బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సహనం, ఓర్పూ….

    మా చిన్నప్పుడు, ఇంట్లో ఏదైనా అల్లరి చేసినా, ఏ ఆటవస్తువో పాడిచేసినా, చివరాఖరికి ఏ సైకిలో నేర్చుకుంటూ దెబ్బ తగుల్చుకున్నా, ఇలా రాసుకుంటూ పోతే, మగ జన్మెత్తినందుకు, తండ్రి చేతిలో దెబ్బలు తినని వాడెవ్వడూ ఉండడు. చదువుల్లో మార్కులు తక్కువరావడం అన్నది ఓ evergreen बहाना ! అందులో నాలాటివాళ్ళకైతే ఓ అలవాటైపోయింది. అలాగని ఆ తండ్రి అనబడే ఆయన రాక్షసుడేం కాదు. ఏదో పిల్లాణ్ణి నాలుగు తగిలిస్తే బాగుపడి, ప్రయోజకుడౌతాడని ఓ అపోహ! మళ్ళీ ఆడపిల్లలకి అలాటి పనిష్మెంట్లుండేవి కావు. పైగా మా ఇంటి మహలక్ష్మీ అంటూ, ఇంట్లోవాళ్ళూ, ఊళ్ళోవాళ్ళూ నీరాంజనాలు పట్టేవాళ్ళు.” అదేమిటయ్యా, ఆడపిల్లమీద అలాగ ఎవరైనా చెయ్యిచేసికుంటారా ..” అనేవాళ్ళు!. వాళ్ళు చేసే అల్లరి, ఈ మగపిల్లాడి అల్లరికంటే ఎక్కువగా ఉండేది, అయినాసరే వాళ్ళకి మాత్రం clemency గ్రాంటయేది. ఈ టపాలో ఏదో ఆడ మగ పిల్లల మధ్య వివక్షతని గురించి కాదు వ్రాసేది. ఏదో సందర్భం వచ్చిందికదా అని ఆమాటన్నాను. అలాగని ప్రతీ మగపిల్లాడూ తండ్రి చేతుల్లో దెబ్బలు తిన్నాడనీ కాదూ, ఏదో స్వానుభవం గుర్తొచ్చింది. పాపం వాళ్ళుమాత్రం ఏం చేస్తారులెండి, పొట్టకోస్తే అక్షరంముక్కుండేది కాదు, పోనీ ఈ రోజుల్లోలాగ ఇంకోటేదైనా ఫీల్డ్ లో ప్రావీణ్యం ఉందా అంటే అదీ లేదూ. చివరకిలా తేలాను!

    అదేం ఖర్మమో, నాకూ వంశపారంపర్యంగా అదే అలవాటొచ్చింది, పిల్లాణ్ణి అల్లరి చేసినప్పుడల్లా నాలుగు దెబ్బలేయడం.దానికి సాయం తన మొండితనమూ అలాగే ఉండేది. నాదా బక్కకోపం. ఏం చేస్తాను, తేరగా దొరికేది పాపం ఆ poor & innocent కొడుకేకదా! మా ఇంటావిడకైతే, ” ఈ రోజు గడిస్తే చాలు భగవంతుడా..” అని అనుకోని రోజు లేదు. పోనీ అలాగని నేనేమైనా intellectual, ideal నాన్ననా అంటే అదీ కాదూ. మరి అలాటప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా పిల్లాడిని అలా బాదడం ఎందుకూ అంటే, కారణం నేనూ చెప్పలేను. పోనీ అన్నేసి దెబ్బలు తింటున్నాడూ, నేనంటే ఏమైనా కోపమా, ఉక్రోషమా అంటే అదీ లేదూ. సాయంత్రం ఇంటికి వచ్చినప్పటినుండీ నాతోనే ఉండేవాడు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందన్నట్లు.

   నా ఉద్దేశ్యంలో, ఆనాటి తల్లితండ్రుల ఆర్ధిక పరిస్థితి ఓ కారణం అయుండొచ్చు. ఏదో పిల్లలు ఆడుకుంటారుకదా అని అప్పో సొప్పో చేసి, ఓ toy లాటిది తెచ్చామనుకోండి, తెచ్చినంతసేపు పట్టేది కాదు, ఏ కీలుకాకీలు విప్పేసి పెట్టడానికి. మరి కోపం వచ్చిందంటే రాదు మరీ. మళ్ళీ ఇంకోటి కొని తెచ్చే తాహతుండేది కాదు,పాపం ఆ విరిగినవాటినే జాయిన్ చేసి ఆడుకునేవాడు!

   ఈ రోజుల్లో తల్లితండ్రులు, వారి పిల్లల్ని పెంచే పధ్ధతి చూస్తూంటే, ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎంత అల్లరి చేయనీయండి, డెసిబిల్ లెవెల్ పెంచకుండా,వాళ్ళని కంట్రోల్ చేయడం. అసలు వీళ్ళకి మాలాగ కోపం అనేది వస్తుందా అనిపించేటట్లుగా! ఆ సహనం, ఓపికా ఎక్కడినుంచొస్తుందో? పైగా ఈ రోజుల్లో పిల్లలు చాలా హైపర్,ఐక్యూ చాలా ఎక్కువ. ఏ పని చేయాలన్నా, they dont think twice.कर्ना है तॉ कर्नॅका, बस . To hell with consequences. అవేవో డాడ్డే చూసుకుంటాడులే అనే ఓ భరోసా! వీటన్నిటికీ ముఖ్యకారణం నా ఉద్దేశ్యంలోaffordability. ఓ వస్తువు తగలడితే ఏం పోయిందీ, ఇంకోటి తెస్తారూ అనే ఓ guarantee! ఇప్పటి సంపాదనలూ అలాగే ఉన్నాయి మరి.

   ఈ సందర్భంలో నాకు ఇంకో కారణం కూడా తట్టింది. బహుశా అందరూ ఒప్పుకోపోవచ్చు. Insecurity– ఓ వయస్సొచ్చిన తరువాత కొడుకునో, కూతుర్నో వాళ్ళు ఎలాటి తప్పు(తల్లితండ్రుల దృష్టిలో) చేసినా, ఏమైనా కోప్పడితే, ఏ అఘాయిత్యం చేస్తాడో అని ఓ భయం! ప్రతీ ఇంట్లోనూ పిల్లలు అలా ఉంటారని కాదు, చాలా కుటుంబాల్లో చూస్తూంటాము.

   ఇంక ఆ పిల్లలూ తల్లితండ్రుల weakness తో ఓ ఆట ఆడేసికుంటారు. ఇదివరకటి రోజుల్లో, ఎప్పుడైనా తండ్రి నాలుగు దెబ్బలేస్తే, మహ అయితే, ఇంట్లోంచి పారిపోయి, ఏ హొటల్లోనో క్లీనర్ కింద చేరేవాడు. కాకపోతే, ఏ పరీక్షలోనో ఫెయిల్ అయితే, ఏ రైలుకట్టో పట్టుకుని పారిపోయేవాడు. మా చుట్టం ఒకడిలాగే, తణుకునుంచి నడుచుకుంటూ పోయి, నిడదవోలు స్టేషన్ లో కనిపించాడు!ఇప్పుడలా కాదే, ఏ టెలిఫోన్ టవరో ఎక్కేసి, మీడియావాళ్ళని కూడా పిలిచేటంత ఘనులు ఇప్పటి తరం వారు! మళ్ళీ ఈ అప్రతిష్టోటా అని, తల్లి తండ్రులూ, పరిస్థితులకి reconcile అయిపోతున్నారు!

    వీటివల్లే ఈమధ్యన పోలీసు స్టేషన్లలో పెళ్ళిళ్ళూ, ఆత్మహత్యలూ, హత్యలూ, ఎక్కువైపోయాయి. ఓర్పూ సహనం చూపించడం కొంతవరకూ మంచిదే. కానీ దానికీ ఓ హద్దనేదుండాలి. దేనికది తగుమోతాదుల్లో ఉంటే ఆరోగ్యం!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏం చేస్తారు, భరించాలి.. తప్పదు మరి….

   ఏమిటో గత నాలుగు రోజులనుండి, టపా వ్రాయడానికి మూడ్డే రావడం లేదు. ఏదైనా ఎక్కువ అయితే అలాగే ఉంటుందేమో? ఇంకా రెండున్నరేళ్ళు పూర్తవలేదు, మరీ 675 టపాలు కొంచం ఎక్కువైపోలేదూ? ఏదో అభిమానం కొద్దీ చదువుతున్నారు కదా అని, మిమ్మల్నందరినీ ప్రతీ రోజూ బోరుకొట్టేయడం భావ్యం కాదని, నోరుమూసుక్కూర్చున్నాను. కానీ ఈ వ్యసనం లోంచి బయటపడ్డం అంత సులభం కాదని తెలిసింది. ఇదిగో మళ్ళీ ప్రారంభం! ఏదైనా సరే “అతి” అయితే, చిరాకేసికొస్తుంది.ఒక్కొక్కప్పుడు, అది నెగెటివ్ గా కూడా రూపాంతరం చెందొచ్చు, కదూ?

   ఉదాహరణకి మన టి.వి.చానెల్స్ లో వచ్చే యాడ్ల సంగతి తీసికోండి. చానెళ్ళవాళ్ళకి వచ్చే ఆదాయం అంతా, ఈ యాడ్లవల్లే అంటారు మీరు. నిజమే కాదనం. కానీ మరీ ఇంతలా బోరు కొట్టేయాలా? పైగా ఒకే యాడ్డు, వాళ్ళు వేసే పధ్ధతి చూస్తే, మళ్ళీ జీవితం లో ఏ యాడ్డు వేశారో ఆ సరుకు ఛస్తే కొనకూడదని నిశ్చయించేసికుంటాము.One is put off after watchng the same ad so many times. ఆవిషయం ఆ కంపెనీల మార్కెటింగు వాళ్ళకి తెలియడం లేదా? లేక తెలిసినా, కంపెనీ యాజమాన్యం వారు ఏదో యాడ్ బడ్జెట్ ఎలాట్ చేశారూ, దాన్ని ఖర్చుపెట్టడమే మన ధ్యేయమూ అనుకుంటున్నారా? ఏది ఎమైనా, మనకి చిత్రహింస మాత్రం తప్పడం లేదు.

   ఏ కార్యక్రమం తీసికోండి, ఓ సీరియల్లవచ్చు, ఓ సినిమా కావొచ్చు, చివరకి ప్రతీ రోజూ ఉదయం వచ్చే ప్రవచనాల్ని కూడా వీళ్ళు వదలడం లేదు. న్యూస్సుల్లో కూడా ఇవే. అందుకే, కార్యక్రమం మధ్యలో, ఈ యాడ్లగోల భరించలెక, హాయిగా మ్యూట్ చేసేసికుంటే ఉన్నంత సుఖం ఇంకోటి లేదు. అరగంట సేపు వచ్చే తెలుగు సీరియల్ ని నెట్ లో చూడండి, అంతా చేసి అయిదు నిముషాలుంటుంది. ఆ అయిదునిమిషాలకోసమూ మనం అరగంట టైము వేస్టు చేయాలి! అలాగే హిందీ సీరియల్సు వ్యవహారమూనూ. సినిమా విషయం అడక్కండి.

   ఆ మధ్యన Tata Crucible Quiz కి వెళ్ళినప్పుడు, ఓ గంట సేపు ఎలిమినేషన్ల రౌండు ముందర కూర్చోవలసి వచ్చింది. ఆ గంటలోనూ, Tata Nano గురించి యాడ్ వేసిందే, వేసి హోరెత్తించేశారు! పైగా పేద్ద సౌండోటీ. అంతసేపు ఆ చిత్రహింస భరించేటప్పటికి, మళ్ళీ Tata Nano మొహం చూడకూడదనిపించింది. అంత వెగటూ, అసహ్యం కలిగింది. మరి ఇలాటి Ad campaign లని ఏమంటారో తెలియదు. మన చానెళ్ళలో యాడ్లేసే వస్తువులని మార్క్ చేసికుని, జీవితంలో ఆ వస్తువు కొనకూడదూ అని నిశ్చయించేసికున్నాను. ఓ పాతిక దాకా తేలాయి. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ధర్మమా అని, చాలా భాగం సుఖపడ్డట్ట్లే! పైగా ఒక్కో యాడ్డూ, టోకున ప్రతీ చానెల్వాళ్ళకీ ఇస్తారనుకుంటా. ఒకచోట వదిలిందనుకుంటే, ఇంకో చానెల్ లో ప్రత్యక్షం. ఏ చానెల్ కా భాషోటీ పైగా.

   ఇవి కాకుండా, మన చానెళ్ళలో వచ్చే సంగీత పోటీలు– ఏదో మొహమ్మాటానికి, ఎస్.పి.బాలు , ‘పాడుతా తీయగా’ మొదలెట్టినప్పుడు, ఎలిజిబిలిటీ క్రైటీరియా లో, ” ఇప్పటివరకూ ఏ పోటీలోనూ పాల్గొనని పిల్లలే ఈ పోటీకి అర్హులూ” అన్నారు. అమ్మయ్య కొద్దిగా వెరైటీ గా ఉంటుందీ, అనుకున్నంత సేపు పట్టలేదు, గత మూడేళ్ళనుండీ, ఏ కార్యక్రమం( సంగీత) చూసినా, అదే పిల్లలు, అదే వ్యాఖ్యలు, చివరాఖరికి అదే ఆడియెన్సూనూ! పిల్లల సంగీత కార్యక్రమాలు బావుండడం లేదనడం లేదు, ఆంధ్రదేశం లో ఇంక పిల్లలే లేరా? ఉన్నా రానీయరా? పాటలూ మహ అయితే ఓ యాభై ఉంటాయి. వాటినే వినాలి. ఇంక జడ్జీల సంగతి, ఎక్కడ చూసినా వీళ్ళ మొహాలే.

   ఇదివరకటి రోజుల్లో సినిమాల్లో especially black & white era యుధ్ధాల సీన్లూ, గాలివాన వరద భీభత్సం సీన్లూ, ఏరో ప్లేన్ నుంచి బాంబులు వేసే సీన్లూ, బయటి సినిమాల్లోంచో, డాక్యుమెంటరీల్లోంచో stock scenes ఉండేవి, వాటినే copy, paste చేసేసేవారు. వీణ్ణెక్కడో చూసినట్లుందే అనిపించేది! ఈ రోజుల్లో తాజకీయనాయకులు చేసే, ఊరేగింపులూ, ధర్నాలూ చూస్తూనే ఉంటారు, ఏ ఊరేగింపు చూసినా అవే మొహాలు! ఇదో వ్యాపారం అనుకుంటా. ఏ పార్టీ వాడు డబ్బులిస్తే వాడి జెండా పట్టుకుని, అరవడం పోలీసుల చేతిలో నాలుగు లాఠీదెబ్బలు తినడం!

   ఇంత జరుగుతున్నా, మనం టి.వి. సీరియళ్ళు చూడ్డం మానలేమూ, రాజకీయనాయకుల ఊరేగింపులూ ధర్నాలూ ఆగవూ, యాడ్లవాళ్ళు మనల్నిbombard చేయడమూ మానరూ, నేను బ్లాగులు రాయడమూ మాననూ! వాళ్ళనెలా భరిస్తున్నారో నన్నూ అలాగే భరించండి !!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–An exhaustive note for pre- 2006 Pensioners….

PPO

   నా టపాలు చదివేవారు కానీ, చదువుతున్నవారి తల్లితండ్రులకు కానీ, పైన ఇచ్చిన pdf ఉపయోగిస్తుందేమో ఒకసారి చూసుకోండి. ముఖ్యంగా పెన్షన్ ఎకౌంటు భార్యతో జాయింటు ఎందుకు చేయాలో వివరించారు. పైన ఇచ్చినదే కాకుండా, కేంద్రప్రభుత్వ పెన్షనర్ల వివరాలు ఇక్కడ మళ్ళీ ఇక్కడా చూసుకోండి. నా స్నేహితుడొకరు నాకు పంపించగా, మీ అందరితోనూ పంచుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఉపయోగిస్తే సంతోషం. 2006 తరువాత రిటైరయినవారికి సమస్యలేదు, వచ్చిన గొడవల్లా, అంతకుముందు రిటైరయినవారికే. ఎవడూ మన మాట వినడూ, అడిగితే కోపాలు, ఏం చేస్తాం ఇలా అవకాశం వచ్చినప్పుడు, ఒకళ్ళతో పంచుకోడం తప్ప!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అప్పుడూ.. ఇప్పుడూ…

   ఇదివరకటి రోజుల్లో పిల్లాడో పిల్లదో చదువు సందర్భంలోనో, ఉద్యోగసందర్భం లోనో, ఎక్కడో దూర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు, వీళ్ళెళ్ళిన ఊళ్ళల్లో, వాళ్ళకి తెలిసిన ఏ చుట్టానిదో, స్నేహితుడిదో ఎడ్రసో, ఫోన్ నెంబరో సంపాదించి, వాళ్ళకి ఉత్తరం వ్రాసో, ఫోను చేసో చెప్పేవారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, ఏదో ఒకళ్ళైనా తెలిసినవారుంటే మంచిదీ అని. అంతేకానీ, వీళ్ళ పిల్లలకి ఆ అవతలివాళ్ళేదో ముద్దచేసి భోజనం పెట్టాలనీ, బ్రష్షుతో పళ్ళు తోమాలనీ, ఒళ్ళు తోమి స్నానం చేయించాలనీ కాదు! ఎప్పుడెలాటి అవసరం వస్తుందో చెప్పలేము కదా, ఒక్కొప్పుడు ఇంటినుండి వచ్చే డబ్బు ఆలశ్యం అవొచ్చు ( ఆరోజుల్లో మరి డబ్బులు ఎం.ఓ. ద్వారానే కదా), ఏ వంట్లోనో బాగోపోవచ్చు, ఏదైనా కావొచ్చు. తెలిసినవాళ్ళుంటే నష్టం ఏమీలేదు. అదేకాకుండా, తెలిసినవారో చుట్టమో అని ప్రతీవారి గురించీ చెప్పేవారు కాదు. ఈ రెండు కుటుంబాల మధ్యా ఉండే స్నేహమూ, చనువూ మాత్రమే
ఇలాటి వాటికి foundation.

తెలిసినవారొకరైనా ఉన్నారులే అని ఆ పిల్లా/పిల్లాడూ, ఫరవాలేదూ తెలిసినవారున్నారూ అని ఇక్కడ తల్లితండ్రులూ ధైర్యంగా ఉండేవారు. ఉన్నారుకదా అని ఈ పిల్లలూ ప్రతీవారం వెళ్ళి ఆ తెలిసినవాళ్ళ నెత్తిమీద కూర్చునేవారు కాదు.ఎవరి సంస్కారం వాళ్ళకుండేది. అది ఆనాటి పరిస్థితి. స్నేహాలకీ, అనుబంధాలకీ ఇంకా భూమ్మీద నూకలున్న రోజులు! ఇప్పుడో, అంతా consumerism & materialstic జనాలు తెలివి మీరేరు కదా! అవతలివాడివలన మనకేమైనా ఉపయోగం ఉందా, లేక మన అమ్మా నాన్నల్లాగే వీళ్ళ సోది కూడా వినాలా అనే అనుకుంటారు. అమ్మాయైతే పెళ్ళయ్యేదాకానూ, అబ్బాయైతే చదువుకున్నన్ని రోజులూ , పోన్లెద్దూ ఏదో అవసరానికైనా ఉపయోగపడతారూ అనో, లేక తల్లితండ్రులమీద గౌరవం చేతనో వినేవారు. చదువుల హడావిడిలోనో, కొత్త స్నేహాలవలనో, కొత్తగా వచ్చిన ఫ్రీడం వలనో, వాళ్ళ క్షేమసమాచారాలు తెలుపలేనప్పుడు, దూరం లో ఉన్న తల్లితండ్రులకి ఈ స్నేహితులూ, చుట్టాలే దిక్కు. ఓ ఉత్తరం వ్రాసో, ఫోను చేసో ” ఓసారి హాస్టల్ కి వెళ్ళి మా అబ్బాయి/అమ్మాయి ఎలా ఉన్నారో” చూసిరమ్మనేవారు.

మా అమ్మాయి చదుతున్నప్పుడు పూణె లోనూ, ఉద్యోగరీత్యా బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా తన పుట్టినరోజుకి మా స్నేహితులద్వారా కేక్ పంపే ఏర్పాటు చేసేవాడిని. అప్పటికింకా ఈ online deliveries ఉండేవి కావు కాబట్టి.అదో సరదా!అలాగే మా అబ్బాయి గుర్గాం లో చదివేటప్పుడు కూడా తెలిసిన స్నేహితుని ద్వారా కేక్ పంపేటప్పటికి చాలా సంతోషించాడు. These may be small things, but they matter a lot.ఆఖరికి అహ్మదాబాద్ లో ప్రోజెక్టు సందర్భంలో వెళ్ళినప్పుడు కూడా, తనకి కావలిసినవన్నీ మా ఫ్రెండు ఎరేంజ్ చేశాడు. ఇదంతా 2000 నాటి మాట.

మరి ఇప్పుడో, ఇంకా పాతపధ్ధతుల్నే పట్టుకుని వేళ్ళాడే తల్లితండ్రులున్నారు. కానీ వచ్చిన గొడవంతా పిల్లలతోనే. అందరూ అలాటివారని కాదు. ఇప్పటికీ, కొడుకు ఏదో దూరప్రదేశానికి ఉద్యోగానికి వెళ్తుంటే, ఆ వెర్రితల్లి, ఏదో ఆ ఊళ్ళో ఉండే ఓ చుట్టానికి ఫోను చేసి, మావాడు మీ ఊళ్ళో ఉద్యోగంలో చేరాడూ, వాడి నెంబరు ఫలానా, ఏదైనా అవసరం వస్తే నువ్వున్నావని చెప్పొచ్చా, అని అడిగే వాళ్ళూ ఉన్నారు. ఎందుకంటే ఈ చుట్టరికం ఫిజికల్ ది, అంతర్జాలానిది కాదు. ఏదో ఫోన్నెంబరిచ్చింది కదా అని, ఓసారి ఫోను చేస్తాడీ చుట్టం.
ఆ పిల్లాడు ఓసారి తిరిగి ఫోను చెయ్యొచ్చుకదా. చేయలేదూ అంటే, మనతో అంత సంబంధబాంధవ్యాలు పెంచుకోడం ఇష్టం లేకే కదా! అంత అవసరం లేనివాడితో అంతలా రాసుకు పూసుకు తిరగడం ఎందుకూ అంటుంది, మా ఇంటావిడ! ఎంతైనా మా ఇంటావిడకంటె పదేళ్ళు పెద్దాడిని కదా, ఇంకా ఆ పాతచింతకాయ పధ్ధతులు వదల్లేదు!

ఇప్పటి రోజుల్లో ముందర చూసేది వీడు మనకి Facebook లో ఫ్రెండా, Twitter లో ఫ్రెండా, లేక Buzz లో ఫ్రెండా అని చూసుకుంటారు తప్ప, ఏదో అమ్మా నాన్నా చెప్పారూ, ఓసారి ఫోనుచేస్తే పోలా అని మాత్రం అలోచించరు. ఇదంతా అంతర్జాల మహిమ.ఇంటిపక్కనున్నవాడితోనే పరిచయం లేని ఈ రోజుల్లో, ఎక్కడో ఊరికి ఆ మూలున్నవాళ్ళతో స్నేహం చేసే తీరికెక్కడిది? ప్రతీ మనిషికీ ఇంకో మనిషి అవసరం ఉంటుంది, అదీ ఏదో తెలిసినవాడైతే ఇంకా మంచిదికదా. మళ్ళీ కొత్తగా introduction అవసరం ఉండదు.

ఇంకో రకం వాళ్ళని చూశాను- ఏదో తిరగడానికి ఏదో ఊరు వెళ్తారు, అక్కడేమో వీళ్ళ చుట్టాలెవరో ఉంటారు. కొడుకు దగ్గరకో, కూతురు దగ్గరకో వెళ్ళినప్పుడు, అడుగుతారు, ఫలానా మన చుట్టాలున్నార్రా ఓసారి తీసికెళ్ళూ అని. ఏదో చుట్టపు చూపుగా వచ్చిన తల్లితండ్రుల్ని disappoint చేయడం ఎందుకూ అనుకుని, ముక్కుతూనో, మూలుగుతూనో, మొత్తానికి మొక్కుబడిగా వాళ్ళింటికి తీసికెళ్తాడు. మళ్ళీ తుపాగ్గుండుకి కూడా దొరకడు.For the simple reason ఈ చుట్టం వల్ల ఏగాణీ ” ఉపయోగం” లేదు.ఈ చుట్టాలూ, స్నేహాలూ, పాతకాలపు అనుబంధాలూ అంతా just thrash ! Life goes on and on….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొన్న ఓ టపా వ్రాశాను ‘పేర్లతో పిలుచుకోడం’ అని. దానిలో ప్రస్తావించిన విషయాలే ఈవేళ ప్రొద్దుట, ప్రత్యక్షంగా వినడం/చూడ్డం తో, అబ్బో ఫరవాలేదూ, నేనూ ఏదో విషయాన్ని గురించి వ్రాయకలనూ అనిపించింది. అదేదో ” live show” లా అనిపించింది. ఈవేళ మా “ఇన్వర్టర్ డ్యూటీ ” ( గుర్తుండే ఉంటుంది, కొడుకూ,కోడలూ బిజీగా ఉండడంతో, మనవడికీ, మనవరాలికీ తోడు అన్నమాట!). మరీ అలాటి మధుర క్షణాల్ని అలా పిలుస్తారేమిటీ అని కోప్పడకండి. ఎంత ఆనందం, మధురమైనా సరే నేనలాగే అంటాను. ప్రపంచం లో ప్రతీ తాతా, నానమ్మా, అమ్మమ్మా చేసేదిదే కదా. కొంతమంది ఇళ్ళల్లో పిల్లల్తో ఉండి చేస్తారు, కొంతమంది విడిగా ఉండి చేస్తారు. కానీ బాటం లైను మాత్రం ఒకటే! అది enjoy చేస్తున్నారా లేదా అన్నది పరిస్థితులని బట్టుంటుంది. ఉదాహరణకి ఒంట్లో ఓపిక లేదనుకోండి, అది డ్యూటీ లాగే అనిపిస్తుంది. మరీ మనమీదే వదిలేసి కాకుండా, పిల్లలు ( ఆ చిన్న పిల్లల తల్లితంద్రులు) కూడా ఇంట్లో ఉంటే ఇంకోలా అనిపిస్తుంది. ఎందుకంటే షేర్ చేసికోడానికి ఇంకోళ్ళు కూడా ఉంటారు కాబట్టి. అందుకే అన్నాను “పరిస్థితుల బట్టి ఉంటుంది”అని.హిపోక్రిటికల్ గా ఉండకూడదు!

    కానీ వచ్చిన గొడవేమిటంటే, ఊళ్ళో వాళ్ళకనిపిస్తుంది, ఇదేమిటీ రోగమా, హాయిగా మనవలతోనూ, మనవరాళ్ళతోనూ ఉండడానికి అని. చిన్న చిన్న పిల్లలతో ఇరవైనాలుగ్గంటలూ “ఆడుకుని” చూడండి.మనం వాళ్ళతో ఆడ్డం కాదు, వాళ్ళు నానమ్మ/అమ్మమ్మలతో కబడ్డీ ఆడేసికుంటారు! తాతయ్యలు మాత్రం ” వయస్సు, ఓపికా అడ్డం పెట్టేసికుని” తప్పించేసికుంటారు( నాలాగ!). మరీ ఇరవైనాల్లుగ్గంటలూ కాకపోవడం తో ఏదో వెల్తి పడకుండా కాలక్షేపం చేసేస్తున్నాం. అక్కడికేదో మనవలూ, మనవరాళ్ళూ లతో ఆడుకోడం ఇష్తం లేదని కాదు. ఓపిగ్గూడా ఉండాలిబాబూ! మా మనవడు మాత్రం పాపం నా ‘కష్టం” అర్ధం చేసికుంటాడు లెండి.నానమ్మని మాత్రం వదలడు. అప్పుడప్పుడు మా కోడలితో అంటూంటాను– ఎప్పుడో మా ముత్తాతగారో, ఆయనకంటే ముందువారో ఎవరికో ఒకరికి ఋణ పడిఉంటామూ, ఇదిగో ఇప్పుడు పూర్తిగా వసూలు చేస్తున్నాడూ అని! వాడికి ఎదురుగుండా ఉండే గణపతి గుడినుండి పంచదార క్యూబ్బులు ప్రసాదం గా ఇస్తూంటారు, అవి తెచ్చి ఆరారగా ఇస్తూండాలి. పాపం అంతకంటె ఎక్కువ expectations లేవులెండి!

   ఆ సందర్భం లో ఎదురుగుండా ఉండే గుడికి వెళ్ళి బయటకొస్తుంటే, ఒకతను పలకరించాడు. ‘ఫణిబాబుగారూ గుర్తున్నానా ” అంటూ. నాకున్న పేద్ద shortcoming ఇదే! అదేమిటో ఎవరిని చూసినా ఎక్కడో చూసినట్లుంటుంది కానీ ఎక్కడో ఎప్పుడో మాత్రం ఛస్తే గుర్తుకు రాదు. మా ఇంటావిడ అలా కాదు, ఎవరినైనా ఒకసారి చూస్తే, మళ్ళీ వాళ్ళ గురించి మర్చిపోదు. పైగా కనిపించగానే, వాళ్ళ ప్రవరంతా చెప్పేస్తూ, నన్నుకూడా చివాట్లేస్తూంటుంది, ” ఏమిటండీ, అప్పుడే మర్చిపోయారా, ఫలానా టైములో ఫలానా చోట కలిశామూ…” అని. మరీ వాళ్ళెదురుగానే కోప్పడాలా చిత్రం కాపోతే? అక్కడికేదో నేనే మర్చిపోతానూ, తనకి మాత్రం ప్రతీదీ గుర్తుండేటట్లు. ఏమిటో వెళ్ళిపోతున్నాయి రోజులు. ప్రస్తుతానికి వస్తే, అలా పలకరించిన పెద్దమనిషి తను ఫలానా అని చెప్పగానే, అర్రే మీరు ఫలానా చోట పనిచేస్తున్నారు కదూ, మీ రింగ్ టోన్ ( సెల్లుది) చాలా బావుంటుందీ అనేశాను. మొహం అంటే గుర్తులేదు కానీ, పేరూ, ఉద్యోగం గుర్తున్నాయి. అతనుకూడా పాపం అర్ధం చేసికున్నాడు, అవునులెండి ఎప్పుడో ఒక్కసారి కలుసుకున్నామూ అని.

   ఇంతలో అతని భార్యా భుజం మీద ఓ ఆరునెలల పిల్లాడినేసికుని గుడినుంచి బయటకు వచ్చింది. ఏకవచనంలోనే సంబోధిస్తున్నాను ఏమీ అనుకోకండి, మరీ మా అబ్బాయి వయస్సువాళ్ళని ఏమండీ, మీరూ అని పిలవడానికి బాగోదు. ఆమాట కూడా చెప్పేస్తాను. వాళ్ళూ మొహమ్మాటానికి అదేమిటి మాస్టారూ మీరు వయస్సులో పెద్దవారూ, ఎలా పిలిచినా ఫరవాలేదూ వగైరా వగైరా… పాపం వాళ్ళుమాత్రం ఏం చేస్తారులెండి, నాలాటివాడి పాలబడ్డాక! అదేమిటో నాకు తటస్థపడేవాళ్ళుకూడా ఇలాటివాళ్ళే.అతను గవర్నమెంటులోనూ, ఆమె ప్రెవేట్ లోనూ ( software) లోనూ పనిచేస్తున్నారు. నేను టపాలో వ్రాసిన విషయం ప్రస్తావించగానే, ఆ అమ్మాయందీ ‘ నిజమే అంకుల్, ఆఫీసులో ప్రతీవాడినీ పెరెట్టే పిలవాలంటారూ, మరీ వయస్సులో పెద్దవారిని అలా పిలిస్తే అదోలా ఉంటుందీ” అని. మీదే ఊరమ్మా అని అడిగాను, అప్పుడు చెప్పారు, ఇద్దరూ దగ్గర చుట్టాలమే అని. అంటే మేనత్త కొడుకా, అయితే ” బావా అనే పిలుస్తావన్నమాట” అన్నాను. పైగా ఇంకో built in advantage ఓటుంది. ఎప్పుడైనా మరీ కోపం వచ్చినప్పుడు, ఒకళ్ళమీదొకళ్ళు free గా అరుచుకోవచ్చు! మరీ ఎక్కువైతే, ఇద్దరి తల్లితండ్రులూ ఎలాగూ ఉన్నారు సద్దిచెప్పడానికి! ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుని, ఓ అరగంట వాళ్ళని బోరుకొట్టేసి వదిలాను. మేముండే ఇంటికి దగ్గరలోనే ఉండేది వాళ్ళు, ఎప్పుడో వీలుచూసికుని రమ్మన్నాను. ఏదో ఫోన్లో కబుర్లు చెప్పుకుంటేనే బావుంటుందీ అని రాకపోయినా రాకపోవచ్చు !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   క్రిందటి వారంలో వ్రాసిన టపాలమీద, చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలొచ్చాయి. వాటిమీద నా స్పందన వ్రాయడం ఆలశ్యం అయినందుకు కోప్పడకండి. పీత కష్టాలు పీతవీ ఏం చేస్తాం? మా అబ్బాయి ఇదివరకు ఏదో ఓ కంపెనీలో పనిచేయడం వలన, పూణె లో జరిగే క్విజ్జు పోటీల్లో, వాళ్ళ కంపెనీ తరఫున పాల్గొనేవాడు. Tata Crucible, Landmark, Brand Equity వగైరాల్లాటివి. ఇవేకాకుండా, పూణె లో ఎక్కడ క్విజ్జు జరిగినా మావాడు, దానిలో పాల్గొనాల్సిందే. చాలావాటిల్లో నెగ్గాడనుకోండి.Landmark క్విజ్జులో క్రిందటేడాది నేషనల్ లెవెల్ లో సెకండొచ్చారు. ఎంబిఏ చదువుతున్నప్పుడు, బి.బి.సి వారు నిర్వహించిన University Challenge Round లోకూడా, సెమిఫైనల్స్ దాకా వచ్చాడు. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, తనకీ ఈ క్విజ్జులకీ అవినాభావసంబంధం! ఉద్యోగం వదిలేసి, ఈ కొత్తగా వ్యాపారం మొదలెట్టేడుగా, లైబ్రరీ ఒకటీ. మరి క్విజ్జుల్లో పాల్గోడం ఎలాగా అని ఆలోచించి, డాడీ, మీరు నా partner గా వచ్చేయండీ అన్నాడు. ఓరినాయనో ఇదేం గొడవరా బాబూ అనుకున్నాను. నా క్విజ్జు వ్యవహారం, తనతో తోకలా వెళ్ళడం, ప్రైజులొస్తే మోయడం వరకే పరిమితం . అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం ఓ సినిమా క్విజ్జులో తనతో పాటు పాల్గొని, సెకండొచ్చామనుకోండి. అంతమాత్రమే నా సో కాల్డ్ అనుభవం !

   ఏదో మొహమ్మాటానికి, పోన్లేరా నేనెందుకూ అన్నాననుకోండి, మరీ ఎక్కువసార్లంటే, సరేలే అంటాడేమో అనో భయం!మొత్తానికి మేమిద్దరమూ ఓ టీం అని, ఎంట్రీ పంపించాము, ఇంక చూడండి నా తిప్పలు- ఈ వారం రోజులూ ఈ రెండు క్విజ్జులకోసం నేను చదివిన పుస్తకాలూ, నెట్ లో సైట్లూ, చదువుకునే రోజుల్లో చదివుంటేనా, వామ్మోయ్ ఎంత పైకొచ్చేవాడినో? అయినా ఇదంతా చదవాలని చదివింది కాదు, ఛాన్సొచ్చిందికదా అని మా ఇంటావిడ, చాయ్ లిచ్చి మరీ చదివించింది! వదల్దే!

   క్రిందటి శనివారం Tata Crucible కి వెళ్ళాము. తీరా చూస్తే, అక్కడున్నవాళ్ళందరూ మా అబ్బాయి వయస్సువాళ్ళే ! వాళ్ళందరూ నేనేదొ ఆడియెన్సులో కూర్చోడానికి వచ్చాననుకున్నారు. ఉన్న వంద టీములకీ మొదట, ఓ prelims చెస్తారు. స్టేజ్ మీదకి వెళ్ళేది ఆరు టీములేగా! ఇచ్చిన పాతిక ప్రశ్నలకీ, 14 దాకా రైటయ్యాయి. కానీ cut off 17 అవడంతో, మేము ఆడియెన్సులోనే ఉండవలసొచ్చింది.

   నిన్నేమో Brand Equity కి అదేదో West in అని ఓ హొటల్లో జరిగింది. నిన్నా అంతే, 24/30 వచ్చాయి. cut off ఏమో 27. ఏం చేస్తాం, యోగం లేదు. ఒకటిమాత్రం తెలిసింది, అవసరం అయితే నేనూ వెళ్ళొచ్చూ అని. Next time better luck!! ఎంత చదివితే ఏం లాభం? పైగా ఎంతని చదవడం? అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువే! But I had lot of fun and thoroughly enjoyed. ఈ క్విజ్జులకి చదవడం ధర్మమా అని నా జ్ఞానం కొద్దిగా, ఎంతా పిసరంత,update అయింది!

   ఈవాళేమో, నా మిస్టరీ షాపింగు సందర్భంలో Esprit అనేదానికి వెళ్ళాను. క్రిందటి సారి మనవరాలికి అదేదో కొన్నాను 1500 పెట్టి. ఈసారి పోనీ ఇంటావిడకి తీసికుందాం అనుకుని చూస్తే, అదేం ఖర్మమో, అన్నీ high end fashion dresses, పోనీ కదా అని తీసికుంటే, కాళ్ళిరక్కొడుతుంది! ఏదొ ఒకటి తీసికోవాలిగా, ఓ షాల్ ( కాటన్) ది తీసికున్నాను. ఇంటికి తెచ్చి చూపిస్తే, దీనికి వెయ్యి రూపాయలు తగలేశారా అని చివాట్లూ! ఓ పీకో చేసిన గుడ్డముక్క అది దానికేమో వెయ్యి రూపాయలా, కోప్పడిందంటే కోప్పడదూ మరి? చేతులో ఉన్న డబ్బులు ఎలా తగలెయ్యాలా అనుకునేవాళ్ళకి ఈ షాప్పులు! నాలాటివాడెళ్తే ఆరిపోతాడు! వాడెవడో reimburse చేస్తున్నాడు కదా అని వెళ్ళడం! Again, I am enjoying all this.

    ఇంత ఆనందం లోనూ, ఒకటే బాధ! నా favourite , ఆటగాడు Mansur Alikhan Pataudi మరణం. అసలలాటి కాప్టెన్ ఉన్నాడా? ఏనాడైతే, అతన్ని, దరిద్రపు కారణాలు చూపించి, కాప్టెన్ గా తీసేశారో, అప్పటినుంచీ నాకు క్రికెట్ మీద ఆసక్తి పోయింది. ఈ రోజుల్లో ఒళ్ళంతా కవచాలు పెట్టుకుని ఆడ్డం చూస్తే నవ్వొస్తుంది, ఆరోజుల్లో కాళ్ళకి పాడ్లూ, చేతులకి గ్లోవ్సూ తప్ప ఇంకేమీ లేకుండా, అదీ ఒకే కన్నుతో ఆడ్డం, అతనండి champion player అంటే! వాళ్ళెవరో అన్నట్లుగా, he taught us to win !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పేర్లతో పిలుచుకోడం….

   ఇదివరకటి రోజుల్లో ఏదో పెళ్ళిసంబరాల్లో భాగంగా, కొత్తపెళ్ళికూతురూ, పెళ్ళికొడుకులచేత, గడప దగ్గర ఒకళ్ళపేర్లొకళ్ళు చెప్పడం అదో ముచ్చట. అప్పుడు కూడా, పెళ్ళికూతురు మహ సిగ్గు పడిపోయి, చెప్పేది. ఒక్కొక్కప్పుడైతే, అతని పేరు అర్ధం వచ్చేటట్లుగా, సరదాగా ఓ పద్యమో, పొడుపుకథో చెప్పేది. అవన్నీ ఇప్పుడు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడో, అసలా ముచ్చట అవసరమే ఉన్నట్లు లేదు. అక్కడికేదో ఒకరి పేరొకరికి తెలియదని కాదూ, పెళ్ళిలో అదో తంతు. అయినా ఈ రోజుల్లో సుముహూర్తం, వధూవరుల మధ్యలో ఓ తెరా లాటివి బొత్తిగా reduntant అనిపిస్తుంది. అందరికీ సౌకర్యంగా ఉండేటట్లు ఓ వీకెండులో ముహూర్తం, పెళ్ళికి ముందురోజో, లేక ఏ అర్ధరాత్రో ముహూర్తం అయితే, అదే రోజు సాయంత్రం రిసెప్షనూ, రాత్రి పెళ్ళీ, మరి ఈ ముచ్చట్లకన్నిటికీ టైమెక్కడిదీ? అవన్నీ చేయడానికి మనుష్యులుండాలికదా, ముహూర్తం అవగానే, ఎక్కడివాళ్ళక్కడే గప్ ఛుప్!

ఇదివరకటి రోజుల్లో, భార్యాభర్తల మధ్య వయస్సు కూడా అయిదునుండి, పది సంవత్సరాలదాకా తేడా ఉండేది. ఇప్పుడో, మరీ పెళ్ళికూతురు, పెళ్ళికొడుక్కంటే పెద్దగా ఉండకపోతే చాలు. కొండొకచో అలాటివీ చూస్తున్నాము.ఎవరిష్టం వారిది. మరీ భార్య, భర్తని పేరుపెట్టి పిలిచే అలవాటుండేది కాదు. ఎట్లీస్ట్ పబ్లిగ్గా! పడగ్గదిలో వాళ్ళు ఏం పిల్చుకుంటే మనకెందుకూ? ఏదో ” ఏమండీ..”, ” మిమ్మల్నే..” లాటివాటితో జరిగిపోయేది, అదే అలవాటు కంటిన్యూ అవుతోంది. ఏ మేనత్తకొడుకో అయితే, “బావా” అని పిలిచేవారు. మరీ అతికి వెళ్ళి ” బావగారూ ..” అంటే, భర్తగారి ఏ అన్నయ్యో పరిగెత్తుకొస్తే మళ్ళీ అదో గొడవా! అదే కాకుండా, పేర్లుకూడా మరీ పాతచింతకాయ పచ్చడిలాగ ఉండడం ఓ కారణం అయుండొచ్చు. భార్య ఏదో ముచ్చటకోసం పేరు పెట్టి పిలుద్దామన్నా మరీ ” సోమనాధం, వెంకట్రామయ్యా, రామారావూ, యాజ్ఞ్యవల్క్యం …” అంటూ పిలిస్తే మరీ అన్ రొమాంటిక్ గా ఉంటుంది!

ఇప్పుడెక్కడచూసినా స్టైలిష్, మోడరన్ పేర్లే. పిలవడానిక్కూడా ఈజీ! రమేష్, యోగేష్, లాటివి. మళ్ళీ వీటికి షార్ట్ కట్లూ రమ్మీ, యోగీ అంటూ, పేకాడదామని పిలుస్తోందో, లేక భర్తని ప్రేమగా పిలుస్తోందొ అర్ధమై చావదు వినేవాళ్ళకి. అలాగే అమ్మాయిలపేర్లు కూడా స్వీట్ గానే ఉంటున్నాయి. పెళ్ళాం ఎప్పుడూ బెల్లం ముక్కేలెండి, దానికి సాయం పేరుకూడా స్వీట్ అయితే సోనే పే సుహాగా !! మేము ఉద్యోగంలో చేరినప్పుడు, మన పై ఉద్యోగిని ( వాడు ఎంత దౌర్భాగ్యుడైనా) “సర్ ” అనే పిలవ్వల్సొచ్చేది. Ofcourse మన కిందవాడు మనల్నీ అలాగే ఎడ్రస్ చేసేవాడు ( మనం ఎంత బడుధ్ధాయిలమైనా!). అటెండెన్స్ రిజిస్టర్ లోనో, పే బిల్లు లోనో చూస్తేకానీ తెలిసేది కాదు మన పైవాడి పేరు. ఓ నేం బోర్డుండేదీ అనుకోండి. చెప్పొచ్చేదేమిటంటే, మన పైవారిని ఎవరినీ పేరుపెట్టి పిలిచే అదృష్టం ఉండేది కాదు.

ఈ రోజుల్లో అంతా Corporate Culture ధర్మమా అని ఎవరినైనా సరే పేరుపెట్టే పిలవాలిట! పైగా మిస్టరూ, మిస్సూ,మిస్సెస్సూ అనికూడా అనకూడదుట. సర్వమానవసౌభ్రాత్వుత్వం. రోజంతా ఆఫీసుల్లో పెర్లుపెట్టి పిలవడంతో ఇంట్లోనూ అదే అలవాటైపోయింది. అదేమీ తప్పనడం లేదు. కానీ ఇప్పటికీ గవర్నమెంటాఫీసుల్లో పాతలవాట్లే. వాళ్ళు పుటం వేసినా మారరు. ఎంతైనా బ్రిటిష్ లెగసీ!

ఇదివరకటి రోజుల్లో, స్కూల్లోనూ, కాలేజీల్లోనూ ఏవేవో పేర్లుపెట్టి ఏడిపించేవారు. కానీ ఇప్పుడో, ఎంత విలక్షణ పేరుంటే అంత గొప్ప! ప్రపంచం లో ఎక్కడా వినని పేర్లు ఇప్పుడు ఫాషనైపోయాయి. ఇంక కొంతమందికి అవేవో పెన్నేమ్ములో, పెన్సిల్నేమ్ములో ! శుభ్రంగా అమ్మానాన్నలు పెట్టిన పేర్లొదిలేసి ఈ తిప్పలెందుకో అర్ధం కాదు. ఆరోజుల్లో మహాభారతం లో పాండవులు మారు పేర్లెట్టుకున్నారంటే,వాళ్ళేదో అజ్ఞాతవాసం లో ఉండబట్టీ. మనకేం ఖర్మండి బాబూ? ఈవేళ అదేదో చానెల్లో “మాఊరి వంట” అని ఓ కార్యక్రమం చూశాను. జరిగిందెక్కడా అమలాపురం లో. ఆవిడెవరో అరటికాయలతోబజ్జీల్లాటివి తయారుచేస్తూ, దానికి ‘అరటి 65’అని పేరెట్టింది! అరటి 65 ఏమిటీ నా నెత్తీ? అసలర్ధం ఉందా ఆ పేరుకి? అక్కడే చిర్రెత్తుకొస్తుంది, అర్ధం పర్ధం లేని పేర్లెట్టేస్తే సరిపోతుందా? పోనీ అలా ఎందుకు పేరెట్టిందో చెప్తుందా అంటే, అదీ తెలీదుట, ఉత్తిత్తినే సరదాగాట. ఇలాటి వేలంవెర్రిలు చూస్తూంటేనే చిరాకేస్తుంది.
.

ఇంక ఈ రోజుల్లో ఇంటి పేరుతో సహా చెప్పుకోడం చాలా బాగుంది. నా ఉద్దేశ్యంలో మనకొచ్చే గౌరవం ఇంటిపేరువల్లే అని. ఏదో అదృష్టంకొద్దీ ఆ ఇంటిపేరున్న ఇంట్లో పుట్టాం, అలాటప్పుడు, పుట్టినింటి/మెట్టినింటి పేరుతో పిలిపించుకోడానికి అంత నామోషీ ఎందుకో అర్ధం అవదు. చాలామంది ఒఠ్థి ఇనీషియల్సే పెట్టుకుంటారు. ఈ దౌర్భాగ్యం మనకే అనుకుంటా, దేశం మొత్తం మీద ఎక్కడ చూసినా పూర్తిపేరు, కొన్నిచోట్ల తండ్రి పేరుతో సహా ఉంటుంది.
गर्व सॅ कहॉ మాఇంటి పేరు ఫలానా है అని !!!!!!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఉన్నమాట చెప్పుకోకూడదుట….

   వామ్మోయ్ కడుపులో ఇంత దాచుకుందన్నమాట మా ఇంటావిడ ! ఏమిటో అమాయకురాలూ, చెప్పిందేదో చేసేయడం అనుకునేవాడిని. ఏదో బ్లాగులువ్రాయడం వచ్చేసింది కదా అని, అలా వ్రాసేయడమే? పెద్దా చిన్నా అంతరం ఉండొద్దూ? అసలు నా టపాలో , ఉన్నమాటేదో ఒప్పుకోవాలికదా అని “నా అస్థిత్వానికి మూల కారణం, మా ఇంటావిడే” అని వ్రాసుకున్నాను. నిజం చెప్పడం కూడా తప్పే అని, ఆవిడ వ్రాసిన టపా ధర్మమా అని తెలిసింది. ఔనులెండి, ఈ రోజుల్లో ఉన్నదున్నట్లు ఒప్పుకునేవాళ్ళే కనిపించడం లేదూ, ఏదో నూటికీ కోటికీ నాలాటివాడు తప్ప! అదికూడా తప్పంటే ఇంక నోరుమూసుక్కూర్చుంటాను.

   నేను పడే తిప్పలెవరితో చెప్పుకోనూ? పోనీ నా సింపతైజర్లెవరితోనైనా చెప్పుకుంటేనైనా కొద్దిగా ఉపశమనం పొందుదామూ అంటే ఈవిడేమో గయ్యిమంటుంది. ఈవేళ్టికీవేళ, అప్పుడెప్పుడో చెప్పిందిలెండి, ఆవిడకి బ్రాండెడ్ గోధుంపిండి బావుండడం లేదూ, గోధుమలు కొని, మర పట్టించి తీసుకురండీ అని. ఆవిడ చెప్పెయగానే చేసే అలవాటు లేదు నాకు, చూద్దాంలే అని ఊరుకుని, ఈవేళ బయటకి వెళ్ళే కార్యక్రమం ఏమీ లేకపోవడంతో, ఆ గోధుంపిండి కార్యక్రమానికి ఇవ్వాళ ముహూర్తం పెట్టాను. అబ్బాయేమో, తను ఎక్కడికో వెళ్ళాలిట, నవ్య స్కూలునుంచి వచ్చే బస్సు దిగినప్పుడు, తీసికోడానికి సాయంత్రం రమ్మన్నాడు. పోనీ ప్రొద్దుటే, మా అమ్మాయిదగ్గరకి వెళ్ళి, వాళ్ళమ్మ పెట్టిన నిమ్మకాయ పచ్చడి ఇచ్చేసొద్దామా అనుకుంటే, ఈవేళ చాలా బిజీ డాడీ, రేపు రండీ అని చెప్పేయడం తో, ఇంకే పనీ లేక గోధుంపిండి కార్యక్రమం పెట్టుకున్నాను.

   మేము సరుకులు తెచ్చుకునే కొట్లో వాడిని అడిగి, బాగుచేసిన గోధుమలు ఓ అయిదు కిలోలు, పక్కనే ఉందికదా కదా అని ఓ చక్కీ కి వెళ్ళాను. మళ్ళీ చక్కీ అంటే ఏమిటీ అని అడక్కండి, చక్కీ అనగా పిండిమర, (Flour mill). మరీ అంత ప్రొద్దుటే, నా ఒక్కడికోసం, వాడు ఆ మర ఎందుకు స్టార్ట్ చేస్తాడూ? ఓ ముగ్గురు నలుగురు గిరాకీలు వస్తేనే కానీ చేయనన్నాడు. అదేమిటో ప్రతీవాడికీ లోకువే నన్ను చూస్తే! ఏం చేస్తానూ, మళ్ళీ అక్కడకి వెళ్ళే ఓపిక లేక, అక్కడే చెతిలో ఓ పేపరు పుచ్చుకుని సెటిలయ్యాను, వచ్చేపోయేవాళ్ళని చూస్తూ, ఎవడి చేతులోనైనా ఓ సంచీ కానీ, స్టీల్ డబ్బాకానీ ఉందేమో, ఆ మరవాడు నాకు ముక్తి కల్పిస్తాడూ అని. అబ్బే, రావడం చాలామందే వచ్చారు, కానీ వాళ్ళందరూ, నిన్న గోధుమలిచ్చి, పిండి చేయించుకుని ఈవేళ కలెక్టు చేసికునే బాపతన్నమాట. ప్రపంచంలో అందరూ నాలాటివాళ్ళే ఉంటారా ఏమిటీ, పనీ పాటూ లేకుండా? ఎవరి పనులు వాళ్ళకుంటాయి.

   కొంచంసేపట్లో మొత్తానికి ఓ నాలుగు రెడీ అయ్యాయి, రెండు డబ్బాలూ, ఓ పేద్ద సంచీనూ. నాదేమో నాజూగ్గా ఆ గోధుమలకొట్టువాడిచ్చిన పాలిథిన్ సంచీ. అప్పుడు మొదలెట్టాడు ఆ మిల్లువాడు, ముందర ఓ సిగరెట్టు కాల్చుకున్నాడు. పోనీ దాన్ని కూడా ఓ నాలుగైదు దమ్ములు పీల్చేసి పడేయొచ్చుగా, అబ్బే, ఓ దమ్ములాగడం, పక్కనే పెట్టడం, ఓ చేత్తో, ఓ చీపురేసి అక్కడ ఉన్న గోధుంపిండి దుమ్మంతా తుడవడం. ఈ కార్యక్రమం పూర్తిచేసి, దేముడికో దండ వేసి అగరొత్తెలిగించడం. ఆ పనేదో, ఆ మాయదారి సిగరెట్టు వెలిగించే ముందర చేసికోవచ్చుగా. అలాటి టైములో ఆ మిల్లు దగ్గరుండడమంత మహాపాపం ఇంకోటుండదు. ఆ దుమ్మంతా మనమీదే! అందుకే కాబోలు, పిండి మరలదగ్గర, ఎవరూ వెయిట్ చేయరు, ఏదో నాలాటి అజ్ఞానులు తప్ప. నేను వేసికున్నదే నీలం రంగు చొక్కా, ఓ అరగంటసేపు ఆ చక్కీ దగ్గర నుల్చోడంతో, నేనూ నా అవతారం ఎలా అయిఉంటుందో ఊహించుకోండి. మొత్తానికి నా పని పూర్తిచేసి ఇచ్చాడండి. నాకెమైనా స్కూటరా, కారా, లేక బైక్కా ఏమిటీ, స్టైలిష్ గా డిక్కీలో పెట్టేసి తీసుకుపోడానికి, అలాగని ఆటోలో వెళ్ళే దూరమూ కాదూ, flyover కి ఈ మిల్లిక్కడా, మేముండే ఫ్లాటక్కడా. అదేదో దూరం అయితే ఆటో ఎక్కుతానని కాదూ, ఊరికే మాటవరసకి చెప్పే కబుర్లంతే !

   ఆ అయిదుకిలోల గోధుంపిండీ, close to the chest పట్టుకుని, షర్టు మరీ దుమ్ముకొట్టేయకుండా, నాకూ, ఆ ప్యాకెట్టుకీ మధ్యలో ఓ న్యూస్ పేపరడ్డేసికుని, మొత్తానికి కొంపచేరాను. అయిదుకిలొల ప్యాకెట్టు పట్టుకున్నప్పుడు, షర్టుకి ఆమాత్రం అంటుకోదా ఏమిటీ? పైగా ఆ మిల్లువాడిచే తుడవబడిన దుమ్మోటీ! నన్నూ నా అవతారాన్నీ చూసి , వెంటనే మా ఇంటావిడ, ఆ చొక్కా విప్పేసి వాషింగ్ మెషీన్ లో పడేయండి ముందరా అంది. పైగా, నా దువ్వెన్నేమైనా చూశారా అంటూ ఓ ఇన్వెస్టిగేషనోటి. నాకెందుకండి బాబూ ఆవిడ దువ్వెన్న? నాకున్నవా ఓ పదో పరకో వెంట్రుకలూ, వాటికో దువ్వెన్నోటా? నాకు తెలియదు మొర్రో అంటే వినదే, కాదు మీరే చూడండీ అంటూ, మంచం కిందా, టేబిల్ కిందా ఒంగుని చూడవలసివచ్చి, మొత్తానికి పట్టుకున్నాను.

   మధ్యమధ్యలో నామీద జోక్కులేస్తూంటుంది. ప్రొద్దుటే నేను లేచిన తరువాత, “పళ్ళుతోముకున్నారా కాఫీ తెస్తానూ..” అని. నా మొహానికి పళ్ళుకూడానా? ఏదో నన్నేడిపించాలనే దురుద్దేశ్యం కాపోతే మరేమిటీ? ఏమిటో వెళ్ళిపోతోంది……

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–of all the things… డయపర్ల గురించి…

    మా చిన్నప్పుడు, చిన్నపిల్లల్ని కింద ఏమీ వేయకుండా ఉంచినా , పేద్దగా అనుకునేవారు కాదు. కానీ, ఇప్పుడో తల్లి ఒడిలో ఉన్నప్పుడు తప్పిస్తే, పాకడం మొదలెట్టేటప్పటికి, వంటి మీద గుడ్డలేకుండా వదలరు. పైగా ఆ కిందేసీ చెడ్డీ లోపల డయపర్లోటి! వాళ్ళు చెడ్డీ చాలాసార్లు తడిపితే, అస్తమానూ మార్చలేక, ఓ లోపల ఓ డయపరోటి వేసేసి ఉంచేస్తారు. చెప్పొచ్చేదేమిటంటే, ఈ ప్రక్రియ పెద్దవారి convenience కోసం మాత్రమే. కానీ దీనివలన జరుగుతున్నదేమిటయ్యా అంటే, ఆ పిల్లో, పిల్లాడో, పాపం నిజంగా పాస్ కి వెళ్దామనుకున్నా, ఈ డయపర్ల ధర్మమా అని, వాటిలోనే పోసేసే అలవాటు అయిపోతోంది. ఇంతకంటే మంచి టాపిక్కే దొరకలేదా అనుకోకండి. ప్రస్తుత burning topic అదే మరి. ఇంట్లో ఏం ఉన్నా లేకపోయినా ఫరవా లేదు. కానీ ఈ డయపర్లు అయిపోతేమాత్రం, మనకి నిద్ర పట్టదు !!

    పైగా రాత్రి పక్కబట్టలు తడిసిపోతాయేమో అని, రాత్రిళ్ళు కూడా ఓ డయపరు వేసేసి పడుక్కోబెట్టడం! దీనితో ఏ స్నానం చేయించేటప్పుడో తప్ప, మిగిలిన ఇరవైమూడు గంటలూ ఆ డయపర్లతోనే ఉండిపోవలసివస్తోంది. మరి ఇంక ఓ టైముకి లేచి, పాస్ కి వెళ్ళడం అలవాటవమంటే ఎక్కడవుతుందీ? ఆ పిల్లనో పిల్లాడినో ఓ రాత్రివేళ లేపి, పోయించడానికి తల్లితండ్రులకి బధ్ధకం. బధ్ధకం అనడానికీ వీలులేదనుకోండి, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అర్ధరాత్రివరకూ ఆఫీసు కాల్స్ తోనే సరిపోతుందాయే. ఏదో టైముందీ అనుకుంటే టి.వీ. లో ఏ సినిమాయో చూసి పడుక్కునేటప్పటికి, అర్ధరాత్రి దాటిపోతుంది, ఇంక మధ్యలో పిల్లనో పిల్లాడినో లేపే ఓపికెక్కడ? ఈ గొడవంతా భరించలెక, ఓ డయపర్ చుట్టబెట్టేస్తే సరి!

    ఆమధ్య ఓ యాడ్ కూడా వచ్చింది, ఓ డాక్టరమ్మ గారు, పక్కావిడతో అంటూంటుంది ‘అరే బాబు రాత్రంతా నిద్రపోలెదా అయ్యో ఫలానా డయపరు వేసేస్తే హాయిగా నిద్రపోయేవాడే…’
ఈ డాక్టర్లు, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇలాటి సలహాలిస్తారేమో అని నాకో అనుమానం! ఆ నిద్రలో ఉన్న పిల్లో పిల్లాడో కూడా ఓ పధ్ధతికి అలవాటు పడిపోతారు, అధవా మధ్యలో మెళుకువ వచ్చినా, పోన్లెద్దూ డయపరుందిగా, దాంట్లోనే పోసేస్తే ఓ గొడవొదిలిపోతుందీ అని! ఓ వయస్సు దాటిన తరువాత పాపం వారికి సరిపోయే డయపర్లు దొరకవాయె, అలాగని ఆ వచ్చేదేదో రాక మానుతుందా, తెల్లారేటప్పటికి పాపం పక్కబట్టలు తడిసిపోతాయి. మళ్ళీ దాక్టరు దగ్గరకు పరిగెత్తడం. ” డాక్టర్, మా పిల్ల/పిల్లాడు ఇంతవయస్సొచ్చినా ఇంకా bed wetting చేస్తున్నాడూ, (అదేనండి పక్క తడపడానికి కొంచం గ్లామరస్ టర్మ్), ఏం చేయమంటారూ” ఆయనదేం పోయిందీ, అంతకుముందే ఏ మెడికల్ రిప్రజెంటేటివో ఇచ్చిన ఫ్రీబీస్, కాంప్లిమెంటరీల ధర్మమా అని, ఇంకో మందు చెప్పేస్తారు! అక్కడికి వాళ్ళ వృత్తిధర్మం పాటించినట్లూ ఉంటుందీ, మార్కెట్ లోకి వచ్చిన ఆ కొత్త’మందు’ కి బేరం వచ్చినట్లూ ఉంటుంది. ఉభయతారకం! ఈ డాక్టర్లే కాకుండా, పేపర్లలో యాడ్లు కూడా చూస్తూంటాము–” మీ బిడ్డ ఇంకా పక్క తడుపుతున్నాడా? అయితే వెంటనే ఈ క్రింది నెంబర్లని సంప్రతించండి” అంటూ.

    ఇదివరకు రోజుల్లో అయితే, ఈ టి.వీ లూ, ఇంటర్నెట్టులూ లేకపోవడంతో, పిల్లలు ఓ పధ్ధతిలో పెరిగేవారు. ఓ టైముకి భోజనం, ఓ టైముకి నిద్రా. నాకు బాగా గుర్తు- మా అబ్బాయి అటుసూర్యుడిటు ఉదయించినా సరే, రాత్రి ఎనిమిదిన్నరా అయేసరికి పక్కెక్కేసేవాడు. రాత్రి పదకొండూ అయే సరికి, ఆ నిద్రలోనే నడిచి, బాత్ రూం కి వెళ్ళి పనికానిచ్చేసేవాడు, ఇదంతా వాళ్ళమ్మ చేసిన అలవాటు. దానితో మాకు పరుపులూ, పక్కబట్టలూ ప్రతీ రోజూ ఎండలో వేసే బాధ తప్పింది!Ofcourse, ఇప్పటివాళ్ళూ అంటారు, మేం మాత్రం ఎండలో వేస్తున్నామా అని, కానీ ఇప్పుడు డయపర్లువేసి, అంతే తేడా!

   ఇంకో చిత్రం ఏమిటంటే, ఇదివరకటి రోజుల్లో, చిన్న పిల్లో పిల్లాడినో బట్టలు లేకుండా చూడ్డం ఓ పేద్ద విషయం లా ఉండేది కాదు. కానీ ఇప్పుడో, modesty. ఇదంతా మన చేతుల్లో ఉన్నంతకాలమే, పెద్దయిన తరువాత to hell with modesty. చూడ్దం లేదూ? ఎంత తక్కువ బట్ట కడితే అంత గొప్ప! మన సౌకర్యం కోసం చిన్నపిల్లలకి ఈ డయపర్లేసి హింసించకుండా, ఓ డిసిప్లీన్ నేర్పిస్తే బావుంటుందేమో. మీకేమిటీ, ఓ చిన్నపిల్లనో పిల్లాడినో పెంచాలా ఏమిటీ, కబుర్లు మాత్రం చెప్తారూ అనకండి, మా ఇంటావిడ, మా మనవణ్ణి చూడాల్సినప్పుడు, డయపరు మాత్రం వేయదు. వాణ్ణి ఎదో ఫిక్సెడ్ టైముకి తీసికెళ్తే వాడే oblige చేస్తూంటాడు. వాడితో ఎక్కడదాకా వచ్చిందంటే, అవసరం వచ్చినప్పుడు, వాళ్ళ నాన్నమ్మని చెయ్యి పట్టుకుని తీసికెళ్ళేదాకా. వాళ్ళ అవసరం గమనించే ఓపికా, టైమూ మనకుండాలి. మీకేమండీ, ఓ పనా పాటా, కావలిసింత టైమూ అనొచ్చు. నిజమే, కానీ కన్నతరువాత పిల్లల బాగోగులు చూసుకోవాల్సింది తల్లితండ్రులే కదా! Buy one get one స్కీంలో నాలుగేసి డయపరు ప్యాకెట్లు కొనేసి పడేస్తే సరిపోదు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–moral support

    ఒక వయస్సు వచ్చిన తరువాత, ఇంకోళ్ళకి ఏదో moral support తప్ప ఇంకోటి ఇవ్వలేము. ఓపికుందా నాలుగు మంచి ముక్కలు చెప్పడం, ఇష్టం ఉందా వింటారు, లేదా తలూపేసి ఊరుకుంటారు. మరీ తన్ని తగలెయరులెండి. వయస్సులో ఉన్నప్పుడైతే, అవతలివాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, మన తాహతుని బట్టి, ఆర్ధిక సహాయం చేయగలమేమో.
నాకు అలాటి అవకాశం ఎప్పుడూ రాలేదు భగవంతుడి దయ వలన. ఏమో, అలాటి అవసరం వస్తే, చేసుండేవాడినో లేదో, ఏదో చేసేద్దామని ఉన్నా, దానికి తగ్గ ఆర్ధిక సామర్ధ్యం కూడా ఉండాలిగా. అదేం ఖర్మమో, నా ఆర్ధిక పరిస్థితి ఎప్పుడు చూసినా, ఇంకోళ్ళకి సహాయం చేయగల స్థితి లో ఎప్పుడూ లేనేలేదు. దానితో ఈ నా noble intentioన్లు, hypothetical గానే ఉండిపోయాయి. ఆ భగవంతుడిక్కూడా తెలుసు, వీడికంత ‘సీన్’ ( తెలుగు సినిమాలు చూసి చూసి, మన భాష కూడా భ్రష్టు పడిపోతోంది!) లేదూ అనుకుని, నన్ను వీధిన పెట్టకుండా దయ తలచాడు!I Thank God for that.

   స్వతహాగా మరీ దుర్మార్గుణ్ణీ, దుష్టాత్ముణ్ణీ కాకపోబట్టి, ఇంకా ఆ residual intentions ఉండిపోయాయి. అప్పుడప్పుడు బయటకి వస్తూంటాయి. ఎవరైనా, వారి సమస్య కానీ, వచ్చిన కష్టం కానీ నాతో పంచుకున్నప్పుడు, తోచిన సలహా ఇస్తూంటాను. అదృష్టం కొద్దీ ఇప్పటిదాకా వింటున్నారు. అక్కడకి మనమేదో గ్రేట్ అనికాదు, ఆ పర్టిక్యులర్ పరిస్థితి లో, ఆ అవతలి వ్యక్తి, తను అప్పటిదాకా అందరి సలహాలూ విని విని విసిగెత్తిపోయి, ఏదో మనం చెప్పినది కొద్దిగా రీజనబుల్ గానూ, రిఫ్రెషింగ్ గానూ ఉండుండొచ్చు, అనుకోవాలి, అంతేకానీ, ఒకరెవరికో నచ్చిందికదా అని, కనిపించిన ప్రతీ వాడినీ – ” నీకేమైనా సమస్యుందా, ఫరవాలేదూ నాతో చెప్పు, నాకు తోచిన సలహా ఏదో ఇస్తాను”- అనలేముకదా. వాడు తెలివైనవాడూ, మన రోగం కుదిర్చేవాడూ అయితే – ” ఔనూ నాకో రెండు లక్షల రూపాయలు కావాలీ..” అన్నాడనుకోండి, వాడి సమస్య తీర్చగలమా, అబ్బే లేదు. మహ అయితే ఏ బ్యాంకులో అప్పు దొరుకుతుందో చెప్పగలం. మళ్ళీ అప్పుడు మనల్ని ష్యూరిటీ సంతకం పెట్టమంటే, అదో గొడవా. అందుకే ఇలాటి సలహాలు voluntary గా ఇచ్చుకుంటూ పోవడం అంత ఆరోగ్యలక్షణం కాదు అని నా అభిప్రాయం. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే, అందరికీ శుభప్రదం.

   ఆ మధ్యన మా ఫ్రెండొకరు కనిపించారు, ఫ్రెండ్లకేమీ లోటు లేదు. వీధిలో బయటనుంచుంటే కావలిసినంతమంది. ఓ పలకరింపు నవ్వు నవ్వేస్తే సరిపోతుంది. అవతలివాడికీ పనేం లేకపోతే మనతో కబుర్లు మొదలెడతాడు. ఉద్యోగంలో నాతో పనిచేసిన చాలా మంది నా స్నేహితులే. చెప్పానుగా, ఈనాడిలా సంతోషంగా గడిపేయకలుగుతున్నానంటే, ఆ భగవంతుడి దయా, స్నేహితుల గుడ్ విషెస్సూనూ. ఓ రోజున అలాటి ఫ్రెండొకరు కనిపించాడు. మామూలుగా కనిపించినప్పుడల్లా, ఏదో ఒక విషయం మీద కనీసం ఓ గంటైనా కబుర్లు చెప్తూండేవాడు, ఇదేమిటీ ఇలా ఓసారి పలకరించేసి వెళ్ళిపోతున్నాడూ అనుకున్నాను. బహుశ, ఏదో సమస్యొచ్చిందేమోలే అని పట్టించుకోలేదు. ఆ మర్నాడు, నేనెక్కడికో వెళ్తూంటే, నాకు ఓ నాలుగడుగులు ముందర, ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఓ కేకేశాను, అబ్బే విన్నట్లు లేదు, కొద్దిగా ముందరకెళ్ళి, ఆపి హల్లో క్యా హుఆ, తబియత్ ఠీక్ నహీక్యా అని నాకు తెలిసిన టూఠీ పూఠీ హిందీలో పలకరించాను. ఏమిటీ, ఎన్నిసార్లు పిలిచినా ఆగలేదూ, వినబడలేదా, లేక వినిపించీ, ఎందుకులెద్దూ అని ఆగలేదా అని నిలేశాను. ఆమాత్రం చనువుందిలెండి. అప్పుడు చెప్పాడు, తననీ, భార్యనీ దొల్చేస్తున్న సమస్య. ఏముంటుందీ, ఆర్ధికసంబంధితమైనది కాదూ, ఆరోగ్య సమస్య కాదూ, ఏదో లా ఎండ్ ఆర్డరు సమస్య కాదూ, మరీ ఈ వయస్సులో ఇంకోడిమీదకెళ్ళి దెబ్బలాడే మనిషికాదూ, అలాగని ఇంకోటీ ఇంకోటీ కూడా కాదు. చెప్పానుగా, చాలా చోట్ల వచ్చే సమస్య అదీ ఇంట్లో ఓ ముగ్గురు పిల్లలుంటే, వారిలో పెద్దాడో, చిన్నాడో, చిన్నదో ఫలానా వాళ్ళని పెళ్ళిచేసుకుండామనుకుంటున్నానూ, ఆ అమ్మాయి/అబ్బాయి మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడూ/స్తుందీ వగైరా వగైరా.

   అన్నీ బావుంటే, ఏదో అమ్మతో చెప్తే సరిపోతుంది, ఆవిడే ఏదో సమయం చూసి, ఆయనతో చెప్పి, కోడల్ని తెచ్చేసికుంటుంది. కథ సుఖాంతం! ప్రపంచం అంతా అంత ఆనందంగా ఉండడం, ఆ భగవంతుడికీ నచ్చదు, ఓ ఆటాడదామనుకుంటాడు. ఈ పిల్లో/పిల్లాడో రొమాన్స్ లో పడ్డవాళ్లు, చాలామంది,inter caste, inter state అయుంటారు. అక్కడేగా వచ్చిన సమస్యంతా! ముందర ఒప్పుకోనివాళ్ళు ఈ అమ్మా నాన్నలే. ఠాఠ్, మన భాషా, మన జాతీ వదిలెసి, ఇంకో చోటకెళ్ళడం ఎందుకూ తో మొదలయి, నువ్వీ పెళ్ళి చేసికుంటే, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలీ, etc ..etc.. ప్రారంభం. మరీ ఇదివరకటి సినిమాల్లో లాగ – “అసలు నువ్వు మాకు పుట్టేలెదనుకుంటాం” లాటి భారీ డయలాగ్గుల్లేవులెండి ఈ రోజుల్లో. మళ్ళీ DNA Test లూ గొడవానూ. అప్పటికీ వినకపోతే, చూద్దాం అనేసి , discussion ని adjourn చేసేస్తారు, మన లోక్ సభ లో లాగ. ఎప్పుడో ఆ కొడుకు ఇంట్లో లేనప్పుడు, ఈ భార్యాభర్తలిద్దరూ జుట్టుపీక్కుంటారు! అంతకంటే చేయగలిగేదీ ఏమీ లేదు. ఆ కొడుకూరుకుంటాడా, ప్రతీ రోజూ అడుగుతూంటాడు, ఎక్కడిదాకా వచ్చిందీ మీ decision making అని. చివరికోరోజు ఓ deadline పెట్టేస్తాడు. రెండురోజుల్లో చెప్పండి, లేదా..……. అని.

   అదిగో తెల్లారితే ఆ deadline పూర్తయే ముందురోజన్నమాట, నేను అతన్ని కలిసింది! చెప్పుకొచ్చాడు గొడవంతా. ఓస్ ఇంతేనా అని కొట్టిపారేశాను. వారి అబ్బాయి అడిగినట్లు చేయడంలో ఉన్న ఎడ్వాంటేజెస్ ఏమిటొ, చేయకపోవడంవలన వచ్చే consequences ఏమిటో అన్నీ చెప్పాను.అతనడిగిన ప్రతీ సందేహానికీ జవాబిచ్చాను. నేచెప్పిందంతా విని, “నీదేం పోయిందీ, చెప్తావు, అలా చేసినవాళ్ళ కష్టాలు తెలిస్తే కదా” అని కొట్టిపారేయబోతే, అప్పుడు చెప్పాను, బాబూ నీకు నాకంటే apt person దొరకడూ, మా అమ్మాయికీ, అబ్బాయికీ కూడా వాళ్ళు చెప్పింది అర్ధం చేసికుని, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, మేమిద్దరమూ ఆలోచించుకుని వాళ్ళడిగినవాళ్ళతోనే పెళ్ళి చేశామూ, భగవంతుని దయవలన హాయిగా ఉన్నారూ, అందుకే అలా చెప్పానూ అని. అర్రే బాస్ నాకు తెలియనే తెలియదు ఇన్నాళ్ళూ అని, ఇంటికి వెళ్ళి, వాళ్ళావిణ్ని కూడా తనే కన్విన్స్ చేసేసి, ఓ పదిరోజుల్లో ఓ ఇన్విటేషన్ కార్డుకూడా చేతిలో పెట్టాడు.

   అక్కడికేదో నేను చెప్పడం వల్లే వాళ్ళ పెళ్ళయిందనడం లేదు, ఏదో కాకీ, తాటిపండూ ( కాకతాళియం అనో ఏదొ అంటారనుకుంటా) లాగ, just in time లో నా moral support ఇవ్వగలిగాను.