బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Wi-f ( e ) i

    దేనికైనా అలవాటు పడకూడదు కానీ, అలవాటంటూ పడ్డామా, అంతే సంగతి. అదో వ్యసనంలా తయారవుతుంది, “నల్ల మందు” లా. కానీ కొన్ని కొన్ని వ్యసనాలు , అదేదో సర్ఫ్ వారి యాడ్డులా “ మరక కూడా మంచిదే..” లాటి కోవలోకి వస్తాయి.అలాటిదే, ఈరోజుల్లో ప్ర్రతీవారికీ ఉండే “ అంతర్జాల శోధన”. యువతరం వారైతే, చేతిలో ఉండే smart phone తో ఏదో ఒకటి వెదుకుతూనే ఉంటారు. మన నోటినుండి మాట వచ్చిందంటే చాలు, ఇదివరకటి రోజుల్లోలాగ, వినేసి ఊరుకోరు. వెంటనే టక..టకా గూగులమ్మని అడిగేయడం. మన అదృష్టం బాగుందా, మనం చెప్పినదానిలోని లోటుపాట్లు, విడిగా చెప్తారు, లేకపోతే అక్కడికక్కడే వీధిన పెట్టేస్తారు.. ఇదేదో బాగానే ఉందని, వయసులో పెద్దవారు, అంటే నాలాటి అర్భకులన్నమాట, ఈ smart phone ల హడావిడి భరించలేక, ఏదో ఓ desktop నే నమ్ముకుని బతుకుతున్నారు. అంటే, BMW, Merc, Audi ఉంటున్న ఈ రోజుల్లో ఇంకా, Maruti 800 నే నమ్ముకున్నట్టన్నమాట. అంతర్జాలంలో కెలకడం ప్రారంభించినప్పటినుండీ, అంటే గత పదేళ్ళనుండీ, ఆ desktop తోనే కాలక్షేపం చేస్తున్నాను, పిల్లలు ఓ కొత్త Laptop ఇచ్చినా. ఊరికే అలంకారార్ధం గంధం సమర్పయామీ అన్నట్టు కాకుండా, దానికో ప్రింటరూ, కెమేరా అన్ని కూడా ఏర్పాటు చేశారు. పాతికేళ్ళ క్రితం కొన్న 286 లాగ, బోసిగా ఉంచకూడదుగా. మళ్ళీ వాటికో Broadband ఒకటుండొద్దూ, “ సూక్ష్మం లో మోక్షం “ అన్నట్టు, మన ప్రభుత్వ BSNL వారిదే తీసికున్నాను. ఏదో పనైపోతోంది. చవకలోనే అవుతోంది. Unlimited కి 500 అంటే చవకే కదా, ఈరోజుల్లో చూస్తే. అయినా అదేదో Laptop ఒకటుండడం వలనైతేనేమిటి, ఎప్పుడైనా ఏ ఊరైనా వెళ్తే “ పోజు” పెట్టి చూపించుకోడానికైతే నేమిటి, Idea వారి అదేదో డాంగిల్ ట అదోటి తీసికున్నాను. నేనేదో సుఖపడిపోతున్నానని మా ఇంటావిడ, ఇంట్లో నేనొకత్తినున్నానని మర్చిపోతున్నారా అంటే, తన ఫోనుకీ, అమ్మాయిచ్చిన Tab కీ కూడా, network mobility సదుపాయం తీసికున్నాను. కండిషను ఏమిటంటే, ఇంట్లో ఉన్నంతవరకూ BSNL wi-fi మాత్రమే ఉపయోగించాలీ అని, లేకపోతే బిల్లులు తడిపిమోపెడయిపోవూ ?

    ఏదో అప్పుడప్పుడు తప్పించి, BSNL వారి ధర్మమా అని ఇన్నాళ్ళూ కాలక్షేపానికి లోటేమీలేదు. అదేమిటో, గత రెండు నెలలుగా, తిప్పలు పెట్టడం ప్రారంభం అయింది. ఓ పదినిముషాలు పనిచేయడం, ఆగిపోవడం. నేనేమో 198 కి ఫోనుచేసి ఫిర్యాదు చేయడం. వాళ్ళేమో 1 నొక్కూ, 2 నొక్కూ, 3 నొక్కూ.. కాదూ అంటే # * తో ఓ పాతికపైన ఫిర్యాదులు వెళ్ళాయి.పైగా మొబైల్ లో ఓ sms ఫలానా నెంబరూ..అంటూ. నేను చేయడం, వారి wireman ఏదో చేయడం, బాగుపడడం, Exchange నుంచి ఓ ఫోనూ “ బాగుపడిందా..” అంటూ. కర్మకాలి ఆ టైములో పనిచేసేది, చేస్తోందీ అనడం తరవాయి, మళ్ళీ ఓ sms… “ your complaint no…. has been resolved..” అంటూ. పట్టుమని పదినిముషాలైనా కాకుండా, మళ్ళీ ఆగిపోవడం, నేనేమో మళ్ళీ 198 వాళ్ళతో రిజిస్టరు చేయడం. Action replay ప్రారంభం. విసుగెత్తిపోయిందంటే నమ్మండి, గ్యాసు సిలిండరు ఎప్పుడయిపోతుందో, గుండె కొట్టుకోడం ఎప్పుడాగిపోతుందో చెప్పలేమనేవారు… ఆ చిఠ్ఠా లోకి నా BSNL Broadband కూడా చేరిపోయింది. Standby గా అదేదో idea ది ఉందిగా, దానితో నా పని కానిచ్చేసుకునే వాడిని. మా ఇంటావిడకి కూడా, ఇంక wi-fi గురించి పట్టించుకోకుండా, ఇంట్లోకూడా ఆవిడ mobile network వాడుకోమని, ఓ “వరం” ఇచ్చేశాను. ఏదో అనుకోవడమే కానీ, నేను చెప్పాలా ఏమిటీ…. మనం చెప్పామూ అనుకోడం ఓ తుత్తి. నిజం చెప్పాలంటే, నేను ప్రతీరోజూ Facebook లో పెడుతూన్న సమాచారం తనే వెదికి పెడుతూంటుంది.అంతే కాకుండా, రోజంతా పాత పుస్తకాలు చదవడం, ఏదైనా విషయం ఉంటే, నాకు ఆ లింకు పంపడం.

   చెప్పొచ్చేదేమిటంటే, ప్రొద్దుటే లేవగానే , net ఉందో, లేదో చూసుకోడం, నూటికి తొంభై సార్లు ఉండేది కాదు. పోనీ 198 వాడితో రిజిస్టరు చేద్దామా అంటే, “ your complaint is already registered.. present status.. technical repair is in hand..” చచ్చినట్టు, ఎక్స్చేంజ్ కి వెళ్ళడం, నా గోడు చెప్పుకోడం, వాళ్ళేమో చేస్తాననడం. ప్రతీరోజూ ఇదో పనిగా తయారయింది. ఇంక ఇలా కాదని, పైఅధికారులకి చెప్తేనే కానీ, అయే పని కాదూ అనుకుని, ఆయనెవరో ఉంటే, వెళ్ళి ముందర నా గొడవంతా చెప్పాను. నా ఎదురుగుండానే, అందరినీ పిలిచి, విషయమేదో అడిగారు, వాళ్ళూ చెప్పారు. చివరకి ఆయన, అదేదో drop అంటే “చుక్కలు” కాదు, కిటికీలోంచి వైరు లాగి, కనెక్టు చేయమన్నారు. ఆ వైరుమాన్ వచ్చి మొత్తానికి అదేదో చేశాడు… కథ సుఖాంతం.

    ఏ గొడవా లేకుండా ఉంటే తోచడంలేదు. ప్రొద్దుటే లేవడం, నెట్ ఉందో లేదో చూసుకోడం.. ఎక్కడకి పోతుందీ.. లక్షణంగా ఉంది. అయినా అలవాటు పడ్డ ప్రాణం కదూ.. చివరకి మా ఇంటావిడ “ అస్తమానూ wi-fi ఉందా అని కాదు, wife గురించికూడా పట్టించుకోవాలి…” అని చివాట్లేసింది…
సర్వేజనా సుఖినోభవంతూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఉంటే పూర్తిగా ఉండాలి కానీ…

    సాధారణంగా పరిపాలనా వ్యవస్థ, అది దేశానికి సంబంధించినది అవనీయండి, రాష్ట్రానికి సంబంధించినది అవనీయండి, అంతదాకా ఎందుకూ, ఇళ్ళల్లో అవనీయండి, ఒక్కోరికి కొన్ని కొన్ని అధికారాలుంటాయి. . వాటినే కొండొకచో Administrative powers / Executive Powers గా విభజించారు, మన రాజ్యాంగ సృష్టికర్తలు. కంగారు పడకండి, ఇప్పుడు, నేను మీఅందరికీ civics లో క్లాసు పీకుతున్నాననుకోకండి. ఏదో , ఆ మాత్రం ఉపోద్ఘాతం చెప్తే, మీకు సుళువుగా అర్ధం అవుతుందని. అలాగని, మీ అందరికీ ఈ విషయాలు తెలియవనీ కాదు. అందరికీ తెలిసినవే, కానీ పెద్దగా పట్టించుకోరు. అధవా పట్టించుకున్నా, పోన్లెద్దూ.. ఎవరి గొడవలు వారికుండగా, మళ్ళీ ఇంకోటెందుకూ అనుకుంటారు..

   ఇంక అసలు కథలోకి వద్దాం. మన దేశం ఉందా, దానికి ఓ రాజధాని ఢిల్లి. ప్రపంచంలోని మిగిలిన దేశాల గురించి, అంతగా తెలియదనుకోండి, కానీ మన దేశ రాజధానిలో రెండు ప్రభుత్వాలున్నాయి. ఏదో ఇన్నాళ్ళూ, కేంద్రంలోనూ, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోనూ, ఒకే పార్టీ అధికారంలో ఉండేది కనుక, గొడవలేవీ ఉండేవి కావు.. సుఖంగా పాలించేవారు, హాయిగా కావాల్సినదేదో తింటూ. రోజులన్నీ ఒకేలా ఉండవుగా, ఆ కేంద్రపాలిత ప్రాంతానికీ, ఎన్నికలొచ్చాయి. అక్కడి ప్రజలేమో , కొద్దిగా బుధ్ధిజీవులాయె. అదేదో Intellectuals అంటారే అలాటివారు. వాళ్ళకి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిపాలనంటే, మొహం మొత్తేసి, ఆయనెవరో కేజ్రీవాల్ ట, ఆయనకి పట్టం కట్టేసి, పనిలో పనిగా, మిగిలిన జాతీయపార్టీలని తుడిచిపెట్టేశారు. అక్కడ కూడా ఓ చిత్రం ఉంది, ప్రధానమంత్రి శ్రీ మోదీ గారేమో, అదేదో “స్వఛ్ఛభారత్” నినాదంతో, అందరి చేతులకీ చీపుళ్ళు ఇచ్చి శుభ్రపరచమన్నారు. అదే టైములో ఢిల్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ కేజ్రీవాల్ గారి పార్టీ చిహ్నమేమో “ చీపురు”. ఓటర్లందరూ, చీపురుకనిపించేసరికి, మోదీగారి “స్వచ్చభారత్ “ గుర్తొచ్చి, ఆ చిహ్నానికి అన్ని ఓట్లూ వేశాసేరని జనాంతికం గా చెప్పుకున్నారు. మొత్తానికి పరిపాలన మొదలయింది. ఏమిటో అంతా గందరగోళం. రెండు చట్టసభలూ అవీనూ. ఏ పని చేయడానికీ , ముఖ్యమంత్రిగారికి అధికారాలు లేవుట. ఏం చేయాలన్నా, లెఫ్టినెంటు గవర్నర్ గారి అనుమతి తీసికోవాలిట. పైగా రాజ్యాంగంలో పొందుపరచిన అధికారాల పట్టీ అంతా ముందు పెట్టుకుని, ముఖ్యమంత్రిగారు ఏదైనా ఆర్డరు వేస్తే, వెంటనే వాటిని రద్దుచేసేస్తున్నారు. అదేదో “ అత్తగారు, కోడలు” సామెతలోలాగ. ఎవరినీ బదిలీలు చేయకూడదుట, పోలిసు వ్యవస్థ అంతా కేంద్రం చేతిలోనేట. మరి ఇంకెందుకూ, ఈ పదవులూ, సింగినాదాలూనూ. Executive Powers లేనప్పుడు, పాలన ఎలా వెలగబెడతారూ? ఊరికే ఉత్సవవిగ్రహం లాగ ముఖ్యమంత్రి అయితే కుదురుతుందా? దేశంలోని, ఏ గవర్నరుకీ, చివరకి రాష్ట్రపతికి కూడా లేని అధికారాలన్నీ, ఈ ఢిల్లీ ఆయనకే. పైగా, లెఫ్టినెంటు గవర్నరు కూడానూ. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పార్టీ అదికారంలో ఉన్నంతకాలమూ, ఛస్తే Statehood మాత్రం ఇవ్వరు. ఇస్తే, కొంప మునిగిపోదూ?

    దీనికీ, ఇళ్ళల్లో ఉండేదానికి సాపత్యం ఏమిటంటారా, ఇదిగో.. వస్తున్నాను అక్కడికే మరి. ఒకానొకప్పుడు, ఇంట్లో ఉండే కుటుంబపెద్దకి చాలా అధికారాలుండేవి. ఆయనేం చెప్తే అంత. ఎవరికీ, ఎదురుచెప్పే ధైర్యం ఉండేది కాదు. కాలక్రమేణా, ఆ కుటుంబ పెద్దలు అలనాటి ఉమ్మడికుటుంబాల్లోంచి, బదిలీ అయి ప్రస్తుతపు Nuclear Family ల్లోకి వచ్చారు. రావడం వరకూ వచ్చారు. కానీ పరిస్థితి ఇదివరకటిలా కాదే. ఢిల్లీ ముఖ్యమంత్రిగారిలాగానే , ఒకనాటి “కుటుంబ పెద్ద” కూడా back seat లోకి వెళ్ళిపోయారు. ఏదో తల్లితండ్రులు మాతోనే ఉంటున్నారూ, అని చూపించుకోడానికి తప్ప, వీళ్ళూ ఉత్సవవిగ్రహాలే. Mothersday, Fathersday లకీ బొకేలు తీసికోవడమూ, ఫొటోలు తీసికుని Facebook లో పెట్టుకోడానికీ తప్ప ఇంకో ప్రయోజనం లేదు. పోనీ అలాగని వీళ్ళకేమీ పని లేదనుకుంటున్నారా, పనికి ఆహారం పథకంలో లాగ వీళ్ళకీ ఓ పనుంటుంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళే ఈరోజుల్లో, విశ్వాసపాత్రం గా పడుండేవారు వీళ్ళే కదా. మళ్ళీ “పోలికలు” చెప్తున్నానని అనుకోపోతే, ఢిల్లీ ముఖ్యమంత్రిగారిలాగ, వీరికీ Executive Powers ఉండవు. ఇంట్లో ఉండే పిల్లలు , ఈ పెద్దాళ్ళ మాట ఛస్తే వినరు. ఏం చెప్పినా, मम्मी ने बोला.. అనో, Daddy knows it అనే అంటారు, కానీ , పోనీ ఈ పెద్దాళ్ళు మన మంచికే చెబుతున్నారేమో అనే ఆలోచనా రాదు, వాళ్ళ తల్లితండ్రులు చెప్పా చెప్పరు.. పైగా Administrative Power అనేదుందిగా, ఏదైనా జరగరానిది జరిగితే ఏదో సంఝాయిషీ చెప్పుకోడానికి తప్ప ఇంకెందుకూ ఉపయోగించదు ఆ అధికారం.
నేను చెప్తున్నదానిలో ఏదైనా అతిశయోక్తి ఉందా చెప్పండి. పైగా ఏవిషయంలోనైనా , ఇంట్లో ఉన్న పెద్దవారు నియంత్రించేరంటే చాలు, వెంటనే, ఆఫీసులో ఉన్న మమ్మీకో, డాడీ కో ఫోను చేసేయడం. అక్కడేమో వాళ్ళు ఏ మీటింగులోనో ఉంటారు. వారి “ఆంఖో కా తారాల “ ఫోను రావడం తరవాయి, వీళ్ళడిగిన గొంతేరమ్మ కోరికలకి OK Beta/Beti అనేస్తారు, ఆ పిల్లలేమో Speaker ఆన్ చేసి మరీ వినిపిస్తారు, ఆ పెద్దవాళ్ళకి. పోనీ, ఫోను తాతయ్యకో, అమ్మమ్మకో ఇయ్యీ మాట్టాడతాను అనొచ్చుగా, అబ్బే, మీటింగు హడావిడిలో మళ్ళీ ఇదెందుకూ అనుకుంటారు. పోనీ సాయంత్రం పిల్లలు ఆఫీసునుండి వచ్చిన తరువాత, ఏదో మాటల్లో చెబుదామనుకున్నా, “పోనిద్దురూ మీరు మరీనూ … “ అని పెద్దాయనగారి ఇల్లాలు కొట్టిపారేస్తుంది.

    అసలు ఈ గొడవంతా ఎందుకంటే, ఈవేళ ఏదో మాల్ కి వెళ్ళాను. అక్కడ బిల్లింగు కౌంటరు దగ్గర, ఓ పెద్దాయన, తన మనవడు ట్రాలీలో పెట్టిన ఓ చిప్స్ ప్యాకెట్ పక్కకి పెట్టేస్తూంటే, ఆ మనవడెమో माम्मी को पूछा.. ठीक है बोली.. అప్పుడు ఆయన హావభావాలు చూసిన తరువాత ఈ టపా..
ఇప్పుడర్ధమయిందా, రెండు రకాల “ అధికారాలకీ “ ఉండే తేడా ఏమిటో..

   సర్వేజనా సుఖినోభవంతూ…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– కొత్త గొడవ….

    మొత్తానికి Nestle వారు noodles ని వెనక్కి ( అదీ తాత్కాలికంగా) తీసికున్నారుట. శుభం.. ప్రభుత్వాలు చేస్తూన్న ఈ “ నిషేధాల” వలన ఏదైనా ఒరుగుతుందంటారా? అంటే NO అనే సమాధానం వస్తుంది. దేశంలో వందలాది వస్తువులమీద ఇలాటి నిషేధాలు సవాలక్ష ఇప్పటికే ఉన్నాయి. అలాగని అవి లభించడం ఏమైనా ఆగిందా? హాయిగా కావాల్సినవారికి దొరుకుతూనే ఉన్నాయి. ఇదివరకటిరోజుల్లో, అంటే మద్యనిషెధం ఉన్నరోజుల్లో, సారాబట్టీలు అనేవి ఉండేవి. అలాగే మత్తు కలిగించే పదార్ధాల మీద కూడా నిషేధం ఉంది. అలాగని అవి దొరకడం లేదా? అలాగే 60- 70 లలో విదేశీ వస్తువుల మీద నిఘా ఉండేది. బంగారం, వాచీలూ, ఎలక్ట్రానిక్కు వస్తువుల మీద ఎన్నెన్ని నిషేధాలున్నా, హాయిగా దొరికేవి. అంతదాకా ఎందుకూ, సినిమాల సీడీ లు పైరసీ చేయకూడదూ అన్నారు, ఏ ఫుట్ పాత్ మీద చూసినా దొరుకుతాయి. సినిమా విడుదలతో సంబంధంలేదు. అదేదో “ ఘుట్కా” విషయమే తీసికోండి, తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఏ కిళ్ళీబడ్డీలో చూసినా వేళ్ళాడుతూ ఉంటాయి. మరి ప్రభుత్వ ఆర్డర్లు ఏ గంగలోకెళ్ళినట్టూ?

   అక్కడికేదో మన దేశంలో చట్టం అంటే అక్కడికేదో పెద్ద “గౌరవం “ ఉన్నట్టు మాట్టాడేస్తూంటారు, అందరూ. విమానాల్లో లైటర్లూ అవీ నిషేధం అన్నారు. దానికి ఓ “ గౌరవనీయ” కేంద్ర మంత్రిగారైతే… “ కొన్నేళ్ళనుండి నేనైతే సిగరెట్టూ, లైటరూ జేబులోనే పెట్టుకుంటున్నాను..” అని ఓ “ఘనకార్యం “ లా చెప్పుకున్నాడు. చిత్రం ఏమిటంటే, ఆయనగారే విమానాలూ గట్రా విభాగానికి మంత్రి. ఇలా ఉంటుంది.. చట్టాల దారి చట్టాలదే, నాయకుల దారి నాయకులదే… పర్వారణం మీదైతే లెక్కలేనన్ని చట్టాలున్నాయి. అలాగని అన్నీ పాటిస్తున్నారా? నదులలో నీళ్ళు ఎలా ఉన్నాయో చెప్పక్కర్లేదు.

    ఈ మాయదారివన్నీ దేశంలోకి ఎప్పుడొచ్చాయిట? ఇదివరకటిరోజుల్లో ఎప్పుడైనా విన్నామా అసలు? ఏదో “ గొల్లభామ “ మార్కు పాలడబ్బాతొ మొదలయిన Nestle వారు ప్రతీ దాంట్లోకీ వచ్చేశారు. ఈ జంక్ ఫుడ్ అన్నది ఓసారి రుచిచూశారా అంటే చాలు, వదిలేది లేదు. ఏం కలుపుతారో తెలియదు. అలాగని రాత్రికి రాత్రి ఏదో అయిపోతుందనీ కాదూ, మరీ అలా అయిపోతే వాళ్ళ వ్యాపారాలు పెరగొద్దూ, ఆరారగా తింటూండాలి, డబ్బులు తగలేస్తూండాలి, ఆరోగ్యాలు మంట కలుపుకుంటూండాలి… ఎంత కథా ఎంత కమామీషూ?

    ఎక్కడ చూసినా రెడీ మేడ్ తిళ్ళే. ఒళ్ళొంచి పనిచేయడానికి బధ్ధకం. ఓ ప్యాకెట్ పిల్లాడికిచ్చేస్తే, తినేసి పడుంటాడు. పైగా వాటిల్లో ఎకానమీ ప్యాక్కులూ, ఫామిలీ ప్యాక్కులూనూ. ఏదో మాయదారి బ్రాండు ఒకటి రావడం తరవాయి, మన సినిమావాళ్ళూ, లేదా ఆటగాళ్ళూ తెయ్యిమంటూ హోరెత్తేయించేయడం. రాత్రీ పగలూ. టీవీ ముందర కూర్చోడం తరవాయి, ఒకడేమో ఫలానాది తినమంటాడు, ఇంకోడేమో ఫలానా హౌసింగులో డబ్బెట్టమంటాడు, ఇంకోడు ఫలానా బట్టలసబ్బే వాడమంటాడు, ఇంకో చిత్రం ఏమిటంటే, ఆ బట్టలుతకమనేవాడు, సాధారణంగా సినిమాల్లో ఛాన్సొస్తే, పైబట్టలు విప్పేస్తాడు, కానీ ఈ బట్టలసబ్బు యాడ్ లో మాత్రం తీయడు. అంటే తనకే నమ్మకం లేనట్టా? అలాగే ఇంకోడు గిన్నెలు తోమే పవుడర్, Toilets లో వాడుకునే liquid ఇలా అర్ధం పర్ధం లేకుండా, డబ్బులొస్తున్నాయి కదా అని ఎడా పెడా వాగేయడం. అసలు ఆ వస్తువులు/ డ్రింకులు/ తిండి పదార్ధాలూ వాడిన మొహాలేనా అవి? వాడెమంటే నమ్మాలి.. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే చాలు, ఎవడెగంగలోకి పోయినా, వాళ్ళకేమీ నష్టం లేదు. కొన్నేళ్ళ క్రితం , మన భారతరత్నం గారు, అదేదో Hometrade అని ఓ కంపెనీకి ప్రకటనలు చేశాడు, తీరా నమ్మి డబ్బులు పెట్టినవాళ్ళందరికీ చిప్ప చేతికొచ్చింది. బాగుపడ్డవాళ్ళెవరయ్యా అంటే, భారతరత్నాలూ, సినిమా వాళ్ళూ, ఆ కంపెనీ వాళ్ళూనూ.

    ఈ నూడుల్స్ మాటలా ఉంచితే, ఇంకా చాలానే ఉన్నాయి. అవేవో బర్గర్లూ, పీజాలూ—ఎప్పుడో ఎవడొ వీళ్ళ వెనక్కాలకూడా పడతాడు. అసలు ఎవరో ఏదో చెప్పాలని కాకుండా, మనంతట మనమే ఓ నియంత్రణ పెట్టేసికోవచ్చుగా. నికమే, ఈరోజుల్లో ఎవరికీ టైముండడంలేదు, వంటా వార్పూ చేసికోడానికి, ఆ కారణం తోనే కదా, వీటన్నిటి వెనక్కాలా పడుతున్నది. తినొద్దని ఎవరూ అనరు. కానీ దానిక్కూడా ఓ లిమిటంటూ ఉండాలి. చాలామంది వైద్యం పేరుతో, ఓ “ చుక్క “ వేసికుంటారు. అలాగని వారి ఆరోగ్యాలు పాడైపోవడంలేదుగా, ఏదో “ ఔషధం” లాగ తీసికుంటారు.

    అఛ్ఛా, ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు న్యూడుల్స్ ని తీసేశారండి, రేపణ్ణుంచి తినడం మానేస్తారంటారా? ఇదివరకు పబ్లిక్ గా తినేవారు, ఇటుపైన చాటుగా తింటారు అంతే తేడా. మనదేశంలో ఏదైనా నిషేధించారంటే దానిమీద “ మోజు” ఎక్కువైపోతుంది. ఏది తీసికోండి, ఈ ఒరవడే కనిపిస్తుంది. అందులోనూ, చిన్నపిల్లలకి ఇన్నేళ్ళనుండీ అలవాటు చేసి, ఇప్పుడు మానేయమంటే అంత సుళువా? ఇంట్లో పెట్టకపోతే ఏ స్నేహితుడింటికో వెళ్ళి తింటాడు. పెద్దవారికే దిక్కులేదు, ఇంక చిన్నపిల్లల్ని నియంత్రించగలరంటారా? ఈవేళ టీవీల్లో దేశమంతా జరుగుతూన్న so called ఆందోళనలు చూపించారు. అందులో చిన్నపిల్లలందరూ ఆ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లని మంటల్లో వేస్తున్నట్టు. టీవీల్లో కనిపిస్తారంటే, ఎవడైనా చేస్తాడు.పైగా అలా చేసినందుకు , ఫీజు గా ఓ పదిపదిహేను ప్యాకెట్ల మ్యాగీలిచ్చినా ఇచ్చుండొచ్చు. ఎవడు చూడొచ్చాడు? Endorsement లు చేసేవాళ్ళు డబ్బులు తీసికోవడం లేదూ, ఇదీ అలాగే…

    చివరగా ఇంకో సంగతి—బజారులో దొరికే నానా చెత్తా పిల్లలకి పెట్టొద్దని ఇళ్ళల్లో పెద్దవారు మొత్తుకుంటూనే ఉంటారు. వింటేగా… ఎవడో బయటివాడు చెప్తే అదే వేదవాక్కు…

   సర్వేజనా సుఖినోభవంతూ…