బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు -44

    మేము మా అమ్మాయికి వివాహం చేయడానికి నిశ్చయించుకొన్నప్పుడు, మా మిత్రులు కొంతమంది పైకి చెప్పకపోయినా, లోలోపల దీనికి ఆమోద ముద్ర వేయలెదేమో ననిపించింది. ఇందులో వారినీ తప్పు పట్టలేము. కానీ తల్లితండ్రులుగా మేము మా అమ్మాయి గురించి ఆలోచించాలికానీ, మిగిలిన వారి గురించికాదుగా.

    23 సంవత్సరాలు మేము అడిగినట్లుగా చదువుకుని, తనకోసమై ఏమీ కోరుకోకుండా, తన జీవిత భాగస్వామి విషయంలోనే తన ఆలోచన మాతో పంచుకుంది. అలాగని, ఏమీ మమ్మల్ని బలవంత పెట్టలేదు, మాకిష్టమైతేనే ఆ అబ్బాయితో వివాహం చేయమంది.

మాకు తను చెప్పిన పాయింట్లు ( ఆ అబ్బాయి గురించి) నచ్చాయి. మేమూ ఆ అబ్బాయిని 5 సంవత్సరాలు చూశాము. ఎదో పట్టుదలలకి వెళ్ళి మాకు నచ్చిన సంబంధమే, సాంప్రదాయాలకి కట్టుబడి చేస్తే, అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళౌతాము. ఎవరో మధ్యవర్తి తెచ్చిన సంబంధం గురించి మనకేమి తెలుస్తుంది చెప్పండి? అమ్మాయీ, అల్లుడూ సుఖంగా కాపురం చేస్తే చూడాలని ఏ తల్లితండ్రులకి ఉండదు?

కొంతమందిని చూశాము–వారి పిల్లలు తమకిష్టమైన వారిని పెళ్ళిచేసికుంటామన్నప్పుడు పేద్ద హడావిడి చేసేసి, -” మేం చూసిన సంబంధం చేసికుంటే సరే సరి, లేకపోతే నీకూ, మాకూ ఏం సంబధం లేదు, నువ్వు మాకు కొడుకు/కూతురు కావు, నువ్వు పుట్టలేదే అనుకుంటాము “ అని వారిని బయటకు పంపేయడం, ఏడాది తిరగకుండా , వీళ్ళు ఏ అమెరికా లోనో ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళడమూ. ఇలాంటి హిపోక్రసీ మాకు నచ్చదు.అదేదో ముందరే ఒప్పుకుంటే అందరికీ బాగుంటుందిగా!

    మా అబ్బాయి క్లాస్ 12 పరీక్షలు పూర్తి అయిపోగానే పూణే లో వివాహం చేయడానికి అన్ని ఎరేంజ్మెంట్లూ పూర్తి చేశాను. మంగళ సూత్రాలూ, మట్టెలూ, యజ్ఞోపవీతాలూ, మధుపర్కాలూ, మా మామగారు తణుకు నుండి తీసుకువచ్చారు. మిగిలినవన్నీ పూణే, జలగాం లలో కొన్నాము.ఎత్తి పెట్టినట్లుగా పూణే వెళ్ళి వివాహం చేయడం కొంచెం శ్రమే అయింది. ముందుగా నేనూ, మా అబ్బాయీ విలువైన వస్తువులన్నీ ట్రైన్ లో తీసికెళ్ళిపోయాము. ఆ తరువాత, మా ఇంటావిడా, అత్త మామలూ వాన్ లో వచ్చారు.

    వివాహానికి మా వైపునుండీ, అబ్బాయి వైపునుండీ అందరు చుట్టాలూ వచ్చారు. వివాహం ఓ తెలుగు పురోహితుడు గారు చేయించారు. పంజాబీ పధ్ధతిలోనూ, మేము నిశ్చయించిన ముహూర్తానికి మన సాంప్రదాయం ప్రకారం వివాహం పూర్తి చేశాము.రాత్రి ముహూర్తం, తెల్లవారెసరికి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారు.

సర్వేజనా సుఖినోభవంతూ. ఇప్పుడు మాకు ఓ మనుమరాలూ, మనవడూ. అంతా క్షేమం !!

నాచేత ఓ మంచి పని చేయించినందుకు ఆ భగవంతుడికి సర్వదా కృతజ్ఞుడిని.

%d bloggers like this: