బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు-క్యాలెండర్లూ, డెయిరీ ల గోల !

    ఈ వేళ్టి బ్లాగ్గుకి థీం నిజం చెప్పాలంటే మా ఇంటావిడ ఇచ్చింది. తనకి ప్రవచనాలూ అవీ వింటూంటే తీరిక లేకపోయేసరికి నేను ఆ థీం ని ‘హడప్’ చేసేశాను! చెప్పానుగా ఆడవారికి మంచి మంచి ఆలోచనలు వస్తూంటాయి. వాటిని టైము చూసి ‘కొట్టేయడమే’ మనం చేసే నిర్వాకం !!

   ఈ న్యూ యియర్ వచ్చేటప్పడికి ఏడాదినుండీ మనకి పలకరించడానికి తీరికలేని వాళ్ళందరి ఫోన్ నెంబర్లూ ముందేసికొని ఇంక ఫోన్లు చేయడం మొదలెడతాము.ఏదో ‘విష్ యు ఏ హాప్పీ న్యూ యియర్’ అనడం తో మొదలవుతుంది. మనకి బాగా తెలిసిన వాడైతే కొంచెం క్షేమ సమాచారాలు అడుగుతాము. ఏదో మొహమ్మాట ఖాతాదారుడైతే అవతలివాడు ‘విష్ యు సేమ్’ తో వదిలేస్తాడు. ఒక్కొక్కప్పుడు, అవతలివాడు మనని మించినవాడౌతాడు. మన దగ్గరనుండి ఫోన్ వచ్చే మాటైతే, ఛాన్స్ దొరికింది ( ఫోన్ బిల్ మనకి పడుతుందిగా!!) కదా అని, క్రిందటేడాదంతా తను చేసిన ఘనకార్యాలన్నీ చెప్పేస్తాడు! కొంతమంది దగ్గరనుండి ఫోన్లు వస్తాయి. ప్రొద్దుటే 11 గంటలదాకా వీటితో కాలక్షేపం అయిపోతుంది.

   మేము ఫాక్టరీల్లో పనిచేసేటప్పుడు, ఆ రోజు మా జనరల్ మెనేజర్ గారి ఛాంబర్ ప్రొద్దుట అంతా తెరిచే ఉంచేవారు. ప్రతీ వాడు ఆ రూం లోకి వెళ్ళి ఒకసారి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వచ్చేవారం.నా చిన్నప్పుడైతే, మా నాన్నగారు హెడ్ మాస్టర్ కదా, టీచర్లు అందరూ బొకేలూ, స్వీట్సూ తెచ్చేవారు.
1963 లో ఉద్యోగం మొదలెట్టినప్పటినుండీ,కొంతకాలం డెయిరీ లు కొనుక్కొని వ్రాసేవాడిని. ఒక్కొక్కప్పుడు రీడర్స్ డైజెస్ట్ తో వచ్చే లిటికంత డైరీయే గతి! పెళ్ళి అయేదాకా వ్రాశాను. ఆ తరువాత బధ్ధకం వచ్చి వ్రాయడం మానేశాను.ఇదొకటే కారణం కాదు, మనం ఏదో మూడ్ లో ఉన్నప్పుడు ఏదో వ్రాస్తాము, ఆ తరువాత ఎవడైనా( అదీ భార్య అయితే) చదివితే మన ప్రాణం మీదకొస్తుంది! ఒక సంగతి ఏమంటే,1963 నుండి 1974 దాకా వ్రాసిన డెయిరీలన్నీ జాగ్రత్త చేసికున్నాను.ఎప్పుడైనా వాటిని చదివితే నవ్వొస్తుంది. ఎన్నెన్ని నూతన సంవత్సర రిజల్యూషన్స్ చేసికునేవాడినో! ఒక్కటీ అమలు పరచుకోలేదు! అందుకే కదా వ్రాసేది! అన్నింటిలోనూ ఉండేది ఏ రోజు ఎవరితో ఏ సినిమాకి వెళ్ళానో!

    ఇంకో అలవాటుంటుంది, చిన్నప్పుడు ప్రతీ కొట్టుకీ వెళ్ళడం ,క్యాలెండర్ అడగడం. ఆ కొట్టువాడేదో అంకెల క్యాలెండర్ వేసేవాడు.కంపెనీల క్యాలెండర్ మీద ఏదో దేముడి బొమ్మో, ఏ సినిమా స్టార్ బొమ్మో ఉండేది.ఎన్ని క్యాలెండర్లు సంపాదిస్తే అంత గొప్ప! మన స్నేహితులందరి దగ్గరా చూపించుకోవచ్చు! పాత కేలండర్ బొమ్మ మనం చదివే పుస్తకానికో, నోట్స్ కో అట్ట వేసేసేయడం! ఆ రోజుల్లో అంటే 60 లలో ఏ సినిమా స్టార్ బొమ్మైనా ఉన్నా అది కొంచెం’మర్యాద’ గా ఒంటి మీద పూర్తి బట్టతో ఉండాల్సిందే ! లేకపోతే గోవిందా ! కాలేజీ కి వచ్చిన తరువాత అనుకుంటా,మా ఫ్రెండు ఒకడి దగ్గర మేర్లిన్ మన్రో ఫేమస్ పోజు ( తను కట్టుకున్న స్కర్ట్ ఫాన్ గాలికి ఎగిరిపోతూంటుంది) ఉన్న క్యాలెండరుండేది. వాడు ఎక్కడినుండో కొట్టుకు వచ్చేశాడు. వాళ్ళింట్లో చివాట్లేశారు. అందుకని మరీ బయట పారేయలేక నాకిచ్చాడు. కాలేజీ కొచ్చానుగా, అందుకని, నేనేదో శ్రధ్ధ గా చదివేసి ఉధ్ధరించేస్తాననుకొని, నాకు ఒక రూం విడిగా ఇచ్చారు. అమలాపురం లో మా ఇంట్లో మొత్తం 14 రూంలు ఉండేవి ! పాపం మా ఇంట్లో వాళ్ళు నేను బాగా చదువుకోవల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సమకూర్చారు. నాకో విడిగా రూమ్మూ, అందులోకి ఎవరూ రాకపోవడం( ఏదో డిస్టర్బ్ అయిపోతానేమో అని!) లాటివి చాలా చేశారు.కానీ తల రాత మరోలా ఉంటే ఇలాటి సౌకర్యాలు ఏం లాభం? చెప్పొచ్చేదేమంటే, ఆ మేర్లిన్ మన్రో కేలెండర్ ఓ మూడు నెలల పాటు నా రూంలో ఉండేది.క్వార్టర్లీ పరీక్షలలో మార్కులు చూసిన తరువాత, మా నాన్నగారు ఓ రోజు
నా రూం లోకి ఇనస్పెక్షన్ కి వచ్చి, ఈ ‘సువర్ణ’ మార్కులకి కారణం ఏమిటా అని చూస్తే, ఈ కేలెండర్ కనిపించింది. నాలుగు చివాట్లేసి, మళ్ళీ ఆ కేలెండర్ ఎక్కడ దాస్తానో అని పర పరా చింపేశారు ! అస్సలు ‘సౌందర్య పోషణ’ లెకుంటే ఎలాగ బాబూ !

    ఇంక ఉద్యోగం లో ప్రతీ ఏడాదీ, ఎవడో ఒకడు ఓ క్యాలెండరూ, డెయిరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రెస్పాన్సిబుల్ పేరెంట్స్ అయ్యాము కదా,అంకెలున్నవో ( అవీ పేద్ద పేద్దవి) పాల లెఖ్ఖలూ అవీ వ్రాసుకోవడానికి వీలుగా, లేక ఏదో ల్యాండ్ స్కేప్పు
ఉన్నవో తెచ్చేవాడిని. మిగిలిన వన్నీ ఎవరో ఒకరికి ఇచ్చేసి పాప్యులర్ అయేవాడిని! ఇంక ఈ డెయిరీ లలో లాండ్రీ కి ఇచ్చిన బట్టల లెఖ్ఖలూ,జమా ఖర్చులూ వ్రాయడం! ఏది ఎలాగున్నా ఓ తెలుగు క్యాలెండర్, ‘వెంకట్రామా’ప్రతీ ఇంట్లోనూ
కంపల్సరీ ! ఇప్పుడు ‘సాక్షి’,’స్వాతి’ వాళ్ళు ఓ తెలుగు క్యాలెండరొకటి ఇస్తున్నారు.వంటింట్లో ఒకటీ, హాల్లోనో, బెడ్రూంలోనో ఒకటీ. ఇప్పుడు మనం ఉండేవి అంతే కదా !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–HAPPY 2010

New Year

శ్రీ దూర్వాసుల వారి ధర్మమా అని శుభ్రంగా అచ్చ తెలుగులో శుభాకాంక్షలు తెలుపుకోకలుగుతున్నాము.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-గోళ్ళు !

    నేను ప్రతీ శనివారం, లోకల్ లో పూణే స్టేషన్ కి వెళ్ళి, తెలుగు వార పత్రికలు స్వాతి, ఆంధ్రభూమి, నవ్య తెచ్చుకుంటూంటాను. అదే లోకల్ లో తిరిగి వచ్చేయడమే. క్రిందటి శనివారం వెళ్తూంటే, నా ఎదురుగా ఒక యువ జంట కూర్చొని ఉంది. నేను అతనినే అబ్జర్వ్ చేస్తూ కూర్చొన్నాను.ఆమె కిటికీ లోంచి చూస్తూ కూర్చొంది. ఈ అబ్బాయి కొంతసేపు కూర్చొని, ఒక చేత్తో గెడ్డం క్రింద ఉన్న ఓ పొక్కు ని ఊరికే కూర్చొని కెలికాడు. నిజంగా చూస్తే ఇది ఎలాటిదంటే,
మా చిన్నప్పుడు ఓ సామెత చెప్పేవారు–‘ పని లేని మంగలి పిల్లి తల గొరిగాడు’ అని.

    ఆ పొక్కు గిల్లడం దాకా బాగానే ఉంది.ఆ తరువాత వచ్చే పరిణామాలే చిరాకు తెప్పించేస్తాయి! ఓ సారి గిల్లేసి ఊరుకోడు కదా, దాని స్వరూపం ఎలా ఉందో అని వేళ్ళు చూసుకోవడం, చూసేటప్పడికి, ఆ పొక్కు కాస్తా చిట్లి, రక్తం రావడం మొదలయింది. ప్రతీ నిమిషానికీ, అక్కడ చెయ్యి వేలు పెట్టడం, రక్తం ఎంతగా కారుతోందో అని చూసుకోవడం. ఇంక చివరికి, జేబులోంచి రుమ్మాలు తీసి దానితో తుడవ్వలసివచ్చింది.అంతే కాకుండా, ఆ రుమ్మాలు అక్కడ ఒత్తుగా పెట్టుకోవలసివచ్చింది. దీన్నే ‘కోతిపుండు బ్రహ్మరాక్షసి’ అవడం అంటారు. ఇదంతా ఎందుకొచ్చిందీ అంటే మనకు ఉండే కొన్ని కొన్ని అలవాట్ల వల్ల.

    ఏం పనీ లేకుండా చెయ్యి ఊరుకోదుగా!కొంతమంది గోళ్ళు కొరుక్కుంటూంటారు. ఇదివరకు నేనూ ఈ వెధవ పనిచేసేవాడిని. అదృష్టం కొద్దీ ప్రస్తుతం పళ్ళు లేవు. అందుకే ఇలాటి జ్ఞాన ప్రబోధలు చేస్తున్నాను!! ఎంతలా కొరికేసుకుంటామంటే,కొరికి ,కొరికి అక్కడ రక్తం వచ్చేస్తుంది. అది ఏ గోరుచుట్టులోకో దింపుతుంది. ఈ రోజుల్లో పిల్లలూ,పెద్దవాళ్ళూ అవేవో నెయిల్ కట్టర్స్ ట, అవి ఉపయోగించి నాజూగ్గా గోళ్ళు కత్తిరించుకుంటూంటారు. అయినా గోళ్ళు కొరుక్కోవడం లో ఉన్న సుఖం ఇందులో ఎక్కడుందండీ ? గోళ్ళు కొరుక్కుంటూంటే అమ్మ పెట్టే చివాట్లు ఎప్పుడైనా మరచిపోతామా? వీటికి సాయం ఈ గోళ్ళు కొరుక్కోడమనే ప్రక్రియ గడప మీద కూర్చొని మరీ చేయడం. ఇంక చివాట్లే చివాట్లు-ఇంటికి దరిద్రం రా అని.

   ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, నాకు ఆ నెయిల్ కట్టర్ తో స్టైల్ గా గోళ్ళుతీసికోవడం రాదు, అందుకని మామూలుగా చేత్తోనే తీసేసుకుంటూంటాను,పనేం లెదుగా,ఆ గోళ్ళేమో చాలా షార్ప్ గా తయారయ్యాయి.రాత్రిళ్ళు నిద్రలో ఏ దోమో వాలినప్పుడు, వాటిని తోలినప్పుడు,ఈ షార్ప్ గోళ్ళ ధర్మమా అని,మొహం మీద గీరుకుపోయింది. ఏదో ‘వయస్సు’ లో ఉన్నప్పుడైతే ఇలాటి ‘ గీరుళ్ళకి’ ఏదో భాష్యం చెప్పుకునేవాళ్ళం ! ఇప్పుడు అలాటివి చెప్తే బాగుండదుగా !!
మా అబ్బాయి ఆ గీరుళ్ళు చూసి నన్ను ఓ నెయిల్ కట్టర్ కొనుక్కోమన్నాడు.

   ఇంకొంత మందుంటారు, ఊరికే ముక్కులో వేళ్ళుపెట్టుకుంటూంటారు. దానితో ఆగరు, ఆవేలు చూసికొని ఏదో తాదాత్మ్యం చెందిపోతూంటారు. అది చూసేవాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుందో పట్టించుకోరు.ఇలాటివన్నీ ఒక్కొళ్ళూ ఉన్నప్పుడు చేసికుంటే ఆ ఆనందం ఏదో తనొక్కడే అనుభవించొచ్చుగా! పబ్లిక్ గా చేసి ఊళ్ళోవాళ్ళని హింస పెట్టకూడదు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Online Bus Reservations

ఇన్నాళ్ళూ ఎయిర్, రైల్వే లకే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు అనుకునేవాడిని.ఇప్పుడు దేశం లో ఎక్కడికైనా బుక్ చేసికోవచ్చని తెలిసింది.ఇప్పటికే మీ అందరికీ తెలిస్తే మంచిదే. ఊరికే కోప్పడకండి. ఈయనకేమీ పనిలేదూ,అస్తమానూ ఏదో లింకులు పోస్ట్ చేస్తూంటాడూ అని. అదో సరదా! నాకు తెలిసిన,నచ్చిన ఏవిషయమైనా ఇతరులతో పంచుకోవడం!All India Bus Services

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-ప్రవచనాలు

   ఈ వేళ సాయంత్రం మా ఇంటికి వెళ్ళినప్పుడు, మా మనవరాలు చి. నవ్య ఓ ఇంగ్లీషు పుస్తకం ఇచ్చి దానిలో ఉన్న కథ చదివి చెప్పమంది. మా చిన్నప్పుడు ఇలాటివి ఏమీ చదివిన జ్ఞాపకం లేదు.మా పిల్లలు ఎప్పుడూ నన్ను ఇలా అడగలేదు. చెప్పానుగా అన్ని విషయాలూ మా ఇంటావిడే చూసుకొనేది.పిల్లలు ఎలా చదువుతున్నారూ అని ఎప్పుడూ అడిగిన పాపానికి పొలేదు! ఏదో నేను ఎక్కడా వీధిన పడకుండా లాగించేశాను. ఇప్పుడు అలాగ కాదే. నాకు చెప్పడం రాదూ అంటే,’ఇంత పెద్దాడివి, ఆ మాత్రం చెప్పలేవా’ అంటుందేమో అని భయం! పోనీ ఎలాగోలాగ చదివేసి,తోచినదేదో చెప్పేద్దామంటే, పక్కనే కూర్చొన్న మా అబ్బాయీ, ఇంటావిడా ఏం కోప్పడతారో అని భయం ! చిన్న పిల్లలకి అర్ధం అయేలా చెప్పడం ఓ కళ. మా ఇంట్లో అందరికీ ఉంది నాకు తప్ప. ఆడవారికైతే పుట్టుకతోటే వచ్చేస్తుంది. పెళ్ళి అవగానే ప్రతీ రొజూ మనకి క్లాసులు తీసికొంటూంటారుగా, అందువలన వారికి ప్రాక్టీసు కూడా ఉంటుంది. అందువల్లే ఏదైనా నేర్పడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య !

    ఈ గొడవంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన నెట్ లోంచి చాలా ప్రవచనాలు డౌన్ లోడ్ చేశాను. శ్రీ చాగంటి కోటీశ్వరరావుగారు,శ్రీ గరికపాటి నరసింహరావు గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, వివిధ పురాణల మీద ప్రసంగించిన ప్రవచనాలు చాలా భాగం డౌన్ లోడ్ చేశాను. ఇంతకాలం నాకు వాటిమీద ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. ఏదో మా ఇంటావిడ విని ఆనందిస్తుంది కదా అనే సదుద్దేశ్యం తో చేశాను. ప్రతీ రోజూ ‘భక్తి’,’ఎస్.వి.బి.సి’ లో వచ్చే ప్రవచనాలు వినేవాడిని, అవైనా అప్పుడప్పుడే. తెలుగు న్యూస్ పేపర్లు అన్నీ చదివేసిన తరువాత, ఇంకేమీ పనిలేక పోవడంతో డౌన్ లోడ్ చేసిన శ్రీ చాగంటి కోటీశ్వర రావుగారి ‘సౌందర్య లహరి’ ప్రవచనాలు వినడం మొదలెట్టాను…

    అబ్బ! అద్భుతం ! ఎంత సరళ భాషలో చెప్పారండి! వాటిని ప్రత్యక్షంగా వినే అదృష్టం లేకపోయినా, ఈ అంతర్జాల మహిమతో మన ఎదురుగుండా ఉండి చెప్తున్నట్లుగా ఉంది. ఈ నెట్ బ్రౌజింగ్ నేర్చుకున్న తరువాత నేను చేసిన మంచి పని
ఇలాటివాటినన్నిటినీ డౌన్లోడ్ చేసికోవడమే అనిపించింది.అందరికీ అర్ధం అయేటట్లుగా చెప్పడం,వాటిని చదవకపోయినా వింటే చాలు మన జీవితం ధన్యం అయిపోతుంది. ఎందుకు ఇదంతా వ్రాస్తున్నానంటే, ఈ బ్లాగ్గులు చదివే చాలా మంది వయస్సులో చాలా చిన్నవారైఉంటారు, కానీ మీ ఇంటిలో వయస్సులో పెద్దవారు మీ తల్లితండ్రులో,తాతయ్యలో, అమ్మమ్మలో, నానమ్మలో ఉండే ఉంటారు. వారికి ఈ ప్రవచనాలని వినే భాగ్యం కలుగచేయండి. ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకి మీరు ఇంకేమీ ఇవ్వనక్కరలెదు, ఇవి చాలు ! వీటి లింకులు క్రింద ఇస్తున్నాను. ఇప్పటికే మీ అందరికీ తెలుస్తే సరి, లేకపోతే ఒకసారి చూడండి.

Pravachanam1

Pravachanam2

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

Train Timings

ఏదో వ్రాయాలని రాసేయడమే కానీ, ఈ పైన ఉన్నదాంట్లో తప్పేమిటో తెలియడం లేదు. పై బోర్డ్ లో రైళ్ళు రావలసిన టైము వ్రాశారు. క్రింద బోర్డ్ లో అవి యాక్చుఅల్ గా వచ్చే టైము వ్రాశారు.ఇది ఆ చదివిన ‘విలేఖరి’కి అర్ధం అవకపోతే రైల్వే వాళ్ళ తప్పు కాదుకదా !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-క్రొత్త పరిచయం

   ఈ వీకెండంతా మా అబ్బాయీ,కోడలూ, మనవరాలితో గడిపి ప్రొద్దుటే మా ‘గూటి’కి చేరాము. మధ్యాహ్నం ‘సుందరకాండ’ సినిమా వస్తూంటే చూస్తూ కూర్చొన్నాను.సాయంత్రం 5 దాకా దానితో కాలక్షేపం అయింది.సరే కంప్యూటర్ దగ్గరకు వద్దామనుకుంటే, అప్పటికే మా ఇంటావిడ అక్కడే సెటిల్ అయి కనిపించింది. ఇప్పుడే కూర్చొన్నాను,అప్పుడే తయారా అంది.ఇదికాదు పధ్ధతీ అని రిలాక్స్ అవుతున్నాను. ఇంతలో ‘మీ ఫ్రెండెవరో ఆన్లైన్ లో హల్లో అంటున్నారూ, చూడండి’ అంది. దొరికిందే చాన్స్ అని వచ్చి చూస్తే ఇందుకూరి శ్రీనివాస రాజు ( తెలుగు బ్లాగర్–‘పడమటి గోదావరి రాగం’ ).అతను పూణే లోనే ఉన్నానని చెప్పాడు.సరే ఎక్కడా అని అడిగితే మేము ఉండే ప్రదేశానికి కొంచెం దూరం లోనే ఉన్నాడని తెలిసి, మేం ఉండే ఏరియా చెప్పి రమ్మన్నాను.

    ఓ పదిహేను నిమిషాల్లో సాయంత్రం 6.15 కి వచ్చాడు.ఏదో ఫార్మల్ పరిచయాలూ అవీ అయిన తరువాత ఇంక ఖబుర్లు మొదలెట్టాము.మర్చిపోయానండోయ్ చెప్పడం, వచ్చేటప్పుడు నా పేవరెట్ బెల్లం మిఠాయి తెచ్చాడు.ఇంతా చేస్తే, శ్రీనివాసరాజు, మా అబ్బాయికంటె ఓ నాలుగు రోజులు మాత్రమే చిన్న ! ఇతనితో ఏం మాట్లాడతాములే అని కొంచెం సంకోచించాను.ముందర ‘మీరూ’ అని ఎడ్రస్ చేసి, ‘నువ్వు’ లోకి దిగిపోయాను. పాపం మొహమ్మాటానికి ‘పరవా లేదండీ’ అన్నాడనుకోండి. ఏదో నా వయస్సు అడ్డంపెట్టుకొని,ఇలా జబర్దస్తీ చేస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు?

   ఎవరైనా కొత్తవాళ్ళు వస్తే నన్ను పట్టుకునే వాడెవరూ? అవతలి వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఏదో వాగేస్తూంటాను.మా ఇంటావిడ అనేదేమిటంటే’అస్తమానూ మీరే మాట్లాడుతారూ, అవతలి వాళ్ళకు ఛాన్సెక్కడిస్తారూ’అని.అంటే ‘ప్రతీ రోజూ నువ్వు మాట్లాడేవన్నీ వింటున్నానా లేదా, ఏదో దొరక్క దొరక్క ఛాన్సొస్తే నీకెందుకూ దుగ్ధ ‘ అంటూంటాను ! మా దెబ్బలాట చూసి ఆ వచ్చిన అబ్బాయి హడలిపోతాడేమో అని నా బెంగ.బ్లాగ్గులమీద కొంచెంసేపు మాట్లాడుకున్నాము.తను తెలుగులో మొదట బ్లాగ్గు ప్రారంభించినప్పుడు ఎలా ఉండేదో, తనని సీనియర్ బ్లాగర్లు ఎలా ప్రోత్సహించేవారో అన్నీ చెప్పాడు.నా గొడవేదో నేను చెప్పాను.
అవీ ఇవీ ఖబుర్లు చెప్పుకుంటూంటే మధ్యలో అతని భార్య దగ్గరనుండి ఫోన్ వచ్చింది, దానికి సమాధానంగా ‘ఇదిగో వచ్చేస్తున్నాను పది నిమిషాల్లో’అన్నాడు. ‘ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి వచ్చానండి, అప్పుడే 2 గంటలయింది’ అన్నాడు.
అన్ని ఖబుర్లూ పూర్తి చేసికొని, ఇంక క్రిందికి వచ్చి ఇంకో అరగంట ఖబుర్లు చెప్పుకున్నాము! అంతా కలిపి 3 గంటలు పూర్తయింది ! చెప్పొచ్చేదేమిటంటే, నేను ఒక పూర్వ పరిచయం లేని వ్యక్తిని మూడు గంటల సేపు కూర్చోపెట్టకలిగాను.

   మా ఇంటావిడంటుందీ ‘ పాపం మీరు చెప్పే లెక్చర్ వినలేక ఎంత బాధపడ్డాడో, మొదటిసారే అలా భయ పెట్టేస్తే ఇంకోసారి మళ్ళీ అడుగెట్టడు’అని.
ఈ సారి వచ్చేటప్పుడు తన భార్యని తీసికొస్తానని,చెప్పాడు. చూద్దాం! నాతో ఖబుర్లు నచ్చాయో లేక బోరు కొట్టాయో! నా అనుభవంలో ఉన్న విషయం ఏమంటే, ఎవరైనా సరే, బయటివాళ్ళతో గడపడానికి ఎప్పుడూ ముందే ఉంటారు!ఇంట్లో వాళ్ళకి వీళ్ళ విషయం అంతా ముందే తెలుసుగా! చెప్పిందే చెప్తూ, విన్నదే వింటూ ఎన్నిసార్లు ఓపిక పడతారూ? దేనికైనా ‘ ప్రెష్ నెస్’ అనేది ఉంటేనే అందరికీ బాగుంటుంది.
Thank you Srinivas, for the nice company you gave us. God Bless you& your wife.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–వామ్మోయ్

Cost of Lower KG

బ్రతికిపోయాను !!

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–‘జైసే కో తైసా’

    కొంతమందికి నోట్లో ఏదో నములుతూ మాట్లాడడం అలవాటు. రికీ పాంటింగ్ ని చూడండి, ఫీల్డ్ లో ఉన్నంతసేపూ ఏదో (చూయింగ్ గం అనుకుందాము) నములుతూనే ఉంటాడు.అది తన అలవాటు కావొచ్చు లెక అవసరం అవొచ్చు. అది ఈ నవయుగంలో తప్పు కాకపోవచ్చు. కానీ మాకు చిన్నప్పుడు ఓ సంగతి చెప్పారు-ఎప్పుడూ నోట్లో ఏదో మేక లాగ నెమరేస్తూ మాట్లాడకు అని. ఈ విషయం పెద్దవారితో మాట్లాడేటప్పుడు తప్పకుండా పాటించమనేవారు.ఇప్పటి వారికి ఇది చాదస్థంగా అనిపించొచ్చు. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా సరే అలా ఏదో నములుతూ మాట్లాడేవారిని చూస్తే మాత్రం చాలా చిరాకేస్తుంది. ఎవరి అభిప్రాయం వారిది.

కిళ్ళీ అలవాటున్నవారు, నోట్లో కిళ్ళీ మెళుకువగా ఉన్నంతసేపూ ఉండాల్సిందే. చిన్నప్పుడు కిళ్ళీ తింటే చదువురాదనేవారు. అందువలన ఆ అలవాటు రాలేదు. అలాగని చదువూ రాలేదు !చెప్పానుగా ‘తేగ’ లోని ‘చందమామ’, కిళ్ళీ ఈ రెండూ నిషేధం. ఏమిటో అనుకుంటాము కానీ, ఇలాటివి మానేస్తే చదువొస్తుందా? తలరాత కూడా ఉండాలండి బాబూ. ఈ కిళ్ళీ లలో మళ్ళీ రకాలు–జర్దా కిళ్ళీ, మిఠాయి కిళ్ళీ అని.ఇప్పుడు ఎవడూ అడిగేవాడు లేడూ అని పోనీ కిళ్ళీ వేసికుందామా అంటే అసలు పళ్ళే లేవు!! ఈ పళ్ళు లేకపోవడం వలన కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలు మిస్స్ అయిపోతున్నాను.మామిడిపళ్ళ సీజన్ లో ముక్కలు చేసి తీసికోవడానికి కుదరదు. ఓ స్పూన్ తో నైస్ గా తిసికోవలసి వస్తుంది. అదేదో స్టైలూ ఫాషనూ అనుకుంటారు. నా కష్టం ఎవరికి తెలుస్తుంది? మా మనవరాలు అస్తమానూ నన్ను ఆట పట్టిస్తూంటుంది.ఎవరికెంత రాసుందో అంతే ప్రాప్తం !!

ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను.అసలు ఈ పోస్ట్ దేనిగురించంటే, ఇక్కడ మహారాష్ట్రా లో ఇంకో అలవాటోటి ఉందండోయ్- ‘తంబాకూ'(అంటే మన పొగాకు) వాటిని పొడి చేసి ప్యాకెట్లలో అమ్ముతారు. అది చేతిలో వేసికొని,దాంట్లో సున్నం వేసి,ఆ రెండింటినీ శుభ్రంగా పొడి చేసేసికొని,పైన వచ్చే పొట్టులాటిది ఊదేస్తాడు. మన ఖర్మ కాలి ఎదురుగుండా ఉన్నామనుకోండి, ఆ డస్ట్ అంతా మన కళ్ళలోకి వెళ్తుంది. పొట్టు ఊదేయగా మిగిలిన పౌడర్ ని స్టైల్ గా కుడిచేతి బొటను వేలూ, చూపుడు వేలూ కలిపి( ప్రాసెసింగ్ అంతా ఎడమ అరచేతిలో చేస్తారు), ఎడమ చేత్తో క్రింది పెదవిని కొంచెం ముందుకు లాగి, ఆ రెండు వేళ్ళలోదీ అక్కడ పెట్టుకుంటాడు. అది అక్కడ ఊరుతూ ఉంటుంది. ఆజ్యూస్ ని మింగుతూ తాదాత్మ్యం చెందిపోతాడు. చెప్పానుగా ఎవరి అలవాటు వాళ్ళది. దీనిలో ఏమీ తప్పులేదు.ఈ మధ్యన ఎక్కడ చూసినా పాన్ పరాగ్ లేదా ఇంకోటి-వాటి అన్నింటిలోనూ ఉండేది పొగాకే. ఎక్కడ చూసినా పది పదిహేనేళ్ళ పిల్లలు కూడా దీనికి బానిసలయ్యారు. దీంట్లోంచి బయటకు తీయడం ఆ భగవంతుడిక్కూడా సాధ్యం కాదు.ఆ సంగతి వదిలేయండి.

ఇది తింటున్నంతసేపూ, జ్యూసులాటిది ఊరుతుంది కదా, దాన్నంతా ఎక్కడ మింగకలుగుతాడూ, ప్రతీ రెండు మూడు నిమిషాలకీ ఉమ్మేస్తూండాలి.ప్రస్తుత పోస్ట్ ఈ ‘ఉమ్మేయడం’ అనే దౌర్భాగ్యపు అలవాటు గురించి.ఏ ఆఫీసు,రోడ్డు చూసినా ఈ దరిద్రపు మరకలతో నిండి పోయుంటాయి. ఆఫీసుల్లో మెట్లమీదుగా వెళ్ళేటప్పుడు చూడండి-కార్నర్లు అన్నీ ఈ డిజైన్ తో నిండిపోతాయి.లిఫ్ట్ లని కూడా వదలరు ఈ ‘పక్షులు’.కొన్ని కొన్ని ఆఫీసుల్లో అయితే, కొంతమంది తెలివైన వాళ్ళు ఆ కార్నర్ లలో ఏ దేముడి బొమ్మైనా పెట్టేస్తూంటారు. ఈ ఉమ్మేవాళ్ళ కి ఏదో దైవ భీతి ఉంటుందిగా అందువలన కొన్ని కొన్ని ఆఫీసుల మెట్లు ఇంకా శుభ్రంగానే ఉంటున్నాయి.

కొంతమంది ట్రైన్ లో కానీ, బస్సులో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు, అడిగి మరీ ‘విండో సీట్ ‘ తీసికుంటారు. అదేదో ప్రకృతి ని ఆస్వాదిద్దామనుకొని కాదు, నోరారా ఉమ్మేసికుందామని మాత్రమే. వాడిదేం పోయింది,మింగినంత మింగి, మిగిలినది ఆ కిటికీలోంచి ఉమ్మేయడమే. నోట్లో ఉన్నది పూర్తి అయిపోతే, మళ్ళీ కిళ్ళీయో, తంబాకో, పాన్ పరాగ్గో వాడి నెత్తో మళ్ళీ దట్టించేయడమే. ఇంతవరకూ ఎవడిష్టం వాడిది. కానీ ఈ ఉమ్మేయడమనే ప్రక్రియ వెనక్కాల సీటుల్లో కూర్చొన్న వారికి ప్రాణాంతకమౌతుంది. ఎందుకంటే వీడు ఉమ్మేసినదంతా వెనక్కాల వాళ్ళ మీద స్ప్రే అవుతుంది. వీడికేమీ పట్టింపు లేదు. చెప్పినా వినడూ.ఆ మాత్రం సంస్కారం లేకపోతే కష్టమండి బాబూ !!

ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఈవేళ సిటీ బస్సులో 20 రూపాయల టిక్కెట్టు కొనుక్కుని, ఊరంతా తిరుగుదామని బయలుదేరాను. మూడు సీట్లకి ముందులో ఓ పెద్దమనిషి కూర్చొన్నాడు. ఈయన నోటినిండా తంబాకో, మరోటో దట్టించినట్లున్నాడు, ప్రతీ రెండు నిమిషాలకీ ఎదో తుంపరల్లా పడుతూంటే, ఏమిటా అని చూస్తే, ఈయన కనిపించాడు. కండక్టర్ తో చెప్పి, నా కొచ్చిన అసౌకర్యం చెప్పాను. పాపం కండక్టర్ నామీద జాలి పడి, వెళ్ళి అతనితో చెప్పాడు. అతనేమన్నాడంటే, బస్సుల్లో సిగరెట్ కాల్చకూడదన్నారు కానీ,తంబాకూ తినకూడదని రూల్ లేదూ, నా ఇష్టం, నాకు తోచినది తింటానూ అన్నాడు. వీడు వినేటట్లుగా లేడనుకొని, మెల్లిగా విండో గ్లాసు వేసేశాను, లేనిపోని గొడవెందుకూ అని.
వీడి ఉమ్ముల కార్యక్రమం సాగుతూనే ఉంది. ఇలాటి సంస్కార హీనుల్ని బాగుచేయడం ఎవరి తరం? అనుకున్నంత సేపు పట్టలేదు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది, ఇంతలో, ఓ యువకుడు లోపలికి వచ్చి, వీడి కాలరు పట్టుకుని,ఎడా పెడా తిట్టడం మొదలెట్టాడు. జరిగిన సంగతేమయ్యా అంటే బస్సు ఆగినట్లు గమనించక, ఈ దరిద్రుడు అలవాటు ప్రకారం బస్సు విండో లోంచి తుపుక్కున ఉమ్మేశాడు. అదివెళ్ళి, ప్రక్కనే బైక్కు మీద ఆగిన కుర్రాడి షర్ట్ మీద స్ప్రే అయింది. ప్రక్కకు చూస్తే, బస్సులోని ఈ మానవుడు, నోరు తుడుచుకుంటూ కనిపించాడు. అంతే బైక్కు స్టాండ్ వేసేసి, బస్సు లోకి వచ్చాడు. అందరూ అడ్డ పడి ఆపకపోతే, వీడి పని అయిపోయేదే ఈవేళ. జీవితంలో మళ్ళీ కిటికీలోంచి ఉమ్మేయడు!!.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఇలాగ ఉండాలి

online

పట్టువదలని ‘విక్రమార్కిణి’