బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు– చిరాకులు,పరాకులు

   ప్రపంచంలో ఎక్కడైనా ఓ బెస్ట్ ఎస్కేపిస్ట్ రూట్ ఉందంటే అది ‘చిరాకు’. దీన్నడ్డబెట్టుకుని, ఎటువంటి విషమ పరిస్థితుల్లోంచైనా, వీధిన పడకుండా బయట పడిపోవచ్చు!ఏ పిల్లాడైనా, బయటివాళ్ళే అవఖ్ఖర్లేదు మన పిల్లలైనా సరే మనకి తెలియని ఏ పొడుపుకథో అడిగాడనుకోండి, చిరాగ్గా మొహం పెట్టేసేమంటే చాలు, వాడు మనదగ్గరకి రాడు! ఈ చిరాగ్గా మొహం పెట్టడమనేది కొద్దిగా ప్రాక్టీసు చేస్తూండాలి. మరీ రాత్రికి రాత్రే రాదుగా! సరిగ్గా ప్రాక్టీసు చేయకుండా, చిరాగ్గా మొహం పెడదామని ప్రాక్టికల్ గా చేయడానికి ప్రయత్నించామా,పట్టేస్తారు.
కొంతమందికి ఈ చిరాగ్గా మొహం పెట్టడమనేది జన్మతోనే వచ్చేస్తుంది. కొంతమందిని చూస్తూంటాము, ఎప్పుడూ మొహం చిటపటలాడిస్తూంటారు.ఏం అడిగితే ఏం ముంచుకొస్తుందో అనే అనిపిస్తూంటుంది.చాలామంది వీరినుంచి సేఫ్ డిస్టెన్స్ లో ఉంటారు. అదేకదా కావలిసిందీ వీళ్ళకి!కొంతమందైతే,ఊళ్ళో జరిగే ప్రతీ విషయంలోనూ వేలెడుతూనేఉంటారు, తిన్న తిండరక్క.వీళ్ళు ఊళ్ళో అందరి సమస్యలూ, స్వంతంగానే భావించేస్తూంటారు.అదో కాలక్షేపం!

పైగా ఈ చిరాకు ఓవర్ డోస్ అయితే, ఒక్కొక్కప్పుడు మనమీదకే బూంరాంగ్ అవుతూంటుంది.అందుకే స్పేరింగ్ గా వాడుతూండాలి.ఓ హోటల్ కెళ్దామన్నా,పిల్లలు ఏ సినిమాకో వెళ్దామన్నా, నెలకో రెండు నెలలకో ఓమాటు తీసికెళ్తూండాలి.లేదా ఎప్పుడో భార్యతో స్వీట్ నథింగ్స్ చెబ్దామనుకుని దగ్గరకు వెళ్తే, అబ్బ చిరాగ్గా ఉందండీ అందనుకోండి, గోవిందా గోహోవిందా!!ఓ ఆర్నెల్లు సావాసం చేస్తే వాళ్ళు వీరౌతారంటారు. అలాగే ఓ ఏడాది తిరిగేసరికల్లా, భార్య, భర్త గారు ఎప్పుడు నిఝంగా చిరాకు పడుతున్నారూ, ఎప్పుడు ఏక్టింగ్ చేస్తున్నారూ అనే విషయం కనిపెట్టేస్తుంది. అందుకే ఈ జాగ్రత్తలన్నీనూ!

అందువలన ఇంటావిడతో వేషాలు వేయకుండా ఉంటే, ఒక్కోప్పుడు ఆవిడే మన రెస్క్యూకి వచ్చేస్తూంటుంది.అదన్నమాట మూలసూత్రం! ఇదివరకటి రోజుల్లో,క్రొత్తగా పెళ్ళై, ఏ పండక్కో పబ్బానికో అత్తారింటికి వెళ్ళినప్పుడు,అల్లుడిగారి/అమ్మాయిగారీ, గొంతేరమ్మ కోరికలన్నీ, ఈ ‘చిరాకు’ ముసుగులో, తీర్చేసికునేవారు.అప్పటిదాకా అమ్మా నాన్నలంటే ఉన్న అభిమానం కాస్తా మాయం అయిపోయి, తనూ, తన భర్తా,తన సంసారం గురించే ఆలోచనలు. మరీ ఏ వస్తువైనా తనకే కావాలీ అనుకుందనుకోండి,’అదేమిటో నాన్నా, ఆయనకి ప్రతీరోజూ బస్సులు పట్టుకుని ఆఫిసుకెళ్ళాలంటే చిరాకు పడుతున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలిసిపోతున్నారు, ఓ అచ్చటా లేదూ,ముచ్చటా లేదూ. ప్రతీ దానికీ చిరాకే.పోనీ ఈ పండక్కి మిమ్మల్ని ఓ స్కూటరు కొనిపెడతారేమో అడుగుదామనుకుంటున్నాను’ అంటుంది.ఇలా ఒక్కో పండక్కీ, ఒక్కో వస్తువు చొప్పునా ఇల్లంతా కానీ ఖర్చు లేకుండా ఫర్నిష్ చేసేసికోవచ్చు. పాపం ఆ పెద్దాయనకి ఒకత్తే కూతురైతే ఫరవా లేదు, అలా కాకుండా ఓ ఇద్దరో ముగ్గురో కూతుళ్ళనుకోండి ( ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ఒక్కో ఇంటికీ ఇద్దరో ముగ్గురో కూతుళ్ళూ, వారి ధర్మాన అల్లుళ్ళూ ఉండేవారు!),పాపం ఆయన పరిస్థితి ఏమిటీ?
కట్నాలూ,కానుకలూ ఆడపడుచు లాంఛనాలూ పెళ్ళిలో వడుక్కోవలసినవన్నీ, ముందరే లాగించేశారు, పెళ్ళైన తరువాత ఇదో దోపిడీ! తన పెళ్ళైపోయినతరువాత, ఇంట్లో ఉండే చెల్లెళ్ళు ఏం దోచుకుపోతారో అని దుగ్ధ! భర్త చిరాకు పేరుతో పుట్టింటారిల్లు గుల్ల చేసిన వారు ఎంతో మందున్నారు. ఇందులో భర్త అనే ప్రాణి ఓ పాసివ్/సైలెంట్ స్పెక్టేటరు మాత్రమే! అంటే ఇక్కడ జరిగిందేమిటంటే టోటల్ మిస్యూజ్ అన్నమాట!

చెప్పొచ్చేదేమిటంటే ఈ ‘చిరాకు’ ఇస్పేటాసు లాటిదన్నమాట. పోనీ రమ్మీ లో జోకరు లాటిదనుకుందాము.ఎక్కడైనా,వాడేసుకోవచ్చు.రోడ్డుమీద ఏ అడుక్కునేవాడైనా కనిపిస్తే చాలు, చిరాకు పడ్డం ఓ స్టైలూ! అంతదాకా ఎందుకూ, ఏ కూతురి పురిటికో, కోడలి పురిటికో విదేశాలకి వెళ్ళొచ్చారంటే చాలు, మన దేశంలో ప్రతీదీ చిరాకే!అంత పుట్టిపెరిగిన దేశంమీదా, మనుష్యులమీదా చిరాకు పడేవాళ్ళు అక్కడే ఉండిపోవచ్చుగా? అబ్బే, పిల్లలకి వీళ్ళంటే చిరాకూ మరి.”అవన్నీ ఎక్కడ చెప్పుకుంటాము, చులకనైపోమూ, మరీ ఇంటివిషయాలు ఊళ్ళోవాళ్ళందరితోనూ టముకేసుకుంటామా ఏమిటీ? ఏమిటో చదివేవాళ్ళున్నారు కదా అని ఏమిటేమిటో వ్రాసుకుపోతున్నాడీ పెద్దాయన, అందుకే అసలు ఆయన టపాలు చదవడమంటే
‘చిరాకు’ నాకు”-అనుకునేవారూ ఉన్నారు.

రైలు ప్రయాణాల్లో చూస్తూంటాము, మనం తినిపడేసిన వేరుశనగ తొక్కలూ అవీ, క్రింద పడేసిన మిగిలిన చెత్తా చదారమూ, తుడవడానికి చిన్న చిన్న పిల్లలు వచ్చి తుడుస్తూంటారు. పూర్తిగా తుడిచేసి, ఓ రూపాయో, రెండో ఇస్తే పుచ్చుకుందామని చెయ్యి చాపుతారు. వాళ్ళని చూడగానే ఎక్కళ్ళేని చిరాకూ వచ్చేస్తుంది చాలామందికి, ఎంతో బిజీగా ఉన్నట్లు పక్కకుతిరిగేయడమో, లేకపోతే మనకున్న మొహానికి ‘చిరాకు’ పులిమేసికోవడమో.ఇంక వాడికేమీ ఇవ్వఖ్ఖర్లేదుగా
ఇదో ఉపయోగం ఈ చిరాకు వలన.ఏ కుక్కంటేనో భయం అనుకోండి, మరీ భయం అంటే బావుండదుగా, ‘ఏమిటోనండీ నాకు మాత్రం ఈ కుక్కలంటే మహ చిరాకులెండి’అనడం, అక్కడికేదో పెద్దపులీ, సింహం అంటే అభిమానంలాగ! ఏ సర్కస్ లోనో బోనులో వదిలేస్తే కుదురుతుంది రోగం !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం

Dilse dil

   మొన్న ఆదివారం ‘ఈనాడు’ లో మా గ్రంధాలయం గురించి వచ్చిన తరువాత, కొందరు ఫోను చేసి, వివరాలు తెలిసికుని, సభ్యత్వం తీసికున్నారు. ఆ హడావిడిలో పడి, టపా వ్రాయడం కొద్దిగా వెనకబడింది. అదేదో నేను టపా వ్రాయకపోతే, దేశానికి నష్టం అనికాదు కానీ, ఏదో అలవాటు పడ్డ ప్రాణం !

   ప్రొద్దుటే 7.00 గంటలకల్లా రెడీ అయి, మా ఇంటికి వెళ్ళి, నవ్య ని స్కూలు బస్సెక్కించి, అగస్థ్యతో ఓ గంట కాలక్షేపం చేసి, తిరిగి మేముండే ఇంటికి వచ్చేస్తున్నాను.ఎండలు పేల్చేస్తున్నాయి.ఇంకా ఏప్రిల్ రాలేదు, అప్పుడే 39 డిగ్రీలు.ఇంక అసలు వేసంకాలం వచ్చిందంటే, ఎలాగుంటుందో?

   ఈ మధ్యన కొత్తవారితో పరిచయాలు బాగానే అవుతున్నాయి. మొన్నెప్పుడో పూణె లో కొత్తగా వచ్చిన ఒకతని టపా చదివి, నా ఫోను నెంబరిచ్చాను వ్యాఖ్య రూపంలో. ఈవేళ ఫోను చేశాడు. తనది పసలపూడి ట! ఈ శనివారం కలుద్దామనుకుంటున్నాము. ఒకరోజు, నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుగారిని కలిశాను.ఆయన వారి అబ్బాయి దగ్గరకు వచ్చారు.ఆయనని కలిసే ముందు, మా అమలాపురం ఆయనొకాయన్ని కలుద్దామని వెళ్ళి, ఓ రెండు గంటలు బోరు కొట్టాను. చిత్రం ఏమిటంటే, మా గురువుగారూ, ఈయనా అమలాపురం లో పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవారుట.నా ద్వారా మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు ఫోన్లోనేలెండి.అలాగే మా క్లాసుమేట్ ఒకతని కుమారుడు ఈ ఊళ్ళోనే పని చేస్తున్నాడు, అదీ మా గురువుగారిద్వారానే తెలిసింది. ఆ అబ్బాయిక్కూడా ఫోను చేసి పరిచయం చేసికున్నాను, ఎప్పుడో వీలు చూసుకుని కలవాలి.

   వచ్చే సోమవారం, ఉగాది సందర్భంగా జరిగే కార్యక్రమానికి వెళ్తే ఇంకా కొందరిని పరిచయం చేసికోవచ్చు.ఈనాడు లొ నాగురించి చదివిన తరువాత,ముంబై నుండి ఒకాయన అభినందిస్తూ ఫోను చేశారు.చాలా సంతోషమేసింది.ఆయనెవరో నాకు తెలియదు.కానీ, ఆయన మాట్లాడిన పధ్ధతీ, అభినందించిన తీరూ,it made my day! ఇవే కదండీ జీవితంలో చిన్ని చిన్ని ఆనందాలూ!

   ఏమిటో రిటైరయిన తరువాత బిజీబిజీ అయిపోయాను. ఉద్యోగంలో ఉండేటప్పుడు అదో రకమైన బాధ్యతా.కానీ it was systematic. ఏదో ఆఫీసులో పనీ, అది పూర్తిచేయడం, తిండం,నిద్రపోవడం, మళ్ళీ ఆఫీసూ. రిటైరైన తరువాత ఎలాగరా బాబూ, అనుకున్నంత సేపు పట్టలేదు, ఓ ఉద్యోగం లేదూ, సద్యోగం లేదూ అయినా సరే టైమనేది ఉండడంలేదు చేతిలో.మా అమ్మాయైతే ఫోను చేసినప్పుడల్లా, కోప్పడుతూంటుంది,ఊరికే తిరక్కూ, రెస్ట్ తీసికుంటూండూ అని.ఏది ఏమైనా,I am enjoying every moment of it. ఉన్నవాటికి సాయం, నా మిస్టరీ షాపింగైతే ఉండనే ఉంది. క్రిందటి వారంలో క్రోమా కి వెళ్ళి, నా కెమేరాలొకి సెల్స్ కొనుక్కున్నాను. పాపం కెమెరాతో ఇచ్చిన బ్యాటరీలు, రీచార్జ్ చేసి చేసి,ఒట్టిపొయాయి ! ఒట్టిపోవడం అంటే తెలుసుగా, ఆవులూ, గేదెలూ పాలివ్వడం మానేసినట్లన్నమాట !

   ఇంకో విషయమండోయ్, నేను ఆంధ్రభూమి లో వ్రాసిన ‘దిల్ మిల్’ వ్యాసానికి స్పందిస్తూ శ్రీమతి శారదా అశోక్ వర్ధన్ గారు ఒక వ్యాసం వ్రాశారు. పైన ఎడం చేతివైపు పెట్టిన Dilse dil మీద ఓ నొక్కునొక్కండి,చదవొచ్చు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

మా గ్రంధాలయం గురించి ఈనాడు ఆదివారం మహరాష్ట్ర ఎడిషన్ లో ప్రచురించారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

www.indianexpress

   నేను వ్రాసిన ఒకవ్యాసం ఆంధ్రభూమి దిన పత్రికలో ప్రచురించారు. నేను దగ్గరనుండి చూసినవీ, విన్నవీ, పేపర్లలో చదివినవాటి గురించే టపాలు వ్రాస్తూంటాను. నా టపాలు చదివేవారు, ఎలా చూసినా కొద్దిమందే. పోనీ మనదేశం లో అడుగుపెట్టి, పేపరు చదివేవాళ్ళను కూడా బోరు కొడదామనే సదుద్దేశ్యంతో, న్యూస్ పేపర్లలోకెక్కాను. పైగా వారు పెట్టిన షరతేమంటే, నేను వ్రాసే వ్యాసం ఇంకెక్కడా ప్రచురింపబడనిదీ అని ఓ అండర్ టేకింగ్ కూడా ఇమ్మన్నారు.

   దానికేముందీ, మన దేశంలో విషయాలకేమైనా కరువా ఏమిటీ? పరిశీలించే ఓపిక ఉండాలి. దానికేమీ లోటు లేదు, నా విషయంలో. పోనీ, ఎక్కడో అక్కడ, దేశంలో చాలా ఇళ్ళల్లో ( భాష ,ప్రాంతం ఏదైనా సరే) జరిగే సంగతే కదా అని
దిల్ మిల్ అని ఓ వ్యాసం వ్రాశాను. ఆ వ్యాసం లింకు ఇస్తూ ఓ టపా వ్రాశాను. అనుకుంటూనే ఉన్నాను, ఇలాటి సెన్సిటివ్ టాపిక్కులు వ్రాసేటప్పుడు, Bouquets and Brickbats రెండూ వస్తాయీ అని! మా ఇంటావిడ కూడా ముందే చెప్పింది, ఏ టాపిక్కూ లేనట్లుగా, దీని గురించి వ్రాస్తారేమిటండి బాబూ అని.

   నేను గమనించిందేమిటంటే, నేను వ్రాసిన వ్యాసం కొత్తకోడళ్ళకి నచ్చదు. అత్తగార్లైన వారు ‘పోనీ మనం వ్రాయకపోయినా,ఎవరో ఒకరికి తట్టిందీ’ అనుకుంటారు. ఇంక కొంతమంది, అంటే ఇంకా అత్తగార్లు కానివారు అనుకుంటారూ ‘ఆ శోద్యం కాపోతే, మరి అంత అన్యాయంగా ఉంటారా ఏమిటీ’ అనుకున్నా అనుకోవచ్చు.ఒకసారి అనుభవం అయితేనే కదా తెలిసేది.అప్పటికీ నేను ఆవ్యాసంలో చెప్పనే చెప్పాను- అవేవో ప్రాణహారకం అయే దెబ్బలాటలు కావూ..’ అని.
Bottomline ఏమిటంటే, ఇద్దరి విభిన్న మనస్థత్వాల మధ్య జరిగే కమ్యునికేషన్ గ్యాప్పు.ప్రతీ వారికీ తెలుసు, తమ మాటే నెగ్గాలని, అవతలివాళ్ళేమైపోయినా ఫరవాలేదూ అని ముందర భావించినా, ఎప్పటికో అప్పటికి తెలుసుకుంటారు.
జనరల్ గా ఏమౌతూంటుందంటే,కొత్తకోడలి జోష్ మాత్రం ఎంతకాలం ఉంటుందీ? తనకీ ఓ నలభై యాభై ఏళ్ళొచ్చేటప్పటికి, ఇంట్లో పిల్లల డక్కా మొక్కీలు తిని తిని, చివరకి అత్తగారు పాపం ఎలా వేగేవారో అనుకునే పరిస్థితి వస్తుంది.కానీ కోడలిలో ఈ మార్పు వచ్చేటప్పటికి, ఈ అత్తగారు మంచమైనా ఎక్కుతుందీ, లేక తన అత్తగారిని కలుసుకోడానికి పైలోకానికి వెళ్ళిపోతుంది.

   ప్రతీ విషయానికీ బొమ్మా బొరుసూ అనేవి ఉంటాయి. పోనీ నేను వ్రాసినదేదో అత్తగార్ల పక్షం మాత్రమే అనుకుందాము.ఈ మధ్యన పూణె లో జరిగిన సంఘటన గురించి వార్త పైన ఇచ్చాను. అలాగని ప్రతీ కోడలూ అలాగే ఉంటుందనుకుంటామా? Definetely not.ఈ సంఘటన లోనూ, “కొడుక్కి విడిగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కదా, ముంబైలో జాబ్ తెచ్చుకున్నాడూ, ఆమాత్రందానికి కొత్తకోడలేదో ఆరళ్ళు పెట్టేస్తోందని, కోడలుమీద పడి ఏడిచి, ఆత్మహత్య చేసికోవాలా?” అనికూడా అనుకోవచ్చు. ఏది ఏమైనా కొత్తకోడలు వచ్చిన తరువాత ఇంటి పరిస్థితిలో మార్పనేది వచ్చిందా లేదా? అదేవిషయాన్ని నా దృష్టిపధం లో వ్రాశాను.మరీ ఇంతంత విపరీతాలు జరుగుతాయని కాదూ, ప్రారంభం ఎలా అవుతాయనే వ్రాశాను.

   అన్నిటికంటే చిత్రం ఏమిటంటే, వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఎంతంత ప్రఛ్ఛన్న యుధ్ధం చేసికున్నా బయటివాళ్ళొచ్చేసరికి ఒక్కటై పోయి, వాళ్ళ పని పట్టేస్తారు !!

   పూణే లో జరిగిన సంఘటన వివరాలు చదవడానికి పైన ఇచ్చిన http://www.indianexpress మీద ఓ నొక్కు నొక్కండి చాలు..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఆంధ్రభూమి లో నా వ్యాసం

Dilmil

ఈవేళ్టి ( 22/03/2011) ఆంధ్రభూమి దిన పత్రికలో నేను వ్రాసిన వ్యాసం ప్రచురించారు.మాకు ఇక్కడ (పూణెలో), ఈ పత్రిక దొరకదు. నెట్ లో చదివి చాలా సంతోషించాను. ప్రింటు మీడియా లో ఇది నా మొదటి రచన.</font

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-బ…ధ్ధ..కం–2

   టపా వ్రాయడానికి ఎంత బధ్ధకం అయిందీ అంటే, పైన శీర్షిక వ్రాయడానికి కూడా బధ్ధకమే ! నిన్న వ్రాసిన టపా కి మొదటి విక్టిం నేనే అవుతానని కలలో కూడా ఊహించలేదు.నేను వ్రాస్తున్నప్పుడు, మా ఇంటావిడ ‘బధ్ధకం’ గా నిద్రపోతూంది. క్రిందటివారం అంతా, చి.అగస్థ్యతో ఆడి ఆడి అలిసిపోయి మేముండే ఇంటికి వచ్చాము. ప్రొద్దుట బాగానే ఉంది, ఏమొచ్చిందో సాయంత్రం నేను వ్రాసిన టపా చదివి,పోనీ ఈవేళ సాయంత్రం ఇంట్లో వంట చేయకుండా ఉంటే ఎలాగుంటుందండీ అని మొదలెట్టింది. తనైతే ఏదో పుల్కాలతో లాగించేస్తూంటుంది. నాకు ఓ కూరా,పచ్చడీ లేకపోతే ముద్ద దిగదాయిరే, ఊరికే కూర్చోక అలాటి టపాలు వ్రాయడం ఎందుకూ, ప్రాణం మీదకు తెచ్చుకోడం ఎందుకూ? ఏదో రాజమండ్రీ లాటి ఊళ్ళలో అయితే, కర్రీ పాయింట్లైనా ఉండేవి, ఇక్కడ అలాటి సౌకర్యాలు కూడా లేవూ.తిన్న తిండరక్కపోయి కానీ, అసలు ఇలాటి సెన్సిటివ్ టాపిక్కులమీద టపాలు వ్రాయమన్నదెవరూ? మళ్ళీ ఇలాటి టపాలు వ్రాయనని, భరోసా ఇచ్చిన తరువాత, మొత్తానికి వంట వండి, పెట్టింది. ఈ మధ్యన ప్రతీ రోజూ శ్రీ చాగంటి వారి “అర్ధ నారీశ్వర తత్వం’ వింటోందిగా, ఆ ప్రవచనం ధర్మమా అని ఏదో గండం గడిచిపోయింది!

ఏదో ఉత్తిత్తినే అన్నానుకానీ, నేనా టపాలు వ్రాయడం అపేవాడినీ? నిన్న సాయంత్రం మా ఇంటావిడతో ఈవెనింగ్ వాక్ కి వెళ్ళాము యాజ్ యూజుఅల్. నాకు ఆవిడ నడిచినంత దూరం నడవడానికి ‘బధ్ధకం’, అందుచేత మధ్యలో ఓచోట కూర్చుండిపోతాను, ఆవిడేమో ఓ మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వస్తూంటుంది.నేను అక్కడ కూలబడిన టైములో ఈ బధ్ధకం కాన్సెప్ట్ గురించి ఇంకొన్ని ఉదాహరణలు గుర్తొచ్చాయి. రోడ్డుమీద సైకిలు మీద వెళ్ళేవాడు, తొక్కడానికి బధ్ధకం వేసి, ప్రక్కనే వెళ్ళే ఏ ట్రక్కు తాడో పట్టుకుంటూంటాడు, చూసే ఉంటారు. ఎప్పుడో దేనికిందో పడేదాకా ఈ బధ్ధకం వదలదు!

అసలు ఈ బధ్ధకం మనుషుల్లో ఇలా ప్రకోపించడానికి, మన టెక్నాలజీ కూడా ముఖ్య పాత్ర వహించింది. గుర్తుండేఉండాలి, బ్లాక్ ఎండ్ వైట్ టి.వీ. ల రోజుల్లో ఉన్న రెండు చానెళ్ళనీ మార్చుకోడానికి, చచ్చినట్లు సోఫాలోంచో, కుర్చీలోంచో లేచి వెళ్ళి మార్చుకోవాల్సివచ్చేది. మరి ఇప్పుడో, ఓ రిమోట్టూ.అందుకే కాబోలు ప్రతీ ఇంట్లోనూ,కౌచ్ పొటాటోస్ ఎక్కువై, ఒళ్ళు కూడా వంచడానికి బధ్ధకించి, ఊరికే శరీరం పెంచేసికుంటున్నారు! అమ్మల్ని, నాన్నల్ని చూసే పిల్లలూనూ!ఇదివరకటి రోజుల్లో కాళ్ళకి వేసికునే షూస్ నే తీసికొండి, వాటికి లేసులూ వగైరా ఉండేవి. ఎవరింటికైనా వెళ్ళినప్పుడూ, ఏ గుళ్ళోకైనా వెళ్ళినప్పుడూ, తిసిన షూస్ తిరిగి వేసికునేటప్పుడు, ఒంటి కాలు మీద భరత నాట్యం చేయాల్సొచ్చేది. కనీసం ఆ మాత్రమైనా body exercise ఉండేది. మరి ఇప్పుడో, అలాటి షూస్ out of fashion అయిపోయాయి.
కొంతమందిని చూస్తూంటాము కారులో evening walk కి వెళ్తున్నామంటారు.వాళ్ళ మొహం, నడవడానికి కారెందుకంట? ఇదివరకటి రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు తీసికోవాలంటే, చచ్చినట్లు బాంకులకే వెళ్ళవలసివచ్చేది, ఇప్పుడో రోడ్డుకి ఎడా పెడా ఎక్కడ పడితే అక్కడ ఏ.టి.ఎం లూ! టెక్నాలజీ ఉండకూడదనడం లేదు, దీని వలన ప్రతీ విషయం లోనూ మన బధ్ధకం ఎంతలా పేరుకుపోయిందో, ముందు ముందు తరాలవాళ్ళు ఈ బధ్ధకభూతానికి ఇంకా ఎలా ఎడిక్ట్ అవుతారో చెప్పడానిక్ మాత్రమే.ఇదివరకటి రోజుల్లో ఓ ఇడ్లీ ,దోశా వేయాలంటే, ముందు రోజు పప్పు నానబెట్టడం, మర్నాటి సాయంత్రం దాకా పులియబెట్టడం, అబ్బో ఎంత కధా, ఇప్పుడో instant idli,dosa…, పైగా వీధి వీధికీ ‘రుబ్బింగ్ మెషీన్ లోటీ!

మా ఇంట్లో ఓ గంటలు కొట్టే గడియారం ఓటుండేది. దాని దుంపతెగా, పెద్ద ముల్లుకి ఆరునుండి, పన్నెండు దాకా పైకెక్కడం బధ్ధకం!ఎప్పుడు చూసినా టైము తప్పే. ఏడాదెళ్ళేసరికి ఓ నెలో నెలన్నరో వెనక్కుండేది!ఇలా కాదని ఓ అలారం టైంపీస్ కొనుక్కున్నాము.అంత దాకా ఎందుకూ, ఎక్కడైనా పచారీ కొట్లలో మనం కొన్నవాటి బిల్లు మొత్తం ఎంతయిందో చూడ్డానికి, కొట్లో కుర్రాడు ఓ calculator తీస్తేనే కానీ లెఖ్ఖకట్టలేడు. ఎక్కాలు నేర్చుకోడానికి రోగమా? ఏం లేదూ వళ్ళంతా బధ్ధకం.ఇదివరకటి రోజుల్లో బట్టలు తీసికెళ్ళేవాడూ, పాలుపోసేవాడూ కూడా టకటకా నోటితో లెఖ్ఖ కట్టేవారు.

ఇప్పుడు వస్తూన్న సదుపాయాలన్నీ ఉండాలి, ఇంకా ఎన్నో మరెన్నో రావాలి. కానీ ఇవన్నీ ఉన్నాయని మన మస్తకానికి బధ్ధకం అబ్బిబెడితే ఎలాగండి బాబూ? చివరకి ఎప్పుడో, పాపం గతితప్పకుండా లబ్ డబ్ మనే మన గుండె కాయకి
బధ్ధకం వేసిందనుకోండి ఇంక అంతే సంగతులు
!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-బధ్ధకం

   ఈ బధ్ధకం అనేది, రానేకూడదు కానీ,వచ్చిందా ఒక్కటంటే ఒక్కపనీ టైముకవ్వదు. మామూలుగా ప్రతీ రోజూ ప్రొద్దుటే లేవడానికి బధ్ధకం. చదువుకున్నప్పటి రోజులనుండి, ఉద్యోగం చేసినంతకాలం, అవసరార్ధం ప్రొద్దుటే లేవాలికదా, అబ్బే అదేం చిత్రమో, ఒక్కరోజుకూడా, మనస్పూర్తిగా లేచిన పాపాన్ని పోలేదు.ఎప్పుడూ బధ్ధకమే. రిటైరయిన తరువాత తెల్లారకుండా నిద్రలేచేసి, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయడం.అంటే అర్ధం అయిందేమిటిటా, పనీ, బధ్ధకం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట.

ఈ బధ్ధకం అనేది రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తూంటారు. ఇదివరలో నేను ఒక టపా పెట్టాను. దాంట్లో సినీ నటుడు శ్రీ కొంగర జగ్గయ్య గారు ‘వెధవ’ శబ్దం గురించి వ్రాసిన వ్యాసం పెట్టాను. ఈ బధ్ధకం కూడా అలాటిదే, నా ఉద్దేశ్యం- మనం వాడే సందర్భాన్ని బట్టి అర్ధం మారుతూంటుంది. ఉదాహరణకి, పిల్లాడికి మార్కులు తక్కువొచ్చాయనుకోండి, తండ్రంటాడూ,”మామూలుగా బాగానే చదువుతాడండీ, ఇంకొంచం శ్రధ్ధగా చదవడానికి బధ్ధకం” లాగన్నమాట!

ప్రొద్దుటే లేవడానికి అలారం మరీ పెట్టుకుంటారు.పైగా గడియారం ఓ పదిహేను నిమిషాలు ఫాస్ట్ గా పెడతారు. ఆ అలారం కాస్తా పాపం మ్రోగినా, దాని నోరునొక్కేసి, పెళ్ళాం నిద్రలేపినా, ‘ఇంకో పది నిమిషాలు పడుక్కోనీయవోయ్, ఇదిగో లేచెస్తున్నా..”అనడమూ బధ్ధకంలోకే వస్తుంది.అలాగే పొద్దుటే స్కూలుకెళ్ళడానికి పిల్లల్ని లేపేడప్పుడు చూస్తూంటాము. ఏ రోజునా టైముకి లేవరు. ప్రతీ రోజూ ఓ యజ్ఞమే!

ఎప్పుడైనా కూతురు పురుటికి వస్తే, నెలలు నిండిన తరువాత,ఎప్పుడైనా డల్ గా ఉన్నట్లు కనిపించిందా, ‘ ఏమ్మా బధ్ధకంగా ఉందా? హాస్పిటల్ కి ఈవాళో రేపో వెళ్ళాలేమో’అనే మాట ప్రతీ తల్లి నోటినుండీ వింటాము.అంతదాకా ఎందుకూ, తిన్నది అరక్క, పొట్ట ఖాళీ అవకపోతే వాడే పదం ‘మల బధ్ధకం’ కూడా ఈ క్యాటిగరీ లోకే వస్తుందనుకుంటా.

ఈ రోజుల్లో పిల్లలు, ఆ బధ్ధకం శబ్దాన్ని మార్చేసి స్టైలుగా ‘బోరు’ అంటున్నారు. తెలుగులో చెప్పుకోడానికి నామోషీ!ఏ రాయైతేనేం బుర్ర పగలుకొట్టుకోడానికీ!చిన్నప్పుడు న్యూస్ పేపరు చదవడం తప్పనిసరైపోయేది. అదే ఓ అలవాటుగా మారింది. అందుకనే మన ఇళ్ళల్లో ఉండే పెద్దవారు, స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళి డిగ్రీలు సంపాదించకపోయినా, న్యూస్ పేపరు చదివే, వారి లోక జ్ఞానం ఇంప్రూవ్ చేసికున్నారు.అందుకే వారికున్న general knowledge ముందర మనం పనికి రాము.ఇప్పుడో, న్యూస్ పేపరు చదవడానికి టైమే ఉండడం లేదూ, ఈ టి.వీ. ల ధర్మమా అని.పైగా, కంప్యూటరు లో ఓ నొక్కు నొక్కగానే, మనకి కావలిసిన సమాచారం వచ్చేస్తోందాయే! మరి బధ్ధకం పెరిగిపోతుందంటే పెరగదు మరీ?

పిల్లాడిని అన్నం తినరా అంటే బధ్ధకం.ఈ బధ్ధకం అనేది ఓ national obsession అయిపోయింది. మన ఆటగాళ్ళని, ప్రతీ రోజూ ప్రాక్టీసు చేయండిరా బాబూ, అని ఆ కోచ్ లు మొత్తుకున్నా సరే, ఛస్తే వెళ్ళరు.ఈ వేళ చేయవలసిన పని రేపటికి వాయిదా వేస్తున్నామంటే, ఈ ‘బధ్ధకం భూతం’ మనల్ని ఆవహించేసిందన్నమాటే.భగవంతుడు కూడా బాగుచేయలేడు మనల్ని.ఏదో అదృష్టం కొద్దీ, ఈ బధ్ధకం అనేది లేనిది ఆ ఒక్క ‘అమ్మ’ కే! ఆవిడకి సరాదాకైనా, బధ్ధకం వేసిందా, ఇంట్లోవాళ్ళ పని గోవిందాయే !

మా మనవడున్నాడే చి.అగస్థ్య- వాడికి నడకొచ్చింది. అయినా సరే పిలవగానే, నడవకుండా పాకుతూ వచ్చేస్తాడు! ఏదోలా పనైపోతూందిలే, ఇలా అయితే శ్రమ పడఖ్ఖర్లేదూ అని! మరి ఇదికూడా ‘బధ్ధకం’ లోకే వస్తుంది. ఇదివరకటికి వాడెవడో, ‘ నీ నెత్తిమీద బూజుందిరా’ అంటే, ‘ఆ చేత్తో నువ్వే తీసేయకూడదూ?’ అన్నాట్ట!ఇది అల్టిమేట్ బధ్ధకం లోకి వస్తుంది !