బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు… To be or not to be…

        ఈ శతాబ్దపు ప్రారంభం లో అనుకుంటా  ఈ ఇంటర్నెట్లూ, PDF  లూ రంగం లోకి వచ్చాక, అచ్చుపుస్తకాలు చదివే అలవాటు అటకెక్కేసింది.. కొన్నివేలు ఖర్చుపెట్టి పుస్తకాలు అచ్చువేయించినా, కొనే నాధుళ్ళు తక్కువైపోయారు.. పూర్వపు రోజుల్లో , నవలల మాటటుంచి, మిగిలిన పుస్తకాలు , తమకున్న పలుకుబడిని బట్టి, రాష్ట్రంలో ఉండే, పీద్దపెద్ద గ్రంధాలయాలకు, బలవంతంగా అంటగట్టిన రోజులు కూడా ఉన్నాయి..  ప్రభుత్వంలో ఓ సీనియర్ పొజిషన్ లో పనిచేసాక, అవేవో  రాస్తారు.. వారు నిర్వహించిన పదవినిబట్టి అమ్ముడవుతాయి..

 మా చిన్నప్పుడు కూడా, ఏదో పేరు గడించాకైతే పరవాలేదుకానీ, వాళ్ళక్కూడా పుస్తకాలు అమ్ముడుబడేవి కావు..అయినా ఓపిగ్గా అచ్చేయించుకునేవారు..అదృష్టాన్ని బట్టి, రెండో ముద్రణ, ఒక్కోప్పుడు మూడో ముద్రణక్కూడా వెళ్ళేవి..పేరునుబట్టి..

 ఏదెలాఉన్నా, పుస్తకాలు రచించడం మాట ఓ ఎత్తైతే, వాటిని ప్రింట్ చేయించుకోవడం చాలా ఖర్చుతోకూడిన పని.. పుస్తకాల ఖరీదులు కూడా proportional  గా, వందల్లోకి వెళ్ళాయి..

 నేను రాయడం మొదలెట్టి ఓ 10 సంవత్సరాలవుతోంది..  ఇప్పటిదాకా ఓ 1500 వ్యాసాలదాకా రాసుంటాను.. వివిధ మాధ్యమాల్లో.. వాటికి ఎటువంటి  సాహిత్యవిలువా ఉంటుందనుకోను.. ఏవో కాలక్షేపం కబుర్లు.. అదికూడా సాధారణ వాడుకభాషలో మాత్రమే.. ఏం చేయనూ నాకొచ్చింది కూడా అంతే.. చివరకి ఆ రాసేదాంట్లో కూడా, ఎన్నో భాషాదోషాలు కూడా పుష్కలంగా ఉంటాయి.. అలాగనిచెప్పి, ఈ వయసులో సమాసాలూ, ఛందస్సూ నేర్చుకునే ఓపికా లేదాయే.. మరి ఆ భగవంతుడి అనుగ్రహమో, లేక నా పూర్వజన్మ సుకృతమో కానీ, నా ఈ “ కాలక్షేపం కబుర్లు “ కూడా చదివేవారు చాలామందే ఉన్నారు.. దేశవిదేశాల్లో  తెలుగు చదవడం వచ్చినవారు.. అది నా అదృష్టం.. చదివేవారందరికీ నా మనఃపూర్వక వందనాలు..

 అలాటి ఓ శ్రేయోభిలాషి, ఓ పెద్దాయన ఓ సలహా ఇచ్చారు.. గత 10 ఏళ్ళుగా రాస్తూన్న వ్యాసాలలో, నాకు నచ్చిన కొన్ని వ్యాసాలు , పుస్తకరూపం లో తీసుకురమ్మని.. Somehow  ఎంత ఆలోచించినా, పుస్తకరూపంలోకి తీసుకురావడానికి , ఏమిటో మొగ్గు చూపలేకపోతున్నాను.. కారణాలు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా అది ఖర్చుతో కూడిన పని..  ఈమధ్యన చవకలో పుస్తకాలు ప్రచురించే ఒక సంస్థ తో పరిచయం కూడా అయింది…నేను రాసినవి, ఒక్కో వ్యాసం..మహా అయితే ఓ రెండు పేజీలదాకా రావొచ్చు.. అంటే నేను రాసిన 1500 కి పైగా వ్యాసాల్లో, నాకు నచ్చినవి తీసుకున్నా చాలా అవొచ్చు.. పోనీ చేసానే అనుకుందాం.. చదివేవారెవరండి బాబూ? ఇంక ఆ పుస్తకం ప్రచురించాక దాన్ని అమ్మడానికి చాలా తిప్పలు పడాలి.. ఇదెలాటిదంటే, కొంతమంది రిటైరయాక ఇన్స్యూరెన్స్ ఏజంట్/ చిన్నమొత్తాల ఏజంట్ గా చేస్తూంటారు.. వారికి ఉద్యోగంలో ఉండగా తెలిసినవారందరినీ బలవంతపెట్టడం.. ఒసారి మొహమ్మాటపడతారు ఈ పరిచయస్థులు.. రెండోసారి ఈయన ఫోను చేసినా ఎత్తని పరిస్థితి.. దారిలో కనిపించినా, మొహం చాటేస్తారు.. మళ్ళీ ఏ పాలసీ తీసుకోమంటాడో అనే భయంతో..అలాగే ఈ పుస్తకాల విషయం కూడా..నాకు తెలిసినంతవరకూ తెలుగుపుస్తకాలు ప్రచురించి, అమ్ముకుని, లక్షలూ కోట్లూ సంపాదించినవారు, ఇదివరకటి రోజుల్లో ఉండొచ్చేమో కానీ, గత పదేళ్ళలోనూ చూసినజ్ఞాపకం లేదు.. పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.. నగరాల్లో పుస్తకాల దుకాణాలు కూడా ఉన్నాయి.. కాదనం.. కానీ, పుస్తకాలు కొని చదివేవారిని వేళ్ళల్లో లెక్కెట్టొచ్చు..అసలు పుస్తకపఠనమే  అటకెక్కేసింది.. ఒకానొకప్పుడు,  పెద్దపెద్ద ఇళ్ళుండేవి.. పైగా దాంట్లో కూడా స్టడీ రూమ్ము ఉండేది..గదినిండా అద్దాల బీరువాలూ, వాటినిండా పుస్తకాలూ అవీనూ.. నిండుగా ఉండేది. ఇప్పుడున్న ఎపార్ట్మెంట్లలో ,  భార్యాభర్త, ఇద్దరు పిల్లలకే సరిపోక, తల్లితండ్రులు కూడా చుట్టపు చూపుగానే వచ్చే ఈ రోజుల్లో, పుస్తకాలూ, అద్దాల బీరువాలూ సాధ్యమయే పనేనా?  ఇంట్లో అప్పటిదాకా ఉన్న పుస్తకాలకే ఠికాణాలేనప్పుడు, పుస్తకాలు కొనేదెవరు?

 అంతర్జాలం వచ్చి, e-books  ప్రాచుర్యంలోకి వచ్చాక, చాలామంది, Kindle  లో చదువుకోవడం సదుపాయంగా భావిస్తున్నారు.. ఎక్కువ స్థలం ఆక్రమించదూ.. కొంతమందనొచ్చు, తెలుగుపుస్తకాలు అంత ఎక్కువగా లేవని.. so what?  అంతర్జాలం లో కొన్ని వేల పుస్తకాలు అవీ తెలుగులో,pdf  రూపంలో లభ్యం అవుతున్నాయి, వివిధ రకాల సైట్లలో..ఆ పుస్తకాలు చదవడం పూర్తయాక డిలీట్ చేసేసుకున్నా అడిగేవాడు లేడు.. ఓ  External Hard Disk  తీసేసుకుంటే, వేలకొద్దీ పుస్తకాలు దాచుకోవచ్చు.. ఓపికున్నప్పుడు చదువుకోవచ్చు.. లక్షలూ, కోట్లూ ఖర్చుపెట్టి సినిమాలు నిర్మిస్తారు.. వాటిని పైరేటెడ్ విడియోలుగా తీసుకొచ్చినప్పుడు, నానా హడావిడీ చేసారు.. ఈ కరోనా ధర్మమా అని, సినిమాలు థియేటర్లలో చూసే నాధుడు లేక,  O T T  ల కి అమ్ముకుంటున్నారు కదా.. అలాగే పుస్తకాలు కూడా, ఎంత ఖర్చుపెట్టి అచ్చేయించారూ అన్నవిషయం ఎవరికీ పట్టదు.. చవకలో ఎక్కడదొరుకుతాయీ అన్నదే కొచ్చను…పైగా, కాగితం వాడకపోవడం మూలాన ఎన్ని చెట్ట్లు కాపాడేమో, పర్యావరణానికి ఎంత ఉపయోగపడితోందో అనే జ్ఞానబోధలు కూడా నచ్చినా నచ్చకపోయినా భరించాలి…

 ఇన్నేసి ఈతిబాధలుండగా, ఎవరిని ఉధ్ధరించాలని పుస్తకం అచ్చువేయడం చెప్పండి? పైగా ఈ కాగితాలకి కూడా ఓ  Shelf life  ఉంది.. కొంతకాలానికి రంగు మారుతుంది, అట్ట చిరుగుతుంది, కాగితం fragile  గా అయిపోతుంది.. అంతర్జాలం లో అదేదో ఈ రోజుల్లో  Cloud  లో save  అవుతాయిటకూడానూ.. అక్కడే పెర్మనెంట్ గా ఉండి, చదవాలనుకునేవారికి ఎప్పుడైనా అందుబాటులో ఉంటుందేమో కదూ…

ఈ పుస్తకాలు అచ్చేయించాక, తన స్నేహితులందరికీ సందేశాలు పంపి మొహమ్మాటపెట్టడం అంత అవసరమంటారా? హాయిగా ఓపికున్నన్నాళ్ళూ రాసుకోవడం, ఎవరైనా చదివారా సంతోషం.. చదవలేదూ .. ఎవరిష్టం వారిదని ఓ దండం పెట్టడం.. ఏమంటారు ?