బాతాఖాని-లక్ష్మీఫణి కబుర్లు

   ఇదివరకటి రోజుల్లో మనం ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకి వెళ్ళినా, వెళ్తూన్నా, దారి తెలియకపోతే, మధ్యలో ఎవరైనా కనిపిస్తే అడగడమో, లేదా ఎలాగోలాగ వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి, ఏ కిళ్ళీకొట్టుదగ్గర నుంచునే వాళ్ళనో, లేదా ఉత్తరాలు బట్వాడా చేసే పోస్టుమాన్నునో అడిగితే, వివరాలు తెలిసేవి.పైగా కొత్త ఊరుకి వెళ్ళీవెళ్ళగానే, ఓహో ఫలనా వారింటికా .. అని పరామర్శ కూడా చేయడమే కాక, ఆ విషయం అందరికీ చెప్పేవారుకూడానూ–ఫలానా వారింటికి చుట్టాలొచ్చారూ అని ! దానితో కొత్తవారితో పరిచయభాగ్యం కూడా జరిగేది.అలాటివన్నీ కొండెక్కేశాయి ఈ రొజుల్లో ! చేతిలో ఓ స్మార్టు ఫోనూ, అందులో అవేవో మ్యాప్పులూ, నావిగేషన్లూనూ. మనం వెళ్ళవలసిన ప్రదేశమేదో అడగ్గానే, ఓ బాణం గుర్తువేసేసి, మార్గదర్సనాలు చేసేస్తోంది. పైగా ఒక్కొక్కప్పుడు ” మాట” రూపంలోకూడా కబుర్లు చెప్పేస్తోంది. దానితో, ఎవరినో అడగాలీ అనే అవసరమే లేకుండా పోయింది. అయినా ఈ రోజుల్లో ఎవరినైనా అడిగినా తెలియదని చెప్పేసి ఊరుకుంటారు, అదృష్టం బాగోక చెప్పినా ఎంతా 3 minutes అంటారు. ఆ చెప్పినవాడి దృష్టిలో కారులో వెళ్తే అయే టైము మాత్రమే చెప్తాడు. మనం నడిచి వెళ్ళేటప్పటికి కనీసం ఓ అర్ధగంటైనా పడుతుంది. అంతకంటే ఈ నేవిగేషన్లే హాయేమో. కానీ, ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ధర్మమా అని, కొత్తవారితో మాట్టాడడాలూ, పరిచయాలూ have gone for a toss..

    ఈమధ్యన మా పుణే లో కూడా మనవైపు దొరికే కూరలు దొరకడం మొదలూ, రోజుకో కూర తెచ్చేస్తున్నాను. ఉదాహరణకి ఆనపకాయ తీసికోండి, ఇక్కడ దొరికేది పొడూగ్గా ఉంటుంది, ఓ రుచీ పచీ లేకుండగా, ఏదో ఆనపకాయ ముక్కలు పులుసులో వేసికున్నామన్న మాటే కానీ, మనవైపు దొరికే గుండ్రటి సొరకాయ లోని రుచెక్కడా? అలాగే అరటికాయలూనూ, ఇక్కడేమో అరటిపండు వెరైటీ పచ్చిగా ఉండేదే, అరటికాయ పేరుచెప్పి కూర చేసేసికుంటూంటారు. అసలు ‘బొంత’ అరటికాయలో ఉండే రుచెక్కడ తెలుస్తుందీ వీళ్ళకి? బచ్చలికూరా, గోంగూరా నెలలో ఒక్కసారైనా దొరుకుతూంటాయి. ఇలా నాకు ఎంతో ఇష్టమైన కూరలు దొరకడంతో, మా ఇంటావిడకి పాపం పనెక్కువపోతోంది. ఇదివరకటి రోజుల్లో ఎప్పుడైనా మనవైపు వెళ్తే , ఈ కూరలతోనే భోజనం. అక్కడవాళ్ళేమో, ఏదో అలవాటేమో అని క్యాబేజీలూ, కేరట్లూ, పొటాటోలతోనూ కూరలు చేసి అతిథిసత్కారం చేద్దామూ అనుకుంటారాయె, నేనేమో హాయిగా ఏ అరిటికాయో కూరచేసి, పులుసులోకి ఆ గుండ్రటి ఆనపకాయ ముక్కలు వేసి పెడితే చాలూ అంటూంటాను. వీడు జీవితంలో బాగుపడే అవకాశం మాత్రం లేదనేసి నవ్వుకునేవారు..నాదేం పోయిందీ, నోటికి హితవుగా ఉండేవేవో తినే భాగ్యం కలిగేది. కానీ, అక్కడదొరికే కూరలు ఇక్కడ కూడా దొరుకుతూండడంతో ఆనందం పట్టలేక మీతో పంచుకుంటున్నాను.Veg

..

    గోతెలుగు.కాం లో ఈవారం కూడా నా వ్యాసం వచ్చింది.

    ఈమధ్యన మేలిమిబంగారంలాటి పాత తెలుగు పత్రికలు చదువుతున్నానన్నానుగా, అందులో ఒక కార్టూను ఇలా...గ్రంధకర్తలకు...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    పాత ఆంధ్రపత్రికలు దొరకడంతో వాటిని చదివి ఆస్వాదించడంతోనే సరిపోతోంది. వాటికి సాయం ఇంకో లింకు దొరికింది. మిగిలిన వార,పక్ష, అర్ధసంవత్సర,సంవత్సర పత్రికలు అన్నిటి లింకూ.ఇన్నిన్ని మృష్టాన్నాలు ఎదురుగా పెట్టుకుని, టపాలు వ్రాద్దామంటే తీరికుండొద్దూ. గోతెలుగు.కాం వారి ధర్మమా అని, ఇప్పటిదాకా పంపిన నాలుగు వ్యాసాలు ప్రచురించారాయే, దానితో ప్రతీవారం ఒకవ్యాసం వ్రాస్తే బాగుంటుందని భావించాను. తెలుగు బ్లాగులోకంలో నా వ్రాతలు చదివి చదివి ఎలాగూ బోరుకొట్టేసుంటుంది. ఎందుకంటే ఎప్పుడుచూసినా ఒకే మూసలో(monotonous) ఉన్నట్టు అనిపించుంటాయి. ఏం చేయనూ మరీ, నాకొచ్చిన భాష ఆమాత్రమే.

    ఈ పాతపత్రికలు download చేయడం మూలాన, ప్రస్తుతం ఏమౌతోందంటే, మా ఇంటావిడ కంప్యూటరు ముందర కూర్చోడం ఎక్కువైపోయింది. ఇదివరకు ఏదో మెయిల్స్ చూసుకోడానికైనా కూర్చుంటూండేవాడిని. ఈమధ్యన ఓ కొత్త ఫోను ఒకటి కొనుక్కున్నానులెండి, దానితో పనైపోతోంది. ( మీరు అడిగినా అడక్కపోయినా, కొత్త ఫోను సంగతి మీతో చెప్పడం అన్నమాట !!). ఆమధ్యన బస్సులో వెళ్తూంటే, రష్ గా ఉండడంతో, ఇరుకులో నుంచోవలసొచ్చింది, తీరా బస్సు దిగిన తరువాత చూసుకుంటే, నా సంచీలోని కెమేరాకాస్తా, ఎవడో కొట్టేశాడు.దీనితో ఈనెల ఓ సెల్ ఫోనూ,ఓ కెమేరా కొత్తవి కొనుక్కోవాల్సొచ్చింది. ఏదో ఆదివారంనాడు, వారఫలాల్లో “వృశ్చిక రాశి వారికి ఈ వారంలో నూతన వస్తువులు లభిస్తాయీ” అంటే, ఎవరైనా ఇస్తారేమో అనుకున్నా కానీ, మరీ ఇలా నాకునేనే కొనుక్కుంటాననుకోలేదు ఏం చేస్తాం, ఇదివరకటిరోజుల్లో అయితే నానా హడావిడీ చేసేసేవాళ్ళం ! కానీ ఈమధ్యన బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాల్లో చెప్పినట్టు– ” ఆ భగవంతుడు నాకు ఓ వస్తువు ఇచ్చాడు,ఇచ్చినందుకు సంతోషించాలి, అలాగే, నా ముచ్చట తీరినతరువాత, అదే భగవంతుడు, ఆ వస్తువుని ఇంకోడిని సంతోషపెట్టడానికి తిరిగి తీసేసికున్నాడు..”– ఏమో నాకైతే ఈ concept నచ్చింది.అలాగని ప్రతీ వస్తువూ పోగొట్టుకోమని కాదూ, దురదృష్టవశాత్తూ ఎప్పుడైనా ఏ విలువైన వస్తువైనా పోగొట్టుకున్నా, మరీ ఇల్లూ వాకిలీ ఏకంచేసేసి, ఏడుపులూ, రాగాలూ పెట్టేయఖ్ఖర్లేకుండగా ఇలా సద్దిచెప్పేసుకుంటే బాధ కొద్దిగా dilute అవుతుందేమో !! ఇలాటివన్నీ మనమధ్యలోనే ఉండాలనుకుంటాను, పిల్లల ( అంటే స్కూలుకీ, కాలేజీకీ వెళ్ళేవారు) ఎదురుగా ఇలాటివి చెప్తే ఒక్కొక్కప్పుడు boomerang అయినా అవొచ్చు. ఏదైనా పోగొట్టుకున్నా, వాళ్ళు ఏం ఫరవాలేదూ, మన నాన్న ఫిలాసఫీ మనకు తెలుసుగా, ఏమీ బాధపడరులే, పైగా మనమీద కాకుండగా, దేవుడిమీద పెట్టేసినా పెట్టేయొచ్చు అని వాళ్ళు భావించినా ఆశ్చర్యపడఖ్ఖర్లేదు ! ఎందుకంటే ఈ కాలాప్పిల్లలు ఆవలిస్తే పేగులు లెఖ్ఖెట్టేస్తారు ! అందుచేత నేను చెప్పిన ఫిలాసఫీ కడుపులోనే దాచుకోండి...

    మా ఇంటావిడ ప్రతీనెలా వాళ్ళ ఫ్రెండ్సందరూ కలుస్తారని చెప్పేనుగా. ఏదో నెలకింతా అని వేసికుని, ప్రతీనెలా ఓ చిట్ తీసి డబ్బులు ఏకమొత్తంగా ఎవరోఒకరికి పంచుకుంటూంటారు. పోనీ ఈ విధంగానైనా కొద్దిగా డబ్బులు సేవ్ అవుతున్నాయిలే, అనుకుని క్రిందటి పదిపదిహేను సంవత్సరాలుగా ప్రతీనెలా కొంతమొత్తం exclusively దీనికోసంతీసికుంటూంది. ఏదో ఇన్నాళ్ళూ ఎలాగోలా కానిచ్చేశాము. కానీ ఇప్పుడు ఎక్కడచూసినా “నగదు బదిలీ” పథకాలుకదా. రొక్కంగా పుచ్చుకోడం బాగోలేదట ! మీరు ఇచ్చేదేదో నా ఎకౌంటుకి ‘బదిలీ’ చేసేస్తూండండి. నేను నెట్ లో మీరు బదిలీ చేసేరో, ఎగ్గొట్టేరో చూసుకుంటాను, అని ఓ ప్రకటన చేసేసింది. మరి నెట్ బ్యాంకింగోటుండొద్దూ, దానికోసం ఈవేళ బ్యాంకుకి వెళ్ళి ఆ పనేదో పూర్తిచేసికున్నాం. ఏమిటో రోజులు మారిపోయాయండి, పెద్దవాళ్ళు చెప్పింది, verify చేసికుంటేనే కానీ నమ్మడంలేదు.ఏం చేస్తాం కాలంతో పాటు మనమూ మారాలి…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– L…o…n..g… Drive…

    ఇదివరకటి రోజుల్లో బస్సులు పట్టుకుని, రేవు దాటి రాజమండ్రియో, కాకినాడో దూరం ఓ వందకిలోమీటర్లకి తక్కువే అయినా, అయిదారు గంటలు పట్టేది. తెల్లవారుఝామున బయలుదేరి, గమ్యం చేరేటప్పటికి నిస్త్రాణ వచ్చేసేది. బహుశా ఆ ఇరుకిరుకు బస్సుల్లో ప్రయాణం చేయడం మూలానేమో. అదే ఓ పేద్ద long drive అనుకునేవాళ్ళం. వందకీలోమీటర్లూ ఓ దూరమేనా అని ఈ రోజుల్లో అనిపిస్తోంది. వారాంతం వచ్చిందంటే చాలు, ఈ కాలప్పిల్లలకి ఓ రెండు మూడు వందల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేస్తేనే కానీ, long drive చేసినట్టనిపించదుట ! పైగా వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఆ వర్షంలో వెళ్ళడమే జీవితపరమావధి అనుకుంటూంటారు. ఏమిటో ఎవరి సరదా వాళ్ళకానందం. ఆ వర్షంలో కారులో వెళ్తూన్నంతసేపూ, నాకైతే ప్రాణాలు గుప్పెట్లోనే ఉంటాయి. హాయిగా ఇంట్లో కూచోక, ఎందుకొచ్చిన ప్రయాణాలూ ఇవీ అనిపిస్తుంది. బహుశా అది వయస్సుతో వచ్చిన భయం కావొచ్చు.దానితో మా పిల్లలు ఇలా వారాంతాల్లో వెళ్ళే ఈ లాం…..గు….డ్రైవులకి నేను సాధ్యమైనంతవరకూ వెళ్ళను. దానికి సాయం, అంతంతసేపు కాళ్ళు కదలకుండగా కూర్చోడం కూడా ఒక సమస్య. అన్నిటికీ తోడు నాకు అంత aesthetic sense కూడా తక్కువే. ఈ ప్రకృతులూ, గొడవల్లో నాకేమీ చిత్రవిచిత్రాలు కనిపించవు. చెప్పేనుగా ఎవరి పిచ్చి వాళ్ళకానందం, బయటకు వెళ్ళకపోవడం నాకున్న పిచ్చి ! బయటకు వెళ్ళాలనుకోడం పిల్లలకి సరదా. అలాగని నేనేమీ spoil sport అవడానికీ ఇష్టపడను. మా ఇంటావిడకి ఈ ప్రకృతులూ, అందాలూ, ఆస్వాదించడాలూ అంటే చెవి కోసుకుంటుంది. మా పిల్లలకీ తెలుసు, అందుచేత ఇలాటివాటికెప్పుడైనా వెళ్ళేమాటైతే తనకే ఫోనుచేస్తూంటారు.ఇదండి కథ..

    మొన్న శనివారంనాడు, అబ్బాయి ఫోనుచేశాడు as usual వాళ్ళమ్మకే, “భీమాశంకర్” వైపు వెళ్తున్నామూ, వస్తారా అని. భీమాశంకర్ అనగానే, ” మీ నాన్నగారు కూడా వస్తారేమో అడుగుతానూ..” అని ఆ ఫోను కాస్తా నాచేతిలో పెట్టేసింది. మళ్ళీ నాన్నగారితో లేనిపోని commitment ఎందుకూ అనుకున్నాడేమో, అటువైపు వెళ్తున్నామూ, దైవ దర్శనం వీలునిబట్టి చేసుకోవచ్చూ, రద్దీ అదీ ఉంటే వీలుకావకబోవచ్చూ అని. పోనిద్దూ, ఏదైతేనెం, ద్వాదశజ్యోతిర్లింగం గా ప్రసిధ్ధికెక్కిన భీమాశంకర్ దేవాలయపు గాలి తగిలినా చాలూ అనేసికుని నేనూ వస్తానూ అన్నాను.చెప్పేనుగా, బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాలు విని, విని ఆయన చెప్పినట్టు శిఖరదర్శనం కూడా పుణ్యంలోకే వస్తుందీ అనుకుని, పైగా రోజంతా పిల్లలతో రోజంతా గడపొచ్చూ అని ఓ bonus ఒకటాయె. బయలుదేరాను.

    ప్రొద్దుటే తొమ్మిదింటికి బయలుదేరాము. 200 కిలోమీటర్లలోపే. మహా అయితే నాలుగైదుగంటలు. ఈ లాంగు డ్రైవులంటే ఊరికే ఏదో పేద్ద పనున్నట్టు వెళ్తే మజా ఉండదనుకుంటాను. దారంతా కొండలూ, లోయలూనూ. పైగా వర్షాకాలమొకటీ, మా పిల్లలందరూ జలపుష్పాల్లాటివారూ, ఎక్కడ నీళ్ళు కనబడితే అక్కడే ఆగిపోవడం, ఆ నీళ్ళల్లో ఓసారి ఆడుకోడం, రోడ్డువారనే కొండల్లోంచి చిన్నచిన్న జలపాతాలూ, వాటిని చూసినప్పుడల్లా వావ్..వావ్.. అరుపులూ, కేకలూ ఎక్కడో మధ్యలో ఒకచోట ఆగి అందరూ బయటకెళ్ళారు. నేను మాత్రం కారులోనే ఉండిపోయాను, అంత ఓపిక లేక. చేతిలో అప్పుడెప్పుడో మా అమ్మాయీ, అల్లుడూ ఇచ్చిన Tab ఒకటోటుందిగా, దానితో ఫొటోలు తీద్దామూ అనుకుని కారు బయటకు వచ్చి నిలబడి, టక..టకా నొక్కేసుకుంటూ ఫొటోలు తీయడం మొదలెట్టాను. బయట అంత వెలుగుండడంతో ఆ Tab లో కెమేరా అంటే తెరుచుకుందికానీ, ఫోకసింగూ గట్రా కుదరలేదు.ఓ పదిపదిహేనుదాకా నొక్కేను.

    కారులోకి వెళ్ళి, అన్ని ఫొటోలు తీశానే మన ఘనకార్యం చూసుకోవద్దూ, అనుకుని తీరా ఆ Gallery లోకి వెళ్ళి చూస్తే ఏముందీ, నామొహం !! జరిగిందేమిటయ్యా అంటే, ఆ Tab లో Back బదులుగా Front కెమేరాలో పెట్టి తీసేశానన్నమాట. ఇలా ఉంటాయి తెలివితేటలు ! తెలియకపోతే నోరుమూసుక్కూర్చోవచ్చుగా, అబ్బే ఫొటోలైనా తీసి నా ప్రకృతిసౌందర్య అభిమానాన్ని చాటుకుందామనుకుంటే నా నిర్వాకం ఇలా తగలడింది. వాటిని చూస్తే మా మనవడు అగస్థ్య కూడా వేళాకోళం చేసేస్తాడు… ఆ ఫొటోలన్నీ delete చేసి, మచ్చుకి ఒకటిమాత్రం ఉంచి, పిల్లలకి కూడా తెలియొద్దూ మరీ, పైగా వాళ్ళకీ ప్రయాణమంతా నవ్వుకోడానికి ఓ కాలక్షేపం కూడానూ… మీరుమాత్రం ఏం తక్కువా? మీరూ నవ్వుకోండి…bhimasankar 002

   నా నిర్వాకం అంతా విని వాళ్ళంతా ఆకలికూడా మర్చిపోయి నవ్వుకోవడమే. “ఎందుకొచ్చిన హైరాణా మీకూ ..” అని మా ఇంటావిడ తీసిన ఫొటోలు …1_photo0098bhimasankar 003IMG_20130713_155125

    దారిపొడుగునా విపరీతమైన వర్షం, visibility అన్నదే లేదు, పైగా మేఘాల్లో ప్రయాణం, ఎదురుగుండా కారులోవాడు వేసే tail lamps ధర్మమా అని, మొత్తానికి ఏ హడావిడీ లేకుండగా భీమాశంకర్ చేరేటప్పటికి రెండయింది. విపరీతమైన రద్దీ, దర్శనం కోసం. ముందర అనుకున్నదే కదా, శిఖరదర్శనమే దక్కింది.తిరిగి బయలుదేరి సాయంత్రానికి పూణె చేరాము. ఇదండీ మా weekend l…o…n…g… drive కథా కమామీషూనూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఈమధ్యన పేపర్లు చదువుతూంటే మహ ఆసక్తికరంగా ఉంటున్నాయిలెండి. ఈవేళ్టికీవేళ, ఆయనెవరో గుజరాత్ హైకోర్టు CJ ట శ్రీ భాస్కర్ భట్టాచార్య, ఓ బాంబు పేల్చేశారు.. ఈమధ్యన గుజరాత్ లో ఎవరికివారే జాతీయ స్థాయిలో పేరుతెచ్చేసికుంటున్నారు, మొన్నెప్పుడో శ్రీ మోడీ, ఇదిగో ఈవేళ ఈయనా. కథేమిటిటా అంటే, ఈమధ్యన సుప్రీంకోర్టుకి ప్రమోషన్ విషయంలో, ప్రస్తుత ముఖ్య న్యాయాధీషుడు శ్రీ కబీర్ గారు, ఈయన పేరు కొట్టేశారుట. అయినా ఇవేమైనా కొత్తా ఏమిటీ, ప్రభుత్వాలు చేసే ప్రతీ పదోన్నతిలోనూ ఏదో ఒక అవతవక జరుగుతూంటూనే ఉంటుంది.జరక్కపోతే విశేషం కానీ, జరిగితే పేద్ద గొప్పేమిటీ? ఆ గొడవ పక్కకుపెట్టండి, ఈయన చెప్పిన కారణాలు మాత్రం బలే ఆసక్తికరంగా ఉన్నాయి.కబీర్ గారి చెల్లెలు శ్రీమతి సుక్లా కబీర్ సిన్హా గారి ప్రమోషన్( గుజరాత్ హై కోర్టుకి) విషయంలో ఈ భట్టాచార్యగారు పుల్ల అడ్డుపెట్టేరట. ఆయన ఊరికే అడ్డుపెట్టలేదు, కారణాలు స్పష్టంగా చెప్పేరుట ఆనాడే–
1. ఈవిడ B.A. పాసవడానికి నాలుగేళ్ళూ, M.A. పాసవడానికి అయిదేళ్ళూ తీసికున్నారుట. ఇవేమైనా రిసెర్చ్ కోర్సులా ఏమిటీ అన్నేళ్ళు చదవడానికి?
2. ఈవిడ సంవత్సరాదాయం 88,000 ట. ఇంత తక్కువ ఆదాయం వచ్చే అడ్వకేట్లని హైకోర్టు జడ్జీలకింద ప్రమోషన్ ఇవ్వమంటే మరి తిక్క రేగదూ? అరే కోర్టులో పనిచేసే చప్రాసీకే 1,56,000 రూపాయలొస్తూంటే (ఇవి నా మాటలు కాదు బాబోయ్.. శ్రీ భాస్కర్ గారివి !),ఈమాత్రం ఆదాయం వచ్చేవారిని హైకోర్టు జడ్జీకింద ఎలా చేస్తామూ అనేది ఈయన వాదన. ఏదో ఆయన అభిప్రాయం ఏదో ఆయన చెప్పి ఊరుకున్నారు, కానీ ఉపయోగం ఏమైనా ఉందా, అప్పటి CJ, ఈయన వాదాన్ని కొట్టిపారేసి, ఆవిడని గుజరాత్ హైకోర్టు జడ్జీగా చేసేశారు. ఆమాత్రం ఉపకారం చేస్తే కృతజ్ఞత అనేది ఉండాలా అఖ్ఖర్లేదా, ఇప్పుడేమో, మన భాస్కర్ గారి పేరు తప్పించేసి, అప్పుడెప్పుడో తన చెల్లెల్ని ఉధ్ధరించినాయనని సుప్రీంకోర్టుకి జడ్జీగా ప్రమోషన్ ఇచ్చేరుట. అలా ఉండాలి న్యాయస్థానాలూ, న్యాయాధిపతులూనూ… మేరా భారత్ మహాన్… వివరాలు ఇక్కడ చదవండి.శ్రీ భాస్కర్ భట్టాచార్య గారు ఈ విషయంలో చాలా strong పదజాలమే ఉపయోగించారు. వివరాలు నేను వ్రాయడంకంటే, ఆ పేపరులోనే చదవండి.

    మామూలుగా మన ఇళ్ళల్లో ఫోన్లుంటాయికదా, ఎవరెవరు ఎక్కడెక్కడికి ఫోన్లుచేశారో వివరాలుకూడా ఇస్తూంటారుకదా, మరి కేరళ ముఖ్యమంత్రిగారూ, మాజీ రైల్వే మంత్రిగారూ, అసలు ఏమౌతోందో తెలియదూ అంటారేమిటో.. అంతా జగన్మాయ !

    ఈమధ్య సుప్రీంకోర్టు వారిచ్చిన జడ్జిమెంటు ధర్మమా అని, పాపం ఎంతమంది పొట్టలమీద దెబ్బో కదూ? ఇన్నాళ్ళూ జైళ్ళలో ఉండికూడా, ఎన్నికల్లో పోటీచేసిన వారి గతేమిటో పాపం ! My heart goes out for them.. ఏమిటో ఈ సుప్రీంకోర్టోటి మధ్యన. ఏదో జనాల్ని వెర్రివెధవలు చేసి ఆడిస్తున్నారుకదా, మళ్ళీ వాళ్ళ నోళ్ళలో మట్టికొట్టడం ఎందుకో ? ఏమిటో కానీ, మన రాజకీయనాయకులని ఇరుకులో పెట్టేశారు. చూద్దాం, అదేదో RTI విషయంలోలాగానే, రాజకీయనాయకులు above court cases అని ఓ చట్టం పాస్ చేసినా చేయొచ్చు, ఈలోపులో ఓ ordinance ఇచ్చేస్తే, ఏ పార్టీవాడూ నోరెత్తడు !అందరికీ ఉపయోగకరమేగా!!

    ఇదివరకటంత రెగ్యులర్ గా టపాలు పెట్టడానికి సావకాశం ఉండడంలేదు. దానికి ముఖ్యకారణం కూడా నేనే అనుకోండి. ఆమధ్యన అందరికీ ఉపయోగపడతాయని కొన్ని లింకులు ఇచ్చాను గుర్తుందా, ఆ లింకులేమిటో నేనూ చూద్దామని చూస్తే కొన్ని అద్భుతమైన ఆణిముత్యాలు– పుస్తకాల రూపంలోనూ, 1913 నుండీ వచ్చిన ఆంధ్రసచిత్రవారపత్రిక ఉగాది సంచికలరూపంలోనూ, అలాగే యువ, భారతి మాసపత్రికలరూపంలోనూ– దొరికేయి. ఊరుకోవచ్చా, వాటిని download చేసి మా ఇంటావిడకి చెప్పాను. అంతే, ఆ డెస్క్ టాప్ వదలదే. ఏదో చదవడం, ఆ చదివిందేదో నాతో చెప్పడం, అరే అద్భుతంగా ఉందే అని నేనూ చదవడం. మా మిగిలిన జీవితకాలం సరిపోదు వాటన్నిటినీ పూర్తిగా చదవడానికి, అయినా సరే, ఆనాటి సామాజిక పరిస్థితులూ, వాతావరణం అ..బ్బ..బ్బ..బ్బ చదవాలండీ. ఇప్పటిదాకా చదవకపోతే ఇప్పుడైనా మొదలెట్టండి. బ్లాగులవైపూ, టీవీల వైపూ చూడరంటే చూడరు.

బైదవే ఈ వారం గోతెలుగులో నావ్యాసం ఎపార్టు(మెంటాలిటీ) ప్రచురించారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓ తీయని బాధ…

   ఎప్పుడో రెండున్నరేళ్ళక్రితం అమ్మమ్మలూ నాన్నమ్మలూ అని ఓ టపా పెట్టాను. అప్పుడైతే మా అనుభవాలు వ్రాశాననుకోండి, ఇప్పుడు తాజాగా ఇంకో ఇద్దరు కొత్త తాతలని చూసేటప్పటికి మళ్ళీ ఓ టపా పెడదామనిపించింది. అయినా ఈ అమ్మమ్మల్నీ, నానమ్మల్నీ ఎన్నిసార్లు గుర్తుచేసికుంటే సరిపోతుందీ? వాళ్ళ ఋణం ఎప్పుడూ తీర్చుకోలేము. ఆమధ్యన మా స్నేహితుల ఇంటికి వెళ్ళాము. వారికీ మధ్యన ఓ మనవడు వచ్చాడు. ప్రస్తుతం తనకి ఎనిమిది నెలలు.వాళ్ళ అమ్మా, నాన్నా ఆఫీసులకి వెళ్ళిపోతూ ఆ బాబుని వీళ్ళదగ్గర వదిలేసి వెళ్తూంటారు. వీళ్ళ పనల్లా సాయంత్రందాకా ఆ బాబుని చూడడం.ప్రపంచంలో ఎవరినైనా చూడొచ్చుకానీ, ఈ ఏడాది నిండకుండా ఉండే పిల్లలని చూడ్డం మాత్రం ఓ బ్రహ్మవిద్యే. పాపం అమ్మమ్మలో, నానమ్మలో చూసుకుంటూంటారు, తాతయ్యల పనల్లా, ఆ నానమ్మో, అమ్మమ్మో ఓసారి నడుంవాల్చినప్పుడు, వీడిమీద దృష్టిపెట్టడం.ఏదో పడుక్కున్నాడుకదా అని ఆవిడేమో నడుంవాలుస్తుంది, ఈ తాతయ్యగారు కూడా, “దానికేముందిలేవోయ్, కొద్దిగా రెస్టు తీసికో, నీ ఆరోగ్యంకూడా చూసుకోవద్దూ, నేను చూస్తాలే…” అని ఆశ్వాసన్ ఇచ్చేస్తాడు, వాడు ఎలాగూ నిద్రపోతున్నాడుకదా అని. పాపం ఆ పెద్దావిడ ఆరోగ్యం ఈయనే చూసుకోవాలిగా. అదేం మాయోకానీ, సరీగ్గా అప్పుడే నిద్రలేస్తాడు ఆ బాబు. ఏదో బజారుకెళ్ళి సరుకులు తెమ్మంటే తేగలడుకానీ, పిల్లలని ఊరుకోబెట్టడం ఎక్కడొచ్చూ ఈయనగారికి? తన పిల్లల్ని పెంచలేదా అని అడక్కండి, ఆరోజులు వేరు, ఆ energy levels వేరు. అయినా ఈ తాతలు చేసిన ఘనకార్యమేముందీ, ఆఫీసు పేరుచెప్పి ప్రొద్దుటినుండి, సాయంత్రందాకా ఆఫీసేగా. రోజంతా ఆ పిల్లల్నిచూసింది ఎవరమ్మా? ఈ నానమ్మ/అమ్మమ్మ ఆనాటి అమ్మ రోల్ లో.

ఎవరైనా ఈమధ్యన మా ఇంటికే రావడంలేదేమిటండీ అని అనడం తరవాయి, ఏమిటో తనే ఆ చిన్నపిల్లాడితో హైరాణ పడిపోతున్నట్టుగా ” మనవణ్ణి చూసుకోడంతోటే సరిపోతోందండీ.” అంటాడుకానీ, నిజం మాత్రం ఛస్తే చెప్పడు. అసలు శ్రమ పడిపోతున్న ఆ ఇల్లాలు ఒక్కమాటనదు, ఎందుకంటే, ఎంత శ్రమపడుతూన్నా, ఎవరికోసం, తను నవమాసాలూ కని పెంచిన తన ప్రతిరూపానికి ప్రతిరూపాన్నే కదా రోజంతాచూస్తూన్నదీ. ఇదికూడా ఓ శ్రమేనా అనుకుంటుంది.

ఈ కబుర్లన్నీ ఎప్పుడూ? తమతోటి అమ్మమ్మ/నానమ్మ/తాతయ్యలు వచ్చినప్పుడు. పుట్టింటారి కబుర్లు మేనమామ దగ్గరా అన్నట్టు, ఆ తాతగారు చెప్పేకబుర్లు ఎవరికి తెలియవు?ఎందుకంటే ఈ వచ్చిన తాతకూడా అలాటి కబుర్లు చెప్పినవాడేకదా. అయినా అదో సరదా, వాళ్ళు చెప్పకా మానరూ, వీళ్ళు వినకా మానరూ. ఇలాటి విషయాలు మరీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాట్టాడుకోలేరుగా. అవడం కనిపించడానికి చిన్నపనే అయినా, అందులో ఖర్చయ్యే man hours అలా చేసినవారికే తెలుస్తుంది. ఆ చిన్నపిల్లాడికి స్నానం పానం చేయించడానికి ఓ పనిమనిషుంటుందిలెండి, ఒక్కో కుటుంబంలో అయితే, వారి ఆర్ధిక స్థోమతను బట్టి, ఆడించడానిక్కూడా ఓ మనిషిని పెడతారు. కానీ మనుష్యులుంటే సరిపోతుందా? ప్రస్థుతం, ఒకే పనిమనిషున్న కేసు తీసికుందాం. ఆ స్నానమేదో చేయించి వెళ్ళిపోతుంది.పైన చెప్పినట్టుగా పిల్లాడూ, నిద్రా, నడుంవాల్చడాలూ లాటివుంటాయిగా, ఈ తాతగారికేమో రోజులో ఒక్కమారైనా బయటకి వెళ్ళకపోతే తోచదు. ఏదో వంకపెట్టి బయటకెళ్ళిపోయాడంటే, ఇల్లూ వళ్ళూ గుర్తుండవు. ఈ సంగతి పెద్దావిడకీ తెలుసు, ఎందుకు తెలియదూనలభైఏళ్ళ కాపరం !

ఈ తాతగారికేమో బయటకి వెళ్ళడానికే కుదరదు, దానితో ఆయనకి ఎక్కడలేని చిరాకూ వచ్చేస్తుంది.ప్రతీదానికీ విసుక్కోడం మొదలెడతాడు. అదే ఆ పెద్దావిడ, ఈ విషయం గుర్తించి ఓ గంట బయటకెళ్ళరాదూ అని ఎరక్కపోయి అందా, టింగురంగా అంటూ స్కూటరో, కారో వేసికుని పారిపోతాడు. అదే ఈ అమ్మమ్మ/నానమ్మల్లో ఉన్న గొప్పతనం. బ్రహ్మశ్రీ చాగంటి వారు తన ప్రవచనంలో చెప్పినట్టు, ఓ తల్లికి పదిమంది పిల్లలున్నా, పదకొండో బిడ్డ తన భర్తేట!
ఒకానొక స్టేజ్ లో భర్తనికూడా ఓ కొడుగ్గా చూసుకుంటుందిట!

సాధారణంగా రెండువైపులా grand parents ఉండడం లోకకల్యాణార్ధం చాలా మంచిది. ఆ పసిపిల్లాడికి మాటలొచ్చేదాకా, ఈ పెద్ద జంటలు వంతులు వేసికుని చూస్తూండాలి. ఇందులో కూడా అమ్మమ్మలు, నానమ్మలే ముఖ్యం. ఈ తాతలు buy one get one లోకే వస్తారు. వారివలన అంతగా materialstic ఉపయోగాలుండవు. ఎలాగూ ఒక్కడూ ఉండి ఏం చేసికుంటాడులే పాపం అని, ఆ పెద్దావిడే ఈయన్నికూడా తీసుకొచ్చేస్తూంటుంది.

ఇన్ని ” బాధలు” ఉన్నా అవన్నీ తీపి బాధలు గానే భావిస్తారు కానీ, ఏదో కష్టపడిపోతున్నామనిమాత్రం ఎప్పుడూ అనుకోరు.

హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావుగారి ప్రసంగాలు “మన తెలుగు” చదివే ఉంటారు, ఇప్పటిదాకా చదవకపోతే మాత్రం ఒక్కసారి చదివేయండి.మనతెలుగు

ఈవారం కూడా గోతెలుగు.కాం లో నా వ్యాసం త్రిశంకు స్వర్గం ప్రచురించారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ప్రతీదీ విమర్శించేయడమే…

    ప్రపంచంలో అన్నిటికంటే సులువైన పని ఇంకోరిని విమర్శించడం. మీ అందరిగురించీ అంటున్నాననుకోకండి. నా విషయమే చెప్తోంట. ఒక్కటీ చేతకాదు, అయినా సరే ప్రతీ దాన్నీ విమర్శించడమే.ప్రతీదానిమీదా అడిగినవాడికీ, అడగనివాడికీ అభిప్రాయం చెప్పేసేయడమే.పైగా ఏమైనా అంటే, వాక్ స్వాతంత్రం అనోటి. వాక్ స్వాతంత్రం ఉండాలి, కాదనం, కానీ దానికి లిమిట్ ఏమిటీ అన్నది కూడా ఆలోచించాలి అని, ఈసారి భాగ్యనగరంలో శ్రీ వంశీ గారు దర్శకత్వం వహిస్తూన్న సినిమా షూటింగు చూసి అర్ధం చేసికున్నాను. ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

    చెప్పేనుగా శ్రీవంశీ గారు మమ్మల్ని షూటింగు చేస్తున్న లొకేషన్ కే వచ్చేయమన్నారు.సరే అని తొమ్మిదిన్నరకల్లా చేరిపోయాము.అప్పటికే, అవేవో కెమేరాలూ అవీ పెట్టుకుని ఓ ఇంటికప్పుమీద ఇద్దరు ఆ ఎండలో వెయిట్ చేస్తున్నారు, షూటింగు ఎప్పుడు మొదలెడదామా అని.ఆరోజు పాల్గొనే ముగ్గురు అప్పటికే వేషధారణ చేసి, నీడలో కూర్చున్నారు.వీళ్ళంతా ఆ సినిమాలో నటించే హీరో కోసం వెయిట్ చేస్తున్నారు.వీళ్ళ హడావిడిలో వీళ్ళందరూ ఉండగా, శ్రీ వంశీ గారూ, ఎక్కడైతే షూటింగు జరుగుతోందో ఆ ఫార్మ్ హౌస్ యజమానురాలు గారూ, నేనూ, నా స్నేహితుడూ ఓ చెట్టుకింద సెటిలయ్యాము. పరిచయకార్యక్రమాలు పూర్తిచేసికుని, కబుర్లలోకి దిగేము. అంత ప్రఖ్యాత వ్యక్తి ని ప్రత్యక్షంగా చూసేసరికే, నా కడుపునిండిపోయింది, ఇంక కబుర్లెక్కడా?

    చివరకి వాతావరణం తేలికచేయడానికి శ్రీవంశీ గారే మొదలెట్టారు కబుర్లు, నా వివరాలూ, అసలు ఆయన్ని చూడాలని ఎందుకనుకున్నానో వగైరా..ఆయన సినిమాలకంటే, ఆయన వ్రాసిన పుస్తకాలు నాకు చాలా ఇష్టం. అదేమాటన్నాను ఆయనతో.అలాగని ఆయన సినిమాలు నచ్చవని కాదు.ఆ కబురూ, ఈకబురూ చెప్పుకుంటూ, శ్రీవంశీగారు మధ్యమధ్యలో హీరో రాక గురించి అడుగుతూ, మాకు నా కెమేరాలో ఫొటోలు తీయడానికి వారి స్టిల్ ఫొటోగ్రాఫర్ ని పిలవడమూ, ఆరారగా కాఫీ, కొబ్బరి నీళ్ళూ లాటివి ఆరగిస్తూంటే మొత్తానికి ఆ హీరో వచ్చారండి.

    అప్పటిదాకా మాతో బాతాఖానీ చెప్తూన్నటువంటి శ్రీ వంశీ గారు ఏక్ దం “రచయిత” లోంచి “దర్శకుడి” గా మారిపోయారు.ఇంక చూసుకోండి.. టేక్కులూ, కట్లూ..
ఎవరో ఫ్రేమ్ లోకి వస్తున్నారని అరుపులూ, కేకలూ .. ఫలానా పధ్ధతిలో రావాలని ఈయన చెప్పడమూ, ఓహ్.. ఓ జీప్పు రావడం షూట్ చేయడానికి మూడుసార్లు షూట్ చేయడం. ఏదో మొత్తానికి ఆ సీన్ పూర్తిచేసేయగానే, మిగిలిన టెక్నీషియన్లుఅందరూ బిచాణా ఎత్తేసి, అంటే కెమేరాలూ, ఎండపడ్డానికి రిఫ్లెక్టర్లూ, ఎండ మరీ ఎక్కువగా పడకుండా ఉండడానికి గొడుగులూ,వీటన్నిటినీ తీసికెళ్ళడానికి మనుష్యులూ, వీటన్నిటికీ సాయం, ఓ టీవీ మోనిటరోటీ. ఇదివరకటిరోజుల్లోలా కాకుండగా, దర్శకుడు విడిగా కూర్చుని, అక్కడ జరిగే షూటింగు–ఫ్రేమ్ సరీగ్గా ఉందా లేదా, డయలాగ్గు ఈయనకి కావలిసినట్టు “యాస” తో సహా ఉఛ్ఛరిస్తున్నారా లేదా, ముఖకవళికలు సరీగ్గా ఉన్నాయా లేదా చూసుకోడం, అన్నీ సరీగ్గా ఉంటే యాక్షన్.. కెమేరా..రోల్ ..అనడం.. మళ్ళీ ఆ ఉన్న ఇద్దరో,ముగ్గురో నటుల్లో ఎవరో ఒకరిది ఈయననుకున్నట్టుగా రాకపోవడం, ఇక్కణ్ణుంచి ఈయనేమో కట్..కట్..కట్.. అనడం.మళ్ళీ ఈయన అదేదో సరీగ్గాలేదూ, ఇదేదో సరీగ్గాలేదూ అని కరెక్టు చేయడం.. తను కావాలనుకున్నexpression వచ్చేదాకా టేక్కులూ, ..కట్లూ.. తోనే సరిపోయింది. మొత్తానికి అవి వచ్చేక ఫైనల్ చేయడం.

   ఓరినాయనో ఇంత హడావిడా మనం తెరమీద ఓ నిముషం వినే సంభాషణ వెనక్కాల జరిగే తతంగమా అనిపిస్తుంది. ఆ ఎండలో ప్రొద్దుటినుంచీ నుంచుని దర్శకుడి అంచనాప్రకారం చేయాలంటే ఎంత శ్రమ పడాలండి బాబూ? మేము చూసిన షూటింగులో ఇద్దరో ముగ్గురో, అదే ఏ నృత్యం అయినా షూట్ చేయడానికి, జూనియర్ కళాకారులూ వగైరాలందరూ ఉండాలి, వాళ్ళందరి హావభావాలూ synchronise అవాలి, ఎంత హడావిడీ. ఇంతంత శ్రమపడి, చెమటోట్చి ఓ సినిమాలో నటించి, ఇంత గొడవయి మొత్తానికి సినిమాని రిలీజు చేస్తారే, తీరా ఆ సినిమా చూసి, ప్రేక్షకులు తీర్పు చెప్పేస్తారు. ఫలానాది బాగోలేదూ, ఫలానాది ఇలా ఉంటే బాగుండేదేమో అంటూ.. నేను శ్రీ వంశీ గారితో అదేమాటంటే ఆయనన్నారూ, “ప్రేక్షకులకి విమర్శించే హక్కు ఎప్పుడూ ఉంటుందండీ.. డబ్బులు ఖర్చుపెట్టి ఓ సినిమాకి వచ్చారంటే వారు ఆశించింది అందులో కనిపించకపోతే తిట్టరేమిటీ మరి?”

   “తను మొన్నే వెళ్ళిపోయింది” చిత్ర కథానాయకా, నాయిక లు అజ్మల్, నిఖితానారాయణ్ లతో నేను “దిగిన” ఫొటో...HYD 1405 027

%d bloggers like this: