బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-టైంపాస్

   మొత్తానికి మా కల్మాడీ గారిని జైల్లో కూర్చోపెట్టారండీ.ఏదో పబ్లిసిటీ కి కాకపోతే, అతనికేమీ సమస్య కాదు బయటకొచ్చేయడానికి.కామన్వెల్తు క్రీడలు జరిగిన రెండు మూడు నెలలదాకా, బయటే తిరగనిచ్చి, దాటించేయవలసినవేవో, దాటించనిచ్చి,దొంగలొచ్చిన ఆరునెలలకి కుక్కలు మొరిగినట్లు, ఇప్పుడు అరెస్టులు చేస్తే లాభం ఏమిటంట? ఏదో ప్రజలకి ఓ కుచ్చు టోపీ పెట్టడంకాపోతే? సుప్రీం కోర్టు వారు స్వయంగా విచారణ ప్రారంభించారు కాబట్టి ఈమాత్రమైనా సాధించారు.
2జి స్కాం లో కరుణానిధి కూతురిని కూడా, రాజాతో పాటు జైల్లో తోసేస్తే, ఓ గొడవొదిలిపోతుంది.

   నల్లధనం గొడవకూడా సుప్రీం కోర్టు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, మా పవార్ నీ,ఆయన కూతురినీ, అలాగే మిగిలిన అతిరథ మహారథులినీ జైల్లో కూర్చోబెట్టి, వాళ్ళు సంపాదించినదంతా ప్రభుత్వ పరం చేయడం మొదలెడితే, ఎప్పటికో అప్పటికి దేశం బాగుపడుతుందేమో అనే ఆశైనా ఉంటుంది.చూద్దాం, మన తలరాతలెలా ఉన్నాయో?

   ఎక్కడో చదివాను- బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళ డ్రెస్కోడ్ మారుస్తారుట! దేనికైనా ఓ హద్దూ అదుపూ ఉండాలి. డ్రెస్సులు కురచచేస్తే,పాప్యులారిటీ పెరుగుతుందీ అని అనుకుంటే,అంతకంటె హాస్యాస్పదం ఇంకోటుండదు.బహుశా అదికూడా రైటేనేమో!సినిమాల్లో చూడ్డంలేదూ,ఏదో ఐటమ్ సాంగని పేరెట్టి, గెంతులూ అవీనూ!అలాగే ఇదీనూ.ఐపిఎల్ (తమాషా) ఎంజాయి చేస్తున్నారనుకుంటా.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంక నా మాటెక్కడ వింటుందీ?

   ఏదో గుప్పిడి మూసుంచినంతకాలమే మనం అవతలివారిని ఊరించొచ్చు! గుప్పిడి తెరిస్తే ఏముందీ, ఓస్ ఇంతేనా అనిపిస్తుంది, పైగా, మన వాల్యూ కూడా పడిపోతుంది!మహ అయితే, పెళ్ళై వచ్చిన 39 సంవత్సరాల్లోనూ, ఒకటి రెండు సార్లు, మా ఇంటావిడ ఒక్కర్తీ తణుకు నుంచి పూణె వచ్చుంటుంది. అప్పుడుకూడా, మొదటిసారి మా అమ్మాయి ( అప్పుడు వయస్సు అయిదారేళ్ళు!), రెండోసారి పిల్లలిద్దరితోనూ.అంటే నా ఉద్దేశ్యం, నేను లేకుండా ఎప్పుడూ ప్రయాణం చేయదు. అమ్మాయిదగ్గరకు ఢిల్లీ లో ఉన్నప్పుడు, ఏరొప్లేన్ లో వెళ్ళడం వదిలేయండి,కోటానుకోట్లిచ్చినా నాకు ఎయిర్ లో వెళ్ళడం భయం! నేను చెప్పేదేమిటంటే బస్సుల్లోనూ, ట్రైన్లలోనూ అన్నమాట.

   ఉద్యోగంలో ఉన్నంతకాలం, మా ఇంటావిడ పిల్లల చదువులూ, శలవలూ వగైరా కారణాలచేత, పుట్టింటికి వెళ్ళాలనే కోరిక చాలామట్టుకు కంట్రోల్ చేసికుంది. ఏదో మరీ ముఖ్యమైనవి వదిలేయండి, ఉదాహరణకి, మా మామగారి షష్ఠిపూర్తీ కం బావమరిది ఒడుగూ తప్పవు. పైన వ్రాశానే కారణాల్లో ‘వగైరా’, అసలు ముఖ్యమైన కారణం అదే! ‘వగైరా’ అంటే, అంతదూరం టిక్కెట్ల డబ్బులు పెట్టుకోలేకా!దానితో, పిల్లలూ చదువులూ, శలవలూ అని కారణాలు చెప్పి తప్పించుకోవడం అన్నమాట! పిల్లలుంటే ఇదో పెద్ద ఎడ్వాంటేజీ! అన్నిటికీ వాళ్ళమీద పెట్టేయొచ్చు!

   ఏ శలవురోజైనా బయటకు వెళ్ళి గడిపి ఏ హొటల్లోనో భోజనం చేసి రావాలనుందనుకోండి, పిల్లలకోసం అని ఓ వంక పెట్టేసికోవచ్చు.అంతదాకా ఎందుకూ, భార్యకి చిరాగ్గా ఉన్నా, పిల్లనో,పిల్లాడినో పక్కలో వేసికుని పడుక్కుంటుంది.!అంతేకానీ, ఎంత మొత్తుకున్నా భర్తని దగ్గరకు రానీయదు!ఏమిటో ఈ పిల్లలు పుట్టినదగ్గరనుండీ, తల్లితండ్రులని కంట్రోల్ చేసేయడమే!పెద్దైన తరువాత ఎలాగూ వాళ్ళ కంట్రోలే! అయినా సరే అస్తమానూ గోలెడతారు, అక్కడకి తల్లితండ్రులేదో వాళ్ళని కంట్రోల్ చేసేశారూ అని!అ పెళ్ళైన మూడు నాలుగు సంవత్సరాలూ తప్పించి, జీవితమంతా పిల్లలకోసమే. ఇంట్లో ఏదైనా తినే వస్తువు కొంటే, నోరు కట్టుకుని వాళ్ళకోసం ఉంచేయడం.ఏమైనా అన్నా కానీ, ఆ తల్లి ‘పొన్లెద్దురూ పాపం మన అబ్బాయి/అమ్మాయి కి ఇదంటే ఎంత ఇష్టమో’ అనేసి, ఓ ‘సెంటిమెంటు’ దెబ్బ కొట్టేస్తుంది!
పోనీ ఇంతచేసినా, ఇంకా అదేదో చేయలేదూ, ఇదేదొ చేయలేదూ అని జీవితాంతం వాళ్ళదగ్గరనుండి దెప్పులు వినడమే.మనం కూడా అలాగే చేశామనుకోండి,అయినా ఆ సంగతిప్పుడెందుకులెండి?మన గురించీ, మన తల్లితండ్రులు అలాగే అనుకున్నారేమో అనే ఆలోచనకూడా దగ్గరకు రానీయము!మళ్ళీ అదేదో గుర్తు చేసికుంటే, ఈ టపాలు వ్రాయడం ఎలాగ వీలౌతుందీ? ఏదో ఆ సంగతులు, కన్వీనియెంటుగా ‘మర్చిపోయి’ ఇలా వ్రాసుకోవడమే బావుంటుంది! అదో సరదా!!

   ఎక్కడో మొదలెట్టి ఎక్కడకో వెళ్ళాను. మా ఇంటావిడ ‘ఒంటరి’ ప్రయాణం గురించి కదూ ఈ టపా, నిన్న జన శతాబ్ది లో బయలుదేరి, హైదరాబాద్ లో ‘కెసినెని ట్రావెల్స్’ బస్సులో, మా వియ్యాలారు ఎక్కిస్తే మొత్తానికి, తణుకు క్షేమంగా చేరిందిట! ఎంతైనా కట్టుకున్న భార్యాయే, ప్రతీ నాలుగ్గంటలకీ ఫోన్లు చేసి, క్షేమసమాచారం కనుక్కోవడంతోనే సరిపోయింది! నేనే ఫోను చేయాలి, తను చేస్తే మళ్ళీ డబ్బులయిపోవూ?తెల్లారకట్ల, నాలుగున్నరకి ఫోనూ, వాళ్ళమ్మాయి క్షేమంగా చేరిందని, మా అత్తగారిదగ్గరనుంచి, ‘అదేమిటీ ని ఫోనెమయిందీ’ అని అడిగితే, దాంట్లో ఛార్జింగైపోయిందీ అని సమాధానం!

   పైగా కొసమెరుపేమిటంటే, ‘ప్రయాణం చాలా కంఫర్టబుల్ గా జరిగిందీ, ఈసారెప్పుడైనా ఒక్కర్తినీ రావడానికి సమస్యేం ఉండదూ..’అని! అయిపోయింది నా పని! ఇంక నా మాటెక్కడ వింటుందీ....

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఆంధ్రభూమి లో నా వ్యాసం..

sowjanya _ ‘______ __’ ___________ __..

టపాలు వ్రాసి మిమ్మలనందరినీ మరీ బోరుకొట్టేస్తున్నానేమో అని, ఈ మధ్యన ప్రింటు మీడియాలో, మిగిలిన వారందరినీ కూడా పట్టుకున్నాను. ఈ సందర్భంలో, ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించిన వ్యాసం పైన sowjanya.. మీద ఓ నొక్కు నొక్కండి. మీ అభిప్రాయం కూడా చెప్తే సంతోషిస్తాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- మరీ వాళ్ళేమీ పాపం చేయలేదండీ…

   ఈ రోజుల్లో చాలా ఇళ్ళల్లో వినే మాట ఏమిటంటే, ‘ ఏమిటోనండి, మా చిన్నప్పుడు, మాకేది ఇష్టమో తెలిసికోకుండా, మా తల్లితండ్రులు చెప్పిందే చదివి, వాళ్ళబలవంతం మీదే ఇంజనీరింగూ, మెడిసినూ చదవవలసి వొచ్చిందీ, మాకు దేంట్లో ఇంటరెస్టుందీ చెప్పుకోడానికి కూడా స్వతంత్రం లేదూ, అందువలన మా పిల్లలకి అలాటి పరిస్థితి రాకుండా,We treat them as our friends’, అనడం ఓ ఫాషనైపోయింది.వినడానికి బాగానే ఉంటుంది ఎవరికీ ఈ నవతరంలోని తల్లితండ్రులకి. అస్తమానూ, వాళ్ళ తల్లితండ్రులేదో, వాళ్ళని హింసపెట్టేశారూ అని దిన్ భర్ మొత్తుకోకుండా, అసలలాటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలిసికోడానికి, ప్రయత్నం, atleast a cursory attempt చేశారా ఒక్కరైనా?

అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదే మంచి అనే అపోహలో ఉన్నట్లే.ఒకసంగతి చెప్పండి, మీరు అంటే ఇప్పటి తల్లితండ్రులు, మీరు చదువుకునే రోజుల్లో, పరీక్షలై శలవలు మొదలెట్టిన తరువాత ఏం చేసేవారు? ముందుగా, ఆ ఏడాదంతా ఔపోసన పట్టిన పుస్తకాలని, అటకెక్కించేయడమో, ఇంకోరెవరికైనా అవసరం వస్తే వాళ్ళకిచ్చేయడమో. వరుసగా ఓ వారం రోజులపాటు, అలుపూ సొలుపూ లేకుండా, ఊళ్ళో ఉన్న సినిమాలన్నీ చూసేయడం,ఎండొచ్చేవరకూ నిద్రలేవకపోవడమూ,అప్పుడు మెల్లిగా స్నానం పానం చేసి, అమ్మ పెట్టేదేదో తిని, మళ్ళీ ఊరిమీద పడడం. అంతేగా. మీ అమ్మా నాన్నా ఎప్పుడైనా ఒక్కసారైనా ఏమైనా అన్నారా? పోన్లెద్దూ, ఏడాదంతా శ్రమ పడి చదివాడూ, శలవల్లోనైనా రిలాక్స్ అవనీ అనేవారు కానీ, అస్తమానూ ఊరిమిద పడి తిరుగుతావేమిటిరా అని ఒక్కటంటే ఒక్కసారైనా మీతో అన్నట్లు గుర్తుందా?ఆలోచించండి.

కానీ మీరు ఇప్పుడు, అక్కడికేదో మీకు అన్యాయం జరిగిపోయిందనే flimsy excuse తో ,మీ పిల్లలని పెడుతున్న హింస ఏమిటీ? శలవలొచ్చేసే ముందరే, నెట్ లో వెదికేసి, ఊళ్ళో ఎక్కడెక్కడ ఏ ఏ so called కళల్లో, కోచింగ్ క్లాసులున్నాయో తెలిసికుని, వాళ్ళని రోజంతా కోచింగులకే కదా పంపేది? Idea is to keep them fully engaged. ఏమైనా అంటే, మా వాడికి ఫలనా గిటార్ అంటే ఇష్టమండీ, డ్రాయింగంటే ఇష్టమండీ,ఫలానా యోగా అంటే ఇష్టమండీ, ప్రాణాయామం అంటే పడి చస్తాడు.సంగీతం అంటే చెవి కోసుకుంటుంది అనే వంకతో ప్రొద్దుటే హిందుస్థానీ, సాయంత్రం కర్నాటక సంగీతమూనూ. ఈ మధ్యలో టైముంటే జిమ్మూ.ఇవన్నీ వాళ్ళకి ఇష్టం అని మీకు చెప్పారా? వాళ్ళని అడిగేదేమిటిలే అని మీరే డిసైడ్ చేసేశారా? ఉన్న నెలా పదిహెను రోజులో, రెండు నెలలో శలవుల్లో, ఇన్నేసి కళల్లో వాళ్ళు అంటే మీ పిల్లలు,expert అయిపోతారని మీరెలా అనుకున్నారసలు?ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు మీరు తెలిసికోనఖ్ఖర్లేదా? మీ తల్లితండ్రులు మిమ్మల్నేదో హింస పెట్టేశారని అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పే బదులు, మీరేం చేస్తున్నారో ఆలోచించండి.

కనీసం శలవులిచ్చిన తరువాత, ఒక పదిహేను రోజులు, వాళ్ళ దారిన వాళ్ళనుండనీయండి,Sky is not going to fall ! పోనీ ఈ శలవల్లో రోజంతా తిప్పలు పడి నేర్చుకున్నది, ఏడాదంతా నేర్చుకుంటారా? మళ్ళీ స్కూళ్ళూ, చదువులూ.వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, ఈ రోజుల్లో టి.వీ.ల్లో వస్తున్న రియాలిటీ షోలూ, వాటిల్లో వచ్చే ప్రైజు మనీ లూ చూసి, తమ పిల్లలేదో వెనక్కి పడిపోతారేమో అని, left,right,centre కోచింగులకి పంపేయడం. పోనీ అలాగని ఇలా ట్రినింగైన ప్రతీవారూ, టి.వీ.ల్లో వస్తున్నారా? అయిదారేళ్ళనుండి చూస్తున్నాము అవే మొహాలు, అవే పాటలు, అవే చానెళ్ళూ. మహ అయితే ఓ పది పదిహెనుమంది కొత్తవాళ్ళొచ్చారేమో? మరి ఈ మిగిలిన ట్రైనింగు పుచ్చుకున్న వాళ్ళందరూ ఏమైనట్లు? ఒక చానెల్ లో నెగ్గితే, ఇంకో చానెల్ లో రెండో మూడో స్థానం. అవే పాటలు, అదే జడ్జీలు, అవే పాటలూ.Everybody is being taken for a sweet ride! మరి ఇన్ని తెలిసీ, పిల్లల్ని,అంతంతేసి హింసలు పెట్టడం న్యాయమంటారా? ప్రతీ వాడూ prodigy అవడండి బాబూ. ఏ లక్షమందిలోనూ ఒకడుంటాడు.ట్రైనింగయిన ప్రతీ వాడూ ఓ సైనా నెహ్వాల్, ఓ విశ్వనాథన్ ఆనంద్ అవలేరు గా! అదేదో పెసిమిజం అనుకోకండి.పచ్చి నిజం.

ఇప్పుడు మీపిల్లలు ఎలా తయారవాలని ఆశిస్తున్నారో అలాగే మీ తల్లితండ్రులు కూడా తమ పిల్లలు అలా తయారవాలని ఆశించారు తప్ప, మరేమీ చెప్పుకోలేని పాపమేదో చేయలేదు. ఊరికే దిన్ రాత్ వాళ్ళమీద పడి, క్షోభ పెట్టకండి.ఏదో నిజంగానే తప్పు చేశామేమో అనే గిల్టీ ఫీలింగిచ్చేయకండి.వాళ్ళు బాధ పడేదల్లా ఏమిటంటే, వాళ్ళ పిల్లల పిల్లలు, అంటే మనవలూ, మనవరాళ్ళూ వారి బాల్యం అందులోని మధురానుభూతులూ కోల్పోతున్నారే అని!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Value for money….

   ఈయనకెప్పుడూ పనేమీ లేదూ, తన స్వంత అభిప్రాయాల్ని ఇంకోళ్ళమీద రుద్దడానికి టపాలు వ్రాస్తూంటాడు అని అనుకుంటే నేనేమీ చేయలేను. అలాగని నా అభిప్రాయాలు చెప్పకుండానూ ఉండలేను,ఏం చేయను? ఇప్పటి తరం వారు
అనుకుంటారూ ఇదికూడా పేద్ద issue నా అని.ఇదివరకే ఒకసారి విన్నవించుకున్నాను, దురదృష్టవశాత్తూ, నాలాటి వాళ్ళు చాలా మంది లేరులెండి. అధవా ఉన్నా, ఇంకెంతకాలం?ఓ పది పదిహేనేళ్ళు గడిచాయంటే, అంతా ‘కొత్త నీరే’ !
అన్నీ తెలిసికూడా మరి వాటిగురించి వ్రాయడమెందుకూ అంటే చాదస్థం అనండి, లేకపోతే తిన్నది అరక్కపోవడం అనండి, మీ ఇష్టం!

ఈవేళ మా ఇంటికెదురుగా ఉండే, మెగామార్టు కి వెళ్ళాను.పోనీ అక్కడ, మా అగస్థ్యకీ, నవ్య కీ ఏమైనా డ్రెస్ తీసికుందామా అనుకుని, వాటి ఖరీదులు చూసి, మానేశాను.అదేదో, జేబులో డబ్బులు లేక కాదు, డబ్బులకేముందీ, క్రెడిట్ కార్డుల ధర్మమా అని, డబ్బులు ఈయడానికి 45 రోజులు టైమెలాగూ ఉంటుంది.ఒక్కొక్కదానికి ఖరీదుకీ, రూపానికీ సంబంధమే లేదు. ఏణ్ణర్ధం పిల్లాడికి షర్టు సైజెంతుంటుందీ,ఓ రెండు జానలు! దాని ఖరీదు 900 రూపాయలుట! పోనీ ఎంతో కొంత, తీసికుందామా అనుకున్నా, తీరా తీసికెళ్తే, ఒకటో రెండు సార్లు వేసికోడానికి సరిపోతుంది. ఆ తరువాత,పాత బట్టల మూటలోకే కదా.అలాగని మరీ పెద్ద సైజూ తీసికోలేమూ.బుళాఖీ లాటి డ్రెస్సులు వేస్తామా ఏమిటీ?

వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే,ఈరోజుల్లో జీతాలు అయిదంకెల్లోనూ, ఆరంకెల్లోనూ వస్తున్నాయి.పిల్లలతో గడపడానికి తల్లితండ్రులకి టైమే ఉండడం లేదు, ఆ వచ్చిన వీకెండ్ కాస్తా పిల్లలమీదే ఖర్చుపెట్టాలనిపిస్తుంది,అదేదో ‘కన్ఫెషన్’ లాటిది చేస్తే, చేసిన పాపాలన్నీ పోతాయిట. .ఇది కూడా ఓ ‘కన్ఫెషన్’ లాటిదే కదా!అలాగే, ఈ రోజుల్లో పిల్లలతో టెలివిజన్ చూడాలంటే భయం, దానితో ఏమౌతోందీ వాళ్ళకి కావల్సిందేదో వాళ్ళే చూస్తారూ అని టి.వి.రిమోట్లు వాళ్ళకి అప్పచెప్పేస్తారు.ఇంక అస్తమానూ, వాళ్ళు ప్రశ్నలడగడం, వారి సందేహాలు తీర్చడం తల్లితండ్రులు వదిలించుకున్నట్లే కదా! ప్రొద్దుటనుండీ, ఆఫీసుల్లో శ్రమపడి వచ్చిన తరువాత, తామూ ఏదో రిలాక్సవుదామనుకుంటారు,మళ్ళీ పిల్లలతో గడపడానికి టైమెక్కడిదీ?This is a mutually acceptable arrangement. వీళ్ళకి వాళ్ళ గొడవుండదూ, వాళ్ళకి వీళ్ల గొడవుండదూ. గొడవల్లా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకే.ఏదో పిల్లల్ని, మనవల్నీ, మనవరాళ్ళనీ చూద్దామని, వారి ఆటపాటలు చూసి సంతొషిద్దామని వచ్చిన గ్రాండ్ పేరెంట్స్ కి కనిపించేదేమిటీ, కూతురు/కొడుకు, అల్లుడు/కోడలు చేతుల్లో సెల్ ఫోన్లూ,మనవళ్ళూ/ మనవరాళ్ళ చేతుల్లో రిమోట్లూ, ఐపాడ్లూ, మళ్ళీ అవేవో కన్సోల్ ట, ఇంటినిండా ఎక్కడచూసినా ఎలెక్ట్రానిక్ గాడ్జెట్లే. చెవుల్లో ఇయర్ ఫోన్లూ.ఎవరిని పలకరిస్తే ఏం తంటాయో తెలియదు. ఈ మధ్యలోనే,ఓ కుక్కు వచ్చి వంటలాటిది చేసేస్తుంది, ఇంకో ఆవిడొచ్చి ఇల్లంతా తుడుపూ, ఇంకోళ్ళు గిన్నెలు తోమేయడం.

కొంపనిండా మనుష్యులే. అయినా ఈ పెద్దాళ్ళకి ఒంటరితనమే!ఈమాత్రం దానికి అంతదూరం నుండి రావాల్సిన అవసరం ఉందా అనే పరిస్థితి.ఎవరి బాధలు వాళ్ళవి. ఎవరినీ తప్పుపట్టలేము.అన్నీ తెలిసినా ఏమీ చేయలెని నిస్సహాయత.పోనీ కూతురో కోడలో అంత శ్రమ పడి వస్తోందీ, వంటలో సహాయం చేద్దామా అనుకున్నా అబ్బే, ఈ ‘ముసలి’వంట తినే ఓపికెక్కడిదీ? ఏదో హోటల్ కి ఫోను చేసేయడమూ,ఏవేవో ఆర్డరు చేసి తెప్పించడమూ. ఇంక వీకెండ్లయితే ఏకంగా హొటల్ కే వెళ్ళడం. సరదాగా ఛేంజ్ కి హొటల్ కి వెళ్దామూ అని సమర్ధింపోటీ. ఛేంజేమిటీ, ప్రతీ రోజూ ఓ కుక్కే కదా వంట చేస్తుంట.ఇంట్లో కుక్కు చీరకట్టుకుంటుందీ, హొటల్లో షెఫ్ ఓ పాంటూ షర్టూ వేసికుని నెత్తిమీద ఓ టోపీ పెట్టుకుంటాడు, అంతే తేడా ! ఈ మాత్రం దానికి ఛేంజ్ అని సమర్ధింపెందుకూ? చేతిలో డబ్బులున్నాయి, వాటిని ఎంత తొందరగా ఖర్చుపెట్టేయాలా అనే కానీ,ఇంకో ఆలోచనుండదు.

చివరకు తేలేదేమిటయ్యా అంటే, ఈ రోజుల్లో ఇంట్లో పిల్లలు, ఎలెక్ట్రానిక్ గాడ్జెట్లతో పెరిగి పెద్దౌతున్నారు.కాలేజీ చదువైనప్పటినుండీ జీవనాధారం మళ్ళీ ఓ కంప్యూటరో, లాప్ టాప్పో.ఇంక వీళ్ళు మానవసంబంధాల మధురానుభూతులు ఎప్పుడు ఆస్వాదిస్తారండి బాబూ? మరి రేడియేషన్ కి expose అవుతున్నారో అని ఏడ్చి మొత్తుకోడం ఎందుకూ?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఏమిటో ఎవరి గొడవ వాళ్ళది ,,,

   అప్పుడెప్పుడో ఒక టపా వ్రాశాను. మా అందరికీ ( రిటైరయి ఆరేడేళ్ళు అయిన) ఎప్పుడో పాతికేళ్ళక్రితం మేము చేసిన ఓవర్ టైముకి ఆరోజుల్లో తక్కువ ఇచ్చారూ, ఇప్పుడు వాటికి సంబంధించిన బకాయిలు ఇస్తారూ అని.ఆ టపా వ్రాసెనో లేదో,మా ఫ్రెండు రామూ, ‘అయితే మాకందరికీ You may throw a party to all bloggers after getting the arrears.’ అని ఓ వ్యాఖ్య కూడా పెట్టేశారు!ఆలూ లేదు,చూలూ లేదూ కొడుకు పేరు సోమలింగంట అన్నట్లుగా ఉంది! అయినా ఎప్పుడో పాతికేళ్ళక్రితం చేసినదానికి ఎరియర్స్ వస్తాయంటే, నమ్మడమంత బుధ్ధితక్కువ పని ఇంకోటి లేదు! అదీ గవర్నమెంటోళ్ళా? ఇవ్వాల్సినవే ఇవ్వకుండా నొక్కేస్తారు, ఇలాటి వ్యవహారాల్లోనా వాళ్ళు లొంగేది?
ఎవరి సరదాలు వాళ్ళవి, ఎవరి ఆశలు వాళ్ళవి.మా ఫ్రెండొకాయనైతే అప్పుడే నాతో అన్నారు కూడానూ, అదేదో భండారా ఫాక్టరీలో, ఈ ఎరియర్స్ కాలుక్లేట్ చేయడానికి ఓ ప్రత్యేక సెల్ కూడా ఓపెన్ చేశారని! అక్కడికేదో, రిటైరయిన పక్షులందరికీ, ఏదో రూపాన తృణమో పణమో కట్టబెట్టాలని గవర్నమెంటు వెయిట్ చేస్తున్నట్లుగా! అదిగో తోకా అంటే ఇదిగో పులీ అన్నట్లుగా, ఎవరి లెఖ్ఖలు వాళ్ళు చేసేసికున్నారు.ఆ ఎరియర్స్ వస్తే ఏం చేయాలీ, ఎన్నెన్నో కలలు కనెసికున్నారు. ఏదో లాటరీ టిక్కెట్టు కొన్నామనుకోండి, దాని రిజల్ట్ వచ్చేదాకా కావలిసినన్ని కలలు కనెసికోవచ్చు! ఒక్క నయాపైసా ఖర్చవదు కలలకి. కొంతమందైతే నిద్ర పడితేనే కానీ కలలు కనలేరు. కొంతమందికి మాములుగా మెళుకువగా ఉన్నా చాలు. ఏ కారుకిందా, బస్సుకిందా పడకుండా శాల్తీ గల్లంతవకుండా ఉండాలి అంతే!

   అదేదో ఎరియర్స్ వచ్చేస్తాయని నేను ఏమీ కలలేం కనలేదు. నిజం చెప్పాలంటే నేను అసలు ఎప్లికేషనే పంపలేదు! I had my own doubts ! పోనీ అలాగని ఎవరితోనైనా అందామా అనుకున్నా, వెధవ శకునపక్షీ అని తిడతారేమో అనో భయం.గుంపులో గోవిందా గా ఉంటే నష్టం లేదుగా.అదే పని చేశాను.అలాగని ఖాళీగా లేనండోయ్, కనిపించిన ప్రతీరిటైరయిన వాడికీ, ఈ ఫార్మెట్, ఫొటో కాపీ తీసి, చేయకలిగిన సేవేదో నేనూ చేశాను!చివరకి మొన్నో రోజున మా ఫ్రెండు
అదే పై టపా లో ఉన్న ‘విశాలహృదయం’ ఆయన, ఫోను చేసి చెప్పారు, ఫణిబాబు గారూ, ఫాక్టరీలనుండి, ఎప్లై చేసినవాళ్ళందరికీ జవాబొచ్చిందీ You are not entitled to those arrears as per Rule no… clause no…Subclause no…page no… vide Supreme Court decision in the Case between Government of India vs XYZ….అనీ ! అయిందా సంబడం!ఇవన్నీ మా ఇంటావిడతో చెప్తే అంటుందీ, ‘మీరెలాగూ పంపలేదుకదా అని, ఈ గొప్పలన్నీ చెప్పుకుంటున్నారూ, అ ఎప్లై చేసిన వాళ్ళకి వచ్చుంటే మీరిలాగ మాట్లాడేవారా?’అని.ఎవరి అభిప్రాయం వాళ్ళదీ.నేనదేమిటంటే, మనకు రావాలనే ఉంటే, మనం పోయిన తరువాతైనా ఫామిలీకి వస్తుంది. రాకూడదని ఉందనుకోండి, ఎంత మొత్తుకున్నా రాదు! ఈ దరిద్రపు ఫిలాసఫీ అందరికీ నచ్చకపోవచ్చు.ఏమిటో తిక్కశంకరయ్యండి బాబూ అన్నా అనొచ్చు! ఎవడి కంఫర్ట్ లెవెల్ వాడిదీ !!

   నిన్న సాయంత్రం మా ఇంటావిడ బట్టలు ఇస్త్రీకి ఇచ్చినవి తెద్దామని లాండ్రీకి వెళ్ళాను. అక్కడ వాడేమో ఒక్క అరగంటాగితే చాలు, చేసిచ్చేస్తానూ అనడం తో అక్కడే ఓ కుర్చీ వేసికుని కూర్చున్నాను. మొత్తం బట్టలకి బిల్లెలాగూ రెండొందలు దాటుతోందని, కొట్టువాడే కుర్చీలో కూర్చోనిచ్చాడు, అంతే కానీ, నామీదేదో ప్రేమాభిమానాల వలన కాదు!వాడు చెప్పిన అరగంటలో ఎక్కడ అవుతాయీ, ఏదో చెప్తారు కానీ, మా ఇంటావిడకి ఫోను చెసి చెప్పేశాను. ఈ సెల్ ఫోన్లలో ఇదో సౌకర్యం, మనం ఉఛ్వాస నిశ్వాసాలతో సహా ఓ ఇంటెరిం రిపోర్ట్ పంపొచ్చు.ఆవిడకేం లెండి, ఆవిడ బట్టలకే కదా వెళ్ళిందీ, సర్లెండి అంది. ఆ టైములోనైనా కంప్యూటరు దొరుకుతుంది కదా అని.అన్ని బట్టలూ తీసికునే రండీ అంటూ ఓ సలహా!
అక్కడ కూర్చున్నానా, పక్కనే ఆ ప్రాంతానికి చెందిన ఒ సీనియర్ సిటిజెన్ల క్లబ్బు ఉంది.మా ఆర్డ్నెన్స్ ఫాక్టరీ పక్షులేలెండి.

   ఒకాయనొచ్చి, ఈ లాండ్రీ షాపు వాడిదగ్గర తాళం చెవి తీసికుని, తాళం తీసి, ఆపసోపాలు పడుతూ, షట్టర్స్ పైకి తీశాడు.అన్ని తిప్పలు పడకపోతే, ఓ కుర్రాణ్ణి పెట్టుకోవచ్చుగా, రూం తెరిచి,ఓ చీపురేయడానికి.మళ్ళీ అలాటివాటికి ఖర్చు పెట్టడం వేస్టూ.అదే మరి ఎవరి గోల వాళ్ళదీ అంటే!తీరా తెరిస్తే, అందులో లైటు వెలగడం లేదు.పక్కనున్న అన్ని షాపుల్లోనూ లైట్లున్నాయి, వీళ్ళ క్లబ్బు తప్పించి.ఇంతట్లో ఇంకొకాయనొచ్చి,సెగట్రీ కరెంటు బిల్లు కట్టలేదేమో అంటాడు,ఇలా అన్నాయనకీ సెగట్రీ ఎగస్ పార్టీ వాడులేండి, ఛాన్సు దొరికితే అల్లరి పెట్టేయడమే!ఇంతలో ఇంకొకాయన వచ్చి, మనకి లైటు కనెక్షన్ గుళ్ళోంచి కదా, అక్కడేమైనా పోయిందేమో, అంటే కరెంటుకి విడిగా మీటరు కూడా లేదన్నమాట!అక్కడ సీనియర్ సిటిజెన్లని ఓ పబ్లిక్ సింపతీ ఓటీ!మొత్తానికి ఓ కుర్చీ వేసికుని ఫ్యూజు పోయిందేమో అని చూడడం, అక్కడినుంచి ప్రతీ వాడూ వచ్చి ఓ సారి స్విచ్చేయడమూనూ. అదేమైనా ఆలీబాబా అద్భుత దీపమా ఏమిటీ? ఓ ఎలెట్రీ వాడిని పిలిచి ఆ ఫ్యూజో ఏదో వేయించేసికుంటే గొడవుండేది కాదుగా! అబ్బే మనం ఎప్పుడో ఫాక్టరీల్లో సంపాదించిన విజ్ఞానమంతా సార్ధకం చేసికోవద్దూ? వీళ్ళంతా ఎప్పుడో గుప్తుల స్వర్ణయుగం కాలంలో టెక్నికల్ పనులు చేసేవారు లెండి!

   ఇంతలో మా లాండ్రీవాడు నా బట్టలిచ్చేశాడు, నేను కొంపకి వచ్చేశాను.లైటొచ్చిందో లేదో నాకు తెలియదు! అందుకే అంట ఎవడి గోల వాడిదీ అని!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Exploitation

   మనం చూస్తూంటాము, సీజనొచ్చిందంటే అంటే పెళ్ళిళ్ళ సీజను, వేసంగి శలవలు వగైరా ప్రతీవాడూ తమ సర్వీసుల ఛార్జీలు పెంచేస్తాడు.వాళ్ళకీ తెలుసు,వాళ్ళెంత ధర పెంచినా తీసికునేవాళ్ళకి కొరతేమీ ఉండదని. మరి మన అవసరం అలాటిది, ఏం చేస్తాం? దీన్నే-Exploitation అంటారనుకుంటాను.మా ఇంటావిడ కి తణుకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది.ఏదో ఇక్కడినుండి భాగ్యనగరం దాకా ట్రైనులో దొరికింది టిక్కెట్టు. కానీ అక్కడనుండి, అన్ని ట్రైనులూ Waiting list లే. మొత్తానికి, తణుకు దాకా, స్లీపర్ బస్సులో టిక్కెట్టు బుక్ చేయవలసివచ్చింది. పాపం వెళ్ళేటప్పుడూ, తిరిగి రావడానికీ కూడా బస్సే దిక్కైంది. బస్సువాడేమో, ముక్కుపిండి వసూలు చేశాడు.వాళ్ళకీ తెలుసు, అవసరం వచ్చినప్పుడు, ఎంత రేటైనా కొనడానికి ‘బక్రాలు’ దొరుకుతారని.

   పోనీ అలా అని, మన కార్యక్రమాలు ముందుగా తెలియచేస్తారా అంటే అదీ లేదు.వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉంటాయి.ఏవో ముహూర్తాలూ అవీనూ.బాగుపడేదెవరయ్యా అంటే ఈ బస్సుల వాళ్ళు.ట్రైనులో వెళ్ళాలంటే, తత్కాలే దిక్కు.పోనీ అదేమైనా సులభంగా వస్తుందా అంటే అదీ లేదు. ఆన్లైన్ లో ఛస్తే దొరకదు. తెల్లవారుఝామునే వెళ్ళి లైన్లో నుంచోవాలి. పోనీ సీనియర్ సిటిజెన్ లైన్లో నుంచుందామా అంటే, స్వంతానికి టిక్కెట్టు తీసికుంటేనే ఇస్తారుట.సవాలక్ష రూల్సూ. పోనీ వెళ్దామా అంటే, ఇచ్చే కన్సెషన్ ఇవ్వరూ.పైగా మామూలుకంటే ఎక్కువ ఖరీదూ.చెప్పొచ్చేదేమిటంటే,చివరకి ప్రభుత్వం వారు కూడా, ఏదో వంక పెట్టి రేట్లు పెంచేయడమే. గవర్నమెంటే అలా చేస్తూంటే, మనల్ని ఎవడడుగుతాడూ అనే భరోసా ఈ ట్రావెల్స్ వాళ్ళకి. ఇంకోటేమిటంటే, చాలా భాగం ట్రావెల్స్ వాళ్ళు ఎవడో ఒక నేత కి సంబంధించినవే. ఇంక వీళ్ళు రేట్లెంత పెంచినా అడిగేదెవడూ?

   ఇంతా చేసి, ట్రైనులో తత్కాల్ లో టికెట్ బుక్ చేసినా, ఈ శలవల్లో ట్రైన్లలో రష్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా?చివరకి తేలేదేమిటయ్యా అంటే ఖరీదెక్కువైనా, ఈ స్లీపర్ బస్సులే మెరుగూ అని.మరీ ట్రైన్లలో లాగ కుక్కేయరు.టాక్సీ వాళ్ళైతే, మన మొహాలు చూసి రేట్లు చెప్తారు.ఇది ప్రయాణాలకి సంబంధించినంతవరకూనూ.

   మా మనవడు మామూలుగా creche కి వెళ్తూంటాడు, ఇంకా స్కూలూ అవీ మొదలవలేదు కాబట్టి.నవ్య ప్రతీ రోజూ స్కూలు నుంచి సాయంత్రం 5.15 కి creche దగ్గర దిగుతుంది. వీలుని బట్టి మాలో ఎవరో ఒకరు వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసికొస్తూంటాము. పూర్తి రోజుండదు కాబట్టి, పార్ట్ పేమెంటే తీసికొనేవారు.నెలంతటికీ కట్టఖ్ఖర్లేకుండా, రోజుకి ఇంత అని.తను అక్కడుండేది ఎంతా, పదిహేను నిమిషాలు. అయినా సరే రోజుల్లెఖ్ఖనే తీసికునేవారు.దానికే 150 రూపాయల చొప్పున. మొన్న సడెన్ గా 250 అన్నారుట.నెలకైతే ఆరువేలు! వాళ్ళకీ తెలుసు, పిల్లలకి వేసంగి శలవలూ, తల్లితండ్రులకి ఆఫీసులూ. పిల్లల్ని మన దగ్గర వదలక ఎక్కడికి వెళ్తారులే అని.అడగడానికి వీలులేదు. పైగా ఏమైనా అర్గ్యూ చేస్తే, పిల్లల్ని సరీగ్గా చూడరేమో అని భయం!ఈ డే కేర్ సెంటర్లు మోస్ట్ అనార్గనైజ్డ్ సెక్టరులోకి వస్తాయి. వాళ్ళు వసూలు చేసే ఫీజులమీద ఎవడికీ కంట్రొల్ అనేది లేదు. అవసరం మనది కాబట్టి, వాళ్ళెంత చెప్తే అంత ధారపోయడం.

   ఇదివరకటి రోజుల్లోలాగ కాదుకదా. పోనీ అంతంత ఖర్చులు పెట్టి డే కెర్ సెంటరుకి పంపకపోతేనేం అనడానికీ లేదు. చిచ్చర పిడుగుల్లాటి పిల్లలు, ఈ వయస్సొచ్చిన గ్రాండ్ పేరెంట్స్ మాట ఎక్కడ వింటారు?మా సొసైటీ లో ఒక తాతా, మామ్మల పరిస్థితి చూసినప్పుడల్లా చాలా బాధేస్తుంది. వాళ్ళకి మా నవ్య వయస్సు మనవరాలొకత్తుంది. వాళ్ల అమ్మా నాన్నా ఆఫిసుకెళ్ళడం తరవాయి,రోజంతా చంక దిగదు. వారూ మరీ చిన్నవాళ్ళేం కాదు,75 సంవత్సరాలుంటాయి. చెప్పలేక పోవడం వారి తప్పంటారా, లేక వయస్సొచ్చిన వారి తిప్పలు గుర్తించకపోవడం ఆ తల్లితండ్రుల తప్పంటారా? మేము మాత్రం ఆ విషయంలో అదృష్టవంతులమే. ఎప్పుడైనా మరీ అవసరం వస్తే తప్ప, పిల్లల బాగోగులు వాళ్ళే చూసుకుంటారు.

   మా రోజుల్లో అయితే, చాలా మంది, housewife లే కాబట్టి, ఇలాటి సమస్యలొచ్చేవి కావు. ఇప్పుడలాక్కాదుగా. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కానీ, రోజెళ్ళదు, పిల్లలకి పెద్ద చదువులు చెప్పించలేరు. రోజ్ మర్రాకే జిందగీ లో దొరికే లక్షరీలు అనుభవించలేరూ.ఇదేదో మాలాటివాళ్ళకు వింతగా కనిపిస్తుందేమో కానీ,నిజంగా అనుభవిస్తూన్న వారికేమీ పేద్ద ఇస్యూ కాదేమో?అయినా నాకెందుకులెండి? ఏదో ఊరుకోలేక వ్రాశాను.

%d bloggers like this: