బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–వడ్డించేవాళ్ళుంటేనే….

మన చిన్నప్పుడు గుర్తుందా, స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ ఎవైనా  Annual Day Function  జరిగినప్పుడు, ఏ పెద్దమనిషినో  ముఖ్యఅతిథిగా పిలవడం ఆనవాయితీ.. ప్రైజులు కూడా ఆయనెచేతిమీదుగానే ఇవ్వబడేవి…  అదేం చిత్రమో, ఆటల్లోనూ,  academics  లోనూ ఏ ఇద్దరికో ముగ్గురికో అన్ని ప్రైజులూ వచ్చేసేవి… ఆరోజుల్లో సినిమాల్లో చూపించేవారు– సాధారణంగా సినిమా హీరోకే ఇలాటి సౌలభ్యాలుండేవి..  ముఖ్యఅతిథి , ఆ హీరో భుజం తడుతూ.. ” జీవితంలో నువ్వు బాగా పైకి వస్తావు, ఏ సహాయం కావాల్సినా నేనున్నానని మరిచిపోకు..  blah..blah..”  అంటూ ఏవేవో చెప్పేవారు.. ఓ నాలుగు రీళ్ళ తరవాత , ఈ హీరో ఆ ముఖ్యఅతిథి ఇంటికి వెళ్ళినా గూర్ఖా ఇంట్లోకి వెళ్ళనిచ్చేవాడు కాదు. .. నేపథ్యంలో ఓ పాటుండేది  symbolic  గా…

అవన్నీ పాతరోజులు.. రోజులు మారినా,   talent  గుర్తింపబడకపోవడం మాత్రం ఏమీ మారలేదు. బయటి దేశాల్లో చైనా,  East European Countries  లోనూ అయితే, ఆటల్లో ఎవరైనా ప్రతిభ   చూపిస్తే, ప్రభుత్వమే ఆ పిల్ల్లల ఆలనా పాలనా చూసుకుని, ఆ బిడ్డ తల్లితండ్రులకీ, దేశానికీ కూడా గౌరవం కలిగేటట్టు చూస్తారు. బహుశా అందుకేనేమో, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో, బయటి దేశాలవారికే అన్నన్ని పతకాలు వస్తాయి. ఇలాటి పోటీలు జరిగినప్పుడల్లా  మన నాయకులూ, పాలకులూ ఓసారి గుండెలు బాదేసుకుంటారు. మనదేశంలో క్రీడలకి ప్రోత్సాహంలేదూ, 100 కోట్ల జనాభా అయితే ఉంది కానీ, ఒక్కడూ అంతర్జాతీయ స్థాయిలో లేడూ.. అంటూ.. అసలంటూ, ప్రభుత్వాలు మన  యువక్రీడాకారుల ప్రతిభ గుర్తించి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు కదా..  especially  మన తెలుగురాష్ట్రాల్లో, ఏ తెలుగువాడైనా, ఆఖరికి తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న పరాయి రాష్ట్రాలవారైనా సరే, ఒక్కసారి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించడం చాలు, ఎగేసుకుంటూ పోతారు.. ” ఫలానా వాడు మనోడే.. ” అంటూ.. మన మాజీ ముఖ్యమంత్రిగారైతే, ఏ తెలుగువాడు పైకొచ్చినా ఆ ఘనంతంతా తనదే అనేవాడు– సత్య నాదెళ్ళ నుండి, సింధు వరకూ..  కానీ  ఆ తేజాలు శ్రమపడుతున్నప్పుడు ఏమైనా ప్రోత్సాహం ఇచ్చేరా అంటే అదీ లేదూ.. ఒక ముఖ్యమంత్రిగారు ఏకంగా ఓ క్రీడాకారిణిని  Brand Ambassador  ఛేశేసారు. ఎప్పుడూ, ఆమె ఖ్యాతి సంపాదించిన తరువాత..

 ఈ కంఠశోషంతా ఎందుకూ అంటే, మన తెలుగురాష్ట్రాల్లోనే, ఒక  యువతేజం   SNEHIT ,  అంతర్జాతీయ క్రీడలో  World No 24   స్థానం సంపాదించాడు– ఏ నాయుడుగారూ చెప్పడం వలన కాదు.. తన తల్లితండ్రుల ప్రొత్సాహం, తన కఠోర శ్రమ వలనానూ…. తను చేసిన పాపం ఏమిటంటే, జనాలందరూ ఎగబడి చూస్తారే .. అలాటి  Cricket  కాకపోవడం.. లేకపోతే ఈపాటికి ఏ  Sports Company వాడో, sponsor  చేసేవాడు.వెర్రి పిల్లాడు.. తను ఈ స్థాయికి వచ్చింది  Table Tennis  లో..  దిక్కుమాలిన కోడిపందాలకే కోటానుకోట్లు  చేతులు మారడం చూసాము.. లక్షలకోట్లు  IPL  అనే  క్రికెట్ తమాషా లో చూసాము,  Match fixing  లు అవుతున్నాసరే…. కానీ  delicate touch  తో ఆడే, ఈ  Table Tennis  గురించిమాత్రం ఎవడూ పట్టించుకోడు..మన రాష్ట్రాల్లో కుల , మత ప్రాతిపదికలమీదే ప్రభుత్వ ప్రోత్సాహాలు లభిస్తాయన్నది కఠోర సత్యం…  అదీ కాకపోతే  Prominent position  లో మనకు తెలిసినవాడైనా ఉండాలి… ఇవేమీ లేకపోతే, తల్లితండ్రులే ఆస్థులు అమ్ముకుని తమ పిల్లల భవిష్యత్తుకి బాటవేసుకోవాల్సిన దుస్థితి….

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు — నయనం ప్రధానం

సాధారణంగా, ఏదో రోజుమర్రా జిందగీలో, పగటిపూటా, రాత్రిళ్ళు లైటులోనూ ,  చూసి , వస్తువులనీ, మనుషులనీ గుర్తుపట్టగలిగితే, కంటి చూపు పరవాలేదనుకోచ్చు. ఓ వయసు దాటిన తరువాత, కొంచంకొంచం చూపు మందగిస్తూంటుంది.  అదేమీ ప్రాణాంతకం కాదు.. ఓ కళ్ళజోడు పెట్టుకుంటే పనైపోతుంది.. ఇదివరకటి రోజుల్లో ఆడపిల్లలకి పెళ్ళిముందర , కళ్ళజోడుంటే, పెళ్ళవదని భయపడేవారు.. ఇప్పుడైతే అందరికీ కళ్ళజోడు ఓ ఫాషనైపోయింది… 

నాగురించి చెప్పుకోవాలంటే, అదేం కర్మమో, ఎప్పుడూ  సరీగ్గా కనిపించేదేకాదు.కాలేజీలో బోర్డుమీద రాసింది ఛస్తే కనిపించేది కాదూ, పోనీ మొదటి బెంచీలో కూర్చుందామా, ఏదో కళ్ళు చిట్లించుకునైనా చూడొచ్చూ అనుకుంటే, మాస్టారు ఏవైనా ప్రశ్నలు వేస్తే… వామ్మోయ్, జవాబు చెప్పేటంత  I Q  ఉండేది కాదూ.. మొత్తానికి ఎలా పాసయానో ఆ భగవంతుడికే తెలుసు, ఉద్యోగంలో చేరిపోయాను. పూనా వచ్చిన తరువాత, ఉద్యోగంలో ప్రతీ ఏడాదీ ,  medical examination  అని ఒకటుండేది, ఏదో నాడి పట్టుకుని, గుండె ఆడుతోందో లేదో చూసి,   ఆ ఏడాదికి  fit  చేసేసేవారు.. సినిమాలకి వెళ్తే టైటిల్స్ కనిపించేవి కావూ..బస్సునెంబర్లైతే సరేసరి. అంతదాకా ఎందుకూ, పెళ్ళి సంబంధాల సందర్భంలో, దారిలో తణుకులో దిగాం, మా దొడ్డమ్మగారింట్లో, మేము అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే , ఓ ఇద్దరు ఆడవారొచ్చారు… ఏమో మా దొడ్డమ్మగారి చుట్టాలేమో అనుకున్నాను.  అంత పరీక్షగా చూద్దామనుకున్నా, అసలే  ఆరోజుల్లో ఇళ్ళల్లో , పూర్తిచికటి పడితేనేకానీ, లైట్లు వేసేవారు కాదాయే..  ఏదో నకూర్చున్న నావైపు ఓ  cursory glance   వెసేసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు..అమలాపురం వెళ్లినతరువాత, మా అమ్మమ్మగారు, తణుకులో చూసిన పిల్ల ఎలా ఉందిరా అని, అడిగితే ” ఏమో ఇద్దరిని చుసానూ.. బాగానే ఉన్నారూ..” అన్నాను. ఆవిడ, ” వెధవా, వచ్చింది తల్లీకూతుళ్ళు ..” అన్నారు.  ఎదో మర్నాడు, నేను చూసుకోబోయే బుల్లెమ్మ వచ్చింది, నాలుగైదడుగుల దూరంలో చూసానూ, కథ సుఖాంతం. మాకు అమ్మాయి పుట్టిన తరువాత, ఓసారి ఫాక్టరీ  Medical Examination  లో కళ్ళుకూడా టెస్ట్ చేయాలని, ఓ విపరీతబుధ్ధిపుట్టింది డాక్టరుగారికి..  నేనెమో ఆ  TEST BOARDS  మీదున్న ఇంగ్లీషు అక్షరాలు బట్టీపట్టేసి రెడీఅయిపోయాను.. ఆయనచేతులో పట్టుబడిపోయి, , ఉద్యోగం ఊడబోయి, మొత్తానికి కళ్ళకి అద్దాలొచ్చేసాయి.

మా ఇంటావిడకి ఈమధ్యన, అవేవో రోజూ పజిల్స్ తయారుచేస్తోందికదూ, కంటికి జోడున్నా, మసకమసగ్గా ఉంటున్నాయిట, అసలు విషయం అదికాదు,  ఇంట్లో ఎక్కడైనా బూజు పడితే, రాత్రిళ్ళే కనిపించేవి, sudden  గా అవికూడా అలాగే కనిపిస్తున్నాయిట. ఎక్కడైనా బూజుంటే ఈవిడకేమో నెద్ర పట్టదాయే… సరే ఈవిడకి  Software update  చేయిద్దామని, మా  CGHS  ద్వారా, అదేదో  Corporate Hospital కి వెళ్ళి టెస్టు చేయించుకుంటే, అదేదో  Cataract  అన్నారు, పైగా రెండుకళ్ళకీ.. సరేఅని  Surgery  కి ముహూర్తం పెట్టుకుని, ఇక్కడ  National Institute of Opthomology  కి వెళ్ళాము.. నేనూ , మా అమ్మాయీ తోడుగా…. నాకుతెలిసినంతవరకూ, కంటికి ఆపరేషనంటే,  ఏదో కంటికి ఓ పట్టీ, ఆ పట్టీ తిసేటప్పుడు, డాక్టరుగారూ, మెల్లిమెల్లిగా పట్టీతీస్తూ,, ఎవరినో ఎదురుగా నుంచోమని… clear  గా కనిపిస్తోందా అని అడుగుతూ… ఏవేవో అనుకున్నాము. మేము మాట్టాడుకుంటూంటే, తీసికెళ్ళిన పావుగంటలో, కళ్ళకి నల్లద్దాలు పెట్టుకుని, టింగురంగా మని వచ్చేసింది. అలాగే రెండో కంటికి కూడా, ఓ వారంరోజుల్లో  చేయించేసుకుని, రోజుకి మూడుపూటలా, అవేవో  drops  వేయించుకుంటూ, నల్ల కళ్ళద్దాలు అస్సలు తీయకుండా, (కరుణానిధిగారిలా).. , ఈ  రెండునెలలలోనూ, అమ్మాయి, కోడలూ సౌజన్యంతోనూ, మధ్యమధ్యలో  Zomato  ద్వారానూ… అప్పుడప్పుడు తను నిర్దేశించిన పాళ్ళలో నాచేతా,, ఎలాగోలాగ కాలక్షేపం చేసి, ఆ కాటరాక్ట్ యజ్ఞం  పూర్తయింది. ఇంకేముందీ..  ” నిన్న లేని అందాలేవో… ” అన్నట్టుగా ఈవిడకి, దూరంనుంచే, టీవీ,  ఫ్రిజ్ , టేబుల్ మీదా, మరకలే మరకలు కనిపించేస్తున్నాయి.. నేనేమో ఫ్ పాతగుడ్డా,  Colin  పట్టుకుని తుడవడం. 

మళ్ళీ వంటింటి సామ్రాజ్యంలోకి అడుగెట్టేసి, షడ్రసోపేతంగా వంట చేసేస్తోంది. పజిళ్ళూ తయారుచేసేస్తోంది…

 life goes on …

బాతాఖాని – లక్ష్మిఫణి కబుర్లు– Return of the native…

 ఏడాదైపోతోంది, బ్లాగులవైపు చూసి… అలాగని రాయడం మానేసానా అంటే అదీకాదూ… జస్ట్ బధ్ధకం..  ఈ ఏడాదిలోనూ   కొన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్రం లోనూ ఎన్నికలు జరిగాయి.. ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.. కేంద్రంలోనూ, తెలంగాణా లోనూ , పాతవారే తిరిగి ప్రభుత్వాలు ఏర్పాటు చేసారు, ఆంధ్రరాష్ట్రంలో, కొత్త ప్రభుత్వం..

 పాత పార్టీయే తిరిగి ఎన్నికైనప్పుడు ఓ పేద్ద  disadvantage  ఉంటుంది, పాతవాళ్ళని తిట్టడానికి వీలుండదు.. ఆ తిట్టడాలూ, తప్పులు పాతవారిమీదకి తోసేయడాలూ, వీళ్ళు వారి మొదటి అయిదేళ్ళలోనూ చేసేసారు. ఇప్పుడు ఏమైనా లోటుపాట్లుంటే, అదంతా గత అయిదేళ్ళలోనూ, వీళ్ళ నిర్వాకమే కదా.. సాధారణంగా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంటుంది, కారణం, తిరిగి అధికారంలోకి రావడానికి పాతప్రభుత్వం,  ఎడాపెడా, సంక్షేమ కార్యక్రమాల పేరిట, డబ్బు ఉదారంగా ఖర్చుపెట్టేస్తారు… ఖజానా ఖాళీగా ఉండడంతో , ఎన్నికలవాగ్దానాలు అమలు చేయడానికి డబ్బులుండవాయే.. దానితో ప్రతీదానిమీదా పన్నుల మోత మొదలూ.. మరో చిత్రం ఏమిటంటే, ఈ సంక్షేమపథకాలకి అర్హులు  Only BPL ( Below Poverty Line ).. వీళ్ళకిచ్చేదంతా మధ్యతరగతివారు కట్టే టాక్సుకే..  అందువలన ప్రభుత్వం వడ్డించే టాక్సులవలన ఆ  BPL  వాళ్ళకి వచ్చేనష్టం ఏమీ ఉండదు. ఎంత చెప్పినా మనది  Welfare State  కదా. 

 ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి– ఒకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే , కొన్ని లాభాలుకూడా ఉంటాయి. ఉదాహరణకి, మొదటి దఫా పాలనలో ప్రారంభించిన ప్రాజెక్టులకి ముక్తీ మోక్షం ఉంటాయి.. అలా కాకుండా కొత్తవాడొస్తే, as a matter of principle  పాతవాటిని ఆపేయడమో, మార్పులు చేయడమో చూస్తూంటాము.

 ఎన్నికల ప్రచారాల్లో పాపం ప్రతీ పార్టీ వాళ్ళూ, ఎదురుపార్టీమీద బురదజల్లడంలోనే బిజీ గా ఉంటూంటారు. నోటికొచ్చిందల్లా వాగి వీధినపడిపోతూంటారు.. ఈ ప్రసంగాల మీద పరువునష్టం కేసులూ గట్రా ఉండవు అదేం చిత్రమో… పైగా అవతలివాడేదో వాగేడని కూడా పట్టించుకోరు. అదో కాలక్షెపం..ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి … ఏదో  public consumption  కోసం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు కానీ, పాపం ఎన్నికలయిన తరువాత, ఒకళ్ళ వీపులు మరొకరు గోక్కుంటారు..  అసలు ఓ విషయమైతే ఛస్తే అర్ధం అవదు.. ఓ  particular  నాయకుడు, ఏవేవో అరాచకాలు చేసేడంటారు, మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలుసు.. అయినా సరే అధికారంలో ఉన్న అయిదేళ్ళూ వీళ్ళకి చీమకుట్టినట్టైనా ఉండదు.. ఏదో ప్రజల్ని ఊరుకోపెట్టడానికి ఏవేవో  Special Investigation Teams  వేసామంటారు. ఉత్తుత్తిదే…

ప్రపంచంలో మొత్తానికి  largest Democracy  మనదేనట.ఒకవైపు చూస్తే, కేంద్రం లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కూడా ఒకే పార్టీకి ఊహించని మెజారిటీ లభించింది… ప్రతిపక్షం అన్నది నామ మాత్రమే.. ఇదిమాత్రం అంత ఆరోగ్యకరంకాదు..  ఇలాటిది ఒక నిరంకుశపాలనకి దారితీయొచ్చు. రెండు పక్షాల బలాబలాలూ  మరీ సగంసగం కాకపోయినా, 60-40 అయినా ఉండుంటే బాగుండేది. మరీ 50-50 అయితే వచ్చేప్రాణం పోయేప్రాణంగా ఉంటుంది. అయినా ప్రతిపక్షాలకి( ఏ పార్టీ అయినా సరే ). 2004- 2014 వీళ్ళుచేసారూ, 2014-24 వాళ్ళు చేస్తారూ   అలవాటే కదా.. సెషన్ సజావుగా సాగనిస్తారా ఏమిటీ ? 

   ఇటుపైనుండి , తిరిగి రెగ్యులర్ గా పోస్టులు పెట్టడం ప్రారంభిస్తానని మనవి… కంగారు పడకండి, మరీ బోరుకొట్టేయను…