సాధారణంగా ఈ రోజుల్లో ఎప్పుడో గానీ ‘feel good’ అనుభవాలు రావు.. అలాగని ఏదో లాటరీలో ప్రైజే రావాలనే లేదు.. ప్రతీరోజూ జరిగే ఏ ఒక సంఘటన కూడా, మనకి ఆ సంతోషం కలిగించొచ్చు. మన దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.. కొంతమంది ఇలాటివారిని ‘ అల్ప సంతోషులు’ అని కూడా హేళన చేయొచ్చు.. so..what.. మన మనసుకి నచ్చింది…. మిగిలినవాళ్ళేమనుకుంటే మనకేమిటీ?
నామట్టుకు నాకు సోషల్ మీడియా Facebook ధర్మమా అని, వందలాది స్నేహితులు లభించారు. మహా అయితే ఓ వందమందితో , personal contact లు ఉన్నాయి. దానికి కారణం, నాతో ఎవరైనా స్నేహం చేస్తే, నేను వారిని, మరీ మొదటి పరిచయం లోనే కాకుండా, వారు నేను ప్రతీరోజూ పెట్టే పోస్టులను చూసనండి, లేక అవతలివారి పోస్టులు చదివనండి, ఉజ్జాయింపుగా మన వ్యక్తిత్వం వారికి తెలిసిందని నమ్మకం కలిగాకనే, నేను వారి ఫోన్ నెంబరు అడుగుతూ, నా నెంబర్ కూడా ఇస్తూంటాను. నూటికి తొంభైతొమ్మిది మంది దాకా oblige చేస్తూంటారు.. ఎక్కడో ఉంటూంటారు.. అడగ్గానే ఇచ్చేస్తే వారి విలువ తగ్గిపోతుందేమోనని కొందరు, అస్తమానూ ఫోన్ చేసి ఇబ్బంది పెడతానేమోనని కొందరు,వారి so called privacy violate చేస్తానేమోనని కొందరూ ఇవ్వడానికిబ్బంది పడుతూంటారు.. ఎవరిష్టం వారిదీ.. ఇచ్చేరని వెంటనే ఫోను చేసేయను.. వారికి ఇబ్బందిలేకపోతే, వారి అనుమతి తోనే నేనే ఫోను చేసి మాట్టాడ్డం అలవాటు.. దేశ విదేశాల్లోని ఎంతో మందితో మాట్టాడుతూంటాను ( వారి అనుమతి తోనే).. ఏం చేయనూ ఒకసారి పరిచయం అయితే కానీసం ఓ పావుగంట కబుర్లు చెప్పడం ఖాయం.. ఏం చేయనూ, ‘స్నేహం ‘ చేయడం నా బలహీనత.
ప్రస్తుతం ఉన్న ఈ Virtual world లో ఎవరెవరో తెలిసికోవడం కూడా చాలా కష్టం.. నలుగురితో మాట్టాడితేనే కదా తెలిసేదీ..మన మాట పధ్ధతి, ప్రవర్తనా నచ్చిందా, మళ్ళీ మాట్టాడ్డానికి ప్రయత్నం చేస్తారు.. లేదా ఎవరికి వారే యమునా తీరే.. ఈ ఫోన్ నెంబర్ల పంచుకోవడం ప్రక్రియ వలన, నేను ఎప్పుడైనా , ప్రయాణాలంటూ చేస్తే, వారుండే ఊరుకి వెళ్ళడమంటూ తటస్థిస్తే, వారిని వ్యక్తిగతంగా కూడా కలవచ్చని ఓ ఆశ, ఇప్పటికి రెండు మూడుసార్లు హైదరాబాదులోనూ, రాజమండ్రీ లోనూ, తణుకులోనూ, భద్రాచలం లోనూ కూడా జరిగాయి. వారు ఫోను చేసి కలవాలనుందని చెప్పినప్పుడు ఎంత సంతోషమనిపించిందో మాటల్లో చెప్పలేను.. ఇవన్నీ గత పుష్కరంలోనూ జరిగినవి.. ఇప్పటికీ ఆ స్నేహం అలాగే కొనసాగడం నా అదృష్టం. అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణల ధర్మమా అని, వారికి “ పూణె’ అనగానే నేనే గుర్తొస్తానని చెప్పడం, ఎంతో సంతోషం కలిగిస్తుంది.అంతే కాకుండా, అలాటి స్నేహితులు, ఏ కారణం చేతైనా పూణె అంటూ వస్తే, తప్పకుండా, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి వెళ్తూంటారు. అది మా అదృష్టం. ఇలాటివాటినే “ Feel Good “ అనేది.
ఇప్పటికే 80 కి దగ్గరలో ఉన్నాను… ఇంక బతికేదెంత కాలం? నలుగురితో కలిసి, వారి వారి అనుభవాల ద్వారా, కొత్త విషయాలు తెలుసుకోవడం లో నష్టమేమీ లేదని నా అభిప్రాయం.
ఇప్పుడంటే, ప్రసారమాధ్యమాలద్వారానూ, సోషల్ మీడియా ద్వారానూ, “ సెలెబ్రెటీ’ లుగా మారిపోతున్నారు. సమాజంలో పేరు తెచ్చుకోడానికి, నలుగురికీ నచ్చే పనేదో చేయాలనేది ‘ ఇదివరకటి’ మాట.. ఇప్పుడు to hell with that concept.. ఓ దరిద్రపు పని చేసినా , మీడియా ద్వారా కావాల్సినంత పబ్లిసిటీ లభిస్తోంది.. ఒకానొకప్పుడు, పోలీసుల దృష్టిలో పడ్డమన్నా, అరెస్టవడమన్నా జరిగితే , ‘ఆత్మహత్యలు’ చేసుకున్న ఉదంతాలు విన్నాము/ చదివాము.. ఇప్పుడో అలాటివన్నీ ఓ STATUS SYMBOL గా భావిస్తున్నారు. ఓ ED Ride, IT Raid లాటివన్నీ సర్వసాధారణం అయిపోయాయి.. మన దేశంలో శాసన సభ్యుల పార్టీ మార్పిడి అనేది ఓ రొటీన్ అయిపోయింది. వారిగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
నా చిన్నప్పుడు ఇలాటి ‘ ప్రచారసాధనాలు’ లేనిరోజుల్లో కూడా, చాలామంది వ్యక్తులు , తమ “ చేత”ల ద్వారానూ “రాత” ల ద్వారానూ గొప్పవారయారు. వారివారి రచనలంటే, ప్రాణం ఇచ్చేవారం.. ఏ లైబ్రరీకో వెళ్ళో, చివరాఖరికి కొన్ని చోట్ల అద్దెకు కూడా తెచ్చుకుని , పుస్తకాలు చదివిన రోజులున్నాయి. వారిలో మరో ‘ప్రత్యేకత’ ఏమిటంటే, వారి రచనలు, ఇప్పటిరోజుల్లోలాగ ‘Book promotion’ సభల ద్వారా ప్రసిధ్ధి చెందినవి కావు… జస్ట్ ‘ నోటిమాట’ ద్వారా ప్రచారమయేవి.. ఒక్కో పుస్తకం రెండో మూడో పునర్ముద్రణాలు కూడా వెళ్ళేవి.. కారణం వాటిలోని “ విషయం’ (content). తెలుగురచయితల్లో చాలామంది గొప్పవారున్నారు.. ఇప్పటి రోజుల్లోలాగ Virtual world లో కాకుండా ‘నిజజీవితంలో పేరు సంపాదించిన వారు.. వారిపేర్లే వారి “ Brand name” గా మారినవారు. అలాటివారిలో కొంతమందితో నాకు పరిచయం ఉండడం , నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తాను. Facebook ధర్మమా అని చాలామంది స్నేహితులని సంపాదించుకోవడం కూడా నా అదృష్టం.
అలా సంపాదించుకున్న ఒక ‘ స్నేహితుడు’ శ్రీ యండమూరి వీరేంద్రనాధ్ గారు. అలాటి ప్రముఖ వ్యక్తి మనకు స్నేహితుడని చెప్పుకుంటే, మన ‘ స్టేటస్’ కూడా పెరిగిపోతుంది. ఈ మధ్యన , నేను ప్రతీ రోజూ Facebook లో పెట్టే కొన్ని పోస్టులకి , ఆయన స్పందించడం నా అదృష్టం.. అంత గొప్పాయన కి నేను పెట్టిన పోస్ట్ నచ్చడం, దానికి ఆయన వ్యాఖ్య రూపంలో స్పందించడం ఓ Feel good కదా మరి.. ఎలాగోలాగ ఒక్కసారి ఆయనతో మాట్టాడితే బావుండునూ అనిపించి, మొన్న, వారికి ఓ message పెట్టాను.. ‘అభ్యంతరం లేకపోతే మీ నెంబరు ఇవ్వగలరా, నాది ఫలానా..’ అని. స్పందన లేదు.. ఆయన్ని అలాగ అడిగే వారెంతమందో ఉండుంటారు.. పెట్టేదేమిటిలే అని వదిలేసుంటారనుకున్నాను.. ఇవేళ పొద్దుటే చూద్దునుకదా, వారి నెంబరు ఇచ్చారు..ఇంకా online లోనే ఉండడం గమనించి.. ముందుగా ధన్యవాదాలు చెప్పి, ‘ 9 గంటలకి call చేయొచ్చునా …అని అడిగితే.. ‘ sure’ అని జవాబిచ్చారు. ఇంకేముందీ తొమ్మిదెప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ… పూజ, బ్రేక్ ఫాస్టూ పూర్తిచేసుకుని కూర్చున్నాను. ఠంచనుగా 9 కి ఫోన్ చేస్తే , జవాబు లేదు.. పట్టివిడవని విక్రమార్కుడి లాగ మరోసారి చేసినా ఫలితం లేకపోయింది.
అప్పుడనుకున్నాను , ఏదో నెంబరంటూ ఇచ్చి, తన గొప్ప మనసు చాటుకున్నారే కానీ, మనం చేసే ఫోన్లతో వారి టైమెందుకు వేస్ట్ చేసుకుంటారూ..అని.. ఫోను రింగయి, పేరు చూస్తే యండమూరి వారిదే..మొట్టమొదటగా ఆయన, నేను ఫోన్ చేసినప్పుడు , ఎత్తలేకపోవడానికి ‘సంఝాయిషీ’.. చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? నేనేమైనా అడిగే ధైర్యం చేస్తాననే? కానీ ఇలాటి చిన్న చిన్న విషయాలకి ప్రాధాన్యం ఇవ్వడంలోనే ఉంటుంది గొప్పతనం. ఆయన రాసిన Personality development పుస్తకాల్లో ఊరికే రాసినట్టుగాకాకుండా, నిజజీవితంలో కూడా ఆచరించడం “ నిండుకుండల” ప్రత్యేకత. ఏదో Formal గా పరిచయాలు, క్షేమసమాచారాలూ మాట్టాడుకుని, చివరగా ఆయన అనుమతి తోనే ఈ పోస్ట్.
He made my day..thank you యండమూరి వీరేంద్రనాథ్ గారూ..
Filed under: Uncategorized | 15 Comments »