, ఓరోజేదో కుదుర్చుకునేవారుఫొటోలకి దిగడానికి. ఫొటో తీసే సమయానికి “సూరీడు” మేఘాల చాటుకి వెళ్ళిపోకూడదూ, అబ్బ ఎంత హడావిడండి బాబూ. ఆ ఫొటోలు తీసినవాడేమో, నాలుగైదు రోజులు పోయిన తరువాత కాపీలిచ్చేవాడు. వాటిని ఓ “అట్ట” మీద అంటించి మరీనూ. ఆ కార్యక్రమాల గురించి ఇదివరకెప్పుడో ఓ టపా, రెండు భాగాల్లో వ్రాశాను. ఇప్పటి తరానికి అసలు బ్లాక్ ఎండ్ వైట్ చూస్తేనే ఎలర్జీ. అందుకోసమే అనుకుంటా, మన పాత కళాఖండాల్ని కలరులోకి మార్చి మరీ చూస్తున్నారు. ఎన్ని చెప్పండి, ఒరిజినల్ లో ఉన్నది రంగు మార్చేస్తే అయిపోతుందా? రంగులు మార్చేవాటిని అదేదో ” ఊసరవెల్లి” అనో ఇంకోటేదో అంటారనుకుంటాను. పైగా ఈ “ఊసరవెల్లి” అన్న పదం, నెగెటివ్ అర్ధంలో వాడతారు ! ఎందుకొచ్చిన గొడవా, హాయిగా వాటి దారిన వాటిని ఉండనీయకా? అదేదో డాల్బీ సౌండో ఏదో అంటారు, పోనీ దాన్నేదో మార్చేసికుని, రంగులు మాత్రం వాటి దారిన వాటిని వదిలేస్తే బాగుంటుంది. అలాగే పాత సినిమా పాటల్ని, అదేదో ” రీమిక్స్” అని పేరు పెట్టి తగలేస్తున్నారు. ఎవరి వెర్రి వాళ్ళకి ఆనందం అనుకుంటాను.

ఎక్కడో మొదలెట్టి ఎక్కడకో వెళ్ళ్ళిపోయాను. బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోల గురించి కదూ మొదలెట్టామూ, ఇప్పుడంటే అవేవో డిజిటల్ ఫ్రేములూ, ఇంకా ఏవేవో సాధనాలొచ్చాయిగానీ, ఆ రోజుల్లో ఇవన్నీ ఎక్కడ చూశామండి బాబూ? అందరిదగ్గరా కాకపోయినా, కొద్దిమంది దగ్గర “డబ్బా” కెమేరాలుండేవి. KODAK, AGFA లాటివి. ఎప్పుడో ఏ పిక్నిక్కులకి వెళ్ళినప్పుడో, పిల్లలు ఆడుకుంటున్నప్పుడో, అలా వివిధ స్టేజీల్లోనూ ఫొటోలు తీసుకోడం. ఆ ఫొటోలన్నిటికీ ప్రింట్లు తీసికోడం, వాటన్నిటినీ ఓ ఆల్బం లాటి దాంట్లో ఏ లైపిండో, జిగురుతోనో అంటించడం, తరువాత్తరువాత, ఈ అంటించడాలు మానేసి, సుతారం గా అవేవో అట్ట కార్నర్లు తయారుచేసి, వాటిలో దోపడం,తరువాత ప్లాస్టిక్ కవర్ లు ,ఒక్కోదానిలో రెండేసి ఫొటోలూ అలా వివిధ రకాలుగా, ఆ ఫొటోలకి ప్రాణం పోసేవారు. ఏ చుట్టాలొచ్చినప్పుడో వాళ్ళ మొహాన్న ఈ “ఆల్బం” లు పడేసి, పని చూసుకునేవారు. సంసార తాపత్రయాల్లో పడి, ఎక్కడో కబ్బోర్డ్ లో ఉండిపోయేవి. కాలక్రమేణా ఆ ” నలుపూ,తెలుపూ” ఫోటోలు, ఓ పాలిథీన్ కవర్లలోకి వచ్చేస్తాయి. ఒక్కసారైనా చూడడానికి సమయమూ ఉండదూ, మూడ్డూ ఉండదు. సావకాశం కూడా ఉండదు.

పిల్లల చదువులే చూసుకుంటారా, ఇళ్ళు కట్టడాలూ, పిల్లల పెళ్ళిళ్ళ గురించే ఆలోచిస్తారా? వీటి మధ్యలో పాత ఫొటోలు చూసుకుని సంతోషించే luxury కూడానా.అలాగని వాటిని ఎక్కడో పారేశారని కాదూ, పాపం ఆ ఫొటోలన్నీ “ముంగి” లా మూతి ముడుచుక్కూర్చుంటాయి poor memories !! అలాటి ఫొటోలకి అకస్మాత్తుగా ప్రాణం వచ్చేస్తుంది. ఎప్పుడూ,ఉద్యోగ సద్యోగాలు పూర్తిచేసికుని, పిల్లల్ని ఓ స్థాయి కి తెచ్చేసి, వాళ్ళ పెళ్ళిళ్ళూ, పురుళ్ళూ పూర్తిచేసి, సావకాశంగా కూర్చున్నప్పుడు. ఈ ప్రస్థానం పూర్తయి, వానప్రస్థం లోకి వచ్చినప్పుడు. ఈ లోపులో ఇంటాయనకి ఓ బొజ్జా, బట్టతలా, కాళ్ళనొప్పులూ వగైరా వగైరాలు వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో భార్యమీద చిరాకులూ, పరాకులూ, వైరాగ్యాలూ, ఒకటేమిటి, అసలు ఈ పెళ్ళనేది ఎందుకు చేసికున్నమురా బాబూ అని అనుకునేదాకా!

అదిగో అక్కడే ఒక్కసారి పాత ఫొటోలు తీసి చూసుకోండి, You will be in cloud 9 !! మనల్ని నమ్ముకుని ముఫై ఏళ్ళ క్రితమో, నలభై ఏళ్ళ క్రితమో, మన వెనక్కాలే వచ్చేసిన ఇంటి ఇల్లాలు ఫొటో ఓసారి చూడండి. అర్రే తనుకూడా ఎంత అందంగా ఉండేదో, చెప్పాలంటే నాకంటే తనే బావుందేమో అనేలా అనిపించేస్తుంది. పైగా అదో రకమైన feeling of diffidence వచ్చేస్తుంది. అనుకుంటాముకానీ, అందం, నాజూకుతనం లో తనుమాత్రం ఎవరికి తక్కువా, పైగా ఆరోజుల్లో ఈ బ్యూటీ పార్లర్లూ, ఫేస్ ప్యాక్కులూ, ఫౌండేషన్లూ ఉండేవి కావు. అంతా సున్నిపిండీ, పసుపూ, కుంకుడుకాయల మహాత్మ్యం!Pure and original stuff. No artificiality. ఎక్కడైనా “బట్టతల” వచ్చిన స్త్రీలని చూశామా?మహ అయితే బారుగా ఉండే “జడ” , ఈరోజుల ఫ్యాషను “కొత్తిమిరి కట్ట” లోకి దిగుండొచ్చు.పైగా ఆ వచ్చిన మార్పులన్నీ కూడా మనవలనే. పిల్లల్ని కనాలి, అత్తమామల్ని చూసుకోవాలి, ఈ “మొగుడనబడే” వాడి వెధవ్వేషాలు భరించాలి, కానీ, ఆ మొహం లో కళలో ఎలాటి మార్పూ ఉండదు. మార్పనేది మన ( మొగుళ్ళ) ఆలోచనల్లోనే!!దిక్కుమాలిన సినిమాలూ, టీవీ లూ చూసి అసలు మన బెంచ్ మార్కే మారిపోయింది.

అలాటప్పుడే ఈ పాతఫొటోలు సీన్ లోకి వచ్చేస్తాయి. ఈ టపా చదివిన తరువాత, ఒక్కసారి ఈ ఇంట్లో ఉన్న నలుపూ తెలుపూ ఫొటోలు ఓసారి చూసుకోండి. నేను చెప్పింది ఎంత “అక్షరసత్యమో” తెలుస్తుంది. మన ఇంట్లో మొదటి బిడ్డ పుట్టినప్పుడు తీయించుకున్న ఫొటో, బిడ్డని వళ్ళో పడుక్కోబెట్టుకుని, కళ్ళల్లో ఆనందం ప్రకటిస్తూ… అసలు ఆ మూమెంట్స్ మళ్ళీ రమ్మంటే వస్తాయా? ఆ ఫొటోలు చూస్తూ, గడచిన నలభైఏళ్ళ జీవితమూ, ఓ సినిమా రీల్ లా మన కళ్ళముందర ప్రత్యక్షం అవుతుంది. మన వానప్రస్థానికి అదో టానిక్కు లాటిది. ఇదంతా ఇప్పటి వారికి చిత్రంగా కనిపించొచ్చు. మీరైనా సరే, అమ్మ ఒడిలో ఎలా ఉన్నారో, ఎంత అమాయకంగా ఉన్నారో, కాలక్రమేణా, ఎంత ” తెలివైన” వారిగా మారేరో analyse చేసికోవచ్చు.

ఏదో ఇలా nostalgia లోకి వెళ్ళి ప్రస్తుతం చూస్తూన్న, కలర్ యుగాన్ని, ఏదో కించపరుస్తున్నాననుకోకండి. దేని గొప్ప దానిదే. మీ ఇళ్ళల్లో ఉన్న నలుపూతెలుపూ ఫొటోలని, మిగిలిన వస్తువుల్లా, వదిలించేసికోకండి. వాటి దారిన వాటిని ఎక్కడో అక్కడ ఉండనీయండి. 20-25 years down the line ఎప్పుడో ఒకప్పుడు వాటిని చూస్తూ, మీ జీవితం హాయిగా గడిపెయొచ్చు. అప్పుడు తెలుస్తుంది “అరే పాపం ఆయనెవడో చెప్తూనే ఉన్నాడు” అని !

సర్వేజనా సుఖినోభవంతూ… Long live Black and White Photos… These sweet memories revitalize your dull moments…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– శ్రీరమణ గారి అవేదన…

    ప్రతీ ఆదివారం రాత్రి hmtv లో వస్తున్న “వందేళ్ళ తెలుగు కథకి వందనాలు” కార్యక్రమం లో నిన్న, శ్రీరమణ గారి “మిథునం” కథానిక మీద కార్యక్రమం వచ్చింది. ఆ సందర్భంలో శ్రీరమణ గారు తాను వ్రాసిన ” బంగారు మురుగు” ప్రస్తావిస్తూ, తనకు ఎక్కడినుంచో ఒకావిడ ఉత్తరం వ్రాశారని చెప్తూ, “బంగారు మురుగు” లో వ్రాసినట్టు, ఈ రోజుల్లో అమ్మమ్మలూ, నానమ్మలూ ఉండడం లేదనీ, ఆ ఉత్తరం వ్రాసినావిడ, తన అత్తగారికి, మనవణ్ణి చూడడం అసలు ఇష్టమే లేదనీ, అసలు వాడి గురించి పట్టించేకోరనీ వ్రాశారుట. దీనికి శ్రీరమణ గారు స్పందిస్తూ అన్నమాట చాలా బావుంది. అసలు ఈ తరం వారికి అమ్మమ్మ/నానమ్మ ల విలువలేమిటో తెలుసునా అని. అమ్మమ్మ/నానమ్మ ల ప్రేమా, అభిమానమూ ఆస్వాదించిన వారికే ఈ విషయాలు తెలుస్తాయి.ఇది అక్షరసత్యం. ఆయన ఇంకా మాటాడుతూ, తాను ఆస్వాదించిన క్షణాలనే, “మిథునం”, ” బంగారు మురుగు” కథలకి అక్షరరూపం గా మలిచానన్నారు. ఔనుకదూ, ఏదో పుస్తకాల్లో చదివితేనూ, ఎవరో చెప్తేనూ కాదు, స్వయంగా ఆస్వాదించినవారికే తెలుస్తాయి, వీటిలో ఉన్న ఆనందాలు ఏమిటో. ఆవిడెవరో వ్రాశారంటే వ్రాయరూ మరి. తన అత్తగారికి మనవడంటే అసలు పట్టించేకోరనీ వ్రాశారంటే, ఈవిడ ఆ అత్తగారికి అసలు ఆ ఆస్కారమే ఇచ్చారా లేదా అన్నది కూడా చూడాలిగా. నాణేనికి రెండు వైపులా చూడాలి. అత్తగారేదో చూడడంలేదని చెప్పడం, ఈతరం వారికి నచ్చొచ్చు. కారణం, ఈతరంలో అత్తమామలకి/ తల్లితండ్రులకీ పిల్లలదగ్గరనుంచి లభిస్తున్న సో కాల్డ్ ” ఆదరణ”. ఏదో పిల్లో పిల్లాడో పుట్టి, ఆ పసిపిల్లకి జ్ఞానం వచ్చేదాకానే, వీళ్ళ అవసరం. ఆకలేస్తే అడిగే స్టేజ్ వచ్చిందంటే, ఇక ఈ “ముసలి” వాళ్ళ అవసరం ఉండదు. అప్పటిదాకా, ఇంటికి వచ్చే Cook, Maid లతోపాటు వీళ్ళూనూ. ఆర్ధిక కెపాసిటీ ఉన్నవాళ్ళైతే విడిగా, ఓ పిల్లని పెట్టుకుంటారు. అలాటప్పుడు ఈ పేరెంట్స్ reduntant అయిపోతారు. ఏ కారణం చేతైనా అలా పెట్టుకోలేకపోయారో, ఈ నానమ్మలు/అమ్మమ్మలు తప్పనిసరి. బయటకు వెళ్ళేటప్పుడు ఎత్తుకోడానికి ఉండాలి. భార్యా భర్తా, అప్పటికే ఉన్న పెద్ద పిల్లో/పిల్లాడో కలిసి ఆడుకోవద్దూ మరి, అలాటప్పుడు, ఈ పసిపిల్లని చూడ్డానికోళ్ళుండొద్దూ? అందుకుపయోగిస్తారు ఈ గ్రాండ్ పేరెంట్స్.Buy one get one లాగ తాత ఫ్రీ అన్నమాట!

   ఇంకో విషయం, తల్లితండ్రులు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటారు పిల్లలు, కనీసం పెళ్ళైదాకానైనా! వారి ప్రవర్తనే వీళ్లకి మార్గదర్శనం. ప్రవర్తన మాట దేముడెరుగు, ఈ పిల్లల ఎదురుగా, పెద్దవాళ్ళగురించి తేలికగా మాటాడినా, ఇంక ఆ పిల్లలకి అమ్మమ్మా/నానమ్మ లమీద గౌరవం, దగ్గరతనం రమ్మంటే ఎక్కడొస్తుందీ? గ్రామాల్లో ఇంకా ఆ అమ్మమ్మా/నానమ్మా మనవళ్ళ మధ్య ఆ ఆప్యాయతలూ అవీ ఉన్నాయి. నగరాల్లో ఉండే వారితోనే వస్తోంది చిక్కంతా. ఎక్కడో ఏదో మిస్ అవుతోంది. ఏ అమ్మమ్మా/నానమ్మా తన మనవల్నీ మనవరాళ్ళనీ దగ్గరకు తీసికోనని ఎప్పుడూ చెప్పరు. ఈ విషయం మీద అప్పుడెప్పుడో ఓ టపా కూడా వ్రాశాను.

    కొద్దిగా జ్ఞానం వచ్చినప్పటినుండీ జరిగేది తెలుసుగా, తన పిల్లలు తమకి ఎక్కడ దూరం అయిపోతారో అన్న insecure feeling ఒకటొచ్చేస్తుంది. దానితో క్రమక్రమంగా పిల్లలకీ, grand parents కీ మధ్య ఎడం ఎక్కువవుతూంటుంది. అప్పటిదాకా కలిసుండి ఏదో కారణం చేత విడివిడిగా ఉన్నారంటే, ఈ పిల్లల మీటింగులు స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే కీ, వీకెండ్స్ లో, జరిగే సోకాల్డ్ కర్టిసీ కాల్స్ కీనూ. వచ్చిన గొడవల్లా పిల్లలకీ, వారి తల్లితండ్రులకే కలవడం కుదరని ఈరొజుల్లో ఇంక “బంగారు మురుగులు” చూసే అదృష్టం ఎక్కడా?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పోన్లెద్దూ.. Syndrome..

   మనలో చాలామందికి ఈ “పోన్లెద్దూ” అనో, ” जानॅ दी यार्….” అనో, “Let it be..” అనో ఉంటుంది.
ఎందుకొచ్చిన గొడవా అనైనా కారణం కావొచ్చు, లేదా సహసిధ్ధంగా అన్నిటితోనూ సద్దుకుపోయే స్వభావం కావొచ్చు. ఏది ఏమైనా ఇలాటి మనుషులు ని exploit చేసేవారు చాలా మందుంటారు.
అవతలి వారిలోని మంచితనం కనిపించదు. అదేదో వారి బలహీనత అనుకుంటారు.ఛాన్స్ దొరికితే చాలు అవకాశం తీసేసికుంటారు. పైగా ఇలాటివారి స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా అందరికీ ఓ అభిప్రాయం కూడా ఏర్పడిపోతుంది. ఫరవాలేదు మనవాడే అని లోకువైపోతాడు. ప్రస్తుత వాతావరణం లో ఇలాటి వారు చాలా నష్టపోతూంటారు.

   ఆఫీసుల్లో చూస్తూంటాము. కొంతమంది “పనిదొంగలు ” ఉంటూంటారు. వీళ్ళకి రోజంతా పని ఎలా ఎగ్గొట్టడమా అనే ఆలోచిస్తూంటారు. సడెన్ గా ఎక్కడినుంచో ఫోనొచ్చిందీ అని ఓ వంక పెట్టి, ఇదిగో మన “పోన్లెద్దూ” మాస్టారి దగ్గరకు వెళ్ళి, “బాబ్బాబు, ఈ ఫైలు చాలా అర్జెంటూ, నాకేమో ఇంటినుంచి ఫోనొచ్చింది, అర్జెంటు గా వెళ్ళాలి, ఏమీ అనుకోపోతే కొద్దిగా దీన్ని క్లియర్ చేసి, ఆఫిసరుకి ఇచ్చెయ్..” అని బుడి బుడి ఏడుపులు ఏడ్చేసి, ఆయనకి అంటకట్టేస్తాడు. ఈయన సీట్ కి పక్కనుండే ఆయన అడుగుతాడు అప్పటికీ, అదేమిటి మాస్టారూ మీ టేబుల్ పని చాలదన్నట్టు, అతని పనికూడా నెత్తిమీద పెట్టుకున్నారేమిటీ అని. మన ఫ్రెండు మాత్రం “పోనీ లెండి, నాక్కూడా ఖాళీయేగా, ఆ మాత్రం సహాయం చేస్తే అరిగిపోతానా ఏమిటీ..” అని చిద్విలాసంగా సమాధానం చెప్తాడు. ఆ అవతలి ప్రబ్రుధ్ధుడి కి అంత అర్జెంటు పనేమిటయ్యా అంటే పెళ్ళాం తో మ్యాట్నీకి వెళ్ళడం. పోనీ ఇలా సహాయం చేశాడని ఏమైనా కృతజ్ఞత అనేది ఉంటుందా అంటే అదీ లేదు. ఆఫీసంతా టముకేస్తాడు– మా సెక్షన్ లో ఫలానా వెర్రిబాగులోడోడున్నాడూ అని !

   ఇలాటివారు మొగాళ్ళలోనే కాదు, ఆడాళ్ళలోనూ చూస్తూంటాము, ఏదో తన భర్త ప్రేమతో తెచ్చిన చీరో, లేక ఇంకోటేదో పక్కింటివారికి చూపించిందే అనుకుందాం, ” అబ్బ ఎంత బావుందండీ, ఎప్పటినుంచో వెదుకుతున్నా సరీగ్గా ఇలాటి దానికోసమే… వగైరా వగైరా..” .ఇంక ఈవిడ, మీకు మరీ నచ్చేస్తే పోనీ మీరే ఉంచేసికోండి, నేను ఇంకోసారి కొనుక్కుంటాను అంటుంది. అలాగే జీవితమంతా కుటుంబం కోసం సేవ చేస్తూనే ఉంటుంది. పిల్లలకోసం, భర్త కోసం తయారు చేసిన పిండివంటలు పోనీ ఓసారి రుచైనా చూస్తుందా అంటే అదీ లేదు.”పోన్లెద్దురూ పిల్లలిష్టపడుతున్నారని చేశాను, వాళ్ళతో వంతేమిటీ..”.

   ఈరోజుల్లో ప్రతీవాడూ మాల్స్ కి వెళ్ళేవాడే. అక్కడ ఏ కౌంటరు దగ్గర చూసినా కొల్లేరు చాంతాడంత క్యూలే బిల్లింగ్ చేయడానికి. ఎవడో వస్తాడు, ‘ఆంకుల్, నేను అర్జెంటు గా వెళ్ళాలి, కొద్దిగా నన్ను మీకంటే ముందర వెళ్ళనిస్తారా ప్లీజ్…”. అదేం ఖర్మమో, ఈ “పోన్లెద్దూ” జాతి పక్షులు, కరిగిపోతారు. బస్సుల్లో సీటు ఖాళీగా ఉన్నా కూచోడు.పక్కవాడు పేపరడిగినా ఇచ్చేస్తాడు. అవతలివాళ్ళకి సహాయం చేయొచ్చు కాదనం, కానీ మరీ “అపాత్రదానం” చేయకూడదు. పైగా అలా చేస్తే “పాపం” ట కూడానూ.

   బైదవే మీ అందరి ఆశీర్వచనాలతోనూ, మీరు చూపించే అపార అభిమానం తోనూ, నేను ఈ టపాలు వ్రాయడం ప్రారంభించి, నిన్నటికి 3 సంవత్సరాలు పూర్తిచేశాను. మా ఇంటావిడ వ్రాసే blogspot లో , ప్రపంచం లో ఏ ఏ దేశాలలోని పాఠకులు చదువుతున్నారో అని వివరాలు ఇస్తారు. అయ్యో నేను వ్రాసేది wordpress దీంట్లో అలాటి సదుపాయం లేదే అని ఊరికే బాధ పడిపోయేవాణ్ణి ఇన్నాళ్ళూ. తెలిస్తే ఏం చేస్తారుటా అని అడక్కండి. అదో “తుత్తీ”, ఓహో మనం రాసే “చెత్త” కబుర్లు ప్రపంచం లో ఇంతమంది చదువుతున్నారా అని ఓ సంతోషం, ఆనందం. ఇంతకంటే ఏం కావాలండీ ఈ వయస్సులో? ఈమధ్యన wordpress లో కూడా ఈ వివరాలు ఇస్తున్నారు. ప్రతీ రోజూ ఓసారి చూసుకోడం, సంతోషించడం. వామ్మోయ్ నా టపాలు ప్రపంచంలో ఉన్న ఇన్నిదేశాల్లో పాఠకులు చదువుతున్నారా అనిపించింది. అందరికీ నా నమస్కారాలు.మొదట్లో వ్రాయడం మొదలెట్టినప్పుడు, వ్యాఖ్యలు పెట్టేరా ఎవరైనా అని పొద్దుటే లేచి చూసుకోడం, వ్యాఖ్య లేకపోతే “అయ్యో..” అనుకోడం. కాలక్రమేణా అలవాటైపోయింది. ” పోన్లెద్దూ పాపం టైము లేకపోయిందేమో…” దాకా వచ్చాను. అసలంటూ చదువుతున్నారు కదా, ఎవరూ చదవకుండానే 1,78000 పైగా hits ఎక్కణ్ణుంచొస్తాయీ? ఎక్కడికక్కడే సమాధాన పడిపోవాలి కదూ.. ఏదో ఓపికున్నన్నాళ్ళూ రాస్తూండడమే. వ్రాయడానికేమిటీ టాపిక్స్ కావలిసినన్ని. పనీ పాటా లేదూ, ఇంకేం చేయనూ మరి?….

   నా టపాలు చదివి సింగపూర్ నుంచీ, US నుంచీ ఫోన్లొచ్చినప్పుడు అనిర్వచనీయమైన సంతోషం. ఫరవాలేదూ, నాటపాలు చదివి ఫోను చేయాలనిపించినవారు కూడా ఉన్నారూ అని ఓ ఆనందం.

A BIG BIG THANKS …….

    ఈ అభిమానం ఇలాగే కొనసాగనీయాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   చిన్నప్పుడెప్పుడో, ఇంగ్లీషు అంత బాగా రానప్పుడు, (అంటే ఇప్పుడేదో వచ్చేస్తోందని అనుకోకండి) history sheeters అంటే, చిన్నప్పుడు మన చరిత్రల్లో చదివిన మహానుభావులు అనుకునేవాడిని ! చరిత్రలోకి ఎక్కాడూ అంటే ఆయన history sheeteరే అనుకునేవాడిని. పైగా భారతదేశ చరిత్రే కాకుండా, ప్రపంచ చరిత్ర కూడా చెప్పేవారు. దీనికి సాయం “ఏగాణీ… దమ్మిడీ క్షవరం ” లాగ పి.యు.సి లో నా గ్రూప్ MPW ఇక్కడ W అంటే World History ! ఏదో విలక్షణంగా ఉంటుందని ఆ గ్రూప్ పుచ్చుకున్నాను.Aristotle కీ aristocrats కీ తేడా తెలిసి చచ్చేది కాదు. ఏదోలాగట్టేక్కేశాననుకోండి. అదండి నా హిస్టరీ పరిజ్ఞానం. మరి అలాటివాడికి history sheeters అంటే అర్ధం ఎలా తెలుస్తుందీ?

   ఈమధ్యనే తెలిసింది, ఈ history sheeters అనబడేవాళ్ళు, చాలా గొప్పవారనిన్నూ, మన ఎసెంబ్లీలలోకీ, పార్లమెంటు లోకీ ఎన్నుకోబడతారనిన్నూ.ఎంత అదృష్టవంతులో కదా! మనమూ ఉన్నాము ఎందుకూ? మాయదారి టపాలు వ్రాసుకోడం తప్ప ఇంకో కాలక్షేపం లేదు. అవునూ , నాకో సంగతి అర్ధం అవదూ, మన దేశంలో ఫ్రీ ప్రెస్సో అదేదో అంటారుట. మరి వీళ్ళకి బయటి దేశాల్లో అంటే అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో ఉన్న పత్రికల్లాగ ఉంటానికి ఏం రోగంట? అక్కడ అమెరికాలో దేశాద్యక్షుడి పదవి అనండి, లేక ఇంకో high profile పదవనండి, ఎవరైనా పోటీ చేస్తే, ఆ కాండిడేట్ చిన్నప్పుడు స్కూలుకెళ్ళే టైములో ఏదైనా వెధవ పని చేశాడా దగ్గరనుంచి, కాలేజీలో ఏం చేశాడూ,ఎప్పుడైనా పట్టుబడ్డాడా, ఎవరెవరితో జాలీగా గడిపాడూ దాకా అందరికీ తెలియచేస్తారే, మరి మన దేశం లో అలాటిదేమీ ఉండదా? పత్రికల్లో రావడం బట్టే కదా అద్యక్షపదవి నుండి గెంటేశారు.

   వీళ్ళనే కాదు,every celebrity is probed and exposed. మరి అలాటి సిస్టం మనకి లేదా? celebrity అనే కాదు, వాళ్ళ వంశం లో కానీ, బంధువుల్లో కానీ, ఎవడు ఏ వెధవ పనిచేసినా , చేసినట్టు తెలిసినా, వీధిలో పెట్టేశారే !! మనకి ఇక్కడ free press అనేది ఉత్తి పేరుకే.ఎవడి గురించి వ్రాస్తే ఏం గొడవొస్తుందో అని భయమే. దేశ స్థాయనండి, రాష్ట్ర స్థాయనండి ఎక్కడ చూసినా, కావలిసినన్ని scams, scandals. అయినా సరే నోరెత్తేవాడెవడూ లేడు. మహ అయితే, ఎవడో ధైర్యం చేసి వ్రాసినా దాన్ని yellow journalism అనేస్తే సరిపోతుంది, గొడవుండదు. మరీ నిలబెట్టి అడిగినా,innocent till proved guilty అంటారు. ఎలాగూ కోర్టులూ వ్యవహారాలూ తేలేటప్పటికి, ఓ పుష్కరం పూర్తవుతుంది. ఈమధ్యలో ఈ మహానుభావుడు, రెండు సార్లు ఎన్నుకోబడి మనల్ని “పరిపాలించొచ్చు“. ఎంతదృష్టవంతులమో కదా, ఇదివరకటి రోజుల్లో history makers పరిపాలించేవారు. ఇప్పుడో history sheeters !!

   బయటి దేశాల్లో క్రీడాకారుల్ని కూడా వదల్లేదు. మరి ఇక్కడో, అదేదో match fixing అన్నారు, మరేదో అన్నారు. చివరకి ఏమయ్యిందీ క్రికెట్ మానేసి, ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఎం.పి. అయి కూర్చున్నాడు. అలాగే Bandit Queen అన్నారు, చివరకి ఎంపీ గా ఎన్నుకోబడి ఎవడో చంపేశాడు. ఇంక ఓ రాష్ట్రానికి అత్యున్నత పోలీసు పదవిలో ఉన్నాయన భార్య ఆస్థిపాస్థులు దర్యాప్తు చేయమన్నారు కోర్టు వారు. ఇంకొకాయన అదేదో ఫోర్జరీ కూడా చేశాట్ట. అయినా సరే హాయిగా ఉన్నాడు. మద్యం సిండికేట్ల వ్యవహారం లో ఇంకో మంత్రిగారి పేరు వస్తే, చివరకి ఏసిబి డి.జి, ఏ.డి.జి లనే తప్పించేశారు. పైగా అప్పుడెప్పుడో మంత్రి పదవి ఇచ్చినప్పుడు, “రవాణా” శాఖ తన గౌరవానికి భంగమూ అన్న ప్రబుధ్ధుడు ఈయన!

   ఏమిటేమిటో కబుర్లు చెప్పేశాడు ఉత్తర్ ప్రదేష్ యువ ముఖ్యమంత్రి గారు, వాడెవడో రజ్జూ భయ్యాట అతన్ని ఏకంగా జైళ్ళ మంత్రిగా చేశాడు. ఎందుకొచ్చిన కబుర్లండీ ఇవి?
ఇంకో మూడు నెలల్లో మన భారత రిపబ్లిక్ కి కొత్త రాష్ట్ర పతి వస్తారుట. ఇదివరకటి రోజుల్లో ఓ రాజేంద్ర ప్రసాద్ గారన్నా, ఓ సర్వేపల్లి రాధా కృష్ణన్ గారన్నా అందరూ ఆహా ఓహో అనుకునేవారు. ఆమధ్యన అబుల్ కలాం గారు కూడా అదే కోవకి చెందినవారే. ఈ అయిదేళ్ళలోనూ మన ప్రస్తుత రాష్ట్రపతి గారు ఏం ఒరగపెట్టారో తెలియదు. సపరివారసమేతంగా ప్రపంచం అంతా చుట్టిపెట్టి రావడానికి 200 కోట్ల పైన ఖర్చయిందిట ! ఇంక ఆవిడ గారి భర్త షెకావత్ గారి సంగతసలు అడగొద్దు. సుగర్ ఫాక్టరీ కి తీసికున్న అప్పులు తీర్చలేక, ఆ ఫాక్టరీ అమ్మేశాడు.అయినా ఆ అప్పు తీరలేదు.మన బ్యాంకులకి NPA లు ఏమైనా కొత్తా ఏమిటీ? ఇంక ఈవిడగారి సుపుత్రుడు మా మహరాష్ట్ర అసెంబ్లీ మెంబరు లెండి, ఆమధ్యన అమరావతి కార్పొరేషన్ ఎన్నికల సమయం లో కోటి రూపాయల unaccounted money పట్టుకున్నారు. అయినా మామూలు మనిషా ఏమిటీ ఆయన, అచ్చంగా దేశాద్యక్షుడి సుపుత్రుడాయే, చెప్పడం మర్చిపోయానూ అని ఓ మాటన్నాడు, కేసూ లేదూ, పాడూ లేదూ … ఇంకో రెండు నెలల్లో, మా పూణె వాసుల అదృష్టమనండి, మేము చేసికున్న పూర్వజన్మ సుకృతం అనండి, దేశాద్యక్షులకోసం ఇక్కడ పూణె లో ఓ పేద్ద భవనం అఘమేఘాలమీద తయారైపోతోంది. దాని ఏరియా ఎంతో తెలుసా– అక్షరాలా 261000 చదరపు అడుగులు–వివరాలు ఇక్కడ చదవండి. అందుకే అప్పుడెప్పుడో ఆ అమ్మాయి Alisha Chinoy పాడిన పాట గుర్తొస్తుంది…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– చుట్టాలతోనూ, తెలిసినవారితోనూ లావాదేవీలు

   బాగా పరిచయం ఉన్నవారితోనైనా సరే, చుట్టాలైనా సరే, వారితో ఎటువంటి లావాదేవీలూ పెట్టుకోనంతసేపే మన జీవితాలు హాయిగా వెళ్ళిపోతాయి. ఆ లావాదేవీలు ఏవైనా అవొచ్చు, ఓ పెళ్ళి సంబంధం కావొచ్చు, వాళ్ళింట్లో అద్దెకుండడానికి వెళ్ళొచ్చు, కాదూ కూడదూ అనుకుంటే, మనింట్లో ఏదో వస్తువు తెలిసినవారికి అమ్మొచ్చు, చివరకి మన ఇల్లు వాళ్ళకో, వాళ్ళ ఇల్లు మనమో కొనుక్కోవడం అవొచ్చు. చెప్పిన ఈ విషయాల్లో, ఎప్పుడూ కూడా బయటి వాళ్ళతో పెట్టుకోవాలి కానీ, చుట్టాలూ,పరిచయస్థులతో మాత్రం దూరంగానే ఉండాలి. మహ అయితే సలహా లాటిదోటి అడగొచ్చు, నచ్చిందా సరే సరి, లేదా ఏదో కారణం చెప్పేసి తప్పించేసికోవచ్చు.

   వీళ్ళతో ఏమిటంటే లేనిపోని మొహమ్మాటాలూ, మొహం మీద చెప్పాలేము, అలాగని నెత్తిమీదకు తెచ్చుకోలేమూ. మనవాడే కదా వినకపోతాడా అని మనమూ, పైవాణ్ణేమిటీ అని ఆ రెండో ఆయనా. అడక్కండి అప్పటిదాకా ఉన్న రిలేషన్స్ తగలడిపోతాయి. ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకోరు, అప్పటిదాకా అక్కయ్యా, అన్నయ్యా అని పిలుచుకునేవాళ్ళు, రాత్రికి రాత్రి బధ్ధశత్రువులైపోతారు. ఇంక వీళ్ళ మీద వాళ్ళూ, వాళ్ళ మీద వీళ్ళూ యాగీ చేసేసికోడం మొదలెట్టేస్తారు. అన్ని సంవత్సరాలనుండీ మిత్రులు గా ఉన్నవారి మధ్య ఇలాటివి అవసరమంటారా?

   ఇలా అంటే, చెప్తారు లెద్దూ బాపూ గారూ, ముళ్ళపూడీ వారూ అరవై సంవత్సరాలు కలిసి ఉండలేదా అంటారు. వారు “యుగపురుషులు” మాస్టారూ.మామూలు మానవమాత్రులకి సాధ్యం కాదు. మీ చుట్టుపక్కల చూస్తే మీకే తెలుస్తుంది. ఏదో తెలిసినవారింట్లో ఈడొచ్చిన పెళ్ళి కొడుకున్నాడు కదా, పోనీ మన పిల్లని అడుగుదామా అనుకుంటారు. ఎవరో మధ్యవర్తి ద్వారానో, ఒక్కొక్కప్పుడు డైరెక్టు గానో ( ఎలాగూ వీరికీ పరిచయం ఉందిగా), సంబంధం ప్రస్తావిస్తారు. పెళ్ళికొడుకు వాళ్ళు, ఓ పట్టాన సమాధానం చెప్పరు. కారణాలనేకం. వీళ్ళకి కావలిసిన కట్నం అడగడానికి మొహమ్మాటం, మరీ అడిగేస్తే బావుండదేమో, పోనీ అలాగని జాతకాలు కలువలేదా అనుకోడానికీ వీలు లేదు. ఏదో తంటాలు పడి, చల్లగా చెప్పేస్తారు, మా వాడు అప్పుడే చేసికోనంటున్నాడండీ అని. చివరకి జరిగేదేమిటీ అంటే కొద్ది రోజుల్లో ఆ పిల్లాడికి సంబంధమూ కుదురుతుంది, కానీ ఆ పెళ్ళికి, రిసెప్షన్ కీ వీళ్ళని పిలవరు. కారణం మరేం లేదూ మొహం చెల్లకనండి, లేదా అప్పుడు పిల్లాడు పెళ్ళికి సుముఖంగా లేడూ అన్నామే, మరీ ఇప్పుడు పెళ్ళికి పిలిస్తే బాగుండదేమో అనీ అవొచ్చు. చివరకి వీరిద్దరికీ ఫ్రెండు అయినవారి ద్వారా తెలుస్తుంది ఫలానా వారి అబ్బాయి పెళ్ళీ అని!ఎంతదాకా వెళ్తుందీ అంటే, ఈ పిల్లకి ఏ పురుడో వస్తే చూడ్డానికి కూడా వెళ్ళరు. చిత్రం ఏమిటంటే, వీళ్ళ పిల్లకీ పెళ్ళయింది, వాళ్ళ పిల్లాడికీ పెళ్ళయింది. కానీ loser వీళ్ళfriendship.చూశారా తెలిసినవారు కదా అని సంబంధానికి వెళ్తే, ఈ ఇద్దరి మధ్యా ఉన్న స్నేహం కాస్తా కొండెక్కేసింది.

   అలాగే ఏ కొంపో అమ్ముదామని ప్రయత్నించి, చెప్పలేదంటాడేమో అని, ముందుగా స్నేహితుడి వద్ద ప్రస్తావిస్తాడు. ఆ పెద్దమనిషేమో, తెలిసున్నవాడేకదా చవకలో కొట్టేద్దామనుకుంటాడు. కానీ ఈయనకీ ఏవో కొన్నిexpectations ఉంటాయిగా, అవి చెప్పడానికి ఈయనకి మొహమ్మాటం. అప్పటికీ చెప్తాడు, ఏదో ఫలానా లక్షల దాకా బేరాలు వస్తున్నాయీ, ఇంకా డిసైడ్ చేసికోలేదూ, నీ చెవిని కూడా ఓ మాటేద్దామని చెప్తున్నానూ అని.అనుకున్నదానికంటే ఓ లక్షో, రెండు లక్షలో ఎక్కువే చెప్తాడు, ఎందుకైనా మంచిదని.తనకీ ఓ కొంప కావాలి కదా, ఎంతైనా స్నేహితుడూ, మొత్తం అంతా ఒకేసారివ్వఖ్ఖర్లేకుండా ఏదైనా వాయిదాల్లో ఇస్తాడేమో చూద్దామనుకుంటాడు. అక్కడే వస్తుంది సమస్య అంతా, ఈయనకేమో, ఏదో అవసరం వచ్చే కదా ఇల్లు అమ్మకానికి పెట్టాడూ, మళ్ళీ మధ్యలో ఈ ఫిట్టింగేమిటీ? పైగా ఏ కారణం చేతైనా ఆ ఫ్రెండు ఓ వాయిదా ఇవ్వలేకపోతే, అడగడానికి లేదూ ఏమిటో అంతా గందరగోళం. చివరకి భార్యా భర్తలు ఆలోచించి ఓ నాలుగైదు రోజులు ఆగి, చెప్పేస్తారు– మా వాడికి డబ్బవసరం పడిందీ, అందుకోసం వాడే బేరం తెచ్చాడూ, ఆ వచ్చినతను తన ఆఫీసులోనే పని చేస్తున్నాడుటా, బ్యాంకు లోన్ కూడా వచ్చేసింది. ఎలాగూ నువ్వు ఒకేసారి ఇవ్వలేనన్నావు కదా, అందుకోసం ఆ అబ్బాయికే ఇచ్చేస్తున్నామూ అని!ఇది పచ్చి అబధ్ధం అని ఇద్దరికీ తెలుసు, అయినా సరే బయట పడరు.!!

   అలాగే ఏదైనా వస్తువో, ఏ బండో అమ్మాలనుకున్నా, ఛస్తే తెలుసున్నవారికి ఇవ్వకూడదు. దానికి ఏ రిపేరీ వచ్చినా మనతో చెప్తూంటాడు.అలాగని మనల్ని రిపేరీ చేయించమని కాదు, “చూశావా ఎలాటి దరిద్రపు వస్తువు అంటకట్టావో, ఛస్తున్నాను దీనితో. కొన్నప్పటినుంచీ ఒక్కరోజైనా మనశ్శాంతి లేదు” లాటి అర్ధం వచ్చే చూపులతో…మళ్ళీ వాడి మొహం మనం చూడమూ, మన మొహం వాడు చూడడూ… గోవిందో గోవింద.. హాయిగా ఏ ఏజెంట్ తో చెప్పినా సరిపోయేది, లేనిపోని తద్దినం తెచ్చికున్నారా బాబూ అని జీవితాంతం గిల్టీ ఫీల్ అవాలి.

   ఈ గొడవంతా ఎందుకు వ్రాశానూ అంటే, ఈమధ్యన మా అబ్బాయి, తన ఆఫీసుకోసం ఇంకో బంగ్లా తీసికున్నాడు, అద్దెకేలెండి. ఇదివరకు వెళ్ళినప్పుడల్లా, ఆ ఇంటాయనా, ఇంటావిడా నోరారా పలకరించేవారు. యోగక్షేమాలడిగేవారు… అలాటిది సడెన్ గా ఈవేళ ప్రొద్దుట కనిపించినా,అసలు పలకరింపే లేదు. కారణం తెలుసా, అబ్బాయి ఇల్లు ఖాళీ చేయడం… అదండీ విషయం…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మా గ్రంధాలయ ప్రస్థానం…చాలా తీయగా, కొంచం చేదుగా….ఉగాది పచ్చళ్ళా అన్నమాట…

   మా అబ్బాయి ప్రారంభించిన tenderleaves.com ప్రోత్సాహవంతంగా ముందుకు సాగుతోంది. ఈమధ్యనే ఓ కొత్త investor ఒకరు వచ్చారు. ఇంగ్లీషు, మరాఠి, హిందీ పుస్తకాలకి ప్రోత్సాహం బాగానే ఉంది. వచ్చిన గొడవల్లా, తెలుగు పుస్తకాల విషయం లోనే వస్తోంది. ఏదో పూణె లో అయిదు లక్షల మందిదాకా మనవాళ్ళు ఉన్నారూ, వారికి తెలుగు పుస్తకాలు ( ఆరు వందల పైగా), ఇంట్లోంచి బయటకు వెళ్ళఖ్ఖర్లేకుండా, గుమ్మం లోకే వచ్చేటట్టు సదుపాయం ఇచ్చినా, response మాత్రం అంత ఉత్సాహంగా లేదు. అప్పటికీ, నాకు చాలా మందే తెలుసుననే దురభిప్రాయం తో ఉన్నాను ఇన్నాళ్ళూ. పోనీ ఆ తెలిసినవాళ్ళైనా చేరారా అంటే, అదీ లేదూ. అప్పటికీ గ్రంధాలయం ప్రారంభించే ముందు, చాలా మందితో సంప్రదించాను కూడా. ” అర్రే బలేగా ఉందండీ. అయితే మనకి తెలుగు పుస్తకాలు ఇంటికే వచ్చేటట్టు చేస్తున్నారన్న మాట.. అహా ఒహో…” అన్నవాళ్ళే, తీరా ప్రారంభించిన తరువాత, “ ఏమిటోనండీ, అసలు టైమే ఉండడం లేదండీ” అని ఒకళ్ళూ, “పిల్లలతోనే సరిపోతోందండీ...” అని ఒకళ్ళూ. ఇంకోళ్ళైతే, మాకు తెలిసినవారితో చెప్తాములెండి అని ఇంకొకళ్ళూ, పోనీ ఏ ఆంధ్ర సంఘం వారి కార్యక్రమాల్లోనైనా, అంతమంది తెలుగువారు పరిచయం అవుతారూ, వాళ్ళకేమైనా interest ఉందేమో అని వారితో పరిచయం చేసికుని, వారికి pamphlet ఇచ్చి ఫలానా సైటులోకి వెళ్ళి చూడండీ, వగైరా..వగైరా చెప్పడం వరకే సీమిత్ అవుతోంది. ” రాత్ గయీ బాత్ గయీ..” లాగ, నేనిచ్చిన pamphlet చూసే ఓపికెవరికుంటోంది? అసలంటూ వాళ్ళు ఇళ్ళకెళ్ళిన తరువాత సెర్చ్ చేశారా లేదా అన్నది, మాకు ఎలాగూ తెలుస్తుంది.

   ఇదంతా మా గ్రంధాలయానికి బిజినెస్స్ రావడంలేదే అన్న భావంతో వ్రాసింది కాదు. అయ్యో అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేక పోతున్నారే అనే ఆవేదనతో వ్రాస్తున్నది. సభ్యులైన వారు కూడా, నా బ్లాగులద్వారా తెలిసికున్నవారే. పూణె లో ఉంటున్న వారు చాలామంది, ఐ.టి. లోనో, టాటా మోటార్స్ లోనో, బ్యాంకుల్లోనో ఈమధ్యన చేరినవారే. నేను వారిని పరిచయం చేసికుని, మా గ్రంధాలయం గురించి చెప్పడం, వారు వెంటనే అలాగాండీ అనడం, తరువాత, పుస్తకాలు చదువుతామండీ అనే వారొకరూ, మాకు తెలుగు చదవడం రాదూ అనేవారొకరూ. I can definetely understand and appreciate this problem. ఎందుకంటారా, ఏ పరాయి రాష్ట్రం లోనో చదివినవారికి ఈ సమస్య ఉంటుంది. కానీ మేము target చేస్తున్నది, నిజం చెప్పాలంటే వారిని కాదు, వారి ఇంట్లో వీళ్ళ పిల్లల్ని చూసుకోడానికై, రిటైరయిన తరువాత మన వైపునుండి వచ్చిన వారి తల్లితండ్రులనీ, అత్తమామల్నీనూ !! వీళ్ళు ప్రొద్దుటే అఫీసులకెళ్ళిపోతారు, రోజంతా ఆ టి.వీ. ముందర కూర్చోడం కంటే, ఇలాటి గ్రంధాలయాల నుండి, తెలుగు పుస్తకాలు తెప్పించి ఇస్తే బాగుంటుందని.అప్పటికీ ఆ విషయమూ చెప్తూంటాను.అయినా ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. సదుపాయం అంటే కల్పించగలం కానీ, బలవంతం చేయలేము కదా!!

   పోనీ ఊరికే ఇద్దామనుకున్నా, మరీ మాదేమీ Charitable Institution కూడా కాదే !పూణె లో ఏ ప్రాంతం లోనైనా నివశించేవారికి పుస్తకాలు వారి గుమ్మం దాకా చేర్చాలా వద్దా, దానికయే ఖర్చుమాత్రమే అడుగుతున్నాము.ఎంతా నెలకి రెండు/మూడు వందలు. ఎన్ని పుస్తకాలైనా తెప్పించుకోవచ్చు. ఆ ఎమౌంటు కూడా ఎక్కువైపోతుందనుకునే వారిని ఏం చేయగలమూ?

   అప్పుడప్పుడు మా అబ్బాయి అడిగే ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేదు. “అదేమిటి డాడీ ఈ ఊళ్ళో తెలుగువారు చాలా మందున్నారూ, వాళ్ళకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అన్నావూ…” .అవును నాయనా ఏం చేయనూ, అలా అనుకున్నానూ, కానీ అది శుధ్ధ తప్పూ అని తెలిసిందీ.ఏదైనా అనుభవం మీదే కదా తెలిసేదీ, ఇంగ్లీషు,మరాఠీ పుస్తకాలకి response బాగుంది కదా, అలాగే కానీయ్ అని ఓ వెర్రి నవ్వు నవ్వేస్తూంటాను అంతకంటే ఇంకేమీ చేయలేక… తనూ అర్ధం చేసికున్నట్టే కనిపిస్తున్నాడు.

   కిందటేడాది ఈ ఊళ్ళో ఉన్న స్కూలు పిల్లలచేత స్టోరీస్ వ్రాయించి, ఓ పుస్తకం కూడా రిలీజ్ చేశాడని ఓ టపా వ్రాశాను. గుర్తుండే ఉంటుంది. దాని తరువాత, పై నెలలో ఓ Summer Camp ఒకటి organise చేస్తున్నాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

   ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే పుస్తక పఠనం సంబంధించినంతవరకూ, మన భాష వారికంటే ఇతర భాషల వారికే ఉత్సాహం ఎక్కువని. వారికోసం కాకపోయినా, వారి పిల్లలకైనా పుస్తకపఠనం ఆలవాటు చేద్దామనుకునే సదుద్దేశ్యంతో మా టెండర్ లీవ్స్ చక చకా ముందుకు సాగిపొతోంది… మీ అందరి ఆశీర్వాదాలతోనూ, భగవంతుడి దయతోనూ, అలాగే ముందుకు సాగిపోవాలని ఆశిస్తూ.…..

%d bloggers like this: