బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–రాజమండ్రి జ్ఞాపకాలు–3

IMG_0096IMG_0223IMG_0224IMG_0436IMG_0437

    రాజమండ్రీ జ్ఞాపకాలలో, మేము, ఏ.పి.ఆర్.టి.సీ వారి ధర్మమా అని చేసిన ” నవ జనార్ధన” టూర్ ఒకటి.ధవళేశ్వరం లో మొదలుపెట్టి,మడికి,జొన్నాడ, ఆలమూరు,కపిలేశ్వరపురం,మాచర,కోరుమిల్లి, కోటిపల్లి, మండపేట లలో ఉన్న 9 వైష్ణవ క్షేత్రాలు చూపించారు. అదీ 100/- రూపాయలు టిక్కెట్టుతో(ఒక్కొక్కరికి). ప్రొద్దుటే వెళ్ళి, సాయంత్రానికి వచ్చేశాము. చాలా బాగుంది. ఈ సందర్భం లోనే, మండపేట వెళ్ళినప్పుడు, నేను 1956 లో చదివిన స్కూలును ఒకసారి చూసుకునే భాగ్యం కలిగింది.

కడియం పూలతోటల సంగతి చెప్పనక్కరలేదు కదా!! అదో మరువలేని అనుభూతి. అదీ , మా అమ్మాయీ,అల్లుడూ,పిల్లలతో వెళ్ళడం వల్ల ఇంకా ఆనందం.అలాగే అంతర్వేది, యానాం ఆ ట్రిప్పులోనే వెళ్ళాం.

   చూద్దామనుకుంటూనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూడలేకపోయాము. …పిఠాపురం,పాలకొల్లు, భీమవరం, మందపల్లి, వాడపల్లి లాటివి. ఎంత ప్రాప్తం ఉందో అంత చూడకలిగాము. మర్చిపోయానండోయ్ పాపికొండలుకూడా చూడలేదు కారణం–అంతసేపు పడవలో ప్రయాణం చేయడం నాకు భయం, మా ఇంటావిడ ఒక్కత్తీ వెళ్ళనంది. అయినా ఎలాగోలాగ ” త్యాగం” చేసేద్దామనుకున్నా, కానీ తను మూడు వారాలు ముందుగానే పూణే వెళ్ళవలసివచ్చింది.

    యు.ఎస్. లో ఉన్న మా అన్నయ్యగారి అమ్మాయి, భర్తా, కుమారుడితో వచ్చి మాతో గడపడం చాలా బాగుంది.ఆ సందర్భంలో మల్కిపురం వెళ్ళాము.” మోరి ” వెళ్ళి చీరలు తీసికొందామనుకుంటే టైము చాలలెదు. అందువలన ఇక్కడే వాళ్ళ ఔట్లెట్ కి వెళ్ళి, ఓ అరడజను చీరలు కొన్నాను ( నాకు నచ్చినవి). బండార్లంక చీరలైతే మా ఇంటావిడతో నే కలిసి కొన్నాము. చీరల సంగతి అదండీ.

    ఇంక రాజమండ్రీ లో చూడడానికి –మా ఇంటి పక్కన ఉన్న రాళ్ళబండి సుబ్బారావు గారి మ్యూజియం, గౌతమీ గ్రంధాలయం, వీరేశ్వరలింగంగారి జన్మగృహమూ చూశాను. దేవాలయాల సంగతి అడక్కండి.

” అడుగడుగునా గుడి ఉందీ ” అంటూ ఎక్కడచూసినా గుడులే !! అక్కడి వాతావరణం, వారు గోత్రనామాలతో చేయించే పూజలూ, నిజంగా జన్మ ధన్యమైపోయింది.ఎప్పుడో పెట్టిపుట్టాననిపిస్తుంది నాకైతే.ప్రతీ రోజూ ఇచ్చే ప్రసాదాలు ( కట్టుపొంగలీ, దధ్ధోజనం) జన్మలో మరువలెను !!

    ఇంక స్నేహితుల గురించి చెప్పవలసి వస్తే బ్లాగ్గు మిత్రులు శ్రీ మల్లిన నరసింహరావు గారు వచ్చి మాతో గడిపిన కొన్ని గంటలు తీపి గుర్తుగా ఉంటాయి. శ్రీ ఎం.వీ. అప్పారావుగారితో పరిచయం గురించి ఇదివరలో వ్రాశాను. ఈ ఏదాది మార్చిలో జరిగిన ” త్యాగరాజ ఆరాధన ” ఉత్సవాలు, మా బాల్కనీ లోనుండే వినే అవకాశం కలిగింది. అలాగని అక్కడికి వెళ్ళలేదని కాదు, అక్కడ కంటే మా ఇంట్లోనుండి వినడానికి చాలా బాగుంది ( ఏక్ దం రింగ్ సైడ్ సీట్ !!). ప్రక్కనే గోదావరి గలగలలూ, వీనులకింపైన సంగీతమూ ఇంకేమి కావాలీ !!

వీటన్నిటికీ మించింది ” సోనే పే సుహాగా” అన్నట్లుగా, మా ఎదురు ఫ్లాట్ లో ఉండే వారు చేసిన ఋషిపంచమి నోమూ, ఆ సందర్భంలో మాకు శ్రవణానందమైన వేదఘోషా. ఎంత డబ్బు పెడితే వస్తుందండీ ఇలాటి ఆనందం? ఇవన్నీ డబ్బుతో కొలిచేవి కావు. ఏ జన్మలోనో మేమిద్దరమూ చేసికొన్న పుణ్యం !!

    ఇవన్నీ ఒక ఎత్తైతే మేము వ్రతం చేసికొన్న శ్రీ సత్యనారాయణ దేవస్థానం అన్నవరం ట్రిప్పూ, కల్యాణం చేసికున్న ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం ఒక ఎత్తూ. నా అరువైనాలుగేళ్ళ జీవితంలోనూ,పూర్తిగా మనస్సారా ఆనందించిన ఒక ఏడాది జ్ఞాపకాలూ, తీపి గుర్తులూ, మధుర క్షణాలూ ఇవి.

    నేను ఇచ్చే సలహా ఏమిటంటే, వీలైనంతవరకూ ప్రతీ వారూ, జీవితంలో ఒక్కసారైనా భార్యతో కలిసి మీకు ఇష్టమైన ప్రదేశంలో ఒక్క ఏదాది గడపకలిగారంటే చాలు, మీ బ్యాటరీలు మళ్ళీ రీఛార్జ్ అయిపోతాయి!!

   నాకు గోదావరి అంటే ఇష్టం కాబట్టి రాజమండ్రీ లో ఉన్నాను, కోనసీమ అందాలు ఆస్వాదించాము. కొంతమందికి కృష్ణాతీరం నచ్చొచ్చు, కొంతమందికి ఇంకో ప్రదేశమేదో నచ్చొచ్చు. ఏదో ఒకటి నచ్చుతుందికదా,ఠింగురంగా మంటూ కాపురం పెట్టేయండి. డబ్బుకోసం చూసుకోవద్దు. ఎంత డబ్బు సంపాదించినా ఈ ఆనందం ఎక్కడా కొనలేరు.హొటళ్ళలో ఉంటే ఈ ఆనందం సంపాదించలేరు. జీవిత సహధర్మచారిణి స్వయంగా చేత్తో చేసిన వంట తింటూ హాయిగా గడిపేయండి. ఇలాగంటే అందరి గృహిణులూ నామీద దండయాత్ర చేస్తారు. ” మీరందరూ రిటైర్ అయినా మాకు ఈ తిప్పలు తప్పవా ” అంటూ. ఆయనచెత కూడా ఎదో ఒక పని చేయించండి. ఇదీ “కంఫర్ట్ జోన్ “ అంటే !! మీ ఇష్టం ఏంకావాలంటే అది చెయ్యొచ్చు, అడిగేవాడుండడు. అడిగినా చెప్పొచ్చు–” మా ఇష్టం వచ్చినట్లుంటాము.నిన్నేమైనా అడిగేమా ” అని ఝణాయించేయ్యొచ్చు.

    ఇన్నింటిలోనూ నాకు నచ్చనిదేమంటే మా అబ్బాయీ, కోడలూ, మనవరాలూ రాలేకపోయారు.ఇంకో రెండేళ్ళలో ( నేను బ్రతికి బావుంటే) ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి అన్నీ చూపించాలని ఉంది. అప్పటికి కొత్తగా మాకు మళ్ళీ మనవడో, మనవరాలో వస్తుంది కాబట్టి ” కంప్లీట్ ఫ్యామిలీ ” తో వద్దామని ఉంది.ఏం రాసి పెట్టి ఉందో !!

పైన ఇచ్చిన ఫొటోలు మా బాల్కని లోంచి తీసినవి. తలుపు తీయగానే గోదావరి తల్లి దర్శనం. కొద్దిగా నడిస్తే లాంచీల రేవు. ఇంకేం కావాలండి ?

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–రాజమండ్రి జ్ఞాపకాలు-2

    రాజమండ్రీ లో కొన్ని విషయాలు అంతబాగా మరచిపోలేము. మొదటిది రోడ్డుమీద ట్రాఫిక్, వామ్మోయ్ ఆ రోడ్లమీద నడిచి ఏమీ జరగకుండా ఇంటికి తిరిగి వచ్చేమంటే, అది మన చాకచక్యం కాదు, మన ఇంట్లో వారి మంగళసూత్ర గట్టితనం !!ప్రతీ నగరంలోనూ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది, కాదనను. అక్కడ కొంచెం డిసిప్లీన్ లాటిది చూడడానికి ఉంటుంది. ఇక్కడ వరసా వావీ ఏమీ లేవు.ప్రతీవాడూ అంటే గాడీలు నడిపేవాళ్ళూ, ఆటోలవాళ్ళూ, ఇవికాకుండా సామాన్లు తీసికెళ్ళే సైకిల్ రిక్షావాళ్ళూ, వాటిమీద పొడుగ్గా ఉంచిన ఊచలూ, స్టీల్ బార్లూ, ఒక్కటేమిటి అడక్కండి. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దూరిపోతారు. ఖర్మ కాలి మనం (నడిచి వెళ్ళే “పూర్ ఫెల్లోస్”) అక్కడ ఎక్కడో, మన దారిని మనం వెడుతున్నా సరే, మనని రాచుకుంటూ, అదృష్టం బాగోపోతే మీదనుంచైనా వెళ్తుంది. ఎవడో ఒకడు 108 కి ఫోన్ చేస్తే, ఏదో హాస్పిటల్లో పడేస్తారు !!

రోడ్డుకి అటూ ఇటూ లెక్కలెనన్ని టూ వీలర్సూ. దాన్ని నడిపేవాడు, పని అయిపోగానే, సీట్ మీద కూర్చొని, ఇంక వెనక్కాల ఏముందో చూసుకోకుండా ఝూం అని రోడ్డుమీదకు గాడీని లాగేస్తాడు.దాని ” పాత్” లో మనం ఉన్నామా అంతే సంగతులు !! కాలుకి కొట్టుకోవచ్చు, ఏదైనా అవొచ్చు.ఏమీ అనడానికి వీలులేదు. వీళ్ళు కాకుండా సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, అటూ ఇటూ దిక్కులు చూస్తూ నడిపే ప్రభుధ్ధులు కొంతమందుంటారు, వాళ్ళలోకంలో వాళ్ళుంటారు. రోడ్డుమీద నడిచేవాళ్ళు వాడి దయా ధర్మాలమీద బ్రతకాలి. ఇంకో రకం చూశాను, క్రికెట్లో మన వాళ్ళు చూడండి, రాత్రైనా, పగలైనా డార్క్ గ్లాసెస్ పెట్టుకుని ఆడడం, ఓ స్టైలు గా చేశారు. అలాగే రాజమండ్రీలో కొందరు రాత్రిళ్ళు కూడా డార్క్ గ్లాసెస్స్ పెట్టుకొని మరీ టూ వీలర్స్ డ్రైవ్ చేయడం. “ఏమిటో ఈ మాయా వెన్నెల రాజా ” అంటూ మిస్సమ్మలో పాట గుర్తొస్తుంది !! సిరబ్బ లెదుకానీ చీడ అబ్బిందిట. ఇంత గొడవ జరుగుతూన్నా ట్రాఫిక్ పోలీసు అనబడే ప్రాణి కూతవేటు దూరంలో ఎక్కడా కనిపించడు. కనిపిస్తే మళ్ళీఏం గొడవో అని !!

షేర్ ఆటో లో ఎంతగా పట్టిస్తే అంతమందిని కూరుతారు. ఏవడో ఒకడి కాలూ, మరోడి చెయ్యీ ఇలాటివి వేళ్ళాడుతూంటాయి. ఆ ఆటోవాళ్ళుకూడా బేరాలకోసం ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలిపేస్తూంటారు. దాని వెనక్కాల ఏ స్కూటరో, కారో వస్తూంటే ఇంక అడక్కండి. ఒక విషయం ఒప్పుకోవాలి– ఇక్కడ అందరూ ఇలాటి లైఫ్ కి అలవాటు పడిపోయారు. ఏదో మన లాటి బయటనుండి వచ్చిన వారికి చిత్రంగా కనిపిస్తుంది. <b. లైఫ్ గోస్ ఆన్…..

ఇంక పొలిటికల్ అవేర్ నెస్స్, అయ్య బాబోయ్ ఎవరిని చూసినా రాజకీయనాయకుడిలాగానే కనిపిస్తాడు. సిల్కు చొక్కా,తెల్లఫాంటూ, చేతినిండా ఉంగరాలూ, నోట్లో కిళ్ళీ, కళ్ళకి డార్క్ గ్లాసెస్సూ.</b. ఎవడిని చూసినా వాడికి ఎక్కడో అక్కడ ఇన్ఫ్లుఎన్స్ ఉండే ఉంటుంది. ఏం అడిగినా ఫర్వా లెదండీ, మీ పనైపోతుందీ అనేవాడే !! మనం ఏదో ఆటోలో వెళ్తున్నామనుకోండి, తెలివి తక్కువగా మనం ఏదో పార్టీ గురించి మాట్లాడేమా,ఖర్మ కాలి ఆ ఆటో వాడు ఇంకో పార్టీకి చెందినవాడయ్యాడా గోవిందా !! అందుకనే ఏదో కొంచెం లీడ్ ఇచ్చి వదిలేయాలి. వాడు చెప్పేదానికి మాటలో మాట కలిపేస్తే పుణ్యం, పురుషార్ధం !!

ఏడాది పొడుగునా ఏవేవో ” దీక్షలు ” జరుగుతూనే ఉంటాయి. ఒకసారి “భవాని”లు, ఇంకోసారి ” అయ్యప్ప”.ఎర్ర డ్రెస్స్ లోనూ, నల్లడ్రెస్స్ లోనూ కనిపిస్తారు. ఈ సంగతి తెలియక మా ఇంటావిడ వచ్చిన కొత్తలో తనకి ఇష్టం కదా అని ఎర్ర చీర కట్టుకొని బయటకు వస్తే ” భవానీ గారూ” అని పిలుపు వినిపించింది. తనని కాదేమో అనుకొని వెళ్ళిపోతూంటే, “పిలుస్తూంటే అలా వెళ్ళిపోతారేమిటీ” అని ఓసారి కసిరింది.అంతే, మళ్ళీ ఎర్ర రంగు చీర కట్టలేదు. నేనేదో ఈ ” దీక్ష” పడుతున్నవారిని అపహాస్యం చేస్తున్నాననుకోకండి, ఉన్న సంగతి వ్రాస్తున్నాను. ఇవే కాకుండా “పచ్చ ” చీర కడితే “తెలుగు దేశం” పార్టీ అనుకుంటారు, పింక్ కడితే ” టి.ఆర్.ఎస్ ” అనుకుంటారు. ఇవ్విధమ్ముగా మా ఇంటావిడ లిస్ట్ లోంచి నాలుగు రంగులు వెళ్ళిపోయాయి. గాడ్ బ్లెస్స్ హెర్ !!ఇంకో ఏడాది ఉండిఉంటే ఇంకెన్ని రంగులు మానేసేదో !! అంత అదృష్టం నాకివ్వలెదు భగవంతుడు .

ఇంక హొటళ్ళలో టిఫిన్ తినేసిన తరువాత ప్లేట్ లోనే చెయ్యి కడిగేసుకోవడం. అదో అద్భుత దృశ్యం !! వాష్ బేసిన్ దాకా వెళ్తే వీడి సొమ్మేంపోయిందో, అంత కక్కూర్తిగా ప్లేట్ లోనే కడుక్కోవడం ఎందుకూ? దీనికి సాయం, టేబిల్ క్లీన్ చేసేవాడు వచ్చి ప్లేట్లు తీస్తూంటే, ఆ ప్లేట్లో నీళ్ళన్నీ ప్రక్కన ఉన్నవాడిమీద పడడం, లేదా మనం తింటున్న ప్లేట్ లో పడడం.

అన్నీ చెప్పి రాజమండ్రీ సందులగురించి చెప్పకపోతే బాగుండదు. ఒక్కసారి చూస్తే గుర్తుంటాయనుకోవడం మనం ( స్పెషల్లీ కొత్తవారు) చేసే పొరపాటు. అంతా తెలిసున్నట్లుందే అని ఓ సందులోకి వెళ్ళామా, ఎవరింట్లోనో తేలుతాము. ఓ వెర్రినవ్వు నవ్వేసి, ఇక్కడ మాకు తెలిసినవారుండాలీ అంటూ ఓ దీర్ఘం తీయాలి !! పోనీ ఏదో ఓ కొండగుర్తు పెట్టుకుందామా అనుకుంటే అదీ కుదరదు. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో కూడా కనిపించవు. కొండ గుర్తంటే గుర్తుకొచ్చింది–గోదావరి గట్టు ఒకటే కొండగుర్తు, ఎలా వెళ్ళి ఎలా వచ్చినా గోదావరి గట్టుమీదకి వెళ్ళొచ్చు. దారి మర్చిపోతే గోదావరి గట్టుకి ఎలా వెళ్ళాలండీ అంటే ఎవడో ఒకడు దారి చెప్తాడు !! అందుకనే నాకు ఇక్కడ పోస్ట్ మాన్ అంటే చాలా గౌరవం. ఎండనకా, వాననకా, ఈ సందులన్నీ గుర్తుపెట్టుకొని, ఉత్తరాలు బట్వాడా చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్ !!

అన్నింటికీ మించినది ఇంటిపక్కనే ఉన్న డ్రైనేజి లలో తుక్కు పారేయడం. పక్కనే ఆర్.ఎం.సీ వాళ్ళు తుక్కు పారేయడానికి సదుపాయం కల్పించినా సరే, డ్రైన్ లోనే పారేయడం ఓ జన్మహక్కులా అనుకుంటారు. మళ్ళీ పేద్ద వర్షం వస్తే నీళ్ళన్నీ వెళ్ళడానికి దారేదీ ? రోడ్లన్నీ మోకాల్లోతు నిండిపోతాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదూ అంటూ ప్రతీ వాడూ ఓ స్టేట్మెంటిచ్చేయడమే.

ఇక్కడ ప్రకాష్ నగర్ లో ” ధర్మం చెర” అని ఓ పెన్షనర్స్ అసోసియేషన్ ఉంది. వారి జీవిత కాల సభ్యత్వం 250/- రూపాయలు. గరికపాటి వారి ప్రోగ్రాం చూడ్డనికి వెళ్ళినప్పుడు, డబ్బు కట్టాను. నా ఫోన్ నెంబరూ అదీ తీసికొని, ఎప్పుడైనా ప్రోగ్రాం లుంటే మీకు చెప్తామండీ అన్నారు. అలా అనడం వరకే పరిమితం. గడిచిన ఆరు నెలలోనూ వారిదగ్గరనుండి ఎటువంటి ఫోనూ రాలేదు. మరి ఏమీ నిర్వహించలేదా అంటే అదీ కాదు, డబ్బు తీసికోవడం వరకే వారి ఉత్సాహం. వీరికంటే ” హాసం” క్లబ్బు వారు చాలా బెటర్. దానిలో సభ్యత్వానికి ఏమీ తీసికోరు, అయినా వారివద్ద నెంబర్లు ఉన్న ప్రతీ వారికీ ప్రోగ్రాం ఏదైనా ఉంటే చెప్తారు.

అన్నీ నెగెటివ్ పాయింట్లే వ్రాశాడూ అనుకోకండి. ఇక్కడ నేను అనుభవించిన ఆనందం ఇంకో పోస్ట్ లో. ఇక్కడ నేను మిస్స్ అయే దృశ్యాలు అన్నీ ఒక పోస్ట్ లో పెడతాను .

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–రాజమండ్రీ జ్ఞాపకాలు–1

IMG_0165IMG_0166IMG_0168IMG_0186

    సరిగ్గా క్రిందటేడాది దసరాల్లో గోదావరి గట్టు పైన ఉండే అపార్ట్మెంట్ లోకి మారాము. ఈ దసరా పూర్తి అయ్యే సరికి తిరిగి పూణే వెళ్ళిపోతున్నాను. ఈ ఏడాది లోనూ, ఎంతోమంది మిత్రులు అయ్యారు. రాజమండ్రీ లో గోదావరి గాలి తగిలేసరికి, నాలో నాకు తెలియకుండా దాగి ఉన్న తెలుగు రచనా వ్యాపంగం బయటకు వచ్చేసింది. ఏప్రిల్ 15 వ తేదీనుండి నేను బ్లాగ్గులు వ్రాయడం మొదలెట్టాను. మొదట్లో కొంచెం సంకోచించాను, నా లాటి వాడు వ్రాస్తే చదివేవాళ్ళు ఎవరుంటారూ అని. కానీ, మన బ్లాగ్గు మిత్రులు ఇచ్చిన అనూహ్యమైన ప్రోత్సాహం చెప్పలేనిది. వారి అండదండలే లేకుంటే, ఈ 150 రోజుల్లోనూ, 162 పోస్టులు చేయకలిగేఉండేవాడిని కాదు.ఇదంతా మీ అందరి చలవే.ఇప్పటికి 23000 కి పైగా సందర్శకులు వచ్చారంటే, మీ అందరి హృదయాలూ ఎంత విశాలమైనవో తెలుస్తోంది.

    మొదట్లో వ్రాయడం మొదలెట్టినప్పుడు, బ్లాగ్గుకి అలంకారాలూ అవీ లేవు. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లు వ్రాసేవాడిని, పేరాగ్రాఫులు విడిగా రాయడం కూడా తెలియదు. జ్యోతి గారి ధర్మమా అని, నా బ్లాగ్గుకి ఓ అందమైన రూపం ఇచ్చారు. ఆవిడకు ధన్యవాదములు. పేరాగ్రాఫ్ లు, రంగుల్లో వ్రాయడం, ఫాంట్లు పెద్దవి చేయడం, మా కోడలి చలవ !! ఏమైతేనే నా బ్లాగ్గుని ఓ కొలిక్కి తెచ్చారు!! చెప్పానుగా, నేనేదో సుఖపడిపోతున్నానని, మా ఇంటావిడ కూడా తెలుగు టైపు చేయడం నేర్చేసుకొని, తనూ ఓ బ్లాగ్గు మొదలెట్టేసింది. పని హడావిడి లో రెగ్యులర్ గా వ్రాయడం లేదు.

    ఈ బ్లాగ్గులు వ్రాయడానికి ముందర ఒక రోజు ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి, మీ ఇంటికి వస్తున్నామూ, ఓ ఇద్దరితో కలిసీ అని చెప్పారు. అతనెవరో తెలియదు, అయినా కాదనడం ఎందుకని, సరే రమ్మన్నాను. అప్పుడు మా ఇంటిపక్కనే, త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నాయి.. మీతో ఓ గంట గడిపి, తరువాత సంగీత కచేరీ కి వెళ్తామూ అని చెప్పారు ఆ పెద్దమనిషి. మా ఇంటావిడ అడిగిందీ, వాళ్ళెవరో మీకు తెలుసునా, వచ్చేయమని చెప్పారూ అని అడిగింది. వచ్చిన తరువాత చూద్దామూ అన్నాను.

    ఆరోజు వచ్చింది శ్రీ చింతా రామకృష్ణరావు గారు, శ్రీ రాకేశ్వర్రావూ, శ్రీ ( డాక్టర్) చామర్తి శ్రీనివాస శాస్త్రీ. వారితో గడిపిన నాలుగు గంటలూ మరువలేనివి. ఓ గంట ఉందామని వచ్చిన వారితో నాలుగు గంటలు తెలియకుండా, గడపకలిగేమంటే, అది వారిలో ఉన్న విశేషమే. శ్రీ చింతా, శ్రీ రాకేష్ ఒకరి తరువాత ఒకరు పద్యాలు వ్రాయడం తోనే గడిచిపోయింది. శ్రీ చింతా రామకృష్ణరావు గారు వ్రాసిన పద్యం….

‘ మరపుకు రాని ఈ రోజు ఇది మాన్యులు శ్రీఫణిబాబుగారు సత్

కరుణకు మారుపేరయిన కాంతలోమణి సూర్యలక్ష్మియున్

సురుచిర సందరాంగుడగు శోభనా సద్గుణ శ్రీనివాసుడున్

తెరువును జూసి కల్సిన సుధమణి సత్ కవి రాక ఈశుడున్

గరువము గొల్పె తెల్గునకు కాంక్షనునొక్కటనుండి నేడిటన్

కరుణను గౌరవంబు నిడి కాంచిరి నన్ను మహాత్యమొప్పగన్”

వెళ్తూ, వెళ్తూ రాఖెష్ ఇలా అన్నాడు……..

కలసినాము నేడు కల్మషములు లేక

సాహితీ వనమున సంధ్యవేళ

గౌతమీ నది తట కల్పవృక్షము క్రింద

మంచి మాటలు విని మనసు పొంగె.

    ఇదండీ ఇలాగ అయింది, మా మొదటి కలయిక. ఆరోజున శ్రీ రమణ గారు వ్రాసిన ” మిథునం”, నా దగ్గర ఒక క్సెరాక్స్ కాపీ ఉంటే చదవమని శ్రీనివాస శాస్త్రి కి ఇచ్చాను. ఆ మర్నాడు వచ్చి చదివి తిరిగి ఇచ్చేశాడు.రాకేష్ నీ, శ్రీనివాసు నీ ” డు” ఎందుకంటున్నానంటే, వాళ్ళు ప్రతిభలో చాలా పెద్దవారైనా, వయస్సులో మరీ కుర్రాళ్ళండీ ( మహా ఉంటే మా అబ్బాయి కంటే ఓ ఏదాది అటో ఇటో) .

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–అంతులేని కథ

saakshi rjy

   పేపర్లలో ప్రతీ రోజూ ఎక్కడో అక్కడ ఇలాటి వార్తలు చదువుతూంటాము. ఎన్నిసార్లు జనం మోసపోయినా ఈ కథ పునరావృతం అవుతూనే ఉంటుంది. చదువుకోని వారి సంగతి సరే, వారు ఇలాటి మోసాల్లో చిక్కుకోవడానికి అవకాశాలు ఎక్కువ. 30-40 ఏళ్ళు గవర్నమెంటు లో సర్వీసు చేసినవారు కూడా ఈ మోసపోయిన వ్యక్తుల్లో ఉన్నారంటే చాలా సిగ్గు పడే విషయం. ప్రస్తుత సమాచార మాధ్యమాల్లో వీటి గురించి ఎన్నెన్నో వార్తలు చదువుతూనే ఉంటాము. అస్సలు లక్ష రూపాయల మీద నెలకి ఆరు వేలు వడ్డీ ఇస్తామంటే ఎలా నమ్ముతారో భగవంతుడికే తెలియాలి.ఇలాటి వాటిలో చాలా మంది ఇంకోడికి తెలియకుండా, చేరుతారు.ఎవడికి వాడే ఒక్కరోజు లో లక్షాధికారి అయిపోదామని. తీరా వాడు జెండా ఎత్తేసేటప్పడికి అందరూ భోరుమని ఏడుపులూ, రాగాలూ. గవర్నమెంట్ ఏమీ యాక్షన్ తీసికోవడం లేదని. జేరేటప్పుడు ప్రభుత్వానికి చెప్పే చేరేడా? ఆ వచ్చిన డబ్బు మీద అసలు టాక్స్ కట్టే ఉద్దేశ్యం ఉందా ? ఇదిగో ఇలాటి ” బక్రా” లు ఉన్నంత కాలం ” నాగేశ్వర శ్రీనివాసరావులు” ” మజా” చేస్తూనే ఉంటారు.

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–బేరసారాలు–2

    నాకు చివరకి అర్ధం అయిందేమంటే, అక్కడ ఉన్నాయనకి ఓ డౌట్ వచ్చింది. ఈ డీల్ లో ఆయనకి ఏమీ కమిషన్ దొరకదేమో అని. అందువలన ఆయన నన్ను ఇలా త్రిప్పుతున్నారు.ఆయన డౌట్ క్లియర్ చేస్తూ అప్పటికీ చెప్పాను– నాకు ఫలానా ఎమౌంట్ వచ్చేలా చూడండీ, ఆపైన వచ్చేది మీరు తీసుకుందురుగానీ అని. కానీ, అప్పటికే మా చుట్టాలు చేయవలసిన డామేజ్ చేసేశారు. నేను అనుకున్నదానికంటే ఎక్కువ చెప్పేసి, అంత కంటె తక్కువకైతే అమ్మరూ అని అందరిదగ్గరా పబ్లిసిటీ ఇచ్చేశారు. ఇంకెవడొస్తాడూ నా ఇల్లు కొనడానికి? ఇలా ఓ ఏణ్ణర్ధం గడిచింది. ఇంక లాభం లేదని “తెలుగు పీపుల్.కాం” లో నా ఇల్లు అమ్మకం గురించి యాడ్ పెట్టాను. ఇంక వివిధ రకాలైన వారి దగ్గరనుండీ ఎంక్వైరీలు ప్రారంభం అయ్యాయి. అందులో కూడా చిత్ర విచిత్రమైనవి– మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారూ, అక్కడ ఏమైనా సమస్యలున్నాయా అంటూ. నేను అక్కడ ఎప్పుడైనా ఉంటే కదా తెలియడానికి. ఇంకోడు అడుగుతాడూ, మీకు ఎంతయ్యిందీ, ఆరేటుకే ఇచ్చేయొచ్చుగా. అవును నాయనా, నీకోసమే కట్టానూ,ఎప్పుడు రాసేయమంటావూ అని అడిగాను!! మొత్తానికి చిరాకు తెప్పించేశారు. చివరకు ముంబై నుండి ఓ అబ్బాయి తో డీల్ ఫైనలైజ్ చేశాను. నేను ఎంతకి అమ్ముతున్నానో ఎవరికీ చెప్పలేదు.

    కాగితాలు సంతకాలు పెట్టడానికి వెళ్ళినప్పుడు మా చుట్టాలూ, మా ఫ్రెండూ ఒకళ్ళ తరువాత ఒకళ్ళు ” అయ్యో అంత తక్కువకే అమ్మేస్తూంటే, మేమే కొనుక్కునేవాళ్ళం కదా, అయినా చాలా తొందర పడ్డావూ, ఇంకొన్ని రోజులు ఆగవలసిందీ” అని పరామర్శలూ. ఈ మూడేళ్ళూ నన్ను పెట్టవలసిన తిప్పలన్నీ పెట్టి, ఇప్పుడు ఈ భేషజం ఖబుర్లొకటి. ఒకటి మాత్రం నిశ్చయించుకున్నాను– మనం ఏదైనా అమ్మ వలసినప్పుడు ఎవరిమీదా ఆధారపడకూడదు. వాళ్ళు ఏదో మెహర్బానీ చేస్తున్నట్లు చూసే చూపులు మనం తట్టుకోలేము.

అందుకే పూణే లో ఫ్లాట్ అమ్మేటప్పుడు కూడా, నెట్ లోనే పెట్టి డీల్ ఫైనలైజ్ చేశాను. మనకి రాసి పెట్టున్నంత వస్తుంది. జెఫ్రీ ఆర్చర్ చెప్పినట్లు ” నాట్ ఏ పెన్నీ మోర్,నాట్ ఏ పెన్నీ లెస్స్”. నాకు దానిమీద చాలా నమ్మకం !! ఇలా చెప్పినప్పుడు, ” వీడికి బ్రతుకు తెరువు తెలియదు” అన్నా, నాకేమీ బాధ లేదు.

    ఈ బేరసారాలు చేసే వారిని, మేము వరంగాం లో ఉన్నప్పుడు కొంతమందిని చూశాను. అక్కడ వారానికి రెండు సార్లు మార్కెట్ ఉండేది. బుధవారాలు మా ఇంటావిడ వెళ్ళేది. శనివారాలు నేను వెళ్ళేవాడిని. మేము కొన్న ప్రతీ కూరా, మా ఫ్రెండొకడు రేట్లు అడిగేవాడు. ఖర్మ కాలి వాడు కొన్నదానికి తక్కువలో కొన్నామా, మార్కెట్ కి వెళ్ళి ఆ కొట్టువాడితో పేద్ద గొడవ పెట్టుకునే వాడు !! ఈ గొడవలన్నీ పడలేక, నేను దేని రేట్లూ చెప్పడం మానేశాను. మా ఫ్రెండ్ సాయంత్రం చీకటి పడి, మార్కెట్ మూసే వేళకి వెళ్ళి, ఎలాగూ సగం రేట్ కే ఇస్తారు కదా అని అప్పుడు వెళ్ళి కొనుక్కునేవాడు !!

    మనం ఏదైనా సరుకు కొనాలనుకుంటే, కొనేయడమే. అంతే కానీ, ఎప్పుడో పండగలకి ఏవేవో స్కీంలు వస్తాయీ అని కూర్చొంటే, ఆ వస్తువు కొన్న ఆనందం ఎలా వస్తుందీ? ఈ వస్తువులన్నీ లేకపోయినా జీవితం గడిచిపోతుంది. మనం ఎఫోర్డ్ చేస్తున్నాము కాబట్టి కొంటున్నాము. ఒక సంగతి చెప్పండి, ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న ప్రతీ సరుకుకీ, అదే కొట్టుకి బయట ఫుట్పాత్ మీద దొరుకుతుంది. అది ఓ డ్రెస్స్ అవనీయండి, ఓ చప్పల్/షూ అవనీయండి. మనకి “త్రో ఎవే ప్రైస్” లో కొనాలంటే అక్కడే కొనొచ్చు కదా ? సరుక్కి సరుకూ కావాలి, ఎక్కువ ధరా ఉండకూడదు, ” అవ్వా కావాలి బువ్వా కావాలి” అంటే ఎలాగ కుదురుతుందీ ?

    ఏమైనా అంటే ” మాక్రో అనాలిసిస్ ” మీద ఓ లెక్చర్ ఇచ్చేసి, ఈ ఎం.ఎన్.సీ లూ, మాల్ వాళ్ళూ మనల్ని ఎలా దోచుకుంటున్నారూ అని ఓ క్లాసు పీకుతారు.అలాగని నేనేదో కోటీశ్వరుడనుకోకండి. నేను ఒక సామాన్య మధ్య తరగతి జీవుడిని.ఇంట్లో వాళ్ళకి మనకి వీలైనన్ని కంఫర్ట్స్ కల్పించాలి. వాళ్ళు, మన గురించి ఒళ్ళు హూనం చేసికొని, మనని భరిస్తున్నారు కదా( ఏ ప్రతిఫలం ఆశించకుండా) ఈ మాత్రం మనం చేయాలి. ఇవన్నీ లేకుండా కూడా ఇన్నాళ్ళూ జీవితం గడిపేశాము, ఇటుపైనా గడపగలము. అయినా అదో సంతృప్తీ.

    ఇంకో రకం వాళ్ళుంటారు–ఎవరైనా ఏదైనా కొత్త సరుకు కొన్నాడంటే ” అర్రే ఆ కొట్లో కొన్నారా, ఇంకో ఫలానా కొట్లో ఇంతకంటే 20 రూపాయలు తక్కువకే ఇస్తున్నారుట.( సంగతేమంటే ఆయన ఆ రోజు పేపర్లోనో, టి.వీ లోనొ ఓ యాడ్ చూసుంటాడు)” ఆ తక్కువకి ఇచ్చే కొట్టు ఎక్కడో దూరంగా ఉంటుంది, అక్కడకి వెళ్ళిరావడానికి అయే ఖర్చూ అన్నీ పెట్టుకుంటే తడిపి మోపెడౌతుంది. ఆ సంగతి చెప్పడు, తనమాటే నెగ్గాలి, ఎలాగోలాగ తను చేసిందే మనం చేసింది తప్పూ అని నిరూపించాలి. సరే బాబూ నువ్వే తెలివైనవాడివీ, మేము బడుధ్ధాయిలం అని వదిలేయాలి!!

    చివరగా చెప్పేదేమిటంటే బేరసారాలు చేసేవాళ్ళు జీవితాన్ని కూలంకషంగా పరిశీలించి, బ్రతుకుతెరువు తెలిసినవాళ్ళు. మిగిలిన నాలాటి వాళ్ళంతా ” గుడ్ ఫర్ నథింగ్ ” రకం !! సర్వేజనా సుఖినోభవంతూ !!

బాతాఖానీ—లక్ష్మిఫణి ఖబుర్లు–బేర సారాలు–1

   ఎప్పుడైనా కొట్టుకి వెళ్తే కొంతమంది బేరం చేయనిదే సరుకు కొనరు.అదో అబ్సెషన్! ఒక్కొక్కప్పుడు వీళ్ళు అడిగే పధ్ధతి చూస్తే ఆ కొట్టువాడు కొడతాడేమో అనిపిస్తుంది. వీళ్ళకి చీమ కుట్టినట్లైనా ఉండదు. ఏది ఏమైనా సరే, కొట్టువాడు చెప్పిన దానికి సగం రేటుకి అడుగుతారు, విచిత్రమేమంటే వాడు ఇవ్వడానికి సిధ్ధ పడతాడు. అంటే మన వాళ్ళు రైటే అని అర్ధం కదా!! బేరం ఆడడం ఓ కళ. అందరికీ రాదు !!ఉదాహరణకి నేను కొట్టువాడు చెప్పినదానికే కొంటాను, నాకు సరుకు నచ్చితే. అందుకే మనం రెగ్యులర్ గా వెళ్ళే కొట్టువాడు, మనని చూడగానే మొహంనిండా నవ్వు పులిమేసికొని ” రండి సార్ చాలా రోజులయ్యింది, ఏం తీసికొంటారూ” అంటూ , ఓ కూల్ డ్రింకో, కాఫీయో, చాయో తెప్పించేస్తాడు. అంటే వాడికి మనలాటి ” బక్రా” లని చూస్తే ఎంత సంతోషమో. మనకి మార్కెట్ లో ఎంత పాప్యులారిటోయో అని ఇంటావిడ కేసి చూస్తాము. కొట్టువాడేమో మనతో ఆడేసుకుంటాడు. మొహమ్మాటానికీ, మన ఇమేజ్ కాపాడుకోవడానికీ ఏదో ఒక సరుకు కొని వాడికి డబ్బులు సమర్పించుకొంటాము. ఏదో భర్తగారికి తెలిసినవాడు కదా అని, ఇంకో రెండు మూడు సరుకులు సెలెక్ట్ చేసిందంటే, మన పని గోవిందా. అలాగని ఆ కొట్టువాడు వదులుతాడా, డబ్బు కేముందండీ తరువాత మీకు తోచినప్పుడు ఇవ్వొచ్చూ అంటాడు. అంతే మనం వాడికి ” హైపోతికేటెడ్” అయిపోయామన్నమాట !!

7nbsp; కొందరుంటారు, మన ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొన్నామనుకోండి, ఏదో చూసి వదిలేయొచ్చుగా, అబ్బే దాని “హిస్టరీ” అంతా అడిగి తెలుసుకుంటారు, ఎక్కడకొన్నారూ, ఎంత పెట్టి కొన్నారూ వివరాలన్నీ. అక్కడితో ఆగక, ఆ వస్తువు మనం కొన్నదానికంటే తక్కువ ఖరీదనీ, కొట్టువాడు మనని ఎలా మోసం చేసేడో, లాటివన్నీ ఏకరువు పెట్టి, అబ్బే మిమ్మల్ని చూస్తే మరీ అమాయకంగా కనిపిస్తారు, అలాగైతే లాభం లెదండీ అంటూ ఓ క్లాసు పీకుతారు. ఇంక ఇంట్లో వాళ్ళు, అవకాశం దొరికిందికదా అని, వాళ్ళతో కలసి, ” అన్నయ్యగారూ, మీరు చెప్పేది రైటేనండీ, నేను ఎప్పుడైనా బేరం చేస్తే, అబ్బే నీకేం తెలియదూ అంటూ తోసి పారేస్తారు, శుభ్రంగా గడ్డి పెట్టండి , కాపరానికొచ్చినప్పడినుండీ ఇదే వరస” అని తనలో ఇన్నాళ్ళూ దాచుకొన్న కసి అంతా బయట పెడతారు !!

అసలు సంగతేమంటే, మనం కొన్న ఆ వస్తువు ఆ వచ్చిన వాడు ఎప్పటినుండో కొనాలని కోరికా, కొనలెని అశక్తతా,స్నేహితుడు తనకంటే ముందే కొనేశాడు. వీడిమీద

” బ్రౌనీ పాయింట్స్” ఎలా స్కోర్ చేయడమా అని ఆలోచించి, ఇలాగ మన కాపురం లో చిచ్చు పెడతాడన్న మాట !!ఇవన్నీ మన ఇంట్లో వాళ్ళకి తెలియక, వాడు ఏదో మన శ్రేయోభిలాషీ అని వాడిని సపోర్ట్ చేస్తారు.

ఇంకొందరుంటారు, మార్కెట్ లో ఉన్న ప్రతీ దాని ఖరీదులూ తమకే తెలుసన్నట్లు. ప్రతీ దానికీ ఏదో ఒక రిఫరెన్స్ ఇచ్చి,అడిగినా అడక్కపోయినా సలహాలిచ్చేస్తూంటారు. ప్రపంచం లో దేనిగురించైనా ఓ లెక్చర్ ఇచ్చేస్తారు. ఖర్మ కాలి, మనం ఏదైనా, స్థలమో, ఇల్లో కొందామనుకుంటున్నామని అన్నామా, మనని వదలడు. వాడికి తెలిసిన ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్నాడూ, తీసికెళ్తానూ, మనకైతే కన్సెషన్ ఇస్తాడూ అంటూ ఏవేవో ఏకరువు పెట్టి మనని, ఆ ఊబిలో ముంచడానికి కంకణం కట్టేసుకుంటాడు. వాడికి తెలుసు, మనం అంత సులభంగా వాడి వలలో పడమూ అని. అంతే అటునుండి నరుక్కొస్తాడు. మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే, మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వాళ్ళని ఊదరకొట్టేస్తాడు. ఇంక ప్రతీ రోజూ ఇంట్లో మనకి క్లాసులు ప్రారంభం, ” మీరు కొనరూ, ఎవరైనా ఉపకారం చేస్తానంటే వినరూ, అస్సలు నాకు స్వంత ఇంట్లో ఉండే యోగం ఆ దేముడు రాసి పెట్టాడో లేదో” అంటూ కన్నీళ్ళు పెట్టేసికొని ఓ పేద్ద సీన్ క్రియేట్ చేయడం. ఇంక ఈ గొడవ భరించలేక, ఓ రోజు ఆ ఫ్రెండు తో ” సరే మీ ఏజెంట్ దగ్గరకు తీసికెళ్ళూ ” అంటాము. మనం అడగ్గానే ఒప్పేసుకుంటే వాడి వాల్యూ తగ్గిపోదూ, ఓ వారం రోజులు

ఫోన్లూ, తిరగడాలూ అయిన తరువాత, ఓ పెద్ద పోజు పెట్టేసి ఆ ఏజెంట్ దగ్గరకు వెళ్ళే కార్యక్రమం ఫిక్స్ చేస్తాడు. ఇంత హడావిడీ పడి వెళ్తే, అక్కడ మన వాడికున్న పరపతి ఏమిటో తెలుస్తుంది. ఇలాటి వాళ్ళంతా అసలు ఏజెంట్ కి సబ్ ఏజెంట్లన్న మాట. అయిన లావా దేవీల్లో వీడికి కూడా కొంత కమీషనుంటుంది. మనమీదేదో ప్రేమ కాదు, వాడికి వచ్చే సంభావన మీద ప్రేమ.

ఇంక మనం ఇల్లేదైనా అమ్ముదామని చూశామో, దానికి వచ్చే ధర గురించి అందరూ మనకి అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు. ఇక్కడ రేట్లు చాలా బాగున్నాయండి, అమ్మదలిస్తే నాతో చెప్పండీ, మంచి రేటు వచ్చేట్లా చూస్తానూ అంటూ. మనం ఆ ఇంటికి వచ్చే ధర గురించి బంగారు కలలు కంటూ, ఆ పై కార్యక్రమం గురించి ప్లాన్స్ రెడీ చేసుకుంటాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తణుకు లో మా ఇల్లు అమ్మేటప్పుడు నేను పడ్డ బాధలన్నీ మీకూ తెలియాలి. దీనిలో ఏమైనా మీకు ఉపయోగిస్తే సంతోషం. ఇంక మన ” ఇల్లు అమ్మడం కార్యక్రమం ” ప్రారంభం. వారానికో సారి ఫోన్ చేయడమూ, ఆయన ( మాకు సహాయం చేస్తానన్న పెద్ద మనిషి), అబ్బే ఇంకా ఎవరూ అంతగా రాలెదండీ, మొన్న ఒకళ్ళిద్దరు చూసి వెళ్ళారూ, ఏ సంగతీ ఓ రెండు మూడు రోజుల్లో చెప్తామన్నారూ.దానర్ధం ఓ రెండు మూడు రోజుల తరువాత మనం మళ్ళీ ఆయన్ని అడగాలన్న మాట.ఏదో రిటైర్ అయిపోయాడుకదా, ఇంట్లోనే ఉంటాడూ అనుకొని ఫోన్ చేస్తే, వాళ్ళావిడ ఫోన్ తీసికొని ” ఇప్పుడే అలా బయటకి వెళ్ళారండీ, వచ్చిన తరువాత మీరు ఫోన్ చేశారని చెప్తానూ” అంటుంది.ఇక్కడ మనకి టెన్షనూ, ఇల్లు అమ్మకం సంగతి ఏమయిందో అని.

మనం వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసికోలేదుకదా అని అక్కడ ఉండే మన చుట్టాలకి మనమీద పీకలదాకా కోపం. వీళ్ళేం చేస్తారూ, అడిగిన వాడికీ, అడగని వాడికీ, ఈ ఇల్లు అమ్మేస్తారండీ, కానీ ధరే కొంచెం ఎక్కువా, అని ఏదో ఎక్కువ రేట్లు చెప్పేసి మన ఇంటికి వచ్చే బేరాల్ని తగలేయడం. దీనివలన వాళ్ళకి ఒరిగేదేమీ లెదు, మనం బాగుపడకూడదు అంతే వారి లక్ష్యం. మళ్ళీ రేపు కలుసుకుందాం….

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–లేకి తనం

    మాములుగా ఎవరైనా ఏ ఫంక్షన్ కో, రిసెప్షన్ కో వెళ్తే, అక్కడ ఏదో ఒకటి ఇవ్వడమో ఏదో చేస్తారు. మేము 1983 లో వరంగాం ట్రాన్స్ఫర్ మీద వెళ్ళినప్పుడు, అక్కడ అంతా తమాషాగా ఉండేది. అప్పటి దాకా పూణే లో ఉండేవాళ్ళం. మేము వెళ్ళినది పక్కా పల్లెటూరు, అక్కడ మా ఫాక్టరీ, కాలనీ తప్ప ఇంకేమీ ఉండేదికాదు. అక్కడ కొన్ని రిసెప్షన్స్ కీ, క్లబ్ లో పార్టీ లకీ వెళ్ళవలసి వచ్చేది. ఎవరిదైనా ఫేర్వెల్ పార్టీ అదీ అయితే, ఎవరో ఒకరి క్వార్టర్ టెర్రేస్ మీద పార్టీయో, లేకపోతే భోజనాలో అరేంజ్ చేసేవారు.మొదట్లో నేను మామూలుగా చేతులు ఊపుకుంటూ, వెళ్ళాను. తమాషా ఏమిటంటే, మిగిలిన వాళ్ళందరూ చేతుల్లో ఓ పళ్ళెమూ, గ్లాసూ తెచ్చుకొన్నారు.

మా చిన్నప్పుడు అమలాపురం లో ఎప్పుడైనా సంతర్పణకి వెళ్ళవలసి వచ్చినా, ఓ ఇత్తడి గ్లాసు మాత్రమే తీసికెళ్ళేవారం. అంతవరకూ బాగానే ఉంది. ఇక్కడ పళ్ళెం కూడా తీసికెళ్ళాలిట. వామ్మో అనుకొని, ఇలాటి అలవాటు ఎప్పుడూ లేక, మళ్ళీ ఏ భోజనాల పార్టీ కీ వెళ్ళలేదు. అదేమిటో మరీ ఎంబరాసింగ్ గా ఉండేది.

    అక్కడ ఇంకో విచిత్రమైన సంగతేమంటే, ఏ కారణం చేతైనా, ఒక్కడే వెళ్ళవలసి వస్తే, కుటుంబం లోని మిగతా వారికి డబ్బా( కారీయర్) లో సద్ది తీసికెళ్ళేవారు. మరి ఆ పార్టీకి మొత్తం కుటుంబం అంతా కలిపి చందా ఇచ్చాడు కదా !!ఇది మరీ అసహ్యంగా ఉండేది. మనకి ఎందుకొచ్చిన గొడవా అని ఏ పార్టీకీ వెళ్ళేవాళ్లం కాదు. అయినా ఒక్కోసారి, క్లబ్ లో పార్టీలకి వెళ్ళవలసి వచ్చేది. ఇంక అక్కడ చూద్దామంటే, మా క్లబ్ సెక్రెటరీ గారు, పార్టీలో సర్వ్ చేయడానికి, బర్ఫీలూ, కేక్కులూ తెచ్చి, వాటిని సగానికి కట్ చేసేవాడు!! మిగిలిపోయినవన్నీ ఇంటికి తీసికెళ్ళొచ్చుకదా అని. అప్పుడు ఛూశాము, ఒక్కోచోట ఆర్గనైజర్స్ ఎంత నీచానికి దిగిపోతారో అన్నది !!

దేముడి గుళ్ళో ప్రసాదాలు ఇచ్చే చోట కూడా ఇలాటివే చూస్తాము. ఇంకొంచెం ఇవ్వండీ, మాఇంట్లో వాళ్ళ కోసమూ అని అడిగేవారిని. వీళ్ళు అవతలివాళ్ళేమనుకుంటారో అని ఆలోచించరు, తమ పబ్బం గడుపుకోవడమే వాళ్ళ ధ్యేయం !!

    ఇవన్నీ ఒక ఎత్తూ, ఈ మధ్యన రాజమండ్రీ లో మొన్న హాసం క్లబ్ మీటింగ్ కి వెళ్ళాను. గత 5 సంవత్సరాలుగా ప్రతీ నెలా మూడో ఆదివారం నాడు, ఓ మీటింగ్ పెడతారు. దానికి చందా ఏమీ లేదు. హాస్య ప్రియులందరినీ ఒకచోట సమావేస పరచి, అందరూ ఏవో జోక్కులూ, పాటలూ పాడడం– ఓ రెండు గంటల పాటు హాయిగా గడపడం. ఆ మీటింగ్ కయ్యే ఖర్చు ఓ ఇద్దరు ముగ్గురే భరిస్తారు. అందులో శ్రీ అప్పారావు గారూ, శ్రీ హనుమంతరావు గారూ ముఖ్యులు. వారు మొదటిసారి గా క్రిందటి రెండు నెలలోనే ” నెల తప్పారుట”. అంటే ఏవో కారణాల వలన క్రిందటి రెండు నెలలోనూ మీటింగ్ చేయలేకపోయారుట !! “నెల తప్పాము” అని అదికూడా ఓ జోక్ లాగ చెప్పారు !! ఆ రెండు గంటలలోనూ ఎవరైనా సరే ఓ జోక్ చెప్పొచ్చూ, పాట పాడొచ్చూ, ఎలాగోలాగ నవ్వించొచ్చు !!మన ఇష్టం . అంతా ఉచితం !!

    ఈ సారి మీటింగు లో శ్రీ అప్పారావు గారు– ఆయన గురించి నా బ్లాగ్గులో ప్రస్తావించాను ఈ మధ్యన ( విశ్వక్సేన దర్శనం), శ్రీ బాపూ, శ్రీ ముళ్ళపూడి వారి ఏకలవ్య శిష్యుడు. ఆయన కార్టూన్లు చాలా బాగా వేస్తారు, చాలా పత్రికల్లో వచ్చాయి. తెలుగు వికీపీడియా లో కూడా వారి గురించి వ్రాశారు–. ఆయన వేసిన కార్టూన్లు ఓ పుస్తక రూపంలో ప్రచురించారు. మూల్యం- 30 రూపాయలు. ఈ సారి ” హాసం ” సమావేశంలో పాల్గొన్న వారికి ( అంటే వేదిక మీదకు వెళ్ళి,ఓ జోక్క్ వేసినవారికి, ఓ పాట పాడిన వారికీ) ప్రోత్సాహ సూచికగా ఆ కార్టూన్ల పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

    ఆ పుస్తకాలు ఆయనకి ఏదో అమ్ముడుపోక కాదు, ఏదో తన ఆనందాన్ని ప్రకటించడం కోసం మాత్రమే. అలాగని అక్కడకు వచ్చిన వారందరినీ కొనమనడం లేదు ఆయన. మేము శ్రీ రమణ గారిని కలుసుకొన్నప్పుడు ఆయన సంతకం చేసి ఆయన రచించిన ” శ్రీ రామాయణం” ( మూల్యం 116 రూపాయలు) మాకు జ్ఞాపిక గా ఇచ్చారు. అలాగే శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు ఆవిడ వ్రాసిన ” ఆలింగనం” పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ఆ పుస్తకాలు, మేము వారితో గడిపిన మధుర క్షణాలకి తీపి గుర్తుగా ఉంటాయి.

    అలాగే అప్పారావు గారు శ్రీ బాపూగారినీ, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారినీ కలిసిన ప్రతీ సారీ వారు ఏదో ఒక పుస్తకాన్ని ఈయనకి ఇస్తారూ, వాటిని ఎంతో ప్రియంగా ఈయన వాటిని దాచుకుంటారు. ఊరికే ఇస్తున్నారు కదా అని శ్రీ అప్పారావు గారు తమ పరిచయాన్ని దుర్వినియోగ పరచుకోవడం లేదు కదా, ఇంకొన్ని పుస్తకాలు ఇవ్వండీ అని !! అది జన్మతహా వచ్చే సంస్కారం !!

    ఇప్పుడు అసలు సంగతికి వస్తే, ఓ జంట లో భార్య గారు ఓ పాట పాడారు, భార్య గారు ఓ జోక్ చెప్పారు. శ్రీ అప్పారావుగారు ఓ పుస్తకాన్ని వీరిరువురికీ కలిపి ఇచ్చారు. ఆ భర్తగారు ఊరుకోవచ్చా, నాకూ ఒకటివ్వండీ, నేనుకూడా ఓ జోక్ చెప్పానుగా అన్నారు. పక్కనే ఉన్న నేనన్నానూ, “ మాస్టారూ భార్యాభర్తలిద్దరూ కలిసి చదివితేనే జోక్ బాగా ఎంజాయ్ చేస్తారూ, ఒక పుస్తకం చాల్లెండీ ” అన్నాను. నేను వెళ్లిపోయిన తరువాత ఆ సదరు భర్త గారు శ్రీ అప్పారావుగారిని ” నాకు ఓ మూడు పుస్తకాలివ్వండీ” అన్నారుట. ఈయనకి చాలా బాధ వేసి ” నేను ఇవన్నీ ఏదో పంచిపెట్టడానికి తీసుకు రాలెదూ, మీకు కావలిసిస్తే దుకాణానికి వెళ్ళి కొనుక్కోండీ ” అని మొహమ్మాట పడకుండా చెప్పేశారుట.

నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఉచితంగా వస్తూంటే ఎంత దొరికితే అంత “గుంజుకుందామని చూసే వారిని” చూస్తూంటే. వీళ్ళ లేకితనానికి అంతే లేదా ?

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–మొహమ్మాటం/ చేతకానితనం

    మామూలుగా ఒక్కొక్కప్పుడు మనం పడే మొహమ్మాటాన్ని ” చేతకాని తనం ” అనికూడా చెప్పుకోవచ్చు.ప్రతీ మనిషికీ లౌక్యం తప్పకుండా తెలిసిఉండాలి.లేకపోతే ప్రస్తుత ప్రపంచంలో నెగ్గుకు రావడం చాలా కష్టం. పోన్లెద్దూ, వాళ్ళని అనుకోవడం ఎందుకూ, మనమే కాంప్రమైజ్ అయిపోదాము అనుకుంటాము. కానీ అవతలవాళ్ళు దీనిని ఒక అడ్వాంటేజ్ గా తీసికొని, మనని ఉపయోగించుకుంటారు. ఇలాటివన్నీ ఈ ఏడాదీ ఆంధ్రదేశం లో ఉండి అనుభవం లోకి వచ్చాయి. ఇవన్నీ నాకు కొద్దిగా మిగిలిఉన్న భావిజీవితంలో ఎంతవరకూ ఉపయోగపడతాయో తెలియదు.

    ఈ మధ్యన మా ఎదురుగా ఉండే ఆయన, ఏదో కార్యక్రమానికి, హైదరాబాద్ నుండి వచ్చారు, ఓ వారంరోజులు గడుపుదామని. ఆయన ఈ నెలాఖరుకి రిటైర్ అవుతున్నారు. రాజమండ్రీ లో ఉందామనే సదుద్దేశ్యంతో, ఇక్కడ గోదావరి గట్టున ఓ ఫ్లాట్ కొన్నారు.ఆయనా, నేనూ ఓ రోజు ఖబుర్లుచెప్పుకున్నాము.ఇక్కడ ఓ సంవత్సరం నుండీ ఉంటున్నాను కదా అని, ఉండడానికి ఎలా ఉంటుందండీ అని అడిగారు.ఆయన కూడా గత పాతిక సంవత్సరాలనుండీ హైదరాబాద్ లోనే ఉన్నారు.ఎప్పుడో చుట్టపు చూపుగా రావడమే కానీ, గట్టిగా ఓ నెలరోజులు గడపలేదు. నేను నా అభిప్రాయం చెప్పాను, ఎలాగూ ఇక్కడ శాశ్వతంగా ఉండడం లేదు, పోనీ నా అనుభవాలు పంచుకుంటే ఆయనకి ఉపయోగపడొచ్చూ అని.ఇక్కడ రోడ్ల పరిస్థితీ, సొసైటీ ( అంటే మేముండే అపార్ట్మెంట్లు) లో ఉండే సాధక బాధకాలూ,లాటివన్నమాట. నేను చెప్పానుగా ఒక బ్లాగ్గులో, మా ఫ్లాట్ పైన ఉండేవారి పనిమనిషి, ప్రతీ రోజూ, మొత్తం రోజులో ఓ గంటసేపైనా ఏవేవో పొడులు తయారుచేస్తూండడమో, లేక పచ్చళ్ళు రుబ్బడమో , ఏమీలేకపోతే మసాలా నూరడమో, ఆతావేతా నా లైఫ్ ని మిజరబుల్ చేస్తుంది.అయినా ఏమీ చేయలేకపోయేను, దానికి ” సంస్కారం” అని ఓ పేరు పెట్టుకొన్నాను. దానిని “చేతకానితనం” అనాలి.

    ఇంక మా సొసైటీ లో నెలలో ఓ పదిరోజులైనా లిఫ్ట్ పనిచేయదు, ఏదో ఒక రిపైర్ దానికి, ఎప్పుడైనా ఖర్మకాలి వాచ్మన్ ని జనరేటర్ వెయ్యరా అంటే, పనిచేయడంలేదూ అని ఓ రొటీన్ సమాధానం చెప్తాడు. ఎంత చెప్పినా అద్దెకున్నవాళ్ళంకదా. నోరుమూసుకొని నాలుగు అంతస్థులూ ఎక్కి వెళ్ళడమే, పోనీ కంప్లైంట్ చేద్దామా అంటే మళ్ళీ మొహమ్మాటమే ( అదే చేతకాని తనం). ఇవన్నీ ఆయనతో పంచుకొన్నాను.

    అదేరోజు ఆయన ఒక విండో ఏ.సీ తెచ్చి అమర్చారు, ఇక్కడ ఎండ వేడి భరించలేనిదిగా ఉంటుంది. రాత్రి ఏ.సీ పెట్టుకొని, ఆయనా, మనవరాలూ పడుక్కున్నారు, ఓ రాత్రి వేళ, వాళ్ళక్రింద ఫ్లాట్ లో ఉన్న ఒకాయన వచ్చి తలుపులు దబదబా అని తట్టాడు. ఆవిడ లేచి సంగతేమిటా అని చూస్తే, ఈ వచ్చినాయన ” మీకు అస్సలు బుధ్ధి ఉందా లేదా, క్రిందవాళ్ళనుగురించి ఆలోచించఖ్ఖర్లేదా, మీ ఏ.సీ లోంచి నీళ్ళు మా విండో మీద పడి, చప్పుడు చేస్తూ నా నిద్ర పాడిచేస్తున్నాయీ” అంటూ, ఇంకా ఏవేవో వీళ్ళ సంస్కారాన్ని గురించీ వగైరా వగైరా ఏమేమో అరచి, అలసిపోయి వెళ్ళిపోయాడు. ఇది జరిగినది ఎప్పుడూ రాత్రి 12 గంటలకి. ఆవిడ హడలిపోయింది, ఆవిడచెప్పేది ఏమైనా వింటేనా, తన గొడవేదో తనదే. కళ్ళంపట నీళ్ళు పెట్టుకొని ఆయన్ని లేపింది. వాళ్ళు ఏ.సీ.పెట్టింది సాయంత్రం 7.00 గంటలు దాటిన తరువాత, ఇంకా మర్నాడు వచ్చి నీళ్ళు పోవడానికి ట్యూబ్బూ అవీ పెట్టాలి. అయినా ఆ క్రిందాయనకి చెప్పే ధైర్యం లేకపోయింది. ఇవన్నీ నాతో మర్నాడు చెప్పారు. పోనీ ఇవన్నీ ఆయనతో చెప్పొచ్చుగా అని, నేను ఓ ఉచిత సలహా ఇచ్చాను!! నేను ఏడాదినుండీ పడుతున్న హింసని ఆపలేకపోయాను!!ఇంకెంత ఇక్కడ ఉండేది ఓ వారమే కదా అని!! మా ఎదురుగుండా ఉన్నాయనంటారూ, పోనీ ఏ.సీ తిసేద్దామా అంటారు!! ఇదండీ ఆయన మొహమ్మాటం ( అదే చేతకాని తనం!!). కొసమెరుపేమిటంటే అంత దెబ్బలాడినాయన ఫ్లాట్ ఓనర్ కాదు, నాలా అద్దెకుంటున్న పక్షే !!

    ఇవన్నీ కాకుండా ఇంకో సంఘటన జరిగింది– వాచ్ మన్ కి వీళ్ళ బట్టలన్నీ ఇచ్చి ఉతికి, ఇస్త్రీ చేసి ఇమ్మన్నారు. వాడు ఆ బట్టలన్నీ టెర్రేస్ మీద ఆరేశాడు. సాయంత్రం చూస్తే అన్నీ ఉన్నాయి కానీ, వాళ్ళ కోడలి డ్రెస్స్ ఒకటి ( చాలా కాస్ట్లీ దిట) పోయింది. వీడంటాడూ, నాకెమీ తెలియదూ, ఫ్లాట్టుల్లో వాళ్ళే ఎవరో కొట్టేశారూ అంటాడు. ఈయన తూర్పు దిక్కుగా తిరిగి దండం పెట్టడం తప్పించి ఏమీ చేయలేకపోయారు !! ఏమంటే మొహమ్మాటం ( అదే చేతకాని తనం!!) అడగడానికి.

    కొంతమందుంటారు, మనం ఎక్కడికైనా ఎదో ఫలానా ఊరు వెళ్తున్నామూ అంటామనుకోండి, అప్పటికప్పుడు ఏదో ఆలోచించేసి, ఊళ్ళో ఉండే వీళ్ళ చుట్టాలకి, మన చేత ఏదో ప్యాకెట్టో, మరేదో తీసికెళ్ళి ఇమ్మనడం.అది ఓ ఊరగాయ అవొచ్చు, ఓ వస్తువవొచ్చు, మరెదో అవొచ్చు.ఇవ్వమూ అనడానికి మొహమ్మాటం.మన వస్తువులకంటే దాన్ని మహ జాగ్రత్తగా చూసుకోవాలి. తీసికెళ్ళం అంటే కోపాలూ. ఏదో వీడే మోస్తున్నట్లు పోజూ అంటూ అందరిదగ్గరా మనల్ని యాగీ చేసేస్తారు!!

   ఇలాటివాళ్ళకి ఇదో జాడ్యం. అదేం ఖర్మమో ఎక్కడికి వెళ్తున్నామన్నా అక్కడ ఓ స్నేహితుడినో, చుట్టాన్నో సృష్టించేస్తారు, వీళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి. పిల్లికి చెలగాటమూ ఎలక్కి ప్రాణసంకటమూ!! ఇలాటివన్నీ వ్రాస్తే వీడేదో ” అన్సోషల్ యానిమల్” అని ఓ టైటిల్ కూడా ఇస్తారు.

వీటన్నిటినీ మొహమ్మాటం అందామా, చేతకానితనం అందామా? మీరే చెప్పండి !!

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు -Three chiefs of The Armed Forces

IMG_0594IMG_0595IMG_0596IMG_0597IMG_0598IMG_0599

     1965 -70 లలో మన రక్షాదళాధిపతుల నుండి వచ్చిన ప్రత్యుత్తరాలు, మీతో పంచుకుంటున్నాను.

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–కోటిపల్లి రైల్ బస్

IMG_0753IMG_0758IMG_0759IMG_0760IMG_0761IMG_0766IMG_0770

    కాకినాడ నుండి కోటిపల్లి దాకా ఓ బుచ్చి ట్రైన్ వేశారు. మా చిన్నతనంలో కోటిపల్లి నుండి కాకినాడ వెళ్తూంటే, దూరంగా ఎత్తుగా, బ్రిటిష్ వాళ్ళు వేసిన రైలు కట్ట కనిపించేది. యుధ్ధం రోజుల్లో స్టీల్ కొరత ఏర్పడితే, ఈ రైలు మార్గాన్ని ఎత్తేశారుట. మళ్ళీ, మన లోక్ సభ స్పీకర్ శ్రీ బాలయోగి ధర్మమా అని, మళ్ళీ ఓ రైల్ వేసి ఆ మార్గాన్ని పునరుధ్ధరించారుట. దానిలో ప్రయాణించడానికి సమయం లేక వెళ్ళలేకపోయాము. కోటిపల్లి నుండి కాకినాడ వరకూ రెండు గంటలు పడుతుందిట. టికెట్ 11/- రూపాయలన్నట్లు జ్ఞాపకం.ఈ ట్రైన్ కి అంత ఎక్కువ ప్రాచుర్యం లేదు. ఏదో మనలాటివాళ్ళు, నావెల్టీ కోసం వెళ్ళడమే. అయినా సిన్సియర్ గా నడుపుతున్నారు. టికెట్లు రైల్లోనే ఇస్తారుట ( బస్సులోలాగ). పచ్చటి పొలాల్లోంచి వెళ్తుందిట. ఎక్కడ ఎవరు చెయ్యి చూపించినా ఆపుతారుట ( మన పల్లె వెలుగు బస్సు లాగ !!). వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేయడానికి బాగా ఉపయోగపడుతోందిట. ఈ సారి ఎలాగైనా వీలు చేసికొని తప్పకుండా ప్రయాణం చేసి ఆనందించాలి !!