బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు–కోనసీమ మీద వ్యాసం

konaseema page 1konaseema2

పుట్టి పెరిగింది కోనసీమలో అయినా ఆ ప్రాంతాన్ని ఇంత అందమైన పదాలలో ఇంకా అందంగా చూపించొచ్చని ‘సాక్షి’ లో వ్రాసిన శ్రీ పూడూరి రాజిరెడ్డిగారు నిరూపించారు. చాలా థాంక్స్.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-తిరుమలలో సీ.డీ.ఆవిష్కరణ సభ

   రెండు రోజులనుండి ఊరించారు లతామంగేష్కర్ పాడిన అన్నమయ్య సంస్కృత కీర్తనల సీ.డీ. ఆవిష్కరణ గురించి. ఓ అరగంట ఆలశ్యం అయినా ఎలాగో మొదలెట్టారు. మనల్ని బోరుకొట్టడానికి, ముందుగా రాళ్ళబండి ఆయన మైకు చేతిలో పుచ్చుకుని మనల్ని బాదేశాడు. ఆయన ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో అసలు ఎవరికీ అర్ధం అవలేదు. ఒక మాటకీ,ఇంకో మాటకీ సంబంధం లేదు.ప్రసంగం కాకుండా మిగిలినవి మాట్లాడేటప్పుడు, మైక్ స్విచ్ ఆఫ్ చేయాలనికూడా తెలియదు.‘ ఒరే గవర్నరు గారికి కుర్చీ లెదర్రోయ్, తీసికుని రండి..’ లాటి వ్యర్ధ డైలాగ్గులు వినే భాగ్యం కలిగింది. అసలు ఇలాటి కార్యక్రమాలు చేయడానికి ఎందరో మహానుభావులు-శ్రీ ఎస్.పి. శ్రీమతి సునీత లాటివారుండగా వీళ్ళందరూ ఎందుకు మనని బాధ పెడతారో? ఆయన ‘తెలుగు వెలుగు’లాటి టీ.వీ. కార్యక్రమాల్లో పద్యాలు చదవడం వరకూ ఓ.కే. సంబంధం లేని కార్య్క్రమాల్లో వేలు పెట్టకూడదు.ఏం మాట్లాడాలో ముందుగా ఓ కాగితం మీద వ్రాసుకుని వచ్చినా బాగుండేది.

   ఇంకో నమూనా-తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి అద్యక్షుడు (లోక్ సభలో తెలుగు దేశాన్ని ముంచేసి కాంగ్రెస్ ని రక్షించిన లిక్కర్ బేరన్) ఆదికేశవులు నాయుడు– ఈయనకున్న క్వాలిఫికేషన్ ఏమిటో ఎవరికీ తెలియదు.ఆయన పదిహేను నిమిషాలు మనల్ని పెట్టిన హింస పూర్తి అయిన తరువాత అమ్మయ్యా అనిపించింది. ఏ భాషా సరీగ్గా మాట్లాడలేడు. అసలు ఎందుకొచ్చిన గొడవా తనకొచ్చిన తూఠీ ఫూఠీ తెలుగులోనే మాట్లాడొచ్చుగా. ఇంగ్లీషు,హిందీ ఓటీ.రైల్వే వాళ్ళ అనౌన్స్మెంట్లలాగ. రాళ్ళబండాయన లతా మంగేష్కర్ పాడినవి 50,000 పాటలన్నారు. ఆదికేశవులు 25000 అన్నారు! వీ.ఏ.కే రంగారావుగారిని అడగాలి !! పైగా రోశయ్య గారు మాట్లాడినది ఈ ఆదికేశవులు ట్రాన్సిలేట్ చేసి చెప్దామనుకున్నట్లు కనిపించింది! అదృష్టం కొద్దీ గవర్నర్ గారు చెప్పినట్లున్నారు.బ్రతికిపోయింది !!
అందరిలోకీ నరసింహన్ మాట్లాడింది బాగుంది.’ ఇక్కడ ఉన్న మేమంతా ఏదో ఓ పొజిషన్ వల్ల వచ్చామూ, మీరు ( లతా జీ ని ఉద్దేసించి) ఒక్కరే స్వశక్తి మీద ఉన్నవారూ అని. ఇంక లతామంగేష్కర్ పాడినదేదో వినలేదు.సీ.డీ కొంచెం విన్నాము.ఫర్వాలేదు. ఎంత ‘ భారత రత్న’ అయినా, ఇంకో భారతరత్న ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పాడినట్లుగా అనిపించలేదు. ఇటుపైన అయినా రాళ్ళబండి వారూ, ఆదికేశవులు లాటి వారూ మన మానాన్న మన్ని వదిలేస్తే సీ.డీ లు విని ఆనందిస్తాము.అసలు హీరో ‘డాలర్’ శేషాద్రి. ఆయనొక్కడే ఇందుగలడందులేడని అన్నట్లు ప్రతీ చోటా కనిపిస్తాడు.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-ప్రేమలూ, పెళ్ళిళ్ళూ

   ఇదివరకు రోజుల్లో అయితే ఇంటి పెద్ద ఏదైనా చెప్పితే నచ్చినా నచ్చకపోయినా,ఆయన మాట వినేవారు.ఎందుకూ, ఏమిటీ అని అడిగే ధైర్యం ఉండేదికాదు.అది గౌరవం కొద్దీ అయిండొచ్చు, భయం వలన కూడా అయిండొచ్చు.ఏమిటీ అని ఇప్పుడు ఆలోచించినా అర్ధం అవదు. ఒకటి మాత్రం అర్ధం అవుతుంది–కాలం మారింది.ఇప్పుడు అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఏదైనా చెప్పగానే వినేది–‘ వై ‘(ఎందుకూ?) అనే పదం. సో కాల్డ్ మనస్థత్వ విశ్లేషకులు దానికి ఏదో ఆధునిక అర్ధం చెప్తారు.ప్రస్తుత జనరేషన్ ప్రతీదీ దానికి కారణం చెప్పకుండా అంగీకరించరూ,వాళ్ళు కన్విన్స్ అయితేనేకానీ ఒప్పుకోరూ అంటూ. మరి ఆయనకి (విశ్లేషడు గారికి) ఇంట్లో పిల్లలు లేరా,ఉంటే ఆయన పరిస్థితి ఏమిటీ,అనేవి మనకు తెలియదు.ఎవడో పేషెంట్ వచ్చాడూ,వాడికి జెంబో నింబో ఏదో చెప్పేసి, మన ఫీజు తీసేసికుందామూ అనే తొందర.

ఇంట్లో ఉన్న కొడుకు,కూతురు దగ్గరనుండి, మనవళ్ళూ,మనవరాళ్ళ దాకా ఎవడూ ఈ పెద్దాయన మాటని ‘ఎందుకూ’ అని అడక్కుండా వదలరు. పాపం ఈయనకేమో ఈ ‘ఎందుకూ’ కి సమాధానం తెలియదు.తను వాళ్ళ నాన్న మాట ఎలాగైతే విన్నాడో అలాగ ఇప్పటి వాళ్ళు వింటారనుకుంటాడు-‘పూర్ సోల్ ‘.ఇంట్లో ఉన్న కూతురు కానీ, కొడుకు కానీ చదువైపోయిన తరువాత సడెన్ గా ఇంట్లో ‘ఓ బాంబ్ ‘ వేస్తారు–‘నేను ఫలానా అమ్మాయి/అబ్బాయి ని ఇష్ట పడుతున్నానూ అని. ఇంక ఇంట్లో ఉన్న ఈ పెద్దాళ్ళు గింజుకుంటారు. ‘అయ్యో మా చిన్నప్పుడు ఇలాటివి విన్నామా ‘ అంటూ.ఏం చెయ్యాలో తెలియదు, పోనీ వద్దందామా అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసికుంటారేమో అని ఓ భయం.కొంతమందిని చూశాను- అమ్మాయో,అబ్బాయో ఇలాటిదేదైనా చేసినప్పుడు, సినిమాల్లో తల్లితండ్రుల్లాగ ‘ నీకూ,మాకూ ఏం సంబంధం లేదూ, నీ ఇష్టం వచ్చినట్లు చేసికో’అనేస్తారు. అమ్మయ్యా గొడవ వదిలిందిరా బాబూ అని, రిజిస్టార్ ఆఫీసుకి వెళ్ళి దండలు మార్చేసికొని కాపురం పెట్టేస్తారు.
ఈ పధ్ధతే హాయి, పెళ్ళిఖర్చులేమీ ఉండవు.కొడుక్కైనా కూతురు కైనా ఈ రోజుల్లో పెళ్ళి ఖర్చులు ఒకలాగే ఉంటున్నాయి. ఓ ఏడాది అయ్యేసరికి ఏ పిల్లో పాపో పుడుతుందనేసరికి, ఈ పెద్దాళ్ళ సోకాల్డ్ కోపాలూ,తాపాలూ తగ్గుతాయి.ఏ అమెరికాయో అయితే పురుళ్ళుపోయడానికి వెళ్ళడం వగైరా వగైరా.. చూశారా పెళ్ళి ఖర్చులు ఎలా తప్పించుకున్నారో.మన చేతికి తడీ అవలేదూ,అయే పని ఎలాగూ అయింది.ఈ రోజుల్లో కొంతమంది రిటైర్ అయిన తల్లితండ్రులు బాగా స్మార్ట్ అయ్యారు.ఇలా చేస్తే ఊళ్ళోవాళ్ళ దగ్గర తన పరువూ నిలబడుతుందీ,పెళ్ళి ఖర్చూ ఉండదూ, ఎలాగూ ఓ రెండేళ్ళు పోయిన తరువాత అందరూ కలిసే ఉంటారు. ఈ ‘మాచ్ ఫిక్సింగ్’ హాయి. ఎవడైనా అడిగినా చెప్పొచ్చు-‘మా మాట వినకుండా, ఇంట్లోంచి వెళ్ళీ పెళ్ళీ చేసేసుకున్నాడూ, ఏం చేయమంటారూ’ అని. రెండేళ్ళ తరువాత ఈయనా, పెద్దావిడా అమెరికా పిల్ల/పిల్లాడి దగ్గరకు ఏ పురిటికోసమో వెళ్ళి వచ్చినా ఎవరడిగినా ఒకటే మాట-” ఏం చెయ్యమంటారూ, మా ఆవిడకి ఆ పిల్లలంటే చచ్చే అభిమానం, ఒక్కరోజూ ఏడవకుండా ఉండడం లేదూ, ఇంక నేనే పట్టుదలలకి పోవడం ఎందుకనీ సరే అన్నాను’ అని మొత్తానికి తనేదో చాలా ‘ప్రిన్సిపుల్డ్ మనిషి’ అనీ, ఇంటావిడేదో ‘వీక్ మైండెడ్ ‘ అనీ పబ్లిసిటీ ఇచ్చేస్తాడు. ఏమైతేనేం మొత్తానికి తను అనుకున్నది సాధించాడు. ఇదంతా ఏదో ‘స్పాంటేనియస్ ‘ గా జరిగినది కాదు.’ ప్రీ మెడిటేటెడ్, ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ ‘. పిల్లలంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు, మొదట్లోనే ఒప్పుకోవచ్చుగా.అమ్మో సంఘంలో ఎంత తలవంపూ!

మామూలుగా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి రెండు కులాల పిల్లల మధ్యే జరుగుతూంటాయి అదేం చిత్రమో! హాయిగా వాళ్ళడిగినట్లుగా చేసేస్తే పోలేదూ? వాళ్ళకి కావలిసినట్లు వాళ్ళెలాగూ చేస్తారు,తరువాత ఏమైనా ప్రోబ్లెం వచ్చినా మనని తప్పు పట్టరు,పట్టలేరు.రిటైర్ అయిన తరువాత బ్రతికే కొద్దికాలమైనా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండొచ్చుగా. ఈ మధ్యన మా స్నేహితుడొకడు (నాకంటే అయిదేళ్ళు ముందర రిటైర్ అయ్యాడు), ఓ కూతురూ, కొడుకూ.కూతురికి పెళ్ళిచేశాడు చాలా కాలం క్రితం. పిల్లాడికి సంబంధాలు వెదకడానికి తల ప్రాణం తోక్కి వస్తోంది.పిల్లకి ఎన్ని స్పెసిఫికేషన్లో-ఒకళ్ళకి నచ్చితే ఇంట్లో ఇంకోళ్ళకి నచ్చదు.కట్నకానుకలూ, సంప్రదాయం వగైరా వగైరా… ఇప్పటికి చాలా సంబంధాలు చూశారు,‘పోనీ వీడైనా ఎవరినో ఒకర్ని లవ్ చేసేస్తే బాగుండునూ’ అనుకుందామా అంటే, 35 ఏళ్ళు దాటేయి లవ్ చేయడానికి ఇప్పుడు వాడికెవ్వరు దొరుకుతారూ అంటాడు. అలాగని వీడికి పధ్ధెనిమిదీ, ఇరవయ్యేళ్ళ పిల్ల ఎక్కడ దొరుకుతుందీ.ఇదివరకు రోజుల్లోలాగ పదేళ్ళూ, పన్నెండేళ్ళూ వ్యత్యాసం ఉండడం కుదరదు. ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవల్సిందే.

ఇంకో స్నేహితుడిని చూశాను-బెంగాలీ.ముగ్గురు కొడుకులు.పెద్దాడికి పెళ్ళయింది ఈయన సర్వీసులో ఉండగానే. రిటైర్ అయి నాలుగేళ్ళయింది. మొన్నో రోజున రెండో వాడు ‘ఓ మరాఠీ అమ్మాయితో పెళ్ళి చేసికుంటానూ’అన్నాడుట.ఇక్కడ మా స్నేహితుడు రియలిస్టిక్ గా ఆలోచించి ఒప్పుకున్నాడు. ఈ రెండో వాడికి ఎలాగూ తల్లితండ్రులు ఒప్పుకున్నారు కదా అని, మూడో వాడు కూడా తన ‘ఇండెంట్’ పెట్టేశాడు ఇంకో మరాఠీ పిల్లతో.ఈ మధ్యన నా స్నేహితుడు కనిపించి, ‘అస్సలు నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండడంలేదూ, ఇంట్లో ఇదీ గొడవా అన్నాడు. అతన్ని ఓ గంట కూర్చోపెట్టి ఎలాగోలాగ కన్విన్స్ చేశాను. అంతా విని ‘నీకేం ఎంతైనా చెప్తావూ, నీదేం పోయిందీ’ అన్నాడు. అప్పుడు చెప్పాను, మా పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్టప్రకారమే చేశామూ,హాయిగా ఉన్నారూ అని. మెల్లి మెల్లిగా జనాల్లో మార్పు వస్తూంది.మరీ ఛాందసంగా ఉండకుండా కొంచెం ‘ఫ్లెక్సిబుల్’ అవుతున్నారు !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–పుత్రోత్సాహం-8

    ఈ కాలపు పిల్లలు చెసే మంచి పనుల గురించి చెప్పానుగా గత రెండు బ్లాగ్గుల్లోనూ, మళ్ళీ ఈ పెద్దాళ్ళు పడే ‘తిప్పలు’ గురించి చూద్దాం! 30 ఏళ్ళుగా నోళ్ళు కట్టుకొని, ఉన్నదేదో పిల్లలే తింటారూ అనుకుంటారు.అక్కడికేదో వాళ్ళకి ఇష్టం లేదని కాదు.అదేదో పిల్లలే తింటే చూసి ఆనందించడం.ఎప్పుడైనా ఏ హొటల్ కైనా వెళ్ళినా,అక్కడ ఓ కాఫీ తాగేసి ఊరుకుంటారు పెద్దాళ్ళు.పిల్లలు ఏదడిగినా కాదనరు.మరి వీళ్ళ కోరికలు తీరేది ఎప్పుడంటా? ‘ ఆరోగ్యం పాడైపోతుందీ,చిరు తిళ్ళుతింటే’ అనే ఓ కుంటిసాకుతో వీళ్ళకి భోజనం తప్ప ఇంకేదీ తినడానికి వీలుండదు.ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అందరూ బ్రెడ్డులూ, జామ్ములూ, నూడిళ్ళూ తింటారే కానీ, ఇంకేమీ కాదు.ఇవేమో పెద్దవాళ్ళకెందుకు పెట్టడమూ, వాళ్ళేమైనా తింటారా అని! పోనీ చిన్నప్పుడెప్పుడూ తినలేదూ, ఓ సారి టేస్ట్ చూపిద్దామనైనా తోచదు వీళ్ళకి.

   ఏదో చేసేద్దామని తపనే కానీ, పేద్దపెద్ద హొటళ్ళకి ఈ పెద్దాళ్ళని తీసికెళ్ళడం ఎందుకు? అక్కడేమైనా పప్పూ భోజనం, వంకాయ కూరా దొరుకుతాయా? అవి లేకుండా ఈ పెద్దాయనకి ముద్ద దిగదూ, ఆయనకి కావలిసినవి అక్కడ ఉండవూ,హాయిగా తల్లితండ్రులికి వాళ్ళకి కావలిసినవేవో ఇంట్లోనే తినేయమనొచ్చుగా.అబ్బే అలా కాదు, తమ స్నేహితులందరికీ తెలియాలి,తాము తల్లితండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో, ఎక్కడికి వెళ్ళినా తమతోనే ఎలా తీసికెళ్తామో.
ఇంకో దురభిప్రాయం ఏమిటంటే ఓ వయస్సు వచ్చిన తరువాత తల్లితండ్రులు ‘తీర్థ యాత్రలకి మాత్రమే ఎలిజిబుల్ అని ! జీవితం అంతా పిల్లల్ని పెద్ద చేయడంలోనే పుణ్యకాలం కాస్తా అయిపోయింది.పోనీ ఎక్కడికైనా టురిస్ట్ ప్లేసెస్ కి పంపొచ్చుగా.కొంతమంది పిల్లలకి ఇలాటి ఆలోచనలు వస్తూంటాయి. ఆ తల్లితండ్రులు ఏదో పెట్టిపుట్టారు.కానీ అలాటివారిని వేళ్ళమిద లెక్కపెట్టొచ్చు.

    ఇదివరకోసారి చెప్పాను, తల్లితండ్రులకి కొంచెం ప్రైవసీ ఉంటే బాగుంటుందని.ప్రస్తుత పరిస్థితులెలాగ ఉంటున్నాయంటే ఎప్పుడైనా పెద్దాయన తన భార్యతో ఏదైనా పరాచికాలాడాలంటే చుట్టురా చూసుకుని మరీ ధైర్యం చేయాలి! పాపం ఆయన మాత్రం పెళ్ళాంతో కాక ఇంకెవరితో సరసాలాడతాడండీ?ఒకళ్ళకొకరిని దగ్గరగా చూస్తే’ ఇంత వయస్సు వచ్చేకకూడా ఈ వేషాలకి మాత్రం ఏం లోటులేదూ’అంటారు.ఏం వాళ్ళుమాత్రం మనుష్యులు కాదా,వాళ్ళూ ఉప్పూకారం తినడంలేదా?ఇలాటివన్నీ వ్రాస్తే ఒక్కొక్కప్పుడు చదివేవాళ్ళకి బాగోదు.అయినా చెప్పకపోతే ఎలా తెలుస్తుందీ?

   ఇదివరకటి రొజుల్లో అయితే ఈ టీ.వీ లూ అవీ ఉండేవి కావు. ఈ రోజుల్లో ఇంట్లో ఏదైనా దెబ్బలాట కానీ, బేధాభిప్రాయం కానీ వచ్చిందా అంటే ఇదిగో ఈ దిక్కుమాలిన టి.వీ ల వల్లే.ఇంట్లో ఉన్న పెద్దాళ్ళు ఎంతసేపని ఒకరినొకరు చూస్తూ,ఒకళ్ళమీదొకళ్ళు అరుస్తూ గడుపుతారూ? వాళ్లకి కూడా ఓ ఛేంజ్ ఆఫ్ సీన్ ఉండాలిగా.ఈ పెద్దాయన ఉద్యోగంలో ఉన్నంతకాలం, మిస్ అయిన కార్యక్రమాలన్నీ, రిటైర్ అయిన తరువాత ఎంజాయ్ చెయొచ్చనుకుంటాడు.అక్కడే దెబ్బ తినేస్తాడు. ఈయన రిటైర్ అయేనాటికి టీ.వీ ల మీద సార్వభౌమాధికారం ఈయనకి ఉండదు.భార్యా,కోడలూ ఒకటైపోతే ఏ సీరియల్లో చూస్తూ కాలక్షేపం చేస్తారు.వాళ్ళు ఏవంటింట్లోకో వెళ్ళినప్పుడు, రిమోట్ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల చేతుల్లోకి వెళ్ళిపోతూంటుంది.ఇంక ఈయనేం చేస్తాడూ–చదివిన పేపరే చదువుతూ కాలక్షేపం! ఆకలేసినా సరే ఆ వస్తూన్న సీరియల్ ఆరోజు ఎపిసోడ్ పూర్తయేదాకా ప్రాప్తం ఉండదు. పోనీ ఆయన దారిన ఆయన వడ్డించుకోనిస్తారా అంటే అదీ లేదూ.అదృష్టం కొద్దీ ఈయనకేమైనా ఏ సుగర్ కంప్లైంటైనా ఉంటే పాపం టైముకి పెడతారులెండి.ఏదో ఒకటి అరారగా తింటూండాలిటగా ! ( ఇంకా ఉంది)

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–‘మిలే సుర్ మేరా’

Mile sur mera

నిన్న జూం చానెల్ లో విన్నాము.అదేమిటో నాకు 22 సంవత్సరాల క్రింద మొదటి సారిగా విన్నదే బాగుందనిపించింది. మిగిలిన వారి అభిప్రాయం ఎలా ఉందో అని నెట్ బ్రౌజ్ చేయగా,

నాకు నచ్చిన ఒక బ్లాగ్గు( ఇంగ్లీషులో)

Read it here.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పుత్రోత్సాహం-7

    ఇంట్లో ఉన్న పెద్దాయన భార్య కొడుకూ,భర్త ల మధ్య నలిగిపోతుంది. ఎవరూ తన మాట వినరు. కొంచెం తెలివైనావిడైతే ‘పోన్లెద్దూ వాళ్ళే ఊరుకుంటారు’ అని వదిలేస్తుంది. ఇంకో గొడవుందండోయ్- 40 సంవత్సరాలూ నిరాటంకంగా ప్రతీ రోజూ, కాఫీ త్రాగుతూ ఆరోజు పేపర్ చదవడం, మన గురువుగారి అలవాటు. ఇప్పుడలాగ కాదే-నాన్నగారు కూడా చదువుతారని ఇంకో రెండు మూడు వెరైటీల పేపర్లు తెప్పిస్తాడు. ఆఫీసు కెళ్ళే ముందర ఓ సారి చదివేద్దామని, పేపరు వచ్చీ రాగానే చేతిలోకి తీసికుంటాడు.అక్కడే వస్తుంది మన పెద్దాయనకి కోపం, ‘ అదిగో పేపరు చదవడానికి కూడా నోచుకోలేదూ’అని. పోనీ అబ్బాయీ, కోడలూ ఆఫీసు కి వెళ్ళిన తరువాత సావకాశంగా చదువుకోవచ్చుగా, అబ్బే వంతుల వీరయ్య లాగ తనుకూడా ముందరే చదివేయ్యాలి !

    ఇంటికి అబ్బాయి స్నేహితులో, కోడలు స్నేహితులో వచ్చినప్పుడు చూడాలి- వాళ్ళదారిని వాళ్ళని ఖబుర్లు చెప్పుకోనీకుండా, అక్కడే ఓ కుర్చీ లో కూర్చొని, వాళ్ళు మాట్లాడే ప్రతీ విషయం లోనూ తలదూర్చడం. ఒప్పుకున్నామండీ, ఈయనకి అనుభవం చాలా ఉంది, ప్రపంచంలో ఉన్న ప్రతీ విషయమూ తెలుసు, అయినా ఈయనకెందుకూ ఆ పిల్లల గొడవలూ? ఆ వచ్చినవాళ్ళు ఈయన గొడవ భరించలేక, అనుకున్నదానికంటే ముందరే వెళ్ళిపోతారు. పెద్దాళ్ళకి సంబంధించిన స్నేహితులెవరైనా వచ్చినప్పుడు, ఈ పిల్లలు అక్కడ కూర్చొంటారా?

    ఎప్పుడైనా బయట తిందామని అనుకొని కారులో అమ్మా, నాన్నల్ని బయటకు తీసికెళ్తారు. అటువంటప్పుడు కొంచెం ఈ పెద్దాళ్ళకి ఇబ్బందౌతూంటుంది. ఆ కారులో, తమ చిన్న పిల్లకి ఓ ‘బేబీ సీట్’ లాటిది పెడతారు.ఈ ‘కుర్చీ’ వల్ల పెద్దాళ్ళిద్దరూ సర్దుకొని కూర్చోవడం కొంచెం కష్టమైన పనే !అదీ మరీ దూర ప్రయాణమైతే ఇంకా కష్టం. రెండు మూడు సార్లు చూసిన తరువాత, ఇంక మేం రాలేమూ, మీరే వెళ్ళండిరా అని తప్పించేసుకుంటారు.ఇలాటప్పుడు కొడుకు అనుకుంటాడూ,’ అమ్మా నాన్నలకి మాతో రావడం ఇష్టంలేదూ’అని, అంతేకానీ అనుభవిస్తున్న అసౌకర్యం వాడు అడగడూ, వీళ్ళు చెప్పరూ.

    పిల్లలు ( అమ్మాయైనా, అబ్బాయైనా) తమ తల్లితండ్రుల్ని ఎలాటి కష్టం పెట్టకూడదనే అనుకుంటారు. వచ్చిన గొడవల్లా ఒకరినొకరు అర్ధం చేసికోవడంలోనే.వీళ్ళు లక్జరీ అనుకునేది ఆ తల్లితండ్రులకి ‘యూస్ లెస్’ గా అనిపిస్తుంది.ఊరికే డబ్బు తగలేస్తున్నారూ అనిపిస్తుంది.
Children’s intentions are very Noble. The problem lies in execution.
అనిపిస్తుంది నాకైతే.
….ఇంకా ఉంది

బానిఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

    మొన్న మా అబ్బాయి స్నేహితుడి వివాహ రిసెప్షన్ కి వెళ్ళాము.అక్కడ అందరూ చిన్నవాళ్ళే ఉంటారూ,నేనేం చెయ్యడం అనుకున్నాను ముందుగా.పెళ్ళికూతురు వారివైపు, మిలిటరీ లో(ఏ.ఎం.సి) లో పనిచేస్తున్నారు.దానితో అక్కడ ఉన్నచాలా మంది సూట్లలోనూ,మెడలో టై తోనూ ఉన్నారు.వారెవరితోనూ పరిచయం లేదు.ఇంకో సంగతి ఏమంటే ఇలాటి రెసెప్షన్లలో,అదీ మిలిటరీ వారైతే వాతావరణం అంతా ‘ఫార్మళ్ గా ఉన్న ఓ ఫీలింగొకటి వస్తుంది. అక్కడ నాలాటివాళ్ళు ఇమడలేరు.వచ్చిన వారిలో పై ఆఫీసరు అయితే ఇంక ఈ క్రిందివాళ్ళందరూ,నోరుమూసుకునే కూర్చోవాలి.ఆ పెద్దాయన ఏం మాట్లాడితే దానికి ‘హా హా హా’ అంటూ ఆర్టిఫిషియల్ నవ్వులూ, ‘హాజీ’ అంటూ ఉండడమే.
ఎవర్ని చూసినా వారి చుట్టూరా వారి క్రిదది ర్యాంకు వారే ఉన్నట్లుగా కనిపించింది!ఎక్కడ చూసినా నవ్వులే.ఈ బ్లాగ్ చదివేవారిలో ఎవరైనా మిలిటరీ వారుంటే నన్ను కోప్పడకండి. ఏదో నాకు అనిపించింది వ్రాశాను.మిలిటరీ వాళ్ళు, ఇది ఎంత నిజమనిపించినా పైకి చెప్పుకోలేరు!

    మా అబ్బాయి నన్ను వాడి స్నేహితులకందరికీ పరిచయం చేశాడు. వాళ్ళు కూడా మొహమ్మాటానికి ‘హాయ్

అంకుల్ ‘ అంటూ ఓసారి పలకరించేశారు.ఇంక మనకేమీ పని లేదనుకుని, మా మనవరాలు నవ్య తో కాలక్షేపం చేద్దామనుకుంటుండగా, మా వాడి స్నేహితులు అందరూ లైన్లో నిలబడి,’అంకుల్, మీరు చేసే మిస్టరీ షాపింగ్ గురించి, హరీష్ మాకిప్పుడే చెప్పాడూ, ప్లీజ్ మాక్కూడా చెప్పండీ’అంటూ ఇంక నన్ను ఓ గంట దాకా వదిలిపెట్టలేదు. నేను చెప్పిందంతా శ్రధ్ధగా విని, అందులో ఏమైనా డౌట్లుంటే క్లియర్ చేసికొని వెళ్ళారు.అక్కడంతా నేను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపోయాను.
వినేవాళ్ళుంటే ఇంక నన్ను పట్టుకోవడం ఎవరి తరమూ కాదు!!అందులోనూ ఈ మిస్టరీ షాపింగుల ధర్మమా అని ఈ విద్యోటి వంటపట్టేసింది.అడగనివాడిది పాపం!!అర్రే రెండు గంటలైపోయిందా అనిపించింది! అంత హాయిగా గడిపేశాను.

   నేను ప్రతీ రోజూ దగ్గరలో ఉన్న దేవాలయాలకి వెళ్తూంటాను,మా నవ్య స్కూలు బస్సు ఎక్కేశాక.ప్రతీ రోజూ ఓ అబ్బాయిని చూస్తూన్నాను.’మేంచెస్టర్ యునైటెడ్’ లోగోతో ఉన్న ఓ షర్ట్ వేసికొస్తూంటాడు.మా వాడికంటె ఓ ఏడాది అటో ఇటో వయస్సుండొచ్చు.పలకరించడానికి అవకాశం కుదరలేదు. కానీ, ఈవేళ కుదిరింది.ఊరూ, పేరూ అడిగిన తరువాత మేంచెస్టర్ యునైటెడ్ గురించి, నాకు తెలిసినదేదో వాగేశాను. కొద్దో గొప్పో కొంచెం తెలుసులెండి (మా అబ్బాయి ధర్మమా అని).ఓ అరగంట కబుర్లు చెప్పుకున్నాము. అంతా అయిన తరువాత ఆ అబ్బాయి అంటాడూ-‘ అంకుల్, మీ వయస్సున్న పెద్దవారితో ఇంత ఫ్రీ గా మాట్లాడడం ఇదే మొదటిసారీ,ఎవ్వరూ మమ్మల్ని పలకరించరూ, పలకరించినా ఏదో ఉద్యోగాల సంగతీ, పెళ్ళి సంబంధాల సంగతీ మాత్రమే.ఆ గొడవలు కాకుండా నాకు ఇష్టమైన టాపిక్కు మీద మాట్లాడుకోవడం,అదీ మన ఇద్దరికీ పూర్వ పరిచయం లేకుండా!! థాంక్యూ అంకుల్,జీవితంలో ఈ రోజు మరచిపోనూ’ అన్నాడు.

    నేను చెప్పొచ్చేదేమిటంటే అవతలివారితో మాట్లాడడం మనలోనే ఉంది.నన్ను ముట్టుకోకూ నామాలికాకి అంటూ, మడి కట్టుక్కూర్చుంటే ఎవరు ముందరకొస్తారూ?
Extend a hand of Friendship.The whole World looks beautiful!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–పుత్రోత్సాహం-6

   నేను పుత్రోత్సాహం మీద వ్రాస్తున్న బ్లాగ్గులు చదివి మా ఇంటావిడ నన్ను కోప్పడేసింది.అస్తమానూ, ఒకే దృష్టికోణం నుండి వ్రాస్తే ఎలాగండీ, మీరు వ్రాసేది చదివిన వాళ్ళు, అసలు ఏ విషయమూ పోజిటివ్ గా తీసికోరేమో అని అపార్ధం చేసికుంటారూ అంది. తనుకూడా రైటే కదా!పిల్లలు అసలు ఏదీ సరీగ్గా చేయరని కాదు ఈ బ్లాగ్గుల ఉద్దేశ్యం.నేను వ్రాసే బ్లాగ్గులు చదివేవారు,
నా సమవయస్కులు తక్కువే ఉంటారు.చాలామంది ఈ తరం వాళ్ళే అని నా నమ్మకం.

చెప్పాలంటే ఈ తరం పిల్లలకి తమ తల్లితండ్రులంటే చాలా ఇష్టం.వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఒక్కొక్కప్పుడు ఆ ఇష్టం మరీ ఎక్కువగా చూపించేస్తూంటారు.ఉదాహరణకి,వాళ్ళ నాన్నగారి విషయమే తీసికోండి,ఆయన ఇన్నాళ్ళూ శ్రమ పడ్డారుకదా అని, ఇంక శ్రమ పెట్టకూడదనే సదుద్దేశ్యంతో, ఎప్పుడైనా ఆయన అలవాటుకొద్దీ ఏ బజారుకేనా వెళ్ళి,సరుకులో, కూరలో తెద్దామనుకుంటే, ‘వద్దు డాడీ, మీరెళ్ళకండీ,ఊరికే అంతదూరం, నేను తీసుకొచ్చేస్తానూ’ అంటాడు. ఈ పెద్దాయననుకుంటాడూ, ‘అదిగో రిటైరయ్యాను కాబట్టి,ఇంక నా మాట చెల్లట్లేదూ అని ఓ ఫీలింగొచ్చేస్తుంది.అప్పటినుండీ, ప్రతీ విషయంలోనూ ఏవేవో ఊహించేసికొని, తనని ఎవరూ పట్టించుకోవడంలేదూ అని ఓ ‘దేవదాసు’ పోజు పెట్టేసికొని,ఇంక తన భవిష్యత్తంతా మంటగలిసిపోయిందీ అని ఊరికే ‘ఇది’ అయిపోతూంటాడు.

ఇంక అమ్మగారి విషయం తీసికుంటే– ఇన్నాళ్ళూ ఇల్లందరికీ వంట చేయడంతోటే సరిపోయిందీ, ఇప్పుడైనా రెస్ట్ ఇద్దామనే ఉద్దేశ్యం తో ఇంట్లోకి ఓ వంట మనిషిని పెడతారు.ఆవిడ ఈ విషయం అసలు జీర్ణించుకోలేదు.తన సామ్రాజ్యాన్ని ఎవరో ఆక్రమించేశారూ అనుకుంటుంది.పిల్లలు చేసిన పని ఈవిడ సుఖం కోసమే అని గుర్తించదు.పోనీ ఎప్పుడైనా పిల్లలకీ, భర్తకీ తన చేతుల్తో ఏమైనా వండిపెడదామనుకున్నా, వంటావిడుందికదా, మీరెందుకు శ్రమ పడతారూ అంటూ కొడుకూ, కోడలూ ఆవిడని కిచెన్ లోకే రానివ్వరు.

ఎక్కడైనా ఎప్పుడైనా ఎడ్మినిస్ట్రేషన్ మారినప్పుడు ఇలాటి మార్పులు సహజమే.ఇంట్లో ఉన్న పెద్దాయనకి ఈ విషయాలు తెలుసు-ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ ఇలాటివెన్నో చూశాడు. అయినా ఇంటిసంగతి వచ్చేటప్పడికి వాటిని ఎప్రీషిఏట్ చేయలేడు.

ఇంట్లో కొడుక్కి పిల్లలున్నారనుకోండి, వాళ్ళని ఏ క్రెచ్ లోనో పెడతారు.కారణం తల్లితండ్రుల్ని శ్రమ పెట్టకోడదనే కానీ ఇంకోటి కాదు.ఒకటి చెప్పండి, ఇప్పటి ‘హైపర్ ఏక్టివ్’ పిల్లల్ని చూసే ఓపిక ఉంటుందా ఈ పెద్దాళ్ళకి. వాళ్ళ పిల్లల్ని పెంచారంటే అది తమ బాధ్యత కాబట్టి.ఇంకో సంగతేమంటే ఆరోజుల్లో ఎవరో ఒఖ్ఖరే ఉద్యోగానికెళ్ళేవారు, ఇప్పుడల్లా కాదే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే కానీ,’లక్జరీస్’సమకూర్చుకోలేరు.ఈ పెద్దాళ్ళు మాత్రం ఎన్నాళ్ళుంటారూ, ఓ పదేళ్ళు, మహా అయితే పదిహేనేళ్ళు, ఆ తరువాత ఎవరు చూస్తారూ ఆ పిల్లల్నీ?

‘ఎఫోర్డ్’ చేయగలరు కాబట్టి తమ పిల్లల్ని క్రెచ్ లకీ, ప్రొద్దుటినుండీ సాయంకాలం దాకా ఉండే స్కూళ్ళకీ పంపుతూంటారు.ఇదంతా పిల్లల్ని తమనుండి దూరం చేయడానికి వేసిన ‘కుట్ర’ అని ఈ పెద్దాళ్ళ ఏడుపూ.ఇంట్లో పెద్దాయన ఓ సంగతి ‘కన్వీనియెంట్’ గా మర్చిపోతూంటాడు, తను తన పిల్లల్ని తనకి కావలిసిన పధ్ధతి లోనే పెంచాడు. మరి అదే పిల్లల విషయంలోకి
వస్తే ఎందుకు అలా గింజుకోవడం? తనకో న్యాయం, పిల్లలకో న్యాయం తప్పు.ఈయన తల్లితండ్రులూ ఇలాగే బాధ పడేవారేమో?ఎప్పుడైనా ఆలోచించాడా?

ఎప్పుడైనా పెద్దాయన ఏ బజారుకో, లేదా ఏ ఫ్రెండింటికో వెళ్దామని బయలుదేరతాడు, అక్కడే ఉన్న కొడుకు,’ఎక్కడికెళ్తున్నావు డాడీ’ అంటాడు. అంతే ఈయనకి చిర్రెత్తుకొచ్చేస్తుంది,’బయటకు వెళ్ళడానిక్కూడా స్వతంత్రం లేదా అనుకుంటాడు.కొడుకు ఉద్దేశ్యమేమిటంటే, దూరం వెళ్తూంటే, పోనీ కారు లో దిగబెడదామా అని.కానీ తన ఉద్దేశ్యాలన్నీ‘ మన్హీ మన్నే ఉంటాయి(మనస్సులోనే)
వాడు తననుకున్నదేదీ బయటకూ చెప్పడూ, పోనీ చెప్పొచ్చుగా , చెప్తే వాడిసొమ్మేంపోయిందీ అని ఆ పెద్దాయన అనుకుంటాడు.ఇదిగో ఇలాటి చిన్న చిన్న విషయాల్లోనే అపార్ధాలు వస్తూంటాయి.పోనీ ఈయనేమైనా తక్కువ తిన్నాడా,ఎక్కడికెళ్తున్నాడో చెప్పొచ్చుగా. అబ్బే నన్నే అడిగే తాహతొచ్చిందా అని ఊరికే బ్లడ్ ప్రెషర్ పెంచేసికుంటాడు.… ఇంకా ఉంది

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-‘వెధవ’ గారిమీద అసలు వ్యాసం.

అయ్యో నా గురించి కాదండి బాబూ వ్రాస్తూంది.నేను జూలై 14, 2009 నాడు ఒక బ్లాగ్గు వ్రాశాను.అది ఏమిటంటే 1967 లో ‘విజయ చిత్ర’ప్రత్యేక సంచిక లో ప్రఖ్యాత నటుడుశ్రీ కొంగర జగ్గయ్య గారు ఆ పత్రికలో ‘వెధవ గారు’ అనే శీర్షికతో వ్రాసిన ఒక పరిశిలాత్మక వ్యాసం. అప్పుడు నాకు స్కానింగులూ వగైరాలు చేయడం రాదు.అంటే ఇప్పుడు ఏదో ఎక్స్ పర్ట్ అయిపోయానని కాదూ,ఏదో నాకు తెలిసినంతలో ఇంట్లో ఉన్న స్కానర్ తో కుస్తీ పట్టి (అదేమైనా పాడైపోతే చివాట్లు తినడానీకి సిధ్ధ పడి),ఏమైతే అది అవుతుందని ఆ వ్యాసాన్ని పొందుపరుస్తున్నాను.మొదటి పేజీ లో అక్కడక్కడ కొన్ని అక్షరాలు కనిపించడం లేదు,( ఆయన ఫొటో కారణంగా). అందులో ఉన్న వాక్యాలు క్రింద వ్రాస్తున్నాను. మిగిలిన పేజీలు హాయిగా వాటిమీద నొక్కేసి చదివేయండి.
చేసిన ఈ ‘వెధవ పనికి’ అందరూ క్షమిస్తారని ఆశిస్తూ….

సంస్కృతం లో’విధవా’ అనే శబ్దానికి తెలుగు వాడుక భాషలో అపభ్రంశరూపమే ‘వెధవ’ అని చాలామంది అభిప్రాయం.అది తప్పు. తప్పు అనడానికి ఆధారాలున్నై.ముఖ్యమైన ఆధారం:
‘విధవా’ శబ్దం స్త్రీ లింగం.కానీ తెలుగులో ‘వెధవ’ శబ్దం కేవలం పుంలింగం. స్త్రీపరంగా వాడవలసివచ్చినప్పుడు ‘ వెధవావిడ’,’వెధవ కూతురు’ అనడం వల్ల ఇది ఋజువౌతోంది. కాబట్టి సంస్కృతానికీ, దీనికీ సంబంధం లేదనీ ఇది దేశ్య పదమేననీ,అంటే అచ్చతెలుగు…”

పైది చదివి రెండో పేజీలోకి వెళ్ళిపోండి..

Read my earlier blog here..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గామన్ ఇండియా

Gammon1Gammon2

మనదేశంలో ఎక్కడ ఏ బ్రిడ్జి అది హైదరాబాదు పంజ గుట్ట ఫ్లై ఓవరు కానీయండి, ఢిల్లీ మెట్రో రైలు కానీయండి, ఆఖరికి పాశర్లపూడి గోదావరి వంతెన (అక్కడ వంతెన కడుతూంటేనే ఒక పిల్లరు ఇప్పటికీ ఒకవైపుకు ఒరిగే ఉంటుంది) అవనీయండి. ఎక్కడ చూసినా ‘గామన్ ఇండియా ‘పేరు వినబడుతూంటేనే ఉంటుంది.అక్కడ ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి, జనం ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు, అయినా సరే మన ప్రభుత్వాలు వాళ్ళకి వేసిన జరిమానాలు ‘మాఫీ’ చేస్తూనే ఉంటారు.ఇన్ని జరిగినా ‘గామన్ ఇండియా’ కి ఆర్డర్లు వస్తూనే ఉంటాయి, అక్కడికి ఇంక వేరెవరూ ‘ఇన్ఫ్రా స్ట్రక్చర్ కంపెనీలు’ లేనట్లు. ఏమైనా అడిగితే వాళ్ళది లోయెస్ట్ టెండరూ అంటారు !!

Read it here

here