బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- అడగందే అమ్మైనా పెట్టదు…

సాధారణంగా  సామాన్య ప్రజానీకానికి, ప్రభుత్వోద్యోగులు అదీ అధికారమున్న ఆఫీసర్లు, ఎవరి గురించీ పట్టించుకోరూ అనే అభిప్రాయం చాలా మందిలో ఉండడం చూస్తూంటాము. కానీ, నా అనుభవం మాత్రం దీనికి పూర్తిగా విరుధ్ధం..

మా ఇంట్లో, ఒక  BSNL Broadband, 2 JIO LIFE   ఉన్నాయి.. ఇన్నున్నప్పుడు, ఇంటర్నెట్ కి లోటేముందీ అనుకోవచ్చు..మా సొసైటీలో  Jio signal  అంత బాగా రాదు..ఆ డాంగిల్ లను, ఓసారి కిటికీ తెరిస్తేనే కానీ, సిగ్నల్ పట్టుకోదు.. అది కూడా వచ్చేప్రాణం పోయే ప్రాణమూనూ..

  ఉండేదిద్దరం.. నేనూ, నా భార్యానూ..తనకో ఫోనూ, ఓ ఐపాడ్డు.. నాకు రెండు ఫోన్లూ, ఓ టాబ్బూ( నా పుట్టిన రోజుకి మా అబ్బాయి గిఫ్ట్ చేసింది) నూ..ఇవి కాకుండా నా డెస్క్ టాప్పూ, లాప్ టాప్పూ… లిటుకులిటుకుమంటూ ఉండే ఇద్దరికీ ఇన్నేసి గాడ్జెట్లు అవసరమా అనకండి.. ఎవరికి వారే స్వాతంత్ర ప్రతిపత్తీ..తన ఐపాడ్ కీ, నా టాబ్ కీ  “ప్రాణాలు” ( అంటే  sim card)  లేవు.. అందుకని బ్రాడ్ బాండ్ మీదే ఆధారం.. జియో సిగ్నల్ రాకపోవడం మూలాన, మొత్తం అన్నిటికీ ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి, మా  BSNL Broad Band  మాత్రమే దిక్కూ.. మర్చేపోయాను నా పుట్టినరోజుకి, అల్లుడు, అమ్మాయీ గిఫ్ట్ చేసిన  LG Smart TV  ఒకటీ ..  Amazon, Netflix etc  లు చూసుకోడానికి.. దానిక్కూడా ప్రాణదాత మళ్ళీ ఈ  BSNL Broadban డే..అప్పటికీ ఇన్నాళ్ళూ రోజూ  5 GB Plan.. పాపం ఎన్నిటికని ప్రాణదానం చేస్తుందీ అది మాత్రం? రాత్రి 7.30  అయేసరికి  “ you exhausted your daily quota.. if you want regular speed top up your plan “  అంటూ మెసేజ్ లు..

సాయంత్రానికే పరిస్థితి ఇంతలా దిగజారిపోతే , ఇంకా నాలుగ్గంటలు మెళుకువగా ఉంటానే మరెలా? అదేదో వాడడగిన  Top up  చేసుకుంటూ పోతే  వచ్చే నెలసరి బిల్లుకి అంతుండదు.. ఇదివరకోసారి ఇలా చేసుకుంటూ పోతే ఆ బిల్లు వెయ్యిన్నరొచ్చింది.. అప్పటినుండీ వాడిచ్చిన  options  లో decline  నొక్కడం మొదలెట్టాను.. ఇంక బ్రాడ్ బాండ్ స్పీడ్ పాసెంజరు బండిలా నడుస్తుంది.. ఊరికే గిర్రుమని తిరుగుతుంది కానీ, ఒక్కటీ ఓపెన్ అవదు. ఇలా కాదూ , పోనీ అసలు ప్లానే అప్ గ్రేడ్ చేసేస్తే గొడవే ఉండదుగా అనుకుని, BSNL postpaid plan  లు చూస్తే, అదేదో 300 GB Plan  ఒకటి బావుందనిపించింది.. నెలకి 300 GB  దీనికి  Daily quota  లేదు.. నెలసరే.. బిల్లు కూడా  వెయ్యి లోపు.. దీన్ని బయటకు వెళ్ళకుండా ,  Tariff  మార్చడం ఎలా అని గూగులమ్మని అడిగితే, ఏదో చెప్పింది.. అదేదో  bsnl selfcare  లో లాగిన్ అవుతే పనవుతుందని.. ప్రయత్నం చేసా కానీ అవలేదు.. సరే అనుకుని వాళ్ళ helpline  కి ఫోను చేసి అడిగితే.. అస్సలు  online  లో కుదరదూ,  exchange  కి వెళ్ళి చేయించుకోమన్నారు.. 100 రోజులనుండి, లాక్ డౌన్ ధర్మమా అని బయటకు వెళ్ళకుండా ఉన్నానూ, ఇప్పుడు ఈ మాయదారి బ్రాడ్ బాండ్ కోసం బయటకు వెళ్ళడం ఇష్టం లేదు..

 అలా కాదనుకుని, మేముండే  exchange  కి ఫోను చేస్తే, ఎవ్వడూ ఎత్తడూ.. ఇంక ఇదికాదనుకుని, నెట్ లో మా పూణె రీజియన్ కి Broadband i/c  DGM/AGM  ఎవరా అని వెదికితే మొత్తానికి దొరికాయి వారి నెంబర్లు.. వారి ఆఫీసు  landline  కి ఫోను చేస్తే ఎవ్వరూ ఎత్తలేదు.. ఇలాక్కాదని వారి మొబైల్ కి ఫోను చేస్తే, ఆయనెవరో పాపం ఎత్తారు… మీరు ఫలానాయేనా అంటే అవునన్నారు.. మీరు  BSNL DGM  కదా అంటే, ఆయనన్నారూ..ఒకానొకప్పుడూ.. ఇప్పుడు రిటైరయానూ అనడంతో ఆయనకి  sorry చెప్పి ఫోను పెట్టేస్తూంటే, ఆయనే అడిగారు పనేమిటీ అని.. వివరాలు చెప్తే, నన్ను  hold  లో పెట్టి, ప్రస్తుతం పూణె లో ఆ పోస్ట్ లో ఉండే ఆఫీసర్ మొబైల్ నెంబరిచ్చి, ఆయనకి ఫోను చేస్తే పనవుతుందీ అని చెప్పగా, ఓ పావుగంట తరవాత ఆయనకి ఫోను చేస్తే, పాపం ఆయనకూడా వివరాలు అడిగి, తనకి పంపమంటే, ఆయన  Whatsapp  లో పంపాను.

 ఓ గంట తరవాత నా  landline  లో ఫోనూ.. నేను  BSNL నుండి మాట్టాడుతున్నానూ.. మా  boss  కి ఎందుకు ఫోను చేసారూ.. మీ  exchange  కి చేస్తే సరిపోతుందిగా , అంటే ఆప్రయత్నాలన్నీ విఫలమయితేనే, మీ  boss  కి చేసానూ, అని చెప్పగానే ఆ అమ్మాయి , ఓ నెంబరిచ్చి ఫోనుచేయమంది.. ఓ పావుగంట పోయాక నేను ఫోను చేయగానే, అతను , నన్ను ఓ  online application  పెట్టి, sdo  కి మెయిల్ చేయమన్నాడు.. ప్లాన్ వివరాలు, ఎకౌంట్ నెంబరు, కస్టమర్ ఐడి తో సహా.. అవన్నీ వెంటనే చేయగానే, మర్నాటికల్లా, నా  Broadband plan   300Superstar  కి లక్షణంగా మారిపోయింది, అడుగు బయటపెట్టక్కర్లేకుండా..50mbps స్పీడ్ తో..  BSNL వారి సౌజన్యంతో…

అందుకే అన్నారు.. అడగందే అమ్మైనా పెట్టదూ.. అని.. పైవారి దృష్టికి తెస్తేనే కదా పని అయేదీ…

 నాకు  help  చేసిన ముగ్గురికీ ఫోను ద్వారా థాంక్స్ చెప్పేసాను..

కథ సుఖాంతం..

%d bloggers like this: