బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– తెలియకపోతే నోరుమూసుక్కూర్చోవాలి….

    మనకి ఏదైనా తెలియదనుకోండి, నోరుమూసుక్కూర్చోవాలి కానీ, ఊరికే వెధవ్వేషాలు వేయకూడదూ అని ఇన్నేళ్ళకి నేర్చుకున్నాను… మాకు ప్రయాణంలో సౌకర్యంగా ఉంటుందని అల్లుడూ, అమ్మాయీ ఓ 3G Tab ఇచ్చేరని చెప్పానుగా, ఏదో సంసారపక్షంగా, నాకు తెలిసిన ( అనే అపోహ !) మెయిల్స్ చెక్ చేసికోడం తో ఊరుకోవచ్చుగా, అబ్బే, మనవైపు వెళ్ళినప్పుడు, అందరికీ మనం అంతర్జాలం లో చేస్తున్న ఘనకార్యాలు చూపించుకోవద్దూ మరి, నా కొత్త ఆటవస్తువు లో నా టపాలు వస్తున్నాయో లేదో చూద్దామని, అనుకుంటే అవేవో బాక్సులు వచ్చాయి. ఓరినాయనో నా 774 టపాలు ఎక్కడికెళ్ళిపోయాయి దేముడో అనుకున్నాను. పొనీ పిల్లలని అడగొచ్చుగా, అబ్బే నామోషీ.. అప్పటికీ ఇంటావిడంటూనే ఉంది, ఓసారి అడక్కూడదూ పోనీ అని..ఇంటావిడ చెప్పినవి వింటే ఎప్పుడో బాగుపడుండేవాడిని, కానీ ‘రాసి’పెట్టుండాలిగా.

   నేను ఎక్కడైతే ఆ సిమ్ కార్డు తీసికున్నానో, వాణ్ణడిగాను. వాడేమో నాకంటే భభ్రాజిమానం, ఇందులో ఇంగ్లీషు తప్ప ఇంకో భాష రాదూ అన్నాడు. నేనేమో గొప్పగా మా ఇంటావిడతో చెప్పేశాను. పోనీ అంతటితో ఊరుకోవచ్చుగా, అక్కడికేదో అన్నీ తెలిసున్నట్టు ఇంటికొచ్చి నెట్ లో వెదికితే, అసలు దీనికున్న OS లో ఇంకోభాష రాదూ అనుంది. ఓహో కాబోసూ అనుకున్నాను. ముందర ఈ OS అంటే తెలియదు, నాకు తెలిసిన OS గవర్నమెంటులో ఆఫీసు సూపర్నెంటు మాత్రమే, ( 42 సంవత్సరాల ఉద్యోగ ధర్మమా అని నేర్చుకున్నది), అప్పుడెప్పుడో రెహమాన్ ధర్మమా అని OS అంటే ఏమిటో తెలిసింది.

    ముందర నా 3G Tab లో ఉన్నదేదో తెలిసికుందామని చూస్తే అదేదో android ట !androiడో, ఎండ్రగబ్బో ఏదో సింగినాదం, దానిగురించి చదివాను. ఏతావాతా తేలిందేమిటీ అంటే
నాకు దీనిలో తెలుగులో చదివే యోగం లేదనిన్నూ, ఎప్పుడో వస్తుందీ అనీన్నూ. ఇదికూడా మిడిమిడిజ్ఞానం లోకే వస్తుంది. నాజ్ఞానబోధలు వినడానికి ఇంటావిడోత్తుందిగా, ఆవిడకి జ్ఞానబోధ చేస్తే, ఏదో మొహమ్మాటానికి, “అవునా పాపం, పోన్లెండి, మీకు తెలుగులో చదివే వీలుగా, పిల్లలుపయోగించేదేదో కొని పెడతానులెండి” అంది. పోన్లే ఇదీ బాగానే ఉందీ అనుకున్నా.మార్కెట్ కెళ్ళి చూస్తే ఈమధ్యన వచ్చే కొత్త ఫోన్లలో ఏదో యాపిల్ వి తప్ప మిగిలినవాటన్నిటికీ OS ( ఇదోటి తెలిసింది కదూ !!) ఈ android ఏట. ఇంకెందుకూ భాగోతం, ఉన్నది చాలకా అనుకున్నాను.
.

    పోనీ ఇంత హడావిడి జరుగుతున్నా, ఇంట్లో అబ్బాయున్నాడూ, తన్ని ఓసారి అడిగితే పోలేదూ అన్న ఆలోచన వచ్చిందా, అబ్బే అలాటిదేదీ రాలేదు. మనం అడిగితే చెప్తారు కానీ, అడక్కుండా మన వ్యవహారాల్లో వాళ్ళెందుకు వేళ్ళేడతారూ? ఇందులో మెయిల్ పంపడం ఓటొచ్చింది కదా అని అమ్మాయికి ఓ మెయిల్ పంపాను. పాపం తనుకూడా, సంతోషించింది,ఏదో డాడీ కి కాలక్షేపంగా ఉంటుందీ ప్రయాణం లోనూ అని. అప్పుడు చల్లగా చెప్పాను తనకి ఇందులో తెలుగు రావడం లేదమ్మా అని. దానితో ఊరుకోక ఇంకా నాకున్న మిడిమిడిజ్ఞానంతో, ఈ android లో తెలుగు enabled కాదుటా, టెక్నాలజీ బ్లాగుల్లో చదివానూ అంటూ ఉన్నవీ లేనివీ కోసేశాను. పాపం ఆ వెర్రితల్లి, కాబోసూ, డాడీ అన్నీ చదివేకదా చెప్తున్నారూ అనుకుంది. నేను చెప్పే కబుర్లు విని నిజమే కాబోలూ అనుకుంది. ఇంక తనూ ప్రయత్నించలేదు పని హడావిడిలో ఉండి.కానీ పాపం చాలా నిరుత్సాహపడింది అయ్యో తెలుగులో రావడం లేదా అని.

   మా ఇంటావిడ నా బాధ చూసి భరించలెక, పోనీ రెహమాన్ కి ఫోను చేయండీ, అతనికేమైనా తెలుస్తుందేమో అని. సరే అని ఆఖరి ప్రయత్నంగా ఫొనుచేస్తే, “కాదండీ తెలుగు లో వస్తుందీ, అదేదో బ్రౌజర్ లొకి చూస్తే శుభ్రంగా వస్తుందీ” అని ఏవేవో పేర్లు చెప్పాడు. అవన్నీ గుర్తుపెట్టుకోలేక, నాయనా, ఆ వివరాలన్నీ ఓ మెయిల్ లో పంపూ, పిల్లలనడిగి చేయించుకుంటానూ అని చెప్పేసి, అతని మెయిల్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా.అదేమో రాదూ.. ఇంక ఊరుకోలేక, అబ్బాయినడిగేశాను, ఈ పనేదో ముందరే చెయ్యొచ్చుగా, అబ్బే దేనికైనా టైము రావాలండి బాబూ, తనేమో ఏవేవో చేసేసి అరక్షణం లో, నా టపాలూ, హారాలూ, కూడళ్ళూ శుభ్రంగా లక్షణం గా తెలుగులో చూపించేసి నా మొహాన్న కొట్టేశాడు అంటే నిజంగా అలా అని కాదూ, చేతిలో పెట్టేశాడు ! ఇంతలో ఓ గంటలో రెహమాన్ దగ్గర నుంచి మెయిలూ వచ్చింది. ఈలోపులోనే అబ్బాయి ధర్మమా అని అప్పటికే తెలుగు enabled చేసేశాము.

   అందుకే అంటారు అడగందే అమ్మైనా పెట్టదూ అని. అబ్బాయిని అడిగాను టక్కున చేసిపెట్టేశాడు.ఈ పనేదో ముందరే చేస్తే ఇంత గొడవా ఉండేది కాదూ, ఇంటావిడ చేతిలో చివాట్లూ ఉండేవి కావూ. ఇంక జీవితంలో నామాట నమ్మదు especially ఈ కంప్యూటర్ వ్యవహారాల్లో !! కానీ ఇంత జరిగితేనే కానీ నాకూ తెలియలేదుగా, ఇటుపైన మాత్రం వెర్రివెర్రి వేషాలు వేయకుండా, ఏదైనా సమస్యొస్తే హాయిగా పిల్లలున్నారూ వాళ్ళని అడిగేస్తే పోలా? అన్నీ మనకే తెలుసుననుకుంటే తేలేదేమిటయ్యా అంటే you look like an idiot. అంటారు కానీ look like ఏమిటండీ నిజంగా మీరు idioట్టేనండీ అని మాత్రం అనకండి.

    చివరకి చెప్పేదేమిటంటే ఓ 10 రోజులు మిమ్మల్ని బోరు కొట్టను. దీంట్లో టపాలు వ్రాసేటంతటి ప్రావీణ్యం లేదు. ఏదో అందరెదురుగుండా మెయిల్స్ చెక్ చేసికోడం, పేద్ద పోజు పెట్టడం తప్ప !! See you in March first week… అప్పుడు కావలిసినన్ని కబుర్లు…

   P.S.
అప్పుడే ఏడాదెళ్ళిపోయింది మన ప్రియతమ ముళ్ళపూడి వెంకటరమణ గారు మనల్నందరినీ “అనాధ” లుగా మిగిల్చేసి...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టీతింగ్ ప్రోబ్లంస్….

   అసలు పళ్ళే లేవు కదా మళ్ళీ ఈ “టీతింగ్” గోలేమిటీ అనుకుంటున్నారా? ఏం చెయ్యను? ఈ వారాంతం లో నేనూ, మా ఇంటావిడా ఓసారి అన్నవరం, తణుకు, రాజమండ్రీ వెళ్ళొద్దామనుకుంటున్నాము. ఆ ట్రిప్పు విశేషాలు, కారణాలూ వచ్చే వారం లో !!

    అమ్మా నాన్నా వారం రోజులపాటు ఇంట్లో కంప్యూటర్ కి దూరంగా ఉంటారూ. ఎప్పుడైనా వాడాలన్నా, ఏ సైబర్ కెఫేకో వెళ్ళాలీ, పాపం అంత శ్రమెందుకూ అనుకున్నట్టున్నారో ఏమో, ఓ 3G Tab తెచ్చి, మమ్మల్నిద్దరినీ ఉపయోగించుకోమని ఇచ్చి వెళ్ళారు. అక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఇలాటివన్నీ నేనెప్పుడైనా చూశానా పెట్టానా? ఏదో పిల్లలు ఉపయోగిస్తున్నప్పుడు చూడ్డమే కానీ, వాళ్ళు దగ్గరలో లేనప్పుడు, దాంట్లో ఎప్పుడైనా ఫోను వచ్చినా, ఎలా తీసికోవాలో కూడా తెలియని వాడిని. ఏమ్ నొక్కితే ఏమౌతూందో అని భయమే ఎప్పుడూ. మాకెందుకండీ ఈ కొత్త Toys/Tools? ఏదో వీధిన పడకుండా, నా మామూలు బేసిక్ ఫోనుతో లాగించేస్తున్నాను కదా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, నా దారిన నేను కాలక్షేపం చేసేస్తున్నా కదా, మళ్ళీ మధ్యలో ఈ గొడవెందుకూ? అదేదో 3G Sim వేయించుకోమన్నారు. ఈవేళ ప్రొద్దుటే వెళ్ళి ఆ పనేదో కానిచ్చుకొచ్చాను.

    కొంపకి తిరిగొచ్చి మొదలూ నా టీతింగ్ ట్రబుల్స్. ఏదో మామూలు ఫోన్లైతే పరవాలేదు కానీ, ఇదేదో టచ్ స్క్రీన్ ట. దీనిల్లుబంగారం గానూ, అటూ ఇటూ పారిపోతుందే. ఏం నొక్కితే ఏమౌతుందో అని భయమే. మొత్తానికి ఏదో తిప్పలు పడి ఫొను చేయడం వరకూ మాత్రం నేర్చుకున్నాను. రేపటికదేదో నెట్ యాక్టివేట్ చేస్తాడుట, నేను నెట్ కూడా బ్రౌజ్ చేసికోవచ్చుట. మామూలుగా, లాప్ టాప్ లో టైపు చేయడమే నాకో “యజ్ఞం” లాగుంటుంది. ఇప్పుడేమో చేతిలో పట్టుకుని చూసుకోవాలిట. ఏమిటో అంతా అయోమయం గా ఉంది. ఇక్కడకేదొ సరిపోదన్నట్టు అదేదో బ్లూ టూత్ కూడా తీసికోవాలిట!

   నాలాటివాడికి ఏదో టేబుల్ మీద పెట్టుకుని, సంసారపక్షంగా టైపు చేసికునే డెస్క్ టాప్పులుండాలి కానీ, మరీ ఇలాటివన్నీ ఇచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలాగండి బాబూ? దీనితో అయిందనుకుంటున్నారేమో, అబ్బాయి ఈ మధ్యన ఆఫీసు కోసం కొత్త ప్రింటర్/స్కానర్ తీసికోడంతో, కిందటేడు కొన్నది ఎలాగూ వాడ్డం లేదు కదా, నాకూ ఉపయోగిస్తుందని తెచ్చి, మేముండే ఫ్లాట్ లో పెట్టి, దాన్ని ఫంక్షనల్ చేశాడు.ఏదో అదీ ఇదీ కెలికి మొత్తానికి నేర్చేసుకున్నాను లెండి.అసలు కంప్యూటరులో నేర్చుకోడమే ఓ గొప్ప విశేషం అనుకుంటూంటే, పిల్లలు మమ్మల్ని మరీ “hi-fi” చేసేస్తున్నారు!

    ఈమధ్యన మన బ్లాగరు ఫ్రండు రహమానుద్దీన్ చాలామందికి పరిచయం అయ్యాడుగా, అతని ద్వారా పరిచయం అయి, ఈ ఊళ్ళోనే ఉంటున్న ఇంకో అబ్బాయి ఫజల్ నాయక్ అన్న అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. నా ట్రెడిషన్ ప్రకారం మూడు గంటలపైగానే కబుర్లు చెప్పుకున్నాము.నాగోల విని విని పాపం బోరుకొట్టేసుంటుంది అతనికి.

    గత నాలుగు రోజులూ మహ బిజీ అయిపోయాము. అక్కడ మా ఇంట్లో, అబ్బాయి అదేదో పెస్ట్ కంట్రోల్ చేయించాడు. దానితో ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టడం, దానికి సాయం కొట్టిన మందు వాసనా, దానితో అబ్బాయీ,కోడలూ, నవ్య, అగస్థ్య మేముండే ఇంటికే వచ్చేశారు. దానికి సాయం అగస్థ్యకి అదేదో వాక్సినెషనోటి చేయించడం తో తనకి పాపం నొప్పీ, జ్వరమూనూ. ఏదో పెద్దవాణ్ణనని నన్నొదిలేశారు కానీ, మిగిలిన ముగ్గురికీ ఈ రెండు రోజులూ నిద్ర లేదు. అదేదో శివరాత్రినాడైతే జాగరణ పుణ్యమేనా దక్కేది !
అదండీ విషయం…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏమీ చేయలేని helplessness….

Kids

   ఏమిటో ఇదివరకు రోజుకో టపా పెట్టగలిగేవాడిని. ఇష్టం ఉన్నా లేకపోయినా, ఏదో నామీద అభిమానం ( అలాగని నేనే అనుకుంటే గొడవే లేదుగా!) వలనో, లేకపోతే ఈయన ఎలాగా మనల్ని వదలడూ అనుకునో, కారణం ఏదైతేనేంలెండి చదివేవారు. ఈమధ్యన వారం లో రెండేసి,మూడేసి రోజులు మనవణ్ణి చూడ్డం కోసం వెళ్ళవలసొచ్చేసరికి, ఈ రొటీన్ కొద్దిగా క్రమం తప్పుతోంది. నాకేమో, అబ్బాయి లాప్ టాప్ మీద టైపుచెయ్యడం రాదాయే, ఆఫీసులో ఉండే డెస్క్ టాప్ ఎప్పుడూ ఖాళీయే ఉండదూ. పోనీ ఏ రాత్రో వెళ్ళి చేద్దామా అనుకుంటే, ఆ సొసైటీలో ఉండేవాళ్ళు కుక్కల్ని వదిలేస్తారూ, నాకేమో భయమాయే, ఏతావేతా చెప్పొచ్చేదేమిటంటే, వీటి ప్రభావం నాటపాలమీద పడుతోంది.

   రేపు మా పూణె మహానగరపాలికా ( మ్యున్సిపల్ కార్పొరేషన్ కి అచ్చ మరాఠీ అనువాదం!) వారు అయిదేళ్ళకోసారి జరిపే ఎన్నికలుట. అదంతా ఓ కామెడీ, మామూలుగా ఎలెక్షన్ల బూత్తులు ఏ స్కూల్లోనో, ఆఫీసులోనో పెడుతూంటారు. అదేం రోగమో, ఈసారి మా అగస్థ్య వెళ్ళే Day Care Centre లో పెట్టారు. దానితో రెండు రోజులు శలవూ. అదేం చిత్రమో, ఎవడైనా Day Care Centre లలో పెడతారా? అసలు అక్కడకి పిల్లల్ని పంపేదెవరూ, భార్యా భర్తలు ఇద్దరూ పనిచేస్తూ, ఇళ్ళల్లో చూడ్డానికి ఎవ్వరూ లేరనే కదా. అలాటిది ఈ రెండురోజులూ, ఆఫీసుల్లో కాళ్ళావేళ్ళా పడి శలవు తీసికోవాల్సిందేగా? ఖర్మం కాలి ఆఫీసుల్లో శలవలు దొరక్కపోతే ఏం చేస్తారుట? ఈ రాజకీయ పార్టీల నాయకులు, పిల్లల సంరక్షణాభారం నెత్తిమీద పెట్టుకుంటారా? ఇక్కడే పోలింగ్ బూత్తు పెట్టడంలో ulterior motive నాక్కనిపించిందల్లా, ఈ Day Care Centre మా పూణె గార్డియన్ మినిస్టర్, మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కొంపకి దగ్గరలో ఉండడం ఒక్కటే ! పైగా కార్పొరేషన్ లో వాళ్ళదే రూలింగ్ పార్టీ. హాయిగా ఓటింగ్ కావలిసినట్టుగా మేనేజ్ చేసికోవచ్చు! ఈ రాజకీయ నాయకులు ఛాన్సొస్తే చాలు, ఎలాటి ” నీచాని” కైనా దిగుతారు. అసలు Day Care Centre లలో పోలింగులు పెట్టడమేమిటండి బాబూ, అడిగేవాడు లేకపోతే సరీ. పేరెంట్స్ కేమో భయమాయే ఏమడిగితే ఏం కోపాలు వస్తాయో, తమ పిల్లల్ని “కష్ట” పెట్టేస్తారేమో అని. ఈ విషయాలన్నీ పోనీ నాలాటివాడెవడైనా అందరి దృష్టికీ తెద్దామని, పేపర్లకి వ్రాస్తే అసలు వాళ్ళు నా లెటర్ ని ప్రచురించేలేదు. వాళ్ళ భయాలు వాళ్ళవి, కానీ ప్రతీవాడూ freedom of expression గురించి లెక్చర్లిచ్చేవాళ్ళే! God save the Country!

   ఈ మధ్యన ఏ ఇంట్లో చూసినా, పిల్లలకీ, పెద్దలకీ ఎప్పుడు చూసినా దగ్గులూ రొంపలూ. పిల్లలకి సీజన్ ని బట్టి ఇలాటివి వస్తూనే ఉంటాయి, దీనికింత రాధ్ధాంతమెందుకూ అనొచ్చు చాలా మంది ప్రస్తుతకాల తల్లితండ్రులు. ఏదో సీజన్ మారినప్పుడు వస్తూంటే అనుకోవచ్చు, కానీ సంవత్సరం పొడుగూనా వస్తూంటే ఏదో కారణం తెలిసికొని, దానికి ఏదో నివారాణోపాయాలు తెలిసికునే ప్రయత్నం ఏదో చేస్తే బాగుంటుందేమో అని, మాలాటి ” చాదస్థపు” పెద్దాళ్ళు మొత్తుకుంటూంటారు. కానీ ఇవన్నీ వినే ఓపికా టైమూ ఎక్కడున్నాయి ఈ రోజుల్లో? ఏదో మరీ ప్రాణం మీదకు రావడం లేదులే అనుకోడం, లేకపోతే వారానికోసారి ఫామిలీ డాక్టరు దగ్గరకి పరిగెత్తడం. ఆయనేమో వ్రాసిన మందులే రాసేసి, ఫీజు పుచ్చేసికోడం. పోనీ అది తినకూ, ఇది తినకూ, ఇలా తినూ,అలా తినూ అని చెప్పొచ్చుగా, అబ్బే తన పేషెంట్లు మరీ ” ఆరోగ్యకరమైన” పధ్ధతులు పాటించేస్తే, ఈ డాక్టర్ల మొహం ఎవడు చూస్తాడు? దానితో ఏమౌతోందీ అంటే, ఆయన చెప్పా చెప్పడూ, ఈ తల్లితండ్రులేమో తమ పధ్ధతులూ మార్చుకోరు. ఏదో వెళ్ళిపోతోందికదా అనే పాలిసీ.

   పైగా ఉన్న పధ్ధతులు మార్చడం అంటే మాటల్లో పనా ఏమిటీ? ముందుగా వాళ్ళు మారాలి, తరువాతేగా పిల్లల్ని మార్చేదీ? అసలు మనకే, ఇంట్లో కుర్కురేలూ, హిప్పోలూ, ఇంకో సింగనాదాలూ లేకపోతే తోచదే, పిల్లలమాట దేముడెరుగు, ముందర మన సంగతేమిటి ” ఏమిటోనండీ అలవాటైపోయిందీ, అవన్నీ లేకపోతే, ఏమిటో ఎలాగో అనిపిస్తుంది..” అంటూ సాగదీసుకుంటూ చెప్పేవారే. ఇంక పిల్లలు కూడా, snacks అంటే ఇవే కాబోలూ అనుకుంటారు. ఇంటినిండా ఎక్కడ చూసినా ఇవే. అంతదాకా ఎందుకూ, నిన్న సాయంత్రం వీధిలోకి వెళ్ళి నుంచోడం అలవాటు,ఎవరైనా పాత స్నెహితులు కనిపిస్తారేమో అని. ఒకాయన కనిపించాడు, నాకంటే ముందరే రిటైరయిన వారు, అటూ ఇటూ చూస్తూ, ఏదో “తప్పు” పని చేస్తున్నవాడిలా, తనని ఎవరైనా గమనిస్తున్నారేమొ అని భయ పడుతూ, ” పానీ పూరీ”, అదేమిటో ఇంకోటీ లెఫ్ట్ రైట్ సెంటర్ లాగించేస్తున్నాడు. ఖర్మ కాలి నా కళ్ళల్లోనే పడ్డాడు. ఇదేమిటి బాసూ, ఆ మధ్యనేదో బైపాస్సో ఇంకోపాస్సో చేయించుకున్నానన్నావు, మరీ ఇదేమిటీ ఇలా రోడ్డున పడిపోయావూ అంటే, ” ఏమ్ చెయ్యమంటావు భాయ్, ఇంట్లోనేమో తిండానికి ఏమీ ఇవ్వరూ, అదేదో కొలెస్ట్రాల్ అంటూ, వాళ్ళ దారిన వాళ్ళు పిల్లలతో సహా ఏమిటేమిటో తింటూంటారు. నా దగ్గరకొచ్చేటప్పడికే ఈ మెడికల్ ప్రికాషన్లూ. ఏం చెయ్యనూ, ఈవెనింగ్ వాక్ పేరెట్టి బయటకొచ్చేసి ఇలా కక్కూర్తి పడుతూంటాను..”. అదండి సంగతీ.. పైన ఒక pdf పెట్టాను kids అని, ఓసారి నొక్కి చూడండి, ముంబైలో సర్వేలో తేలిందేమిటో చదవండి. ముంబై అనేమిటి, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అందరికీ తెలుసు, కానీ ఏమీ చేయలేని helplessness.. చల్తాహై, చల్తే రెహ్తా హై

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అబ్బ.. ఎంత apt గా ఉందో కదూ….

నేను నిన్న వ్రాశిన టపా లో, నా బాధ వ్యక్తపరిచాను ప్రస్తుత వాతావరణం గురించి. అది చదివి, మా అన్నయ్యగారి అమ్మాయి పంపిన ఒక వ్యాసం. ఈ వ్యాసంలోని విషయాలు
ప్రస్తుత వాతావరణానికి ఎంతలా వర్తిస్తాయో మీరే చూడండి….

    Common Sense R I P…..

This article was written by Lori Bergman and first published in the Indianapolis Star on March 15th, 1998.

An Obituary for Common Sense

Today we mourn the passing of a beloved old friend, Common Sense, who has been with us for many years. No one knows for sure how old he was, since his birth records were long ago lost in bureaucratic red tape.

He will be remembered as having cultivated such valuable lessons as: knowing when to come in out of the rain, why the early bird gets the worm, life isn’t always fair and maybe it was my fault.

Common Sense lived by simple, sound financial policies: don’t spend more than you can earn and adults, not children, are in charge.

His health began to deteriorate rapidly when well-intentioned but overbearing regulations were set in place. Reports of a 6-year-old boy charged with sexual harassment for kissing a classmate; teens suspended from school for using mouthwash after lunch; and a teacher fired for reprimanding an unruly student, only worsened his condition.

Common Sense lost ground when parents attacked teachers for doing the job that they themselves had failed to do in disciplining their unruly children. It declined even further when schools were required to get parental consent to administer sun lotion or an aspirin to a student; but could not inform parents when a student became pregnant and wanted to have an abortion.

Common Sense lost the will to live as the churches became businesses; and criminals received better treatment than their victims. Common Sense took a beating when you couldn’t defend yourself from a burglar in your own home and the burglar could sue you for assault.

Common Sense finally gave up the will to live, after a woman failed to realize that a steaming cup of coffee was hot. She spilled a little in her lap, and was promptly awarded a huge settlement.

Common Sense was preceded in death, by his parents, Truth and Trust, wife Discretion, daughter Responsibility, and son, Reason. He is survived by his 4 stepbrothers; I Know My Rights, I Want It Now, Someone Else Is To Blame, and I’m A Victim. Not many attended his funeral because so few realized he was gone.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఈ లెఖ్ఖన పేరెంట్సూ తమ జాగ్రత్తలో ఉంటే మంచిదేమో…

Times Crest

   మన సైన్యాదక్షుడు జనరల్ సింగ్ గారు, మొత్తానికి సుప్రీం కోర్టు వారి మాట విని, తన dob మీద వచ్చిన, controvesy కి తెర వేసేశారు. అసలు ఈ గొడవంతా ఎందుకు పెట్టారో అర్ధం అవలేదు. తనని జనరల్ గా నియమించేముందు, 1950 కి ఒప్పుకుని, తరువాత, ఠాఠ్ అదంతా అబధ్ధం, అసలు నేను పుట్టింది 1951 అనడం, ఆయనున్న పదవికి disgrace తెచ్చింది. ఉత్తిపుణ్యాన్న ఈ గొడవంతా వీధిన పెట్టారనిపించింది. ఒకవైపున పేపర్లలో యాడ్లూ “సైన్యం లో చేరండీ” అంటూ, ఇంకోవైపునేమో ఇలాటి గందరగోళాలూ. ఎవడికైనా Armed Forces లో చేరాలని కోరిక కలుగుతుందా అసలూ?
ఇవేవీ సరిపోనట్టు, ISRO లో ఈమధ్యన రిటైరయిన ముగ్గురు శాస్త్రవేత్తలమీద, ఇంకో ఉద్యోగంలో చేరకూడదూ అని ఆంక్షలు. అసలు మనవాళ్ళకి ఏదో ఒక గొడవుంటేనేకానీ, రోజు గడవదనుకుంటాను. మన రాష్ట్రం లో ఐఏఏస్ వారి దైతే రావణకాష్ఠం లా మండుతూనే ఉంటుంది. మొన్నెప్పుడో, అదేదో చానెల్ లో శ్రీవెంకటేశ్వరుడి నామాల మీద గొడవా.

   ఆమధ్యనెప్పుడో పూణె లో ఓ డ్రైవరు, ఇష్టం వచ్చినట్టు బస్సు నడిపేసి, ఓ తొమ్మిదిమందిని చంపేశాడు. ఇంకో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరోజు headlines వేశారు, మర్నాటి నుంచీ ప్రతీ రోజూ, ఆ దిక్కుమాలిన డ్రైవరు గురించే కానీ, ఆ గాయపడ్డవారి పరిస్థితి ఏమిటీ, ప్రాణాలు పోగ్గొట్టుకున్నవారికి పరిహారం ఇచ్చారా అసలు, ఇస్తే ఎంతంతా, ఇలాటివాటి గురించి, ఏ పేపరు వాడికీ, ఏ చానెల్ వాడికీ పట్టలేదు. అసలు ఏదైనా అలాటి సంఘటన జరిగినప్పుడు, దాని follow up కూడా ఇస్తే, విషయాలు తెలుస్తాయి కదా.

   ఇవన్నీ సరిపోనట్టు, నిన్న చెన్నై లో ఓ కుర్రాడు, తన టీచర్ ని పొడిచి చంపేశాడుట. ఎక్కడో న్యూస్ లో చదివాను- “అగ్నిపథ్” సినిమాతో inspire అయ్యాడుట వాడు. పైగా వీడికి 15 సంవత్సరాల వయస్సే కాబట్టి juvenile court లోనేట వాడి విచారణ. Great. అక్కడికేదో మామూలు కోర్టుల్లో జరిగితే ఏదో ఒరిగిపోతుందని కాదూ, ఇంక పిల్లలూ, చదువులూ, టీచర్లూ వీటిమీద ప్రతీ వారూ తమ “అమూల్యమైన” అభిప్రాయాలు చెప్పేస్తున్నారు. స్కూల్లో పాఠాలు చెప్పకపోతే, అంతంత ఫీజులిస్తున్నామూ, చెప్పకపోతే ఎలాగా అని ఏడుస్తారు. చెప్తే, అర్ధం అయిందా లేదా అని అడక్కూడదుట. వీళ్ళదారిన వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసికోవచ్చు.

    ప్రతీ ప్రొఫెషన్ లోనూ “కలుపుమొక్కలు” అనేవి ఉంటాయి.ఇప్పుడు మొన్న వాడెవడో ఇష్టం వచ్చినట్టు బస్సు నడిపేడని, బస్సులెక్కడం మానుతారా, లేక ఎక్కడో ఏ మారుమూలో ఏ తిక్కశంకరయ్యో విద్యార్ధిని కొట్టాడని, టీచర్లందరూ అలాటివాళ్ళేననడం ఎంతవరకూ భావ్యమో మన ” విజ్ఞులే” చెప్పాలి. ఈ వరస చూస్తే, చిన్నప్పుడు దెబ్బలేసిన తండ్రులనందరినీ కూడా, firing squad ఎదురుగుండా పెట్టేయాలేమో? రేపెప్పుడో మా అబ్బాయిని అడగాలి, నా టర్న్ ఎప్పుడు నాయనా అని!! నేనూ దెబ్బలు తిన్నాను, మా అబ్బాయీ నాచేతిలో దెబ్బలు తిన్నాడు, కానీ మామధ్య రిలెషన్స్ ఏమీ పాడవలేదే? మా ఇంటావిడంటూంటుంది “గొర్రెప్పుడూ కసాయివాణ్ణే నమ్ముతుందీ..” అని.

   నేను పెరిగింది టీచర్ల వాతావరణం లో, నాకైతే టీచర్ అంటే విపరీతమైన గౌరవం. మనకు తెలియదుకనుకనే వాళ్ళ దగ్గరకి వెళ్తాము, ఇప్పుడు నాకు చదువు అబ్బలేదూ అంటే, నాకు చదువు చెప్పిన టీచర్లది తప్పూ అంటే ఎలాగండి బాబూ? ఏదో కొందరు సెన్సిటివ్ పేరెంట్స్ ఇస్యూ చేసేస్తున్నారని, ప్రతీ పేరెంటూ అలాటివారే అని ఎలా చెప్పలేమో, అలాగే ఏ కొద్దిమంది టీచర్ల ప్రవర్తన వలన అందరినీ అదే కాటా లో తూస్తే ఎలాగ?

   స్కూళ్ళలో పిల్లల్ని “హింస” పెట్టేస్తున్నారూ అని భావిస్తే, హాయిగా స్కూలుకీ కాలేజీకీ పంపడం మానేయొచ్చు. మీ పిల్లలూ మీఇష్టమునూ! మన రాజ్యాంగం లో ఏం చేసినా అడిగేవాడు లేడు ! ఈ మధ్యన అదేదో చానెల్ లో అదేదో సీరియల్ గురించి ఓ ప్రొమో వస్తోంది. దాంట్లో ఓ పదేళ్ళ పిల్ల చెప్పే డయలాగ్– ” ఒరేయ్ వెధవా, నువ్వు నాకు తండ్రేమిట్రా..” ఇంతకంటే హీనాతి హీనమైన డయలాగ్గు ఉండదేమో? దీనికి ఆ డయలాగ్ వ్రాసిన రచయితననాలా, దాన్ని ప్రసారం చేస్తున్న చానెల్ ని అనాలా, ఆ పిల్లచేత అనిపిస్తున్న దర్శకుణ్ణనాలా, అలాటి డయలాగ్గులు చెప్పించొద్దూ మా పిల్లచేతా అని చెప్పలేని తల్లితండ్రులననాలా, ఎవరినీ? Ofcourse మన “విజ్ఞులు” అందరూ, పాపం పిల్లదేం తప్పులేదూ అనే అంటారు లెండి. మర్చిపోయాను చెప్పడం ఆ దౌర్భాగ్యపు డయలాగ్ చెప్పబడే సీరియల్ “జెమినీ” లో వస్తోందిట. జోక్ ఏమిటంటే దానిపేరు ” కన్నవారికలలు”–

    పైన పెట్టిన వ్యాసం చదవండి. పిల్లలు tantrums చేస్తే దానిక్కూడా counselling ఉందట. హాయిగా దానికి దేనికో పంపేయండి. అలాకాకుండా చెయ్యి చేసికున్నారంటే రేపెప్పుడో పుటుక్కున ఏ కత్తో పెట్టి పొడిచేస్తాడు, లేదా కాల్చేస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండీ…

   GOD SAVE ALL PARENTS, TEACHERS.. .

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఊరికే కూర్చోనీకుండా…..

   ఏదో నాదారిన నేను ఏదో కాలక్షేపానికి రోజుకోటో, అప్పుడప్పుడు వారానికోటో బ్లాగులు వ్రాసుకుంటున్నాను కదా, వదిలేయొచ్చుగా, ఉత్తినే “కెలకడం” ( మంచి గానే లెండి) ఎందుకూ?మొన్నెప్పుడో వ్రాసిన నా టపా మీద వ్యాఖ్య పెడుతూ, మన “ఒకేఒక్క శంకరుడు“.. ”
కాకినాడలో పుట్టి
కాకినాడలో పెరిగి
కాకినాడలో చదివి
కాకినాడ మీద ప్రేమని నరనరానా నింపుకున్న
అచ్చమైన కాకినాడ పౌరుడిని నేను.” అని వ్రాశేశాడు. ఇంక నేనేనా ఊరుకునేదీ? అసలే ‘కోతి” ఆ కోతికో కొబ్బరికాయ పంధాలో, నా ” కాకినాడ జ్ఞాపకాలూ” గుర్తొచ్చేశాయి. మీమీద పడుతున్నా, భరించండి..

నిన్నటివా మొన్నటివా 1954,55 లలోవి, అంటే 58 ఏళ్ళైనా గడచుండాలి.ఆ రోజుల్లో పుట్టినవాళ్ళైతే ఈపాటికి రిటైరు కూడా అయిపోయుండొచ్చు. మన మిగిలిన పాఠకులైతే ఈ ప్రపంచం లోకే వచ్చుండకపోవచ్చు. వీళ్ళనేమిటీ, వీళ్ళ జన్మలకి కారకులైన తల్లితండ్రులకి వీళ్ళని పుట్టించాలనే సంకల్పం కూడా కలిగుండకపోవచ్చు, అంత పాత జ్ఞాపకాలు మరి! కానీ వాటిని గుర్తు చేసికోడంలో ఉన్న ఆనందమే వేరు.

మాకు అమలాపురం లో పేద్ద పెద్ద ఆసుపత్రులు లేకపోవడం తో, ఎటువంటి ఆరోగ్య సమస్యైనా వస్తే, అటు కాకినాడ కానీ, మరీ సీరియస్సు అయితే విశాఖపట్నం కె.జి.ఎచ్, ఇవే గతి. కోటిపల్లి రేవు దాటడం,పడవ దిగి, ఓ రెండు ఫర్లాంగులు నడిచి బస్సు పట్టుకుని, దాక్షారం బస్ స్టాండు లో కొద్దిసేపు ఆగి, కాకినాడ చేరుకోవడమూనూ. గాంధీనగరం లో పోలీసు క్లబ్ అనోటుండేది, దానికి పక్కనే మా చుట్టాలుండేవారు. ఆయన శ్రీ కందా లక్ష్మినారాయణ గారు, ఆయనేమో నాకు పెదనాన్నగారు (maternal), ఈయనే మనరాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేసిన శ్రీ మోహన్ కందా కి కూడా పెదనాన్నగారే ( paternal). మరీ name dropping అనుకోపోతే, ఇదండి మా చుట్టరికం. సందర్భం వచ్చింది కదా అని వ్రాశాను.

ఆ రోజుల్లో ఎక్కడికైనా వైద్యానికి వెళ్ళాల్సొస్తే, ఆ ఊళ్ళో చుట్టాలే కదా దిక్కూ, హోటళ్ళూ అవీ ఎక్కడుండేవీ, ఉన్నా వాటిలో ఉండే స్థోమతకూడా ఉండాలిగా. అయినా ఊళ్ళో అంత దగ్గరి చుట్టాలని పెట్టుకుని, బయటెక్కడో ఉండడానికి వాళ్ళూ ఒప్పుకునేవారు కాదూ( అని మనమే అనేసికుని వాళ్ళని మొహమ్మాట పెట్టేయడం!). ఆయన లోకల్ ఫండ్ ఆడిట్ లో పనిచేసేవారు. ఏదో ఒకటిలెండి, అవ్విధంబుగా వాళ్ళింట్లో నన్ను పెట్టి, వారం వారం మానాన్నగారు అమలాపురం నుండి వచ్చేవారు. ప్రతీ శనివారం సాయంత్రం, ఆయనకోసం ఎదురుచూడ్డం ఓ వింత అనుభూతీ, మధుర జ్ఞాపకం.

ఆ పోలీసు క్లబ్బుకి పక్కనే రైలు కట్టుండేది. అక్కడకి వెళ్ళి రైలు చూడ్డం, కలకత్తా మెయిల్ సామర్లకోటలో వేసిన ఇంజను కూత, ఇక్కడకి వినిపించడం, మర్చిపోతామా? అదేదో బిఎన్ ఆర్ ఇంజననేవారు. దాని షేప్పే వేరుగా ఉండేది. ఆ ఇంజన్లు కాకినాడ వచ్చే రైళ్ళకుండేవి కావు. ఇక్కడ మామూలు ఛుక్ ఛుక్ ఇంజన్లే, కుయ్యో కుయ్యో మనే కూతే !!సాయంత్రాలు ఆరింటికో ఆరున్నరకో అదేదో నైన్ డౌన్నో ఎదో అనేవారు. నర్సాపురం దాకా వెళ్ళేది.

ఇంక నాకు వైద్యం చేసే డాక్టరు గారు శ్రీ నూకల అమ్మన్నపంతులు గారు, టౌన్ హాల్ పక్కన ఉండేవారు. ఎనిమిదింటికల్లా నేను వెళ్ళి భయపడుతూ,భయపడుతూ గేటు తీసి, కారణం, వాళ్ళింట్లో రెండు కుక్కలుండేవి. దాంట్లో ఓ కుక్క పాపం నాలాటిదే నోరూ వాయీ లేదు, ఏదో అటూ ఇటూ తిరుగుతూండేది. కానీ ఆ రెండోది, వామ్మోయ్ ఎంతలా అరిచేదో. తీరిగ్గా ఆయనేమో తొమ్మిదింటికి మేడమీంచి కిందకు దిగేవారు. ఆరోజు ఇంజెక్షన్ తీసికుని వెళ్ళడం. ఇలా వారంలో మూడు సార్లు రావలసివచ్చేది. పాపం పిల్లాడు గాంధీనగరం నుండి, టౌన్ హాల్ దాకా నడవలేడూ, పోనీ రిక్షాలో వెళ్తాడులే అని, మా నాన్నగారు, మా చుట్టాలింట్లో కొంత డబ్బుంచేవారు. దాంట్లోంచి తీసి, నేను వెళ్ళల్సొచ్చినప్పుడు, ఓ ఆరణాలు రానూపోనూ రిక్షా ఖర్చుకి మా అక్కయ్యగారు ఇచ్చేవారు.

మానాన్నగారు వారం వారం వచ్చినప్పుడల్లా ఆయనతో ,జిల్లా బోర్డు ఆఫీసుకెళ్ళడం, అక్కణ్ణుంచి, మెయిన్ రోడ్ లో రావూస్ కేఫ్ ( కెఫే అంటారని ఇప్పుడు తెలిసిందనుకోండి!) కి వెళ్ళి టిఫిన్ పెట్టించడం, ఓ సినిమా క్రౌన్ థియేటర్ లో చూపించడం. పాపం పిల్లాడు వైద్యం చేయించుకుంటున్నాడు కదూ! ఇందులొ ఆ రావూస్ కేఫ్ ఒకటి నచ్చేసింది. ఆరోజుల్లో బ్రేక్ ఫాస్టులూ అవీ ఉండేవి కాదుకదా, మహ అయితే చద్దన్నం. అయినా ఆరోజుల్లో హొటళ్ళకెక్కడ వెళ్ళేడ్చామూ? నా రిక్షా ఖర్చులకోసం ఇచ్చిన ఆరణాల్లోంచీ, వెళ్ళేటప్పుడు నడిచేసి, మూడణాలతో ఆ కేఫ్ కి వెళ్ళి పూరీ కూరా తినడం! అసలు ఆ పొంగిన పూరీ, ఆ కూరా ఇప్పటికీ గుర్తొస్తే నోట్లో నీళ్ళూరుతాయి! తిరిగెళ్ళేటప్పుడు మాత్రం రిక్షాలోనే, లేకపోతే ఇంట్లోవాళ్ళు తిడతారేమో అని భయం.

ఇంకోసారి కాకినాడ జనరల్ హాస్పిటల్ లో గడిపిన పదిరోజులూ, ఇంటినుండి ఓ బుచ్చి టిఫ్ఫిన్ కారీయర్ లో తెచ్చే కూరా అన్నమూ, వాహ్ వాహ్… గాంధీనగరం పార్కుకి వెళ్ళడం, ఆ పక్కనే ఉండే శ్రీ చెన్నుభొట్ల భానుమూర్తి గారు కూడా మా చుట్టం లెండి. మా పెదన్నాన్నగారబ్బాయిని ఆయన దత్తత తీసికున్నారు. ఈయనేమో ప్రకృతివైద్య డాక్టరు గారూ, పచ్చి కూరగాయలూ, ఆకులూ అలమలూ, రసాలూ తప్ప ఇంకోటి ముట్టుకోనిచ్చేవారు కాదు !!

నన్ను మరీ underestimate చేసేయకండి. కొసమెరుపు ఏమిటంటే నేను కూడా “ చదువుకుంటున్నాని” పేద్ద ఇమేజ్ ఉన్న రోజుల్లో పాపం మా నాన్నగారు, ఎంతో ఆశతో నన్ను కూడా ఐఐటి ఎంట్రెన్స్ పరీక్షకి పంపారు. ఆ పరీక్ష కి కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో అడుగు మాత్రమే పెట్టే అదృష్టం కూడా కలిగింది! మార్కుల సంగతి మాత్రం అడగొద్దు!

సినిమా స్ట్రీట్, రామారావుపేట, మూడు లైట్ల జంక్షనూ, జగన్నాధపురం వంతెనా, క్రౌన్ థియేటరూ, అక్కడెక్కడో కుళాయి చెరువనోటుండేది ఎంత చెప్పినా ఆతావేతా ఓ ఆరు నెలల జ్ఞాపకాలు… శంకరా, రాస్తే రాశావు కానీ, ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసికుని అందరిమీదా రుద్దే అవకాశం కల్పించావు….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అంత మరీ అన్యాయం కాదు…

   ఈ మధ్యన ఓ ప్రకటనొచ్చింది, CGHS కార్డులున్న పెన్షనర్లకి ప్లాస్టిక్ కార్డులు జారీ చేస్తున్నారని. ఏదో ఒక ఊళ్ళో రిజిస్టర్ చేసికున్నవారికి దేశం లో ఏ CGHS హాస్పిటల్ లోనైనా సదుపాయం ఉండేటట్టుగా ఇప్పుడు అంతా online చేశారు. ఇదివరకైతే అంతా గందరగోళం గా ఉండేది. ఉదాహరణకి నేను పూణె లో రిజిస్టరు చేసికుంటే, వైద్యానికీ, మందులకీ పూణె ఏ రావాల్సివచ్చేది. ఖర్మం కాలి ఏ భాగ్యనగరంలోనైనా మంచం పడితే, భాగ్యనగరంలో ఉన్న CGHS ఆఫీసుకెళ్ళి వాళ్ళదగ్గర సర్టిఫికేట్ తీసికోవాల్సివచ్చేది. ఏదో అదృష్టం కొద్దీ,భగవంతుడి దయ వలన, కార్డంటే, రిటైరయిన రెండేళ్ళకి 18000 కట్టి తీసికున్నాను కానీ, దాన్ని ఉపయోగించవలసిన అవసరం ఎప్పుడూ రాలేదు ! కానీ రోజులన్నీ మనవి కాదుకదా, ఎప్పుడేం అవసరమొస్తుందో, పోనీ ఆ ప్లాస్టిక్ కార్డేదో తీసికుంటే బాగుంటుంది కదా. పాత కార్డు సరెండర్ చేసేస్తే, ఈ ప్లాస్టిక్ కార్డిస్తారుట.

    అక్కడొచ్చింది అసలు గొడవంతా, “ఆయనే ఉంటే….” అన్నట్టుగా, అవసరానికి ముఖ్యమైన డాక్యుమెంట్లు కనిపించి చావవుగా. ఏదో తీరువుగా, ఒబ్బిడిగా అన్ని డాక్యుమెంట్లూ ఓ చోట పెట్టండి మహప్రభో అని ఇంటావిడ ఎన్నిసార్లు మొత్తుకున్నా, ” ఆ ఒక్కటీ అడగొద్దు..” అన్నట్టు, మామూలుగానే ఎక్కడో పెట్టడం, మర్చిపోడమూనూ. రెండిళ్ళూ వెదికా, కనిపించదే. రెండీల్లూ అంటే అపార్ధం చేసికోకండే, నేనూ ఇంటావిడా ఉండే సింగిల్ బెడ్రూం ఫ్లాట్టూ, మా స్వంత ఫ్లాట్టూ అన్నమాట. ఆ కార్డుకోసం వెదికి వెదికి శ్రమపడే కంటే, వాళ్ళని బతిమాలి కొత్త కార్డు తీసికోడం సులభమేమో అని ఓ ఐడియా వచ్చేసింది. ఎవరినో అడిగితే, పెనాల్టీ కడితే కొత్తదిస్తారూ అన్నారు.

   సరే అని వాళ్ళ ఆఫీసుకి వెళ్తే, మొదటి ప్రశ్న-పాత కార్డు xerox ఉందా అని. పోనీ అదీ లేకపోతే నెంబరేనా చెప్పూ అని. “దరిద్రుడి నెత్తిమీద వడగళ్ళ వాన ” లా మనదగ్గర ఆ రెండూ లేవు. గోవిందో గోవిందా . ఏదో ఇదివరకు కార్డు పుచ్చుకున్న కొత్తలో, మా CGHS Dispensary కి వెళ్ళి, ఓ రూళ్ళ పుస్తకంలో, రిజిస్టరు చేయించుకుని , వాళ్ళచేత ఓ stamp వేయించుకోడం ఒకటే, నేను చేసిన మంచిపని. ఆ పుస్తకమూ, నా ఐడి కార్డూ అక్కడున్న అతని చేతిలో పెట్టేసి ” నీవే దిక్కు మహప్రభో..” అని సరెండరైపోయాను. పాపంఏమనుకున్నాడో ఏమో, “సరే చూస్తానూ, వెయిట్ చెయ్యీ..” అన్నాడు. సరే అనుకుని బయట బెంచీ మీద సెటిలయ్యాను. ఓ పదినిముషాల్లో బయటకు వచ్చి, ఓ నెంబరు చెప్పి, ఇది పోయినట్టు పోలీస్ స్టేషన్ లో కంప్లైంటిచ్చి, ఆ FIR కాపీ పట్టుకు రా, కొత్తదిస్తామూ. అని చెప్పి పంపించేశాడు.

   ఎప్పుడైనా పోలీస్టేషన్లకెళ్ళిన మొహమా నాదీ, అప్పుడెప్పుడో passport వ్యవహారం లో pvr అందలేదని, కమీషనర్ ఆఫీసుకెళ్ళా కానీ, ఈ పోలీసుస్టేషన్లలో ఏమడుగుతారో, ఏం చెప్పాలో, ఏం చెబితే ఏం తప్పో.. అన్నీ సందేహాలే.. పైగా చేసేదా వెధవ పని, నా కార్డు పోయిందా అంటే నిజంగా పోలేదు. ఇంట్లో ఎక్కడో పెట్టా గుర్తుకు రావడం లేదూ, ఈ FIR కాపీ ఏదో ఇస్తే కానీ, కొత్త కార్డు రాదూ, ఏం గొడవరా బాబూ, ఎరక్కపోయి మొదలెట్టాను, పాత కార్డుకోసం వెదకడమే cheap and best అనికూడా అనేసికున్నాను. ఇలా కాదని, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు మా డీలర్ ఒకతన్ని పట్టుకున్నాను. బాబ్బాబు ఎలాగోలాగ ఈ పని చేసిపెట్టూ, వచ్చే జన్మలో నీ కడుపున పుడతానూ… వగైరాలు చెప్పి, అతన్ని తీసికెళ్ళాను.

   దానికి ఎంతో కొంత ఖర్చవుతుందీ, పోలీసు స్టేషన్లో పోయింది మన వస్తువైనా సరే తృణమో పణమో లేకుండా పనవదూ అన్నాడు. ఏం చేస్తానూ, చచ్చినట్టు ఒప్పుకున్నాను. అక్కడకి వెళ్ళిన తరువాత ఈ మధ్యన చూస్తున్న ” సింగం” సినిమాల్లాటివన్నీ, కళ్ళముందర తిరగడం మొదలెట్టాయి.అక్కడో ఇనస్పెక్టరుంటాడూ, అతను కాళ్ళు టేబుల్ మీద పెడతాడూ, మనమేమో, నీళ్ళు నములుతూ, వాళ్ళెదురుగుండా, చేతులు నలుపుకుంటూ, ” ఆయ్ నాదండీ, కార్డండీ ఎవడో కొట్టేశాడండి ఓ రిపోర్టిద్దామనొచ్చానండి….” etc..etc.. దానికి ఆ ఇన్స్పెక్టరు “ నువ్వు పోయిందీ అంటే మేం నమ్మాలా? ఎక్కడ, ఏ టైములో,ఏం చేస్తూంటే అసలు పోయిందీ.. ఎవడో కొట్టేశాడని ఋజువేమిటీ, అసలు నువ్వెందుకెళ్ళావూ అక్కడకీ, ఇంత వయస్సొచ్చిన తరువాత ఒక్కణ్ణీ బయటకెళ్ళడానికి మీ ఇంట్లోవాళ్ళసలెలా ఒప్పుకున్నారూ…” వామ్మోయ్ ఎన్నెన్ని ప్రశ్నలో. వాటిలో దేనికీ సమాధానంచెప్పే పరిస్థితిలో లేను. అందుకే కదా, ఫ్రెండుని తీసికెళ్ళిందీ. చిత్రం ఏమిటంటే, నేను ఊహించినంత అన్యాయం కాదు, వెళ్ళీవెళ్ళగానే, మా ఇద్దరికీ కూర్చోడానికి కుర్చీలిచ్చారు. మంచినీళ్ళు కూడా తెప్పించారు. ప్రశ్నలన్నీ మాత్రం ఇవే !!

    పేద్ద గొప్పగా ఓ కాగితం మీద నాలుగు ముక్కలు వ్రాసి తీసికెళ్ళాను. ఠాఠ్ ఇంగ్లీషులో కాదూ, మరాఠీలో వ్రాసిమ్మన్నారు. ఏదో భాషంటే అర్ధం అవుతుంది కానీ, ఎప్లికేషన్ వ్రాసే ప్రావీణ్యం లేదాయె. పాపం నాతో వచ్చినతనే ఓ కాగితం మీద మరాఠీలో నేను చెప్పిన ” నిజాలు” వ్రాసిచ్చాడు, నాకు ఓ సంతకంతో సరిపోయింది. ఈ వివరాలన్నీ ఇంకో పోలీసు అదేదో ఫారం మీద, కార్బన్ కాపీ తీసి ఓ స్టాంపేసి, మా చేతుల్లో పెట్టాడు.ఇప్పుడు, ఈ వ్యవహారానికంతా ఎంతవుతుందీ అని అడగాలేమూ, అడిగితే మళ్ళీ ఏం గొడవో, హాఠ్ మమ్మల్నలా అడుగుతావా అని ఏ లాకప్పులోనో పడేస్తే, వామ్మోయ్… అయినా ధైర్యం చేసేసి, మా ఫ్రెండడిగేశాడు. దానికి ఆ పోలీసు మాకిచ్చిన సమాధానం వింటే ఆశ్చర్యపోతారు- ” ఇక్కడ మేముండేదెందుకుట? పబ్లిక్ కి సహాయం చేద్దామనే కదా. ఈ మాత్రం దానికి, ఎంతవుతుందీ అనడం, మమ్మల్ని insult చేసినట్టే…” అని మరాఠీలోనే అనుకోండి, చెప్పడం తో అనిపించింది, ఊరికే సినిమాల్లో చూసీ, ఏ దరిద్రుడో చెప్పిందీ విని, మనం ఊరికే అభిప్రాయాలు ఏర్పరుచుకో కూడదు. మన అనుభవం ఏమిటీ అన్నదే ముఖ్యం. అలాగని నేను కానీ, మా ఫ్రెండు కానీ వాళ్ళకి తెలియదు. ఎవరి ద్వారానూ వెళ్ళలేదు.

   మొత్తానికి ఈ కాగితాలూ, ఓ ఫొటో తీసికెళ్ళి, పది రూపాయలు మాత్రమే జుర్మానా కట్టి ఈవేళ నా కార్డు సంపాదించాను. మామూలుగా గవర్నమెంటాఫీసుల్లో, చేతులు తడిపితేనే కానీ పనులవ్వవూ, అదీ రిటైరయిన వారి సంగతైతే అడక్కండీ, ఎవ్వడూ మన మొహం చూడ్డూ, తిరిగి తిరిగి చెప్పులరిగిపోతాయీ blah..blah.. లాటివి విని విని, కాబోసేమో అనుకంటాము.

   కానీ అనుభవం మీద తెలిసిందేమిటంటే, మన way of approach మీద ఆధారపడి ఉంటుంది. మనం వెధవ్వేషాలేసి, పోజులు కొడితే చెయ్యాలనుకున్నవాళ్ళు కూడా చెయ్యరు… ఏమో బాబూ నాకైతే అనిపించింది.. “ మరీ అంత అన్యాయం కాదూ..” అని.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

Engg Students

   రెండు రోజుల క్రితం, మన రాష్ట్రం లోని ప్రెవేట్ కాలేజీల యాజమాన్యం వారు, రేపణ్ణించి కాలేజీలు మూసేస్తున్నామని ప్రకటించారు. ఏదో కిందా మీదా పడి, మొత్తానికి ప్రభుత్వం, అదేదో fees reimbursement కి సంబంధించి, కొంత మొత్తాన్ని విడుదల చేస్తామనేటప్పటికి, యాజమాన్యం, వారి “బెదిరింపు” వాయిదా వేశారని ఈవేళ్టి న్యూస్ లో విన్నాము. అంతా బాగానే ఉంది, కానీ ప్రభుత్వం వారిచ్చేreimbursement ఏ కొద్దిమందికో కానీ, అందరికీ కాదు కదా, మరి ఈమాత్రం దానికి నిజాయితీగా ఫీజులు కట్టేవారి చదువులు పాడిచేస్తే ఎలాగండి బాబూ? అంత బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే ఎలాగా?

   మా రోజుల్లో, ఇంజనీరింగు కాలేజీలు ఎక్కడో కాకినాడలోనూ, విశాఖపట్టణం లోనూ, అలాగే కొన్ని ముఖ్యనగరాల్లోనూ ఉండేవి. జనాభా పెరిగేకొద్దీ, ప్రస్తుతం వీధికో ఇంజనీరింగు కాలేజీ వచ్చేసింది. దాంట్లో టీచింగ్ క్వాలిటీ ఎలాగుందీ అనే దానిమీద ఎవరికీ శ్రధ్ధలేదు, అది వేరే విషయం. మన రాష్ట్రం లో ఎక్కువ ఇంజనీరింగు కాలేజీలు, ఏదో ఒక రాజకీయనాయకుడికి సంబంధించినవే. ఎలాగూ ప్రభుత్వం ఫీజు reimburse చేస్తారులే అని, ఎవడుపడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ, ఓ కాలేజీ తెరిచేశారు. ఏదో తల తాకట్టు పెట్టో, ఏ ఎడ్యుకేషన్ లోనో తీసికుని, చాలామంది తల్లితండ్రులు వారి పిల్లల్ని ఇంజనీరింగులో చేర్పిస్తారు. చదువు పూర్తయిన తరువాత ఏదో ఉద్యోగం వస్తేనే కదా, వాళ్ళు చేసిన అప్పు తీర్చడం. అందరూ లక్షాధికార్లూ, కోటీశ్వరులూ కాదు కదా, చాలామంది మధ్యతరగతి వాళ్ళే. ఏదో దీక్షలూ, ఆందోళనలూ దాటుకుని మొత్తానికి ఆ డిగ్రీ పూర్తిచేస్తారు. వీళ్ళేదో డిగ్రీ సంపాదించేశారూ అని, వీళ్ళకోసం ఉద్యోగాలేమైనా వీరికోసం waiting లో ఉండవుకదా. మళ్ళీ ఇంతట్లో ఊరికే కూర్చోడం ఎందుకని, పోస్ట్ గ్రాడ్యుఏషనూ, అప్పటికీ ఉద్యోగం రాకపోతే, ఎంబిఏ, అదీ పూర్తిచేసి, మళ్ళీ అదేదో డాక్టరేటూ.

   మనదేశం లో ఇంజనీరింగు చేసినవారికి ఉద్యోగాలు ఎందుకు రావడం లేదో కారణాలు, ఈమధ్యన ఓ పేపర్లో చదివాను. ఆ వ్యాసంపైన పెట్టాను. ఓసారి చదవండి. ఊరికే కాలేజీలు తెరిచేసి, ఇంజనీర్ల ఫాక్టరీలు తయారుచేస్తే సరిపోదుగా.

   ఈవేళ మన ఐఏఎస్ వారు, ” work to rule” లాటిది మొదలెట్టారుట. అంటే దానర్ధం ఇన్నాళ్ళూ రూల్స్ ప్రకారం పనిచేయడం లేదన్న మాటే కదా! మరి ఈమాత్రం దానికి ఊరికే మొత్తుకోడం దేనికీ?

.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Melody R.I.P…….

SRT is GOD

    ఈవేళ సాయంత్రం “మా” మ్యూజిక్ చానెల్ వారి బహుమతీ పురస్కార కార్యక్రమం చూశాను. అందులో వివిధ గాయకులు పాడిన పాటలు విన్నాము. మెలొడీ కీ, బీట్ కీ ఉండే తేడా ఏమిటో స్పష్టంగా తెలిసింది. బీట్ అనేదుండాలి, కానీ మరీ ఎక్కువేమో అనిపించింది. ఇదివరకటి రోజుల్లోనూ ఉండేవి బీట్ పాటలు, కానీ వాటిలో ఏదో అర్ధం అయ్యే పదాలుండెవి. ఇప్పుడు పదాలకి అంత ప్రాముఖ్యం అవసరం లేదని తెలిసింది. అందుకే కాబోలు, ఆర్నెల్ల క్రితం వచ్చిన సినిమా అయినా సరే, ఒక్క పాటకూడా గుర్తుండదు. ఆ అరుపులూ, కేకలూ, వాటిననుకరిస్తూ చేసే గైరేషన్లేనా గుర్తుంటాయా అంటే అదీ లేదు.
ఒక విషయం మాత్రం చాలా బాగుంది– మోడరన్ అరుపులు ఎంత బాగా చేశారో, అదే శ్రధ్ధతో పాత పాటలు పాడిన, మన యువ గాయకులకి హ్యాట్సాఫ్ !! బహుశా ఈ ప్రావీణ్యం, మన సుశీల గారికీ, జానకి గారికీ లేదేమో అనిపించింది. వాళ్ళు ఈరోజుల్లో వచ్చే పాటలు పాడిఉండగలిగేవారా అనిపించింది. హాయిగా రంగం లోంచి వెళ్ళిపోయి సుఖపడ్డారు. సిరివెన్నెలసీతారామశాస్త్రి గారి గురించి, దర్శకుడు త్రివిక్రం చెప్పిన మాటలు చాలా బావున్నాయి. తనకు జరిగిన సన్మానానికి సిరివెన్నెల స్పందన కూడా బావుంది.

   ఒక విషయం మాత్రం అర్ధం అవదు నాకు ఎప్పటికీ- ఇలాటి కార్యక్రమాల్లో కొంతమంది “కళాకారులు” చేసే ఐటం సాంగుల గెంతులు !పబ్లిక్కుగా వీళ్ళు చేస్తే రైటా, అదే మన పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ఏదో పొట్టకూటి కోసం రికార్డింగ్ డాన్సులు చేస్తే తప్పా?Why these doublestandards? ఆ మధ్యన ఏదో “జాతర” సందర్భం లో పాపం వాళ్ళెవరో సోకాల్డ్ “అశ్లీల నృత్యాలు” చేశారనీ, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారనీ , మన చానెళ్ళవాళ్ళు ఘోష పెట్టేశారులెండి. దానికి సాయం అదే కార్యక్రమం లో మన మహిళా సంఘాల ప్రతినిధులు కూడా పాపం ఆవేశపడి, ఆవేదన చెందేశారు. మరి ఇలాటి ఫంక్షన్లలో జరిగేవేవీ వీళ్ళ దృష్టిలోకి రావా? వచ్చినా అభ్యంతరపెట్టే ధైర్యం లేదా?

   కొత్త పాటలు వింటూన్నంతసేపూ, గైరేషన్లు చూస్తున్నంతసేపూ ప్రేక్షకులలో ఉన్న శ్రీ విశ్వనాథ్, శ్రీ బాపూ.శ్రీమతి సుశీలా ( to mention only a few..) గార్ల body language, హావభావాలు చూస్తేనే అర్ధం అవుతుంది, వాళ్ళెంత ” హింస” కి గురయ్యారో! ముందరి సీట్లలో కూర్చున్న ఏ ఒకరో ఇద్దరో తప్ప, మిగిలినవారందరూ లిటరల్లీ ఫ్రీజ్ అయిపోయారు!

   బీట్ పాటలుండకూడదనడం లేదు, కాని వాటి shelf life ఎంత? ఆ పాటలున్న సినిమాల్లాగానే మహ అయితే ఓ వారం, పదిహేను రోజులు కాదూ కూడదూ అంటే ఓ నెలేసికోండి.ఈరోజుల్లో వచ్చే పాటల standard గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అలాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్లూనూ- one night wonders !మెలొడీకి ఈ రోజుల్లో స్థానం లేదని, ఇళయరాజా చేసిన శ్రీరామరాజ్యానికి ఎవార్డ్ రానప్పుడే తెలిసింది. Melody R.I.P.

   వారం వారం వచ్చే సాహిత్య సంచికా కార్యక్రమం ” వందేళ్ళ తెలుగు కథ” ప్రసారం చేస్తున్న hmtv వారు అభినందనీయులు. అలాగే నిన్ననుకుంటా ఏదో చానెల్ లో సైబర్ క్రైం గురించి ఓ కార్యక్రమం కూడా బావుంది. ఈవేళ TV9 అనుకుంటా, తెలుగు ఎకాడెమీ వారు ప్రచురించిన డిఎస్ సీ పుస్తకాల్లో ప్రచురించిన తప్పుల తడకల గురించి కార్యక్రమం. వాటిగురించి వింటూంటే సిగ్గేసింది.మనకంటే సిగ్గేస్తుంది కానీ, వాళ్ళకి సిగ్గూ ఎగ్గూ లేదని తెలిసిపోయింది.

   మనవాళ్ళు ఏదో by mistake ఓ మాచ్ నెగ్గేసరికి ఇక్కడ టపాకాయలు పేల్చేశారు. పాపం వాళ్ళా మనల్ని disappoint చేసేదీ? ఈవేళ మళ్ళీ మామూలే… నిన్న ఓ పేపరు లో చదివిన ఓ వ్యాసం పైన పెట్టాను. కోప్పడకండి, ఓపికుంటే చదవండి…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేముణ్ణి కూడా వదలడం లేదు…

OPEN

   అదేం విశేషమో, ఆ శ్రీవెంకటేశ్వరుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. రెండు రోజుల క్రితం, షిరిడీ నుండి వచ్చిన సాయిబాబా పాదుకలమీద వివాదం. ఈవేళ చిన జియర్ గారూ, ఆయనెవరో పీఠాధిపతి గారూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు. ఈ మధ్యలో శ్రీవారి కల్యాణం నేపాల్ లో జరపడం విషయం లో వివాదం. ఇవే కాకుండా ఈ.ఓ. గారొకాయన మీద సిబీఐ వాళ్ళు chargesheet లో ఆయన పేరు ప్రస్తావించారని, ఈయనేమో దేముడి మీద ప్రమాణాలూ వగైరా.. ఏమిటో ఆయనదారిన ఆయన శ్రీవెంకటేశ్వరుడు, ఏదో హాయిగా కళ్ళు మూసుకుని, ఆయన అప్పేదో తీర్చుకుంటున్నారుగా, వీళ్ళనేమైనా అడిగారా పెట్టారా, వదిలేయకూడదూ పోనీ? ప్రతీదాన్నీ రాజకీయం చేయడం ఎందుకో అసలు? ఆయనెవడో, ప్రభుత్వాన్ని రక్షించడానికి ఓటు వేశాడని, టిటిడి ఛైర్మన్ చేశారు. ఇంకోఆయనేమో (మాజీ ఛైర్మన్) అవేవో నిరాహారదీక్షలూ వగైరా చేశాడు. ఒక్కరోజు కూడా, ఏదో ఒక controversy లేకుండా రోజెళ్ళడం లేదు. ఎవరి వాదనలు కరెక్టో కూడా తెలియదు. ఎవర్ని నమ్మాలో అసలే తెలియదు. అందుకనే అన్నారేమో కలికాలం అని.

   ఈవేళంతా మన ఐఏఎస్ అధికారులందరూ గొడవ మొదలెట్టారు. ప్రతీ వాళ్ళూ రాజకీయ నాయకుల ఒత్తిడివలన ఆర్డర్లు పాస్ చేశామనే వారే. కానీ దేశం మొత్తం మీద చూస్తే
ఓ ఆర్మీ అనండి, ఇంకం టాక్సనండి, పోలీసనండి, ఎక్సైజనండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ శాఖలోనూ అతిరథమహారథులున్నారు. గట్టిగా పట్టుకునేసరికి గుండె నొప్పనేవాళ్ళోళ్ళు, నడుంనొప్పనేవాళ్ళోళ్ళు. అసలు ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు. ఈ సందర్భం లో OPEN లో వచ్చిన వ్యాసం ఒకటి పెట్టాను.చదవండి.
అమ్మయ్య మొత్తానికి మనవాళ్ళు ఓ మ్యాచ్ నెగ్గారండి బాబూ! దానిక్కూడా ఎంత సస్పెన్సో…

%d bloggers like this: