బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు– అంత ఖంగారేమిటి శంకరా…..

    ఈ శంకరెవరో తెలిసినవారా అంటే అదీ లేదు. మాకు అతనితో ఉన్న పరిచయం, నేను వ్రాసిన కోతి కొమ్మచ్చి టపా లో అతను పెట్టిన వ్యాఖ్యతో. ఓరోజు సడెన్ గా ఫోను చేసి, “గురువుగారూ, మీ పోస్టల్ ఎడ్రస్ ఇవ్వండీ..” అన్నారు, ఏమో పూణె వస్తున్నారేమో కలవ్వొచ్చూ అనుకున్నాను. అబ్బే మూడు రోజుల్లో ఓ కొరియర్ ద్వారా ఓ పుస్తకం వచ్చింది. బాపూ బొమ్మలకొలువు సందర్భంగా ప్రచురించిన souvenir. తరువాత్తరువాత ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి-3, ఈమధ్యన “రచన” సాయి గారు ప్రచురించిన శ్రీరమణ గారి “మిథునం”. మార్కెట్ లో రిలీజయిన మూడో రోజుకల్లా శంకర్ ధర్మమా అని, మా చేతుల్లో ప్రత్యక్షం ! ఏదో పుస్తకాలు పంపిస్తున్నాడు కదా అని కాదు, అసలు మాకూ అతనికీ ఏమిటీ అనుబంధం? ఇప్పటి దాకా అతనితో ఫోనుద్వారానూ, మెయిళ్ళద్వారానే పరిచయం. మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళి, ఫోను చేసినా, ఒకసారి కాకినాడలోనూ, ఇంకోసారి తిరుపతిలోనూ. ఒక్కసారికూడా మాకు అతన్ని కలిసే భాగ్యం కలుగలేదు. ఎప్పుడు ఫోను చేసినా, “కట్” చేసేయడం, మరు నిముషంలో తనే “కాల్” చేయడం. పోనీ నేను చేసినప్పుడు మాటాడొచ్చుగా అంటే, ” మీతో మాట్టాడ్డం నేను చేసికున్న అదృష్టం, మళ్ళీ మీకెందుకూ ఖర్చూ.. ” అనేవాడు ! అసలు ఈ మనిషిని మార్చడం ఎలాగా అనుకునేవాడిని. అప్పుడెప్పుడో ఒకరోజు ఫోను చేసి, “మీరు కాదండీ, లక్ష్మి గారిని పిలవండీ..” అన్నాడు. ఏమిటి నాయనా అంటే, ” మీకీ విషయాలు తెలియదులెండి, ఆవిణ్ణోసారి పిలవండి, ఆవిడా, నేనూ మాట్టాడుకుంటాము..”. సంగతేమిటా అంటే, ఏదో పదచంద్రిక పజిల్ లో సందేహం వచ్చిందిట, అడగాలనీ !!

    నేను online లో ఉండగా, మొన్న 23 వ తారీఖు సాయంత్రం chatting లోకి వచ్చాడు. విషయాలు యతాతథంగా ఇస్తున్నాను….

   SHANKAR: జూలై 27 కి హైద్ లోనే ఉండచ్చు నేను. తప్పకుండా కలుస్తా
5:28 PM
వరవిక్రయం, పాండవోద్యోగవిజయాలు, చింతామణి (కొన్ని సీన్స్), ఘంటసాల పద్యాలు ఒక నూట యాబై, ఘంటసాల ప్రైవేట్ సాంగ్స్ ఒక డెబ్భై సీడీలో పంపిద్దామని (డేటా డీవీడీ రాస్తే పరవాలేదా లేక MP3 డీవీడీగా పంపాలా అని అడిగేందుకు పింగ్ చేశా)

మొదటి మూడూ రేడియో నాటకాలు
5:29 PM
రచ్చ రచ్చ ఉన్నాయి. ఆకాశవాణి వాడివి

SHANKAR: ఒకే గురూజీ. దాంతో పాటూ ఇంకో సర్ప్రైజ్ కూడా పంపిస్తా :).

    మేము 27 వ తేదీన వస్తున్నామనీ, కలుద్దామనీ చెప్పానే, తప్పకుండా కలుస్తానని promise చేశాడే, ఆమాత్రం మంచీ, మర్యాదా లేకుండా, అలా వెళ్ళిపోవడమేమిటండీ? అసలు అంత ఖంగారేమిటీ? నిన్న online లో ఉండగా కృష్ణప్రియ ” ఈ న్యూసు విన్నారా, అంటూ, మా ఆత్మబంధువు శంకర్ ఇంక లేడండీ …” అనగానే కాళ్ళూ చేతులూ ఆడలెదు… ఏమిటో అంతా శూన్యం అయిపోయింది.. మా కుటుంబంలోని ఓ వ్యక్తిని చూడలేకపోయామే అని బాధ .ఏం వ్రాయాలో తెలియడం లేదు. ఎంత శ్రీ ముళ్ళపూడి వారితో కలిసి ఫొటోకి దిగినా, మరీ ఆయన్ని కలుసుకోడానికి ఇంత ఖంగారు పడాలా? అదీ శ్రీ వెంకటరమణ గారి పుట్టినరోజునా....

    ఈ విషాదసమయంలో చి.స్వాతికి సానుభూతి తెలియచేయడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయత….

    శంకర్ మన మధ్యలో లేకపోయినా, తను మనల్నందరినీ సంతోష పరచిన టపాలు ఇక్కడ చదవండి. టపాలద్వారా శంకర్ ఎప్పుడూ చిరంజీవే....

   అతని జ్ఞాపకార్ధంగా, తన స్వహస్తాలతో నా ఎడ్రసు వ్రాసిన కవరు గుండెల్లో దాచుకుంటాము…..

బాతాఖాని లక్ష్మిఫణి కబుర్లు— My goodness gracious me…..

    ఎవరికైనా ఎప్పుడైనా ఆశ్చర్యమో, ఆనందమో, భయమో కలిగినప్పుడు, మన భాషలో కాకుండా, ఇంగ్లీషులో వ్యక్తపరచడం ఓ ఫాషనూ. ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా ఉండేది ఈ జాడ్యం. ఎంత చెప్పినా ఇంగ్లీషోల్లని అనుకరించడం అలవాటైపోయింది. పైగా అదో స్టేటస్ సింబలోటీ. ఏమైనా అంటే, “అదేమిటో కానీయండి, ఇంగ్లీషులో చెప్తేనే అసలు మన ఫీలింగేమిటో అర్ధమవుతుందండీ, తెలుగులో అలాటి పదాలున్నాయేమో నాకైతే తెలియదూ...” అంటారు. తెలుగులో ఉన్నాయో లేదో నాకూ తెలియదు, అంచేత ఆ విషయం లోకి వెళ్ళడం లేదు.

    ఈ టపాకి పెట్టానే శీర్షిక My goodness gracious me….., Oh God.., My goodness..Oh dear… gosh... లాటి మాటలు ఇదివరకు వినేవాళ్ళమూ, పుస్తకాల్లో చదివేవారమూనూ. వీటన్నిటినీ ఊతపదాలంటారనుకుంటాను. తెలుగులోనూ ఉండే ఉంటాయి, కానీ ఎక్కువగా ఉపయోగించడం లేదు. కానీ ఒకానొకప్పుడు ఈ పదాలన్నీ వినేవాళ్ళం. వినసొంపుగా కూడా ఉండేవి. వాటిలో అభ్యంతరకరమైనదేదీ లేకపోవడం వలన. పిల్లలూ, ఆడవారూ కూడా ఉండగా కూడా, ఇలాటి పదప్రయోగాలు చేస్తే, ఎవరూ ఏమీ అనుకునేవారు కాదు. పైగా ఏదో కొత్త పదం ( usage) తెలిసొచ్చేది !

    అలాటిది ఈమధ్యన so called mod generation మాట్టాడేదేమిటీ, వ్రాయడానిక్కూడా అసహ్యంగా ఉంది..oh ! shit..అని ! ప్రతీదానికీ అదేమాట. ఓ సంతోషం కలిగినా, చిరాకు కలిగినా అదే మాట ! రోజంతా అలా నోట్లోనే నానుతూంటే అసలు వాళ్ళకి ఏమీ అనిపించదా? వాళ్ళ సంగతి దేముడెరుగు, చివరకి చిన్న పిల్లల నోట్లోనూ అదే మాట ! ఈమధ్యన రోడ్డుమీదనుండి వెళ్తూంటే, ఓ ఇద్దరు పిల్లలు నాలుగైదు సంవత్సరాలుంటాయేమో, ఆడుకుంటూంటే, ఏదో వచ్చిందనుకుంటాను, మొదటివాడు రెండో వాడితో ఇదే ( పైన చెప్పింది) అంటూంటే విన్నాను. అక్కడ ఆగి, ఆ పిల్లాణ్ణి పిలిచి అడిగాను- “ఇప్పుడు వాడావే ఆ మాటకి అర్ధం తెలుసునా…” అని. దానికి ఆ పిల్లాడిచ్చిన సమాధానం- ” I dont know. I heard mummy daddy using it regularly, so I thought I can also use it..…”- అదండీ విషయం ! వాడికి అర్ధం చెప్తే మళ్ళీ అదే మాట ! ఎలాగూ మొదలెట్టానుకదా అని పూర్తిచేద్దామని, ఆ పిల్లాడితో చెప్పాను. నేను చెప్పిందంతా విని, ” Ok uncle, now I will tell my parents also…”. చెప్పొచ్చేదేమిటంటే, పిల్లల ఎదురుగుండా అయినా, కనీసం, మన భాష కొద్దిగా presentable గా ఉంటే అదే నేర్చుకుంటారు. పిల్లలమీద ఎలాటి దుష్ఫలితాలు ఉంటాయో ఆలోచించడానిక్కూడా టైముండడం లేదు !

   ఇంక weekend వచ్చిందంటే చాలు, వెర్రి వెర్రి వేషాలు వేసేసికుని ఓ బైక్కు మీద ఝూమ్మంటూ వెళ్ళడం. ఏ pub లోనో, మధ్యమధ్య పానీయం లాగ బీర్లు తాగుతూ, అవేవో subway లు, burger లూ, ఇంకా అవేవో తింటూండడం. ఇంక ఆడపిల్లల డ్రెస్సులకొస్తే చూడాలేకానీ, చెప్పతరం కాదు. ఎక్కడ పడితే అక్కడ tatoos ట ! ఇదివరకటి రోజుల్లో వంటి మీద ఎక్కడైనా మచ్చలాటిదుంటే, దాన్ని కప్పుకోడానికి తాపత్రయ పడేవారు. ఇప్పుడో ఎన్నెన్ని మచ్చలుంటే అంత గొప్పా! పైగా వాటిల్లో మెసేజిలోటీ !వాళ్ళు వేసికునే T shirts మీద స్లోగన్లోటీ– I am available… why not give a try ? మరి ఇలాటి వేషాలేస్తే మిగిలినవాళ్ళూరుకుంటారా?

    ఇంక మొగ పిల్లలంటారా, చెవికో పోగూ, సగంసగం పిల్లిగడ్డం, అర్ధ ముండితాలూ చేయించుకుని ఓ చెడ్డీ, స్లీవ్ లెస్ బనీనూ, కళ్ళకో జోడూ, రాత్రయినా పగలయినా నల్ల కళ్ళద్దాలే. మిగిలిన రోజుల్లో ఏ కంపెనీ వాడో ఇచ్చిన T shirts . అవికూడా ఎక్కడ దొరికినవీ, ఏ 5k run కో వెళ్ళి ఫుకట్ గా దొరికిన షర్తూ, క్యాప్పూ. ఇంకో రకం ఈ మధ్యన కొత్తగా టీ షర్టుల మీద ఓ స్లోగన్- ” being human ” అని. అసలు వీళ్ళకి ఆ మాటకి అర్ధం తెలుసునా, బస్సుల్లో ఆడవారికీ, సీనియర్ సిటిజెన్లకీ రిజర్వ్ చేసిన సీట్లలో దేర్భ్యాల్లా కూర్చుంటారు ! మళ్ళీ వీళ్ళ కబుర్లు వింటే, వామ్మోయ్.. అసలు our country will never improve అండీ. ఎవడు చూసినా డబ్బు తినేవాడే. ఈ మధ్యన మొబైళ్ళలో కూడా ఇంటర్నెట్ సదుపాయం ధర్మమా అని facebook లోనో, twitter లోనో ఓ మెసేజ్ తగలేయడం. మళ్ళీ వాటికి జవాబులూ. అందరూ అలాగ ఉంటున్నారని కాదు, ఎక్కువ శాతం ఇలాటి పక్షులే !!

    ఛాన్సొచ్చిందంటే ఏ అన్నా హజారేదో, రాందేవ్ బాబాదో ఉద్యమాలని ఫాలో అయిపోతూండడం. వాటిమీద ఎక్కడలేని ఆసక్తీ, అభిమానమూ పొంగించేసికోడం. పైగా వీటికి అవేవో గ్రూప్ లుట, అదోటీ మధ్య. ప్రతీదానికీ ఓ గ్రూప్పూ, ఫాన్సూ. ఇంక ఈ social networking site లలో విషయాలేమిటీ, మా ఆవిడ నెల తప్పిందీ, మా పిల్ల పెద్దమనిషయిందీ లాటివి !

    బైక్కు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలనీ, కారుల్లో వెళ్ళేటప్పుడు మొబైళ్ళలో మాట్లాడకూడదనీ, రేడియోలూ వగైరాలు ఉండకూడదనీ మాత్రం వీళ్ళకు గుర్తుండదు. అలాటివేవైనా చెప్తే పాత చింతకాయ పచ్చడి….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మాట దాచుకోడం…

    ఈ దాచుకోడాలని గురించి ఇదివరకు ఓ టపా వ్రాశాను. అందులో, వస్తువులు ” దాచుకునే” వారి గురించి ప్రస్తావించాను. వస్తువులే కాకుండా, కొంతమంది, మాటలు కూడా దాచుకుంటూంటారు. తమ మనస్సులో ఉన్నది ఇతరులతో పంచుకోరు. ఏం చెప్తే ఏమి చేసేస్తారో అని భయం. ప్రపంచంలో ప్రతీవారూ తమకు పోటీయే అని ఓ అభిప్రాయం.

    తమపిల్లలు స్కూల్లో చదివేటప్పుడు, వాళ్ళ నోట్సులుకూడా ఇంకోళ్ళకి ఇవ్వనీయరు. అవతలివాళ్ళకెక్కడ మార్కులు ఎక్కువ వచ్చేస్తాయో అని భయం. పోనీ అలాగని, ఇంకోళ్ళ నోట్సులు తీసికోకుండా ఉంటారా అంటే అదీ లేదూ, తమ పిల్లలు ఏ కారణం చేతైనా స్కూలుకి వెళ్ళలేకపోతే, అవతలివాళ్ళ పిల్లల నోట్సులే గతి.అలాగే ప్రతీవారికీ ఏదో ఒక సందర్భంలో అవసరాలు పడుతూ ఉంటాయి. అందరూ అలా ఉంటారని కాదు, సమాజంలో ఇలాటివారినే ఎక్కువగా చూస్తూంటాము. ఉదాహరణకి, ఏ scholarship పరీక్ష గురించో, లేకపోతే ఏ talent test గురించో వీళ్ళకి ముందుగా తెలిసిందనుకోండి, ఛస్తే ఇంకోళ్ళకి చెప్పరు, కారణం వాళ్ళ పిల్లలు ఎక్కడ తమ పిల్లలతో పోటీకి వస్తారో అని !ఇవే కాదు, తమ పిల్లలకి చదువుకోడానికి కొనిపెట్టే పుస్తకాల విషయం కూడా, ఇంకోళ్ళతో పంచుకోరు. వాళ్ళు కూడా ఇవే పుస్తకాలు చదివి మార్కులు ఎక్కువ తెచ్చేసికుంటే అమ్మో !!

    ఇప్పుడంటే నెట్ నిండా పెళ్ళి సంబంధాలే కాబట్టి ఫరవా లేదు కానీ, ఇదివరకటి రోజుల్లో , ఇంట్లో ఆడపిల్లుందంటే చాలు, తెలిసిన సంబంధాల విషయం ఇంకోరితో పంచుకునేవారు కాదు. ఏదో కారణాలవల్ల, వీళ్ళ ప్రయత్నాలు fail అయినప్పుడు మాత్రం, పేద్ద “విశాల హృదయం” తో, అవతలివాళ్ళతో ఒక మాట అనడం. అప్పుడు కూడా పూర్తి వివరాలు చెప్పరు, వీరికి ముందుగానే తెలిసినా కూడా.మళ్ళీ మన విషయం తెలిసిపోతే, వామ్మో ! చివరికి ఎవరిద్వారానో వాళ్ళకీ తెలుస్తుంది.అప్పుడు మొత్తానికి తేలుస్తారు, జాతకాలు కలవక, మేమే వద్దన్నామండి అని. అసలు కారణం ఇంకోటైనా సరే .

    అలాగే, మనం ఏ flat కొనుక్కోడానికో, అద్దెకు తీసికోడానికో, ఖర్మ కాలి ఏ agent/broker నైనా పట్టుకున్నామనుకోండి, తనే వారి దగ్గరకు తీసికెళ్తానంటాడు కానీ, ఆ party ( ఎవరైతే అద్దెకో/అమ్మడానికో ఇచ్చేవారు) వివరాలు మాత్రం మనతో share చేసికోడు. మళ్ళీ మనం direct గా, వాళ్ళని సంప్రదించేస్తే, వీడి commission పోదూ ? అలాగే మనం కూడా ఏ ఇల్లో, భూమో అమ్మడానికి ప్రయత్నిస్తూంటే, ఎవరో తెలిసినవాడు అడుగుతాడు, మాకే అమ్మకూడదోయ్ అంటూ. అక్కడ మళ్ళీ మొహమ్మాటం, మనం అనుకున్న రేటు రాకపోవచ్చు, వీణ్ణి వదిలించేసుకోడానికి, ఇంకో చోట ఎక్కువ బేరం చెప్పినవాడికి ఇచ్చేయడం, మరీ నిలబెట్టి అడిగినా, ” అస్సలు తెలుసున్నవాడివి కదా నీకే ఇచ్చేద్దామనుకున్నానోయ్, కానీ ఆఫీసులో మావాడు అప్పటికే ఇంకోళ్ళకి మాటిచ్చేశాడుట, ఏం చేయనూ, ఆఫీసుల్లో relations maintain చేయాలి కదా…”, అని అంటాడే కానీ అసలు విషయం మాత్రం చెప్పడు! పెళ్ళిళ్ళ విషయాల సంగతికొస్తే “జాతకాలు” safest escape route.

   ఇలాటివన్నీ ఇదివరకటి రోజుల్లో సర్వసాధారణంగా జరిగే విషయాలు. ఇంక ఈ రోజుల్లో తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాల విషయాల్లో చూస్తూంటాము. చెప్పా పెట్టకుండా, ఎప్పుడో ఒకరోజు చేతిలో pink slip వచ్చే రోజులాయె. ఎక్కడెక్కడ ఉద్యోగాలుంటాయో చెప్తే, మళ్ళీ వీడెక్కడ competition కి వస్తాడో అని భయం. ఈ సందర్భం లో నా అనుభవం చెప్తాను. నేను చేసే mystery shopping గురించి అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ చెప్తూంటాను. వాటి గురించి రెండు మూడు టపాలు కూడా వ్రాశాను. వాటిమీద ఆసక్తి ఉన్నవారు చదివారు, లేదా మానేశారు. పేద్ద చెప్తారు కానీ, పూణె లో ఉండడం లేదు కాబట్టి, ఆ సమాచారం తెలిసి, ఎవరైనా చేరినా మీకు competition కి రారు కాబట్టి, బయటి వాళ్ళతో share చేసికున్నారు కానీ, అదే పూణె లో ఉన్నవారితో share చేసికుంటే చెప్పండి అనొచ్చు. అక్కడికే వస్తున్నాను. నాకు తెలిసిన ఓ పెద్ద మనిషికి, దగ్గరుండి, నెట్ లో రిజిస్టర్ చేయించి, వివరాలు చెప్పాను. తను ఇప్పటికే రెండు మూడు evaluations కూడా చేశాడు, వాటికి డబ్బు కూడా వచ్చింది. ఆ పెద్దమనిషి ఓసారి మాటల్లో చెప్పాడు, తనకి TV Ads కీ,Movies లో చూస్తూంటాము junior artists సప్లై చేస్తూంటారు, అలాటి వాటికి వెళ్టూంటాడుట తనూ, తన భార్యానూ. పైగా తనే చెప్పాడు, మీగ్గూడా చెప్తానూ, సరదాగా ఉంటుందీ అని. అక్కడికేదో సినిమాల్లో వేసేద్దామని కాదు కానీ, ఇలాటివి బావుంటాయి కదా అని, కాలక్షేపమూ అవుతుందీ సరే ఇమ్మన్నాను.ఇదిగో ఇస్తానూ అదిగో ఇస్తానూ అంటాడే కానీ, ఆ ఏజెంట్ నెంబరు మాత్రం ఇవ్వలేదు ! No issue ! సందర్భం వచ్చింది కదా అని చెప్పాను.అలాగని నేనేదో ఘనకార్యం చేసేశానూ అని చెప్పుకోడానికి కాదు. అంతదాకా ఎందుకూ, ఎక్కడో ఏదో వస్తువు కొన్నామనుకోండి, అది కూడా ఏ discount sale లోనో, ఆ విషయం మాత్రం ఇంకోళ్ళతో పంచుకోము. అవతలివాడెందుకు సుఖ పడిపోవాలీ?

    ఈరోజుల్లో చూస్తున్నదేమిటీ? పైకోమాటా, లోపలోమాటానూ. ఎక్కడ చూసినా, వాడితో చెప్తే మనకేం వస్తుందీ అనే కానీ, పోనీ మనకి తెలిసినదేదో ఓ నలుగురితో పంచుకుంటే, వాళ్ళూ బాగు పడతారేమో అనుకుంటే, ఎంత బావుంటుందీ? Sharing enhances happiness always…

    ఏదో ఒకటీ అరా ఇలాటి అనుభవాలు జరిగాయి కదా అని బుధ్ధొస్తుందా అంటే అదీ లేదూ, నాకు ఏదైనా విషయం తెలిస్తే చాలు, నోట్లో నువ్వు గింజ నానదు. ఇంకోళ్ళతో చెప్పేసికుంటేనే కానీ కడుపుబ్బరం పోదు !నేను ఇప్పటి దాకా వ్రాసిన టపాలు చదివితేనే తెలుస్తుంది. నా జీవితం లో ఇప్పటిదాకా ఏమైనా “దాచానా” అంటే, నా అర్ధికస్థోమత గురించి, అదీ ఎవరితోనూ, of all the people మా ఇంటావిడతో !! ఆ సంబరమూ తీరిపోయిందిలెండి ఈమధ్యనే !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఇదివరకటి రోజుల్లోనే బావుండేది. ఏదో BSNL వాళ్ళ ఫోన్లూ, వాటికి ఓ నెంబరూ. మొబైళ్ళు వచ్చిన కొత్తలో కూడా బాగానే ఉండేది. ఏదో ఒక నెంబరుతో సరిపోయేది. ఈ మధ్యన ఎక్కడ చూసినా Dual siమ్ములే. అదేం ఖర్మమో రెండేసి నెంబర్లుట. ఏదో మనకి తెలిసిన వారి నెంబరు, ఎంతో శ్రధ్ధగా మన సెల్ లో పెట్టుకుంటాము. ఎప్పుడో ఒకసారి పలకరిద్దామని ఫోను చేస్తే this number does not exist అని జవాబూ. అధవా ఎవడైనా ఎత్తినా, ఆ పక్షి మనకు తెలిసినవాడు అవడు. ఏమిటో అంతా గందరగోళం. అసలు ఈ రెండేసి సిమ్ములేమిటో. ఇదివరకు పెర్రీ మాసన్ నవల్స్ లో చదివేవారం- అందులో డిటెక్టివ్ పాల్ డ్రేక్ ది ఎప్పుడూ unlisted నెంబరే. ఒక్క పెర్రీ మాసన్ కీ, అతని సెక్రటరీ డెల్లా స్ట్రీట్ కే తెలిసేది. ఏదో పత్తేదార్లూ, కోర్టులూ పోనీ వాళ్ళకుందంటే అర్ధం ఉంది. మామూలుగా సంసారాలు చేసికునేవాళక్కూడా ఈ గోలెందుకండి బాబూ?

   ఇంకొంతమందుంటారు, బయటి రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు roaming charges పడతాయని, లోకల్ ది ఒకటీ, బయటదోటీ. అయినా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు.ఇంకా కొంతమందుంటారు ఇంటినిండా సెల్ ఫోన్లే. ఆఫీసుదోటీ, చుట్టాలకోటీ, ఫ్రెండ్స్ కోటీ. చివరకి దేనికీ జవాబివ్వరనుకోండి. అది వేరే విషయం.

    ఈవేళ అదేదో చానెల్ లో చూశాను, అప్పుడెప్పుడో యూరో లాటరీ ఫ్రాడ్ లో అరెస్టయిన కోలా కృష్ణమోహన్ కీ, నారా వారిని సమర్ధిస్తూ వచ్చిన ఇద్దరికీ మధ్య మాటల యుధ్ధం. ఇంకో చోట, ముంబైలో జరిగిన అగ్నిప్రమాదం. అక్కడికేదో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవన్నీ కొత్త అన్నట్టు. ప్రతీ రెండు మూడేళ్ళకీ ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ,inconvenient files మాయం చేయాలంటే, ఇంతకంటే మంచి సాధనం ఉండదు. ఆదర్శ్ సొసైటీ కేసూ, లావాసా కేసూ కి సంబంధించిన ఫైళ్ళు మాత్రమే అగ్నికి ఆహుతయ్యాయిట. వహ్వా.. వహ్వా…

    ప్రొద్దుట అక్కడెక్కడో హర్యాణా లో ఓ పాప బోరు బావిలో పడిపోయిందిట. ప్రొద్దుటంతా అదే హడావిడి.ఈ అగ్నిప్రమాదం వచ్చెసరికి, ఆ పాప సంగతేమయ్యిందో ఎవరికీ పట్టలేదు. రేపు పేపర్లే దిక్కు. మామూలుగా ఒలింపిక్స్ లో దేశప్రతినిధిత్వం చేయడమంటే ఓ పెద్ద గౌరవంగా భావించేవారు, ఇదివరకటి రోజుల్లో. మరి ఇప్పుడేమయిందో, టెన్నిస్ పేస్, భూపతీ కొట్టుకుంటున్నారు.

   ఎవరైనా మన టివీ చానెళ్ళలో ప్రసారమయ్యే సీరియళ్ళ్ గురించి, ఏ Human Rights Commission కో ఫిర్యాదు చేస్తే బావుండును. మామూలుగా ఏదైనా కార్యక్రమం చూసి, ఏదో ఒక positive విషయం నేర్చుకుంటాము. అదేం ఖర్మమోకానీ, మన సీరియళ్ళు తెలుగయినా, హిందీ అయినా సరే, ఒక్కటంటే ఒక్కదాంట్లోనూ,negative vibes తప్ప ఇంకేమీ కనిపించవు. ఎప్పుడు చూసినా అవతలివాడి కొంప ఎలా కూలుద్దామా అనే కానీ, కాపరాలు నిలబెట్టాలని ఒక్క సీరియల్ లోనూ కనిపించదు. అలాటప్పుడు ఆ దిక్కుమాలిన సీరియళ్ళు చూడమని ఎవరు చెప్పారూ అనకండి. మరి అదే చేస్తూంట. నాకు ఒకటనిపిస్తూంటుంది, ఈ సీరియళ్ళలో పగలనకా, రాత్రనకా నటించి, ఆ నటీనటులు కూడా నిజజీవితాల్లో అలాగే తయారవుతున్నారేమో అని!

    ఈమధ్యన నాకు ఓ మెయిల్ ద్వారా వచ్చిన ఓ సమాచారం. అందరికీ ఉపయోగించేదే….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Name/brand sells…

    ఎవరైనా సరే ఒకసారి పేరు,ప్రఖ్యాతులు వచ్చిన తరువాత, వారు ఏమి చేసినా చెల్లుతుంది, ఏమి వ్రాసినా ఆహా..ఓహో.. అనుకుంటారు. మరి పేరు తెచ్చుకోడం అంటే మరి అంత సులభమా? అలా పేరు తెచ్చుకోడానికి వారు ఎంతో కష్టపడుంటారు, కానీ అదంతా ఇదివరకటి రోజుల్లో అంటే మన మీడియావారు రాత్రనకా పగలనకా మనల్ని హోరెత్తించేయడానికి పూర్వం అన్నమాట. ఇప్పుడో, ఓ మీడియా వారిని మంచి చేసికుంటే చాలు, ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా అదే పేరు.

    ఆ వ్యక్తి ఒక రచయిత/త్రి అవొచ్చు, ఒక క్రీడాకారుడవొచ్చు, అలాటివారికి అన్నీ మాఫ్… మామూలుగా మనం ఏదైనా పత్రికకో ఇంకోదానికో ఓ రచన పంపుదామనుకుందాము, ఆ రచనతో పాటు ఓ “హామీ” పత్రం ఒకటి అడుగుతారు. “ఫలానా మీ రచన ఇంకో మాధ్యమం లో(including internet) ప్రచురింపబడలేదూ” అని. కానీ ఈ రోజుల్లో చూస్తున్నదేమంటే, అంతర్జాలపత్రికల్లో ప్రచురితమైన కొన్ని రచనలు, కొన్ని పత్రికల్లో కూడా రావడం. అడిగితే, అందరికీ net access లేదుకదా, అందువలన ప్రచురిస్తున్నామూ అని. ఇలాటిదానికి మళ్ళీ హామీ పత్రాలూ సింగినాదాలూ ఎందుకుట?

    ఈమధ్యన కొంతమంది “ప్రముఖులు” కూడా అంతర్జాలంలోకి అడుగెట్టారు. ఏదో పేరూ ప్రఖ్యాతీ ఉన్నవాడు కదా అని, వారు వ్రాసింది చదివి, ఓ వ్యాఖ్య పెడతాము. ఈ మాత్రం దానికి సమాధానం వ్రాసేదేమిటీ, అనుకుంటారు ఆ “ప్రముఖులు”. అది Blog అవనీయండి, Facebook అవనీయండి,Twitter అవనీయండి. కానీ వారుచేసే ” జ్ఞానబోధలు” మాత్రం ఆపరు. ఈమధ్యన ప్రారంభించిన ఓ కార్యక్రమం గురించి, అన్ని పేపర్లలోనూ ఎంతో పొగుడుతూ వ్రాశారు. అలాటివి, అంతకంటె మంచివీ కూడా ఎన్నో కార్యక్రమాలు చాలా చూశాము.కానీ, వాటికీ, ఈ కార్యక్రమానికీ తేడా ” మీడియా పబ్లిసిటీ..”.

    అలాగే టీవీ ల్లో అవేవో చర్చా కార్యక్రమాలొస్తూంటాయి. అందులో పాల్గొనేవారు ఎవరూ? ఈ విషయంలో ఈమధ్యన ఒక వార్త చదివాను. TV Audience ! రాజకీయ పార్టీల రాలీలకి జనాల్ని డబ్బిచ్చి పోగేసుకునేవారుట. ఇప్పుడు టివీ కార్యక్రమాలకి కూడా అదే గతి పట్టింది. మొన్న ఆదివారం నాడు అదేదో చానెల్ లో father’s day గురించి ఓ కార్యక్రమం చూపించారు.అందులో ఓ ముగ్గురు జంటలు( తండ్రి-కూతుళ్ళు), వారి మధ్య ఉండే అభిమానాలూ వగైరాలగురించి ఓ అరగంట, చెప్పిందే చెప్పి బోరుకొట్టేశారనుకోండి. నాకు ఒక విషయం అర్ధం అవదూ, ఇలాటి కార్యక్రమాల్లోకి తండ్రీ కొడుకుల్ని ఎందుకు తీసుకురారుట?

    ఇదివరకెప్పుడో వ్రాశాను, ఈ లాఫింగ్ క్లబ్బుల గురించి. ఈమధ్యన ముంబైలో ఆయనెవరో కోర్టుకి వెళ్ళారుట. రోగం కుదిరింది ఆ క్లబ్బువాళ్ళకి !HC orders laughter out of the club

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఇదివరకటి రోజుల్లో ఇళ్ళల్లో ఎవరిదైనా ఏ పుట్టిన రోజైనా జరిగితే, ఏదో మన తాహతుని బట్టి ఓ బహుమతి ఇచ్చేవాళ్ళము. మా చిన్నప్పుడైతే, ఏదో కొత్త బట్టలూ, ఇంట్లో భోజనాలతో పాటు ప్రత్యేకంగా ఆ పుట్టినరోజుకి సంబంధించిన వారికి ఇష్టమైన ఓ స్వీటూ, సాయంత్రం ఓ సినేమా. వీటితో పనైపోయెది. మా పిల్లల విషయానికొస్తే, బయటి వారినెవరినీ పిలిచేవారము కాము. మరి పిల్లలు disappoint అయేవారేమో, కానీ ఎప్పుడూ మాతో అన్నట్టు జ్ఞాపకం లేదు. అనుకుని ఉన్నా, convenient గా మర్చిపోయేవారమేమో !!ఇక్కడ పూణె లో ఉన్నంతకాలమూ ఏదో ఊళ్ళో ఉండే famous bakery “కయాని” కి వెళ్ళి ఓ కేక్కు తేవడం, స్కూల్లో పిల్లలకి , అవేవో eclairs చాకొలేట్లు పంచమనడం. ఎందుకంటే నా ఆర్ధిక స్థోమత కూడా అంతంతమాత్రమే కనుక.

    ఇంక ఇంటావిడ పుట్టినరోజు వస్తోందంటే, ఏదో ఇంట్లోకి అందరికీ ఉపయోగపడే వస్తువు, ఓ టివీయో, ఇంకోటేదో కొనేయడం, దానికి ఇంటావిడ పుట్టినరోజు బహుమతి అని పేరు పెట్టేసి ఊరుకోపెట్టేయడం. ఏం చేస్తాం, LMC ( Lower Middle class) లోకి వస్తామాయే! ఏమో దాంట్లోనే ఉందేమో ఆనందం, సంతోషమూనూ. ఎప్పుడూ ఇదేమిటండీ అన్న పాపాన పోలేదు !!

    కానీ ఈరోజుల్లో పిల్లల పుట్టినరోజులు వస్తున్నాయంటే, ఆ రోజుకి వాళ్ళకి ఏమివ్వాలో తెలియడం లేదు. కారణం వాళ్ళ దగ్గరున్నవస్తువులు వాళ్ళకే తెలియదు! ఏదో ప్రత్యేకంగా మనం ఏదో బహుమతి తెచ్చామనుకుంటాము, ఆ వస్తువు అప్పటికే, వాళ్ళ అమ్మా నాన్నా, ఏదో వీకెండు షాపింగుల్లో, ఏదో జంతికలో, కారప్పూసో కొనుక్కున్నట్టు, కొనేసుంటారు. తీరా మనం ఏదో గొప్పగా గిఫ్ట్ ప్యాకింగు చేయించి చేతిలో పెట్టిన ప్యాకెట్ తెరిచి చూస్తే, “అర్రే ఇదా తాతయ్యా, నా దగ్గర ఎప్పటినుంచో ఉందీ….”అనడం, వాళ్ళ అమ్మో నాన్నో “అది వేరూ, ఇది వేరూ, అదేమో జూనియర్ దీ, ఇదేమో సీనియర్ దీనూ…” అని సద్దిచెప్పడమూనూ, మరీ మనంdisappoint అవకూడదని ! తెలుస్తూనే ఉంటుంది, పిల్లలకీ పిల్లల తల్లితండ్రులకీ నచ్చలేదని. కానీ చేయకలిగింది ఏమీ లేదు.

   ఇంకో విషయం అర్ధం అవదు, అసలు పిల్లలకైనా, పెద్దలకైనా ఆ gift కి సంబంధించినంతవరకూ benchmark ఏమిటని? ఈ రోజుల్లో వస్తూన్న electronic items కైతే అసలు sky is the limit. ఇదివరకటి లాగ ఏదో కీ ఇస్తే తిరిగే బొమ్మో,లాటిది ఇస్తే మొహాన్నేసి కొడతారు ! అలాగని మరీ పెద్ద పెద్ద items ఇద్దామా అంటే, కొద్దిగా పెద్ద అయిన తరువాత ఇస్తే బాగుంటుందేమో అని వాయిదా వేస్తాము. కారణం, మనం అంటే నాలాటివాళ్ళం, ఇంకా “పాత” రోజుల్లోనే ఉండడం బట్టి. పోనీ, ఏ బంగారం వస్తువైనా కొందామా అంటే, మరీ అంత చిన్న పిల్లకి బంగారం వస్తువు ఇప్పటినుంచీ అంత అవసరమా. ఏదో వాళ్ళు ఆడుకునేదో తేవాలి కానీ అంటారేమో అని భయం. పోనీ అదీకాదూ, ఇదీకాదూ అనుకుని, వాళ్ళకి కావలిసినవేవో వాళ్ళే కొనుక్కుంటరులే అనుకుని ఏ gift vouchers ఇస్తే, మళ్ళీ అదో తప్పు! ఏది ఏమైనా తిరిగితిరిగి మనమీదకే వస్తుంది.

    ఇంట్లో ఎక్కడచూసినా ఆడుకునే బొమ్మలే. అందులో మనవడివి కొన్నీ, మనవరాలివి కొన్నీ. ఉన్నవేవో వాళ్ళకీ తెలియదు, మనకీ తెలియదు. అలాగని పుట్టినరోజుల్లాటి పండగల్లో చేతిలో ఏమీ పెట్టకుండా ఉండలేమూ. పైగా మళ్ళీ ఇందులో ఇంకో గొడవుంది. తాతయ్య ఇస్తే, నానమ్మని అడగడం నీ గిఫ్టేదీ అని !

   ఇంక పార్టీలంటారా అడక్కండి, స్కూల్లో ఉన్న తన ఫ్రెండ్సందరినీ పిలవడం, వాళ్ళందరినీ entertain చేయడానికి, ఏవేవో గేమ్సూ, తిండీ ఎరేంజ్ చేయడం, ఎదో ఫలానా టైమని చెప్పగానే, వాళ్ళ అమ్మో నాన్నో ఆ పిల్లనో, పిల్లాడినో దిగబెట్టేసి వెళ్ళడం, ఇంక ఆ మూడు నాలుగు గంటలూ వాళ్ళు ఆడుకుంటూంటే, వాళ్ళని మన ఇంట్లో ఉన్న పెద్దాళ్ళందరూ జాగ్రత్తగా చూస్తూండడమూనూ.ఇంక ఆ పిల్లలేమో, వాళ్ళ విశ్వరూపాన్ని ప్రదర్శించేస్తారు. వాళ్ళున్న మూడు నాలుగ్గంటలూ టెన్షనే. మొత్తానికి ఈ హడావిడంతా పూర్తయి, ఎవరి పిల్లల్ని వాళ్ళ తల్లితండ్రులు తీసికెళ్ళాక అమ్మయ్యా అని ఊపిరిపీల్చుకుంటారు. మొన్న మా నవ్య పుట్టినరోజు నాడు, జరిగిన హడావిడంతా చూసి వ్రాస్తున్న టపా ఇది. మా అమ్మాయీ, కోడలు కీ పురుడు వచ్చిన రోజుల్లో కూడా ఇంత టెన్షన్ లేదు నిజం చెప్పాలంటే !
పోనీ వీటిక్కూడా అవేవో event management లాటివాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుందేమో అనుకుంటే మళ్ళీ సెంటిమెంట్లోటీ !

    నాలాగ రైళ్ళల్లో ప్రయాణాలు చేసేవారికి వచ్చే కష్టాల పరంపరలో, online booking లో, ఎప్పుడైనా tatkal ల్లో చేద్దామంటే, ఎప్పుడూ దొరకదు. అలాగని స్టేషన్ కెళ్ళాలంటే, ఏ తెల్లారకట్లో వెళ్ళి క్యూలో నుంచోవాలి. లేదా ఏ ఏజంటు కాళ్ళో పట్టుకోవాలి. ఏదీ కాదంటే తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవాలి. ఈ మధ్యన నాకు ఓ మెయిల్ వచ్చింది, tatkal online booking కష్టాలు అధిగమించడానికి ఈ పధ్ధతి ఉపయోగిస్తుందేమో చూడండి… మాకిదివరకే తెలుసునూ అంటారా శుభం !!.

    వచ్చేవారం మా tenderleaves.com ఆధ్వర్యంలో ఒక క్విజ్ చేస్తున్నారు. వాటి వివరాలు ఇక్కడ చూడండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అతిథిదేవోభవ…

    కొన్ని దశాబ్దాలనుండి పూణె నగరవాసులు, తమ దినవారీ సమస్యల్ని పక్కకు పెట్టి, ఆషాఢ మాసంలో, అళంది నుండి వచ్చిన సంత్ జ్ఞానేశ్వర్ పాదుకలూ, దెహూ గావ్ నుండి వచ్చిన సంత్ తుకారాం పాదుకలూ, ఊరేగింపుగా పంఢరీపురం లోని పాండురంగ విఠల మందిరానికి వెళ్తూ పూణె మహానగరం లో ప్రవేశించిన రోజున, ఆ వార్కారీలకి చేసే అతిథిసత్కారం నభూతోనభవిష్యతి. కొన్ని లక్షలమంది భక్తులు మూడు రోజులపాటు పూణె నగరాన్ని పావనం చేస్తారు.

    ఈ ఊరేగింపు ఈ సంవత్సరం ( 2012) ఈవేళ మధ్యాన్నానికి పైచెప్పిన రెండు పుణ్యస్థలాలనుంచీ వచ్చిన ఊరేగింపు ముంబై-పూణె రోడ్డు మీద, మరియాయీ గేట్ అన్న ప్రదేశంలో ఒకటిగా చేరి ఊరేగింపుగా విఠల మందిరానికి వెళ్తాయి. జూన్ 15 తేదీదాకా ఇక్కడ పూణె లో విశ్రమించి, పంఢరీపురానికి బయలుదేరతాయి. ఈ మూడురోజులూ ఈనగరంలో అంతా పండగ వాతావరణమే. ఎక్కడ చూసినా కాషాయ రంగులే. ఊరు ఊరంతా విఠల భజనలే.ప్రతీ హవుసింగు సొసైటిలో కారు పార్కింగ్ స్థలాల్లో కార్లన్ని మాయం అయిపోతాయి.వార్కరీల భోజన సదుపాయాల్ల్తో లేక వారికి విశ్రాంతి స్ఠలాలాగో మారిపోతాయి.
ఎక్కడ చూసినా Traffic diversions, ఊళ్ళో ఎక్కడ చూసినా Traffic Jams. అయినా సరే ఎవ్వరూ విసుక్కోరు. అడుగడుక్కీ ఈ వార్కరీలకి భోజనసదుపాయాలు కలగచేసే చలవ పందిళ్ళు. ఓహ్… చూడాలి..అంతే వర్ణించలేము. 2011 లో జరిగిన పాల్కీ ఊరేగింపు ఇక్కడ చూడండి.

   సహ్యాద్రి పర్వతాలకీ, “సంత్” గురువులకీ ఏదో అవినాభావ సంబంధం ఉందనుకుంటాను. సహ్యాద్రి సాంగత్యంతో “సంత్” లు అవుతారో, లేక ” సంత్” లు అందరినీ తనలో సగర్వంగా దాచుకుంటుందో మాత్రం తెలియదు. అక్కల్ కోట్ మహరాజ్, షిరిడి సాయి రాం, షేగాం గజానన్ మహరాజ్, స్వామి శ్రీ సమర్ధ రామదాసు, అళందీ లో ఉండే సంత్ జ్ఞానేశ్వర్, సోదరులు నివృత్తి నాద్,సోపానదేవ, సోదరి ముక్తాబాయి,వీరి గురువు చాంగ్ దేవ్, దేహూ లోని సంత్ తుకారాం, అందరూ సిధ్ధపురుషులే కదా! వీరే కాకుండా, మనందరికీ తెలిసిన సక్కూబాయి మహిళల్లోనే మణి హారం.

   వార్కరీ ల గురించి, ఓ విదేశీయుడు వ్రాసినది ఇక్కడ చదవండి.

    దేనికైనా పెట్టిపుట్టాలంటారు. ఇన్నేళ్ళనుండీ పూణె లో ఉంటున్నా, దగ్గరలోనే ఉండే పుణ్యస్థలాలు దేహూ గావ్, ఆళందీ చూసే అదృష్టం కలగలేదు. చూడకూడదని కాదు, సందర్భం కుదరలేదు. కానీ ఈ మధ్యన ఆ లోటు కూడా మా స్నేహితుడు శ్రీ దాసరి అమరేంద్ర గారు తీర్చేశారు. ఓరోజు ప్రొద్దుటే మా ఇంటికి వచ్చి, దగ్గరలో ఉన్న దేహు, అళందీ లకి వెళ్ళొద్దామా అన్నారు. అంతకంటేనా అనుకుంటూ వెళ్ళాము. ముందుగా దెహూ గావ్ కి వెళ్ళాము.
అక్కడ తీసిన కొన్ని ఫొటోలు:

సంత్ తుకారాం విగ్రహం
దేహు గావ్ లో సంత్ తుకారాం మందిరం

సంత్ తుకారాం జన్మస్థానం

సంత్ తుకారాం రచించిన అభంగ్ లు ఇంద్రాయిణి నదిలో విసిరేసిన స్థలం

సంత్ తుకారాం వైకుంఠానికి వెళ్ళిన స్థలం

సంత్ తుకారాం విరచిత అభంగాలు

    ఇంక అళందీ

   సంత్ జ్ఞానేశ్వర మందిరం

   అళందీ జ్ఞానేశ్వర మందిరం బయట

    ఈ దర్శనాలు చేసికునే అదృష్టం కలిగిన మేము….

    పాదుకల ఊరేగింపు ఇలా ఉంటుంది….

    ఇలాటివి చూసినప్పుడే అనిపిస్తుంది, ఇలాటి “పుణ్య నగరి” పూణే లో ఉండడానికి ఎంత అదృష్టం చేసికోవాలో కదా అని !!

జై మహరాష్ట్ర ! జైహింద్….