బాతాఖానీ ఖబుర్లు–33

                                                              ఇదంతా ఇలా ఉండగా 1986 కి నా సొసైటీ వ్యవహారం పూర్తి అయ్యింది. ఈ లోపులో పూణే తిరిగి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాను. మా పెద్దన్నయ్య గారి ద్వారా. కాని ఏమీ ఉపయోగం లేకపోయింది. మాకు తెలుసున్న ఒకాయన మా బోర్డ్ లో కలకత్తా లో ఉండేవారు. ఒకసారి ఆయనని కలుసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాను. ఆ రోజున ఆయనని కలుసుకోలేకపోయాను, కానీ ఆయన తండ్రి గారు( 90 సంవత్సరాలు ) ఉన్నారు. ఆయనతో నా కష్టాలన్నీ చెప్పాను, అంటే మేముంటున్న చోట ఉన్నత విద్య కి అవకాశాలు లేవనీ, మా అమ్మాయి చాలా బాగా చదువుతుందనీ.” మీ అబ్బాయి తలుచుకుంటే నాకు పూనా లోని ఏ ఫాక్టరీకైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చనీ” చెప్పాను. ఆయన అప్పుడు నా డిటైల్స్ అన్నీ తీసికొని ” అలాగా, మనవాళ్ళకి చేయకపోతే మావాడి ఉద్యోగం ఎందుకూ, నువ్వెళ్ళు, నీ పని చేయిస్తాను ” అని పంపేశారు. ఆయన అన్నట్లుగానే అక్టొబర్ 31 వ తేదీ కి నాకు పూనా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసింది.. చెప్పానుగా నేను సొసైటీ లో ఉన్నప్పుడు, నా ముందరి కాషియర్ ఓ ” ఫ్రాడ్ ” చేశాడని. మా జనరల్ మేనేజర్ గారు, నా సొసైటీ గవర్నమెంట్ ఆడిట్ అయ్యేదాకా నన్ను రిలీజ్ చెయ్యనన్నారు. ఇంతలో నా ఆర్డర్ కాన్సిల్ అయిపోయింది !!ఇదే ” దేముడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడని ” అనే సామెత నా విషయం లో నిజం అయ్యింది. చూద్దాం ఇదీ మన మంచికే అనుకొంటే సరిపోతుందిగా.

                                                            మా అమ్మాయీ, అబ్బాయీ కేంద్రీయ విద్యాలయ లో అన్ని కార్యక్రమాలలొనూ టాప్ లోనే ఉండి మాకు చాలా ఆనందాన్నిచ్చెరు. అన్ని పరీక్షలలోనూ వాళ్ళదే ఫస్ట్. దీనికంతా కారణం నా భార్యదే. వాళ్ళతో కూర్చొని చదివించడం, వాళ్ళు చెప్పేవి వినడం, ఏదైనా స్కూల్ పుస్తకాలు కావలిసినప్పుడు నాచేత తెప్పించడం. నాకు ఆదివారాలు మాత్రమే పిల్లలతో గడిపే అవకాశం ఉండేది. వాళ్ళ స్కూల్లో ప్రతి రోజూ న్యూస్ చదవడం ఒక కార్యక్రమం ఉండేది. నేను ఆ ముందు రోజు టి.వీ లో వచ్చే అన్ని న్యూస్ లూ కాగితం మీద వ్రాసిచ్చేవాడిని, స్కూల్ కెళ్ళే ముందర అది అప్డేట్ చేసి ఇచ్చేవాడిని. మా పిల్లల విషయం లో నాదేమైనా కంట్రిబ్యూషన్ ఉందా అంటే– వాళ్ళ పుస్తకాలకి అట్ట వేయడం, యూనిఫారమ్ ప్రతీ రోజూ ఇస్త్రీ చేయడం, షూస్ పాలిష్ చేయడం, ఏ పుస్తకం కావల్సివచ్చినా దానిని ఎక్కడినుండైనా ఎలాగైనా తెప్పించడం. ఇంతకంటే నేను ఏమీ చేయలేకపోయేవాడిని. ఆ ఫాక్టరీ చాలా రిమోట్ ఏరియా అవడం తో ఆస్కూల్ కి ఎవరూ టీచర్లు వచ్చేవారు కాదు. అందువలన మా పిల్లలకి ఏమైనా చదువు వచ్చిందంటే అదంతా వాళ్ళ స్వశక్తి మీదే. ఇంకోటేమిటంటే ఆ వూళ్ళొ సిటీ లలో ఉండే డిస్ట్రాక్షన్స్ ఉండేవి కాదు. ఓ సినిమా లేదు, ఎప్పడైనా సినిమాకి వెళ్ళాలంటే 25 కిలోమీటర్ల దూరం లో ఉన్న భుసావల్ దాకా వెళ్ళాలి. అంత ఓపికా, టైమూ లేదు.

                                                       పిల్లల ధర్మమా అని స్కూల్లో ఉన్న టీచర్లు, ప్రిన్సిపాలూ , మా తోటి చాలా క్లోజ్ గా ఉండేవారు. వాళ్ళతో ఎప్పుడూ మా పిల్లల చదువు విషయం చర్చించలేదు. కానీ ఈ సాంగత్యం చాలా మందికి ఇష్టం ఉండేది కాదు. ” టీచర్లంతా తెలిసి ఉండడం వల్లే ఫణిబాబు పిల్లలు ఎప్పుడూ ఫస్టే వస్తారు ” అనేవారు. ఎవరి అభిప్రాయం వారిది, మనం చేసేపని నిజాయితీగా చేస్తే ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మా పిల్లలు చదువుతారా లెదా అనెది మేము చూసేవాళ్ళం, ఇంక ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటే మనకేమిటీ అని దాన్ని గురించి పట్టించుకొనేవాళ్ళం కాదు.

                                                   మా అమ్మాయి కి 10 త్ క్లాస్ లో నూటికి 90 వచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చింది. అప్పుడు మా జనరల్ మేనేజర్ గారు వారి నాన్నగారి

జ్ఞాపకార్ధం ఓ  రోలింగ్ కప్ ఇచ్చారు. అదే కప్ మా అబ్బాయికి 1995 లో వచ్చింది..

                                                   మా జనరల్ మేనేజర్ గారికి  ” క్వాలిటీ సర్కిల్ ” అనే ఓ కాన్సెప్ట్ చాలా ఇష్టం. అందువలన ఆయన నన్ను, దానికి ఇన్చార్జ్ గా వేసి, ఆ కార్యక్రమాలన్నీ నన్ను చూడమనేవారు. అదే కాకుండా ఈ కాన్సెప్ట్ ని మా ఇతర ఫాక్టరీల లో  ప్రోపగేట్ చేయడానికి నన్ను ఆగ్రా, కాన్పూర్, లకు పంపేవారు. ఈ సందర్భంగా నాకు ఊళ్ళు చూసే భాగ్యం కలిగింది. ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా నన్నే పంపేవారు. ఎప్పుడు బయటకు వెళ్ళినా, మా కాలనీ లో వాళ్ళు ఎవరికి కావల్సినా

మందులూ, పుస్తకాలూ తీసుకురావడానికి నేను ఎప్పుడూ సిధ్ధం గా ఉండేవాడిని. ఈ రెండు వస్తువులూ మాకు ఆ ఎస్టేట్ లో దొరికేవి కాదు.

                                               ఈ కార్యక్రమాల సందర్భం లోనే మా టీమ్ ని ఓ సారి డిల్లీ లోని ” ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్స్ ” కి పంపేరు. అది తాజ్ ఇంటర్నేషనల్ లో జరిగింది. అదో చాలా మంచి అనుభవం.  ఇలాంటి వాటి వల్ల నాకు బయటి వారితో ఎలా ఉండాలో నేర్చుకొన్నాను. 

                                              స్కూల్లో మా పిల్లల వలనా , ఫాక్టరీ లో నేను చేసే పని వలనా మాకు ఎంతో గౌరవం కలిగేది.

బాతాఖానీ-తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు

World Space Sattelite Radio

                                                                 ఈ వేళ పొద్దున్నంతా ఇక్కడ వర్షం రావడం తో దేవాలయాలకి వెళ్ళే కార్యక్రమం మానేశాను. వర్ల్డ్ స్పేస్ రేడియో కొని ఓ నాలుగు నెలలైంది. కానీ దాన్ని ఆస్వాదించినది ఈ రోజు మాత్రమే. పూణే లో ఉన్నప్పుడు  మా అబ్బాయి ఓ బర్త్ డే కి ఇచ్చాడు. అది అక్కడే వదిలేసి రావడం వల్ల మళ్ళీ ఇక్కడ ఒకటి తీసికొన్నాము. ఆ రేడియో ఒక అమృత భాండం. తెలుగు పాటలు, కర్ణాటక, హిందుస్తానీ సంగీతం, హిందీ పాత, కొత్త పాటలే కాకుండా ఇంకా చాలా మంచి జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు కూడా ఆనందించవచ్చు. ఈ వేళ సుసర్ల దక్షిణామూర్తి గారి సినిమా పాటలు విన్నాను. కొత్త పాటలు వేయడం మొదలెట్టగానే హిందీ పాత పాటలు… మనకి వినే ఓపిక ఉండాలి.

                                                               నిన్న లైబ్రరీ నుండి యండమూరి గారి  “ధ్యేయం”, మల్లాది కృష్ణమూర్తి గారి “సద్దాం ఆంటీ కథ ” తెచ్చాను. ఎంత బాగున్నాయండీ.  “ధ్యేయం” మామూలుగా ఉండే యండమూరి నవలలకి విభిన్నంగా ఉంది. మనస్తత్వాల  విశ్లేషణ అద్భుతం గా ఉంది.. ఇంక మల్లాది గారిది చదువుతూంటే మనం నవ్వలేక చచ్చిపోతాము. ప్రతీ పేజ్ లోనూ హాస్యమే.  ఆఖరికి విలన్  చేసే పనులు కూడా హాస్యం గానే ఉన్నాయి.

                                                                మా ఇంటావిడ ఈ వేళ శనివారం కాబట్టి భోజనం ( అంటే రైస్ ) తినదు. నాకు కోకోనట్ రైస్ ( బాసుమతి రైస్, కొబ్బరి పాలు ) చేసింది. చాలా రుచిగా ఉంది. మా కేబుల్ వాడు ఈ వేళనుంచి ” కలర్స్ ” చానెల్ మొదలెట్టాడు. దాంట్లో తను మూడు నెలలనుంచి చూడలేకపోయిన హిందీ సీరియల్ అంతా చూపెట్టేశాడు. ఆవిడ అందులో లీనం ( 4 గంటలపాటు ) అయిపోయింది.

                                                               చెప్పానుగా గోదావరి నీళ్ళు ఫిల్టర్ చేసికోవడానికి ఓ ” ప్యూర్  ఇట్ ” కొన్నాను. దానికి బ్యాటరీ కిట్ మార్చవలసి వచ్చింది. నాలుగు రోజుల క్రితం నాకు ఆ యూనిట్ అమ్మినవాడికి ఫోన్ చేస్తే, అతను ఆ ఉద్యోగం మానేశాననీ, ఇంకో నంబరిచ్చాడు. ఆ నంబర్ పనిచేయడం లేదట. ఎలాగరా బాబూ, అనుకొని ” నెట్ ” లో వెదికాను. ముందుగా హిందుస్తాన్ లీవర్ మీద అన్నీ కంప్లైంట్ లే, వాళ్ళ సర్వీస్ బాగాలేదని. సరే మన అదృష్టం ఎలాఉందో అని, ఫోన్ చేస్తే మూడు రోజుల్లో పంపుతానన్నాడు. అతను ఈ వేళ వచ్చి కొత్త బ్యాటరీ కిట్ తెచ్చి వేశాడు. నేను చెప్పేదేమిటంటే ఈ నెట్ లో వివిధ కంపెనీల గురించీ మనం అందరూ వ్రాసే వన్నీ నమ్మఖర్లేదు.

                                                         అందుచేత ఈ వేళంతా ” ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ ” లోనే ఉన్నాము. సర్వేజనా సుఖినోభవంతూ

బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు

                                                              ఒక సారి మేము తిరుపతి దర్శనం పూర్తి చెసికొని, క్రింద అమ్మవారిని, గొవిందరాజస్వామి వారిని దర్శించుకొని తణుకు వెళ్ళడానికి  రైల్వేస్టేషన్ చేరుకొన్నాము. ఇంతలో ఒకాయన వచ్చి ” ఏమండీ మాది విజయవాడ, నేను ఫామిలీ తో ఇక్కడకు వచ్చాను, దురదృష్టవశాత్తూ, నా బాగ్, డబ్బులూ పోయాయీ, మేము విజయవాడ దాకా వెళ్ళడానికి మీకు తోచిన సహాయం చేయండి, మాకు విజయవాడలో సినిమా హాలు ఉంది, మీ ఎడ్రస్ ఇస్తే ఆ డబ్బు నేను మీకు తిరిగి పంపుతాను ” అన్నారు. నేను మామూలుగా ఇలాంటి వారికి సహాయం చేయడానికి వెనుకాడను. చూస్తే పెద్దమనిషిలాగానే కనిపించారు. మనం ఇలాంటి వారికి ఏదో పెద్దగా సహాయం చేయలేకపోయినా, మన తాహతు ని బట్టి , చేస్తే తప్పు లేదనుకొంటాను. సరే అని, ఓ రెండు వందలరూపాయలనుకొంటా ఇచ్చాను. నా ఎడ్రస్ ఇవ్వలేదు. నాది, మా ఇంటావిడదీ పాలసీ ఏమిటంటే ఎప్పుడైనా తీర్థయాత్రకి వెళ్తే ఆ భగవంతుడు మనచేత ఎంత ఖర్చు పెట్టించాలనుకుంటాడో ఆ ధనం ఏదో రూపేణా, మనచేత ఖర్చు చేయిస్తాడని. అదో మూఢ నమ్మకమన్నా సరే.

                                                            తణుకు లో ఓ నాలుగు రోజులుండి బయలుదేరాము. ఆ రోజుల్లో తాడేపల్లిగూడెం నుండి లింక్ లో వార్ధా దాకా వెళ్ళి ,అక్కడ

మహరాష్ట్ర ఎక్స్ ప్రెస్ లో భుసావల్ దాకా వెళ్ళాలి. తణుకు బస్ స్టాండ్ లో, మా పిల్లలూ, మామగారూ ముందర బస్ ఎక్కేశారు. నేను బస్ కదుల్తూండగా ఎక్కాను. టికెట్ తీద్దామని చూస్తే జేబులో పర్స్ లేదు. అందులోనే రైలు టికెట్లూ, డబ్బూ అన్నీ ఉన్నాయి. ఖంగారు వచ్చేసింది. ఏం చేయాలో తెలియలేదు. ముందర బస్ దిగెశాము. ఎక్కడని వెదకమూ?  డబ్బు వరకూ అయితే మా మామగారిదగ్గర పుచ్చుకోవచ్చు, టిక్కెట్లో, తణుకు స్టేషన్ లో ఇస్తాడో లేదో తెలియదు. అయినా ప్రయత్నిద్దామని స్టేషన్ కి బయలుదేరాము.  బస్ స్టాండ్ దగ్గర్లో ఉన్న లెవెల్ క్రాసింగ్ వద్ద గేట్ వేసేశాడు. అందుకని తిరిగి బస్ స్టాండ్ కి వచ్చాము. అక్కడ మళ్ళీ వెతకడం మొదలుపెట్టాము.

                                                        ఇంతట్లో ఒక అబ్బాయి ” ఏం వెదుకుతున్నారూ ” అన్నాడు. మా పర్స్ పోయిందయ్యా బాబూ అన్నాను. చేతిలో ఓ పర్స్ చూపించి ఇది మీదేనా అన్నాడు. ఒక్కసారి నా పోయిందనుకొన్న పర్స్ చూసేటప్పడికి నా మనొభావాలు చెప్పలెను. పర్స్ తిసి చూసుకోండి, అన్నీ ఉన్నాయో లేదో అన్నాడు.  సంగతేమంటే నేను పుస్తకాల షాప్ లో పుస్తకాలు కొనుక్కొన్న తరువాత, పర్స్ జేబులో వేశాననుకొని కిందకు వదిలేశాను. ఈ అబ్బాయికి దొరికింది. ఇది మా వాళ్ళతో చెప్తూ, ఆ అబ్బాయికి  థాంక్స్ చెప్పుదామని తిరిగి చూస్తే— ఏడీ ఎక్కడా కనిపించలెదు. ఇది కలయో వైష్ణవ మాయో తెలియదు, మా డబ్బులు, టికెట్లూ మాకు సురక్షితంగా చేర్చేసి ఆ మహానుభావుడు మాయం అయిపోయాడు.

                                                     ఈ పై చెప్పిన సంఘటన, నేను తిరుపతి రైల్వె స్టేషన్ లో ఆ ఆగంతునికి చేసిన సహాయానికి ( కొద్దిపాటిదైనా ) భగవంతుడు నా మీద చూపిన కరుణ అంటారా, లేక ఆయన మీద ఉన్న నా నమ్మకానికి ఓ తార్కాణమంటారా. ఏది ఏమైనా నన్ను  అప్పుడూ, ఇప్పుడూ సర్వవేళలా ఆ భగవంతుడు

కాపాడుతూనే ఉన్నాడు.

బాతాఖనీ ఖబుర్లు–32

                                                            ఆ తరువాత శ్రీ సుందరం గారు ( అంటే మా జి.ఎం )  ఎవరిద్వారా తెలుసుకున్నారో ఏమో, నా గురించి, నా పని గురించీ విచారించారు. దానికి సాయం మా అమ్మాయి స్కూల్లో పెర్ఫార్మెన్స్ వలనైతేనేమిటి , మా ఇద్దరి సంబంధాలూ ఊహించనంతగా అబివృధ్ధి చెందాయి. ఆయనకి నామిద

చాలా మంచి అభిప్రాయం వచ్చింది. ఆ రోజుల్లో మా చిన్నన్నయ్య గారు హైదరాబాద్ నుండి ఓ ఉత్తరం వ్రాశారు– వారి అమ్మాయి అప్పుడే ఎం.బి.బి.ఎస్, పూర్తిచేసింది, పై చదువుకి వెళ్ళే లోపులో ఖాళీ గా ఉండడం ఎందుకని, మా ఫాక్టరీ లో ఏదైనా టెంపరరీ గా మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఏదైనా ఉందేమో కనుక్కోమన్నారు.నెను ఫాక్టరీ కి వెళ్ళి, మా జి.ఎం గారిని అడిగాను. నేను అడగ్గానే ఊహించని విధం గా ఆయన ” ఓ అపాయింట్మెంట్” ఆర్డర్ తయారుచేయించారు ( ఆ రోజుల్లో జి.ఎం లకి షార్ట్ టర్మ్ మెడికల్ ఆఫీసర్ లను నియమించే పవర్ ఉండేది ). ఇంక మేమైతే మా పక్కన ఉన్న క్వార్టర్ కూడా మా అన్నయ్య గారి అమ్మాయి కోసం రిజర్వ్ చేసి ఉంచాము !!

తనకి బెంగుళూర్ లో అడ్మిషన్ దొరకడం వల్ల ఈ ఉద్యోగానికి రాలేకపోయింది. కానీ కొద్ది రోజులలో ఒక యువ జంట డాక్టర్లు పూణే నుంచి అదే క్వార్టర్ లో చేరారు.

మేమూ పూణే నుండే రావడం వల్లనైతేనేమిటి, స్వభావాలూ ఒకటైతేనేమి వారితో మా సంబంధ బాంధవ్యాలు  అప్పుడు ప్రారంభమైనవి ఈ రోజు వరకూ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆయనకీ, నాకూ వయస్సులో ఓ 18-20 సంవత్సరాల తేడా ఉంది. అయినా సరే మాతో చాలా క్లోజ్ గా ఉంటారు. వారి నాన్నగారికైతే ఇప్పటికీ ఆశ్చర్యమే ” మీ ఇద్దరికీ దోస్తీ ఎలా కుదిరిందీ ” అంటూంటారు.

                                                    ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. మేము వరంగామ్ వచ్చేముందర మా పూనా డాక్టర్ గారు ( పిల్లల డాక్టర్ ) ఏదైనా అవసరం వస్తాయేమో అని కొన్ని మందులు వ్రాసిచ్చి, అవి మాతో తీసికెళ్ళమన్నారు ( అంటే అప్పుడప్పుడు వచ్చే దగ్గులు,జ్వరం, లాంటివాటికి ). మా అబ్బాయి కి అప్పుడు మూడున్నర ఏళ్ళ వయస్సు. ఓ  ఆదివారం మేమందరం మధ్యాహ్నం పడుక్కొని ఉండగా వాడికి ఏమీ తోచక, ఆకలేసి ఆ మందులన్నీ తాగేశాడు. ఏడవడం మొదలెట్టాడు, ఏమయ్యిందో తెలియదు, వళ్ళంతా మందుల వాసన, మా ఇంటావిడేమిచేసిందంటే వాడి చేత ముందుగా కక్కించేసింది. అదంతా బయటకు వచ్చేసిన తరువాత పడుక్కున్నవాడు ఓ పది గంటల దాకా నిద్ర లేవలేదు. మా కాలనీ లో ఉన్న డాక్టర్లందరూ ఇండోర్ లో ఏదో క్రికెట్ మాచ్ అవుతూంటే అది చూడడానికి వెళ్ళారు. ఒఖ్ఖడాక్టర్ కూడా లేరు, మాకెమో ఖంగారు. డాక్టర్లు రాత్రి తిరిగి వచ్చిన తరువాత వాడిని ఎక్జామిన్ చేశారు. అంతా బాగానే ఉంది.

                                                ఇంకోసారి ఏమయ్యిందంటే మేము నలుగురం తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణం లో హైదరాబాద్ మీదుగా, మా అమ్మ గారిని తీసికొని

మన్మాడ్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. నిజామాబాద్ వచ్చేక, ఆ పైనేదో డిరైల్మెంట్ అయిందీ ఇంక ట్రైన్ ఇక్కడే ఆగిపోతుందన్నారు. ఇంక చూసుకోండి అంచెలంచెలుగా, బస్సు లో కొంత దూరం ప్రయాణం చేసి, ఆ తరువాత రిజర్వేషన్ లేకుండా మన్మాడ్ నుండి భుసావల్ దాకా రైల్లో నుంచుని మా సామాన్లు, ప్లస్ మా పిల్లలూ , అమ్మగారూ, మా ఇంటావిడ తో అర్ధ రాత్రి డిశంబర్ 31 న చేరాము. విపరీతమైన చలి. అందరూ వణికి పోతున్నారు. ఎలాగోలాగ ఓ ఆటో చేసికొని రాత్రి రెండు గంటలకి ఇల్లు చేరాము. చేరీ చేరగానే వీళ్ళందరికీ ఇంట్లో ఉన్న రగ్గులూ, దుప్పట్లూ, బొంతలూ కప్పేసి పడుక్కోపెట్టాశాను. పొద్దున్నే ఎవ్వరూ లేవలేదు. ఉన్నారో ఊడేరో తెలియదు,

వంటి మీద కప్పినవి తెరిచి చూడడానికి ధైర్యం చాలలెదు. ఎలాగైతెనే పొద్దుట పది గంటల తర్వాత లేచారండి.సర్వేజనా సుఖినోభవంతూ!!

                                             నా అదృష్టమేమంటే  ఇన్ని సంవత్సరాలలోనూ డాక్టర్లతో ఉన్న పరిచయం ఐతేనేమి, ఎప్పుడూ చిన్న చిన్న రోగాలకి హాస్పిటల్ కి వెళ్ళవలిసిన అవసరం కలుగలెదు. ఇప్పడికీ  మా కేమైనా ప్రోబ్లమ్ వస్తే మా డాక్టర్ దేష్పాండే గారినే అడుగుతూంటాను. ముందుగా ఆయన సలహా పుచ్చుకొన్న తరువాతే ఇంకో డాక్టర్ ని కలుసుకోవడం. ఏ జన్మలో ఋణమో ఇది !! మా అబ్బాయికైతే ఆయనో హీరో– చిన్నప్పటినుంచీ చూశాడేమో, వాడు ఎం.బి.ఏ చేయడానికి

గుర్గామ్ వెళ్ళినప్పుడు కూడా ఏమైనా అవసరం వస్తే ఆయననే అడగడం. మళ్ళీ ఆవిడను నమ్మడు !! ఆవిడేదైనా చెప్తే ఈయనతో మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అడిగేవాడు. మా కుటుంబం తో  ఆ డాక్టర్లు కుటుంబం బాగా కలిసిపోయారు. అది నా అదృష్టం గా భావిస్తున్నాను.

బాతాఖానీ–తెరవెనుక ( లక్ష్మిఫణి) ఖబుర్లు

                                                                  

   ఈ వేళ నా పుస్తకాల అభిరుచి గురించి రాయాలనిపించింది. నెను మీరు అనుకొన్నట్లుగా ఏవో పెద్ద పెద్ద క్లాసిక్స్ లాంటివి చదవలేదు. చదివినా అర్ధం చేసుకొనేంత జ్ఞానమూ లేదు. ఏదో మామూలు పుస్తకాల మీదే ఆసక్తి ఉంది. ఏ పుస్తకమైనా చదువుతూంటే వదలకుండా చదివి, ఒకే ” సిటింగ్ ” లో చదివి దానిని అస్వాదిస్తే చాలు అని నా ఉద్దేశ్యం. ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా మనం ఎంజాయ్ చేయకలిగితే అది మంచి పుస్తకం కింద లెఖ్ఖ.

   మిగిలిన వారు దీనితో ఏకీభవించవలసిన అవసరం లేదు. ఏదో అందరూ చాలా బాగాఉందన్న పుస్తకం , మనకు నచ్చకపోవచ్చు.ఎవరిష్టం వాళ్ళది. అయినా పబ్లిసిటీ కోసం , మనం ఆ పుస్తకాన్ని మన షోకేస్ లో పెట్టుకోవడం ఓ” స్టేటస్ సింబల్”, మన ” ఇమేజ్ ” కూడా పెరుగుతుంది. అది వట్టి ” హిపోక్రసీ ” అని నేననుకొంటాను.

                                                                  

    నేను చదివిన మొట్టమొదటి ఇంగ్లీష్ పుస్తకం పెరల్ బక్ వ్రాసిన ” గుడ్ ఎర్త్ ” . చాలా చిన్నప్పుడు, అంటే ఇంకా తల్లితండ్రుల వద్ద ఉన్నప్పుడు !! బాగా నచ్చింది.. ఆ తరువాత  ఉద్యోగం లో చేరిన తరువాత మా ఫ్రెండ్ మూర్తి అన్నతను  జేమ్స్ హాడ్లీ చేజ్ పరిచయం చేశాడు. అంతే వరసగా ఆయన రాసిన పుస్తకాలన్నీ  లైబ్రరీ నుండి తెచ్చుకొని చదివేశాను.  అవన్నీ చదివి 20 సంవత్సరాలయ్యింది. నా అభిరుచి తెలిసికొని , మా అబ్బాయి ఈ మధ్యన నా పుట్టిన రోజు కి జేమ్స్ హాడ్లీ చేజ్ రాసిన పుస్తకాలు అన్నీ ఓ సెట్ ( ఈ మధ్యనే పబ్లిష్ చేశారు ) కొని నాకు బహుమతి గా ఇచ్చాడు. అందులో మొత్తం 80 పుస్తకాలున్నాయి. మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను. ఇవి కాకుండా  గార్డ్నర్ రాసిన పెర్రీ మేసన్ అంటే చాలా ఇష్టం. అవి కూడా అన్నీ చదివాను.

                                                                 

    వరంగామ్ ఫాక్టరీ లో ఉన్నప్పుడు, మాకు కాలక్షేపం ఉండేదికాదు. అప్పుడు  క్లబ్ లైబ్రరీ నుండి, ఇర్వింగ్ వాలెస్, ఆర్థర్ హైలీ, జెఫ్రీ ఆర్చర్, సిడ్నీ షెల్డన్, హెరాల్డ్ రాబిన్స్ నవలలు అన్నీ తెచ్చి చదివాను. మా ఇంటావిడ కూడా చదవడం మొదలెట్టింది. ఇప్పుదు చెప్తోంది– ఆరోజుల్లో తను  చదివిన నవలలు గురించి ఎవరితొనూ చర్చించడం కుదరక, మా అమ్మాయి ( అప్పుడు 7, 8, సంవర్సరాల వయస్సు !! ) తో చెప్పేదిట… ఓ విషయం నాకు చాలా నచ్చింది, జస్ట్ పీ.యూ. సీ వరకే చదివి, ఇంగ్లీష్ నవలలు చదివి అర్ధం చేసికొన్నందుకు నాకు చాలా ఆనందం గా ఉంది.

                                                            

      నేను పుస్తకాల మీద చాలా ఖర్చు చెసేవాడిని. ఆ రోజుల్లో ఎమెస్కో వారి ” ఇంటింటా గ్రంధాలయం ” లో సభ్యునిగా చేరి

చాలా పుస్తకాలు తెప్పించేను. అవే కాకుండా మన  తెలుగు మాస పత్రికలతో వచ్చే ” బోనస్ ” నవలన్నీ బైండ్ చేయించి ఉంచేవాడిని. మేము వరంగామ్ నుండి వచ్చేస్తూ, ఓ రెండు బస్తాల తెలుగు పుస్తకాలు, మాకు తెలిసిన మాస్టారికి ఇచ్చేశాము. ” మీరు చదవండి, ఆ తరువాత ఇంకెవరికైనా ఇవ్వండి, కానీ అమ్మవద్దు ” అని చెప్పాము. ఈ మధ్యన ఫోన్ చేశారు ఆయన, ” ప్రిన్సిపాల్ ” గా సెలెక్ట్ అయ్యారని. ఈ సారి కలిసినప్పుదు అడగాలి ఆ పుస్తకాలన్నీ ఏం చేశారో.

                                                           

      వార పత్రికల్లో వచ్చిన మంచి సీరియల్స్ కూడా కట్ చేసి బైండ్ చేయించేవాడిని. ఎప్పుడైనా  హైదరాబాద్ వెళ్తే విశాలాంధ్ర, నవోదయా లకి వెళ్ళి, కనీసం నాలుగు గంటలైనా గడపడం మా ఇద్దరికీ చాలా ఇష్టం.ఇవేకాకుండా మాకున్న మంచి స్నేహితురాలూ, బంధువు (మా కోడలి అమ్మమ్మ గారు), మాకు పుస్తకాల మీద ఉన్న అభిరుచి చూసి మంచి పుస్తకాలు బహుమతి గా ఇచ్చారు. అన్నింటి కంటే మంచి బహుమతేమిటంటే. ఆవిడ ధర్మమా అని మాకు శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు,  మిథునం రచయిత శ్రీ రమణ గారూ, పరిచయం అయ్యారు. ఆ సమావేశం గురించి ఇంకోసారి చెప్తా

                                                        

       చెప్పానుగా పూణే లో వచ్చే తెలుగు వార, మాస పత్రికలన్నీ కొంటాను. కానీ చదవడానికి బధ్ధకం. మా ఇంటావిడ పుస్తకం తేగానే  గళ్ళనుడికట్టు తో సహా చదివేసి. ” కొత్త పుస్తకం రాలెదాండీ ” అంటుంది.  ఆ పుస్తకాలన్నీ  చాలా జమయినప్పడినుంచీ ఒకే గోల– రద్దీలో అమ్మేయండీ అని. అప్పుడు చదవడం మొదలు పెడతాను. తనకి చదవడానికి ఏమీ లేక , నాకు ఇన్ని పుస్తకాలున్నాయే అని దుగ్ధ అని నా ఉద్దేశ్యం !!

                                                         

     ఇప్పుడు రాజమండ్రీ వచ్చిన తరువాత మా ఇంటి దగ్గరలో  ఓ ” ప్రభుత్వ గ్రంధాలయం” పట్టుకొన్నాను.మొదటి రోజు ఆయన ఓ వంద రూపాయల డిపాజిట్ తీసికొన్నారు. ఓ పుస్తకం తీసికోవచ్చన్నారు. మనం అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ వంద రూపాయలూ తిరిగి ఇచ్చేస్తారుట !!

ఓ నెల పోయిన తర్వాత నుండీ ఇప్పుడు రెండేసి పుస్తకాలిస్తున్నారు. ఈ తెలుగు బ్లాగ్గులూ, నెట్ లో పడి నాకు ఈ నవలలు చదవడానికి టైమే దొరకడం లేదు. ఆవిడేమో పుస్తకాలు తెచ్చిన రెండో రోజుకి అవి చదివేస్తుంది. నేనేం చేస్తానంటే ఆ పుస్తకాలి ” ఎండింగ్ ” చదివేస్తాను.

                                                       

      నాకైతే ఏదో లైట్ గా ఉండే పుస్తకాలే ఇష్టం. ఆ లైబ్రరీ లో చాలా మంచి మంచి నవలలున్నాయి.  ఆవిడది నాకంటే కొంచెం స్టాండర్డ్ ఎక్కువా. పోనీ క్లాసిక్ నవలలు తెమ్మన్నావా అని అడిగాను. ఒద్దు బాబూ, అన్ని సమస్య ల నుండి గట్టెక్కి, ఇప్పుడెందుకండీ ఆ భారి భారీ నవలలు, ఎదో మీరు తెచ్చే మల్లాది, యెండమూరి, కొమ్మనాపల్లి, యద్దనపుడీ చాలండీ., హాయిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పింది.. ఈ సందర్భం లో మల్లాది కృష్ణమూర్తి గారు రాసిన ” సద్దాం ఆంటీ కథ ” చదివాము. నవ్వుకోలేక చాలా అవస్థ పడ్డాము. ప్రతీ పేజీ నవ్వులే.

బాతాఖానీఖబుర్లు —31

                                                       ఆ మర్నాడు  మా డైరెక్టర్లందరూ కలిసి, భుసావల్ నుండి ఓ తాళాలు తీసేవాడిని తెచ్చారు. అతను వచ్చి ఆ గోద్రెజ్ సేఫ్ ని పరీక్షించి, ఇంకా ఏవో పనిముట్లు కావాలని, మర్నాడు వస్తానని వెళ్ళిపోయాడు. వెళ్తూ, తన దగ్గర ఉన్న కొన్ని సామాన్లు మా సొసైటీ రూం లో వదిలేసి వెళ్ళాడు !!

నాకు రాత్రి అంతా భయం. ఎవడైనా దొంగ వచ్చి ఆ సేఫ్ రొంతా బద్దలుకొట్టి అన్నీ తీసుకుపోతాడేమో అని. అందులో లక్ష రూపాయల పైగా డబ్బుంది. అది నాకొక్కడికే తెలుసు!! ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు, ప్రతీ రెండు గంటలకీ ఓ రౌండ్ వేయడం చూడ్డానికి. ఏమైతేనేం తెల్లారగానే వచ్చేసి సొసైటీ లోనే కూర్చుండిపోయాను.

                                                    రెండో రోజు ఆ మెకానిక్ వచ్చి మూడు గంటలు కుస్తీ పట్టి ఏమైతేనే ఆ గాద్రెజ్ సేఫ్ తాళం తీశాడు.ఆరోజు ఆ డబ్బంతా తీసి బాంక్ లో జమా చేసిన తర్వాతే భోజనం చేయకలిగాను. ప్రతీ వాడూ పరామర్శించేవాడే. ” అయ్యో అలాగా బాగ్ కొట్టేశారా, అక్కడ భుసావల్ లో ఇలాంటివి చాలా ఎక్కువా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫలానా ఫలానా “. నా అదృష్టం కొద్దీ, నాకు సంబంధించిన డబ్బు మాత్రమే పోయింది. అదే ఫాక్టరీ డబ్బు పోయుంటే గోవిందా !!

                                                  ఈ ఇన్సిడెంట్ అయిన ఓ పదిహేను రోజులకి మా జనరల్ మేనేజర్ గారి వద్దనుండి అర్జెంట్ గా రమ్మని పిలుపు వచ్చింది. ఆయన చేంబర్ లో కి వెళ్ళగానే ” నీకు సస్పెన్షన్ కావాలా, లేక డిస్మిసల్ కావాలా ” అన్నారు. అంతకు ముందు వారం లోనే ఓ సీనియర్ ఫోర్మన్ ని సస్పెండ్ చేశారు. ఓరి నాయనో ఇదేం గొడవరా బాబూ అనుకొన్నాను. సంగతేమంటే మన తెలుగు వాడే ఒకడు, ఓ రూమర్ ప్రారంభించాడు. ” ఫణిబాబు సొసైటీ కి సంబంధించిన డబ్బు స్వంతానికి వాడుకుంటున్నాడూ, దానిని వడ్డిలకి తిప్పుతున్నాడూ ఫలానా ఫలానా ” అని. ఆ విషయం, కొత్తగా వచ్చిన ఓ బెంగాలీ ఆఫీసర్ మా జి.ఎం. గారికి మోశాడు.అదన్నమాట ఆయనకి నామీద అంత కోపం రావడానికి కారణం. నేను ఏమీ భయ పడకుండా,” అవునూ, బాంక్ లో నాపేరుమీద లాకర్ తీసికొని ఆ డబ్బుని పెట్టానూ, ఈ విషయం మా కమెటీ అందరికీ తెలుసును. వారి అనుమతి తొనే ఈ పని చేశాను, మీకు ఈ విషయం చెప్పవలసిన బాధ్యత వాళ్ళది” అన్నాను.

ఏ పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందో కూడా చెప్పాను. ఆ లాకర్ లో ఉండే డబ్బు నోట్ల వివరాలతో సహా ఓ కాగితం మీద రాసుకొని నా జేబులో పెట్టుకొనేవాడిని.

” మరి నాకెందుకు ఈ విషయం చెప్పలెదూ, ఆరోజు భుసావల్ లో దొంగతనం విషయం బంగ్లా కొచ్చి చెప్పావుగా ” అన్నారు. ” క్షమించండి మా కమెటీ వాళ్ళు మీకు ఈ వివరాలు చెప్పేఉంటారనుకొన్నాను “.అన్నాను.అయితే నువ్వు వెళ్ళి ఆ లాకర్ లో ఉన్న డబ్బంతా బాంక్ అకౌంట్ లో వేయకలవా అన్నారు. ఓ కార్ ఇచ్చి నన్ను బాంక్ కి పంపారు. ఈ లాకర్ లో ఉన్న డబ్బు సంగతి వివరాలు బాంక్ మేనేజర్ కి కూడా తెలుసుగా, అక్కడకు వెళ్ళిన 15 నిమిషాలలో ట్రాన్సాక్షన్ అంతా పూర్తి చేసికొని, ఫాక్టరీ కి వచ్చి మా జనరల్ మెనేజర్ గారికి    ” ఏక్షన్ కంప్లీటెడ్ రిపోర్ట్ ” ఇచ్చాను. ఆ యన నాకు ” సారీ నేనే నిజం తెలుసుకోకుండా నీమీద నేరం మోపాను “అన్నారు. ఛూశారా నిజాయితీగా మన పని మనం చేసికొంటే ఆ భగవంతుడు మనకి ఎల్ల వేళలా సహాయ పడుతాడు !!

                                                ఆ తరువాత 6 నెలకి ఆ జనరల్ మేనేజర్ శ్రీ భావి కట్టి గారు ఇంకో ఫాక్టరీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా, మా సొసైటీ ఇదివరకటి కమెటీ వాళ్ళ అకౌంట్ లు ఆడిట్ చేయడానికి గవర్నమెంట్ ఆడిటర్లు వచ్చారు. వాళ్ళకి లెడ్జర్లు అన్నీ ఇచ్చాను. ఒకరోజు ఓ ఆడిటర్ వచ్చి, ” ఇదివరకటి కమెటీ వాళ్ళు   60,000 రూపాయల బాంక్ ఫిక్సెడ్ డిపాజిట్ వేశారూ, ఆ కాగితాలు చూపించమన్నారు. నా దగ్గరేమైనా ఉంటే కదా చూపించడానికీ. లేదన్నాను, వాళ్ళు నమ్మలేదు. ఇద్దరం కలిసి బాంకికెళ్ళి చూస్తే, ఆ 60,000 రూపాయలూ ఎప్పుడో డ్రా చేసి ఖర్చు పెట్టేశారని తేలింది. అంతే ఓ పెద్ద ” ఫ్రాడ్ ” అయినట్లు తేల్చారు. నా ముందరి క్యాషియర్ దగ్గర వసూలు చెశారు.

                                                అప్పటికి మాకు కొత్త జనరల్ మేనేజర్ శ్రీ సుందరం గారు వచ్చారు. ఈ సొసైటీ ఫ్రాడ్ క్రితం జనరల్ మేనేజర్ గారి “టెన్యూర్ ” లో జరిగిఉంటే మా పాత కేషియర్ డిస్మిస్ అయిపోయుండేవాడు !!. ఈ యన తో నా మొదటి పరిచయం అంత శుభకరంగా లెదు. ఈయన సొసైటీ కి రావడమే ఒక రాంగ్ ఇంప్రెషన్ తో వచ్చారు. ముందుగా నా రూమ్ లోకి వచ్చి నా కాష్ రెజిస్టర్ తో నా దగ్గరున్న డబ్బు టాలీ చేయమన్నారు. నా అదృష్టం బాగులేక, అంతకుముందే మా సెక్రటరీ వచ్చి ఓ వంద రూపాయల కి చిల్లర ఇమ్మని, నాకు ఇచ్చి వెళ్ళాడు, మా పెద్దాయన రావడం చూసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అందుచేత మా జి.ఎం  చెక్ చేసినప్పుడు నా దగ్గర 100 రూపాయలకి తేడా వచ్చింది. ఫాక్టరీ కి వెళ్ళి నాకో నోట్ పంపించారు. మా సెక్రటరీ ని ఆయన వద్దకు పంపి ఆయనకు వివరణ ఇప్పించవలసి వచ్చింది !!

                                             ఈ పైన వివరించిన రెండు విషయాల వల్లా నేను జీవితం లో ఎన్నో నేర్చుకొన్నాను. వాటి వల్ల నేను మళ్ళీ ఎప్పుడూ డబ్బు విషయం లో అజాగ్రత్తగా ఉండలేదు.

బాతాఖానీ ఖబుర్లు —30

                                                               అక్కడ ” కీ ” పోస్ట్ లో ఉండడం తో కాలనీ లో అందరికీ పరిచయం అయి పోయాను. రోడ్ మీద ఎక్కడైనా కనిపించినప్పుదు, పలకరింపుగా నవ్వడం అలాంటివి బాగానే ఉండేది. ఒక్కొకప్పుడు కొంతమందైతే ” గాస్ బండి వచ్చిందా “, ” రేషన్ లో పంచదారఎప్పుడు వస్తుందీ”

రేపు మా వాడిని పంపిస్తానూ పాం ఆయిల్ ఇప్పించండీ ” అని మార్కెట్ లో అడగడం చిరాకు తెప్పించేది. ఆ కాలనీ లో ఉండే కిరాణా కొట్టు వాడికీ, నాకూ ఏమీ తేడా ఉండేదికాదు !! చిన్న కాలనీ అవడం తో  పోస్ట్ ఆఫీస్, బాంక్ లలో కూడా నాకు ప్రయారిటీ ఉండేది !! వాళ్ళు కూడా మా సొసైటీ నుండే కదా సరుకులు తీసికొనేది.

                                                              ఆ రోజుల్లో ఇండేన్ గాస్ కొత్త కనెక్షన్ లు ఇచ్చేవారు. మా డైరెక్టర్ లు వాళ్ళకి కావల్సిన వాళ్ళందరికీ , ఇష్టం వచ్చినట్లు కనెక్షన్లు ఇచ్చేశారు. దానికి సంబంధించిన డబ్బు ( సుమారు  75, 000 రూపాయలు ) నా దగ్గర డిపాజిట్ చేశారు.  దాని వివరాలు నా రఫ్ కేష్ బుక్ లో రాసేవాడిని. వచ్చిన గొడవేమిటంటే  ఆ డబ్బు అఫీషియల్ గా మా సొసైటీ అకౌంట్ లో వేయడానికి లేదు. ఇదంతా ఐ.ఓ.సీ వాళ్ళ పెర్మిషన్ లేకుండా ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించిన డబ్బు. అలా అని మా సొసైటీ ” సేఫ్ ” లోనూ ఉంచలేను.  అక్కడేమీ సెక్యూరిటీ ఉండేదికాదు. అందుచేత నాతోపాటు ఇంటికే తీసికెళ్ళేవాడిని. ఇది ఇలా కాదని, మా సెక్రటరీ, డైరెక్టర్ , వైస్ ఛైర్మన్ ల తోనూ, బాంక్ వాళ్ళతోనూ చర్చించి , చివరకు , నా పేరు మీద ఓ లాకర్ తీసికొన్నానండి. అందులో పెట్టాశాను.

                                                             అంతకు ముందర ఓ సారి భుసావల్ వెళ్ళాను, ఏదో పని మీద. నాది మొట్టమొదట్లో( 1966) తీసికొన్న బర్షేన్ గాస్ ( దానికి డిపాజిట్ 75 రూపాయలు మాత్రమే ) సరెండర్ చేసేసి, ఇక్కడ ఇండేన్ ( ఎలాగూ మన చేతిలో ఉన్నదే కదా ) తీసికొందామని ప్లాన్. ఆ పని పూర్తి చేసికొని తిరిగి మా కాలనీ కి రావడానికి బస్ స్టాండ్ కి వస్తూంటే, రోడ్ మీద ఒకడు నన్ను ఆపుచేసి, వెనక్కాల చూసుకో షర్ట్ మీద ఏదో ఉంది అన్నాడు. పోన్లే అనేసి వదిలేశాను. కొంచెం సేపు పోయిన తరువాత, మా సెక్రటరీ కలిశాడు  , అతను కూడా ‘నీ షర్ట్ అంతా ఖరాబైపోయిందీ తుడుచుకో ” అన్నాడు. అక్కడేదో ” దూలగొండాకు” పేస్ట్ చేసి వేశారు. ఒకటే దురద, ఎలాగో అది అంతా కడుక్కుని , బస్ స్టాండ్ చేరాను. చేతిలో రెండు బ్యాగ్గులూ. కాలర్ మీద తడి తగిలేసరికి విపరీతమైన దురద పెట్టేస్తూంది. ఇంక చూసుకోండి నా పరిస్థితి !! దీనికి సాయం, ఓ చిన్న పిల్ల  ( 6 ఏళ్ళుంటాయి ) ఏదో సణగడం, డబ్బులు ఇవ్వమని, తను అడిగేదేమిటో నాకు వినిపించక, గోడకు ఆనుకుని కూర్చున్నవాడిని కొంచెం ముందుకు వంగి, ఏమిటీ అన్నాను.  ఈ రెండు ప్రక్రియలకీ పట్టిన టైము 5 సెకండ్లు కూడా పట్టి ఉండదు. వెనక్కి తిరిగి చూసేడప్పడికి నా బ్యాగ్ మాయం. ఎవరిని అడిగినా మాకేం తెలియదనేవాళ్ళే. సంగతేమంటే, ఇదంతా ఓ గ్యాంగ్ ఉంటారు, మనం ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో అయి, మనని టార్గెట్ చేస్తారు. నా ఖర్మ కాలి నేను వాళ్ళకి విక్టిమ్ అయిపోయాను. ఈ మోడస్ ఆపరెండీ భుసావల్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక కుటిర పరిశ్రమ.

ఇవేమీ నాకు తెలియదు. రొజు బాగుండకపోతే ఇలాంటి వాటిల్లో చిక్కుకుపోతాము. నా వర్రీ అంతా డబ్బులు పోయాయని కాదు. ఆ బ్యాగ్ లో నేను తీసికొన్న గాస్ ట్రాన్స్ఫర్ కాగితమూ, దానికంటే విలువైన మా సొసైటీ ” గాద్రెజ్ సేఫ్ ” తాళాలూ. భోరుమని ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, రిపోర్ట్ ఇచ్చాను. తిరిగి కాలనీకి వెళ్ళి ఏంచేయాలో, ఆ రొజు మా ఎంప్లాయీస్ కి జీతాలు ఎలా ఇవ్వాలో అంతా అయోమయం. చెక్ పుస్తకాలూ అవీ ఆ సేఫ్ లోనే ఉన్నాయి.

                                                         ఆ రోజు మా ఫాక్టరీ నుంచి చెక్ ( అంటే ఎంప్లాయీస్ నుంచి రికవర్ చేసిన డబ్బుకి ) వస్తుంది. మామూలుగా ఏం చేస్తానంటే ఆ చెక్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసి, ఆ తరువాత మా సొసైటీ చెక్ ద్వారా డబ్బు డ్రా చేసి జీతాలు ఇస్తాను. అలా డ్రా చేసిన డబ్బు కూడా ఆ ” సేఫ్ ” లోనే ఉండిపోయింది.

దాని తాళాలు భుసావల్ లో దొంగ గారి దగ్గర ఉండిపోయాయి!!.  ముందుగా బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి , నా ప్రోబ్లెం చెప్పి , ఆయననడిగేను మా వాళ్ళకి జీతాలు ఎలా ఇవ్వడం అని. నా దగ్గర ఉన్నది ఫాక్టరీ చెక్ మాత్రమే. ఆయన అన్నారూ, : ఈ చెక్ మీద జనరల్ మెనేజర్ గారి సంతకం తీసికో,కావల్సిన డబ్బు ఇస్తామూ, మిగిలనది సొసైటీ అక్కౌంట్లో జమ చేసేస్తామూ అన్నారు. బ్రతికేనురా భగవంతుడా అనుకొని, మా పెద్దాయన దగ్గరకు వెళ్ళి, ఆయనకు నా భాగవతం అంతా చెప్పి, చివాట్లు తిని, అయన సంతకం తీసికొని, ఎలాగైతే ఆరోజు గండం దాటాను.

బాతాఖానీ ఖబుర్లు–29

                              

                                    1983 లో వరణ్గావ్ ఫాక్టరి కి వెళ్ళిన ముందరి కొద్ది రోజులూ కొత్తగా ఉండేది. నెను వచ్చింది కెమికల్ ఫాక్టరీ లో 20 సంవత్సరాలు పనిచెసి. ఇదేమో ఫిల్లింగ్ ఫాక్టరీ, అమ్యునిషన్ తయారుచేసేది. ఇక్కడ సేఫ్టీ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించలెదు. ఏమిటో ఏమీ అవదూ అనే భావం ఎక్కువ ఇక్కడి ఫాక్టరీ లో. మేము వచ్చిన ఫాక్టరీ లో ఆక్సిడెంట్లు దగ్గరగా చూశాము, అందువలన సేఫ్టీ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం. నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పినా, ఏదో వెర్రివాడిలా కనిపించేవాడిని.

                                                       

           నెను పూనా లో ఉండగా విశాఖపట్నం లో ఉన్న    నేవల్ డాక్ యార్డ్ లో సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ కి అప్లై చేశాను. ఇంటర్వ్యూ కి వెళ్ళాను, చాలా బాగా చేశాను. కానీ పోస్ట్ గ్రాడ్యుఏషన్ లేకపోవడం వల్ల వాళ్ళు నాకు ఆ ఉద్యోగం ఇవ్వలేదు.. అప్పుడు మాత్రం చాలా బాధ పడ్డాను– డిగ్రీ తరువాత పైకి చదవనందుకు !!

                                   

                             మా బాబు ని ఫాక్టరీ వాళ్ళ స్కూల్లోనే వేశాము. అమ్మాయికి కేంద్రీయ విద్యాలయా లో చేర్చాము. ఆ ఏడాది స్కూల్లో స్వాతంత్ర దినోత్సవం నాడు స్కూల్లో ఏదో స్పీచ్ ఇవ్వమన్నారు, మా అమ్మాయి పేరు ఇచ్చింది. సరే అని నేను నాకు తెలిసినది రాసిచ్చాను.  రెండు మూడు సార్లు

ప్రాక్టీస్ చేసి మర్నాడు మీటింగ్ లో అదరగొట్టేసింది. దానితో మా జనరల్ మేనేజర్ గారి దృష్టిలో పడింది, తనకి పూనా లో 5 సంవత్సరాలు కాన్వెంట్ లో చదవడం వలనైతేమి, స్వతహాగా ఉన్న తెలివితేటలైతేనేమి భగవంతుని దయ తో  ఆరోజు తరువాత అక్కడ చదివిన 9 సంవత్సరాలూ స్కూల్లో అన్నింటిలోనూ ఫస్టే. దాని ధర్మమా అని  నేనెవరో ఆ కాలని లో ఉన్నవాళ్ళందరికీ తెలిసింది– ఫలానా అమ్మాయి పెరెంట్స్ వీళ్ళూ అని– ఇంతకంటే జీవితం లో గొప్ప గౌరవం ఏం కావాలండీ.అన్నిరకాల పాటలు, రెసిటేషన్, ఇలక్యూషన్, ఒకటేమిటి అన్నింట్లోనూ  తనే ఫస్ట్..

                                          

                    1984 అక్టోబర్ కి  ఆప్రాంతం లో టి.వీ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. నేను వదులుతానా, 31 సాయంత్రానికి ఇంటికి టి.వి వచ్చేటట్లుగా కొట్టువాడికి డబ్బులు ఇచ్చి వచ్చాను. మీకు గుర్తుండేఉంటుంది. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ  హత్య చేయబడింది, పైగా ఆరోజునుంచి 3 రోజుల పాటు ప్రత్యక్ష ప్రసారాలూ. ఏం తిప్పలు పడ్డామండీ ఆ 3 రోజులూ. మొత్తం ఎస్టేట్ కి రెండంటే రెండే టి.వీ లూ, అందరికీ చూడాలనుంటుంది, చివరికి క్యూ లో జనాలని చూడ్డానికి వదలవలిసి వచ్చింది. ఎవరిని వదలకపోతే వాళ్ళకి కోపం, ఏమైతేనే టి.వీ మహాత్మ్యం వలన చాలా పాప్యులర్ అయిపొయాము . ఆ తరువాత రెండు నెలలో మొత్తం కాలనీలో ప్రతీ ఇంటికీ ఓ టి.వీ. వచ్చింది.

                                                 

             1985 లో  మా అబ్బాయి ని కూడా  సెంట్రల్ స్కూల్లో వేశాము. ఓ ఏడాది బాగానే ఉందండి. కానీ ఎక్కడో ఏదో  ఆడ్ గా అనిపించేది, సంగతేమంటే మా అబ్బాయి ఏక్ దం హిందీ, తెలుగు తప్ప ఇంకో భాష మాట్లాడేవాడు కాదు. ధన్యవాద్, శుభ్ రాత్రీ,నమస్తే వగైరా వగైరా. ఎలారా భగవంతుడా వీడిచేత ఇంగ్లీష్ మాట్లాడించడం అని నెనూ, మా ఇంటావిడా ఆలోచించాము.మన చిరంజీవి కి దేనిమీద ఎక్కువ ఆసక్తీ అని. చూస్తే వాడికి ఆటలమీద చాలా ఇంటరెస్ట్. సరేఅని, ప్రతీ వారం ” స్పోర్ట్ స్టార్ ” తెప్పించడం మొదలుపెట్టాము. అంతే హిందీ చంపక్ లూ, లోట్పోట్ లూ చూడ్డం మానెశాడు. ఆ తరువాత అంచెలంచెలుగా వాడి ఇంగ్లీష్ జ్ఞానం పెరిగిపోయింది. ఈవేల్టి రోజున వాడు మాట్లాడే ఇంగ్లీష్, మాకు గర్వ కారణం . అందుకనే చెప్తాను మా ఇద్దరి పిల్లల వల్లా మేమెవరో అందరికీ తెలిసింది. ఆ విషయం లో భగవంతునికి జీవితాంతం కృతజ్ఞుడినే. అందుకే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ జన్మలో ఏం పుణ్యం చేసికొన్నానో ఇలాంటి భార్యా, పిల్లలూ నాకు దక్కారు !!

                                          

                  మాకు అక్కడ కాలనీ లో ఓ కోపరేటివ్ సొసైటీ ఉండేది. మా జనరల్ మేనేజర్ గారు నన్ను దానికి ట్రెజరర్ గా వేశారు. ప్రతీ రెండేళ్ళకీ ముగ్గురు స్టాఫ్, ఒక అఫీసర్ ని నామినేట్ చేస్తారు.  ఈ  అకౌంటింగ్ వ్యవహారాలు, నాకేమీ తెలియదు. అలా అని పెద్దాయనకు ఎదురు చెప్పే ధైర్యం లేదు. చూద్దాం, ఓ నెలరోజులు నేర్చుకుంటే అదే వస్తుంది, అదేం బ్రహ్మవిద్యా అని  చేరిపోయాను. మొదట్లో అంత డబ్బు చూసేడప్పడికి కొంచెం ఖంగారు వచ్చెది. ఎవదిని నమ్మాలో తెలియదు, అక్కద మాకు రేషన్, గాస్, గ్రోసరీ లు ఉండేవి.. వీటన్నింటి అమ్మం ద్వారా వచ్చిన డబ్బు, ప్రతీ రోజూ రాత్రి 8.00 గంటలకి నా దగ్గర డిపాజిట్ చేసేవారు. మేము ప్రతీ రోజూ ఫాక్టరీకి వెళ్ళవలిన అవసరం ఉండేది కాదు. నెలకొసారి జీతానికే వెళ్ళడం.అక్కడ పనిచెసి కొత్త కొత్త విషయాలు నెర్చుకొన్నాను.

బాతాఖానీ -తెరవెనుక (లక్ష్మి ఫణి ) ఖబుర్లు–బెల్లం మిఠాయి

IMG_0230బంగారు బెల్లం మిఠాయి .చేసిన చిలకమ్మ గారికీ, సహాయంచెసిన జయకీ, తీసికొచ్చిన నాగుకీ,   ఆనందించిన మా ఇంటావిడకీ     జయహో !!

బాతాఖాని–తెరవెనుక (లక్ష్మి ఫణి ) ఖబుర్లు–తీరిన కోరిక

                                                              

   ఈ వేళ పొద్దున్న  ” మా  టీ వీ ” లో ములుగాయన చెప్పారు, ఈ వేళ వృశ్చిక రాసి వారికి చిరకాల కోరిక తీరుతుంది అని. చివరగా చెప్పారు ” ఈ రోజు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ” అని. ఏదో ఆయన చెప్తూనేఉంటారూ, మనకేమి ఉంటాయిలే అని కొట్టి పారేశాను. చెప్పానుగా మా కజిన్ రోజు విడిచి రోజు మా ఇంటికి వస్తూంటాడు, నిన్న వచ్చాడు , ఈ వేళ కొంచెం మబ్బు గా ఉండడం తో నేను కూడా ఎక్కడికీ వెళ్ళలేదు. ఏమిటో కుడి కన్ను ఒకే పనిగా అదురుతోందండి మధ్యాన్నం నుండి. సాయంత్రం మా వాచ్ మన్ వచ్చి కరెంట్ బిల్ ఇచ్చి వెళ్ళాడు.  ఇంతలో మళ్ళీ బెల్ రింగయ్యింది. ఎవరా అని చూస్తే మా కజిన్. ఇదేమిట్రా ఈవేళ వస్తావనుకోలేదూ, ఏమిటి సంగతులు , అన్నాను. ఉందిలే మంచీ కాలం అంటూ ఘంటసాల గారి పాట మొదలెట్టాడు, వాడికి తెలుగు పాటలు పాడడం మహా ఇష్టం. చేతిలో ఓ ప్లాస్టిక్ బుట్ట అందులో ఓ స్టీల్ డబ్బా ఉన్నాయి. ఊరగాయలైతే చాలా రోజులక్రితమే తెచ్చాడు, ఇదేమిటీ అన్నా. ” తెరిచి చూసుకో ” అన్నాడు. చూస్తే ఏముందీ    నేను ఎన్నోరోజులనుండి ఎదురు చూస్తున్న నా ” ఆల్ టైమ్ ఫేవరెట్ ”  ” బెల్లం మిఠాయి ఉండలు ” తెచ్చాడండి. ఇంక నా ఉత్సాహం పట్టలేకపోయాను. మా ఇంటావిడ కూడా ” అమ్మయ్యా ఇంక ఈయనకి రోజూ నిద్ర పడుతుంది, ఊళ్ళో వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తారు ” అంది.

                                                           

     సంగతేమిటంటే మా మరదలు ( అంటే మా కజిన్ భార్య), వాళ్ళ అక్కయ్య గారిని రిక్వెస్ట్ చేసి, వీళ్ళిద్దరూ కలిసి శ్రమ పడి తయారు చేశారన్నమాట.ఇంకా ఫ్రెష్ గా ఉన్నాయీ ఈవేళే ఇస్తే వాడూ సంతోషిస్తాడూ అనుకొని అర్జెంట్ గా తీసికొచ్చేశాడు. అది ఒక కారణం, నేను పడుతున్న బాధ వాడికి కూడా తెలుసును, బెల్లం మిఠాయి గురించి కలుసుకున్నప్పుడల్లా వాడినీ, వాళ్ళావిడనీ “బోర్ ” కొట్టేస్తూంటాను. అందరికీ నా బెల్లం మిఠాయి ఒక ” అబ్సెషన్ ” అయిపోయింది !! ఎలాగో అలాగ వీడు ” పోయేలోపల ” ( అంటే రాజమండ్రి నుంచండి బాబూ ) వీడి కోరిక తీర్చలేకపోతే మన జన్మెందుకూ అనే స్టేజ్ కి వచ్చేశారందరూ. లేకపొతే   మా పెద్దమ్మగారి కోడలుకి అక్కయ్య గారు నా గురించి ఇంత శ్రమ తీసికోవడం !! ఇదన్నమాట పొద్దున్న ములుగాయన చెప్పింది, నా కుడి కన్ను అదరడం  సంగతి !! ఏమిటొ రాసిపెట్టిఉంటే అన్నీ జరుగుతాయి !!

                                                          

  ఆ సంతోషం లో నేను ఇల్లూ , వళ్ళూ మర్చిపోయాను. నోటి దురద అంటే ఇలాగే ఉంటుంది. ఊరికే కూర్చోచ్చా, కాలం కలిసి రాకపోతే తాడే పామౌతుందిట !!  ” పోన్లేరా ఓ 10 రోజులకి , నాకు గ్రాసం దొరికిందీ, వేవిళ్ళ కోరికా తీరింది, మా ఇంటావిడ తను చేయదూ, బయటనుంచి కొనుక్కోనివ్వదూ ” అన్నానండి. నా ఉద్దేశ్యం ఏమిటంటే– నాకు రాత్రిళ్ళు డబ్బాలు వెతుక్కుని చిరుతిళ్ళు తినడం ఓ వెధవ అలవాటు, మా ” స్వర్ణ యుగం ” రోజుల్లో పాపం మా ఇంటావిడ ఏదో ఒకటి చేసి డబ్బాల్లో ఉంచేది, నేను అందరూ పడుక్కున్న తర్వాత, చప్పుడు చేయకుండా తినేవాడిని !! ఇప్పడికీ అదే అలవాటు, ఏం చెయ్యనూ, పుట్టుకతో వచ్చిన అలవాటూ, ఎప్పుడు పోతుందో మీకూ తెలుసు….. నేను అలా అనగానే మాఇంటావిడకి ఏక్ దం  కోపం వచ్చేసిందండి. ‘ రోజూ పొద్దుటే చపాతీలు, ఉప్మా, ఇడ్లీలూ, దోశలూ చేస్తున్నానుగా, ఒఖరోజైనా మానేనా, కావలిస్తే ఓ వంట మనిషిని పెట్టుకోండీ, మీకు కావల్సినవన్నీ చేయించుకోండీ, ఎట్స్ ఎట్స్… ” అనీ ఓ రైజయిపోయిందండి. ‘ అయ్యబాబోయ్, నేనన్నది నువ్వు చేయడం లేదనికాదు, ఏదో నా చిరుతిండిల గురించి అన్నానూ ” అంటే వినదే. పచ్చి కొట్టేసిందండి.

 

   ఈవిడెలాగూ అన్ని రకాల వంటలూ చేస్తోంది కదా, అనుకొని     నా చిరు తిళ్ళు బయటనుంచి తెచ్చుకొనేవాడిని ఏదో గంగరాజు కోవా, ఆనంద్ స్వీట్స్ నుంచి కాజాలూ, మినపసున్నుండలూ లాంటివి. ఈ మధ్యన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాజమండ్రీ లో చెకింగులు చేసి  తినుబండారాల్లో కల్తీ ఉంటోంది అన్నప్పటినుంచి, బయట ఏసరుకూ కొనడం లేదు.  ఏదో పళ్ళతో  లాగించేస్తున్నాను,   స్వర్ణకమలం లో భానుప్రియ అన్నట్లుగా ” ఏమిటో నన్నెవరూ అర్ధం చేసికోరూ “.

                                                      

    ప్రపంచం లో నూటికి     90 మంది భర్తలకున్న రోగం ఇదేనండి రొజూ ఇంట్లో పంచభక్ష్యపరమాన్నలతోటి భార్య చేసిపెడుతున్నా,

ఎప్పుడైనా బయట ఎవరింట్లో అయినా తిన్నామనుకోండి, అంతవరకూ ఫర్వాలెదు, ఖర్మ కాలి అది చాలా బాగుంది అన్నామంటే గోవిందా గోవిందా అయిపోతుంది.

ఏదో పెట్టిన వాళ్ళు సంతోషిస్తారు కదా అని అంటాము కానీ ” నిజంగానాండీ “. మా బాస్ ఒకాయన చెప్పెవారు ” నైబర్స్ వైఫ్ ఈజ్ ఆల్వేజ్ బ్యూటిఫుల్ “, తెలుగులో అయితే ” పొరుగింటి పుల్లకూర రుచు గానే ఉంటుంది “.

                                        

   ములుగాయన చెప్పిన రెండో విషయం  నా ” ఫుట్ ఇన్ ద మౌత్ ” డయలాగ్ తో నిజం అయ్యింది !!

%d bloggers like this: