బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అయినా సరే బతికేస్తున్నాం…

   తెలుగువాళ్ళకి ములక్కాడలంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. అదేం ఖర్మమో ఈమధ్యన మార్కెట్ లో వాటి ధర కొండెక్కేసింది. మరీ పావుకిలో 20 రూపాయలంటే కొనే పరిస్థితా మనది? ఏదో చవకలో దొరికితే కొనొచ్చు కానీ, మరీ కిలో 80 రూపాయలంటే, కొని పూజ చేయాలనిపిస్తుంది. ఈలోపులో అవి ఎండిపోయి, నా వయస్సుకి వచ్చేస్తాయి, అది వేరే సంగతనుకోండి. దానితో ఈమధ్యన మార్కెట్ కెళ్ళినప్పుడల్లా, దూరం నుంచే చూసేసి, “మమ” అనుకొని వచ్చేస్తున్నాను. అంతేసి డబ్బులు పెట్టి కొనే ఓపిక లేదమ్మోయ్. అలాటిది ఈ మధ్యన ఆదివారం, తెలిసిన కొట్టులో నవనవలాడుతూ కనిపించాయి, పక్కనే ఇంకో ఆవిడ ఏదో కొంటోంది. నాకైతే పావు పదిరూపాయలూ అని వినిపించింది. అమ్మయ్యా ధర తగ్గిందిరా బాబూ అనుకుని, ఓపావిమ్మన్నాను. వాడు తూచి, మరీ పొడుగ్గా ఉన్నాయి కదా అని కోసిపెట్టనా అన్నాడు. మరీ వాటిని ముక్కలు చేయడం ఇష్టం లేక, ( ఇంటికెళ్ళిన తరువాత, ఇంటావిడ పులుసులోకో, చారులోకో ఎలాగూ చేస్తుంది, మరీ ఆ “పాపం” నేనెందుకు కట్టుకోడం అని) వద్దని, ఓ పది రూపాయల నోటిస్తే, కాదూ ఇరవై అన్నాడు. అదేమిట్రా, పదన్నావు కదా అంటే, ములక్కాయలు కాదూ, పనస చెక్క ఖరీదదీ అన్నాడు. మంచిదయింది, వాటిని ముక్కలు చేసుంటే, నాకంటగట్టేవాడు. విడవలేక విడవలేక, సంచీలోంచి వాటిని బయటకు తీసి, తిరిగిచ్చేశాను. ఓ దండం పెట్టుకుని! పోనీ ధరేదో తగ్గేదాకా ఆగొచ్చు కదా, అబ్బే, అప్పుడెప్పుడో తెచ్చి, ఫ్రిజ్ లో దాక్కున్న ములక్కాడముక్కలు వేసి, ఇంటావిడ ఆ ముందురోజే బ్రహ్మాండమైన చారు పెట్టింది. దాంతో మళ్ళీ ములక్కాడలవైపు పోయింది దృష్టి. వెధవ జిహ్వచాపల్యం, బతికున్నంతకాలమూ వదలదు! నిన్న దగ్గరలో ఉన్న మార్కెట్ లో ఏదో కొంటూంటే మళ్ళీ వినిపించింది పావు పదీ… అని. ఆ అర్ధ అనేది మింగేశాడు. అడిగితే చెప్పనే చెప్పాడు మరీ పావు ఇరవై అంటే ఎవడూ ఈపక్కకే రావడం లేదూ, అందుకే అశ్వథామా కుంజరహ అని, అర్ధ మింగేసి, పావే వినిపించేలా అరుస్తున్నానూ అని!మొత్తానికి పదిరూపాయలూ ఇచ్చి అర్ధపావు తీసికున్నాను, రెండంటే రెండు కాడలొచ్చాయి. ఒకటి నాకూ, ఇంకోటి ఇంటావిడకీనూ! చూస్తూండగానే ఆ కొట్టువాడు నలుగురికి అరపావు చొప్పున అమ్మేడు.

   పైన చెప్పినది ప్రత్యక్షంగా చూసిన marketing technique. అందరూ అంటారూ, తెలివిమీరిపోయారండీ ఈ రోజుల్లోనూ, అక్కడికేదో వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టు. కానీ పేద్ద పేద్ద కంపెనీలు చేస్తున్నదేమిటిట? పైన ఇచ్చేనే బొమ్మ అందులో indiatimes వాడి యాడ్ చూడండి– అన్ని పుస్తకాలమీదా 40% discount అని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాశాడు. ఏదో చవకలొ వస్తున్నాయని తీరా ఆ సైట్ లోకి వెళ్ళి చూస్తే కనిపించేదేమిటీ- ఏదో ఒకటీ రెండు వెరైటీలు తప్పించి, దేనిమీదా 25% discount మించి లేదు. బళ్ళమీద అరుస్తూ వస్తారు చూడండి అరటిపళ్ళవాళ్ళు డజను పదిరూపాయలూ.. అంటూ, తీరా బండి ఆపి చూస్తే, నా వయస్సుకు వచ్చేసి, మిగలముగ్గిపోయిన పళ్ళు చూపిస్తాడు. వాడికీ, ఈ indiatimes వాడి యాడ్ కీ తేడా ఏమీ లేదు.

   అన్నిటిలోకీ ఈ రిలయన్స్ వాళ్ళు దోచేస్తున్న పధ్ధతి- వాడి Broadband speed 3.1 Mbps అంటాడు. ఎప్పుడు చూసినా దాని స్పీడ్ 0.00. దీంతో ఏమౌతుందీ అంటే, ఏ రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడో, ఆఖరి పేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి, బ్యాంకు వాడిది బాగనే ఉందికదా అని,పేమెంటు పూర్తిచేస్తాము ,redirecting to irctc… అంటుందే కానీ, ఛస్తే పూర్తిచేయదు, పైగా please do not ” refresh” or ” back”….. అని మెసేజ్ ఓటీ. ఏం చేస్తే ఏం కొంపములుగుతుందో అని దాన్ని చూస్తూ ఊరుకుంటాము. అది తిరుగుతూంటుందేకానీ, ఆ redirecting to irctc… మాత్రం పూర్తవదు. ఓ పదినిముషాలు అయిన తరువాత, పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది.Your log in time expired. please log in again.. గోవిందో… గోవిందా... మనం బుక్ చేసిన టిక్కెట్టు అయిందో లేదో తెలియదు. మళ్ళీ లాగ్ ఇన్ అయితే, ఎక్కడున్నావే గొంగళీ అంటే అక్కడే అన్నట్టు మళ్ళీ మొదలూ.. ఓ నాలుగు రోజులు పోయిన తరువాత డబ్బులు తిరిగొస్తాయనుకోండి. కానీ ఇంత అసౌకర్యం కలగాలంటారా? పోనీ ఆ Broadband వాడికి ఫోను చేద్దామా అంటే, ఒకటి నొక్కూ, రెండు నొక్కూ.. పీకనొక్కూ… అంటాడేకానీ, ఓ జీవించిన మనిషితో మాటాడ్డం మాత్రం కుదరదు..

   ప్రొద్దుటే అబ్బాయితో ఇవన్నీ మాట్లాడుతూంటె తను ఓ బ్లాగ్ పోస్ట్ గురించి చెప్పాడు, అదే రెండో ఫొటో… ఇలాటివన్నీ మన దేశంలోనేనా, ప్రపంచం అంతా ఇంతేనా? ఇంకోటండోయ్ నిన్న ప్రొద్దుటే, ఆయనెవరో బ్రేక్ ఫాస్ట్ తీసికుని, తన Volkswagon కారులో కూర్చుని, ఇగ్నిషన్ తిప్పాడో లేదో పరిస్థితి పైన పెట్టిన ఫొటోలో చూశారుగా…

    అయినా సరే బతికేస్తున్నాం…..

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కొంపలో అన్నీ బావున్నంత కాలమే…..

   ఇంత వయస్సొచ్చిన తరువాత, వయస్సులో ఉన్నట్టుండమంటే కష్టమే కదూ! ఏదో మరీ మంచం పట్టకుండా, మన పన్లు మనం చేసికుంటూంటే, మనకీ, మన చుట్టుపక్కలవాళ్ళకీ సుఖం. ఏవో చిన్నా చితుకూ వస్తూనే ఉంటాయి. అలాటప్పుడే చిరాకులూ పరాకులూనూ. ఏం చేస్తాం ఏదోలా కాలక్షేపం చేసేయాలి. మనకైతే ఏ కాలినొప్పో, రొంపో, లైట్ గా జ్వరమో వస్తే, దగ్గరలో ఉన్న ఏడాక్టరు దగ్గరకో వెళ్ళడమో, కాదూ కూడదనుకుంటే, ఏవో OTC మందులేసికోవడమే. పనైపోతుంది. కానీ మరీ అలవాటు చేసేసికుంటే, ప్రాణం మీదకొస్తుంది. అప్పుడెలాగూ హాస్పిటలుండనే ఉంది.

కానీ, ఇంట్లో అలవాటైపోయిన వస్తువులున్నాయే, అవి మాత్రం పడకేశాయా, అయిందే మన పని! అవి లేకపోతే రోజెళ్ళదూ, అలాగని వాటిని రిపేరీ షాప్ కి తీసికెళ్ళాలేమూ, ఎవడికో ఫోను చేసి, వాడికి ఖాళీ దొరికి, మన అదృష్టం బాగుండి పాడైన వస్తువు బాగు చేస్తే, మన జీవితం ధన్యమైపోయినట్టే! వచ్చిన గొడవేమిటంటే, ఏదో పగ పట్టిన వాళ్ళలాగ, ఇంట్లో ఉండే ప్రతీ ముఖ్యమైన వస్తువూ, ఒకేసారి Tool down strike చేసేస్తాయి. మన ఖర్మకాలి ఇంట్లో ప్రతీదీ ముఖ్యమైనదే, అలా తగలడ్డాయి మన జీవితాలు! ఏం చేస్తాం? ఏ వస్తువు లేకపోయినా, మన రొటీన్ దెబ్బతినేస్తుంది. ఇదీ అదీ అని లేదు ఇంట్లో కుక్కర్ దగ్గరనుంచి ఇంటావిడ ఫ్లోర్ తుడిచే మాప్ దాకా ప్రతీదీ ముఖ్యమే మరి.

ఇదివరకటి రోజుల్లో కుక్కర్ కి ఉండే safety valve ఏదో పాడైపోయినప్పుడు ఓసారి కొత్తది వేయిస్తే సరిపోయేది. ఇప్పుడలా కాదే, ఏదో technological improvement అని పేరు పెట్టి, దానికి పైన ఓ బుల్లి వాషర్ ఓటి పెట్టాడు. దానిల్లుబంగారం గానూ, అదేమో నిలబడదూ, పైగా కడిగేటప్పుడు ఎక్కడో జారిపోతుంది, ఈ వాషర్ లేకపోతే, ఆ సేఫ్టీ వాల్వు ఉపయోగం లేదూ. దానికేమో జారిపోడం అలవాటూ, మనకి వంటిల్లూ, స్టొవ్ కిందా, వాష్ బేసిన్ లోనూ వెదుక్కోడం అలవాటూ. మన రోజు బాగోపోతే, ఇంటావిడ ” ఏమండీ, ఆ వాషర్ ఎక్కడైనా చూశారా..” అంటుంది. చీకట్లో కనిపించి చావదూ. ఇంత హింస పగవాడిక్కూడా వద్దురా బాబూ అనిపిస్తుంది.
అలాగే మా పాత food processor కి లోపల ఓ మేకులాటిదుండేది. ఎందుకనడక్కండి నా ప్రాణం తీయడానికి! ఓ రోజు ఇంటావిడ తీరిగ్గా, చపాతీ పిండీ అదీ చేసికుని చూస్తే, ఆ మేకు కాస్తా మాయం అయిపోయింది. ఇంక సెర్చ్ పార్టీ రెడీ. ఆరోజునే వెన్నోటి చేసింది, వెన్న కాచిన నెయ్యిలో ఉందేమో, లేక ఆవిడ తినే పుల్కాల్లో ఉందేమో, అక్కడా ఇక్కడా అనిలేదు, ఇంతోటి కిచెనూ వెదికేసాము ఫలితం శూన్యం. ఇదికాదని, బయటకు వెళ్ళి మొత్తానికి ఓ కొత్త food processor తెచ్చేశాను. దాన్ని ఎలా ఉపయోగిస్తారో కంపెనీ వాడొచ్చి demo ఇస్తాడా పోనీ అంటే, లేదుట దాంట్లో ఓ సిడి ఇచ్చాడు. పోనీ దాన్నేదో, నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానం తో కంప్యూటర్ లో పెట్టి చూద్దామా అంటే, అప్పుడే, దానికీ సుస్తీ చేసింది ! చెప్పాపెట్టకుండా ఆగిపోయింది. మర్నాడు ఏదో ఫోను చేసి, దాన్ని రిపేరీ చేయించి దాని సంగతేదో చూశాను. ఈలోపులో మా అమ్మాయి సహాయంతో మొత్తానికి, ఆ కొత్త food processor ని పన్లో పెట్టుకుంది. ఇంక ప్రతీ రోజూ ఎడా పెడా చేసేస్తోంది. వాటి గురించి ఇంకో టపాలో !!

అన్నీ బావుంటే మజా ఏముందీ? జీవితం లో థ్రిల్ ఉండొద్దూ! పాపం మా ఇంట్లో ఉన్నవి, కొత్తా పాతా తేడా లేకుండా, నన్ను పెట్టవలసిన తిప్పలు పెడుతూంటాయి. అవడం చిన్న చిన్న రిపేరీలే. కానీ వాటిని బాగుచేసే పరిజ్ఞానం లేదే. వాటిని బాగుచేయడానికి ఏ ప్లంబరో కావాలి, వాడేమో దొరకడూ, వాడు దొరికే దాకా పనాగిపోతుంది. అది రిపేరీ అయేదాకా, ఇంటావిడ మొహంలో మొహం పెట్టి చూళ్ళేమూ. పైగా పాడయ్యింది ఏ వాషింగ్ మెషీనో అయిందా, ఇంక మొదలూ..” రేపణ్ణించి, ఈ బట్టలన్నీ సబ్బెట్టి ఉతికే ఓపిక లేదమ్మో…”. అదీ నిజమేగా, ఈ వాషింగ్ మెషీన్లొచ్చిన తరువాత ప్రతీదీ దాంట్లోనే, ఓపికుండమంటే ఎక్కడుంటుందీ ? అలవాటా పోయింది, చేయడానికి ఓపికా ఉండదు. పోనీ పాడయ్యింది ఏమైనా మెషీన్ దా అంటే అదీ కాదూ. వాటర్ లైన్ కి పెడతామే ఆ water inlet ఊడి చచ్చింది. ఇల్లంతా నీళ్ళు. పైగా అదికూడా నా నిర్వాకమే. నా అదృష్టం బాగోక వాష్ బేసిన్ దగ్గర ఏదో చెయ్యి కడుక్కుంటుంటే, దాని కిందున్నది కాస్తా ఊడింది. మెయిన్ వాల్వ్ మూసేయాలని తోచింది, కాస్త నయం. వాడికీ వీడికీ ఫోను చేయగా చేయగా మొత్తానికి ఎనిమిదిన్నరకి, వాడు వచ్చి, అదీ ఇదీ తిప్పి, కొద్దిగా టైట్ చేసేసి, ఓ యాభై రూపాయలు పట్టుకు పోయాడు!డబ్బు అయితే అయింది, ఇంటావిడ రేపు బట్టలుతకఖ్ఖర్లేదు!

అలాగే ఈ మధ్యన అదేదో కొత్తగా మార్కెట్ లోకి Majic Wash అని వచ్చింది. దాంట్లో సదుపాయం ఏమిటంటే, హ్యాండిల్ కి ఉన్న మాప్ ని అదేదో చిన్నబుకెట్ లో పెట్టి తిప్పితే, నీళ్ళు పిండేయొచ్చుట. మొదట్లో బాగానే పనిచేసింది, దానికేం రోగం వచ్చిందో, తిరగడం మానేసింది. పేద్ద కారణం ఏమీ లేదు, దాని వాషర్ పోయింది. దాన్ని బాగుచేయాలంటే, కొట్టుకి తీసుకురమ్మంటాడు వాడూ. ఏమిటో అంతా గందరగోళం.. వస్తే అన్నీ ఒకేవారంలో వచ్చేస్తాయి….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మరీ అంత sensationalism… అవసరమంటారా…

Bhopal

   ఈవేళ ప్రొద్దుట అదేదో చానెల్, TV 9 అనుకుంటా, ఓ కార్యక్రమం వస్తోంది. దాంట్లో ఈమధ్యన నార్వే లో , భారతీయ సంతతికి చెందిన, ఇద్దరు చిన్నపిల్లల సంరక్షణా భారం గురించి, జరిగిన సంఘటన గురించి, ఓ కార్యక్రమం చూపించారు. వీళ్ళ కార్యక్రమం చూసినవారనుకుంటారూ, ఏదో మన దేశంలోనే, చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయన్నట్టూ, వాటిని అందరూ యతాతథంగా పాలిస్తున్నట్టూ, ఓ పేద్ద ఇమేజ్ తయారుచేసేశారు. మన ఆచారవ్యవహారాలూ, సంప్రదాయాలూ, అలవాట్లూ చూసుకుంటే, నార్వే ప్రభుత్వం వారు చేస్తున్నది వింతగా కనిపించొచ్చు. కానీ, అసలు వాళ్ళకి పిల్లలంటే ప్రేమే లేనట్టూ, అక్కడకి మనకే ఎంతో ప్రేమా, అభిమానమూ ఉన్నట్టూ చెప్పడం భావ్యం అంటారా? ఈవేళ్టి Indian Express లో వచ్చిన వార్తేమిటి మరి? అంటే మన పిల్లలైతే బెల్లం, ఇంకోరి పిల్లలైతే అల్లమూనా? అంతకంటే నార్వే ప్రభుత్వం వారే బెటర్ కదా, తమదేశస్థులా, బయటివారా అని కూడా చూసుకోకుండా, ఎవరైనా పిల్లలు పిల్లలే అని వారి సంరక్షణా భారం తీసికుంటున్నారు కదా. అదీ తప్పేనా మన మీడియా దృష్టిలో?

   అవునూ, వాళ్ళ చట్టాలు వాళ్ళకుంటాయి. అది అర్ధం చేసికోవాలే తప్ప, ఏదో మనం వాళ్ళని ఉధ్ధరించేద్దామని అనుకోడం బుధ్ధితక్కువ. ముందుగా, ఈ మీడియావాళ్ళు, దేశంలో జరిగే అన్యాయాలగురించి high light చేయమనండి. తరువాత బయటి వాళ్ళసంగతి చూడొచ్చు. పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రమా మరీనూ? ఏదో ఒకటి రెండు చానెళ్ళు తప్పించి, ప్రతీ తెలుగు న్యూస్ చానెలూ, ప్రతీ రోజూ ఏదో ఒక విషయం తీసికోడం, దానిమీద “తమ” అభిప్రాయాలు, చూసేవాళ్ళమీద రుద్దడం. ఏదో ఆ ETV2 వాళ్ళు, మరీ ప్రతీ విషయాన్నీ, అతిగా sensationalise చేయరు, వాళ్ళ “నాయుడి” గారి గురించి మాట్టాడనంతవరకూ. అవునూ, ఆయనకి వీళ్లతో ఎన్నెన్ని లావాదేవీలో మరి. ఆమాత్రం సపోర్ట్ ఇవ్వడం మరి సమంజసమే. అలాగే ETV లో కూడా, కార్యక్రమాలు బాగానే ఉంటాయి. “పాడుతా తీయగా” మొదలెట్టింది వాళ్ళేగా. మరి ఆ కార్యక్రమానికీ, దాన్ని కాపీ చేస్తూ మొదలెట్టిన so called సంగీతకార్యక్రమాలకీ, వేషభాషల్లో తేడా లేదంటారా? అలాగే ETV2 లో ప్రసారమయ్యే వార్తలనండి,ప్రత్యేక కార్యక్రమాలు ” మార్గదర్శి” “తీర్థయాత్ర”, ” ఇదీ సంగతి” లాటివిబాగానే ఉంటాయి.

   ఇంక మిగిలిన వాళ్ళు ఏదో న్యూస్ చానెల్ అనడం, దాంట్లో అణాకాణీ వాణ్ణేవళ్ళనో పిలవడం, వాళ్ళతో ” చర్చా” కార్యక్రమాలు పెట్టడం. నిన్నో మొన్నో చూశాను ఎవరో ముగ్గుర్ని పిలిచారు, అందులో ఒకాయన ఓ మతం వారుట, ఇంకోరు ఓ పురోహితుళ్ళా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకళ్ళమీద ఒకళ్ళు అరుచుకోడం తప్ప, సాధించిందేమీ లేదు.
ఒక పరిస్థితిలో ఆ ప్యాంటూ,షర్టూ వేసికున్నాయన పక్కనే కూర్చున్న ఆ పురోహితుడి మీద చెయ్యి చేసికుంటాడేమో అని భయం వేసింది! ఇదంతా జరుగుతూంటే, ఆ యాంకరమ్మ కులాసాగా, నిర్వికారంగా నవ్వుతోంది. అసలే విజయవాడలోనూ, అమలాపురం లోనూ విగ్రహాల ధ్వంసం మీద కొట్టుకు ఛస్తున్నారు. ఆ టైములో ఇలాటి కార్యక్రమాలు అవసరమంటారా? మరి దీన్నే sensationalism అంటారు.

    ఇంకో చానెల్ లో నిండా రాత్రి పదిన్నరైనా అవదు, తెలుగుసినిమాల్లోని titillating scenes అన్నీ ఓ హారం కింద గుచ్చి మరీ చూపిస్తారు. ఏ అర్ధరాత్రో వేసికోవచ్చుగా, అబ్బే TRP లు తగ్గిపోవూ? పైగా ఈ కార్యక్రమాల్లో బ్రేక్ లు కూడా ఉండవు. దీనికి యాంకరింగ్ ఓ అమ్మాయి చేస్తుంది. ఆవిడకి embarassing అనిపించదా? పైగా వీటన్నిటికీ ” సామాజిక చైతన్యం” అని అంటూంటారు. It is just disgusting. అక్కడికేదో నేను prudish అనుకోకండి. ఇలాటివన్నీ చూపించుకోడానికి ఓ చానెల్ మొదలెట్టుకోమనండి డబ్బులు మూలుగుతూంటే. అంతే కానీ news channel అని పేరెట్టి, ఇలాటి blue films చూపించఖ్ఖర్లేదు. ఏదో ఆ Press Council Chairman కట్జూ ఏదో అంటే, ఆయనమీద ఎగిరేశారు, freedom of speech, freedom of media… అంటూ, మెడమీద తలున్న మన జర్నలిస్టులు.. ఇలాటివాళ్ళందరికీ బయట దేశాల్లోని చట్టాలుండాలి.

   ఇప్పటికైనా అర్ధం అవుతుందనుకుంటా మనవాళ్ళకి, నార్వేలో పిల్లల విషయంలో చట్టాలు ఎలా ఉంటాయో, ఎందుకుంటాయో. ముందుగా మన ఇల్లు చక్కబెట్టుకున్న తరువాత, బయటి వారి సంగతి మాట్లాడదాం

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   నిన్నటి రోజున నేను వ్రాశినటపా మీద ఓ వ్యాఖ్య వచ్చింది. శ్రీ బాపు గారి గురించి సాక్షి పేపరులో వచ్చిన కార్టూన్ లింకు ఇచ్చారు. మళ్ళీ మీరందరూ, ఆ లింకేమిటో అని ఖంగారు పడేబదులుగా, అదేదో నేనే పెట్టేస్తే బావుంటుందని, ఆ కార్టూన్ పైన ఇచ్చాను. ఎంత apt గా ఉందో కదూ !! ఇంకో విచిత్రం ఏమిటంటే, ఈ వ్యాఖ్య పెట్టిన వారి పేరు “బాపు”, ఆయన మెయిల్ ఐడీ లో రమణగారి పేరుండడం. ఈవేళ NTV లో ఒక కార్యక్రమం చూశాను, ఈ విషయం గురించే– ఎవరెవరో వారి వారి అభిప్రాయాలూ, శ్రీ బాపు గారికి పద్మ ఎవార్డు రానందుకు బాధపడిపోతూ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అందులో ఒకాయనన్నారూ- ” మనం తెలుగువారి గురించి ఉత్తినే రికమెండు చేసేస్తే సరిపోదూ, ఆ కమెటీ వాళ్ళకి అర్ధం అయేటట్టు హిందీలో ఏదైనా brief గా వ్రాసిస్తే బాగుండేదేమో…” అని. I think this is the most ridiculous suggestion of the century.. మన పక్క రాష్ట్రం తమిళనాడు వాళ్ళు హిందీ అంటేనే పడేడుస్తారే, మరి వాళ్ళకి అన్నేసి పద్మలు ఎలా వస్తున్నాయో? ఇక్కడ మన ప్రభుత్వం వారిచ్చిన రికమెండేషన్ అర్ధం అవుతుందా లేదా అని కాదు ప్రశ్న, ప్రభుత్వాల మీద అవిశ్వాస తీర్మానాలొచ్చినప్పుడు, మన పార్లమెంటు మెంబర్ల సపోర్టడగడం లేదూ, అక్కడ అడ్డం రాని భాష ఇక్కడెందుకూ? అప్పుడెప్పుడో, తెలుగుదేశం మనిషి ఆదికేశవులునాయుణ్ణి హిందీలోనే అడిగారా మాకు మీ ఓటు ఇవ్వండీ అని? ఏదో టివీ వాళ్ళు అడిగారు కదా అని సలహాలిచ్చేయడం. అన్నిన్ని కబుర్లు చెబతారే, మన నటసామ్రాట్టు గారు, ప్రతీ ఏడూ, ఊళ్ళో ఉన్న అందరికీ ఇస్తారే కానీ, మన బాపురమణలు గుర్తుకే రాలేదా? ఏమైనా అంటే అన్నారని అభిమానసంఘాలవాళ్ళు హడావిడి చేస్తారు.ఎందుకొచ్చిన గొడవా?

   ఏదో మనవాళ్ళు ఎడిలైడ్ టెస్టులో అయిదోరోజుదాకా ఆడకలిగారని ఊరికే సంతోషపడిపోనఖ్ఖర్లేదు. ఇదంతా మన గొప్పేనని ఊరికే అపోహపడిపోకండి. ముందరి మూడు టెస్టులూ మూడో రోజుకే అయిపోవడంతో, అక్కడిbroadcasters నష్టాల్లో పడిపోయారుట. అందుకే ఎలాగోలాగ అయిదో రోజుకి లాక్కురావడానికే , మనకి follow on ఇవ్వలేదు. ఈవేళ్టి ఆడిన పధ్ధతి చూస్తే, ఆ follow on ఏదో ఇస్తే, నిన్నటికే పూర్తయుండేది. This is another way of match fixing.. ఇలాటి ఫిక్సింగులమీద ఇంక్వైరీలూ గట్రా ఉండవు !! వాడెవడో డబ్బు తీసికున్నాడని గోలెడతారే, మరి ఇలాటి day light robberies దృష్టిలోకి రావా మరి? డబ్బు మాస్టారూ డబ్బు. రేప్పొద్దుట మనం నిద్రలేచే టైముకి మాచ్ అయ్యేపోతుంది, గొడవా వదుల్తుంది. మళ్ళీ వచ్చేవారం ODI లుట! అందులోనైనా మన భగవద్స్వరూపుడు ఆ వందో శతకం పూర్తిచేసేస్తే, అందరూ ఆనందిస్తారు. భారతరత్న గురించి ఆలోచించొచ్చు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

NLaw

   నేను ఓ వారం రోజులపాటు బ్లాగులు వ్రాయకపోవడానికి, ఆయనెవరో పెట్టిన వ్యాఖ్య ఓ పేద్ద కారణం కాదు.It was purely coincidental… ఏదో మూడ్ లేక వ్రాయలేదు. కానీ, నిన్నటి టపా చదివినవారి సంఖ్యా, వ్యాఖ్యలూ చదివిన తరువాత అనిపించింది– ఇంక మిమ్మల్ని వదిలేది లేదూ.. అని. ఏదో అసలు ఉండేదెంతకాలం, అందులో మళ్ళీ మూడ్లూ, అలకలూ అంటూ కూర్చుంటే మీరందరూ సుఖపడిపోరూ? వామ్మోయ్, నేను వ్రాస్తూనే ఉంటాను, మీరు భరించకా తప్పదు…

    నిన్న పెట్టిన నార్వే సంఘటన సుఖాంతమయింది మొత్తానికి. సర్వే జనా సుఖినోభవంతూ !! పైన పెట్టానే దాన్ని ఓ నొక్కు నొక్కండి. ఈవేళ్టి సాక్షిలో కూడా చదివాను. ఈవేళ మన రిపబ్లిక్ దినోత్సవంట. అసలు గుర్తే లేదు, నిజం చెప్పాలంటే. మా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాను. ఆరోజుల్లో టివీ లూ అవీ ఉండేవా ఏమిటీ? ఏదో 25 వ తేదీ రాత్రి ఎనిమిందిటికి రేడియో ముందర కూర్చోడం, మన రాష్ట్రపతి సందేశాన్ని శ్రధ్ధగా వినడం, ఆ తరువాత వచ్చే జాతీయగీతం వినేటప్పుడు నుంచోడం. వెంటనే , ఆ సందేశం తెలుగులో వినడం. పైగా ఆరోజుల్లో మన దేశాద్యక్షులు ఎలాటి ఉద్దండులుండేవారో! ఇంక మర్నాడు ప్రొద్దుటే, ఏడు గంటలకి ఏ పన్యాల రంగనాధరావు గారో, తమదైన unique style లో, ప్రభుత్వం వారిచ్చిన పద్మ పురస్కారాలు పొందిన వారి పేర్లు చెబుతూంటే, ఓ పెన్సిలూ, కాగితం తీసికుని నోట్ చేసికోడం. ఎందుకంటే న్యూస్ పేపర్ సాయంత్రం దాకా రాదు కనుక.తొమ్మిదింటిలోపల స్కూలుకి తెల్ల చొక్కా, తెల్ల నిక్కరూ, తెల్లబూట్లూ వేసికుని వెళ్ళి, అక్కడకూడా పతాకవందనం,ఏసీసీ,ఎన్ సీ సీ, పెరేడ్ చూసి, స్కూల్లో పంచిపెట్టిన మిఠాయిలో, చాక్లేట్లో తెచ్చుకుని, మళ్ళీ రేడియో పెడితే, దాంట్లో ఢిల్లీ లో జరిగే పెరేడ్ మీద ఏ Melville D’Mellow, V.M.Chakrapani, Roshan Menon లో చెప్పే ప్రత్యక్షప్రసారం విని, అప్పుడు భోజనం చేయడం. మళ్ళీ సాయంత్రం స్కూల్లో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలూ, అబ్బ ఏం హడావిడండి బాబూ..

   ఇప్పుడేమిటీ, ఓ రోజుముందుగానే పద్మ ఎవార్డులు వచ్చినవాళ్ళపేర్లూ, పైగా ఓ వారం ముందునుంచీ ఎవరెవరి పేర్లు రికమెండు చేయబడ్డాయో, వాటి వెనక ఎన్నెన్ని పైరవీలో వివరాలూ. ఎవడిక్కావలిసిన వాడికి, వారి పేర్లు రికమెండు చేయడం, పైగా వీటిలో“కోటా” ఒకటీ ! ఒక విషయం అర్ధం అవదూ, ఎప్పుడో పోయినవాళ్ళకి అసలు ఈ ఎవార్డులెందుకూట? ఇవ్వకపోతే ఏమైనా వాళ్ళు కోప్పడతారా? ఈ ఎవార్డులవలన వాళ్ళకి ఒరిగేదేమీ లేదు. ఇవ్వకపోయినా వాళ్ళకి తరిగేదీ లేదూ. ఊరికే ఎలెక్షన్ స్టంట్లు.ఈరోజుల్లో మన దేశాద్యక్షుల్ని చూసినా, విన్నా అసలు ఆ inspiratioనే ఉండడం లేదు. పైగా ఆవిడ పదవీకాలం ఈ ఏడు పూర్తవుతుందిట, పూణె లో ఆవిడుండడానికి ఓ ఇల్లూ అవీ ఎరేంజ్ చేస్తున్నారులెండి. ఈమధ్యనే పేపర్లో చదివాను- ఆవిడ ఇదివరలో నడిపించిన పంచదార ఫాక్టరీ, వేలం వేస్తున్నట్టు. పేద్ద కారణం అని కాదు, ఏదో బ్యాంకులకీ, వాళ్ళకీ ఈ ఫాక్టరీ వాళ్ళుఓ నూట ఇరవై కోట్లు ఋణ పడి ఉన్నారుట, ఇప్పుడీ వేలం వేస్తే, ఏదో సగం తీరుతుందిట. మిగిలినది, మిమ్మల్నీ, నన్నూ వేలం వేస్తారు. అదేనండి, exempt చేయడం అన్నమాట. ఎంతైనా మాజీ అద్యక్షులు కూడానూ ! మరి ఇలాటి వారిని చూస్తే inspiration రమ్మంటే ఎక్కడ వస్తుందీ? ఈవిడ అయినతరువాత ఇంకోర్ని వెదకాలి. వెదికేదేమిటిలెండి, ఎక్కడో ఏ రాజకీయనాయకుడో ఉండే ఉంటాడు.

   ఊరికే మనందరమూ మొత్తుకోడం తప్ప, శ్రీ బాపూ గారికి పద్మ ఎవార్డ్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? ఎవార్డులు వస్తాయనే ఆయన , వారి చిత్రాలద్వారానూ, కార్టూన్లద్వారానూ, మన తెలుగువారందరికీ అంత ఆనందం ఇస్తున్నారా? అసలు దానిగురించి, ప్రతీ ఏడూ అనుకోడం, తీరా రాకపోతే నిరాశ చెందడం, అసలు అవసరమంటారా? ఆ మాయదారి ఎవార్డు ఇచ్చి, ఆయన్ని అగౌరవపరచడం కంటే, అసలు ఆయన పేరే ఎత్తకుండా ఉంటే, ఆయన్ని గౌరవించినట్టు. ఎనిమిదేళ్ళనుండీ రికమెండు చేయడం, కేంద్రప్రభుత్వం, దానిగురించే ప్రస్తావించకపోవడం చూస్తూంటే, వెధవ కబుర్లు చెప్పే ఈ రాజకీయ నాయకులు without exception ప్రతీవాడూ, ఎంత దౌర్భాగ్యులో తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎప్పుడో, ఆ జయలలిత తల్చుకుంటే, భారతరత్న కూడా ఇప్పించొచ్చు. She is capable of that. ఎలాగూ శ్రీ బాపు గారు ఉండేది చెన్నై లోనే, ఆయన కడుతున్న పన్నులూ అవీ, తమిళనాడుప్రభుత్వానికే. ఎస్పీ కి రాలేదూ, అలాగే ఇదీనూ. తరువాత ప్రతీ తెలుగువాడూ చంకలెగరేసుకోవచ్చు బాపూ మా వాడే అని ! ఎలాగూ మనవాళ్ళకి అలవాటే కదా!

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇలా అయితే కష్టమే కదండీ….

    ఓ వారం అయింది టపా వ్రాసి. మనం టపాలు వ్రాయకపోతే, ప్రపంచం ఏదీ ఆగదు. పైగా ఎవరి పని వాళ్ళు హాయిగా చేసికుంటారు. నాకైతే పనేమీ లేదు కానీ, మిగిలినవారికి ఏదో ఒక వ్యాపకం ఉంటుందిగా. ఏదో మన టపాలు మిస్ అవుతున్నారూ అందరూ, అనుకోడం ఓ తృప్తీ. నిజం చెప్పాలంటే అలాటిదేమీ ఉండదు. పాపం ఆయనకెవరికో ( పేరు కూడా వ్రాసుకోలేని దుస్థితి పాపం ఆయనది) నెత్తిమీద ఇంకా బొచ్చొచ్చుండాలి ఈ వారం లోనూ! పోన్లెండి ఆ గొడవంతా ఎందుకూ ఇప్పుడు?

    మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా, మా మనవడు అగస్థ్య వాడి నానమ్మని, ఎత్తుకో..ఎత్తుకో.. అంటూ పీకేస్తూంటాడు. ఈవేళ “సాక్షి” పేపర్ లో ఓ వార్త చదివి, పోనీ వీణ్ణి నార్వే పంపించేద్దామేమిటండీ, అని ఓ ప్రపోజల్ పెట్టింది మా ఇంటావిడ. వాటి వివరాల్లో కెళ్ళాలంటే ఇక్కడ చదవండి, లేదా కింద పెట్టిన Norwegian Law మీద ఓ నొక్కు నొక్కండి. తెలుస్తుంది..

   ఇదెక్కడి గొడవండి బాబూ, పిల్లలకి గోరుముద్దలు తినిపించకూడదుట, పక్కని పడుక్కోబెట్టకూడదట. బయటి దేశాల్లో ఏదో సంపాదించేసి సుఖపడిపోదామని వెళ్ళడమే కానీ, ఉన్న ఇద్దరు పిల్లలనీ, దగ్గరకే తీసికోకూడదంటే ఎలాగ? ఏమిటో చిత్రచిత్రాతి చట్టాలూ. హాయిగా మనకే బావుంది.. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్టాడుకోవచ్చు, అవతలివాడు ఎలాటివాడైనా, మన ఎసెంబ్లీ కి పోటీ చేసి నెగ్గొచ్చూ, రన్స్ స్కోర్ చేయకపోయినా హాయిగా టెస్టుల్లో ఆడి డబ్బులు కూడబెట్టుకోవచ్చు, విగ్రహాలు కూల్చొచ్చు అది ట్యాంకు బండైనా సరే, లేక కోనసీమ అయినా సరే! ఓపికున్నంత దోచుకోవచ్చు, మరీ పట్టుబడిపోతే మొక్కుబడిగా కొన్ని నెలలు జైల్లో కూర్చోచ్చు. భూములూ, గనులూ అన్నీ మనవే. అన్నిటిలోకీ ఇంకో సదుపాయం ఏమిటంటే, మన న్యాయ వ్యవస్థ కూడా ఎవడడిగినా వాడికి ఓ ” స్టే” ఆర్డరోటి ఇచ్చేస్తుంది.బెయిళ్ళ సంగతి అసలు అడగొద్దు.

    ఈవేళ మా పూణె మహానగరం లో ఓ సంఘటన జరిగింది. పొద్దుటే ఎనిమిదిన్నరకి ఓ డ్రైవరు ఓ ఎస్ టీ బస్ డిపోలోంచి బయటకు తెచ్చి, వాడిష్టం వచ్చినట్టు నడిపి, దారిలో ఎవడడ్డం వస్తే వాడి మీదనుంచి పోనిచ్చేసి ఓ తొమ్మిదిమంది ప్రాణాలూ తీసేశాడు. ఓ పాతికపై మంది జనాలు గాయపడ్డారు. ఇంక వాహనాల సంగతి అడక్కండి. ఏదో వాడి పేరు, ఇంకో మతం వాడు కాదుకాబట్టి, ఆ మతానికి చెందిన మిగిలినవారు బ్రతికిపోయారు. లేకపోతేనా.. తెలుసుగా పూణె లో పేద్ద కారణం అంటూ అఖ్ఖర్లేదు.. మరి ఇలాటివన్నీ అదేదో నార్వేలో చేయడానికి వీలుంటుందా మరి?

    ఇవన్నీ సరిపోనట్టు ఈవేళ్టి పేపరులో ఇంకో వార్త చదివాను. అదికూడా చదివేస్తే ఇవాళ్టికి చాలు.Norwegian LawDNA

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— ఓ మనిషవ్వొచ్చు, కొట్టవ్వొచ్చు, అనుబంధం అనుబంధమే….

Manney’s

    ప్రతీ మనిషికీ చిన్నప్పటివో, కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటివో, ఎన్నెన్నో జ్ఞాపకాలుంటాయి. పైగా ఓ మనిషి కానీ, ఓ సంఘటన కానీ, తన జీవితంలో ఒక మార్పుకి గురి అయినదైతే అసలు మర్చిపోలేము. అలాగే ఏ స్కూలుకెళ్ళేటప్పుడో దారిలో ఉండే కొట్టనండి, ఓ సినిమా హాలనండి , సావకాశంగా కూర్చున్నప్పుడు గుర్తొస్తూంటాయి. ఎప్పుడో, సంవత్సరాల తరువాత ఓ సారి చూసొద్దామని వెళ్తే అక్కడేముంటుందీ? ఆ కొట్టు స్థానంలో ఓ మాలూ, సినిమా హాలు స్థానం లో ఓ మల్టీప్లెక్సూ! అయ్యో అనుకుంటాము. కానీ ఆ జ్ఞాపకాలు రాక మానవుగా.

    ఇప్పుడు మరీ అంతకాదనుకోండి. ఈ రోజుల్లో అన్నీ use and throw ! చేరిన ఉద్యోగంలోనే పట్టుమని రెండేళ్ళుండని ఈ కాలంలో మరీ attachment లు ఉండాలనుకోడం అత్యాశే ! ఏదో తప్పదు కాబట్టి తల్లితండ్రులతో మరీ అంత కాకపోయినా ఏదో ఆ బాండింగు ఉంచుతున్నారు. దీనికి ఎవరినీ తప్పుపట్టలేము. కాల మహిమ ! నేను 1963 దాకా అమలాపురం లో స్కూలు,కాలేజీ చదువులులాటివి పూర్తిచేసి ఉద్యోగానికి పూనా వచ్చాను. అమలాపురం లో ఉన్నంతకాలమూ, ఏ కిళ్ళీకొట్టునుండో డిటెక్టివ్ పుస్తకాలు అద్దెకి తెచ్చి చదవడం వరకే సీమిత్ నా పుస్తక పఠనం. ఏదో మెడ్రాస్ లాటి ఊళ్ళు వెళ్ళినప్పుడు ఏ మూర్ మార్కెట్ లోనో ఇంగ్లీషు పుస్తకాలు చూసేవాణ్ణి. అలాగని చదివే ధైర్యం ఉండేది కాదు. ఏదో ఏ హాలీవుడ్ సినిమా గురించో ఏ “కినిమా” లో కానీ, ఏ “సినిమారంగం” లో కానీ బొమ్మలు, అదీ ఎవరికీ కనిపించకుండా చూసి ఆనందించడమే! ఇదీ నా పుస్తకపఠన background !

    అలాటిది నేను ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకి, నన్ను మా ఫాక్టరీలో ఇంకో సెక్షన్ కి మార్చి, లైబ్రరీ చూడమన్నారు. అక్కడ ఏదో టెక్నికల్ పుస్తకాలుండేవి. గవర్నమెంటులో funds కి ఏమీ లోటులేదుగా. దానికి సాయం, మా జనరల్ మేనెజర్ గారికి, కొత్త కొత్త పుస్తకాలు చేర్చాలని ఓ కోరికా! ప్రతీ బుధవారం పూనాలో Westend సినిమా పక్కనే ఓ కొట్టుండేది Manneys అని.

    అక్కడకి వెళ్ళడం,మా బాస్ చెప్పిన ఏదో పుస్తకం కొనడం, అలా కాలక్రమేణా, ఆ కొట్టు అతను ఇవ్వగా, కొన్ని పుస్తకాలు On approval basis మీద తెచ్చేవాడిని. మా జిఎం గారికి నచ్చొచ్చేమో అని, ఆయన ఆ పుస్తకాన్ని ఓసారి చూసి,excellent selection అని ఓ శభాసీ ఇచ్చేవారు. ఓహో నాక్కూడా పుస్తకాల సెలెక్షన్ వచ్చునన్నమాట అని సంతోషపడిపోయేవాడిని. ఇంక వారానికి రెండు సార్లు వెళ్ళడం మొదలెట్టాను. దీనితో ఆ కొట్టతనికీ, నాకూ ఓ అవినాభావసంబంధం ఏర్పడిపోయింది. ఇది ఎంతదాకా వెళ్ళిందీ అంటే, ఫాక్టరీ కోసం పుస్తకాలే కాకుండా, ప్రత్యేకంగా నేను చదువుకోడానికి అప్పుడే కొత్తగా వచ్చిన Hard bound నావెల్సనండి, క్రికెట్ మీదొచ్చిన పుస్తకాలనండి, నాకు ఓపికున్నన్ని పుస్తకాలిచ్చేసేవాడు. Paper back కీ Hard bound కీ ఉన్న తేడా ఏమిటో చాలామంది పుస్తకప్రియులకి తెలిసే ఉంటుంది. రెండో దాంట్లో పెద్ద పెద్ద అక్షరాలూ, మరీ మొదటిదానిలా ఇరుకిరుగ్గా ఉండేవి కావు. దానితో పుస్తకాలంటే ఓ పిచ్చి ఏర్పడిపోయింది. వందల పుస్తకాలు అవీ ఒరిజినల్ Hard bound లో చదివే అవకాశం వచ్చింది. That was how my love wih books started పూనా/పూణె తో సంబంధం ఉన్న ఎవరికైనాసరే ఈ పుస్తకాల షాప్ పరిచయమే! తెలుగు పుస్తకాలకి మన విశాలాంధ్ర, నవోదయా ఎలాటివో, పూణె లో ఇంగ్లీషు పుస్తకాలకి ఈ Manneys అలాగన్నమాట.

   దీనితో ఏమయిందీ, ఇంట్లో ఎప్పుడు చూసినా పుస్తకాలే. రైల్వే స్టేషన్ లో తెలుగువీ, ఈ కొట్టునుంచి తెచ్చిన ఇంగ్లీషువీ. పెళ్ళైన తరువాత మా ఇంటావిడకీ ఈ జాడ్యం అంటించాను!ఇంక దానితో మా ఇంట్లో పుస్తకాలు చదవడం ఓ “వ్యసనం” లా మారింది. మధ్యలో 15 సంవత్సరాలు, వరంగాం ట్రాన్స్ఫర్ అయినా, అక్కణ్ణుంచి కూడా, ఈ కొట్టతనితో సంబంధాలు కంటిన్యూ చేశాను, కారణం అక్కడకూడా లైబ్రరీ ఏ చూసేవాణ్ణి. ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలే అవడంతో, మా పిల్లలకి కూడా ఇదే అలవాటయింది. అదే చివరకి, మా అబ్బాయిచేత ఓ గ్రంధాలయం ప్రారంభించేదాకా వచ్చింది. ఆ Manney’s తో ఎన్నెన్ని జ్ఞాపకాలండి బాబూ. మా ఇంటావిడతో మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు, ఓ నిట్టింగ్ బుక్ ఇచ్చారు. ఇప్పటికీ ఉంది. అలాగే మా అమ్మాయి రెండో birthday కి ఓమూడు పుస్తకాలిచ్చాడు. ఇప్పటికీ ఉన్నాయి.అలాటివి మర్చిపోగలమా?

   అలాటిది నిన్నటి పేపర్లో వచ్చిన వార్త ( పైన ఇచ్చాను, ఓ నొక్కు నొక్కండి) చదవగానే గుండె చెరువైపోయింది! ఏదో మన ఇంట్లోనే ఎవరో వెళ్ళిపోయినంత బాధేసింది! ఎవరి కారణాలు వాళ్ళకుంటాయనుకోండి, కానీ ఈవేళ ఉండబట్టలేక, వెంటనే వెళ్ళి ఆ కొట్టతని తో నా nostalgia పంచుకున్నాను! ఒకటా రెండా 48 సంవత్సరాల గుర్తులు! జీవితంలో ఇంగ్లీషు పుస్తకాలు చదవడానికి సదవకాశం ఇచ్చిన మా Manneys కి ఇదే నా పుష్పాంజలి !!
బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Exchange Offers….

   ఇదివరకటి రోజుల్లో ఇంట్లోకి ఏదైనా electronic item కొనడమే కష్టమయ్యేది. కారణం మరేమీ లేదూ, కొనే “ఒపిక” or “ఆర్ధిక స్థోమత” లేక! పైగా ఆరోజుల్లో ఇప్పటిలాగ instalments వగైరా ఉండేవి కావూ, అరువులాటిదీ దొరికేది కాదు. రెండు మూడేళ్ళు ఏదో కూడబెట్టి కొనుక్కోవడమే. నేను చెప్పేది నమ్మకపోతే, మీ ఇంట్లో ఉండే పెద్దాళ్ళని అడగండి, మీ ఇంటికి మొట్టమొదటి ఫ్రిజ్ ఎప్పుడొచ్చిందీ, మిక్సీ ఎప్పుడొచ్చిందీ, అంతదాకా ఎందుకూ టేబిల్ ఫాన్ ఎప్పుడొచ్చిందీ అని! వాళ్ళూ పాత జ్ఞాపకాలు తాజా చేసికుంటారు. ఇంట్లో జరిగిన ఏదో సంఘటనతో ముడెట్టుకుని కొన్నవే. ఎప్పుడో మిమ్మల్ని స్కూల్లో వేసే ముందరో, తమ్ముడు పుట్టే ముందరో, అలాటివే. దానితో కొన్న ఆ వస్తువుమీద కూడా ఓ attachment ఏర్పడిపోయేది. ఇప్పుడు అలా కాదుగా. మార్కెట్ లోకి వచ్చే ప్రతీ వస్తువూ మన ఇంట్లో ఉండాలాయె. లేకపోతే సొసైటీలో మీకూ, స్కూల్లో మీ పిల్లలకీ ఎంత తలవంపూ ! ఏదో మాలాటివాళ్ళు ఇంకా, అప్పుడెప్పుడో కొనుక్కున్న వస్తువులనే పట్టుకు వేళ్ళాడుతూంటాము. వదలా లేమూ, ఏదోలా పనిచేస్తోంది కదా, ఇప్పుడే ఎందుకూ మార్చడం అనే బధ్ధకమూ. ఇక్కడే వస్తుంది అసలు తేడా పాతవారికీ, కొత్తవారికీ “ఏదోలా పనిచేస్తోందిగా..” అనే concept ఉందే అది చాలా డేంజరస్! ఓ మిక్సీ ఉందనుకోండి, ఏదో పప్పు నానేస్తే, నలుగుతుంది. కానీ ఆ మిక్సీ పనిచేస్తున్నంతసేపూ పేద్ద శబ్దాలు, ఊరంతా వినిపించేటంత చప్పుళ్ళు. అంటే మనం ఇంట్లో ఏదైనా రుబ్బుకుంటే ఊరంతా తెలుస్తుందన్నమాట!ఆఫీసునుండి పిల్లలొచ్చేసరికి, వీధి చివరకి వినిపిస్తూంటుంది మన మిక్సీ చప్పుడు– “ఓహో అమ్మ రేపటికి ఇడ్లీ పిండి రుబ్బుతోందన్నమాట..” అని కొడుకూ, “ఓహో అత్తగారు రేపటి బ్రేక్ ఫాస్ట్ కి ఏదో చేస్తున్నట్టున్నారు.. ” అని కోడలూ! ఇంక పిల్లలకైతే నవ్వూ!

పోనీ కొత్తది కొనుక్కుంటే పోలా అని ఓసారి అనుకున్నా, ఈ ఇంట్లో ఉన్నదాన్నేం చేయడం? కిచెన్ టేబిల్ మీద ఒక్కమిక్సీకే చోటు లేదు, ఇంక రెండోదెక్కడ పెట్టడం? పోనీ ఎవరికైనా అమ్మేస్తేనో? ఎవడుకొంటాడు, ఇక్ష్వాకుల కాలం నాటి మిక్సీనీ? దానిమీద ఎదురు డబ్బు పెట్టినా ఎవడూ తీసికోడు, పైగా కొనుక్కోవడం కూడానా! అప్పటికీ ఉండబట్టలేక, మన సొసైటీ లోని వాచ్ మన్ నో, పనిమనిషినో అడిగి చూస్తాము, ” మా ఇంట్లో పాత మిక్సీ ఉందోయ్, ఏదో చవకలో ఇచ్చేద్దామనుకుంటున్నాము, నీకేమైనా కావాలా..” అని. వాడు ప్రతీ రోజూ మనింట్లో మిక్సీ ఆన్ చేసినప్పుడు వచ్చే సౌండులు భరించలెకపోతున్నాడు, పైగా దీన్ని కొనుక్కోడమోటా? నిజం చెప్పాలంటే వాడింట్లో Food Processor ఉంది. అఖ్ఖర్లేదండి అమ్మగారూ, ఈ మధ్యనే మా ఆడది వాయిదాల్లో కొత్తది కొంది. ఆ విషయం పాపం ఈవిడకి తెలియదు. ఎన్నిసార్లు మెట్ల పక్కనుంచి వెళ్ళినా, శబ్దాలే వినిపించలేదూ. మిక్సీ అంటే పేద్ద పెద్ద శబ్దాలు రావాలీ అనేదే ఈవిడ నమ్మకం. పనిపిల్ల మర్నాడు మనింటికి వచ్చేముందరే, దారిలో కాపేసి ఈ వాచ్ మన్ alert చేసేస్తాడు. “ఏయ్ జాగ్రత్త, అమ్మగారు తన పాత మిక్సీని అంటకట్టాలని చూస్తోంది” అని. అలాగ, ఈ ఇద్దరిచేతిలోనూ reject చేయబడి, చుట్టుపక్కలవాళ్ళందరితోనూ చెప్పుకోవడం. “ఏదో ఇన్నేళ్ళనుండీ తెలిసినవారు కదా అని, చవకలో మిక్సీ ఇస్తానంటే ఎంతంత సూకరాలో.”.. అని.

ఇదిగో exactly same పరిస్థితిని cash చేసికోడం మొదలెట్టారు మన కంపెనీలు. పండగొచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా హోర్డింగులు, పేపర్లలో యాడ్డులు, పేపర్లతో పాటు ఓ పాంఫ్లెట్టూ ! మీ ఇంట్లో ఉన్న ఏవస్తువైనా సరే, ఏ కంపెనీదైనా సరే, తెచ్చి మేమిచ్చే ఆకర్షణీయమైన భారీ భారీ తగ్గింపులు స్వంతం చేసికోండి… అంటూ! కట్టుకున్న పెళ్ళాం తప్ప ఇంట్లో ఉన్న ఎలాటిదైనా పాతదిచ్చేసి కొత్తది తెచ్చేసికోవచ్చుట ! పొలోమంటూ ఇంట్లో ఉన్న చిన్నా చితకా వస్తువులన్నీ ఓ బస్తాలో వేసేసి, ఓ ఆటో చేసేసికుని వెళ్ళిపోవడం. కార్లున్నవాళ్ళు మరీ ఇలాగ వెళ్ళరులెండి, నామోషీ మరి! పాతవాటిని ఏ NGO వాడికో ఫోను చేసి వాళ్ళకిచ్చేస్తే పుణ్యం పురుషార్ధమూనూ! ఒకలా చూస్తే ఇదే హాయనిపిస్తుంది. ఇంట్లో వాచ్ మన్ కీ, పని మనిషికీ పోనీ ఊరికే ఇచ్చేద్దామన్నా, వాళ్ళేమైనా విశ్వాసంగా ఉంటారా అంటే అదీ లేదూ.వాళ్ళకి ఎంత చేయండి, వాళ్ళు మాత్రం మారరంటే మారరు. ఇంటికి చుట్టాలొస్తున్నారంటే రెండురోజుల ముందరనుండీ పనికి రాదు పనిమనిషి. ఇంక వాచ్ మన్ ఉన్నాడే వాడు, ఏదో ముందరి నెలరోజులూ, ఎప్పుడైనా కరెంట్ పోతే, జనరేటర్ వేస్తాడు, తరువాత మామూలే, డీశల్ అయిపోయిందంటాడు.

ఈ సోదంతా ఎందుకూ అంటే, మా ఇంట్లో 1998 లో కొన్న ఓ Food Processor ఉందిలెండి. పనిచేస్తోందా అంటే చేస్తోంది. మా ఇంటావిడ ఎప్పుడైనా కారం పెట్టి వంకాయ కూర చేద్దామని, కొత్తిమిరీ పచ్చిమిరపకాయా కలిపి నూరితే, వాటి రూపం మారదు. కొబ్బరి పచ్చడి చేద్దామంటే, ముక్కలు ముక్కల్లాగే తగలడతాయి. నాకా పళ్ళు లేవు. .పచ్చళ్ళో ఉన్న ముక్కలన్నీ ఏరేస్తే మిగిలేది, ఆవిడ పెట్టిన పోపులోని ఎండు మిరపకాయలోటీనూ ! ఇలా కాదు మార్చేద్దామని బయలుదేరాము. ఓ కొట్లో అడిగితే ఏదో నాలుగు వేలు చెప్పాడు

మాదగ్గర ఉన్న పాతది తీసికుంటావా అంటే, నో అన్నాడు. పైగా తనే చెప్పాడు ఏ పనిమనిషికో ఇచ్చేయండి, సంతోషిస్తారూ అని. అక్కణ్ణించి ఇంకో కొట్టుకు వెళ్ళి అడిగితే, పాతది తీసికుంటామూ, అని అదీ ఇదీ కాలుక్లేట్ చేసి నాలుగువేల అయిదువందలన్నాడు. ఇందులో మనకి వచ్చిన సంతృప్తి ఏమిటయ్యా అంటే, మన దగ్గరున్న పాతదానికి ఏదో కొంత వస్తోందీ అని. Its purely an aberration! పాతది తీసికోకుండా ముందరి కొట్టువాడు నాలుగువేలన్నాడు. ఏదో మెహర్బానీ చేస్తున్నట్టు పోజు పెట్టి రెండో వాడూ అదే చెప్పాడు. ఏ NGO వాడికో ఇచ్చేస్తేనే బాగుంటుందనిపించింది.

ఈ కంపెనీల వాళ్ళు మనకేమైనా చుట్టాలా ఏమిటీ, చవకలో ఇవ్వడానికి. ఏదో ” మధ్యతరగతి మనస్థత్వాల్ని” exploit చేయడం తప్ప ….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- ఏంచేయగలం…

   ఇదివరకటి రోజుల్లో మార్కెట్ వాతావరణం మరీ అన్యాయంగా ఉండేది కాదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, బజార్లోకెళ్ళి ఏదైనా వస్తువు కొని, ఇంటికెళ్ళిన తరువాత దాంట్లో లోపం ఏదైనా కనిపిస్తే, కొట్టువాడు తిరిగిచ్చేవాడు. దానికో కారణం మనుష్యులు మరీ వ్యాపార దృష్టితో కాకుండా, కొద్దిగా మానవత్వం, ఒకళ్ళమీదొకళ్ళకి నమ్మకం గట్రా ఉండడం. కానీ ఈరోజుల్లో ఎక్కడ చూసినా, అంతా consumerism. ఆ పాడైన వస్తువు తిరిగి పుచ్చుకుంటే మనకేమైనా లాభం ఉందా, అసలు ఆ వచ్చినవాడు నమ్మదగ్గవాడేనా etc..etc.. ఆలోచించి, మరీ మనం రూల్సూ గట్రా మాట్లాడితే, ఏదో పేద్ద మెహర్బానీ చేస్తున్నట్టు పోజెట్టి విసుక్కుంటూ “సరే మిరు కాబట్టి ఇస్తున్నానూ..” అని, మొత్తానికి తిరిగి ఇస్తాడు. కానీ బిజీ బిజీ అయిన ఈరోజుల్లో, ఇంతంత తిరుగుళ్ళూ అవీ చేసే ఓపికా టైమూ ఎక్కడున్నాయి? “పోన్లేద్దూ.. ” అనేవారే ఎక్కువ. సరీగ్గా దాన్నే cash చేస్తున్నారు ప్రతీవారూనూ. ఏదో పనీ పాటూ లేని, నాలాటివాళ్ళు ఏం చెప్పినా అది చాదస్థం అని కొట్టిపారేస్తారు.

    ఫుట్ పాత్లమీద ఏదో వస్తువు చవకలో వస్తూందని, కొనేయడం, ఇంటికెళ్ళి చూస్తే అదేమో పనిచేయదు. పోనీ మర్నాడు వెళ్ళి చూద్దామా అంటే, ఆ కొట్టువాడు మాయం ! పోనీ ఎవరితోనైనా చెప్పుకుందామా అంటే, అసలు మిమ్మల్ని అక్కడ కొనమనెవరన్నారూ, హాయిగా ఏదో దుకాణం లోకి వెళ్ళి కొనుక్కోవచ్చుగా అని జ్ఞానబోధోటి మిగులుతుంది. ఇన్స్యూరెన్స్ వాళ్ళూ, క్రెడిట్ కార్డువాళ్ళూ చూడండి, వాళ్ళ కబుర్లు కోటలు దాటేస్తాయి. వాడిచ్చే పాలసీలోనో, క్రెడిట్ కార్డులోనో వెనక్కాలెక్కడో small print. లో వాడి terms and conditions ఉంటాయి. మనలో ఎంతమంది వాటన్నిటినీ చదివాము? ముందర ఆ అక్షరాలు కనిపించి చావ్వు. రెండోది, ఆ కంపెనీ వాడు ఇంటికొచ్చాడంటే, వచ్చిన గంటసేపూ ఏవేవో చెప్పి హోరెత్తించేసి, బోరుకొట్టేస్తాడే కానీ, ఈ రూల్సూ, terms and conditions గురించీ ఛస్తే చెప్పడు. చివరనెప్పుడో ఓ పదిపదిహేను సంతకాలు పెట్టించుకుంటాడు. అప్పుడేమో చదివే ఓపికా ఉండదూ, అందుకోసమే కాబోలు సాయంత్రాలు వస్తూంటారు ఈ అప్పులిచ్చేవాళ్ళు. ఇంట్లో చిన్న పిల్లల హడావిడీ, ఏదో లాగ ఈ తద్దినం వదుల్చుకుందామనే ఉంటుంది కానీ, వాటి వివరాలు చదివే సావకాశం ఉండదు.

    ఈ మధ్యన వాడెవడో ఇండస్ ఇండ్ బ్యాంకు వాడుట, అబ్బాయికి ఫోనుచేసి ప్రతీ రోజూ ఊదరగొట్టేటప్పటికి ఏదో ఇంటికి రమ్మన్నాడు. ఓ అమ్మాయీ అబ్బాయీ వచ్చారు. వాడు చెప్పిందేమిటంటే, ఈ కార్డు జీవితకాలం ఉచితం, నెలలో నాలుగు సార్లు ఏ మల్టీప్లెక్స్ లోనైనా ఓ సినిమా టిక్కెట్టు కొంటే ఇంకోటి ఫ్రీ వగైరా వగైరా.. మా అబ్బాయి ఒఠ్టి మొహమ్మాటస్తుడు, కోడలలా కాదు, వీలున్నంతవరకూ రూల్సన్నీ చదువుతుంది. ఆ చదువుతున్న సందర్భం లో కనిపించాయి–Tickets only on select days. Purely at the descrition of the management of the Multiplex. Annual maintainance charge of just Rs.300/- only… అని. కోడలడిగింది ఆ పిల్లని, ఫ్రీ అన్నావుకదా మళ్ళీ ఈ maintainance charge ఏమిటీ అని. దానికి సమాధానం చెప్పకపోగా, పైగా అంటుందీ, Multiplex లో నెలంతా ఫ్రీ టిక్కెట్టు తీసికుంటూంటే, ఆ వివరాలు
maintain చేయడానికి ఆమాత్రం ఇస్తేనేమిటీ అని ఓ కౌంటరూ! మరి ఆ వివరాలన్నీ చెప్పకుండా, ఉత్తినే ఫ్రీ ఫ్రీ ..అని ఎందుకు చెప్తావూ అంటే సమాధానం లేదు. చివరకు చెప్పింది మా కోడలు, ఈ వ్యవహారాలన్నీ నాకూ తెలుసూ, నేనూ ఇదివరకు ఓ బ్యాంకులో పనిచేశానూ అని. అదేదో వినాయక చవితి కథలో శమంతకమణి వ్యవహారం, ఏదో ఆ శ్రీకృష్ణుడు భగవంతుడు కాబట్టి నీలాపనిందనుంచి బయటపడ్డాడు కానీ, మామూలు “ఆంఆద్మీ” ల సంగతేమిటీ అంటే, ఈ కథని విని, అక్షింతలేసుకుంటే చాలన్నారు. ఏదో బ్యాంకుల్లో పనిచేసినవాళ్ళకి ఫరవాలేదు కానీ, మనలాటివాళ్ళని ఎంతంత మోసాలు పైగా చాలా hi tech గానో కదా! We are taken for a ride. ఇదివరకు హెల్త్ పాలసీ విషయం లోనూ అలాగే అయింది.

    ఈ కోవలోకే వచ్చేది ECS. ఇదివరకటి రోజుల్లో మనం ఏదైనా వస్తువు కొంటే, ఆ వాయిదాలేవో చెక్కు రూపేణా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఒకటా రెండా, పెళ్ళాం పిల్లలు తప్పించి, ప్రతీదానికీ EMI లే! ఎన్నింటికని చెక్కులిస్తారు? హాయిగా అదేదో ECS అంటున్నారు. పాపం ఈ అప్పులు చేసినవాళ్ళు మాత్రం ఎన్నని గుర్తుపెట్టుకుంటారు? ఏదో బ్యాంకు వాడు చూసుకుంటున్నాడు కదా అని ఓ వెర్రి భరోసా! ఇందులో ఆ బ్యాంకువాడి ప్రమేయం ఏమీ లేదు ట, ఎవడిదగ్గరైతే వస్తువు కొన్నామో, ఆ కంపెనీ వాడు చెప్పేదాకా ఈ ECS అలా ఇస్తూనే ఉండాలిట. ఎప్పుడో సడెన్ గా గుర్తొచ్చి చూస్తే, అప్పటికే రెండో మూడో EMI లు extra గా వెళ్ళిపోయుంటాయి. మళ్ళీ ఈ Bank statements పుచ్చుకుని, వాడి వెనక్కాల తిరగడం. అదృష్టం బాగుంటే, ఇంకో EMI వెళ్ళేలోపల, ఆ పుచ్చుకున్నదేదో తిరిగొస్తుంది.

   మా స్వంత ఫ్లాట్ ఉండేచోట దగ్గరలో ఓ లాండ్రీ షాప్ ఉండేది. ఉండేది అని ఎందుకంటున్నానంటే, నిన్నటిదాకా ఉన్నది కాస్తా రాత్రికి రాత్రి మండి బూడిదయ్యింది! అదేదో short circuit ధర్మమా అని, అంతా కాలిపోయింది. ఫర్నిచరూ, బట్టలూ అన్నీ. ఇలాటి చిన్న కొట్లకి ఏమీ fire insurance వగైరాలేవీ ఉండవు. పోనీ మనం ఇచ్చిన బట్టలకైనా రసీదిస్తాడా అంటే అదీ లేదు. ఏదొ నమ్మకం మీద, ఓ క్యారీబాగ్గులో బట్టలు కుక్కి, వాటిని ఇస్త్రీ చేసేయమంటాము. ఏదో ఫలానా రోజుకి ఇస్తానంటాడు, ఏదో వెళ్ళిపోతోంది కదా అని, మనమూ అక్కడే ఇస్తూంటాము. ఇదిగో ఇలాటి సంఘటనలు జరిగినప్పుడే, మనందరికీ తెలుస్తూంటాయి. ఏం చేస్తాం? తూర్పుకి తిరిగి దండం పెట్టడం తప్ప? For a change ఈసారి మా బట్టలేవీ ఇవ్వలేదు. మేముండే చోట ఇచ్చిన బట్టలు మాత్రం తెచ్చేసికున్నాను. ఎవరైనా అనొచ్చు, “మన చేతిలో ఏముందండీ? ” అని. కానీ ఇలాటి situations ఎదుర్కోడం ఎలా?

   ఇలాటి నా అనుభవాలు వ్రాయడం లో ఉద్దేశ్యమేమిటంటే, ఏదో ఇంకొకరితో పంచుకుంటే, వాళ్ళైనా జాగ్రత్తలు తీసికుంటారేమోనని!

   ఏమిటో వెళ్ళిపోతున్నాయి రోజులు….

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అమ్మయ్య సుఖపడ్డాడు…

   అదేదో ఓవర్లు తక్కువ చేశాడని, నాలుగో టెస్టు ఆడకూడదని మన so called cool captain ధోనీ మీద ban పెట్టారుట ! సుఖపడ్డాడు. అందరికీ సమాధానాలు చెప్పుకోలేక ప్రాణం మీదకొస్తోంది! ఓ గొడవోటి వదిలింది. మన మీడియాల్లో అదేదో “అగ్నిపథ్ సీరీస్ ” అని పేరోటీ! ఇంకోడెవడో కాప్టెన్ అయితే ఏదో మొహమ్మాటానికి నెగ్గినా నెగ్గొచ్చు. కానీ మనవాళ్ళు అనుకోవాలిగా అలాగని. ఓడిన ప్రతీమాటూ ఒకటే మాట- It is one of those things.. అని. ఏదో పాపం బౌలర్లు ఆడేరని సంతోషపడిపోయాము. ఓవర్ రేట్ సరీగ్గా లేదంటారు కానీ, ఆ ఓడిపోవడం లో కూడా మన వాళ్ళు ఎంత ఫాస్టో చూడండి, మొదటిది నాలుగో రోజు, రెండోది మూడో రోజు, మూడోది, మరీ బాగోదని రెండున్నర రోజులూ! ఛాన్సొస్తే, ఆ నాలుగోది వన్ డే చేసినా చేయగల సమర్ధులు!

   నేనూ, మా ఇంటావిడా వెళ్ళి భోజనం చేసిన హొటల్ లోనే, నిన్న మా మనవరాలు తాన్యా పుట్టినరోజు గడిపాము. అమ్మాయి అత్తగారూ, మామగారూ, ఆడపడుచులూ వాళ్ళ ఫామిలీలూ మొత్తం అంతా కలిపి ఓ పదిహేనుదాకా తేలారు. అందరం కలిసి భోజనం చేసి, రాత్రికి కొంపకి చేరాము. ఈవేళ సాయంత్రందాకా hypothicated to అగస్థ్య అన్నమాట.

   ఇక్కడ మేమంతా క్షేమం. అక్కడ మన పాఠకులందరూ క్షేమం అని తలుస్తాను… సంక్రాంతి బాగా జరుపుకున్నారని తలుస్తూ….


%d bloggers like this: