బాతాఖానీ ఖబుర్లు–42 ” ఏక్ దూజే కేలియే ”

    మా అమ్మాయి పుణే ఇంజనీరింగ్ కాలెజీ లో మూడవ సంవత్సరం పరీక్షలైపోగానే క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వచ్చింది. ఆ రొజున నెను కూడా అక్కడే ఉన్నాను. ఆ తరువాత ఒక ఆరు నెలలు గడిచాక ఇంటికి వచ్చినప్పుడు అడిగింది, ” డాడీ, మీరు చెప్పారుగా, చదువు అయిపోయి ఉద్యోగం రాగానే నాకేది కావలిసి వస్తే అది అడగొచ్చని, అడగనా ” ” మా ఫ్రెండ్ విశాల్ , నాకు నచ్చాడు, అతనికీ క్యాంపస్ లో ఉద్యోగం వచ్చింది “ అంతే చెప్పింది.

    తల్లితండ్రులుగా మాకు ఎంతో గౌరవం చదువులో తెచ్చింది.ఫలానా అమ్మాయి తల్లితండ్రులు వాళ్ళు అనేటట్లుగా మాకు ఓ గుర్తింపు తెచ్చింది. అప్పటిదాకా ఏదీ అడగలేదు, అందువలన తను ఇంజనీరింగు కి వెళ్ళే ముందర చెప్పాము నువ్వు ఇప్పటిదాకా మాకు కావలిసినట్లుగా చదివి జీవితంలో పైకి వచ్చావు, చదువు పూర్తి అయినతరువాత నీకు ఏమి కావల్సినా అడగొచ్చు అని చెప్పాము, నీ కోరిక తీర్చే బాధ్యత మాది అన్నాము. దీనికంతటికీ ఓ 5 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్ ఉంది……..

    మా అమ్మాయి 11 క్లాస్ లో ఉండగా ఓ రోజు స్కూల్ నుండి వచ్చి, నన్ను మా క్వార్టర్ టెరేస్ మీదకు తీసికెళ్ళి ” డాడీ, నాకు ఫలానా అబ్బాయంటే చాలా ఇష్టం, పెళ్ళంటూ చేసికుంటే ఆ అబ్బాయినే చేసుకుంటానూ “ అంది. అప్పటిదాకా తన చుట్టూ ఓ పరిధి గీసికొని అందులోకి ఎవరినీ రానివ్వని, మా అమ్మాయి, తనతో చదువుకునే ఓ అబ్బాయి గురించి అలా చెప్పిందంటే అతనిని ఎంతగా ఇష్టపడిందో చెప్పఖర్లేదు. వచ్చిన గొడవల్లా ఎక్కడంటే ఆ అబ్బాయి, మా ఫాక్టరీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాయన కుమారుడు!! సరే ఆలోచిస్తామూ అని అప్పటికి ఆ విషయం వాయిదా వేశాము.మా ఇంటావిడతో చెప్పాను, తను షాక్ అయింది--” ఇదేమిటండీ, ఇంకా చదువు కూడా పూర్తికాలెదు, ఇప్పటినుండీ ఈ గొడవేమిటండీ, వాళ్ళు పంజాబీలు కదా, మనతో సంబంధం కలుపుకుంటారా” అని ఒకే టెన్షన్ పడిపోయింది. ఇక్కడ మా అమ్మాయి నాతో మాట్లాడే సమయం లోనే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేశాడు– పెళ్ళంటూ చేసికుంటే ఫలానా అమ్మాయినే చేసుకుంటానూ ” అని.

    ఇంక ఇంట్లో ప్రతీ రోజూ ఇదే గొడవ, ఇలా కాదని ఓ రోజు నేనూ, మా ఇంటావిడా, మా అమ్మాయిని తీసికొని, వాళ్ళ బంగళా కి వెళ్ళాము. అందరం కలసి చాయ్ తీసికుంటూంటే, ఈ ఇద్దరూ మళ్ళీ మొదలెట్టారు ” మేము ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నామూ, మీకేమిటి అభ్యంతరమూ” అని. దానికి ఆ అబ్బాయి అమ్మగారు చాలా సంయమనం తో, ఎక్కడా ఓర్పు పోగొట్టుకోకుండా ” చూడండి, పిల్లలూ, ముందుగా చదువులు పూర్తి చేయండి, ఆ తరువాత ఉద్యోగం సంపాదించండి, ఆ తరువాత ఆలోచిస్తాము, ఉద్యోగం లేకుండా పెళ్ళిళ్ళు చేసికుంటే, తిండి సంపాదించుకోవడం కోసం రాళ్ళు కొట్టుకోవాలి.అయినా మీది పెళ్ళి చేసికునే వయస్సా”అని చాలా నచ్చచెప్పారు. అబ్బే వింటేనా. ముందుగా మాకు అంగీకారం చెప్పండి, అప్పుడు నమ్ముతాము మిమ్మల్ని అన్నారు. అంటే మేము నలుగురమూ అంటే పేరెంట్స్ ఒక్కటే చెప్పాము. మీ ముందరి టార్గెట్ క్లాస్ 12 పరీక్షలు, దానికి మీరిద్దరూ పోటీ పడి చదివి ఎవ్వరూ ఊహించనంతగా మార్కులు తెచ్చికొని, ఓ మంచి ప్రొఫెషనల్ కోర్స్ లో చేరి, జీవితంలో ఒక పొజిషన్ తెచ్చుకోండి, అప్పటికీ మీ ఇద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారూ అంటే, అప్పుడు మాకు ఏమీ అభ్యంతరం ఉండదూ , అప్పటిదాకా మీరు కూడా ఈ విషయం పక్కకి పెట్టి చదువు మీద శ్రధ్ధ చూపించండి” అని చెప్పాము. ఇదేదో ” ఏక్ దూ జే కేలియే “ సినిమా కథ అనుకుంటున్నారా, కాదండి బాబూ, మాఇంట్లో జరిగినదే.

%d bloggers like this: