బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–ఎప్పుడూ కలలోకూడా అనుకోలేదు….


నేను గత ఆరు నెలలనుండీ , ఈ మాధ్యమానికి దూరంగా ఉండాల్సొచ్చింది.. అలాగని పూర్తిగా రాయడం మానలేదూ.. ఫేస్ బుక్ లో రాస్తూనే ఉన్నాను.. కానీ నా బ్లాగు మిత్రులు చాలామంది అక్కడ కనిపించలేదు.అలాగని , మిమ్మల్నందరినీ నా ‘ బారి’ నుండి తప్పించుకోనిస్తానా? అందుకనే మళ్ళీ వచ్చేసాను.. భరించాలి మరి  సరేనా ?..

   1940 ల్లో అనుకుంటా.. ప్రఖ్యాత తెలుగురచయిత శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, “ బారిస్టర్ పార్వతీశం” అని ఒక నవల రాసారు..అందులో తను మొదటిసారి లండన్ వెళ్ళడం, అక్కడ తన అనుభవాలు రాసారు(ట).. ‘ట’ అని ఎందుకన్నానంటే,అప్పటికి నేనింకా ఈ భూమ్మీదకి రాలేదు..నేను పుట్టడం 1944 లో కదా మరి..మనవైపు ఓ అలవాటుంది.. పిల్లలు పుట్టగానే వారి జాతకం రాయిస్తూంటారు..నాకు చదవడం రాగానే ఈ విషయం తెలిసి, సరే అని..నా భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటుందే కదా.. చూస్తే..” ఈ జాతకం లో విదేశయానం అని స్పష్టంగా ఉంది..” అని రాసారు..ఎప్పుడు పెద్దయేది, చదువు పూర్తయేదీ..చదవగానే.. నా మాటెలా ఉన్నా, ఇంట్లోవాళ్ళకి మాత్రం ఎంతో సంతోషం వేసిందిట. పైగా అప్పుడే మొక్కపాటి వారి నవల ప్రభావంలో కూడా ఉన్నారేమో.. “పిల్లాడు ప్రయోజకుడవుతాడూ..” అని..( అవలేదు ..అది వేరేవిషయమనుకోండి)..ఆ పుస్తకానికీ, మీ జాతకానికీ, మమ్మల్నందరినీ ఇంతలా ‘బోరు’ కొట్టడానికీ సంబంధం ఏమిటీ..అని అందరూ అనుకోవచ్చు.. సరీగ్గా అక్కడకే వస్తూంట..పై మూడు విషయాలకీ లంకె ఉన్నట్టు మీరే అంటారు పూర్తయాక..

2005 లో రిటైరయాక  చూస్తే, ఎక్కడ చూసినా, విదేశాలకి వెళ్ళేవారు విపరీతంగా పెరిగిపోయారు. చేతిలో ఏదో ఒక ‘ కళ’ ఉన్న ప్రతీవారికీ బయటకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చాయి.. ఏ కళా లేకపోయినా, దేశం లోని చాలామంది “ అమ్మలు” వారివారి పిల్లల పురుళ్ళకో, మరోదానికో వెళ్ళేవారు. తల్లి వెళ్తే, తండ్రిని ఏం చేయడం? Buy One Get One  లో లాగ, ఈ తండ్రిగారుకూడా వెళ్ళేవారు. పైచదువులకైతే చెప్పాల్సిన అవసరమే లేదూ.. మన దేశం లోఉండే రూల్స్  ధర్మమా అని, పైచదువులకి, ఎంత తెలివితేటలున్న విద్యార్ధికైనా, సీటు వస్తుందో రాదో తెలిసేది కాదు.. పైగా ఈ విదేశీ చదువులకి కూడా, బాంకులు అప్పులు ఇవ్వడం ప్రారంభం అవడంతో అవకాశాలు వచ్చిన విద్యార్ధులందరూ, విదేశాల వైపే మొగ్గుచూపేవారు. ఆతావేతా జరిగిందేమిటంటే, పూజలు చేయించే పురోహితులదగ్గరనుండి, పై చదువులకి వెళ్ళే విద్యార్ధులదాకా, విదేశాలకి వెళ్ళడమే.

ఎవరిని చూసినా, అమెరికా , ఇంగ్లాండ్ కబుర్లే.. అసలంటూ వెళ్ళినా, వెళ్ళకపోయినా, అందరిలాగా నాక్కూడా ఓ  Passport  ఉంటే బావుంటుందనిపించింది…పైగా అదో స్టేటస్ సింబలోటీ.. ఏదైనా ID  అడిగినప్పుడు చూపించడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగూ లేదాయే,మరీ రేషన్ కార్డ్ చూపించడానికి నామోషీ… ఈ Passport చూపిస్తే, మన స్థాయి కూడా పెరుగుతుందీ అనే ఓ ఆశ..అప్పటికింకా ‘ఆధార్’ కార్డులు రాలేదాయే..పాస్ పోర్ట్ తీసుకునేందుకు ఇన్ని ‘ సమర్ధింపులా’ అనిపించొచ్చు.. ఏంచేయనూ?

 ఏదొ మొత్తానికి దగ్గరేఉన్న ఓ ఏజంట్ ని పట్టుకుని ‘పాస్ పోర్ట్ పర్వం’ ప్రారంభించాను. మరీ ఒక్కడికీ ఏమిటీ అనుకుని, నా భార్యకి కూడా apply  చేసాము.అదేదో సామెత చెప్పినట్టుగా.. మా పనికి అన్నీ ‘విఘ్నాలే’.. మొట్టమొదట, నాభార్య , SSLC Book ( జన్మతిథి దాఖలా) లో “ పరిమి’ అని ఉమ్దీ..’ భమిడిపాటి’ ఎలా అయిందీ అంటూ.. అప్పటికి పెళ్ళై 33 సంవత్సరాలయి, ఇద్దరు ఎదిగొచ్చిన పిల్లలకి , తల్లి తండ్రులమయాక, మా “ శీలాల’ మీద ప్రశ్నార్ధకం వచ్చింది.. కారణం ఈరోజుల్లోలాగ, మారోజుల్లో ఈ సర్టిఫికేట్లూ, రిగిస్ట్రేషన్లూ ఉండేవి కావాయె.. అన్నవరం సత్యనారాయణస్వామి సన్నిధి లో , సశాస్త్రీయంగా జరిగిందన్నా లాభం లేకపోయింది.. అదృష్టవశాత్తూ, అప్పటి శుభలేఖ, మా పినమామగారు తీయించిన ఫొటో ( తాళి కడుతూండగా) దొరగ్గా, వాటిని జతచేసి , ఓ affidavit చేసాక , మొత్తానికి మావివాహబంధం చట్టపరంగా అంగీకరించి, ఎప్లికేషన్ అంగీకరించారు…అంతా ఓ పేద్ద కథా. ఎన్నో ఎన్నెన్నో విఘ్నాలు అధిగమించి. చివరికి పాస్ పోర్ట్ లు చేతికి వచ్చేసరికి, ఒక రోజు తక్కువగా ఏడాదీ పట్టింది ( 363 రోజులు). మొత్తానికి సాధించాను… ఆ పాస్ పోర్ట్ చూసేసరికి ఎంత ముచ్చటేసిందో….

మొక్కపాటి వారు రాసినంత అద్భుతంగా అయితే నేను రాయలేను..పైగా నా వ్యాస పరంపర ఏదీ “ ట్రావెలాగ్” లాగ కూడా ఉండకపోవచ్చు.. ట్రావెలాగ్ లలోసాధారణంగా, మనం ఎక్కడికైనావెళ్ళినప్పుడు, అక్కడి వివరాలు, ఖర్చులూ, వగైరాలతో వివరంగా రాస్తారు..భవిష్యత్తులో ఎవరైనా వెళ్ళాల్సినా, ఈ ట్రావెలాగ్ చదివితే అన్నీ తెలుస్తాయి. కానీ , నేను ఇటుపైరాసే వ్యాసాల్లో, మిగిలిన వాటి మాటెలాఉన్నా, ఖర్చులూ, ఖరీదులూ మాత్రం నాకు తెలియదు.. కారణం—వీసా ఫీజునుండి, మేము ముంబయి తిరిగివచ్చేదాకా, మాచేత ఓఖ్ఖ పైసా ఖర్చు చేయనీయలేదు, మా అల్లుడు,అమ్మాయీనూ.. పైగా ఎప్పుడైనా అడిగే ధైర్యం చేద్దామన్నా, ఆ అవకాశం కూడా రానీయకుండా, ఒకలా చెప్పాలంటే “ మమ్మల్ని పువ్వుల్లో పెట్టి ,పువ్వుల్లోనే తిరిగి పంపించారు” పిల్లలు. అంతా మా పూర్వజన్మసుకృతం, భగవంతుడి దయా అని నమ్ముతాము .

(సశేషం)

#OFFTOLONDON–1

3 Responses

  1. I don’t know why my telugu reply is not publshed.. Same thing happened with my sister’s blog also.so i am trying with English reply.

    Like

  2. Happy Birthday Sir 🎉

    Like

Leave a comment