బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం

   ఇంకా BSNL వారి దయకలగలేదు, కొత్తఫోనూ రాలేదూ, బ్రాడ్ బ్యాండూ రాలేదూ. అలాగని నా నెట్ కాలక్షేపమూ ఆగలేదూ.ఆమధ్యన ఒకసారి అనుకున్నాను, ఎలాగూ బ్రాడ్ బ్యాండుందికదా, ఆ రిలయెన్సు వాడిది ఆపేస్తే పోలే అని. ఏదో విధివశాత్తాననండి, బధ్ధకం అనండి, ఆ పనిచేయలేదు కనుక బతికిపోయాను.లేకపోతే నా తిప్పలు నాకుండేవి. అందుకే అంటారు ఏది జరిగినా మనమంచికే అని. ఊరికే పోతాయా ఆ సామెతలూ..

   ఆ మధ్యనెప్పుడో ఒకానొక నా టపాని లింకుచేస్తూ శ్రీమతి నిడదవోలు మాలతి గారు ఓ విషయం ప్రస్తావించారు. ఆవిడన్నదేదో నాకర్ధం అవలేదూ, అది వేరే విషయమూ, అది ఆవిడ తప్పుకాదులెండి, నా మట్టి బుఱ్ఱలో ఉండే గుజ్జుందే దానిదీ ఆ తప్పు. ఒక విషయం మాత్రం అర్ధం అయింది, ఆవిడ కాపీరైట్ల విషయం వ్రాశారూ అని. ఆ సందర్భంలోనే, నిన్న పాత ఇంగ్లీషు మాగజీన్ CARAVAN అని ఒకటి చూస్తూంటే ఇదేదో దొరికింది.Copyright.దీన్నిబట్టి తెలిసిందేమిటంటే, ఏదో దొరికిందికదా అని మనం నెట్ లో దొరికినవన్నీమన టపాల్లో పెట్టకూడదనిన్నూ, ఎవడికో తిక్కరేగిందంటే మనల్ని కటకటాల వెనక్కి పంపగలరనిన్నూ. ఏమిటో గోల మనమేమైనా వ్యాపారం చేస్తున్నామా ఏమిటీ, ఏదో తెలిసినదేదో అందరితోనూ పంచుకోవాలనే ఉత్సాహం తప్ప.ఈ విషయంలో మీకెవరికైనా ఇంకా వివరాలు తెలిస్తే తెలియచేయ ప్రార్ధన.

   పాత తెలుగుపాటల సేకరణ విషయంలో చెన్నై లో ఉంటున్న శ్రీ వి.ఏ.కే. రంగారావుగారిదే పెద్దచెయ్యీ అనుకునేవాడిని ఇన్నాళ్ళూ, కానీ అదే కోవలో మన రాజమండ్రీలో కూడా ఒకానొకరున్నారని తెలిసిందిFor Song’s Sake–Rjy

    ప్రతీరోజూ తప్పకుండా తెలుగు న్యూసుపేపరు చదువుతూంటానని ఒకసారి చెప్పుకున్నానుగా, ఈవేళ “సాక్షి” అమలాపురం చదువుతూంటే, ఓ వార్త కనిపించింది.శ్రీ తోపెల్ల.ఈయనేమీ ఓ పేద్ద celebrety కాదు, అలాగని ఓ పేద్ద లీడరూ కాదు. కానీ,పూజాపునస్కారాలంటే గురి ఉన్న ప్రతీవారికీ ఓ “గురువు” లాటివారు. గొప్పగొప్పవాళ్ళెవరైనా స్వర్గస్థులైనప్పుడు, ప్రతీవాడూ ఏదో ఒకటి చెప్పేవారే. కానీ ఈ వార్తలో ప్రస్తావించిన శ్రీ తోపెల్ల వారు, మాకు ఇంటి పురోహితులు. ఏ పండగైనా, పబ్బమైనా, లేదా ఇంకోటేదైనా సరే ఆయన లేకుండా జరిగేది కాదు. ఓ పెళ్ళికీ, ఒడుక్కీ ముహూర్తాలు పెట్టాలంటే ఆయనే. సుబ్బారాయుడి గుడిలో ఎక్కువగా ఉంటూండేవారు. ఎప్పుడూ చెప్పిన టైముకి మాత్రం వచ్చేవారు కాదు ! ఎన్నెన్ని ఇళ్ళల్లో చేయించాలో, అమలాపురంలో ఈయనా, శ్రీ వాడ్రేవు మహదేవుడు గారూ ఊరిని పంచేసికున్నారు ఆరోజుల్లో !!ఈవేళ ఆయన స్వర్గస్థులయ్యారన్న వార్త విని ఆ పాత జ్ఞాపకాలు వచ్చేశాయి. ఆరోజుల్లో ఓ సైకిలుమీద వచ్చేవారు, తరువాత్తరువాత ఓ moped లోకీ, ముందు ఓ గుడ్డసంచీ వేళ్ళాడతీసికుని, వచ్చీరావడంతోటే, పంజాబ్ మెయిల్ లా సంకల్పం చేయించేయడం.సుబ్బారాయుడి తీర్థానికి ఆ గుళ్ళో ఆయనేకదా ప్రధాన పూజారీ, తెల్లవారుఝామునే వెళ్ళినప్పుడు నన్ను చూసి ” ఏమోయ్ ఇంత పెందరాళే స్నానం చేసొచ్చేసేవన్నమాట..” అనే పలకరింపు ఇప్పటికీ గుర్తే !ఇంట్లో ఓ సత్యన్నారాయణ వ్రతం చేయించాలంటే, ముందుగా ఈయన dates అడగాలి…

    మన బాపూగారికీ, శ్రీమతి జానకమ్మగారికీ పద్మా అవార్డులు రావడానికి కారణభూతురాలూ అని అనుకున్నంతసేపు పట్టలేదూ, ఆ జయలలిత పాపం ఆ కమల్ హాసన్ వెనక్కాల పడిందీ? ఏదో నలుగురికీ నచ్చే సినిమాలేవో తీస్తున్నాడు కదా, వాళ్ళెవరో ఏదో అభ్యంతరం చెప్పారని, విశ్వరూపం సినిమాకి అన్ని అడ్డంకులు పెట్టాలా? మనవాళ్ళని ( ఆం.ప్ర. ప్రభుత్వం) చూడండి, ఎవడెలా మొత్తుకున్నా, ఓ కులాన్ని అగౌరవపరిచే దృశ్యాలు ఉన్నాయన్నా సరే, ఏమీ పట్టించుకోరు. అలా ఉండాలికానీ, మరీ ఇదేమిటండీ చిదంబరం ప్రధానమంత్రి అవతగ్గవాడూ అన్నందుకే, కమల్ హాసన్ మీద అంత కోపం తెచ్చేసికోవాలా? ఏమిటో వీళ్ళూ, వీళ్ళ గొడవలూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైం పాస్…

    కొత్త ఇంట్లో మెల్లిమెల్లిగా సెటిల్ అవుతున్నట్టే అనిపిస్తోంది.ఇదివరకటిదైతే ఒకటే చిన్న హాలూ, ఓ బెడ్రూమ్మూ కాబట్టి, ఉన్న మేమిద్దరమూ ఎక్కడుంటున్నామో తెలిసేది. కానీ ఇప్పుడున్నది, దానితో పోలిస్తే మరి పెద్దదే ! 2BHK పెద్దదాంట్లోకే వస్తుందిగా. ఓ ఫోను చేస్తే కొంపకి పట్టుకొచ్చేసే కిరాణా/కూరలు వాడొకడు దొరికాడు. పాలవాడు సరేసరి. ఇదివరకైతే బట్టల ఇస్త్రీకి నేనే పట్టుకెళ్ళేవాడిని, ఇప్పుడేమో కొంపకి వచ్చి తీసికెళ్ళేవాడొకడు దొరికాడు. ఎంతైనా మరి స్టేటస్ పెరిగిందికదా!!పేపరు వాడినడిగితే తెలుగుపేపరు ప్రొద్దుటే రాదన్నాడు. ఈ వంకెట్టైనా బయటకి పారిపోవచ్చు !

   ఇదివరకటిలా కాకుండా, మా అగస్థ్యా, నవ్యా వచ్చినప్పుడు మరీ ఇరుకిరుగ్గా కాకుండా, విశాలంగా ఉంది.మొన్న శనివారం వాళ్ళతోనే కాలక్షేపం.అబ్బాయీ, కోడలూ సాయంత్రందాకా ఉండి, రాత్రి భోజనం చేసి వెళ్ళారు. ఇంక అమ్మాయైతే, వారంలో రెండురోజులు తప్పకుండా వస్తూనే ఉంటుంది.ఇవ్విధంబుగా కాలక్షేపానికేమీ లోటు లేదు.ఒకటిరెండు రోజుల్లో ఆ BSNL వారి broadband కూడా వచ్చేస్తుంది. నాకైతే రిలయన్స్ నెట్ కనెక్టుంది, కానీ దానికి వైఫై లేకపోవడంతో, మా ఇంటావిడ తన సెల్లులోనూ, టాబ్ లోనూ చేసే విన్యాసాలు కుదరడంలేదు పాపం ! అందుకే ప్రతీరోజూ నన్ను అడుగుతూంటుంది వైఫై ఎప్పుడొస్తుందీ అని. నిజం చెప్పాలంటే ఆ రెండిటీ నెట్ వర్క్ తో వాటిల్లో బ్రౌజ్ చేసికోవచ్చు. కానీ ఓ gentleman’s agreement ఒకటి చేసుకున్నాముకదా, దాని ప్రకారం వైఫైలో మాత్రమే తను బ్రౌజ్ చేసికోవాలి.లేకపోతే బిల్లు తడిపిమోపెడౌతుంది.

    నేను 2011 నవంబరు లో ఒక టపా పెట్టాను. ఏం లేదూ, మా పెన్షనర్ల గోల-ఏదో పెన్షను పెరుగుతుందీ అనుకుంటే, ప్రభుత్వం వారేమో హైకోర్టుకి వెళ్ళారు. కోర్టుల్లో కేసులు మన జీవితకాలంలో సెటిలయ్యేవి కావు. ఏమొచ్చిందో ఏమో మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు అకస్మాత్తుగా నిన్నటి రోజున (28/12/2013) ఓ ఆర్డరు పాస్ చేసేశారు . ఏమైనా “పాపభీతి” లాటిది కలిగిందేమో. ఎందుకొచ్చిందీ, ఈ పెన్షనర్ల ఉసురు పోసుకోవడం ఎందుకూ అనేమో. ఆ ఆర్డరు వివరాలు ఇక్కడ ఇక్కడా చదివి మీ ఇంట్లోకూడా నాలాటి పెద్దవారెవరైనా ఉన్నారేమో, చదివి సంతోషిస్తారు.మాకెందుకండీ ఈ గొడవా అంటారా మీఇష్టం. చెప్పడంవరకూ నావంతూ.

    శ్రీ బాపూ గారు అస్వస్థతగా ఉండి బంజారా హిల్స్ లో హాస్పిటల్ లో చేరారని నిన్నటి సాక్షి లోచదివాను. ఇప్పుడు కులాసాగానే ఉండిఉంటారని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.Bapu

    జానకమ్మ గారు, పద్మభూషణ్ వద్దన్నారు, అంతవరకూ బాగానే ఉంది. కానీ తనకి “భారతరత్న” ఇవ్వాలనడం కొద్దిగా too muచ్చేమో కదూ ! ఇలాటి ప్రకటనలు ఇవ్వడంతో, వారిమీద ఇప్పటిదాకా ఉన్న గౌరవమూ, అభిమానమూ కొద్దిగా dilute అవుతాయేమో అని నా అభిప్రాయం. ప్రపంచంలో ప్రతీవారికీ ఉంటుంది తనకి ఫలానాది రావాలీ అని, కానీ ఆ ఇచ్చేవాళ్ళక్కూడా అనిపించాలికదా …

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలు ఈ విషయం ఎత్తకూడదనుకున్నాను.. కానీ..

   మన కేంద్రప్రభుత్వం వారు ప్రతీ ఏటా గణతంత్రదిన సందర్భంలో అవేవో “ఎవార్డులు” పంచుతూంటారు. పంచడం అని deliberate గానే అన్నాను.ఏదో ప్రతీ ఏడాదికీ ఓ “కోటా” పెట్టుకుంటారు.వివిధ రాష్ట్రప్రభుత్వాలూ పంపిన ఓ జాబితాలోంచి పేర్లు ఎంచుకుని వారికి ఏ పద్మశ్రీయో, భూషణో, విభూషణో ప్రదానం చేసేస్తూంటారు. భారతరత్నకి సంబంధించినంతవరకూ, ప్రతీ ఏడాదీ ఇవ్వాలనేమీ లేదు.నాకు తెలిసున్నంతవరకూ ఇదీ వాటి చరిత్ర. ఇంకా వివరాలు తెలిసికోవాలంటే ఇక్కడ చదవండి.

    ఈ ఎవార్డుల విషయంలో నాకు ఒక సంగతి అర్ధం అవదు. ఉదాహరణకి ఎవరో ఒకాయనకి ఏదో శ్రీ యో, భూషణో ఒకసారి ఇచ్చారనుకోండి, మళ్ళీ ఆ మహాశయులకి, శ్రీ ఇచ్చినవారికి భూషణమూ, భూషణం వచ్చినవాళ్ళకి విభూషణమూ, అదేదో ప్రభుత్వోద్యోగులకి ప్రమోషన్ ఇచ్చినట్టుగా లేదూ? పైగా నియమావళిలో ఖచ్చితంగా వ్రాసుంది, ఇలాటి బహుమతి వచ్చినవాళ్ళెవ్వరూ, వాళ్ళ పేర్లముందర ఈ titles పెట్టుకోకూడదనిన్నూ, అలా పెట్టుకుంటే దాన్ని వెనక్కి తీసేసికుంటారనిన్నూ. మరి మన సినిమావాళ్ళకి ఈ విషయం తెలియదా? పద్మ ఎవార్డొచ్చిన ప్రతీవాడూ పేరుకిముందర పద్మ తగిలించుకుంటారూ? పోన్లెద్దురూ ఎవరి సంతోషం వాళ్ళదీ.

   ఈ టపా అసలు ఎందుకో అర్ధం అయిఉంటుందనుకుంటాను. శ్రీ బాపూ గారికి వీళ్ళిచ్చేదేమిటండీ, అదీ పద్మ శ్రీ యా? అలా ఇవ్వడానికైనా సిగ్గుండొద్దూ? ఇన్నేళ్ళదాకా ఆయనకి ఎవార్డు ఇవ్వాలనే ఇంగితజ్ఞానం లేనందుకు ఇన్నాళ్ళూ ప్రభుత్వాన్ని తిట్టిపోశాము. చివరకి తట్టేటప్పటికి ఓ పద్మశ్రీతో సరిపెట్టేశారు.ఆ “విభూషణాల” తో పోలిస్తే అసలు ఆయన ఏ విషయంలో వారికి తక్కువా?

   ఇంకొకళ్ళైతే ఈ ఎవార్డు అసలు నాకఖ్ఖర్లేదనేవారు. కానీ మన బాపూ గారు Too simple a human being.. అలాటి లేనిపోని controversies లోకి వెళ్ళరు. అది ఆయన గొప్పతనం. అయినా అనుకుంటాము కానీ సూర్యుడికి ఎదురుగా “దీపం” ఎందుకండీ? ఆ దీపం ఏమూలకీ? పోనీ ప్రభుత్వం వారికి ఈ ఆలోచన ఓ రెండేళ్ళు ముందరైనా వచ్చుంటే, జంట లో రెండోవారైన శ్రీ వెంకటరమణ గారిక్కూడా ఇచ్చేవారుకదా? ఈవిషయం మీద క్రిందటేడాది ఓ టపా పెట్టాను.

    అందరి అభిమానపాత్రుడూ అయిన శ్రీ బాపూ గారికి ఈ ఎవార్డ్ వచ్చిందని సంతోషించాలో లేక ఇంతేనా అని సిగ్గుపడాలో తెలియడంలేదు. ఎంతచెప్పినా ఎవార్డు ఎవార్డే so సంతోషించేద్దాము.

    LONG LIVE Sri BAPU garu…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— and miles to go….

    ఆ పెద్దాయనెవరో వ్రాసినవాటిని, నెహ్రూ గారు తన రైటింగ్ పాడ్ మీద వ్రాసుకున్నారుట.అదేదో చదవడానికి బావుందని, నేనూ నా టపాకి శీర్షిగ్గా పెట్టేశాను. అక్కడికేదో మాకు ఏమీ “and miles to go.” లాటివేమీ లేవు . జీవితప్రయాణంలో చరమాంకానికి వచ్చేసినట్టే ! ఏదో భగవంతుని దయవలన ప్రస్తుతం బ్రతుకున్నది “బోనస్” లోకే వస్తుంది.ఏదో బతికున్నంతకాలమూ టపాలు వ్రాసుకుంటూ లాగించేస్తే చాలనుకునే వాడిని.

   అసలు ఈ శీర్షిక పెట్టాలని ఎందుకనిపించిందంటే ఈవేళ మా చి.అగస్థ్యకి, కావాల్సిన స్కూల్లోనే సీటొచ్చినట్టు తెలిసింది. సిటీల్లో స్కూళ్ళలో సీటు దొరకడంఅంటే, అదేదో లాటరీలో ప్రైజొచ్చేసినంత సంతోషమాయిరి.ఇదివరకటి రోజుల్లోలాగ ప్రభుత్వ పాఠశాలల్లో చదివేరోజులు కావాయె.
ఈరోజుల్లో మా అమ్మాయీ, అబ్బాయీ వాళ్ళ పిల్లల చదువులకోసం ( ఇంతా చేసి ఇంకా స్కూలే) చేసే ఖర్చు చూస్తూంటే, గుండె గుబేలెత్తిపోతోంది. దేశంలో ప్రతీవారిదీ ఇదే గొడవనుకోండి, కానీ దగ్గరనుండి చూసేటప్పటికి దాని impact ఏదో బాగాతెలుస్తోందంతే, అంతేకానీ మీకందరికీ కొత్తనికాదు నేను చెప్పేది.

    భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే ఈ రోజుల్లో, పిల్లల చదువులంటే ఎన్నెన్ని చూసుకోవాలీ, పిల్లలు ఏ మధ్యాన్నమో స్కూలునుండి బస్సులో ఇంటికొచ్చేసరికి ఇంటిదగ్గర ఎవరో ఒకరుండాలి,ఇంకో option ఏమిటంటే, చిన్నప్పటినుండీ అలవాటున్న, ఏ creche లోనో దిగే ఏర్పాటుచేసికుని, సాయంత్రాలు ఆఫీసుల్నుంచొచ్చేటప్పుడు ఆ పిల్లల్ని కొంపకు తెచ్చుకోవాలి.వీటికిసాయం, ఆ స్కూల్లోనే బ్రేక్ ఫాస్టూ,లంచ్ కూడా దొరికితే, “సోనే పే సుహాగా” యేకదా మరి, పిల్లలకి లంచ్ బాక్సులూ అవీ ఇచ్చుకోనఖ్ఖర్లేదు.

    మా పెద్దమనవరాలు తాన్యా, తన తమ్ముడు ఆదిత్య, మా చిన్న మనవరాలు నవ్య చదువుతున్న “గురుకుల్” స్కూల్లోనే, మా అగస్థ్యకీ ప్రవేశం దొరికింది. పేద్ద ఇందులోఏముందీ, డబ్బెడితే నగరాల్లో ఎక్కడైనా ప్రవేశం దొరకడం కూడా గొప్పేనా అని అనుకోకండి. ఈమధ్యన అదేదో R T E ట, మ.రా.శ్రీ. ప్రభుత్వం వారు ఓ బిల్లు పాస్ చేశారు, దాని ధర్మమా అని,
Corporate Schools లో కూడా, Low Income వారిలోకూడా ఎవరికైనా ఈ స్కూళ్ళలో చదవాలని ఉంటే, వాళ్ళకి కూడా, ప్రతీ స్కూలూ 25% సీట్లు వారికోసం ప్రత్యేకంగా కేటాయించాలిట.Ofcourse అలా వచ్చినవారి ఫీజులూ వగైరాలు, ఈ మిగిలిన 75% వారినుండీ ముక్కుపిండి వసూలు చేస్తారుట!

    అంటే ప్రభుత్వం నడుపుతున్న స్కూళ్ళలో ప్రమాణాలు, ఈ ప్రెవేటు స్కూళ్ళకంటే తక్కువని వారే ఒప్పుకుంటున్నట్టేగా. అలా కాకుండా, ప్రభుత్వ స్కూళ్ళ ప్రమాణాలు పెంచి, వాటిల్లోనే ఈ పైన చెప్పినవారికి ప్రవేశాలు కల్పిస్తే ఏం పోయిందిట? ప్రభుత్వ స్కూళ్ళ ప్రమాణాలు తగ్గిపోడానికి ముఖ్య కారణం అసలు ప్రభుత్వానిదే. ఇదివరకటి రోజుల్లో ప్రభుత్వాలు లేవా, స్కూళ్ళు లేవా, మనందరమూ అలాటి స్కూళ్ళలోనే కదా చదివిందీ? మనం ఏం తక్కువా ఈ కార్పొరేట్ స్కూళ్ళలో చదివినవారికంటె?

    వీటికి సాయం అదేదో ఫీజు రీఎంబర్సుమెంటుట వాటికయ్యే ఖర్చంతా మిగిలినవారిదగ్గరనుండి ముక్కుపిండి వసూలుచేయడం. పైగా వీటన్నిటికీ అవేవో welfare measures అని పేరోటీ !ఓట్లొచ్చేది ఆ దరిద్రులకి, దానిక్కావలిసిన డబ్బులు మాత్రం మనం ఇచ్చుకోవాలిట. అసలు విద్యని ప్రెవేటీకరించడంతోటే తగలడింది వ్యవస్థంతా, ఈ so called “విద్యా దాతలు” అసలు ఎవరుట, మన రాజకీయ దురంధరులు.ఎక్కడపడితే అక్కడ ఓ స్కూలూ, కాలేజీ తెరిచేయడం. ఆంధ్రదేశం విషయం నాకంతతెలియదు కానీ, ఇక్కడ మహారాష్ట్రాలో మాత్రం, ఈ స్కూళ్ళూ కాలేజీలూ పెట్టిన ప్రతీవాడూ ప్రభుత్వంలో ఓ మంత్రే. DYPatil, Vikhe Patil, Patangrao Kadam ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రతీ రాజకీయపార్టీలోని ముఖ్యవ్యక్తులే.

    దేశంలో డబ్బు చేసికోవాలీ అనుకుంటే ఓ స్కూలో, ఓ గుడో పెడితే చాలు, కావలిసినంత డబ్బు. ఇదివరకటిరోజుల్లోనూ ఉండేవారు విద్యాదాతలు, కానీ వారెప్పుడు స్వలాభం కోసం ప్రాకులాడలేదు. కానీ ఇప్పుడో?

    అదండీ విషయం– మొత్తానికి మా అగస్థ్య కూడా తన l…o..n..g road లో మొదటి అడుగేశాడుAgi 015.కానీ…
and miles to go. ఎక్కడికక్కడే కదా మరి. మా నవ్య మొదటిసారి “గురుకుల్” లో చేరినప్పుడు మా ఇంటావిడ ఓ టపా వ్రాసింది. మళ్ళీ ఈసారికూడా తనే ఎక్కడ వ్రాసేస్తుందో అని, తను మధ్యాన్న నిద్రలో ఉండగా ఈ టపా పెట్టాను !!

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- స్థాన చలనం… ఊళ్ళోనేలెండి…

    ఈమధ్యన కొద్దిగా స్థానచలనం కావడం మూలాన, టపాలు వ్రాయడానికి తీరికలేకపోయింది.ఏదో ఆవిడెవరో వాళ్ళ ఎపార్టుమెంటులో మాకు కావలిసినన్ని రోజులుండవచ్చూ అన్న కారణం చే హాయిగా కాలక్షేపం చేసేస్తున్నాము ఇన్నాళ్ళూ. అబ్బాయికి, అమ్మాయికి ఎప్పుడు అవసరం వస్తూన్నా వెళ్ళి వాళ్ళ పిల్లలతో కాలక్షేపం చేసేస్తున్నాము. ఏదో గుట్టుగా వెళ్ళిపోతోంది.అలాటిది పదిహేను రోజులక్రితం ఓ “బాంబు” పేలేసింది ఆవిడ, వాళ్ళ ఆడబడుచెవరో వస్తున్నారుట, ఓ రెండు మూడు నెలలలో ఖాళీ చేయాలేమో అని కొద్దిగా “ఇషారా” చేసేశారు.ఆవిడెప్పుడో చెప్పేదాకా ఊరుకోడం ఎందుకూ అనుకుని, పిల్లల చెవిలో ఓ మాటేశాము. అబ్బాయి ఇలాటి ఛాన్సుకోసమే ఎదురుచూస్తూన్నట్టు, తనూ, కోడలూ ఓ “యుగళగీతం” పాడేశారు– ” దానికేముందీ, ఇక్కడ పెట్టిన సామాన్లన్నీ అమ్మేసేయడమూ, మనింటికి వచ్చేయడమూ ..” అనేశారు. ఏదో అమ్మేయడమే అయితే, రాజమండ్రీనుంచి వచ్చే టైములోనే ఆ పని చేసేవాళ్ళం కదా, ఏదో కొత్తగా కొనుక్కున్నామూ, మా ఇంట్లో అంతకుముందునుండీ ఉన్నవన్నీ, ఎప్పుడో పదేళ్ళ క్రితం కొన్నవీ, అంచేత ఈ కొత్త వస్తువులు కొద్దికాలమైనా enjoy చేయడానికి, విడిగా ఉంటామూ అనుకున్నాము కదా, ఇలాగే కానీయ్,ఏదో కాలూ చెయ్యీ సాగుతున్నంతకాలమూ ఇలాగే వెళ్ళిపోనీయ్, అని మా స్వంత ఇంటికి వెళ్ళే కార్యక్రమం, వద్దనుకున్నాము. అబ్బాయీ, కోడలూ ఈ proposal పెట్టడమూ, మేము తరువాతెప్పుడో చూద్దాములే అని చెప్పిన అరగంటకల్లా, అమ్మాయీ, అల్లుడూ వచ్చేశారు.

    ఈమధ్యన వాళ్ళు, ఓ 4BHK లోకి మారారు. ఇదివరకటి ఇల్లేమో, అద్దెకు ఇవ్వడం ఇష్టం లేదూ, అలాగని తాళం పెట్టుంచడమూ బావుండదూ, పాడైపోతుందని.మొదటినుండీ పాపం వాళ్ళకి ఓ ఆలోచనుండేది, వాళ్ళు కొత్తింటికి మారిపోవడమూ, వాళ్ళుంటున్న ఇంట్లోకేమో మమ్మల్ని మారమనడమూ, ఈమధ్యనే ఆ ఇంటికి paints అవీ కూడా చేయించుంచారు.మమ్మల్ని disturb చేయడం ఎందుకూ అనుకుని, మాతో అనలేదు. ఇప్పుడేమో అకస్మాత్తుగా ఓ అవకాశం దొరికింది. మమ్మల్ని వచ్చి అక్కడ ఉండమని, చెప్పలేక చెప్పలేక చివరకి చెప్పేశారు.ఇంకేముందీ, మా ఇంటావిడకి “తంతే బూర్ల బుట్టలోకి” వెళ్ళినట్టయింది! రాజమండ్రీలో మూడు రూమ్ములూ, హాలూ లో ఉన్న సామానంతా, ఇక్కడ పూణె లో ఒకరూమ్మూ, హాల్లో సద్దేసింది. ఇప్పుడేమో, రెండు రూమ్ములూ హాలూనూ.

    మొత్తానికి నిన్న సాయంత్రానికి సామానంతా మార్చేసి, కొత్తింటికి వచ్చేశాము.ఇల్లు మారడం అంటే మాటలా? ఇదివరకు రాజమండ్రీనుంచి వచ్చేటప్పుడైతే తను, ఓ నెల ముందరే రావడంతో, నా దారిన నేను ప్యాకింగూ అవీ, ఏ గొడవా లేకుండా చేయించేశాను. ఇప్పుడలా ఎలా కుదురుతుందీ?అసలే మా ఇంటావిడ ఓ cleanliness freaక్కాయే వెళ్ళేదేమో అమ్మాయింటికాయె, తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి, మాటరాకూడదు.ఇల్లేమో చకా చెక్ లా ఉండాలి. ఇవన్నీ నా ప్రాణం మీదకొచ్చాయి.ఓ మేక్కొట్టకూడదంటుంది, tiles మాయకూడదంటుంది,రెండు బెడ్రూమ్ములోనూ AC లు, ఇంక ఇదివరకే మేము కొన్న AC ఎక్కడ పెట్టుకోనూ, నెత్తిమీద పెట్టుకోమంది. అలాగే, మరీ నా నెత్తి కాకుండా, cupboard మీద పెట్టేశాము!మొదటిరోజు నెట్ లేదూ, టీవీ లేదూ. మొత్తానికి ఈవేళ్టికి రెండూ వచ్చేశాయి, మీముందర హాజరీ వేయించేసికున్నానోఛ్ !

    ఈ స్థానచలనం ముఖ్యమైన మార్పేమిటంటే, ఈ నలభై ఏళ్ళ కాపరంలోనూ, బీరువాలో నాకంటూ ఒక ” అర” మాత్రమే ఉన్నదల్లా, ఈ ఇంటికి వచ్చేసరికి, ఓ separate wardrobe వచ్చేసింది! ఈ ముచ్చటెన్నాళ్ళో చూడాలి, ఎప్పుడో encroach చేసేస్తుందిలెండి మ ఇంటావిడ. ఇన్నాళ్ళూ, తలుపు వెనక్కాల కొక్కేనికి వేల్లాడతీసికునే నా బట్టలకి ఇన్నేళ్ళకి ఓ “ఉన్నత స్థానం” ఏర్పడింది! ” ఆకాశమంతా” సినిమాలో, ఆ రవి అంటాడు గుర్తుందా, ఇన్నాళ్ళూ హోటల్ బయటే ఉండేవాడినీ, ఇన్నాళ్ళకి “అమ్మ” దయవలన హొటల్ లోపలికి మొదటిసారిగా రాగలిగానూ, అలాగన్నమాట !

    ఇన్నాళ్ళూ మేముండే ఏరియా, ఏదో సంసారపక్షంగా ఉండే మాలాటివాళ్ళు. ఇప్పుడేమో అంతా posh. ఎక్కడ చూసినా ఎపార్టుమెంట్లూ అవీనూ, అంతా ఐటీ మయం. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోడమే ” పాపం” అనుకుంటారు. పక్కవాడెవడో తెలియదు, పోనిద్దురూ వాళ్ళింట్లోవాళ్ళైనా తెలుసు.కొంతవరకూ నయమే ! అక్కడ పదిరూపాయలుండే వస్తువు ముఫ్ఫై రూపాయలు. పని మనుష్యులు వాళ్ళని అదేదో maids అనాలిట, వాళ్ళకి వేలల్లో జీతాలూ, వాటికి సాయం weekly off లోటీ ! ఆడాళ్ళూ, మగాళ్ళూ తెల్లారేటప్పటికి ఓ కుక్కేసికుని వాకింగూ, ఏమిటో అంతా హడావిడి జీవితాలూ, మొత్తం సొసైటీకి, నేనూ, మా ఇంటావిడే ఏ పనీ లేకుండా ఉండేవాళ్ళము.

   ఈవేళ ఓ మిత్రులు ఈ క్రింది కార్టూన్ పంపారు. మీరూ ఆబొమ్మ మీద double click చేసి ఓ సారి ఆనందించండి.

Height of Technology

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    మొన్నెప్పుడో మా మిత్రులొకరు ఈ క్రింది మెసేజ్ పంపారు. అవడం పూర్తి అంగ్లంలోనే అయినా, అందరితోనూ పంచుకోవాలనిపించింది.

   ANSWERING MACHINE

   Here is an interesting anecdote published in “The Speaking Tree” Sunday Jan 6,2013 Pune edition.

   A message heard on an answering Machine.

   Good Morning we are not home at the moment,but please
leave your message after hear the beep.

   If you are one of our children,dial 1 and then select from
option 1 to 5 in order of your birth so that we know who it is.

   If you need us to stay with grandchildren ,press 2

   If you want to borrow the car ,press 3

   If you want us to wash your clothes and do ironing ,press 4

   If you want the grandchildren to sleep here tonight press 5

   If you want us to pickup the kids from school,press 6

   If you want us to prepare a meal for Sunday or to have it
delivered to your home ,press 7

   If you want to come to eat here,press 8

   If you need money ,press 9

   If you are going to invite us to dinner,or take us to the
theatre,start talking….we are listening.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సీతమ్మ వాకిట్లో… etc..etc…

    ఆంధ్రదేశంలోనే దిక్కు లేదు “మిథునం” సినిమా చూడ్డానికి. బయటి దేశాల్లో ఏమైనా డబ్బులొస్తాయని అక్కడకి కూడా పంపించారట. అంతేకానీ, మన దేశంలోనే పరాయి రాష్ట్రాల్లో కూడా, ఓ మంచి తెలుగు సినిమా చూస్తారేమో పోనీలే అని మాత్రం అనుకోలేదు. అవునులెండి ఎవరి commercial interests వారివీ.ఆ కారణాలవల్ల మాకు పూణే లో ఏదైనా “మంచి” సినిమా చూడడానికి నోచుకోలేదు. దానితో ఇంక next best option కి సెటిలయిపోతూంటాము. సినిమా పేరేదో చాలాకాలం తరువాత శుభ్రంగా ఉందీ అనుకుని ఈవేళ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సిణేమాకి వెళ్ళాము. మరీ మనరాష్ట్రంలోలా కాకుండా, మొదటి రోజు మొదటాటాకి టిక్కెట్లు దొరుకుతాయిలెండి,పైగా వర్కింగు డే ఒకటీ.కానీ ఈసారి చూసిందేమిటంటే, ఇదివరకటిలా కాకుండా, హాల్ నిండింది పన్నెండు గంటలాటక్కూడా ! పేద్ద కారణాలు లేవు, మహేష్ బాబున్నాడు కాబట్టి,టినేజర్స్ కూడా కనిపించారు.కానీ పాపం వాళ్ళు disappoint అయుంటారు. ఎందుకంటే అతని చేత ఒక్కసారీ చెయ్యెత్తించలేదు ! పైగా టైటిల్స్ లో “ఫైట్స్” ఫలానా అని కూడా వ్రాశారు. పాపం అవన్నీ ఏమైపోయాయో? చాలాకాలం తరువాత పెద్దపెద్ద స్టార్ల సినిమాలో “బ్రహ్మానందం” లేకపోవడం. That was the biggest surprise ! అతనుకూడా ఆ సినిమాలో ఉన్నాడని చదివినట్టు జ్ఞాపకం.ఇక్కడ చదివితే మీకే తెలుస్తుంది.

    ఇంక మిగిలినా విషయాలంటారా, అస్సలు ఆ సినిమా టైటిల్ అలా ఎందుకుపెట్టారో అర్ధం అవలేదు.కానీ చాలాకాలం తరువాత అచ్చతెలుగు పేరు మాత్రం చాలా బావుంది. దిక్కుమాలిన పేర్లతో విసిగెత్తిపోయాము.సినిమా మొత్తానికి సిరిమల్లె చెట్టు ఓ రెండు క్షణాలు చూపించారు. ఇంక “వాకిటి” అంటారా ఏదో ప్రకాష్ రాజ్ బయటనుండి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చే సందర్భంలో ఓసారి !

    సినిమా అంతా చూసేటప్పటికి తేలిందేమిటంటే, ఏ ఏ సీన్లుంచాలో, ఏవేవి తీసేయాలో తెలియక confusion లో అంట కత్తెర చేసేశారు. Highly amateurish job ! ఓ సీన్ కీ, ఇంకో సీన్ కీ సంబంధమే లేదు. ద్వారకా తిరుమలలో చూపిస్తూంటారు, సడెన్ గా రెండో సీన్ వీళ్ళింట్లో.ఓ అర్ధం పర్ధమూ లేకుండా. మీడియాలో వచ్చిన “వార్త” ల ప్రకారం ఆ సినిమా కథ ఇది ట. అవన్నీ ఎక్కడకు పోయాయో ఆ పరమాత్ముడికే ఎరుక !

    చెప్పానుగా ఏం చేయాలో తెలియక ఓ “అతుకుల బొంత” లా తయారుచేసి జనం మీదకి వదిలారు. వెంకటేష్, మహేష్ లు ఉన్నారుకదా, వాళ్ళ ఫ్యాన్లు చూడకేం చేస్తారూ, మన డబ్బులు వసూలైపోతాయీ అనే కానీ, ఏదో సినిమాకి ఓ మంచి టైటిలు పెట్టామూ, ఆ టైటిలుకైనా న్యాయం చేస్తే బావుంటుందేమో అనే ఆలోచనమాత్రం లేదు. మరి ఆ సినిమా నిర్మాతలమీద ఐటి దాడులు జరిగాయంటే జరగవూ మరీ? ఏ బ్రహ్మానందమో పంపించుంటాడు.

    ఇంక నటన అంటారా, ప్రకాష్ రాజ్, జయసుధ ” కొత్త బంగారు లోకం” లో నటనకి photocopy. రోహిణీ హత్తంగడీ, ఏదో
“సీతారామయ్యగారి మనవరాలు” టైపులో ఉంటుందేమో అనే అపోహతో ఒప్పుకున్నట్టుంది.మిగిలినవారిలో ఆ రావుగోపాలరావు గారి కొడుకు రోల్ బాగానే చేశాడు. కానీ వాళ్ళ నాన్నగారిలా చేయాలనుకోడం కొద్దిగా అత్యోత్సాహమే. కోట శ్రీనివాసరావుకి ముచ్చటగా మూడంటే మూడు సీన్లు. కొత్త హీరోయిన్ అంజలిట ( సీత పాత్రలో), ఆ అమ్మాయిది రాజోలు( కోనసీమ) అన్నారు, కానీ ఉచ్చారణలో ఎక్కడా గోదావరి టచ్ లేదు.ఇంక ఫొటోగ్రఫీ అంటారా, గోదావరీపరివాహక ప్రదేశాల్లో, ఓ కెమేరా పట్టుకుని, వెళ్తే ఎక్కడ చూసినా అందమైన దృశ్యాలే,ఇంతకంటే మంచిమంచి దృశ్యాలు ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తాయి.

    మహేష్ బాబుకి ఓ పదిమందిని చితక్కోడితేకానీ, చెయ్యూరుకోదు అలాటివాడి చేతులు కట్టేసి కూర్చోమంటే ఎలా కుదురుతుందీ? అప్పటికీ ప్రయత్నించాడు, అందుకే కాబోలు టైటిల్స్ లో “ఫైట్స్” అని పెట్టుంటారు. వెంకటేష్ పెద్దాడిగా ఏదో ఫరవాలేదు!

    రెండో హీరోయిన్- ఏదో రెండో హీరోకి ఎవరో ఒకరుండాలని పెట్టారు కానీ, ఉపయోగం తెలియలేదు. అలాగే పెద్దాడి పెళ్ళి చూడకలిగాము కానీ, రెండో వాడిదయ్యిందో లేదో పాపం ! ఇంక సంగీతం- ఈమధ్యన వస్తూన్న సినిమాల పాటల “మూస” లోనే ఉన్నాయి. పెద్దగా చెప్పుకోవలిసినంత గొప్పగా లేవు. కానీ for a change పాటలలోని సాహిత్యం మాత్రం అర్ధం అయింది.మరీ అరుపులూ, కేకలూ కాకుండా.

    ఆంధ్రదేశ వాతావరణం మాత్రం సంపూర్ణంగా ఆస్వాదించాము, audience ధర్మమా అని, మహేష్, వెంకటేష్ ల entry అవగానే వీళ్ళు వేసే ఈలలూ, అరుపులూ ధర్మమా అని !
అదండీ విషయం.