బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకొన్ని రొజులు పోతే….

    అప్పుడెప్పుడో ఒక టపా పెట్టాను. మన culture కనుమరగైపోతోందేమో అన్న భయంతో పాత సామాన్లు దొరికినన్ని సేకరించి భద్రపరుస్తున్న ఒక వ్యక్తి గురించి. ఆలోచించి చూస్తే, వస్తువులనే కాదు, ఇంకా ఎన్నెన్నో కనుమరగైపోయే అవకాశం ఉందేమో అని నా అభిప్రాయం.

తెలుగు భాష గురించి చాలామందే బాధపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా ఇంగ్లీషూ, హిందీయే. తెలుగులో మాట్టాడడం చిన్నతనంగా భావిస్తున్నారు చాలామంది.అడిగినా అడక్కపోయినా, కనీసం పెళ్ళయేవరకూ, కడుపు నింపడానికి అమ్మ కావాలి, కానీ భాష దగ్గరకొచ్చేసరికి ఆవిషయం మర్చిపోతున్నారు చాలామంది.అసలు మాట్లాడడమే తక్కువ. ఎక్కడ మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అనే భయం. ఈ పేమెంట్ల ధర్మమా అని ఎక్కడో ఏ ఆఫీసుకో వెళ్ళి వివరాలు అడగవలసిన పరిస్థితి లేదు.ఎయిర్, రైల్ రిజర్వేషన్ల దగ్గరనుంచి ప్రతీదీ ఓ మీట నొక్కితే అయిపోతోంది. ఇదివరకటి రోజుల్లో తల్లితండ్రులు కనీసం ఇళ్ళల్లో వాళ్ళ పిల్లలతోనూ, తల్లితండ్రులతోనూ మాట్టాడేవారు. ఇప్పుడు అసలా అవకాశమే కలగడమేలేదాయె. ఎప్పుడు చూసినా చెవిలో ఓ”పువ్వు”, మెడవంచేసి ఏదో క్లయంటుతో కాల్స్ అంటూ. రోడ్డు మీద నడుస్తూంటే కాల్స్, కార్లు డ్రైవు చేస్తూ కాల్స్, ప్రొద్దుటే ఫలహారం చేస్తూ కాల్స్, టాయిలెట్లలోకి వెళ్తే కాల్స్, చివరాఖరికి భార్యాభర్తలు రాత్రెప్పుడో పడకెక్కినా, పక్కనే ఆ మాయదారి సెల్ ఫోన్ లేకుండా గడవదు. ఈ కాల్స్ ధర్మమా అని బయటివారితో రాకపోకలూ తగ్గిపోతున్నాయి. ఖర్మ కాలి ఎవరైనా వచ్చినా, నోరెత్తకూడదు, ఒకళ్ళమొహం ఒకళ్ళు చూసుకుంటూ సైగలతోనే కాలక్షేపం.అదేదో “Silent valley” చూడ్డానికి ఎక్కడికో వెళ్ళఖ్ఖర్లేదు. ఇదివరకటి రొజుల్లో తెలుగు బ్లాగులు వచ్చిన కొత్తరోజుల్లో, చదవడానికి కొన్నైనా తెలుగు బ్లాగులుండేవి. వారుకూడా ఫేస్ బుక్, ట్విట్టర్, ప్లస్ ల్లోకి వెళ్ళిపోయారు. పోనీ అక్కడైనా తెలుగులో వ్రాస్తారా అంటే అక్కడా ఇంగ్లీషే, ప్రపంచం అంతా చదవొద్దు మరీ? పోనీ ప్రసారమాధ్యమాల్లో ఏమైనా ఉధ్ధరిస్తున్నారా అంటే అక్కడ ఉండే యాంకర్లు వాక్యానికి కనీసం నాలుగైనా ఇంగ్లీషు పదాల్లేకుండా మాట్లాడలేరు. ఇంక సినిమాలంటారా, ఏదో తెలుగులో పేరు పెడితే చూడరేమో అని భయం. అధవా పెట్టినా , వాళ్ళు పెట్టే పేర్లు చూసి ఆ సినిమాహాలు దరిదాపులకే వెళ్ళరూ. తెలుగు వార్తాపత్రికలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. తెలుగులో మాట్లాడమంటే అదేదో గ్రాంధికంగా మాట్లాడమనికాదు, అలాగని పాతరోజుల్లోని పద్యాలూ అవీ పాడమనీ కాదూ,మామూలు జనసామాన్యభాషలో మాట్లాడినా చాలు. అదే కరువైపోతోంది.

ఇంక ఇళ్ళల్లోకి వద్దాం.భోజనం చేసేటప్పుడు అన్నంలోకి పప్పూ, దాంట్లోకి నెయ్యి వేసితింటే ఎంతబావుంటుందో. అదేం ఖర్మమో నెయ్యి అంటేనే ఆమడ దూరం పరిగెడుతున్నారు ఈరోజుల్లో. ఎవరో చెప్పారుట, నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందనీ, గుండె జబ్బులొస్తాయనీ, శరీరం పెరిగిపోతుందనీ. వాళ్ళ మొహమేమీ కాదూ, నెయ్యితింటే కాదు వళ్ళొచ్చేది, బయట బర్గర్లూ, సబ్ వేలూ, కుర్కురేలూ చెత్తా చెదారమూ తినీ.ఇదివరకటి రొజుల్లో ఇంట్లో నేతిచుక్క వేయకుండా తిండి పెట్టారంటే చిన్నబుచ్చుకునేవారు. ఇప్పుడు ఇంట్లో నెయ్యుందంటే నామోషీ. పోనీ నెయ్యి మానేయడం మూలాన రోగాలు తగ్గాయా అంటే,అదీ లేదూ, వచ్చే రోగాలొస్తూనే ఉన్నాయి.

ఇలాటిదే పంచదార.హయిగా బతికున్నంతకాలమూ తినేదేదో త్రాగేదేదో త్రాగేసి బతక్క, ఎందుకొచ్చిన గొడవలండి బాబూ ఇవి? ఇదివరకటి రోజుల్లో క్షేమసమాచారాలు ఎలా అడిగేవారో అలాగ, ఎవరింటికైనా వెళ్తే మొదటి ప్రశ్న– ఏదో కాఫీయో, చాయో ఇవ్వాలిగా — సుగరాండీ అని! అలాటిదే ఉప్పొకటి. రుచీపచీ లేకుండా తినే తిళ్ళు ఇళ్ళల్లో దొరక్కే అసలు అందరూ బయటి తిళ్ళకి అలవాటుపడ్డారేమో!

ఇదివరకటి రొజుల్లో “పిచికలు” అనేవుండేవి. గుర్తుందా? నగరాల్లోనూ, పట్టణాల్లోనూ అసలు వీటి మాటే లేదు.శుభ్రమైన నీళ్ళ సంగతి అసలు అడగఖ్ఖర్లేదు.ఎక్కడ చూసినా , ఏ నదిచూసినా కలుషిత నీళ్ళే. ఇలా చెప్పుకుంటూ పోతే,posterity కోసం భద్రపరచవలసిన వస్తువుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అలాగని నేను కూడా తెలుగుభాషని ఉధ్ధరించేస్తున్నాన కాదూ, ఈ టపా కూడా పూర్తిగా తెలుగులో ఎక్కడ వ్రాసి ఏడ్చానూ, పూర్తిగా అర్ధం అవడానికి, అక్కడక్కడ ఇంగ్లీషు పదాలు వాడవలసొచ్చినందుకు క్షమించండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మేరా భారత్ మహాన్…

    ఇదివరకటి రొజుల్లో కోర్టులు ఏదైనా జడ్జిమెంటనేది ఇస్తే, దానికో విలువుండేది.ప్రస్తుత పరిస్థితి ఎలాఉందంటే, ఎవడి నోటికొచ్చిన సలహా ఇచ్చేవాడే ప్రతీవాడూనూ. ఉదాహరణకి సినీనటుడు సంజయ్ దత్ కేసే తీసికోండి. 1993 లో ముంబాయి లో జరిగిన అల్లర్లలో, దావూద్ ఇబ్రహీం లాటివాళ్ళకి సహాయం చేసినట్టు నిరూపింపబడ్డం వల్లనే కదా, జైల్లో పెట్టారూ. అసలు TADA కిందే బుక్ అవవలసినవాడు, దానిలోంచి ఎలా తప్పించుకున్నాడో ఇక్కడ చదవండి.వాళ్ళనాన్న సునిల్ దత్ ధర్మమా అని బయటపడి, Arms Act లో బుక్ అయ్యాడు. ఆ కేసు 20 ఏళ్ళకి సుప్రీంకోర్టులో విచారణకొచ్చి, శిక్షపడ్డ అయిదేళ్ళ, మిగతా కాలానికి జైలుకెళ్ళమన్నారు.

    ప్రతీవాడూ అయ్యో..అయ్యో.. పాపం పసిబిడ్డ, అమాయకుడు, నోట్లో వేలెడితే కొరకలేడు కూడానూ, ఇద్దరు బిడ్డల తండ్రీ, వాళ్ళ నాన్న ఫలానా.. వాళ్ళ అమ్మ ఫలానా.. గాంధీ గారి గురించి ప్రచారం చేశాడూ, ఒకటేమిటి ఎక్కళ్ళేని సద్గుణాలూ కనిపించిపోయాయి మన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ కట్జూ గారికి! ఈయనొక్కడూ చాలదన్నట్టు ప్రతీ రాజకీయపార్టీలోని వాడూ మాట్టాడేవాడే.సంజయ్ దత్ అసలు ఉగ్రవాది కాదుట, ఉత్తిత్తినే అవేవో గన్నులూ, గ్రెనేడ్లూ ఎలా ఉంటాయో ఓసారి చూద్దామని అట్టేపెట్టుకున్నాడుట. సరదాగా చూడ్డానికి బావుందని ఒక్కటంటే ఒక్కటే గన్నోటి ఇంట్లో పెట్టుకున్నాడుట. మిగిలినవన్నీ అప్పుడే తీసికెళ్ళిపొమ్మన్నాడుట.. పాపం అలాటి అమాయకుణ్ణి క్షమించేయండీ అని గవర్నరుగారికి ఉత్తరం వ్రాసెవాడొకడూ, ఏకంగా కలిసేవాడింకొకడూ. వీళ్ళందరినీ చూసే ఓ పేపరువాడు సల్మాన్ ఖాన్ మీదకూడా కేసునడుస్తోందిగా, అతనేం చేద్దామనుకుంటున్నాడో సరదాగా ఓ వ్యాసం వ్రాశాడు. చదివే ఉంటారు అయినా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చదవండి.మన మాజీ న్యాయమూర్తులు, హాయిగా ఏదో పదవి ఇచ్చారుగా, హాయిగా కూర్చోక ఎందుకొచ్చిన దిక్కుమాలిన సలహాలండీ ఇవీ?

    మాజీ విమానదళాధిపతి గారి విన్యాసాల గురించి చదివే ఉంటారు.ఆయనెవడో ఒడీషా మాజీ డీజీపీ ట, ఆయనగారి కొడుకు అయిదేళ్ళపాటు, ఈయనగారి సహకార సౌజన్యాలతో మాయమైపోయి అయిదేళ్ళకి దొరికాడు.

    అప్పుడెప్పుడో శివసేనా బాలాసాహెబ్ థాక్రే గారు, పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్ళని ముంబైలో అడుగెట్టనీయనన్నాడు. పోనిద్దూ పెద్దాయనా వద్దంటున్నాడూ, అనేసికుని మనవాళ్ళు పాకిస్థాన్ తో ఆడ్డమే మానేశారు ! నేనుమాత్రం తక్కువా అనుకుందేమో ఏమో కానీ, జయలలిత గారు శ్రీలంక ఆటగాళ్ళు చెన్నైలో అడుగెడితే కాళ్ళిరక్కొడతానంది. రిజల్ట్-IPL Circus లో చెన్నైలో ఆడే గేమ్స్ లో శ్రీలంక ఆటగాళ్ళు నో..నో..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఒక్కొక్కళ్ళది ఒక్కో పధ్ధతి…….

    మా అబ్బాయి తన కంపెనీ కి consultancy సందర్భంలో ఒకరిని హైదరాబాదు నుంచి ఆహ్వానించి, ఆ విషయం మాతో చెప్పాడు. ఆయన పేరేమిటీ అని అడగ్గా, ఫలానా అని చెప్పి, వారింటి పేరు Y తో ప్రారంభం అవుతుందీ అన్నాడు. ఏ యనమండ్రో. యర్రమిల్లో, యద్దనపూడో అయిఉంటుందనుకున్నాము. కాదూ “ఏనుగు” అన్నాడు. మాకు వెంటనే చిన్నపుడు చదువుకున్న ఏనుగు లక్ష్మణ కవి గారు గుర్తొచ్చారు. “కరెక్టు..” అదే అన్నాడు. పైగా ఆయన మా అబ్బాయిని మా వివరాలు అడిగి. మీ పేరెంట్స్ కి తెలుస్తుందీ, మా ఇంటిపేరు చెప్పగానే అని కూడా చెప్పారుట. అవునుకదండీ, ఎంతైనా ఆ ఇంటిపేరున్న వారి, భర్తృహరి సంస్కృతంలో వ్రాయగా, వాటిని తెలుగులోకి అనువదించిన శ్రీ ఏనుగు లక్ష్మణ కవిగారి సుభాషితాలు చదివే పెరిగిపెద్దయాము కదా! ఈ రోజుల్లో వారికి అంతగా తెలియకపోవచ్చు.

    ఎప్పుడో చిన్నప్పుడు భర్తృహరి సుభాషితాలు బట్టీపట్టిన గుర్తైతే ఉంది.కానీ అప్పుడే అరవై సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన్ని కలిసినప్పుడు, మరీ వెర్రిమొహం పెడితే బావుండదుగా, అందుకోసం వెంటనే వికీపీడియా తెరిచి, శ్రీ ఏనుగులక్ష్మణ కవిగారి వివరాలు చదివేశాను.ఆ విషయం ఆయన్ని మర్నాడు కలిసినప్పుడు ఆయనతో చెప్పానుకూడానూ.ఆయనా సంతోషించినట్టే కనిపించారు.ఎవరైనా మా ఇంటిపేరు “భమిడిపాటి” అని తెలిసి, నా సంగతెలా ఉన్నా, మా ఇంటిపేరున్న ప్రముఖుల వివరాలు తెలిసికుంటే నాకు సంతోషంగా ఉండదూ మరి?అలాటి పెద్దల ఆశీర్వచనాలతోనే కదా మనం బతుకుతున్నదీ?

    ఇంక ప్రస్తుతానికి వస్తే ఈ కొత్తగా పరిచయం అయిన వారి పేరు శ్రీ ఏనుగు కృష్ణమూర్తిగారు. ఈయనకి ఒక ఆసక్తికరమైన హాబీ ఉంది.మామూలుగా ఈ హాబీల్లాటివున్నవారు, ఏవో స్టాంపులూ, నాణాలూ, అలాటివి సేకరిస్తూండడం చూస్తూంటాము. కానీ ఈయనది బొత్తిగా చిత్రమైన హాబీ ! మన చిన్నప్పుటి విషయాలు గుర్తుండే ఉంటాయి అందరికీ.ఆరోజుల్లో అన్నీ గ్రామాలే.ఆ గ్రామీణ వాతావరణంలో నిత్యకృత్యంలో ఎన్నెన్నో వస్తువులు వాడేవారం. చాలా భాగం ఇత్తడితో చేసినవే.కాలక్రమాన అవన్నీ మాయమైపోయి ఈరోజుల్లో ప్లాస్టిక్ వస్తువులలోకి వచ్చేశాయి.ప్లాస్టిక్ వాడొద్దు మొర్రో అని ఒకవైపున చెప్తూనే, ఇల్లంతా ప్లాస్టిక్కు మయం చేసేశాము. ఇత్తడి గురించి మాట్టాడడమే నామోషీగా భావిస్తున్నాము.పైగా use and throw ఒకటీ. ఎక్కడచూసినా ప్లాస్టిక్కే.కుర్చీలు, సోఫాలు, గిన్నెలు, పువ్వులు, ఫలాలు , దేవుడికి వేసే దండలు, ఒకటేమిటి మనం నవ్వే నవ్వుకూడా ప్లాస్టిక్కే. హృదయపూర్వకంగా నవ్వే నవ్వెక్కడండి బాబూ. ఏదో మొహమ్మాటానికి నవ్వడంకానీ..

    అప్పటికీ, ఇంకా పాతవాసనలు పోని కొంతమంది సహృదయులు పాత సెంటిమెంట్లు వదులుకోలేక, ఇంకా ఆ పాతవస్తువులు పట్టుకుని వేళ్ళాడుతున్నారు.ఇదివరకటి రొజుల్లో పెద్ద పెద్ద ఇళ్ళుండేవి కాబట్టి, ఈ ఇత్తడి సామాన్లు జాగ్రత్త పెట్టుకోడానికి విడిగా ఓ రూమ్ముండేది. కానీ ఈ కాంక్రీటు జంగిళ్ళలో, మనం విడిగా పడుక్కోడానికే జాగా దొరకని ఈరోజుల్లో ఆ ఇత్తడిసామాన్లకెక్కడ స్థలం దొరుకుతుందీ? ఈ కారణం చేత చాలా భాగం పాత ఇత్తడి సామాన్లకి కాళ్ళొచ్చేశాయి. ఇదివరకటి రొజుల్లో ఏ శ్రీరామనవమైనా వచ్చిందంటే పానకం కలపడానికి “గంగాళం” అని ఒకటుండేది.అలాగే ఏ “సంతర్పణ” లాటిది జరిగితే, అక్కడ నేతి “జారీలూ”, పదార్ధాలు వడ్డించడానికి పాత్రలూ ఎన్నెన్నో ఉండేవి.ఎవరింట్లోనో ఇలాటివి ఉన్నాయని తెలిస్తే వారింటికి వెళ్ళి తెచ్చుకునేవారు. పని అయిపోగానే వాటిని శుభ్రంగా తోమించి తిరిగి ఇచ్చేసేవారు.ఇళ్ళల్లో అన్నం వండుకోడానికి వివిధరకాలైన గిన్నెలూ, సోల, అడ్డ,మానెడు లాటివి ఉండేవి. ఇద్దరికి ఓ సోలడుబీపన్నం పెడితే సరిపోయేది. నలుగురొస్తే తవ్వెడు, ఇలా వచ్చినవారినిబట్టి ఉండేవి కొలతగిన్నెలు.

    ఈ విషయాలన్నీ ఏవో పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ(పాతవి) చూసే పరిస్థితికి వచ్చేసింది, మన so called నాగరికత. ఇంకొన్ని సంవత్సరాల్లో అసలు ఇలాటివి ఉండేవన్న విషయంకూడా మర్చిపోవచ్చు. అలా జరిగి మన సంస్కృతి మరుగున పడిపోతుందేమో అన్న ఆవేదనతో, శ్రీఏనుగు కృష్ణమూర్తిగారు ఓ మహత్కర కార్యానికి నడుం కట్టారు.దాని పరిణామమే ఈయనగారి హాబీ. ఎక్కడో ఏదో ఊళ్ళో ఫలానా గుళ్ళో ఫలానా వస్తువుందని తెలిసికోడం, వెంటనే అక్కడకి వెళ్ళిపోవడం, వారితో బ్రతిమాలో, బామాలో, ఖరీదిస్తానని చెప్పో, కాదూకూడదూ అనుకుంటే, వారిదగ్గర తీసికున్న వస్తువుకి మారుగా, వారికి ఉపయోగించే వస్తువిచ్చో, మొత్తాని ఏదైతేనేం “పాత సామాన్లు” చాలానే సేకరించారు. వాటిని పాతసామాన్లన్నాని వాటి విలువ dilute చేశాననుకోకండి. ఓ ఇరవై ఏళ్ళు గడిచాయంటే వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్ లో లక్షల్లోకి వెళ్తుంది.

   డబ్బుమాట ఎలాఉన్నా, మన సంస్కృతి కాలగర్భంలో కలిసిపోకముందే, తనవంతు సహాయం చేయకలుగుతున్న కృష్ణమూర్తిగారు ఈ సామాన్లన్నీ ఎక్కడ పెడుతున్నారో తెలుసా, వారి ఇంట్లో ! ఇప్పటిదాకా ఆయన సేకరించిన సామాన్ల వివరాలు అన్నీ పొందుపరిచి ykantiques.com పెట్టారు.ఆ ఫొటోలు ఒక్కోటీ చూస్తూంటేనే కడుపునిండిపోతోంది. ఇంక ప్రత్యక్షంగా చూస్తేనా… అక్కడుంచిన వస్తువులకి ఇంగ్లీషులో కాకుండా తెలుగు లో వివరిస్తే ఇంకా అందంగా ఉండేదని వారికి సూచించాను. అదే ప్రయత్నంలో ఉన్నారు. గంగాళం, గోకర్ణం, జారీ అంటే ఉన్న సొగసు gangaalam, gokarnam, jaaree అంటే ఉంటుందా?

   మామూలుగా antiques సేకరించి భద్ర పరిచే museums చూశాము కానీ, ఒక గృహస్థుకి ఇలాటి వ్యాపకం ఉండడం చాలా చిత్రం కదూ..పైగా వీటన్నిటినీ ఉంటున్న ఇంట్లోనే భద్రపరచడానికి కొంత స్థలం కేటాయించడమంటే ఇంకా చిత్రం ! ఈ సామాన్లన్నిటికీ ఇల్లు ఇరుకైపోతుందని అనుకోకుండా, ఆ వస్తువులని తమాషాగా వినియోగంలోకి తేవడమైతే simply అద్భుతం.గంగాళమంటే సైజెంతుంటుందో తెలుసుగా, అలాటిదానిమీద ఓ చెక్క ఏర్పాటుచేసేసి, దానినే dining table గా ఉపయోగిస్తున్నారంటే ఆయన ingenuity ఎలాటిదో ఊహించుకోండి !! ఇలాటివాటికి ఇంటి ఇల్లాలి సహకారం కూడా ఉండాలి. మరి ఆవిడనికూడా అభినందించాలిగా,ఇలాటి వారిని “భరిస్తున్నందుకూ” !!!

    అలాటి ఓ గొప్ప వ్యక్తితో నాకు పరిచయం అవడం నా అదృష్టం… ఈ టపా చదివి, ఆ సైటు చూశాక, ఎక్కడైనా మీకు తెలిసి, ఎవరింట్లోనైనా అలాటి అపురూపర వస్తువులు లభిస్తాయని ఆయనకి తెలిపితే ఎంతో సంతోషిస్తారు..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Pest control….

   మా చిన్నప్పుడు ఇళ్ళల్లో పుస్తకాలున్న చోట “చెద” అని ఒకటి పట్టేది. ఏవర్షాలకైనా తేమ ఎక్కువైతే,ముందుగా ఈ చెదపురుగులు పుస్తకాల్ని ఎటాక్ చేసేవి. పైగా తెలిసేది కాదుకూడానూ. ఏదో వెదకడానికి ఏ పుస్తకాల ర్యాక్కు దగ్గరో చూసేటప్పటికి తెలిసేది- అడుగు అర అంతా చెదపట్టేసిందని. అదేం ఖర్మమో కానీ, చదువుకునే క్లాసు పుస్తకాలకి పట్టేది కాదు! కనీసం ఆ కారణం చేతైనా క్లాసుపుస్తకాలు రోజూ బట్టీపట్టే గొడవొదిలేది. అబ్బే మనకంత అదృష్టం కూడానా? అలా చెద పట్టిన పాతపుస్తకాలూ, న్యూసుపేపర్లూ ఎండలో పడేసి, salvage చేయకలిగినవేవో చేసేసి, ఎక్కదైతే చెదపట్టేదో, అక్కడంతా, కిరసనాయిలు గుడ్డలో ముంచి, ఆ గుడ్డతో శుభ్రపరిచేసి తిరిగి పుస్తకాలూ, ఏమైనా మిగిలితే ఆ పేపర్లూ మళ్ళీ అక్కడ “బొత్తి” గా పెట్టేయడం. ఆరోజుల్లో చాలాభాగం పెంకుటిళ్ళే కాబట్టి, భూమిలోని తేమ కూడా తోడై, ఏ గోడమూలలోంచో మొదలై గోడమీదుగా ఇల్లంతా పాకేసేవి ఈ చెదపురుగులుకూడా. ఆరోజుల్లో “చెద” పట్టని మధ్యతరగతి ఇల్లుండేదనుకోను. పెద్దపెద్దవాళ్ళ సంగతి వేరనుకోండి. ఏదో ఆ కిరసనాయిలు గుడ్డతో తుడిచేస్తే మిగిలిన పురుగులు- బొద్దింకలూ, నల్లులూ వగైరాలుకూడా, ఎవరిదారిన అవి పడుండేవి. ఆరోజుల్లో మరీ తెలివిమీరలేదు అవికూడా, ఏదో చెప్పిన మాట వినేవి !

నగరజీవితాలకి వచ్చేటప్పటికి ఆ చెదపురుగులు కూడా urbanization కి తట్టుకోలేక, మనవైపే ఉండిపోయాయి! తణుకులో 1989 లో ఇల్లు కట్టుకున్నప్పుడు బాగానే ఉండేది టీచర్స్ కాలనీలో, కాలక్రమేణా అక్కడ నేలలోమహాత్మ్యం ఏమిటో కానీ, ఏడాది తిరిగేసరికల్లా, తలుపులూ, ద్వారబంధాలూ చెదపట్టేసి, డొల్లల్లా తయారైపోయేవి. ఏడాది పొడుగునా వచ్చిన అద్దె డబ్బులు కాస్తా ఈ చెదల Treatment కే సరిపోయేది. ఈమాత్రందానికి అక్కడ ఇల్లెందుకూ అనేసికుని అమ్మిపారేశాము.కారణాలు ఇంకొన్ని ఉన్నా, ఇదో వంక పెట్టాము!

తరవాత్తర్వాత నగరాలకొచ్చేటప్పటికి చెదల మాటెలా ఉన్నా బొద్దింకల గొడవ ఎక్కువైపోయింది.పైగా వాటిని సరైన సమయంలో అంటే చిన్నగా ఉన్నప్పుడే control చేయకపోతే, అవిపెరిగి పెద్దయి గరుడ పక్షుల్లా ఎగురుతాయికూడానూ.ఎవరైనా ఇంటికొచ్చేసరికి, ఇవి బయటకి వచ్చేసి, మన “పరువు” వీధినపెట్టేసేవి.అదేదో “ఫ్లిట్” అనేదుండేది. ఓ డబ్బా, దానికో పంపూ, ఆ డబ్బాలో కిరసనాయిలూ, బొద్దింకలమందూ కలిపి ఇల్లంతా ఆ పంపుతో కొట్టుకోడం. మనం ఇంటిని శుభ్రంగా ఉంచితే సరిపోదు, ఇంకో ఎపార్టుమెంటులో వాళ్ళు, ఏ క్లీనింగైనా చేస్తే, అక్కడుండే బొద్దింకలన్నీ మనింట్లోకి వచ్చేసేవి. ఇదో గొడవా!అదేదో మార్కెట్ లోకి “లక్ష్మణ రేఖ” లో ఏవో వచ్చేవి. రాత్రి పడుక్కునేముందు దానితో ముగ్గులు పెట్టేస్తే, ప్రొద్దుటికి ఎక్కడలేని బొద్దింకలూ చచ్చిపడుండేవి, కొన్నైతే గిలగిలా కొట్టుకుంటూ ఉండేవి. ఇంటిముందు ముగ్గు వేసినా వేయకపోయినా “లక్ష్మణరేఖ” ముగ్గులు మాత్రం తప్పేవి కావు ! ఆ స్టిక్ ఖరీదుకూడా, మరీ ఎక్కువ కాకుండా, ఏదో మనకొచ్చే జీతంలో కొనగలిగేదిగానే ఉండేది. వీడికొచ్చే జీతానికి, అంతకంటే ఎక్కువ ఖర్చుపెడతాడూ, అనేసికుని ఆ బొద్దింకలు కూడా మనతో సహకరించి ప్రాణత్యాగం చేసేవి.

మొన్నమొన్నటి వరకూ ఇంకోచోట ఉండేవాళ్ళం కదూ, అక్కడ ఈ “లక్ష్మణరేఖ” లతో పని కానిచ్చేసేవాళ్ళం. రోజులన్నీ ఒకలా ఉండవుగా, ఇప్పుడుంటున్న ఏరియా కొద్దిగా posh అని చెప్పానుకదూ, ఎక్కడ చూసినా ఐటీ వాళ్ళే. వాళ్ళకి తగ్గట్టే ప్రతీదీ ఖరీదే– కూరలు ఖరీదు, బట్టల ఇస్త్రీ ఖరీదు, అన్నీ ఖరీదే. ఇంక బొద్దింకలు మాత్రం తక్కువ తిన్నాయా, అవికూడా “లక్ష్మణరేఖ”, ముగ్గు లకి లొంగడం మానేశాయి.అప్పటికీ మా ఇంటావిడ, క్రమం తప్పకుండగా ప్రతీరోజూ కిచెన్ ప్లాట్ఫారమంతా ముగ్గులు గీసేసేది. పైగా వాటికో డిజైనోటీ.. బొద్దింకలు ఈవిడమాటవినడం మానేసి, యథారాజ్యంగా తిరగడం మొదలెట్టేశాయి.పోనీ మా ఇంటావిడేమైనా ఇల్లు శుభ్రంగా ఉంచదనడానికీ లేదు. రోజంతా ఫినాయిలు గుడ్డా, చీపురూ తోనే ఉంటుంది. తుడిచిందే తుడవడం. అయినా ఈ బొద్దింకలుమాత్రం వదలవు.

ఇంక ఇలా కాదని వాడెవడో pest control వాడికి ఫోనుచేస్తే, మొత్తానికి వాడొచ్చి ఈవేళ అదేదో herbal దిట, ఆ పేస్టు ఇంట్లో చాలాచోట్ల కార్నర్స్ లో అద్దేశాడు.అదేమిట్రా, ఫలానా చోట పెట్టలేదూ అని అడిగితే, మీరేమీ వర్రీ అవకండీ, బొద్దింకలన్నీ ఓ వారంరోజుల్లో వాహ్యాళికి ఈ మందుపెట్టిన చోటుకి వచ్చి చచ్చూరుకుంటాయీ,మళ్ళీ ఆరునెలలదాకా ఫరవాలేదూ అని ఓ assurance ఇచ్చి వెళ్ళాడు ! ఈలోపులో ఒక్క బొద్దింక కనిపించినా సరే, ఫోను చేయండీ ఊరికే మందెడతామూ అని ఓ ఆరువందలు పట్టికెళ్ళాడు.

ఈ మందుతో దోమలు పోవుట, అలాగే నల్లులకీ, బల్లులకీ ఇంకో మందు వాడాలిట. ఏమిటో, మనరోగాలకి రకరకాలైన స్పెషలిస్టుల్లాగ ఈ పురుగులక్కూడా రకరకాల మందులు…

సందర్భం కాదనుకోండి… మొన్న నేను వ్రాసిన మిథునం మీద నా అభిప్రాయం టపా చదివి, పాపం మా ఇంటావిడ నిన్న ఓ టపా పెట్టింది.చదివేవాళ్ళందరికీ కోపం వచ్చుంటుందీ, ఆ కోపం కొద్దిగా పలచబరిచే ఉద్దేశ్యంతో, అసలు నాకు “మిథునం” పుస్తకం మీద ఎంత అభిమానమో, సినిమా చూసి నేనెందుకంతగా disappoint అవ్వాల్సొచ్చిందో, వగైరా.. వగైరా లతో. పోనీ తనమాటెందుకు కాదనాలీ, కావలిస్తే రాసుకో అన్నాను.ఆ టపా చదివినవారినుంచి ఒక వ్యాఖ్య చదివాను-” చదవడానికి బాగుండేవి చూడ్దానికి బాగోవూ..ఎబ్బెట్టుగా కూడా ఉంటాయీ..” అని. నాకైతే నవ్వొచ్చింది ఆ వ్యాఖ్య చదివి. బర్త్ డే ఫంక్షన్లలో కేక్కులు కోసి ఓ ముక్క మొగుడునోట్లో భార్యా, అదే ముక్కని భార్య నోట్లో మొగుడూ, పైగా వీలుంటే పక్కనున్నవాళ్ళ నోళ్ళలో పెట్టినప్పుడు లేని “ఎబ్బెట్టు తనం”, అప్పదాసు గారు బుచ్చిలక్ష్మిగారి నోట్లో జామకాయ గుజ్జు పెడితే ఎబ్బెట్టెలా అవుతుందో నాకైతే అర్ధం అవలేదు!

వారిద్దరి అనుబంధమూ బాపూగారి దృష్టి లో ఎలా ఉంటుందో, ఆ కథకి ఆయన వేసిన ముఖచిత్రంలోనే తెలుస్తుంది. అర్ధనారీశ్వర తత్వం.
Mithunam

మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది ఏదైనా.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏం జరిగినా మన మంచికే… అని ఊరికే అనరు…

    ఎప్పుడైనా మనం ఊహించినది జరక్కపోతే అయ్యో అని నిరుత్సాహపడిపోతాం.కానీ దేవుడిమీద నమ్మకం ఉన్నవారు,positive గా ఆలోచించి,గత అనుభవాలు దృష్టి లో పెట్టుకుని, అలా జరగడం కూడా మనమంచికేనేమో అనుకుంటారు.అలాగని ప్రతీదీ అదే దృష్టి చూడలేమనుకోండి.నూటికి తొంభై పాళ్ళు అలా అనుకునే పరిస్థితులుంటాయి.

    మాకు ఈ ఊళ్ళో చాలామట్టుకు తెలుగు సినిమాలు, మన రాష్ట్రంలో రిలీజైన రోజే ఇక్కడా రిలీజవుతూంటాయి. ఏదో ఏ రెండు నెలలకో వెళ్తూంటాము. ఆ సందర్భంలోనే శ్రీరామరాజ్యం, షిరిడీ సాయీ, దూకుడూ, సీతమ్మవాకిట్లో… లాటి సినిమాలూ చూడకలిగాము. ఒక్కో సినిమా కెళ్ళాలంటే ఓ అయిదువందలనోటు అవుతూంటుంది ఇద్దరికి టిక్కెట్టూ+రానూపోనూ ఆటో ఖర్చూ.మరీ పెన్షనర్లం కదా, ఆచి తూచి వెళ్తూంటాం.ఎట్టాగూ ఇదివరకటి రోజుల్లోలా కాకుండా, త్వరగానే టీవీ లో వచ్చేస్తున్నాయీ, అప్పుడే చూడొచ్చులే అనే ఓ కారణం ఒకటీ. ఆమధ్యన వచ్చిన ” మిథునం” ఇక్కడ రిలీజవలేదాయె. ఇక్కడేమిటిలెండి, ఆంధ్రదేశంలోనే చాలా ప్రదేశాల్లో అవలేదు. కానీ ప్రతీవాడూ అడిగేవాడే–” మిథునం” చూశారా అంటూ. ఏం చేస్తాం ప్రాప్తంలేదూ అని సమాధానం చెప్పేయడం.ఈమధ్యనే ఆ సినిమా డివీడీ కూడా వచ్చేసిందీ అని ఊరించేవారు కొందరూ.చివరకి ఎలా తయారయిందంటే ” మిథునం” సినిమా చూడనివాడు కూడా మనిషేనా, వాడిదీ ఓ బతుకా అన్నంతగా. భాగ్యనగరంలో ఉండేవారిని కాళ్ళట్టుకుని, ఎలాగోలాగ ఆ డీవీడీ ఏదో తెప్పించుకుంటేనే కానీ, మన బతుక్కో అర్ధంలేదూ అన్నంతగా. మొన్న భాగ్యనగరం వచ్చినప్పుడు, నిజం చెప్పాలంటే ప్రయత్నమూ చేయలేదూ, టైమూ లేదూ. ఓ గొడవొదిలిందిలే అనుకున్నాను.

   తెలుగు డీవీడీలు పూణే లోకూడా త్వరగానే వస్తూంటాయి. పోనీ ఆ షాపుకెళ్ళి అదేదో చూద్దామా అనుకుని, నిన్న సోమవారం కొట్లుండవూ అనేసికుని, మానేశాను.తీరా ఇంటికొచ్చేసరికి తెలిసింది వరూధిని(జిలేబీ) గారు, ఆ సినిమాని నెట్ లో పెట్టారూ అని.చూశారా ఆవిడధర్మమా అని నయాపైస ఖర్చుపెట్టఖ్ఖర్లేకుండా,మేమూ ఆ “మిథునం” చూసేసి, తరించిపోయి, మా జీవితాలకి ఓ అర్ధం అంటూ ఏర్పరిచేసికున్నాము..ఈఊళ్ళో ఆ సినిమా వచ్చినా, నాకు డీవీడీ దొరికినా అయిదారువందలు చమురు వదిలేదికదూ..నాకు ఈ సినిమామీద ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టఖ్ఖర్లేదని రాసున్నప్పుడు పై చెప్పిన ఏదో ఒకటి జరిగేదే.అందుకే అన్నాను, “ఏం జరిగినా మన మంచికోసమే” అని.

    ఇంక సినిమా సంగతంటారా, అందరూ పొగిడేస్తున్నంత అద్భుతంగా ఏమీ లేదు. శ్రీరమణగారు తొంభైల్లో వ్రాసినప్పుడు, అప్పదాసు గారంటే, అందరూ “ ఓ రూపానికి” ప్రాణం పోసేసికున్నారు. అలాగే బుచ్చిలక్ష్మి గారూనూ. వారిలో మన తాతయ్యలనీ, అమ్మమ్మా/నానమ్మ లనీ ఊహించేసికున్నాము.అలాటిది సినిమాలో బాలసుబ్రహ్మణ్యం ఆ పాత్రకి misfit అని నా అభిప్రాయం.మొదట్లో మిథునం చదివినప్పుడు, చివరి ఘట్టానికి వచ్చేటప్పటికి, కళ్ళంట జలజలా కన్నీళ్ళొచ్చేసి, నోట్లో కొంతసేపటిదాకా మాటే రాలేదు. శ్రీరమణ గారికి 1998 లో నా అభిప్రాయం తెలియచేస్తూ ఉత్తరం వ్రాసినప్పుడు కూడా, ఆ ఇన్లాండ్ కవరు మీద నా కళ్ళనుండి జారిన కన్నీళ్ళు పడ్డట్టు గుర్తు. కథలో పటుత్వం అంతలా ఉంచారు శ్రీరమణ గారు.అలాగే తరువాత సరసభారతి శ్రీ గబ్బిట ప్రసాద్ గారు కూడా “మిథునం” కథ చదివి ఆడియో ద్వారా బ్లాగులో పెట్టారు. అక్కడకూడా చివరి ఘట్టానికొచ్చేసరికి, ఆయన గొంతుక గద్గదమయిపోయింది. నేను చెప్పేదేమిటంటే, ఒక పాత్రని రచయిత సృష్టించినప్పుడు, ఆ పాత్రలో మనమూ లీనమయ్యేదెప్పుడంటే ఇదిగో నాకూ, శ్రీ ప్రసాద్ గారికీ జరిగినట్టు. అలాగని మేమొక్కళ్ళమే కాదు, మిథునం చదివిన ప్రతీపాఠకుడికీ ఇదే అనుభవం కలిగుండాలి. అప్పదాసుగారి పాత్రను అంత అద్భుతంగా చెక్కారు శ్రీరమణ గారు.ఈ సినిమాలో అసలు అలాటి అనుభూతే కలగలేదు. మామూలుగా కొన్ని దృశ్యకావ్యాల్లో చూసినప్పుడు, అనుకోకుండానే పాత్ర చితీకరణ చూడగానే వహ్వా..వహ్వా.. అనడానికికూడా గొంతుక్కి ఏదో “అడ్డం” వస్తుంది.అలాటిది ఇక్కడ రాలేదంటే పాత్ర ఎంత “ఫీకా” గా ఉందో తెలుస్తుంది.

    అలాటప్పుడు ఆ కథని చలనచిత్రంగా రూపొందిస్తున్నప్పుడు, మనకీ కొన్ని expectations ఉండడంలో తప్పులేదు. కానీ అప్పదాసు పాత్రకీ, బాలూకీ అసలు పోలికే లేదు.శ్రీరమణ గారు అప్పదాసుగారిలో చిత్రీకరించిన గంభీరమే లేదు.ఏదో రెండే పాత్రలతో చిత్రంతీసేద్దామనే తొందరే తప్ప, మిగిలిన పాత్రలు ఉదాహరణకి కథ చెప్తూన్న మేనల్లుడూ, అతని తల్లితండ్రులూ,శ్రావణ పేరంటమూ వగైరా ..వగైరాలు కూడా పెడితే ఇంకా నిండుతనం వచ్చేదేమో. అలాగే,ఏదో మూలకథ చదివి తాదాత్మ్యం చెందిన పాఠకులు ఏదో బాధపడతారేమో అని అక్కడక్కడ కొన్నిసంఘటనలు ఇరికించినట్టు కనిపించింది కానీ, అప్పదాసూ, బుచ్చిలక్ష్మీ ల character build up ఎక్కడా కనిపించలేదు.ఏదో మనల్ని మెప్పించడానికి “పుష్పవిలాపం” వినిపిస్తేనే ఆ సినిమా కళాఖండం అయిపోతుందా? ఏమో మరి భరణి గారికే తెలియాలి. ఇంక దూదేకడం, కుండలు చేయడం అవసరమంటారా?
బుచ్చిలక్ష్మి గారి పాత్రలో లక్ష్మి అమోఘంగా నటించారు. అందులో సందేహానికి చోటులేదు.

    2000 సంవత్సరంలో శ్రీ వాసుదేవన్ నాయర్ గారు ” మిథునం” కథ విని, దానిని మొట్టమొదటగా చలనచిత్రంగా నిర్మించారు. పోలికలు చూస్తారేమో అని “ఒరు చెరు పుంచిరి”, నెట్ అంతా వెదికి పట్టుకున్నాను. Sub Titles(11 clip లుంటాయి) ఉన్నాయి, ఒకసారి చూడండి.అప్పుదాసు పాత్రకి ఆయన ఇచ్చిన నిర్వచనమూ, తనికెళ్ళవారి నిర్వచనమూ తెలుస్తుంది.“పొరుగింటి పుల్లకూరా” అని అనుకోకుండగా,మనవాళ్ళకంటే పరాయివాళ్ళవే నచ్చుతాయి మీకూ అని తిట్టకుండగా, నేను చెప్పినదానిలో అతిశయోక్తి ఏమైనా ఉందేమో మీరూ చెప్పండి. ఆ చిత్రంలో కూడా, మూలకథలో లేని ఎన్నెన్నో సంఘటనలు చొప్పించారు, కానీ అవన్నీ character build up సంబందితమే. అందుకేనేమో ఆ సినిమా అన్నన్ని International Film Festivals లో చూపించారు. మరి భరణిగారి “మిథునం” ఆ స్థాయికి చేరుకోలేక,అన్నన్ని గౌరవాలు, ప్రశంసలూ సంపాదించలేకపోతే, ఇంక ప్రతీవారి నోటా ” అవునండీ తెలుగువాడంటేనే అసలు పడదూ ఎవరికీ, మనకేమైనా lobby లున్నాయా ఏమిటీ..” లాటి విమర్శలు వినాల్సొస్తుంది. కొంచం వినడానికి బాగోపోవచ్చుగానీ, శ్రీ తణికెళ్ళ భరణి గారి “మిథునం” నాకైతే ఓ పేద్ద disappointment. ఆ మళయాళం సినిమా చూసిన తరువాతైతే మరీనూ..మీరు తిట్టినా సరే, అప్పదాసుగారన్నట్టు “నిరక్షర కుక్షీ..” అన్నా సరే మీ ఇష్టం…

   ఆ సినిమా చుసిన తరువాత బాధ భరించలేక, మూల కథని మళ్ళీ ఇంకో సారి( ఇప్పటికి కొన్ని వందలసార్లు చదివాను) చదివి శ్రీరమణ గారు సృష్టించిన అప్పదాసు గారినీ,బుచ్చిలక్ష్మిగారినీ చదివి తరించాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–PGWodehouse ని ఔపోసన పట్టేసిన ఒక వీరాభిమాని కథ..

    మామూలుగా కొంతమంది ప్రఖ్యాత తెలుగు రచయితలు, (పేర్లెందుకులెండి) ఇంగ్లీషులోని best sellers చదివేసి,వాటిని తెలుగులోకి తర్జుమాలాటిది చేసేసి, ఆ నవలని తమ “స్వంతం” చేసేసికోడం, ఎప్పటినుండో చూస్తున్నాము. ఇంగ్లీషు నవల్లు చదివే తెలుగుపాఠకులెంతమంది లెద్దూ, ఎవడికి తెలుస్తుందీ అనే అపోహలో ఉంటారు. మరీ ఎవడో అడిగినా, మక్కికి మక్కీ తర్జుమా చేశానని మాత్రం ఛస్తే ఒప్పుకోడు.పైగా inspire అయ్యామని ఓ తలాతోకాలేని సంఝాయిషీ ఇస్తూంటారు. శ్రీముళ్ళపూడి వారన్నట్టు copy right అంటే కాపీచేయడానికి రైట్టూ అనికూడా కొన్ని సందర్భాల్లో చెప్పేవారినికూడా చూశాము.

    అలాటి పరిస్థితులున్న ఈ రోజుల్లో, మన తెలుగువారైన ఒక PGWodehouse వీరాభిమాని, ఆయనమీదుండే అభిమానంతో, తనకు వీలైనన్ని PGW కథలు, తెలుగువారుకూడా ఆస్వాదించాలనే సదుద్దేశ్యంతో నడుంకట్టారు.అలాగని, పైన చెప్పినట్టుగా హడప్ చేయడంకాదు, Wodehouse Estate వారిని సంప్రదించి, కాపీరైట్ హక్కులకోసం కట్టవలసిన ఫీజు కట్టి మరీ అనుమతి తీసికున్నారు. మీకెలా తెలుసండీ అంటే, భాగ్యనగరం లో మొన్న వారింటికి వెళ్ళినప్పుడు, ఆ agreement పత్రాలు చూడడం తటస్థించింది. ఫీజు మరీ వందల్లో కాదు, వేలల్లో…( ఒక్కొక్క కథకీ). మరీ అంత అవసరమా మాస్టారూ అని అర్ధం పర్ధం లేని ప్రశ్న వేస్తే ఆయనిచ్చిన సమాధానం– This is my humble tribute to the great PGW for all the pleasure and enjoyment I derived by reading his stories... అన్నారు.అదీ వీరాభిమానం అంటే..

    ఆయనెవరో కాదు, భాగ్యనగరంలో ఉంటున్న శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు. నాకూ, ఆయనకీ పరిచయంhyd 033 ఎలాగా అంటారా, ఆయనకూడా ఉద్యోగార్ధం మొదట్లో పూనా లోనే జేరారు. ఒకానొక సందర్భంలో ఆయన పూనా జ్ఞాపకాల గురించి ఒక వ్యాసం వ్రాశారు.ఆయన వివరాలు సంపాదించి, ఆయనతో “దోస్తీ” చేశాను, నెలలో కనీసం రెండు మూడుసార్లైనా ఫోనుల్లోనే మాట్టాడుకోడం. ఆ సందర్భంలోనే తెలిసింది ఆయనకి PGW అంటే ఎంత అభిమానమో. కౌముది లో కూడా ఒక నవల తెలుగీకరించి, సీరియల్లు గా ప్రచురిస్తున్నారు. నేనైతే అదేమిటో, ఒక్కటి కూడా PGW కథలు చదవలేదు. ఆ విషయం నిస్సిగ్గుగా ఆయనకి చెప్పాను.ఫరవాలేదూ, ఇప్పటికైనా మొదలెట్టండీ అన్నారు. చిత్రం ఏమిటంటే, మా అబ్బాయి హరీష్ ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే Complete Works of PGW కొని ఇంట్లో పెట్టాడు.

    మొన్నటి భాగ్యనగర ట్రిప్పులో, రెండో రోజు ఉదయం పదిన్నరకి మేముండే హొటల్ కి వచ్చి, సోమాజిగూడా లో ఉండే తమ ఇంటికి తీసికెళ్ళారు.వారు ప్రస్తుతం వ్రాస్తున్నవీ,వ్రాయబోయేవీ, శ్రీ బాపూ గారితోనూ, శ్రీ ముళ్ళపూడివెంకట రమణగారితోనూ ఉన్న పరిచయ విశేషాలూ వగైరా వగైరాలు మాతో పంచుకున్నారు.వామ్మోయ్ నాకు పరిచయం అయిన ఇంకో celebrity నా లిస్టులోకి చేరిపోయారోచ్ అనుకున్నాను.మన పరిజ్ఞానం ఎలా ఉంటే ఎవడిక్కావాలీ, ఫలానా..ఫలానా వారు మాకు తెలుసునూ అనేసికుంటూ బతికేస్తాం..అవునంటారా కాదా? Namedropping లో ఉండే సదుపాయం మరి ఇదే…
శ్రీ కృష్ణమోహన్ గారు ఇప్పటిదాకా ప్రచురించిన మూడు పుస్తకాలు, ఇచ్చి మమ్మల్ని సత్కరించారు.
PGW1PGW3PGW2

    మొదటి రెండు పుస్తకాలకీ ముఖచిత్రం వేసినదెవరో తెలిసికోడం ఏమీ కష్టంకాదనుకుంటాను. ఇంక పుస్తకాలలోని content అంటారా, ఏదో శ్రీ కృష్ణమోహన్ గారు చెప్పారు కాబట్టి తెలిసింది కానీ, లేకపోతే PGW వ్రాసిందీ అని తెలిసేదేకాదు.అంత అమోఘంగా ఉన్నాయి.మూలాన్ని దృష్టిలో పెట్టుకుని, పాఠకులకి అర్ధం అయేటట్టు, మన భాషలో,మన యాసలో, మన వాతావరణం, పేర్లూ వ్రాస్తూ, ఎక్కడా మూలం లోని కథాగమనాన్ని చెక్కుచెదరకుండా వ్రాయడమంటే అంత తేలికా మరి? నాలాటి పామఱులకి కూడా PGW అంటే అభిమానం పుట్టేటంత అద్బుతంగా వ్రాశారు.ఇలాటి ప్రక్రియని అనుసృజన అంటారుట. అదికూడా, ఆ మూడో పుస్తకానికి శ్రీ జగన్నాధ శర్మగారు వ్రాసిన “ముందుమాట” లో చదివి తెలిసికున్నాను.ఈ ఒక్కమాట మాత్రమే ఆ పుస్తకంలోంచి రచయిత అనుమతి లేకుండా వాడుకున్నాను.క్షమించాలి శ్రీ కృష్ణమోహన్ గారూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేనికైనా పెట్టిపుట్టాలంటారు అందుకేనేమో….

    ఓ అంటే ఢం కూడా రాని నాలాటివాడికి, అంతంతమంది ప్రఖ్యాత సాహితీపరుల తో ఓ ఆరుగంటలు గడపకలిగానంటే మరి ఏం చెప్పమంటారూ? వారందరి గురించీ, ఏవో పత్రికల్లో చదవడమే కానీ, ప్రత్యక్షంగా చూస్తానని ఎప్పుడైనా అనుకున్నానా ఏమిటీ? అందుకే ఈ టపాకి శీర్షిక అలా పెట్టాను.

   ఆమధ్యన మమ్మల్ని సిమ్లా, హరిద్వార్ దర్శనాలు చేయించిన శ్రీ దాసరి అమరేంద్ర గారు తమ అరవయ్యో జన్మదినం భాగ్యనగరంలో సాహితీమిత్రుల సమక్షంలో జరుపుకుంటున్నారనీ, వీలుంటే తప్పకుండా వచ్చి, ఆ కార్యక్రమంలో పాలుపంచుకుంటే తనకూ సంతోషంగా ఉంటుందనీ, చెప్పడమేమిటి, మేము సరే అనేశాము.అయినా ఊరుకోలేక, ఎవరెవరు వస్తున్నారండీ అని కూడా అడిగేశాను. ( అసలు నాకెందుకూ, ఆయన ఎవరెవరిని పిలుస్తారో, ఆయనిష్టం, మీకెందుకండీ, మన్ని పిలిచారూ, వెళ్దాం.. అని మా ఇంటావిడచేత చివాట్లు కూడా తిన్నాను).అయినా నోటి దురద తీరదుగా…

    ఆయనా ఏదో పెద్దవాణ్ణి కదా అని నేను అడిగినదానికి సమాధానంగా ఓ నాలుగైదు పేర్లు చెప్పారు.అందులో ఒకరు శ్రీ కె.శివారెడ్డిగారు, నవ్య సంపాదకులు శ్రీ జగన్నాధ శర్మగారూ, శ్రీ వివినమూర్తిగారూ, శ్రీఖదీర్ బాబు గారూ…శ్రీమతి కుప్పిలిపద్మగారూ, శ్రీ శ్రీపతిగారూ. వీరందరి పేర్లూ ఎక్కడో అక్కడ చదివినవే, శివారెడ్డిగారైతే సాహిత్యేకాడెమీ బహుమతి వచ్చినవారూ, శర్మగారు నవ్య ద్వారా వారంవారం సుపరిచితులే. శ్రీ వివినమూర్తిగారి కథలైతే ఎన్నో చదివాను. వోరినాయనోయ్ ఇంత పెద్దపెద్ద వారితో, మమ్మల్నీ ఆహ్వానించారంటే, శ్రీ అమరేంద్ర గారికి మామీద ఎంత అభిమానముందో తెలుస్తుంది.

    ఉద్యోగంలో ఉండే రోజుల్లో కొంతమందిని చూశాను- వారింట్లో ఎదైనా శుభకార్యం జరిగితే ఇచ్చే రిసెప్షన్లు మామూలు ఉద్యోగులకి ఒకసారీ, పెద్దపెద్దవారికి ప్రత్యేకంగానూ ఇచ్చేవారు.అలాటి so called elite gathering లలో మామూలువారికి ప్రవేశం ఉండేది కాదు. దానికి విరుధ్ధంగా ఇప్పుడు మాలాటి అర్భకులని కూడా without a second thought, ఆహ్వానించారంటే, శ్రీఅమరేంద్రగారి సంస్కారం ఎంత గొప్పదో తెలుస్తోంది.దానికి సాయం, ఆయనమీద నా అభిప్రాయం ఏమిటో కూడా వేదిక మీద చెప్పమన్నారు ! అదంతా తరువాత చెప్తానులెండి.

    శతాబ్దిలో బయలుదేరి, రెండున్నరకల్లా సికిందరాబాద్ లో ఓ హొటల్ లో దిగి, అదేదో “ఫ్రెష్” అయిపోయి, బేగంపేట Air Force Station కి నాలుగింటిలోపల చేరిపోయాము.ఆ హొటల్ ఏదో ముందర చూడ్డానికి బాగానే ఉంది, రాత్రికి తెలిసింది, ఎంత దౌర్భాగ్యపు హొటలో అది! నెట్ లో ఏవో రివ్యూలు చూసి బుక్ చేశాను, స్టేషనుకి మనిషినికూడా పంపాడు. తెల్లారకట్ల కరెంటు పోయేసరికి, లైటూ, ఫాన్నూ, ఏసీ ఆగిపోయాయి సరే, ఓ కిటికీ కూడా లేదు. నా దారిన నేను పడుక్కున్నాను, మా ఇంటావిడైతే నానా బాధా పడింది. దిక్కుమాలిన రివ్యూలు చదివి హొటళ్ళు బుక్ చేసికోకూడదని జ్ఞానోదయం మాత్రం కలిగింది.అయినా అన్నీ బాగానే ఉంటే మొహం మొత్తేయదూ? ఇలాటి అనుభవాలు కూడా కలిగితేనే కానీ ట్రిప్పు పూర్తయినట్టుండదు !

   అందరూ వచ్చినతరువాత కార్యక్రమం మొదలెట్టారు. ముఖ్యాంశం శ్రీ అమరేంద్రగారు వ్రాసిన రెండు పుస్తకాలు ఆత్మీయమ్DA, సాహితీయాత్ర DA2 ల ఆవిష్కరణ. ఒకరి తరువాత ఒకరు, శ్రీ అమరేంద్రగారితో వారికి ఉన్న అనుబంధాల గురించి మాట్టాడారు. వారంతా ఏదో ఒక రూపంలో ఆయనతో గత నలభై ఏళ్ళగా పరిచయం ఉన్నవారే, ఉద్యోగరీత్యా అనండి, సాహిత్య ప్రయాణం అనండి,లేదా దగ్గరబంధువులనండి, వారివారి మధుర జ్ఞాపకాలు అందరితోనూ పంచుకున్నారు. అమ్మయ్య నా పేరు చెప్పలేదూ బతికిపోయానూ అనుకున్నంత సేపు పట్టలేదు, ఇంతలో వారి అబ్బాయి రాహుల్ , “మానాన్న గారి latest friend..” అని నా పేరు చెప్పేశాడు.ఏదో కూర్చుని కబుర్లు చెప్పమంటే చెప్పగలను కానీ, ఇలా అంతమంది ప్రముఖుల సమక్షంలో మైక్కులో చెప్పమంటే ఎలాగండి బాబూ, ఎప్పుడూ మైక్కులూ అవీ చేతిలో పెట్టుకుని మాట్టాడడం రాదాయె, అదృష్టం ఏమిటంటే, మైక్కు చేతిలో పెట్టుకోవలసిన అవసరం కలగలేదు.ఆ మైక్కులేవో fix చేసేఉన్నాయి. ఓ గొడవొదిలింది, లేకపోతే కాళ్ళూ చేతులూ వణికి, ఆ మైక్కేదో కిందపడేసేవాడిని. ఆ విడియో తీస్తున్నవారి ఫ్లాష్ లైట్లూ ..ఏమిటో అంతా గందరగోళం అయిపోయింది. ఏమైనా కాగితమ్మీద వ్రాసుకున్నానా ఏమిటీ, చదివేస్తే ఓ పనైపోఏది. అబ్బే ఎక్కడో విన్న ఎక్స్టెంపో ట. అప్పటికప్పుడే చెప్పేయాలిట.

    కిందపడిపోకుండా, ఆ మైక్కులు పట్టేసికుని, ఎదురుగుండా ఒక్కడు కనిపిస్తే పాపం, అంతా అంధకారమయం, ఏం పేలానో తెలియదు.మొత్తానికి మొహమ్మాటానికి చప్పట్లైతే కొట్టారు.. ఏది ఏమైనా మనస్పూర్తిగా ఆయనమీద నా అభిప్రాయమైతే చెప్పగలిగాననే భావిస్తున్నాను.. నా నాలుగుమాటలూ పూర్తికాగానే snacks కోసం బ్రేక్కిచ్చేశారు. ఆ బ్రేక్ తరువాత కేక్ కటింగూ, ఆ తరువాత రాహుల్-సురభిల ఉంగరాల exchange.ఈ మధ్యలో మరి వాళ్ళందరినీ కలియకలిగామని documentary proof ఉండొద్దూ మరీ, Autograph.

    అలాగే కొన్ని ఫొటోలూ అవీకూడా తీశాను.hyd 001hyd 028kb 002hyd 016

    తరువాత భోజనం. పదిన్నరయింది.అదేదో హొటల్ లో దిగాముగా, అక్కడికి వెళ్ళొద్దూ, మళ్ళీ మా అమరేంద్రగారే దిక్కు ! వారి స్నేహితురొకరితో చెప్పి, మమ్మల్ని సికిందరాబాద్ లో దింపేయమన్నారు.ఎక్కడా శ్రమ పడఖ్ఖర్లేకుండా,కాలు కిందెట్టఖ్ఖర్లేకుండా, మమ్మల్నిక్షేమంగా చేర్చే బాధ్యతకూడా తీసికున్నారు. That is what Mr.Amarendra is..స్నేహానికి ప్రాణంపెట్టడమంటే ఇదే మరి. వారికి మాతో పరిచయం ఏణ్నర్ధం క్రితం, అయినా మాలో ఏం చూశారో కానీ, ప్రాణమిత్రులయిపోయారు.ఆయనలో మాకు నచ్చింది ఆయన నిరాడంబరత్వం, స్నేహానికి ప్రాణం పెట్టే తత్వం, అవతలివారిని తన మాటలతో ఎక్కడా నొప్పించకుండా, తననుకున్నదేదో నిర్మొహమ్మాటంగా వ్యక్తపరచడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. అలాటివారు, మమ్మల్నికూడా తమ స్నేహితుల జాబితాలో చేర్చుకోడం మా అదృష్టం...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-” Domestic help” అనబడే పనిమనిషి….

   ఇదివరకటి రోజుల్లో వంటవరకూ ఏదో ఇంటియజమానురాలే చేసేవారు. మిగిలిన పనులకి అంటే ఆరోజుల్లో పెరడూ, వాకిలీ లాటివి ఉండేవి కనుక, అక్కడంతా తుడిచి, కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టడమూ, పెరడంతా తుడవడమూ, ఇల్లు ఊడచడమూ, వంటగిన్నెలు కడగడమూ, ఈ మధ్యలో బట్టలు ఉతికి ఆరేయడమూ.. వగైరా..వగైరా.. లకి ఓ పనిమనిషుండేది.కాలక్రమేణా ఇళ్ళూ, వాకిళ్ళూ, పెరళ్ళూ చరిత్ర లోకి వెళ్ళిపోయాయి.ఎపార్టుమెంట్లొచ్చాయి.వాటికి వాకిలిమాట దేముడెరుగు, ‘గడప’ లాటిదే ఉండదు, గొడవే లేదు.వారికి ప్రత్యేకంగా జీతభత్యాలని ఉండేవి కావు. పైగా ఒక మనిషొచ్చిందంటే ఆమెతో ఒక personal bonding ఏర్పడిపోయేది.ఇంట్లో మనిషిలా ఉండేది.

కాలక్రమేణా అదేదో inflation ధర్మమా అని కుటుంబ ఖర్చులు అందరికీ పెరిగేయి. దానితో ప్రతీదానికీ ఒక రేటనేది ఏర్పడింది.నగరాల్లో పనిమనుష్యులు దొరకాలంటే ఓ పెద్ద యజ్ఞం లా తయారయింది.మన అవసరాలని బట్టి వారి demandసూ పెరిగాయి. భార్యా భర్తా ఉద్యోగాలు చేస్తున్న ఈరోజుల్లో డబ్బుకేమీ కొదవలేదుగా, దానితో, పనిమనుష్యులు ఎంత demand చేస్తే అంతా ఇచ్చే స్థాయిలోనే ఉన్నారు. ఇంట్లో పెద్దవారెవరైనా ఉంటే ఫరవాలేదు కానీ, అలా లేకుండా ఈ జంట ఒక్కరే ఉండేమాటైతే,వీరి convenience ప్రకారమే ఆ పనిమనిషి రావాలిగా. అలా కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళెవరైనా ఉంటూంటే సంగతి వేరూ, కనీసం పనిమనిషి వచ్చేవేళల్లో ఏవో కొద్ది మార్పులు చేసికోవచ్చు. కానీ ఈరోజుల్లో ఇళ్ళల్లో పెద్దవారుండే పరిస్థితులు తక్కువే. ప్రతీవారూ విడిగానే ఉండడం prefer చేస్తున్నారు. ఎవరి కారణం వారిదీ. కానీ ఇందులో బాగుపడ్డవాళ్ళు మాత్రం definete గా పనిమనుష్యులే అని నా అభిప్రాయం.

పైగా వీటికి సాయం, ప్రభుత్వం వారుకూడా,welfare measures పేరుతో వారికీ కనీస వేతనం ఇవ్వాల్సిందే అని ఒక చట్టం తేబోతున్నారుట.త్వరలో రాబోయే ఆ చట్టం గురించి అభిప్రాయాలు ఇక్కడ చదవండి.

చట్టాలు తయారుచేసేముందు, అసలు ఎవరూ వివరంగా ఆలోచించరా, ఆలోచించినా పోనిద్దూ, మనం ఓ చట్టం చేసేద్దాము, వాళ్ళ గొడవేదో వాళ్ళే పడతారు అనా?. ఉదాహరణకి పనిమనుష్యుల కనీస వేతనం గురించే చూద్దాం- కనీస జీతం ఫలానా అంత ఉండాలీ అన్నారు, చేయవలసిన పనులేమిటీ, ఎంతసేపు ఉండాలీ, ఒక్కో పనీ ఎంతసేపు చేయాలీ ఇలాటివాటి మాటేమిటీ? పోనీ ఏదో నాలుగ్గంటలుండాలీ అన్నారనుకుందాం, ఉన్న మూడుగదులూ సావకాశంగా ఆడుతూ పాడుతూ తుడుస్తూ, నాలుగ్గంటలూ గడిపేసి, అంట్ల గిన్నెలు కడగడానికి టైమయిపోయిందంటే, ఆ “ప్రభుత్వం” వారొచ్చి గిన్నెలు కడుగుతారా? ఇలాటి సమస్యలొస్తాయి.

ఇంకో సంగతేమంటే వీళ్ళకీ యూనియన్లూ వగైరాలుంచుకోవచ్చుట.మళ్ళీ అదో గొడవా.సైనిక దళాలకీ, పోలీసు వ్యవస్థకీ ట్రేడ్ యూనియన్ అనుమతించరే ప్రభుత్వం వారు, మరి వీళ్ళకి మాత్రం ఎందుకుట? వాళ్ళని కూడా essential services లోకి వేసేయొచ్చుగా… అలాగని నేను ఏదో ఫ్యూడల్ వ్యవస్థకి చెందినవాణ్ణీ అనిమాత్రం అనుకోకండి.అలాగని మరీ లెఫ్టిస్ట్ సిధ్ధాంతాలూ కావూ.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అత్తగారు కొట్టిందనా లేక తోడికోడలు నవ్విందనా…

    నిన్నంతా మహాశివరాత్రి హడావిడితో సరిపోయింది. అలాగని ఉపవాసాలూ అవీ చేసేటంత ఓపిక లేదనుకోండి. మా ఇంటావిడకి moral support మాత్రం extend చేసి రాత్రి ఒంటిగంటన్నరదాకా భక్తీ టీవీ, SVBC లో ప్రత్యక్షప్రసారాలు చూస్తూ ఓ half జాగరణ మాత్రం చేశాను.

    ప్రొద్దుణ్ణించీ టీవీ లో ఒకటే గొడవ- వాడెవడో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసికున్నాడని. ఆమధ్య జరిగిన అమానుష కాండలో దోషిగా పట్టుబడ్డవారిలో ఇతను ముఖ్యుడు. అప్పుడు పట్టుకున్నప్పుడుమాత్రం దేశం దేశమంతా ఘోషించింది దోషుల్ని ఉరి తీయండీ అని.మరి వారు చేసిన పని కూడా అలాటిదే కదా.కొందరన్నారు ఉరితీయకూడదూ, ఇంకోటేదో కఠిన శిక్ష వేయండీ అంటూ ఎన్నెన్నో సలహాలొచ్చాయి. అదేదో fast track court ట , దాంట్లో విచారణా మొదలెట్టారు.మొదట్లో లాయర్లెవరూ అసలు ఈ కేసే వాదించకూడదన్నారు. అదన్నారు ఇదన్నారు. మొత్తానికి ఆయనెవరో లాయరుగారు కేసులో దోషులతరపున వాదించడానికి వకాల్తా పుచ్చుకున్నారు. ఆ విచారణేమో in camera లో చేయాలన్నారు.ప్రజానీకానికి కానీ, మీడియాకి కానీ అసలేమవుతోందో తెలియని పరిస్థితి. ఇదివరకు చాలా కేసుల్లో విచారణ సమయంలోనే అందరినీ అనుమతించిన కోర్టులకి ఈ విషయంలో మరి అంత జాగ్రత్తలు ఎందుకో వారికే తెలియాలి.

    ఈ గొడవంతా జరుగుతూంటే ఆ ముఖ్యదోషి ఈవేళ ప్రొద్దుటే ఉరేసికుని చనిపోయాడుట. అదీ న్యూస్.అంతే మన మీడియావాళ్ళందరూ పేట్రేగిపోయారు. అలా ఎలా కుదురుతుందీ, శిక్షనుంచి తప్పించుకుంటే ఎలా? అని కొందరూ,ప్రొద్దుణ్ణించి చానెళ్ళలో ఘోష పెట్టేస్తున్నారు. అతని లాయరుగారైతే ఇంకో అడుగు ముందుకేశారు- కేసు చాలా బాగా నడుస్తోందీ,దోషిమీద కేసే ఉండకపోవచ్చూ,ఇలాటి పరిస్థితుల్లో తను ఆత్మహత్య చేసికుంటాడని అనుకోనూ, ఇదంతా ఓ కుట్రా, నా కొడుకు ఆత్మహత్య చేసికునేటంత పిరికివాడు కాదూ అని అతని తండ్రీ, జైళ్ళలో సంస్కరణలు జరగాలీ అని ఇంకోరూ, ఏమిటేమిటో చెప్తున్నారు. ఓ రెండు రోజులు హడావిడిగా ఉంటుంది.

    సంస్కరణలూ వల్లకాడూ అంటూ కబుర్లు చెప్పేస్తున్నారే ఈ నాయకులూ,న్యాయవాదులూ మరి ఉత్తర్ ప్రదెశ్ లో ఈమధ్యన అదేదో కేసులో ఇరుక్కున్న ఆ మంత్రెవడో, అప్పటికే ఓ డజను కేసులదాకా ఆరోపింపబడ్డవాడిని ఆ రాష్ట్ర జైళ్ళ శాఖామంత్రిగా చేసినప్పుడు
నిద్రపోతున్నారంటారా?
ఈ టపాకి పెట్టిన శీర్షిక లో అన్నట్టుగా ఆ దోషికి శిక్షపడలేదనా లేక తనే శిక్షించుకున్నాడనా ఇప్పుడు గొడవ?

   నిన్న ఏదో తెలుగుపుస్తకంలో చదువుతూంటే ఒక లింకు దొరికింది. భారతీయతా, హిందుత్వం మీదా ఆసక్తి ఉన్నవారు ఒకసారి చూడండి. మన ధర్మాలమీద మనం నోటికొచ్చినట్టు మాట్టాడతాము. కానీ ఒక అమెరికన్ ఎంతో పరిశోధనలు చేసి, హిందూమతం, దేముళ్ళ విశిష్టతా ఎంత బాగా చెప్పారో. కొన్ని విడియోలు కూడా ఉన్నాయి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- “కలల అలలపై తేలెను….”

    ముత్యాలముగ్గు సినిమాలో ముళ్ళపూడి వారి డయలాగ్గు రావుగొపాలరావు గళంద్వారా వినిపించిన ” దేనికైనా కొంత కలాపోసన..” అనేదుండాలి , అన్నట్టుగా, నాకైతే కలాపోసన అబ్బలేదనుకోండి. కానీ ఎవరైనా ఆ దృష్టి తో ఏవ్యాసమైనా వ్రాస్తే మటుకు, నిజమే కదూ అనుకుంటాను. ఆ కోవలోకి చెందిందే ఈ క్రింద ఇచ్చిన వ్యాసం. మా స్నేహితులు శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు, ఆయన ఆ దృష్టి తో చూసి, దానికి అక్షరరూపం కల్పించి, ఆయన ఆస్వాదించడమే కాక, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉన్న ప్రతీవారూ, దానిని ఆస్వాదించాలని ఆయన ప్రగాఢ కోరిక.

   ఈ introduction అంతా దేనికంటారా– “గులేబకావళి కథ” చిత్రంలో అందరికీ “నన్నుదోచుకుందువటే..” అనే పాటైతే నచ్చేస్తుంది. కానీ, చెప్పానుగా కళాదృష్టి తో చూసేవారికి ఇంకో పాట–“కలల అలలపై..”-అన్నది ఎంత మధురంగా ఉందో తెలియడానికి ఆయన చెప్పినట్టుగానే ముందుగా ఇక్కడ ఆ దృశ్యం చూసి, ఆ పాటమీద శ్రీ కృష్ణమోహన్ గారి అభిప్రాయం
ఇక్కడకలల అలలపై.. చదివి, మీ అభిప్రాయం కూడా చెప్పండి.