బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–పెళ్ళిసంబంధాలు

    ఈ మధ్యన ఏ పేపరు చూసినా, మేగజీన్ చూసినా పెళ్ళిసంబంధాల ప్రకటనలే. నెట్ లో అయితే చెప్పక్కరలేదు. ఇదివరకటి రోజులకి, ఇప్పటి రోజులకీ సహస్రాంతం తేడా ఉంది.ఇదివరకు ఆడపిల్లకి పెళ్ళి సంబంధం చూడడానికి, తండ్రి ” చెప్పులరిగేలా” తిరిగేవాడనేవారు. ఇప్పుడు మగపిల్లలకి ఆ అవస్థ వచ్చింది. ఈ మధ్యన మమ్మల్ని కనీసం ఓ పదిమందిదాకా అయినా అడిగిఉంటారు, వాళ్ళ పిల్లలకి ఏమైనా సంబంధాలు తెలిస్తే చెప్పమని.

    మాకు తెలిసిన వారు వాళ్ళ అబ్బాయిలకు సంబంధాలు వెతికితే ” World is very small” అన్నట్లుగా రెండు వైపులవాళ్ళూ మాకు తెలిసిన వారే.రాజమండ్రీ లో మాకు తెలిసిన వారొకరు మారేజ్ బ్యూరో నడుపుతున్నారు. ఆవిడని అడుగుతూంటాను ఈ సంబంధాలు ఎలా కలుపుతారూ అని.ఆవిడ చెప్పిన ప్రకారం- ఎవరైనా సంబంధం కావాలని వచ్చినప్పుడు, వారి కోరికలననుసరించి, ఓ సంబంధం గురించి చెప్పి, ఆ ఇద్దరినీ ఒకొళ్ళకొకరిని పరిచయం చేయడంతో వీళ్ళ పని పూర్తయిపోతుందన్నమాట. ఆ తరువాత ఎవడి అదృష్టం వాళ్ళది.ఈ బ్యూరో వాళ్ళకేమీ పూచీ లేదు.జాతకాలు చూసుకోవడం, కట్నాలూ, కానుకలూ అన్నీ వాళ్ళే మాట్లాడుకోవాలి. సంతోషిస్తే ఈ బ్యూరో వాళ్ళకి ఏదైనా చేతిలో పెట్టి సత్కరించాలి. ఆవిడ Success percentage 70% దాకా ఉంటుందిట.బాగానే ఉంది.
ఇంకొకరిని చూశాను, వారి అబ్బాయి నెట్ లో ఓ అమ్మాయి నచ్చినట్లనిపించింది. సరేనని ఒకళ్ళ వివరాలు ఒకరడిగారు.ఈ అబ్బాయి నిజాయితీగా ” నేను మా తల్లితండ్రుల తో ఉంటున్నాను, ఇల్లు మా అన్నయ్యది, కారు కూడా అన్నయ్యదే . ఏదో సాఫ్ట్వెర్ లో ఉద్యోగం చేస్తున్నాను” అని చెప్పాడు. హాఠ్ స్వంత ఇల్లూ, గాడీ లేని నీలాంటి వాడితో నాకేమిటీ అని ఆ అమ్మాయి ఇతని ప్రపోజల్ తోసేసింది. చెప్పేదేమిటంటే ఈ రోజుల్లో పెళ్ళికి పూర్వమే, ఓ ఇల్లూ, ఓ గాడీ ఉండడం కనీస అర్హత.అందులో ఇంకొక కండిషన్ ఏమిటంటే తల్లితండ్రులు విడిగా ఉండాలి. అందరూ కలసి ఉండేమాటైతే సెకండ్ ప్రిఫరెన్స్.

    ఇదివరకటి రోజులలో పెళ్ళిసంబంధాలు అటు ఏడు తరాలూ, ఇటు ఏడు తరాలూ చూసికానీ తెలిసికొని కానీ చేసికొనేవారుకాదు. అవన్నీ ఇప్పుడు చాదస్థాలలా కనిపిస్తాయి.ఒకలా తీసికుంటే
అప్పటి బాండింగే వేరు.బహుశా ఆనాటి సామాజిక నియమాలూ, బాంధవ్యాలూ, ఆప్యాయతలూ, ఆపేక్షలూ కారణమేమో. ఇప్పుడు ఏదైనా మాట తేడా వస్తే అంతే సంగతులు.ఇంటికి వచ్చే మనిషి గురించి మనం ఏమీ Expectations పెట్టుకోకూడదు.ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వారే.అందువలన ఎవరి Ego వారికుంటుంది.ఇంకొక విషయమేమంటే, ఇంకొకరితో ఎలా ఉండాలనే సంస్కారం జన్మతహా ఉండాలి. ఎవరో చెప్తే వచ్చేది కాదు.

    నిన్నో మొన్నో పేపర్లో చదివాను– బెంగుళూరు లో 36 సంవత్సరాల భర్త తన భార్య గురించి Insecurity ఫీల్ అయి ఆత్మహత్య చేసికొన్నాడుట. ఈ Insecurity అంటే ఏమిటండి బాబూ? ఒకళ్ళమీద ఒకళ్ళకి ఉన్న నమ్మకంతోనే వివాహం విజయవంతం అవుతుంది. నిన్న ఈటివి-2 లో తెలుగు వెలుగు కార్యక్రమంలో శ్రీ గరికపాటివారు ఒక విషయం చెప్పారు.– ఆయనకేదో అవధానంలో ఒక సమస్య ఇచ్చారుట -దాని విషయమెమిటంటే ఒకసారి కర్ణుడు భానుమతి( దుర్యోధనుడి భార్య) కొంగు లాగేడట–దీనిని పరిష్కరించమన్నారు. జరిగినదేమంటే , ఒకసారి కర్ణుడు దుర్యోధనుడిని చూడడానికి వచ్చినప్పుడు,భానుమతి తన చెలికత్తెతో చదరంగం ఆడుతూందిట.దుర్యోధనుడు ఎక్కడో బయటకు వెళ్ళడం వలన, ఆయన వచ్చేదాకా వేచి ఉండవలసివచ్చి, కర్ణుడు ఆవిడతో చదరంగం ఆడడం మొదలుపెట్టగా, ఇంతలో దుర్యోధనుడు రావడం గమనించి, అకస్మాత్తుగా లేవడంతో, ఆవిడ చీర కొంగు స్థానభ్రంశం పొందిందిట.అలాగని దుర్యోధనుడు, వారిద్దరినీ అనుమానించలేదుగా. చెప్పేదేమిటంటే ఒకరిమీద ఒకరికి నమ్మకం అనేది ముఖ్యం.

    ఇప్పుడు పెళ్ళిసంబంధాలు కుదుర్చుకోవడం ఎంత కష్టమో విడిపోవడం అంత శులభం. They are inversely proportional!. పేద్ద కారణం అక్కర్లేదు, విడిపోవడానికి, పిల్లిమీదో ఎలకమీదో చెప్పొచ్చు.కొత్తగా పెళ్ళైయ్యే వారు ఒక విషయం మరచిపోతున్నారు–ఇదివరకటి లాగ కాపురం పెట్టే టైములో ఎవేవో సామాన్లూ అవీ కొనక్కర్లేదు. They are entering a ready made fully furnished house.అందులో ఉన్నవన్నీ తను కట్టుకున్నవాడు కొన్నవి కాదు,వాడి తండ్రి ఎన్నో సంవత్సరాలు కష్టపడి సమకూర్చినవి.వాటిమీద ఒకవిధమైన attachment ఉంటుంది.అవెవో పాతబడిపోయాయీ, మనకి అంతా మోడర్న్ వస్తువులే కావాలీ అనుకొని, వీటన్నిటినీ మార్చడంతో మొదలౌతుంది, రావణ కాష్ఠం. ఓ రెండునెలలో మొదలౌతాయి సన్నాయి నొక్కులు. బయట వాళ్ళందరరికీ వీళ్ళకుటుంబం చాలా ఆదర్శవంతంగా కనిపిస్తుంది.లోపల్లోపల జరిగేవి ఎవరికీ కనిపించవు.తమ Public Image కాపాడుకోవడానికి
వీలున్నన్ని Exercises చేస్తారు. ఎప్పుడూ మాట్లాడని వాళ్ళతో సడెన్ గా పరిచయాలు పెంచేసుకొని( అదీ తెలుగేతరులతో ) పూసుకొని తిరగడమూ లాంటివన్నమాట.దీని ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైనా ఏదైనా గొడవొస్తే Public support ఎక్కడుంటుందో తెలుసుగా!

    ఇంక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ సంగతి చూస్తే– ఏదో పిల్లల్ని ఎన్నెన్నో ” త్యాగాలు “ చేసి పెంచాము, వాళ్ళు జీవితాంతం మనం చెప్పినట్లే వినాలీ అనుకుంటారు.పోనీ ఏదో ఇంకో ఇంటినుండి
పిల్ల మనింటికి వచ్చిందికదా తనకీ Adjust అవడానికి టైము పడుతుందీ అనుకోరు. ఇది కాలేజీ ల్లో జరిగే Ragging లాంటిది.ఒకళ్ళనొకరు అర్ధం చేసికుంటే ఈ గొడవలేమీ ఉండవు.

    ఇంకో విషయం మర్చిపోయాను– గవర్నమెంటు లో సర్వీసు చేసి తన పెరుమీద అప్పు దొరక్క కొడుకు పేర మీద అప్పు చేసి, తన రిటైర్మెంట్, గ్రాట్యుటీ డబ్బులూ అవీ దీంట్లో పెడతాడు.తన పేర వచ్చే పెన్షన్ మాత్రమే గతి.నచ్చినా నచ్చకపోయినా అందరూ కలిసే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.మింగలేకా కక్కలేకా ఐపోతుంది.ఇలా కాకుండా ఎవరి Space వారికుంటే అందరికీ సుఖం.ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు తలదూర్చక్కర్లేదు. సలహా అడిగితే చెప్పొచ్చు.లేదా Live and let live.

%d bloggers like this: