బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…

    ఈ నెలలో ఈవేళా, రేపూ సారస్వతిక సమ్మెకి వెళ్తున్నామని, almost అన్ని ట్రేడ్ యూనియన్లూ ( కాంగ్రెస్ వారితో సహా) ఎప్పుడో చెప్పారు, దానికి సంబంధించిన నోటీసులూ గట్రాకూడా ఇచ్చేశారు. ఇదేదో అకస్మాత్తుగా వచ్చిందని ఎవరూ అపోహపడఖ్ఖర్లేదు.ఈ సమ్మెలూ అవీ, కార్మికులకున్న ఒకేఒక అస్త్రం. అది ఎవరూ కాదనలేరు, పైగా కాదంటే మళ్ళీ అదో గొడవా..అన్ని యూనియన్లూ కలిసి చేయడం బహుశా ఇదే మొదటిసారేమో. ప్రతీసారీ ఏదో యూనియను వాళ్ళు నోటీసులివ్వడం, ఇంకోరు దాన్ని వ్యతిరేకించడమూనూ. దానితో చాలాసార్లు ఈ సమ్మెలు అంత విజయవంతమయినాయి కావు.

   ఈ సమ్మెల్లో కార్మికులకోరికలు ఓ పెద్ద లిస్టు ఉంటుంది. అందరికీ తెలుసు వాళ్ళు అడిగేవన్నీ ప్రభుత్వమూ ఇవ్వదూ అని, అయినా చావుకి పెడితేనే కానీ లంఖణం లోకి దిగదూ అని ఎడాపెడా అడిగేస్తూంటారు.ఇలాటి సమయాల్లో ప్రభుత్వం వారు కూడా ఓ ప్రకటన చేసేస్తూంటారు–సమ్మె అన్నది న్యాయబధ్ధమైనది కాదూ,ఆ రోజున ఏదైనా కారణం చేత విధులకి హాజరవనివారి మీద క్రమశిక్షణా చర్యలు తీసికోబడతాయీ.. వగైరా.. వగైరా. అలాగని చేసేవాళ్ళు మానా మానరు.వాళ్ళకీ తెలుసు ఇవన్నీ ఉత్తిత్తివే అని. ఏదో మొత్తానికి సాయంత్రానికల్లా మా సమ్మె విజయవంతం అని ట్రేడ్ యూనియన్లూ, కాదూ సమ్మె ప్రభావం ఏమీ లేదు సామాన్యప్రజానీకం మీదా అని ప్రభుత్వం వారూ ప్రకటనలు చేసేస్తారు.

    ఇంక మన టివీ చానెళ్ళవాళ్ళకైతే పండగే పండగ. ఈవేళ్టి సమ్మె ( ఇంకా మొదటిరోజే) లో అక్కడెక్కడో నొయిడా లో జరిగిన హడావిడంతా రోజంతా చూపించారు. అంటే దానర్ధం- ఎక్కడా హింసాత్మకంగా జరగని ప్రదేశాల్లో, ఎలా చేయాలో పాఠాలు నేర్పుతున్నట్టా? పోనీ ప్రభుత్వం వారి దూరదర్శన్ చూద్దామా అంటే, సమ్మె దేశంలో అసలు విజయవంతమే కాదన్నట్టు చూపిస్తారు.ఎవరిని నమ్మాలి?

    ఈ సమ్మెల్లో ప్రభావితం అయ్యేవారు చెప్పాలంటే సామాన్యప్రజానీకం.ఇన్నిన్ని కబుర్లు చెప్తారే ఈ రాజకీయనాయకులూ, వారిని ఎన్నుకున్న సామాన్యప్రజల పట్ల వారికి బాధ్యతలేదా? ఈ సమ్మెల్లో ముందుగా బలైపోయేవి ప్రభుత్వ ఆస్థులు. పైగా ఏమైనా అంటే అసలు ఈ సమ్మెలు price raise గురించేకదా అని ఓ సెర్మనూ.పనీపాటాలేని వారందరికీ ఏదో ఒక వ్యాపకం కావొద్దూ, కనిపించిన ప్రతీదీ తగలెట్టేయడం ఫైరింజన్లతో సహా. వీళ్ళను చెదరగొట్టడానికి పోలీసులూ, భాష్పవాయువులూ, మరీ ఎక్కువైపోతే ఫైరింగూ. మరి అంత హడావిడిలో లాఠీచార్జింగు జరిగితే ఎవరికో ఒకరికి దెబ్బలు తగలకుండా ఉంటాయా? ఫైరింగులో కూడా ఎవరో ఒకరు గాయపడ్డమూ, లేదా మరణించడమూ జరిగిందంటే జరగదా మరి?

   అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే ఇలా గాయపడ్డవారిలోనూ, మరణించినవారిలోనూ ఒక్కడంటే ఒక్క రాజకీయనాయకుడైనా లేకపోవడం ! ఏదో పొద్దున్నే వచ్చేసి నాలుగు కేకలెసేస్తే పోలీసులు వాళ్ళని అరెస్టు చేసేస్తారు. అది వాళ్ళకీ తెలుసు,హాయిగా రోజంతా పోలీసు కస్టడీ లో కూర్చుని, సాయంత్రానికో, మర్నాడో, ఏ తలమాసిన చానెల్ వాడో పిలిస్తే నోటికొచ్చినట్టు పేలడం.ఏమైనా అంటే ఇదంతా నాయకత్వం అని ఓ పేరోటీ!!

    పైగా ఏమైనా అంటే, అప్పుడే పదేళ్ళయింది సమ్మెలు చేసీ, ప్రభుత్వానికి పట్టఖ్ఖర్లేదా, జీతాలు పెంచాలనీ. ఏ పార్టీ అయినా ధరలు పెరగవూ అని ఆస్వాసన్ ఇవ్వగలరా? పోనీ ప్రభుత్వం వారు ఒప్పుకున్నారే అనుకోండి, అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తున్నామూ అని, జరిగేదేమిటీ బడ్జెట్ లో మళ్ళీ ఎడాపెడా పన్నులు. వాళ్ళకి మాత్రం డబ్బులెక్కణ్ణించి వస్తాయీ? మళ్ళీ అధికధరలూ, సమ్మెలూనూ. ఇదో విషస్ సర్కిల్.

    ఇవేమీ సరిపోవన్నట్టు బిజేపీ వారు, ఆ షిందేగారేదో అన్నారుట, ఆ “మాట” వెనక్కు తీసికుని క్షమాపణ చెప్పేదాకా, పార్లమెంటు బడ్జెట్ సెషన్ జరగనీయమూ అని ఈవేళ ఢిల్లీలో ప్రదర్శనలూ గట్రానూ. ఇప్పుడు ఆయనెవరో క్షమాపణ చెప్పినా, అనవలసిన మాటేదో అననే అన్నాడుకదా. ఇప్పుడు ఒరిగేదేమిటిట? ఓవైపున భారత్ బంధ్ జరుగుతూంటే, మళ్ళీ ఈ గొడవేమిటిట? అయినా రాజకీయపార్టీలకి కారణాలే కావాలా ఏమిటీ పార్లమెంటు జరగనీయకుండా ఉండడానికీ, ఏదో ఓ వంక.ఈ ఏడాదంతా సెషన్లు జరగనీయకుండా ఉండడానికి ఎన్నెన్నో కారణాలు చెప్పారు. మొత్తానికి కాలం గడిపేశారు. ఇంకో ఏడాది మహ అయితే. మళ్ళీ ఎన్నికలూ, ఎవరో ఒకరు అధికారంలోకి వస్తారు, మళ్ళీ ఆ నెగ్గనివాళ్ళు మొదలూ.

    ఒక విషయం నిజమే. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కాలంలో, UPA లోనే ఎక్కువ స్కామ్ములు “వెలుగు” లోకి వచ్చాయీ అన్నది. అందులో డౌటేమీ లేదు. రోజుకో స్కామ్ము బయటపడుతోంది.తినడం అనేది అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. జీవనది లాటిది !

   అసలు జీతాలు సరిపోడంలేదో అని ప్రతీసారీ సమ్మెలు చేస్తారే, దానికి సగం కారణం మనమే కదా! ఈ సందర్భంలోనే అప్పుడెప్పుడో ఒక టపా పెట్టాను. గవర్నమెంటులో నేనూ పనిచెసినవాడినే. వాళ్ళిచ్చే జీతం సరిపోతోందా లేదా అనే విషయం కొద్దిగా నాకూ అవగాహన ఉంది. కానీ ఇచ్చేజీతానికి బాధ్యతగా పనిచెసేవారెంతమంది? మళ్ళీ అలాటివి అడక్కూడదు.అడిగితే, ఇంతేసి ధరలతో సంసారం గడపడమెలాగా, మీరోజుల్లో అయితే ఇంతంత ఖరీదులుండేవా ఏమిటీ అంటారు. నిజమే కాదనం, కానీ ధరలు ఇలా ఆకాశాన్నంటడానికి కూడా మనమే కారణం కదా.మనుష్యుల మనస్థత్వాల్లో మార్పు రానంతవరకూ, జీతాలెంతంత వచ్చినా ఇంకా..ఇంకా.. కావాలనే ఉంటుంది.

    ఈ సమ్మె ధర్మమా అని ప్రభుత్వరంగబ్యాంకుల వాళ్ళూ రెండు రోజుల సమ్మెట.మొన్న SBH కి ఓ పనిమీదవెళ్ళాను. ఆరోజు system down ట, రెండోరోజు శివజయంతి శలవుట, తరువాత రెండురోజులూ సమ్మెట.. తూర్పు తిరిగి దండం పెట్టమన్నారు.ఇదీ పరిస్థితి.ఇలాటివవుతూనే ఉంటాయి, ప్రతీదానికీ ఇలా కడిగేస్తూంటే ఎలాగా అంటారు. ప్రెవేట్ రంగంలో వాళ్ళెవరైనా సమ్మె చేస్తారేమో చూడండి, సమ్మె అంటే ఓ నెలజీతం చేతిలోపెట్టి కొంపకెళ్ళమంటారు. అలాగని మన హక్కు ఉపయోగించొద్దూ అని కాదు, ఏదో ఒక రోజైతే పరవాలేదు, కాలక్షేపం చేసేస్తారు. కానీ రెండురోజులు ఎక్కువేమో. పైగా ఆయనెవడో చెప్పనేచెప్పాడు, మా కోరికల్లో ఏ ఒకటో రెండో ఒప్పేసికుని, మిగిలిన చిఠ్ఠాలోవాటికి సంప్రదింపులు చేస్తామూ అన్నా కానీ ఒప్పెసికుంటామూ అన్నాడు.This shows how serious this strike is.. మళ్ళీ ఎల్లుండినుంచి మామూలే.. పెట్రొల్ ధరా పెరగొచ్చు అలాగని గాడీలు మానేశారా? రైళ్ళ టిక్కెట్టు ధరలూ పెరగొచ్చు అలాగని ప్రయాణాలు మానేస్తామా? ఈ వంకలు పెట్టి ప్రతీవాడూ ధరలు పెంచేసేవాడే.

    Life goes on… మేరా భారత్ మహాన్...

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

    క్రిందటి వారం అంతా నా మిస్టరి షాపింగులతో బిజీ బిజీ గా ఉన్నాను. ఆమధ్యన ఓ కొత్త ఏజన్సీ బెంగుళూరు లో ఉంది, దానిలో రిజిస్టరు చేసికున్నాను. వాళ్ళు ప్రస్తుతం దేశంలోని ఎలక్ట్రానిక్ ఔట్ లెట్స్ ( శామ్సంగ్, ఎల్.జీ) ల మిస్టరీ షాపింగులు నిర్వహిస్తున్నారు. ఏదో కొత్తగా ఉంది కదా అని దాంట్లోకి అడుగెట్టాను.ఇచ్చేది తక్కువే అయినా, నాలుగైదు షాపులు ఒకేసారి అడగొచ్చు. డబ్బులు కిట్టుబాటవుతాయి. పైగా ఏమో కొనఖ్ఖర్ల్లేదు, చేతి డబ్బులు ఏమీ అవవు. సరే చూద్దామని ఓ నాలుగు షాపులు అడిగితే, వాళ్ళేమో అన్నీ ఇచ్చేశారు. వాటికి POV ( Proof of Visit), అదేదో వాయిస్ రికార్డింగు చేయమన్నారు, నేను ముందుగానే చెప్పాను, నాకలాటివేమీ తెలియదనీ, కావల్సొస్తే ఓ ఫొటో (exterior of the outlet) తీసి పంపిస్తాననీ, సరే అన్నారు కదా అని ఒప్పుకున్నాను. పేద్ద పనేమీ లేదూ, మా ఇంటిదగ్గరలోనే ఉండే LG వాళ్ళ కొట్లకి వెళ్ళి, AC, LED/LCD TV ల ఖరీదెంతో తెలిసికోడం, మిగిలినవి ambience వగైరాలమీద ఓ రిపోర్టు వ్రాయడం. అన్నీ పూర్తయి బయటకొచ్చి ఓ ఫొటో తీయడం. ఇవన్నీ పూర్తిచేసి రిపోర్టు పంపేశాను.

    మర్నాటికల్లా వాళ్ళ దగ్గరనుంచి ఫోనూ, వాళ్ళ విజిటింగ్ కార్డు తీసికోలేదూ, నీ రిపోర్ట్ ఒప్పుకోడంలేదూ అని.వాళ్ళదగ్గర విజిటింగ్ కార్డులు లేకపోతే నేనేం చేసేదీ, మిగిలిన వివరాలు ఇచ్చాను కదా వాళ్ళపేరూ, గోత్రం అవీనూ, ఇంకా ఏమేమి కావాలీ, కావల్సొస్తే వెళ్ళి CC TV Coverage చూసుకోండీ, అంతేకానీ, నేను వెళ్ళలేదూ అంటే మాత్రం ఒప్పుకోనూ అని ఛడామడా కోప్పడేశాను.అంతకుముందు, ఇదే ఏజన్సీ వారి SAMSUNG కి చేస్తే, ఇదే గొడవ పెట్టారు. మళ్ళీ మొదలూ. ఇలాకాదని, నేనూ కొద్దిగా పాఠాలు నేర్పాను వాళ్ళకి- చూడండీ, మీకు ఇదేమొదటిసారేమో కానీ, నేను గత అయిదారేళ్ళుగా వందలకొద్దీ ఇలాటివి చేశాను, డబ్బులిస్తే ఇవ్వండీ, లేకపోతే టు హెల్ విత్ యు.. అనేసి ఫోను పెట్టేశాను.

    మరి నేనిచ్చిన డోసు వల్లో, లేకపోతే ఎందుకొచ్చిన గొడవా అనుకున్నారో ఏమో, మొత్తానికి నా రిపోర్ట్ అంగీకరించారు. వీళ్ళతో వచ్చిన గొడవే ఇది, మెత్తగా ఉండేవాళ్ళని చూస్తే మొత్త బుధ్ధేస్తుందిట.వాళ్ళు చెప్పిన దానిని వినేసి, సారీ.. అలాగా.. అనేసి, మనమేదో తప్పుచేశామని ఒప్పేసికుంటే, వాళ్ళే ఓ ఘనకార్యం చేశామనుకుంటారు. ముందుగానే వాళ్ళతో చెప్పాను, విజిటింగ్ కార్డు లేకపోతే ఓ ఫొటో తీయొచ్చూ అని వాళ్ళే చెప్పారు, వాళ్ళడిగినట్టుగానే చేసినా ఏదో ఒక గొడవ.

    అప్పుడప్పుడు మనం చేసింది రైటే అయినప్పుడు అవతలివాడితో వాదించడం తప్పేమీ కాదని నా అభిప్రాయం. మా పాత ఏజన్సీ వాళ్ళు ఫోను చేసి, అర్జెంటుగా ఓ ఆడిట్టుందీ ప్లీజ్ చేయండీ అని అడిగారు.అదికూడా కొనడాలేమీ లేవు. అదేదో రియల్ ఎస్టేట్ వాడి షో రూమ్ముకి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్టులో ఇళ్ళు ఎలా ఉన్నాయీ,వాటి సదుపాయాలేమిటీ, వగైరా వగైరా..కొశ్చనైర్ చూస్తే, అదేదో శాంపిల్ ఫ్లాట్ గురించి కూడా ప్రశ్నలున్నాయి. మళ్ళీ అక్కడెక్కడికో కూడా వెళ్ళమంటారేమో అని భయపడ్డాను. తీరా చూస్తే, అదే షో రూమ్ములోనే, చెక్కలతో ఓ శాంపిల్ ఫ్లాట్ కట్టేసుంచారు. వాటి వివరాలే అడిగారన్నమాట ! మొత్తానికి కిందటి వారమంతా వీటితో సరిపోయింది.

    ఇంక వచ్చేవారంలోనే అసలు బిజీ అంతానూ. మా ఫ్రెండొకాయన ఢిల్లీ రమ్మన్నారు, ఓ వారంరోజులికి, ఓ ఆధ్యాత్మికమూ, ఓ మామూలు తిరుగుడు కార్యక్రమమూ ప్లాను చేశారుట ( మా కోరికమీదే అనుకోండి). శుక్రవారం బయలుదేరి, తిరిగి శనివారం వచ్చేయడం. చూడాలి ఎలా ఉంటుందో మరి.. నా మాటెలా ఉన్నా, మా ఇంటావిడైతే చాలా..చాలా.. ఉత్సాహంగా ఉంది.తిరిగొచ్చిన తరువాత మిమ్మల్నందరినీ బోరు కొట్టడానికి కావలిసినన్ని విశేషాలు…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–utterly helpless….

   ఒక్కొక్కప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తూంటుంది.అవడం విషయం చిన్నదే అవొచ్చు, కానీ వయస్సొచ్చేకొద్దీ మనలో వచ్చే పరిణామాల ప్రభావం ధర్మమా అని ఇలాటివి అనుభవాల్లోకి వస్తూంటాయి. వయస్సుమీద పడేకొద్దీ, మనలో జ్ఞాపకశక్తి తగ్గిపోతూంటుంది.ఏదో మామూలుగా కాలక్షేపానికైతే పరవాలేదు, కానీ బయటకెప్పుడైనా వెళ్ళినప్పుడు, అదృష్టం బాగోక కొంతమంది వాళ్ళుండే ప్రాంతం పేరు మర్చిపోతూంటారు. ఒకటి రెండుసార్లు జరిగేటప్పటికి ఏ డాక్టరుదగ్గరకో తీసికెళ్ళాల్సొస్తూంటుంది. ఇలాటివి సర్వసాధారణంగా వయస్సొచ్చినవారికి జరిగేవే. వివరాలు ఇంకా తెలిసికోవాలంటే ఒకసారి ఇక్కడ చదివేయండి.

ఇదివరకెప్పుడో ఒక టపా కూడా వ్రాశాను తిన్నతిండరక్క వ్రాసిన టపా అది.కానీ ఏదో సరాదాకి అనుకున్నదేదో, అత్యవసరపరిస్థితిలో మనకే అనుభవం అయితే ఎంత helpless.. అయిపోతామో చెప్పడానికే ఈ టపా..

మనుష్యులమధ్య communication కోసం ప్రతీవారూ ఈరోజుల్లో cell phones ఎందుకు ఉపయోగించుకోవాల్సివస్తుందో, వాటిని మంచి కండిషన్ లో పెట్టుకోవాల్సిన అగత్యం ఏమిటో, అనుభవం మీదకానీ తెలియదు. ఏదో ఓ “పెద్దరికం” అడ్డుపెట్టేసికుని ” ఏమిటోనండీ ఈ రోజుల్లో ఎవరిచేతుల్లో చూడండి ఆ దిక్కుమాలిన సెల్లులే..” అంటూ sermonize చేయడం బాగానే ఉంటుంది. పైగా “ మారోజుల్లో ఇలాటివేమైనా చూశామా, పెట్టామా..” అంటూ సాగదీసుకుంటూ కబుర్లు చెప్పడం కూడా బాగానే ఉంటుంది upto a limit. కానీ, చేతిలో సెల్ల్ ఫోను ఉన్నా, అది పనిచేయకపోవడం మాట దేవుడెరుగు, పోనీ ఇంకో ఫోనునుంచైనా ఫోను చేయడానికి, అసలు ముఖ్యమైన నెంబర్లే గుర్తులేదంటే thats the height of it... సరీగ్గా అలాటి పరిస్థితే ఎదురయింది నాకు ఈవేళ !

ఈమధ్యనే BSNL వారి లాండ్ లైనోటొచ్చిందని చెప్పానుగా, దానితో పాటు broadband కూడా వచ్చిందిలెండి.”అన్నీ బావుంటే ఆయనెందుకూ..” అన్నట్టు, ఆ మాయదారి wi-fi పనిచేయడం మానేసింది.కారణం పేద్ద ఏమీలేదనుకోండి, పనిలేక సెట్టింగ్స్ కెలకడం మొదలెట్టేటప్పటికి అది కాస్తా మొండికెత్తింది. ఆ wi-fi లేకపోతే నాకొచ్చే నష్టం ఏమీ లేదనుకోండి, కానీ మా ఇంటావిడొకత్తుందిగా ఆవిడ సెల్లూ, టాబ్బూ పనిచేయడం మానేశాయి. అదన్నమాట అసలు విషయం. మొత్తానికి మా అల్లుడిని పట్టుకుని అదేదో బాగుచేయించాము. అన్నీ బాగానే ఉన్నాయీ అనుకున్నంతసేపు పట్టలేదు, నిన్నంతా ఆ ఫోనూ, నెట్టూ డెడ్ అయిపోయాయి.

ఈవేళ మేము ఇదివరకు ఉన్న పాత ఫ్లాట్ ఆ ఓనరు కి ఇచ్చేసి, ఆవిడదగ్గరున్న నా డబ్బులేవో తెచ్చుకుందామని బయటకు వెళ్ళాను. ఆవిడతో మాట్టాడి మా ఇంటావిడకు ఫోను చేద్దామనుకుని చూస్తే, ఆ మాయదారి సెల్లు పూర్తిగా down అయిపోయింది. పోనీ ఇంకో చోటునుండి ఇంటికి ఫోను చేద్దామా అనుకుంటే, మా ఇంటావిడ నెంబరే గుర్తుకి రాదే. ల్యాండ్ లైను నెంబరు గుర్తుంది, కానీ అదేమో పనిచేయడం లేదాయె, పోనీ పిల్లల నెంబర్లైనా గుర్తుకొస్తాయా అంటే అదీ లేదూ.పాపం మా ఇంటావిడేమో నా నెంబరుకు ఫోను చేస్తే నాదేమో పలకదాయె.నానా హడావిడీ అయిపోయింది ఈవేళంతా, మొత్తానికి మధ్యాన్నం పన్నెండున్నరకల్లా కొంపకి చేరాననుకోండి, అది ఎప్పుడూ మామూలేగా, అదే మా ఇంటావిడ ధైర్యం ! కథ సుఖాంతం.. ఫోనూ వచ్చింది, నెట్టూ వచ్చింది.

అసలు ఈ గొడవలన్నీ ఎందుకొస్తున్నాయంటే ఒళ్ళంతా బధ్ధకం పెరిగిపోయి. ప్రతీదానికీ బధ్ధకమే. ఇదివరకటిరోజుల్లోనూ ఉండేవి ఈ ఫోన్లూ అవీనూ. ఆ నెంబర్లన్నీ లక్షణంగా ఓ pocket diary లో వ్రాసుకుని ఎవరికైనా ఫోను చేయాల్సొచ్చినప్పుడు ఆ నెంబరేదో చూసుకుని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జేబుల్లో అలాటి డైరీలు పెట్టుకోడానికి నామోషీ.ఆ మాయదారి సెల్లులోనే, అవేవో నొక్కేసి సేవ్ చేసేసికోడం.పైగా పూర్తినెంబరు చేయడానికి కూడా బధ్ధకమే. వాటికి అదేదో speed dial ట దాంట్లో పెట్టుకోడం, అవసరం వచ్చినప్పుడు ఆ నెంబరుని ఓ నొక్కు నొక్కడం.ఇన్నేసి సదుపాయలున్నప్పుడు ప్రత్యేకంగా నెంబరు గుర్తుపెట్టుకోమంటే ఎవడు పెట్టుకుంటాడూ? హాయిగా అదో పని తప్పింది అని సంతోషించడం.

ఒక్కొక్కప్పుడు ఎవరినైనా మీ నెంబరెంతా అని అడిగిచూడండి, గుర్తులేదండీ అని చిద్విలాసంగా చెప్తాడు. పైగా ” నా ఫోనెప్పుడూ నాదగ్గరే ఉంటుంది కదండీ..” అని ఓ వెర్రిమొర్రి explanation కూడా ఇస్తాడు ! ఓరి భబ్రాజిమానం, ఇంకోరెవరికో చెప్పాలన్నా గుర్తుండాలికదురా అని ఎవరైనా అంటారేమో అని, తన నెంబరు మాత్రం గుర్తుంచుకుంటాడు. నాది ప్రస్తుత పరిస్థితి exactly అదే !

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– affordability…

    ఈ టపాకి పెట్టిన శీర్షిక ఒక్కొకరికి ఒక్కో విధంగా ఉంటుంది. నా ఉద్దేశ్యమేమిటంటే ఒకరికి affordable గా ఉండేది, ఇంకోరికి చాలా సుళువుగా ఉండొచ్చు. వీటికి కారణం సంపాదిస్తున్న డబ్బు మీద ఆధారపడుతుందేమో అని నా అభిప్రాయం. ఏదో ఒక వస్తువు కొన్నప్పుడు, దాని ఖరీదు కొద్దిగా ఎక్కువేమో అని నాలాటివాడు అన్నప్పుడు, కొందరికి అది వింతగా అనిపించొచ్చు.ఓస్ ఈమాత్రందానికేనా ఇంత హడావిడీ అనికూడా అనుకోవచ్చు.అది మన మనస్థత్వాన్నిబట్టీ, సంపాదనబట్టీ ఉంటుంది.

ఉదాహరణకి ప్రస్థుతం మేముంటున్న ప్రాంతంలో, చాలా వస్తువులు పూణె లోని ఇతరప్రాంతాలకంటె కొంచం ఎక్కువగానే ఉన్నట్టనిపిస్తోంది. ఇదివరకంటే, జీవితంలో ఇంకా ఎన్నెన్నో బాధ్యతలు అంటే పిల్లలకి చదువులూ, పెళ్ళిళ్ళూ , ఓ కొంప ఏర్పాటుచేసికోడమూ లాటివి ఉన్నచేత, ప్రతీదీ మనం afford చేయలేమేమో అనే అనిపించేది.కానీ, వాటన్నిటినీ ఏదో నా శక్తిమేరకు,భగవంతుని దయతో, దాటేయడం మూలానా, ఇంకేమీ పేద్ద బాధ్యతలన్నవి లేకపోవడం మూలానైతేనేమిటిలెండి బావున్నట్టే అనిపిస్తోంది. అంటే ఒకలా చూస్తే, గట్టెక్కేసినట్టే అనుకోండి. ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను.

అందుకోసమే, అసలు ఈప్రాంతంలో ఇంతంత ఖరీదులెందుకెక్కువా అనే ఆలోచనలాటిదోటొచ్చింది.ముఖ్యకారణం( నా ఉద్దేశ్యంప్రకారం), ఇక్కడెవరికీ బేరం ఆడే అలవాటు లేదు.ఆ కొట్టువాడేం చెప్తే అంతిచ్చేయడం. కారణం చేతినిండా డబ్బులు, వాటినెలా ఖర్చుపెట్టాలో తెలియదూ. అది ఓ కూర్లనండి, పనిమనిషనండి, లాండ్రీవాడనండి,ఒకటేమిటి ప్రతీదీనూ.కూరలూ, గ్రోసరీలూ, దగ్గరలోనే ఉండే రిలయెన్సు మార్టూ, డీమార్టూ లలో ఫరవాలేదు,మరీ అంత ఖరీదెక్కువకాదు, పైగా తూకంకూడా బాగానే ఉంటుంది.కానీ వచ్చినగొడవల్లా బిల్లింగు దగ్గరే. ఏ వీకెండులోనే వెళ్తే గంటలతరబడి వేచిఉండాలి.పైగా కొన్నవన్నీ కొంపదాకా మోసుకుపోడమోటి. కానీ మామూలు కిరాణా దుకాణం వాడు కొన్నసరుకులు కొంపకి చేర్చే సౌలభ్యమోటిచ్చాడు.దీనివలన ఏమౌతోందంటే, కావలిసిన సరుకులు ఆ కిరాణా కొట్టువాడిదగ్గరే తెప్పించేసికుని, window shopping కి మాత్రమే మాల్స్ కి వెళ్ళడం.అయినా లింగూలిటుకూమంటూ ఉండే ఇద్దరికి ఏం కావాలీ?

ఇంక పనిమనుష్యులవిషయానికొస్తే, ఈ ప్రాంతంలో ఉండే చాలా ఇళ్ళల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులు కావడం చేత, పనిమనుష్యులు part and parcel వాళ్ళకి. పాపం ప్రొద్దుటే పిల్లలని స్కూళ్ళకీ, భర్తలని ఆఫీసులకీ పంపడంకోసం, ముందుగా ఓ వంటమనిషి ముఖ్యం. ఏ సాయంత్రమో ఆఫీసులనుండి కొంపకి తిరిగొచ్చే సమయానికి, ఆ రెండో పనిమనిషిని రమ్మంటారు.చెప్పేదేమిటంటే, వారి సౌకర్యంప్రకారం ఆ పనిమనుష్యుల పనివేళలు మనం నిర్ణయించేసరికి, వాళ్ళేమో నెత్తికెక్కేస్తారు. అవసరం మనదిగా, వాళ్ళేంచెప్తే దానికే చచ్చినట్టు ఒప్పుకోవాలి.వాళ్ళకి మూడ్డుంటే వస్తారు, లేకపోతే ఓ దండం పెట్టుకోవడం. ఇక్కడనే ఏమిటిలెండి, ఈ మహానగరాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్తూన్న ప్రతీ ఇంట్లోనూ ఇదే భాగవతం.ఏదో నూటికీ కోటికీ ఇంట్లోంచే పనిచేసేసదుపాయం ఉన్నవారికి తప్పించి, మిగిలినవారందరి అవస్థా ఇదే.

ఇలా పనిమనుష్యుల tantrums మాట్టాడకుండా భరిస్తున్నారంటే మరి affordability యే కారణం కదా! దీనితో ఏమయ్యిందీ అంటే మామూలు జీతాలకి పనిమనుష్యులు దొరకడం అంటే చాలా కష్టం.మధ్యతరగతి ప్రాణులు ఎవడైనా వచ్చి ఇలాటి ప్రాంతాల్లో ఉండాలంటే ప్రాణం మీదకొచ్చిందంటే రాదు మరీ ?

ఇంక కూరలూ, పళ్ళూ వ్యవహారంలోకి వస్తే, వాటినమ్మే కొట్టువాడిని రేటెంత బాబూ అంటే ఏదో వింతమృగాన్ని చూసినట్టు చూస్తాడు, కారణం- ఇప్పటిదాకా ఎవడూ రేటడిగిన పాపానికి పోలేదు, ఏదో కారు కొట్టుపక్కనే ఆపడం, ఓ కూర చూపించడం, ఫలానాది అరకిలో, ఇంకోటేదో పావుకిలో అంటూ చెప్పడం, వాడడిగినదేదో ఇచ్చేయడం.అలాటిది ఓ అర్భకప్రాణి వచ్చి రేటెంతా అని అడిగాడంటే ఆశ్ఛర్యపడ్డంలో వింతేముందీ? కానీ I could get a break in the price! ఈమధ్యన ఓ కూర్లకొట్టుదగ్గరకి వెళ్ళి ఫలానాది ఎంతా, అన్నాను , ఏదో చెప్పాడు, కాదూ ఇంతకైతే ఇస్తావా అన్నాను, ముందుగా కాదూ అన్నవాడే తీరా నేనడిగిన రేటుకే ఇచ్చేశాడు. కారణం- మిగిలినవారిదగ్గరనుంచి ఎలాగూ చాలా లాభం సంపాదించుకున్నానుకదా, అలాటిది రొజులో ఏ ఒకరిద్దరికో, వాళ్ళడిగిన రేటుకిస్తే ఏం పోయిందీ. ఇక్కడుండే ఐటి వారి ధర్మమా అని, ఆ కొట్టువాడుకూడా CRM లో దిట్ట అయిపోయాడేమో..ఏదైతేనేం, తేలిందేమిటయ్యా అంటే, బేరాలు ఆడొచ్చు అని.కానీ బేరం ఆడడానికి నామోషీఆయే.

బయట రోడ్లపక్కనుండే చాయ్ దుకాణాల్లో చాయ్ తాగాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. కారణం, ఎవరైనా చూస్తారేమో అని! అదే ఎవడో, ఓ మెర్సిడీజ్ బెంజ్ కారు ఆపి, ఆ కొట్టులో చాయ్ తాగాడనుకోండి, ఇంక ప్రతీవాడూ అక్కడే తాగడం మొదలెడతాడు. పైగా అదో స్టేటస్ సింబలనుకుంటారు. అదేచాయి, ఏ కెఫే కాఫీలోనో, బరిస్టాలోనో తాగాలంటే తాడితెగుతుంది! అలాగని పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్తే పాపమనికాదు.Affordability అనేది ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తుందో అని చెప్పడానికి.

ఇంక ఇక్కడి ఎపార్టుమెంట్ల గొడవ. ఎప్పుడో ఆరేడేళ్ళక్రితం, ఇంకా ఇంత expansion లేని రోజుల్లో కొనుక్కున్న ఏ అపార్టుమెంటో అమ్ముకుందామని చూశారో, ఇంక చూడండి, ఆ సొసైటీ సెక్రెటరీయో ఎవడో ఉంటాడు, వాడికేమో చవకలో కొట్టేద్దామని ఆశ, అమ్మేవాడేమో ఏదో రేట్లు పెరిగాయికదా, ఆ పెరిగిన రేటుకి అమ్ముదామని వీడి ఆలోచనా.చివరకి బేరం కుదరక తాళం పెట్టుకుంటాడు. ఇదో టైపు mean..
దాదాగిరీ. ఏమిటో అంతా గందరగోళం. అయినా పనేమీ లేదుగా, ఇలాటివే చూస్తూంటాను, నా టపాలకి టాపిక్కులు దొరుకుతాయి కదా అని.

ఈవేళ పేపరులో ఒక వార్త చదివాను. చాలా బాధేసింది. మీరూ చూడండి…Choked while breast feeding

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– 2006 కి పూర్వ పెన్షనర్లకి వచ్చేది…

    గత నెల 29 న ఒక టపా పెట్టాను.అది చదివిన తరువాత అంతా అగమ్యగోచరంగా ఉంది. అసలు ఏమైనా వస్తుందో రాదో, వస్తే గిస్తే ఎంతొస్తుందీ.. అన్నీ సందేహాలే. పనేమీ లేదుకదండీ ఇదో కాలక్షేపమూ… ఆయనెవరో ప్రభుత్వంవారు జారీ చేసిన ఆర్డర్లకి ఓ intrepretation ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు ఇక్కడ చదవండి. జాతకాలు తెలుస్తాయి.Minimum_Revised_Pension_as_per_DOP_OM_Dated_28-1-2013

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అప్పుడే యాభైఏళ్లు పూర్తయ్యాయి…

    టపా శీర్షిక చూసి ఆ యాభై ఏళ్ళన్నది నా వయస్సుకి సంబంధించింది కాదూ, ఈ పూనా నగరానికి వచ్చీ అని మనవి చేసికుంటున్నాను. అయితే ఏమిటిట అనిమాత్రం అనకండి. అవేవో పాతిక్కీ, యాభైలకీ, వందలకీ పండగలు చేసికుంటారే, ఇదీ అలాగే. ఎంత చెప్పినా యాభైఏళ్ళంటే మాటలాండీ? పుట్టి పెరిగిన కోనసీమలో ఉన్నది 18 సంవత్సరాలే. కానీ, జీవితానికి సరిపడేనన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నిజంచెప్పాలంటే, ఆ జ్ఞాపకాల పునాదిలమీదే కదా, ఇక్కడి ప్రస్థానం మొదలెట్టింది ! ఇప్పటికీ , ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉంటే, టక్కున ఆనాటి జ్ఞాపకాలు తాజా చేసికున్నప్పుడల్లా, మళ్ళీ పుంజుకుంటూంటాను.

   1963 లో పూనా వచ్చినప్పుడు, అప్పటిదాకా రైలంటే తెలియని అమాయక అర్భక ప్రాణిని, అలాగని ఇప్పుడేదో పేద్ద గొప్పవాడినైపోయాననికాదు. బ్రతుకుతెరువేదో నేర్చుకున్నాను. ఈ ప్రస్థానంలో ఎంతోమంది మిత్రుల్ని ఉద్యోగరీత్యా సంపాదించుకోగలిగాను.అలాటిది ఎప్పుడో పుట్టిపెరిగిన చోటుకి, ఇన్నేళ్ళ తరువాత వెళ్ళి, మళ్ళీ జీవితంప్రారంభించడం కొద్దిగా శ్రమౌతుందేమోననే భయం ఓటీ. ఆరోజుల్లో మనసహాధ్యాయులూ ఎవరూ ఉండరూ, ఉన్నవాళ్ళెవరికీ మన సంగతి పట్టదూ, ఏదో డబ్బూదస్కం ఉంటే సంగతి వేరనుకోండి, ఏవేవో సామాజికసేవలు (పుట్టిపెరిగిన ఊరికి) చేస్తూ, ఏదో నలుగురినోళ్ళలోనూ బతికేయొచ్చు.కానీ అలాటి ఆర్ధిక స్థోమతుండాలికదా. పెన్షన్లమీద బతికే మాలాటివారికి అది కష్టమైన పని.

   ఏదో “ఎత్తిపెట్టినట్టు” గా ఇన్నేళ్ళూ తిండిపెట్టిన ఉన్న ఊరిని వదిలేసి, ఏవో సెంటిమెంట్ల పేరుతో, అక్కడేదో ఉధ్ధరించేద్దామనుకోడం బుధ్ధితక్కువేమో అని నా అభిప్రాయం. పైగా సామాజికంగా కూడా ఊర్లు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడ చూసినా ” నువ్వు మాకేమిస్తావూ..” అనే కానీ, ఇంకో ఆలోచన ఉండడంలేదు. వీటికి కారణాలు లెఖ్ఖలేనన్నున్నాయి.ఎక్కడ చూసినా “కులం.. కులం…”. ఆ మధ్యన ఎప్పుడో మనవైపు బస్సులో వెళ్తున్నప్పుడు, ఓ పెద్దమనిషి, “మీరేమిట్లండీ..” అని అడగడంతో షాకయ్యింది.నేనేమిటైతే ఆ పెద్దమనిషికెందుకూ అసలూ, వల్లకాట్లో రామలింగయ్యని.ఇలాటివి ఆరోజుల్లో లేవా అని కాదు, ఉండేవి, కానీ మరీ ఇంత ఉధృతంగా కాదు.ఎక్కడచూసినా (including piligrim centres ) కులప్రాతిపదికమీద సత్రాలూ, హాస్టళ్ళూ. ఇలా కులం పేరుతో ప్రజానీకాన్ని polarise చేసేశారు.దీనంతటికీ ముఖ్యదోషులు రాజకీయనాయకులే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఓట్ల రాజకీయాల పేరుతో జనాలమధ్య లేనిపోని శత్రుత్వాలు పెంచేశారు. వీటికి సాయం గత రెండుమూడేళ్ళుగా సాగుతున్నప్రాంతీయ రాజకీయాలోటీ. ఎప్పుడేం గొడవొస్తుందో తెలియదు, ఏ రోజు బస్సెళ్తుందో, ఏరోజు రైలు రోకో ఉంటుందో తెలియదు. వీటన్నిటికీ ఎవరి కారణాలు వాళ్ళు చెప్తారనుకోండి.

    ప్రస్థుతం ఆంధ్రదేశంలో ఉంటున్నవాళ్ళందరూ పడడంలేదా ఈ అవస్థలన్నీ, వాళ్ళు మాత్రం బతకడంలేదా అనొచ్చు. కరెక్టే. కానీ హాయిగా ఏ గొడవలూ లేకుండా బతికేస్తూ, లేనిపోని చిరాకులు తెచ్చుకోడం అంత అవసరమంటారా? ఇదివరకటి రోజుల్లా కాదు,ఇప్పుడు పూణే లోకూడా మనప్రాంతాల్లో దొరికే ప్రతీ వంటకమూ, కూరా నారా, చదువుకోడానికి అచ్చతెలుగు పుస్తకాలూ, ఆంధ్రదేశంలో రిలీజైన రోజే చూడ్డానికి తెలుగుసినిమాలూ, ఆ థియేటర్లలో అభిమాన నటుడు తెరమీదకొచ్చినప్పుడు వేసే ఈలలూ, కేకలతో సహా ఇక్కడే దొరుకుతున్నాయి.కరెంటు కోతలు లేవు.రోజుకో బందుచొప్పున లేవు.ప్రతీ ఏడాదీ వంతుతప్పకుండా వచ్చే తుఫాన్లూ, సైక్లోన్లూ లేవూ.

    వెదకాలేకానీ, తెలుగుమాట్టాడేవారు ఓ అయిదులక్షలమందిదాకా ఉన్నారు. తెలుగు స్నేహితులంటరా, ఓ పదిపదిహేనుమందుంటే చాలదండీ? మా ఫ్రెండెవరో చెప్పినట్టుగా “అవసరానికి” ఓ నలుగురుంటే చాలుట ! నిన్ననే ఓ కొత్త స్నేహితుడితో పరిచయం అయింది. ఆయన ఇక్కడ ముఫై ఏళ్ళనుండీ ఉంటున్నారుట, ఇన్నాళ్ళకి పరిచయం చేసికునే యోగం పట్టింది.

    ఇంక రాజకీయాల ప్రభావం అంటారా, ప్రతీచోటా ఉండేదే.కానీ ప్రత్యేకత ఏమిటంటే దాని ప్రభావం సామాన్యమానవుడి మీద, మన రాష్ట్రంలో ఉన్నంత కాదు. మన దారిని మనముంటే, ఎవడూ మన జోలికి రాడు, మరాఠీవారిదీ, మనదీ పంచాంగం ఒక్కటే కావడంతో, పండగలూ, పబ్బాలకీ కూడా తేడా లేదు. ఏదో డెభ్భైల్లో శివసేన వాళ్ళేదో దక్షిణభారతీయులమీద గొడవలు పెట్టారు కానీ, ఇప్పుడలాటిదేమీ కనిపించదు.Live and let live అనే పధ్ధతిమీదే నడుస్తోంది.

   కానీ ఇన్నేళ్ళలోనూ జరిగిన మార్పేమిటంటే, ఇదివరకటి రోజుల్లో పూనా ని “ Pensioners’ Paradise” అనే వారు, ప్రశాంతవాతావరణమూ, ఎక్కడ చూసినా సైకిళ్ళూ, చాలామంది నెత్తిమీద టోపీలూMaharashtian Topi, అలాటిది ఈరోజుల్లో ఏ అన్నా హజారే గారి నెత్తిమీద తప్ప అస్సలు టోపీలే కనబడవే ! అలాగే ఇదివరకటి పర్ణకుటీరాల స్థానంలో స్కై స్క్రేపర్లూ, రో హౌస్సులూ, గేటెడ్ కమ్యూనిటీలూ, ఫ్లైఓవర్లూ, ఒకటేమిటి అన్నినగరాల్లోనూ ఉండే అవలక్షణాలూ పూణే మహానగరాన్నీ వదిలిపెట్టలేదు. జనాభా పెరుగుదలతో ఇవి ఓ occupational hazardలాటివి.

   అలాగని మిగిలిన విషయాల్లో ఇదేమీ UTOPIAN అనడంలేదు.కానీ మిగిలిన మహానగరాలతో పోలిస్తే పూణె చాలా..చాలా.. మంచిదీ అనొచ్చు. అన్ని ఊళ్ళూ తిరిగొచ్చారా అంటే, లేదూ అనే సమాధానం. అయినా అక్కడుంటేనే కానీ తెలియదా ఏమిటీ, దినదినప్రవర్ధమానం చెందుతున్న మన చానెళ్ళూ, పేపర్లూ చాలవూ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూందో క్షణాల్లో చెప్పడానికీ…

   ఇంతలా ఉన్నాకానీ, పునర్జన్మంటూ ఉంటే ఆ భగవంతుణ్ణి కోరుకునేదేమిటంటే, ఆ పుట్టేదేదో ఈ జన్మిచ్చిన తల్లితండ్రుల కడుపునే, మళ్ళీ ఆ సుందర కోనసీమ లోనే పుట్టించమనీ..మళ్ళీ ఆ జన్మలోకూడా, ఈ “ఇంటావిడ” తోనే కలపమనీ….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఆయనెవరో కురియన్ ట, రాజ్యసభకి ఉపాద్యక్షుడిగా ఉంటున్నారు. కొద్ది సంవత్సరాలక్రితం కేరళలో ఒకామ్మాయిమీద అత్యాచారం జరిగిన సందర్భంలో, ఈయన పేరుకూడా వచ్చింది.అప్పుడేదో manage చేసేసి, తప్పించేసికున్నారు. కానీ, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత తెరమీదకొచ్చింది ఈ సంఘటన.

   ఈఊళ్ళో VIBGYOR SCHOOL అని ఓ పేద్ద పేరున్న స్కూలోటుంది, స్కూలన్నతరువాత ఓ ప్రిన్సిపాలొకరుకూడా ఉంటారుకదా. ఆవిడేమో, ఓ పదిపదిహేను రోజులనుండి స్కూలుకి రావడం లేకపోతే, పేపర్లవాళ్ళు విచారించడం మొదలెడితే తేలిందేమిటో చదవండిVIBGYOR School. ఈవిషయం మిగిలినపేపర్లవాళ్ళెవరూ ఎత్తలేదు ! This is all our so called “free press” !! దీన్నిబట్టితేలిందేమిటంటే, మన భాగ్యనగరంలో, మిగతా రాష్ట్రాలనుండి వచ్చికూడా, స్కామ్ములు మహారాజులా చేసికోవచ్చన్నమాట !

    ఆమధ్యన హర్యాణా మాజీ ముఖ్యమంత్రి గారిని అదేదో స్కాంలో అరెస్టు చేయగానే,నేను పెద్దవాడినయిపోయానూ, శిక్ష తగ్గించండీ అంటాడేకానీ, తిన్నదాన్ని గురించిమాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడడు.ఇంక ఆంధ్రదేశంలో అయితే, అరెస్టయినవాళ్ళ సంఖ్య లెఖ్ఖేలేదు.ప్రతీవాడూ చెప్పేదొక్కటే, వయస్సయిపోయిందీ, ఏదో తక్కువ శిక్ష వేయండీ అనే కానీ, వయస్సులో ఉన్నప్పుడు తిన్నదేదో కక్కుతామనిమాత్రం చెప్పరు !

    ఈమధ్యన ఆన్ లైన్ లో తెలుగుసాహిత్యం గురించి వెదుకుతూంటే ఓ రెండు అద్భుతమైన లింకులు దొరికాయి. ఇప్పటికే మీ అందరికీ తెలిస్తే వదిలేయండి, తెలియనివారు ఓసారి ఇక్కడ ఇక్కడా చూడండి. తెలుగు పుస్తకాలు వేలల్లో ఉన్నాయి.

%d bloggers like this: