బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–స్కామాయణం !

>   ఇప్పుడు మనదేశంలో ఎక్కడ చూసినా వినే మాటేమిటంటే స్కాం !పైగా ఎక్కడిదాకా వచ్చిందంటే ఏ సి.బి ఐ వాడో రైడ్ చేయడం ఓ Status symbol అయిపోయింది.అవసరం ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వం కూడా ఓ సి.బి.ఐ ఎంక్వైరీ పెట్టేస్తోంది. పైగా ఆ శాఖకి అంతంతేసి జీతాలిచ్చి పోషిస్తున్నామాయిరి! వాళ్ళకీ తెలుసు, ఎంతమందిని పట్టుకున్నా, ఏమీ అవదూ అని. ఊరికే వాళ్ళకీ, వీళ్ళకీ ఓ కాలక్షేపం!

   ఎంత హడావిడండి బాబూ, సి.బి.ఐ ఎంక్వైరీ వేయమని ముందుగా రాజకీయ పార్టీలు గొడవ చేయాలి,కొద్దిరోజులు బెట్టుసరి చేసి, ప్రభుత్వం కూడా సరే అనాలి, ఆ తరువాత, వాడేదో మినిస్టరో ఇంకోడో అయితే, ప్రభుత్వం అనుమతివ్వాలి,తీరా ఇచ్చిన తరువాత ఈ మంత్రిగారి పార్టీ వాళ్ళు అదేదో కులానికి సంబంధించినవారు కాబట్టే, ఇలాటి ఎంక్వైరీలూ అని గొడవ పెట్టాలి, ఈ బాలారిష్టాలన్నీ దాటి ముందుగా రైడ్లూ, వాటినే సోదాలూ అంటారుట, ఈ సి.బి.ఐ వాళ్లు సిమెంటు బస్తాల్లో ఏవేవో నింపేసి, ఓ నాలుగైదు చానెల్స్ వాళ్ళని పిలిచి, వాళ్ళెదురుగా, ఈ సిమెంటు బస్తాలు తీసికెళ్ళడం. వాటిలో ఉండేవేమిటీ, మనం ఏ రెండు మూడు నెలలకో, పాత పెపర్లవాడిని పిలిచి అమ్మేస్తాం చూడండి, అలాటి రద్దీ అన్నమాట!పోన్లెద్దూ, ఈ విధంగానైనా ఇంట్లో ఉండే చెత్తంతా వదిలిందీ అనుకుంటారు, ఈ రైడ్లు జరపబడిన వాళ్ళందరూ. ఇప్పటిదాకా ఇన్ని రైడ్లు జరిగాయి, ఒక్కచోటేనా, దొరికినవేవో చెప్పారా? ఇదేమిటంటే mutually accepted tamaashaa ! వాడితో రెండు మూడు నెలలముందరే చెప్పేస్తారు- చూడు నాయనా, నీ ఆఫిసూ, ఇళ్ళమిదా ఫలానా బ్రహ్మముహూర్తంలో రైడ్లు చేయడానికి నిశ్చయింపబడిందీ కావున, నీవు తీసికోవలసిన జాగ్రత్తలేవో, ముందుగానే తీసికుని, మదర్పిత చందన తాంబూలాలు స్వీకరించ ప్రార్ధన, మంగళం మహత్-ఇట్లు విధేయుడు… అని! అలా తీసేయమన్నాము కదా అని అన్నీ ఖాళీ చేసేయకు, ఏదో చిల్లర ఖర్చులకీ, మీడియాకి చూపించడానికి కొద్దిగా ఉంచు, మరీ అంత నీతి నిజాయితీ పరుళ్ళా ఏమీ ఉండఖ్ఖర్లేదులే. ఎలాగూ కోర్టుకెళ్లాక ‘for want of sufficient proof అని మన చేతిలో ఓ బ్రహ్మాస్త్రం ఉందిలే, దానిద్వారా బయటకొచ్చేయొచ్చు! బస్ అంతే!

   లేకపోతే ఓ సంగతి చెప్పండి, 1970 నుండీ ఇంతంతమంది రాజకీయ నాయకులమీద అన్నేసి ఎంక్వైరీలూ, రైడ్లూ చేశారే, అందరూ ‘పతివ్రత’ లే అంటారా? అప్పటినుండి అన్ని పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి, ఒక్కడంటే ఒక్కడు అరెస్టయి,జైల్లో పెట్టడం చూశామా? పైగా ప్రతీ దౌర్భాగ్యుడూ, చాయ్ కెటిల్ తో మొదలెట్టి కోట్లకు పడగెత్తినవాడే! ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో, ఏ దరిద్రుడు ఎక్కడ ఉపయోగానికొస్తాడో తెలియదు.ఊరికే కెలకడం ఎందుకూ? అదీ మన ప్రభుత్వాల పాలసీ!

   ఎక్కడ చూడండి, ఎదో ఒక స్కామే! వాటన్నిటి గురించీ వ్రాయాలంటే, మహాభారతమంత తయారవుతుంది.నిన్నెక్కడో చదివాను, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ మీద కూడా అరోపణలు చేశారు, కృష్ణయ్యర్! మన న్యాయవ్యవస్థే ఇలా బ్రష్టు పడిపోతే మనల్ని కాపాడేవాడెవడు? వాడెవడో హర్యానాలో డీ.జీ.పీ సంగతి తీసికోండి, లేకపోతే మా Ordnance Factory మాజీ Chairman సంగతే తీసికోండి.మనం వీళ్ళకిందా పనిచేసిందని తల్చుకుంటేనే అసహ్యం వేస్తోంది.
ఏదో ఆ మన్మోహన్ సింగు గారు, 2G Scam విషయంలో, ఎప్పుడు కావలసిస్తే అప్పుడు వచ్చి తనమీదొచ్చిన ఆరోపణలకి సమాధానం PAC ముందర ఇవ్వడానికి రెడీ అంటూంటే, మా మురళీ మనోహరుడు ఇంకా సమాధానం చెప్పడం లేదు,
ఈ లోపులో మిగిలిన BJP నాయకులేమో, ఈయన ఇలావచ్చి చెప్తే, ఆమధ్య పార్లమెంటులో వీళ్ళందరూ చేసిన అల్లరి dilute అయిపోతుందేమో అని గోలా! ఎలాగూ వచ్చేదేమీ లేదు,సింగుగారిని రానిచ్చి ఆయనచెప్పేదేదో వింటే నష్టమేమిటిట?

   కల్మాడీ మీద గొడవొచ్చి అప్పుడే మూడు నాలుగు నెలలయింది, అప్పుడేమో ఇదిగో గేమ్ములవనీయండి, తరువాత చూద్దాం అన్నారు. ఆ తరువాత Asian Games అన్నారు, మెల్లిగా పేరంటానికెళ్ళినట్లు, సావకాశంగా రైడ్లు చేశామూ అంటే దొరికేవి ఏమిటంట? పైన చెప్పినట్లుగా ఇదంతా Well orchestrated show, for public consumption. వాళ్ళంతా బాగానే తింటారు. మనమే ఊరికే ఆయాసపడిపోయి, ఊరికే బి.పీ.లు పెంచేసికుని మన ఆరోగ్యాలు తగలెసికుంటున్నాము. ఏ చానెల్ వాడికో ముట్టచెప్పవలసినది ముట్టచెప్పకపోతే వాడు కాస్తా ఓసారి కెలుకుతాడు. చూశాముకదా మన జర్నలిస్టులు ఎలా ఉన్నారో?

   వాడెవడో అఫ్జల్ గురూ కి ఉరిశిక్ష వేశారు, వాడేమో క్షమాభిక్ష అడిగాడుట. ఇస్తున్నారో లేదో తేల్చి తగలెయ్యొచ్చుకదా త్వరగా! అబ్బే, మళ్ళీ ఎక్కడో ఏదో ఉపద్రవం జరిగేదాకా చూడాలి.ఈ లోపులో అన్ని సాక్ష్యాలూ శుభ్రంగా ఉన్నాసరే, ఆ దరిద్ర దౌర్భాగ్యుడు కసబ్ ని ఇంటల్లుడిలా చూస్తున్నాము. ఇదెక్కడి Legal system అండి బాబూ? ఏమైనా అంటే Contempt of court అంటారు. పోనీ ఆ కోర్ట్లు చెప్పేవైనా వింటారా అంటే అదీ లేదు, అప్పుడెప్పుడో పాడైపోతున్న ధాన్యం బీదవారికి ఇచ్చేయకూడదా అంటే ఠాఠన్నారు! ఏమిటో రోజులెళ్ళిపోతున్నాయి !

   బైదవే ఈవేళ్టి పూణె టైమ్స్ లో మా లైబ్రరీ Article – Books are on the home delivery menu now గురించి ఒక వార్త వచ్చింది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పూణె లో కూడా బంధ్ చేశారోచ్…

   పూణె లో కూడా నిన్న బంధ్ చేశామోచ్! అదేమిటీ ఒక్కరోజు బంధుకే, అదేదో గొప్పవిషయంలా చెప్పేస్తున్నారూ, మాకైతే ప్రతీ రోజూ ఎవడో ఒకడు దీక్షచేసేవాడే, ఎక్కడో అక్కడ బందులే, పేద్ద అదేం గొప్పమ్మా , ఇక్కడ భాగ్యనగరంలో, నిమ్స్ లో అయితే,నిరాహార దీక్షలకి ఓ ప్రత్యేక వార్డు కూడా తెరిచేశారు అని మాత్రం అని, నా ఉత్సాహం మీద చన్నీళ్ళు పోసేయకండి ప్లీజ్ !

   Actual గా నేనిక్కడ ఉంటున్నది 1963 నుంచేనైనా అంటే అక్షరాలా రేపు ఫిబ్రవరికి 48 ఏళ్ళు పూర్తవుతాయి,అయినా ఇంకో రెండేళ్ళుండకపోతానా అని అడిగినవాడికీ, అడగనివాడికీ, 50 ఏళ్ళని చెప్పేస్తూంటాను, టెండుల్కర్ 50 వ సెంచరీ లాగ! విండానికి బాగుంటుంది, అబ్బా అన్నేళ్ళనుండి ఉంటున్నారా అని అనిపించుకోవడం బాగుంటుంది, ఇక్కడ శివసేన వాళ్ళకీ, MNS ( రాజ్ ఠాక్రే) నేనూ మరాఠీవాడినే అని చెప్పుకోడానికీ బావుంటుంది! రేపెప్పుడైనా రాష్ట్ర విభజనలు జరిగితే, నన్నెవడూ settler అనఖ్ఖర్లేకుండా ఉంటుంది. ఏం చెప్తాం, ఎవడికో తిక్క రేగిందంటే, ఏదైనా దీక్షలూ, పోరాటాలూ మొదలెట్టినా మొదలెట్టొచ్చు!

   ఇంక అసలు విషయానికొస్తే, ఈ 50 ఏళ్ళలోనూ, ఇక్కడ ఈ బంధులూ వగైరాలు చూడలేదు, ఏదో ఏ పనీ లేనప్పుడు, మా సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగులు చేసేవారే అలాటివి తప్ప,లేకపోతే బ్యాంకు వాళ్ళూ, LIC వాళ్ళూ తప్ప. అందుకని అరుదుగా వచ్చే, నిన్నటి బంధ్ కొద్దిగా పేపర్లలోనూ, టి.వీ. ల్లోనూ వచ్చేసింది.వాళ్ళకీ అనిపించుండొచ్చు, ఇదేమిటీ పక్కనే ఉన్న ఆంధ్రాలో ఎంత హడావిడీ, ఎప్పుడు చూసినా ఏదొ ఒకటి చేస్తూనే ఉంటారూ, అమ్మయ్య మన రాష్ట్రంలోకూడా, ఒక్కరోజుకైనా సరే చేస్తున్నారూ అని! ఏమైతేనేం, ఉన్న కొద్దిమంది పోలీసుల్నీ మోహరించేశారు, కొద్దిమంది అని ఎందుకన్నానంటే, ఇక్కడి పోలీసులెప్పుడూ, ఆంధ్రాలోనే ఉంటారు!

   బంధ్ చేయడానికి పేద్ద కారణమంటూ ఏం లేదు. అప్పుడెప్పుడో శివాజీ మహరాజ్ గారి గురువుగారుట, బాబా ఖొండ్ దేవ్ గారి విగ్రహం, అక్కడెక్కడినుంచో తీసేశారుట అదీ సంగతి. ఇక్కడ BJP గురించి ఓ విషయం చెప్పుకోవాలి,వాళ్లు బ్రతికున్నవాళ్ళకంటే, చరిత్ర లోకి వెళ్ళిపోయినవారిగురించే ఇలాటి agitations చేస్తూంటారు. అక్కడ అయోధ్య వివాదం చూడండి అలాగన్నమాట.కోర్టులో ఓ కేసేస్తే, అదంతా తేలేటప్పటికి, ఎలాగూ ఓ 50 సంవత్సరాలు పూర్తవుతుంది, ఈ లోపులో వీళ్ళకీ కాలక్షేపం!

   మరీ ఏం గొడవలు ఉండడంలేదే అని ఓ పార్టీ (ఇక్కడ NCP,Congress) అనుకుంటుంది, పైగా పూణె ముద్దుబిడ్డ కల్మాడీ కామన్వెల్తు గేమ్స్ లో కొంత నొక్కేశాడని ప్రతీ వాడూ అంటున్నారు, అదేంటమ్మా, ఆమాత్రమైనా నొక్కేయకపోతే, ప్రిస్టీజ్ పడిపోదూ? రాజకియనాయకుడా మజాకానా? ఆ గొడవనుండి దృష్టి మార్చాలంటే, ఏదో ఒక గొడవ మొదలెట్టాలిగా మరి, అందుకోసమని ఇదిగో ఈ బాబా ఖాండ్ దేవ్ గారి విగ్రహం ఇంకోచోటకి మార్చేశారుట.ఇంకేం కావాలి మన BJP వాళ్ళకి, మేమూ ఉన్నామోచ్ అని శివసేన వాళ్ళూ, MNS వాళ్ళూ బంధ్ కి పిలుపిచ్చేశారు. ఎలాగూ స్కూళ్ళకీ, కాలేజీలకీ క్రిస్మస్ శలవులే, ఎందుకొచ్చిన గొడవా అని మాల్సూ అవీ మూసేశారు. మరీ అసలు హడావిడి లేకపోతే మజా ఏముంటుందీ, పేపర్లలో ఫుటోలైనా రావాలా అఖ్ఖర్లేదా, టి.వీ ల్లో అభిప్రాయాలు అవీ అడగాలా లేదా,అందుకోసమని, ఓ పాతిక సిటీ బస్సుల్లో పాసింజర్సుని దింపేసి, అద్దాలు పగలుకొట్టేశారుట. ఇదికూడా Bus Body Builders వాళ్ళ లాబీయే చేయిస్తూంటారని విన్నాము. కొత్తబస్సులకి ఈ మాత్రం రిపేరానా లేకపోతే ఎలాగండి బాబూ, వాళ్ళ వ్యాపారం కూడా సాగొద్దూ? దేశంలో ఎక్కడెక్కడో బస్సులు తగలెట్టామూ, రాళ్లు రువ్వి అద్దాలు పగలకొట్టామూ అంటే వీళ్ళకి (అంటే Bus Body Builders కి) కావలిసినంత వ్యాపారం.అందుకే ఈ బస్సులు తగలేసేవాళ్ళు,అద్దాలు పగలకొట్టే వాళ్ళనీ ప్రత్యేకంగా ట్రైనింగిచ్చి, ఈ బంధుల్లోకి వదుల్తూంటారుట! కూటికోసం కోటి విద్యలు! ఇవన్నీ ఎవరో చెప్పగా విన్నవి మాత్రమే!

   మొత్తానికి ఇక్కడ కూడా చాలా రోజుల తరువాత ఓ బంధ్ చూశాము. ఇదీ పెద్ద బంధేనా ఏమిటీ,అసలు బంధంటే ఎంత హడావిడుండాలి,ఎంతంత ట్రాఫిక్కు జామ్ములుండాలి, టి.వీ ల్లో రోజంతా ఎంతంతమంది అభిప్రాయాలడగాలి, ఓ దీక్షైనా లేదు, ఇదీ ఓ బంధేనా పేద్ద గొప్పగా చెప్తున్నాడీయన అనుకుంటున్నారు కదూ ! ఏం చేస్తాం చెప్పండి ఇక్కడవాళ్ళు, ఏదో అంటూంటారు చూడండి Poor imitation of a Bandh లా పేపర్లలోకి వచ్చారు.

   ఇదంతా నా ప్రాణానికొచ్చింది. బంధ్ ధర్మమా అని నన్ను బయటకి వెళ్ళనీయలేదు మా అబ్బాయీ, మా ఇంటావిడానూ.మా కోడలైతే చెన్నై వెళ్ళింది. మా నవ్యా, అగస్థ్యా అయితే, క్రెచ్ మూసేయడం వలన ఇంట్లోనే ఉండిపోయారు. మర్చేపొయానండోయ్ ఈవేళ మా కోడలు శిరీష పుట్టినరోజు !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-so refreshing…

   నిన్న ఆదివారం ప్రొద్దుటే, ఒక ట్.వి.చానెల్ లో మహానటి సావిత్రిని జ్ఞాపకం చేసికుంటూ ఒక కార్యక్రమం, కొద్దిసేపటి తరువాత ఇంకో చానెల్ లో దర్శకుడు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి గురించి, ఇంకో కార్యక్రమమూ చూపించారు. వాటిని చూసిన తరువాత అనిపించింది, ప్రస్తుత సినిమాలు ఎంత ఛండాలంగా ఉంటున్నాయో అని! ఏదో టెక్నాలజీ పేరుతో మనని హింసిస్తున్నారే తప్ప, ఇప్పటి సినిమాల్లో అసలు ఏదైనా content అనేది ఉంటోందా అనిపిస్తూంటుంది. ఎప్పుడో చేసికున్న పాపాలకి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలని అంటూంటారు, ఇదేనేమో?

   ఓ పాట విషయం తీసికుంటే, అందులో ఉన్న పదాలెవో అర్ధం అవవు,పోనీ అర్ధం అనేది ఉందా అంటే,అన్ని ద్వందార్ధాలే! పైగా ఆ పాడేవాళ్ళుకూడా, ఏదో ఆస్త్మా పేషంటు పాడినట్లుగా, ఊపిరి ఎగదోసుకుంటూ పాడడం.ఇంక రొమాంటిక్ పాటలు అయితే, వాటిలో డాక్టరు సమరంగారివో, ఇంకో ఆయనెవరో ఉండేవారు, ఆయనో పత్రికలద్వారా సమాధానాలు చెప్పేవారే, అవన్నీ ఇప్పుడు, ఈ దృశ్యాల్లోనూ, పాటల లిరిక్స్ లోనూ,పూర్తిగా అర్ధం చేసికోవచ్చు.ఒక్క మాట చెప్పండి, గత పదేళ్ళలోనే కాదు, జస్ట్ క్రిందటేడాది అన్ని సినిమాలొచ్చాయే, ఒక్క సినిమాలోదైనా పాట గుర్తుందా? ఏదో వివిధ చానెళ్ళలోనూ, వచ్చే రియాల్టీ షోల ధర్మమా అని, ఆ ప్రోగ్రాంలలో పాల్గొనేవాళ్ళు, బట్టీ పట్టి పాడ్డం తప్పించి, ఒక్కటంటే ఒక్క పాట హం చేసికునే విధంగా ఉంటోందా? పైగా ఏమైనా అంటే, ఇప్పుడు మెలొడీ కంటె బీట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారూ అంటారు. బీట్ అంటే, ఏ డాల్బీ సౌండో పెట్టేసి, థియేటర్లలో, మన ప్రాణాలు తీయడమా? అసలు థియేటరుకెళ్ళాలంటేనే భయం వేస్తోంది, ఏమాత్రం గుండే నిబ్బరం లేనివాడైనా సరే, ఆ సౌండు విని గుండాగి ఛస్తాడు! దీనికి సాయం, పాత పాటలన్నిటికీ రీమిక్స్ లోటి.ఆ పాటలన్నిటినీ ఎందుకు అలా ఖూనీ చేస్తున్నారో అర్ధం అవదు.ఇప్పటికీ, 60 సంవత్సరాలక్రిందటి పాటలు వింటూంటే, ప్రాణం లేచి వస్తుంది. కనీసం మనకి అంటే ఇప్పుడున్నవారికి, చెప్పుకోడానికీ, ఏ డిప్రెషనులోనో ఉన్నప్పుడు వినడానికీ, ఆ పాతపాటలైనా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రిమిక్స్ ల ధర్మమా అని ,అవికూడా ఉండవు.

   పోనీ సినిమాలు చూద్దామా అంటే, ముందుగా వాటి టైటిల్స్. రక్త చరిత్ర ఏమిటీ, వాడి పిండాకూడు! పైగా ఆ దరిద్రపు సినిమాలకి సీక్వెల్సోటి! రక్తచరిత్ర-1, రక్తచరిత్ర-2, గాయం-1, గాయం-2 అంటూ. రోజూ పేపర్లలో చదువుతున్నాము, ఈ ఫాక్షనిస్టులూ,అండర్ వర్ల్డ్ డాన్లూ గురించి, ఇంకా వీళ్ళమీద సినిమాలుకూడా ఎందుకండి బాబూ? పొనీ వాళ్ళు చేసిన ‘ఘనకార్యాలు’ చూసి, ఏమైనా నేర్చుకోవాలనా? అప్పుడే పుట్టిన పిల్లాడు కూడా అనుకుంటాడు, చదువూ ఒద్దూ, సంధ్యా ఒద్దూ హాయిగా ఓ పదిపదిహేను మందిని పోగెసుకుని, బందులూ, రేప్పులూ చేసికుంటూ పోతే హాయిగా ఉంటుందీ అని. తీరా సినిమాకెళ్తే అందులో చూపించేదేమిటీ, అమ్మాయిల్ని ఎలా ఏడిపించడమూ, టీచర్లని ఎలా ఏడిపించడమూ, రాగ్గింగు ఎలా చేయడమూ అంతే కదా? ఆఖరికి ఆ విశ్వనాథ్ గారుకూడా ఆమధ్యన తీసిన సినిమాలో, వాటిగురించే! ఏమైనా అంటే సామాజిక స్పృహ, చైతన్యం, బాధ్యత అంటారు.ఎన్ని రోజులాడిందిట ఆ సినిమా?

   ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ, కొన్ని వందల ప్రింటులు తయారుచేసి, విశ్వవ్యాప్తంగా రిలీజు చేయడం, అంతా చేసి అది ఆడేది ఎన్నాళ్ళుట? ఓ వారం పదిరోజులు, ఈ మాత్రం దానికే, పేపర్లలోనూ, టీ.వీ ల్లోనూ యాడ్లు, ఫలానా సినిమా
రికార్డ్లు బద్దలుకొట్టేసింది, ఇంతంత డబ్బులు చేసికుందీ అంటూ! చేసికోక ఛస్తుందా, అన్నన్ని ప్రింట్లు ప్రదర్శిస్తే చేసికోవడంలో చిత్రం ఏముందీ? అందుకే మనవైపు వాల్ పోస్టర్లు చూస్తూంటాము, పదకొండో రోజూ, పన్నెండో రోజూ అని, చావుకీ, పురిటికీ చెప్పుకునేటట్లుగా! ఒక్క సినిమా కూడా ఏదో అక్కడక్కడ ఈ యాక్టర్ల, ప్రొడ్యుసర్ల స్వంత థియేటర్లు తప్పించి, బారసాల ( ఇరవయ్యొకటో రోజు) దాకా వెళ్ళిన దాఖలాలు లేవు!

   మరి ఇదివరకటి రోజుల్లోనో, శత దినోత్సవాలూ, వాటి సంబరాలూ,ఆ టైములో థియేటరు వాళ్లకి బోనస్సులూ ఏం హడావిడండి బాబూ!హిందీలో అయితే సిల్వర్ జూబిలీలూ,ఆఖరికి ఓ నటుడిని సిల్వర్ జూబిలీ కుమార్ అనికూడా పిలిచేవారు!
పైగా ప్రతీవాడూ సినిమా తీయడానికి ఇన్ని కోట్లయ్యాయీ అని చెప్పడమే. అయ్యాయంటే అవ్వవు మరీ, పుట్టడం అమెరికాలో, హిరొయిన్ పెద్దమనిషవడం జర్మనీలో, హీరో గారు ఈవిడని కలిసి మనసుపారేసికోవడం మారిషస్ లో, ఇద్దరూ కలిసి అదేదో డ్రిల్లు చేసినట్లుగా ఒకళ్ళమీద ఒకళ్ళు పడి దొల్లడం Alps లో. చివరకు పెళ్ళిచేసికోడం ఏ ఇంగ్లాండులోనో ఎక్కడో! వాళ్లసలు ఎక్కడేడిస్తే మనకెందుకూ? అంతంత బడ్జెట్టులు పెట్టి సినిమాలు తీయడం ఎందుకూ, వాళ్ళేడ్చి, మనల్ని ఏడిపించడం ఎందుకూ? ఇక్కడ మనదేశం లో లేవా ఈ మానవ జీవన పరిణామాలు (పుట్టడం దొల్లడం వగైరాలు..) చూపించడానికి? హాయిగా గోదావరుంది, కృష్ణ ఉంది, హిమాలయాలున్నాయి కోనసీముంది, పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు కేరళ ఉంది. ఏం అక్కడ తీస్తే సినిమా అనరా? ఓ సంగతి చెప్పండి, మన సినిమావాళ్ళు తెయ్యిమని ప్రతీ డాన్సూ తలో దేశంలొనూ చూపించి మన ప్రాణాలు తీస్తారే, బయటి దేశాల వాళ్ళు ఎంతమంది ఇక్కడ షూటింగులు చేస్తున్నారుట? ఇదేం యావండి బాబూ? ఇదివరకటి రోజుల్లో బయటి దేశాల విశేషాలు తెలియని రోజుల్లో అయితే వేరు. ఇప్పుడు టి.వీ ల్లో ఉన్న చానెల్స్ ధర్మమా అని ఆ లోటుకూడాలేదు.

   ఇంతంత డబ్బు వేస్టు చేసి, పైరసీ వల్ల నష్టం వచ్చేస్తోందో, లక్షల కుటుంబాల నోట్లో మట్టికొట్టేస్తున్నారో అని ఏడ్చే బదులు,చిన్న బడ్జెట్ లోనే తీసేయకూడదూ? ఇదివరకటివి సినిమాలు కావా, వాటిని చూడలేదా? పైగా ఇన్ని సంవత్సరాలు గడిచినా, ఆవురావురంటూ చూస్తున్నాము. కారణం They are so refreshing !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- వడ్డించేవాడు…

   మనకి ఎక్కడైనా సరే influence అనేది ఉంటే, ఏ పనైనా సరే క్షణాల్లో జరిగిపోతుంది. దాన్నే ఒక్కొక్కప్పుడు recommendation అనికూడా పిలుస్తూంటారు. ఆతావాతా తెలుగులో చెప్పేదేమిటంటే ‘ వడ్డించేవాడు మనవాడైతే, ఎక్కడ కూర్చుంటేనేమిటీ..’ అని పూర్వకాలంలో అనేవారు! ఇప్పుడు ఎక్కడ చూసినా, ఈ recommendation ల పర్వమే కదా! ఆ శ్రివెంకటేశ్వరస్వామి దర్శనం, త్వరగా జరగాలీ అంటే, అదేదో సెల్లార్ దర్శనంట! హైదరాబాదులోనో ఎక్కడో వాడెవడో, ఓ లెటరిస్తాడుట, దాన్ని తీసికెళ్తే, చివరికి ఆ భగవంతుడు కూడా, ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటూ దర్శనం ఇచ్చేస్తాడు! ఏమిటో ఆయనకూడా ఈ recommendation కి లోబడిపోయాడు.

ఏ రాజధాని నగరం అయినా ఆఖరికి ఢిల్లీ తో సహా, కిళ్ళి కొట్టువాడి దగ్గరనుండి, కార్పొరేటరు దాకా ప్రతీవాడికీ, ప్రభుత్వం లో ఎవడో ఒకడు తెలిసే ఉంటాడు.ప్రతీవాడూ,మనం ఏదైనా సమస్య గురించి చెప్తే,dont worry, I will do something అనేవాడే! అందుకేనేమో రాడియాల్లాటి వారు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు!

ఒక సంగతి మాత్రం అందరం గుర్తుంచుకోవాలి, ఎలాగోలాగ పాట్లు పడి, జీవితంలో ఎక్కడో చోట influence అనేది సంపాదించుకోవాలి. ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరికి ఉపయోగిస్తుంది. అవతలివాడెదో పేద్ద ఆఫీసరే అవఖ్ఖర్లేదు, ఆఫీసులోకానీ, ఇంకో చోట కానీ పనిచేసే దర్వాన్ అయినా చాలు!ఆఖరికి, ఆఫీసరుగారి డ్రైవరైనా చల్తా హై! అలా కాదూ, ఆఫీసరుగారి పెళ్ళాం నే పట్టేస్తారా, మీకు తిరుగే లేదు! తిన్నగా కుంభస్థలాన్నే కొట్టేయొచ్చు! రైల్వేలో ఓ టి.టి తో ఫ్రెండ్ షిప్ చేయండి, మీకు ఎప్పుడు ఆఖరి క్షణాల్లో ప్రయాణం చేయవలసివచ్చినా, ఇంటికే టిక్కెట్లొచ్చేస్తాయి. ఓ పొలీసాడితో, పరిచయం చేసుకోండి, ఊళ్ళో ఎవడి బుర్ర పగలుకొట్టినా, మిమ్మల్నడిగే వాడుండడు!

అంతదాకా ఎందుకూ, ఈ గవర్నమెంటు ఆసుపత్రిలు కానీ, కార్పొరేట్ ఆసుపత్రిలు కానీ తీసుకోండి, ఒక్కడైనా తెలిసినవాడుంటే ఉండే ఉపయోగం, మీ దగ్గరెంతడబ్బున్నా దానిముందర బలాదూరే!ఒకడంటే ఒక్కడు, వాడు చివరకి వార్డ్ బోయ్ అయినా సరే, మహరాజభోగాలతో, మనకు వైద్యం జరుగుతుంది. ఎప్పుడైనా బాంకుల్లో చూస్తూంటాం, బయట ఎంత క్యూ ఉన్నా సరే, మనకి తెలిసినవాడొక్కడున్నాడంటే చాలు, ఈ క్యూలూ అవీ to hell with it!క్షణాల్లో పనిచేసికుని వచ్చేయొచ్చు!

ఊరికె స్నేహం చేయడంతోనే సరిపోదు, ఆ స్నేహాన్ని జాగ్రత్తగా maintain చేయడం ఓ కళ! పని ఉన్నా లేకపోయినా సరే, ఆయనాఫీసుకెళ్లి, ఏ రెండు మూడు నెలలకో వారిని పరామర్శిస్తూండాలి.అంతే కానీ, ఎప్పుడో పనున్నప్పుడే వెళ్ళడం కాదు.అప్పుడప్పుడు వెళ్తూ, ఆయన యోగక్షేమాలడుగుతూంటారనుకోండి, మనం ఎప్పుడైనా ఏ పనికోసమో వెళ్ళినప్పుడు, ‘ఊరక రారు మహాత్ములు’ అంటూ, ఓ కాఫీకూడా బోనస్ గా దొరకొచ్చు. అలా కాక, మన పని అయిపోయిందికదా అని, ఆయన ఉన్నాడో ఊడేడో కూడా తెలిసికోకుండా,’ రేవు దాటి తెప్ప తగలెసినట్లు’ గా ఉన్నారనుకోండి, మనం వెళ్ళీ వెళ్ళగానే ఆయన పలకరింపు కూడా అలాగే- ‘ ఏమిటీ, ఏదో పనిమీదొచ్చినట్లున్నారే, లేకపోతే, మేమెక్కడ కనిపిస్తాం లెండి’లా ఉంటుంది.ఆయనకీ తెలుసు, ఈ వెధవకి నాతో పని బడినట్లుంది, లేకపోతే ఎందుకు వస్తాడూ అని.

మనవైపు సినిమాహాళ్ళలో బుకింగాఫిసువాడు అందరిలోకీ బెస్ట్. ఏ సినిమా అయినా సరే,మొదటిరోజు మొదటాటకి మనకి టిక్కెట్లు గ్యారెంటీ!అసలు ఉద్యోగంలో ఉండగానే, మనం వివిధాఫీసుల్లోనూ, ఈ పరిచయాలు cultivate చేసికోవాలి. రిటైరయిన తరువాత మన మొహం ఎవడూ చూడడు. ఉద్యోగంలో ఉన్నంతకాలం ప్రతీవాడూ సలాం కొట్టేది, ఆ సీటుకే, మన మొహం చూసికాదు. చెప్పానుగా, ఈ రోజుల్లో ఏ పనికావాలన్నా, ‘దక్షిణ తాంబూలాలు’ తప్పని సరైపోయాయి.ఎంత చెట్టుకంత గాలి లా ఎంత దక్షిణకి అంత పని!

మా చిన్నతనపురోజుల్లోనూ ఉండేవి, ఇలాటివన్నీనూ, కానీ ఇంత commercialise కాదు. ఏదో పాఠాలు చెప్పిన మాస్టారి కొడుకూ అనో,ఫలానా వారికి చుట్టమనో చెప్పినా చాలు పన్లైపోయేవి. అక్కడ మన గొప్పతనం చూసి కాదు, మనం ఎవరిపేరైతే చెప్పేమో వారిని బట్టి! అంతదాకా ఎందుకూ, నాకు ఉద్యోగం వచ్చింది, మా అమ్మమ్మ గారికి మనవడినై పుట్టినందుకూ, మా అమ్మగారికి కొడుకునై పుట్టినందుకూ! ఎందువలనా అంటే, నా చదువుకి, పిలిచి ఉద్యోగం ఇచ్చినాయన, పై విధంగా మాకు పరిచయం! ఇప్పటికీ, నోట్లో రెండు పూట్లా ముద్దెళ్తోందంటే వారి చలవే!

నేను ఇక్కడ, రెండు సార్లు కమాండ్ హాస్పిటల్లోనూ, ఒకసారి మిలిటరీ హాస్పిటల్లోనూ, ఏ శ్రమా లేకుండా వైద్యం చేయించుకుని, లక్షణంగా ఇంటికొచ్చానంటే కారణం మా స్నేహితుడు బాలరంగయ్యగారూ, మా కజిన్ సదానందా నూ.Influence అనేది జీవితంలో ఎంత ముఖ్యమో,అప్పుడర్ధమయింది. మనం ఓ తీగ లాటివారం,అది ప్రాకడానికి ఓ పందిరో ఏదో, ఆఖరికి ఓ పుల్లయినా కావాలి కదా. అలాగే ఈ పరిచయాలూనూ.మనకి ఏదో ఉపయోగిస్తాడులే అని పరిచయం చేసికోకూడదు.మన ప్రవర్తనని బట్టి వారే మనకి ఉపకారం చేయొచ్చు.ఎందుకంటారా, ఈ రోజుల్లో ప్రతీ చోటా, ఎవరో ఒకరు తెలిసిన వారు లేకుంటే పన్లవడం చాలా కష్టం.నాకేమిటీ, డబ్బు పారేస్తే అదే అవుతుందీ అనుకోకండి, డబ్బొకటే కాదు ముఖ్యం. దాన్ని తీసుకోడానికి కూడా ఓ తెలిసినవాడుండాలి!! ఈ రొజుల్లో ఎవడుపడితే వాళ్ళదగ్గరనుంచి డబ్బులు తీసికోవడం లేదు. ఆ ఇచ్చినవాడు, ఏ ACB వాడో,ఏ T.V. వాడో అయితే ఖర్మ!ఉన్న ఉద్యోగం కూడా పోతుంది!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఈవేళ ప్రొద్దుట, మా ఫ్రెండింటికి వెళ్ళాను.ఆయనకి 72 ఏళ్ళు.ఇప్పటికీ హాయిగా టింగురంగా మంటూ ముంబై/పూణే లమధ్య తిరిగేస్తూంటాడు, భార్యతో సహా.నిన్న వస్తున్నప్పుడు, ఆవిడకి almost పెద్ద accident జరగబోయి ఆగిందిట.ముంబై లో లోకల్ ఎక్కుతూ, ఆవిడ పట్టుజారి క్రిందపడబోయారుట.ఎలా తప్పించుకుని బ్రతికి బట్ట కట్టిందో ఆ భగవంతుడికే తెలియాలి.ఆవిడ పడ్డం కంటే పెద్ద హింస ఏమిటంటే, కనిపించిన ప్రతీవాడూ నీతులు,జాగ్రత్తలు చెప్పడం!ఈ సెర్మన్స్, accident కంటే, హింసిస్తాయి! అప్పుడు నాకు క్రిందటివారమ్లో జరిగిన accident గురించి చెప్పి, నేను కూడా ఈ పోస్ట్ మార్టెం తప్పించుకోడానికి, ఎలా ఎవరికీ చెప్పలేదో, తీరా చెప్పిన తరువాత అందరూ ఎలా రియాక్ట్ అయ్యారో వివరాలు అతనితో చెప్పాను.

   ఆ సందర్భంలో తన అనుభవం ఒకటి చెప్పాడు. క్రిందటేడాదెప్పుడో, ఒకసారి మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు, సడెన్ గా పడిపోయాడుట. తిరిగి కళ్ళు తెరిచేటప్పటికి, హాస్పిటల్ లో తేలాడుట.పైగా, ఆ పడ్డది ఎక్కడా అంటే, ఓ కంట్రీ లిక్కరు షాపు ఎదురుగుండాట! ఏదో మస్తుగా త్రాగేసి పడి ఉంటాడులే అని చాలా మంది చూసినా ఏమీ పట్టించుకోలేదుట. కానీ, వీరికి తెలిసిన ఒకమ్మాయి, ఈయన్ని చూసి ఇంటికి వెళ్ళి చెప్పిందిట- ఇలా అంకుల్, సారా దుకాణం ఎదురుగా పడి ఉన్నారూ అని! ఇంట్లో ఉన్నవారు వచ్చి ఈయన్ని హాస్పిటల్ లో చేర్చి, వైద్యం చేయించారు. ప్రతీ వాడూ అడగడమేట, అంత కష్టం ఏమొచ్చిందీ, మరీ కంట్రీలిక్కరు త్రాగేసి పడిపోయేటంత అని!నాకు నవ్వాగలేదు, ఇదంతా విని.

   నిన్న మా అబ్బాయి, శిరీషని పిక్ అప్ చేసికుని, పిల్లల్ని క్రెచ్ దగ్గరనుండి తీసికెళ్దామనుకుంటుండగా, ఓ ట్రాఫిక్ పోలీసొచ్చి, వీళ్లని ఆపాడుట. నేను అంతసేపటినుండి పిలుస్తూంటే, ఆపకుండా పోతున్నావూ, లైసెన్స్ ఏదీ అన్నాడుట. లైసెన్స్ చూపించిన తరువాత, మీరు ఫలానా సిగ్నల్ బ్రేక్ చేశారూ, మా బాస్ మిమ్మల్ని తీసికురమ్మని, పంపాడూ చలో అన్నాడుట. మేమసలు ఆ దారిన రాలేదు మొర్రో అన్నా వినిపించుకొలేదు. పైగా మీ కారు రెడ్ కలరు, నెంబరు 526, మిమ్మల్నే తీసుకురమ్మన్నాడూ అని లాక్కుపోయాడుట. తీరా అక్కడిదాకా వెళ్ళిన తరువాత తెలిసింది, తీసుకురమ్మన్నది ఇంకో సీరీస్ లోని అదే నెంబరుట ట!ఇంక ఆ పొలీసు సిగ్గుపడిపోయి, సారీలు చెప్పేసి వదిలాడుట. పొలీసులు కూడా సారీలు చెప్పడం వినేటప్పటికి మా పిల్లలైతే చాలా ఆశ్చర్యపడిపోయారు!

   ఏమిటో ఇంట్లో నా పరిస్థితేమీ బావుండడం లేదండి. ప్రతీరోజూ, మా ఇంటావిడే పాలు తోడెడుతూంటుంది, చలికాలమేమో, ఒక్కరోజు కూడా తోడుకోదు, దానితో నేను ప్రతీ రోజూ బయటకి వెళ్ళడం, ఓ దహి డబ్బా తేవడం. ఇలా కాదని,నేనే
ఓ రోజు తోడు పెట్టాను. నా అదృష్టం బాగోక, అది కాస్తా శుభ్రంగా తోడుకుంది! ఇంక ప్రతీ రోజూ, మా ఇంటావిడ, ‘ఒక్కొక్కళ్ళ చేత్తో శుభ్రంగా తోడుకుంటుందీ, అని మస్కా కొట్టేసి, ప్రతీ రోజూ ఈ తోడు చుక్క కార్యక్రమం నాకప్పచెప్పేసింది! ఏం చేస్తాను, ప్రొద్దుటా, సాయంత్రం ఇదో పని!

   తనేదో కంప్యూటరు చూస్తూ,తుక్కు తీసికెళ్ళే మనిషొస్తే, ఆ తుక్కు బయట పెట్టేయండీ అంది. ఎందుకంటే, ముందరే పెట్టేస్తే మా బిల్డింగులో పిల్లి వచ్చేసి, పాడిచేస్తూంటుంది. సరే ఇదో పెద్ద గురుతర బాధ్యతోటి పెట్టింది కదా అని, కిటికీలోంచి చూస్తూ నుంచున్నాను. ఇంతలో, ఆవిడెవరో, తొమ్మిది గజాల చీరలో, కారిడార్ లో బూజు దులుపుతూ కనిపించింది. ఆవిడే తుక్కు తీసికెళ్ళే మనిషీ అనుకుని, ఊరుకోక, ఆవిడకి పైగా సైగచేసి మరీ, ఆ డస్ట్ బిన్ కాస్తా బయట పెట్టాను. నాకేం తెలుసూ, ఆవిడ పక్కింటి ఓనర్ అని!మళ్ళీ, మా ఇంటావిడ నాకు ఇలాటి పనులు అప్పచెప్పలేదు! అప్పుడప్పుడు, మా ఇంటావిడ ప్రొద్దుటే పెట్టిన కాఫీ పూర్తిగా త్రాగకుండా, దాచుకుంటూంటుందిలెండి. ఎప్పుడైనా ఆవిడ త్రాగే సమయంలో నేను ఇంట్లో ఉంటే, నాక్కూడా ఆఫరు చేస్తూంటుంది, ‘ఓ చుక్క త్రాగివ్వండీ’అని. ఏదో ఆలోచిస్తూ పూర్తిగా తాగేస్తూంటాను. ఇలా రెండు మూడుసార్లయిన తరువాత, మళ్ళీ ఆఫరు చేస్తే ఒట్టు!అయినా చుక్క తాగూ,ఔన్స్ తాగూ అని రూల్స్ పెడితే ఎలాగండి బాబూ?ఇచ్చేదేదో శుభ్రంగా ఇవ్వాలి కానీ.
ఏదో లాగించేస్తున్నాం! సర్వేజనా సుఖినోభవంతూ !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఎవరి బాధలు వాళ్ళవి…

   ఈవేళ సాయంత్రం, మా ఫ్రెండొకరున్నారు,వారింటికి వెళ్ళాము. ఆయన నాకంటె రెండు సంవత్సరాలు ముందే రిటైరయ్యారు. అదీ ఇదీ అంటే మరేమీలేదూ, ఉల్లిపాయ ఖరీదులూ, మాకు కాంటీను లో సరుకులు తక్కువ ధరలకి ఎలా దొరుకుతాయో వగైరా పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకున్న తరువాత, ఆయన వెళ్ళబోసుగున్న ‘బాధలు’ వింటూంటే, మేము ఎంత అదృష్టవంతులమో అనిపించింది!ఆ భగవంతుడి దయవలన, మా పిల్లలిద్దరికీ, 25 ఏళ్ళు నిండేటప్పటికే, వాళ్ళు కోరిన వారినిచ్చి పెళ్ళిళ్ళు చేసేశాము. వాళ్ళూ ఇద్దరేసి పిల్లలతో సుఖంగానే ఉంటున్నారు.ఇందులో మేమేమీ ఘనకార్యం చెసేశామని అనడం లేదూ, ఏదో అలా అన్నీ కలసొచ్చాయి అయింది.పిల్లలిద్దరికీ ఒకళ్ళకొకళ్ళు నచ్చితే చాలూ అనుకున్నాము. వాళ్ళూ సుఖంగానే ఉన్నారు, మమ్మల్నీ తాతయ్య, అమ్మమ్మ/నానమ్మ చేసేశారు.ఇంకో రెండు మూడేళ్ళు అయిన తరువాత అయితే, మాకూ (స్పెషల్లీ మా ఇంటావిడకి మరీనూ)ఓపికా ఉండేది కాదు, పురుళ్ళూ పుణ్యాలూ చూసుకోడానికి.అందుకే అంటాను ఏది జరిగినా మన మంచికే అనుకున్నట్లయితే, అన్నీ బాగానే ఉంటాయి.ఆ భగవంతుడు చల్లగా చూస్తే చాలు.

   ఇప్పుడు వెళ్ళేనే ఆయనకి ముగ్గురు కొడుకులు, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసి, తాతయ్యా, బామ్మా అయ్యారు.ఇప్పుడు మూడో కొడుక్కి చేయాలి. ఏదో మన రాష్ట్రం మీదా, ఆచారవ్యవహారాలమీదా అభిమానం కొద్దీ, తెలుగు సంబంధాలే చూస్తూఉన్నారు ఇన్నాళ్ళూ. కానీ ఈ విషయంలో ఆయనకి అయిన అనుభవాలు చెప్పి, వాళ్ళ కొడుకూ, డాడీ ఆంధ్రా సంబంధాలు చూడ్డం మానేసి, హాయిగా ఇక్కడే పూణే లోనో, ముంబైలోనో సంబంధం చూడండి, అక్కడివాటితో విసుగొచ్చేసిందీ అన్నాడుట.

   ఏం లేదూ, వీళ్ళూ నెట్ లో వచ్చే యాడ్ లు చూసే సంప్రదించేవారు.కానీ వచ్చిన గొడవేమిటంటే,ఆ వధువు కి సంబంధించిన వారు, అన్నీ సరిపోయినా సరే, ఓ పట్టాన సమాధానం చెప్పకపోవడం, ఈయనేమో ఎన్నిసార్లు ఫోను చేసినా, ‘ఇంకా మా అమ్మాయి అభిప్రాయం అడగలేదండీ, ఇదిగో రెండు మూడు రోజుల్లో వస్తూంది, ఏవిషయమూ కనుక్కుని చెప్తామూ’ అని!కమ్యూనికేషను ఇంత ఫాస్ట్ అయినరోజుల్లో కూడా, ఇలాటి సమాధానాలు వింటూంటే, ఈయనకేమో చిరాకొచ్చేస్తుంది. వీళ్ళేమో క్లియర్ గా అప్పుడే చెప్పేశారు, మాకైతే మీ అమ్మాయి నచ్చిందీ, మీ అభిప్రాయం కూడా చెబితే, ముహూర్తాలు పెట్టుకుందామూ అని.అంటే 50% అయిపోయినట్లే కదా!ఆ మిగిలిన 50% దగ్గరే వస్తోంది గొడవంతానూ. ఓ పట్టాన చెప్పరూ, ఎప్పుడో చెప్పినా, ‘పూణె అంటే ఇక్కడికి ( అంటే విజయవాడ కి) చాలా దూరం అంటున్నారండీ, మా ఇంట్లో పెద్దాళ్ళు’ అని. అమెరికా అయితే ఫరవా లేదుట, కానీ పూణే నా? హైదరాబాదయినా ఫరవాలేదు! ఇది మరీ అన్యాయం అండి బాబూ!

   ఇదివరకటి రోజుల్లో కూతురికి పెళ్ళి చేయాలంటే చెప్పులరిగేలా తిరిగేరనేవారు. ఇదేమిటో చిత్రం, మగపిల్లాడి పెళ్ళికి కూడా ఇలా తిరగవలసివస్తోందనుకోలేదు ఆయన!పోనీ ఆ పిల్లాడికేమైనా కాలొంకరా, కన్నొంకరా ఉందా అంటే అదీ లేదు. శుభ్రంగా 28 ఏళ్ళ young and handsome bridegroom! హాయిగా ఐ.టి.లో ఉద్యోగం, ఏ బరువూ బాధ్యతా లేదు. ఓ కారుకూడా కొనుక్కున్నాడు.
అసలు మనవైపు వారి కోరికలు ఏమిటో ఆ మాట్రిమోనియల్ యాడ్ లో ముందరే పెట్టేస్తే,వారికి తగ్గ సంబంధాలే వస్తాయిగా. అన్ని వివరాలూ వ్రాయరు, దేనికైనా transparency అనేది ఉండాలి.లేకపోతే ఇలాగే ఉంటుంది. చివరదాకా వచ్చిన తరువాత ఎదో సాకు చెప్పేసి వద్దనేయడం.ఇలా నాలుగైదు సంబంధాలు తప్పిపోయేసరికి,ఇటు ఈ కుర్రాడికీ డౌటొచ్చేస్తుంది, ఇదేమిటీ మనలో ఏదైనా లోపం ఉందేమో అని!అమ్మాయైనా, అబ్బాయైనా ఇదే పరిస్థితి.ఏమిటో ఎప్పుడు బాగుపడతారో ఈ తల్లి తండ్రులు? ఏదో దొరికిన సంబంధమే చేసేయాలని కాదు,అన్నీ చూసుకునే చేయాలి. కానీ ఈ ‘అన్నీ’ అనేది ఓ relative term. ‘అన్నీ’ అంటే ఏమిటి?పెళ్లికొడుకు రూపం, ఉద్యోగం,సంపాదన వరకూ బాగానే ఉన్నాయి. మరి ఇంకా ఏమిటిట? ఈ ‘అన్నీ’ ల గురించి, మొదట్లోనే మొహమ్మాట పడకుండా చెప్పేస్తే అటువారికీ, ఇటువారికీ ఈ ఈతిబాధలు తప్పుతాయికదా.అసలే male/female ratio చాలా alarming గా ఉందని ప్రతీ రోజూ పేపర్లలో చదువుతున్నాము. దీనికి సాయం ఈ మనస్థత్వాలు కూడా తోడయ్యేయంటే ఇంక అడగఖ్ఖర్లేదు!

   ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి ఓ ఇంటివాడో/ ఇల్లాలో అయేసరికి 30-35 ఏళ్లొస్తాయి. ఇక్కడేమో ఈ తల్లితండ్రులకు 70 దాటుతాయి. అప్పుడు పురుళ్ళూ,పుణ్యాలూ చూసే ఓపికా ఉండదు. మళ్ళీ ఏమీ సహాయం చేయటల్లేదో అని గోలా!
ఎందుకొచ్చిన గొడవలండి బాబూ, ఏదో ఆ ‘అన్నీ’ లన్నీ ముందరే చెప్పేసి, పిల్లల్ని చిలకా గోరింకల్లా హాయిగా పెళ్ళవలసిన టైముకి చేసేస్తే ఎంత హాయండి !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మొత్తానికి అనుకున్నంతా అయింది. మా ఇంటావిడ, నేను బయటికి వెళ్ళినప్పుడు, మా అబ్బాయీ, కోడలుతోటీ, అప్పుడెప్పుడో నేను రోడ్డు క్రాసు చేస్తూండగా ఓ సైకిలు వాడొచ్చి ఢీ కొడితే, నేను క్రింద పడ్డానని!నేను ఇంటికి వచ్చేటప్పడికి, అనుకున్నట్లే, మా అబ్బాయీ,కోడలూ ఓ లెక్చరిచ్చేశారు. అదేమిటి డాడీ, అలా జరిగినప్పుడు మాతో ఒకసారి చెప్తే ఏం పోయిందీ? అని.దానివలన, నన్ను ఎక్కడికీ బయటకు వెళ్ళడానికి వీల్లేకుండా చేయడం తప్ప, నాకు ఒరిగిందేమిటీ? నేను పడే బాధేదో నేనే పడాలికదా.దానికి సాయం మీ అందరి చివాట్లోటీ.అందుకే చెప్పలేదు,అన్నాను.

   మా కోడలు చెన్నై నుండి తిరిగి వచ్చేయడంతో, మేము మా కొంపకి వచ్చేశాము.ఈవిడ సరుకులన్నీ వచ్చాయో లేదో చూడ్డం నాకు అప్పజెబుతూంటుంది.ఈవేళ వచ్చేటప్పుడు, కళ్ళజోడు పెట్టి తెచ్చాను,దాంట్లో కళ్ళజోడు లేకుండా! సుఖపడ్డాను, కంప్యూటరు నాకొదిలేసింది!అక్షరాలు కనిపించవు పాపం!ఇటుపైన ఎప్పుడైనా ఇలా కంప్యూటరు నేనే ఉపయోగించుకోవాలీ అనుకున్నప్పుడల్లా, ఇలా ఖాళీ కళ్ళజోడు పెట్టి తెస్తే సరి,సుఖ పడతాను! అబ్బే అంత ఈజీయా ఈవిడతో, పోనీండి, ఇక్కడకూడా ఓ కళ్ళజోడు స్టాండ్ బై పెట్టుకుంటే బాగుంటుందేమో అంటోంది!

   నిన్న ప్రొద్దుట పేపరు తెచ్చుకోడానికి వెళ్ళినప్పుడు, ఒకతను, ఏదో క్రిందబడితే, తీసి, ఎవరికో చెయ్యూపుతున్నాడు. ఆ అబ్బాయి తన ఫోనులో మాట్లాడుకోవడం తప్ప, చెయ్యూపుతున్నతనివైపు చూస్తేనా!చివరికి ఏమిటీ అని అడిగితే, నా చేతిలో పెట్టాడు.సరే ఈ సంగతేదో చూద్దాం అనుకుని,ఆ అబ్బాయి ఫోనులో మాట్లాడ్డం పూర్తయేదాకా ఉండి, అడిగాను- నీ జేబులోంచి ఏదైనా పడిపోయిందా అని, అబ్బే ఏం లేదూ అన్నాడు. కాదు ఓసారి చూసుకో అనగానే, జేబులు వెదుక్కుని, అయ్యో నా ఐ.డి. కార్డ్ పడిపోయిందీ అన్నాడు. మరి అతనెవరో నీ జేబులోంచి పడిన ఈ కార్డు తీసి, నిన్ను పిలుస్తూంటే, కనీసం రెస్పాండేనా చేయొచ్చుకదా అన్నాను.అంటే అతనన్నాడూ, ఫోనులో మాట్లాడుతూ, అంత ధ్యాస పెట్టలేదూ, సారీ అన్నాడు. ఆ కార్డు అతనికిచ్చేసి, రోడ్డుమీద వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో వగైరాలమీద ఓ లెక్చరిచ్చేసి వెళ్ళాను. చిత్రం ఏమిటంటే, ఈవేళ, నేను పేపరు తీసికెళ్ళడానికి వెళ్ళినప్పుడు, ఆ అబ్బాయి కంపెనీ బస్సుకోసం చూస్తున్నాడనుకుంటాను, ‘అంకుల్, ఈవేళనుండీ జాగ్రత్తగా ఉంటానూ..’అని పలకరించాడు.

   అలాగే అప్పుడెప్పుడో, మిస్టరీ షాపింగుకి, టైటాన్ ఐ షాపుకి వెళ్తే, 11.30 అయినా,షాపు తెరవలెదు.11.00 కి తెరవాలి. తీరిగ్గా వచ్చి తెరిచాడు.ఇదేమిటీ, ఇంత లేటయిందీ అంటే ట్రాఫిక్ జాం, ఆలశ్యం అయిందీ అన్నాడు. ప్రతీరోజూ ట్రాఫిక్ జామ్ ఉంటూనే ఉంటుంది కదా, ఓ అరగంట ముందే బయలుదేరితే, ఓ గొడవే ఉండదుగా అన్నాను. ఆ సంగతే మర్చిపోయాను. నిన్న నేను వెళ్తూంటే, నా పక్కన ఓ బైక్కతను ఆగి, హాయ్ అంకుల్ అని పలకరించాడు. ఆ హెల్మెట్ లో అతనెవరో తెలియక, ఆప్ కౌన్ హై అంటే, నేను ఈమధ్య ఓ అరగంట ముందరే బయలుదేరి, షాప్ టైముకే తెరుస్తున్నానూ అన్నాడు. ఆ టైటాన్ సంఘటన జరిగి నెల పైగా అయింది.అప్పుడు గుర్తొచ్చింది, ఈ కుర్రాడు, ఓహో అతనా అని! నాకైతే చాలా సంతోషం వేసింది. నేను చెప్పిన మర్నాటినుండీ, తన పధ్ధతి మార్చుకోవడమే కాకుండా,గుర్తు పెట్టుకుని నాతో చెప్పడం.నేను చెప్పింది వినాల్సిన అవసరం ఆ అబ్బాయికి లేదు, అయినా నేను చెప్పింది ఆచరించాడు. అప్పుడు అర్ధం అయింది,చెప్పవలసిన పధ్ధతిలో చెప్తే,ఎవరైనా వింటారూ అని!

   వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, ఈగోలు.వాటిని పక్కకు పెట్టి,అవతలివాడు చెప్పేది మన మంచికే ప్రతీ వారూ అనుకుంటే, ఈ దెబ్బలాటలూ, దీక్షలూ, ధర్నాలూ ఉండనే ఉండవు.పాలక పక్షం చేసేవి అన్నీ తప్పుల తడకలే అని ప్రతిపక్షాలూ, ప్రతిపక్షాలు చేసేది ఎప్పుడూ కుట్రే అని పాలకవర్గం వారూ భావిస్తున్నంతకాలం, పార్లమెంటు సమావేశాలూ, అసెంబ్లీ సమావేశాలూ, ఈమధ్యన జరిగేయ్ చూడండి, అలాగే తగలడతాయి. ఉల్లిపాయ ధర 100 దాటుతుందంటున్నారు. గత రెండు నెలలుగా చేతికొచ్చినట్లు export చేసికోనిచ్చి, స్టాక్ అంతా బయటకు పోనిచ్చారు, ఇక్కడ ఉన్నదేమో అయిపోయింది. ఉన్నదానికి రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఓ నెల పోయిన తరువాత, ఇదిగో ఉల్లిపాయ ఖరీదు తగ్గించడానికి బయటి దేశాలనుండి import చేస్తున్నామూ అంటారు! మళ్ళీ దాంట్లో కొంత తినేయడం! చివరకు తేలేదేమిటంటే, మన మంత్రుల జేబులు నిండడం.

   చిత్రం ఏమిటంటే, ఏ పార్టీ వారు పవర్ లోకి వచ్చినా, మన బ్రతుకులింతే.లేకపోతే ఒకటి చెప్పండి,ప్రతీ పార్టీ లోనూ స్కాం లున్నాయి.వీడింత తిన్నాడని వాడూ, వాడింతతిన్నాడని వీడూ అనడమే తప్ప, ఏమైనా చేస్తున్నారా, ఏమైనా చేశేరా, ఇంక్వైరీలూ, కమిషన్లూ తప్ప! ఒకడి వీపు ఇంకోడు గోక్కోడం ఒకటీ మిగిలింది.మన జాతకాలలాగే ఉన్నాయి!
సర్వే జనా సుఖినోభవంతూ !