నిన్న ఒకటపా వ్రాశాను. మా ఇంటావిడ వ్రాసిన ఒక టపా లో ఒక వ్యాఖ్య చదివి, తను ఎంత బాధ పడిందో తెలియచేస్తూ… and also my take on the same.
ఈవేళ, ఆ ” అజ్ఞాత” నా భాషలో అనామకుడు, బాధ పడుతూ, ఒక వ్యాఖ్య పెట్టారు– “లక్ష్మి గారు
మనసు బాగోలేని ఒకానొక క్షణంలో ఆ కామెంట్ రాసిన వెధవని నేనే. క్షమాపణలు. దయచేసి బ్లాగు రాయడం కొనసాగించండి.
మొదటి అనామక “- అంటూ. ఏదో మనసు బాగుండనప్పుడు ఉద్రేకంలో ఏవేవో అనుకోడం, ఆ “కోపాన్ని” ఎదుటివారిమీద చూపించేయడం, చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. కానీ, అది realise చేసి, తప్పుని ఒప్పుకోడంలోనే, అసలు గొప్పతనం అంతా.ఈ విషయంలో ఆ “అజ్ఞాత” కి నా hearty compliments...
ఇలాటివి మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఏవో చికాకులొచ్చి, ఆఫీసుకి వెళ్ళి, ఏ కారణం లేకుండా, ఎవడిమీదో ఆ చిరాకు ప్రదర్శిస్తూ, చడా మడా కోప్పడేయడం. పాపం అవతలివాడు ఎప్పుడూ బాగా పనిచేసేవాడే, కానీ, అదృష్టం బాగోక, ఈ ఇంట్లో చికాకులొచ్చిన పెద్దమనిషి చేతిలో బలైపోతాడు.ఈ పెద్దమనిషి కొద్దిగా ఇంగితజ్ఞానం ఉన్నవాడైతే, తను చేసిన తప్పు తెలిసికుని, ఆ అవతలివాడిని పిలిచి,సద్దిచెప్తాడు.కాదూ ఎవడెలా పోతే మనకేమిటిలే అనుకునేవాడైతే, తన పట్టు వదలడు. దీనితో ఇద్దరి మధ్యా సంబంధబాంధవ్యాలు strain అయిపోతాయి.అలాగని జీవితాంతం తెలిసికోకుండా ఉంటాడంటారా, అబ్బే ఎప్పుడో ఒకప్పుడు తెలిసికుంటాడు. But it is too late..
ఇలాటివి ఊళ్ళోవాళ్ళతో ఉండే వ్యవహారాలు. కానీ ఒక్కోక్కప్పుడు, భార్యా భర్తల మధ్యే ఇలాటివి తలెత్తుతూంటాయి. అప్పుడప్పుడేమిటిలెండి, ఎప్పుడు పడితే అప్పుడే, తేరగా, లోకువగా దొరికేది కట్టుకున్న పెళ్ళామేగా.. మన “ బక్క కోపం” అంతా ఆ poor soul మీద చూపించేసికోడం. ఆ కోపంలో ఏం మాట్టాడుతున్నామో కూడా తెలియదు.ఒళ్ళు తెలీకుండా చడా మడా అరవడం. ఒక్కోసారి, ఎప్పటినుంచో దాచుకున్న ” కచ్చి” అంతా మాటల రూపంలో చూపించేయడం. ఓ అర్ధం పర్ధం ఉండదు. అనుకుంటూంటాను, ఎప్పుడో ఎవరికో ఇలాటి పరిస్థితి వచ్చినప్పుడు, ఏ రికార్డింగో చేసి చూపిస్తే ఎలా ఉంటుందో అని. ఛాన్సొస్తే ఈ రోజుల్లో వెళ్ళే Counselling చేసేవాళ్ళందరిదగ్గరా ఇలాటివే ఉంటాయేమో. లేకపోతే అన్నన్ని సలహాలెక్కడ ఇస్తారూ?
40 ఏళ్లల్లోనూ లెఖ్ఖలేనన్నిసార్లు, ఇంటావిడమీద గయ్యిమంటూనే ఉంటున్నాను, ఏదో నా రోజులు బాగోబట్టి, తిరగబడలేదు.అసలు తిరగబడితే ఏం చేసుంటానంటారు, నోరు మూసుకుని కూర్చునేవాడినేమో. Anyway it is all hypothetical..పోనీ అదేదో తెలిసికుందామా అంటే, తను తిరగబడా లేదూ, నేను ఆవిడమీద అప్పుడప్పుడు ఏ కారణం లేకుండా, గయ్యిమనడం మానాలేదూ.. ఏమిటో ఇదిమాత్రం నా unfulfilled wish గా మిగిలిపోతుందేమో..ఎప్పుడైనా అలాటిదంటూ జరిగితే మాత్రం చెప్తాలెండి.అందరూ అనుకుంటూంటారు.. ఓసారి లక్ష్మిగారు ఈయనమీద తిరగబడుతే బాగుండునూ, రోగం కుదురుతుందీ.. అని. ఉత్తిపుణ్యాన్న ఆవిడలో లేని పోని ఆలోచనలూ, ఐడియాలూ ఇవ్వఖ్ఖర్లేదు... మా దారిన మమ్మల్ని బతకనీయండి. OK ?
కానీ ప్రతీచోటా ఇలాగే ఉంటుందేమో అనుకుంటే, పప్పులో కాలేసినట్టే.ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అవేవో equality లూ, సింగినాదాలూనూ. భార్యాభర్తలిద్దరూ సంపాదనాపరులే. వెధవ్వేషాలేస్తే, నీ దిక్కున చోట చెప్పుకో ఫో.. అనేసి, బిచాణా కట్టేసి వెళ్ళిపోతుంది.అలాగని నేనేదో సంపాదనాపరుణ్ణీ, మా ఇంటావిడ కేమీ సంపాదనలేదూ, అందువలన అణిగి మణిగి ఉందీ అనుకుంటే, తనని కించపరిచినట్టే. ఒక్కోళ్ళ స్వభావాలు అలాగే ఉంటాయి.” ఫొనిద్దూ.. అరిచి అరిచి ఆయనే నోరుమూసుకుంటాడూ..”. పిల్లలేడుస్తూంటే ఏదో ఒక్కసారి దగ్గరకు తీసికుంటారు. కానీ అదే ఓ weapon లాగ ఉపయోగిస్తూంటే, their place is shown..ఎన్నిచెప్పండి, మా ఇంటావిడ ఇంకా నా place నాకు చూపించలేదు...ఏదో నా రోజులు వెళ్ళిపోతున్నాయి.
ఇలాటి పరిస్థితే వచ్చుంటుంది– లతామంగేష్కర్ గారికి, ఎందుకు చెప్పండి, హాయిగా రోజులెళ్ళిపోతున్నాయి కదా, ఎందుకొచ్చిన గొడవా, ఎప్పుడో రఫీ గారికీ ఈవిడకీ గొడవొచ్చిందిట, ఆ గొడవేదో 50 ఏళ్ళ క్రితమే సెటిల్ అయిపోయింది. ఇన్నేళ్ళకి, ఆయనేదో క్షమాపణ పత్రం రాసిచ్చారూ అని చెప్పుకోవాలా? వదిలిపోయింది, రఫీ గారి కొడుకు, ఆ పత్రం ఏదో చూపించండి, లేకపోతే legal గా proceed అవుతానూ అని ఓ ప్రకటన చేశాడు.బహుశా, లతామంగేష్కర్ కి, బహిరంగంగా, రఫీగారు వ్రాసిచ్చారూ అని చెప్పుకోడం ఓ stress busteరేమో.
సినిమాల్లో చూస్తూంటాము- హీరోలకి కోపాలూ తాపాలూ వచ్చినప్పుడు, అవేవో punching bags ట, వాటిమీద టపా..టపా ..కొట్టేస్తూంటారు.ఇప్పుడున్న ఎపార్ట్మెంటుల్లో ఈ punching bags లకీ వాటికీ చోట్లెక్కడా, ఏదో డైనింగ్ టేబుల్ నో ,ఓ గోడనో కొట్టేసికుంటే సరి ! అదికూడా చక్కతో చేసిన డైనింగ్ టేబుల్ అయితే ఫరవాలేదు. ఏ గ్లాసుదో అయితే మళ్ళీ గొడవా, విరిగూరుకుంటుంది. చూసుకుని మరీ చేయండి. కాదంటారా, పిల్లాడికి ఏవో మార్కులు తక్కువొచ్చాయనో,అసలు చదువు గురించి పట్టించుకోకుండా టీవీ చూస్తూంటాడనో, ఓ నాలుగు దెబ్బలేసేయండి. తరువాత దగ్గరకు తీసికుని ఓ చాకొలేట్ కొనేసియ్యండి. ఇలాటివైతే మన దేశంలో గొడవుండదు. బయటి దేశాల్లో అయితే మళ్ళీ ఆ పిల్లలు పోలీసులకి ఫోను చేస్తారుట. వామ్మోయ్ మళ్ళీ ఇదో గొడవా. ఇక్కడే హాయి.. అందుకే అంటారు.. “మేరా భారత్ మహాన్..”. ఏదో నాలుగు దెబ్బలు తిన్నా ఓ చాకొలేట్ తో గొడవొదిలిపోతుంది…మన కోపమూ చల్లారుతుంది..
అందరిలోకీ రాజకీయనాయకుల పని హాయి. అవతలి పార్టీ వాడిమీద కోపం వచ్చినప్పుడు అవాకులూ చవాకులూ మీడియా వాళ్ళని పిలిచి మరీ వాగేస్తాడు.ఎప్పుడో కొన్ని రోజులతరువాత, ఎవడిమీదైతే పేలాడో, వాడే అధికారంలోకి వస్తే, ఇంద్రుడూ చంద్రుడూ అని పొగిడేస్తాడు. అదేమిటండీ ఇదివరకు ఇంకోటేదో అన్నట్టున్నారూ అని అడిగినా, I was quoted out of context అనేసిఊరుకుంటాడు.“మమ” అనుకున్నట్టన్నమాట…
Filed under: Uncategorized | 2 Comments »