బాతాఖానీ ఖబుర్లు–43– బస్ ఇత్నాహీ కాఫీ

    పూణే నుండి వరంగాం తిరిగి వచ్చి మా ఇంటావిడతో సంప్రదించాను, ఏం చెయాలని. మాఇంట్లో పెద్దవాళ్ళు–మా అమ్మగారూ, మా మామ గారూ–వారిని అడిగితే అన్నారూ ” పిల్లలిద్దరూ ఇష్టపడుతూంటే ఏమీ ఇంక ఆలోచించకుండా చేసెయ్యి “. అంత పెద్ద వయస్సులొ ఉన్నవారే అలాగంటే ఇంక ఆలస్యమెందుకూ అనుకొన్నాము.ఇంకో విషయ మేమంటే ఆ అబ్బాయి గురించి అంతకు ముందు 5 సంవత్సరాలనుండీ మాకు తెలుసు, చదువులోననండి, ప్రవర్తనలోననండి. మా అమ్మాయీ, తనూ పూణే లో చదువుతూండేటప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడా కలసి తిరగడం కానీ, ఎవరి నోట్లోనూ పడడంగానీ చేయలేదు. ఈ లోపులో ఆ అబ్బాయి నాన్న గారు మా డిపార్ట్మెంట్ నుండీ రిటైర్ అయి ఢిల్లీ వెళ్ళిపోయారు. వెళ్ళేలోపల మా ఇద్దరి మధ్యా ఎలాంటి మాటలూ జరగలేదు, కాంటాక్ట్ కూడా ఏమీలేదు.

    మా అమ్మాయీ, ఆ అబ్బాయీ నేను పూణే వెళ్ళినప్పుడు మాత్రం చెప్పారు, అతని తల్లితండ్రులు త్వరలో పూణే వాళ్ళ అమ్మాయీ, అల్లుడూ దగ్గరకి వస్తున్నారూ అని. సరే ఈ అవకాశం ఉపయోగించుకుని, వారిని కలిసి, వారి అభిప్రాయం కూడా తెలిసికోవాలనుకున్నాను. నేనూ, మా అమ్మాయీ, వారి అల్లుడుగారింటికి వెళ్ళాము.

ఏం మాట్లాడాలో తెలియదు, ఎలామొదలెట్టాలో తెలియదు. అంతకుముందు ఎప్పుడూ ఇలాంటివి అలవాటు లేదు. సినిమాల్లోనూ, నవలల్లోనూ చూసినవీ, చదివినవీ గుర్తుచేసికొని, పేద్ద గొప్పగా ” ఐ వాంట్ టు ఆఫర్ మై డాటర్’స్ హాండ్ టు యువర్ సన్” అన్నాను. దానికి సమాధానంగా వారు టిపికల్ పంజాబీ స్టైల్లో ” క్యూ నహీ, మైనే కబ్ మనా కియా” అన్నారు. ఒప్పుకున్నారో లేదో అర్ధం అవలెదు !!కానీ ఆ తరువాత వారు అన్న మాటల బట్టి అర్ధం అయిందేమంటే వారికి, ఎటువంటీ అభ్యంతరమూ లేదని, ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేద్దామూ అన్నారు. అమ్మయ్యా ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడిన పిల్లలిద్దరికీ వారి వారి పెద్దల అనుమతితో పెళ్ళిచేయడం లో ఉన్న ఆనందం ఏమిటో తెలిసింది.పెళ్ళి అంటే రెండు మనసులేకాదు, రెండు కుటుంబాలుకూడా కలవాలి. అప్పుడే దానికి అందం..

    మా ఇంటావిడకి ఈ శుభవార్త ఫోన్ లో చెప్పేశాను.ఇంక ఈ ఎంగేజ్మెంట్ కి సన్నాహాలు చేయడమే తరవాయి. పిల్లలిద్దరికీ ఫైనల్ పరీక్షలు,మా అబ్బాయేమో క్లాస్ 11 పరీక్షల హడావిడిలోనూ ఉండబట్టి, అవి అయిన తరువాత పూణే లోనే చేద్దామనుకున్నాము. ఓ నెల దాటిన తరువాత మేంముగ్గురం(నేను, ఇంటావిడ, అబ్బాయి) పూణే వెళ్ళి, మా ఫ్రెండ్ విశ్రాంత వాడిలో ఉండేవాడు–అతనింట్లోనే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాము

    వివాహం మాత్రం మా అబ్బాయి క్లాస్ 12 పరీక్షలైన తరువాత పూణే లోనే చేద్దామని నిశ్చయించుకొన్నాము. ఈ లోపులో అమ్మాయికి కావలిసినవి కొనడమూ, మిగిలిన ఎరేంజ్మెంట్స్ పూర్తి చేసికోవడమూ అవుతాయి కదా. ఈ కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఒకరోజు వారి దగ్గరనుండి ఫోన్ వచ్చింది–ఒకసారి పెళ్ళి లోపులో ఢిల్లీ వచ్చి వారిని కలుసుకోమని! మళ్ళీ ఇదేమిటని మేమిద్దరమూ కొంచెం ఖంగారు పడ్డ సంగతి నిజం. ఏం అడుగుతారో ఏమిటో అని. అయినా అన్నింటికీ సిధ్ధ పడి, ఢిల్లీ ప్రయాణం అయ్యాము. మా కజిన్ వసంత్ విహార్ లో ఉండేవారు, వీళ్ళేమో రోహిణీ లో . ఊరికి ఈ మూల ఒకరు, ఆ మూల ఇంకొకరు.మా కజిన్ వాళ్ళకి కూడా ఖంగారు పుట్టింది, ఎందుకు పిలిచారో అని, పంజాబీ లకి చాలా చాలా కోరికలుంటాయీ, ఏం అడుగుతారో అంతా మీ అదృష్టం మీద ఆధార పడుతుందీ… అన్నారు. ఇంతదాకా వచ్చిన తరువాత ఏమైతే అదే అవుతుందని, వాళ్ళింటికి వెళ్ళాము.బ్రహ్మాండంగా డిన్నరూ అదీ ఏర్పాటు చేశారు.భోజనం అదీ అయిన తరువాత పెళ్ళి ఎక్కడ చేయడమూ లాంటి వాటి మీద మాటలు అయ్యాయి. అడిగెదేదో తొందరగా అడిగేస్తే ఓ సంగతి తేలిపోతుందికదా అని నేనూ, మా ఇంటావిడా ఒకే టెన్షన్ పడ్డాము.

ఆఖరికి వారు చెప్పడం మొదలెట్టారండీ–-మా వాళ్ళందరూ అంటే వీరికంటే వయస్సులో పెద్దవారందరూ పెళ్ళికి వస్తారూ, పూణే లో ఉన్న మా స్నేహితులందరినీ

పిలుస్తామూ, మాములుగా పంజాబిలందరూ తిండిపుష్టి కలవాళ్ళూ, అందువలన మీరు డిన్నర్ లో మా ప్రత్యేక వంటకాలు చేయించండీ, ఏమీ అభ్యంతరం లేదుకదా “ అన్నారు. మాకైతే ఏం చెప్పాలో తెలియలెదు. ఈ మాత్రం దానికేనా ఏమేమో ఊహించుకున్నాము. ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అన్నాము. అంటే వారన్నారూ ” బస్ ఇత్నాహీ కాఫీ. ఆప్ కీ లడ్కీ అబ్ హమారీ హోగయీ “

    మెము తిరిగి మా కజిన్ వాళ్ళింటికి వెళ్ళి ఈ సంగతి చెప్తే వాళ్ళుకూడా ఆశ్చర్యపోయారు, ఇంత మంచివాళ్ళింట్లోకి పిల్ల వెళ్తూంది, సుఖపడుతుంది,?b>అన్నారు. మీరు చాలా అదృష్టవంతులూ అని చెప్పారు.