బాతాఖాని-తెరవెనుక(లక్ష్మిఫణి)కబుర్లు–అలవాట్లు

    మేము పూణే నుండి రాజమండ్రి ప్రయాణంలో ఉండడం వలన ఈ రెండురోజులూ ఏమీ వ్రాయలేకపోయాను. అందుకనే మా ఇంటావిడ ఓ ఉచిత సలహా ఇచ్చింది ఒక
Laptop తీసికోమని. నాకు ప్రయాణాల్లోనూ,తనకు ఇంట్లోనూ ఉపయోగంగా ఉంటుందని. రెండో ది దృష్టిలో పెట్టుకునే ఈ సలహా ఇచ్చిందని నా నమ్మకం.!

    ఈ వేళ నేను మనుష్యులలో ఉండే కొన్ని అలవాట్లగురించి (మంచివీ, చెడువీ) వ్రాయాలనుకొన్నాను.ముందుగా నా గురించే వ్రాస్తే గొడవే ఉండదు. అడిగినా అడక్కపోయినా ఉచిత సలహాలివ్వడం, కనిపించిన ప్రతీ వాడితోనూ ఖబుర్లు చెప్పడం, (అవతలివాడు వద్దుమొర్రో అంటున్నా వినకుండా!!).మనం వ్రాసింది అందరికీ నచ్చుతోందా లేదా అని ఆలోచించకపోవడం,ఊరికే వ్రాసుకుంటూ పోవడం!!

   కొంతమంది చిన్నపిల్లలు బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటారు, నాకు తెలిసిఉన్న ఒక అమ్మాయైతే బొటనవేలితో, తన జుట్టుకూడా నోట్లో పెట్టుకునేది.ఇలాంటి అలవాట్లు తల్లితండ్రులే గమనించి, అవి మాన్పించాలి. లెకపోతే పెద్ద అయిన తరువాత అందరూ వీళ్ళని ఏడిపిస్తారు. కొంతమందికి నోరు వెళ్ళపెట్టుకుని చూడడం ఓ అలవాటు.ఏది చూసినా అదో అద్భుతంలా చూస్తాడు. కొంతమందికి, చెవిలోనూ, ముక్కులోనూ వెలుపెట్టి కెలుక్కోవడం ఓ దురల్వాటు. అవతలివారికి ఇది ఎంత అసహ్యంగా అనిపిస్తుందో.ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసికుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు.ప్రయాణాల్లో చుస్తూంటారు, ట్రైన్ లో కొంతమందికి నిద్రలో గురక పెట్టడం, ఇది మిగిలిన వారికి ఎంత న్యూసెన్సో.పైగా అదెదో ప్లేన్ లాండింగ్, టేక్ ఆఫ్ ల లాగ ధ్వనులు వస్తాయి. అలాటివారిని గేలి చేస్తున్నాననుకోకండి, ఇంట్లో ఎంత గురక పెట్టినా ఫర్వాలేదు, ఇంట్లో వాళ్ళకి తప్పదు కాబట్టి భరిస్తారు, ప్రయాణాల్లో అలా కాదే!! నోట్లో ఏదో నములుతూ మాట్లాడడమంత దరిద్రపు అలవాటు ఎక్కడా ఉండదు.కొంతమంది గమనించే ఉంటారు, పొద్దుటే దంతధావనం చేసికొనేటప్పుడు పేద్ద పేద్ద ధ్వనులు చేస్తారు.అందులో వారికి అలౌకికానందం ఉండవచ్చు, కానీ ఈ ధ్వనులు వినేవారికి చాలా చిరాకు తెప్పిస్తాయి.అలాగే భోజనం అవగానే చేయికడుక్కునేటప్పుడుఅవెవో ధ్వనులు చేస్తారు. ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినప్పుడైనా మానుతారా అబ్బే. వీడి ధ్వనులు విని, ఇంకా భోజనం చేస్తున్నవాడు కంచం లో చేయి కడిగేసుకుంటాడు. ఇంక కొంతమందికి బస్సులో వెళ్తూ కిటికీ లోంచి ఉమ్మేయడం,ఈ అలవాటు ఉన్నవాళ్ళు మన సమాజంలో ఉండడానికి అనర్హులు. మహరాష్ట్రలో చూస్తూంటాము, చాలా మంది “తంబాకూ” ( అంటీ మన పుగాకు) సున్నంలో కలిపి, పొడి చేసికొని,క్రింద పెదవి కింద పెట్టుకుని ఆ జ్యూస్ బయటకు ఉమ్ముతూంటాడు. మన అదృష్టం బాగోక ఆ బస్సు పక్కనుండి వెళ్ళేమా మన పని అయిపోయినట్లే!! బస్సు ప్రయాణంలో జోగుతూ పక్కవాడిమీద పడడం మనకి ఒక నేషనల్ అబ్సెషన్!! అందరి ఎదురుగానూ ఓ పుల్ల పెట్టుకుని పళ్ళు కుట్టుకోవడం, గోళ్ళు కొరుక్కోవడం.

    గుడిలో పూజారి తీర్థం ఇచ్చినప్పుడు చప్పుడుచేసికుంటూ స్వీకరించడం. నాకు ఈ అలవాటుండేది, రంగనాధస్వామి గుడిలో పూజారి నాచేత ఈ అలవాటు మాన్పించారు. చాలా ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది!! అలాగే కాఫీ, చాయ్ తాగేటప్పుడు చప్పుడుచేసికుంటూ త్రాగడం, మాఇంటావిడ నాచేత ఎలాగో మాన్పించింది.దానికి కూడా చాలా శ్రమ పడవలసివచ్చింది. ఐనా మానేశాను.

నెను చెప్పొచ్చేదేమిటంటే అందరికీ అలవాట్లుంటాయి, వాటివల్ల అవతలివారికి అసౌకర్యం కలగకూడదు.

%d bloggers like this: