బాతాఖాని-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు

    5 వారాల తరువాత రాజమండ్రి ఆదివారం వచ్చాము. నిన్న ప్రయాణ బడలికతో బయటకు ఎక్కడికీ వెళ్ళలెదు. ఈ వేళ్టినుండి నా మామూలు కార్యక్రమాలు మొదలెట్టాను. మెము పూణే వెళ్ళకముందు గోదావరి బక్కగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా దీనంగా ఉంది. తిరిగి వచ్చేటప్పటికి నిండుగా, గర్వంగా, ఉరకలూ పరుగులతో

చూడచక్కని అందాలతో ఇంక వర్ణించలేనండి బాబూ….మా బాల్కనీ తలుపు ( నాలుగో అంతస్థులో ఉంటున్నాము) తెరవగానే గోదావరి చప్పుళ్ళుకూడా ఒక్కొక్కప్పుడు వినిపిస్తాయి.ఆ దృశ్యం చూడగానే,b> మనం ఏ జన్మలో చేసికొన్న పుణ్యమో గోదావరి తల్లిని అంత దగ్గరలో చూడగల్గుతున్నామూ అనుకొని ఆ భగవంతుడికి, ఈ వరం ప్రసాదించినందులకు దండం పెట్టుకుంటూంటాను.

    ముందుగా క్షేత్రపాలకుడు శ్రీ వేణూగోపాలస్వామి వారిని, దర్శించుకొని, అక్కడనుండి మార్కండేయస్వామి దేవాలయానికి వెళ్తాను ఆ కాంప్లెక్స్ లో ముందుగా నవగ్రహ దేవతలూ, లక్ష్మినారాయణ, శ్రీవెంకటేశ్వరుడూ, మార్కండేయస్వామి, పార్వతీ అమ్మవారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సూర్యనారాయణ,అయ్యప్ప స్వామి గుడులు ఉన్నాయి. ఎవరిని దర్శించుకోపోతే ఏ దేముడికి కోపం వస్తుందో అని అందరినీ దర్శించుకొని, తీర్థం పుచ్చుకొని బయటకు వస్తూంటాను.

    మామూలుగా బయట సాధువులుంటూండేవారు, ఈ వేళ కనిపించకపోతే ఏమయ్యారా అనుకున్నాను, వాళ్ళందరినీ వర్షాలు వస్తున్నాయి కదా అని లోపల ఉండడానికి ఒప్పుకున్నారు. దేవాలయంలో అందరు పూజార్లూ పలకరించారు ఇన్నాళ్ళూ ఎక్కడికి వెళ్ళిపోయారంటూ. వారిని అడిగాను నన్ను ఎలా గుర్తుంచుకున్నారూ అని–అంటే వారన్నారూ-ఈ వయస్సులో ఎప్పుడూ నవ్వుతూండే మీ మొహం అందరికీ గుర్తుంటుందండీ–ఆఖరికి మా చిన్న ఫ్రెండు రోజూ స్కూలికివెళ్ళే 4 సంవత్సరాల పాప కూడా పలకరించి ” హల్లో అంకుల్ రోజూ కనిపించడం లేదే ” అన్నది.

    అక్కడనుండి శ్రీ కందుకూరి వీరేశలింగంగారి జన్మ గృహం ఉన్న సందులో, అష్టలక్ష్మి, శ్రీ రంగనాధస్వామి దేవాలయానికి వెళ్ళాను. అక్కడ ప్రతి రోజూ ప్రసాదం ఇస్తారు-

కట్టు పొంగలీ, దధ్ధోజనమూ- చాలా రోజులతరువాత వెళ్ళానుకదా,b> కొంచెం ఎక్కువే ఇచ్చారు !! అక్కడ పూజారిగారు, ఇదివరకు జుట్టు ఎక్కువగా ఉండేది, ఇప్పుడేమో అర్ధముండితంగా కనిపించారు. ఏమిటి స్వామీ అన్నాను , ఆయన ” వైరాగ్యం వచ్చేసిందండీ అందుకే వేషం మార్చేశానూ” అన్నారు. అదేమిటండీ అప్పుడే అలా అంటే ఎలాగా అన్నాను.ఇంతలో ఒకావిడ బహుశా 40 ఏళ్ళుంటాయేమో ” సార్ మీ తరం వాళ్ళు ఎన్ని సమస్యలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని జీవితం లో ఢక్కామొక్కిలు తినైనా పైకి వచ్చారూ, ఇప్పుడు మాకు అంత ధైర్యమూ లెదూ, అంత సహనమూ ఓర్పూ లేదూ, పైగా గోదావరి కూడా పక్కనే ఉందీ,నిరాశ పుడితే ఆ తల్లే మమ్మల్ని కడుపులో దాచేసుకుంటుందీ” అని చాలా అధైర్యంగా మాట్లాడారు. నాకైతే చాలా బాధ వేసింది. అంత జీవితం చాలించేసేటంతదాకా వెళ్ళకూడదూ అన్నాను. ఆ సందర్భంలో ఆవిడతో కొంచెంసేపు మాట్లాడాను.

    మధ్యాహ్నం గొల్లపూడి వీరాస్వామి గారి కొట్టుకు వెళ్ళి ” కొతి కొమ్మచ్చి” ఉందా అని అడిగాను. అదేం పుస్తకమండీ, అలాంటివి మేం తెప్పించమూ అన్నారు–అదెదో చాలా అభ్యంతరకరమైన పుస్తకం లాగ. నాకైతే చాలా ఏడుపు వచ్చింది ఆ కొట్టాయన అడిగిన పధ్ధతి చూసి, దగ్గరలో ఉన్న ధవళేశ్వరం లో పుట్టి పెరిగిన శ్రీ ముళ్ళపూడి గారికి, రాజమండ్రీలో ఉన్న గౌరవానికి. పోనీ అలాగని ఆకొట్టులో అన్నీ అధ్యాత్మిక పుస్తకాలే అనుకోవడానికి వీలు లేదు యండమూరివి ఉన్నాయి, చిరంజీవి గురించి ఉన్నాయి, ఎన్.టి.ఆర్ గురించి ఉన్నాయి.. సాయంత్రం మా ఇంటిపక్కన ఉండే “మణికంఠ బుక్ స్టాల్ ” కి వెళ్ళి పరీక్షిద్దామని రమణ గారి పుస్తకాలున్నాయా అన్నాను. ఆ కొట్టబ్బాయి ” ఏ రమణ గారండీ, శ్రీ రమణ గారా, ముళ్ళపూడి వెంకట రమణ గారా “అన్నాడు. ఎంత సంతోషమనిపించిందో– అడగ్గానే ఠక్కున ” కోతి కొమ్మచ్చి” తీసి చేతిలో పెట్టేశాడు. పైగా 150 రూపాయల పుస్తకాన్నీ డిస్కౌంట్ తో 130 రూపాయలకే ఇచ్చాడు!! రాత్రంతా ఇంకోసారి మళ్ళీ చదవాలి.

    నెను ఈ పై సోదంతా ఎందుకు వ్రాశానంటే, మన ప్రవర్తనని బట్టి అందరూ మనని గుర్తు పెట్టుకుంటారూ అని చెప్పడానికి. రాజమండ్రీ లో మేమున్నది గత ఏడాది నుండే, అందులో మూడు నెలలు మాపిల్లల్ని చూడ్డానికి పూణే లో గడిపాము. ఆతా వేతా ఉన్నది అంతా కలిపి ఏ ఆర్నెల్లో!! అయినా మాగురించి ఆలోచించారూ అంటే ఎంత అదృష్టవంతులమో.ఇంత చక్కటి వరం ఇచ్చిన ఆ భగవంతుడి దయ అపారం. ఆయన కటాక్షం అలాగే ఉండాలని ప్రతీ రోజూ ప్రార్ధిస్తూంటాను.ఇదెదో మేము ఏమేమో గొప్ప గొప్ప పనులు చేశామని కాదు, అవతలి వారి మనస్సులు ఎంత ఉదాత్తమైనవో చెప్పడానికి మాత్రమే ఈ బ్లాగ్గు. మీ అందరితో పంచుకుందామనిపించింది.

%d bloggers like this: