బాతాఖానీ-తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–పోపులో శనగబద్ద

    ఈ బ్లాగ్గు కి ” పోపులో శనగ బద్ద” అని ఎందుకు పేరు పెట్టానంటే–మనకి రుచుల విషయంలో ఏదైనా గుర్తు పెట్టుకోవలిసి వస్తే అది మనం కూరల్లో గానీ, పచ్చళ్ళలోగానీ వేసే పోపు/తాళింపు లలో వేసే అతి చిన్న “శనగ పప్పు బద్ద”. ఆ పదార్ధానికి రుచి అంతా ఈ శనగ బద్దల వల్లే వస్తుంది, అని నా అభిప్రాయం.మనం ఏదైనా తింటూంటే ఆ శనగ బద్ద పళ్ళలో ఎక్కడో దాగిఉండిపోతుంది, ఆ తరువాత దీనిని నాలుకతో trace చేసి, మెల్లిగా ముందుపంటిక్రిందకి తెచ్చి, మళ్ళీ నమిలేస్తాము. దాని రుచి అలాంటిది. అదొక రుచికరమైన జ్ఞాపకం. ఇవన్నీ మీరు ఎలా చెప్తున్నారూ, మీకు పళ్ళులేవుగా అనకండి.పళ్ళున్న ” స్వర్ణ యుగం” లో నాకు అతి ఇష్టమైన జ్ఞాపకం ఇది. మీ అమ్మగారు చేసిన పులిహార అయినా, పులిహార ఆవకాయైనా తిని చూడండి, వాటికి ఆ రుచి అంతా ఆ శనగబద్దలవల్లే.

    నిన్న సాయంత్రం మాఇంటికి దగ్గరలోనే ఉన్న పూణే యూనివర్సిటీ రోడ్ మీద సాయంత్రం అలా నడుచుకుంటూ వెళ్ళాము, నేనూ ,మాఇంటావిడానూ.దారిలో Paraplegic Home and Centre అని ఒకటుంది. ఇక్కడ యుధ్ధం లో క్షతగాత్రులై, నడుము క్రిందనుండి Physically challenged అయిన వారికి పునరావాస కేంద్రం లాంటిదన్నమాట. ఆ రోడ్ మీద ఎప్పుడూ Wheel chair ఎవరో ఒకరు తిరుగుతూ కనిపిస్తూంటారు. అక్కడ ఓ కేబిన్ లో ఒకతను Instant coffee అమ్ముతున్నట్లనిపించింది. ఇదివరకెప్పుడూ చూడలేదు అక్కడ.
కాఫీ టైము కాకపోయినా మేమిద్దరమూ అక్కడ ఆగి ఓ రెండు కాఫీలిమ్మన్నాము. అతను నన్నే ఓ ఖాళీ కప్పు తీసికొని, నాచేతే కాఫీ చేయించాడు. కప్పులు తిసికొని వెనక్కాల కుర్చీలు వేశారు అక్కడ కూర్చొని కాఫీ తాగమన్నారు. అక్కడ ఇంకో ఇద్దరు Wheel chairs లో కూర్చొని ఉన్నారు.ఇంక వాళ్ళతో ఖబుర్లు మొదలెట్టాము, వారికి ఈ పరిస్థితి ఎలా వచ్చిందీ, ఇక్కడ ఎన్నాళ్ళుండాలీ, వారి వారి కుటుంబాల గురించీ అన్నీ అడిగాము. వారితో గడిపిన ఆ అరగంటా మరువలెము. బయటవారెవళ్ళో వచ్చి వారితో అంత సమయం గడపడం వల్ల వారికి వచ్చిన సంతోషం వారి ముఖంలో కనిపించింది.వారి ముఖంలో ఉన్న ఆత్మ విశ్వాసం చూస్తే ఎంతో ఆనందం వేసింది.

    ప్రతీ శనివారమూ నేను పూణే స్టేషన్ కి వెళ్ళి తెలుగు పుస్తకాలు తెచ్చుకుంటాను. ఈ వేళకూడా అలాగే వెళ్దామని ఖడ్కీ స్టేషన్ కి వెళ్ళేసరికి అక్కడ రెండు రైళ్ళూ, ఎంతోమంది జనమూ రైల్వే ట్రాక్ మీద కనిపించారు, కారణం ఏమిటా అని చూస్తే , లోకల్ లో వెళ్ళే ప్రయాణీకులు రెండో ట్రైన్ ని ఆపేశారుట. కారణం ఆ రెండో ట్రైన్ కోసం ఈ లోకల్ ని ఇక్కడ డిటైన్ చేశారుట.ఇది ప్రతీ రోజూ జరిగే భాగవతమే. లోకల్ లో వెళ్ళేవాళ్ళు ఆఫీసులకీ, స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళవలసిన వాళ్ళు. ప్రతీ రోజూ మన రైల్వే అధికారుల ధర్మమా అని లేట్ గా నే చేరుతున్నారు. ఈ లోకల్ ని ఏదో ఒక స్టేషన్ దగ్గర detain చేయడం, ఇంకో So called prestigious train దేన్నో వదలడమూను. ఎన్నిసార్లు పాసెంజర్స్ కంప్లైంట్ చేసినా ఎవరూ వినడం లేదు. వీళ్ళకీ ఓర్పు అయిపోయింది. అంతే ట్రాక్ కి అడ్డంగా నుంచొని వాళ్ళ సమస్యని వాళ్ళే తీర్చుకున్నారు.This was an avoidable problem,కానీ వినేవాళ్ళెవరూ? అందుకే ప్రజలు లా ని తమ చేతిల్లోకి తీసికుంటారు. పూణే స్టేషన్ కి వెళ్ళి ఈ వారం స్వాతి, నవ్యా తీసికున్నాను. ఇంతలో ఒకాయన వచ్చి సాక్షి, ఈనాడు అడిగారు. నాచేతిలో తెలుగు పుస్తకాలు చూశారు, అయినా పలకరించలేదు. నేనే ఓ అడుగు ముందుకేసి మీరు తెలుగు వారా అని అడిగాను, ఔనండీ నేను CPWRS Khadakvaasla లో పనిచేస్తున్నానూ అని చెప్పారు. ఇంతలో ఆయన ట్రైన్ టైము అయిపోవడం వలన వెళ్ళిపోయారు. నేను నిన్న N R A ల గురించి వ్రాశాను. మనం ఓ అడుగు ముందుకు వేస్తేనే అవతలి తెలుగు వారు పలకరిస్తారు. తమంతట తాము చొరవ చేయరు. నా చేతిలో తెలుగు పుస్తకాలు చూసి కూడా ఆయన ఏమీ పట్టించుకోలేదు. నేను ఆయనని తప్పు పట్టడం లేదు. ఇక్కడి తెలుగు వారి మనస్థత్వానికి ఒక ఉదాహరణ మాత్రమే.

    ట్రైన్ బయలుదేరడానికి ఇంకా టైముంది కదా అని స్వాతి లో కోతి కొమ్మచ్చి చదివేశాను. అబ్బ వెంకటరమణగారు ఎలా వ్రాస్తున్నారో, కొన్ని చదువుతూంటే మనలో మనమే నవ్వేసుకుంటాము. అవతలివాడికి ఇదంతా ఏదో వెర్రి వ్యవహారంలా కనిపిస్తుంది. వాడికేం తెలుసూ మన ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి గురించి. పోనీ translate చేద్దామా అంటే, అయ్యబాబోయ్ అంత సాహసమా ? అస్సలు ఇలాంటి రచనలని తెలుగులో చదివితేనే ఆనందం. ఆ తరువాత నవ్య లో మొదటి పేజీ (First page) అని ఒకటుంది. ఈ వారం ” శివ కేశవులు” అనే శీర్షికకింద వ్రాశారు.అందులో ఒక వాక్యం –-” మా అయ్య ఓ మాటనేవాడు! కాలిలో ముల్లు గుచ్చుకుంటే, కంట్లో గుచ్చుకోలేదని ఆనందించాలి కానీ, బాధ పడకూడదు.అలాగే ఉద్యోగ మే పోయింది కానీ, బతుకు పోలేదు కదా! అందుకని బేఫికర్, మనకి భయం లేదు” అని ఓ అఛ్ఛోణీ లాంటి వాక్యం వ్రాశారు. నవ్య లో ఇదివరకు శ్రీ రమణ గారు ఈ సీర్షిక నిర్వహించేవారు. ఇప్పుడు ఎవరు వ్రాస్తున్నారో తెలియచేస్తే ఇంకా బాగుండేది. శ్రీరమణ గారి ఈ “మొదటి పేజీ” లన్నీ ఓ పుస్తకరూపంలో కూడా వచ్చాయి.

    ఈ వాళ్టి ఈ ఆనందం అంతా ఎవరితోనైనా చెప్పుదామంటే వినే ఓపికా, సమయమూ ఎవరికున్నాయి? అలాగని ఎవరితోనూ పంచుకోపోవడం బాగుండలేదు. పోనీ నా బ్లాగ్గు లో వ్రాసుకుందామని ఈ పోస్ట్. నాలాగే ప్రతీ వారికీ ” పోపులో శనగ బద్దల్లాంటి” అనుభవాలుంటాయి, ఆనందాలుంటాయి, అవి అందరితోనూ పంచుకుంటేనేకదా ద్విగుణీకృతం అవుతాయి!!

%d bloggers like this: