బాతాఖానీ ఖబుర్లు –45


    మా అమ్మాయి పెళ్ళిచెసి, పిల్లని అప్పగించెసిన తరువాత అంతా శూన్యం అయిపోయినట్లనిపించింది.భగవంతుని దయ వలన అత్తవారింట్లో అమ్మాయి ఎలా ఉంటుందనే శంక. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ లెదు. అమ్మాయి మా దగ్గర లేకుండా ఉండడం నాలుగు సంవత్సరాల క్రితమే, అంటే తను ఇంజనీరింగు చదవడానికి, పూణే వెళ్ళినప్పుడే ప్రారంభం అయింది.ఎప్పటికైనా అమ్మాయి పరాయి ఇంటికి వెళ్తుందని తెలుసును, అన్నింటికీ సిధ్ధపడతాము, అయినా అదో ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్, వచ్చేస్తుంది.ఇది ప్రతీ తండ్రీ ఎప్పుడో అప్పుడు అనుభవించాల్సిందే. ఈ సందర్భంలో శ్రీ శంకరమంచి సత్యం గారు వ్రాసిన అమరావతి కథలలో ” అంపకం “ అనే కథ చదవండి.ఇంకో ఇంటినుండి మనం ( అంటే ఈ తండ్రులూ అనే ప్రాణులు) ఓ అమ్మాయిని తెచ్చేసుకున్నాము కదా, దానికి ఈ రూపంలో జరిమానా అన్నమాట !! అయినా జీవితం సాగుతూనే ఉంటుంది. ఈ మధ్యన పూణే వెళ్ళినప్పుడు మా అమ్మాయితో ఓ రెండు గంటల పాటు ఖబుర్లు చెప్పే అవకాశం వచ్చింది, మా ఇంటావిడ చెప్పినట్లుగా, ఈ పన్నెండు సంవత్సరాలలోనూ, తనూ, తన కాపురమూ ఎలా ఉన్నాయని అడగవలసిన అవసరం కలగలెదు–మా అల్లుడూ, అతని తల్లితండ్రులూ అంత మంచివారు . గాడ్ బ్లెస్ దెం .

    అమ్మాయి ఇంజనిరింగు చదవడానికి పూణే వెళ్ళిపోయినా, మా అబ్బాయి మా దగ్గరే ఉండడం బట్టి ఎక్కువగా పిల్లలు దూరం అయేరనిపించలేదు. దేముడి దయ వలన మా అబ్బాయి కూడా క్లాస్ 12 లో, మరీ వాళ్ళ అక్క, బావగార్లలాగ 98, 99 % లు తెచ్చుకోలేదు. 95–96 % తో సరిపెట్టేశాడు. నాకైతే పూణే లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగులోనే ( మా అమ్మాయి చదివిన కాలెజీ ) మా అబ్బాయి కూడా చదివితే బాగుంటుందనిపించింది. కాంప్టీషన్ వలన తనకి కావలిసిన సబ్జెక్ట్ లో దొరకలెదు. అయినా చేరాడు ( బహుశా మా కోరిక తీర్చడానికేమో).

    1997 జూలై కల్లా మా అబ్బాయీ, అమ్మాయీ వాళ్ళదారిన వాళ్ళు వెళ్ళిపోయారు,ఒకళ్ళు కొత్తజీవితం ప్రారంభించడానికీ, రెండో వాళ్ళు పై చదువులకీ. ఇంక మేమిద్దరమూ, మా అమ్మగారూ మిగిలాము వరంగాం లో.పిల్లలిద్దరినీ ఓ సరైన గాడిలో పెట్టామనే అనుకుంటాము. అబ్బాయి విషయం లోనే కొంచెం భయ పడ్డాము– చిన్నప్పటినుండీ, అంటే లోయర్ కెజీ నుండి, క్లాస్ 12 దాకా పూర్తి గ్రామీణ వాతావరణంలో చదివాడు, పూణే లాంటి పేద్ద నగరంలో ఎలా నెగ్గుకొస్తాడా అని. హాస్టల్లో సీట్ దొరకకపోవడం వల్ల, బయట రూం తీసికోవాల్సి వచ్చింది. ఎలాగైనా అమ్మాయితో ఒకలాగ ఉండేది, అబ్బాయితో ఇంకోలాగ!! ఏది ఏమైనా భగవంతుడి దయతో, అబ్బాయి కూడా హాస్టల్లో సీట్ సంపాదించాడు. . అమ్మాయి టైములోలాగానే, ప్రతీ నెలా పూణే వెళ్ళేవాడిని, శలవలకి తను వచ్చేవాడు. ఒకసారి వచ్చినప్పుడు, తనతో చెప్పాను, బ్లాక్ ఎండ్ వైట్ టి.వీ, మార్చి,కలర్ ది తీసుకుంటున్నానూ అని.ఇంటావిడతో చెప్తే వద్దంటుందేమోనని భయం. చెప్పకుండా వెళ్ళాను. మాఇంటావిడ వచ్చి ‘ మీ నాన్నగారు ఎక్కడరా అని అడిగితే నాకు తెలియదూ అన్నాడు. సాయంత్రం ఓ టైము గడిచేసరికి ఇంక ఖంగారు పుట్టింది, ఎప్పుడూ చెప్పకుండా బయటకు వెళ్ళరూ, ఏమైపోయానో అని.మా ఫ్రెండు డాక్టరుగారింటికి వెళ్ళి, అన్ని చోట్లా వెదకడం మొదలెట్టారు. ఇంతట్లో ఓ తెల్ల వ్యాన్ లో ఎల్.జి. వాళ్ళ కలర్ టి.వీ .పెట్టుకుని ఇంటికి వచ్చాను. ఆ తెల్ల వ్యాన్ ఎదో ఏంబ్యులెన్స్ అనుకొని ఇంకా ఖంగారు పుట్టిందిట. సంగతి తెలిసికొని మా ఇంటావిడా, డాక్టరుగారూ చివాట్లు పెట్టారు.

    1998 లో మా అమ్మాయికి సూడిదలు తీసికొని బొంబాయి వెళ్ళాము. ఆ ముహుర్తం కూడా మా మామగారే పెట్టారు. సూడిదల కార్యక్రమం పూర్తిచెసికునే సరికి,

ఫోన్ వచ్చింది– మా మామగారు సడెన్ గా హార్టెటాక్ వచ్చి స్వర్గస్తులయ్యారని.వెంటనే విశాఖపట్నానికి ప్రయాణం అయి వెళ్ళాము. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా చాలదు. ఆయన సహాయమే లేకుంటే తణుకు లో ఇల్లు కట్టుకునేవాడిని కాదు. ఎంత నమ్మకం లేకపోతే అంతంత డబ్బు ముందుగా ఖర్చు పెట్టగలుగుతారు? అంటే డబ్బు సహాయం చేశారు కదా అని ఆయనెదో చాలా మంచివారనడంలేదు, స్వతహాగా ఆయన స్వభావమే అంత..బహుశా ఆయన జీవించి ఉంటే ఆయనమీద గౌరవంతోనైనా , తణుకులో ఇల్లు ఉంచుకునేవాడినేమో. అక్కడే కాకుండా, రాజమండ్రీ లో కూడా ఓ ఫ్లాట్ బుక్ చేసికొని ఉంచి, చాలా భాగం డబ్బు కట్టేశాము. ఇంతలో నాకు పూణే ట్రాన్స్ఫర్ వచ్చింది.

Leave a comment