బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ప్రతీదానికీ సెంటిమెంటు అవసరంలేదు…

   ఈ మధ్యన మాకు తెలిసిన వారింటికి వెళ్ళాము. అక్కడ ఏదో మాటల్లో ఆవిడన్నారూ-“మీకేమిటండీ..నెల తిరిగేసరికి హాయిగా పెన్షనొచ్చేస్తుందీ, కానీ అందరికీ అలాటి సదుపాయం లేదుగా..” అని. ఒకవిషయం గమనిస్తూంటాను, సాధారణంగా చాలామందికి ఈ పెన్షనర్స్ అంటే, చాలా అసూయగా ఉండడం.ఇంతమంది ఘోష వినలేకేమో, కేంద్రప్రభుత్వం వారు కూడా, అప్పుడెప్పుడో 2000 సంవత్సరం తరువాత ఉద్యోగాల్లో చేరినవారికి, ఈ సదుపాయం ఎత్తేసి, ఇంకోటేదో స్కీమ్ ప్రారంభించారు.ఆరోజుల్లో అంతంత జీతాలుండేవి కావు. ఇంకోవిషయం ఏమిటంటే, ఈ పెన్షనర్లకి నెలనెలా ఇస్తున్నారనే కానీ, almost దానికి సమానంగా, మిగిలిన సంస్థల్లో పనిచేసినవారికి, ఒకేసారి ఇచ్చేస్తారన్న విషయం convenient గా మర్చిపోతారు. అలా వచ్చినదానిని, ఏదో డిపాజిట్ లో వేసి, నెలకింతా అని వడ్డీరూపంలో తీసికుంటే బావుంటుందికదా అని ఈ పెన్షనర్లంటారు. ఇలాటివన్నీ easier said than done. ఒక్కసారి చేతిలోకి అంత డబ్బురాగానే, ఆ కుటుంబసభ్యులకి ఎక్కడలేని అత్యవసరాలూ గుర్తొచ్చేస్తాయి !

ఉదాహరణకి ఆ ఇంట్లో ఏ ఇంజనీరింగు పూర్తిచేసో, పూర్తిచేయబోయే కుర్రాడో, కూతురో ఉన్నాడనుకుందాం. తన తోటివారందరూ విదేశాలకి వెళ్ళి, అవేవో ఎమ్.ఎస్సు చేస్తున్నారే, మనం కూడా ఎందుకు వెళ్ళకూడదూ అనే ఓ ఆలోచనవచ్చేస్తుంది.అవేవో పరీక్షలుపాసయి మొత్తానికి ఎక్కడో ఏదో యూనివర్సిటీ లో స్కాలర్ షిప్పు వరకూ సంపాదిస్తాడు పాపం. చల్లగా ఇంట్లో చెప్తాడు– నాన్నా నాకు స్కాలర్ షిప్పు వచ్చిందీ అవటాఅని.స్కాలర్ షిప్పు అంటే వచ్చిందికానీ, మిగిలిన ఖర్చులుంటాయిగా, ప్రయాణానికీ, ఆ స్కాలర్ షిప్పు డబ్బులేవో చేతికివచ్చేదాకా ఖర్చులూ వగైరా. వాటన్నిటికీ ఈ ఇంటిపెద్దగారికి ఒకేమొత్తంలో వచ్చిన డబ్బుమీద పడుతుంది దృష్టి. దానికి సాయం, తల్లికూడా, “ఎలాగూ ఇక్కడిదాకా చదివించామూ, పాపం బయటకివెళ్ళి ఏదో పైచదువులు చదువుకుంటానంటున్నాడుగా, ఏదో సద్దేయండి మరి ..” అంటుంది.మొత్తానికి సింహభాగం ఆ ఖర్చుకు అయిపోతుంది. అందరిమాటా ఏమో కానీ, కొంతమంది ప్రబుధ్ధులకి, తమ తల్లితండ్రులు ఎంత శ్రమ పడిచదివించారో అనే మాటే మర్చిపోయి, ఆ పైచదువులకోసం బయటకి వెళ్ళి, అక్కడే సెటిలయిపోయి, ఈ తల్లితండ్రులని వారి మానాన వాళ్ళని వదిలేస్తాడు. ఇలాటివి జరగలేదంటారా?

ఈ పైచదువులవాడిని వదిలేద్దాం, దేశంలోనే ఉండి, ఏ మహానగరంలోనో ఉద్యోగం చేస్తూన్న ఇంకో కొడుకుగురించి మాట్టాడుకుందాం. ఇంటద్దెలు భరించలేక, ఏదో కొద్దో గొప్పో ఓ కొంపలాటిది ఏర్పాటు చేసికుందామనుకుంటాడు, దానికి ఋణాలు ఇచ్చే బ్యాంకులున్నాయనుకోండి, కానీ ఈరోజుల్లో ఎపార్టుమెంటు కొనాలంటే మాటలా, ఆ బ్యాంకు వాడిచ్చే ఋణం ఏమూలకీ, ఆ టైముకే తండ్రిగారు రిటైరయి, ఒకే మొత్తంగా డబ్బు చేతికివస్తుంది. ఆయన రిటైరయ్యే రోజుకి, శలవు పెట్టేసికుని, ఎక్కడలేని ప్రేమాభిమానాలూ ఒలకపోసేసి, చల్లగా తన మనసులోని ఆలోచన బయటపెడతాడు.– అప్పటికే, ఈ పెద్దాయనకి తను ఉండేఊళ్ళోనే ఓ ఇల్లుందనుకుందాము, ఆ ఇల్లు అమ్మకానికి పెట్టేసి,ఈ ఏకమొత్తంగా వచ్చిన డబ్బుని దానికి జోడించి, తనకు రాబోయే ‘అప్పు’ కలిపి, అందరూ కలిసుండేటట్టుగా, తనుండే మహానగరంలోనే ఓ ఇల్లు కొంటే బావుంటుందేమో అని.–. ఈ దిక్కుమాలిన సెంటిమెంటోటికదండీ, ఆ తల్లితండ్రులూ ఒప్పేసుకుంటారు. ఇందులో ఆ పెద్దాయనకి ఒరిగేదేమిటయ్యా అంటే, ఆ ఎపార్టుమెంటు రిజిస్ట్రేషన్ టైములో, ఆయన పేరుకూడా చేర్చడం. దానివలన ఉపయోగం ఏదైనా ఉందా అంటే ఎప్పుడైనా ఆ ఎపార్టుమెంటు అమ్మేటప్పుడు, ఆయన సంతకంకూడా చేయడం. మహా అయితే, పార్కింగులో పెట్టే బోర్డుమీద ఈయన పేరుకూడా రాయడం !

ఈరోజుల్లో ప్రతీవారికీ మహ అయితే రెండు లేదా మూడు బెడ్రూమ్ముల ఎపార్టుమెంటు కొనగలిగితే మహద్భాగ్యం. మొత్తానికి పెట్టేబేడా పుచ్చుకుని, ఆ తల్లితండ్రులు తమ స్వంత ఇంటిని అమ్ముకుని, చేతిలో కానీ బ్యాంకులో గానీ, ఏగాణీ లేకుండగా, మరి అదంతా ఈ కొత్త ఎపార్టుమెంటుకి down payment కి ఖర్చైపోయిందిగా, గృహప్రవేశం కొడుకూ, కోడలూ చేయగా కొత్త ప్రదేశంలో సెటిలవుతారు. ఆ ఎపార్టుమెంటేదో రెండు బెడ్రూమ్ములదైనమాటైతే, ఆ కొడుక్కి పిల్లలు లేకపోతే, ఓరూమ్ములో వాళ్ళూ, ఇంకో రూమ్ములో ఈ తల్లితండ్రులూనూ. ఒక పిల్లో, పిల్లాడో ఉంటే వాళ్ళూ తల్లితండ్రులూ ఒకరూమ్ములోనూ సెటిలవుతారు. ఆ ముచ్చటెన్నాళ్ళూ, ఈ పిల్లలు పెద్దయేదాకా, ఆ తరువాత ఆ బెడ్రూమ్ము పిల్లల స్టడీ రూమ్మూ, తల్లితండ్రులు హాల్లోకీనూ. ఇవేవో అతిశయోక్తిగా వ్రాస్తున్నాననుకోకండి . ఇవి పచ్చినిజాలు. కొంతమందికి నచ్చకపోవచ్చు.

పోనీ అలాగని ఈ తల్లితండ్రులకి స్వతంత్రం ఉంటుందా, ఎప్పుడు బయటకి వెళ్ళాలన్నా కొడుకునో, కోడలినో అడగాలి, చేతిలో డబ్బుల్లేవుగా.అదృష్టం బాగుండి, ఏ వైద్య సహాయమూ అవసరం ఉండదనుకుందాం, ఎప్పుడైనా అవసరం వచ్చిందా అయిపోయిందే.అన్నీబావుంటే ఈరోజుల్లో ఐటీలో పనిచేసే ప్రతీవారికీ ఉంటుందే అదేదో మెడికల్ ఇన్స్యూరెన్సులూ, అవేవో క్యాష్ లెస్సులూ, వాటితో గండం గడిచిపోతుంది. భార్య తనతల్లితండ్రుల పేర్లూ, భర్త తన తల్లితండ్రుల పేర్లూ నామినీల్లో చేరుస్తారుకనుక. అలా కాకుండగా, ఇంకోటేదైనా జరిగిందా, ఈ తల్లితండ్రుల పని గోవిందాయే. నేను అలాటి కుటుంబాలని చూశాను.

చెప్పొచ్చేదేమిటంటే , ఈ పెన్షన్లు లేనివారు, మరీ సెంటిమెంటుకి పోకుండగా, తమ భవిష్యత్తుకూడా దృష్టిలో పెట్టుకుని, తమకంటూ కొంత డబ్బు ఉంచుకుని మరీ ఖర్చుచేస్తే బావుంటుందని.తినో, తినకో పిల్లలని వాళ్ళ కాళ్ళమీద నిలబెట్టగలిగారు,ఇటుపైన వాళ్ళ బతుకులు వాళ్ళే బతకాలి. ఈ పెద్దవారు కూడా, తమకై దాచిన డబ్బుని, పోయేటప్పుడు వాళ్ళతో ఏమైనా తీసికెళ్తారా ఏమిటీ, ఎలాగూ పిల్లలకి వచ్చేదే. ఆ కొనే ఎపార్టుమెంటేదో వీళ్ళు పోయిన తరువాతే తీసికుంటే, వీళ్ళదారిన వీళ్ళూ సుఖంగా ఉండొచ్చు. అంతగా వీరి సహాయం అవసరంలేకుండా, తీసికోగలిగారా సంతోషం.

నేను చూసిన కొన్ని కుటుంబాల పరిస్థితి ఈ టపాకి ప్రేరణ.

ఈవారం కూడా gotelugu.com లో నా వ్యాసం ఒకటి వచ్చిందండోయ్…

మరీ సీరియస్సుగా వ్రాశానేమో సరదాగా ఈ లింకు చూసేయండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్…

   పోయినవాళ్ళెప్పుడూ అదృష్టవంతులే అన్న సూక్తి ఊరికే రాలేదు. మన సైనిక దళాల,మిగిలిన para military వారి ధర్మానా, రక్షింపబడి, డెహ్రాడూన్ దాకా రాగలిగిన యాత్రీకులు, నిన్న మన రాష్ట్ర రాజకీయనాయకుల వీరంగాలు చూసి, అసలు ఎందుకు బ్రతికున్నామురాబాబూ అనుకునుంటారు. అసలు వీళ్ళకి కవరేజ్ ఇచ్చిన మీడియావాళ్ళననాలి,కెమేరాలు ఉన్నాయి కదా అని, ఆ దెబ్బలాడుకునేవాళ్ళూ ఇంకా పేట్రేగిపోయారు. వీళ్ళా మనకి పాలకులూ అనిపిస్తుంది. అసలు విపత్తు జరిగిన స్థలాలకి వెళ్ళనే లేదు. ఏదో సురక్షితంగా ఉండే డెహ్రాడూన్ లో మొదలెట్టారు వీరి నాటకాలు. ఒక్క పార్టీ అనేమిటిలెండి, అందరూ అలాగే తగలడ్డారు. మన “భవిష్య” ప్రదానమంత్రి గారు మాత్రం తక్కువ తిన్నాడా, రక్షింపబడడానికి ప్రాధమిక eligibility గుజరాతీ అయుండాలిట. ఈయనేమో. మొత్తం దేశానికి ప్రధానమంత్రి అవాలని కలలు కంటున్నాడు.ఈవేళ ఇంకో బిజెపీ ప్రముఖనాయకుడు యశ్వంత్ సిన్హా కడిగిపారేశాడు.అసలు విపత్తులని రాజకీయం ఎందుకుచేస్తారో అర్ధం అవదు.ఏదో మన సైనిక బలాలు, ప్రాణాలకు తెగించి, అంత అద్భుతంగా, భాష,రాష్ట్ర, లింగ బేధం లేకుండగా అంతలా రాత్రనకా, పగలనకా శ్రమపడుతున్నారే, ఈ దౌర్భాగ్య రాజకీయనాయకులకి, కనీసం నోరుమూసుకుని కూర్చోవాలనైనా ఎందుకు తట్టదో?

    ఇప్పుడిప్పుడే ఉత్తరాఖండ్ లో జరిగిన “the day after” కథలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. ఓమూల ఇంత ఘోరవిపత్తు జరిగి ప్రాణాలు పోగొట్టుకున్న మృతదేహాలనుండి, ఆభరణాలు ఒలిచేస్తున్నవారు కొందరూ, వ్రేలి ఉంగరాలు రాకపోతే, ఏకంగా ఆ వ్రేలినే కోసేసిన దృశ్యం చూస్తూంటే గుండె బేజారెత్తిపోయింది. ఇంక సాధూ సంతుల విషయం అడక్కండి. దోచినంత సొమ్ము దోచుకున్నారు, వారి యోగం బాగోక పట్టుబడిపోయారు. సహాయ కార్యక్రమాలకి వాడుతున్న ప్రెవేట్ హెలికాప్టరు యాజమాన్యం ఒకడైతే ప్రభుత్వం ఇస్తూన్న దానికంటే, ఎక్కువ అడగడం ఎంతో విచారకరం. అందరి రంగులూ ఇప్పుడు బయటపడతాయి. ఎవడికి వాడే దొరికినంత దోచేసికుంటున్నారు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలోటీ. ప్రతీవాడూ, సహాయనిధి ప్రారంభించేవాడే, అది ఉత్తరాఖండ్ వరదబాధితులకా, లేక స్వంతానికా అన్నది ఆలోచించాల్సిన విషయం.

    ఈవేళ అదేదో చానెల్ లో విజయవాడ కనకదుర్గ ఆలయంలో జరుగుతూన్న “అరాచకాల” గురించి ఒక రిపోర్టు చూస్తూంటే, ఆ గుడిలో పూజలు చేయిస్తున్న పూజారుల మీద ఉండే గౌరవం మంటకలిసిపోతుంది. అసలు వాళ్ళకి సెల్ ఫోన్లు ఎందుకంట? ఏ దేవాలయానికి వెళ్దామన్నా ఏదో ఒక గొడవే. హాయిగా ఇంట్లోనే కూర్చుని దేవుణ్ణి పూజించుకుంటే హాయనిపిస్తోంది. బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్పనే చెప్పారు, భౌతిక పూజ కంటే మానసిక పూజ ఎంతో ముఖ్యమని!

    ఏదో పేపర్లలో చదువుతూ, ధరలు పెరిగిపోయాయీ అంటే ఏమో అనుకున్నాను. మార్కెట్ లో “అల్లం” ధర కిలో రెండువందల రూపాయలు. చిన్నప్పుడు ఏ దగ్గో , జలుబో వచ్చిందంటే అల్లపురసం ఇచ్చేవారు. ఆరారగా నోట్లో వేసికుని చప్పరించడానికి అల్లపుమురబ్బా చేసేవారు. అంటే ఇటుపైన “అల్లం పెసరట్టు” luxury item అయిపోయిందన్నమాట ! కొత్తిమిర కట్ట 40 రూపాయలు ! అంటే అదేదో garnishing అంటారు, అవన్నీ బంధ్ అన్నమాట ! క్రమక్రమంగా అన్నీ “చరిత్ర” లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంక మిగిలిన వాటి గురించి అడగఖ్ఖర్లేదనుకోండి.

    ఇదివరకటి రోజుల్లో అంటే నాలాటివాళ్ళు చదువుకునే రోజుల్లో 60% వచ్చిందంటే, ఏదో ఘనకార్యం చేసేమనుకునేవాళ్ళం. అలాగని నాకువచ్చాయని అపోహ పడకండి. నేను moderation లో పాసవడానికే ప్రాణం మీదకొచ్చింది ఈవేళ న్యూస్ లో చెప్పారు- ఢిల్లీలో 12th క్లాసు పూర్తయిన తరువాత, కాలేజీల్లో చేరడానికి cut off marks 100% ట ! ఓరినాయనోయ్ మార్కెట్ లో ధరల్లాగ, వీటిల్లో కూడా inflatioనే !!

   మేరాభారత్ మహాన్…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    మెల్లిమెల్లిగా ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న యాత్రీకులని రక్షించి, తమతమ స్వంత ఊళ్ళకి పంపుతున్నారు. ఈ సందర్భంలో మన సైన్య,వాయు,నావికా దళంవారూ, ITBP వారూ చేస్తూన్న సేవలు అద్భుతం. ఏ భాష టీవీ చానెల్ చూసినా, అక్కడినుంచి క్షేమంగా బయటపడ్డవారితో ఇంటర్వ్యూలు, వాటిల్లో వారు పడ్డ బాధలు,అక్కడ వారు పొందిన సహాయమూ గురించి కళ్ళకు కట్టినట్టుగా చెప్పడంతో, మన సైనికుల గొప్పతనం ప్రపంచంఅందరికీ తెలుస్తోంది. ప్రచారమాధ్యమాలు ఈమధ్యన చేస్తున్నవాటిలో ఇది మాత్రం చాలా బావుంది.

    మొన్న వ్రాసిన టపాలో,మనతెలుగు చానెల్ వారొకరు, ఉత్తరాఖండ్ లో వరదలు రావడానికి, ముఖ్యకారణం, అక్కడ కట్టిన, కడుతూన్న జలవిద్యుత్ ప్రాజెక్టులే అని చెప్పినప్పుడు, కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అదేమిటీ, ప్రతీవారూ, ప్రాజెక్టులూ..ప్రాజెక్టులూ అని ఘొషిస్తూంటే, ఈ చానెల్ వాళ్ళేమిటీ, అసలు ప్రాజెక్టులే వద్దంటున్నారూ అని. అదే అర్ధం వచ్చేటట్టు, నేను నిజానిజాలు తెలియకుండగా, ఏవేవో వ్రాశాను. కానీ, CAG వారు, 2010 నుండీ మొత్తుకుంటున్నారు. అక్కడ కడుతూన్న ప్రాజెక్టులవలన, పర్యావరణానికి ఎంత నష్టం వస్తోందో తెలియచేస్తూ ఒక రిపోర్టు కూడా సమర్పించారు. మామూలు నివేదికల్లాగే ఇదీ బుట్టదాఖలయింది. ఫలితం- ప్రస్తుతపు devastation. ప్రాజెక్టులకి సంబంధించినంతవరకూ వారి రిపోర్టు ఇక్కడా, పూర్తి రిపోర్టు చదవాలంటే ఇక్కడా నొక్కండి. తెలుస్తుంది.

    కేంద్రప్రభుత్వం వెయ్యికోట్లు సహాయం ప్రకటించిందిట. ఇప్పుడు ఆ వెయ్యికోట్లూ ఎవరికి వెళ్తాయీ? నదీతీరంలో ఎడాపెడా రిసార్టులూ, హోటళ్ళూ కట్టేసిన బడాబాబులకే అనడంలో సందేహం ఏమీ లేదు. చనిపోయినవారికి రెండు లక్షలన్నారు. లెఖ్ఖాపత్రం లేక కొట్టుకుపోయినవారి విషయం ఏమిటీ? వీటికిసాయం, పోయినవారి బంధువులు ఈ compensation పొందడానికి, వారిదగ్గర ప్రమాణపత్రాలు ఎలా చూపించగలరూ? ఆతావేతా తేలేదేమిటీ అంటే, influence ఉన్నవాళ్ళెవరో పంచుకుంటారు. అన్నీ ప్రశ్నార్ధకాలే.

    మన జీవితాల్లో మొబైల్ ఫోన్లు ఎంతగా అంతర్భాగం అయిపోయాయో తెలియడానికి సరదాగా ఈ లింకు చూడండి.

    ఇంకో విషయమండోయ్, కొత్తగా వస్తూన్న అంతర్జాల పత్రిక gotelugu.com లో ఒక వ్యాసం వ్రాశాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు మనకి సంతృప్తి అనేది ఉంటుందా…

    ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది, మనకి జీవితంలో అసలు సంతృప్తి అనేది ఉంటుందా అని. ఫలానాది ఉందంటే, ఇంకోటేదో లేదని గోల.ఎవడో ఏదో చేయలేదో అని గోల. ఇంకోడికేదో ఎక్కువగా ఉందని గోల.ఇలా చెప్పుకుంటూపోతే ఈ గోలలకి అంతనేది ఉండదు. అయినా ఆ గోలలన్నీ లేకపోతే ఈపాటికి మహాత్ములైపోయేవాళ్ళం కదూ! అందుకేనేమో ప్రపంచంలో ఏ కొద్దిమందికో తప్పించి, మిగిలినవారందరికీ ఆ భగవంతుడు అలా చేసేశాడేమో.ఇలా ఆలోచించడానికి ముఖ్యకారణం, ఈమధ్య పగలనకా, రాత్రనకా ఆస్వాదిస్తూన్న బ్రహ్మశ్రీ చాగంటివారి ప్రవచనాలేమో.ఆయన చెప్పినట్టుగా, మనం ఆలోచించే పధ్ధతినిబట్టే ఉంటుందనుకుంటాను.

    ఉదాహరణకి ఈమధ్యన “దేవభూమి” అనబడే ఉత్తరాంచల్ లో సంభవించిన ప్రకృతివైపరీత్యం. ఏ ప్రభుత్వమూ కావాలని చేసింది కాదు. It was definetely a major disaster. అందులో సందేహమేమీ లేదు.మనం ప్రతీరోజూ పూజించే దేవుళ్ళందరూ అక్కడే ఉండడం ధర్మాన, దేశంలోని ఎక్కడెక్కడినుంచో శ్రధ్ధాళులు, దైవదర్శనం చేసికోడానికి వేసవికాలం ముగుస్తూండగా అక్కడకి చేరుకుంటారు. వర్షాలు మొదలయ్యే లోపల, యాత్ర పూర్తిచేసికుని, ఇంటికి చేరుకోవచ్చని. మళ్ళీ శీతాకాలం వచ్చేసరికి ఆ దేవాలయాలు మూసేస్తారు.

    ఈ సంవత్సరం చెప్పాపెట్టకుండా వర్షాలు ఓ వారం పదిరోజులు ముందుగా ప్రారంభం అయి, ఓ ప్రళయంలా ముంచుకొచ్చేశాయి. ఇదేమైనా “ముందస్తు ఎన్నికల” లాగ ప్రభుత్వం వారేమైనా ఆహ్వానించారా? ప్రళయం వచ్చింది, దారిలో ఉండేప్రతీదానినీ తుడిచిపెట్టుకు పోయింది. దురదృష్టంకొద్దీ, అందులో ఓ ఆరవైవేల యాత్రికులు చిక్కుపడిపోయారు. అక్కడ యాత్రీకులు పడ్డ కష్టాలు ఊహించుకోవచ్చు.చాలా బాధలు పడుంటారు, ఇంకా పడుతూనే ఉండుంటారు. ఇంతదూరంలో ఉండి, చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ పడినప్పుడే కదా తెలిసేదీ.Its true.

   ఈ విపత్తు సంభవించిందని తెలిసేసరికే రెండురోజులు పట్టింది. ఇంక తెలిసినప్పటినుండీ, నెత్తిమీద తలున్న ప్రతీ తెలుగు చానెల్ వాడూ, వాళ్ళే అంతా చేసెస్తున్నట్టూ, ముందుగా వాళ్ళకే ఈ విపత్తుగురించి తెలిసినట్టూ, వాళ్ళే ఈ rescue operations చేస్తున్నంతగా హోరెత్తించేశారు. ఆ యాత్రీకుల్లో తెలుగువారు తప్పించి, ఇంకోరెవరికీ ఆపదే సంభవించలేదన్నట్టూ హడావిడి చేశారు.కానీ చిక్కుకున్న 60000 మంది యాత్రీకుల్లోనూ తెలుగువారు 3000 మంది. యాత్రలకు వెళ్ళేవారిలో చాలామంది వయోవృధ్ధులే ఉంటారు. మహా అయితే వారితో వెళ్ళిన వారిలో ఏ కొంతమందో చిన్నవారైఉంటారు. మరీ పసిపాపలని తీసికుని వెళ్ళరుగా. వయస్సు పెరిగేకొద్దీ, ఆరోగ్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయనేది ఒప్పుకోవలసిన నిజం.ఇన్ని ప్రతికూల పరిస్థితుల్నీ తట్టుకుని యాత్రలకి వెళ్ళారంటే ఆ భగవంతుడిమీద ఉండే భక్తీ విశ్వాసమూనూ.

    వచ్చిందేమీ మామూలు తుంపరలాటిది కాదు. టీవీల్లో చూస్తూంటే తెలిసింది, పక్కా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.వంతెనలు కూలిపోయాయి. రోడ్లు నామరూపాల్లేకుండా మాయమైపోయాయి. ఇదేమైనా మాములు ఉపద్రవమా? ఇలాటి విపత్కర పరిస్థుతుల్లో rescue operations చేయడానికి,మన సేన, వాయుదళం, ITBP, ఇంకా ఎంతమందో ముందుకువచ్చి, వారు చేయగలిగినంతా చేసి, ఎంతోమంది ప్రాణాలు రక్షించారనడంలో సందేహం లేదు. ఈ Rescue teams వారికి కష్టంలో ఉన్నవారిని సురక్షితప్రాంతానికి తరలించడమే ధ్యేయం. ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువమందిని రక్షించగలిగారనేదే ముఖ్యం.అంతేకానీ, ఈ సురక్షితప్రాంతానికి వచ్చిన తరువాత, “మమ్మల్ని ఇక్కడ పడేశారూ తెచ్చీ..” అనడం భావ్యం కాదు. ఎందుకంటే గత నాలుగురోజులనుండీ మన చానెళ్ళవాళ్ళు అక్కడి survivors తో చేస్తూన్న ఇంటర్వ్యూలు చూస్తూంటే అలాగే అనిపిస్తోంది. ఇక్కడ పడేశారూ అంటున్నారుకదా, అలా కాకుండగా అక్కడే దిక్కూదివాణం లేకుండా, వదిలేసుంటే ఏమయ్యేదిట? జరిగినదానికి భగవంతుడికీ, ఆ rescue teams కీ కృతజ్ఞత చెప్పుకోడంపోయి, ఇలా అనడం బాగోలేదు.

   TV visuals లో చూశాము, రోడ్లూ, వంతెనలూ లేనిచోట పెద్దపెద్ద తాళ్ళకి వేళ్ళాడతీసి రక్షించడం, కొన్నిచోట్ల హెలికాప్టరు ద్వారా రక్షించడమూనూ. ఇంక అన్నపానాదులంటారా, అక్కడ ఏదిదొరికితే అదే పెడతారుకానీ, మాకు మడికట్టుకుని పప్పూ, కూరా పులుసూ వేసి పెట్టాలంటే కుదురుతుందా? బ్రెడ్డు దొరికితే అదీ, లేకపోతే చపాతీలూ. ఇక్కడ కడుపునిండడం ముఖ్యం కానీ రుచీ పచీ కాదు. ఇంకో సమస్య భాష. మనలో చాలామందికి హిందీ రాదూ, వాళ్ళుచెప్పేది వీళ్ళకి అర్ధం అవదూ, వీళ్ళభాష వాళ్ళకర్ధం అవదూ. అన్ని పరిస్థితులూ బావున్నప్పుడు యాత్రలు చేయడం సులభమే. ఆ ట్రావెల్స్ వాడే చూసుకుంటాడు.

    మన చానెళ్ళవాళ్ళు post mortem ల బదులు, జరిగిన సహాయకార్యక్రమాల గురించి చెప్పుంటే బావుండేదేమో. అన్నిటిలోకీ చిత్రం ఈవేళ ఓ చానెల్ వాడు చెప్పేది విని నవ్వొచ్చింది. ఎడాపెడా ఆనకట్టలు కట్టడం వలన వచ్చిందిట అసలు ఈ విపత్తు అంతా. కట్టకపోతే కట్టలేదో అని గోల. కడితే ఎందుకు కట్టారూ అని గోల.ప్రజలందరికీ కావాల్సిన విద్యుఛ్ఛక్తి ఎక్కణ్ణించి తెస్తారుట? న్యూక్లియర్ ప్లాంట్లు పెడితే ఓ గొడవ, అలా కాకుండా coal based పెడితే ఇంకోగొడవ. కాదూకూడదూ గ్యాస్ తో తయారుచేద్దామా అంటే ఆ గ్యాసిచ్చేవాడు లేడాయె.

    సమస్యలనేవి ఎప్పుడూ ఉండేవే. కానీ సంతృప్తి అనేది ఉండకపోతే మనుగడే కష్టం అయిపోతుంది.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–వర్షాలొచ్చేశాయి…

    చిన్నప్పుడు అంటే, ఋతువులని బట్టి వర్షాలొచ్చే రోజులన్నమాట, వర్షాకాలం వచ్చిందంటే ఎన్నెన్నో previleges ఉండేవి. మరీ గట్టిగా వర్షం వస్తే, స్కూలికే పంపేవారు కాదు. అధవా స్కూల్లో ఉన్నప్పుడు ప్రొద్దుటి చివరి పిరీయడ్ లో వర్షం మొదలెడితే “కంటిన్యూ” పెట్టేవారు. అంటే ఇంకో మూడు పీరియడ్లు పాఠాలు చెప్పేసి, స్కూలుగంట కొట్టేసేవారు. హాయిగా ఉండేది, మళ్ళీ స్కూలుకి రావఖ్ఖర్లేదుగా. కొద్దిగా ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళకి ఓ గొడుగూ, మరీ అంతలేకపోతే ఓ గోనె (jute) బస్తా నెత్తిమీద కప్పుకుని, ఇళ్ళల్లో పనిమనుషులూ, పాలు పోసేవాళ్ళూ వచ్చేవారు.కొంతమంది తాటాకు గొడుగులు వాడేవారు. దేని అందం దానిదీ. ఇళ్ళల్లో గొడుగుమీద, ఇంట్లోవాళ్ళు తెల్లదారంతో పేరు కూడా కుట్టేవారు, మళ్ళీ మనగొడుగు మారిపోకుండా. ఆరోజుల్లో వర్షంలో బయటకి వెళ్ళడం అంటే ఓ మజాగా ఉండేది.మరీ పొలాలంబడ మోకాల్లోతునీళ్ళల్లో వెడితే, ఏ జలగో మన కాలికి పట్టుకోడంకూడా తటస్థించేది. అదేమిటో ఈ రోజుల్లో ఆ జలగలూ,వానపాములూ, నత్తలూ కూడా కనిపించడం మానేశాయి. అసలు మట్టనేది ఉంటేగా, ఎక్కడచూసినా సిమ్మెంటే సిమ్మెంటాయె. అప్పుడప్పుడు “గాలివానలు” ( cyclone) కూడా వచ్చేవనుకోండి. ఈ వర్షాల్లో ఇళ్ళల్లో ఎక్కడైనా వర్షంనీరు కారితే, వాటిని గుర్తుంచుకుని, వర్షాలు తగ్గగానే ఇల్లు ఒకసారి ‘నేయించడం” అంటే పైకప్పుమీద ఉండే పెంకులు ఒకసారి సద్దించడం అన్నమాట.

    పెరట్లో ఉండే నూతుల్లో, పై “వర” దాకా నీళ్ళొచ్చేసి, బాల్చీ వేసికోకుండానే నీళ్ళు తోడుకోడం ఓ మధురానుభూతి. అరుగుమీద కూర్చుని కాగితం పడవలు నీళ్ళల్లో వేస్తే, అవి జాయిగా వెళ్ళిపోవడం ఎవరైనా మర్చిపోగలరా? ఇప్పుడో , ఓ ప్లాస్టిక్ టబ్ లో నీళ్ళోసి, కాగితంపడవలు మన పిల్లలకి చూపించవలసిన దుస్థితికి వచ్చాము.

    కాలక్రమేణా, ఈ గొడుగులూ అవీ మోసుకెళ్ళడం నామోషీ అయితేనేమిటిలెండి, హాయిగా ఓ సంచీలో పెట్టుకుని తీసికెళ్ళడానికి సదుపాయంగా ఉండడంచేతనండి, ఫోల్డింగు టైపు గొడుగులొచ్చాయి. వాటి తరువాత రైన్ కోట్లూ, మళ్ళీ అందులో వెరైటీలూ, మొదట్లో పోలీసులకి Duck Back వారు తయారుచేసిన “ప్రత్యేక” రైన్ కోట్లుండేవి. పైన కాన్వాసూ లోపల రబ్బర్ లైనింగుతో, ప్రస్తుతం అవికూడా కనుమరుగైపోయి, రైన్ సూట్లు వచ్చాయి. హాయిగా వాటిని వేసికుని వర్షంవచ్చినా, ప్రళయం వచ్చినా మన పోలీసులు ట్రాఫిక్కు ని నియంత్రిస్తున్నారు.

    స్కూళ్లు తెరిచారంటే, పిల్లలకి ఇళ్ళల్లోనే ఆ రైన్ కోట్ వేసేసో, మరీ వర్షం లేకపోతే, స్కూలు బ్యాగ్గులోనో పెట్టి, వర్షం వస్తే వేసికో అమ్మా అని చెప్పడం, ఇప్పుడు ప్రతీ ఇంట్లోనూ చూసేదే. మన అదృష్టం బావుందా, ఆ రైన్ కోటుతో పిల్ల ఇంటికొస్తుంది, లేదా ” I forgot in the bus/school mummy..” అంటూ ముద్దుముద్దుగా చెప్పేసరికి, ఈ అమ్మలూ, నాన్నలూ లోపల్లోపల ఎంత గింజుకుంటున్నా, పైకి మాత్రం..”no issue baby..” అనేసి, ఇంకో రెండు రైన్ కోట్లు కొనేసి పెట్టుకోడం, ఈరోజుల్లో ప్రతీ ఇంట్లోనూ చూసే దృశ్యం. వచ్చే ఏడాదికి అవి పొట్టైపోతాయి, అది వేరేవిషయం. సరైన సమయంలో వర్షాలొచ్చేవి, పంటలు పండేవి, త్రాగడానికి నీరు సమృధ్ధిగా ఉండేది. ఎక్కడెక్కడో డామ్ములూ అవీ కట్టి, కావలిసినంత విద్యుత్తు ఉత్పాదన కూడా హాయిగా చేసేవారు. కానీ రోజులన్నీ అలాగే ఉండవుగా, జనాభా పెరిగింది, సరిపడేటట్టుగా ఉండడానికి కొంపా గోడూ కట్టుకోవాల్సొచ్చింది. ఇదివరకటి రోజుల్లోలా కాకుండగా, ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే అక్కడే కట్టేయడం. దానికి ఓ వరసా వావీ లేదు. మొదట్లో నగరాలనండి, గ్రామాలనండి, వర్షాలూ, తదనుగుణంగా వర్షపునీరు భూమిలోకి వెళ్ళడానికో, మరీ ఎక్కువైతే నదిలోకి ప్రవహించడానికో డ్రైనేజీ లు కట్టారు. కానీ, మన భూకబ్జాలవారి ధర్మమా అని, ఈ డ్రైనేజీలమీదే కొంపలు కట్టేశారు. ఎక్కడచూసినా భూకబ్జాలే.

    ఇదివరకటిరోజుల్లో, ఓ నది ఉందంటే, ఆ నదీతీరానికి ఏదో కొన్ని మీటర్ల దూరందాకా, ఏదీ కట్టకూడదనేవారు. కానీ ఇప్పుడో, ఎక్కడ చూసినా, River View, Riverside, Riviera, River Plaza అంటూ పేర్లు పెట్టేసి, ఎక్కడపడితే అక్కడ సముద్రాన్నీ, ప్రవహించే నదినీ అదేదో reclaim చేసేసి, ఆకాశహర్మ్యాలు కట్టేయడం. ఈ కట్టడాలతో పాటే జనాభా, పొల్యూషనూ, దేశంలో ఏ ఒక్కనదైనా స్నానం చేయడానికి శుభ్రంగా ఉందేమో చెప్పండి. పోనీ ప్రభుత్వాలు శ్రధ్ధతీసికోలేదంటారా అంటే అదీ కాదు, గంగమ్మ తల్లిని శుభ్రపరచడానికి ప్రతీ సంవత్సరమూ కోటానుకోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. పనులు చేయడంలేదా అంటే అదీ కాదూ, పదిరూపాయల్లో అయిదురూపాయలు తిన్నా, మిగిలిన అయిదురూపాయలూ శుభ్రపరచడానికి ఖర్చైతే పెడుతున్నారు. ఏమైనా అడిగితే, “జనంలో రావాలీ, నదీతీరాలు శుభ్రంగా ఉంచాలీ అని” అంటారు ప్రభుత్వం వారు. ప్రజలనే ఏమిటిలెండి, పరిశ్రమలూ అలాగే ఉన్నాయి.వాళ్ళ ఫాక్టరీలో ఉండే waste అంతా నదుల్లోకి వదిలేస్తారు. వాళ్ళ సొమ్మేంపోయిందీ, వాడూ వాడి ఫాక్టరీ శుభ్రంగా ఉన్నాయి, ఎవడెలాపోతే వాడికేమిటీ?

    ఇలా చెప్పుకుంటూ పోతే కావలిసినన్నున్నాయి. ఎవరు మాత్రం ఎంతకాలం ఓర్చుకుంటారు చెప్పండి. ప్రభుత్వం వారినడిగితే మేము డబ్బులు ఖర్చుచేస్తున్నామూ అంటారు, ప్రజలనడిగితే, మమ్మల్నేం చేయమంటారూ మాకు ఖాళీ స్థలాలు దొరకడంలేదూ అంటారు. అదేదో రాజుగారూ ఏడు చేపల కథలాగ ఏవేవో కారణాలు చెప్పేసి తప్పించేసికుంటున్నారు.

    ఇంక వీళ్ళెవరివల్లా లాభం లేదనుకున్నదేమో ఆ గంగమ్మ తల్లి. చేసేదేదో తనే చేయాలనుకుందేమో, వీళ్ళా ప్రక్షాళనం చేయరూ, పోనీ చేసేవాళ్ళని చేయనిస్తారా అంటే అదీ లేదూ, ఇంకెలాగ మరి? సరే చేసేదేదో మనమే చేసేస్తే వీళ్ళకీ తెలిసొస్తుందనుకుని, “క్లీనింగ్ అభియాన్” పేరుతో, మొత్తం అంతా తుడిచిపెట్టేసింది. ఇంక ఇప్పుడంతా శుభ్రమే కదా. దేనికైనా ఓర్పు అనేది ఉంటుంది. beyond certain limit వెళ్తేనే ఇలాటి ఉపద్రవాలు సంభవిస్తూంటాయి. అలాటివాటిలో ప్రజలకి కష్టాలు కలగడం purely incidental.

    మీకేమిటీ, ఇంట్లో కూర్చుని ఎన్నైనా చెప్పగలరూ, ఆ యాత్రలకి వెళ్ళినవారి కష్టాలు మీకేం తెలుసూ. పాపం చూడండి, మన తెలుగు చానెళ్ళవాళ్ళు, వాళ్ళవల్లే సహాయకార్యక్రమాలు ప్రారంభం అయినట్టు , ప్రతీ చానెల్ వాడూ చెప్పడమే.

    దేశంలో ఉండే ప్రతీ నదీ, ఇలా పుష్కారినికోసారి ప్రక్షాళనా కార్యక్రమం చేబడితేనే కానీ, మనం బాగుపడం...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సినేమాకి శతవార్షికోత్సవం….ట…

    మన దేశంలో చలనచిత్రాలు అవేనండీ సినేమాలు వచ్చి 100 సంవత్సరాలు పూర్తయాయిట. ఆ సందర్భంలో టీవీల్లో వచ్చే ప్రతీ చానెల్ వాళ్ళూ ప్రత్యేకకార్యక్రమాలు చూపించేస్తున్నారు. ఏదో ప్రాంతీయ చానెళ్ళవాళ్ళు తమప్రాంత చిత్రాలను గురించి కార్యక్రమాలు చేశారంటే అర్ధం ఉంది. కానీ జాతీయ చానెళ్ళలో చూపించే కార్యక్రమాలు అందులోనూ ఇంగ్లీషువాటిల్లో చూపించే ఈ 100 సంవత్సరాల చలన చిత్ర కార్యక్రమాలు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. హిందీ చానెల్స్ హిందీ సినిమాల గురించి చూపించడంవరకూ బాగానే ఉంది. కానీ ఈ so called National Channels లో చూపించేవి చూస్తే, భారతదేశంలో హిందీలోనే సినిమాలు తీస్తారూ, మిగిలిన భాషలలో తీసేవి, ఏదో నామమాత్రంగానే అనే అర్ధం అవుతూంటుంది. కారణం వారం వారం హిందీ సినిమాలగురించి మాట్టాడతారు కానీ, ప్రాంతీయ చిత్రాలగురించి నోరెత్తరు. ఈమాత్రం దానికి వాటిని జాతీయ చానెల్స్ అని పిలుచుకోడం దేనికో?

    పైగా వాటికి TRP లూ, సింగినాదాలూనూ, చానెళ్ళసంగతి అలా ఉంటే, ఇంక ఈ సినిమాల పత్రికల సంగతి అసలు అడగనే అఖ్ఖర్లేదు. హిందీ కాకుండగా, మిగిలిన అన్ని ప్రాంతీయ భాషల్లోనూ కూడా సినిమాలు తీస్తారని కానీ, ఆ సినిమాలు హిందీ చిత్రాలకి ఎంతమాత్రం తీసిపోవనీ, అసలు వాళ్ళకి తెలుసునంటారా? మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇంగ్లీషులో ఉండే పత్రికలకీ, టివీ చానెళ్ళకీ ఈ “జాతీయ” హోదా కట్టిబెట్టడం. దేశమంతా చదువుతారు అంతవరకూ బాగానే ఉంది, కానీ చలనచిత్రాల విషయం వచ్చేసరికి హిందీ సినిమాల విషయమే మాట్టాడుతారు. గత వంద సంవత్సరాల్లోనూ దేశంలో విడుదలైన ప్రఖ్యాత సినిమాలూ అని మొదలెట్టి ఓ Mother India తో ప్రారంభించి Sholay తో ఆపుతారు. అక్కడకి అవి తప్ప చూడదగ్గ చిత్రమే లేనట్టు. మధ్యలో ఇంకో భాషుందండోయ్ బెంగాలి, సినిమాలగురించి వ్రాసే ప్రతీవాడికీ సత్యజిత్ రే గురించి వ్రాయడం ఓ status symbol. ఆయన గొప్పవాడే ఎవరూ కాదనడంలేదు. కానీ ఆయన తప్ప దేశంలో ఇంకో ప్రముఖవ్యక్తే లేడనే అర్ధం వచ్చేటట్టు వ్రాస్తే చిర్రెత్తుకొస్తుంది.

    ప్రతీ ప్రాంతీయ సినిమా ప్రపంచంలోనూ ఉద్దండులైన దర్శకులూ, నిర్మాతలూ ,నటులూ, నటీమణులూ, సంగీత దర్శకులూ, నేపథ్యగాయకులూ ఉన్నారు, వారిగురించికూడా ఒకసారి formality కోసమైనా ప్రస్తావిస్తే వాళ్ళ సొమ్మేమైనా పోతుందా? అసలు గొడవంతా మనలోనే ఉంది, ఉదాహరణకి తెలుగు సినిమాలు తీసికోండి, తెలుగులో అసలు నటులే లేనట్టు, బయటివాళ్ళని తెచ్చుకోడం, పాటలు కూడా తెలుగేతర గాయకులచేతే పాడించడం, వీటన్నిటినీ తెలుగు ప్రేక్షకుల నెత్తిన రుద్దడం. అప్పుడెప్పుడో లతామంగేష్కర్ చేత, సుసర్ల దక్షిణామూర్తిగారు సంతానం సినిమాలో పాడించారంటే, పోనిద్దూ బాగానే ఉందీ అనుకున్నాము, కారణం ఆరోజుల్లో అదొక novel experiment. కానీ ఈ రోజుల్లో అదో వేలంవెర్రిలా తయారయింది. ఏమైనా అంటే freedom of expression అంటూ అంటూ లెక్చర్లోటి. ఇంక నటీనటుల విషయానికొస్తే, స్వఛ్ఛమైన తెలుగునటులంటే మన నిర్మాతలకి ఎలర్జీ అనుకుంటాను, అందుకే పరభాషానటీమణులకే పెద్దపీట వేస్తారు. పోనీ అదేదో cultural exchange లాటిదనుకుందామా అంటే, హిందీవాళ్ళు మన మొహం కూడా చూడరు. అధవా ఏదైనా పాత్ర ఇచ్చినా, ఏదో సెకండరీదే కానీ, ప్రముఖ పాత్రల్లో ఉండరు. కానీ, మనవాళ్ళు మాత్రం ఎగేసుకుంటూ పోతారు.

    పోనీ ఆ హిందీసినిమాలైనా ఒరిజినలా అంటే అదీకాదు, తెలుగులో హిట్టైన చాలా చిత్రాలు హిందీలోనూ వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడకూడా ఓ తిరకాసుంది, అదృష్టం బాగుండి, ఆ హిందీ సినిమా హిట్టయిందా, ఇంక చూసుకోండి చిలవలూ,పలవలూ చేసేసి పొగిడేస్తారు. ఎక్కడో చివరన ఈ సినిమా ఫలానా భాషనుండి హిందీకరించబడిందీ అంటూ, “తమిళం” అని వ్రాస్తారు తప్ప, తెలుగు అనిమాత్రం ఛస్తే వ్రాయరు. అరే ఇది మన తెలుగు సినిమాలా ఉందే అనుకున్నా, ఎవడికీ పట్టదు. ఇంక మన యువతరం (facebook crowd) ఆ హిందీసినిమా చూసేసి ఆహా..ఓహో.. అనడం, అర్రేబాబా ఇది ఒరిజినల్ గా తెలుగులో తీశారు నాన్నా అన్నా సరే, ” ఊరుకోండి డాడీ, తెలుగులో ఇంత మంచి సినిమాలు కూడా వస్తాయంటే నమ్ముతామేమిటీ, you are joking.. అనడం. ఇలా ఉంది మన తెలుగు సినిమాల పరిస్థితి. ఏదో బావుందనే కదా, హిందీలో తీశారూ, అది ఒప్పుకోడానికేంరోగం?

    అన్ని సంవత్సరాలు బానిసత్వానికి అలవాటు పడిపోయి, ఆ వాతావరణంలోంచి బయటపడలేకపోతున్నారు. ఇదివరకు ఆంగ్లేయులూ, ఇప్పుడేమో హిందీచలనచిత్రరంగం వాళ్ళూనూ. ఎవరినో అని లాభం ఏమిటీ మన బంగారం బాగోనప్పుడు…చూస్తూ కూర్చోడం తప్ప.

    ఇంక పత్రికల విషయానికొస్తే ఏదో ఆ Screen తప్పించి , మిగిలిన వారు Filmfare, Stardust వాళ్ళు దక్షిణభారతీయ చిత్రాలను గురించి ఒక్కమాటైనా వ్రాస్తారేమో చూడండి. కానీ మన పత్రికలవాళ్ళు especially స్వాతి వార పత్రిక లాటివారు మాత్రం పేజీకి ఒక హిందీ తారామణి గురించి వ్రాస్తేనే కానీ నిద్రపట్టదు వాళ్ళకీ. ఇది సరిపోనట్టు ఎవరో ఓ మాయదారి తారగురించి ప్రత్యేక వ్యాసాలోటీ. ఖర్మ ఏం చేస్తాం? భరించాలి మరి !

    వికీపేడియాలో ఒకసారి చూడండి, దేశంలో తయారయ్యే చలన చిత్రాలలో కొన్ని కొన్ని సంవత్సరాల్లో తెలుగు సినిమాలే ఎక్కువ.తెలుగు చలనచిత్రపరిశ్రమలో ఈ వందేళ్ళలోనూ జరిగినవి ఇక్కడ చూడండి. అంతదాకా ఎందుకూ ఆమధ్యన CNN-IBN వాళ్ళు నిర్వహించిన Poll లో మన తె…లు..గు… చిత్రమే ( మాయాబజార్) సర్వోత్కృష్ట సినిమా గా ఎంపికయింది. అంతకంటే ఏం కావాలండీ తెలుగు సినిమా ఘనత చాటడానికీ ? ఓ దేవదాస్ సినిమా అన్ని భాషల్లో తీశారుకదా, తెలుగులో శ్రీ అక్కినేని గారి నటనతో ఇంకోరెవరైనా పోటీకి రాగలరా? అయినా సరే ఆ మాట ఏ “జాతీయ” పత్రికవాడూ, చానెల్ వాడూ ఎత్తడు.

    ఈ సందర్భంలో CARAVAN అనే మాస పత్రికలో వచ్చిన వ్యాసం చదవండి.Century Bazaar

బాతాఖాని–లక్ష్మిఫణి కబుర్లు–Good..old.. Telegram..R.I.P…

    ప్రస్తుతం తెలుగు బ్లాగులు చదివేవారు, వాళ్ళు పెరిగిపెద్దయే సందర్భంలో, ఒక్కసారైనా ఈ టెలిగ్రాం ని చూసుంటారు. మీ తల్లితండ్రుల గురించి చెప్పఖర్లేదనుకోండి. మీరు పరీక్షలు పాసయినప్పుడు అవొచ్చు, అంతదాకా ఎందుకూ, మీరు పుట్టినట్టు మీ నాన్నగారికి తెలిసింది, ఈ టెలిగ్రాం ద్వారానే, ఒకసారి అడిగిచూడండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏడో నెలకే పురిటికోసం, పుట్టింటికి వెళ్ళిపోయేవారు. అక్కడ శ్రీమంతం తంతు పూర్తిచేసికుని, మళ్ళీ మామగారిదగ్గరనుండి ఈ టెలిగ్రాం వచ్చిన తరువాతే పుట్టిన బాబునో, పాపనో చూడ్డానికి వెళ్ళడం. అంతవరకూ “మేఘసందేశాలే” మరి…

    ఓ శుభవార్తొచ్చినా, అశుభవార్తొచ్చినా ఈ టెలిగ్రాం ద్వారానే. టెలిగ్రాం బంట్రోతు వచ్చేడంటే అందరికీ దడా, వణుకూనూ, ఏం వార్త మోసుకొచ్చిందో అని ! మంచిదైతే ఆ టెలిగ్రాం తెచ్చినవాడికి ఓ పటికబెల్లం ముక్కో ఇంకోటో చేతిలో పెట్టడం. అదే ఏ విచారకరమైన వార్తో వచ్చిందా, వాడెదురుగుండానే గుండెలు బాదుకుంటూ ఏడుపులూ, రాగాలూనూ. ఉరు ఊరంతా తెలియాలన్నమాట, వారి దగ్గరవారెవరో పోయారని. ఇంక పరామర్శలూ వగైరాలు.

    ఇవి కాకుండగా పెళ్ళిళ్ళలో వచ్చే శుభాకాంక్షల టెలిగ్రాములు. దేశంలో తెలిసిన ప్రతీవారికీ ఓ శుభలేఖ వేస్తారుగా, ప్రతీవాడూ ఎక్కడ వస్తాడూ, ఓ గ్రీటింగు టెలిగ్రాం, పెళ్ళి టైముకి అందేటట్టు పంపించేస్తే ఓ గొడవొదిలేది. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఈ టెలిగ్రాం లలో మొదటి ఇన్ని words కి ఇంతా,అటుపైన ప్రతీ word కీ ఇంతంతా అని ఉండేది, ఈ రోజుల్లో ఆటో రిక్షా మీటర్లలాగ.comma, fullstop కి అదనం. ఎడ్రసుకూడా కుదిమట్టం చేసి పంపాల్సొచ్చేది, దాన్ని కూడా లెఖ్ఖలోకి తీసికుంటారుగా. ఆ ఎడ్రసూ, శుభాకాంక్ష సందేశం పూర్తిగా వ్రాసేటప్పటికి తడిపి మోపెడయ్యేది, దానికంటే శలవు పెట్టి పెళ్ళికి వెళ్ళడమే చవక. అందుకోసం ప్రభుత్వం వారు, ఈ Greeting Telegram లకి కొన్ని కోడ్ నెంబర్లు పెట్టారు. ఫలానా నెంబరైతే ఫలానా సందేశం అని. పెళ్ళిళ్ళకైతే 8, 16 ఉండేవనుకుంటాను. మరీ ఎక్కువ టెలిగ్రాం లు లేకపోతే ఆ నెంబరుకి సంబంధించిన సందేశం వ్రాసేవారు, లేదా మన అదృష్టం బాగోపోతే ఆ నెంబరొకటే వేయడం, మనమేమో అదేమిటో తెలిసికోడానికి ఏ టెలిఫోన్ డైరెక్టరీలోనో చూసుకోడం. జీవితంలో సంభవించే ప్రతీ occasion కీ ఓ నెంబరుండేది. వాటి వివరాలు కావలిసిస్తే ఇక్కడ ఓసారి చూడండి.ఆ రోజుల్లో పెళ్ళిళ్ళల్లో ఎన్ని గ్రీటింగు టెలిగ్రాములు వస్తే అంత గొప్పన్నమాట. అబ్బ మా అల్లుడిగారికి ఎంతమంది స్నేహితులో అని మామగారూ, మా వారికి ఎంత పాప్యులారిటీయో అని కొత్త పెళ్ళికూతురూ అనుకోడం, పక్కనే ఉండే పెళ్ళికొడుకు కాలరెగరేసికోడమూనూ. ఆ టెలిగ్రాములు తెచ్చినవాడికి మామూళ్ళు మళ్ళీ మామగారి ఖాతాలోనే…

    ఈ టెలిగ్రాములు పంపడానికి కూడా ఓ పెద్ద తంతు… ఓ ఫారం ఇచ్చేవారు దాంట్లో మనం పంపవలసిన సమాచారం ఏదో కుదించి వ్రాయడం, ప్రతీవారికీ ఆంగ్ల భాష మీద అంత పట్టుండేదికాదుగా, ఏ స్కూలుకెళ్ళేవాడినో పట్టుకుని, వాడిచేత వ్రాయించి, కిటికీకి ఆతలుండే అతనికి ఇవ్వడమూ, అతనేమో కొబ్బరికాయలు లెఖ్ఖెట్టినట్టు ఎన్ని words ఉన్నాయో చూడడం, ఇంతా అని చెప్పి, అదేదో దానిమీద టక..టకా..టక్.. టక్..టక్.. ఠా.. ఠక్కులమారీ.. అంటూ నొక్కేయడం, ఓ రసీదు వ్రాసి మన మొహాన్న కొట్టడమూ, అదేమిటో రెండోదాంట్లోనో, మూడోదాంట్లోనో వేసేవాడు స్టాంపు…

   ఏమిటో ఈ రోజుల్లో వచ్చే SMS ల భాష చూసి, దేశంలో భాష భ్రష్టుపడిపోతోందో అని బాధపడిపోతున్న సాంప్రదాయవాదులు ఒక సంగతి గుర్తుంచుకోవాలి. ఆంగ్ల భాష అప్పటికే భ్రష్టు పడిపోయింది ఈ టెలిగ్రాముల ధర్మమా అని. ఓ అర్ధం పర్ధం ఉండేవికావు, అయినా పనైపోయేది. మళ్ళీ ఇందులో ఒక తిరకాసూ, ఆ ఇచ్చేవాడు సరీగ్గా కొట్టాలి, ఈ రాసుకునేవాడికి అది అర్ధం అవాలి, ఆతావేతా చివరికి అందేవాడి అదృష్టం. ఇంటర్వ్యూలనండి, పరీక్షా ఫలితాలనండి, పైఊళ్ళో ఉండే కొడుక్కో కూతురికో డబ్బులు అవసరమైనప్పుడనండి, అఘమేఘాలమీద సందేశాలు వెళ్ళిపోయేవి. ఆరోజుల్లో బొంబాయిలో మా చుట్టం ఒకరుండేవారు, ఆయన ఒకసారి అస్వస్థతతో ఆసుపత్రిలో చేర్చారు వారి స్నేహితులు, దగ్గరగా ఉండే వారికెవరికైనా తెలియపరచొద్దూ, నేను దొరికాను, ఎప్పుడో మాటల్లో మా బంధువు చెప్పారు, మా అంకుల్ పూనాలో ఉంటున్నారూ అని, ఇంకేముందీ, ఏదో పిల్లనిచ్చే మావే అయుంటాడూ అనుకుని నాకో టెలిగ్రాం ఇచ్చేశారు, పోనీ అదైనా సరీగ్గా ఉందా, అబ్బే .. ఆ ఇచ్చినాయన పేరు లక్ష్మణస్వామి, నాకు ఆ టెలిగ్రాం చేరేటప్పటికి అది కాస్తా ఆకాశవాణి అయిపోయింది ! రేడియో వాళ్ళకి నాతో పనేమిటా అని ఆలోచిస్తే, ఆ టెలిగ్రాం లో సమాచారం చదివినతరువాత తెలిసింది ఈ టెలిగ్రాములవారి నిర్వాకం..
పరీక్షాఫలితాలు తెలిసికోవాలంటే ఏ వాల్తేరులోనో ఉండే వాడిని పట్టుకోడం, ఆ పెద్దమనిషేమో, ఏ రిజిస్టార్ ఆఫీసులోనో తన పరిచయాలు ఉపయోగించి, ఫలితాలు ప్రచురించేముందే , తెలిసికుని ఓ టెలిగ్రాం పంపడం. వీటివల్ల ఓ రెండుమూడు రోజులముందునుంచీ చివాట్లు తగిలేవి, మన రిజల్టు చూసి

    ఉద్యోగరీత్యా నేను వరంగాం లో ఉన్నప్పుడు, మా అమ్మాయి రిజల్టు టెలిగ్రాంద్వారానే తెలిసింది. కానీ అలాటి చిన్న చిన్న కాలనీల్లో, మనకి ఏదైనా టెలిగ్రాం వచ్చిందంటే, మనకంటే ముందుగా ఆ కాలనీలోవాళ్ళకి తెలిసిపోయేది, కారణం– ఆ టెలిగ్రాములు పంచేవాడికి కాలనీఅంతా చుట్టాలే, అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పేయడం. Free publicity అన్నమాట !

    అలా అన్ని రోజులూ, మన జీవితాల్లో సుఖ, దుఃఖాల్లో పాలుపంచుకున్న ఈ టెలిగ్రాము ఇంక కనుమరుగవుతుందని ఈవేళ పేపర్లో చదివితే ఎంతో బాధేసింది.కొత్తనీరొచ్చి పాతనీరుని తీసేస్తుంది నిజమే కానీ నీరు నీరే కదా.

    మనలో చాలామందికి ఈ టెలిగ్రాముల విషయం, కథా కమామీషూ తెలుసును, కానీ తరువాతి తరం వారికి కూడా తెలియాలిగా, మీ ఇళ్ళల్లో ఎప్పటివైనా పాత టెలిగ్రాములు ఉంటే, వాటిని జాగ్రత్తచేసి పిల్లలకి చూపించండి–for posterity.. మహా అయితే నవ్వుకుంటారు so what ?కానీ, ఆ టెలిగ్రాం వచ్చిన రోజున మనజీవితాల్లో పండిన నవ్వుని మళ్ళీతేగలమా?

   1974లో మా అమ్మాయి పుట్టినప్పుడు మా మామగారు ఇచ్చిన టెలిగ్రామూ, మా అమ్మాయి పరీక్షాఫలితాల టెలిగ్రామూ ఇప్పటికీ దాచిఉంచాను… అదో సరదా…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “ఈనాడు” వారి భాషా సేవ

   తెలుగులోనే మాట్టాడాలి, తెలుగుభాషని అభివృధ్ధి చేయాలీ అనే స్లోగన్సే తప్ప, ప్రభుత్వం వారు sincere గా చేసే ప్రయత్నం ఏమీ కనిపించడంలేదు. ఏదో ప్రతీ సంవత్సరమూ, ఒక రోజు ని తెలుగుభాషా దినం, మాతృభాషా దినం అంటూ, రవీంద్రభారతి లోనో ఎక్కడో ఓ సభ ఏర్పాటు చేసేస్తే సరిపోతుందా? మామూలుగా ప్రతీవాళ్ళూ చేసే Fathers Day, Mothers Day, Valetines Day ఇంకో సింగినాదం Day ల్లాగే ఇదీనూ. అక్కడెక్కడో అమెరికాలో జరిగే తానాలూ, ఆటాలూ వగైరాల్లో పాల్గొని, అవేవో “జీవితసాఫల్య ఎవార్డులు ” తీసికోడంతో సరిపోయిందనుకుంటారు మన గౌరవనీయ ప్రభుత్వం వారు.. నాకో విషయం అర్ధం అవదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు సమావేశాలు జరిగినా, ఓ పేద్ద పటాలం వెళ్ళిపోతుంది. వీళ్ళందరి ఖర్చులూ ఎవరు భరిస్తూంటారుట? అయినా మనం అందరం పన్నులు కడుతున్నాము కదా, డబ్బుకి లోటేమిటిలెండి?

    ఓ సెన్సార్ బోర్డనోటుంది.వాళ్ళు సినిమాల్లో చూపించే దృశ్యాలు ఎలాగూ పట్టించుకోడంలేదు, కనీసం ఆ సినిమాల పేర్లైనా తెలుగులో ఉండాలని సూచిస్తే వాళ్ళ సొమ్మేంపోయింది? పైగా సినిమాకి ఏం పేరు పెట్టాలో మేమేం చెప్పగలమూ అంటారు, “పేరు లో ఏముందీ” అంటూ పాటకూడా పాడే సమర్ధులు. ఆ సినిమావాళ్ళూ అలాగే తగలడ్డారు. సినిమాలకి తెలుగులో ఉండే పేర్లు పెడితే అవేవో ఆర్ధికసహాయాలు చేస్తామంటే చాలు, పొలోమంటూ పెట్టేస్తారు. ఆమాత్రం కూడా చేయలేదా ప్రభుత్వం? పక్క రాష్ట్రాలవాళ్ళు చేస్తున్నట్టు చేయడానికి వీళ్ళకేం రోగం? భాషాభివృధ్ధికి ఏమిటేమిటో చేసేస్తున్నామూ అని ఊరికే ప్రసంగాలు చేయడం కాదు. చేస్తున్నట్టు కనిపించాలి కూడానూ.

    ఈ విషయంలో తెలుగుభాషకి కొంతలోకొంత సేవలాటిది చేస్తున్నది రామోజీ ఫౌండేషన్ వాళ్ళేమో అనిపిస్తుంది.ఆయన అంటే రామోజీ గారికి ఎన్ని గొడవలుండనీయండి, భాష విషయంలో మాత్రం సేవ చేయడమే కాదు, వారు చేసేవి అందరికీ అందుబాటులోకి తేవడం. నాకు ఈనాడు పేపరంటే అదేదో అభిమానమేమో అనుకోకండి. వార్తాపత్రికలన్నీ ఏదో ఒక రాజకీయపార్టీకి mouth pieces లే. ఏ పార్టీ అభిమానులకి ఆ పత్రిక నచ్చుతుంది. అందులో వ్రాసినవే వేదాక్షరాల్లాగ కనిపిస్తాయి.

   కానీ పార్టీలకీ, రాజకీయాలకీ అతీతంగా, తెలుగు భాషనే దృష్టిలో పెట్టుకుని, తమకి తోచిన సేవ చేయడంలో ఈనాడు గ్రూప్ వాళ్ళు మాత్రం second to none. వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే. ఇదేమిటీ ఈవేళ ఈయన ఈనాడు గురించి ఇంతలా ప్రశంసిస్తున్నారేమిటీ, వాళ్ళు ఏమైనా డబ్బులు కానీ ఇచ్చారా అనుకోవచ్చు. అలాటిదేమీలేదులెండి, ఉన్నదేదో చెప్పాలనే ఈ టపా. అసలు పుస్తకాలు ఎందుకుప్రచురిస్తారుట, నలుగురు చదువుతారూ, అన్ని విషయాలూ తెలుస్తాయీ అనే కదా. ఆ సందర్భంలోనే తెలుగు సాహిత్యాన్ని అందరికీ చేరువలోకి తెచ్చే ఉద్దేశ్యంతో ఓ రెండు మాసపత్రికలు నడుపుతున్నారు. అవి సరిపోనట్టు ఇంకో మాసపత్రిక కూడా మొదలెట్టారు. దానికి ఓ కొంత వెల పెట్టారు. గత కొన్నేళ్ళగా నెలకీ అతిస్వల్ప (అంటే 10 రుపాయలు) వెలతో, అందరికీ అందుబాటులో పెట్టడానికి ఖలేజా ఉండాలి. మిగిలిన వార మాస పత్రికలన్నీ, ఏదో కారణం చెప్పి ఖరీదులు పెంచేస్తున్న ఈ రోజుల్లో కూడా, ఈనాడు వారు ప్రచురిస్తున్న విపుల, చతుర మాసపత్రికలు ( with so much content) అంత తక్కువ ఖరీదుతో అందరికీ అందుబాటులో ఉంచడం ఈనాడు రామోజీరావుగారికే చెల్లింది. పైగా దేశవిదేశాల్లో అందరికీ లభించవేమో అనుకుని ప్రతీనెలా, ఈ మాసపత్రికల– విపుల చతుర — ల online editions కూడా అందుబాటులో పెట్టారు. డబ్బులే చేసికోవాలంటే ఈనాడు వాళ్ళు ఇలా చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఏదో నలుగురూ చదవాలీ, భాష అభివృధ్ధి చెందాలీ అన్నదే వీళ్ళ ఉద్దేశ్యం.

    ఈమధ్యనే ఇంకొక మాసపత్రిక కూడా మొదలెట్టారన్నానుగా, “తెలుగు వెలుగు” అని, ఏదో అంతర్జాలంలో ఆ పత్రిక గురించి రివ్యూలు చదివి, అరే ఆ పత్రిక ఇక్కడ( పూణె) లో కూడా దొరికితే బావుండేదీ , అనుకుని మా రైల్వే బుక్ స్టాల్ వారిని అడిగాను. ఏదో మా మిత్రుల ధర్మమా అని, ఓ రెండు సంచికలు దొరికేయి పోస్టు/కొరియర్ ద్వారా పంపబడగా, కానీ ప్రతీ నెలా పంపమంటే బాగోదుగా. ఎలాగరా అని ఆలోచిస్తూంటే నిన్నటి గూగుల్ ప్లస్ లో ఎవరో పెట్టిన లింకు గురించి మా ఇంటావిడ చెప్పింది. మొత్తానికి తెలుగు వెలుగు మాసపత్రిక e-edition కూడా పెట్టేశారు.

    ఈనాడు వారు తెలుగుభాషకి చేస్తూన్న ఈ సేవ మాత్రం అభినందనీయం. ఈనాడు యాజమాన్యం వారు ఇంత “బడా దిల్” ప్రదర్సించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. రెండు మూడు పత్రికలు ప్రచురిస్తున్నాము, దాని వెల ఫలానా కావలిసిస్తే కొనుక్కోండి, లేదా సంవత్సర చందా ఇంత, అని చెప్పేసి వదిలేయొచ్చు. కానీ అలా కాకుండగా, తెలుగు భాషాభిమానులందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వారు ఆ మాస పత్రికల e-edition అందుబాటులోకి తేవడం చాలా బావుంది.

    మిగిలిన తెలుగు పత్రికలు కూడా ఇలా చేయగలిగితే కనీసం అంతర్జాలంలోనైనా తెలుగు భాష అభివృధ్ధి చెందుతుందేమో అని ఓ ఆశ. కారణం print editions కి ఎలాగూ కాలదోషం పట్టింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతర్జాలమే.తెలుగులో ప్రచురిస్తున్న మిగిలిన పత్రికలు కూడా అంతజాలంలో వస్తే ఇంకొన్ని పత్రికలు చదువుకోవచ్చని ఓ చిన్న ఆశ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   సిబీఐ జాయింటు డైరెక్టరు శ్రీలక్ష్మినారాయణ గారి, పదవీకాలం పొడిగించకుండా, మహరాష్ట్ర కి బదిలీ చేయడం నిరసిస్తూ, ఎవరో హైకోర్టులో వ్యాజ్యం వేశారుట. ఎవరి అభిమానం వారిదీ. కానీ అవేవో రూల్సని ఉంటూంటాయిగా, వాటిని కూడా అనుసరించాలేమో అప్పుడప్పుడు. ఈ వ్యాజ్యం వేసినవారనేదేమిటయ్యా అంటే, శ్రీలక్ష్మీనారాయణ, ఆయన ఎందరో ప్రముఖుల్ని– సత్యం రామలింగరాజు,గాలి, వాళ్ళెవరో ఇద్దరు ముగ్గురు మంత్రులూ, మాజీ ముఖ్యమంత్రిగారి పుత్రుడూ, మళ్ళీ ఇంకొందరు మంత్రులూ ఇలా చెప్పుకుంటూ పోతే, పాపం జైళ్ళకెళ్ళిన చాలామంది, శ్రీ లక్ష్మినారాయణ గారి ప్రసాదమే మరి. అయినా ప్రతీదీ ఇలా సీరియస్సుగా తీసేసికుంటే ఎలాగండి బాబూ. ఈ విచారణలూ, అరెస్టులూ ఏదో, ప్రజలని ఊరుకోపెట్టడానికి కానీ, వీళ్ళందరికీ ఏమైనా శిక్షలు పడతాయా ఏమిటీ?

    కేసులు తేలేటప్పటికి కనీసం ఓ పుష్కరమైనా పడుతుంది. ఈలోపులో ప్రభుత్వాలు మారకుండా ఉంటేనూ. కోర్టుల్లోకి వెళ్ళిన కేసులకే దిక్కులేదు, ఉత్తర్ ప్రదేష్ లో పాత కేసులు ఎత్తేయాలని తీరా నిర్ణయం తీసికుంటే, కోర్టువాళ్ళు కోప్పడ్డారుట. 1984 లో జరిగిన అల్లర్ల విషయంలో సజ్జన్ కుమార్, టైట్లర్ లకి చీమైనా కుట్టినట్టులేదు. హాయిగా ఉన్నారు.అంతదాకా ఎందుకూ, మహారాష్ట్రలో జరిగిన అల్లర్లకి బాల్ ఠాక్రే ని ఏం చేశారు? గుజరాత్ లో జరిగిన అల్లర్లకి మోడీ కారణం అన్నారు. తీరా జరిగేదేమిటంటే, రేపెప్పుడో ప్రధానమంత్రి గా బాధ్యతలు చేబట్టినా చేపట్టొచ్చు.

    సోనియాగాంధీ సెక్రెటరీ జార్జి మీద పేద్ద హడావిడి చేసేశారు. తీరా జరిగిందేమిటీ–for insufficient evidence కేసు కొట్టేశారుట.అలాగే రాబర్టు వాధ్వా వ్యవహారమూ అదే గతి పడుతుంది.ములాయంసింగు మీద, మాయావతి మీదా సిబీఐ కేసులున్నాయి. ఉత్తిత్తినే వాటిని బయటకులాగి బెదిరించడానికి ఉపయోగిస్తూంటారు, ప్రభుత్వాలు పడిపోకుండగా, అంతే.ఎవరో ఒక పార్టీవాళ్ళే కాదు, ప్రతీ రాజకీయపార్టీ కీ ఉన్న రోగమే ఇది.

    చెప్పొచ్చేదేమిటంటే, ఓ లక్ష్మీనారాయణ అవనీయండి, లేకపోతే ఇంకో రామలింగయ్య అవనీయండి, ఎవరున్నా ఒక్కటే, ఓపికున్నంతకాలం కేసులు లాగడం, తీరా చివరకి బలమైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొట్టివేయబడిందీ..అనేసి అందరి నోర్లూ మూయడం.అప్పుడెప్పుడో ఓ మంత్రిగారు కూతురి పెళ్ళి వ్యవహారంలో, వసూళ్ళు చేశాడన్నారు, ఏమయిందీ ఆ కేసు?

    మొత్తానికి బిజేపీ వాళ్ళు మోడీకి పెద్దపీట వేసేశారు. పాపం ఆ ఆద్వానీగారు, అసలు ఒక్కళ్ళూ తనపేరే చెప్పడంలేదేమిటీ అని ‘అలిగి” గోవా వెళ్ళడం మానేశారు. అలాగని జరిగేదేమన్నా మానిందా, ఊరికే హడావిడిచేసి ఆద్వానీకి లేనిపోని ” అస్వస్థత” ని అంటగట్టారు.ఇప్పుడు బయటపడతాయి అందరి “రంగులూ”. ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా, దేశంలో ప్రతీవాడూ తను ఓ నెహ్రూ అనో, ఇందిరాగాంధీ అనో, వాజపేయీ అనో అనుకుంటే హాస్యాస్పదం. ఏదో state level లో ఓ గొప్ప నాయకుడవొచ్చు, National level లో రాణించడానికీ, నెగ్గుకురావడానికీ అదేదో..that.. extra.. bit.. లాటిదేదో కావాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న ఎవరిలోనూ లేవు.మన్మోహన్సింగుగారు రెండు సార్లు ప్రధానమంత్రిగా చేసినా, ఆ ఘనత అంతా సోనియాకే ఇస్తారుకానీ, ఈయన గురించి ఎవడూ మాట్టాడడు.

    అసెంబ్లీ సమావేశాలూ, పార్లమెంటు సమావేశాలూ ప్రారంభం అవుతాయి, అదో కామెడీ షో. జరిగేదేమీ ఉండదు.2014 లో జరగబోయే సాధారణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎడా పెడా స్కీమ్ములూ, ప్రాజెక్టులూ వింటాము. అవేమైనా జరిగేవా పెట్టేవా? అదో కాలక్షేపం.

    మధ్యలో రామాయణం లో పిడకలవేటలా, అదేదో IPL Match Fixing ట. అక్కడికేదో కొత్తగా వచ్చినట్టు.ఆరేళ్ళనుండీ జరుగుతోంది, ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ప్రతీవాడూ ” హా..శ్ఛర్యాలు..” ప్రకటించేవాడే.

    ఎందుకొచ్చిన గొడవా, హాయిగా మన గొడవలేవో మనం చూసుకుందామూ అనుకుంటారా, ఇదిగో ఇలా హాయిగా మనసారా నవ్వుకోండి. నవ్వడానిక్కూడా ఓ యోగం ఉండాలండీ.

    నవ్వులూ అవీ తరువాత చూసుకుందామూ, హాయిగా నయనానందకారంగా ఏదైనా చూద్దామనుకుంటారా, మా కోనసీమ అందాలు సరిపోవూ …

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏమిటో అంతా గందరగోళంగా ఉంది….

    ఏదో వీధిన పడకుండా, నేను వారానికోటీ, మా ఇంటావిడ నెలకో, రెణ్ణెల్లకో ఒకటీ టపాలు పెట్టి కాలక్షేపం చేస్తున్నాము. ఇదివరకటి రోజుల్లో మా దగ్గర Desktop ఒకటే ఉండడంతో కొద్దిగా అభిప్రాయబేధాలు వచ్చేవి. మరీ పెద్ద కారణం కాదూ, ఆ Desktop ముందర, రోజులో చాలా భాగం నేనే కూర్చుంటూ ఉండేవాడిని. ఏ మంచినీళ్ళు త్రాగడానికో లేచినప్పుడు చటుక్కున తనొచ్చి కూర్చొనేది. రోజంతా ఈ musical chairs తోటే సరిపోయేది. భోజనం దగ్గరకూడా అదే తంతు, ఎవరు ముందర భోంచేసేస్తే వాళ్ళు వెళ్ళి కూర్చోడం.

    జ్ఞాపకం ఉండే ఉంటుంది, ఇదివరకటి రోజుల్లో అంటే చిన్నపిల్లలు లక్షణంగా తిండి తినే రోజుల్లో అన్నమాట, అలాగే పోషకపదార్ధాలతో తినే రోజులన్నమాట, టీవీ లూ రిమోట్లూ లేని రోజుల్లో అన్నమాట,కంప్యూటర్లూ అంతర్జాలాలూ లేని రోజులన్నమాట, అమ్మ చేతిముద్దే తినే రోజులన్నమాట, ఇంటినిండా గంపెడు పిల్లలుండే రోజులన్నమాట... అమ్మ అనేది ఇది అమ్మ ముద్దా, ఇది నాన్న ముద్దా, ఇది తాతయ్య ముద్దా, ఇది అమ్మమ్మ ముద్దా, ఇది దేవుడి ముద్దా అంటూ, ఎవరు ముందర బువ్వ తినేస్తారో వాళ్ళకి ఓ అసలు సిసలైన అమ్మ ముద్దూ.. అంటూ. ఆ రోజులలాగుండేవి మరి.

    ఇప్పుడు ఆ ముద్దలూ లేవూ, ఆ అమ్మ ముద్దులూ లేవు. కానీ ఎవరికి వారికే తొందరగా తినేయాలనే అనే concept మాత్రం మిగిలిపోయింది. ఎవరి కారణాలు వారివి, ఎక్కడ చూసినా ఉరకలూ పరుగులూనూ, ఆ మాయదారి టివీ లో సీరియల్ ఏమైపోయిందో అని కొందరికి ఆత్రం, ఏ భక్తి కార్యక్రమాలో పెట్టేసికోవచ్చని కొంతమందికి హడావిడి, ఆ దిక్కుమాలిన క్రికెట్ మాచ్ ఏమైపోయిందో అని కొందరికి ఖంగారు, మొత్తానికి భోజనం చేయడం అనే ప్రక్రియ had gone for a toss.

    మరి మీకెందుకండీ లింగూలిటుకూ అంటూ ఇద్దరే ఉన్నారూ, హాయిగా కలిసి భోజనం చేయొచ్చుగా అనొచ్చు మీరు. పైన చెప్పానుగా ఎవరి కారణాలు వాళ్ళకుంటాయి. కూర్చోడం కలిసే కూర్చుంటాం, మరీ తను ముందరే భోజనం చేసేసే పరిస్థితికి రాలేదులెండి. ఇంకా పూజలూ, వ్రతాలూ చేసికుంటూంటుంది . అయినా భోజనం పూర్తిచేయడానికి రూల్సేవీ లేవుగా, అదిగో ఆ కిటుకు పట్టేసింది.
ఏదో నాలుగు ముద్దలు తినేసి, వెళ్ళి కంప్యూటరు ముందు కూర్చోడం. పైగా స్టవ్ మీద పాలు పెట్టేసి వెళ్ళడం,” ఓసారి చూస్తూ ఉండండీ, పాలు పొంగిపోతాయేమో..” అంటూ ఓ ఆర్డరు పాస్ చేసేసి. తప్పుతుందా మరి, ఆవిడ ఈలోపులో ఆ కంప్యూటరు దగ్గరకి వెళ్ళి కూర్చోడం. అప్పుడెప్పుడో అమ్మాయీ, అల్లుడూ మాకు ఒక Tab ఇచ్చినప్పటినుండీ, పరిస్థితుల్లో కొద్దిగా మార్పొచ్చిందిలెండి.నాతో పట్టింపులేకుండగా, దాంట్లొనే చూసుకుంటోంది. మళ్ళీ దాంట్లో ఓ మెలికోటీ, అందులో ” తెలుగులో వ్రాసుకోవడానికి పడడం లేదు. అవేవో ప్రహేళికలూ అవీ పూరిస్తూంటుందిగా, వాటి గురించన్నమాట. దానికీ ఓ సొల్యూషన్ పట్టాను. ఆ వచ్చిన ప్రహేళికలేవో ఓ print out తీసి ఆవిడకిచ్చేయడం. అవి పూర్తయేదాకా నా జోలికి రాదు. ఏదో ఇలా adjust అయిపోయాము.

    ఆ Tab ని మాత్రం ఇంట్లో wi-fi ఉన్నప్పుడే వాడుకోవాలీ అని ఓ out of court ఒడంబడిక ఒకటి చేసికున్నాములెండి. లేకపోతే బిల్లు తడిపిమోపెడవుతుందని. మళ్ళీ ఇందులో ఇంకో గొడవొచ్చింది. పిల్లలు ఎప్పుడొచ్చినా హాయిగా wi-fi మాత్రం connect అవుతూంటుంది. తన Tab దగ్గరకొచ్చేటప్పటికి అల్లరి పెట్టేస్తూంటుంది. అదేదో వీధుల్లో గాడీలు park చేసికోడానికి, అవేవో తేదీలుంటాయి చూడండి, అలాగ రోజువిడిచిరోజు మాత్రమే ఆ మాయదారి wi-fi connect అవుతూంటుంది. అదేం చిత్రమో మరి !

    అఛ్ఛా ఇవన్నీ ఇలాగుంటూండగా, ఈమధ్యన ఇంకో విచిత్రం కనిపిస్తోంది. అప్పుడప్పుడు తను వ్రాసుకున్న టపాలు అప్పుడప్పుడుTab లో చూస్తూంటుంది, ఏమైనా వ్యాఖ్యలున్నాయేమో అని, అలా ఒకసారి చూస్తూన్నప్పుడు తను వ్రాసిన ఒక టపాలో, తను పెట్టని కొన్ని పదాలు కనిపించాయి, రెండుమూడు చోట్ల. నాకు చూపించిందికాబట్టి కానీ, తను చెప్తే నమ్మేవాడిని కాదు. ఏమో ఎవరైనా తన టపాలు hack చేస్తున్నారేమో అనిపించింది. అయినా నా టపాలు hack చేయడానికి ఎవరికి పట్టిందండీ అంటూనే, ఆ particular టపాకి ఓ screen shot తీసి, అసలు ఈ గొడవలేమిటో అని, మన పాఠకులనెవరినైనా అడుగుదామని, desktop లో చూద్దామని ప్రయత్నిస్తే, అసలు ఏమీ తెలియని అమాయకురాలులా మామూలుగానే ఉంది. ఈ లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుకా అంటారా, లేక మీలో ఎవరైనా విజ్ఞులు కొద్దిగా తెలియచేస్తారా? ప్లీజ్…

    కొన్ని అద్భుతమైన ఫొటోలు చూడాలంటే ఇక్కడ నొక్కండి.

%d bloggers like this: