బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–feel good….

    ఈమధ్యన SBI కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది, అదీ మా ఇంటావిడని తీసికునీ. ఏం లేదూ, ఎప్పుడో “స్వర్ణయుగం” రోజుల్లో, తనకీ, ఓ ఎకౌంటు తెరిచి, దాంట్లో డబ్బులేసేవాడిని లెండి. దాని ATM CARD నాదగ్గరే ఉండేది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఎప్పుడూ బ్యాంకులకీ వాటికీ వెళ్ళే సద్గుణాలు మా ఇంటావిడకి లేవు, పాపం వెర్రి ఇల్లాలు! అన్ని రోజులూ మనవే కావుగా, రోజూ ఆ టీవీ లో సీరియళ్ళూ అవీ చూస్తూంటుందిగా, ఎందుకైనా మంచిదీ అని. ఓ రోజు నిలేసింది.” అప్పుడెప్పుడో, పబ్లిసిటీకోసం నాపేరుమీద ఓ ఎకౌంటోపెన్ చేసినట్లు గుర్తూ, అసలు అందులో ఏమైనా ఉందా...” అంటూ. ఎప్పుడడిగినా దాటేస్తూంటాను, “నీకెందుకూ ఆ గొడవలన్నీ, కావలిసినవేవో తెస్తూనే ఉన్నానుగా, అనవసర టెన్షనూ అదీ నీకెందుకూ..” అని. తను మాత్రం ఎన్ని రోజులాగుతుందీ? ఇదిగో అదిగో అంటూ నాకు వచ్చే జీతం కూడా తెలియనీయకుండా, 40 ఏళ్ళు లాగించేశాను. మధ్యలో ఓసారి చెక్ చేస్తే, తన ఎకౌంటు లాక్ అయిపోయింది.ఎంతుందో తెలియదూ, మరి ఇలాటి “సున్నితమైన” విషయాలు ఆవిడతో చెప్పి క్షోభ పెట్టడం ఎందుకూ అని,అసలు చెప్పేలేదు.

   మనం దాస్తే దాగుతాయా రహస్యాలూ? నేను 2005 లో రిటైరయినప్పుడు, పెన్షన్ ఎకౌంటు, పెన్షనరు పేరుమీదే ఓపెన్ చేయించేవారు. మన “ఇన్నింగ్స్” పూర్తయి, ఫ్యామిలీ పెన్షన్ వచ్చేదాకా, వీళ్ళు పిక్చర్ లోకి వచ్చేవారుకారు. 2006 నుంచీ, పెన్షన్ ఎకౌంట్లు కూడా ” జాయింటు” పేర్లమీద ఇస్తున్నారుట.నాకేం తెలుసూ? ప్రయత్నిస్తే తెలిసేదేమో, ప్రయత్నిస్తేగా? మన సంగతెలాఉన్నా ఊళ్ళోవాళ్ళకి అన్నీ కావాలి! మాకున్న ఫ్రెండ్సందరూ రిటైరయినవాళ్ళేగా, ఆ మధ్యనెప్పుడో ఒకళ్ళింటికి వెళ్ళినప్పుడు, ఊరుకోవచ్చా ఏదో కబుర్లు చెప్పుకుని, అబ్బే, అలా ఉంటే వాళ్ళు చేసిన “ఘనకార్యాలు” అందరికీ తెలియొద్దూ? ” ఫణిబాబు గారూ, మీరూ చేసేశారా జాయింటూ పెన్షన్ ఎకౌంటూ…” అంటూ పుల్లెట్టేశారు!మా ఇంటావిడ అలాటి విషయాలు టపక్కున పట్టేస్తుంది! అప్పటికీ వ్యర్ధప్రయత్నం చేశాను టాపిక్కు మారుద్దామని, అబ్బే వాళ్ళా మార్చేది? అయిపోయింది నేనూ నా “దాపరికాలూనూ”.
ఆమాత్రం సూదిమొనంత జాగా ఇస్తే వదులుతుందా మా ఇంటావిడ? ప్రొద్దుటే లేవగానే సుప్రభాతం “ఏమండీ ఆ జాయింటు వ్యవహారమేదో చూడకూడదూ, ఎటొచ్చి ఎటొస్తుందో ఏమిటోనూ, అన్ని బావున్నప్పుడే చూసేస్తే బావుంటుంది కదా etc..etc...”

   ఇంక తప్పెదేముందీ, అప్పటికీ ప్రయత్నించాను, బ్యాంకులో రష్ గా ఉంటుందీ, చాలా టైము పడుతుందీ, ఎప్పుడో సావకాశంగా చూద్దాం లే అంటూ!ఆవిడా వదిలేదీ, ఎప్పుడో బ్లాగులోకూడా పెట్టేస్తుంది, అప్రతిష్ట కూడానూ!ఓ ముహూర్తం చూసుకుని బయలుదేరాము. ప్రొద్దుటినుంచీ, ఓ నాలుగ్గంటలపాటు క్యూలో నిలబెడితే, ఈవిడకి తెలుస్తుందీ, మళ్ళీ ఇంకెప్పుడూ అడగదూ అనుకున్నాను.నాకంత అదృష్టం కూడానా? అంతకుముందు ఓసారి SBI కి వెళ్ళినప్పుడు, నేను వరంగాం లో పనిచేస్తున్నప్పుడు అక్కడి SBI లో పనిచేసిన,ఒకతను పలకరించాడు, సరే అతన్నే బోరుకొడదామూ, పైగా “భాభీ ( మా ఇంటావిడలెండి!) ఎలా ఉందీ వగైరా వగైరాలన్నీ అడిగి పుణ్యం కట్టుకున్నాడాయే. మీకూ తెలుసునుగా, ఈ SBI ల్లో, ఎవరో ఒకరు తెలిసినవాళ్ళు లేపోతే, ఎన్ని తిప్పలు పడాలో!

   ఇక్కడి మా SBI బ్రాంచ్ లో ఆఫీసర్ గా ఉన్నాడూ, తిన్నగా లోపలకి వెళ్ళిపోయాము.సెక్యూరిటీ వాడేమైనా గొడవపెట్టి పరువు తీస్తాడేమో అని భయమైనా లేకుండా!వెళ్ళగానే, చాయ్ కూడా ఇచ్చి, మా పనులన్నీ అంటే KYC, మా ఇంటావిడ ఎకౌంటు యాక్టివేట్ చేయడం, నా పెన్షన్ ఎకౌంటు జాయింటు చేయడం, ఎప్పుడో వేసిన ఫిక్సెడ్ డిపాజిట్ రెన్యూ చేసి,పైగా దాన్ని కూడా జాయింటు చేయించి మరీ. ఏమిటో రోజులు బాగోపోతే ఇలాగే జరుగుతూ ఉంటాయి! పైగా ఆ పెన్షన్ ఎకౌంటు జాయింటు చేయడానికి, అవేవో నాలుగైదు ఫారాలూ అతనే నింపాడు! నాకు నింపడానికి కష్టం అవుతుందని!నాకు దొరికేవాళ్ళూ ఇలాటోళ్ళే! అన్ని పనులూ చకచకా మని పూర్తిచేసి మళ్ళీ ఇంకోసారి చాయ్ తెప్పించి, పంపేశాడు!

   మరీ అన్ని పనులూ మానుకుని, మాకోసం అంత టైము వేస్టు చేశాడూ అని థాంక్స్ చెప్తే, తనంటాడూ ” బాస్ మేము వరంగాం లో ఉన్నప్పుడు, మా బ్యాంకు వాళ్ళందరికీ ఎప్పుడైనా క్యూలో నుంచునే అగత్యం ఉండేదా? ఆ రోజులు ఎప్పుడైనా మర్చిపోతామా?” అన్నాడు. ఏం లేదులెండి, ఆరోజుల్లో, మాకు ఓ కన్జ్యూమర్ సొసైటీ ఉండేది, దానికి నేను ఆనరరీ క్యాషియర్ గా పనిచేశాను. గ్యాస్సూ, రేషనూ అక్కడే ఇచ్చేవారు.ఎప్పుడు చూసినా ప్రతీదానికీ క్యూలే.నేను ప్రతీ రోజూ క్యాష్ జమా చేయడానికి బ్యాంకుకి వెళ్ళేవాడిని, అక్కడేమో ప్రతీవాడికీ, రేషన్ లో పంచదారో, సిలెండరో అవసరమైనప్పుడల్లా నాతో చెప్పేవారు. నా జేబులోంచేమైనా ఇవ్వాలా ఏమిటీ. మర్నాడు వాళ్ళు సొసైటీకి రానఖ్ఖర్లేకుండా, గుమ్మంలోకి వచ్చేసేవి! జస్ట్ నా పవర్ లో ఉన్నదేదో చేయడం. అదేం పేద్ద గొప్ప ఆబ్లిగేషననుకోలేదు నేను ఆ రోజుల్లో. మన చేతిలో ఉన్నదేదో, అవతలివాడికి ఉపకారం చేస్తే మనకి పోయేదేమీ లేదని నేనకునేవాడిని. బ్యాంకు వాళ్ళే కాదు, ఎవరికి ఎలాటి ఎమర్జెన్సీ వచ్చినా, ఓ ఫోను చేస్తే, నా చేతుల్లో ఉన్నంత చేసేవాడిని.అలాగని అప్పుడు అలా చేశానూ, ఇలా చేశానూ అని గొప్పలు చెప్పుకోలేదు. కానీ, ఎంత చిన్నదైనా ఎప్పుడో చేసిన ఇలాటి చిన్న చిన్న హెల్పులు, గుర్తెట్టుకోడం అవతలివాళ్ళ గొప్పతనం!

   చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడో ఒకప్పుడు మనం చేసిన ఇలాటివి, జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనకీ మంచిచేస్తాయి. ఏదో ఈవేళ SBI లో మా పని తొందరగా అయిందికదా, ఏదో గొప్ప పని చేసేశానూ అని కాదు చెప్పడం, అప్పుడప్పుడు ఇలాటి feel good occasions కూడా ఉంటూంటాయి.చిన్ని చిన్ని సంతోషాలు జస్ట్..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఏమైపోయాననుకుంటున్నారా గత ఆరు రోజులనుంచీ? ఏమీ అవలేదు, నా కంప్యూటరు కి “జ్వరం” వచ్చేసింది. ఇదిగో ఈవేళే “డాక్టరు” వచ్చి ఓ డోస్ వేసి వెళ్ళాడూ, మళ్ళీ ప్రారంభం! మనలో మనమాట, మీ అందరూ అనుకునుంటారు కదూ ” అమ్మయ్యా, ఈయన గొడవోటి వదిలిందీ.అబ్బ ఎంత refreshing గా ఉందో ఈ ఆర్రోజులూ” అని! అమ్మ! అంత సుళువుగా వదులుతానా నా బంధువుల్నీ?

   చెప్పాలంటే, నా కంప్యూటరుకి ఏమీ పేద్ద రోగం రాలేదు. ఓ దుర్ముహూర్తాన్నా, డెస్క్ టాప్ లో ఉన్నవన్నీ మాయం అయిపోయాయి. మేము ఎప్పుడూ ఉపయోగించే గూగుల్ క్రోం కూడా వెళ్ళిపోయింది. నేనేమైనా మీ అందరిలాగా expert నా ఏమిటీ, వాటన్నిటినీ సరిదిద్దుకోడానికి? IE ఒక్కటే కనిపించడం మొదలెట్టింది. దాంట్లో, నా యంత్రం.కాం తీసికుని పోనీ, రాద్దామంటే, దానిల్లుబంగారం గానూ, సరీగ్గా ఓచోటుండదే! ఏమిటో అంతా గందరగోళం అయిపోయింది. దానికి సాయం, గతవారం అంతా, మా కోడలు, ముంబై వెళ్ళడంతో
మాకు “ఇన్వర్టర్ డ్యూటీ” ( ఇది మా ఇంటావిడ పెట్టినపేరు!). కరెంటు పోవడంతో ఆటోమేటిక్ గా ఎలా లైట్లు వెలుగుతాయో, అలాగ, మా అబ్బాయో,కోడలో బయటకి వెళ్ళినప్పుడు, ఆటోమేటిక్ గా, మేమిద్దరమూ “సీన్” లోకొచ్చేస్తాము. పోనీ ఇదివరకులాగ, మేముండే ఇంటికి వచ్చి, నా తిప్పలేవో పడి, ఓ టపా రాద్దామనుకున్నా, మా కంప్యూటరు పడకేసేసింది.పోనీ, మా వాళ్ళ లాప్ టాప్పుల్లో ఏదో ప్రయత్నిద్దామా అంటే, నాకు కుదరదూ, పోనీ సాయంత్రం వేళల్లో, మా అబ్బాయి ఆఫీసు( లైబ్రరీ) కి వెళ్దామా, అక్కడ ఓ డెస్క్ టాప్ ఉందిలెండి, అనుకుంటే, రాత్రిళ్ళు కుక్కల్ని వదిలేస్తారూ, నాకా చచ్చే భయం! మరి ఇంకెక్కడినుండి వ్రాయనూ?ఇదండి వ్యవహారం!

   అయినా క్రిందటి వారమంతా బిజీ బిజీ. SBI కి వెళ్ళాము( వివరాలు ఇంకో టపాలో), నేను ఓ మిస్టరీ షాపింగోటి ( ESPRIT) చేశాను. గత 20 ఏళ్లుగా కలవని ఓ స్నేహితుడింటికి వెళ్ళాము ( జోక్ ఏమిటంటే, వాళ్ళు మా ఇంటికి వెనుక సొసైటీ లో ఉంటున్నారు!).నిన్న మా ఇంటావిడ పోలాల అమావాస్య పూజ చేసికుంది. ప్రసాదాలు, కొడుక్కీ, కూతురికీ ఇవ్వాలిగా, బయట హోరున వర్షం, అయినా వెళ్ళి ఆ పనేదో కానిచ్చాను! ఇంటావిడ దగ్గర సెహబాషీ సంపాదించాను. పైవారం లో ఇంకో మిస్టరీ షాపింగ్ చేయాలి. ఎల్లుండి వినాయకచవితీ, మనవడితో చేసికోవద్దూ?

   రేపటినుండీ మళ్ళీ ప్రారంభం, నాగోల !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–most critical decade..అనండి లేదా పుష్కరం అనండి..

    ఏమిటీ ఈవేళ ఏదైనా స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోని “most critical decade..అనండి లేదా పుష్కరం అనండి..” గురించేమైనా పాఠాలు చెప్తాడా ఈయనా అని ఊరికే ఖంగారు పడకండి! నాకు అలాటి జ్ఞానబోధలు చేసే అలవాటూ లేదూ, అంత జ్ఞానమూ లేదూ, ఓపికా లేదు. నేను చెప్పేది, సాదా సీదా ఓ ఆడపిల్ల మామూలు NTP conditions అంటే, పాతికేళ్ళో, మహా అయితే ఇంకో రెండేళ్ళకో, పెళ్ళి చేసికుని, 30 ఏళ్ళకి ఒకరో ఇద్దరో పిల్లల్ని కని, వాళ్ళని పెంచిపెద్దచేసే సందర్భంలో, తను, 30-40 సంవత్సరాల వయస్సులో పడే పాట్ల గురించి. నా టపాలు చదివేవారు చాలా మంది ఈ కోవకే చెందినవారైఉంటారనే ఉద్దేశ్యంతో వ్రాస్తూన్న టపా. ఇవన్నీ నా observations మాత్రమే. తప్పొప్పులు మీరే నిర్ణయించాలి. వేషాలు కానీ, ఈయనకేం తెలుస్తుందీ అని తీసిపారేస్తే, నేనేం చేయలేను! మీ ఇష్టం !

అప్పుడప్పుడే టీన్ ఏజ్ లో అడుగెడుతున్న కూతురికి, ప్రపంచం లో ” అమ్మ” అంత పరమ శత్రువింకోరుండరు. అసలు ఈ అమ్మ అనేది, నన్ను హింసించడానికే పుట్టుకొచ్చిందీ అనుకుంటారు.పదేళ్ళొచ్చేదాకా, కొంగుపట్టుకుని తిరిగే పిల్లకి, బయలాజికల్ ఛేంజెస్ వచ్చేసరికి, అమ్మ అంటే ” అల్లం ముక్క” అయిపోతుంది. నిజమే కదా, ప్రొద్దుటలేచింది మొదలు, స్కూలుకో కాలేజీకో వెళ్ళి తిరిగొచ్చేదాకా, పాపం ఆ తల్లికి ఈ పిల్లగురించే చింతంతా! బయట ఫ్రెండ్సేసుకునే డ్రెస్సులే బావుంటాయి, వాళ్ళు చదివే పుస్తకాలే నచ్చుతాయి. పైగా ఈ రోజుల్లో ఇంటర్ నెట్టులూ, అవీనూ.బయటివాళ్ళు తినే తిండేనచ్చుతుంది.ప్రతీ విషయంలోనూ అమ్మేదో అడుగుతుందీ, అన్నిటికీ జవాబు కావాలంటుంది. స్కూలునుండి రాగానే, స్కూల్లో ఏమేం జరిగేయో చెప్పాలి,ఫ్రెండ్సందరూ ఎలా ఉన్నారో చెప్పాలి, స్కూల్లో చెప్పేపాఠాల విషయం సరేసరి. ఇదేం చిత్రమమ్మా, అసలు నాకో వ్యక్తిత్వం అనేదుందా లేదా అని ఆ పిల్లా, నీమంచికోసమేనమ్మా అని ఆ తల్లీ కొట్టుకోని రోజుండదు. ఫ్రెండ్సందరూ చూశారని అదేదో సినిమాకెళ్ళాలంటుంది. ఇవికాకుండా స్కూలూ, హోంవర్కూ ఉండనే ఉంటాయి.ఇదంతా ఒకెత్తూ, ఇంకో పిల్లాడు కూడా ఉంటే ఇంక అడగఖ్ఖర్లేదు! వాడి గోల వాడిదీ.

వర్కింగ్ లేడీస్ అదీ, ఏ ఐటీ లోనో పనిచేసేవారైతే,వాళ్ళకి 24 గంటలూ సరిపోనే సరిపోవు. బయటివాళ్ళనుకుంటారూ, ఆవిడకేమండి బాబూ, హాయిగా వర్క్ ఫ్రం హోం, మాలాగ ప్రొద్దుటే తెమిలి, వంటచేసికుని, పిల్లల్ని స్కూలు బస్సులో ఎక్కించి, ఆదరాబాదరాగా వెళ్ళాలా ఏమిటీ అనుకుంటారు. వాళ్ళపనే హాయి ఒక విధంగా, ఆఫీసుకెళ్ళి ఓ కాబిన్ లో కూర్చుని వాళ్ళ పనేదో చూసుకుంటారు. టైముకి తిండేనా ఉంటుంది. ఈ కొంపనుండి పనిచేసే ప్రాణులు (కొం.ప. ప్రా) ల సంగతి ఘోరం. ఆ లాప్టాపు 24 గంటలూ ఓపెనయ్యే ఉండాలి. ఏ అమెరికాలోనో, స్వీడన్ లోనో ఇంకోచోటో ఉండేవాడికి అప్పుడే తెల్లారుతుంది, వాడిదేం పోయిందీ, లేడికి లేచిందే పొద్దూ అనుకుని ఓ వరసా వావీ లేకుండా మెయిల్స్ పంపుతూనే ఉంటాడు.ఇక్కడ ఈ అమ్మగారేమో పాపం ఏదో ఒకటి గొంతుకలో పడాలికదా,దానితో ఏ కాఫీయో చాయో తయారుచేసికోడానికి ఏ కిచెన్ లోకో వెళ్తుంది. ఇంతట్లో వాడేమో, ఈవిడ రెస్పాన్సివ్వడం లేదని, ఈవిడగారి పైవాడికి మెయిలోలేకఇంకోటో పంపెస్తాడు. అక్కణ్ణుంచి ఆయన ఫోన్లూ. కాఫీ చాయ్ గయా పానీమే ! పైగా ఈవిడ టైముకి అటెండవకపోతే ” ఆర్ యూ దేర్?” అంటూ సణుగుడూ. హాయిగా ఆఫీసునుంచే పనిచేసికుంటే బావుండేదీ అని ఈవిడనుకుంటుంది. ఓ టైమూ పాడూ ఉండదు ఈ కొం.ప.ప్రా లకి. కానీ ఇందులో ఉండే సౌకర్యాలు దీంట్లోనూ ఉన్నాయి. ఎప్పుడో బయటి దేశాలకెళ్ళవలసివచ్చినప్పుడు వస్తుంది అసలు గొడవంతా. పాపం అప్పుడే వయస్సులోకి వస్తున్న టీనేజ్ పిల్లని వదిలీ వెళ్ళలేదూ, అలాగనిఉద్యోగ భవిష్యత్తూ పాడిచేసికోలేదు.

ఇదంతా టీనేజ్ ఆడపిల్లలుండే తల్లుల కష్టాల పరంపర. ఇంక చిన్న స్కూలుకి వెళ్ళే పిల్ల ఒకర్తీ, ఇంకా క్రెచ్ కెళ్తున్న బాబూ ఉన్న వాళ్ళ కష్టాలింకో రకం. స్కూల్లో ఏమైనా హోం వర్కిచ్చారో లేదో, స్కూలునుండి రాగానే ఛస్తే చెప్పరు. ఏ రాత్రో సడెన్ గా గుర్తొస్తుంది.ఇంక ఆ తల్లి ఉరకలూ పరుగులూ చూస్తే, “పగవాళ్ళకైనా ఇలాటి కష్టాలు రాకూడదురా బాబూ” అనుకుంటాము! ఏం తింటారో తెలియదు, ఎప్పుడు తింటారో తెలియదు. వాళ్ళు ఏదో ఒకటితిని పడకెక్కేదాకా ఈ తల్లులకి నిద్రనేదుండదు.

ఏదో నానా తిప్పలూ పడి, మొత్తానికి ఓ పదేళ్ళో,పుష్కరమో ఏ అవాంతరమూ రాకుండా,గడపగలిగితే వీళ్ళ పెళ్ళిలయేదాకా కొంచం పరవా లేదు. కానీ ప్రతీ స్త్రీ, మామూలు గృహిణైనా (మా ఇంటావిడ లాటిది), ఇద్దరు పిల్లల వర్కింగు లేడీ ( మా అమ్మాయీ, కోడలూ, ఎందుకంటే పైన చెప్పిన వెరైటీలు- టీన్ ఏజ్ కూతురూ, ఏడేళ్ళ కొడుకూ,చిన్నస్కూలుకెళ్ళ్ కూతురూ, క్రెచ్ కెళ్ళే కొడుకూ–), వాళ్ళు పడే తిప్పలు డే ఇన్ డే ఔట్ చూస్తున్నాను. అదృష్టం కొద్దీ నాది అబ్జర్వర్ పాత్రే! పార్టిసిపెంటు పాత్రైతే వామ్మోయ్ !! హ్యాట్సాఫ్ టు ఆల్ వర్కింగ్ మదర్స్ !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అమ్మయ్య, ఓ గొడవొదిలింది….

    మనవాళ్ళు, ఇంగ్లాండులో మొత్తం నాలుగు టెస్టులూ శుభ్రంగా ,మళ్ళీ ఏ తేడా పాడా లేకుండా, హాయిగా ఓడిపోయి, ఓ ఉపకారం చేశారు! ఏదో 2-1,అయితే, మనమే మొదటి స్థానంలో ఉండేవారమట! పోన్లెండి అటువంటి ఇరకాటంలో పెట్టకుండా 4-0 తో ఓడిపోయి, మూడో స్థానానికి వచ్చేశారుట. ఉత్తినే మొదటి స్థానంలో ఉండుంటే దాన్ని కాపాడుకోడం మాటలా ఏమిటీ? మూడో స్థానమైతే కొంత టైమేనా ఉంటుంది, ఈ లోపులో జింబాబ్వేనో, బంగ్లాదేశ్ తోనో ఆడి ఓ నలుగైదు పాయింట్లు సంపాదించుకోవచ్చు.కదూ !

    ఇంక అనుకునేదే కదా. ప్రతీ చానెల్ లోనూ, ప్రతీ పేపరులోనూ, మన అతిరథమహారథులందరూ, వాళ్ళకు తోచిన సలహాలేవో ఇచ్చేస్తున్నారు. అదేదో Vision ఉండాలిట. మనకీ,మన బోర్డుకీ ఉన్న విజన్ డబ్బు ..డబ్బు..డబ్బు. అంతకంటే ఏమీ లేదు.To hell with the pride of the Nation. ఏమిటో పాతచింతకాయ ఖబుర్లండీ దేశం, దేశభక్తీ, దేశ గౌరవం అంతా thrash. ఎవడిక్కావాలీ, టెస్టుల్లో సరీగ్గా ఆడేమా లేదా అని, T-20 ఉంది, ODI ఉన్నాయి. ఎవడికి ఓపికండి బాబూ అయిదురోజులు ఆడ్డానికి? ఆ టెస్టులూ అవీ,గుప్తులకాలం నాటి మాటలు. ఇప్పుడంతా ఫటా ఫట్ !

   ఏదో ద్రవిడ్ లాటి పాతకాలం మనుషులు ఒకటీ అరా కనిపించడం మన అదృష్టం!అందుకే ఆ వెర్రిమనిషికి “కిసాన్ జాం” తప్ప ఇంకో యాడ్ ఉన్నట్టు కనిపించదు. పూర్ ఫెలో!ఇంకోడికేమో, అవేవో వందవందలెప్పుడు పూర్తవుతాయా, ఆ భారతరత్నేదో ఎప్పుడొస్తుందా అని చూడ్డం, ఏదో దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్న రాజకీయనాయకుల్లా, ఓ దొంగ మెడికల్ సర్టిఫికేట్టు తీసికుని, ఒకడొస్తాడు. పోనీ ఏమైనా ఉధ్ధరించాడా అంటే మొత్తం 33 రన్నులు! పైగా ప్రజలంటారూ, అతనికి మూడ్ వచ్చిందంటే ఎవరూ పట్టలేరూ, అందుకోసమని అలాటివాళ్ళని టీం లో ఉంచుకోవాలీ అని. మరా దిక్కుమాలిన మూడ్ ఎప్పుడొస్తుందిట?

   రేపెప్పుడో మళ్ళీ ODI ఆడతారు, ఆ గేమ్ములన్నీ దైవాధీనం సర్వీసులూ. ఏ రోజు ఎవడి అదృష్టం బావుంటే వాడు నెగ్గుతాడు. ఇంక నిన్న జరిగినవన్నీ మర్చిపోతాము. ఇంక ప్రతీ వాడూ see I said so… అనేవాడే. మన గ్రేట్ కామెంటేటర్లు శాస్తుర్లు, గవాస్కరుడూ, నిన్నంతా ఇంట్లో ఎవడో పోయినట్లు మొహం పెట్టి మాట్లాడారు. అదేమిటో ఇంకా శ్రీకాంత్ నుంచి ఏమీ వ్యాఖ్య రాలేదు. అతని పుణ్యమే కదా ఈ టీం!

   అసలు మనవాళ్ళకి ఫారిన్ కోచ్చీలని పెట్టడం ఎంత సంతోషమో కదా! గత కొన్నేళ్ళగా ఇంగ్లాండ్ ని కోచ్ చేసిన ఫ్లెచర్ నే పెట్టాలా, అదీ వాళ్ళతో ఆడే సీరీస్ లోనే? నాకో సందేహం- ఈ మధ్యన ఝాన్సీకీ రాణి సీరియల్ చూసిన ఎఫెక్టు లెండి– ఫ్లెచ్చరే మన వాళ్ళ ” కిటుకులు” అన్నీ, ఇంగ్లాండ్ వాళ్ళకి చెప్పేశాడేమో అని!It is quite possible ! నవ్వకండి! అక్కడికేదో కిటుకులున్నాయని కాదు, అసలు కిటుకు “డబ్బు”. టెస్టు నెగ్గినా డ్రా చేసినా ప్రతీవాడికీ ఓ కోటో రెండు కోట్లో ఇస్తామని చెప్పండి, ప్రతీవాడూ క్రెచెస్ పెట్టుకునైనా ఆడేస్తాడు !

    ఇంత గొడవవుతున్నా ESPN/STARSPORTS లో మళ్ళీ యాడ్లూ… just 30 Days, just 29 days… అంటూ. దేనికిట? మళ్ళీ అదేదో Champions Trophy ట.ఈ so called injured players అందరూ టింగురంగా అంటూ దానికి తయారవుతారు.. దాంట్లో డబ్బులొస్తాయిగా మరి.

    ఒకానొకప్పుడు West Indies, Australia నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నారంటే, పదేసేళ్ళున్నారు. మరి మన ప్రబుధ్ధులూ,రెండేళ్ళు జస్ట్ రెండేళ్ళు ! ఇలాగంటే, నాకు దేశభక్తిలేదూ,unpatriotic, treason అనొచ్చు. ఏం ఫరవాలేదు. ఆ ఆడేవాళ్ళకే లేనప్పుడు. మనకుంటే ఏమిటీ లేకపోతే ఏమిటీ? Australia లో వాళ్ళ స్థానం పడిపోయేటప్పటికి, Greg Chappel ని డిస్ మిస్ చేశారు. మరి మనవాళ్ళకి అంత ధైర్యం ఉందా? ఎన్నిగొడవలూ మనకీ, శ్రీకాంత్ కొడుకుని పైకి తీసుకురావాలి, ఇంకా తమిళనాడు వాళ్ళని పైకి తీసికురావాలి. అయినా ఆ శ్రీనివాసన్నో ఎవడో ఇంకా ఉన్నాడుగా, అతనే చూసుకుంటాడు. మనవాళ్ళకి మనవాళ్ళమీదే అంత నమ్మకం ఉంటే, దేశంలో క్రికెట్ కోచ్చీలకేం తక్కువా ఏమిటీ? అయినా సరే బయటివాళ్ళేకావాలి . ఏ క్రీడ తీసుకోండి అన్నిటిలోనూ బయటివాళ్ళే! Neighbour’s wife is always beautiful! ఇంక administration విషయానికొస్తే, ప్రతీ రాజకీయనాయకుడూ, ఏదో ఒక Sports Body కి అద్యక్షుడో, సింగినాదమో. అసలు వాళ్ళ పనేదో చేసికోక, వీళ్ళకెందుకండీ ఈ గొడవలన్నీ? For the simple reason– FUNDS.

   మన యాంటీ అవినీతి వాళ్ళకి ఈ దౌర్భాగ్యులు కనిపించడం లేదా? ఎప్పుడు చూసినా ప్రభుత్వోద్యోగులూ అంటూ ఘోష పెడతారే, అక్కడకి వీళ్లంతా మహానుభావులన్నట్లు!

   రాయాలంటే, కావలిసినంత రాయొచ్చు. ఉత్తి కంఠ శోష! వచ్చే నెలరోజుల్లోనూ మళ్ళీ Champions Trophy తమాషా ప్రారంభం అవుతుంది, మన ప్రజానీకం, గొర్రెలమందల్లా స్టేడియాలు నింపనూ నింపుతారు, మన ఆటగాళ్ళ యాడ్లూ చూడాలి, చానెళ్ళవాళ్ళకీ, పేపర్లవాటికీ కాలక్షేపం.

    ఎవరైనా పోతే ఏమంటాం, రేపటికి రెండూ… అని. అలాగే ఈవేళ నెంబర్ ఒన్ పొజిషన్ పోతే ఏమయిందిట రేపటికి రెండో రోజు!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పోస్టు మార్టాలూ ప్రీమార్టాలూ….

    పోస్టుమార్టాలని విన్నాము కానీ, ఆ రెండోది అదే ప్రీ మార్టం అనేది ఉపయోగిస్తారో లేదో తెలియదు. పోన్లెండి ఏదో ఒకటీ, ప్రీ అంటే ముందరా, పోస్ట్ అంటే తర్వాతా అని తెలుసునుగా, అది చాలు ! ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడైనా ఓ యాక్సిడెంటులాటిది జరిగిందనుకోండి, ప్రతీవాడూ చెప్పేవాడే- అలా చేయకుండా ఉండవలసిందండీ, కొద్దిగా జాగ్రత్త తీసికుంటే బావుండేదిగా, ఏమిటో ఈ రోజుల్లో ఇంకోళ్ళ మాటవినే శ్రధ్ధా, ఓపికా ఎవరికుంటుందీ, ఎవరికి వాళ్ళు వాళ్ళంత తెలివైనవాళ్ళు ప్రపంచంలో ఇంకెవరూ లేరనుకుంటారు. అసలు రోజులే మారిపోయాయి, మారోజుల్లోఅయితేనా….. blah..blaah..blaaah..” అంటూ ఇంకోళ్ళెవరో వాళ్ళని ఆపేదాకా జ్ఞానబోధ చేస్తూనే ఉంటారు. మనకి వినడానికి ఓపికుండాలి.

“జ్ఞానబోధ” చేయడమంత సుళువైన ఉచిత వ్యాపంగం ఇంకోటి లేదు . అదేం ఖర్మమో ఇలాటివాళ్ళ దృష్టికి ఎప్పుడూ అవతలివాళ్ళ తప్పులే కనబడతాయి.అక్కడకి వాళ్ళెప్పుడూ జీవితంలో తప్పులుచేయనట్లే. వాళ్ళు చేసేదే రైటయిన పధ్ధతీ, అంతవరకూ బాగానే ఉంటుంది, కానీ అవతలివాళ్ళందరూ వెర్రివెధవలయినట్లు మాట్లాడతారే అప్పుడూ చిర్రెత్తుకొచ్చేది! ఈ జ్ఞానబోధానందులకి ఈ సంగతి ఎప్పుడూ తట్టనైనా తట్టదు. అది మన ప్రారబ్దం. అనుభవించాలి ఏం చేస్తాం? ఓపికుంటే వినడం, లేకపోతే, మళ్ళీ వాళ్ళ మొహం చూడకుండా ఓ దండం పెట్టి ఊరుకోవడం.

ఏదో బస్సులో వెళ్తున్నామనుకోండి, బస్సునిండా జనం, చేతిలో ఓ సంచీ, మరీ స్పీడుగా వెళ్ళే బస్సులో, చేతులొదిలేసి నుంచోలేముగా, వయస్సులో చిన్నవాళ్ళైతే ఓ చేత్తో పైనున్న బారు ని పట్టుకుంటారు. నాలాటివాడైతే, చేతిలో ఉన్న సంచీని, భుజానికి తగిల్చేసి, రెండు చేతులతోనూ వేళ్ళాడతాడు. ఇంతలో జేబులు కొట్టడమే హాబీ గా పెట్టుకున్నవాడు కాస్తా మన ప్యాంటు జేబులో ఉన్నదేదో లాగించేస్తాడు.అదో ట్రైనైనా అంతే. బస్సు దిగి నెత్తిన గుడ్డేసికుని కొంపకు చేరతాము. ఎక్కడనుండొస్తాడో మన జ్ఞానబోధానందుడు, ” అదేమిటి మాస్టారూ, మరీ అంత అజాగ్రత్తేమిటీ, వెనక జేబులో ఎవడో చెయ్యిపెడితే అసలు మీకు తెలియనేలేదంటే నమ్మేలా ఉందా” అనీ, ఆ విక్టిం కొద్దైగా వయస్సులో చిన్నవాడూ, అదీ తన కొడుకో ఎవడో అయ్యేడా, ఇంక వాడి పనైపోయిందే “ వెధవ్వేషాలు కాపోతే, అంత స్పర్శజ్ఞానం కూడా లేకుండాపోయేవన్నమాట. బస్సుల్లో ఓ ఆడపిల్ల కనిపించేసరికి ఒళ్ళు తెలియదు.
డబ్బు విలువ మీకేం తెలుస్తుంది, బయటకు వెళ్ళి ఓ రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడాలో.( standard dialogues
)… వగైరా..” ఆ పిల్లాడు ఏ సమాధానమూ చెప్పకుండా ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతాడు, ఇంతలా అరుస్తూంటే ముంగిలా కూర్చుంటావేమిటీ, ఆ బస్సులో అంత రష్ అయితే, ఇంకో బస్సులో తగలడొచ్చుగా. టైముకి కొంపకు రాకపోతే ఢాం ఢూం అనేదీ ఈయనే ! అదివేరే విషయం!

ఆతావేతా చెప్పేదేమిటంటే, ప్రతీ రోజూ అదో exercise లాగ ఎవరినో ఒకరిని తిట్టడం. లేకపోతే ఆయనకు తిన్నదరగదు.అదీ విషయం.ఏ రోడ్డు దాటుతోనో, ఏ బస్సుకిందో,స్కూటరు కిందో పడి, ప్రాణం పోతే గొడవే లేదు, కానీ ఏ దెబ్బలో తగిలి బ్రతికి బయటపడ్డామా అంతే సంగతులు. గవర్నమెంటోళ్ళు చూడండి, ఎక్కడ ఏది జరిగినా, ఓ కమెటీ వేసేస్తారు. వాళ్ళకి ఓ ఏడాదో రెండేళ్ళో టైమిచ్చి ఓ రిపోర్టిమ్మంటారు. ఈ రిపోర్టిచ్చేలోపల అలాటివి జరిగితే మన ఖర్మ! ఏదో ఇమ్మన్నారుకదా అని ఆ కమెటీ వాళ్ళుకూడా ( ఇంకేమీ పనుండదుగా!) ఓ రిపోర్టిస్తారు. దానికీ ఓ పెద్ద కార్యక్రమమూ, పబ్లిసిటీ, ఫొటోలూ గట్రా ఉంటాయి. అలాటి రిపోర్టులు కొన్ని లక్షల్లో బూజు పట్టి ఉంటాయి ఏ విభాగంలొనైనా సరే.

అప్పుడెప్పుడో, మొరార్జీ దేశాయి గారి ఆధ్వర్యంలో ఓ Administrative Reforms Committee అని వేశారు. ఆ తరువాతకూడా అలాటి కమెటీలు వచ్చాయి. ఆ రిపోర్టులంటూ అమలు పరిస్తే అసలు ఈ అన్నా హజారేలూ, యాంటీ అవినీతీ గొడవే ఉండేది కాదూ అని ఇప్పుడంటున్నారు. మొరార్జీ గారినుండి ఇప్పటిదాకా ఓ డజను పార్టీల ప్రభుత్వాలొచ్చాయి, వీళ్ళందరికీ తెలియదా ఈ విషయం? అదండి ఈ పోస్ట్మార్టాల విషయం.

ఇంక ప్రీ మార్టాల విషయానికొస్తే, కొందరుంటారు మా ఇంటావిడ లాటివాళ్ళు, ప్రతీ సందర్భంలోనూ ఏదో సలహా చెప్తూనే ఉంటుంది పాపం. చెప్పిన ప్రతీసారీ, నేనే, “ఊరుకుందూ, ఎవేవో ఊహించేసికుని నీ బుర్ర పగలకొట్టుకుని, నా బుర్ర తినేస్తూంటావు” అని కొట్టిపారేస్తూంటాను. పాపం తను చెప్పేవి, మన క్షేమంగురించే అని ఓసారి అనుకుంటే నాదేం పోయిందీ.అబ్బే అలా చేస్తే మన గొప్పేమిటీ?

ప్రతీ విషయంలోనూ ఈ పోస్ట్మార్టాలూ, ప్రీమార్టాలూ ఉంటూనే ఉంటాయి. Life goes on.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్

   ప్రొద్దుటినుండీ ఇంట్లోనే ఉండిపోయాము.టి.వీ. చూద్దామా అంటే ఒకటే విషయంగా, దానిమీద అంత పెద్ద ఆసక్తేమీ లేదు. పోనీ సరదాగా క్రికెట్ టెస్ట్ చూద్దామా అంటే, దాంట్లోనూ మనవాళ్ళేమీ పొడిచేయలేదు. మొత్తానికి 300 దాకా చేరారు. ఎక్కడక్కడే సంతోష పడాలి లెండి.

    ఇంకేం చేద్దామా అనుకున్నంతలో, మా ఇంటావిడ, రిమోట్ తో అన్ని చానెళ్ళూ వెదుకుతూ నన్నూ పిలిచింది. కారణం మరేమీ లేదు- భేజా ఫ్రై లో నటించిన వినయ్ పాథక్ నటించిన సినిమా ఒకటొస్తోంది. సినిమా పేరు–CHALO DILLI— అందులో నటించినవారు, లారాదత్తా, వినయ్ పాఠక్ . చాలామంది భేజాఫ్రై చూసేఉంటారు, అందులో వినయ్ పాథక్ నటన చూసి, ఆనందించనివారు బహుశా బహు తక్కువమంది అని నా అభిప్రాయం. నిజంగా మన బుర్ర తినేస్తాడు!

   ఈ సినిమాలోనూ అదే రంధి. కథాక్రమం ఏమిటయ్యా అంటే, లారా దత్తా ముంబైలో ఓ పేద్ద బ్యాంకు పెద్ద పొజిషన్ లో పనిచేస్తూంటుంది. వినయ్ ఢిల్లీ లో ఓ వస్త్రవ్యాపారి.లారా తన భర్తని కలుసుకోడానికి ఢిల్లీ బయలుదేరి, ప్లేన్ తప్పిపోవడంతో, విధివశాత్తూ వినయ్ పాఠక్ పాలిట పడుతుంది. ఇంక చూసుకోండి, రెండు గంటల్లో ముంబైనుంచి ఢిల్లీ వెళ్ళగలననుకున్న లారా, వినయ్ తో పడే పాట్లు! ముంబైనుండి, జయపూర్ అక్కడినుంచి ఏమైతేనేం ఢిల్లీ ! లారా ఏమో మితభాషీ, వినయ్ ఏమో ఎప్పుడూ ఏదొ ఒకటి మాట్లాడుతూనేఉంటాడు. పైగా తనుచెప్పేది ప్రతీదీ సరిగ్గానే మాట్లాడుతాడు.

   దారిపొడుగునా వీళ్ళిద్దరికీ ఎదురయ్యే అనుభవాలే ఈ కథ. క్లైమాక్స్ మాత్రం వదలొద్దు. ఇంక నటనా కౌసల్యానికొస్తే, వినయ్ పాథక్ సూపర్ ! ఢిల్లీవాలాల హావభావాలూ, మాటతీరూ అతనిలా ఇంకెవరూ చేయలేరేమో? ఈ సినిమా చూసిన తరువాత Bheja Fry నథింగనిపించింది. ఒక్కసారి తప్పకుండా చూడవలసిన సినిమా .లారాదత్తా నటన కూడా బావుంది.అవడం ఢిల్లీ లాటి మహానగర వాసులైనా, వారి ప్రవర్తనలో అదో టిపికల్ కల్చర్ ఉంటుంది. అలాగే ముంబైవాసులు చాలా సాఫిస్టికేటెడ్ అనుకుంటారు. సినిమా అంతా ఈ రెండుమహానగరాల కల్చర్ గురించే !

   మధ్యమద్యలో మనవాళ్ళు ఓవల్ లో ఏం వెలగబెట్టేస్తున్నారో అని చూస్తూ, హిందీ సినిమా పూర్తయిన తరువాత మరాఠీ చానెళ్ళలోకి వెళ్తే అక్కడ ఈ టీవీ మరాఠీలో ఓ సినిమా వస్తోంది — KAS–అని.ఇదికూడా చాలా బావుంది. ఓ బ్యాంకులో పనిచేసే ఆవిడమీద డబ్బు గోల్ మాల్ చేసిందని ఓ అభియోగం వస్తుంది. బ్యాంకు మేనేజరంటాడూ, నేరం ఒప్పేసికుంటూ ఓ కాగితం వ్రాసిచ్చేస్తే, కేసుండదూ అని. ఆమె భర్త కూడా అలాగే చెప్తాడు. కానీ తను నిర్దోషిననీ, ఆత్మగౌరవం కాపాడుకునేందుకు జైలుకి కూడా వెళ్తుంది. ఆవిడకి బెయిల్ ఇవ్వడానికి కూడా భర్త రాకపోతే, తనని ఇదివరకు ప్రేమించిన ఒకతను ఈమె రెస్క్యూకి వచ్చి బెయిలిప్పిస్తాడు. ఆ విషయం భర్తకి నచ్చదు. బెయిలిప్పించిన తరువాతకూడా, కేసు మాఫీ చేయడానికి ఓ డాక్యుమెంటుమీద సంతకం పెడితే చాలంటాడు భర్త. కానీ ఆమె దానికి ఒప్పుకోక, తన తండ్రి ( రిటైర్డ్ జడ్జ్) వ్రాసిన ఓ డైరీ కారణంగా, తన నిర్దోషిత్వం నిరూపించుకుంటుంది. ఆ భర్త , తనన్న మాటలు మర్చిపోమనీ, తనతో సంసారం చేయమనీ అడుగుతాడు ,కానీ ఆమె ఇతని ప్రవర్తనతో విసిగిపోయి, అతన్ని వదిలి వెళ్ళిపోతుంది.
సినిమా లో నాయిక నటన చాలా బావుంది.

    హాయిగా రెండు మంచి సినిమాలు చూడకలిగాము. విడిగా ఉండడం వలన వచ్చే సౌకర్యం ఇదోటి !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–We eat లంచం,We breathe లంచం,We live లంచం….

    పుట్టినప్పటినుంచీ ఏదో ఒక లంచానికి అలవాటుపడ్డవాడే ప్రతీ వాడూనూ. మళ్ళీ ,ఏదో కొత్తగా కనిపెట్టినట్లు ఈ గొడవేమిటీ అసలు? ఆ ఆదం ఆపిల్ పండు లంచం ఇవ్వడంతో ప్రారంభమయింది ఈ సృష్టి. జీవితాంతం ఆ లంచంతోనే బ్రతకాలి. ఎక్కడ లేదూ లంచం? పెళ్ళానికి లంచం ఇవ్వకపోతే, అసలు దగ్గరకేరానీయదు,ఇంక సృష్టెక్కడ?ఓసారి కోప్పడి చూడండి, ఏదో కారణం చెప్పి, ఈవేళ ఏమిటో మూడ్ బాలేదండీ, అంటుంది. ఆ మూడ్ బాగుచేయడానికి ప్రతీ భర్తా ఏదో ఒక టైపు లంచం ఇచ్చికున్నవాడే!

    చిన్నపిల్లాడు ఊరికే ఏడుస్తూంటే, ఓసారి ఎత్తుకుంటే కానీ ఏడుపు మానడు. అలాగే బువ్వ తినరా అంటే, ఇంకోటేదో కావాలని పేచీ, ముందర బుధ్ధిగా తినేస్తే తరువాత తాయిలం పెడతానని, అమ్మ ఆ పిల్లాడికి లంచం ఇచ్చుకోవాలి!అంతదాకా ఎందుకూ, పిల్లలు బాగా చదివి పై చదువులకి వెళ్తే, ఓ వాచీయో, ఓ బైక్కో కొనిపెడతాననే తల్లితండ్రులు ఎంతమందిని చూడలేదు? కాలక్రమేణా అవి సెల్లుల్లోకీ, ఐపాడ్లలోకీ వచ్చాయి. ప్రిన్సిపుల్ ఒకటే లంచం.పిల్లో పిల్లాడో ఎవరో అమ్మాయినో అబ్బాయినో ప్రేమిస్తున్నానూ అనగానే, కాదంటే ఏం కొంప ముంచుతాడో అని భయపడి, వాళ్ళడిగినట్లు చేయడం కూడా ఈ కోవలోదే.

   గవర్నమెంటు ఆఫీసుల్లో చూస్తూంటాము, ఎవడో కక్కూర్తి పడి దక్షిణ అడిగినవాళ్ళే బయట పడతారు కానీ, ఆ ఆఫీసు హెడ్డు ఇచ్చే లంచాలు బయట పడవు. ఉదాహరణకి అక్కడ ఓ ఫలానా యూనియన్ పవర్ఫుల్ గా ఉందనుకోండి, వాళ్ళేం చేసినా ఊరుకోమని ప్రతీ డిపార్ట్మెంటు కీ subtle గా instructions వెళ్తాయి, dont be harsh, be diplomatic అని! దీన్నేమంటారు? ఎవడితో గొడవెట్టుకుంటే ఏం గోలో అని, నోరుమూసుకుని, వాళ్ళేం వెధవ్వేషాలేసినా భరించాలి. బహుశా ఇందువల్లే కాబోలు, బ్యాంకులో ఆఫీసర్లకంటే, క్లాస్ ఫోర్ వాళ్ళు పవర్ఫుల్ గా కనిపిస్తారు.ఇదీ ఓ రకమైన లంచమేగా? నా నలభై ఏళ్ళ సర్వీసులోనూ ఇలాటివి ఎన్నో చూశాను.ప్రతీదానికీ డెప్యుటేషనే ( గవర్నమెంట్ ఖర్చు మీద).

    అంతదాకా ఎందుకూ, మన దేముళ్ళేమైనా తక్కువ తిన్నారా? ఫలానా పరీక్ష పాసౌతే గుండు కొట్టించుకుంటానూ, ఫలానా రోగం బాగైతే నిలువు దోపిడీ ఇస్తానూ, ఫలానా లాటరీ తగిల్తే ఫలానా పెర్సెంటు హుండీలో వేస్తానూ, మరివన్నీ ఏమిటీ? చివరాఖరికి ఆ భగవంతుడు కూడా, తృణమో పణమో సమర్పించుకోపోతే, పని చేయడం లేదు. దీన్ని మొక్కుబడి అంటారూ, లంచం కాదూ అనొచ్చు. కానీ ఇదికూడా లంచం డెఫినిషన్ పరిధిలోకే వస్తుంది.( Gift or money given, to persuade him to make a favourable decision).

    ఇంక మన పాత్రికేయులూ, మీడియా వాళ్ళూ తక్కువ తిన్నారేమిటీ? ప్రభుత్వం వారు వీళ్ళని గుడ్ బుక్స్ లో పెట్టుకోడానికీ, మంచి ఇమేజ్ బిల్డప్ చేసికోడానికీ, జర్నలిస్టులకి కొంపలు కట్టుకోడానికి స్థలాలూ, ఎప్పుడైనా విదేశాలకెళ్ళినప్పుడు వాళ్ళ టీం లో రావడానికీ అన్ని ఖర్చులూ భరిస్తారు. ఓ ప్రెస్ మీట్ పెడితే, అక్కడకి వచ్చే విలేఖరులకి జరిగే మర్యాదలకి అంతే ఉండదు. ఏదైనా తక్కువయిందా, మర్నాడు పేపర్లలో ఏకేస్తారని భయం!
వీళ్ళిచ్చే ఆమ్యామ్యాలకి , for maintaining goodwill అనో పేరోటీ! వెధవ్వేషాలేం కాదూ. ఇన్నాళ్ళనుంచీ మీడియాల్లో రాస్తున్నవాళ్ళందరూ గుండెల మీద చెయ్యేసికుని చెప్పగలరా, తాము ఎప్పుడూ ఇలాటి ప్రలోభాల్లో పడలేదని? అవన్నీ గుడ్ విల్లులూ, మిగిలినవన్నీ లంచాలా? అంతదాకా ఎందుకూ, పండగలకీ పబ్బాలకీ, ప్రతీ ఆఫిసులోనూ చూస్తూంటాము, జనవరి ఒకటికి డైరీలూ, క్యాలెండర్లూ, దీపావళికో, దసరా కో స్వీట్ బాక్సులూనూ.ఇవేమిటిట మరి, బువ్వాలాటల్లో తాయిలాలా?

   లంచం ఇచ్చినా తప్పే, పుచ్చుకున్నా తప్పే, ఇంకోళ్ళు పుచ్చుకుంటూంటే చూస్తూ ఊరుకున్నా తప్పే అంటారు కదా, మరి ఈ పెద్దమనుష్యులు, అదేనండీ సో కాల్డ్ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరూ జీవితంలో అసలు తప్పే చేయలేదంటారా? పైగా అలా అంటే, ఏమో చేసే ఉంటాం, అయినా సుధారవడం కూడా తప్పేనామ్మా అని ఓ కౌంటరోటీ? Have a heart. Dont be a hypocrite.

   అలాగని బతికున్నంతకాలమూ, లంచాలిస్తూనే బతకాలని కాదు. ఈ పరిస్థితి మారాలి, తప్పకుండా మారే తీరాలి, కానీ one has to accept facts. ఏ గవర్నమెంటాఫీసులోనైనా, ఓ పని చేయించుకోవాలనుకోండి, అక్కడి పెద్దాయనేదో తెలిసినవాడూ, మనకేమిటీ అనుకుంటే సరిపోదు, ఒకసారైతే సరిపోతుంది, ఆ తెలిసినాయన కాస్తా రిటైరయ్యో, ట్రాన్స్ఫరయ్యో వెళ్ళిపోతే, అక్కడుండే ప్యూన్నో, గుమాస్తాయే గతి. అప్పుడు తెలుస్తుంది, అసలు సంగతి!

   ఈవేళ ఓ పేపర్లో చదివాను- అన్నా హజారే గారి పెర్సనల్ ఫిజీషియన్ అంటారూ, అన్నా తొమ్మిది రోజులపాటు, నిక్షేపంగా నిరాహార దీక్ష చేసికోవచ్చుట. ఆయన ఆరోగ్యానికొచ్చిన ధోకా ఏమీ లేదుట!
I am not trying to dilute the seriousness of the mood of the Nation. Janalokpal is not the solution.

%d bloggers like this: