బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” శరద్రాత్రులు”…

    ” అసలు రోజుకు ఎన్ని గంటలు పనిచెయ్యాలె”

   “ప్రొద్దున్న తొమ్మిది గంటలనుండి సాయంత్రం అయిదు గంటల దాకా డ్యూటీలో ఉండాలె”

   ” చేయవలసిన పనులు ఏమిటి?”

   “చాలా వరకు నా ముందు నుంచోడం”

   “నుంచుని?”

   ” నుంచుని నను చూస్తూండడమే”

   “ఇంకా”

   “నాకు పూలు తెచ్చిపెట్టడం, నేను అలంకరించుకుంటూంటే నాకు తోడ్పడటం”..

    ఇలాటి సంభాషణలు విని కానీ, చదివి కానీ ఎన్ని సంవత్సరాలయిందో కదూ. ఈరోజుల్లో ఇంత సావకాశంగా ఉండే అవకాశం ఎక్కడిదీ? ఎక్కడ చూసినా ఉరకలూ పరుగులూనూ. అసలు ప్రొద్దుటే లేవడమే కష్టం, దానికి సాయం భర్తతోపాటు ఉద్యోగానికి వెళ్ళే భార్య కి, పిల్లల్ని లేపి వాళ్ళని స్కూలుకి పంపడం, భర్తకి ప్రొద్దుటే టిఫిను చేసి, తనూ తిని, ఆఫీసులో మధ్యాన్న భోజనానికి ఓ లంచ్ బాక్స్ తయారుచేసికుని, ఆదరాబాదరాగా వెళ్ళడం. సాయంత్రం మళ్ళీ షరా మామూలే. ఇంత హడావిడిలోనూ…

   “ఆమె చెక్కిళ్ళు ఆ వెన్నెలని తినేస్తున్నాయి.ఆమె పెదవిపై కెక్కి నాట్యం చేస్తున్న ఎరుపును తెలుపు చేయాలనివెన్నెలలు ప్రయత్నం చేశాయి. వెన్నెల ప్రవాహంగా వచ్చేసరికి చీకట్లు కొన్ని పారిపోయివచ్చి ఆమె గడ్డం క్రింద దాక్కున్నాయి.”

   ఈరోజుల్లో ఆ వెన్నెలలెక్కడా, చెక్కిళ్ళెక్కడా? అగ్గిపెట్టెల్లాటి ఎపార్టుమెంట్లలో వెన్నెలలు రావడానికి అవకాశం ఎక్కడ?

   “ ఆవిడ రాణి అయి మూడు నెలలు అయిఉంటుంది.ఆమె మొగములో ఇంకా కొత్త పెళ్ళికూతురుతనం పోలేదు. మాటిమాటికీ సిగ్గుపడేది…సిగ్గుపడిసిగ్గుపడి చివరకు తలవంచుకుని తేనె వాక్కులు జార్చేది..“— ఇలాటివన్నీ ఏవో రచనల్లో చదవడమో, ఎన్నో ఏళ్ళ క్రితం తీసిన ఏ సినిమాలోనో యూట్యూబ్ తీసికుని చూడ్డమే. మహా అయితే ఏ యాష్ ఛోప్రాయో తీసిన సినిమా టీవీలో వచ్చినప్పుడు చూడడమే.
ఇప్పటి రొజుల్లో పెళ్ళికూతురిలో సిగ్గూ, కొత్తతనమూ మాట దేముడెరుగు, … ఎందుకులెండి.. మనోభావాలు నొచ్చుకుంటాయి.. మన అభిప్రాయాలు వ్రాస్తే…
ఇంకో సంఘటనలో కొత్తపెళ్ళికూతురూ, పెళ్ళికొడుకూ వారి అక్క వరసావిడ ఇంటికెళ్ళినప్పుడు పేర్లు చెప్పుకోకుండా ఇంట్లోకి రానివ్వనన్నప్పుడు జరిగిన హడావిడీ అవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపిస్తున్నాయా?

    దంపతులమధ్య ఉండవలసిన అవగాహనా, వారి మధ్యనడిచే శృంగారం పనస తొనల్లాటి వివరణతో చెప్పాలంటే శ్రీ మునిమాణిక్యం నరసింహరావుగారు సృష్టించిన “కాంతం” పాత్ర అసలు ఎందుకు సృష్టించారూ అన్నది తెలుసుకోవాలి. అది తెలియాలీ అంటే ఆయన 1945 లో వ్రాసిన “ శరద్రాత్రులు” అనే నవలిక చదవాలి. అసలు ఆ నవలికకి ఆ పేరే ఎందుకు పెట్టారూ అన్నది కూడా తెలిసికోవాలంటే ఆ శరద్రాత్రులు చదవొద్దూ మరి? ఇంకెందుకూ ఆలశ్యం.. చదివేయండి.. అలా..అలా..అలా.. పాత మధురజ్ఞాపకాల్లోకి వెళ్ళి, ఒకసారి రీఛార్జ్ చేసేసికోండి మీ బ్యాటరీలు…శరద్రాత్రులు మునిమాణిక్యం కండిషన్లు మామూలే… పుస్తకం తెరుచుకోడంలేదని ఊరికే ఖంగారు పడిపోకండి. HAPPY READING.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మొత్తానికి నన్ను floor చేసేసింది మా ఇంటావిడ…

    ఇన్నేళ్ళగా అంటే అక్షరాలా 40 సంవత్సరాల 3 నెలలుగా తట్టనిది ఈసారి ఎలా తట్టిందో కానీ, మొత్తానికి నన్ను పట్టేసింది.ప్రతీ ఏడాదీ వేశవి శలవల్లో ప్రతీ తెలుగువారి ఇంటా, క్రమం తప్పకుండా జరిగేదేమిటయ్యా అంటే “ఊరగాయలు” పెట్టడం. ఇదివరకటి రోజుల్లోలా కాకుండగా, ఇప్పుడు ప్రతీచోటా ఈ ఊరగాయలు దొరుకుతూనే ఉన్నాయి. ఏదో కొంతకాలం క్రితందాకా ఆ రామోజీ గారి “ప్రియా” పచ్చళ్ళే దిక్కు, కానీ కాలక్రమేణా చిన్న చిన్న గ్రామాల్లో కూడా, ఈ ఊరగాయల తయారీ ఓ cottage industry లా తయారైపోయింది. ఇదివరకటిలాగ ఆవాలూ, కారం, మెంతులూ, ఉప్పూ, నూనె అంటూ బజారుకెళ్ళి తెచ్చే ఓపికెక్కడుంటోంది ఇప్పుడూ? పోనీ అలాగని మిగిలినవాటిలాగ, ఏదో ఇంట్లో చేస్తే ఖర్చు తక్కువా అనడానికీ వీలులేదాయె. ఈమాత్రందానికి ఊరికే తాపత్రయాలెందుకూ, హాయిగా మార్కెట్ కి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చెసికుంటే గొడవొదిలిపోతుంది. పైగా వాటిల్లో వివిధ రకాలైన పచ్చళ్ళోటీ. అయినా అనుకుంటాం కానీ, ఈ రోజుల్లో ఇళ్ళల్లో ఊరగాయలు ఎవరికోసం పెట్టాలీ, ఈ కాలం పిల్లలు ప్రతీదానికీ so..much oil !! Oh my God.. అని నోరు వెళ్ళబెట్టేవాళ్ళే, ఆ తెరిచిన నోట్లో ఓ ఆవకాయ పెచ్చు పడేస్తే తెలుస్తుంది!!. పైగా కొత్తవకాయలో హాయిగా నెయ్యి వేసికుని తినే “మజా” వీళ్ళకెలా తెలుస్తుందీ? నెయ్యంటేనే ఆమడదూరం పారిపోతారు.. అదేమిటో fat పెరిగిపోతుందిట.కొలెస్ట్రోలో ఏదో పెరిగిపోతుందిట. ఇన్నేళ్ళూ మేమంతా ఈ ఊరగాయలూ, నేతులూ వాడకుండానే ఉన్నామా ఏమిటీ, చిత్రం కాపోతే. అసలు తినొద్దని ఏ డాక్టరూ చెప్పలేదు, కొద్దిగా మితంగా తినమంటారు. అయినా సరే ఈరోజుల్లో బర్గర్లకీ, పిజ్జాలకీ,సబ్ వే లకీ ఉండే విలువ ఆ ఆవకాయకి లేదు. ఏం చేస్తాం? అయినా “తెలుగు న్యూసు పేపరు” ఇంట్లో లేకపోతే ఎంతతలవంపో, అలా ఆవకాయ ఇంట్లోలేకపోతే అంత తలవంపు ఈరోజుల్లో. ఎందుకంటారా, ఈ రోజుల్లో నగరాల్లో పనిచేసే కుర్రకారుకి, తెలుగువారికంటే పరభాషా స్నేహితులే ఎక్కువాయె, ఎప్పుడో వాళ్ళని ఏ భోజనానికో పిలిచినప్పుడు వాడు अर्‍ऍ भाय आंध्रा पिकिल नही है क्या... అంటాడేమో అని భయం మరి.వాడుకూడా ఎక్కడో నెట్ లో చదివుంటాడు, ఆంధ్రావాళ్ళకి ఆవకాయ చాలా ప్రీతీ అని. అలా క్రమక్రమంగా ఈ “ఆవకాయ” మనకోసం కంటే బయటివాళ్ళకోసం ఓ status symbol గా తయారయింది. ఈనాటి పిల్లలంతా వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో పెట్టిన ఊరగాయలతోనే పెరిగారు. ఇప్పుడే ఈ సుకరాలన్నీనూ.

   ఇంత గొడవ జరుగుతున్నా ప్రపంచంలో మా ఇంటావిడ లాటి ప్రాణులు కొంతమందుంటూనే ఉంటారు. మాయదారి తాపత్రయాలూ, భవబంధాలూ అంటూ, ఊళ్ళోనే ఉండే కూతురికీ, కొడుక్కీ ప్రతీ ఏడాదీ క్రమం తప్పకుండగా ఈ ఊరగాయలు పెట్టడం, “వాహ్ మమ్మీ” అంటూ కూతురూ అల్లుడూ, “వహ్వా అమ్మా” అంటూ కొడుకూ డయలాగ్గులు చెప్పడం. కొడుకుతో పాటు కోడలనదా అనకండి, ఈ ఆంధ్రా కోడళ్ళకి ఆంధ్రదేశం నుంచి వాళ్ళ అమ్మలు తెచ్చే ఊరగాయలే నచ్చుతాయి.ఎంత చెప్పినా అమ్మ అమ్మే.. అత్త అత్తే…ఆతావేత తేలేదేమిటంటే, అబ్బాయికి ఇచ్చిన ఊరగాయ, ఏడాది పొడుగునా, మేము అక్కడకి వెళ్ళినప్పుడు వేసికోవడమే. పాపం మా నవ్య, అగస్థ్యలకి మాత్రం, నేను వెళ్ళేనంటే పండగే. నాతోపాటు నెయ్యేసికుని, ఆవకాయముద్ద తప్పకుండా తింటారు.

    అసలు విషయానికొస్తే, నా “ఆవకాయ” గొడవలు గత మూడేళ్ళనుండీ వ్రాస్తూనే ఉన్నాను, ప్రతీ ఏడాదీ ఎండాకాలం వచ్చిందంటే నా ప్రాణం మీదకొచ్చేది. ఇక్కడేమో, మా ఇంటావిడ specifications కి సరిపడే ఆవపిండీ, కారం దొరకవుట, ఆంధ్రదేశం నుంచి తెప్పించాలంటుంది.అప్పుడెప్పుడో మా రాజమండ్రీ కాపరంలో ఓ ఏడాది అక్కడపెట్టినప్పటినుంచీ, ఆ రుచే కావాలంటుంది. ఈ ఆవకాయకోసం ప్రతీసారీ ఆంధ్రదేశం వెళ్ళాల్సొస్తే ఈ ఆవకాయ “ఖర్చు” తడిపిమోపెడవుతుంది.అయినా ఎలాగోలాగ ఎవరిచేతో తెప్పించి మొత్తానికి ఆవపిండీ, కారం అక్కణ్ణుంచి తెప్పింఛేటట్టూ, మెంతులూ, ఉప్పూ, ఆయిలూ ఇక్కడ కొనేటట్టూ ఓ ఎగ్రీమెంటుకు వచ్చి, అలా కానిచ్చేస్తున్నాము.పాపం భాగ్యనగరంలో ఉండే మా వియ్యాలారికి ప్రతీ ఏటా ఇదో ఎగస్ట్రా పని. ఈ సారేమో ఈ నెలలో శ్రీవంశీ గారిని కలియడానికి కార్యక్రమం పెట్టుకున్నాగా, నన్ను ఆహ్వానించిన శ్రీ కృష్ణమోహన్ గారినే, సిగ్గు విడిచేసి అడిగేశాను, ” గురువుగారూ కొద్దిగా ఈ సహాయం చేసిపెడతారా ” అని. కొల్తలు చెప్పండీ అనేసి, ఏ ఎస్ బ్రాండు పప్పునూనె కూడా తెప్పించుంచుతానూ అనేయడంతో, హాయిగా ఒక్కరోజే కదా అని ఓ బ్యాగ్గుతో వెళ్ళేదానికి, ఓ సూట్ కేసు నాకంటగట్టింది మా ఇంటావిడ. మొత్తానికి ఆంధ్రదేశం నుంచి raw material తేవడంతో మొదటి అధ్యాయం ముగిసింది.

    మా ఇంటావిడ మామిడికాయల దగ్గరకొచ్చేటప్పటికి ఏమిటేమిటో “గిన్నెలూ, కొలతలూ” చెప్తుంది.పోనీ ఎన్ని కిలోలో చెప్పమంటే చెప్పదూ, పాతిక్కాయలంటుంది, ఒక్కోసారి పాతిక్కాయలంటే అయిదారు కిలోలూ కాకపోతే క్వింటాళ్ళూ అవుతాయి, మరీ బలవంతపెడితే నాలుగ్గిన్నెలంటుంది. ఏమిటో గోల! పోనీ తననే తీసికెళ్దామా అంటే తను రాదూ నామోషీట, ఏమిటో ఆ భగవంతుడిమీద భారం వేసేసి, నేనే traditional చివాట్లు తింటూ లాగించేస్తున్నాను. ఈసారి ఏమనుకుందో ఏమో పూర్తిగా రూట్టే మార్చేసింది. ఏవో కొలతలు వేసి, ఓ న్యూస్ పేపరుమీద ఆవపిండీ,ఉప్పూ, కారం వేసి, కిందపెట్టేసి నన్ను కలపమంది. పైగా పక్కన నుంచుని, “సరీగ్గా రెండు చేతులతో కలపమన్నానా..” అంటూ గొడవోటీ. నాలుగ్గిన్నెల ముక్కలూ విడిగా తీసి, ఆరారగా successful గా నాచేత కలపబడిన దాంట్లో వేయడం, కొద్దిగా నూనె చేర్చి మొత్తానికి సీసాలో వేయడం, ఈ కార్యక్రమం అంతా పూర్తయేసరికి గంటన్నరా పట్టింది. పట్టదూ మరీ, అక్కడెక్కడో ఆవకాయపిండి, ముక్కా సరీగ్గా కలవలేదూ, నూనె పట్టలేదూ అనడం, మళ్ళీ రెండుచేతులతోనూ కలపమనడం. ఓరి నాయనో ఇంత గొడవుందా ఈ ఆవకాయ పెట్టడానికీ అనిపించింది.

    పోనీ ఇంత శ్రమా పడ్డాడూ, ఓ కాఫీయో, చాయో ఇద్దామనుంటుందా, మధ్యలో తడి తగలకూడదుట. ఈ తడేమిటో కానీ, ఈ ఆవకాయ కలుపుతున్నంతసేపూ నా గొంతుకలో తడి మాత్రం ఆరిపోయింది.అన్నీ పూర్తయినతరువాత అంటుందీ..” ఈ ఏడాది ఆవకాయ ఏమైనా బూజు పట్టిందా, మీదే బాధ్యత..” అని బెదిరింపోటీ.

    నిన్న నెట్ లో ఇంకో బ్రహ్మాండమైన పుస్తకం దొరికింది. 1954 లో శ్రీ మునిమాణిక్యం నరసింహరావుగారు, భార్యాభర్తల సంబంధాల గురించి వ్రాసిన ఇల్లు-ఇల్లాలు.ఆ పుస్తకంలో వ్రాసినవన్నీ అక్షరసత్యాలు. ఇప్పటికే తెలుగువారు చాలా మంది చదివేసుండొచ్చు. ఇంకోసారి చదవండి. ఇంకా చదవనివారు ఓసారి చదివేస్తే తెలుస్తుంది అందులొని మజా. నేను పెట్టిన ఈ pdf తెరుచుకోడానికి టైము పడితే విసుక్కోకండి. ఆమాత్రం సహనం ఉండాలి, అలాటి “ఆణిముత్యం” చదవాలంటే..మొదటి అయిదారు పేజీలూ blank గా కనిపిస్తే ఖంగారుపడి పారిపోకండి. కనిపిస్తుంది మరి, ఎంతైనా పాతపుస్తకం కదా, కొద్దిగా టైము తీసికుంటుంది… Happy Reading...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కావల్సినంత కాలక్షేపం… మీదే ఆలశ్యం మరి…

    గత వారంరోజులనుండీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి “అనుభవాలూ-జ్ఞాపకాలూ” చదవడంలో బిజీ అయిపోయాను(ము), చెప్పానుగా ప్రస్తుతం మాకు “శలవలు” అని. ఆ ముచ్చటా ఇంకెన్నిరోజులూ? 31 వ తారీకుదాకా, తరువాత మా వాళ్ళొచ్చేరంటే మళ్ళీ బిజీ బిజీ..

    ఓ గొడవొదిలింది… ఆ మాయదారి IPL ముంబైవాళ్ళకిచ్చేసి(fixing again?) , కొద్దిగా ఊపిరితీసికోడానికి ఆ మద్రాసీ శ్రీనివాసన్ bought little time. మొదటినుండీ అందరికీ తెలిసిందే ఈ IPL గేమ్సన్నీ ఉత్తి తమాషాలూ అని. అయినా సరే ఎండల్లో పడిపోవడం. పోనిద్దురూ ఎవడిపిచ్చి వాళ్ళకానందం.

    ఈవేళ శ్రీ కందుకూరి వీరేశలింగం గారి 95 వ వర్ధంతిట. ఎప్పటినుండో వారు వ్రాసిన “స్వీయ చరిత్ర” చదవాలని ఉండేది. మా ఇంటావిడ మొత్తానికి నెట్ వెదికేసి పట్టేసింది. మీరు కూడా చదవాలని అనుకుంటే ఇక్కడ నొక్కండి, రెండు భాగాల్లో ఉంది. పనిలోపనిగా ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి ” నా జీవిత యాత్ర” కూడా చదవాలీ అనుకుంటే ఇక్కడ నొక్కేయండి. 900 పైచిలికు పేజీలు, ఆదంతా download చేసి పెట్టాలంటే కొద్దిగా శ్రమతో కూడిన పనాయె. ఆ తిప్పలేవో మీరే పడండి. బైదవే ఈ లింకులు దొరికే చోటికి వెళ్తే ఇంకా మంచి పుస్తకాలు కూడా దొరుకుతాయండోయ్… ఈ స్వియచరిత్రలూ అవీ ఇప్పుడెందుకండీ అంటారా ఇదిగో భక్తి పేజీలు మరి. సరదాగా శ్రీ చాసో గారి వ్యాసం చదవాలనుకుంటారా ఓ నొక్కు ఇక్కడ నొక్కేయండి. కావలిసినంత కాలక్షేపం. ఈవేళ్టికి ఇవి చాలు కదూ…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మాకూ శలవులే…

   ప్రస్తుతం మాకు వేశవి శలవలు. ఏదో ఉద్యోగాలు చేసేవారికి శలవలంటే అర్ధం ఉందికానీ, తొమ్మిదేళ్ళక్రితం రిటైరయి హాయిగా కొంపలో కూర్చుండే మాలాటి వాళ్ళకి శలవలేమిటా అని ఆశ్చర్యపోతున్నారు కదూ, మరి అందులోనే ఉంది అసలు మజా అంతా..రిటైరయిపొయిన తరువాత అంత పనులేముంటాయీ అనుకోకండి. ఇళ్ళలో ఇంకా పదేళ్ళైనా నిండని మనవలూ, మనవరాళ్ళూ ఉంటే తెలిసొస్తుంది పనంటే ఏమిటో? అలాగని వాళ్ళకేమీ నీళ్ళోయడం, బువ్వ పెట్టడం లాటివి కావు, అవి చూసుకోడానికి అమ్మమ్మలూ/నానమ్మలూ ఎలాగూ ఉన్నారు. ఎప్పుడైనా స్కూలుబస్సునుండి దింపుకోవాలన్నా, ఏ క్రెచ్ లోంచో తీసుకురావాలన్నా, తాతయ్యలే కనిపిస్తారు పిల్లలకి.

    అసలు విషయం ఏమిటయ్యా అంటే, మా అబ్బాయీ,కోడలూ, మనవడూ, మనవరాలూ మూడు రోజులక్రితం బయలుదేరి,holiday tour కి వెళ్ళారు. పిల్లలతో పూర్తి సమయం గడపడానికి, ఈరోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, ఇలాటివే కదా అవకాశాలూ మరి. మా ఫ్రెండ్స్ ఎవరితోనో ఈమాట చెప్పినప్పుడు, వారన్నారూ ” మీరుకూడా వెళ్తున్నారా..” అని. మేమెందుకండి బాబూ తోకల్లాగ, వాళ్ళేదో పిల్లలకే పూర్తి attention ఇవ్వాలని వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటే, మళ్ళీ తెయ్యిమంటూ మమ్మల్ని కూడా తీసికెళ్ళూ అంటే అసలు అందులో అర్ధం ఉందా? ఇలాటివి తల్లితండ్రులే అర్ధం చేసికుని, పిల్లలు ఏదో “మొహమ్మాటానికి” అడిగినా, ” మాకు అంతంతదూరాలు తిరిగే ఓపిక లేదు నాయనా..” అని సున్నితంగా చెప్పేస్తే, మన గౌరవం మనకీ మిగులుతుంది, వాళ్ళకీ ఈ extra baggage గురించి బాధా ఉండదు. ఎంతంత రిజర్వేషన్లూ, బుకింగులూ చేసికున్నా, ఎక్కడ ఉండే శ్రమ అక్కడుంటుంది. ఈ ప్రయాణాల్లో తినే తిండీ,త్రాగే నీరూ ఒక్కొక్కప్పుడు, ఈ పెద్దాళ్ళకి పడక, ఏదో అనారోగ్యం కలగొచ్చు. వీటికి సాయం ఆ ప్రదేశాల్లో కూడా వీరు చూడాలనుకున్నవి ఆ పిల్లలకి నచ్చకపోవచ్చు, వారికిష్టమైనవి వీళ్ళకి ఎందుకూ ఇప్పుడూ అనిపించొచ్చు.ఏదో తేడా వచ్చి ప్రయాణం అంతా మూతిముడుచుక్కూర్చోడం కంటే హాయిగా ఇంట్లోనే కూర్చోడం సుఖం. అంతగా వెళ్ళాలీ అనుకుంటే విడిగా ఈ భార్యాభర్తా వాళ్ళు చూడాలనుకున్న ప్రదేశాలకి వెళ్ళడం. అప్పుడు మాత్రం ఆ తిండీ, నీరూ గొడవలుండవా అంటారేమో, ఉంటాయి ఎందుకుండవూ, ఓ వయస్సు వచ్చినతరువాత ఇలాటివి తప్పుతాయా? కానీ తేడా ఏమిటీ అంటే, ఇక్కడ శ్రమ పడేది ఇద్దరే భార్యా భర్తానూ, అక్కడేమో నలుగురిని బాధపెట్టాలి. అంతగా ఏ emergency అయినా వచ్చినా, ఓ నాలుగైదుగంటల్లో ఏ కొడుకో, కూతురో వీళ్ళ rescue కి ఎప్పుడూ వస్తారు, ఆమాత్రం ప్రయాణ సాధనాలు ఉన్నాయి ఈరోజుల్లో.

    ఇంకో విషయం ఈ పెద్దాళ్ళు కొన్ని సంవత్సరాలక్రితం వారివారి పిల్లలతో ఇలాటి ” విహారయాత్రల” కి వెళ్ళినప్పుడు, ఎన్నెన్నిసార్లు వాళ్ళవాళ్ళ తల్లితండ్రుల్ని తీసికెళ్ళారుట? కనీసం ఈ రోజుల్లో పిల్లలకి ఆమాత్రం ఆలోచనైనా వస్తోందని సంతోషించాలి. వస్తారా అని అడగడం వాళ్ళ ధర్మం, రామూ అని సున్నితంగా చెప్పేయడం ఈ పెద్దాళ్ళ ధర్మమూనూ.ఏమంటారు? కొంతమందనుకుంటారు, అసలు వాళ్ళు అడిగే ఉండరూ, అది దాచుకోడానికే ఈ కబుర్లన్నీనూ అని. పోనీ వారి సంతృప్తికోసం వాళ్ళన్నదే రైటూ అనుకున్నా, అసలు వాళ్ళనుండి అలాటివి expect చేయడమే తప్పూ అంటాను. అంతగా ఏ విహారయాత్రకైనా వెళ్దామనుకుంటున్నామురా అని ఒక్క మాట వాళ్ళతో అన్నామంటే, కావలిసిన ఏర్పాట్లు నిమిషాల్లో చేసేస్తారు ఈ రోజుల్లో పిల్లలు. ఉన్నదానికి సంతోషించాలికానీ, అదేదో లేదూ, ఇదేదో లేదూ అంటూ ఏడవడంలో అర్ధం లేదు. ఏమో నా అభిప్రాయం చెప్పాను.

   ఆతావేతా తేలిందేమిటంటే, మాకు ప్రస్తుతం వేశవి శలవలూ అని. మూడేళ్ళనుండీ అలవాటైపోయిందేమో, పిల్లలు లేకుండా తోచడంలేదు.మరి ఏదో ఒక కాలక్షేపం ఉండొద్దూ. హాయిగా ఓ పుస్తకం చదువుకోడంలో ఉన్న ఆనందం కంటె ఏమి కావాలి? ఆమధ్యన మన తెలుగు పుస్తకాల treasure ఒకదానిని గురించి ప్రస్తావించాను. కానీ అందులో మనక్కావలిసిన పుస్తకాన్ని సావకాశంగా చదువుకోడానికి download చేసికునే సదుపాయం లేదు అప్పటికి.కానీ ఆ లోటుకూడా తీరిపోయింది నిన్న నెట్ లో చూస్తే. మీకు నేను పైన ఇచ్చిన లింకులోని 23000 పైచిలుకు పుస్తకాలలో ఏవైనా download చేసికోవాలనుకుంటే ఈ లింకు నొక్కి, అందులో వివరించినట్టుగా, ఆ పుస్తకంయొక్క అదేదో 13 digits నెంబరు ని దాంట్లో పెట్టి download మీద నొక్కితే, హాయిగా పుస్తకం నిడివినిబట్టి download అయిపోతుంది. ఎప్పుడు కావలిసిస్తే అప్పుడు చదుకోవచ్చు.
నిన్న కూర్చుని శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి “అనుభవాలూ-జ్ఞాపకాలూ” download చేసికున్నాను.596 పేజీల పుస్తకం. ఒకే sitting లో చదివేయడంకంటే, ఆరారగా చదివి, ఆస్వాదించడంలో హాయి ఎక్కువ.పైగా శ్రీ శాస్త్రిగారి పుస్తకాలు అలా చదివితేనే మజా.ఒరిజినల్ సైటులో కాపీరైట్లూ గొడవా లేవని వ్రాయబట్టి నేను చదువుతున్న పుస్తకాన్ని మీతోనూ పంచుకుంటున్నాను.శ్రీపాద వారి ఆత్మకథఆలశ్యం ఎందుకూ చదవడం ప్రారంభించేయండి మరీ… Happy reading...

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– భలే మంచి రోజు..పసందైనరోజు…

    క్రిందటి సారి భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు ఒక

పెద్దమనిషితో పరిచయం అయిందని చెప్పానుగా, ఆ పెద్దమనిషి మాటల్లో ఇంకో పెద్దమనిషితో తనకు చాలా పరిచయం

ఉందనిన్నూ, తమ ఇంటికి ఆయన రాకపోకలు కూడా ఎక్కువగానే ఉన్నట్టూ చెప్పారు.ఈయనకి అంత పరిచయం ఉన్న పెద్దమనిషిని ఎప్పటినుండో కలుద్దామనీ ఉంది నాకైతే. నేనే అని ఏమిటిలెండి, ఛాన్సంటూ వస్తే, ఎవరైనా ఆయన్ని ఒక్కసారి కలిస్తే బావుంటుందని అనుకోనివారు ఎవరూ ఉండరు. మరి ఆయన తెలుగు సాహితీరంగంలోనూ, సినిమా రంగంలోనూ అంత ప్రసిధ్ధికెక్కిన మనిషి.ఆయన దర్శకత్వంలో సినిమా వచ్చిందంటే, ఎలా ఉంటుందో అని ఒక్కసారైనా చూడకుండా వదలరు.మరి అంత పేరుతెచ్చుకున్నారు. ఇంక ఆయన వ్రాసిన పుస్తకాలంటారా,లైట్ గా, మనసుకు హత్తుకునేలా , ఆ రచనలోని పాత్రలు, మన కళ్ళకెదురుగా వచ్చి నుంచుంటాయి. దానికి కారణం ఆయన చేసిన పాత్రలోని జీవం,ఆ పాత్రలకు ప్రాణంపోసిన శ్రీ బాపూగారి “గీతలూ”. ఒక్కసారి ఆ బొమ్మలు చూస్తేనే, కథంతా అర్ధం అయిపోతుంది.

    మరి అలాటి మహత్తర వ్యక్తిని చూడాలని కోరిక ఉందంటే ఆశ్చర్యం ఏముంటుందీ? భాగ్యనగరంలో నా స్నేహితుడితో ఓ “అర్జీ” పెట్టేసికున్నాను. అయ్యా, వారిని నేను కలిసే పుణ్యం మాత్రం మీరే చేసుకోవాలీ అని. ఇందులో అడగడానికి మొహమ్మాటం ఎందుకూ, వీలైతే చేస్తారు, లేకపోతే కుదరదూ అని చెప్పేస్తారు. కానీ నా అదృష్టంకొద్దీ, మొదటిదానికే ఒప్పుకున్నారు. సరేనండి, నా ప్రయత్నమేదో నేను చేసి, మీకు ఓ వారంరోజులుముందుగా తెలియచేస్తానూ అని చెప్పేశారు. ఇంక అప్పటినుంచీ, ఆయనదగ్గరనుండి ఫోనెప్పుడొస్తుందా, నా చిరకాల కోరిక ఎప్పుడు తీరుతుందా అని రోజూ ఎదురుచూడ్డమే. మొదటి స్టెప్పుగా, ఓ రోజు ఆయన ఫోను చేసి, తనతో మీకోరిక చెప్పానండీ, తప్పకుండా కలుద్దామూ అన్నారూ అని చెప్పేరు.ఫరవాలేదూ,కలవడానికి ఒప్పుకున్నారు మొత్తానికి రథం కదిలిందని సంతోషించి, కార్యక్రమానికి ఓ తేదీ ఫిక్స్ చేసికోవద్దూ మరి? అదికూడా నిశ్చయించేసికుని,నిన్న( 14-5-2013) కలుద్దామని అనుకున్నాము.సరే అనుకుని టిక్కెట్టు కూడా రిజర్వు చేయించేసికున్నాను. మా నవ్య, అగస్థ్యలకి శలవల కారణంగా, నేనొక్కడినే వెళ్ళేటట్టు కార్యక్రమం పెట్టుకున్నాను.

    అన్నీ బావున్నాయీ అనుకున్నంతలో, మా స్నేహితుడి దగ్గరనుంచి మళ్ళీ ఫోనూ..” ప్రోగ్రాంలో కొద్దిగా మార్పు అయిందీ..”అని. మళ్ళీ ఏమి ఆటంకంవచ్చిందా అని భయపడ్డాను. వాళ్ళింటికి వెళ్ళి కలుద్దామనుకున్నాము కదా, తను నిన్న ఫోను చేసి చెప్పారూ, తన “సినిమా షూటింగు మళ్ళీ మొదలుపెట్టానూ..”, ఈయనన్నారుట, ” పాపం అంత దూరంనుంచి మిమ్మల్ని కలవడానికే వస్తున్నాడాయనా, ఇప్పుడెలాగ..”అని అంటే, ” దానికేముందిలెండి, తిన్నగా మన లొకేషన్ కి తీసికొచ్చేయండీ, షూటింగు చూసినట్టూ ఉంటుంది, నాలుగు కబుర్లూ చెప్పుకోవచ్చూ..,లంచ్ కూడా మాతోనే చేసేయొచ్చూ..” అన్నారుట.తంతే బూర్లెబుట్టలో పడ్డం అంటే ఇదే మరి! ఏదో ఇంటికి వెళ్ళి ఒకసారి కలిసి, ఆయన పుస్తకాల గురించి మాట్టాడుకుందామనుకుని నేననుకుంటే, ఏకంగా ఆయనలోని, రెండో ప్రతిభ కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తూంటే ఇంకేం కావాలి? అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా ప్రోగ్రాం ఫైనల్..
కార్యక్రమం ఫైనలైజు చేసికున్న తరువాత, ఆ పని అయేదాకా ఎవరితోనైనా ఆ విషయం పంచుకోడానికి కొద్దిగా జంకుతాను. ఏదో అయిపోతుందేమోనని భయం అని కాదూ, ఏదో అదో సెంటిమెంటూ. తీరా మనం అనుకున్నది జరక్కపోతే ఏదో అవతలివాళ్ళు వేళాకోళం చేస్తారేమో అన్న భయమోటీ, ఇంత శ్రమా పడి ఈ ఎండలో వెళ్ళినా ప్రయోజనం లేకపోయిందే అని ఓ రకమైన disappointment అనండి, మొత్తానికి ఎవరితోనూ ముందుగా చెప్పనివే మాకు విజయవంతమయ్యాయి. సరే అని ఆ పధ్ధతికే సెటిలయిపోయాము.కానీ ఈసారిమాత్రం చిరకాల మిత్రుడొకరు మమ్మల్ని కలవడానికొచ్చినప్పుడు, మా ఇంటావిడ కాస్తా నా ప్రోగ్రాం విషయం అతనితో అనేసింది. అయ్యో మాట జారేశానే, తీరా ఏదైనా అవాంతరం వస్తే పాపం ఈయన బాధపడతారేమో అని, నేను నిన్న భాగ్యనగరం వెళ్ళి, ఆ పెద్దమనిషిని కలవకలిగి, నాలుగు గంటలు ఆయనతో గడిపేనని ఫోను చేశాకకానీ తీరలేదు.

    పోనీ ఇక్కడితో అయిందా, ఎలాగూ కలుస్తున్నాను కదా అని, ఆయన అప్పుడెప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూని యూట్యూబ్ లో వెదికి పట్టుకున్నాను. అందులోనేమో ఈయన, తనకి అసలు స్నేహితులనేవారే లేరనిన్నూ, అంతగా ఇతరులతో కలియడానికి అంతగా ఇష్టపడరనిన్నూ etc..etc.. చెప్పుకొచ్చారు. ఓరినాయనో మరీ ఇలాటివారితో పెట్టుకున్నానేమిటీ, అని భయపడుతూనే, అన్నిeventualities కీ సిధ్ధపడి, మొత్తానికి మా స్నేహితుడు తన కారులో, చిలుకూరు లో షూటింగవుతున్న farm house కి తీసికెళ్ళారు.అప్పటికే ఆయన అక్కడకి వచ్చేశారు.సినిమాకి సంబంధించిన హీరో రాక ఆలశ్యం అవడంతో, మాకు ఆయనతో ఓ మూడు గంటలు exclusive గా గడిపే సదవకాశం కలిగింది.

    ఇంక మరి ఆ పెద్దమనిషెవరో మీతో చెప్పొద్దూ– “పసలపూడి కథలు” ,” దిగువ గోదావరి కథలు” లాటి అచ్చతెలుగు నుడికారంతో వ్రాసిన కథల రచయితా, “సితార” లాటి ఆణిముత్యాన్ని మనకందించిన ప్రఖ్యాత దర్శకుడు శ్రీ వంశీ గారు. నేనంటే చాలా అసూయగా ఉంది కదూ, మీకే అలాగుంటే, నాలుగ్గంటలు ఆయనతో గడిపిన నాకెలా ఉంటుందంటారు?

    రెండేళ్ళ్ళ క్రితం శ్రీ బాపూరమణలు, అంతకుముందు మిథున శ్రీ రమణ గారు, క్రిందటేడాది ఆర్.కే.లక్ష్మణ్ గారు, ఇప్పుడేమో శ్రీ వంశీగారు.
HYD 1405 005

Vamsi 001

   ఇంత “భలే మంచి రోజు”, మా ఇంటావిడ నాతో పంచుకోలేకపోయిందే అన్నదే నా బాధల్లా.అక్కడ గడిపిన నాలుగ్గంటలూ మరీ అన్నీ కాకపోయినా.. ఇంకో టపాలో..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    మొత్తానికి ఇంకో ఇద్దరు కేంద్రమంత్రుల గొడవ వదిలిపోయింది.ఒకడేమో CBI వాళ్ళ రిపోర్టు ముందరే చదివేసి, అందులో ఏవేవో మార్పులు చేశాడుట, అయినా ఆమాత్రం చేయరేమిటీ మరీ? ఏదో ఇదివరకటి రోజుల్లోలా కాకుండా, పత్రికలూ, టీవీ వాళ్ళూ గొడవ పెట్టేస్తున్నారని కానీ, ఇలాటివి ఎప్పుడూ మన దేశంలో జరగనట్టే ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా చేసేది ఇదే కదా. పట్టుబడితే దొంగా, లేకపోతే దొరా. టీవీ ల్లో చర్చాకార్యక్రమాలు( జాతీయ చానెల్స్) చూస్తూంటే, చచ్చే నవ్వొస్తుంది. అవే మొహాలు, అవే arguemeంట్లూ. అయినా ఇవిమాత్రం ఎన్నిరోజులూ, ఇంకోటేదో వస్తుంది, ఈ గొడవంతా తెరవెనక్కి వెళ్ళిపోతుంది.కాలక్షేపానికి మాత్రం లోటు లేదు ! పాపం మన ప్రాంతీయ చానెళ్ళకి మాత్రం, వాళ్ళ ever green topic ఉండనే ఉంది.

    ఇంక రెండో ఆయన, అతని మేనల్లుడుట ఏదో డబ్బులు తీసికుంటూ పట్టుబడ్డాడుట. నాకు ఒక విషయం అర్ధం అవదు, ప్రతీవాడూ CBI- government tool అంటూ ఘోషిస్తూంటాడే, మరీ అధికారంలో ఉండే వారి బంధువుల గురించి, అసలు ఈ రెయిడ్లూ అవీ ఎలా జరుగుతాయో? పోనీ ఎవరో తెలిసీ తెలియక పాపం చేశారే అనుకోండి, మరీ ఇంత గొడవ చేసేస్తారా? అసలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారూ, ఏదో నాలుగు డబ్బులు చేసుకోవాలనే కానీ, దేశసేవా, ప్రజా సేవ కోసమా ఏమిటీ? ఎంతచెట్టుకంత గాలి అన్నట్టు Railway Board Member అవడానికి ఆ మాత్రం, 10 కోట్లు అడిగితేనే తప్పా? పైగా ఆ మహేశ్ కుమార్ అన్నవాడు అంత డబ్బు ఇవ్వకలిగాడూ అంటే, ఎంతకాలం నుండీ, దేశాన్ని దోచుకుంటున్నాడో?

    వచ్చిన గొడవల్లా ఏమిటంటే ఇదే పవన్ కుమార్ బన్సల్ రైల్వే మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టినప్పుడు, ఒక్కడంటే ఒక్కడైనా వీటిగురించి మాట్టాడాడా? ఎందుకొచ్చిన గొడవలే అని వదిలేశారు.ఇప్పుడు మాత్రం అతను చండీగడ్ లో చేస్తున్నవన్నీ రోజుకోటి చొప్పున బయట పెడుతున్నారు.అయినా ఇవన్నీ ఎన్నిరోజుల్లెండి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఈ దౌర్భాగ్యులే దిక్కు. వీడు కాపోతే వాడి కొడుకో, కోడలో.

    ఇంకో విషయం, ప్రతీరోజూ దేశంలోని జాతీయ చానెళ్ళూ, ప్రాంతీయ చానెళ్ళూ ఏదో ఒక విషయం పట్టుకుని వాడెవడినో పట్టుకున్నారూ, వీడినెవణ్ణో పట్టుక్లున్నారూ అంటూ ఊదరకొట్టేస్తారే, మరి వాడి సంగతేమయిందో, వాడు ఉన్నాడో, పోయాడో వాటి వివరాలు follow up చేసి అందరికీ ఎందుకు తెలియచేయరుట? ప్రతీ రోజూ ఏదో ఒక so called sensational issue చూస్తూనే ఉంటాము. ఓహో అ..లా…గా.. మనం కూడా ముక్కుమీద వేలేసికుని, నోరెళ్ళబెట్టేసికుని,” ఏమిటోనండీ మా.. రో…జు… ల్లో.. ఇలా ఉండేదా అంటూ ఆశ్చర్యపడిపోవడం. Life goes on…

    ఈరోజుల్లో ఎక్కడచూసినా కనిపించేవి ఐపాడ్లూ, ల్యాప్ టాప్పులూ, రెండేళ్ళ పసిపిల్ల దగ్గరనుంచీ ఎవరి చేతుల్లో చూసినా టీవీ రిమోట్లూ, అవేవో చేతులూ, కాళ్ళూ ఊపేసే consoleలూనూ. వేసవికాలంలో చిన్నపిల్లలు ఎండలో బయటకి వెళ్ళకుండా, చేతిలో వీటిల్లో ఏదో ఒకటి పెట్టేస్తే, వాళ్ళ దారిన వాళ్ళు పడుంటారు. అదేకదా ఈరోజుల్లో తల్లితండ్రుల ధ్యేయం. పోన్లెద్దూ ఈ వంకనైనా ఏదో ఒకటి కడుపులో పడేసికుంటున్నాడూ అనేసికుని, చేతిలో ఓ రిమోట్టోటి పెట్టేసి ఆ టీవీ ఎదురుగా కూర్చోపెట్టేయడం. ఇంతంతసేపు ఆ టీవీ ముందరా, చేతిలో ఐపాడ్లూ పెట్టుకుని రోజంతా కాలక్షేపం చేస్తారే, ఆ తల్లితండ్రులకైనా తట్టఖ్ఖర్లేదా, వాటిల్లోంచి వచ్చే radiation ప్రభావం ఎలా ఉంటుందో? పోనీ తెలియకా అంటారా అంటే అదీ కాదు, తెలుసు కానీ ఏమీ చేయలేని చేతకానితనం. పోనీ ఇళ్ళల్లో ఉండే పెద్దాళ్ళెవరైనా ఈ విషయం గురించి మాట్టాడడానికి ప్రయత్నం చేసినా, ఓ పేద్ద గొడవైపోతుంది. మీరోజుల్లో ఇలాటివన్నీ లేవు కాబట్టి అలా అనిపిస్తుంది కానీ, ఈరోజుల్లో ఇవి లేకుండగా రోజే వెళ్ళదు. అసలు నెట్ అనేదే లేకపోవడం ఊహించడానికే భయంకరంగా ఉంది అనేసి నోరుమూయించేయడం. నిజమే ఒప్పుకుంటున్నాము, ఈ టెక్నాలజీ ధర్మమా అని ఎన్నెన్నో తెలుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్టాడేది, చిన్నపిల్లలకి మరీ అంత చిన్నప్పటినుంచీ, వాటికి బానిసలుగా చేయడం మనకి ధర్మమేనా అని. ఊరికే చాదస్థం అనుకోకుండా ఇక్కడ ఒకసారి దృష్టి పెట్టండి.

    ఇలాటివన్నీ మాకు తెలియదనుకుంటున్నారా, ఎప్పుడో తెలుసు.. కా…నీ…. ఏం చేయమంటారు? మాకా పిల్లలతో గడపడానికి టైమే ఉండదు. మా ఉద్యోగాలలో తిండి తినడానికి కూడా టైముండదు. ఇంక పిల్లలంటారా వాళ్ళక్కూడా ఏదో కాలక్షేపం ఉండొద్దూ?ఎంత దేవుడూ, కర్మ లగురించి ఎలా మాట్టాడినా, సడెన్ గా దేవుడు గుర్తుకొచ్చేస్తాడు. పోనిద్దురూ నారు పోసినవాడు నీరుపోయడా ఏమిటీ మీరు మరీనూ.. ప్రపంచం చాలా ఫాస్టు మాస్టారూ.. మా పిల్లలకి సెల్ ఫోన్లూ, కాన్సోళ్ళూ, లాప్ టాప్పులూ లేవన్నా, వాటి గురించి తెలియదన్నా ఎంత తలవంపో అసలు మీకు తెలుసునా? చేతులకి పట్టొస్తే చాలు, ఓ రిమోట్టో, ఓ ఐపాడ్డో పెట్టేస్తే వాడిదారిన వాడు పడుంటాడు. మీకా వాళ్ళని ఆడించే ఓపిక లేదు, ఏదో మాదారిన మేమే, ఏదో మార్గం చూసుకుంటే , దానికీ చివాట్లేనా? ఇంక మిగిలిన విషయాలంటారా, అప్పుడు చూసుకోవచ్చులెండి.అనేవాళ్ళూ ఉంటారు

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అబ్బ.. bore ..కొట్టేస్తోందండి…

    ఈ టపాకి పెట్టిన శీర్షిక నా అభిప్రాయం కాదు. ఈ రోజుల్లో ఎవరి నోటంట విన్నా ఇదే మాట. ఏదో మాటలు రానంతకాలం ఫరవాలేదు, ఏదో ఉంగా.. బుంగా.. అంటూ లాగించేస్తారు పసిపిల్లలు. వాళ్ళనేదేమిటో మనకు అర్ధమైచావదూ, తీరా నాలుగుమాటలు నేర్చుకునేటప్పటికి, వాళ్ళనేదేమిటీ అంటే ఇదిగో “బోరు” అనే మాట. దానికి వాళ్ళనీ తప్పుపట్టి లాభంలేదు. ఆ పసిపిల్ల అమ్మా, నాన్నా, తనకంటే ఓ రెండుమూడేళ్ళముందర పుట్టిన అక్కో, అన్నో.. ఎవరినోటంట విన్నా అదేమాటాయె. మరి ఏవేవో అర్ధవంతమైన మాటలు రమ్మంటే ఎక్కడొస్తాయీ?

పెద్దచదువులు చదివి తగిన ఉద్యోగంరాలేదో అని ఏడ్చినంతసేపు పట్టదు, తీరా వచ్చినతరువాత ఏడాదినుంచీ ప్రారంభం..” ఏమిటోనండీ దిక్కుమాలిన ఉద్యోగం ‘బోరు’ కొట్టేస్తోందండీ..”. అసలు పొట్టకూటికోసం చేస్తూన్న ఉద్యోగం “బోరు” కొట్టడమేమిటో నా మట్టి బుఱ్ఱకైతే అసలు అర్ధమే అవదు.. ఈ బోరు కొట్టడమనేది ఒక జన్మహక్కనుకుంటారు.ఒకడికేమో job profile బాగో లేదట, ఇంకోడికేమో ఆ job లో growత్తే లేదట. కారణాలకేమిటిలెండి, కావలిసినన్ని వెరసి “బోరు”. మరి అంత బోరుకొడుతూంటే ఆ ఉద్యోగం మానేసి, హాయిగా స్వంతవ్యాపారం ఒకటి చూసుకోవచ్చుగా, అబ్బే, మళ్ళీ దానికి పెట్టుబడెవడు పెడతాడు? పైగా స్వంతవ్యాపారం అంటే అందులో ” బోరు” లాటి privileges ఉండవు కదా. ఆతావేతా తేలేదేమిటంటే, ఇంకోడెవడో పెట్టుబడిపెట్టిన సంస్థలో వేషాలేయొచ్చన్నమాట. నిజమే growth అనేది లేకపోతే కష్టమే, కానీ ఈ growth అనేదానికి కొలమానం ఏమిటి? మనం growth అని పిలిచేది, ఆ సంస్థయజమానికి అలా అనిపించకపోవచ్చుగా.

కొంతమందికి ఇంట్లో ఊరికే కూర్చోడం “బోరు” కొట్టి, ఏదో ఉద్యోగంలో చేరుతూంటారు.ఇలాటివారు ప్రభుత్వరంగంలో ఎక్కువగా కనిపిస్తూండేవారు.ఫాక్టరీలోనో, రక్షణ శాఖలోనో భర్త ఏదైనా పెద్ద ఉద్యోగంలో ఉన్నారంటే automatic గా భార్య, అక్కడుండే స్కూల్లో teacher.అలాగని వారు శ్రధ్ధగా పాఠాలు చెప్పలేదని కాదు,చెప్పొచ్చేదేమిటంటే, పాఠాలు చెప్పడంలోకంటే, ఇంట్లో ఊరికే కూర్చుని ” బోరు” కొట్టఖ్ఖర్లేకుండా ఉండడానికి ప్రాముఖ్యత ఎక్కువిచ్చేవారు.

సరేనండి, పెద్దాళ్ళకి ఇలాటి privileges ఉండడం బాగానే ఉందీ, మరి పిల్లలకి ఈ “జాడ్యం” అంత త్వరగా వచ్చేయడానికి కారణాలు ఏమిటిటా? ఇంట్లో వాతావరణమేమో అని నా అభిప్రాయం.సంపాదన బాగా ఉన్నప్పుడు వచ్చే ” జరుగుబాట్లు” ఇవన్నీ.ప్రతీరోజూ చూస్తున్న కర్టెన్ బొరు కొడుతుందిట.అదే కారులో రోజూ ఆఫీసుకెళ్ళడం బోరుట కొందరికి.ప్రతీ రోజూ ఇంట్లోనే తింటే బోరుకొడుతుందిట కొందరికి. మరి ప్రతీదీ ఇంతంత బోరు కొట్టేస్తూంటే, ఆ దిక్కుమాలిన చానెళ్ళలో వచ్చే సీరియళ్ళు బోరెందుకు కొట్టవో మరి !!ఏళ్ళ తరబడీ జీడిపాకంలా సాగతీయబడే సీరియళ్ళని మాత్రం వదులుకోరు. ప్రాణం మీదకొచ్చినా సరే, సీరియల్లో ఏమయిందో తెలిసికోవాలి.

ఇన్నిన్ని కబుర్లు చెప్తారే, మన ఇంటికి పాల ప్యాకెట్లు తెచ్చేవాడికీ, అంట్లు తోమే పనిమనిషికీ, సొసైటీలో తుడిచేవాడికీ, రోడ్లు బాగుచేసేవాళ్ళకీ అకస్మాత్తుగా “బోరు” కొట్టేస్తే, మన పని ఏమైపోతుందిట? మరి వాళ్ళూ మనుష్యులేకదా, వాళ్ళకో రూలూ, మనకో రూలూనా ఏమిటీ? సామాజికన్యాయం ఉండొద్దూ?సరదాగా ఓసారి మాటవరసకి ఊహించుకుందాం- పైన చెప్పిన ప్రతీవాడూ ” బోరు” కొట్టబడి, వాడు ప్రతీరోజూ చేసేపని, మానేసి చూద్దాం అనుకుని, కట్టకట్టుకుని రావడం మానేస్తే, వామ్మోయ్ ఊహించడానికే ఇంత భయంకరంగా ఉంటే , నిజంగా జరిగితే, భరించగలమా?ఈ పనులు చేయడానికి ఇంకో source కూడాఉండదు.

అందుకే నేను చెప్పొచ్చేదేమిటంటే, ఓ ఉద్యోగం బోరుకొడితే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు.ఓ కారు అమ్మేస్తే ఇంకో కారు కొనుక్కోవచ్చు, ఓ కర్టెన్ బోరుకొడితే, ఇంకోటి మార్చేసికోవచ్చు, అలా మార్చుకుంటూ పోతే దీనికి అంతెక్కడా? అంతదాకా ఎందుకూ, ఈరోజుల్లో ఎవ్వరూ ఓ సెల్ ఫోనుని ఏడాదికాలం వాడరు.ఏమిటయ్యా అంటే, ఆ పాతదానిని వాడి వాడి బోరుకొట్టేసిందండీ అనేయడం.

ఇదివరకటి రోజుల్లో ఈ “బోరు” లనబడేవి ఎక్కువగా ఉండేవి కావు, కారణం చెప్తే అందరికీ నచ్చకపోవచ్చు–సింపుల్ గా చెప్పాలంటే, ఆర్ధికస్థోమత,availability.ఈ రెండూ ఎక్కువయ్యేసరికి ఎక్కళ్ళేని బోరులూ వచ్చేశాయి.తల్లితండ్రుల్ని చూసి పిల్లలూ నేర్చేసికుంటున్నారు.ఇదివరకటి రోజుల్లో అయితే, ఓ దెబ్బేసి అడిగే పరిస్థితి. ఇప్పుడో, అడిగితే ” మీరూ, మమ్మీ ప్రతీదానికీ బోరు బోరు అంటూంటారే, మాకుమాత్రం బోరుండకూడదేమిటీ” అని ఎక్కడ అడిగేస్తాడో అని భయం.దాంతో ఏమౌతోందంటే, “నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా..” అనుకుంటూ ఓ దండం పెట్టుకోడమే. మనం చేసేదే మన పిల్లలూ నేర్చుకుంటారు.

ఇలాటివాళ్ళు ఇన్నేసేళ్ళు కాపరాలు ఎలా చేస్తారో మరి? వాళ్ళకి మాత్రం ప్రతీరోజూ చూసే భార్యంటే భర్తకీ, vice versa బోరుకొట్టేయదా మరి? ఇన్ని కబుర్లూ చెప్పి దీంట్లోకెళ్ళేడేమిటీ ఈయనా అనుకుంటున్నారా? అదే మరి మన భారతీయత లో ఉండే అసలు సిసలు గొప్పతనమంతా.ఎక్కడైనా బావ కానీ, వంగతోటలో..అన్నట్టు మిగిలినవాటన్నిటిలోనూ ఎన్నైనా వేషాలు వేయొచ్చు, కానీ ఈ దాంపత్యంలో మాత్రం కాదు. కొట్టుకుంటూ, తిట్టుకుంటూ కాలక్షేపం చెసేస్తారు కానీ, మరీ ప్రాణం మీదకి మాత్రం తెచ్చుకోరు.అదేకదా మన పెళ్ళిమంత్రాల్లో ఉండే అసలు మహాత్మ్యం అంతా.

ఈవేళ నెట్ లో ఒక లింకు దొరికింది. హిందుస్థానీ సంగీతం నేర్చుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒక్కసారి ఇక్కడ చూడండి.

ఇన్నేసి కబుర్లు చెప్తున్నారు, మీకు బోరు కొట్టడంలేదా ఇన్నిన్ని టపాలు పెట్టడానికీ అని.వ్యాఖ్యలు పెట్టినా, పెట్టకపోయినా, కొంతమందికైనా ఉపయోగిస్తుందేమో అనే సదుద్దేశ్యంతో లింకులు ఇస్తూంటాను. ఊరికే లింకులిచ్చేసీ టపా పెట్టేస్తే ఎలాగా అని, మిమ్మల్ని బోరుకొడుతూంటాను.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇంకో అద్భుతమైన లింకు..

   పనేమీ లేక నెట్ వెదుకుతూంటే కొన్ని లింకులు కనిపించాయి. ఉపయోగిస్తాయేమో చూడండి….

   1.ఆంధ్ర-తెలుగు ఇందులో అన్నిరకాల లింకులూ ఉన్నాయి.

   2. ప్రత్యేకంగా ఆడియోలూ, pdf లు కావాలంటే ఆంధ్ర తెలుగు భక్తి పేజి ఇదైతే నాకు అద్భుతంగా అనిపించింది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- “సరదాగా కాసేపు.”.

    నేను మార్చ్ నెలలో భాగ్యనగరం వచ్చినప్పుడు, నాకు కలిగిన ఓ మంచి పరిచయం గురించి ఒక టపా పెట్టాను. నా స్నేహితుడు శ్రీ గబ్బిట కృష్ణమోహన్ గారు, మాకు షడ్రసోపేతమైన భోజనంతో పాటు dessert గా ,ఆయన వ్రాసిన మూడు పుస్తకాలు చేతిలో పెట్టారు.అందులో ఒక పుస్తకం ” సరదాగా కాసేపు”Saradaagaa.. అనేది ఒకటి. చెప్పానుగా, అది చదువుతూంటేనే కడుపుబ్బిపోయి నవ్వేశాను. అందులో ఉన్నవి పది అఛ్ఛోణీ లాటి కథలు. నేను చదివి మీ అందరితోనూ నా ఆనందం పంచుకోవాలని ఎప్పటినుండో ఉండడమైతే ఉంది. కానీ, ఆకథలన్నిటికీ మూలం PG Wodehouse Short Stories. శ్రీ కృష్ణమోహన్ గారు, ఆ కథలని తెలుగు వాతావరణం లోకి ఎలా transform చేశారో తెలియాలంటే, మరి ఆ మూలకథలు కూడా చదవాలిగా.ఇప్పుడు వాటిని కొని చదవమనడమూ బాగోదాయె, కానీ పాఠకులచేత చదివించాలాయె, మరి ఈ సమస్య కి సమాధానం ఏమిటీ అని ఈ నెలన్నరా ఆలోచించి..చించి.. చించి మొత్తానికి సాధించేశాను. దాని ఫలరూపమే ఈ లింకు.PG Wodehouse ఇందులో మొత్తం తొమ్మిది కథలున్నాయి. 266 పేజీలు. శ్రీ కృష్ణమోహన్ గారు తనదైన బాణీ లో మొదటి రెండు కథల తో పాటు ఇంకో 8 కథలు తనస్వంతమైన ప్రత్యేక ఫక్కీ లో “ అనుసృజన” చేశారు. తీరా చేసి ఆ పుస్తకాన్ని అంకితం ఎవరికిచ్చారూ అంటే, ఇంకెవరూ మన “ వంశీ” గారికి.

   మన పురాణాల్లో “సూత ముని” పేరు చాలా చోట్ల వింటాము. సాధారణంగా ఆయన నోటివెంటే పురాణాలన్నీ నడుస్తాయి. మరి ప్రస్తుతానికి వస్తే, మూల కథలో ఉన్నట్టు Mr.Mulliner.. Mr George అని వ్రాస్తే మజా ఏముంటుందీ,, పైగా ఏమీ అర్ధంఅవకపోవచ్చుకూడానూ, అందుకని ఓ ” సూత ముని” పాత్రకి ఓ భాగోతుల సూతరాజు ని సృష్టించేశారు.

   ఉదాహరణకి మూలకథలో 12 వ పేజీలో వుడ్ హౌస్ ఒక మాటంటారు–.”I love a lassie.. bonny, bonny lassie” sang George ” She is as pure as the lilly in the dell..”, ఆ భావం వచ్చేటట్టుగా, మన మనసులు ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్టుగా చెప్పాలంటే, మరి మనకి తెలిసినవి చెప్తేనేకదా చదువరిలకి అర్ధం అయ్యేదీ?
“మా ఊళ్ళో ఒక చిన్నదీ,ఎంతో అందమైనదీ,ఆమెంటే నాకెంతో ఇష్టమూ, ప్రాణమైనా ఇస్తానూ.. లాయిలప్ప లాయిలా, లాయిలప్ప లాయిలా..” అంటూ పాడాడు.తన భావాలని డాక్టరుగారు సలహా ఇచ్చినట్టుగా,ఈ కథని చదివే తెలుగువారు relate చేసికుని, మనసుకు హత్తుకునేటట్టుగా చేయడానికి,రచయితకి ఓ తెలుగుపాట చరణాలు గుర్తుచేయడానికి , భాషమీదే కాదు, మిగతావాటిమీద కూడా పట్టుండాలి.అవి మాత్రం పుష్కలంగా ఉన్నాయి శ్రీ కృష్ణమోహన్ గారికి.

   “” All we Mulliners have been noted for our presence of mind..”–అన్నదాన్నికి రచయిత వ్రాసిందేమిటీ– “మా భాగోతుల వంశీకులు మంచి లౌక్యులు..” అని. ఇలాటి అచ్చతెలుగు నుడికారాలుంటేనే కదా, కథ ముందుకు నడిచేదీ. డాక్టరు గారి దగ్గరనుంచి సలహా తీసికుని, ఆ సలహా ఆచరణలో పెట్టే ఉద్దేశ్యంతో ఇంగ్లీషు కథలో,కథానాయకుడు డైరెక్టు ట్రైన్ లో కాకుండా, ఒక ట్రైనెక్కి, ఇంకో ట్రైనులోకి మారాల్సొస్తుంది. మరి ఆ కథలోనే ఉండే రైలు ప్రయాణం వివరిస్తే, మనవాళ్ళకి అర్ధం ఏమౌతుందీ, అందుచేత, మన ప్రాంతంలోని మెడ్రాస్- రేపల్లె మార్గాన్ని ఎన్నుకున్నారు, కారణం రేపల్లెకి తిన్నగా వెళ్ళలేరు, తెనాలిలో రైలు మారాలి, అదన్నమాట విషయం. అలా అడుగడుగునా, మూల కథలోని సన్నివేశాలన్నిటినీ, ఏక్ దం తెలుగు వాతావరణం లోకి మార్చేసి కథని నల్లేరుపైనడకలా నడిపించేశారు.

    ప్రతీ సన్నివేశాన్నీ, సంఘటననీ, కథానాయకుడి మనస్థత్వాన్నీ, “తెలుగైజు”చేసేయడమంటే మాటలా మరి? ఏ ఒక్కపేజీ విసుగెత్తదు.డాక్టరుగారు ఇచ్చిన సలహా ప్రకారం, ముగ్గురు కొత్త్తవారితో పరిచయం చేసికోవాలి. అందులో ఇద్దరితో interaction తో గుండె బేజారెత్తిపోయిన తరువాత, మూడో పరిచయం– ఆ మారిన ట్రైనులోది. అందులో ఒక వనిత ఎక్కుతుంది.అకస్మాత్తుగా, ఓ “ప్రాణి” ని చూసేటప్పటికి, ఆవిడ స్పందన తెలుగులో చదవాలేకానీ, వర్ణించడం చాలా కష్టం. మన కథానాయకుడేమైనా తక్కువ తిన్నాడా, ఠక్కున డాక్టరుగారి సలహా జ్ఞాపకం వచ్చి “పాట” లోకి దిగిపోతాడు !” అందమైన బాలా.. ఆవుపాలా చాయా, విందుగా పసందుగా చాయ అందుకోవా.. కోవా...” అంటూ, 1960 లో నాగేశ్వరరావూ, గిరిజ లమీద చిత్రీకరించిన జమునారాణి, పిబిశ్రినివాసు ల “ఋణానుబంధం” లోని పాటను ఎంచుకున్నారు. ఇది చదవగానే మనకు గుర్తొచ్చేది ఆ సీనే.

    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని చెప్పగలనూ? ప్రతీ పేజీ ఓ కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకు, ఓ బందరు లడ్డూ అన్నా చాలదేమో. మరి అందుకే ఆ పెద్దాయన శ్రీ ముళ్ళపూడి వెంకటరమణగారు

    “ఇంపైన వుడ్ హౌసు

    సొంపైన తెలుగీసు

   తెలుగు హాస్యప్రియులకు

   ఇంతకన్న ఆనందమేమీ”-— అన్నారంటే అనరూ మరి…

%d bloggers like this: