బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–http://tenderleaves.com/

పూణె లోని తెలుగువారందరూ,ఏ గ్రంధాలయానికీ వెళ్ళఖ్ఖర్లేకుండా, హాయిగా మీ వద్దకే వచ్చే ఓ సదవకాశం.ఒక్కసారి అందులోని పుస్తకాల జాబితా చూశాక మమ్మల్ని సంప్రదించండి.

Online Library

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పూణె లో తెలుగువారికి సదవకాశం.

    నేను పూణె లో గత 47 సంవత్సరాలనుండీ ఉంటున్నాను.నాకు తెలుగు అంటె విపరీతమైన అభిమానం. వచ్చిన కొత్తలో అంటే 1963 లో అప్పుడప్పుడు తెలుగు వార, మాస పత్రికలొచ్చేవి.కొంతకాలం తరువాత, తెలుగు దిన పత్రికలు రెండో రోజుకి వచ్చేవి.రైల్వే స్టేషనులో ఒక్కొక్కప్పుడు, డిటెక్టివ్ నవలలు దొరికేవి.ఎప్పుడైనా మనప్రాంతానికి వెళ్ళినప్పుడు మాత్రమే, తెలుగు పుస్తకాలు( నవలలలాంటివి) కొనుక్కుని, వాటినే మళ్ళీమళ్ళీ చదుకోవలసివచ్చేది.ఆంధ్రా అసోసిఏషన్ కి వెళ్దామంటే, బాగా దూరం. అయినా అక్కడ తెలుగు గ్రంధాలయం ఉందో లేదో ఇప్పటికీ నాకు తెలియదు.చెప్పొచ్చేదేమిటంటే, తెలుగు మీద అభిమానం ఉన్నవారికి, తెలుగు పుస్తకం దొరికేదికాదు.అదృష్టవశాత్తూ, కొంతకాలానికి ఎమెస్కో వారు
ఇంటింటా గ్రంధాలయం ప్రారంభించిన తరువాత, దానిలో సభ్యత్వం తీసికొని, కొన్ని పుస్తకాలు కొనుక్కోకలిగాను.అలా అవీ ఇవీ కలిపి ఓ పాతిక ముఫై పుస్తకాలు సేకరించకలిగాను. దీపావళి మాసపత్రికలు ఎలాగోలాగ సంపాదించేవాడిని.

   ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ మధ్యన మా అబ్బాయి చి.హరీష్, హాయిగా చేస్తున్న ఉద్యోగం మానేసి,కోడలు చి.శిరీష ఉద్యోగం సాగిస్తూ, ఓ Online library ప్రారంభించారు–http://tenderleaves.com/ – దానిలో ముందుగా అందరూ చదవడానికి వీలుగా, ఇంగ్లీషు పుస్తకాలు పెట్టాడు. కానీ, నా మాట మన్నించి, ఇక్కడి తెలుగువారికోసం తెలుగు పుస్తకాలు కూడా పెట్టాడు. ఎరక్కపోయి సలహా ఇచ్చినందుకు, తెలుగు విభాగం అంతా నన్నూ, మాఇంటావిడనీ చూసుకోమన్నాడు.అక్కడ పెట్టిన తెలుగు పుస్తకాల గురించి ఎంతోకొంత వ్రాయాలిగా, అవన్నీ మాకు అప్పచెప్పాడు. ప్రస్తుతానికి నాలుగువందల పైన తెలుగు పుస్తకాలు పెట్టాము.ఒకసారి పైనిచ్చిన లింకులో , అక్కడ ఉన్న
ఇంగ్లీషు, తెలుగు పుస్తకాల జాబితా, వాటిని ఎలా తెప్పించుకోవాలో మొదలైన వివరాలు తెలుస్తాయి.

    మాకు తెలిసినంతవరకూ పూణె లో అయిదు లక్షల మంది తెలుగువారున్నారు. అందులో కొంతమందికైనా తెలుగు పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉంటుంది.నెట్ లో దొరుకుతున్నాయికదా ఇంకా ఈ గ్రంధాలయం ఎందుకూ అనకండి, ఎంతసేపని
కంప్యూటరు ముందు కూర్చుంటారు? రోజంతా ఆఫీసులో కూర్చుని చేసేదదేకదా.ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చాక, పుస్తకాలు చదివే ఓపికెక్కడిది? మీ ఇంట్లో, మీనాన్నగారో, అమ్మగారో, అత్తగారో, మామగారో ఉన్నారనుకోండి, మీరు ఆఫీసుకెళ్ళిపోయిన తరువాత, ఎంతసేపని, టి.వీ చూస్తూ కాలక్షేపం చేయమంటారు? అదే ఓ పుస్తకం ఇచ్చేస్తే ఆ మజాయే వేరు! అంతేకాదు, మీమీద ఇంప్రెషన్ పెరిగిపోతుంది! మా అల్లుడు/ కొడుకు ఎంత మంచివాడో, పూణే లో కూడా మాకోసం మంచి తెలుగు పుస్తకాలు తెస్తున్నాడూ అని!! మీరైనా సరే ఏ శలవురోజో, ఓ పుస్తకం హాయిగా తలక్రింద ఓ దిండు పెట్టుకుని, చదివి చూడండి. అప్పుడు తెలుస్తుంది, నెట్ లో చదవడానికీ,అసలు పుస్తకం చదవడానికీ ఉన్న తేడా!

    నేను చూసిందేమిటంటే, పూణె లో తెలుగువారికి మన బ్లాగులగురించి అంత పరిచయం లేదు. మేము ఏమీ ఈ ఆన్ లైన్ గ్రంధాలయం గురించి అంతగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు.అందుచేత, మన తెలుగు బ్లాగర్లందరినీ కొరేదేమిటంటే
మీకు తెలిసిన స్నేహితులకి కానీ, చుట్టాలకి కానీ ఈ విషయం చెప్పమని. మీరందరూ ఒకసారి ఈ సైటులోకి వెళ్ళి, పుస్తకాల జాబితా ఒకసారి చూడండి.అక్కడ ఉన్న పుస్తకాలు చదవదగ్గవే అని మీరు అనుకుంటే మీవాళ్ళకి చెప్పండి. నలుగురికీ తెలిస్తేనే కదా,చదివేది. ఇంకో సంగతండోయ్- నాకున్న మిడిమిడి జ్ఞానంతో పెట్టిన పుస్తకాలే అనుకోకండి, అక్కడున్నవి కాక, ఇంకా మీ అందరి దృష్టిలోనూ చదవవలసిన పుస్తకాల జాబితా, మీ మీ వ్యాఖ్యలద్వారా తెలియచేయండి.
అందరూ తలో చెయ్యేస్తేనే కదా మా కార్యక్రమం విజయమంతమయ్యేది! మీ అందరి ఆశీర్వచనాలతో, మేము ప్రారంభించిన ఈ గ్రంధాలయం అందరికీ ఉపయోగించేటట్లుండాలని ఆశిస్తూ….
.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– తెలుభాషా దినోత్సవం

    ఆ మధ్యనెప్పుడో ఓ టపా వచ్చింది.ఈ నెల 29 న మాతృభాషోత్సవం సందర్భంగా, తెలుగుబాట కార్యక్రమం జరుపుతున్నారని.ఏదో మన భాషమీదుండే అభిమానం కొద్దీ, తెలుగుబాట కార్యక్రమంలో, నేనూ పాలుపంచుకుందామనే సదుద్దేశ్యంతో, భాగ్యనగరానికి వెళ్ళాను.వారిచ్చిన లింకులో నా పేరు నమోదుకూడా చేశాను.అందులో,వారు చెప్పిన ప్రకారం, కార్యక్రమంలో మార్పులూ, చేర్పులూ ఉంటే తెలియచేస్తామన్నారు. నా ఐ.డి.,సెల్ నెంబరూ ఇచ్చాను.

    శుక్రవారం 27 కే చేరుకుని, రామూ తో మూడుగంటలు గడిపాను( ఆ విషయాలన్నీ ఇంకో టపాలో)వాళ్ళ కార్యాలయంలో.శనివారం ఫోను చేసి, తెలుగుబాట కార్యక్రమ స్థలంలో, ఏదో మార్పున్నట్లు విన్నానని చెప్పారు. ఏదైనా మార్పున్నట్లయితే తెలియచేస్తామన్నారూ, నాకైతే ఏ సమాచారం లేదూ, అయినా ఏదో పేద్ద పాత్రికేయుడు చెప్పాడు కదా అని, శ్రీ సతీష్ కి ఫోను చేసి అడిగితే, కొన్ని ‘కారణాల’ వలన ఎచ్.ఎం టివీ లో అలా స్క్రోలు చేస్తున్నామనిన్నూ, స్థలమార్పేమీ లేదనీ చెప్పారు.ప్రొద్దుటే 7.30 కి’ తెలుగుతల్లి’ విగ్రహానిదగ్గరకు వచ్చేయమన్నారు.

    మర్నాడు ప్రొద్దుటే, వారు చెప్పినట్లుగా తెలుగుతల్లి విగ్రహం దగ్గరకు( ఆటో డ్రైవరు ధర్మమా అని క్షేమంగా) చేరాను!నన్ను మా చుట్టాలడిగారు, అక్కడికి వచ్చేవారు మీకు తెలుసునా అని, నేను చెప్పాను అక్కడికి వచ్చేవారందరిపేర్లూ విన్నానూ, కొంతమందితో ఫోను ద్వారా పరిచయం ఉందీ, అయినా నా మొహం అందరికీ సుపరిచితమే ఎవరో ఒకరు గుర్తు పడతారూ అని.అలాగే అనుకున్నట్లుగా, సుజాత ( మరీ వాళ్ళందరినీ ‘ గారు’ అనడం లేదు, ఒక్కళ్ళకీ నా సర్వీసంత వయస్సు లేదు.పైగా నా కంటె వయస్సు తక్కువున్నవారికి నమస్కారం పెట్టినా, మరీ ఎక్కువగా ‘గారూ’ ‘ బీరూ’ అంటే ఆయుక్షీణంట బాబూ, ఎందుకొచ్చిన గొడవా, ఇంకా కొన్ని సంవత్సరాలు మిమ్మల్నందరినీ బోరు కొట్టద్దూ!!)వచ్చి పలకరించి, అక్కడున్నవారికి పరిచయం చేసి, ఓ టీషర్టిచ్చారు. దానికి ఓ బ్యాడ్జి తగిలించారు. ఈ అలంకరణలయ్యాక, ఓ ఫారం ఇచ్చి నింపమన్నారు.నా చేతివ్రాత ఎవరికీ అర్ధం అవదని, సుజాత నే నింపమన్నాను.అందులో ఆఖరి కాలం ఏమిటంటే ‘ మీరు ఈ తెలుగు సభ్యత్వం తీసికుంటారా’ అని.సంవత్సరచందా ఎంతని అడిగితే,500/- అన్నారు! అదేం పెద్దమొత్తం కాదనుకోండి,అయినా మరీ బలవంతంగా ఓ టీషర్టు తొడిగేసి, సభ్యత్వం తీసికుంటారా లేదా అని అడిగితే ఎలాగండి బాబూ, కాదంటే ఆ టీషర్టు పీకేస్తారేమో అని ‘ భయపడి‘ సరే అన్నాను!

    ఇంతలో కొంతమంది వచ్చారు. అందరినీ పరిచయం చేసికుని, సుజాత అందరికీ చాయ్ ఇప్పించారు, అది త్రాగి, ఏవో కొన్ని ఫుటోలు తీసికున్నాను.అంతా కలిపి ఓ యాభై మందుంటారు.
అదీ భాగ్యనగరంలో మనవారి ‘ భాషాభిమానం’. చాలా బాధేసింది.వారంలో అదీ శలవురోజున ఆమాత్రం ఇటువంటి కార్యక్రమాలకి సమయం, అదీ ఎంత ఓ మూడు గంటలు,ఓ దిక్కుమాలిన సినిమా చూసిందానికంటే తక్కువ!– కేటాయించలేకపోయారంటే, మనవాళ్ళందరికీ, మాటల్లో తప్ప చేతల్లో అంత ఉత్సాహం లేదనే అనుకోవాలి.రాకపోవడానికి ఎన్నెన్నో కారణాలకేముందీ, కావలిసినన్ని చెప్పొచ్చు.అక్కడికి, ఈ కార్యక్రమానికొచ్చిన వారందరికీ పనులే లేవా, అయినా ఓ మంచి పని చేస్తున్నారూ, వారందరినీ ఉత్సాహపరచాలనే కదా వెళ్ళిందీ.అంతే కానీ, టి.వీ ల్లో రావచ్చూ, ఓ ఫ్రీ టీషర్టు ( అని అనుకుంటున్నాను!) కొట్టేయొచ్చూ అని కాదుగా.ఎవడో ఎక్కడో ‘వాకథాన్’ ‘మారాథాన్’ అనగానే మాత్రం, వర్షమైనా ఎండైనా సరే తోసుకుంటూ వచ్చేస్తారు, ఎందుకంటే అక్కడ సెలిబ్రెటీస్ కూడా వస్తారు కాబట్టి.ఇక్కడే వస్తుంది గొడవంతా, ప్రభుత్వం తెలుగు గురించి ఏమీ చేయడంలేదూ అని గోల పెట్టేకంటే,మనం ఏం చేస్తున్నామూ అని ఆలోచించండి.మీకే దొరుకుతుంది సమాధానం!

   ఆ కార్యక్రమంలో ఏం జరిగిందీ అనే వివరాలు చాలా టపాల్లో వచ్చాయి. మళ్ళీ ఆ వివరాల్లోకి వెళ్ళడం అనవసరం!అక్కడున్న చాలా మందిని అడిగాను- పి.వీ జ్ఞానభూమి దాకా నడవాలనే ఎందుకు అనుకున్నారూ అని. అందరూ చెప్పిన సమాధానం ఏమిటంటే, శ్రీ గిడుగు రామ్మూర్తిగారి విగ్రహం భాగ్యనగరంలో లేదనిన్నూ,తెలుగువారికి కీర్తితెచ్చిన శ్రీ పీ.వీ. నరసింహరావు గారి జ్ఞానభూమి అయితే బాగుంటుందనిన్నూ. మరి ఆయనమీదంత అభిమానం ఉంటే, మరి పార్లమెంటు చర్చలో ఈ మధ్యన ఓ దరిద్రుడు అర్జున్ సింగు, భోపాల్ విషయంలో ఆండర్ సన్ ని వదిలేయడంలో తప్పంతా శ్రీ పీ.వీ దే అన్నప్పుడు, ఏ ఒక్క తెలుగు రాజకీయనాయకుడికీ, ఆఖరికి ఏ ఒక్క బ్లాగరుకీ ఏమీ అనిపించలేదా, అనిపించినా ‘పోన్లెద్దూ మనకెందుకులే’ అని వదిలేశారా? బ్రతికున్నంతకాలం, ఆయన పేరుచెప్పుకుని పబ్బం గడుపుకున్నారు.

    ఊరేగింపులో ముందర ఓ పాతికమంది బ్యానర్లు పట్టుకుని వెళ్ళారు.అందరూ నడిచారో లేదో నేను చూడలేదు, కానీ నేనూ, వేణూ మాత్రం కలిసే నడిచాం.ఇంతలో కొంతమంది ప్రముఖులు, గాడీల్లో వచ్చి దారిలో ఉన్న టి.వీ. వాళ్ళకి ‘ బైట్లు’ ఇచ్చారు. పక్కనుంచే మేము ( నేనూ, వేణూ) వెళ్తున్నా, ఎవడూ మమ్మల్నేం ఆపి అడగలేదూ, మేము చెప్పాలేదూ!అందుకని దుధ్ధతో వ్రాస్తున్నానని అపోహ పడకండి! పాపం మధ్యలో స్వాతీ, ఇంకో సుజాతా మంచినీళ్ళ ప్యాకెట్లు కావాలా, నడవలేకపోతే, మా స్కూటీ ఎక్కండీ అని అడిగారు. థాంక్స్!<b. ఆ నీళ్ళ ప్యాకెట్టు తీసికుంటే, దాన్ని చించడానికి నాకు పళ్ళులేవూ, మళ్ళీ ఈగోలెందుకులే అని తీసికోలేదు!

    మొత్తానికి జ్ఞానభూమి దగ్గర ‘ కార్యక్రమం’ ముగిసిన తరువాత, వర్షం వచ్చేసింది. భాష మీద మన వారికున్న అభిమానాన్ని చూసేసరికి! అవి కన్నీళ్ళా, ఆనందభాష్పాలా మీరే నిర్ణయించండి!
అదేదో హొటల్ లో ‘కడుపునిండుగా’ బ్రంచ్ తీసికుని కొంపకి చేరాను. మొత్తానికి ఇదేదో బ్లాగర్ల సమావేశం లా ఉంది.మనందరికీ భాష మీద అభిమానం ఉండబట్టే తెలుగులో వ్రాస్తున్నాము.
ఆంధ్రదేశంలో ఎవడికి నచ్చినా, నచ్చకపోయినా సరే మనందరం ఇలాగే కొనసాగిద్దాం !! సర్వేజనాసుఖినోభవంతూ !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- భాషకొచ్చిన తిప్పలు !!

    నేను ఈ మధ్య చెన్నై ట్రైనులో వెళ్ళానుగా, అప్పుడు పగటి ప్రయాణం అంతా ఆంధ్రదేశం చూస్తూ గడపగలిగాను.నాతో ప్రయాణం చేస్తున్న ఓ తమిళమాయన, ప్రతీ పెద్ద స్టేషనూ దేనికి ప్రసిధ్ధో చెప్తూ వచ్చారు( తినే వస్తువులు!). గుంతకల్లు లో ఉప్మా చాలా బాగుంటుందన్నారని, ప్లాట్ ఫారం మీదకొచ్చాను. దగ్గరలో విజయా డైరీ వారి కౌంటరు కనిపిస్తే, అక్కడికి వెళ్ళాను.చూస్తే ఏముందీ? పైన చూపించినది కనిపించింది!ముందుగా అనుకున్నాను- అహో మన తెలుగువారు ఎంత
ధార్మికులో పేడ ని కూడా కొనుక్కుని, పూజలు చేసికుంటున్నారూ
అని. తీరా కొట్టువాడిని ఇదేమిటీ అని అడిగితే స్వీట్ అన్నాడు.మరి దానిమీద వ్రాసిందేమిటయ్యా అని అడిగితే,పాలకోవా అని వ్రాస్తే హిందీ వాళ్ళకు తెలియదుకదండీ అన్నాడు.
నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఈ భాషా సంకరం ఎందుకో అర్ధం అవలేదు. పోనీ వ్రాసిందేనా కరెక్టుగా వ్రాసేరా? హిందీ లోనూ, మరాఠీ లోనూ ఆ స్వీటుని दूध पॅढा/ दूध पॅढॅ అంటారు!పోనీ దేవనాగరి లిపిలో వ్రాసేడందామా అంటే, అబ్బే
అచ్చ తెలుగులో ‘పేడ’ అనివ్రాశారు! మరి ‘పేడ’ అంటే మన ప్రభుత్వం వారికి అర్ధమే తెలియదా? ప్రభుత్వ రంగ సంస్థలు భ్రష్టు పడిపోతున్నాయంటే పడవూ? దానిమీద తెలుగులో వ్రాసిన పేరు చూసి ఏ తెలుగొచ్చినవాడైనా దాన్ని కొనే ధైర్యం చేయగలడా?What exactly the marketing division of Vijaya Dairy (AP Government undertaking),wanted to convey? అందులో ఒక్కడికీ దాన్ని పాలకోవా అంటారూ, దూద్ పేడ అనరూ అనే ఇంగితజ్ఞానమే లేదా? ఆ కొట్టువాడు చెప్పినట్లు, ఇతరభాషలవాళ్ళకి అర్ధం అయేలా వ్రాసేమూ అంటే, పోనీ దేవనాగరి లిపిలో సరీగ్గా ఏడవొచ్చుగా !

    నేను ఉద్యోగంలో చేరినప్పుడు, మా ఫ్రెండొకడుండేవాడు-ఒకసారి ఇక్కడ ‘గూఢచారి 116’ సినిమా వచ్చింది. వీడు పేపర్లో చూసి, ‘ ఊళ్ళోకి తెలుగు సినిమా ‘గూఢాచారి 116’ వచ్చిందిరోయ్’అన్నాడు. అది మాతోఉండే ఇంకో భాషాభిమాని విని, గయ్యిమన్నాడు- ‘దరిద్రుడా వాడేమీ గుళ్ళో ఆచారికాదూ, గూఢచారి అంటే స్పై అన్నమాట’ అని కోప్పడ్డాడు! అయినా సరే మా స్నేహితుడు ఎక్కడ పోస్టరు చూసినా చదివేవాడు-ఓసారి మాయాబజారు కన్నడంలో వచ్చింది.ఇంక చూసుకోండి మావాడు ‘ ಮಾಯಾಬಜಾರ್’ ని ఎలా చదివాడో తెలిసిందా!!

    వచ్చిన కొత్తలో, మరీ బక్కపలచగా ఉన్నానని, ఎగ్ తినమన్నారు. ప్రతీరోజూ మార్కెట్ కెళ్ళి తెచ్చుకునేవాడిని. ఒకసారి తెచ్చినప్పుడు అవేవో ఇంకో రుచితో ఉన్నట్లనిపిస్తే, మా వాళ్ళన్నారూ, ఇది కోడి గుడ్డు అయుండదూ, బాతు గుడ్డైఉంటుంది అని. సరే కొట్టుకెళ్ళి, ఆ కొట్టావిణ్ణి అడగాలంటే, <b.హిందీలో ఎలా అడగాలో తెలిసేడవదు అయినా సరే పెద్ద పోజు పెట్టి येह एग्ग किस्का है? అన్నాను.ఆవిడకి చిర్రెత్తిందేమో मॅरा नय् అంది.ఎక్కడో కోనసీమ లాటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి హిందీలో మాట్లాడమంటే ఎలాగండి బాబూ? అక్కడికీ ఎస్.ఎస్.ఎల్.సీ లో 30% వచ్చాయి. ఎలాగనడక్కండి-ఆ రోజుల్లో పరీక్ష ప్రశ్నా పత్రం మక్కి కి మక్కీ వ్రాసేసినా 30% ఇచ్చేవారు!

   ఇంక ఆఫీసులో మాకు బెంగాలీ స్నేహితులుండేవారు. వాళ్ళు మామూలుగా ‘ఆఫీసు’ని ‘ఘర్’ అంటారు. ఓ రోజున మా తెలుగు స్నేహితుడొకడు, ఇంకో ఆఫీసునుంచి వచ్చి నాతో కూర్చున్నాడు. ఇంతలో ఓ బెంగాలీ స్నేహితుడోడొచ్చి,
మా ఫ్రెండు తో ‘ అభీ అభీ తుమ్హారా ఘర్ సే ఆరహాహూ!‘ అనేసరికి మావాడికి ఖంగారొచ్చేసింది.’ఇదేమిట్రా, నేనిక్కడ ఆఫీసులో ఉంటే వీడేమిటీ, మా ఇంటికి వెళ్ళేనంటాడూ, అసలే మా ఆవిడ ఒక్కర్తీ ఉంది, వీడేం చేసొచ్చాడో’అని.
వాడికి బెంగాలీ వాళ్ళు ఆఫీసునే ఘర్ అంటారూ, మీ ఆఫీసుకెళ్ళొచ్చాడంటున్నాడూ అని చెప్పి వాడిని కన్విన్స్ చేసేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చింది! వీళ్ళు వాళ్ళిళ్ళల్లో ఏదైనా పూజా కార్యక్రమాలున్నప్పుడు, ‘భజన’ కార్యక్రమం కూడా పెడుతూంటారు. భజన కి బదులుగా భోజన్ అంటూంటారు. మనం వాళ్ళింట్లో భోజనం కూడా ఉంటుందని వెళ్ళామా గోవిందా! పూజా, భజన్ అయిన తరువాత, ఓ తాంబూలం చేతిలో పెట్టి పంపేస్తారు! ఇలాటివన్నీ, ఇంకో భాష వారిని కించపరచడానికి వ్రాయడం లేదు, ఒక్కొక్కప్పుడు భాష, యాక్సెంటు తెలియకపోతే వచ్చే కష్టాలెలా ఉంటాయో చెప్పడానికిమాత్రమే.

   నేను చదువుకున్నంత కాలం ‘H’ ని హెచ్చ్ అనేవాడిని. మా పిల్లలు స్కూలికెళ్ళి చెప్పేదాకా ‘ఎచ్’ అంటారని తెలియదు! అలాగే ‘Target’ ని టార్జెట్ అనేవాడిని. టార్గెట్ అనడానికి కొన్నేళ్ళు పట్టింది! అలాగని నేనేదో expert అయిపోయాననుకోకండి.కనీసం ఏదైనా తెలియనప్పుడు Dictionary చూస్తే పోలా! దేనికీ సిగ్గు పడకూడదు. భాష గురించి వ్రాసేను కాబట్టి, నా అనుభవాల్ని మీతో పంచుకోవాలనే ఈ టపా!
ఆగస్టు 29 న భాగ్యనగరం లో జరిగే బ్లాగర్ల సమావేశానికి వద్దామనుకుంటున్నాను. వీలుంటే మన బ్లాగరు స్నేహితుల్ని కలుసుకోవచ్చనుకుంటున్నాను ! See you !!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–“ఇంకోతికొమ్మచ్చి”

    శ్రీ వెంకటరమణగారితో, మూడు గంటలు గడిపి, వారిరువిరి ఆశీర్వచనాలూ తీసికొని, క్రిందకు వచ్చాము. రమణగారు చెప్పిన ప్రకారం, రెండో రోజు వచ్చి శ్రీ బాపూ గారిని కలవ్వొచ్చూ అని.ఒకవైపున చాలా నిరుత్సాహం చెందాము-అయ్యో బాపు గారిని చూడలేకపోతున్నామే అని.తిరుమల దాకా వెళ్ళి ఆ శ్రీవెంకటేశ్వరుని దర్శనం అవకపోతే మరెలాగుంటుందండీ? శ్రీ రమణగారి ని చూడకలిగాము, అయినా అదో feeling of emptiness , ఇద్దరినీ ఒకేరోజున కలిస్తే ఉండే సంతోషం, ఆనందం వేరు.

    క్రిందకొచ్చేసరికి, కిటికీలోంచి శ్రీ బాపు గారి అబ్బాయి శ్రీ వెంకటరమణ కనిపించారు, పోనీ ఆయనతో ఒకసారి చెప్పి వెళ్దామూ, మర్నాడు శ్రీ బాపు గారిని కలవడానికి వీలుంటుందా అని అడగనూవచ్చూ, అనుకుని, తలుపు తట్టాము.ఆయన తలుపు తీయగానే, నేను ఫలానా అని చెప్పగానే, పూణె నుంచి వచ్చారా అన్నారు.అప్పటికే ఆయనతో రెండు మూడు సార్లు మాట్లాడానుకదా! ‘రండి లోపలికి, నాన్నగారు ఇప్పుడే వచ్చారు, చెప్పి వస్తాను’ అనగానే, ఇంక మా సంతోషం ఏమని చెప్పనూ? దేనికైనా రాసిపెట్టుండాలి. అసలు శ్రీ బాపు గారిని చూడగలనుకున్నామా ఆరోజు.

    ఆయన క్రిందకు రాగానే, ఒక్కసారి ఆయన పాదాలకి నమస్కారం చేసేటప్పటికి, మా జన్మ ధన్యం అయిపోయింది. ఆ నిరాడంబరత, ఈయనేనా అంతంత అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తారూ అనిపించింది.అందుకే అంటారు నిండుకుండలు ఎప్పుడూ తొణకవు అని.ఆయనతో గడిపిన గంటన్నరా ఏం చెప్పను? ఆ మధుర క్షణాలు గుండెల్లో జీవితాంతం దాచుకుంటాము.మాట్లాడడం లోనూ అదే నిరాడంబరత. ఏదో మాట్లాడుతూ ‘కందా బచ్చలి’ ప్రసక్తి వచ్చింది-ఆయనన్నారూ, ‘మీ కందా బచ్చలి కూరమీద ఓ కార్టూన్ వేశాను, ఈ వారం స్వాతిలో చూడండి’ అన్నారు.
మాటల్లో ఆయనతో చెప్పాము- ‘గురువుగారూ, మీరూ, శ్రీ వెంకటరమణ గారిలాగ, మేమూ తూ.గొ.జి. ప.గో.జీ వాళ్ళమే’ అనగానే, మాకు ఓ కార్టూన్ తీసి ఇచ్చారు. దానిని మా ఇంటావిడ తను వ్రాసే టపాలో పెడుతోంది.
వారిద్దరికీ ఉన్న కోట్లాది అభిమానుల్లో మేమిద్దరం ఎంత? అయినా వారిద్దరూ అంతసమయం మాకోసం స్పేరు చేశారంటే నమ్మ బుధ్ధికావడం లేదు. అదే అసలు సిసలైన celebrities కీ, pseudo celebrities కీ ఉన్న తేడా!

    ఓ పది నిమిషాలు మాట్లాడి పంపించేయొచ్చు, ఎవరూ అడిగే ధైర్యం చెయ్యరు, అలా ఎందుకు చేశారూ అని.కానీ,వారిద్దరిలోనూ ఉన్న గొప్పతనం, అవతలివారిని completely at home చేయడం. అవతలివారిని సంతృప్తి పరచడంలోనే చూపించారు వారి గొప్పతనమంతా!

   మా చెన్నై ట్రిప్పు పూర్తిగా సార్ధకం అయింది.ఎప్పటికైనా చూడకలుగుతామా అనుకున్న నా ఆరాధ్య దైవాల్ని అదీ ఒకే రోజు కలుసుకొని, వారిద్దరితోనూ అంత సేపు గడపడం, ఇంక జీవితంలో ఏం కావాలి? ఎన్నెన్నో వ్రాయాలనుంది, కానీ మేమనుభవించిన ఆనందానికి అక్షరరూపం ఇవ్వలేకపోతున్నాను. That was a feeling of ecstasy,which I can not express in words.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–“Paid News”-PCI Report

www.outlookindia

అందరికీ తెలుసు, మన మీడియా ఎన్నెన్ని ‘నిజాల్ని’ చెప్తుందో !!దానిమీద Outlook పత్రిక లో వచ్చిన ఇంటర్వ్యూ ఒకసారి అందరూ చదివితే బాగుంటుంది. అందులో చివరన ఇచ్చిన PCI report ఇక్కడ చదవండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్

   నిన్నటినుండి చానెల్స్ లో మొదలెట్టారు- వాడెవడి దగ్గరో డ్రగ్స్ పట్టుకున్నామనిన్నూ,తెలుగు హీరో తమ్ముళ్ళట, వాళ్ళని పట్టుకున్నామనిన్నూ. ఈ వేళైతే కొన్ని చానెల్స్ కొంతమంది రాజకీయనాయకుల వారసులూ, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నటులూ,వాళ్ళ పేర్లు ప్రొద్దుటినుంచీ చూపిస్తున్నారు. మధ్యాన్నం, ఆ హీరోలు లైవ్ లో వచ్చి, మాకేం తెలియదు మొర్రో అంటున్నారు. ఎం.పీ. అయితే అసలు మాకొడుక్కి డ్రగ్ అంటేనే తెలియదు పొమ్మన్నాడు.

   ఒకవైపున ప్రభుత్వం ఆంధ్రదేశం లో రేషను షాపుల్లా,left ,right and centre మద్యం షాపులు తెరిస్తే పట్టించుకోని చానెల్సూ, పత్రికలూ ఈ డ్రగ్స్ గురించి ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నట్లూ? మద్యం కూడా మత్తే ఇస్తుంది కదా? డ్రగ్స్ కొంచెం ఖరీదెక్కువ అంతే! ఏ రాయైతేనేం తల పగలుకొట్టుకోడానికి? మద్యం ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తున్నారో, అలాగే డ్రగ్స్ కొట్లుకూడా వేలం వేసేస్తే ప్రభుత్వానికి కావలిసినంత ఆదాయం!

   నిన్నెక్కడో చానెల్ లో చూశాను-ఇదివరకటి సినిమాలకీ, ఇప్పుడొస్తున్న సినిమాలకీ ఉన్న తేడా గురించి ఓ కార్యక్రమం.ఇదేదో కొత్త విషయం కాదే!అర్ధం అయిందేమిటంటే ఏం వార్తలు లేకపోతే, ఇలాటిదేదో తీసికుంటే, వాళ్ళదగ్గరున్న హాట్ హాట్ క్లిప్పులు చూపించుకోవచ్చు! ఏదో దేశోధ్ధారణ చేస్తున్నట్లు! ఇంక ఆయనెవడో, ఇంకోడి స్థలం కబ్జా చేశాడుట.ఈయన్ని ఓ చానెల్ వాడు పిలిచి, నోటికొచ్చిందల్లా వాగనిచ్చాడు.కావలిసిస్తే అవతలివాళ్ళు కోర్టుకెళ్ళొచ్చని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.ఆ కోర్టు వ్యవహారం తేలేటప్పటికి ఇద్దరూ ఉండరు! खॉस्ला का घॉस्ला సినిమా గుర్తొచ్చింది!

    ప్రతీ రోజూ ‘ఓదార్పు యాత్ర’ గురించి వస్తున్న ప్రకటనలతో, ఎవడే పార్టీయో తెలియడం లేదు! దానివలన ఆం ఆద్మీ కొచ్చిన నష్టం ఉందని కాదూ, ఊరికే సందర్భం వచ్చింది కదా అని!ఇంక కమ్యూనిస్టులిద్దరూ ఇద్దరనెందుకంటున్నానంటే, ఎప్పుడు చూసినా ఓ ఎర్రజండా పుచ్చుకుని వీళ్ళిద్దరే కనిపిస్తూంటారు!,ఒకళ్ళనికళ్ళు తిట్టుకుని ఇంకా రెండు నెలలు కాలేదు, అప్పుడెప్పుడో మహా కూటమన్నారు, ఎన్నికలతరువాత హాత్తెరీ నీవల్లే మేము ఎలెక్ట్ అవలేదన్నారు, అవన్నీ మర్చిపోయి నాయుడుగారితో మళ్ళి చర్చలంటున్నారు! అసలు ఏదైనా టి.వీ. వాళ్ళు, ఈ రాజకీయనాయకులందరూ, వివిధ సమయాల్లో ఒకళ్ళమీదొకళ్ళు దుమ్మెత్తిపోసుకున్న ప్రసంగాలన్నీ, ఓ డాక్యుమెంటరీ గా తయారు చేస్తే దానికి foreign film category లో ఓ Oscar రావడం ఖాయం! ఒకటిమాత్రం ఒప్పుకోవాలిలెండి, ఈ నాయకులే లేకపోతే మన వీక్షకుల జీవితం, చాలా డల్ గా ఉండేది.మన eternal jokers వీళ్ళు! మరి అంత పట్టించుకోకుండా ఉంటే హాయి!

   ఇంక తిరుమల లో ఏం జరుగుతోందో ఆ శ్రీవెంకటేశ్వరునికే తెలియదు, మనమెంత? మొన్నేదో చానెల్ లో పాలకమండలి వాళ్ళు చెసే వ్యాపారాలు, వెలుగులోకి వచ్చిన చిఠ్ఠా చెప్పారు.సిగ్గూ శరం లేనివాళ్ళనేం అని లాభం? ఆదికేశవనాయుడు
తనంతటి భక్తుడే లేడంటున్నాడు. కరుణాకరరెడ్డయితే భోజనం మానేసి ఉపోషం మొదలెట్టాడు, ఈయన ఉపోషం ఎలా అగుతుందిట? ఎవడూ పట్టించుకున్నట్లు లేదు. పాపం ఎలాగో?

    అవునూ ఆమధ్యెవరో మంత్రిణి గారి వజ్రాలహారం పోయిందన్నారూ, పాపం దొరికిందా లేదా? ఏమిటో అన్ని కష్టాలూ, మన నాయకులకే! ఇంక కొంతమంది మంత్రులు హైదరాబాదు లో అసలు కనిపించడమే లేదు!అప్పుడెప్పుడో ఓదార్పు యాత్ర పేరుతో వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయారనుకుంటా! ఉన్నాడో ఊడేడో తెలియదు!ఇంక మన మమతమ్మకి సడెన్ గా గుర్తొచ్చింది, తనూ ఒక మంత్రి అని, ఓ సారి చుట్టపు చూపుగా పార్లమెంటులో దర్శనం ఇచ్చింది. మొత్తానికి, కల్మాడీ వ్యవహారాలకి కళ్ళెం వేసినట్లనిపిస్తోంది. ఇంక భోపాల్ గ్యాస్ ట్రాజెడీ గురించి, అడిగేవాళ్ళెవరూ లేరు కదా అనిపీ.వీ. మీద తోసేస్తే హాయీ అని, అర్జున్ సింగు చాలా నిజాయితీపరుడిలా ఓ స్టేట్మెంటిచ్చాడు.ఒక్కళ్ళంటే ఒక్కళ్ళూ దానిని ఛాలెంజి చేసినవాళ్ళు లేరు! మరిక్కడ తెలుగు వారి సో కాల్డ్ ‘ఆత్మగౌరవం’ పిక్చరు లోకి రాదా? మెడమీద తలకాయ ఉన్న ప్రతీ నాయకుడూ, తెలుగువారి ఆత్మగౌరవం గురించి అంతంత బాధ పడిపోతూంటారే,దేశానికి ప్రధాన మంత్రి గా,
అయిదేళ్ళపాటు మైనారిటీ ప్రభుత్వం నడిపించిన ఏకైక తెలుగు మనిషి ఆయన!దేశం లో జరిగిన రెండు ముఖ్యమైన సంఘటనలు- Economic Reforms and Babri Incident- ఆయన టైములోనే జరిగాయి. ఆర్ధిక సంస్కరణల ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు.ఇప్పటి నేతలందరూ రాత్రికి రాత్రి కోటీశ్వరులవడానికి ప్రధాన కారణం ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా Economic Reforms ధర్మమే!

    నాకింకోటర్ధం అవదు, ప్రతీ ఏడూ,Forbes Magazine వాళ్ళో లిస్టు తయారుచేస్తూంటారు, ప్రపంచంలో ఉన్న ధనవంతులవి, అదేమిటో వాళ్ళకి మన నేతలగురించెవరూ చెప్పలేదనుకుంటాను! అంబానీలూ,ప్రేంజీలూ, టాటాలూ, బిర్లాలూ,వీళ్లందరూ వాళ్ళవాళ్ళ తాతలూ, ముత్తాతలూ ఇచ్చిన ఆస్థులతో పెద్దయ్యారు. కానీ మన రాజకీయనాయకులో ‘స్వయం కృషి’ తో బిలియనేర్స్, ట్రిలియనేర్స్ గా ఎదిగారు! అదీ అయిదేళ్ళల్లో. మరి వారిని గురించి కూడా చెప్తే
అందరికీ ఎంత inspiring గా ఉంటుందో.

సర్వేజనా సుఖినోభవంతూ !!! मॅरा भारत महान !!

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ‘కోతికొమ్మచ్చి’-Live

    చెన్నై వెళ్ళడానికి ముందురోజు నుండీ, పూణె నుంచే బాపూ గారి ఇంటి నెంబరు ప్రయత్నించగా, మొత్తానికి వారి అబ్బాయి దొరికారు. శ్రీ బాపూ రమణగార్లు హైదరాబాదు వెళ్ళారనిన్నూ, శుక్రవారానికి చెన్నై తిరిగి రావొచ్చనీ చెప్పారు.
శుక్రవారం నాడు ప్రయత్నిస్తే, ఇంట్లో లేరనీ, మత్నాడు (శనివారం) ప్రొద్దుటే ప్రయత్నించమనీ చెప్పారు. మరీ ప్రొద్దుటే ఎందుకులే అనుకుని, 9.00 గంటలు దాటిన తరువాత శ్రీ రమణ గారికి ఫోను చేసి, ‘గురువుగారూ, నేను ఫలానా,
నాకు జీవితంలో ఉన్న కోరికల్లో శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చాలా సార్లు తీరింది, ఇంక మిగిలినదల్లా, నరనారాయణులైన మిమ్మల్నీ, శ్రీ బాపుగారినీ దర్శించుకుని మీ పాద స్పర్శ చేసికోవడం. మీరు అనుమతిస్తే సరి, లేకపోతే, మీరు సరే అనేదాకా, మీ ఇంటిచుట్టూనే తిరుగుతానూ’ అని చెప్పేశాను.అంటే దానికి ఆయనన్నారూ, ‘ నేను ఖాళీగానే ఉన్నాను, కానీ శ్రీ బాపూ ఏదో కాల్ షీటు సందర్భంలో బయటకు వెళ్ళారూ, 12 గంటలకి రావొచ్చూ, అడుగుతానూ, మీరు 12.30 కి ఫోను చెయ్యండీ’ అన్నారు. సరే అని ఠంచనుగా 12.30 కి మళ్ళీ ఫోను చేశాను ( ‘స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్, జె.వి.సొమయాజులు గారిని బోరు కొట్టిన సీను గుర్తుచేసికోండి!).’గురువుగారూ ఏమయ్యిందీ’ అంటూ. ‘ వీడెవడో వదిలేటట్టుగా లేడూ’ అనుకున్నారేమో, ‘సరేనండీ, నన్ను కలుసుకోవాలంటే, సాయంత్రం 4.30 కి మా ఇంటికి రావచ్చు.బాపు రాత్రి ఎప్పటికి వస్తారో చెప్పలేనూ’అని వాళ్ళింటికి డైరెక్షన్ చెప్పారు-మాముట్టి ( మళయాళం) హీరో ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లే మాది’ అని.

    మా పిల్లలడిగారు,’ఎంతసేపట్లో తిరిగి వస్తారూ’అని. మాకేం తెలుసూ,వెళ్ళిన పదినిమిషాల్లో హలో హలో అని పంపిచేయొచ్చు, ఆయన మాకు తెలుసు కానీ,మేము ఆయనకి తెలియదుగా, చూద్దాం అదృష్టం ఎలా ఉందో’ ఇంక చూసేదేముందీ, నేనూ, మా ఇంటావిడా ఓ ఆటో చేసికుని, ఆయన చెప్పిన చోటకి చేరిపోయాము.పేద్ద కాంపౌండు లో ఉంది వారి ఇల్లు. బయటే కొంతసేపు అటూ ఇటూ చూసి ( ఏ కుక్కైనా ఉందేమో అని ఓ పక్క భయం),శ్రీ రమణగారికి ఫోను చేస్తే వారి భార్య తీశారు. మొహమ్మాట పడకుండా అడిగేశాను- ‘అమ్మగారూ, మీ ఇంటికిందే ఉన్నామూ, ఏదైనా కుక్కా అవీ ఉన్నాయా ‘అని.’అలాటివేవీ లేవూ, తిన్నగా పైకి వచ్చేయండీ’ అన్నారు. ఇంక అడ్డేముందీ, మొహమ్మాట పడకుండా,మెట్లెక్కి వారింట్లోకి వెళ్ళాము.

    శ్రీ వెంకటరమణగారిని మొట్టమొదటిసారిగా,ప్రత్యక్షంగా చూసేటప్పడికి, నా సంతోషం ఏమని చెప్పనూ…..మాటల్లో వర్ణించలేను. ముందుగా కలా నిజమా అని తేల్చుకుని, వారికి పాదాభినందనం చేశాను. మా ఇంటావిడ కూడా అలాగే చేసి, కలో నిజమో తేల్చుకోడానికి నన్ను గిల్లింది!

    అసలు ఆయనతొ ఏం మాట్లాడాలో, ఎల మొదలెట్టాలో తెలిస్తేనా? నేనేమైనా పత్రికా విలేఖరినా ఏమిటీ, ఏవో కొన్ని ప్రశ్నలు ముందుగానే ఎంచుకుని వాటికి ఆయన సమాధానం తెలుసుకోడానికి!అంతా అయోమయం అయిపోయింది.ఆయనకూ తెలుస్తూనేఉంది, వచ్చినవాడు చాలా excite అయిపోయి, ఏమీ మాట్లాడలేకపోతున్నాడూ అని! ధైర్యం చేసేసి,’ ‘సార్ మీకు
ముత్యాలముగ్గు సినిమాలో డయలాగ్గులు అలాగే వ్రాయాలని ఎందుకనిపించిందీ,ఎక్కడ విన్నారు అసలు?’అన్నాను.ప్రక్కనే కూర్చున్న మా ఇంటావిడ వైపు చూస్తే అనిపించింది,ఇంతకంటే మంచి ప్రశ్న దొరకలేదా అన్నట్లు చూసినట్లు! అందుకనే అనుకుంటూంటాను అప్పుడప్పుడు-ఎవరినైనా కలిసినప్పుడు, మనం ఒక్కళ్ళూ ఉండాలీ,ఏమైనా అవతలివాళ్ళు తిడితే, ఎవరికీ తెలియకుండా ఉంటుందీ అని, అంత అదృష్టం కూడానా! కానీ నేనడిగిన ప్రశ్నకి, శ్రీ రమణగారు, ఏమీ నవ్వకుండా, ఓపిగ్గా, ‘కోతికొమ్మచ్చి’ లో వ్రాసినట్లుగా జవాబిచ్చేటప్పటికి, అమ్మయ్యా ఫరవాలేదూ, నేనూ ఏదో మాట్లాడగలనూ అనిపించింది.ఆ తరువాత situation సులభం అయింది.

    ‘ గురువుగారూ, మీరు ఏమీ అనుకోపోతే నేను కొన్ని ఫొటోలు తీసికుంటానూ అనగానే ‘ మీ ఇష్టం, కావలిసినన్ని తీసికోండి’ అన్నారు.మొత్తం ఓ నలభై ఫొటోలు తీసికున్నాను.బయట వెరెండాలో ఆయన కూర్చుని, వ్రాసుకునే కాగితాలతో సహా.అక్కడో జోకు వేశారు- నా చేతివ్రాత, నా భార్యకీ, బాపూగారికీ తప్ప ఎవరికీ అర్ధం అవదూ, వాళ్ళే ఫెయిర్ చేసికుంటూంటారూ, ఒక్కొక్కప్పుడు, నాక్కూడా అర్ధం అవదూ’– అని!

   వారింటికి సాయంత్రం 4.45 కి వెళ్ళాము, ఎప్పుడు బయటకి వచ్చామో చెప్తే ఆశ్చర్యపోతారు సరీగ్గా 7.40 కి. అంటే అయిదు నిమిషాలు తక్కువగా మూడు గంటలు! అసలు అలాటి వారికి మాతో అంత విలువైన సమయం గడపడానికి ఏం అవసరం? ఆ టైములో ఆయన రెండు మూడు కాల్ షీట్స్ వ్రాసుకోవచ్చు.అయినా సరే ఏం విసుక్కోకుండా, నేను అడిగిన ప్రతీ తలా తోకాలేని ప్రశ్నలకూ విసుక్కోకుండా సమాధానం చెప్పారంటే, నమ్మలేకపోయాము.

అప్పుడే ఎక్కడ అయిందీ ఇంకా చాలా ఉంది !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Landmark Quiz National Finals

    మా అబ్బాయి హరీష్, తన ఇద్దరు partners తో ఫైనల్స్ కి క్వాలిఫై అయినప్పుడే నిశ్చయించుకున్నాను, నేను కూడా తనతో చెన్నై వెళ్దామని, ఎంతైనా పుత్రోత్సాహం కదా!కార్యక్రమంలో కొద్దిగా మార్పేమిటంటే, మా కోడలూ,ఇంటావిడా,మనవరాలు, మనవడూ కూడా వచ్చారు! వాళ్ళు flight లో వెళ్తూ నన్నుకూడా రమ్మన్నారు. తెలుసుగా, నాకు గాలిలో ఎగరడం కంటె, భూమిమీదే రెండు కాళ్ళూ ఉంచుకోడం ఎక్కువ ఇష్టం.అంతేకాదు,నాకు ఎత్తులంటే భయం మూలంగా, నామానాన్న నన్ను train లో రమ్మని, వాళ్ళు ముందర వెళ్ళారు.

   ఆఖరి నిముషందాకా నా టిక్కెట్టు వెయిటింగు లిస్టులోనే ఉంది.ఏమైతేనేం, బయలుదేరే ముందే లోవర్ బెర్త్ లో సినియర్ సిటిజెన్ అయినతరువాత మొట్టమొదటి సారి confirm అయినప్పుడే అనుకున్నాను, ఇదేదో సాఫీగా జరిగే ప్రయాణం కాదూ అని!పూణే అర్ధరాత్రి తరువాత వచ్చింది ట్రైను.నాకు ఎలాట్ చేసిన A-1 కోచ్ లో వెళ్ళేసరికే ఒకళ్ళు ముసుగు పెట్టి నిద్రపోతున్నారు, ఆవిడకు సంబంధించిన ఆసామీ, పై బెర్తు మీద దుప్పట్లోంచే, ఈ బెర్త్ మాదీ, లేవమూ అని చెప్పేశాడు. కాదయ్యా బాబూ, ఛార్ట్ లో నాపేరుందయ్యా అంటే వినడే.అప్పటికే, చాలామంది నాపేరు చూశారు. అందరం కలిసి,conductor ని పట్టుకుని తీసుకొచ్చి, ఆ ‘పెద్దమనిషి’ ని లేపి, చెప్పిన తరువాత, తేలిందేమిటంటే, అతని భార్యకి ఇంకో కోచ్ HA లో వచ్చింది. ఇంక నోరుమూసుకుని కాళ్ళబేరానికి వచ్చాడు! ఈ లోపులో నన్ను సపోర్ట్ చేసిన ప్రతీవారూ, ‘మీరు వెనక్కు తగ్గద్దూ, కావలిసిస్తే అతన్నే వెళ్ళమనండీ’ అని మొహమ్మాట పెట్టేశారు, అయినా పాపం ఆడవారితో ప్రయాణం చేస్తున్నాడూ, ఎందుకులే అని నేనే HA కోచ్ లోకి వెళ్ళాను. ఆ ఏడుపేదో మొదటే పధ్ధతిలో ఏడిస్తే ఇంత గొడవుండేది కాదుగా!ఏదో AC ల్లో ప్రయాణం చేస్తున్నారుకదా అని ప్రతీవారికీ సంస్కారం ఉండదు. అలాటివి చెప్తే వచ్చేవి కావు!

    నా చెన్నై ప్రయాణం సుఖంగానే జరిగింది.ట్రైను లోనే ఒకతన్ని పట్టుకున్నాను, నాయనా నేను అడయారు వెళ్ళాలి, కొంచెం హెల్ప్ చెయ్యీ అని. అతను,ఓ టాక్సీ మాట్లాడి,తను మధ్యలో దిగిపోయి, డ్రైవరుకి నన్ను ఎక్కడ దింపాలో చెప్పాడు. అంతవరకూ బాగానే ఉంది. ఈ చెన్నైలో మనుష్యులు తమిళం తప్పి ఛస్తే ఇంకో భాషలో మాట్లాడరు!మనకెమో ఆ భాష రాదూ, టూఠీ పూఠీ ఇంగ్లీషులో, మాట్లాడుతూ, ప్రతీ రెండు నిమిషాలకీ, మా పిల్లల్ని అడుగుతూ, మధ్య మధ్యలో మా అబ్బాయంటాడూ, డ్రైవరుకియ్యి ఫొనూ అని, వాడికి మన భాష రాదురా నాయనా, అని చెప్పి మొత్తానికి guest house చేరాను.

   మర్నాడు ప్రొద్దుటే బీచ్ కి వెళ్ళి, అక్కడినుంచి అష్టలక్ష్మి గుడికి వెళ్ళి, పన్నెండు గంటలకి తిరిగి కొంపకు చేరాము. అక్కడేదో పాముకుందామనుకుంటాము కానీ, నాకైతే చెన్నై కంటే మా పూణే బాగుంది- ఆటో వాళ్ళు మీటరు మీద రారు.వందతో మొదలెడతారు,బేరం ఆడుదామంటే అరవంలో ఓ లెక్చరిస్తారు. వాతావరణం- దరిద్రాతి దరిద్రం-అంత వేడేమిటండి బాబూ! ఇంక ఖరీదులంటారా, ఇడ్లీ ప్లేటు 12/- రూపాయలట, బొండం 15/- రూపాయలు.పూణే లో ఏ ఒక్కళ్ళైనా ఆటో వాడు, మీటరుమీదొస్తాడు, చెన్నైలో అన్ని ఆటోలూ పోలీసువాళ్ళవేట! అడిగేవాడు లేడు! కోట్లిచ్చినా చెన్నై లాటి ఊళ్ళో ఉండకూడదనిపించింది.ఇవన్నీ భరించి అక్కడే ఏళ్ళతరబడీ ఉంటున్నవారికి టోకున భారత రత్న ఇవ్వొచ్చు!
Hats off to all of them!

సాయంత్రం Music Academy లో క్విజ్ కార్యక్రమం మొదలెట్టారు. లోపల ఉండి మా మనవడిని బాధ పెట్టడం ఎందుకులే అనుకొని, నేనూ, మా ఇంటావిడా బయటే CC TV ముందర సెటిల్ అయ్యాము. లోపల కంటే హాయిగా ఎంజాయ్ చేశాము. మా అబ్బాయి టీం పోటీలో సెకండ్ వచ్చారు. ఎంతో ఆనందం అనిపించింది,ఎంతచెప్పినా జాతియ స్థాయి కదా! అదండి సంగతి.
వెళ్ళడం ఓ రోజూ, క్విజ్ ఓ రోజూ, మరి ఇంకో రోజేం చేసేవయ్యా అంటే–అంతా సస్పెన్స్! నా జీవితంలో ఎన్నాళ్ళనుండో ఉన్న కోరిక నెరవేరిన రోజు!ఇంకా ఆ hangup నుండి తేరుకోలేదు.వచ్చే రెండు మూడు టపాలూ ఆ విషయమే! ఎంత వ్రాస్తే అవుతుందీ!!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Swine Flu, etc..etc..

    మెము రాజమండ్రి లో ఉన్న ఏణ్ణర్ధం లోనూ, ఆంధ్రదేశానికి సంబంధించి మూడు ముఖ్యమైన సంఘటనలు- ఎలక్షన్లూ,వై.ఎస్ గారి మరణం, రామలింగరాజు అందరి నెత్తిమీదా శఠగోపం పెట్టడం- వీటికంటే, మాకు సంబంధించినంతవరకూ జరిగినదేమిటంటే Swine flu epidemic in Pune. మీరు రాజమండ్రీ లో ఉన్నారుకదా, పూణే లో Swine flu వస్తే మీకేమయిందీ అంటారు. అక్కడే వచ్చింది గొడవంతా.

    మేము వెళ్ళిన మొదట్లో అడిగినవాడికీ, అడగనివాడికీ, కనిపించి పరిచయం అయిన ప్రతీవాడికీ,చెప్పడం- నేను రిటైరు అయి గోదావరి మీద ఉండే అభిమానంతో గోదావరిగట్టున ఓ ఫ్లాట్ అద్దెకు తీసికుని మరీ ఉంటున్నానని,అదేదో రిక్షాల్లో సినిమా యాడ్లకి క్యాసెట్టు పెడతారే అలాగ ప్రతీవాడితో చెప్పేసికున్నాను!ముందరలో ఆహా ఓహో అన్నారు!అదే నా ప్రాణం మీదకొస్తుందనుకోలేదు ముందర!స్వైన్ ఫ్లూ మొట్టమొదట పూణే లో వచ్చిందనీ,అక్కణ్ణించి వచ్చినవాళ్ళు దాన్ని ఇక్కడ(అంటే మన ప్రాంతాల్లో)spread చేయొచ్చనీ అందరికీ ఓ గట్టినమ్మకం ఏర్పడిపోయింది. తెలిసిన ఏ కొట్టుకెళ్ళినా, అదోలా చూడ్డం మొదలెట్టారు.పైగా, ‘మాస్టారూ మీరు కొద్దిగా లైన్లో కాకుండా పక్కకు నుంచోండి‘అంటూ. మొదట్లో నాకైతే ఏమీ అర్ధం అవలేదు.తర్వాత్తర్వాత తెలిసింది, నన్ను వీళ్ళు isolate చేస్తున్నారూ అని!ఆఖరికి దేవాలయాల్లో కూడా,ప్రసాదం చేతిలో పెట్టకుండా, పైనుంచి అరచేతిలో వేసేవారు!భోజనాలమాట దేముడెరుగు, కాఫీక్కూడా పిలవడానికి ధైర్యం చెయ్యలేదు.

   మా ఇంటివెనక్కాల ఓ కార్పొరేటరుండేవాడు, అతను ఉండవిల్లి అరుణ్ కుమార్ కి క్లోజుగా ఉండేవాడు.ఏదో సెలిబ్రైటీ కదా ( రోజూ రామోజీరావు మీద ఏదో ఒకటి అంటూండేవారు)పోనీ ఓ సారి ఆయన్ని కలుద్దామూ అనుకున్నాను.పైగా నాతో చెప్పాడుకూడా, సారు ( ఉండవిల్లి) ఊళ్ళో ఉన్నప్పుడు మిమ్మల్ని తీసికెళ్తానూ అని.అలా చెప్పిన మనిషి పూణే లో స్వైన్ ఫ్లూ వచ్చిందని తెలియగానే పత్తా లేకుండా పోయాడు!ఇక్కడ ఈ గొడవ భరించలేక,పూణే పిల్లలదగ్గరికి వెళ్దామూ అనుకుంటే, మా అబ్బాయి, ‘అక్కడ మీకు ఏ సమస్యా లేకుండా ఉందీ, ఇక్కడకొస్తే, మిమ్మల్ని కూడా చూసుకోవాలీ, ఈ హడావిడంతా అయిన తరువాత వద్దురుగానీ’ అన్నాడు.దాంతో టిక్కెట్లు క్యాన్సిల్ చేశాను.
నేను చెప్పేదేమిటంటే,for the simple reason, we are from pune,మమ్మల్ని చాలా మంది avoid చేశారు! అయినా వాళ్ళని అనేం లాభం లెండి. టి.వీ లూ, పేపర్లూ హోరెత్తించేశాయి,’గొడవంతా పూణే లోనే వచ్చిందీ, అక్కడికి వెళ్ళి వచ్చినవారితో జాగ్రత్తగా ఉండాలీ’ అని! ఈ ఏడాది మొదటి కేసు విశాఖపట్నం లో వచ్చింది. అలాగని కోణార్క్ express, LTT-Vizag express లో వచ్చిన వాళ్ళందరినీ quarantine చెయ్యాలంటారా? ప్రస్తుతం పూణే లో కూడా ఎక్కువగానే ఉంది. అయినా Serum Institute, Pune వాళ్ళు డెవెలప్ చేసి మార్కెట్ చేస్తున్న ఓ వాక్సీన్ ( ముక్కులో వేసేది) వచ్చింది. వచ్చిన గొడవల్లా ఏమిటంటే,ఆ వాక్సీన్ ప్యాక్ ఆఫ్ ఫైవ్ గా వస్తోంది.అయిదుగురుంటేనే కానీ కిట్టుబాటవదు.అంతా కలిపి 1500/- పుచ్చుకుంటున్నారు. పదిహేను రోజులక్రితం మేమందరమూ తీసికున్నాము. ఏ సైడు ఎఫెక్టూ లేదు.ఓ రెండు మూడు రోజుల్లో సింగిల్ డోస్ కూడా వస్తోందట.

    ఈవేళ టి.వీ లో ఆవిడెవరో మంత్రిణి గారి వజ్రాలహారం పోయిందన్నారు. సాయంత్రానికల్లా ఇంకోళ్ళదెవరిదో పదిహెను తులాల హారం పోయిందన్నారు. అదేదో పేద్ద విశేషం అన్నట్లు.ప్రతీ రోజూ వందలాది కొంపల్లో దొంగతనాలు జరుగుతున్నాయి.ప్రతీదానికీ అంత ప్రాముఖ్యం ఇస్తారా? సోనీ వాళ్ళు చేస్తున్నIndian Idol లో మన తెలుగబ్బాయి ఆఖరి మూడు స్థానాల్లోనూ ఉన్నాడుట.అతన్ని నెగ్గించడానికి ప్రతీవారూ SMS చేసి నెగ్గించాలని, అన్ని చానెల్సూ,బ్లాగ్గుల్లోనూ చెప్తున్నారు.ఆ అబ్బాయి <b.బాగానే పాడుతున్నాడు, కాదనం. ఎస్.ఎం.ఎస్ లు ఊరికే రావండి బాబూ.అందర్నీ అడిగే బదులు, ఆ చానెల్( తెలుగు) వాళ్ళే, హాయిగాఎస్.ఎం.ఎస్ లు flood చేయొచ్చుకదా!ఎక్కడినుంచొచ్చాయని ఎవడూ అడగడు, ఎన్ని ఎక్కువొచ్చాయో మాత్రం చూస్తారు.పైగా మన నాయకులందరిదగ్గరా, అంతంత డబ్బులు మూలుగుతున్నాయి, ఆమాత్రం చేస్తే ఏం పోయిందిట!మన తెలుగు ఆత్మగౌరవం తిరిగి తెచ్చుకోవచ్చుగా!

    ప్రతీదానికీ ఈ ఎస్.ఎం.ఎస్ లు అడగడం, ఓ ఫ్యాషనైపోయింది.ప్రతీ రోజూ ఏదో ఒక విషయం మీద ఏదో ఒక చానెల్ అడుగుతూనే ఉంటుంది- తిరుమల కొండమీద తిరుగుతున్న పులి ఆడా, మగా, ఆడైతే ఏ అనీ,మగైతే బి అని ఎస్.ఎం.ఎస్ చెయండి అని.నిన్నేదో చానెల్ లో చూశాను, ‘యథా ప్రజా యథా రాజా’ అని. కార్యక్రమం మొదట బాగానే మొదలెట్టారు. కానీ, రానురానూ, అసెంబ్లీ లో మన వాళ్ళు కొట్టుకుంటారే అలా తయారయింది.ఇంక రాజశేఖర్, మెగా స్టార్ వెనక్కాల పడ్డాడు.అల్లు అరవిందు కూడా, ‘నాలిక కోస్తాను…’ భాషలోకి వచ్చారు.నాయుడుగారు యాత్రల హడావిడిలో ఉన్నారు.విజయవాడలో మన కమ్యూనిస్టు సోదరులు,వాళ్ళుకూడా ఉన్నారూ అని చూపించికుంటున్నారు.
మన రాజకీయ నాయకుల ధర్మమా అని తెలుగు vocabulary భ్రష్టు పడిపోతూంది.సినిమాల్లో డయలాగ్గులు వ్రాసేవారికి కూడా కావలిసినంత కాలక్షేపం!
ఓ వారం రోజులపాటు మీ అందరినీ బోరు కొట్టను.పునర్దర్శనం 18 న.

%d bloggers like this: