బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఫొటోలు పెట్టుకోడం ఎందుకు?

    కొంతమందికి తమ ఫొటో పబ్లిగ్గా పెట్టుకోవడమంటే ఓ ఎలర్జీ అనుకుంటా. తమ నిజస్వరూపం అందరికీ తెలిస్తే వచ్చే నష్టం ఏమిటో? Public domain లో ఉంటున్నప్పుడు అలాటి అభ్యంతరాలకి అర్ధం లేదు. ప్రతీ పోలీసు స్టేషనులోనూ కనిపిస్తూంటాయి seasoned criminals ల ఫొటోలు, మరీ అలాటి ప్రదేశాల్లో మన ఫొటోలు ఉండాలని కాదుకానీ, బ్లాగు ప్రొఫైలులో కానీ, ఫేస్ బుక్ ప్రొఫైలులో కానీ, తమ తమ నిజం ఫొటోలు పెట్టుకోడానికి చాలామంది, ఎందుకు సందేహిస్తారో నాకైతే అర్ధం అవదు. అంత అజ్ఞాతంగా ఉండవలసిన కర్మేం పట్టిందో తెలియదు.ఒకసారి ఎవరిదైనా ఫొటో చూస్తేనే కదా, ఓహో .. ఆయనా.. ఆవిడా.. మా ఇంటిప్రక్కనే ఉంటారనో, మా నాన్నగారి స్నేహితుడనో గుర్తుపట్టేది. బ్లాగుల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ తమతమ నిజస్వరూపాలు చూపించుకోకూడదన్నదాని వెనక ఉండే rationale ఏమిటో నాకు అర్ధం అవదు. ఎవరిదైనా ఫొటో చూస్తేనేకదా, వారిమీద ఒక అభిప్రాయం ఏర్పరుచుకునేదీ? వాళ్ళు వ్రాసేవన్నీ చదవాలా, కానీ వాళ్ళెలాఉంటారో తెలియకూడదా? మనిషిని గుర్తించడానికి ఉన్న సాధనాల్లో ఈ ఫొటోలొకటీ, వేలిముద్రలోటీ. ఈమధ్యన అవేవో DNA test లూ అవీ కూడా చేస్తున్నారనుకోండి. ఏదో ఎన్డి తివారీల్లాగ వెధవపనులు చేస్తే ఏమో కానీ, లక్షణంగా ఓ ఫొటో పెట్టుకుంటే ఎవరో కొందరైనా చూసి సంతోషిస్తారుకదా.

అదేమిటో కానీ, ఇలా తమ అసలు ఐడెంటిటీ దాచుకోవాల్సిన వారిని చూస్తే, పోలీసులు పట్టుకున్నప్పుడు, అవేవో నల్లగుడ్డలు మొహాలకి కట్టుకుంటారే వాళ్ళే గుర్తుకొస్తారు నాకు. కొంతమంది సినిమా స్టార్ల బొమ్మలూ, కొంతమందైతే అవేవో ప్రకృతి దృశ్యాలూ, ఇంకా కొంతమందైతే …. ఎందుకులెండి….ఈ virtual world ఇలా ఉండడంలో పోనీ ఏదో సరదా అనుకుందాం, కానీ ఆయనెవరో ప్రఖ్యాత రచయిత, తన ఫొటోలు పెడతారన్నారని అసలు ఆ పత్రికలకే వ్రాయడం మానుకున్నారుట ! ఇప్పటిదాకా తన అసలు ఇడెంటిటీ ఏదో , తన రచనలు చదివేవారికి తెలియకపోవడం అదో ఘనతగా భావిస్తున్నారు. ఏమైనా అంటే ప్రైవసీ.. నా మొహం, నా ఇష్టం అంటారు. నిజమేకదా ఎవరెలా ఉంటే మనకెందుకూ? ఫొటోలు ప్రపంచానికి తెలిసేటట్టు పెట్టడమనేది, వారు వ్రాసే వ్రాతలతో మనం connect చేసుకోగలడానికే కానీ, వాళ్ళ కొంపలు కూల్చడానికి కాదూ అని ఎప్పుడు తెలిసికుంటారో? ఒక విషయం ఒప్పుకుంటాను, ఈరోజుల్లో నెట్లో ఆడపిల్లలు ఫొటోలు పెడితే , వాటిని దుర్వినియోగం చేసికోడానికి చాలామందికి అవకాశం ఉంది, కాదనను, కానీ సంవత్సరాలనుండీ వ్రాస్తూన్నవారికి కూడా అలాటి సందేహాలుంటాయంటే మాత్రం ఒప్పుకోను. అయినా ఎక్కడో ఎవడో ఏదో చేస్తాడేమో అని భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతామూ?

ఈమధ్యన మా చుట్టం ఒకబ్బాయి నన్ను కలియడానికి వస్తానని ఫోనుచేశాడు., మా పెదనాన్నగారి మనవడు. ఫలానా చోటులో ఉన్నామూ, ఫలానా బస్సులో వస్తే ఇక్కడకు రావొచ్చూ, నేను బస్ స్టాప్ లో నుంచుంటానూ అని చెప్పేను. బయలుదేరేముందు ఫోను చేయీ, నాకూ ఓ పదినిముషాలు పడుతుందీ, రావడానికీ అని చెప్పేను. ఎంత సేపు ఆగినా ఫోనే రాలేదు. బహుశా ఇంతదూరం శ్రమ పడి వేళ్ళేదేమిటిలే అనుకున్నాడేమో, పోనీ పలకరించాడు అదే పదివేలూ అనుకున్నాను కానీ, బస్ స్టాప్ కి వెళ్ళనేవెళ్ళేను. సంగతేమిటో తెలిసికోవాలని ఫోను చేస్తే, ఇంకో పావుగంటలో చేరతానన్నాడు.మేముండే చోటుకి, అతనుండే ప్రదేశం కనీసం ఇరవై కిలోమీటర్లు. అయినా ఎవరెవరినో అడిగి, మొత్తానికి చేరేడు. బస్సుదీగీదిగగానే నన్ను చూసి హలో అని పలకరించాడు. అరే ఎప్పుడూ చూడనేలేదూ, నన్నెలా గుర్తుపట్టకలిగేడూ అనుకుని అడిగితే, మీరు ఫేసుబుక్కులో మీ ఫొటో పెట్టేరుగా, అది చూసి గుర్తుపట్టానూ అన్నాడు. ఓహో ఇలా ఫొటోలు పెట్టడం వల్ల ఇలాటి ఉపయోగాలూ ఉంటాయన్నమాట అనుకున్నాను.

పురాణాల్లొ చదివిన దేవతామూర్తులని మనవేమైనా చూశామా పెట్టేమా, ఏదో మహారాజా రవివర్మ గారి ధర్మమా అని, ఆయన ఊహించి వేసిన చిత్రాలతో ఆ దేవుళ్ళని identify చేసికుని, ఓహో రాముడంటే అలా ఉండేవారా అనో, శివుడంటే అలాగా, అమ్మవారంటే ఇలా ఉండేవారన్నమాట అని మనం తెలిసికోవడమూ, మన పిల్లలకి చెప్పడమూ కదా.

అంతదాకా ఎందుకూ, ప్రతీ మాట్రిమోనియల్ సైట్లలోనూ, ఫొటోలతోనే కదా అసలు కథ ప్రారంభం అయేదీ? ముందుగా ఫొటో చూసి, ఫరవాలేదూ, అనుకున్నతరువాతే కదా next step వేసేదీ? మన తాతముత్తాతలగురించి మన తల్లితండ్రులు ఎన్నెన్నో విషయాలు చెప్తారు, కానీ ఆ రోజుల్లో ఫొటోలూ గట్రా సదుపాయాలు లేకపోవడం వలన, వారి అసలు రూపాలు చూసుకొనే అదృష్టం కలగలేదు. నిరతాన్నదాత్రి డొక్కా సీతమ్మగారి ఫొటో ప్రక్కనే సింహాసనం మీద పెట్టుకుని బ్రిటిష్ మహారాజు పట్టాభిషేకం చేసికున్నారని చదివేము. ఏదో అదృష్టంకొద్దీ ఒక్కటంటే ఒక్క ఫొటో ఆవిడది లభ్యం అయింది. ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఫొటో ఒకటి దొరికింది ఈమధ్య.శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుగారు

ఫొటోలు పెట్టుకోనివారికీ, అజ్ఞాతంగా ఉండి ఏదో ఉధ్ధరించేద్దామనుకునేవారికీ ఈ టపా నచ్చకపోవచ్చు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– సంగీత అతిరథ మహారథుల మధుర స్వరాలు వినాలనుందా…

   ఇదివరకటి రోజుల్లో వీనులకు విందైన సంగీతం, అది ఒక సినిమా పాట అవొచ్చు, లేదా శాస్త్రీయ సంగీతం అవొచ్చు. మార్కెట్ లో దొరికే క్యాసెట్లో, సీడీలో, అంతకుముందైతే గ్రామఫోను రికార్డులే కొనాల్సొచ్చేది. లేదా అదృష్టం బాగుండి ఏ రేడియోలోనైనా వారు దయతలిస్తే విని ఆనందించే అదృష్టం కలిగేది. కొద్దికాలానికి ఆల్ ఇండియా రేడియో వారు తమ archives నుంచి కొన్ని కొన్ని అమృతభాండాల్ని దేశంలోని వివిధ ఆకాశవాణి కేంద్రాలద్వారా విక్రయించేవారు. కానీ మాలాటివారికి ఏ కర్ణాటక సంగీతమో వినాలనుకుంటే , ఇక్కడ పుణె ఆకాశవాణి కేంద్రంలో అంత choice ఉండేది కాదు. సంగీతప్రియ అని ఒక సైటుంది కానీ, చాలా లింకులు తెరవబడేవి కావు. మనకింతే ప్రాప్తం అని వదిలేశాను.

    కానీ ఈమధ్యన Music online అనే ఒక లింకులో అద్భుత అత్యద్భుత.. ఇంకా ఎన్నెన్ని అద్భుత వాడాలంటే అంతంత అద్భుతమైన పాటలు ఉచితంగా దొరుకుతున్నాయి. వెంటనే వినడం మొదలెట్టేసి ఆనాటి పా…త.. మధురలోకాలలో విహరించేయండి.
మచ్చుకి ఒక లింకు ఇస్తున్నాను. ఇప్పటికే తెలిసుంటే సరేసరి లేదా…ఒకసారి వినండి.

    శ్రీ అవసరాల రామకృష్ణరావు గారి ఈ వ్యాసంకూడా చదివేయండి పనిలోపనిగా…మాయరోగాలు– శ్రీ అవసరాల

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– గుర్తుంచుకోడం…

    ఏదో ఓపిగ్గా చదువుతున్నారుకదా అని, అర్ధం పర్ధంలేని విషయాలమీద ఈయనేమిటీ ఊరికే “సుత్తి” కొట్టేస్తున్నాడూ అని అనుకోకపోతే, నాకు గుర్తొచ్చిన ఓ విషయం వ్రాస్తాను. “గుర్తింపు” కీ “గుర్తుంచుకోడం” కీ సహస్రాలు తేడా ఉంది, నా ఉద్దేశ్యంలో. “గుర్తింపు” అనే మాట, ఏ మహత్తరకార్యమో చేస్తే వాడతారనుకుంటా. వెధవపనులు చేసినా ఓ “గుర్తింపు” లాటిది వస్తూంటుంది, అది వేరేవిషయం. అయినా ఇప్పుడు మనం మాట్టాడేది “గుర్తుంచుకోడం” గురించి.

ప్రతీరోజూ చూస్తూంటే ఓ మనిషి రూపం గుర్తుండిపోతుంది. అలాగని టీవీల్లోనూ, సినిమాల్లోనూ చూసేవాళ్ళు గుర్తుండిపోతారని కాదు, కారణం screen మీద కనిపించేవారు, అందంగా కనిపించడానికి నానారకాల తిప్పలూ పడతారు, ఎప్పుడో యాదృఛ్ఛికంగా ఏ ట్రైనులోనో కనిపించినా మనం గుర్తుపట్టలేకపోవచ్చు. ట్రైనని ఎందుకన్నానంటే నేనెప్పుడూ ఏరోప్లేను ఎక్కలేదూ, ఎక్కిన ఒకేఒక్కసారి భయంతో కళ్ళుమూసుకుని కూర్చోడంతోనే సరిపోయింది.ఏ కొద్దిమందో తప్ప సాధారణంగా మగవాళ్ళు మేకప్పూ గట్రా లేకుండా ఉండడంతో గుర్తుపట్టలేకపోతామన్నమాట. అయినా కొంతమంది ఎంత బట్టతలైనా, విగ్గులేకుండా బయటకి రారనుకోండి. అయినా నేను వ్రాసేది సాదాసీదా మనుష్యులగురించి. వాళ్ళ అసలు రూపాలతో మనకెక్కడ పరిచయమూ, గుర్తించలేదని హో..బాధపడిపోతారు. అంత పెద్ద హీరోనీ అసలు పలకరించనైనా లేదే అని.

ఉదాహరణకి మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, వాళ్ళింట్లో ఉండే పసిపిల్లాడినో పసిపిల్లనో దగ్గరకు తీసికోవాలని ప్రయత్నిస్తే కెవ్వున కేకపెట్టి , గొల్లున ఏడుపు మొదలెడతారు. ఎంతదాకా వెళ్తారంటే మనమేదో గిల్లినంతగా…” మా వాడికి కొత్త తెలుస్తోంది..” అంటారు. వదిలేయడం ఆరోగ్యకరం. అలాగే వాళ్ళింట్లో ఉండే కుక్క కూడా భౌవ్వుమంటుంది. దానికీ గుర్తే మరి, కొత్తమొహమేదో వచ్చిందని. కానీ రెగ్యులర్ గా వాళ్ళింటికి వెళ్ళే పనిమనిషినీ మాత్రం గుర్తుంచుకుంటుంది. ఇంట్లోవాళ్ళైతే సరేసరనుకోండి.

అలాగే మనం ఉండే సొసైటీలో గేటుదగ్గరుండే సెక్యూరిటీవాడు, ప్రతీరోజూ మన మొహం చూస్తూంటాడుకాబట్టి ,మనం కనిపించగానే ఒకసారి నవ్వడమో, ఎప్పుడైనా దీపావళి మామూళ్ళిస్తే ఓ సలాంలాటిది పెట్టడమోకూడా చేస్తూంటాడు. ఈ విషయం ఎందుకువ్రాశానంటే, మా ఇంటావిడ ఎప్పుడో వారానికో, పదిహేనురోజులకో ఒకసారి బయటకు వెళ్తూంటుంది. ఈవెనింగు వాక్కు కూడా ఇంట్లోనే కానిచ్చెస్తోంది. ఆమధ్యన ఎప్పుడో ఒకసారి ఒక్కర్తీ బయటకువెళ్ళివస్తూంటే , ” ఆప్ కౌన్ హై..కిధర్ జానేకా..” అని అడ్డుపెట్టేడుట. తన ఐడెంటిటీ చెప్పుకుని మొత్తానికి కొంపలోకి వచ్చిందనుకోండి. అలాగే మా అమ్మాయి ఎప్పుడు మమ్మల్ని చూడ్డానికి వచ్చినా తనని అడుగుతూనేఉంటాడు. వచ్చినప్పుడల్లా ఇదే గొడవ. ఈ సొసైటీలో ఉండే ఎపార్టుమెంటుకి నేనే యజమానిని మొర్రో అని విన్నవించుకుంటూంటుంది.

నేను ఉద్యోగం చేసేరోజుల్లో మా ఫాక్టరీ గేటుదగ్గరుండే సెక్యూరిటీ వాళ్ళు నన్నుచూడగానే ఓ సలాంలాటిది పెట్టేవారు, కారణం నన్ను ప్రతీరోజూ షిఫ్టుల్లోకూడా చూసేవారొకటీ, వాళ్ళని అప్పుడప్పుడు పలకరించడం బట్టీ. ఒకరోజున నేనూ, మా సెక్షన్ హెడ్డూ ఒకేసారి గేటులోంచి వెళ్ళడం సంభవించింది. నన్నుసలాం కొట్టి మామూలుగా వదిలేయడంతో లోపలకి వెళ్ళిపోయాను, కానీ మా పెద్దాయన్ని ఐడి చూపించమన్నాడుట. అంతే లోపలకొచ్చి ఒకటే గింజుకోడం. హాత్తెరీ నీకు సలాం కొడతాడా, పైగా నన్ను ఐడీ అడుగుతాడా అంటూ..

ఎప్పుడో సంవత్సరాలక్రితం జరిగిన ఆ సంఘటన ఎందుకు గుర్తొచ్చిందంటే ఈవేళ బస్సులో జరిగినదానికీ, ఎప్పుడో జరిగినదానికీ పోలికలుండబట్టి. ఎప్పుడో తప్పించి, ప్రతీరోజూ నేను బస్సులో వెళ్తూనేఉంటాను. నా మొహం చూడగానే తెలుస్తుందనుకోండి వీడు concession pass వాడూ అని. అయినా నేను ప్రతీరోజూ ప్రయాణం చేసే చాలామంది కండక్టర్లకి నా మొహం గుర్తే. అదేకాకుండగా వాళ్ళ పేర్లు అడిగి, క్షేమసమాచారాలు అడుగుతూంటాను.ఈవేళ ప్రొద్దుటే బస్సులో చాలా రద్దీగా ఉంది. కండక్టరు టిక్కెట్లిచ్చుకుంటూ మా దగ్గరకు వచ్చి, నన్ను చూసి “నమస్తే అంకుల్..” అన్నాడు. పక్కాయనకేమో టిక్కెట్టిచ్చాడు. ఆ విషయం ఆయనకంతగా నచ్చినట్టులేదు. కండక్టరు వెళ్ళిపోయినతరువాత అడిగేడు, మీకు కండక్టరు తెలిసినవాడా టిక్కెట్టడగలేదూ అంటూ….. కాదు మహాప్రభో నెలమొత్తానికి ఒకేసారి పాస్ కొనుక్కుంటూంటానూ అదీ విషయం అన్నాను.

రాత్రనకా పగలనకా ఒకేచోట పనిచేస్తూంటే, ప్రతీదీ గుర్తుండిపోతుంది. మెడికల్ షాప్పుల్లో చూడండి, ఏ మందడిగినా ఠక్కున ఏ షెల్ఫ్ లో ఉందో చూసి తెచ్చిచ్చేస్తాడు. ఏ కిరాణా కొట్టులోనైనా ఇదే పరిస్థితి. మా ఆఫీసులో ఒకతను సంవత్సరాలకొద్దీ అక్కడే పనిచేసినందువలన, ప్రతీ ఫైలూ గుర్తే. పై ఆఫీసర్లు ఎప్పుడు అడిగినా ఫైలునెంబరుతోసహా చెప్పేవాడు. అసలు అతను లేకపోతే పనే జరగదేమోఅన్నంతగా చెప్పుకునేవారు. పైగా నేను ఆ ఆఫీసుకి బదిలీఅయినప్పుడు, అతన్ని చూసి నేర్చుకోవాలీ అని కూడా జ్ఞానబోధచేశారు. ఓ నాలుగురోజులు పనిచేసేటప్పటికి నాకూ వంటబట్టేసిందనుకోండి, ఛస్తామా ఏమిటీ ఎప్పుడుచూసినా వాటితోనే. లైబ్రరీల్లో చూడండి, ఓ పుస్తకం అడిగేమంటే ఉందో లేదో వెంటనే చెప్పేస్తాడు. దీన్నన్నమాట గుర్తుంచుకోడం అంటారు.

ఆమధ్యన అభినవ భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి ఒక కథ పెట్టేను. ఆ సందర్భంలోనే మా ఇంటావిడ ఇంకో వ్యాసం వెదికి పట్టుకుంది. ఒకసారి మీరుకూడా చదివి ఆస్వాదించండి.ఆనకట్టకి పూర్వం కబుర్లు

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం

    ఏవిటో కానీ, నాకు తెలుగు దేశం ( పార్టీ కాదండోయ్!!) అన్నా,తెలుగు భాషన్నా, తెలుగువంటకాలన్నా, తెలుగు వేషభూషణాలన్నా చెప్పలేనంత ఇష్టం.అందులోనూ తెలుగు కూరలంటే మరీ ఇష్టం. ఇందులో కూరలకి భాషేమిటీ అనుకోవచ్చు.అక్కడే ఉంది అసలు మజా అంతానూ. మనవైపు దొరికే గుండ్రటి ఆనపకాయా, నీటివంకాయా, దొండకాయా, బీరకాయా, పనసపొట్టూ , పొట్లకాయా, దోసకాయాకూరగాయలు — వీటితోపాటే కదా పెరిగిపెద్దయింది.ఇవికాకుండా ఆకుకూరలు గోంగూరా, బచ్చలికూరా, తోటకూరా గోంగూరబచ్చలికూరఇలాటివి– వీటన్నిటినీ తెలుగు కూరల్లోకి వేద్దాం. ఇంగ్లీషు కూరలంటే క్యాబేజీ, కాలీఫ్లవరూ, క్యాప్సికమ్మూ, బీట్టురూట్టూVegetables 3 లాటివి.మరి మా చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడచూశామూ? ఈరోజుల్లో పిల్లలకి పాతకూరలు అంతలా నచ్చవు. వాటిల్లోఉండే రుచి తెలియాలంటే , తింటేనేకదా తెలిసేదీ? ఇళ్ళల్లో తినడానికి సుకరాలూ, హోటళ్ళకెళ్తే ఆ పైన చెప్పిన ఇంగ్లీషు కూరలే కదా దొరికేదీ?

    ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళకి త్రిశంకుస్వర్గం లా తయారౌతుంది పరిస్థితి. కలిసే ఉన్నప్పుడైతే మరీనూ. ఇంటి పెద్దాయన్ని కూరలు తెమ్మని బయటకి పంపారా, మార్కెట్ లో నేను పైన చెప్పేనే ఆ “తెలుగు కూరల” మీదే పడుతుంది దృష్టంతా. ఉద్యోగాల్లో ఉండేటప్పుడైతే ఏదో ఒకకూరలెద్దూ అని సరిపెట్టేసుకునేవారు. ఉత్తి తిండే కాదుకదా, మిగిలిన వ్యవహారాలుండేవి. పైగా సంసారం ఈదడమనేదొకటుండేదిగా. కానీ ఉద్యోగంలోంచి రిటైరయినతరువాత , ఆ చిన్ననాటి కూరలమీదకి మనసు వెళ్తుంది.అసలుకారణం అదన్నమాట పెద్దాయన్ని మార్కెట్ కి పంపితే ఆ “పాత కూరలే” తేవడానికి. ఓ నెలరోజులు చూస్తారు, enough is enough అనుకుని, “ఎందుకు డాడీ మీరు మార్కెట్ కి వెళ్ళి శ్రమ పడడమూ, ఆఫీసునుంచి వచ్చేటప్పుడే మేమే ఏదో ఒకటి తెచ్చేస్తాములే..” అని సున్నితంగా చెప్పేస్తారు. అసలు కారణం ఇంటావిడద్వారా తెలుస్తుంది. సరే ఇంక మనకింతే ప్రాప్తం అని ఓ మెట్టవేదాంతంలో పడిపోతాడు.

    పైన చెప్పినవన్నీ ఆంధ్రదేశంలో ఉంటున్నవారిగురించికాదు నేను చెప్పేది, మాలాగ పరాయిరాష్ట్రాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడిపోయిన ప్రవాసాంధ్రుల(NRA s) గురించి. తినాలని యావుంటుందీ, కానీ తినడమెలా? ఏదో అదృష్టంకొద్దీ ఈరోజుల్లో ఇతర రాష్ట్రాల్లోకూడా మన “తెలుగు కూరలు” దొరుకుతున్నాయి. వీధివీధికీ పుట్టుకొచ్చిన మాల్స్ ధర్మమా అని. ఒక్కొక్కపుడు సాదాసీదా మార్కెట్ లోకూడా దొరుకుతూంటాయి. వాటిని చూస్తే ప్రాణం లేచొస్తూంటుంది. నా అదృష్టమనండి, లేకపోతే పెట్టిపుట్టాననండి, వారానికి ఓ రెండు మూడు రోజులకైనా దొరుకుతూంటాయి. వచ్చిన గొడవల్లా మా ఇంటావిడకే. బయటకి వెళ్ళి ఏంకూర తీసికొస్తాడో ఈయనా అని బితుకు బితుకుమంటూనే ఉంటుంది. అయినా పాపం నా “వేవిళ్ళ కోరికలు” తీరుస్తూనే ఉంటుందిలెండి.God bless her.
నిన్న రిలయన్సు కి వెళ్ళినప్పుడు మనవైపు కూర అరటికాయలు నవనవలాడుతూ కనిపించాయి, వారం తిరక్కుండా మళ్ళీ తీసికెళ్తే ఇంటావిడ గయ్యిమంటుందేమో అని భయం. మొన్నటికిమొన్నే ఆవపెట్టి కూరచేసింది. అందువలన descrition ఉపయోగించి, వారంలో ఓ రెండురోజులైనా తెలుగుకూరలు తేవడానికి అలవాటు పడిపోయాను. కందా బచ్చలికూర,నువుపప్పు వేసి బీరకాయకూరా, పొట్లకాయకూరా తింటే ఉండే రుచి, ఈరోజుల్లో మసాళాలు దట్టించి చేసే ఇంగ్లీషు కూరల్లో ఎక్కడుందండీ?

    అసలు ఈ గొడవంతా ఎందుకంటే ఈవేళ ప్రొద్దుటే పేపరుకోసం వెళ్తే, “గోంగూర” దొరికింది.ఓ నాలుగు రోజులపాటు ఈ గోంగూర పచ్చడిగోంగూర పచ్చడి తో వెళ్ళిపోతుంది. అయినా ఈ కబుర్లన్నీ, అనుకున్నప్పుడల్లా దొరకవని వాటిమీద అంతంత వ్యామోహం పెంచేసికోవడం. చిన్నప్పుడు, పెరట్లో కావలిసినన్ని దొరికేవి. అమ్మకూడా ఓ తాజాగా నాలుగు బీరకాయలతో ఓ కూరా, ఆనపకాయ ముక్కలు వేసి ఓ పులుసూ, సాయంకాలానికి దొండకాయ వేపుడూ, పెట్టినప్పుడల్లా వెధవ్వేషాలు వేసేవాళ్ళం, రోజూ ఈ కూరలేనా అని ! ఇప్పుడేమో కావాలంటే దొరకవాయె.

    చిన్నప్పుడు మన ఇళ్ళల్లో యాదాలాపంగా ఉపయోగించే మాటల్లో “జీలకఱ్ఱ సింగినాదం” అని ఒకటి వాడేవారు, ఇది గోదావరిజిల్లాలలో ఎక్కువగా ఉండేది. దాని అర్ధం మాత్రం తెలిసేది కాదు. కానీ తెలుగుభాషాభిమానం ధర్మమా అని నేనూ వాడుతూంటాను. మొత్తానికి నా “వెదుకులాట” లో దొరికింది, ఆ సామెత పుట్టుపూర్వోత్తరం. మీరుకూడా చదవండి.జీలకఱ్ఱ సింగినాదం

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– నవ్వాలో ఏడవాలో..

    ఈవేళ శ్రీ అక్కినేని నాగేశ్వరరావుగారు, ఏదో సినిమాల్లో డయలాగ్గులు చెప్పేసినట్టుగా, ఎంతో సుళువుగా చెప్పేశారు- తన శరీరంలో క్యాన్సరు కణాలు ప్రవేశించినట్టు డాక్టర్లు చెప్పారూ అని ! టివీలో ఆయన చెప్పిన మాటలు వింటూంటే, ఎవరికైనా ఇంత గుండెధైర్యం ఉంటుందా అనిపించడమే కాకుండా, ఉన్నదున్నట్టుగా చెప్పగలిగే సాహసం కూడా cultivate చేసికోవాలనిపించింది. ఎన్నో సంవత్సరాలక్రితం “ఆనంద్” (హిందీ) సినిమాలో చూశాము. అదేమో reel life కానీ ఇదిమాత్రం నిజజీవితం. పైగా ఆయన అన్నట్టుగా, మనోధైర్యం ఉంటే, ఎలాటి ఒడుదుడుకులనైనా ఎదుర్కోవచ్చనీ. ఇది నిజంగా అందరికీ ఒక పాఠం లాటిది. ఆయన ప్రకటన ఎవరైనా మిస్ అయి ఉంటే ఇదిగో ఇక్కడ చూడండి.

    నాకు కొన్ని కొన్ని విషయాలు అర్ధం అవవు. ఉదాహరణకి Facebook. ఇదివరకటి రోజుల్లో దేశవిదేశాల్లో ఏదైనా సంఘటన మంచైనా, చెడైనా జరిగితే అందరికీ తెలియడానికి చాలా సమయం పట్టేది. కానీ ఈరోజుల్లోనో Facebook,Twitter ల ధర్మమా అని, కొద్దినిముషాల్లో ప్రపంచం అంతా తెలిసిపోతోంది.

    ఈ Social Networking ధర్మమా అని, ప్రపంచం నిజంగానే “గుప్పెట” లోకి వచ్చేసింది. ఎక్కడెక్కడివో విషయాలు మనకు మనసుంటే తెలిసికోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఏదో కారణం చేత టివీ లో న్యూసు చూడకపోయినా , ఒకసారి ఏ ఫేసుబుక్కో చూస్తే విషయం తెలిసిపోతోంది.చివరకి కుటుంబసభ్యులు కూడా వారి వారి జీవితాల్లో జరిగే విషయాలు ఈ ఫేస్ బుక్కు ద్వారానే తెలిసికుంటున్నారు. ఒకలా చూస్తే అది చాలా విచారకరమైన పరిణామం. స్నేహితుల మధ్య అయితే ఫరవాలేదు, కానీ కుటుంబసభ్యుల మధ్యకూడా, దీన్నే మాధ్యమంగా ఎంచుకోవడం, ఏమిటో నాకైతే నచ్చదు. కానీ కాలంతోపాటు మనమూ పరిగెత్తాలిగా !! బంధువులదగ్గరనుండి ఫోను రాలేదని బాధపడేకన్నా, ఆ బంధువుకి చెందిన ఏ Facebook,Twitter ఐడి యో నొక్కితే విషయం తెలిసికోవలసినంతగా, దిగజారిపోయాము.పోనిద్దురూ, మాధ్యమం ఏదైతేనేం క్షేమసమాచారం తెలుస్తోందిగా అని సరిపెట్టేసుకుంటున్నారు.

    ఈ సందర్భం లో నిన్న జ్ఞానపీఠ బహుమతి ఈమధ్యనే గ్రహించిన శ్రీ రావూరి భరద్వాజ గారి, మరణవార్త నేను టీవీలో చూడకపోవడం కారణంగా, ఈ Facebook లోనే తెలిసికున్నాను. చాలా విచారించాను కూడా. మనందరం ఎప్పుడో ఒకప్పుడు పైలోకాలకి వెళ్ళిపోవలసినవారమే. శ్రీ భరద్వాజగారు, స్వయంగా జ్ఞానపీఠ బహుమతీని స్వీకరించడం అదృష్టం.

    ఈవిషయం Facebook ద్వారా తెలిసికున్నప్పుడు ఓపికుంటే ఓ వ్యాఖ్య పెట్టడం. కానీ చిత్రం ఏమిటంటే కొంతమంది ” like ” పెట్టడం. వారి ఉద్దేశ్యం ఏమిటో అర్ధంకాలేదు. శ్రీభరద్వాజగారు స్వర్గస్థులవడం వారికి ఇష్టమయిందనా? లేక వారు మరణించడం మంచిదయిందనా? ఓ అర్ధం పర్ధం లేకుండా, ఓ వేలం వెర్రిలా ప్రతీదానికీ “like” లు పెట్టడం కొంచం ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది. సందర్భం చూసి ఏదైనా మంచివార్త అయితే ఈ”like” లు పెడితే సంతొషిస్తారు కానీ, ప్రతీ విషయానికీ పెడితే మనోభావాలు కించపరిచినట్టవడంలేదూ? ఒకసారి ఆలోచించండి. FB లో కొంతమంది స్పందన చూసి నవ్వాలో ఏడవాలో తెలియలేదు.

    మరీ ఈ టపా కొద్దిగా సీరియస్సు గా ఉన్నట్టుంది కదూ. కొద్దిగా relax అయిపోండి ఈ వ్యాసం చదివేసి.
పెళ్ళాన్ని పిలవడం ఎలా- అందరూ తమ తమ భార్యలని ప్రతీరోజూ ఏదో ఒక సందర్భంలో పిలవాలేకదా, ఈ వ్యాసంలో చెప్పబడిన పధ్ధతులు ఏవైనా ఉపయోగిస్తాయేమో చూడండి…పొరపాటున ఇంకొక వ్యాసంకూడా జతచేశాను. ఫరవాలేదులెండి, అది కూడా ఉపయోగబడేదే…

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు — కోజాగిరీ పూర్ణిమ

Happy Kojaagiri

    ఇక్కడ మహారాష్ట్ర లో ఈ రోజు అంటే 18-10-2013 న కోజాగిరి పౌర్ణిమ గా ఆచరిస్తారు. ఈ కోజాగిరి పూర్ణిమ ప్రాముఖ్యత నేను వ్రాయడం కంటే , క్రింద ఇచ్చిన లింకుల లో చదివితేనే బాగుంటుందేమో అని నా అభిప్రాయం.

Importance of Kojagiri Purnima

    ఈ కోజాగిరి పౌర్ణమి గురించి ఆంధ్రభూమి 1940 నవంబరు సంచికలో ప్రచురించిన వ్యాసంకూడా చదవండి.

కోజాగిరీ..

    ఈరోజు మసాలా దూధ్ తయారుచేసికుని తప్పకుండా త్రాగాలి. అది తయారుచేయడం ఎలాగో ఇక్కడ చదవండి.

ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ చదవండి.

    HAPPY KOJAGIRI

    గమనిక : అసలు ఈ టపా కి సమాచారం అంతా సేకరించింది మా ఇంటావిడ. కానీ తన బ్లాగ్ స్పాట్ లో ఈ pdf లూ వగైరా పెట్టడం వీలుకాకపోవడంతో నేను వ్రాయాల్సొచ్చింది. ఈ టపాకి సంబంధించినంతవరకూ ఘనత అంతా మా ఇంటావిడదే.. .

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    “మా” టివీ వారు ప్రతీ రోజూ ఉదయం 8 గంటలనుండి, ఒక అరగంట బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ప్రసారం చేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలుసు. ఆ పరంపరలో , “ప్రశ్నోత్తరాల” తరువాత భారతీయ సాంస్కృతిక వైభవం గురించి ప్రసంగిస్తున్నారు. ఆ పరంపరలో నిన్నా, ఈవేళా త్యాగరాజ విరచిత “నాద తనుమనిశం” అనే కీర్తన వైభవాన్ని గురించి చెప్పారు. ఏదో వినడానికి బాగుంది కదా అని, వినడమే కానీ, ఆ కీర్తనలోని ఆర్తి, భక్తి, బ్రహ్మశ్రీ చాగంటి వారి ద్వారానే తెలిసింది. అంత ఘనంగా వర్ణించిన త్యాగరాజకీర్తన ” నాదతనుమనిశం” చిత్తరంజని రాగంలో శ్రీమతి ఎం.ఎస్ .పాడగా, అదే కీర్తన శ్రీమతి ఎం.ఎల్.వి పాడగానూ , వినేసి ఒకసారి ఆస్వాదించేయండి మరి..

    1966 లో ఐక్యరాజ్యసమితి లో శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి గానకచేరీ, ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారమైన తరువాత నుండీ , కర్ణాటక సంగీతం మీద అభిమానం ఏర్పడింది. ఏదో విని ఆనందించడమే కానీ, ఆ కీర్తనలలోని nuances తెలిసికునేటంత “సంగీత జ్ఞానం” ఎక్కడుందీ? అయినా ఆ తరువాత ఓ HMV వారి రికార్డు ప్లేయరొకటి కొని, నెలకి రెండు LP ల చొప్పునా, కర్ణాటక సంగీతం లోని అతిరథమహారథుల LP లు సేకరించేవాడిని. పూనా లో కానీ, దగ్గరలో ఉండే బొంబైలో కానీ, ఎప్పుడైనా సంగీత కచేరీలు ఉంటే, అక్కడకి వెళ్ళి ఆ కార్యక్రమాలు వినేవాడిని.వెళ్ళేటప్పుడు, నేను కొనుక్కున్న LP లు తీసికెళ్ళి, వారి “ఆటోగ్రాఫులు” కూడా తీసికునేవాడిని.శ్రీమతి ఎమ్.ఎస్, శ్రీమతి ఎం.ఎల్.వి, శ్రీ శమ్మంగుడి,శ్రీ చెంబై, శ్రీ చిట్టిబాబు, శ్రీ లాల్ గుడి, శ్రీ నామగిరిపెట్టై,శ్రీ మంగళంపల్లి లాటి ప్రముఖుల కచేరీలు వినే అదృష్టం కలిగింది.

    ఆ సందర్భంలోనే భాగ్యనగరం లోని రవీంద్రభారతి లో జరిగిన ఒక సంఘటన ఎప్పుడూ మర్చిపోలేను. ఆరోజు శ్రీ చిట్టిబాబు గారి వీణ కచేరీ జరిగిన తరువాత, as usual నేనూ, నా ఎల్పీలూ, చేతిలో ఓ పెన్నూ పట్టుకుని స్టేజి మీదకు వెళ్ళగానే, శ్రీ చిట్టిబాబుగారు, “మీరు పూనాలో కూడా వచ్చి నాసంతకం తీసికున్నట్టున్నారూ, కొత్తదికూడా తీసేసికున్నారన్నమాట..” అని, నా రికార్డుమీద సంతకం పెట్టడం. ఎంత సంతోషమనిపించిందో . ఇంతలో ఒకాయన వచ్చి,’ఈ రికార్డు కొత్తగా వచ్చిందాండీ… ఒక్కసారి రాత్రికి విని ఇచ్చేస్తాను, ఇవ్వగలరా..” అని అడగడంతో ముందర కొద్దిగా సంశయించాను. అయినా , మన రికార్డు ఉంచేసికుని ఈయనేం బాగుపడ్డాడులే అనుకుని , సరే అని ఆ రికార్డు ఆయనకిచ్చేను.” మా ఇల్లు ఈ ఆడిటోరియం కి ఎదురుగానే ఉందీ అన్నారు. మర్నాడు సాయంత్రం వారింటికి వెళ్తే తెలిసింది ఆయన ఆనాటి ఆంధ్రప్రదేష్ పోలీసు ఐజి అని.పేరు గుర్తులేదు. ఈరోజుల్లోలాగ, అప్పుడు రాష్ట్రానికి ఓ పదిమంది ఐజీలూ, ఓ డజనుమంది డీజీపీలూ కాదుగా. రాష్ట్రం అంతటికీ ఒక్కరే ఐజి.

    పెళ్ళైన తరువాత,మా ఇంటావిడకి కూడా ఏదో సంగీతం మీద ఇంటరెస్టు ఉన్నా లేకపోయినా, నాతో కచేరీలకి వచ్చేది. వినగా వినగా తనకీ ఓ అనుభూతి కలగడం మొదలెట్టిందనుకోండి. ఎంతదాకా వెళ్ళిందీ అంటే , మా అమ్మాయి చి.రేణు కి సంగీతం నేర్పించేదాకా. ఆరోజుల్లో పూనాలో శ్రీమతి వడ్లమాని సుభద్రగారి దగ్గర నేర్చుకునేది. ఆ సంగీతాభిమానమే మేము వరంగాం లో ఉన్నంతకాలమూ, స్కూల్లో పాటలపోటీల్లో ఎప్పుడూ తనే ప్రథమ స్థానంలో ఉండేది.

   ఆరోజుల్లో నా దగ్గర ఉన్న రికార్డులు అన్నీ టేప్ రికార్డరులో రికార్డు చేసికునేవారు.పైగా ఇప్పటిలాగ కాదుకదా,ఓ మైక్కూ, దాంట్లోంచి వినబడే పాటలు ఓ టేప్ లో రికార్డు చేసికోవడం.రికార్డింగు జరుగుతున్నంతసేపూ , బయటి ధ్వనులు వినిపించకుండా, కిటికీలు మూసేయడం. దగ్గకూడదు, నవ్వకూడదు, చప్పుడనేది చేయకూడదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఎవరో ఒకరు వచ్చేసి పాటలు, కీర్తనలూ రికార్డు చేసికోవడం. చిత్రం ఏమిటంటే ఎవరిద్వారానో నా దగ్గర రికార్డుల సంగతీ, వాటిని రికార్డింగు చేయడమూ విని, 40 సంవత్సరాలుగా నా గురించి ఖోజ్ చేస్తూ..చేస్తూ . చివరకి నన్ను కలిశారు ఈమధ్యన. ఇంకా చిత్రం ఏమిటంటే వారిదీ మా అమలాపురమే.. ఆయన అడిగిన మొదటి ప్రశ్న..” ఆ రికార్డులు మీ దగ్గర ఇంకా ఉన్నాయా..” అని. అదృష్టం కొద్దీ మా అబ్బాయి ఆ జాగ్రత్త తీసికున్నాడు.

    అసలు ఈ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావించానంటే , దానికీ ఓ కారణం ఉంది. వినే ఉంటారు బ్రహ్మశ్రీ ఓగిరాల వీరరాఘవ శర్మగారని గాయత్రీ ఉపాసకులు, అలాటి బ్రహ్మజ్ఞానితో మాకు బంధుత్వం ఉండడం మేము ఏజన్మలోనో చేసికున్న పుణ్యం అయుంటుంది. మా సంగతెలా ఉన్నాకానీ, మా పూర్వీకులైనా పుణ్యం చేసికునుంటారు. దాని ఫలితమేలెండి ఈరోజు రెండుపూటలా తిండి తినే భాగ్యం కలగడం. చెప్పొచ్చేదేమిటంటే, ఓగిరాల వారి కుమార్తె శ్రీమతి విమల గారు మాకు దగ్గర చుట్టం. ఎలాగా అంటారా, మా పెదనాన్నగారు శ్రీ భమిడిపాటి రామచంద్రుడిగారి, మనవడు శ్రీ బులుసు రామచంద్రుడు, ఈ విమల గారికి భర్త. అంటే మాకు కుమార్తె వరసన్నమాట.. చూశారా ఎంత అదృష్టమో మరి.

    అవకాశం దొరికినప్పుడు ఇలా name dropping చేసేసికుంటూంటేనే బాగుంటుంది కదూ.. ఈ విషయం ఏనాడో తెలియచేయవలసింది, కానీ సందర్భం కుదరలేదు. నిన్న మా “మేనల్లుడు” ( వరసకే లెండి, వయసులో ఆయన నాకన్నా పెద్దవారూ, పూజ్యనీయులూనూ) ఫోను చేసి ఈమధ్యన శ్రీమతి విమలగారు వాద్య సహకారం లేకుండగా, వారి నాన్నగారి కీర్తనలు పాడగా, నెట్ లో పెట్టారు. మీరూ విని ఆనందించండి.

1 శ్రీమతి విమల

2. బ్రహ్మశ్రీ ఓగిరాల వీరరాఘవ శర్మ గారు.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అరవై ఏళ్ళ క్రితం…(60 +)

Ammadu

    ఆంధ్రదేశంలో అరవై ఏళ్ళ క్రితం కొన్ని మరపురాని సంఘటనలు జరిగేయి. ఆగస్టు నెలలో గోదావరి నదికి పెద్ద వరద వచ్చి, రాజమండ్రీకి చాలా నష్టం వచ్చింది. ఆ తరువాత అక్టోబరు 1 న శ్రీ పొట్టిశ్రీరాములుగారి నిరాహారదీక్ష ధర్మమా అని, కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అదే సంవత్సరంలో అక్టోబరు 15 న , నా జీవితానికి సంబంధించినంతవరకూ, మా ఇంటావిడ ఈభూమ్మీద కి వచ్చింది !క్రిందటేడాది తన “ప్రవర” కూడా వ్రాసుకుంది.

    ఇంటావిడ పుట్టినరోజూ అని చెప్పుకోడానికి ఇంత build up అవసరమా మాస్టారూ అనొచ్చు. ఏం చేయమంటారూ, తన పుట్టినరోజని తనకు తానై చెప్పుకోదు.ఇదివరకటి రోజుల్లో ఇంటి ఇల్లాలికి షష్టిపూర్తి సమయానికి, ఇంకా కొన్ని కొన్ని బాధ్యతలు మిగిలిపోయేవి, ఉదాహరణకి మా అమ్మగారి షష్టిపూర్తీ, మా ఇంటావిడ శ్రీమంతమూ ఒకేరోజున జరిగేయి. కానీ మా ఇంటావిడ విషయంలో తను కోడలిగా, తల్లిగా, అత్తగారిగా, అమ్మమ్మగా, నానమ్మగా అన్ని బాధ్యతలూ నిర్వర్తించినట్టే,to the best of her ability.
తన రెండో దశకంలో నాజీవితంలోకి వచ్చింది. మూడో దశకానికల్లా ఇద్దరు పిల్లలని నాకు అందించింది.నాలుగో దశకానికి పిల్లల చదువులు పూర్తయాయి.అయిదో దశకానికి పిల్లల పెళ్ళిళ్ళూ, వాళ్ళ పిల్లలకి రెండుపర్యాయాలు అమ్మమ్మగానూ, ఇంకో రెండు సార్లు నానమ్మగానూ బాధ్యత నెరవేర్చింది.ఆరవ దశకానికి మొదట్లో కోడలిగా బాధ్యతలు పూర్తిచేసికుంది.అప్పటినుండీ నా “బాగోగులు” చూసుకుంటోంది.ఈమధ్యలో ఈ నలభైరెండేళ్ళూ నాసంగతి పట్టించుకోలేదనికాదు…ఆవిడేలేకపోతే ….

    ఈ అరవయ్యో జన్మదినం తిరుపతి కొండమీద చేసికుదామనుకున్నాము మొదట్లో. కానీ రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, ఆ కార్యక్రమం మానుకుని , మాకు దగ్గరలోని నారాయణపూర్ మా అమ్మాయీ అల్లుడూ తీసికెళ్ళగా శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని వచ్చేము. మిగిలిన వారందరితోనూ సాయంత్రం హొటల్ లో భోజనం.

    ఆ మధ్యన అరవై ఏళ్ళక్రిందటి ఆంధ్రసచిత్రవారపత్రిక చూస్తూంటే ఆ దసరాసంచిక coincidental గా 14-10-1953 న ప్రచురించారు.పైగా అది బాలల ప్రత్యేక సంచిక కూడానూ. ఆ సంచికలో ప్రచురించిన కొన్ని బొమ్మలు మీతో పంచుకోవాలనుకున్నాను. విశేషమేమిటంటే, ఆ బొమ్మలు వేసిన బాలల వయస్సు కూడా ప్రచురించారు. అంటే ఆనాటి బాలలందరూ ఇప్పుడు 60 + లోకే వస్తారుగా !! ఎక్కడెక్కడున్నారో ఏం చేస్తున్నారో.. జీవితంలోని బాధ్యతలన్నీ నిర్వర్తించి హాయిగా ఉండే ఉంటారు. ఆ పేర్లలో మీకెవరైనా పరిచయం ఉంటే వ్యాఖ్యలరూపంలో తెలియచేయ ప్రార్ధన…

చిత్రములు 1చిత్రములు 2చిత్రములు 3
చిత్రములు 5చిత్రములు 6చిత్రములు 7

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఏదో దసరా బాగానే గడిచిపోయిందని సంతోష పడ్డంత సేపు పట్టలేదు.దురదృష్టం కొద్దీ ఈవేళ జెమినీ లో “జగద్గురు శంకరాచార్య” సినిమా చూడాల్సి వచ్చింది. జగద్గురువులు ఆదిశంకరుల గురించి, బ్రహ్మశ్రీ చాగంటి వారి “శంకర విజయం” లో చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని,పోనీ ఆ అంశాలు దృశ్యరూపంలో కూడా చూసి ఆనందించవచ్చూ అనే ఒకేఒక్క కోరికతో రెండున్నర గంటలూ భరించాల్సొచ్చింది. అసలు ఆ సినిమా ఎందుకుతీశారో అర్ధం అవలేదు. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎంత ఎక్కువగా పెడితే అంతగా సినిమా విజయవంతమౌతుందనే దురభిప్రాయం లోంచి ఎప్పుడు బయట పడతారో మన నిర్మాతలు, అన్నది తెలియడంలేదు. అప్పుడెప్పుడో సాయిబాబా చరిత్రని ఉధ్ధరించారు. ఇప్పుడు ఆదిశంకరుల వంతు వచ్చింది. ఒక్క పాత్రా నేలమీద నడిచిన పాపాన పోలేదు. ఎవరిని చూసినా గాలిలో ఎగిరేవారే. ఒక్కో సినిమాకీ అవేవో A సర్టిఫికేటూ, కొన్నిటికి U సర్టిఫికేటూ, కొన్నిటికి UA అనీ ఇస్తూంటారు. ఈ సినిమాకైతే ముందరే For Youth అని ఒక tag పెట్టేశారు. అప్పుడైనా తెలిసికోవలిసింది, ఈ సినిమా ఒఖ్ఖ facebook జనాలకే అని. సాయిబాబా సినిమాలోవారే మేక్ అప్ మార్చేసికుని ఈ సినిమాలో నటించేశారనుకుంటా. ఇంకా ఎంతమంది మహనీయుల చరిత్రలు ఈ గ్రాఫిక్స్ బారిన పడతాయో పాపం

    పాప ప్రక్షాలణం కోసం ఇదివరకెప్పుడో తీసిన శంకరాచార్య సంస్కృత సినిమా చూసి refresh కావాల్సొచ్చింది. మీరు కూడా ఈ చిత్రాన్ని ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో ఇక్కడ చూడండి.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–తమసోమా జ్యోతిర్గమయ–TV5

    తెలుగు చలనచిత్రరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన శ్రీహరి ఈవేళ ముంబైలో స్వర్గస్థులయారని తెలిసి, చాలా బాధ వేసింది. ఇంకా నిండా యాభై ఏళ్ళుకూడా లేవు. ఆమధ్యన టివి 5 లో ప్రారంభించిన తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమం, నిర్వహించిన శ్రీహరి ని ఈ వీడియోలో చూడండి.

%d bloggers like this: