బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అపాత్ర సహాయాలు…

   అపాత్ర దానాలని విన్నాము. ఇప్పుడు ఈ అపాత్ర సహాయాలేమిటా అని అనుకుంటున్నారా? దానాల్లాగే సహాయాలు కూడా అవతలివారిని చూసి చేస్తూండాలి. అడిగినవాడికీ, అడగనివాడికీ సహాయాలు చేస్తూ పోతూంటే లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటూ ఉంటాము. ఈ సహాయాలు పొందినవారుంటారే, వారి పని సవ్యంగా జరిగిపోతే చాలు, ఆ సహాయం చేసినవాడు ఎలా పోయినా, ఏ గంగలో దూకినా ఏమీ పట్టింపనేది ఉండదు.

   సినిమాల్లోనూ, కథల్లోనూ చూస్తూంటాము, ఏ ఎయిర్ పోర్టులోనో, రైల్వే స్టేషన్ లోనో, మన దారిన మనం ఉంటున్నా సరే, ఎవడో ఓ ఆగంతుకుడు వచ్చి, మా సామాను చూస్తూంటారా అనగానే , ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా, సరే అంటాము. ఊరికే చూడడమేగా ఇందులో అంత శ్రమ పడేదేముందీ అని అనుకుంటారు.అలాగే, రైల్వే స్టేషనులో కూడా, ఎవరో ఒకరు అడుగుతూంటూనే ఉంటారు.ఆ అడిగినవాడు మామూలువాడైతే ఫరవాలేదు, కానీ కొన్ని సందర్భాల్లో avoidable చిక్కుల్లో పడుతూంటారు, ఈ పరోపకారులు. రైల్లో చూడండి, రిజర్వేషను చేయించుకున్నా, భార్యకోచోటా, భర్తకో చోటా సీటు దొరుకుతుంది. మరీ వేరు వేరు కోచ్ లైతే ఏమో కానీ, ఒకే కోచ్ లో కూడా , విడివిడిగా కూర్చోడానికి కూడా ఏదో ప్రాణం మీదకొచ్చినంత హడావిడి చేసేస్తూంటారు. ఎవడో బక్రా దొరుకుతాడు, ఆతన్ని కాళ్ళావేళ్ళా పడి, మొత్తానికి ఆ పెద్దమనిషిని ఒప్పించి, సీటు మార్చుకుంటారు. బస్.. వాళ్ళక్కావలసినది అయిపోయిందిగా, ఎవరెలా పోతే మనకేం అనుకుంటారు. ఏదో అలా అనుకుంటే ఫరవాలేదు, కానీ అతి ఉత్సాహానికి వెళ్ళి అవతలి వారిని అదీ ఎవరివల్ల సహాయం పొందేరో వారిని చిక్కుల్లో పెడతారే, అలాటివారి గురించన్నమాట ఈ టపా.

    క్రిందటి ఆదివారం నాడు, మా అగస్థ్య, నవ్య లని హైదరాబాదునుండి తీసికుని, పూణె బయలుదేరారు వాళ్ళ అమ్మమ్మా, తాతయ్యలు, శతాబ్ది లో. వాళ్ళెవరికో పైన చెప్పేనే అలాటి పరిస్థితి వస్తే, మా వియ్యంకుడూ, వియ్యపరాలినీ అడిగేరు సీటు మార్చుకోవచ్చా అని. సరే అన్నారు,సామాన్లు అన్నీ పై లగేజీ షెల్ఫ్ లో పెడుతూ, ప్రయాణం లో పిల్లలు తినే సరుకులూ, మొబైల్ ఛార్జర్లూ, అలాగే కొన్ని బట్టలూ ఉన్న బ్యాగ్గుని క్రిందే ఉంచారు. మా వియ్యంకుడు గారేమో, ఎవరో తమ సీటు నెంబర్లు ఛార్టులో చూడమని అడిగేరుట,ఆయన క్రిందకు దిగేరు. వియ్యపురాలు మనవడూ, మనవరాలితో కొద్దిగా వెనక సీట్లలో కూర్చున్నారు. అదండీ దృశ్యం.

    ట్రైను కొంతదూరం వెళ్ళిన తరువాత పిల్లల తిండి సరుకుల బ్యాగ్గుకోసం చూస్తే కనిపించలేదు. అందరినీ అడిగేరు, ఎవరికివారే తెలియదంటే తెలియదన్నారు. చివరకి TC ని అడిగితే తెలిసింది, ఆ బ్యాగ్గు కాస్తా, క్యాటరింగువాడు తీసికెళ్ళి సికిందరాబాద్ స్టేషన్ లో రైల్వే పోలీసు స్టేషనులో ఇచ్చి వచ్చాడుట. అదేమిటీ అలా ఎందుకు చేశాడూ అని విచారించగా, తేలిందేమిటంటే, ఏ దంపతులైతే కాళ్ళా వేళ్ళా పడి సీటు మార్పించుకున్నారో వాళ్ళ నిర్వాకంట. వాళ్ళ సామాన్లు సద్దుకుని, కూలబడ్డాక చూస్తే పక్క సీట్లో ఓ బ్యాగ్గు కనిపించిందిట, ఆ బ్యాగ్గు ఎవరిదీ అని అందరినీ ( మా వాళ్ళను తప్పించి) అడిగిందిట, ఎవరూ తమది కాదంటే తమది కాదన్నారుట, ఆవిడేమో భారతీయ responsible citizen పాత్రలోకి ఒదిగిపోయి, TC ని పిలిచి, ఇక్కడ ఒక unclaimed bag ఉందీ, చూడండీ అందిట, ఏ బాంబైనా ఉందేమో, ఎందుకొచ్చిన గొడవా అని, క్యాటరింగు వాడిని పిలిచి, దాన్ని కాస్తా రైల్వే పోలీసులకి అప్పచెప్పొచ్చాడుట. మా వియ్యంకుడు గారు వచ్చేసరికి తెలిసిన విషయం ఇదీ.

    ఆ సీటు పుచ్చుకున్నావిడని అడిగితే, మాకేం తెలుసూ ఆ బ్యాగ్గు మీదనీ అని దబాయింపోటీ.చివరకి TC కి విషయం చెబితే, అతను ఫోను చేసి సికిందరాబాదు రైల్వే పోలీసులకి సమాచారం ఇచ్చాడు, కంగారేమీ లేదూ, ఆ బ్యాగ్గులో బాంబులూ అవీ లేవూ, అందులో ఉన్న సామాన్లు ఫలానావీ. స్టేషనులోనే ఉంచండీ, వీరి తరఫువారు వచ్చి తీసికుంటారూ అని. మా వియ్యపురాలు తన తమ్ముడి కొడుక్కి వెంటనే ఫోను చేసి, Railway Police Station కి వెళ్ళి బ్యాగ్గు collect చేసికోమన్నారు. తీరా ఆ అబ్బాయి వెళ్ళేసరికి ఆ తిండి సరుకులు కాస్తా, ఆ పోలీసులే లాగించేశారుట. ఊరగాయల సంగతి తెలియలేదు. ఛార్జర్ల విషయం ఆ దేవుడికే తెలియాలి. పైగా 200 రూపాయల దక్షిణ కూడా తీసికుని మొత్తానికి ఆ బ్యాగ్గు తిరిగి ఇచ్చారుట.

    దీన్నే అంటారు పుణ్యానికి వెళ్తే తలకి చుట్టుకుందని. మీలో ఎవరైనా సహాయం చేద్దామని అనుకుంటే, ఒళ్ళు దగ్గరపెట్టుకుని మరీ చేయండి. అడిగినవాళ్ళందరికీ చేస్తూ పోతూంటే ఇదిగో ఇలాటి చిక్కుల్లో పడుతూంటారు. తస్మాత్ జాగ్రత్త...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– హాయిగా టపాలు వ్రాసుకోవచ్చు…

    అమ్మయ్య! ఓ గొడవ వదిలింది. దేశంలో ఎన్నికల కార్యక్రమం ప్రకటించినప్పటినుండీ, ఓ వ్రతం పెట్టుకున్నాను. టీవీ లో వార్తాప్రసారాల చానెళ్ళు చూడకూడదని,న్యూసు పేపర్లు చదువకూడదనీ పనిలో పనిగా క్రికెట్ సర్కస్ కూడా. నమ్మండి నమ్మకపొండి, గత రెండు నెలలూ వాటి జోలికి పోలేదు.ఎంత హాయిగా ఉందో. రాజకీయనాయకుల వ్యర్ధ ప్రేలాపనలూ చూడాల్సిన పని లేకపోయింది. అలాగే ” నాలుక కోసేస్తా… తల పగలకొడతా.. ” అనే దౌర్భాగ్యపు భాషకూడా చదవాల్సిన అవసరం లేకపోయింది. ఎవడెలా కొట్టుకున్నా, అరుచుకున్నా జరిగేది జరక్క మానదుగా. చివరకి జరిగింది కూడా అదే.

    రాష్ట్ర విభజన సందర్భంలో అధికార పార్టీకి సంబంధించిన చవటాయిలందరినీ నామరూపాల్లేకుండా గోదాట్లో పడేశారు సీమాంధ్ర వారు. అలాగే, కావాల్సింది సాధించి, మీదిక్కున్నచోట చెప్పుకోమన్నారు తెలంగాణీయులు. చివరికి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదన్న్ట్టట్టయింది కాంగ్రెస్ పరిస్థితి.కొడుకుని ప్రధానమంత్రిని చేద్దామనుకున్న కలలు కల్లలైపోయాయి. 1984 ఎన్నికల తరువాత ఒకే పార్టీకి అన్ని సీట్లు రావడం ముదావహం. ఇదివరకు శ్రీ పీవీ గారి హయాములో మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించిన ఘనత, శ్రీ పీవీ గారికే చెందాలి.ఆయన ఫస్ట్ ఫ్యామిలీ ని పట్టించుకోకపోవడం, దానితో వారు అలిగి, శ్రీ పీవీ గారి పేరును చరిత్రలోంచే చెరిపేశారు.1992 లో జరిగిన ఆర్ధిక సంస్కరణల ఫలాల్ని అనుభవించడం తెలుసు. వాటిని అమలుపరచిన శ్రీ పీవీ ఎప్పటికీ చిరస్మరణీయులే.

    ఏదో ఈ ఎన్నికలలో ఘనవిజయం సాధించిందని జనం అందరూ జేజేలు కొడుతున్నారు. అధికారం చేతికొచ్చిన తరువాత పరిణామాలకి we have to wait and see. మార్పు ఎప్పుడూ మంచిదే. అలాగే తెలంగాణా సాధించడంతోటే పనైపోలేదు. కాంగ్రెస్ చేతిలో రాష్ట్రం అంతా 60 ఏళ్ళు సర్వనాశనం అయిపోయిందీ, మళ్ళీ బాగుచేయాలంటే మాటలేమిటీ .. అనే ఒక lame excuse తో ఓ అయిదేళ్ళు గడిపేయొచ్చు. తరువాత ఉంటేనేమిటి, ఊడితేనేమిటి మనక్కావాల్సింది కూడబెట్టుకున్నామా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న. ఇదంతా ఏదో pessimism అని కాదు, చేదు నిజం. ఎన్నికలలో నెగ్గిన euphoria ఓ నెలరోజులుంటుంది. తరువాత అంతా మామూలే. You scratch my back, I will scratch yours.. కాబోయే ప్రధానమంత్రి ఈవేళ వరోద్రాలో చెప్పనే చెప్పారు.. “రాజకీయాల్లో ఎవరూ శత్రువులుండరూ..ఉంటే గింటే అభిప్రాయబేధాలే..” అని. That is the bottom line. ఈ పదేళ్ళూ మేము చేసిన వెధవ పనులు మీరు కాశారూ, ఈ అయిదేళ్ళూ మీ welfare మేము చూస్తాము..dont worry.. బొగ్గుల కుంభకోణం లో భాజాపా వారి చేతులకి అసలు మట్టే అంటుకోలేదంటారా? ఏదో public consumption కోసం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు.ఈవేళ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఉపాద్యక్షుడూ మీడియా ముందర మాట్టాడడం చూసేఉంటారు.ఏదో పెద్ద ఘోరం జరిగిపోయిందనే ఫీలింగే లేదు, ఉన్న నాలుగు నిముషాలూ నవ్వుతూనే ఉన్నారు.ఎందుకంటే ఖర్చుపెట్టిన డబ్బు మీదీ, నాదీనూ, వాళ్ళదేం పోయిందీ? అలాగని ఎన్నికలలో తుడిచిపెట్టుకుపోయినందుకు ఏడుపులూ, పెడబొబ్బలూ పెట్టాలని కాదు, ఏదో కొద్దిగానైనా బాధపడ్డట్టు నటించినా ఏదో సానుభూతి ఉండేదేమో. పోనిద్దురూ ఈవేళ పోతే రేపు రెండో రోజు….

    ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వారిగురించి బాధంటూ పడితే ఒక్క నందన్ నీలెకెనీ గురించి మాత్రమే. హాయిగా ఉన్న మనిషి ఉన్నవాడున్నట్టుండకుండా ఎన్నికలెందుకూ అసలు ఆయనకి? అదీ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుమీదా? కుమారస్వామిలు, యెడ్డీలూ ( మచ్చుకి మాత్రమే) ఉన్న భాజాపా దేశాన్ని ఏదో ఉధ్ధరించేస్తారనుకోవడం ఉత్తి భ్రమ ! శ్రీ మన్మోహన్ సింగు గారి ఆధ్వర్యంలోఎన్నెన్ని గొడవలొచ్చినా , వ్యక్తిగతంగా అయన clean. మోడీ గారిమీద, ఎన్ని రకాలైన మతసంబంధితమైన ఫిర్యాదులున్నా, లంచగొండి ఫిర్యాదులు ఎప్పుడూ మీడియాలో రాలేదు. అలాగే మోడీ గారు లంచాలు తీసికోకపోయినా, మిగిలినవారు తీసికోకూడదని ఏమైనా రూలా? తరువాత గొడవేమైనా జరిగితే, పాపం మోడీ మంచివారే, ఆయన పేరుచెప్పుకుని ఎవరైనా తింటే పాపం ఆయన తప్పేమిటీ అనొచ్చు…

    అఛ్ఛా నాకో డౌటూ, పాపం వాళ్ళెవరెవరినో చంచల్ గూడా జైల్లో పెట్టారూ, వాళ్ళ సంగతేమిటి ఇప్పుడూ? బయట ప్రతీ రాజకీయనాయకుడూ ఎవరి దారిన వాళ్ళు మజా చేసికుంటున్నారు, ఆ జైల్లో ఉన్నవాళ్ళు అలాగే ఉండాలా లేక…

    ఇటుపైన వ్రాయడానికి కావాల్సినన్ని విశేషాలు… ఓపికుండాలే కానీ రోజుకో డ్రామా చూడొచ్చు… శుభం…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కలా పోసణ…

20140511_120109

    పైన పెట్టిన ఫొటో ఏమిటంటారా… భోజనాలు చేసే డైనింగు టేబిల్ అంటే నమ్ముతారా? నమ్మాలి.. తప్పదు మరి.. ప్రత్యక్షంగా చూసి అదే టేబుల్ మీద వెండి కంచాల్లో , వేడివేడిగా షడ్రసోపేతమైన విందు ఆరగించాము, నేనూ, మా ఇంటావిడానూ మొన్న ఆదివారం నాడు. ఎంతో అభిమానంతో, మమ్మల్ని ఆహ్వానించి విందుభోజనం పెట్టిన వారు మరెవరో కాదు.. శ్రీ యేనుగు కృష్ణమూర్తి. శ్రీమతి రమణ దంపతులు. ఈ డైనింగు టేబుల్ మచ్చుకి మాత్రమే. అలాటి చిత్రవిచిత్రమైనవి ఎన్నో..ఎన్నెన్నో ..చూడగలిగాము. ఏదో పురావస్తు ప్రదర్శన శాల (Museum) అనుకోకండి. అచ్చంగా వారు నివసిస్తూన్న ఇల్లు. ఇంటినిండా ఎక్కడ చూసినా, నేతి జారీలూ, పులుసు గోకర్ణాలూ, గరిటెలూ,రాచ్చిప్పలూ, అన్నం వండే అడ్డెడు గిన్నీ, మానెడు గిన్నీ, కొబ్బరి తురుముకునే కోరం. కత్తిపీట, కుంపటి- పైగా ఇత్తడిదండొయ్. అడక్కండి, అక్కడ లేని వస్తువంటూ లేదు.వీటికి సాయం దేవుడి ఊరేగింపుతో వెళ్ళే కాగడాల జంట, వాటిలో నూనె పోసే జారీ ఒకటీ.

20140511_122149

   పైన పెట్టిన ఫొటో గంగాళంలా ఉంది కదూ? కదూ ఏమిటీ గంగాళమే, దానిమీద ఒక గ్లాసు వేసేసి దాన్ని ఓ సెంటర్ టేబుల్ (టీపాయ్ అంటామే అలా అన్నమాట)గా మార్చేశారు. వీటికి సాయం సైడు టేబుల్స్ కూడా ఇంకో గంగాళం !! ఇంట్లో ఉండే సామాన్ల మాట అటుంచి, ద్వారబంధం కూడా అలా సమకూర్చుకున్నదే. ఇంక తలుపులంటారా, బయట ఒక గొళ్ళెం, లోపల ఒక అడ్డ గడియ !! మన చిన్నతనం అడుగడుగునా కనిపిస్తుంది.
శ్రీ కృష్ణమూర్తి గారి ఇంట్లో చూసిన వస్తువులు అన్నీ మనచిన్నతనంలో చూసినవే, కానీ ఈరోజుల్లో ఎన్ని ఇళ్ళల్లో చూడగలమంటారు? ఇదివరకటి రోజుల్లో ఇళ్ళు కూడా పెద్దగానే ఉండడంతో పెద్దపెద్ద సామాన్లు ఉంచుకోడానికి సమస్య ఉండేది కాదు. అలాగని ప్రతీ ఇంట్లోనూ ఉండేవని కాదు, ఏ కొద్దిమంది ఇళ్ళల్లోనో ఉండేవి. ఊళ్ళో ఎవరికి అవసరమైనా, ఇవ్వడానికి సంకోచించేవారు కాదు. ఎవరింట్లోనైనా శుభకార్యం జరిగితే, ఎవరో ఒకరి ఇంటినుండి సామాన్లు తెచ్చుకునేవారు. శ్రీరామనవమికి పానకం కలపాలంటే గంగాళాలే ఉపయోగించేవారు. ఓ సంతర్పణ/సమారాధన జరిగితే కావాల్సిన పులుసు గోకర్ణాలూ, నేతి జారీలూ, గరిటెలూ ఎవరో ఒకరి ఇంటినుండి తీసుకునివస్తే హాయిగా పనైపోయేది.

    కాలక్రమేణా ఇళ్ళూ ఇళ్ళస్థలాలూ మాయం అయిపోయి ఎపార్టుమెంట్లలోకి మారిపోయాయి.పదేసి గదులున్న ఇళ్ళల్లోంచి, అగ్గిపెట్టెల్లా ఉండే ఎపార్టుమెంట్లలోకి, మారగానే, ఉండడానికే స్థలం సరిపోవడంలేదాయె, ఇంక ఈ పాతసామాన్ల సంగతి ఎవడు పట్టించుకుంటాడు? అదేం చిత్రమో, ఈ రోజుల్లో చూస్తూంటాం, ఫ్లాట్ ఇరుగ్గా ఉందీ అంటే, అందరి కళ్ళూ ముందర, వంశపారంపర్యంగా వచ్చిన పాత సామాన్లమీదే. పైగా ఎక్కడికో మోసుకునికూడా వెళ్ళఖ్ఖర్లేదు. ఓసారి నెట్ లోకి వెళ్తే quikr, olex లూ ఉండనే ఉన్నాయి.వాళ్ళేవచ్చి తీసుకుపోతారు. ఎక్కడచూసినా ప్లాస్టిక్ సామాన్లే !

    ఈరోజుల్లో చూస్తూన్నదేమిటంటే, ఇంట్లో ఉండే “పాత” సామానులని, సాధ్యమైనంత త్వరలో మార్చేసి, వాటి స్థానంలో మార్కెట్ లోకి వచ్చిన ఏ electronic లేదా plastic వస్తువో కొనేసి, పని కానిచ్చేయడం. దానితో మనం ఏ ఏ వస్తువులతో పెరిగిపెద్దయామో ఆ వస్తువులు ఎవరో చెప్పగా, అంతర్జాలంలోనే చూసి సంతోషించే దుస్థితి లో ఉన్నాము.వాటిని ఏ museum లోనో చూసినప్పుడు, అలనాటి పాత సంగతులు గుర్తుచేసికుని, ఒకసారి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం… అదంతా nostalgia అని ఓ పేరు పెట్టి అందరితో పంచుకోవడం…
కానీ రాత్రనకా పగలనకా ఆ పాత సామాన్లతోనే జీవిస్తూన్న ఒక పుణ్యదంపతుల గురించి మీకు పరిచయం చేస్తున్నాను.పుణ్య దంపతులూ అని ఎందుకంటున్నానంటే, ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు, జీవితభాగస్వామి సహకారం తప్పనిసరి. లేకపోతే ఏమౌతుందంటే, భర్తగారు ఊళ్ళన్నీ తిరిగి విలువైన పాత సామాన్లు తెస్తూంటే, భార్య “ ఎందుకొచ్చిన సంత అండీ.. ఈ పాతసామాన్లన్నీ చేరేస్తున్నారూ… వాటిని తోమించలేక నా ప్రాణం మీదకొస్తోందీ..” అని కానీ అంటే, ఆ భర్త ఉత్సాహం మీద చన్నీళ్ళు చల్లేసినట్టే కదా… ఇక్కడ అలాటిదేమీలేదు. ఎందుకంటే వారిద్దరూ ఒకరిని మించినవారింకొకరు. దేశంలో ఎక్కడ “పాత” వస్తువు దొరుకుతోందని తెలిసినా వెంటనే వారిని సంప్రదించడమూ, ఆ సరుకేదో ఎంత ఖరీదైనా సరే తెచ్చేసికోవడమూ. ఊరికే కొనేసి సేకరించడంతో సరిపోతుందా, వాటికి తగిన జాగా చూసుకోవాలి. అంతే ఇద్దరికీ ఓ అద్భుతమైన ఆలోచన వచ్చేసింది– ఎలాగూ పూర్వపురోజుల్లో ఆ వస్తువులు ఉపయోగకరమైనవే కదా, వాటికి పూర్వస్థితిని కలిగిస్తే గొడవే ఉండదు. ఆలోచన రావడం ఏమిటి ఆచరణలో పెట్టేశారు. వాటన్నిటినీ functional చేసేశారు. చెప్పడం శులభమే కానీ, వాటి maintainence and upkeep మాటేమిటి, రెగ్యులర్ గా వాటిని తోమించడం.

    ఇవన్నీ చూసి శ్రీకృష్ణమూర్తిగారికి ఇంకేమీ పని లేదనుకోకండి. వృత్తి రీత్యా ఆయన ఓ గొప్ప consultant. ఈ రెండోది ప్రవృత్తిమాత్రమే. ఎంతమందికుంటుందండీ ఇంత శ్రధ్ధా? వీటన్నిటినీ చూడాలంటే ఎక్కడికో వెళ్ళఖ్ఖర్లేదు.. భాగ్యనగరం లోనే ఉంటున్నారు వీరు. వారింటికి వెళ్ళి మన చిన్నతనపు మధుర జ్ఞాపకాల్లోకి వెళ్ళడం మేము చేసికున్న అదృష్టం. నాకున్న limited పరిజ్ఞానం తో ఒక చిన్న విడియో తీశాను. ఇక్కడ చూడండి.ఇంకా వివరాలు తెలిసికోవాలంటే శ్రీ కృష్ణమూర్తిగారి సైట్ చూడండి.

20140511_133545

    అన్నీ చెప్పి ఇంకొక విషయం మర్చిపోయానండోయ్….పందిరి పట్టి మంచం20140511_122537

    ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు నోటివెంట శ్రీ ముళ్ళపూడి వారు చెప్పించినట్టు.. ” మడిసన్న తర్వాత కుసింత కలా పోసణ ఉండొద్దూ? “.

    YK sir.. you really made our day… Thanks a lot…