బాతాకానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–స్నేహం

    నేను ఇంతకుముందొకసారి వ్రాశాను–నాకు రిటైర్ అయిన వారికంటే సర్వీసు లో ఉన్నవాళ్ళతో సమయం గడపడం ఎక్కువ ఇష్టం అని. అది చాలా తప్పు అని నిన్న తెలిసింది.అది ఆరోజున్న పరిస్థితి ని బట్టి అలా వ్రాశాను. ఆనాడు నేను కలిసిన ఇద్దరు రిటైరు అయిన వాళ్ళూ నన్ను depression లోకి తీసికెళ్ళిపోయారు!! వాళ్ళ సమస్యలన్నీ దొరికేనుకదా అని నాతో ఓ గంటసేపు చెప్పేటప్పటికి నాకు నిరుత్సాహం వచ్చేసింది. అందువలన ఆరోజు అలా వ్రాయవలసి వచ్చింది.

    నిన్నటి రోజు న పూణే లో ఉన్న మా పాతమిత్రులు శ్రీ ప్రసాద్ గారు మమ్మల్ని భోజనానికి రమ్మన్నారు. అలా కాదంటే భోజనంలాంటి టిఫిన్ కైనా సరే రమ్మన్నారు. నెనూ మాఇంటావిడా
10.30 కి వాళ్ళింటికి వెళ్ళాము.ఇడ్లీలు, ఉప్మా , తయారుచేశారు. నా బ్లాగ్గుల ద్వారా, నాకు చాలా ఇష్టమని తెలిసికొని నా All time favourite బెల్లం మిఠాయి ఉండలు చేశారు. అవి చెయడానికి ఎంత శ్రమ పడాలో నాకు తెలుసును.
ఆ బెల్లం మిఠాయి ఉండలు గురించి వర్ణించడం నా తరం కాదు.Simply superb. నోట్లో వేసికుంటే కరిగి పోయాయి. ఆవిడ అంత శ్రమ తీసికొని మాకోసం అవన్నీ చేయవలసిన అవసరం లేదు. అలా చేసిపెట్టారని నేనేదో స్నేహం గురించి వ్రాస్తున్నాననుకోకండి. ఎన్నెన్నో ఖబుర్లు చెప్పుకున్నాము. నెను పూణే లో 2004 లో ఫ్లాట్ కొన్నప్పుడు ఈయనే చూపించారు. మేము రాజమండ్రీ నుండి వచ్చేసే లోపులో ఒక్కసారి మా ఆథిథ్యం స్వీకరించమని చెప్పాను. ఏమో రాకలరో లేదో.ఈయనతో మాట్లాడిన తరువాత ఇంకో తెలుగాయన దగ్గరకు వెళ్ళాము, అందరం కలిసి. ఆయన చెప్పేఖబుర్లు అంతా ఆధ్యాత్మికంగా ఉంటాయి. మేము ఆరుగురమూ మొత్తం నాలుగు గంటల పాటు ఒకళ్ళకొకరు బోరు కొట్టుకోకుండా గడపగలిగేము.మా ముగ్గురివీ వివిధరకాలైన మనస్థత్వాలు, అయినా అవి అడ్డు రాలేదు.

    మాకు సంబంధించినంతవరకూ స్నేహితులకే పెద్ద పీట వేస్తాను నేను,మా ఇంటావిడా.బంధువులకంటే స్నేహితులే Longlasting అని నా ఉద్దేశ్యం.ఉన్న నలుగురూ మనతో కలిసిపోయేవారైతే కావలిసినంత కాలక్షేపం.పిల్లలూ, చదువులు విషయాలలో కొంత విబేధాలు వస్తాయి కాదనను.అదీ ఒకే స్కూలూ, ఒకే క్లాసూ అయితే ఇంకా కష్టం.రిటైర్ అయిపోయిన తరువాత ఈ గొడవలు ఏమీ ఉండవు కాబట్టి మన స్నెహం revive చేసికోవచ్చు.నాకైతే గత 48 సంవత్సరాలనుండీ అన్ని విషయాలలోనూ స్నేహితుల వల్లే పైకి వచ్చాను.

    బంధువులతో వచ్చిన ఒకే సమస్య ఏమిటంటే నా అనుభవం లో, మన కంటే ఎక్కువ వాళ్ళు మనని చిన్నచూపు చూస్తారు, మనకంటే కొంచెం తక్కువలో ఉన్నవాళ్ళు మననుండి ఏమేమో
ఆశిస్తారు.ఈ రెండు పరిస్థితులూ చికాకు తెప్పించేవే! ఇలా అనడం చాలా మందికి నచ్చకపోవచ్చు.మీ మీ అనుభవాలు గుర్తుకు తెచ్చికోండి, మీకే తెలుస్తుంది.ఎవరో మన బంధువు పెద్ద ఉద్యోగం లో ఉన్నాడు కదా అని, సహాయం అడిగేరనుకోండి, ఆ పెద్దమనిషి ఊళ్ళో వాళ్ళెమనుకుంటారో అని మొహం చాటేస్తాడు. స్నెహితులలా కాదు, వీలుంటే చేస్తారు లేకపోతే లేదని చెప్పేస్తారు. నాకు సంబంధించినంతవరకూ నాకు ఉన్న బంధువర్గంతో Friendship కే ఎక్కువ విలువ ఇచ్చి నాకు చాలా సహాయం చేశారు.అన్నింటికంటే ముఖ్యం మా కజిన్–అతనితో బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ. మేమిద్దరమూ ఒకేవయస్సు వాళ్ళం( ఓ సంవత్సరం అటూ ఇటూ). అతనే లేకపోతే నాకు ఇక్కడ మిలిటరీ హాస్పిటల్ లో పళ్ళ వైద్యం మహరాజభోగంతో జరిగేది కాదు. జీవితం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి అది ! నాకు సహాయం చేయడం అతని గొప్పతనం.
రాజమండ్రి లో ఇంకో కజిన్ ఉన్నాడు –నాకంటే చిన్న. వాడూ, నేనూ బంధుత్వం కంటే స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము. ఏ స్నేహమైనా డబ్బుల వ్యవహారం రానంతవరకూ చాలా బాగుంటుంది.

    ఇదివరకు పెళ్ళిసంబంధాలు కుదుర్చుకొన్నప్పుడు, పెళ్ళికూతురు/ పెళ్ళికొడుకు ల స్నేహితులెవరో కూడా కనుక్కునేవారు. దాన్ని బట్టి వీళ్ళని అంచనా వేసేవారు.అదే కాకుండా మనం కూడా మన పిల్లలు ఎవరెవరితో తిరుగుతున్నారూ అని watch చేస్తాము. కారణం ఏమిటీ,మన పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారూ అని తెలిసికోవడానికి.
అంతదాకా ఎందుకూ, నేను తెలుగులో బ్లాగ్గులు వ్రాయడం ఏప్రిల్ 15 వ తారీఖున మొదలెట్టాను, ఈ మూడు నెలలోనూ నాకు పరిచయం అయిన వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.ఎంత ఆత్మీయంగా పలకరిస్తున్నారూ మీరంతా. మీకేమి ఇచ్చి ఋణం తీర్చుకోగలనూ. మా పిల్లలుకూడా అంటున్నారు, ” మీకు మాకంటే, మీ బ్లాగ్ మిత్రులే ఎక్కువయ్యారూ ” అని.
.

%d bloggers like this: