బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

epaper-sakshi-com (13)epaper-sakshi-com (14)

   శ్రీ ముళ్ళపూడి వారు అస్తమించిన వార్త విన్న తరువాత,అసలు కంప్యూటరు ముందు కూర్చుని వ్రాయాలనే అనిపించడం లేదు. కానీ ఎన్నాళ్ళు? Life must go on… ఈ నాలుగైదు రోజులూ, మా దగ్గర ఉన్న ‘రచన’ పాత సంచికలన్నీ తీసి, అప్పుడెప్పుడో బాపు-రమణ ల గురించి వేసిన ప్రత్యేక సంచికతో సహా అన్నీ చదివాము. అలాగే ఆయన వ్రాసిన రచనలన్నీ మళ్ళీ మళ్ళీ చదివేసి, ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటున్నాము. బాపూ గారికి గానీ, శ్రీమతి శ్రీదేవి గారికి గానీ, ఫొను చేసే ధైర్యం కలగడం లేదు. ఏ చుట్టరికం లేని మనకే ఇలా ఉంటే, అరవై ఏళ్లపైన ఉన్న తన సహచరుడి గురించి శ్రి బాపు గారు ఎలా ఉన్నారో ఉహించుకుంటూంటేనే భయం వేస్తోంది.యూట్యూబ్ లో వచ్చిన ప్రతీ వీడియో చూసాను. నాకైతే అన్నిటిలొకీ నచ్చిన ట్రిబ్యూట్ ఆదివారం ‘సాక్షి’ లో ఇచ్చిందే అనిపించింది.

   ప్రస్థుత పరిస్థితుల్లో ఆంధ్రదేశం లో పిల్లల పరీక్షల గురించి ఊహిస్తూంటేనే భయం వేస్తోంది. దానికి సాయం ఈ క్రికెట్టోటీ! అదేం ఖర్మమో కానీ, ఈ World Cup కూడా ఇప్పుడే రావాలా? నిన్నటి match, అసలు చూడకూడదనే అనుకున్నాను. కానీ చూడకుండా, దానిగురించి ఎక్కడో చదివి వ్రాయడం బాగుండదు. రేడియోల్లో కామెంట్రీలు వచ్చే రోజులనుండి ఫాలో అయేవాడిని. కానీ అదేమిటో, మన రవి శాస్త్రి కామెంటరీ ఇచ్చినప్పుడు, ఎక్కడలేని చిరాకూ వచ్చేస్తుంది.ఆ అరుణ్ లాల్ అనే వాడొక్కడూ. very very limited vocabulary! ఇంతకంటే మంచివాళ్ళే దొరకరా వీళ్ళకి. ఇంకో విషయమేమంటే,మన దేశంలో ఇంకోళ్లెవరిని సపోర్ట్ చేసినా, మనల్ని ‘ దేశద్రోహులు’ కింద కట్టేస్తారు. అవతలి వాళ్ళలోనూ బాగా ఆడేవాళ్ళున్నారు కదా! వాళ్ళెవరైనా బాగా ఆడితే just by chance, అదే మనవాళ్ళైతే class ! జనాలకి పిచ్చెక్కిపోతోంది, అసలు ఆ స్టేడియం లో వాళ్ళకి ఏం కనిపిస్తుందిట? అక్కడ Giant Screen లో చూసేదేదో హాయిగా ఇంట్లోనే కూర్చుని చూసుకోవచ్చుగా! Yesterdy’s result was very apt.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-భగవంతుడు ఆడే ఆటలు…


   ఈవేళ ప్రొద్దుట హారం లో నవతరంగం లో ‘బాపు ఇక వంటరి వారు…’ అనే శీర్షిక చూసి, ఏమిటీ బాపూ రమణల జంట విడిపోయి, వారు తీసే కొత్త సినిమాకి రచయితని మార్చారా ఏమిటీ అనే అనుకున్నాము కానీ, తెలుగువారి అభిమాన రచయిత శ్రీ ముళ్ళపూడి వారు ఇకలేరని, అసలు తల్చుకోడానికే అవలేదు.అప్పటికే, శ్రీ ఎం.వి.అప్పారావుగారి దగ్గరనుండి నా సెల్లులో ఓ మిస్స్డ్ కాల్ ఉంది. ఆయనకు తిరిగి ఫోను చేసి మాట్లాడదామంటే అసలు మాటలే రాలేదు.గొంతుక పూడుకుపోయింది.ఎవరో మన ఆత్మ బంధువే ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయారా అన్నంతగా ఏడుపొచ్చేసింది.

ప్రొద్దుటినుండీ వివిధ చానెల్స్ లోనూ ప్రసారం చేస్తున్న శ్రధ్ధాంజలి కార్యక్రమాలూ, బ్లాగుల్లో వ్రాస్తున్న టపాలూ చూసిన తరువాత, ఇదిగో ఇప్పటికి తేరుకుని వ్రాయడం మొదలెట్టాను. కీ బోర్డ్ మీద వేళ్ళు నడవ్వే.ఎలా వ్రాయాలో, ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి.అసలు వ్రాయకపోతే ఏమౌతుందీ? నేను వ్రాయకపోతే, ఆయనమీద ఉన్న నాకున్న భక్తి, ఆరాధన,ఎవరికి ఎలా చెప్పుకోనూ? స్వయంగా అనుభవించిన ఆనందం, అదీ ఇంకా ఆరు నెలలేనా అవలేదు.ఇంతలోనే ఏం తొందరొచ్చేసిందీ ఆయనకి? అక్కడేం రాచకార్యాలు వెలగబెట్టాలిటా?అక్కడే చిర్రెత్తుకొస్తుంది ఇలాటి వారితో, గత నలభై ఏళ్ళనుండి ప్రయత్నిస్తున్నా వీలు పడని ఆ అవకాశం, నాకోసమే అన్నట్లుగా రావడం ఏమిటీ, నేనూ మా ఇంటావిడా చెన్నై వెళ్ళడమేమిటీ, అక్కడ ఆయనతో ఫోనులో దెబ్బలాడేసి, ఆయన్ని కలిసి ఒకటా రెండా, మూడున్నర గంటలు ఆయన సముఖంలో కూర్చోడమేమిటీ, ఏమిటో అంతా కలగానే మిగిలిపోయింది.

అదంతా కల కాదూ నిజం గానే జరిగిందీ అనడానికి, ఆయన మా టెండర్ లీవ్స్ కి ఇచ్చిన పాతిక పుస్తకాలూ పక్కనే ఉన్నాయే, పోనీ ఆ సంగతి వదిలేయండి, మా టెండర్ లీవ్స్ కి ఒక సందేశం పంపించగలరా అని, చేత్తో వ్రాయలేక( ఎందుకంటే వ్రాసేటప్పుడు నా చేతులు వణుకుతాయి!), కంప్యూటరు లో వ్రాసే ధైర్యం చేసి, ఆ తప్పిదానికి కారణాలు వివరిస్తూ క్షమాపణ చెప్పుకుంటూ, ఓ ఉత్తరం మళ్ళీ దానికీ ప్రింటౌట్టోటీ,ఎందుకంటే, ఆయనకి ఇ కంప్యూటరు తో పరిచయం లేదని, ముందుగానే చెప్పారు.ఇన్ని హడావిళ్ళు చేసి నేను పోస్ట్ చేసిన పది రోజుల్లో, ఓ ఇన్లాండ్ ఉత్తరం మీద స్వయంగా వ్రాసి నా ఎడ్రెస్ కూడా స్వయంగానే వ్రాయగా, నాకొచ్చిన అమూల్య కానుక ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది.

పోనీ ఈ విషయం పక్కకి పెడదాము.క్రిందటి నెల 26 న అప్పారావుగారి బ్లాగులో శ్రీ ముళ్ళపూడి వారి వివాహ వార్షికోత్సవమూ అని చదివి, అక్కడికి ఆయనేదో మన దగ్గర బంధువులా, మేము శుభాకాంక్షలు చెబ్దామనుకుని ఫొను చేయగానే, ముందుగా శ్రీదేవి గారూ, శ్రీ రమణగారూ, ఇలా నేనూ పూణె నుంచి ఫణిబాబూ అనగానే ‘ హల్లో మీ అబ్బాయి లైబ్రరీ ఎలా ఉందీ’ అని వాళ్ళిద్దరూ అడగడమెమిటండి బాబోయ్! అసలు ఆ దంపతుల గురించి ఏమనుకోవాలో తెలియడం లేదు. అసలు చుట్టాలే మొహం చాటేస్తున్న ఈ రోజుల్లో ఏ బంధుత్వమూ లేని, మాలాటి అర్భకుల మీద అసలు అంత అభిమానం ఎందుకండి బాబూ?

పోనీ ఈ అభిమానమైనా నాలుగు కాలాల పాటు ఆస్వాసిద్దామా అనుకుంటే, ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం.అసలు ఆ భగవంతుణ్ణనాలి,శ్రీ ముళ్ళపూడి వంటి వారిని పుట్టించడం ఎందుకూ, పోనీ పుట్టించాడే,ఆ కోతికొమ్మచ్చి మూడో భాగం కూడా వ్రాయనీయొచ్చుకదా. అప్పుడు కలిసినప్పుడు అడిగితే, ఇంకా తొంభై పేజీలు తక్కువయిందీ, ఎప్పుడో తీరిక చేసికుని వ్రాస్తానూ అన్నారు. ఇంకెక్కడి తీరిక?మా స్నేహితులడిగారు ఆయనతో మూడున్నర గంటలు ఏం మాట్లాడారూ అని.కావలిసినన్ని( జీవితం అంతా గుర్తుంచుకోకలిగినన్నీ) కబుర్లు చెప్పుకున్నాం. అన్నీ అందరికీ చెప్పాలా ఏమిటీ? మా పిల్లలూ అడిగారు, మీరింతసేపు అక్కడేం చేశారూ అని,నేను మాట్లాడినదెంతా, ఆయన మొహంలోకి చూడ్డంతోనే సరిపోయింది.

నేను కూడా కంప్యూటరులో తెలుగులో వ్రాయగలనూ అనే ఆత్మ విశ్వాసం, మొట్టమొదటి సారి, రాజమండ్రీ కాపరం లో ‘ స్వాతి’ వార పత్రికలో ‘కోతొకొమ్మచ్చి’ మీద నేను వ్రాయగా ప్రచురించబడ్డ ఉత్తరం ద్వారానే కదా!అప్పుడు నాకు తోచినదేదో వ్రాసేశాను, ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, అంత ధైర్యం అసలు ఎలా చేయగలిగానా అని.
చెన్నైలో శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారితో నేనూ, మా ఇంటావిడా అనుభవించిన అలౌకికానందం గురించి ఇక్కడ చదవండి.

అసలు ఆ భగవంతుడేమిటో, మనతో ఎందుకు ఆడుకుంటాడో ఎవరికీ అర్ధం అవదు. రేపు ఆ ‘బుడుగు’ వచ్చి మా నాన్నెక్కడా అంటే ఏం చెప్తాం?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమిటో ఈ మధ్యన నా టపాలలో వ్యాఖ్యలు పెట్టడం మానేశారు! అలాగని చూడ్డం మానేశారా అంటే అదీ లేదూ. రోజుకి కనీసం ఓ నూట యాభై దాకా సందర్శకులైతే వస్తూనే ఉన్నారు. బహుశా నేను వ్రాసేవాటితో మరీ మొహం మొత్తేసుంటుంది. నేనేం చేయనూ, నాకు తెలిసినదేదో వ్రాస్తూన్నాను.ఒక్కోసారి ఏమీ లేకపోతే నేను చదివినదాని గురించి మీ అందరితొనూ పంచుకోవడం.అలాగని మరీ posting for posting sake అనుకోకండి.

   మొన్నెప్పుడో పుణె లోని ఆంధ్రసంఘానికి వెళ్ళాను. నేను దానిలో సభ్యుడిని కాకపోవడం వలన, లోపల మీటింగు జరుగుతోందని, బయటే నిలబడ్డాను. ఇంతలో ఒకావిడ వచ్చి, ఫరవాలేదండీ, లోపలకి వచ్చి కూర్చోండీ అనడం చేత లోపలకి వెళ్ళాను. వాళ్ళ జనరల్ బాడీ ఎదొ జరుగుతోంది.తెలుసుగా ఇలాటి మీటింగుల్లో ఎలా ఉంటుందో!!పాలక వర్గం వారు చెప్పేది, సభ్యులకి నచ్చదూ. ఏదో ఏడాదంతా నానా కష్టం పడి ఏవెవో కార్యక్రమాలు చేస్తున్నారుకదా, వాటిలో కొద్దిగా లోపాల్లాటివుండొచ్చు. ఏ తప్పూ లేకుండా, ఇదిగో ఈ విమర్శలు చేసేవాళ్ళని చేయమనండి, అబ్బే మాకు టైము లేదండీ అనేస్తారు. పోనీ ఎవరో ఒకరు బాధ్యత తీసికుని చేస్తున్నారుగా, వాళ్ళ దారిన వాళ్ళని చేయనీయొచ్చు కదా! అమ్మో అలాగైతే మా సభ్యత్వం ఏ మూలకీ అనుకుని, హక్కు ఉంది కదా అని ఆ చేసేవాళ్ళకి తడకలు కట్టేయడం! స్వతహాగా సహృదయులే ఏదో టైం పాస్ అన్నమాట!

   ఓ పదిమందిదాకా కొత్తవారు పరిచయం అయ్యారు. అప్పుడు తెలిసింది, ఈ నాలుగు రోజులూ( 21,22,23,24) పూణే లో ఒకభాగమైన గోర్పురీ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారని. ఈ నలభై ఏళ్లలోనూ ఎప్పుడూ ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. ఈవేళ ప్రొద్దుట, మా అబ్బాయిని, నన్నక్కడ దింపేసి వెళ్ళమన్నాను. అక్కడ చాలా మంది పరిచయం అయ్యారు. పూజ, వేదపఠనం,చాలా బాగా జరిగింది. అక్కడ అన్న ప్రసాదం తీసికుని వచ్చాను.

   ఎక్కడికెళ్ళినా పిన్ని గారిని ఎందుకు తీసికెళ్ళరూ అనకండి. మొన్న ఆంధ్ర సంఘానికెళ్ళిన రోజు, మా అగస్థ్య తో కాలక్షేపం. ఈవేళ నవ్య తో కాలక్షేపం. ఏం లేదూ, ఈ వాతావరణ మార్పులు( పగలంతా ఎండా, రాత్రంతా చలీ), మనకే జ్వరం వచ్చినట్లుంటుంది, పాపం చిన్న పిల్లలకెలా ఉంటుందీ? అదీ కారణం.

   తిన్న తిండరక్క చెప్పే కబుర్లనే ‘బాతాఖానీ కబుర్లు’ అంటారు. మా చిన్నప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, గ్రామస్థుల కార్యక్రమం అని ఒకటొచ్చేది. అందులో శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గారనుకుంటా ఒకాయనా, ఇంకోరూ బావగారి కబుర్లనేవి వచ్చేవి. ఊరికే గుర్తొచ్చి ప్రస్తావించాను.ఓ రెండు మూడు టాపిక్కుల గురించి వచ్చే రోజుల్లో వ్రాద్దామనుకుంటున్నాను. ఏమౌతుందో, మా ఇంటావిడతో ముందరే చెప్తే, ‘ఎందుకులెస్తురూ ఊరికే కూర్చోకా’ అంటుందేమో అని భయం! అవును కదూ, అదే ఉత్తమం! అయినా తిరిగే కాలూ…అని ఓ సామెత చెప్పినట్లుగా, నేనెక్కడూరుకుంటానూ? అలాగని నేనేదో కొత్త విషయం గురించేమీ కాదు లెండి. రోజూ జరిగే విషయాలే, ఏదో నా భాషలో….

బాతాఖాని-లక్ష్మిఫని కబుర్లు-అక్కడికి మనవాళ్ళు తక్కువైనట్లు-2

   ఆమధ్యన ఈ టపా మొదటి భాగం వ్రాశాను. మనవాళ్ళు ఎక్కడికైనా మార్కెట్ కి వెళ్తే కొనేవి handbags. ఏమిటేమిటో మోడెల్స్ కొంటారు. ఆఫీసుకెళ్ళేటప్పుడు వేసికోడానికి వీలుగా ఉంటుందనొకటి, ఏ పార్టీకైనా వెళ్ళేటప్పుడు వేసికోనాటికోటీ, సరదాగా సాయంత్రం బయటకెళ్ళడానికోటీ, అడక్కండి. కొన్న మొదట్లో బాగానే ఉంటుంది.వాడగా వాడగా దాంట్లో లోపాలొక్కక్కటీ బయట పడతాయి. మరీ చిన్నగా ఉంటే సెల్లూ, కళ్ళజోడూ పట్టవు.పోనీ అవన్నీ పట్టేటట్లుగా కొనుక్కుంటే మరీ handbag లా కాక, చేతిసంచీ లా ఉంటుందంటారు. రెండూ ఒకటే గా అనడానికి వీలులేదు. మొదటిది ఆడవారు stylish గా వేసికునేదీ, చేతిసంచీ మనం సంతలకీ, మార్కెట్లకీ తీసికెళ్ళేదీనూ. మరి తేడా ఉందంటే ఉండదు మరీ? పోనీ ఏ మాలుల్లోనైనా కొందామనుకుంటే,అక్కడ వాటి ఖరీదులు చూసేసరికి తల తిరుగుతుంది! ఎప్పుడో ఏ ఫుట్ పాత్ పక్కనే ఉండే దుకాణాల్లో తీసికోవడం.దాన్ని ఓ రెండు మూడు సార్లు వాడేటప్పటికి దాని జిప్పు కాస్తా పాడైపోతుంది. పోనీ ఏ చెప్పులకొట్టువాడి దగ్గరకో తీసికెళ్తే దాన్ని క్షణంలో బాగుచేస్తాడుగా, అబ్బే మరీ అలా వెళ్తే బావుంటుందా?దాన్ని రిటైరు చేసేసి ఇంకోటి కొనుక్కోవడంలొనే ఉంది మజా అంతా! దాంతోటి జరిగేదేమిటీ, కప్బోర్డ్ లో వేళ్ళాడేవి ఈ పాడైపోయిన handbag లే!

అలాగే ఇంట్లో చిన్న పిల్లలుంటే కొనేవి వాళ్ళ కంపాస్ బాక్సులూ, రంగు పెన్సిళ్ళూ, ఇరేజర్లూ, షార్పెనర్సూ.ఇంట్లో ఓ డబ్బా నిండా ఇవే. ఇంక సీ.డీ లూ, ఇదివరకైతే క్యాసెట్లూ. ముందరో పైరేటెడ్ ది ఒకటీ, ఆ తరువాత క్వాలిటీ బావో లేదని ఏ మోసేమైరు వాడు వేసిన ఒరిజినలూ, అదీ బావో లేదని ఓ డీ.వీ.డీ. మొత్తానికి ఒక్కో సినిమాకీ మూడేసి సీ.డీ లు.పోనీ వాటినైనా రోజూ చూస్తారా,అదీ లేదూ.ఏడాదెళ్ళేటప్పటికి ఓ డబ్బా నిండా ఇవే.మొదట్లో బాగానే ఉంటుంది,అవన్నీ పెట్టడానికి ఓ ఆల్బమ్మూ, వీటి సంఖ్య పెరిగేటప్పటికి వాల్ కబ్బోర్డులో పడేయడం. ఒక్కదాని కవరూ సరీగ్గా ఉండదు. ఏ కవరులో ఏ సీ.డీ ఉంటుందో ఆ భగవంతుడికే తెలియాలి.

ఇంక వేసుకునే డ్రెస్స్ లకి మాచింగ్ గా ఉండే బొట్లూ, క్లిప్పులూ, పూసల దండలూ- మళ్ళీ వాటిల్లో ethnic ఓటీ.ఇంటినిండా అవే, ఏదో మఠాల్లో ఉన్నట్లు ఎక్కడ చూసినా ఇవే!ఈ గంద్రగోళం లో, మొగాళ్ళకి చెవి కుట్టించుకుని వేళ్ళడతీసే టాప్సోటీ! అదికూడా ఒక్క చెవికే వేసుకోవాలిట.చేతికో రాగి రింగోటీ. జీన్సూ, కాప్రీలూ, హాఫ్ చెడ్డీలూ అసలు అడక్కండి. ఇంట్లో ఎక్కడ చూసినా అవే వేళ్ళాడుతూంటాయి.ఇవి కాకుండా పెళ్ళికో పెటాకులకో కొనుక్కున్న షేర్వాణీలూ, కుర్తా పైజమాలూ. పెళ్ళి తరువాత మళ్ళీ వేసికున్న పాపానికి పోరు, అలాగని బయట పారేయలేరూ,అవన్నీ దొంతరగా పెట్టడం వాటికో కబ్బోర్డూ!

ఇదివరకటి రోజుల్లో రెండో మహా అయితే మూడో సూట్ కేసులుండేవి. మొదట్లో అయితే ట్రంకు పెట్టెలనేవారు. క్రమక్రమంగా మౌల్డెడ్ వి.ఐ.పీ ల్లోకి వచ్చింది.తరువాత్తరువాత,పిల్లలూ పెద్దలూ అమెరికాలకీ ఇంగ్లాండులకీ వెళ్ళవలసి రావడంతో
కొంపనిండా పేద్ద పేద్ద భోషాణాల్లాటి సూట్ కేసులు తయారయ్యాయి, ఏదో విమానాల్లో వెళ్ళేటప్పుడు ఉపయోగిస్తాయి కానీ, బస్సుల్లోనూ, మన రైళ్ళలోనూ వెళ్ళేటప్పుడు ఇవెక్కడ ఉపయోగిస్తాయీ?ఇవి వాటిల్లో ఛస్తే పట్టవు. ఇదివరకటి రోజుల్లో బస్సుల్లో వెళ్ళేటప్పుడు టాప్పు మీదేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రావెల్స్ వాళ్ళు బస్సులకి పక్కనే ఓ దాంట్లో పడేస్తారు. రైళ్ళలో బెర్తు కింద పెడదామన్నా పట్టదు. పోనీ బెర్తు పైనే పెట్టేద్దామా అంటే, సగభాగం అదే పట్టేస్తుంది, ఇంక మనం రాత్రంతా దాని పక్కనే కూర్చుని జాగారం చేస్తూ చక్క భజన చేయాలి.ప్లాట్ ఫారం మీద దిగ్గానే పోనీ లాక్కుపొదామా అంటే, చెప్పానుగా మనవైపు ఏ స్టేషనులోనూ, ఓవర్ బ్రిడ్జీకి రాంపు ఉండదు. మెట్లమిదనుండి మోసుకుపోవాలంటే ప్రాణం మీదకొస్తుంది.ఏ పోర్టరునో పెట్టుకున్నామా, తడిపి మోపెడౌతుంది. ఆఖరికి మనం ట్రైను దిగిన తరువాత కూడా కొంపకి చేరాలంటే, రెండో మూడో టాక్సీలో, ఆటోలో చేసికోవాలి. మరీ టెంపో లో వెళ్తే బావుండదుగా!చివరకు మనం వెళ్ళే కొంపకు చేరుకున్న తరువాత కూడా దాన్ని పెట్టుకోడానికి నానా అవస్థలూ పడాలి.

ఈ గొడవలన్నీ పడలేక పిల్లలకోటీ, పెద్దలకో రెండూ చొప్పున మళ్ళీ ఓ మూడు సూట్ కేసులు ప్రత్యక్షం. వీటన్నిటినీ ఆ పెద్ద భోషాణం లాటి దాంట్లో పడేసి అటకెక్కించేయడం.ఒకదాంట్లో ఇంకోటి పడితే ఫరవా లేదు. సైజుల్లో తేడా ఉంటేనే ఉపయోగం. ప్రయాణాల్లో తీసికెళ్ళడానికి ట్రావెల్ బ్యాగ్గులోటీ ఈ కోవలోకే వస్తాయి.ఇంట్లో ఉండే చెత్తా చదారమూ వాటిల్లో కుక్కేసి పెట్టేస్తాము. మళ్ళీ ఆ చెత్తంతా ఎక్కడ పెట్టాలో తెలియక, ఇంకో బ్యాగ్గూ! దానితో పిల్లి పిల్లల్ని పెట్టినట్లుగా ఇంటినిండా ఈ బ్యాగ్గులూ, సూట్ కేసులూనూ. అప్పుడే ఎక్కడయ్యిందీ, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వ్రాస్తాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

epaper-sakshi-com (12)

మనం ఎంతో అభిమానించే ఎ.ఆర్.రెహ్మాన్ ని మొదట పరిచయం చేసిన శ్రీ చంద్రశేఖర్ గారి గురించి ‘సాక్షి’ విశాఖపట్టణం ఎడిషన్ లో చదివినది, పైన ఇచ్చిన వ్యాసం.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   నిన్న మా అబ్బాయి ఫోను చేసి చెప్పాడు, నా బ్లాగులు చదివిన తరువాత పూణె లో ఉంటున్న ఒకావిడ, తెలుగు పుస్తకాలకోసం రిజిస్టరు చేసికున్నారని. నాకైతే చాలా సంతోషం వేసింది.పరవాలేదూ,నేను వ్రాసే బాతాఖాని కబుర్లు, పూణె లోని వారూ చదువుతున్నారని తెలిసి బోల్డంత హాశ్ఛర్యపడిపోయాను!

   ఇక్కడ గత సుమారు యాభైఏళ్ళనుండి ఉంటున్న కారణంగా,భాషాభిమానులు పడుతున్న తిప్పలేవో తెలిసే, మా అబ్బాయి ప్రారంభించిన గ్రంధాలయం లో తెలుగు పుస్తకాలు పెట్టించింది.ఆ పుస్తకాలు సుమారు 400 పైచిలికు, చదివి, వాటిగురించి వ్రాయడం, నాకూ మా ఇంటావిడకూ భలే కాలక్షేపం అయింది.ఇదిగో ఇంకా ఎవరైనా చేరితే, వారి వారి అభిరుచుల కనుగుణంగా మరి కొన్ని పుస్తకాలు కొనమని మా అబ్బాయి చెప్పాడు. ఆ సందర్భం లో ఒకసారి భాగ్యనగరం రావాలని ఉంది.

   ఇంకో సంగతండోయ్, నేను వ్రాసే పిచ్చాపాటీ కబుర్లు చూసేవారి సంఖ్య మొన్ననే లక్ష దాటింది!అయ్యబాబోయ్! ఒక ఏడాదీ ఎనిమిది నెలలలో ఈమాత్రం సందర్శకులు వచ్చారంటే పరవాలేదు కదూ! ఇదంతా మీ అభిమానమే కానీ, నేను వ్రాసేదాంట్లో ఏవేవో పెద్ద పెద్ద విషయాలున్నాయనికాదు లెఖ్ఖ!మీరందరూ నామీద ఇదే అభిమానం చూపిస్తారని ఆశిస్తూ…..

   42 ఏళ్ళు Ordnance Factories లో పనిచేసి ఏదో పొడిచేసేమనుకున్నాను! మేము ఉద్యోగంలో చేరిన కొత్తలో మాచేత ఒక Oath of secrecy చేయమనేవారు!ఎంత చెప్పినా ఆరోజుల్లో ఇలాటివాటికి ఎంతో ప్రాముఖ్యం ఉండేది. చివరకు ఇంట్లో ఎవరితోనూ కూడా మాట్లాడేవాళ్ళం కాదు, మేము చేస్తున్న పని గురించి. అలాటిది మొన్నెప్పుడో రాత్రి టి.వీ. చూస్తూంటే, సాక్షి టి.వీ.లో ఒక కార్యక్రమం చూశాను. అదిచూసిన తరువాతే అనిపించింది ప్రస్తుతం దేశంలో ఉన్న
gun culture వెనక ఉన్న కారణం ఏమిటో? మన వాళ్ళ టెక్నలాజికల్ నో హౌ పెరిగినందుకు సంతోషించాలా, లేక ఈ గన్నుల ధర్మమా అని, ఎవరికీ బయట తిరిగే ధైర్యం లేదని ఏడవాలా అని!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమిటో ఈమధ్యన నాకేమీ బాగుండడం లేదు!మా అబ్బాయీ వాళ్ళూ ఉండేచోట ఓ వంటమనిషి చేత వంట చేయిస్తారు. ఆవిడకొచ్చిన పధ్ధతిలో చేస్తూంటారు. నాకేమో, మా ఇంటావిడ గత 39 ఏళ్ళనుండీ, తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో పాపం నాకు నచ్చే పధ్ధతిలోనే చేస్తోంది. అందుకనే ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళవలసివచ్చినా, ఏదో మా మనవడూ, మనవరాలితో ఉండొచ్చనికానీ, తిండి విషయం లో మాత్రం, అంత చెప్పుకోడానికి ఏమీ లేదు. ఓ ఉప్పు సరీగ్గా ఉండదు, కారం విషయంలో నాకేమీ కంప్లైంటు లేదనుకోండి, ఎందుకంటే కారం ఎక్కువ తినను.అలాగని ఊరగాయ తింటారుగా, అప్పుడెప్పుడో ఆవకాయ విషయంలో నేను వ్రాసిన టపా గుర్తుచెయకండేం! అది వేరూ ఇదివేరూ.

   మేముండే ఇంటికి వచ్చేటప్పుడే కూరగాయలూ వగైరా తెచ్చేస్తూంటాను. ఇద్దరికి ఏం కావాలనీ? తలో కూరా పావు పావు చొప్పున తెస్తే ఎక్కీ తొక్కీనూ!!ఇంక ఈవిడేం చేస్తుంది, రెండు పూటలకీ సరిపోయేలా ప్రొద్దుటే చేసేస్తుంది, సాయంత్రం ఆవిడతో వాకింగుకెళ్ళొచ్చి, డైరెక్టు గా భోజనానికి కూర్చోవచ్చని. ప్రొద్దుటే నా దారిన నేను బయటకు వెళ్ళి ఏ పన్నెండున్నరకో వస్తానా, ఆవురావురుమంటూ ఉంటాను.వేడి వేడిగా ఉండే పదార్ధాలతో శుష్టుగా లాగించేస్తాను. బాగున్నవేవో, మళ్ళీ ఆవిణ్ణడిగేదేమిటీ అని, నేనే వేసేసికుంటాను. అక్కడే వస్తుంది గొడవంతానూ! ‘నేనేమో ఇక్కడ నోరుకట్టుకుని, సాయంత్రానిక్కూడా ఉంటుందికదా అని, కొద్దికొద్దిగా వేసుకుంటూంటే, మీరేమిటీ అలా’ అంటుంది. ఆవిడ లెఖ్ఖ ప్రకారం, నేను మిగిల్చినది ఇద్దరికి తక్కువా, ఒకళ్ళకి ఎక్కువా అని. నేనేం చేయనూ,ఆవిణ్ణి అంత బాగా చెయ్యమన్నదెవరంట? ఓ మాట మాత్రం ఒప్పుకోవాలండోయ్ వంటలో మాత్రం మహ మంచి దిట్టలెండి. ఆవిడేదో చేస్తుంది. సర్వసాధారణంగా నానైతే అవి నచ్చేస్తాయి. అందుకోసం ఒకటికి రెండు సార్లు వేసికుంటే తప్పేమిటంట? అంతంత రెస్ట్రిక్షన్స్ పెడితే ఎలాగండి బాబూ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఎరక్కపోయీ వచ్చానూ ఇరుక్కుపొయా….

   మొన్నెప్పుడో నా మిస్టరీ షాపింగుకోసం ఒక మెయిల్ వస్తే, ఏమీ ఆలోచించకుండా, ఈవేళ ( Feb 14th.) చేస్తానన్నాను. చేయడంకూడా ఎక్కడా-Mocha Restaurant ! అసలు దాన్ని మోకా అనాలో మోచా అనాలో కూడా తెలియదు!! దాన్ని మోకా అంటారుట, మా అబ్బాయి చెప్పాడు!ఏదో ఒకటీ, పేరులో ఏముందిలెండి? ఓ 550/- రూపాయల తిండి తిని, దానిగురించి evaluate చేయమన్నారు. ఒక్కడినీ అంత తిండెక్కడ తినగలనండి బాబూ, పోన్లే చూద్దాం అని వెళ్ళాను సాయంత్రం నాలుగింటికి.

   గేటులోనే, సెక్యూరిటీ వాళ్ళు, ఓ పుస్తకంలో పేరూ,ఊరూ, సెల్ నెంబరూ వ్రాయమన్నారు. ఏం లేదులెండి, గత ఏడాది, ఇక్కడకి ఎదురుగా ఉన్న జర్మన్ బేకరీలోనే ప్రేలుడు సంభవించిందిగా, అందుకోసమన్నమాట ఈ హడావిడంతానూ! లోపలికెళ్ళి చూసేటప్పటికి ఏముందీ, అక్కడున్నవాళ్ళందరూ కుర్రగాళ్ళే!అమ్మాయిలూ,అబ్బాయిలూ చేతుల్లో గులాప్పువ్వులూ!! అప్పుడు గుర్తుకొచ్చింది, అరే ఈవేళ Valentines Day అని! ఆహా ఏం ముహూర్తం పెట్టుకున్నానురా బాబూ అనుకున్నాను! పోనీ మా ఇంటావిడనైనా తీసుకొచ్చానుకాదూ అనిపించింది!! తననే అడిగేవాడిని- Will you be my Valentine? పోన్లెండి ఎరక్కపోయి అడిగాను కాదు, చివాట్లు తినేవాడిని, డెభై ఏళ్ళొస్తుంటే మీకేదేమిటీ అని!అందుకే అంటారు ఏది జరిగినా మన మంచికోసమే అని!

   ఎక్కడచూసినా జంటలే! నేనొక్కడినీ ఒంటిపిల్లి రాకాసి లాగ ఒక్కణ్ణీనూ! సింగిల్ సీటు కావాలనగానే, ఆ restaurant వాడు విచిత్రంగా చూశాడు.ఏమో ఎవరైనా వస్తారేమోలే అనుకున్నట్లున్నాడు.ఏదో మొత్తానికి ఓ సోఫాలో కూలేసి, ఓ మెనూ కార్డు చేతిలో పెట్టాడు.దాన్ని కాస్తా తెరిచి చూస్తే, ఏమైనా ఆ పేర్లెప్పుడైనా విన్నానా ఏమిటీ, అంతా గందరగోళం గా అనిపించింది.పైగా నాకున్న guidelines ప్రకారం, అన్నిటిలోంచీ, ఒక్కోటి ఆర్డరివ్వాలని. ఏదో మనవైపైతే, ఇడ్లీ,దోశా లాటివి పేర్లని బట్టి ఆర్డరు చేసికోవచ్చు, ఇక్కడైతే ఎప్పుడైనా పెద్ద restaurants కి వెళ్ళవలసివచ్చినా, ఎప్పుడూ వీధిన పడలెదు,ఏదో పిల్లల ధర్మమా అని! ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోయేటట్లుగా ఉంది.

   ముందుగా రేట్లు చూశాను. ఎరక్కపోయి, మొత్తం బిల్లు 550 దాటితే, మన చేద్ది పడుతుంది. ఏదో అన్నిటిలోంచీ ( Main course, dessert,beverage) ఒక్కోటి ఆర్డరు చేస్తే పోలే అనుకుని ఏమిచేద్దామా అని ఆలోచించా.ఆలోచించడం వరకూ బాగానే ఉంది, వాటి ఖరీదు చూస్తూంటే, వీటిని నేనొక్కడినే ఎలా లాగించగలనూ అని అనుమానం వచ్చింది. పోనీ మాములు హొటళ్ళలో లాగ ప్యాక్ చేయిస్తే, పోనీ పిల్లలైనా తింటారూ, నేనేదో కాఫీలాటిదానితో కానిచ్చేద్దామనుకున్నాను. అడిగితే, చేసి ఇస్తానన్నాడు. అమ్మయ్య ఓ గొడవ వదిలిందీ అనుకున్నాను.

   ఇంక సెలెక్షను కి వచ్చాను. డెజర్ట్స్, బెవరేజెస్ కీ హెడింగు ఉంది కాబట్టి పెద్ద సమస్య అవలెదు. ఈ మెయిన్ కోర్స్ ఏమిట్రా బాబూ అనుకుని,ఇక లాభం లేదనుకుని, ఆ మెయిన్ కోర్సేమిటో కనుక్కున్నాను. ఇక్కడివరకూ బాగానే ఉంది, ఏదో మొత్తం ఎంతౌతుందో నోటిలెఖ్ఖ కట్టేసి,అంతా కలిపి బడ్జెట్ లో వచ్చేలాగ, ఏవో మూడు ఆర్డరు చేశాను. ఎక్కడో అనుమానం వచ్చింది, నేను ఆర్డరు చేసింది వెజ్జా, నాన్ వెజ్జా అని! తీరాచూస్తే బెవరేజ్ కాకుండా, మిగిలిన రెండింటిలోనూ
అవేవో Lamb, liver, breast… లాటివి కనిపించాయి! వామ్మోయ్ ఇంకేమైనా ఉందా? మళ్ళీ కొంపలో అడుగెట్టనీయరు! బయట వారాలు చెప్పుకుని బతికేయాలి!పైగా ఎవరైనా వింటే హవ్వ హవ్వ….అలాగని నాన్ వెజ్ తినేవాళ్ళని విమర్శించడం కోసం వ్రాసింది కాదు, మా ఇంట్లో ఎప్పుడూ తినలేదు. ఏదో గాస్ ఫూస్ మీదేబ్రతికే వాళ్ళం. ఓ పప్పూ,కూరా, పచ్చడీ చాలు!

   మళ్ళీ ఆ ఆర్డరు క్యాన్సిల్ చేసి, బుధ్ధిమంతుడిలా, మొహమ్మాట పడకుండా, అతన్నే అడిగి ప్యూర్ వెజిటేరియన్ మెయిన్ కోర్సు ఆర్డరు చేసి ప్యాక్ చేయించాను.మా ఇంటికి వెళ్ళి ఇచ్చివచ్చాను. వాళ్ళు శుభ్రంగా ఆరగించారు!వాటి పేర్లు అడిగితే, బిల్లులో చూసుకోమన్నాను!
అదండీ ఎరక్కపోయీ ఇరుక్కుపోయా అంటే ఇదీ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఆడుతు పాడుతు పనిచేస్తోంటే…

   ఇదేదో తోడికోడళ్ళు సినిమాలో పాటగురించి వ్యాఖ్యానం అనుకోకండేం. ఈ పాట పాడుకోవడం కోసం, సావిత్రి,నాగేశ్వర్రావు లాగ పొలాల్లోనే పనిచేయఖ్ఖర్లేదు. మామూలుగా ఇంట్లో కూడా పనిచేస్తూ పాడుకోవచ్చు.మనసుండాలంతే. ఇంట్లో ప్రతీ పనీ పెళ్ళామే చెయ్యాలంటే కుదరదుగా మరి.ఈ మధ్య ఓ నాలుగురోజులు, మా ఇంట్లోనే ఉండవలసొచ్చిందని వ్రాశానుగా, ఆ సందర్భంలో ప్రతీ రోజూ మా నవ్య స్కూలు బస్సెక్కేటప్పుడు, నేను కూడా వెళ్ళేవాడిని. తనకి బై చెప్పినట్లుంటుందీ, అదే బస్సులో వచ్చే మా తాన్యా, ఆదిత్య లను చూసినట్లుంటుందీ అని.

   ఆ సందర్భం లో ఒకావిడని రోజూ చూసేవాడిని.ఎప్పుడు చూసినా ఉరకలూ పరుగులతోనే వెళ్ళి, అక్కడే ఉండే కంపెనీ బస్సెక్కేది.ఒక్కరోజు కూడా, సావకాశంగా వెళ్ళిన రోజు లేదు. విషయమెమిటని విచారించగా తెలిసిందేమిటంటే,ఆవిడ ఇద్దరు పిల్లలకి,భర్తకి టిఫిన్ డబ్బాలు రెడీ చేసి, ఇంట్లో ఉండే అత్తమామలకు బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి,తనకోసంకూడా ఎదో ఒకటి తయారుచేసికుని, ఆఫీసుకెళ్ళాలన్నమాట.మా పిల్లల బస్సు వచ్చేసమయానికే, ఆవిడ భర్తో, మామగారో ఆ పిల్లల్ని కూడా బస్సెక్కిస్తూంటారు. ఇక్కడనేకాదు, ప్రతీ ఇంట్లోనూ, భార్యా భర్తా పనిచేస్తూ, వాళ్ళ పిల్లలు స్కూళ్ళకెళ్ళవలసివచ్చినప్పుడు కనిపించే దృశ్యమే ఇది.

   ఇదిగో ఇలాటి పరిస్థితుల్లోనే ఒకళ్ళకొకళ్ళు సహాయపడితే, హాయిగా ఆ పాట పాడుతూ పనిచేసుకోవచ్చు.పని పంచుకోవాలని తపనే ఉండాలికానీ,ఇలాటివి నేర్చుకోడానికి ఏమీ Induction Training లాటివేవీ ఉండవు! పెళ్ళవడమే ఓ ట్రైనింగనుకోవడం, దిగిపోవడమూనూ! ఉద్యోగాల్లో ఉండేవాళ్ళే కానఖ్ఖర్లేదు పనులు పంచుకోవడానికి. రిటైరయిన తరువాతా చేసికోవచ్చని తెలిసింది. ఈ మధ్యన ఓ వారంరోజులుగా, మా ఇంటికి వెళ్ళడం ధర్మమా అని, ఇక్కడి ఫ్లాట్ తాళం వేసుండడం ధర్మమా అని, ఇల్లంతా ఓ అంగుళం మందాన, మట్టీ మశానం పేరుకుని ఉన్నాయి. మామూలుగానే మా ఇంటావిడ ప్రతీ రోజూ రెండు మూడు సార్లు క్లీనింగు చేస్తేనే కానీ ( తనే లెండి) తిండి పెట్టదు.పైగా, ఒకటా రెండా, వారంరోజులు క్లీనింగు చేయలేకపోయిందంటే, మీరే ఊహించుకోవచ్చు!నాకేమో పన్నెండున్నరయేసరికి ముద్ద లేకపోతే గడవదూ, మేమేమో ఇక్కడికి వచ్చేటప్పటికే పదిన్నరయింది. ఈవిడ క్లీనింగభియాన్ ఎప్పటికవనూ, అత్తిసరో కుక్కరో ఎప్పటికి పెట్టనూ,నా నోట్లోకి తిండెప్పుడు వెళ్ళనూ, అమ్మో తలచుకుంటేనే, ఆకలేసేస్తూంది. ఇంక ఇలా కాదని, మన ఇలాకాలోకి వచ్చేపనులేవో చేసేద్దామని, ఓ గుడ్డా, కొలినూ పట్టుకుని రంగంలోకి దిగిపోయాను. అదేం బ్రహ్మవిద్యా ఏమిటీ, ఆవిడ ప్రతీరోజూ చేసే ఏరియాలు చూస్తున్నా కదా,కంప్యూటరు టేబిలూ, సోఫాలూ, డైనింగు టేబిలూ, టి.వి. చుట్టుపక్కలా, ఏ.సీ. రుద్దేసి తుడిచేసి, ‘రాముడు మంచి బాలుడు’ లాగ చేసేశాను. ఈలోపులో ఆవిడకూడా, ఇల్లంతా తుడిచేసి ఓ కిలో మట్టీ మశానం ప్రోగెసి తడిగుడ్డతో తుడిచేసింది.

   వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఆవిడ తడిగుడ్డేసి తుడిచిన చోట, మనం ఖర్మకాలి అడుగేశామా, గయ్యిమంటుంది. అంతే, Traffic Constable లాగ ఎక్కడివాడిని అక్కడే ఆగి, ఆ తడేదో ఆరేదాకా statue అయిపోవడం!ఆ తరువాతే మనం చేద్దామనుకున్నది చేయడం!ఇలాటి చిల్లర మల్లర చివాట్లు తప్పితే, ఇంట్లో మనం కూడా పనిచేస్తే బాగానే ఉంటుందని ఈ రోజే తెలిసింది!దీన్నే మీరు ‘పనికి ఆహారం’ అనేమీ వేళాకోళం చేయఖ్ఖర్లేదు! ఏదో జ్ఞానోదయం అయిందికదా, పోనీ మీలోకూడా ఎవరికైనా ఇలాటి మంచి ఆలోచనలు వస్తాయికదా అని వ్రాశాను!

   మన ఇంట్లో మన పన్లు చేసికోవడానికి ఏమీ నామోషీ ఫీలవఖ్ఖర్లేదు.తెలిస్తే బయటివాళ్ళేమనుకుంటారో అనీ భయపడఖ్ఖర్లేదు. ఇంట్లో వాళ్ళకి సహాయం చేయకుండా, కొంపలో కాఫీ,తిండీ దొరక్క బయటికెళ్ళి తినవలసివస్తేనే ఇంకోళ్ళు ఏమనుకుంటారో అని భయపడాలి!ఏమైనా ఇంకో ఇంటికి వెళ్ళి పాచిపని చెయ్యమన్నారా ఏమిటీ, మనింట్లో మనం చేసికోకపోడానికి ఏం రోగం? ఏమీ ఫరవాలేదూ, ఒళ్ళేమీ అరిగిపోదు.హాయిగా ఆడుతు పాడుతు అని Duet పాడుకోవచ్చు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ప్రాణానికి ఎంత హాయిగా ఉందో…

   గత నాలుగు రోజులుగా, మా కోడలు చెన్నై వెళ్ళడంతో మేము మా అగస్థ్య,నవ్యలతో గడపడానికి, మా ఇంటికి వెళ్ళాము. నవ్య స్కూలుకీ, అగస్థ్య క్రెచ్ కీ వెళ్ళడంతో, పగలంతా ఖాళీయే. సరే అని నెను మాత్రం, మేముండే ఫ్లాట్ కి వచ్చి, కంప్యూటరు కెలుకుతూ, ఏదో భోజనం టైముకి ఇల్లు చేరుతూ, కాలక్షేపం చేస్తున్నాను. అబ్బాయేమో, తన లైబ్రరీ హడావిడిలో ఉన్నాడు. ఇంగ్లీషు పుస్తకాలకోసం చాలా మంది సభ్యులయ్యారు కానీ, తెలుగు పుస్తకాలకోసం అంత ఉత్సాహం చూపడంలేదు. అలాగని తెలుగువారు లేకా, అదీ కాదు.అప్పటికీ నేను తెలిసినవారందరికీ చెప్తూనే ఉన్నాను.Simply not interested in reading. Thats all !! ఎవరిష్టం వారిదనుకోండి. చెప్పడం వరకే మన డ్యూటీ! బలవంతంగా పుస్తకాలు చదివించలేము కదా!

   నిన్న ప్రొద్దుటంతా పొనీ, తెలుగు బ్లాగులేమైనా చదువుదామా అంటే, ఏమిటో ఎక్కడ చూసినా ఏమిటేమిటో వ్యాఖ్యలతో దెబ్బలాడుకుంటున్నారు. పొనీ భాషెమైనా సౌమ్యంగా ఉందా అంటే అదీ లేదు. నాకెందుకొచ్చిన గొడవ?మిగిలిన సైట్లు ఓసారి చూసి, మెల్లగా కొంపకు చేరాను. ఏమున్నా లేకపోయినా, కడుపులో ఎదొ ఒకటి పడాలిగా! కొంతదూరం వెళ్ళాక గమనించాను, జేబులో సెల్ ఫోను లేదని. కొంతమందైతే మెళ్ళో ఓ తాడు కట్టుకుని వేళ్ళాడతీసికుంటారు. నాకు అలాటి అలవాటేమీ లెదు, జేబులో పెట్టుకోవడమే. పోనీ వెనక్కి వెళ్ళి తెచ్చుకుందామా అనుకున్నా, ఠాఠ్ ఓ ఇరవైనాలుగు గంటలు ఫొను లేకపోతే, ఏమైనా భూమ్యాకాశాలు పేలిపోతాయా ఏమిటీ? చూద్దాం ఎలా ఉంటుందో? అయినా <b.మనమేమైనా పుట్టడం సెల్ ఫొనుతో పుట్టామా ఏమిటీ?ఉందికదా అని, ఏవో ఎస్.ఎమ్.ఎస్ లు పంపడం,లేకపోతే ఎవరో ఒకరికి ఫోను చేయడం అంతేగా!ఒక్కరోజు బిల్లు తగ్గినా తగ్గినట్లే!

   నాకుమాత్రం ఫోన్లు చేసేవాళ్ళెవరూ? ఆమధ్య ‘భక్తి’ చానెల్ తీసేశాడని, చెప్పా పెట్టకుండా Airtel తీసేసి, Big TV తీసికున్నా. ప్రతీ రోజూ Airtel వాడు ఫోను చేస్తూంటాడు, ఎందుకు మానేశారూ అని.’నా ఇష్టం’ అంటూంటాను.
ఇంక క్రిందటివారం లో నా మిస్టరీ షాపింగు సందర్భంలో Barclay Finance కి వెళ్ళి అప్పడిగాను. ఉత్తిత్తినే లెండి. రిటైరయిపోయావూ నీకు దొరకదూ అంటే, మా కోడలిపేరన ఇవ్వమన్నా.This was all part of my assignment. అప్పటినుండీ రెండురోజులకోసారి ఫోను చేస్తున్నారు, అప్పు ఎప్పుడు పుచ్చుకుంటున్నారూ అంటూ!వీళ్ళూ వాళ్ళూ కాదంటే, ఏ ఇన్స్యూరెన్స్ వాడో ఫోను చేస్తాడు. వాళ్ళు చెప్పే సోదంతా విని, నేను రిటైరైపొయానూ అని చెప్పగానే, తుపాగ్గుండుకి దొరక్కుండా పోతారు!

   ఈ ఫోన్లన్నీ రిసీవ్ చేసుకోపోతే, కొంపేమీ మునిగిపోదుగా! ఇదిగో ఈవేళ వచ్చి ఫోను చూసుకుంటే, నేను పైన చెప్పిన Missed calls మాత్రమే ఉన్నాయి! ఇంకోటండోయ్ మర్చిపోయా, నా సెల్ ఫోనులో నిన్న రాత్రి మిస్ అయిందేమిటంటే, మా అగస్థ్య పేచీ పెట్టినప్పుడల్లా, నా ఫోనులో ఉన్న రింగ్ టోన్స్, మరీ షిలాకీ జవానీ లాటివి కాదనుకోండి. అదిగో అల్లదిగో.. అలాగే శ్రీ420, చొరిచోరి లాటి సినిమాల్లో ట్యూన్స్ డౌన్లోడ్ చేసికున్నవి వినిపిస్తే ఊరుకుంటాడు. నిన్న రాత్రంతా, నేనే పాడవలసి వచ్చింది! వాడికీ నచ్చలేదూ, ఏడుపూ ఆపలేదు!కానీ నేనూరుకుంటానా, మరీ గట్టిగా పాడడంతో భయపడి నిద్రపోయాడు!

   అంచెత నేను చెప్పేదేమిటంటే ఒక్కరోజంటే ఒక్కరోజు, సెల్ ఫోను గురించి మర్చిపోయారంటే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అలాగే ఆ టి.వీ కూడా! తెలుగు బ్లాగుల భాష మారకపోతే వాటికీ అదే గతి పడుతుందేమో!!
అలాగని నేనేదో బ్రహ్మాండమైన భాషలో వ్రాస్తున్నానని కాదు, మరీ అంత అభ్యంతరకరమైన భాషని అనుకోను. మీరే చెప్పాలి.

%d bloggers like this: