బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— ” मन की बात ” అనబడే ప్రధానమంత్రి గారి “ఉవాచ”…

   ఇదివరకటి రోజుల్లో, ఇంట్లో ఉండే పెద్దవారు,వారికి జీవితంలో జరిగిన అనుభవాలను, సలహా రూపంలో తమ కుటుంబసభ్యులతో పంచుకునేవారు. అలాగే స్కూల్లో ఉపాధ్యాయులుకూడా, క్లాసు పాఠాలతో పాటు, తమతమ అనుభవాలు విద్యార్ధులతో పంచుకునేవారు. ఎంత చెప్పినా, పుస్తకాలద్వారా నేర్చుకున్నదానికంటే, అబుభవం మీద తెలిసిందే, చాలా కాలం గుర్తుంటుంది. అందుకేనోమో, చిన్నప్పుడు , పెద్దవారితో గడిపిన క్షణాలూ, వారు నేర్పిన జీవిత పాఠాలూ ఇప్పటికీ గుర్తుండిపోతాయి.
కాలక్రమేణా, కుటుంబాలూ సూక్ష్మరూపం ధరించేసి, కుంచుకుపోయాయి. ఎవరి కారణాలు వారివీ. ఈరోజుల్లో కుటుంబం అంటే, భార్యా, భర్తా, వాళ్ళకి ఓ ఇద్దరు పిల్లలూ. వారి ప్రపంచం వారిది. ఏదైనా సమస్య వచ్చినా, ఈరోజుల్లో అంతర్జాలంలో దానికి పరిష్కారం తెలిసికోడానికి, ప్రయత్నిస్తారే కానీ, పోనీ కుటుంబంలోని పెద్దవారిని అడిగితే, ఏదైనా తమ అనుభవం చెప్పి, దీనికి ఫలానా పధ్ధతిలో చేస్తే సమస్య పరిష్కారం అవుతుందేమో అని సలహా ఇచ్చినా ఇవ్వొచ్చు. కానీ, ఈరోజుల్లో ఎవరూ దీనికి సిధ్ధంగా లేరు. పోనిద్దూ, కన్సల్టేషన్ ఫీజు పడేస్తే, ఎవడైనా చెప్తాడూ అనుకుని, వేలకి వేలు తగలేస్తారే కానీ, పెద్దవారిని మాత్రం అడగరు. అయినా ఈరోజుల్లో డబ్బే లోకం కదా…leave it..
ఇంక ఈ consultants ల విషయానికొస్తే, వారు పుస్తకాలలో చదివినదో, అంతర్జాలంలో చదివినదో, సలహాగా ఇస్తారు కానీ, అనుభవంమీద ఇచ్చేది మాత్రం కాదు, ఎక్కడో నూటికీ, కోటికీ తప్ప. పైగా సలహా అంటే ఇస్తారు కానీ, సమస్య పరిష్కారం అవుతుందని గ్యారెంటీ ఉండదు. కానీ, దీనివలన, వారి వ్యాపారానికొచ్చిన నష్టంకూడా లేదు. అందుకనేనేమో దేశంలో చాలామంది, కన్సల్టెంటులు గా మారిపోతున్నారు.

    ఈమధ్యన మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు, ఓ కొత్త కార్యక్రమం మొదలెట్టారు. వారికి తీరిగ్గా కూర్చోడం అసలు ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. ఒకానొకప్పుడు, ప్రభుత్వ ప్రసార మాధ్యమాలు, ఆకాశవాణి, దూర్ దర్శన్ లే దిక్కు మనకి. కాలక్రమేణా, FM చానెళ్ళు వచ్చి, ఆకాశవాణినీ, వ్యాపార చానెళ్ళు వచ్చి, DD నీ పక్కకు పెట్టేశాయి. మనప్రధాన మంత్రిగారి “Make in India “ పరంపరలో, ఈ రెండింటికీ, మళ్ళీ ప్రాణం పోయాలనే “ సదుద్దేశ్యం” తో, “ मन की बात “ అనే కార్యక్రమం ద్వారా, నడుం కట్టారు. ఏదో, వారి ప్రభుత్వ విధానాలూ, ఉద్దేశాలూ, కార్యక్రమాలూ ప్రజలకి తెలియచేస్తే బావుంటుందికానీ, అంతకంటే మించి ఉపదేశాలూ, సలహాలూ ఇవ్వడం మొదలెడితే, ఆ విన్నవారు, మరీ confuse అయిపోతారేమో. ఏదో ప్రధానమంత్రంతటివారు, చెప్పేరూ, వినకపోతే బావుండదేమో అనుకున్నారా, కొత్త సమస్యలు తలెత్తుతాయి.

    ఉదాహరణకి, ఈ మధ్య విద్యార్ధులతో/కి ఒక కార్యక్రమం చేశారు. వారి “ మనోభావాలు “ పిల్లలతో పంచుకున్నారు. వాటి సారాంశం ఇక్కడ చదవండి.
అందులో రెండో పాయింటు… “Do not take so much tension. I have been an ordinary student. I have not scored exceptionally well in the exams I gave and have a poor handwriting also.” విన్న తరువాత, పోనిద్దూ ఆయన చేతిరాత బాగుండేది కాదుట, ఊరికే ఇంట్లో ప్రాణం తీస్తూంటారు, అనుకుంటే …
ఏడో పాయింటు “”Appear for the exams in cool manner…. Have faith in yourself…. Do not get worried about outside reasons because that shows lack of self-confidence and you fall into ‘andh vishwas’ (blind faith).” మరి పరీక్షలముందరా, రిజల్టు వచ్చిన తరువాతా, మన దేవుళ్ళ గతేమిటీ?
పదో పాయింటు ..” . “Dear parents, don’t compare your child’s performance with your neighbour’s or relative’s children, instead talk to them about their bright future, opportunities and possibilities.” ఇది తల్లితండ్రులకోసం. ఏమిటో ఈ ప్రధాన మంత్రిగారేమో ఉన్న భార్యని దూరంగా ఉంచేశారాయె. సంతానం మాటే లేదు. ఇంక పిల్లల్ని పెంచడం గురించి, ఆయనకేం తెలుసూ అని దేశంలోని ప్రతీ తల్లీ, తండ్రీ అనుకుంటే తప్పేమిటిట?
ఉపదేశాలూ, సలహాలూ ఇవ్వడంలో తప్పేమీలేదు. కానీ వాటిలో ఆచరణయోగ్యంగా ఎన్నున్నాయీ అని కూడా అలోచించాలిగా.

   ఏమో మన ప్రధాన మంత్రిగారి “मन की बात “ చదివిన తరువాత నా मंकी बात వ్రాశాను….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Facebook గందరగోళం..

   గత అయిదారు రోజులుగా, నా Facebook పేజీలో , అర్దంపర్ధంలేని, కొన్ని అశ్లీలమైన విడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఏదో, నాదారిన నేను జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల జయంతి, వర్ధంతి ఈ తరం వారికి తెలియచేయాలని, గత ఆరేడు నెలలుగా ఓ వ్యాపకం పెట్టుకున్నాను. ఒకరోజు ముందుగా, మర్నాటి ‘పోస్టు” గురించి, అంతర్జాలం లో నాకు ఓపికున్నంతవరకూ, వెదికి, వీలైనంతవరకూ, వారి ఫొటోలు కూడా సేకరించి, సరంజామా తయారుచేసికుని, రాత్రి తొమ్మిదీ, పదీ మధ్య పోస్టుచేస్తున్నాను. నచ్చినవారికి నచ్చుతోంది. దీనివలన నాకు ఒరిగేదేమిటీ అంటే, నిజం చెప్పాలంటే nothing. కానీ, ఈ వ్యాపకం మొదలెట్టినప్పటినుండీ మాత్రం “పరిచయాలు” పెరిగాయే అనుకోవాలి.దీనితో ఏమౌతోందంటే, నేను ప్రతీరోజూ పోస్టు చేస్తూన్న సమాచారం కోసం నా ఫేస్బుక్ మిత్రులు , ఆత్రంగా వేచిఉంటారూ అన్న విషయం తెలిసి నాకైతే చాలా సంతోషం వేసింది. అదో ” తుత్తి ” . అలా wait చేస్తూంటారూ, అని మీకు మీరే ఊహించేసికుంటున్నారా అని కూడా అనుకోవచ్చు. కానీ కొందరు మిత్రులనుండి వచ్చే ఫోన్లూ, ఎప్పుడైనా కలిసినప్పుడు, వారు వ్యక్తపరచిన అభిప్రాయాలూ, నా పోస్టులకు వారి స్పందనా చూస్తే నచ్చినట్టే కనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం-ఇప్పటిదాకా ఎవరూ ” చివాట్లు” వేయలేదు. దీనితో, ప్రతీరోజూ నా “కార్యక్రమం” నిరాటంకంగా జరిగిపోతోంది.

    మళ్ళీ ఇందులోనూ కొన్ని “కష్టాలు” ఉన్నాయనుకోండి– అర్ధం పర్ధం లేని కొన్ని ఫొటోల్లో , మన ప్రమేయం లేకుండా, ఎడా పెడా tag చేసేస్తూంటారు. ఏదో settings లోకి వెళ్ళి, ఆ సమస్యను పరిష్కరించొచ్చని తెలిసింది. అంతవరకూ, బాగానే ఉంది. కానీ , ఈమధ్య అశ్లీల విడియోలకి మన పేరుతో జతచేసి, స్నేహితులందరికీ పంపడం. రెండు రోజులక్రితమైతే మరీ దారుణం- ఓ డజను విడియోలు నా పేరన post అయిపోయాయి. ఏదో మర్యాదగా సంఘంలో బతుకున్న వారిని target ఎందుకు చేస్తున్నారో అర్ధం అవదు. పోనీ facebook వారిని అడుగితే, సమాధానమే రాదు.
Public domain లో ఉన్నప్పుడు, ఇలాటివి తప్పవూ అంటారు, కొందరు. నిజమే, కానీ యాజమాన్యానికి కూడా కొంత బాధ్యత ఉంటుంది కదా..

   అసలు ఈ “అంతర్జాలమే ” ఒక మాయ. అందులో, మళ్ళీ, ఈ ఫేస్బుక్కులూ, ట్విట్టర్లూ, ఓ వ్యసనం లాటివి. ఒకసారి ఇది పట్టుకుంటే వదలదు. పోనీ, వదిలేద్దామా అంటే, ఇంకో కాలక్షేపమా లేదాయె. ఏం చేయాలో అర్ధం అవడం లేదు.పోనీ ఇలాటి సమస్యలకి పరిష్కారం చెప్తారా అంటే, ఒకోరిదీ ఒకో పధ్ధతి.. రోగం వస్తే , అందరూ తలో సలహా ఇస్తూంటారు. మళ్ళీ ఇందులో ఇంకో గొడవా– మనపేరున ఎవరైనా ” అఘాయిత్యం” చేశారా అని చూసి, పోనీ timeline లోకి వెళ్ళి, అదేదో delete చేసేద్దామా అంటే, ఆ సదుపాయం కాస్తా తీసేశారు. ఆయనెవరో, ఓ సలహా ఇచ్చారు- ఇంకో సిస్టంలో లాగిన్ అయి చూడండి అని. ప్రస్తుతం చేస్తూన్న పని అదే. డెస్క్ టాప్ లో కొంతసేపూ, లాప్ టాప్ లో కొంతసేపూ, వీటితోనే సరిపోతోంది.
ఈవేళ, స్నేహితుడు రెహ్మాను ఓ సలహా ఇచ్చారు. సమస్య fb తో కాదూ, నా బ్రౌజరు ( Chrome) తోనూ అని. పరిష్కారం కూడా చెప్పారు.Google Chrome లో ఉన్న ఒక extension ను enable చేసికుని మొత్తానికి తాత్కాలికంగా, బయట పడ్డాను.

    ప్రతీసారీ, నాకు సాధ్యమైనంతవరకూ, తప్పులు లేకుండా పెట్టడానికే ప్రయత్నిస్తూంటాను. అయినా, ఒక్కొక్కప్పుడు తప్పులు వస్తూంటాయి. నా మిత్రులలో ఎవరో ఒకరు, తెలియచేసినప్పుడు, వెంటనే సరిచేసికుంటూంటాను. అయినా కొందరు “విచిత్ర ప్రాణులు”, నేను సరిచేసిన తరువాత కూడా, అదే ” ఎత్తి చూపి” ఓ ఆనందం అనుభవిస్తూంటారు. అదో మనస్థత్వం కొందరిది. భరించాలి.. కానీ అలాటప్పుడు అనిపిస్తూంటుంది- ఈ వయసులో నాకివన్నీ అవసరమా అని. అయినా ఒక వ్యక్తి కోసం , మానుకోవడం కంటే, సంతోషిస్తున్న మిగిలిన మిత్రులకోసం, ఆమాత్రం శ్రమ పడితే తప్పేమీలేదనిపిస్తుంది.

    మన చిన్నప్పుడు, స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతీ subject కీ guide లు ఉండేవి, గుర్తుందా. అలాగే నా వ్యాపకమూనూ. నేను పోస్టు చేస్తున్న సమాచారం, ఎవరికీ తెలియదని కాదు, ఒకసారి ఆ ప్రముఖుల గురించి గుర్తుచేయడమే, ముఖ్యోద్దేశం. పోనిద్దురూ ఆనాటివారు ఎలా పోతే మనకెందుకూ, అనుకుంటే అసలు గొడవే లేదు. కానీ, నూటికి తొంభైమందికి nostalgia లో ఆసక్తి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే మొదలెట్టాను.

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఏదో సరదాగా అంటే, మరీ అంత సీరియస్సుగా తీసికుంటారేమిటమ్మా…

   మన దేశ ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారు, “స్వఛ్ఛ అభియాన్ ” అని పేరుపెట్టి, దేశంలో ఉన్న so called ” ప్రముఖులందరినీ” అదేదో బ్రాండ్ ఎంబాసడర్లు చేసేశారు. దానితో, దేశంలో రాత్రికి రాత్రే బాగుపడిపోతుందనుకున్నారు. మన కి సర్టిఫికెటల మీద సంతకాలు పెడుతూంటారు, వారెవరో ” నోటరీస్ ” లాగ, ఈ బ్రాండ్ ఎంబాసడర్లు కూడా ఓ ఆదివారప్పూట, చేతిలో చీపుళ్ళు పట్టుకుని ఫొటోలూ, టివీ ల్లోనూ హడావిడి చేశారు. ఇంకేముందీ, దేశమంతా బాగుపడిపోయిందన్నారు. గాంధీ గారి కళ్ళజోడుని ఓ “లోగో” చేసేశారు. పోనీ అంతటితో ఊరుకోవచ్చా, అబ్బే మొట్టమొదట దేశరాజధాని ఢిల్లీ ని శుభ్రపరుద్దామన్నారు. అరే ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వమే లేదూ, అని గుర్తుకొచ్చి, పోనీ ఏదో సద్దుబాటు ( horse trading)) చేసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామా అని చూశారు, కానీ కుదరలేదు. చేసేదేమీ లేక ఎన్నికలు ప్రకటించారు. దేశం మొత్తం మీద నెగ్గగా లేనిది, ఢిల్లీ ఎంతా? बाए हाथ का खेल అనుకున్నారు. తీరా చూస్తే ముఖ్యమంత్రి పదవికి సరిపడేవారు లేక, మొన్న మొన్నటి దాకా బిజేపీ ని నానా మాటలూ అన్న, కిరణ్ బేడీ ని రంగంలోకి దింపారు. ఆవిడేమో, తను 40 సంవత్సరాలు చేసిన నిస్వార్ధ్ధ సేవ పణంగా పెట్టి, రంగం లోకి దిగారు.

    దేశం లోని అన్ని రాష్ట్రాలలోని బిజేపీ నాయకులూ, కేంద్ర మంత్రివర్గం, మోదీ గారూ, గత నెల రోజులుగా మీటింగులు పెట్టేసి, వాటిని అన్ని చానెళ్ళలోనూ, ప్రత్యక్షప్రసారాలు చేసేసి, ఒకటేమిటి, అన్ని రకాల హడావిళ్ళూ చేసేశారు. మోదీ గారు ఏదో సరదాగా.. మొట్టమొదట ఢిల్లీ నే దేశానికి స్వఛ్ఛభారత్ కి ప్రతీకగా ఉంచాలి” అని ఎరక్కపోయి అన్నారు. ఢిల్లీ వాసులు ” ఔను కదూ.. తుడిచేద్దాం.. ” అనేసికుని, ఆంఆద్మీ పార్టీవారి చీపురు గుర్తు మోదీగారిదే అయుంటుందీ అనుకుని, ఆ పార్టీని ఉహాతీతంగా నెగ్గించేశారు. బిజేపీ వాళ్ళేమో, చతికిలబడ్డారు. చిత్రం ఏమిటంటే, రాష్ట్రాన్ని విభజించినందుకు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, కాంగ్రెస్ ని ఎలా నామరూపాలు లేకుండా చేశారో, exactly అలాగే, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ని తుడిచిపెట్టేశారు. దేశానికి ఇదో శుభ పరిణామం.

    దేశ ఎన్నికల euphoria లో, ఓ మూడు నాలుగు రాష్ట్రాలలో, బిజేపీ వచ్చింది, కానీ ఢిల్లీ ఎన్నికల దృష్ట్యా రాబోయే ఎన్నికలలో ఇంకా ఏమేమి చూడాలో? ఇదివరకటి రోజుల్లో ఎన్నికల్లో ఏ పార్టీ అయినా మరీ ఇన్నేసి సీట్లు సంపాదించేస్తే, అధికారపార్టీ rigging చేసిందనేవారు. మరి ఇప్పుడో? నెగ్గకపోతామా అని మోదీగారి పరిపాలనకి రిఫరెండం అన్నారు. తీరా తుడిచిపెట్టుకుపోయేసరికి, అబ్బే అలాటిదేమీలేదూ, ఎక్కడదక్కడే, దేశం వేరూ, రాష్ట్రం వేరూ అన్నారు. అవేవో exit polls ని बाजारू అని స్వయంగా మోదీ గారే ఘోషించారు. ఇంక బేదీ గారైతే, ఇక్కడే ఉండడమా, లేక ఆవిడ లెక్చర్స్ ఇచ్చుకోడమా అనే ఆలోచనలో ఉన్నారు. చూద్దాం..

    ఉత్తుత్తి కబుర్లు చెప్పడమూ, హిందువులందరూ ఇంకా ఇంకా పిల్లల్ని కనాలీ, blah..blah.. లు పనికిరావూ అని తేలిపోయింది. దేశరాజధానిలో ఉంటూ కూడా, పార్టీల చెత్త చెత్త స్లోగన్స్ పట్టించుకోకుండా, ఢిల్లీ ఓటర్లు రాజకీయ పార్టీలకి ఓ చక్కని గుణపాఠం నేర్పారు. కేజ్రీవాల్ గారు ఏం చేయబోతున్నారు అన్నది చూడాలి.మోదీగారు ఏమిటేమిటో చేస్తానన్నారు, ఇక్కడ మన ” చంద్రులు” ఇద్దరూ రోజుకో ప్రకటన చేసేస్తున్నారు. చూడాలి…

   ఏదీ ఏమైనా, ఢిల్లీ ప్రజలు అసలు సరుకు చూసినతరువాతే ఓటు వేస్తారూ అన్నది తేలిపోయింది. ప్రజాస్వామ్యానికి ఇదో మరచిపోలేని రోజు….

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– “తెలుగు వికీ” లో కొన్ని avoidable mistakes.

        ఏదో అందరికీ అందుబాటులో ఉండాలన్న గొప్ప ఉద్దేశ్యంతో , వికీపీడియా వారు, అంతర్జాలం లో వివిధ భాషల్లోనూ సమాచారం అందిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, తగినంత జాగ్రత్త తీసికోవడంలేదేమో అనిపిస్తోంది. విమర్శించడం చాలా తేలిక, స్వయంగా ఏదైనా చేస్తేనే, అందులోని కష్టసుఖాలు తెలుస్తాయీ, ఊరికే బయటనుంచి మాట్టాడడం కాదూ, అని కొందరు అభిప్రాయ పడొచ్చు. అలా చేయడం తెలియకే కదా, సమాచారం అవసరమైనప్పుడు, తెలుగు వికీపీడియా చూస్తున్నది. ఒక వేదిక ఓ విషయం గురించి సమాచారం సేకరిస్తున్నప్పుడు దానిని కూలంకషంగా పరిశీలించిన తరువాతే , ప్రచురిస్తే బాగుంటుందేమో.

    వార్తా పత్రికల విషయం వేరు. ఏదైనా వార్త ప్రచురించినా, దాన్ని ఎవరో చదివి ఆ వార్తలోని నిజానిజాలు తెలియచేస్తే, అది ఆ పత్రిక యాజమాన్యానికి నచ్చితే, ఏదో ఆ మర్నాటి పత్రికలో, ఆ ముందురోజు వార్తను సవరిస్తూ ఓ ప్రకటన ఇచ్చి, చేతులు దులిపేసికుంటారు. కాకపోతే ఆ వార్త ఏ వ్యక్తికి ఆపాదించారో ఆ “ప్రముఖుడు” నన్ను out of context quote చేశారూ అంటాడు. అదీ కాకపోతే కోర్టులో “పరువు నష్టం ” దావా వేసికుంటారు. అయినా ఈ రోజుల్లో వార్తా పత్రికలని నమ్మడం ఎందుకులెండి? ఏ చానెల్ చూసినా, ఏ పత్రిక చదివినా అందులో కనిపించేవి, వారివారి “ప్రియతమ నాయకుల” గురించి, జేజే లూ, ప్రతిపక్షాల గురించి అవాకులూ, చవాకులూ.. less said the better. అయినా మనవార్తాపత్రికలు, న్యూస్వ్ చానెళ్ళ గురించీ కాదుగా ఇక్కడ ప్రస్తావిస్తూన్న విషయమూ…

    కానీ, వికీపీడియా అంతర్జాతియంగా ప్రసిధ్ధి చెందిన ఒక సంస్థ. ఇంగ్లీషు తో పాటు, ప్రపంచం లోని వందలాది భాషల్లో, వేలాది విషయాల గురించి సమాచారం లభిస్తుంది. నూటికి తొంభై పాళ్ళ వరకూ, ఇంగ్లీషు వికీ లో సమాచారం బాగానే ఉంటుంది. మనకి తెలియని ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలిసికుంటాము. చెప్పొచ్చేదేమిటంటే, వికీపీడియా అంటే ఓ గని. ఎంతైనా తవ్వుకోవచ్చు. మన knowledge అభివృధ్ధి చేసికోవచ్చు.

    నావరకూ నేను ప్రతీరోజూ వికీపీడియా ఇంగ్లీషూ, తెలుగూ refer చేస్తూంటాను. నాకు సుళువుగా అందుబాటులో ఉండే సాధనం అదేగా మరి ? ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఒకే వైద్యుడు చెప్పిందే కాకుండా, second opinion అని ఒకటికూడా తీసికుంటాము కదా, అలాగే నేను కూడా ఏదైనా విషయం తెలిసికోవాలనుకున్నప్పుడు, రెండు మూడు సైట్లు చూస్తూంటాను. ప్రతీరోజూ ఇంకో పనేమీ లేదా, ఈ వికీపీడియా చూడ్డం తప్పా అనకండి. రిటైరయిన తరువాత ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలిగా. పైగా ఎవరు చూసినా, అదేదో faceబుక్కూ, Whatsapp లలో మనం లేమనుకుంటే, అదేదో “పాపం” చేసినట్టు చూస్తూంటారు. సరే, మనమేం తక్కువ తిన్నామూ అనుకుని, గత కొన్ని నెలలుగా ఓ వ్యాపకం పెట్టుకున్నాను. ప్రతీ రోజూ, ఆ మర్నాటికి సంబంధించిన ప్రముఖ వ్యక్తుల , పుట్టినరోజులూ, జయంతులూ ఈ నాటి వారికి పరిచయం చేద్దామని, ఓ రెండు మూడు గంటలు అంతర్జాలం లో వెదికి ఆ సమాచారం ఇద్దామని. అక్కడికేదో నేనేదో ” ఘనకార్యం” చేస్తున్నానని కాదు కానీ, ఎంత చెప్పినా మన జీవితాలను ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తులను కనీసం వారి జన్మదినం రోజునో, లేక వర్ధంతి రోజునోనైనా గుర్తుచేసికుంటారని. ఇక్కడ ప్రచురిస్తూంటాను. నచ్చిన వారికి నచ్చుతున్నాయి. అదో కాలక్షేపం. కనీసం ప్రతీరోజూ చూసి..చూసి.. రేపెప్పుడో నన్నూ గుర్తుంచుకుంటారని !! దీనివలన నాకు లభించినది ఏమిటంటారా, అంతర్జాలం ధర్మమా అని ఎందరో స్నేహితులు. ఈ వయసులో ఇంతకంటే ఏం కావాలండి?

    రెండేసి రోజుల వివరాలు సేకరించే సందర్భంలో ఫిబ్రవరి 9 వ తారీకు, వివరాలు చూస్తే, అందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది.తెలుగు వికీ ఫిబ్రవరి 9.

    అందులో “మరణాలు ” శీర్షిక కింద 1975-రెండో పేరు చూడండి. లక్షణంగా, ఆరోగ్యంగా ఉన్న సుమంత్ ని మరణాల జాబితాలో వేసేశారు. మరీ ఇంత అన్యాయమా? సమాచారం ఇవ్వడమే కాదు, ఆ సమాచారం ప్రచురించే ముందర, దాని authenticity కూడా చూసుకోవడం, సంస్థ బాధ్యత అని నా అభిప్రాయం. ఇంకొక సూచన — ప్రముఖ వ్యక్తుల గురించి రాసేటప్పుడు, ” ఏకవచనం ” తో కాకుండా, మర్యాదగా ” బహువచనం” తో సంబోధిస్తే బాగుంటుందని. ఎంతైనా, వారు మనకంటే ప్రముఖులూ, పెద్దవారూనూ.. అందుకే కదా వికీపీడియాలో వారి గురించి ప్రస్తావించిందీ ?