ఏదో ఆరోగ్యం లక్షణంగా ఉన్నన్ని రోజులూ పరవాలేదు కానీ, ఎక్కడో కొద్దిగా తేడా వచ్చిందా, ఇంట్లో ఉండే పిల్లా, పెద్దా అందరూ ఉచిత సలహాలిచ్చేవారే. దానికి సాయం , మన కుటుంబ స్నేహితుడెవరైనా ఏ డాక్టరో అయారా, సుఖశాంతులతో వెళ్తూన్న మన జీవితాలు, రోడ్డున పడ్డట్టే..
అలాగని మరీ hospitalizatio నూ వగైరాలూ కాకపోయినా, ప్రతీదానిమీదా ఆంక్షలు ప్రారంభమైపోతాయి… చాలామంది సలహాలిస్తూనే ఉంటారు– ఏడాదికోసారైనా General check up చేయించుకోమనీ.. మనకే బధ్ధకమూ,, పోనిద్దూ ఇప్పుడేమీ ఆరోగ్య సమస్యలు లేవుకదా.. అనే ఓ భావనానూ… చేయించుకుంటే ఏం నష్టమూ, అని సకుటుంబ సపరివారమంతా పోరగా.. పోరగా మొత్తానికి ఓ ముహూర్తం చూసుకుని, CGHS Dispensary కి వెళ్ళడం. ఒంటరిగా వెళ్తే మజా ఏముందీ.. ఆ డాక్టరేం చెప్పారో, ఈయనేం విన్నారో.. వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోపోతే నిద్ర పట్టదుగా..ఇంటావిడ సమేతంగా వెళ్ళాను… మొత్తం అందరూ రాలేదు.. బతికిపోయాను.
ఆ డాక్టరుగారు ఓ పదిరకాల Tests రాసిచ్చి, వాటి Test Report తీసికుని రమ్మన్నారు… ఆ కాగితం పట్టుకుని, దగ్గరలో ఉండే ఓ Corporate Hospital కి వెళ్తే, మర్నాడు పొద్దుటే, కడుపులో ఏమీ వేసికోకుండా , (కాఫీకూడా) రమ్మన్నారు… అదృష్టమేమిటంటే, ఈ రక్త పరీక్షలకి తను తోడు రాకపోవడం– ఎలాగూ Test results వచ్చినప్పుడు చూడొచ్చులే అనేమో…ఏదో మొత్తానికి వెళ్ళి ఆ రక్తదానమేదో ఇచ్చొచ్చాను. పాపం రక్తం ఇచ్చొచ్చానుకదా అని జాలిపడిపోయి, రోజూకంటే ఎక్కువ breakfast లభ్యం అయింది.మళ్ళీవెళ్ళి , రెండోసారి కూడా రక్తం ఇచ్చి, , ఆ Dracula కి thanks చెప్పి కొంపకి చేరాను.. ఇదంతా 10 నెలలకింద జరిగింది.
ఆ test reports దొంతరంతా పట్టుకుని తిరిగి మా CGHS Dispensary కి పయనం–ఇంటావిడతో సహా.. ఓ పదినిముషాల వెయిటింగ్ తరవాత, ఆ కాగితాలు చదవడం.. Oh! అంటూ భ్రుకుటి ముడవడం,, ఓసారి పెదిమలు విరవడం లాటి హావభావాలు పుర్తిచేసి, మళ్ళీ నన్నోసారి టేబుల్ ఎక్కించి, గుండె కొట్టుకుంటుందో లేదో మరోసారి టెస్టు చేసి, సుగర్ లెవెల్ ఎక్కువగా ఉందీ జాగ్రత్తగా ఉండాలీ వగైరాలు చెప్తూంటే , పోనీ ఇంటావిడ ఆగొచ్చుగా, అబ్బే.. ” అయితే రేపణ్ణుంచీ కాఫీలో పంచదార మానేయమంటారా, రోజూ కనీసం 200 గ్రాముల తీపి పదార్ధాలు తింటూంటారు, అవికూడా మానిపించేయనా అంటూ, ఈవిడ పెట్టబోయే ఆంక్షల చిఠ్ఠా చెప్పేసింది. పోనీ ఆయనేం చెప్తారో వింటే ఏం పోయిందీ ? డాక్టరుగారూ, మా ఇంటావిడా ఓ సంయుక్త ప్రకటన చేసేసి, మొత్తానికి నా సుఖసంతోషాలకి గండి పెట్టేసారు. వెళ్తూవెళ్తూ, వివిధరకాల మాత్రలు పంచరంగుల్లోవి కూడానూ.. మర్నాటినుండీ ఇంట్లో Curfew starts.. దీనికి సాయం, పిల్లలకి విషయం చెప్పేయడం– మళ్ళీ అక్కడకి వెళ్ళి ఏం కక్కూర్తిపడతానో అని..అప్పటిదాకా ఇంట్లో ఉన్న స్వీట్స్ అన్నీ పనిమనిషి పాలయ్యాయి… మర్నాటినుండీ భోజనంలో మార్పు, పిల్లలు చెప్పిందీ, తననుకున్నదీ, ఆ డాక్టరు చెప్పిందీ, మొత్తం అన్నిటికీ ఓ mean తయారుచేసి ప్రారంభం చేసేసారు.. పధ్ధతులు మారేటప్పటికి నాకూ చిరాకూ, కోపం.. ప్రతీ రోజూ పిల్లలదగ్గరనుండి ఫోనులూ.. రోజువిడిచి రోజు personal counselling అడక్కండి– తెలుసు నా శ్రేయస్సుకోరే చేస్తున్నారూ అని.. ఈలోపులో నేనైతే తెలిసినవారందరికీ నా కష్టసుఖాలు చెప్పుకున్నాను.. ఒకడేమో ఫలానావి తినొద్దంటాడు, ఇంకోరేమో ఇది మామూలేనండీ .. కొంచం జాగ్రత్తతీసికుంటే చాలంటారు…. మొత్తానికి ఈ తిండివిషయం లో ఏ ఇద్దరికీ ఏకాభిప్రాయం లేదని… వ్యవహారం ఎక్కడదాకా వెళ్ళిందంటే, ప్రతీ వరలక్ష్మీ వ్రతానికీ చేసే తొమ్మిది పిండివంటల్లోనూ, ఏడు ప్రసాదాలు తీపిలేనివే.. ఉన్న ఆ రెండింటిలోనూ నామమాత్రంగా బెల్లం… బయటకే హొటల్ కైనా పిల్లలతో వెళ్తే, ఆ బఫేలో, నా పక్కని అబ్బాయో, అమ్మాయో, వెనక్కాలైతే సహధర్మచారిణీ.. Z Category Security లాగన్నమాట.
మొత్తానికి ఈ పదినెలల నా నియమనిబధ్ధతా, మా ఇంటావిడ కఠోర management , పిల్లల సహకారంతోనూ, పరిస్థితులు చక్కబడ్డట్టే.. ప్రతీ రెండునెలలకీ ఆ టెస్టులేవో చేసుకుని, మొత్తానికి మా ఫామిలీ ప్రెండు డాక్టరుగారికి కూడా చెప్పి, ఆయన approval తో కొంచంకొంచంగా curfew relax అయింది.
నాకు ఈ సందర్భంలో ఒక్క విషయం అర్ధం అవలేదు– general గా ఇళ్ళల్లో ఈ sugar levels చెక్ చేసినప్పుడు, ఓ రక్తపుబొట్టుతో అయిపోయే పనికి, ఈ Pathological Labs లోనూ, Hospitals లోనూ, మరీ సిరెంజ్ గుచ్చేసి అంత రక్తం తీసుకుంటారెందుకనీ అని… అదేదో చెప్పి పుణ్యం కట్టుకోరూ….?
ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.. మిమ్మల్నింకా బోరుకొట్టదలుచుకోలేదు… జైపూర్ వచ్చిన మర్నాడు, పిల్లలు అదేదో Hot air balloon లో గగనవిహారం చేయడానికి వెళ్ళారు.. అన్నీ మూసేసిన ఏరోప్లేన్ లోనే భయపడ్డ నాలాటి వాడు, Open గా ఉన్న ఆ గుమ్మటంలోనా వెళ్ళడం ? అబ్బే అలాటి ఉద్దేశ్యాలేవీ పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండిపొయాము.
వాళ్ళు నలుగురూ తిరిగి వచ్చిన తరువాత, జైపూర్ హవా మహల్ వైపు sight seeing కి వెళ్ళాము.
ఆ మరుసటిరోజు, పుష్కర్ , అజ్మేర్ దర్గా దర్శించుకుందామని బయలుదేరాము.
అజ్మీర్ షరీఫ్ దగ్గరకి వెళ్ళేటప్పుడు, ఓ రెండుకిలోమీటర్ల దూరంలో, పార్కింగ్ చేసి, ఓ ఆటోలో వెళ్ళాల్సొచ్చింది. సందులూ గొందులూ తిప్పుతూ మొత్తానికి అక్కడకి చేర్చాడు… విపరీతమైన జనసందోహం. అన్ని ధర్మాలవారూ ఈ దర్గాని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
అక్కడ ఓ రెండు గంటలు గడిపి , పుష్కర్ కి బయలుదేరాము. అక్కడ బ్రహ్మ గుడి, పుష్కర్ సరస్సూ చూసి, తిరిగి జైపూర్ చేరాము.మర్నాడు సాయంత్రం Flight లో పుణె తిరిగి వచ్చాము.
మొత్తం ఓ వారంరోజులు పిల్లలతో గడపడం చాలా సంతోషమయింది. ప్రయాణం లో మమ్మల్ని అత్యంత luxurious గా తీసికెళ్ళారు పిల్లలు..
ఈ ప్రయాణం ధర్మమా అని నాకైతే, కుక్కలు, విమానాల భయాలైతే చాలామట్టుకి తగ్గినట్టే…
మర్నాడు పొద్దుటే హరీష్, శిరీష ఆఖరిసారి మళ్ళీ వెళ్ళారు అడవిలోకి, ఆ పులేమైనా తిరిగి దర్శనం ఇస్తుందేమోనని. కానీ కనిపించలేదుట… మొత్తానికి రణథంబోర్ పూర్తిచేసుకుని, జైపూర్ కి బయలుదేరాము.. వెళ్ళేలోపల ఓ అద్భుత సంఘటన– నా ప్రాణానికైతే అది అద్భుతమే మరి… విమానం భయం కొంతవరకూ తీరిందా, అలాగే సఫారి కూడా, ఎటువంటి అవాంతరాలూ జరక్కుండా లాగించేసినట్టేగా, ఇంక మిగిలినదల్లా, ఆ Resort లో పహరా కాసే ఆ శునకరాజములు… ఏదో వాటి బారినపడకుండా కానిచ్చేసేనన్నంత సేపు పట్టలేదు… సామాన్లన్నీ కారులో పెట్టి, ఇంక మెట్లు దిగుదామనుకున్నంతలో, ఓ శునకం, దానికి నామీద ఏం అభిమానం పుట్టుకొచ్చిందో, వచ్చేసి నన్నోసారి ముట్టుకునేసరికి, నా ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయిందే అనుకున్నాను… ఓవైపున అది నన్నుముట్టుకుని కాళ్ళు ఎత్తుతుంటే, ఒక్కడూ ఏమీమాట్టాడరే, అదేదో routine check up చేస్తున్నట్టు చేసి, ఏమనుకుందో ఏమో పక్కకు నుంచుంది. ఆ హొటల్ వాళ్ళందరూ– సాబ్జీ ఓ కుఛ్ నహీ కర్తా అంటూనే ఉన్నారు, వాళ్ళదేం పోయిందీ, కానీ ఇంతదాకా వచ్చిన తరవాత అదేదో నేనే స్వయంగా తెలుసుకుందామని, ఏమైతే అయిందనుకుని, దానిమీద ఓ చెయ్యేసాను… ప్రాణాలుగ్గబెట్టుకుని, కళ్ళుమూసేసుకుని చెయ్యేసేశాను.. ready with bated breath.. కళ్ళుమూసుకునే ముందర, మా ఇంటావిడనీ, అబ్బాయి కోడలూ, మనవరాలు, మనవడినీ ఓ సారి తనివితీరా చూసేసుకుని, మళ్ళీ చూడగలనో లేదో, ఈ మాయదారి test నాకెందుకు చెప్పండీ…. అబ్బే ఏమీ అవలేదు– surprise.. surprise.. వామ్మో అంత భయంకరమైన శునకాన్ని , నేను ముట్టుకున్నానా అనుకుని మాత్రం ఓసారి గుండె లయతప్పినట్టనిపించింది.. నిజంగా పాపం ఆ వెర్రి జీవి ఏమీ చేయలేదు.. ఈ మూడురోజులూ అనవసరంగా దాన్ని అనుమానించి భయపడ్డాను.. ఇదేదో తెలిసుంటే, దాన్ని ముద్దుపెట్టుకుంటానని కాదూ, నా పెద్దరికం నిలుపుకోగలిగే వాడినేమో…
ఈరోజుల్లో ఎవరైనా సెలెబ్రెటీ ని కలిస్తే ఓ ఫొటో తీయించుకోవడం order of the day కదా.. సరే అనుకుని, నేనూ ఫొటోకి దిగాను…
పులి తో ఎలాగూ దిగలేదు కదా అని పులి బొమ్మతో తీయించుకున్నాను ఫుటో.. మిమ్మల్ని మరీ బోరుకొట్టేసాను కదూ.. ఇంకొక్క భాగం రాసి , రాజస్థాన్ యాత్ర పూర్తిచేస్తాను…
రాత్రి డిన్నర్ అయిన తరువాత చల్లగా, చెప్పారు, మర్నాడు ఉదయం 630 కల్లా, మళ్ళీ ఆ ఆడవిలోకి వెళ్తున్నామని. ఈసారి ఇంకో Zone, మేముండే DEV VILAS కి దగ్గరలోనే.. నాకు అక్కడ నచ్చిన మరో విషయం ఏమిటంటే, రాత్రి పడుక్కోబోయే ముండు, రెండు Hot water bags తెచ్చి, మా కంబళి/ రగ్గు లకింద పెట్టడం. రూమ్మంతా వెచ్చవెచ్చగానే ఉందనుకోండి, కానీ ఈ arrangement ఇంకా బావుంది. అంత వెచ్చగా పడుక్కుని, మర్నాడు ఏదో చిన్నప్పుడు పరీక్షల్లో లేచినట్టు, మరీ తెల్లారకట్ల లేవమంటే కష్టమే కదూ.. మధ్యలో మా అగస్త్య reminder ఒకటీ.. సుభే సుభే తయ్యార్ హోకే రెహనా అంటూ..ఎంతైనా మనవడిదగ్గర పరువుంచుకోవద్దూ? మొత్తానికి ఆ జిప్సీ ఏదో వచ్చేసరికి, ఒంటినిండా all available స్వెట్టర్లూ, జాకెట్టూ వేసేసికుని , నెత్తికో మఫ్లర్ కూడా చుట్టుకుని, గంగిరెద్దుకి అలంకరణ చేస్తారే, అలాగ నన్ను మా ఇంటావిడ నన్ను అలంకరించగా చాయ్ తాగేసి రెడీ అయ్యాను.
అన్నీ చెప్పి ముఖ్యమైన విషయం చెప్పడమే మర్చిపోయాను– జైపూర్ లో లాగ కాకుండా, ఇక్కడ ఈ Resort లో రెండు భయంకరమైన కుక్కలు, పైగా నాకంటే పొడుగ్గా ఉన్నాయి, వాటిని free గా వదిలేసారు… అక్కడున్న 3 రోజులూ భయమే నాకు.. ఎలాగొలాగ వాటి బారిన పడకుండా లాగించేసాను మొత్తానికి… 630 కల్లా ఆ దగ్గరలోఉన్న Zone కి చేరాము. మా గైడ్ అయితే చెప్పాడు, ఆ ముందురోజు ఓ పులి కనిపించిందని, మధ్యమధ్యలో కిందకి చూడ్డం, అవిగో పగ్ మార్కులు.. ఇవిగో పగ్ మార్కులూ.. పులి ఇక్కడే ఎక్కడో తిరుగుతోంది.. అంటూ, అడవంతా తిప్పాడు. అడవి జంతువులు తప్పించి, పులి మాత్రం కనిపించలేదు.
చివరకి ఆ పులేదో కనిపించకపోయేసరికి, 12 గంటలకి తిరిగి వెళ్ళాము. లంచ్ అయిన తరువాత, మళ్ళీ మూడోసారి, చివరిప్రయ్త్నం చేయడానికి వెళ్ళాము… పొద్దుటికంటే కొంచం better.. పక్షులు, జంతువులా warning signals ధర్మమా అని మిగిలిన అన్ని వాహనాలూకూడా, ఓ చెరువు చుట్టూరా చేరిపోయాయి. ఇంతలో ఓ పెద్ద గాండ్రింపు వినబడింది, మరీ నిన్నటంత దూరంలోకాదూ, కానీ స్పష్టంగా వినడంమాత్రం విన్నాను.. ఆ పులి ఏదో జంతువునుచంపి, తన పిల్లలకి పెట్టడమో, లేక తనే విశ్రాంతి తీసికోడమో చేస్తూందన్నాడు మా గైడ్.. ఇవన్నీ ఎలా తెలుస్తాయో వీళ్ళకి, ఎంతైనా ఎన్నోసంవత్సరాల అనుభవం కదా…సాయంత్రం 630 కి తిరిగి వెళ్ళి, డిన్నర్ తీసికుని బొజ్జున్నాం. మరికొన్ని విసేషాలు తరువాతి పోస్ట్ లో
సాయంత్రం 7 కి జైపూర్ లో, మొత్తానికి, ఏ అవాంతరాలూ లేకుండా land అయ్యాము. మొదటి మజిలీలో, airbnb ద్వారా వారెవరో family ఉండే ఇంట్లో, రెండు గదుల్లో సెటిలయ్యాము. సాయంత్రం రెండు cab లు చేసుకుని, City Centre లో ఉన్న Albert Hall Museum కి వెళ్ళి ఓ రెండు గంటలు గడిపాము . దారిలో బిర్లా మందిరం కూడా దూరం నుంచి, దర్శించుకుని, హొటల్లో డిన్నర్ తీసికుని, తిరిగి వెళ్ళాము. గేటు బయటుండే Calling Bell కొట్టడమేమిటీ, ఆ ఇంట్లో ఉండే కుక్క, భయంకరంగా అరవడం మొదలెట్టింది… వాళ్ళు దాన్ని కట్టేయగా, మెము నిర్భయంగా రూమ్ములో సెటిలయ్యాము… రూమ్ము బయటకి అడుగెడితో ఒట్టు.
మర్నాడు, నవ్య కి కొద్దిగా అస్వస్థత కారణంగా, మేమిద్దరమూ, అగస్థ్యా, అబ్బాయితో కలిసి, Amer Fort కి బయలుదేరాం.. అక్కడ చాలా రష్ గా ఉండడంతో, మేము కారులోనే ఉండిపోయి, వాళ్ళిద్దరినీ వెళ్ళిరమ్మన్నాం…
నలుగురూ కలిసి తిరిగి వెళ్ళి, అందరం కలిసి హొటల్లో లంచ్ తీసికుని, ఆరోజుకి సెటిలయ్యాము.. అసలు కథంతా ఆ మర్నాడుప్రారంభం అయింది . కారులో బయలుదేరి రణతంభోర్ చేరాము. అక్కడ DEV VILAS అనే Resort లో check in అయ్యాము. అద్భుతంగా ఉంది. మధ్యాన్నం ఓ Maruti Zypsy వచ్చేసింది. మేము ఆరుగురం, ఓ గైడూ , డ్రైవరూ… 4 గంటలకల్లా Ranthambore National Park కి చేరి, Security check పూర్తిచేసుకుని, బయలుదేరాము. పెద్దపులి movements ని ఈ గైడ్లు, ఉదయంపూట అయితే ఆ పులుల పాదముద్రల( Paw marks ) ద్వారానూ, మిగతా సమయాలలో అయితే కొన్ని అడివి జంతువులూ, పక్షులూ చేసే ఓ ప్రత్యేకమైన ( unique ) శబ్దాలతోనూ గుర్తు పడతారుట.. అలాటిదేదో ఉండాలిలెండి , అలాటి warning system లేకుండా, అకస్మాత్తుగా , ఓ పులిపిల్లైనా చాలు, మనమీదకి ఎగిరితే బతక్కలమంటారా? పైగా ప్రయాణం చేసేదేమో Open Van… ఆ పులేదో కనిపించేదాకా, మిగతా అడివి జంతువులు చాలానే కనిపించాయి.. ఇంతలో ఆ గైడ్ ఏం చూసాడో ఏమో… అదిగో అల్లదిగో శ్రీహరివాసమూ అన్నట్టు. అదుగో పులి అన్నాడు, నేనైతే చిన్నప్పుడు నేర్చుకున్నట్టు .. అదిగో తోకా… అని మనసులోనే అనుకున్నాను. నాకైతే ఏమీ కనిపించలేదు ఒట్టు. కానీ, ఆ గైడూ, మా అబ్బాయీ అయితే ఆ పులి లేచిందని ఒకరూ, ఒళ్ళువిరుచుకుంటోందని ఇంకోరూ మాట్టాడుతూ, నాక్కూడా కనిపించిందా అని అడిగారు. సరేనని ఎక్కడో దూ… రం… గా ఉన్న వాళ్ళు చెప్పిన చోటులో దృష్టి కేంద్రీకరించాను.. అబ్బే…. ఎలా తిరిగి ఎలా కళ్ళు చిట్లించి చూసినా కనిపించదే.. అబ్బాయైతే తన Camera ని Zoom చెసి, దాని ఫొటో కెమేరాలో బంధించేసాడు. ఇంతలో Driver , మా ఇంటావిడ mobile తీసికుని, Zoom చేసి చూపించాడు.. అప్పుడు తెలిసింది నెను అప్పటిదాకా చూసింది, Wrong place అని.. కనిపించమంటే ఎలా కనిపిస్తుందీ మరి ?
ఏదో మొత్తానికి వచ్చిన పనయింది. ఇంతలో చీకటి పడ్డంతో తిరుగు ప్రయాణం.. మధ్యలో కనిపించిన ప్రతీవాడూ అడగడమే.. పులి కనిపించిందా అంటూ.. Oh Yes అని నేను తప్ప మిగిలినవారందరూ ముక్త కంఠంతో చెప్పేసారు. ఈ బుడ్డా ఆద్మీకి ఏం కనిపిస్తుందిలే అనుకుని నన్ను అడగడం మానేసారు– ఓ గొడవ వదిలింది. Resort కి వెళ్ళేటప్పటికి అక్కడుండే Attendants , వేణ్ణీళ్ళలో చిన్న చిన్న టవల్స్ ముంచి, ఒళ్ళు, మొహం తుడుచుకోడానికి ఇవ్వడమైతే నాకు చాలా నచ్చేసింది.
నాకు కనిపించలేదని, అసలు పులే లేదూ ఆ జంగిల్ లో అంటే ఎవరూరుకుంటారూ? అబ్బాయి తను Zoom చేసి తీసిన ఫొటోలు Download చెసి సాక్ష్యాధారాలతో చూపించాడు…
అప్పుడే ఎక్కడయిందీ.. ఇంకా చాలా రాయాలి… ఇంకో టపాలో….
అదేమిటో కానీ , పుట్టిల్లు దర్శించుకోడానికే టైముండడంలేదాయె…. ఆ ఫేసుబుక్కూ, గోతెలుగూ , నాటైము పూర్తిగా కేటాయించాల్సొస్తోంది… అలా కుదరదని మళ్ళీ వచ్చేసా. కిందటి సంవత్సరాఖరిలో , అబ్బాయి, కోడలూ, ఫోను చేసి ” మేము జయపూర్ ( రాజస్థాన్) వెళ్తున్నామూ, మీరుకూడా వస్తే బావుంటుందీ అన్నారు… నిజం చెప్పాలంటే, నాకు వెళ్ళే ఉద్దేశ్యమైతే అస్సల్లేదు. ఒకటి విమానప్రయాణం, రెండోది ఆ టైములో రాజస్థాన్ లో ఎముకలు కొరికే చలోటీ… పైగా ఇంకోవిషయం కూడా చెప్పారు.. మూడు రోజులు జైపూర్ లోనూ, మూడురోజులు రణతంభోర్ లోనూట.. ఎందుకూ అంటే , ఆ ప్రదేశం ఓ Tiger Resort ట, ఆ పెద్దపులుల్ని మనం దగ్గరనుంచి చూడ్డంట.. Zoo ల్లోనూ, Circus లోనూ , బోనుల్లోఉండగా చూస్తేనే ఛచ్చే భయం, పైగా ఈ Resort లో Maruthi Zypsy ( open ) లో , ఆ అడవంతా తిరగడంట.. అయ్యే పనేనా ఇదీ?. హాయిగా కొంపలో కూర్చోక ఎందుకొచ్చిన గొడవా? ఫోనులో పిల్లలతో మాట్టాడుతూంటే, పక్కనే , మా ఇంటావిడ, ” ఏమిటీ మాట్టాడుతున్నారూ.. ఎక్కడికైనా వెళ్తున్నారా పిల్లలూ.. ” అని అడగ్గా, ” అవునూ ఓ వారంరోజులూ, మనమూ వస్తామా ..అని అడుగుతున్నారూ..” అనడం ఏమిటి, ఇంక మరో ఆలోచన లేకుండా, ” వస్తున్నామని చెప్పేయండి.. ” అంది… వెళ్ళే ప్రదేశం మీద కాదు ఇంటరెస్టు– పిల్లలతో ఓ వారంరోజులు గడపడం ఓ అరుదైన అవకాశం, దాన్నా వదులుకునేదీ.. ? ” పిల్లలు కలుస్తారు, కానీ వారాంతంలో కొన్ని గంటలు మాత్రమే.. కలవకూడదని కాదు, టైముండాలిగా వాళ్ళకీ.. రోజూ స్కూలూ, డాన్సూ, టెన్నీసూ బిజీ బిజీ.. అయినా అంత హడావిడిలోనూ, నవ్య అగస్త్యలను తీసికుని మాదగ్గరకి రావడం మాత్రం మానరు. మహా అయితే ఓ రెండుమూడు గంటలు.అలాటిది ఓ వారంరోజులు, రోజుకి కనీసం పదిపదిహేను గంటలు , వాళ్ళతో గడిపే అవకాశాన్నా వదులుకునేదీ.. అబ్బాయితో చెప్పేసా–మేమూ వస్తామూ.. అని. చెప్పిన అరగంటలో మాకు Return Tickets మెయిల్ లో పంపేశాడు.. Air Asia Flight ట.
ఇంక ప్రయాణం తయారీ ప్రారంభం.. వెళ్ళేదా చలి ప్రదేశం, స్నానపానాదులు ఆ వారంరోజుల్లోనూ, ఉంటాయో ఊడుతాయో తెలియదు. మామూలుగా వేసికునే పాంట్లైతే, మరీ ఎక్కువేసికోవాల్సొస్తుందని, మాపాగడానికి జీన్సూ ( jeans ) , ఓ స్వెట్టరూ, ఓ జాకెట్టూ.. ఇంకా ప్రయాణం ఓ రెండువారాలుండడంతో , Flight లో ప్రయాణం చేయడానికి , మనసులో తయారవడం వగైరా ప్రారంభించాను. ఎప్పుడూ రైళ్ళలో ప్రయాణం చేసిన మొహమే నాది.. జీవితంలో రెండేరెండు సార్లు విమానప్రయాణం చేసాను. రెండుసార్లూ, కళ్ళుమూసుకుని, ప్రాణాలుగ్గబట్టుకునీనే.. మొదటిసారి సునామీ టైములో మద్రాసునుండి ముంబైదాకా— వేరే మార్గంలేక చేయాల్సొచ్చింది. రెండో సారి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చీనూ.. అవకాశం ఉండుంటే, చేసేవాడిని కాదు.. విధిలిఖితంకదా తప్పించుకోలేకపోయాను. అదేవిటో విమానం అంటే నాకన్నీ భయాలే. అందులోనూ ఆ Take off time లో అయితే మరీనూ…వాటన్నిటికీ కూడా mentally prepare అవడానికి ఇంకా రెండు వారాలు. ఈ లోపులో మా అగస్త్య అయితే నన్ను కలిసినప్పుడల్లా వేళాకోళమే.. వాడి పధ్ధతిలో వాడూ నాకు ధైర్యం చెప్పడమే… ” కుఛ్ నహీ హోతా తాతయ్యా..” అంటూ…
నాకు అత్యంత భయం కలిపించేవి, విమాన ప్రయాణం, కుక్కలూ.. విమానం విషయమైతే మనసు గట్టి పరిచేసుకున్నాను.. కొడుకూ , కోడలూ, నవ్య అగస్త్య, మా ఇంటావిడా ఎలాగూ నాతోనే ఉంటారూ.. ఏమైపోయినా ఫరవాలేదూ.. అనుకుని.. కోడలు చల్లగా ఓ వార్త చెవినేసింది– మేము ఆ వారంరోజులూ ఉండేది హొటల్ లో కాదుట, అవేవో Resort / Family తోటిట.. ముఖ్యమైన విషయం ఆ మూడు చోట్లా భయంకరమైన శునకరాజాలు కూడా ఉన్నాయిట.. నాకు కుక్కలంటే ఉన్నభయం తెలిసుండడం వలన ఆ విషయం ముందర తెలుసుకున్నారు… వాటిని ఎటువంటి పరిస్థితులలోనూ , మేము ( కనీసం నేను ) ఉండే ప్రదేశానికి రానీయకూడదని…
ఏమిటో ఇన్ని రకాల Tensions పెట్టుకుని, వెళ్ళకపోతే ఏమిటిట? ఎవరిని ఉధ్ధరిద్దామని ఈ ప్రయాణం ? అలాగని ఏదో వంక పెట్టి రానంటే, అనవసరంగా వాళ్ళ ఉత్సహాన్ని పాడిచేసినవాడినవుతానేమో.. రాక రాక, పిల్లలతో వారం రోజులు exclusive గా గడిపే చాన్స్ మళ్ళీ వస్తుందో రాదో?
24 డిశంబర్ రోజున మధ్యాన్నం 3 15 కి , పుణె Airport కి చేరాము… Cab దిగినప్పటినుండీ, అగస్థ నాతోనే.. నా Guide అన్నమాట. మొత్తానికి అవేవో చెక్కులూ, డ్రాఫ్టులూ చేసుకుని, విమానం సీట్లలో కూలబడ్డాను. నాకు ధైర్యం చెప్పడానికి మా ఇంటావిడ పక్క సీటులో ( ఎంతైనా వీటిల్లో తను experienced కదా). ఆ విమానమేదో త్వరగా బయలుదేరి, తొందరగా ఆ గొడవేదో ఒదిలిపోతే బావుండునుగా, అబ్బే.. ఇదేమైనా రైలు ప్రయాణమా– గార్డ్ ఓ విజిలేస్తే బయలుదేరడానికీ, ఈలోపులో ఓ పిల్ల మాట్టాడుతూండగా, ఇంకో పిల్ల అభినయం చేస్తూ, ఏదైనా ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన precautions వగైరా చెప్పింది. అసలు ఈ జ్ఞానబోధంతా అవసరమంటారా? మా అమ్మమ్మగారనేవారు- జరగబోయే అవాంతరం గురించి మాట్టాడితే, పైనున్న తధాస్థు దేవతలు వింటారూ అవటా అని…. ఎందుకొచ్చింది చెప్పండి ఈ గోలంతా?
మొత్తానికి పేద్ద చప్పుడు చేసికుంటూ బయలుదేరింది. ఏవిటో విమానంలో వెడితే టైము కలిసొస్తుంది కానీ, ఇరుక్కుని కూర్చోడం కూడా కూర్చోడమేనా? ఎవడికి వాడు ఓ సెలెబ్రెటీ అనుకుంటాడు.. ఓ మాటుండదు మంతుండదు..కిటికీ లోంచి చూడ్డానికి భయం, ఏవేం చూడాలో అని. ఆ సీట్ బెల్టు ఎలా పెట్టుకోవాలో తెలిసేడవదు., ఆ మాయదారి బెల్ట్, అదేదో క్లిప్ లో పట్టి చావదూ,.. పోనీ ఓ చుట్టు చుట్టుకుని చేత్తో పట్టుకుందామా అనిపించింది… మా ఇంటావిడే మొత్తానికి తంటాలు పడి పెట్టింది.
Morning Raga సినిమాలో Shabana Azmi గుర్తుందా, ఆవిడకి బస్సెక్కడం భయం , అప్పుడెప్పుడో తన స్నేహితురాలికి accident అవడం వలన. అలా అయింది నా పరిస్థితి !! మా ఇంటావిడకైతే నా భయం తెలుసు కాబట్టి, , ఏవో కబుర్లలో పెట్టేసింది, అదేదో చిన్నపిల్లలకి డాక్టరు దగ్గర చెప్పినట్టు.. ఇంతలో ఓ ట్రాలీలో ఏవేవో వచ్చాయి.. అబ్బాయి చెప్పగా, ఆ విమానం పిల్ల ఓ కాఫీ తెచ్చిచ్చింది…
విమానం దిగిన తరువాతి కార్యక్రమాలూ, సంబంధిత ఫోటోలూ… రెండో భాగం లో
పెళ్ళైన మొదటి 10 సంవత్సరాలూ, ప్రతీ ఏడూ, Marriage Anniversary రోజు February 28, నఇక్కడపుణె లో ఉన్న పార్వతి కొండకి వెళ్ళి , అమ్మవారి దర్శనం చేసుకునేవారం.. 1983 లో వరంగాం బదిలీమీద వెళ్ళి తిరిగి పుణె, 1998 లో వచ్చాము… పెళ్ళిరోజులైతే అప్పటినుండీ, ప్రతీ ఏడూ , చేసుకునేవాళ్ళం, అయినాఏమిటో అమ్మవారి దర్శనానికి వెళ్ళడం మాత్రం కుదరలేదుఏమిటో ఆ లోటుమాత్రం కనిపించేది.అలాగని దైవ దర్శనాలు మానేమా, అబ్బే ఆ తల్లిని మర్చిపోవడమే ? No way.. గత అయిదారు సంవత్సరాలుగా, ప్రతీ ఏడూ, ఏదో ఒక పుణ్యక్షేత్రానికి, మా ” దేవదూత ” ల ధర్మమా అని వెళ్ళగలిగేమనుకోండీ, కానీ , ఈ ఏడాది, బయటకెక్కడికీ కాకుండా, ఈసారి పార్వతి కొండకే వెళ్ళాలని నిశ్చయించుకున్నాము. మొత్తానికి దాదాపు 30-32 సంవత్సరాల తరువాత, వెళ్ళి దర్శనం చేసుకోగలిగాము.
అప్పటికీ ఇప్పటికీ తేడా అల్లా ఏమిటంటే, ఆరోజుల్లో బస్సులు పట్టుకుని వెళ్ళేవాళ్ళమూ, ఇప్పుడేమో UBER లోనూ.. ఈ పెరుగుదల అంతా ఆ అమ్మ దయేగా.. ఆరోజుల్లో తెలిసేది కాదుకానీ, ఇప్పుడు కొండ ఎక్కినప్పుడైతే , వయసురీత్యా అయితేనేమిటి శ్రమపడాల్సొచ్చింది…
మేము వెళ్ళేటప్పటికి అంటే ఎంతా ఉదయం 9.30 కి, గుడి తలుపులు మూసున్నాయి.. అక్కడ ఉన్న సెక్యూరిటీ అతన్ని అడగ్గా , పాపం అతను పూజారికి ఫోనుచేసి పిలిచాడు. ఈలోపులో మేమిద్దరమూ, ఆ ప్రాంగణంలోనే, లలితాసహస్రనామం పారాయణ చేసుకున్నాము. పూజారి గారొచ్చిన తరువాత, అమ్మవారికి , చీర, పసుపు,కుంకం , నాభార్య సమర్పించుకుంది… గుడి చుట్టూ ఉండే ప్రహారి ఎక్కితే, పుణె నగరం ఎంతో సుందరంగా కనిపిస్తుంది.. నాకు ఓపిక లేక, వెళ్ళలేదు, తనే వెళ్ళింది.
ఆతరువాత విష్ణు మందిరం, గణపతి మందిరం, కార్తికేయమందిరం, విఠోబా మందిరం, బాజీరావు పీష్వా సమాధి, చివరగా పీష్వాల కాలంలో ఉపయోగించిన వస్తువులు, ఆయుధాలు, ఆనాటి చిత్రపటాలూ, వ్రాత ప్రతులూ… ఉంచిన సంగ్రహాలయ్ ( Museum ) కి వెళ్ళి, ఓ అరగంట అక్కడ గడిపాము.
ఓ కాఫీ తాగి, మెల్లిగా 12 గంటలకి కిందికి దిగాము. Overall it was a beautiful experience..
ఈసందర్భంలో శ్రీమతి PSM లక్ష్మి గారు సమర్పించిన ఒక విడియో లింక్ ఇస్తున్నాను.. ఆ గుడి వివరాలన్నీ, అద్భుతంగా వివరించారు.