బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Phasing out………

   ఒకానొకప్పుడు ఒంటెద్దు బళ్ళుండేవి, వాటిని గుర్రబ్బళ్ళు వచ్చిన తరువాత మర్చిపోయారు. అలాగే మొదట్లో లాగుడు రిక్షాలూ, తరువాత సైకిలు రిక్షాలూ, క్రమక్రమంగా అవీ పోయి, ఆటోరిక్షాలూ,టాక్సీలూ, అవేవో సిక్స్ సీటర్లూ. ఒకానొకప్పుడు పెద్ద నగరాల్లో ట్రాములనేవి ఉండేవి. ప్రస్తుత స్పీడ్ తో పోలిస్తే, పాపం అవి నత్తనడకలాగే ఉంటుందనుకోండి. సిటీ బస్సులూ అవీ వచ్చేసి, ఆ ట్రాములని పక్కకి తోసేశాయి. ఇంకా కొల్కత్తాలో అనుకుంటా, ఇంకా అవి ఉన్నాయి.అలాగే ఇప్పుడంతా మెట్రో హవా. రైళ్ళే చూడండి, మొదట్లో ఛుక్ ఛుక్ మంటూ బొగ్గింజన్లూ, తరువాత డీసెలింజన్లూ, ఇప్పుడు ఏకంగా ఎలెట్రీ ఇంజన్లే. ఎప్పుడో బుల్లెట్ ట్రైన్లుకూడా వచ్చేస్తాయి.అలాగే బస్సులూనూ, మొదట్లో అవేవో బొగ్గుబస్సులుండేవిట, ఇప్పుడు ఎక్కడ చూసినా వోల్వోలూ, మెర్సిడీజ్ స్లీపర్లూ, సెమీస్లీపర్లూనూ…

   కొత్తవి రాగానే, పాతవాటిని Phase out……… చేసేస్తారు. కరెక్టే చేయాల్సిందే. ఎప్పుడు చూసినా పాతవాటినే వేళ్ళాడుతూ ఉంటామంటే, దేశం “ముందుకు” పోయేదెలా? అలాగే మొదట్లో మనకి నీళ్ళిచ్చే పెరట్లో నూతులు, “రక్షిత మంచినీళ్ళ” పథకాలకి చోటిచ్చేశాయి. కానీ, పాతవన్నీ మంచివి కావూ అనలేము కదా. కొత్తవి రానప్పుడు, ఆ పాతవాటివల్లే మన రోజులు వెళ్ళేవి. ఇప్పుడంటే ప్రయాణాల్లో ఏరేటెడ్, మినరల్ వాటర్ బాటిళ్ళూనూ, ఇదివరకో మరచెంబే గతి. అలాగే గుర్తుండేఉంటుంది, అదేదో కాన్వాస్ బాగ్ లో నీళ్ళు పట్టేసి, దాన్ని కిటికీకి బయట పెట్టేవారు రైళ్ళలోనూ, బస్సుల్లోనూ, ఆ మంచినీళ్ళ ” చల్లదనానికి”, ఏ ఫ్రిజ్ వాటరూ సరిపోదు.

   ఏమిటీ సడెన్ గా ఫిలాసఫీలోకి వెళ్ళిపోయారేమిటీ అనుకుంటున్నారా, ఏం లేదూ, ఈవేళ మా స్నేహితుడిని కలిశాను. చాలా కాలం తరువాత కలిశామేమో, ఇన్నేళ్ళూ, జరిగిన పరిణామాలూ వగైరాల గురించి కబుర్లు మొదలెట్టాము. ఏదో పని మీద వచ్చాడులెండి ఇక్కడకి. తనుండే ఊళ్ళో తనూ, భార్యా ఒక ఇంట్లోనూ, కొడుకూ కోడలూ పిల్లలూ ఇంకో చోటా ఉంటున్నారుట.మొదటినుండీ, మా స్నేహితుడిదీ, మాదీ అభిప్రాయాలు ఒక్కలాగానే ఉండేవి. బహుశా అదే కారణం కూడా అవొచ్చు, ఇన్నాళ్ళైనా మా స్నేహం ఇంకా నిలబడ్డానికి.అదేదో same wavelengతో ఏదో అంటారనుకుంటా. ఎవరి స్పేస్ వాళ్ళకి ఉండాలనే నా అభిప్రాయంతో తనూ నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తాడు.తన అవసరం ఉన్నంత కాలమూ, తనూ భార్యా వెళ్ళి పిల్లలతో గడిపేవారు, ఏదో వాళ్ళకీ సహాయంగా ఉండొచ్చు కదా అని.రిటైరయ్యాడు కదా అని హాయిగా కొంపలో కూర్చోకుండా తనూ, వంట్లో ఓపికున్నా లేకపోయినా పిల్లలు చిన్నవాళ్ళూ అని భార్యా, వళ్ళొంచుకోకుండా చూసేవారు. అలాగని తను ఏదో పేద్ద “త్యాగం” చేసేడని ఎప్పుడూ అనుకోనూ లేదూ, ఎవరితోనూ అనా లేదూ. కొడుకూ కోడలూ ఆఫీసులకెళ్ళిపోయినా, మనవరాలిని స్కూలు బస్సెక్కించేందుకూ, మనవణ్ణి ఎప్పుడైనా డే కేర్ సెంటర్ నుండి తెచ్చేందుకూ వెళ్ళడం ఇలాటివి చేయడంలో ఓ ఆనందం పొందేవారు. బయటివాళ్ళనుకోవచ్చు, ఇదీ పేద్ద పనేనా ఏమిటీ అని. ఓ వయస్సొచ్చిన తరువాత, ఒంట్లో ఓపిక లేనప్పుడు ఇవికూడా పేద్ద పనులే అవుతాయి. ప్రతీవారికీ వయస్సొచ్చిన తరువాత తెలుస్తాయి వీటిలో ఉండే తిప్పలేమిటో..

   ముందొచ్చిన చెవులకంటే, వెనకొచ్చిన కొమ్ములే ఎక్కువా అన్నట్టు, కొడుకులూ, కూతుర్ల కంటే, మనవలూ మనవరాళ్ళే ఎక్కువవుతారు ఈ తాతలకీ, అమ్మమ్మలకీ, నానమ్మలకీనూ. ఎక్కువ రోజులు వాళ్ళతో గడిపేటప్పటికి వాళ్ళతో ఓ bonding ఏర్పడిపోతుంది. వాళ్ళని చూడకుండా ఉండలేకపోతారు. ఇంక పిల్లలకీ చిత్రవిచిత్ర ఆలోచనలు రావడం మొదలెడతాయి. మన పిల్లలు, మన మాటకంటే, తాతా, నానమ్మా లకే చేరువైపోతున్నారేమో అనే ఓ feeling of insecurity… germinate అవడం ప్రారంభం అవుతుంది. ఇన్నాళ్ళూ అవసరం వచ్చినప్పుడల్లా వీళ్ళ rescue కి వచ్చిన ఆ గ్రాండ్ పేరెంట్స్, ఓ లయబిలిటీ గా కనిపిస్తారు.అలాగని మొహమ్మీదే చెప్పలేరుగా, ఏదో subtle గా మొదలవుతాయి సన్నాయి నొక్కులు. అమ్మకి మరీ “శ్రమైపోతోందేమో” తో మొదలూ. ఇన్నాళ్ళూ గుర్తురాలేదా మరి? అవసరం వాళ్ళదిగా, అలాటప్పుడు ఇలాటి చిన్న చిన్న విషయాలు ఎక్కడ గుర్తొస్తాయి? నాన్నగారూ, ఊరికే ఎండలో తిరక్కండి, రెస్ట్ తీసికోండి, అవసరం ఉన్నప్పుడు నేను ఫోను చేస్తానుగా, అప్పుడు వద్దురుగాని.అంటే indirect గా చెప్పడం ఇంక మీఅవసరం మాకంతలేదూ అని…నువ్వే మరీ ఎక్కువగా react అయ్యావేమోనయ్యా, మరీ మీ అబ్బాయి ఉద్దేశ్యం అలా కాకపోవచ్చు, నిజంగా మీకు రెస్ట్ ఇవ్వాలనే అలా అన్నాడేమో అని చెప్పాను. లేదయ్యా నువ్వెప్పుడూ ప్రతీదాంట్లోనూ పాజిటివ్వే చూడాలంటావు, కానీ ఇక్కడ మాత్రం జీర్ణం చేసికలేక ఇదిగో ఇలా పాత స్నేహితుల్ని ఓసారి కలిస్తేనేనా మనశ్శాంతిగా ఉంటుందేమో అని ఊళ్ళమీద పడ్డామూ…అన్నాడు..

    ఇదిగో దీన్నే మొదటి రెండు పేరాల్లోనూ వ్రాశానే అలాగ Phase out…. చేసేయడం అన్న మాట…వచ్చిన గొడవల్లా ఎక్కడా అంటే, పైన చెప్పినవన్నీ యంత్రాలు వాటికి ఓ ఫీలింగూ అవీ ఉండవు. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటంటే మానవ సంబంధాలు. మరీ మా స్నేహితుడూ, తన భార్యా జడపదార్ధాలు కాదుకదా, వాళ్ళకీ పిల్లల్ని చూడాలనే ఉంటుంది, కానీ కొడుకూ కోడలూ, ఫరవాలేదూ మేమే చూసుకుంటామూ అనేటప్పటికి వీళ్ళు మాత్రం ఏం చేస్తారూ? ఆ కొడుకు దగ్గరనుంచో, కోడలు దగ్గరనుంచో ఫోనెప్పుడొస్తుందా అని ఎదురుచూడ్డం తప్ప...

    మరి ఇప్పుడు మీరు చెప్పండి, యంత్రాలూ, ప్రయాణ సాధనాలూ Phase out చేసినట్టు, తాతల్నీ, అమ్మమ్మల్నీ,నానమ్మల్నీ కూడా చేసేయాలంటారా, మా ఫ్రెండు కి తొందరలో చెప్పాలి..….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్….

   ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలకి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. నిజం చెప్పాలంటే భారతీయులుగా మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. మన పదాదిదళాధికారి జనరల్ సింగ్ గారు, మొదట్లో ఆయన జన్మదినం గురించి గొడవ పడి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి, వెనక్కి తగ్గారు. ఈ లోపులో మన ప్రభుత్వం కొత్త జనరల్ ని నియమించేసింది. ఇంక ఎలాగూ వెళ్ళాల్సిందే అనుకున్నారో ఏమో, రోజుకో స్కాం బయటపెట్టడం మొదలెట్టారు. చివరకి జరుగుతున్నదేమిటీ అంటే,ఒకళ్ళమీదొకళ్ళ నేరారోపణలు మాత్రమే. రాజకీయ నాయకులకైతే సిగ్గూ, ఎగ్గూ లేదనుకోవచ్చు, కానీ డిసిప్లీన్ కి మారుపేరైన ఆర్మీలో ఉంటూకూడా, సింగుగారి ప్రవర్తన వెనుక అసలు విషయమేమిటో మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. రిటైరయిన తరువాత పోనీ ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారేమో అని, లాలూ అన్నదాన్ని కొట్టిపారేయలేము. పోనీ చేద్దామనే అనుకున్నారనుకుందాము, కానీ దానికీ ఓ వరసా వావీ ఉండాలిగా.

   గత వారం రోజుల్లోనూ, వాళ్ళెవరో తనకి 14 కోట్లు ఇవ్వచూపారూ అని ఒకటీ, ఇంకోసారి ప్రస్తుతం ఇంకా సర్వీసులో ఉన్న జనరల్ దల్బీర్ సింగ్ గురించి, ఆయనెవడో త్రునమూల్ కాంగ్రెస్ ఎం.పి. ఏదో పితూరీ చెప్పాడనీ,ఇవన్నీ కాకుండా, మన దేశరక్షణ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ప్రదానమంత్రికి ఈయన ఓ లేఖ వ్రాశారనీ, ఆ లేఖేదో లీకయింది. ఇదిలా ఉండగా, “సందట్లో సడేమియా” అన్నట్టు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, వాళ్ళ నాన్న ( దేవె గౌడ) ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయనకీ లంచం ఇవ్వబోయారనీ, ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు పిచ్చికుక్క కరిచినవాళ్ళలా నోటికొచ్చింది వాగేస్తున్నారు. మన రాజకీయనాయకులకి కావలిసినంత మసాళా దొరికేసింది. అక్కడికేదో, తామే సత్యహరిశ్చంద్రులన్నట్టు, లాలూ దగ్గరనుండి, మెడమీద తలకాయున్న ప్రతీవాడూ మాట్లాడేస్తున్నాడు.

   మేము ఉద్యోగంలో చేరిన కొత్తలో, ప్రతీ ఏడాదీ మా అందరిచేతా, ఓ Oath of secrecy తీయించేవారు.కాలక్రమేణా ఆపేశారు. మా Ordnance Factories లలో, ఎక్కడ ఏమేమి తయారుచేసేవారో దాంట్లో పనిచేసేవారికి తప్ప ఇంకోరికి తెలిసేది కాదు. దేశరక్షణ దృష్ట్యా అలాటివి అవసరమే కదా. అలాగని, వాటిల్లో ఏదో అంతా Rosy గా ఉండేదీ అని కాదు. ప్రతీ వ్యవస్థలోనూ లోపాలనేవి ఉంటూనే ఉంటాయి. కానీ inspite of all that, 1962 తరువాత మన రక్షణదళాలు బయటి దేశాలతో జరిపిన మూడు యుధ్ధాల్లోనూ, మరీ పూర్తిగా కాకపోయినా, నూటికి అరవైపాళ్ళైనా, మా Ordnance Factories వారి ఘనతే కదా.

    ఈవేళ్టి press conference లో రక్షా మంత్రి శ్రీ ఆంటొనీ చెప్పినట్టు, మన సరిహద్దుల్లో రాత్రనక పగలనక మనల్ని, రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోనిస్తున్న మన జవాన్లని దృష్టిలో పెట్టుకునైనా మన రక్షణ బలాల్ని గురించి, మరీ పబ్లిక్కుగా మాట్టాడొద్దు. అక్కడికేదో మన అధికారులందరూ సత్యహరిశ్చంద్రులనడం లేదు. మా DGOF/Chairman Ordnance Factories, దోచుకున్నంత దోచుకుని, పట్టుకునేసరికి, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.అదే పొజిషన్ కి వెళ్ళిన ఇంకా చాలామంది తిన్నా పట్టుబడలేదు కాబట్టి, పెద్దమనుషుల్లా చెలామణి అయి, హాయిగా రిటైరయ్యారు. అలాగే ప్రభుత్వ విభాగాల్లో అత్యున్నత స్థానాలకి వెళ్ళిన చాలామంది “జాతకాలు” నెట్ లో వెదికితే కావలిసినన్ని దొరుకుతాయి. పట్టుకోనంతసేపే దొర, పట్టుకుంటే దొంగ.

   అంతదాకా ఎందుకూ, కొంతకాలం క్రితం వరకూ, మా Ordnance Factories లో Production Target జనవరి ఒకటో తారీకుదాకా ఎవరికీ తెలిసేది కాదు, కానీ ఇప్పుడు ప్రతీదీoutsource చేయడం, ఆ figures అన్నీ నెట్ లో పెట్టడంతో, ఆర్నెల్లు ముందరగానే, వెండర్లకి తెలుస్తోంది. ఇంక సీక్రెసీ ఉండమంటే, ఎక్కడ ఉండి ఛస్తుందీ? One has to pay the price for all these things. ఇదివరకటి రోజుల్లో ఎవరైనా sensitive positions లో పనిచేసి రిటైరయిన తరువాత, కొంతకాలం దాకా conflict of interest వచ్చేచోట పని చేయకూడదనేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటీ, ఆ పెద్ద పొజిషన్ లో ఉన్నవాడు, సర్వీసులో ఉండగానే, VRS తీసికుని మరీ, Advisor/Consultant గా చేరిపోతున్నాడు.<b.To hell with conflict of interest... వీటన్నిటికీ మూలకారణం lack of discipline. జన్మతాహా క్రమశిక్షణ లేనివాడు, దేశాన్నేమిటీ, తల్లిని కూడా అమ్మేయడానికి వెనుకాడడు.

   ప్రస్తుతం మన జనరల్ సింగ్ గారు ప్రధాన మంత్రికి వ్రాసిన విషయాలేవీ కొత్తవి కావు. వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, పబ్లిక్ డొమైన్ లోకి రావడం కొత్త.ఆయనెవడో, ఈయనకి 14 కోట్లు ఇవ్వ చూపాడూ అన్నది జరిగి రెండేళ్ళ క్రితం అయితే, మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారుట? గోళ్ళు గిల్లుకుంటున్నారా? అలాగే జనరల్ దల్బీర్ సింగు గారి విషయం కూడా, ఇప్పుడే బయటపెట్టాల్సిన విషయం కూడా debatable. ఎలాగూ ఇంకో రెండు నెలల్లో రిటైరయిపోతాడు కదా, ఆ తరువాత ప్రతీవాడూ రాసినట్టుగా memoirs రాసుకోవచ్చుగా. ఆ పుస్తకం ఎవడూ కొనడేమో అని భయమా? There was no need to to make them public at this juncture.There definetely is an ulterior motive.

   ఇంక మన మాజీ ప్రధానమంత్రి గారు ఇప్పుడే ” నిద్ర” లోంచి లేచారా? లేక ఈమధ్యన ఎవడూ తనని పట్టించుకోడంలేదని ఆడే డ్రామాయా ఇది. దేశ ప్రధాన మంత్రి అనండి, లేక ఆర్మీ ఛీఫ్ అనండి, వారి దరిదాపుల్లోకెళ్ళి, వాళ్ళకి “ఎర” చూపించే ధైర్యం ఉంటుందంటే నమ్మే విషయమేనా? అంత చీప్పా వాళ్ళూ?పోనీ అలా జరిగిందనే నమ్ముదాము,అంటే వారి ప్రవర్తన అలాగే ఉందనుకోవాలా? If somebody could offer a bribe to people, holding such high position, God only can save this Country.

   ఈ గొడవ చాలదన్నట్టు, వాడెవడో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రిని చంపినందుకు, ఉరితీయాలిట, ఠాఠ్ కూడదూ అన్నారుట, మన కేంద్ర గృహశాఖ వారు, ఆ “ఉరిశిక్ష” stay చేసేశారుట. మరి సుప్రీం కోర్టులూ అవీ ఉన్నదెందుకుట? ఇదంతా ఓ డ్రామా అని సుప్రీం కోర్టు వారు చెప్పనే చెప్పారు. అయినా వాళ్ళని పట్టించుకునే వాళ్ళెవడులెండి?

    చివరికి జరిగిందేమిటయ్యా అంటే, దేశాన్ని అమ్మకానికి పెట్టేశారు.

   మేరా భారత్ మహాన్.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– నాతో పెట్టుకుంటాడా…

   ఎప్పుడో అకస్మాత్తుగా మన ప్రభుత్వం వారికి, ఏదో ఆలోచనొచ్చేస్తూంటుంది. ప్రభుత్వం అంటే, అందులో పనిచేసే అధికారికన్నమాట. అప్పుడప్పుడు అనుకుంటూంటారనుకుంటాను, ఇలా చేస్తే బావుంటుందేమో, అలా చెస్తే బావుంటుందేమో, వగైరా వగైరా… లేడికి లేచిందే పరుగు కదా, ఓ సర్క్యులర్ మీద సంతకం పెట్టేసి జనం మీదకి వదులుతారు. అదృష్టం బాగుంటే అందరికీ తెలుస్తుంది, లేకపోతే ఓ దండం పెట్టడం. అలా వచ్చిందే “ఆధార్” కార్డు. ఓపికున్నవాళ్ళు వెళ్ళి క్యూల్లో నిలబడి, ఫుటోలూ అవీ తీయించుకున్నారు. మా ఇంట్లో నాదీ,అబ్బాయిదీ, మనవరాలిదీ, మనవడిదీ మొత్తానికి వచ్చేశాయి, ఇంటావిడదీ, కోడలుదీ రావాలి. అమ్మాయికీ, అల్లుడికీ ఫారాలిచ్చాను, వాళ్ళకి తీరికెప్పుడైతే అప్పుడు చేయించుకుంటారు. టైముండడం లేదు డాడీ అంటారు. కాని ఎప్పుడో ఓ రోజున ప్రభుత్వం వాళ్ళు, ఈ ఆధార్కార్డు లేకపోతే, గ్యాస్ సిలిండరు ఇవ్వమూ అనాలి, అప్పుడు మొదలవుతాయి ఉరకలూ, పరుగులూ. ఆ మధ్యన తణుకెళ్ళినప్పుడు, మా అత్తగారినడిగాను, ఆధార్ తీసికున్నారా అని. ఆవిడ తిప్పలావిడవీ, ఎవరో చెప్పారని, రిక్షాకట్టించుకుని ఎండలో వెళ్తే, రోజుకీ యాభయ్యే అని, పంపేశారుట. మరీ బ్రహ్మముహూర్తం లోనే లేచి, వెళ్ళలేరుగా పాపం,దాంతో ఆధార్ కార్డు కార్యక్రమం వెనకబడిపోయింది.ఎప్పుడో వాళ్ళుండే టీచర్స్ కాలనీకి వస్తే, ఎవరైనా దయతలచి చెప్తే, ఆవిడ ఓపిక చేసికుని వెళ్తే, ఆ “కార్యక్రమం” పూర్తవుతుంది.

   ఈ మధ్యలో గ్యాస్ కంపెనీ వాళ్ళకో ఆలోచనొచ్చింది. అదేదో SMS ద్వారా బుక్ చేసికోవాలిట. ముందుగా మన సెల్ ఫోను రిజిస్టర్ చేసికుని, దానితో పాటు,Consumer Number రిజిస్టర్ చేసేసికుంటే, మనకి గ్యాస్సయిపోయినప్పుడు ఓ మెసేజ్ పంపితే చాలుట. ఇదంతా Indane వారిది. అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న అని,Bharat Gas వాడు, అదేదో smart card తయారుచేశాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ smart carడులే కదా.

   ఈ సందర్భం లోనే మా CGHS వాళ్ళకీ ఓ “మంచి ఆలోచన” వచ్చేసింది. మన “జనా” లందరికీ కూడా ఓ smart card ఇచ్చేస్తే పోలే అని. ఆ సందర్భం లోనే ఆమధ్య ఓ టపా కూడా వ్రాశాను.దానంతేదో కొత్త సంవత్సరం లో తేల్చేసికోవాలని,వాళ్ళనీ, వీళ్ళనీ అడిగితే, తలోరూ తలో మాటా చెప్పారు. ఇంకా ఎప్లికేషన్లే ఇవ్వడం లేదూ దగ్గరనుండి, పాతదానితో పనైపోతుందీ దాకా, అయినా మనం అనుకుంటే పనైపోతుందా ఏమిటీ, ఎప్పుడో పాతకార్డు పనికిరాదూ, ప్లాస్టిక్కుదే ఉండాలీ అంటే, ఎక్కడ పరిగెత్తుతామూ. ఏదో ఓపికుందికాబట్టీ, మన ప్రభుత్వం వారి “వెర్రి మొర్రి” రూల్స్ తో పరిచయం ఇంకా ఉంది కాబట్టీ, ఏదో మనం బావున్నప్పుడే ఇలాటివేవో పూర్తి చేసేస్తే, తరువాత మన్నెవళ్ళూ తిట్టుకోరు. ఏదో ఈ కార్డోటుంటే, ఓ యాంబులెన్సు పిలవమని, ఎవరికి చెప్పినా, మనల్నీ కార్డునీ హాస్పిటల్లో పారేస్తారు. ఉత్తినే అవతలివాళ్ళకెందుకూ మన వైద్య ఖర్చులూ?

   ఈ కార్యక్రమం నిన్న మొదలెట్టాను. మేముండే చోటునుండి, పదిహేను కిలోమీటర్లు ఆ ఆఫీసు. ఏదో అదృష్టం బావుండి, సరైన ఎప్లికేషనోటి చేతిలో పెట్టాడు. అందులో మనం పెన్షన్ తీసికునే బ్యాంకు దగ్గరనుండి, ఓ సర్టిఫికేట్టూ, మన PPO( Pension Payment Order) కాపీ ఒకటీ, మన ఎడ్రస్ ప్రూఫూ, ఇవి కాకుండగా ఎవరైతే benificiary లో వారి ఫుటోలూ ( Stamp size only please..) రెండేసి, ఒకటి ఎప్లికేషన్ తోనూ, రెండోది ఓ కవర్ లో పెట్టీ, ఇవన్నీ పూర్తిచేసి, ఓ సంతకం పెట్టిఆ ఎప్లికేషనేదో మన మ.రా.శ్రీ. ప్రభుత్వం వారికి ఇస్తే, ఎప్పుడో వారికి దయ కలిగినప్పుడు, ఆ ప్లాస్టిక్ కార్డేదో మనకి ప్రదానం చేస్తారుట. మన అదృష్టాన్ని బట్టుంటుంది.

   నిన్న ప్రొద్దుట ఆ ఎండలో వెళ్ళి, ఎప్లికేషను తెచ్చుకున్న తరువాత, మధ్యాన్నం 2.00 కి మళ్ళీ ఆ ఎండలో బ్యాంకుకి వెళ్ళి, ఆ సర్టిఫికెట్టేదో సంతకమూ, స్టాంపూ వేయించేసికుని, పన్లోపనిగా, ఆ PPO కాపీమీదా ఎటెస్టు చేయించుకుని, సాయంత్రం ఫుటోఫాస్ట్ కి వెళ్ళి నేనూ, ఇంటావిడా విడివిడిగా ఫుటోలు తీయంచుకుని, మళ్ళీ అవికూడా దమ్మిడీ సైజులో కాపీలు తీసికుని, కొంపకి చేరాము.విడివిడిగా ఎందుకూ అంటే, ఇద్దరికీ ప్రత్యేకంగా కార్డిస్తారుట. ఇదొక్కటే బావుంది. ఏ కారణం చేతైనా భార్యాభర్తలు రెండు వేరువేరు నగరాల్లో ఉండవలసివచ్చినా, సమస్యుండదని, అంతేకానీ ఇచ్చారుకదా అని విడిపొమ్మని. కాదు !!

   నిన్న వెళ్ళినప్పుడు చూశానుగా, ఆ ఆఫీసు పదికి తెరుస్తారు, ఒంటిగంటకి కట్టేస్తారు.క్యూలో ముందరే ఉంటే పనైపోతుందని, తొమ్మిదింటికల్లా వెళ్ళాను. అక్కడ మరీ రైల్వే రిజర్వేషనూ, బ్యాంకుల్లోలాగ, సినియర్ సిటిజెన్ క్యూలు వేరే ఉండవు. వచ్చే “పక్షు” లందరూ ఒకే “జాతి” వారవడం వల్ల.క్రమక్రమంగా జనాలు వచ్చి బెంచి మీద కూర్చుంటూంటే, అదో “తుత్తీ”, అబ్బ మనం ఎంత “తెలివైనవాళ్ళమో” అని! మొత్తానికి పదింటికి ఒకతను వచ్చాడు. అంతకుముందు పరిచయం ఉండడం తో, పరిచయం ఉండక ఛస్తుందా, ఒకే ఆఫీసుకి రెండు మూడు సార్లు వెళ్ళగా వెళ్ళగా అదే అవుతుంది. నాలాటివాడైతే మరీనూ…నా ఎప్లికేషను ఓసారి అటూ ఇటూ తిప్పి, నా ఎడ్రసు ప్రూఫూ, నేను అంటించిన ఫుటోలూ ఎటెస్టు చేయలేదన్నాడు. ఓరినాయనో మళ్ళీ అంతదూరం వెళ్ళాలా అనుకుని, ఓ వెర్రిమొహం పెడితే, పాపం తనే ఓ “ శాపవిమోచన” మార్గం చెప్పాడు. వాళ్ళ ఎడ్మిన్ ఆఫీసర్ చేత చేయించేసికో అని! పాపం ఆయనకీ వీళ్ళకీ ఏం గొడవలో!!ఏం పనీ పాటాలేకుండా, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడూ, వీళ్ళందరినీ ఆయనమీదకు వదిలితే, ఒక్క రోజైనా పని చేస్తాడూ అని కాబోలు !! సరే అని ఆ ” పెద్ద మనిషి” దగ్గరకు వెళ్తే, అనుకున్నట్టుగానే ఎవరితోనో కబుర్లు చెప్పుకుంటున్నాడు, నేను ఫలానా, నాకో సంతకం కావాలీ అనేటప్పటికి, చూస్తున్నావుగా ఎంత బిజీగా ఉన్నానో, అని ఓసారి కోప్పడేసి మళ్ళీ కబుర్లలోకి దిగాడు. ఏం చేస్తాం అవసరం మనదీ, ఎవడి కాళ్ళైనా పట్టాల్సిందే. కొంతమందికదో ఆనందం, తమకోసమని ఎంతసేపు వెయిట్ చేయిస్తే అంత గొప్పా అనుకుంటారు.ఈ భోగం అంతా డ్యూటీలో ఉన్నన్నాళ్ళే. రిటైరయిన తరువాత తెలుస్తాయి పాట్లు. ఓ రెండు సంతకాలకోసం నన్ను అరగంటా వెయిట్ చేయించాడు. ఇలా ఉందా నాయనా ఇంతకింతా అనుభవిస్తావు, అని “శాపం” పెట్టేసి (అదొకటే కదా మనకొచ్చిందీ), రూమ్ములోకి వెళ్ళి, ఆ ఎడ్రస్ ప్రూఫ్ ని ఎటెస్ట్ చేయించి, మా ఇద్దరి ఫుటోలూ కూడా చేయమంటే, మీరీవరో నాకేం తెలుసూ, చెయ్యను ఫో అన్నాడు.దొరికావురా నాయనా, నేనూ అదే అంటే, అక్కడ మీ ఆఫీసులో వాళ్ళు, కుదరదంటున్నారు. మరి అలాటి దరిద్రపు రూల్సెందుకూ, ఏదో ఓ సంతకం పడేయ్, వాళ్ళే చూసుకుంటారూ అని బలవంతం పెట్టేసరికి, ఏమనుకున్నాడో ఏమో పెట్టేశాడు.

   ఈ కాగితాలన్నీ తీసికుని మళ్ళీ ఆఫీసుకెళ్ళేటప్పటికి, పేద్ద క్యూ ఉంది. ఎలాగో తిప్పలు పడి, మొత్తానికి పదకొండున్నరకి, నా కాగితాలన్నీ సబ్మిట్ చేసి, ఓ రసీదు తెచ్చుకున్నా. ఓ మూడు నెలల తరువాత ఇస్తారుట!! పనైపోయిందిగా, ఆ “శాపం” వ్యవహారమేదో చూడొద్దూ, ఆ క్యూలో ఉన్న ప్రతీ వాళ్ళకీ వాళ్ళిచ్చిన కాగితాల్లో, అదేదో లేదూ, ఇదేదో ఎటెస్ట్ చేయలేదూ అనడమే. దొరికాడురా బాబూ, అనుకుని అడిగినవాడికీ, అడగని వాడికీ, ” ఆ పక్క రూమ్ములో ఉన్నాడే, ఎడ్మిన్ ఆఫీసరూ, ఆయన దగ్గరకు వెళ్ళండి, పాపం మంచివాడు, చేస్తాడూ…” అని చెప్పడం తో పొలో మని జనాలందరూ ఆయన రూమ్ములో క్యూ కట్టేశారు. చచ్చినట్టు ఎటెస్ట్ చేయొద్దూ మరీ? వదిలింది రోగం, నాతో పెట్టుకుంటాడా.

    పోస్టాఫీసుల బయట కూర్చునుంటారు చూశారా, మనీ ఆర్డర్ ఫారాలు నింపేవాళ్ళు, అలాగ ఈవేళ ఆ CGHS ఆఫీసు దగ్గర నుంచుని, చాలామందికి, వారి వారి ఫారాల్లో ఉండే లోటుపాట్లూ వగైరా చెప్పి, ” జ్ఞానోదయం” చేసి వచ్చాను!! ఎంతైనా ఇదోటి తెలిసిందిగా. ఈ టపా కూడా అందుకోసమే. పాఠకుల్లో ఎవరైనా, వారు కానీ, వారి తల్లితండ్రులు కానీ, ఎవరికైనా ఈ CGHS ఫెసిలిటీ అంటూ ఉంటే, ఈ పనేదో తొందరగా చేసేయండి. ఏదో నాకు తెలిసిందేదో చెప్పాను, తరువాత మీ ఇష్టం….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఉగాది రోజున పూణె లో….

   పూణె నగరంలో ఉన్న ఆంధ్రసంఘం వారు, ప్రతీ ఏటా జరిపినట్టే ఈ ఏడాదీ “ఉగాది” ” సంబరాలు” జరుపుతున్నామని, ఓ మెయిల్ పంపారు. ఎంతైనా, తెలుగువాడినీ, పూణె లో ఉంటున్న మిగిలిన తెలుగువారిని పరిచయం చేసికున్నట్టూ ఉంటుందీ అని, నేనూ, మా ఇంటావిడా వెళ్దామనుకున్నాము. దగ్గరలో ఉన్న, మా చుట్టాలు( ఇంటావిడవైపువాళ్ళు), ఇంకా వివరాలు కావాలంటే ఈ టపా చదవండి, ఎలాగూ కంపెనీ ఉందికదా అని, మమ్మల్ని కూడా ఎక్కించికుని, కారు( వాళ్ళదే) లో బయలుదేరాము.మొత్తానికి ఉగాది పూటా, మా ఇద్దరికీ పూర్తి వాహనయోగం… ప్రొద్దుటే అమ్మాయొచ్చి, మా అబ్బాయి కొత్తగా తీసికున్న లైబ్రరీ ఉద్ఘాటన పూజా కార్యక్రమాలకి తిసికెళ్ళింది, అబ్బాయేమో తన కారులో మమ్మల్ని దిగబెట్టేశాడు. ఆతావేతా రోజంతా అదీ ఉగాది రోజున వాహనయోగం పట్టింది. ఉగాది రోజున ఏం జరిగితే అది, సంవత్సరమంతా జరుగుతుందంటారుగా చూద్దాం, మా యోగం ఎలా ఉందో…

   Invitation లో ఇచ్చిన ప్రకారం వెళ్తే, ఉగాది కార్యక్రమం జరిగే చోటు కనిపించలేదు. వాళ్ళు చెప్పిన కల్మాడీ స్కూలూ, కన్నడసంఘం సరీగ్గానే పట్టుకున్నాము. అక్కడంతా నిర్మానుష్యం. వాళ్ళనీ వీళ్ళనీ అడుక్కుంటూ మొత్తానికి చేరాము ప్రోగ్రాం జరిగే చోటుకి. రెండింటి పేరూ కల్మాడీ స్కూలే, తేడా ఏమిటీ అంటే, ఒకటి పాతదీ, రెండోది కొత్తదీనూ. ఈ పాద్దానిదగ్గర పోనీ ఓ నోటీసైనా పెడితే మా ఆంధ్రసంఘం వారి సొమ్మేం పోయిందో..ఎంతైనా ” ఆంధ్రులము” కదా.. స్థలం ఏదైనా, ఒరిజినల్ స్వభావాలు మారవేమోలెండి. ఏమిటండీ అని అడిగితే, ఫోనులో అడగొచ్చుకదా అని రిటార్టోటీ మళ్ళీ..ఎప్పుడూ ఉండేదేలెండి ఈ గోల, వదిలేద్దాం. ఇన్ని తిప్పలూ పడి వెళ్ళినందుకు లాభం ఏమిటీ అంటే, ఆ ఆడిటోరియం మాత్రం చాలా బావుంది. మంచి సౌండ్ సిస్టమూ, సీటింగూ, ఏసీ. మొత్తానికి బావున్నదదొకటే..

   ప్రఖ్యాత తెలుగు నటుడు శ్రీ ఏవిఎస్ ( “తుత్తి” ఫేం) గారి హాస్యకదంబం, పంచాంగ శ్రవణం, కూచిపూడి నృత్యం, అదేదో తెలుగు హాస్యనాటిక, అన్నిటిలోకీ ముఖ్యమైనది “బుర్రకథ”,అన్నీ అయిన తరువాత “విందుభోజనం”. అదండీ కార్యక్రమం. ఏదో ఆ ఏవిఎస్ గారి కార్యక్రమాన్ని హైలైట్ చేస్తే, అదేదో చూడొచ్చూ అనుకున్నాము. తీరా అయిందేమిటయ్యా అంటే, ఆయన ఇచ్చిన “స్పీచ్” అంతా కలిపి పదిహేను నిమిషాలు. అందులో “నత్తి” (stammering) ఉన్నవారు మాట్లాడే విధానమూ..I felt it was in a very poor taste. Somehow ,I feel very bad whenever somebody cracks jokes at somebody else’s shortcoming... ఇలాటివి ఏవిఎస్ గారికి తెలియదా మరి? కానీ పేద్ద హాస్యనటులాయే మరి, భరించాలి. Honest గా శ్రీబాపూ రమణ గార్లకు ఆయన అర్పించిన నివాళి నచ్చింది. అలాగే ఇంకో రెండు జోక్కులూ, వారి అమ్మాయి లివర్ ఇవ్వడంలో చూపిన గొప్పతనమూ బావున్నాయి. ఈ సంవత్సరపు “నంది” బహుమతి ప్రదానోత్సవం మానుకుని మరీ, ఇక్కడకు రావడం మాత్రం, శ్రీ ఏవిఎస్ గారి గొప్పతనాన్ని చాటుతుంది. పైగా అక్కడ ఆయనక్కూడా ఓ “నంది” వచ్చిందిట. Hats off….

   బుర్రకథ మాత్రం చాలా బావుంది. ఎన్నో ఏళ్ళయింది, నాజర్ గారిదీ, నిడదవోలు అచ్యుతరామయ్య గారిదీ విని. మళ్ళీ ఇన్నాళ్ళకి ప్రత్యక్షంగా వినగలిగాము. కానీ హరికథ ల్లో చెప్పే టాపిక్కు సీతారామకల్యాణం మాత్రం బాగోలేదు. పోనీ వాళ్ళనైనా పూర్తిగా చెప్పనిచ్చారా అంటే అదీలేదూ, కొంత టైమయ్యేటప్పటికి, ఆర్గనైజర్లదగ్గరనుండి చీటీలూ, సౌంజ్ఞలూ, త్వరగా కట్టేయమని. This is our “love” for folk arts...కార్యక్రమాన్ని ఓ పధ్ధతిలో నడిపిస్తే, అన్నీ బాగానే ఉండేవి. ఆ బుర్రకథ కళాకారులకీ బాగుండేది.ఈరోజుల్లోఇలాటివన్నీ ఎవరు పట్టించుకుంటున్నారూ? కూచిపూడి నృత్యం చాలా బాగుంది. ఆ తరువాత బావిలో కప్ప అని ఓ "హాస్య నాటిక" ప్రదర్శన జరుగుతూండగానే, బయటకొచ్చేశాము, మళ్ళీ తిండుండదేమో అని! ఎందుకంటే, ఈ బఫే డిన్నర్లలో భరోసా ఉండదు. ఏదో మనం మొహమ్మాటానికి వెళ్ళి కార్యక్రమం పూర్తయేదాకా ఉందామనుకుంటామనుకోండి, తీరా డిన్నర్లలో మిగిలేది ప్లాస్టిక్ పళ్ళాలూ, టిస్యూ పేపర్లూనూ

   ఇంక డిన్నర్ విషయానికొస్తే not much to write about… Satabdi Express లో ఇచ్చే భోజనమే బావుందనిపించింది, నాకైతే… అదండీ “మా ఊళ్ళో” ఉగాది….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఈ నాలుగురోజులనుండీ టపాలు పెట్టలేదు. నేనిన్నాళ్ళూ వాడుతున్న రిలయన్స్ వాళ్ల బ్రాడ్ బాండ్ దానికి తోచినప్పుడు, ఓ వేళా పాళా లేకుండా, స్పీడ్ జీరోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రారంభం అవడం తనకి తోచినప్పుడే మరి. ఇంక ఇది పని కాదని, బి.ఎస్.ఎన్.ఎల్ వాళ్ళది తీసికుందామనుకున్నాను. రాజమండ్రీ లో ఉన్నప్పుడు పాపం వెర్రిది, చాలా విశ్వాసపాత్రంగా పనిచేసింది. ఈమధ్యనే ల్యాండ్ లైన్ కూడా వచ్చిందేమో, పోనీ వాళ్ళ బ్రాడ్ బాండ్ కూడా తీసికుంటే పోలే అనిపించింది. ఇదేమీ స్వంత ఐడియా కాదనుకోండీ, ఇంటావిడ ఎప్పుడో చెప్పింది, అయినా మీకు తెలుసుగా, నాదంతా ట్యూబ్ లైట్ వ్యవహారమాయె, కొంత టైముపడుతుంది, “వెలగడానికి”! ఒకసారి వెలిగిందీ అంటే చాలు, ఆగడం లేదు. ఎప్లికేషనిచ్చేటప్పుడు, ఇదివరకటిలా ఏమైనా డబ్బులు కట్టాలేమో అనుకున్నాను. అఖ్ఖర్లేదుట, మొదటి బిల్లులో వేస్తారుట. ఆ “మొదటి బిల్లు” అనేదెప్పుడు వస్తుందో అంతా దైవాధీనం! నా ల్యాండ్ లైన్ డిశంబరులో తీసికుంటే, మార్చ్ దాకా రాకపోతే, మళ్ళీ కట్ చేసేస్తారేమో అని ఆఫీసుకెళ్ళి డూప్లికేట్ జనరేట్ చేయించుకుని కట్టొచ్చాను. ఇంతాచేసి, మర్నాడు ఆ బిల్లు కాస్తా రానే వచ్చింది.ఇలా ఉంటుందండి మరి. ఏం చేస్తాం? పోనీ ఆన్ లైన్ లో కట్టేద్దామా అనుకుంటే, వాటన్నిటినీ లెఖ్ఖలోకి తీసికోకుండా, తడిపి మోపెడు బిల్లేస్తారు. అదీ అనుభవం అయింది. బి.ఎస్.ఎన్.ఎల్ వాళ్ళని ఏమీ అనకూడదూ, మా ఇంటావిడ కొత్త పుట్టింటారాయే ( అర్ధం అయిందనుకుంటా). ఏమిటో అన్నీ గందరగోళాలే!!

   ఎప్లికేషనిచ్చేటప్పుడే చెప్పారు, మోడెమో, మొండెమో అదేదో మనమే తెచ్చుకోవాలట. ఇదివరకే బాగుండేది, హాయిగా ఓ వెయ్యి రూపాయలు కట్టించేసికుని, వాళ్ళే ఏదో చేసేసేవారు. ఈ “రాజా” ల గొడవలు మొదలయినప్పటినుంచీ, టెండర్లే పిలవడం లేదుట. వాళ్ళకేం పోయిందీ, మనక్కదా కష్టాలూ.రెండు రోజులు పోయిన తరువాత అడిగితే, నీ బ్రాడ్ బాండ్ వచ్చేసిందీ, మోడెం తెచ్చుకున్నావా అన్నారు. బిఎస్ ఎన్ ఎల్ వాళ్ళిచ్చిన వెండర్లకి ఫోను చేస్తే, వాళ్ళేమో వైర్ లెస్ ది 2000, వైరూ వైఫై ఉన్నది 3000 అన్నారు.మరీ అంతెందుకూ అనుకుని, నాకు తెలిసిన ఇంటిపక్కనుండే వాడినడిగి, ఓ మోడెం తెప్పించుకున్నాను. తీరా దాని ప్యాకెట్టు తెరిస్తే తెలిసిందేమిటంటే, అది వీళ్ళ వైర్డ్ దానికి కంపాటిబుల్ కాదూ అని. మళ్ళీ కొట్టువాడిదగ్గరకు వెళ్ళి ఇది కాదు నాయనా, అదేదో ADSL కావాలిట అన్నాను. ప్యాకెట్టు తెరిచేశావూ అంటాడేమో అనో భయం, మరీ కోప్పడకుండా, కొత్తది తెచ్చి ఇచ్చాడు. ఆ బి.ఎస్.ఎన్.ఎల్ వాడేమో, exchange కే తీసుకుని రండీ, మీకు Installation charges పడవూ అన్నడు. ఎంతైనా వెధవది మధ్యతరగతి మనస్థత్వాలూ, పోన్లే ఏదో కొంత తగ్గుతుంది కదా అని, అక్కడికే వెళ్ళి వాడి నెత్తిమీద కూర్చున్నాను.

    ఏదో అదీ ఇదీ చూసి, ఏవేవో నొక్కి, మొత్తానికి ఆ కాన్ఫిగరేషనేదో చేసేసి చేతిలో పెట్టాడు. దీన్నేం చేసికోనూ నాయనా అంటే, పాపం ఏమేం చేయాలో వివరంగా చెప్పి పంపాడు. ఆ గొడవలన్నీ నాకెక్కడ తెలుసూ, పోనీ అబ్బాయిని అడిగితే పోలే అనుకుని, తనకి ఫొను చేస్తే ఈవేళొచ్చి చేస్తానన్నాడు. అయినా, నేనా ఊరికే కూర్చునేదీ, ఇదేమైనా బ్రహ్మవిద్యా ఏమిటీ అనుకుని ( పైగా మా ఇంటావిడ చెప్పేధైర్యమోటీ..), అదీ ఇదీ కెలికి, మొత్తానికి ఆ మోడెం లో బ్లింకులదాకా వచ్చానండి. అదేదో కనెక్టవడానికి, అదేదో పోర్టలో ఏదో కావల్సుంటుందని ఎక్కడో విన్నాను. కనెక్టు చేయాలంటే ముందుగా నొక్కడానికి ఏదో ఒకటి కావాలికదా, అదన్నమాట… మొత్తానికి దాన్ని కూడా వెదికి పట్టుకుని, తీరా కనెక్ట్ మీద నొక్కితే,దీనిల్లుబంగారం గానూ, కనెక్టవదే… మళ్ళీ ఇదో గొడవా. అబ్బాయికి ఫోను చేసి చెప్తే అన్నాడూ.. “వచ్చి చేసిపెడతానన్నాను కదా, మరీ అంత తొందరెందుకూ, రేపొచ్చి చేస్తానూ..” అన్నాడు. అయినా ఏమిటో ఇలా అయిపోయిందీ అనుకున్నాను. మాకు అలవాటేలెండి, ఇంట్లోకి ఏ కొత్త వస్తువు తెచ్చినా సరే, మొదటి రోజు ఏదో ఒక తిప్పలు పెడుతూనే ఉంటుంది. ఇది మాత్రం తక్కువ తిందా ఏమిటీ?

   ప్రొద్దుటే అబ్బాయొచ్చి స్టార్ట్ చేసి, అదేమిటి డాడీ, కనెక్టయే ఉందిగా అన్నాడు… అందుకే అన్నాను, ఏ విషయమైనా పూర్తిగా తెలియనైనా తెలియాలి, లేదా ఎవరైనా చెప్తేనైనా వినాలి, కానీ ఈ వయస్సొచ్చిన తరువాత కొంచం కష్టమే కదూ… ఆ బి.ఎస్ ఎన్.ఎల్ అతను చెప్పనే చెప్పాడు, ఇంటికి తీసికెళ్ళి దేని “చిల్లు” లో దాన్ని పెట్టండీ, హాయిగా బ్రౌజ్ చేసికోండీ అని. వింటేగా… ఇదండి విషయం.ఇటుపైన కనెక్టివిటీ గొడవ లేకుండా, హాయిగా టపాలు వ్రాస్తానని ఆశిస్తున్నాను…

    రేపు ఉగాది కదా, ఏదో మామిడాకులూ, వేప్పువ్వూ తెద్దామని బజారుకెళ్ళాను. చెరుగ్గడ, బెల్లం,పువ్వులూ, మామిడికాయా ప్రొద్దుటే తెచ్చేశాను. ఇద్దివరకటి రోజుల్లో ఎప్పుడైనా ఇలా బజార్లలో కొనుక్కునేవాళ్ళమా? ఎక్కడ చూసినా మామిడిచెట్లూ, వేపచెట్లూనూ. ఇప్పుడు తుపాగ్గుండుక్కూడా దొరకడం లేదు. వాడిచ్చే నాలుగు రొబ్బలకీ పదేసి రూపాయలడుగుతాడు. అయినా మానుతామా ఏమిటీ? మన దౌర్భాగ్యం ఏమిటంటే, తోరణాలకి కట్టే మావిడాకులుకూడా కొనుక్కోవలసిరావడం… మేరా భారత్ మహాన్

అందరికీ నందననామ సంవత్సర శుభాకాంక్షలు….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Food for thought….

   ఇలాటి టపాలు అంటే Fooడ్డూ, thoughట్టూ లాటివి తిన్న తిండరక్క చేసే/పెట్టే టపాలన్నమట. ఇష్టముందా చదువుతారూ, లేదా పోనిద్దూ ఏదో వయస్సు వచ్చేసి రాస్తున్నాడూ అనుకుని వదిలేస్తారు. రాజ్యాంగంలో ప్రతీవాడికీ అదేదో freedom of speech అనోటిచ్చారుగా, పోనీ ఇచ్చారే అనుకోండి, నోటికొచ్చినట్టు అవాకులూ చవాకులూ వ్రాస్తే ఎలాగా అనకండి, 24 గంటలూ మన రాజకీయనాయకులు వాగట్లేదూ, అలాగే ఇదీ అనుకోండి.వాళ్ళని భరిస్తున్నామా లేదా?

   ఈ టపా రెండు మూడు రోజులముందు వ్రాసుంటే, అందరూ నన్ను తన్ని తగలేసేవారు.ఇప్పుడంటారా, జనాలు కొద్దిగాeuphoria నుండి బయటపడుంటారు, hangover లోంచి తేరుకునుంటారూ అని భావించి వ్రాస్తున్న టపా. అదేనండీ, మన సెంచరీల సచిన్ గురించి. అతను ప్రపంచంలో statistical గా THE GREATEST. అందులో సందేహమేమీ లేదు. సందేహం ఉందీ అంటే కాళ్ళిరొగ్గొడతారు.నా టపాలు చదివేవాళ్ళందరూ మానేస్తారు.There is absolutely no doubt, ఈ విషయంలో మాత్రం.

   పైగా 20 సంవత్సరాలనుండీ ఆడుతూ, అన్నిదేశాల ( క్రికెట్ ఆడే) మీదా సెంచరీలు సాధించడం అంటే మాటలు కాదు. ఈ కాలక్రమంలో భారతదేశానికి World Cup వచ్చింది, టెస్టుల్లో మొదటి స్థానం ( however short lived it was...) వచ్చింది, ఎన్ని రికార్డులు ఓ మానవమాత్రుడికి సాధ్యమో అన్నీసాధించకలిగాడు.He achieved whatever was humanly possible.No two opinions about it. ఏదో వందో సెంచరీ కొట్టగానే, రిటైరయిపోతాడేమో అనుకున్న వారందరికీ ఓ bombshell వేశాడు. తను ఇంకా గేమ్ముని ఆస్వాదిస్తున్నాననీ, ఎప్పుడు enjoy చేయడం తగ్గిపోతుందో అప్పుడే రిటైర్ అవుతాననీ. ఈ statement వల్లనే ఈ టపా. తనెప్పుడు రిటైరవుతాడో తనిష్టం కానీ, మీకెందుకూ ఆగొడవా అనకండి. క్రికెట్టు స్పెలింగు K తోనా, C తోనా అని తెలియనిప్రతీవాడూ మాట్టాడేవాడే అనొచ్చు. అది మీఇష్టం. కానీ రాయడంవరకూ మాత్రం నా ఇష్టం…

   దేశంలో ఏమిటి, ప్రపంచంలో ఓ “పని” చేసే ప్రతీవాడూ, తనుచేసే పనిమీద ఇష్టమయే చేస్తాడు. కానీ ఏదో పరిస్థితుల ప్రభావం వల్లా, ఏవో రూల్సూ రెగ్యులేషనల వలనా రిటైరు అవుతారు, లేదా చేయబడతారు. అంతేకానీ మనకిష్టం కదా అని కంటిన్యూ చేయనీయరు. Infosyis నారాయణమూర్తిగారూ, రతన్ టాటా గారూ, రాహుల్ బజాజ్ గారూ వాళ్ళకి పనిలో ఉతస్సహం లేదని రిటైరయ్యారా ఏమిటీ? వారి సంస్థలు వారు ప్రారంభించినవే, వాళ్ళెన్నాళ్ళున్నా అడిగేవాడు లేడు. కానీ తప్పుకున్నారు, కారణం కొత్తవారికి స్థానం కలిపించాలనే సదుద్దేశ్యంతో. ఏమో కొత్తగా వచ్చేవారు, వీరికంటే గొప్పగా చేయొచ్చేమో? ఛాన్స్ దొరికితేనే కదా తెలిసేది? కాదూ బతికున్నంతకాలం మనమే ఉండాలీ అనుకునుంటే రిటైరయ్యేవారా?

   మనదేశంలో రాజకీయనాయకుల్ని ఈ కోవలోకి తేకండి. కారణం, ఒకసారి వచ్చాడాంటే, state honours తో కాటికెళ్ళి, వీధివీధినా విగ్రహలు పెట్టించుకునేదాకా మనల్ని వదలరు వాళ్ళు. అది మనం చేసికున్న దౌర్భాగ్యం, అనుభవించాల్సిందే.

   అంతదాకా ఎందుకూ,ఇదివరకటి రోజుల్లో 58 ఏళ్ళకి రిటైరయ్యారుకదా అని, మన పెద్దవాళ్ళు, వాళ్ళు చేసే “పనుల్లో” ఎంజాయ్ చేయడంలేదన్నారా? ఛాన్స్ దొరకలేదు కానీ, దొరికితే హాయిగా “కాపురం” చేసికునేవారు. కానీ మనవాళ్ళో, రిటైరయ్యారంటే ” పెద్దాయనకి” అరుగుమీద మడతమంచమూ, “పెద్దావిడ” కి మనవళ్ళూ,మనవరాళ్ళతో వాళ్ళు తడిపిన గుడ్డల్లో పడుక్కోవడమూనూ. కాదూ మేము ఇంకా జీవితాన్ని “ఆస్వాదిస్తున్నామూ” అంటే వీలౌతుందా మాస్టారూ? విడిగా రూమ్ము కావాలీ,అంటే కుదురుతుందా?

   ఇప్పటికీ, ఉద్యోగాలనుండి రిటైరయినవారు, తరువాత కూడా ఏదో పనిలో బిజీగా ఉన్నారూ అంటే, వాళ్ళకి ఆ పనిమీద ఇంటరెస్టున్నట్టే కదా. అలాగని మమ్మల్ని ఇంకా ఉద్యోగంలో ఉంచండీ అంటే కుదురుతుందా?

   అలాగే మన క్రికెట్టులోకూడా, ఒక కీర్తిపతాకం సాధించిన తరువాత, అదే పొజిషన్ లో ఉండగా రిటైరయిపోతే, తనకీ గౌరవమూ, పైగా ఇంకా అభిమానం పెరుగుతుంది. అంతేకానీ, ఎవరిచేతో బయటకి పంపింపబడ్డం బాగుంటుందా? పోనీ అదే పరిస్థితి వచ్చిందనుకుందాము, అప్పుడు కూడా, మన మీడియావాళ్ళూ, క్రికెట్ బోర్డువాళ్ళూ, దాన్నికూడా గుడీ గుడీ గానే చూపిస్తారు. అసలు సచినే కిందటేడాది చెప్పాడూ, తనని తీసికోవద్దనీ, రిటైరయిపోవాలనుందీ అనీ, కానీ మేమే ఆపాము వగైరా వగైరా…Public has to accept with a pinch of salt.వెర్రివెధవలయ్యేదెవరుట మీరూ, మేమూనూ…అతని ఇమేజ్ అలాటిది మరి.

   కొత్తతరానికి తెలియదేమో కానీ, Polly Umrigar అని ఒకాయనుండేవాడు. వెస్టిండీస్ మీద 170 పరుగులుచేసిన వెంటనే రిటైరయ్యాడు.ఒకానొకప్పుడు, మనదేశంలో అత్యుత్తమ క్రికెటర్ గా పూజించేవారు. అక్కడిదాకా ఎందుకూ గంగూలీలూ, ద్రవిడ్ లూ, లక్ష్మణ్ లూ ఆటని ఎంజాయ్ చేయడం లేదో అని రిటైరయ్యారా ఏమిటీ? వీళ్ళకి guardian angels లేకపోవడం వలన గౌరవంగా తప్పుకున్నారు. ఇప్పుడు చూడండి ప్రతీ వాడూ, ఒహో గంగూలీ అయితే ఎలా ఆడేవాడో కదా, ద్రవిడ్ అయితే ఎలా ఉండేదో కదా అనే వాడే!అలా అందరిచేతా అనిపించుకోవాలి వీలుంటే, అంతేకానీ అబ్బ ఇంకా ఎంతకాలం ఆడతాడురా బాబూ అని కాదు. కొత్తవాళ్ళకీ స్థానాలు కల్పించాలికదా, ఖాళీ అయితేనే కదా కొత్తవాళ్ళు వచ్చేదీ. సచిన్ ని తప్పించే ధైర్యం ఎవరికీ ఉందని అనుకోను. తప్పిస్తే ఏం తంటా వస్తుందో. దేశం అంతా “భగవంతుడు” అనబడే ఆటగాడిని తప్పిస్తే, మళ్ళీ దీక్షలూ, ధర్నాలూనూ. ఎందుకొచ్చిన గొడవా?

   ఏమో నాకనిపించింది వ్రాశాను. నచ్చిందా సంతోషం. లేదా చివాట్లేస్తే, మళ్ళీ ఇలాటి టపాలు పెట్టను. ఏదో ఒకటి చెప్పండి. ఎవరూ ఏమీ అనలేదూ అంటే ఇలాటి పిచ్చిపిచ్చి వ్రాతలు రాస్తూనే ఉంటాను…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— నీళ్ళు…….

    రోజూ ట్యాప్పు తిప్పితే వస్తూండడంతో ఈ నీళ్ళకున్న ప్రాముఖ్యతా, అవసరం మనకి గుర్తుండదు. ఎప్పుడో టుపుక్కున ఆగిపోయేసరికి ఇంక రోజంతా ఆ నీళ్ళ గురించి చర్చలే. అందులోనూ నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఎపార్టుమెంట్లలో, అవీ బహుళ అంతస్థులాయే, నీళ్ళు రాకపోయేసరికి, వీధిన పడిపోతాము. బిజీబిజీగా ఉండే జీవితం లో, పెద్దాళ్ళు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్ళకీ తయారయి వెళ్ళవలసిన సమయం లో ఇలాటిదేదో జరిగిందంటే ఇంక అడగఖ్ఖర్లేదు. అప్పుడొస్తాయి గొడవలన్నీనూ. ఆ సొసైటీ సెక్రెటరీ మీదో, ఛైర్మన్ మీదో ఎగరడం మొదలెడతారు. వాళ్ళు మాత్రం తక్కువా ఏమిటీ, “Society maintainance charges ఇవ్వాలని గుర్తుండదు కానీ, నీళ్ళు రానప్పుడూ, లిఫ్ట్ పనిచేయనప్పుడూ మాత్రం గుర్తొస్తూంటాము“.అని వాళ్ళూ ఛాన్సొచ్చిందికదా అని,ఘాటుగా జవాబిస్తారు. అక్కణ్ణించి ప్రారంభం, ఎపార్ట్మంట్లలో పాలిటిక్స్, “ఈ దరిద్రపు కమెటీకి అసలు శ్రధ్ధే లేదండీ, ఇదివరకు మేముండే సొసైటీలో నేను సెక్రెటరీగా పనిచేశాను, అక్కడికెళ్ళడగండి ఎలా ఉండేదో. ఓ ప్లానూ, టైంఫ్రేమూ ఉండాలండి బాబూ. అసలు చెప్పాలంటే అదో specialised skiల్లండి బాబూ. ప్రతీవాడికీ రాదు…వగైరా వగైరా”.. వినాలి.Society maintainance charges defaulters లో ఈ మాజీ సెక్రటెరీగారి పేరు మొదట్లోనే ఉండొచ్చు, అది వేరేసంగతనుకోండి. అసలు గొడవంతా ఎక్కడొచ్చిందీ అంటే, క్రితం సారి సొసైటీలో జరిగిన ఎలెక్షన్ లో ఈయనగారి సంగతి ఎవడూ పట్టించుకోలేదు.

ఇంకోటేమిటంటే, టైముకి నీళ్ళురాకపోయేసరికి, ముందుగా బలైపోయేవాడు ఆ సొసైటీ వాచ్మన్. నిన్న మా సొసైటీలో నీళ్ళు రాకపోయేసరికి, మోటార్ ఆన్ చేయలేదూ అని, అతనిమీదే పెట్టేశారు. విషయం తెలిసికోకుండా పెద్ద గొప్పగా నేనూ, నాటపా లో వ్రాసేశాను.అసలు జరిగిందేమిటంటే, మా పూణె/ చించ్వాడ్ కార్పొరేషన్లవాళ్ళు, నీళ్ళ సరఫరాలో కటౌతీ పెట్టారుట.ఆ వాచ్మన్ అసలు నీళ్ళేరాలేదు మొర్రో అంటే వినిపించుకోరే. ఏదో మొత్తానికి ఒకళ్ళనొకళ్ళు కోప్పడేసికుని, ఒకటో రెండో ట్యాంకర్లు తెప్పించారు. జనాలు తెలివిమీరిపోయారు, ఆ ట్యాంకర్ వచ్చీరాగానే, ఎవరికి తోచింది వాళ్ళు ఇంట్లో ఉన్న గిన్నెల్లోనూ, బకెట్లలోనూ, గ్లాసుల్లోనూ నీళ్ళు నింపేసుకునేసరికి, అరగంటలో ఖాళీ అయిపోయింది. ఆఫీసులకెళ్ళే హడావిడిలో ప్రొద్దుటే, ట్యాప్పులు తెరిచేసి ఉంచడం ధర్మమా అని, కొన్ని తాళాలున్న ఫ్లాట్టుల్లో నీళ్ళన్నీ గట్టర్ లోకి వెళ్ళాయి.ఆతావేతా జరిగిందేమిటంటే ట్యాంకు ఖాళీ..ఆ తాళం వేసి, ట్యాప్పులు తెరిచేసిఉంచిన వాళ్ళమీద అవాకులూ చవాకులూనూ.

ఇదివరకటి రోజుల్లో నీళ్ళకెప్పుడూ కరువుండేది కాదు, ఏదో వర్షాల్లేని కొన్నిప్రాంతాల్లో తప్ప. హాయిగా పెరట్లో ఓ నుయ్యుండేది, ఓ చేదా,దానికో చేంతాడూ, ఎప్పుడైనా నూతిలో పడిపోతే దాన్ని తియ్యడానికి ఓ గేలమూ, దాన్ని periodical గా ఓసారి దాంట్లోకి ఎవడో దిగి, మట్టి తీసేవాడు.ఆ టైములో ఎప్పుడో నూతిలో పడ్డ చెంబులూ, గ్లాసులూ, బంతులూ ఒకటేమిటి, సింధునాగరికత టైములో ఉండే ప్రతీ వస్తువూ దొరికేది. ఇంక ఆ నూతుల గురించి, చుట్టుపక్కల ప్రతీవాళ్ళూ చెప్పుకోడమే, ఫలానా వారి నూతిలో నీళ్ళు ఎంత రుచిగా ఉంటాయో అనీ, ఫలానా వాళ్ళింట్లో నీళ్ళు ఉప్ప రొడ్డండి బాబూ అనో… ఏదో ఆ నూతినీళ్ళకీ ఓ పేరొచ్చేసేది. కాలక్రమేణా, ఆ నూతులూ ఎండిపోవడం ప్రారంభం అయింది. జనాభా పెరిగేకొద్దీ అవేవో “రక్షిత మంచినీళ్ళ పథకాలు” ప్రారంభం అయి, కుళాయి చెరువులు, తరువాత్తరువాత Overhead Tank లూ తయారయ్యాయి. వీధికో కుళాయీ, ప్రతీ రోజూ నీళ్ళొచ్చే టైముకి, అక్కడ పెద్ద పెద్ద క్యూలూ, దెబ్బలాటలూ ఒకటేమిటి కావలిసినంత హడావిడి.స్థోమతున్నవాళ్ళు ఇళ్ళలోకి కుళాయిలు, హాయిగా tap తెరిస్తే నీళ్ళొచ్చేసేవి. మనుష్యులూ సుఖానికలవాటు పడ్డారు.

కాలక్రమేణా ఇళ్ళూ,స్థలాలూ అమ్మేసికుని ఎపార్ట్మెంట్ కల్చరొచ్చేసరికి, ముందుగా ఓ బోరు బావోటి తవ్వేవాడు. దాంట్లోంచి వచ్చే నీళ్ళతోనే కట్టాలికదా మరి, ఆ బహుళంతస్థుల భవనాలు. మనం ఏ ఫ్లాట్టో బుక్ చేసికోడానికి వెళ్తే ముందుగా అడిగేది నీళ్ళ గురించేకదా. వాడు స్వర్గం చూపించేస్తాడు. తాగడానికి కార్పొరేషన్ నీళ్ళూ, బ్యాకప్పుకి బోరింగూ అని, ఆ బోరుబావిదగ్గరకు తీసికెళ్ళి మన తల పట్టుకుని, దాంట్లోకి వంచేసి మరీ చూపించేస్తాడు. ఆ చీకట్లో కనిపించకపోయినా సరే నిజమే కాబోసనుకుంటాము.ఆ బోరుబావిలో నీళ్ళు ఓ ఏడాదిపాటు వస్తాయి. కనిపించిన ప్రతీవాళ్ళతో చెప్పుకోడం, మా సొసైటీలోనండీ అస్సలు water probleమే లేదండీ,అసలు అందుకోసమే నేనిక్కడ తీసికున్నాను అంటూ.. పైగా కనిపించినప్పుడల్లా పరామర్శ చేయడం ఓటీ “ఏమిటీ ఎలా ఉన్నారూ నీళ్ళూ అవీ వస్తున్నాయా లేక ఇంకా బయట ట్యాంకర్లేనా”.. అంటూ. ఈ ముచ్చట ఓ కొద్దిరోజులుంటుంది. అదేం ఖర్మమో, సొసైటీ లోని అన్ని ఫ్లాట్ట్లూ occupy అయి, సొసైటీ ఫార్మ్ అయ్యేటప్పటికి, ఆ బోరింగు కాస్తా ఎండిపోతుంది. కార్పొరేషన్వాళ్ళిచ్చే నీళ్ళే గతి. వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకుని, ఎంతో కొంత తినిపించిన తరువాత, అదేదో ఒన్ ఇంచ్ లైనో, టు ఇంచ్ లైనో వేస్తారు.

పొనీ ఏదోలాగ హాయిగా కడుపులో నీళ్ళు కదలకుండా నీళ్ళొస్తున్నాయి కదా, వాటినైనా సరీగ్గా ఉపయోగించే జ్ఞానం ఉందా అంటే అదీ లేదూ. ఇదివరకటి రోజుల్లో గుర్తుండే ఉంటుంది, ఓ చెంబెణ్ణీళ్ళు పట్టుకుని వెళ్తే పనై పోయేది. మరి ఇప్పుడో ఫ్లషులూ గొడవానూ. పైగా ఒకసారి కొట్టేటప్పటికి, రెండో మూడో బకెట్ల నీళ్ళు గోవిందా! ఏమైనా అంటే హైజీనూ, సింగినాదమూనూ. హైజినిక్ గా ఉండాలి, కాదనడం లేదు, కానీ మరీ అంత లగ్జూరియస్ గా ఉంటే నీళ్ళెక్కణ్ణించొస్తాయి? ఇదివరకటి రోజుల్లో, ఓ గ్లాసుడు నీళ్ళో,ఓ బుల్లికప్పుడు నీళ్ళో పెట్టుకుని, ఓ అద్దం చేతిలో పట్టుకుంటే, హాయిగా గెడ్డం గీసుకోడం అయిపోయేది. మరి ఇప్పుడో ఓ వాష్ బేసినూ, దానికో ట్యాప్పూ, పైనో అద్దమూ, దానెదురుగుండా మనం ఓ షేవరో, ఏదో పట్టుకుని షేవింగు చేసికోడం, చేసికున్నంతసేపూ కింద ట్యాప్పు లోంచి నీళ్ళు అలా పోతూనే ఉంటాయి. మరి ఆ నీళ్ళన్నీ, ఎవడు వాడినట్టూ? ఇలాగేదైనా అంటే, పాత చింతకాయ పచ్చళ్ళా ఉంటుంది. ఇంక స్నానాలకొస్తే, ప్రతీ వాళ్ళూ పురిటి స్నానం లాగానే చేయడం. గంటల తరబడి. మళ్ళీ హైజీనే..

అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే, ఎక్కడో ఎవడో పేపర్లో చూస్తాడు, ఫలానా రోజున నీళ్ళుండవూ అని. ఛస్తే ఇంకోడితో చెప్పడు, ఇంట్లో ఉన్న గిన్నెల్లోనూ,బకెట్లలోనూ, వీలుంటే సింటెక్స్ ట్యాంకుల్లోనూ నీళ్ళు నింపేసికోడం, నీళ్ళు లేవని ఏడుస్తున్నవారిని చిద్విలాసంగా చూస్తూ, “అర్రే పేపర్లో చూళ్ళేదా నీళ్ళు రావని వ్రాశారూ..” అంటూ, తనేదో గొప్ప పని చేశాడని చూడ్డం. పోనీ ఆ పట్టుకున్న నీళ్ళైనా సద్వినియోగం చేస్తాడా అంటే అదీ లేదూ, మళ్ళీ నీళ్ళు రావడం మొదలెట్టగానే, ఈ పట్టిన నీళ్ళన్నీ పారపోస్తాడు. అదో పైశాచికానందం మరి.

ఇలా రాసుకుంటూ పోతే కావలిసినన్నున్నాయి. అందరికీ తెలియదా అంటే తెలుసునూ అనే అనాలి. కొంపలో నీళ్ళు రానప్పుడే గుర్తొస్తాయి ఇలాటివన్నీ. మళ్ళీ మామూలే..

అమ్మయ్యా ఓ గొడవొదిలిందండి బాబూ.. సచిన్ వందో సెంచరీ పూర్తిచేశాట్ట. మనందరమూ కిరికెట్టు చూడ్డం మానేయొచ్చు… మనవాళ్ళు ఓడిపోయారనుకోండీ, అదేమీ అంత importanటా ఏమిటీ? అయినా ఇదేమైనా కొత్తా ఏమిటీ……
Life goes on and on....

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అస్సలు జీవితంలో బాగుపడతానా….

   ఓ కారణం ఉండదు, ఊరికే ఏదో జరిగిందని, బి.పి.పెంచేసికుని, తేరగా దొరికిందికదా అని ఇంటావిడమీద కేకలేసేయడం. ఓ అర్ధం పర్ధం ఉండదు. ఈమధ్యన మనప్రాంతాలు తిరిగి వచ్చినప్పటినుంచీ, అలిసిపోయి, ఎంతైనా డెభైఏళ్లకి దగ్గరవుతున్నాను కదా ( పైగా ఇదో వంకోటీ !!!), చిన్న చిన్న కారణాలకి ఊరికే ఆవిడమీద ధాంధూం అనేస్తున్నాను. తెలుసండి బాబూ,నేను చేస్తున్నది తప్పూ అని. కానీ అదేమిటో సమయం వచ్చేటప్పటికి ఏమీ గుర్తుకు రావు. ఇన్నేళ్ళనుండీ నన్ను భరిస్తోందా, వేసే వెర్రి మొర్రి వేషాలన్నీ” పోన్లెద్దూ నాదగ్గర కాక ఇంకెవరిదగ్గర వేస్తారూ..” అని వదిలేస్తోందా, అయినా సరే, ఈ periodical bursts లోంచి మాత్రం బయటపడలేకున్నాను. పోనీ స్త్రీలకైతే అదేదో PMT ట, కానీ నాకేం రోగంట?

ఏం లేదూ, ఈవేళ ప్రొద్దుట మేముండే ఫ్లాట్ లో నీళ్ళు రావడం మానేశాయి. పేద్ద కారణమూ లేదు, వాచ్ మన్ కి పంపు ఆన్ చేయడానికి మూడ్ లేదుట, దాంతో నీళ్ళు టాంక్ లోకి ఎక్కడం మానేశాయి.వీడిల్లుబంగారం గానూ, మాటిమాటికీ ఇలా అయితే ఎలాగట? ఎలాగూ నీళ్ళు లేవూ, పోనీ మన ఫ్లాట్ కి వెళ్ళిపోదామా అన్నాను. ఠాఠ్ మనకి వేరే ఆప్షన్ ఉందికదా అని, మనింటికి వెళ్తామూ, సొసైటీలో ఉండే మిగిలినవాళ్ళసంగతేమిటీ? వాళ్ళలాగే మనమూనూ. ఓర్నాయనో మన రాజకీయనాయకుల్లా ఇలా “ సామాజికన్యాయం” అంటూ జ్ఞానబోధ చేస్తే ఎలా చెప్పండి? ఏదో భగవంతుడు మనల్ని చల్లగా చూసి, ఇంకో ఆల్టర్నేటివ్ ఇచ్చాడు, అది అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కానీ, మరీ ఇలా social justice అంటే ఎలాగా అంటే వినదే.నేను చెప్పాను తను వినలేదూ బస్ అంతే కారణం. దానితో నోటికొచ్చినట్టల్లా వాగేసి, నాదారిన నేను భళ్ళున తలుపేసేసి వెళ్ళిపోయాను.అయినా ఇంత బుల్లి కారణానికి ఎవరైనా కట్టుకున్న భార్యమీద ఎగురుతారా ? అయినా సరే ఆ టైములో ఇది చిన్నకారణం, పెద్దకారణం అని గుర్తుండదు. ఏదో ఒకటీ, కారణం అంటూ ఉందికదా! Very poor defence కదూ! ఇలాటివి నాకే కాదు ” రాక్షసత్వం” లేని ఏ భర్తకైనా ఎప్పుడో ఒకసారి వస్తూనేఉంటుంది. నిజంగా “ రాక్షసుడే” అయితే, పీక నొక్కి వదిలేస్తాడు.భగవంతుడి దయవలన అలాటివేవీ ఉండవు నూటికి తొంభైమంది భర్తల్లో. అందుకేనేమో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాపరాలు చేసేస్తున్నాము.

అప్పుడప్పుడు ఇలాటి కన్ఫెషన్స్ చేస్తే చేసినపాపం ఉండదుట. ఇదీ బాగానే ఉందండోయ్, చేసేదల్లా చేసేయడం, కన్ఫెషన్ చేసేయడం. హాయి కదూ. మన కాలక్షేపం మనకీ ఉంటుంది. అయినా ఒక్కోసారి అనిపిస్తూంటుంది, విన్నన్నాళ్ళు విని, ఎప్పుడో ఎదురుతిరిగితే ఏం చేస్తాముట?నీదారి నువ్వు చూసుకో, నా దారి నాదీ అంటే ఏమిటిట దిక్కు? హాయిగా కూర్చున్న చోటునుండి లేవఖ్ఖర్లేకుండా, ముద్ద దిగుతోంది కదా. ఏదో వేళపట్టున తిండి తిని ఉండొచ్చుకదా. అబ్బే అలా ఉంటే కాపరం ఏమిటీ? అప్పుడప్పుడు కొట్టుకుంటూనూ ఉండాలీ,మళ్ళీ కలుస్తూనూ ఉండాలి. అదేకదండీ జీవితం! ఇదేదోజ్ఞానబోధో, ప్రవచనమో అనుకోకండి ఏదో నాకు తోచింది వ్రాశాను. ఇలాటివన్నీ ఎప్పుడు తెలుస్తాయీ అంటే, అప్పుడప్పుడు, బయటి ఊళ్ళకి వెళ్ళి ఎక్కడో అక్కడ ఉండి, అవతలివాళ్ళ కాపరాలు ఎలా ఉన్నాయో చూస్తే, మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తూంటుంది.

ప్రస్తుతం జరిగిందదే నాకూనూ. ఈమధ్యన మనవైపు వెళ్ళినప్పుడు, మాకు తెలిసిన వారి విషయాలు విన్నప్పుడు, కలిగిన అభిప్రాయం అన్నమాట. ఏదైనా సరే, ఇంకోరితో పోలిస్తేనే కదా తెలిసేది, where we stand అనేది!!వెళ్ళొచ్చిన తరువాత ఓ వారం పదిరోజులుంటుంది, ఆ ప్రయాణ ప్రభావం, ఆహా మనం ఎంతదృష్టవంతులమో, ఓహో మనకలాటి సమస్యలు లేవుకదా అని. మళ్ళీ మొదలు.అలాగని అక్కడే ఉంటే మన సెంటిమెంట్లు తాజాగా ఉంటాయని అనుకోకూడదు. గుంపులోగోవిందా అని మనమూ అలాగే తయారవుతాము.ఎంతైనా స్థలప్రభావం అనోటుంటుందికదా.

ఆతావేతా చెప్పేదేమిటంటే, రిటైరయిన తరువాత ఊరికే కొంప పట్టుకుని కూర్చోకుండా, అప్పుడప్పుడు బయటి ప్రదేశాలకీ వెళ్తేనే కదా తెలిసేది, మన పరిస్థితి ఏమిటో.కానీ ఈ సదుపాయం ఉద్యోగంలో ఉండే వారికి వీలవదు. వాళ్ళ హడావిడేదో వారిదీ. కొట్టుకుంటూంటారు, పిల్లల ధర్మమా అని మళ్ళీ కలుస్తూంటారు. మరీ ఎక్కడో కానీ, విడిపోరు…
విడిపోయారా అంటే beyond economic repairs అన్న మాట…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…

Sakshi

    ఈవేళ ప్రొద్దుటే మా ఇంటివైపు వెళ్ళినప్పుడు ఓ పాత స్నేహితుణ్ణి కలిశాను. అతనితోపాటే ఇంకొకాయనా ఉన్నారు. ఆయనుండేది మా సొసైటీలోనే లెండి.అవీ ఇవీ మాట్టాడుతూంటే, ఈమధ్యన మా CGHS వారు ప్లాస్టిక్కు కార్డుల జారీ విషయం లో, ఓ ఎప్లికేషను ఇస్తున్నారుట. కావలిసిస్తే నన్నూ తీసికోమన్నారు. ఎలాగూ వాళ్ళ ఆఫీసుకెళ్ళి తీసికుందామనే అనుకుంటున్నాను, పోనీ ఇక్కడే దొరికింది కదా అని ఓ కాపీ నేనూ తీసికున్నాను. చిత్రం ఏమిటంటే, మా సొసైటీ లో ఉండే ఆయన దగ్గర ఎప్పణ్ణించో ఉందట, ఎవరితోనూ పంచుకోవాలనిమాత్రం అనుకోలేదాయన. మరీ అవతలివాళ్ళు సుఖపడిపోతే ఎలాగా?That is the bottom line. ఇక్కడ నేనేమో ఏదైనా విషయం నా దృష్టికి వస్తే, కొంపలు మునిగిపోతున్నట్టు బ్లాగులనిండానూ, కనిపించిన ప్రతీ వారితోనూ పంచేసికుంటాను. అదంతవసరమంటారా? నాలో ఏదైనా “లోపం” ఉందంటారా? ప్రతీ వారిలోనూ ఎంతోకొంత “దాపరికం” ఉండాలేమో మరి!! ఒక్కోరి స్వభావాలింతేనేమో…

    ఆమాటా ఈమాటా చెప్పుకుంటూంటే, రైల్వేల్లో Complaint SMS విషయం ఎత్తాను. ఊరుకోవచ్చుగా వెధవబుధ్ధి-కుక్కతోకలాటిది– నాకు తెలిసిందేదో వాగేసేదాకా కడుపుబ్బరం తగ్గదు.మామూలేగా, ప్రభుత్వం చేసే పన్లులలోనూ కొన్ని మంచివీ ఉంటాయి అని ఒప్పుకోడం నామోషీ మరి. వీళ్ళకి జీతాలిచ్చిందీ ఆ ప్రభుత్వమే. ఏ పనీ చేయకుండా మేపుతున్నదీ మళ్ళీ ఆ ప్రభుత్వమే. అయినా ప్రతీదానికీ ప్రభుత్వాన్ని తిట్టడం ఓ ఫాషనూ మరి.నే చెప్పింది ఒప్పుకోరే వాళ్ళు, చివరకి నా సెల్ లో ఉన్న ఎస్.ఎమ్.ఎస్ చూపించి నమ్మించాను.అదేదో one off అంటారే కానీ, ఒప్పుకోడం మాత్రం లేదు.పైగా రైళ్ళల్లో జరిగే “అన్యాయాలూ” లంచాలూ వగైరాల గురించి ఓ లెక్చరూ. వాటిక్కూడా నివారణోపాయాలున్నాయి. వివరాలతో ఓ ఎస్.ఎమ్.ఎస్ పంపితే, వెంటనే యాక్షన్ తీసికుంటారు. కానీ మనకంత తీరికెక్కడ? టిటి చేతిలో డబ్బెట్టాము, బెర్త్ దొరికింది బస్.. “రాత్ గయీ బాత్ గయీ..”.మళ్ళీ Complaint చేసి ఇంకోడి పొట్టమీద కొట్టడం ఎందుకూ అని సెంటిమెంటోటీ.అలాటివాళ్ళు రోడ్లమీద పడి గోలెట్టకూడదు.

   ఇంతలో మొదటాయన పోస్టాఫీసులో తన సేవింగ్స్ ఎకౌంటు మార్చుకోడానికి నాలుగు నెలలనుండి ప్రయత్నిస్తున్నాడుట, ఇప్పటిదాకా జరగలేదూ అన్నారు. మరి PMG కి Complaint చేశావా అన్నాను. ఇంట్లో నెట్టుందికదా దాంట్లో వెదికితే ఫోను నెంబర్లూ అవీ తెలుస్తాయీ, ఓసారి వాళ్ళ దృష్టికి తెస్తే క్షణాల్లో పనైపోవును కదా అంటే, మా సొసైటీలో ఉన్నాయనంటాడూ, ఇదే పనా ఏమిటీ బయటెన్నెన్ని పన్లుంటాయో. అసలు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సరైన టైములో సరీగ్గా పని చేస్తే ఇలాటి సమస్యలే ఉండవూ వగైరా వగైరా జ్ఞానబోధ మొదలెట్టాడు.అవునండీ కరెక్టే.మరి “మనం” ఉద్యోగంలో ఉన్నంత కాలం ఏం చేశామో మర్చిపోతే ఎలాగా? పుట్టింటారి సంగతి మేనమామ దగ్గరా? అసలా గొడవంతా వదిలేయండి, ఏదో PMG దృష్టికి తెస్తే పనైపోతుందని చెప్తే, ఆ రెండో ఆయన పాపం చేద్దామనే అనుకుంటున్నా, ఈ మొదటాయన ఒప్పుకోడే. పైగా ఇద్దరిదీ ఒకే ప్రాంతం లెండి!

   నాకెందుకొచ్చిందీ అనవసరంగా నా బుర్ర పగలుకొట్టుకోడం ఎందుకూ, కొంతమంది స్వభావమే అంత. మనకే ప్రపంచంలో అన్నీ తెలుసూ, అవతలివాళ్ళు ఉత్త తెలివితక్కువ దద్దమ్మలూ అని భావిస్తూంటారు. వాళ్ళ దారిన వాళ్ళని వదిలేయడం ఉత్తమం!

   బైదవే నా “ఆధార్” కార్డు వచ్చేసింది.ఎంట్రీలు సరీగ్గానే ఉన్నాయి. ఇంటావిడది ఇంకా రాలేదు. దీని ఉపయోగం ఏమిటో నాకైతే ఇంకా తెలియలేదు. ఈవేళ సాక్షి పేపరులో చదివిన వార్త చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ చదవండి లేదా పైన పెట్టిన పిడిఎఫ్ చదవండి. ఇదేమిటండి బాబూ, ఏదో నగలు కొట్టేశారూ, సూట్ కేసులు కొట్టేశారూ అని విన్నాము. మరీ ఇలా బస్సులోంచి, పసిపిల్లాడు కిటికీలోంచి జారిపోయాడూ అంటే ఎలాగా? ఏదో ఆ పిల్లాడి అదృష్టం బాగుండి బతికి బట్టకట్టాడు. లేకపోతే ఊహించుకోడానికే ఒళ్ళు గగుర్పొస్తోంది…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Wireless అనుబంధాలు…..

   ఈసారి ప్రయాణం లో మాకు, అంతర్జాలంద్వారా పరిచయమైన ఒకరిద్దరి వ్యక్తులను కలిసే అదృష్టం కలిగింది. అందులో ఒకరైతే మన “కష్టేఫలే” శర్మ గారు.అన్నవరం లో స్వామివారి కల్యాణ కార్యక్రమం పూర్తిచేసికుని, మర్నాడు రాజమండ్రీలో “సురేఖ” అప్పారావు గారిని ఓ గంట బోరుకొట్టి, మర్నాడు మళ్ళీ ఓ ట్రిప్పు వేసికుందామనుకున్నాము. తణుకు లో ఉండగానే, శ్రీ శర్మ గారు ఫోను చేసి, మమ్మల్ని కలవడానికి ఎప్పుడొస్తున్నారూ అన్నారు. అయ్యా, మేము ద్వారపూడి దాకా వస్తే తప్పకుండా , అనపర్తి వచ్చి మిమ్మల్ని కలుస్తానూ అన్నాను. మా కజిన్ తో మర్నాటి ప్రోగ్రాం ఫిక్స్ చేశాము. ద్వారపూడి,బిక్కవోలు, బలభద్రపురం,గొల్లలమామిడాడా వెళ్ళి దైవదర్శనం చేసికుందామనిన్నూ, వీలుంటే తిరుగుప్రయాణం లో ఆత్రేయపురం మీదుగా నిడదవోలు వెళ్ళి, రాత్రికి కొంపకు చేరేటట్టు.

   ప్రొద్దుట వెళ్ళే రూట్ లో మధ్యాన్న భోజనం ఎక్కడ చేయాలో తెలిసింది కాదు. ఓసారి శర్మగారికి ఫోను చేసి స్వామీ మా కార్యక్రమం ఫలానా, అనపర్తికి ఎప్పుడు రాకలమూ అన్నాను. ఆ లెఖ్ఖా ఈ లెఖ్ఖా వేసి భోజనానికి పిలవకపోతారా అని. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారూ, మరీ ఇలా నిస్సిగ్గుగా చెప్పేటప్పటికీ? ఆంధ్రదేశం వదిలి 50 ఏళ్ళవుతున్నా, పాతకాలపు ఆంద్ర లౌక్యాలు ఇంకా వదల్లేదు మరి, ఏం చేస్తాను? అనుకున్నట్టే పాపం ఆయనకూడా, మీ దైవదర్శన కార్యక్రమాలు పూర్తిచేసికుని, మధ్యాన్న భోజనానికి మా ఇంటికి వచ్చేయండీ అన్నారు. మరీ అడగ్గానే ఒప్పేసికుంటే, వీడేమిటీ మరీనూ అనుకుంటారేమో అని, “ఎందుకులెండి మీకు శ్రమా, ఓసారి కనిపించేసి వెళ్తామూ, పైగా మేము నలుగురం, డ్రైవరు అదనం”
అని ఓసారంటే ఓసారే చెప్పాను. మరీ నొక్కివక్కాణిస్తే, “పొన్లెండి, మీరు మరీ అంత మొహమ్మాట పడుతూంటే, వదిలేద్దాము…” అని ఆయనంటే వదిలేది నా రోగం... ఏదో ఒకటికి రెండుసార్లు అడిగించుకుని మొత్తానికి ఏదో ఆయన్నిoblige చేస్తున్నట్టుగా సౌండిచ్చి ఒప్పేసుకున్నాను! పైగా మా ఇటావిణ్ణి “చెల్లెమ్మా” అనికూడా చుట్టరికం కలుపుకున్నారాయే!
కానీ వారింటికి వెళ్ళినతరువాత తేలిందేమిటయ్యా అంటే, నేను ఆయన్ని oblige చేయడం కాదు, ఆయనా, వారి ధర్మపత్నీ, కోడలూ మాకుచేసిన మర్యాదలు చూస్తే, ఆయన మమ్మల్ని oblige చేసినట్టు, వారి పరిచయభాగ్యం కలగడానికి.

   తిరిగొచ్చేటప్పుడు ఫలానా జంక్షన్ లో ఆగండీ, నేనొచ్చి మిమ్మల్ని కలిసి ఇంటికి తీసికెళ్తానూ అన్నారు. ఆయన చెప్పినట్టే ఆగాము. ఓసారి కారులోంచి బయటకొచ్చి చూశాను, ఎవరైనా వచ్చి పలకరిస్తారేమో అని.ఆయనెలా ఉంటారో తెలియదాయే, ఇంతలో ఓ పెద్దాయన వచ్చి, పలకరించారు. రూపం, వేషం చూస్తే ఈయనే అయిఉంటారూ అనుకుని, ఆయన వెనక్కాలే వెళ్ళాము. అంతా సంప్రదాయ పధ్ధతిలో, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చి వగైరా ..వగైరా…ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుని భోజనానికి లేచాము.” బాబయ్య గారూ, పంచె కట్టుకుంటారా..” అని వారి కోడలు అడగడం తో, వామ్మోయ్ అంత ఆచారం లేదు తల్లీ అని చెప్పేసి,భోజనానికి సెటిల్ అయిపోయాము. శర్మగారేమో, మాస్టారూ బాత్రూం కి వెళ్ళాలా అంటే, మళ్ళీ స్నానం అదీ చేయమంటారేమో అని భయపడి పోయి, అలాటిదేదీ అవసరం లేదన్నాను. మరి ఇందుకే అంటారు ఊరికే ఏవేవో ఊహించేసికోకూడదు.శుభ్రంగా షడ్రసోపేతంగా పెట్టిన భోజనం తిని , “అన్నదాతా సుఖీభవా” అనుకోకుండా, ఇలాటి పిచ్చి పిచ్చి వ్రాతలెందుకూ అంట?

    శ్రీ శర్మ గారింట్లో మాకు జరిగిన మర్యాదలూ, వారూ,వారి కుటుంబమూ చూపించిన అభిమానమూ, మేము జీవితంలో మర్చిపోలేము. ఆయనకీ, మాకూ ఉన్నది Wireless అనుబంధం మాత్రమే. కానీ దగ్గర బంధువుల దగ్గరకూడా లభించని ఆప్యాయత మేము పొందకలిగాము.వారి మనవరాలిని కూడా చూసివెళ్తే బావుండేది కానీ, వెనక్కి వెళ్ళే హడావిడిలో ఆగలేకపోయాము. మా మరదలు కూడా ఏదో చుట్టరికాలు కలిపేసింది… దానితో ఇద్దరు ముత్తైదువలూ చెరో చీరా సంపాదించేశారు… ( ఎంతైనా “పుట్టింటి” వారు కదా!), నాచేతిలో, నా అభిమాన రచయిత ముళ్ళపూడి వారి పుస్తకం పెట్టి, వీడ్కోలు తీసికున్నారు. ఈ ట్రిప్పులో మేము కలకాలం గుర్తుపెట్టికునే పరిచయం ఇది.GOD BLESS THEM…..

%d bloggers like this: