బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు

  తిన్నతిండి అరక్క చేసే పనుల్లో ఒకటి- ఈరోజుల్లో తెలుగు సినిమా చూడ్డం. అదే నిన్న చేసిన పని. మొన్న ఏదో మా బంధువుల ఇంట్లో పెళ్ళి కి వెళ్ళి, తిరిగి ఇంటికొచ్చేటప్పటికి అర్ధరాత్రి దాటింది. పొద్దుటే, తెలుగు పుస్తకాలు తెచ్చుకోడానికి, స్టేషనుకి వెళ్ళి , వస్తూంటే, అబ్బాయి ఫోనూ… ” సాయంత్రం తెలుగు సినిమాకి వస్తారా.. ” అంటూ.. పిల్లలతో ఇంకొంచంసేపు గడపొచ్చూ అనుకుని, సరే అని , మా ఇంటావిడకి ఫోను చేసి చెప్పాను.. స్వయంగా సినిమాలకి వెళ్ళి , వాటికయ్యే ఖర్చూ, ఆ థియేటరులోని , భయంకరమైన డాల్బీ సౌండూ, భరించే ఓపిక లేక, అసలు థియేటరుకి వెళ్ళి సినిమాలు చూడ్డమే మానుకున్నాము.. అలాగని మేమేదో జీవితంలో ఏదో కోల్పోయామని కూడా అనుకోవడం లేదు. మహా అయితే, ఇంకో తెలుగువారెవరైనా, ఫలానా సినిమా చూశామూ, మీరు కూడా చూశారా అన్నప్పుడు,  అయ్యో, ఇదివరకటి రోజుల్లోలాగ ఏదో పాత సినిమాలు కాకుండా, ఆంధ్రదేశంలో రిలీజైనరోజే, పరాయి రాష్ట్రాల్లోకూడా రిలీజవుతున్నప్పుడు కూడా, అలాటి సదావకాశాన్ని సద్వినియోగపరచుకోలేదే అని అనుకుంటూంటాము.. అలాటి భావోద్వేగాలకి లోనైనప్పుడు మాత్రం ఓ తెలుగు సినిమా చూసి, పాపప్రక్షాలణ చేసికోవడం. ఓ సినిమా చూడ్డం, మళ్ళీ ఓ రెండు సంవత్సరాలపాటు, సినిమా యాడ్లుకూడా చూడకపోవడం. జీవితం బాగానే వెళ్ళిపోతోంది.

 ఏదో ఉన్నవాళ్ళకంటే ఇంకొంచం బాగా చేస్తూన్న, అల్లు అర్జున్  సినిమా కదా, పోనీ వెళ్దామూ అనుకున్నాము.   అసలు ఆ సినిమా ఏమిటో, కథేమిటో, ఒక్కో సీనులో పదేసిమందిని, ఒక్కోసారి హీరో, ఇంకోసారి హీరో  చంపేయడమేమిటో, మాట్టాడితే అయిటం  సాంగులేమిటో , అస్సలర్ధం అవలేదు.  పైగా, పరాయిరాష్ట్రాల్లో తెలుగేతరులని కూడా హింసించడానికి,  Subtitles  ఒకటీ.. పాటల లిరిక్స్ తో సహా..   ఇవన్నీ సరిపోవన్నట్టు, హీరో ఇదివరకు ఆర్మీలో పని చేశాడని , మాటలద్వారా తెలిసింది. ఈ హీరో బయటకొచ్చేయడం వలన, మన దేశ సరిహద్దులు , ఎంత పటిష్ఠంగా ఉన్నాయో తెలిసింది.  హీరోయిన్  ఒక  MLA  ట. శుభం. ఇప్పుడర్ధమవుతోంది, మన శాసనసభలు అంత దరిద్రంగా ఎందుకుంటున్నాయో.. ఎప్పుడుచూసినా హీరోలతో డ్యాన్సులు చేస్తూంటే, ఇంక ప్రజలగురించేం పట్టించుకుంటారు మరీ? అలాగని పట్టించుకోవడం లేదూ అనడానికీ లేదూ… పట్టించుకున్న ఓ విషయమూ flop show  అవుతుంది. ఇంక హాస్యమంటారా, కొన్ని కొన్ని డయలాగ్గుల ద్వారా  routine  కి  different  గా తమాషాగానే ఉన్నాయి. ఒక్కో నటుడికీ, మొత్తం సినిమా అంతటికీ ఓ గుప్పెడు డయలాగ్గులూ. ఇదివరకటి రోజుల్లో ప్రముఖ నటులెవరైనా సినిమాలో వేస్తే, ” అతిథి పాత్ర ” లో అనేవారు. ఈరోజుల్లో, హీరో, విలనూ తప్పించి అందరూ “అతిథి పాత్ర” ల్లోనే. ఇంక డ్యాన్సులంటారా, అవేవో రికార్డింగు డ్యాన్సుల్లా ఉన్నాయి.

 అయినా ఈరోజుల్లో, ఏవేవో expectations  పెట్టుకుని, తెలుగు సినిమాకి వెళ్ళడమేమిటీ? అస్సలర్ధంలేని మాట. డబ్బులున్నాయా వెళ్ళు. ఓపికుందా సహించు. లేదంటావా నోరుమూసుక్కూర్చో.. అంతేకానీ, ఇలా  రాయడం వచ్చుకదా అని అవాకులూ, చవాకులూ రాసి, తెలుగువారి మనోభావాలు కించపరచొచ్చా… హన్నా…

టీవీల్లోనూ, పత్రికల్లోనూ ఆ సినిమా గురించి అభిప్రాయాలూ, రివ్యూలూ హోరెత్తించేస్తున్నారే,  మొదటిరోజు ఇన్ని కోట్లూ.. రెండో రోజు ఇన్ని కోట్లూ, ఫలానా హీరో సినిమాకంటే ఇంతెక్కువా అని . పైగా ఒక్కో చానెల్ లో ఆ హీరోయిన్లతో , వచ్చీరాని తెలుగులో ఇంటర్వ్యూలూ. హాయిగా ఇవన్నీ చూసి కాలక్షేపం చేసినా గొడవుండేది కాదు. “చేసిన పాపం చెప్పుకుంటే పోతుందిట ” అందుకే ఈ టపా..  మొత్తం నాకు నచ్చిందల్లా ఆ థియేటరులోని  సీట్లు. హాయిగా కాళ్ళు జాపుకుని  relax  అయ్యేలాగ  సోఫాలు. అదికూడా ఈమధ్యనే మొదలెట్టారుట. మా మనవడు అగస్థ్య  వచ్చి, సీటు కి పక్కనుండే అదేదో నొక్కి, కాళ్ళు బార్లాజాపుకునేటంతగా చేసి, వాడి దారిన వాడు పడుక్కున్నాడు హాయిగా…

 

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు- భూమి గుండ్రంగా ఉండడమంటే ఇదే కాబోలు…

సాధారణంగా ఈరోజుల్లో,  ఆనాటి మాటలేమైనా చెప్తే, మన ” యువతరం ” .  ” అంతా ఏమిటో పాతచింతకాయ పచ్చడిలా , మరీ వాటినే పట్టుకు వేళ్ళాడుతూ కూర్చుంటే ఎలా… మారాలి కాలంతో పాటూ… ” అని కొట్టిపారేస్తూ,   ” జ్ఞానబోధ ” చేయడం చూస్తూనే ఉంటాం. అయినా మొండిఘటాలు చేస్తూనే ఉంటారు.. చెప్పడం మన డ్యూటీ అనుకుంటూ. ఈరోజుల్లో ఎక్కడ చూసినా ” అంతర్జాల మహిమ” కదా..  ఇంట్లోపెద్దలు ఎంత చెప్పినా, ఓసారి గూగులమ్మని అడిగితేనే కానీ, అంత సులభంగా ఒప్పుకోరు. ఇంక ఆ గూగులమ్మేమో, ఏదో అమెరికాలో కనిపెట్టిన విశేషమోకానీ చెప్పదాయె. పైగా ఆ విషయాలన్నీ, ప్రాచీనకాలంలో మన ఋషులు ఏనాడో చెప్పారూ అన్నా కూడా ఒప్పుకోరు. ఎంతైనా పెరటి చెట్టు మందుకి ఉపయోగించదుగా..శంఖంలో పోస్తేనే తీర్థం, ఆ గూగులమ్మ చెప్పిందే వేదం. అదేమీ తప్పుకాదు. ఇదివరకటి రోజుల్లో, ” మెదడు” ని ఉపయోగించేవారు, ఈరోజుల్లో, ఆ మెదడుకి విశ్రాంతి ఇచ్చి, చేతిలో ఉన్న  smart phone  ని ఓ నొక్కునొక్కుతున్నారు.. No issue..

 ప్రస్థుత విషయం ఏమిటయ్యా అంటే,   ఓ కుటుంబంలో ఉండే పిల్లల విషయం. అంటే ఒక్కో కుటుంబంలో ఎంతమంది పిల్లలుండాలీ అని. ఇదివరకటి రోజుల్లో, ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంత సౌభాగ్యమూ అనుకునేవారు, తమ ఆర్ధిక స్థోమతతో  సంబంధం లేకుండా. ఆరోజుల్లో మన తల్లితండ్రులు అలా అనుకోకపోతే, ఇప్పుడు నేనూ ఉండేవాడినికాదూ, 60 ఏళ్ళపైబడ్డ  ఎవరూ ఉండేవారు కాదు.. కనీసం ఓ అయిదారుగురు పిల్లలుంటేనే కానీ, తోచేదికాదు ఆరోజుల్లో. అలాటివి విన్నప్పుడు మన యువతరం… ”  अरे बाप रे… इत्ना बच्चा..”  అని ఆశ్ఛర్య పడిపోడం. వారిమధ్య సంబంధబాంధవ్యాలు ఎలా ఉండేవీ అన్నది, ప్రస్థుతం, అప్రస్థుతం. పెళ్ళిళ్ళు కూడా చిన్నవయసులోనే అయిపోయేవి. కుటుంబ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబాలూ etc..  అవీకూడా లక్షణంగానే ఉండేవి, ఎక్కడో అక్కడా ఇక్కడా తప్పించి. ఆరోజుల్లోనూ పిల్లలు ఉద్యోగరీత్యా దేశవిదేశాల్లో ఉండేవారు. అయినా ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా, ఓ పండగొచ్చినా, అందరూ  తప్పనిసరిగా కలిసేవారు ” నిత్యకల్యాణం పచ్చతోరణానికి ” ప్రతీకగా ఉండేది వాతావరణం.ఇంట్లో ఎంతమందిపిల్లలుంటే అంత గర్వంగా భావించేవారు. మరి ఈ పిల్లలందఱూ పెరిగిపెద్దదయ్యేదెట్లా అని అడిగినా, ” ఏదో ఆ నారు పోసినవాడే నీరూ పోస్తాడులెద్దూ.. ” అని నవ్వేసేవారు. మనం పెరిగిపెద్దవలేదూ వారి ఆశీర్వచనంతో?

 కానీ కాలక్రమేణా, జనాల్లో కోరికలూ, ఏదో ఉధ్ధరించేద్దామని ఊహలూ మొదలయ్యాయి. ఇంట్లో అంతమంది పిల్లలుంటే, వీళ్ళని పెంచేదెట్లా అనేసికుని, 70 వ దశకం తరువాత, ఉండాలికాబట్టి ఓ పిల్లా, తనకి తోడుగా ఉండడానికి ఓ పిల్లో, పిల్లాడో చాలూ, అనే పరిస్థితిలోకి వచ్చేశారు. ఒకలా చూసుకుంటే అదీ సరైన పధ్ధతిగానే కనిపించింది.. ముందర ఆడపిల్ల పుడితే, ఇంకోసారి ప్రయత్నం చేసి, ఓ మొగపిల్లాడు పుట్టాడా సరే సరి, లేకపోతే ఇద్దరు చాలనుకునేవారు.. మరీ ఎక్కడో తప్ప, ఇంటికి ముగ్గురూ, అంతకన్నా ఎక్కువా  పిల్లలుండడం చాలా అరుదు.ఈరోజుల్లో ఓ పిల్లనో పిల్లాడినో పెంచిపెద్దచేసి మంచి చదువులు చెప్పించడానికి లక్షల్లో ఖర్చవుతోంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూండడం వలన ఎలాగోలాగ బాగానే వృధ్ధిలోకి తెస్తున్నారు. కానీ రోజులు గడిచేకొద్దీ, ఒక్కరితోనే సరిపెట్టేసికుంటున్నారు. ఆ ఉన్నవాళ్ళనే బాగా పెంచితే చాలూ అనుకుంటున్నారు.  No problem…

 కానీ ఈవేళ న్యూస్ పేపరులో ఓ వార్త  చదివిన తరువాత నవ్వొచ్చింది. అలాగే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారి  ఉవాచ… ” నేటి తరం కుటుంబ నియంత్రణ పద్ధతులను పక్కన పెట్టి.. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో శనివారం క్రీడా అవగాహణ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన కుటుంబ నియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనన మరణాల రేటు సమానంగా ఉంది. దీంతో రాబోయే కాలంలో యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని.. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు చెప్పారు. తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి సంతరించుకున్నాయి.  ” , ఇంకా చిత్రంగా ఉంది. ఆ సందర్భంలోనే  ఈ లింకు కూడా చదవండి… అకస్మాత్తుగా నాయుడుగారికి    ఇంత  జ్ఞానోదయం ఎలా  అయిందబ్బా?  ఎంతైనా రాజకీయ దురంధరులాయె. తనకు ఎలాగూ సమస్యలేదుకదా, పోతే ప్రజలే మట్టికొట్టుకుపోతారూ, అంతేసిమంది సంతానాన్ని పెంచలేకా, తనూ,  తనకున్న కొడుకూ చల్లగా ఉంటే చాల్లెద్దూ అనా?

 చెప్పడమంటే చెప్పేశారు కానీ, ఈరోజుల్లో ఒక్క పిల్లో, పిల్లాడో పుట్టించడానికే టైముండడం లేదాయె, అధవా టైమంటూ ఉన్నా, 40 ఏళ్ళకి మగాళ్ళూ, 35 ఏళ్ళకి ఆడవారూ, పెళ్ళిళ్ళు చేసికుంటూన్న ఈ రోజుల్లో  , అంత వయసొచ్చిన తరువాత, వచ్చే శరీరమార్పులతో, అదికూడా కష్టతరమైపోతోంది.. కిం కర్తవ్యమ్ ?  ఓవైపునేమో,  దేశ సమస్యలకన్నిటికీ జనాభా వృధ్ధే కారణమంటారు, ఇంకోవైపునేమో నాయుడుగారేమో ఇలా మాట్టాడుతున్నారు ఎలాగబ్బా?

 మొత్తానికి భూమి గుండ్రంగానే ఉందనీ, ఉంటుందనీ తేలిపోయింది. ఇంకా ఎన్నెన్ని మార్పులొస్తాయో చూడాలి…

సర్వేజనా సుఖినోభవంతూ

 

 

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– చెప్పకూడదనుకుంటూనే….

ఓ ఏడాది క్రితం నేను తెలుగు వికీపీడియా గురించి ఒక  టపా పెట్టాను .  అప్పుడు ,  తెలుగు వికీలో చూసిన ఒక  misprint  గురించి రాశాను. దాన్ని సహృదయంతో స్వీకరించి, తప్పును వెంటనే సరిచేశారు. అంతవరకూ బాగానే ఉంది. అక్కడితో ఆపకుండా, కొంత  “జ్ఞానబోధ “కూడా చేశారు. ఆ టపా చదివితే మీకే తెలుస్తుంది. ఇది ఎలా ఉందంటే… ” నీ నెత్తిమీద బూజు పడిందిరా ..” అంటే  ”  అదేదో నువ్వే తీసేయ్..” అన్నాట్ట వెనకటికి ఎవడో.. ఏదో  ” విజ్ఞానఖని ”  అంటారు కదా అని, అవసరార్ధం , తెలుగు మహనీయుల గురించి, తెలుగులో సమాచారం కావాల్సినప్పుడు, చూస్తూంటాము. తప్పులు రాసినప్పుడు, దాన్ని కూడా , పాఠకులనే సరిచేయమనడం ఎంతవరకూ సమంజసమంటారు? ” ఏదో ఆయనే ఉంటే ..” అని ఒకావిడ అన్నట్టు, ఆమాత్రం తెలివితేటలే ఉంటే ఇలా ఎందుకుంటాము?

 కానీ ప్రస్థుత విషయం రెండు వికీల్లోనూ ఉన్న సమాచారం గురించి. తెలుగు వికీలో శ్రీ కె. విశ్వనాథ్ గారి గురించి ఏప్రిల్, 19 అన్నారు KV2 అదే విశ్వనాథ్ గారి గురించి,  Wikipedia   లో KV3  అన్నారు. ఇందులో ఏముందీ, పేద్ద హడావిడి చేస్తున్నారూ అంటారేమో,. చేయాల్సొచ్చింది. నేను ప్రతీరోజూ మహనీయుల జయంతి/ వర్ధంతి సమాచారాలు, నామీదున్న గౌరవం అనండి, అభిమానం అనండి, ఎంతో మంది చదవడమే కాక, చాలామంది  share  కూడా చేసికుంటారు. అలాటప్పుడు నాకు కూడా ఓ బాధ్యత అనేది ఉంటుందిగా– సరైన సమాచారం పాఠకులకి ఇవ్వాలని. అనుకున్నట్టుగానే ఒకరు సందేహం వెలిబుచ్చారు, “మాస్టారూ ఫిబ్రవరి 19 అని చదివానూ, మీరేమో ఏప్రిల్ 19 అంటున్నారూ, ఏది రైటూ..”. వెంటనే స్పందిస్తూ, నేను తెలుగు వికీలో చదివిన సమాచారం   Copy paste  చేశాను.

 దివంగతులైన celibreties  గురించి రాసినప్పుడు, ఇలాటి తేడాలొచ్చినా, ఓ  disclaimer  రాస్తూంటాను. ” ఫలానా దాంట్లో ఇలా ఉందీ, ఫలానా దాంట్లో అలా ఉందీ.. తేదీ ఏదైనా అటువంటి మహనీయుడిగురించి స్మరించుకోవడం మన ధర్మమూ…” అంటూ. గొడవుండేది కాదు. కానీ సజీవులైన మహనీయుల గురించి రాసేటప్పుడు, ఒక్కసారి వారినే సంప్రదిస్తే ఇలాటి తప్పులు దొర్లే అవకాశం ఉండదుగా. దాన్నికూడా వికీ చదువరులనే చేయమంటారేమో?.

  దేశంలో ఈ జన్మతిథుల గురించి ఇప్పటికే చాలా విన్నాం. అప్పుడెప్పుడో, మన భారతీయ సైనికాధిపతి గారు, నానా హడావిడీ చేశాడు.  మా మంత్రసాని చెప్పిన ప్రకారం నేను ఫలానా సంవత్సరంలో పుట్టానూ, ఇంకో ఏడాది సర్వీసుందీ అన్నాడు. ఠాఠ్ అదేం కుదరదూ అని ఆయన్ని రిటైరు చేసేశారు. అయితేనేం, ” తన్నితే బూర్ల బుట్ట లో పడ్డట్టు..”, హాయిగా ఏడాది తిరక్కుండా కేంద్రంలో మంత్రి అయి కూర్చున్నాడు. ఆయనడిగినట్టు ఇంకో ఏడాది  Extension  ఇస్తే  ఈ భోగాలుండేవా మరి? అయిదేళ్ళపాటు హాయిగా ఉండొచ్చు. ప్రభుత్వ పెన్షన్,( పైగా OROP కూడానూ..) ఆ తరువాత పార్లమెంటు సభ్యులకిచ్చే పెన్షనూ తీసికోవచ్చు. ఏవో  Memoirs  అని పాత ప్రభుత్వంలోని లొసుగులు  రాయొచ్చు.

   Wikipedia  లో ఏవిషయం గురించైనా సందేహం ఉంటే  బ్రాకెట్లో   citation needed  అని  రాస్తూంటారు.. ఇంక వాళ్ళ బాధ్యత ఏమీ ఉండదు. కావాల్సొస్తే తీసికోడం, లేకపోతే ఓ దండం పెట్టడం. అలాగే  సజీవులైనవారి గురించి రాసేటప్పుడు ఒక్కసారి  just  ఒక్కసారి, ఆ విషయం, వారినుంచే  confirm  చేసికుంటే బావుంటుందని. అలాగే ఇదివరకోసారి, ఓ ప్రముఖ దర్శకుడి గురించి రాస్తూ… ఎరక్కపోయి తెలుగు వికీలో రాసిన వారి అసలు పేరు కూడా ప్రస్తావించాను. ఇంకేముందీ.. ఆయనకి కోపం వచ్చేసింది. ఆయన  అసలు పేరూ అవీ నాకు తెలుసునా ఏమిటీ, ఏదో మన తెలుగు వికీలోనేకదా రాశారూ అనుకుని నేనూ రాశాను. బుధ్ధొచ్చింది. జన్మలో మళ్ళీ అలాటిది చేయకూడదని.

 నిజమే తప్పులు  point out  చేసినప్పుడు కోపం రావడం సహజం. చెప్పకూడదనే అనుకుంటూంటాను… అయినా … ఎందుకులెండి…

బాతాఖాని-లక్ష్మి ఫణి కబుర్లు.

 గుర్తుందా మన చిన్నప్పుడు, పెళ్ళిలో వియ్యాలారి విడిదిలో  వారి స్థోమతకి తగ్గట్టుగా , కొన్ని వస్తువులు ప్రత్యేకంగా ఉంచేవారు.. వాటిని చూసి, వాళ్ళూ పరవాలేదూ, మర్యాదలు బాగానే ఉన్నాయీ అనుకునేవారు. వాటిలో ముఖ్యమైనది  సెంటు నూనె Hair Oil Scented  ఈరోజుల్లో నెత్తికి నూనె రాసుకోవడమే, నామోషీగా భావించే  ఈ తరానికి ,  ఆ సెంటునూనెలో ఉండే ఆనందం ఏం తెలుస్తుందీ? దేనికైనా పెట్టిపుట్టాలంటారు అందుకే. ఉండడం చిక్కగా ఉన్నా, అది నెత్తికి రాసుకుంటే, ఆమడలదూరం తెలిసేది దాని సువాసన. 

అలాగే కాంథడ్రీన్ అని ఒక తలనూనె ఉండేది..Cantherdine అలాగే , సాధారణంగా ఏ కచికతోనో, బొగ్గుపొడితోనో పళ్ళు తోముకునేవారు, కొంతకాలానికి , ఇంటింటికీ వచ్చి ఓ జోలా సంచీలో ( జోలా అన్నా సంచీ అన్నా ఒకటే, కానీ దాన్ని ఇప్పటికీ అలాగే అంటారు …అదో సరదా ) పంపిణీ చేసే నంజను గూడ్ వారి శ్రేష్ఠమైన పళ్ళ్ పొడిNANjan gud కాలక్రమేణా  Tooth Powder తరవాత్తరవాత   వచ్చిన బినాకా పేస్టూ, దానితో పాటు వచ్చే Binaca బుల్లి బుల్లి బొమ్మలూBinaca Toys 1  అసలు ఆరోజులే వేరూ..పొద్దుటే తాగడానికి Ovaltine (1) స్నానానికి Mysore Sandal    పసిపిల్లలు ఏదైనా నలతచేసి ఏడుస్తూంటే  ఓ గుక్కెడు గ్రైపు వాటరూGripe Water, రోడ్డు పక్కనుండే కిళ్ళీకొట్టుకి వెళ్ళి తాగే KIllikottu  కలరు సోడాలూ Colour Soda   ఇలా చెప్పుకుంటూ పోతే,  కనీసం బ్లాగు పోస్టుల ద్వారా అయినా ఆరోజుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదూ… ఒక్కసారి గుర్తు చేసికోండి..

 

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఎంతవరకూనిలబడుతుందో చూడాలి…

 మన దేశంలో సాధారణంగా జరిగేది ఏమిటంటే, ఓ కింది కోర్టువారు ఇచ్చిన తీర్పుని, పైకోర్టువారు కొట్టేయడమో, లేక అదేదో ” స్టే ఆర్డరు ” ఇవ్వడమో.  ఆ ” తీర్పు” లోని  విజ్ఞత   ఆ “పైవాడికే “తెలియాలి. ఈ మధ్యన  so called priority cases  తీసికోండి, కింది కోర్టులిచ్చినవి , పైకోర్టువారు  invariable  గా   reverse  చేసేశారే. అది ఓ జయలలిత కేసవనీయండి, లేక ఓ సల్మాన్ ఖాన్ కేసవనీయండి, లేకపోతే ఆవిడెవరిదో సస్పెన్షన్ కేసవనీయండి. అన్నేసి సంవత్సరాలు అంతంతమంది సాక్ష్యాలు విని  , ఓ న్యాయాధిపతి  ఎంత కింది కోర్టయినా సరే, ఇచ్చిన తీర్పు లో అన్నన్ని లొసుగులున్నాయంటారా? పైగా ఇలా రాస్తే అదో గొడవ మళ్ళీ..

 బహుశా నేరం చేసేవారికందరికీ అదే భరోసాయేమో. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ తో అంటాడు గుర్తుందా? “కోర్టుల్లో శిక్షలు పడేనాటికి నువ్వూ ఉండవు, నేనూ ఉండను..” అని. బహుశా అదే  ప్రస్థుత పరిస్థితి. మన రాజకీయ నాయకులమీద సవాలక్ష కేసులున్నాయి. ఒక్కటీ తేలలేదు.   Just pause  మాత్రమే. ఎప్పుడో వాడు కిరికిరి పెట్టినప్పుడు మళ్ళీ మొదలెట్టి బెదిరిస్తారు.  ఈమధ్యన మన రాష్ట్ర, జాతీయ శాసనసభల్లో, నేర చరిత్ర ఉన్న సభ్యులు లేరంటారా? ఒకానొకప్పుడు, ఏదైనా పోలీసు స్టేషన్లో ఫిర్యాదున్నా సరే, పోటీ చేయనిచ్చేవారు కాదు. దానికీ ఓ ఎమెండ్ మెంటు తెచ్చి, ఫరవాలేదూ, ఫిర్యాదులు ఎవరైనా చేయొచ్చూ,  కోర్టువారు శిక్ష వేసేంతవరకూ హాయిగా, జైల్లోంచికూడా పోటీ చెయ్యొచ్చు అన్నారు.. ఏమైనా అంటే ” ప్రజాస్వామ్యం అంటారు.

అసలు కథలోకి వద్దామా… మహరాష్ట్రలోని నీటికొరత మూలాన, అవేవో  I P L   తమాషా మ్యాచ్చీలు ఇక్కడ ఆడి నీటిని వ్యర్ధ పరచొద్దని  ఆయనెవరో   I P L   మీద  ఓ   P I L   వేశాడు. దాన్ని ముంబై హైకోర్టువారు అంగీకరించి, ఇక్కడ ఏప్రిల్ 30 తరువాత ఆ మ్యాచ్చిలి ఆడి, నీటిని వేస్టు చేయొద్దన్నారు. బుధ్ధీ,  జ్ఞానం   ఉన్నవాడెవడైనా అదే అంటారు. తాగడానికి నీళ్ళు లేక  రైల్వే వాగన్లలో నీటిని తరలిస్తున్నారే, ఇప్పుడు ఆ మాచ్చిలకోసం 60 లక్షల లీటర్లనీళ్ళు  అవసరమా? 

 ఇంక మన క్రికెట్ సంఘాలన్నీ, ఇదంతా మామీద కక్షా అంటాడొకడు. నీళ్ళు లేకపోవడమనేది ఓ కొత్త విషయమా అంటాడు భారత కెప్టెన్ గారు.  అసలు ఈ IPL గురించి  చూద్దాం… వాటిని అప్పుడెప్పుడో మొదలెట్టిన, మోడీ ఏమో, మాల్యాతో కలిసి లండన్ లో వేషాలేస్తున్నాడు.. ఇంకో శ్రీనివాసన్ అల్లుడి ధర్మమా అని ఉన్న పదవి కాస్తా ఊడింది. ఆ దాల్మియాని  ముందర ఆరోపణలతో తీసేశారు. తిరిగి  రావడమైతే వచ్చాడు కానీ, పరలోకాలకి వెళ్ళిపోయాడు. ఇంక మన మహనీయ ఆర్ధిక మంత్రిగారిమీద ,  DDCA  లో డబ్బులు లాగించేడని ఆరోపణలు వచ్చాయి. వీళ్ళందరూ కలిసి  జనాలని ” బక్రా” లు చేసి ఆడిస్తున్నారు,  entertainment  పేరుతో.. డబ్బులు చేసికునేది వీళ్ళందరూ. దేశానికి ఒక్క ఉపయోగం లేదు. పైగా, మహరాష్ట్రనుండి,  మాచ్చిలు మార్చేస్తే 1000 కోట్లు నష్టం వస్తుందని బెదిరింపోటీ.

 అసలు నాకోటి అర్ధం అవదూ… ఈ నీళ్ళమీద ఆధారపడకుండా, హాయిగా  హాకీలోలాగ ఏ  ASTRO TURF  లాటిదానితోనో పిచ్చిలు చేసికోవచ్చుగా. ఎలాగూ కోటానుకోట్లు చేసికుంటున్నారాయె. ఇదివరకటి రోజుల్లో డాకా లో టెస్టు మాచ్చిలు  Matting Wicket  మీద ఆడేవారు. అలాకూడా చేయొచ్చుగా ఇన్నిన్ని కబుర్లు చెప్తారూ?

ఈ మాచ్చీలేమీ  దేశగౌరవానికి సంబంధించినవి కానే కావు. ఎలా ఆడితే ఏం పోయిందిట? అప్పుడెప్పుడో ,  World T 20  లో సరీగ్గా కామెంటరీ ఇవ్వలేదనీ, శత్రుపక్షాన్ని పొగిడాడనీ, ఉన్న లక్షణమైన వ్యాఖ్యాత   Harsha Bhogle  ని కాస్తా తీసేశారు.

 వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ముంబై హై కోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టుకి వెళ్తే ఏం చేస్తారూ అని..  Keep your fingers crossed…

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఆ ఆనందాలే వేరు….

ఈరోజుల్లో ఇంట్లోని ఏ వస్తువుకైనా  కొద్దిగా ” నలత ” చేసిందంటే, దానికి వైద్యం చేయించడానికి తడిపి మోపెడవుతోంది.. మామూలు రిపేరీ చేసేవాళ్ళ దగ్గర చేయించుకోకూడదుట.. ఆ కంపెనీవారి  Authorised  Service Centre  లోనే చేయించుకోవాలిట. ఇదివరకటి లాగ ఓ ఫోను చేస్తే రాడు వాడు.. అదేదో  Helpline  కి , చేసి    ఓ అమ్మడు చెప్పినవన్నీ  మాట్టాడకుండా విని, ఆవిడ చెప్పిన అంకెలేవో నొక్కి, మధ్యలో దాని పీక నొక్కేయాలనిపించినా, ఓర్పు వహించి, మొత్తానికి ఓ  “మానవ గొంతు” తో సంపర్కం పొందిన తరువాత, మన గోల ఆ గొంతుక్కి వినిపిస్తే, ఆ గొంతుక మన ” పితూరీ” కి ఓ నెంబరు ఇస్తుంది. మన్నాడో, మూడోనాడో , ఆ వైద్యం చేసేవాడు వచ్చి  మన పాడైపోయిన వస్తువుకి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు.  ఎప్పటిదాకా పనిచేస్తుందో, మన తలరాతని బట్టి ఉంటుంది. కొండొకచో, రిపేరీలు చేసి చేసి, చివరకి ఆ వస్తువు అసలు ఖరీదుకంటే ఎక్కువే అవొచ్చు. ఎందుకొచ్చిన దరిద్రంరా బాబూ అనుకుని, ఏ  Exchange Offer  వచ్చినప్పుడో, దీన్ని వదిలించుకోవడం. మళ్ళీ కొత్తదానికీ   Action Replay  తప్పదు. ఆ మధ్యన మా ఇంట్లో, రాజమండ్రీలో కొనుక్కున్న  మైక్రోవేవ్  అటకెక్కేసింది లెండి.

 అలాటప్పుడు అనిపిస్తూంటుంది ఇదివరకటిరోజుల్లోనే వస్తువులు , అవడం మోటుగాఉన్నా, మన్నిక మాత్రం బావుండేది. ఓ రేడియో  తీసికోండి, ఆర్ధిక స్తోమత లేనప్పుడు ఓ బ్యాటరీ రేడియోOne.Band.Radio   అదీ   మీడియం వేవు ది, విజయవాడ, హైదరాబాద్ స్టేషన్లలో భక్తి రంజని తో ప్రారంభించి, వార్తలు, కార్మికుల కార్యక్రమాలూ, సాయంత్రం గ్రామస్థుల కార్యక్రమంలో బావగారి కబుర్లూ, అప్పుడప్పుడు రాత్రిళ్ళు వచ్చే మీరుకోరిన పాటలూ, ఆదివారాలు సంక్షిప్త శబ్దచిత్రాలూ.. అబ్బో .. ఎంతగా ఆనందించేవాళ్ళమో.. ఇంకొన్ని రోజులు పోయేసరికి, కరెంటున్నవాళ్ళింట్లో   మూడు నాలుగు  బ్యాండులుండే రేడియోలూ  PYE  . వీటిలో రేడియో సిలోను, క్రికెట్ కామెంట్రీలూ కూడా వినే సావకాశం ఉండేది. బుధవారం వచ్చిందంటే  ” బినాకా గీత్ మాలా ” వినాల్సిందే, మర్నాడు పరీక్ష ఉన్నా సరే.. ఆ రేడియోలకి  అదేదో ఆకుపచ్చ రంగులో   Magic Eye  అని ఉండేది. దాన్ని చూస్తూ రేడియో వినడం అదో వింత. 

రేడియోల్లో వచ్చే పాటలు రికార్డు చేసికోడానికి టేప్ రికార్డర్లూ..Spool.Taperecorder   Tape.Recorder.1

కాలక్రమేణా టీవీలొచ్చాయి. మొదట్లో ఒకే చానెల్ వచ్చేది. BW.Tvs దానికో యాంటినా Antennas గట్టిగా గాలేస్తే, బొమ్మ రావడం మానేసేది. నాన్నగారో, అన్నయ్యో డాబా మీదకు వెళ్ళడం, ఆ యాంటెనాని, అటూ ఇటూ తిప్పడం, బాల్కనీ లో నుంచుని, హాల్లోకి తొంగిచూస్తూ , బొమ్మొచ్చిందో లేదో చెప్పడం. ఆ సరదాలన్నీ , ఈరోజుల్లో వస్తూన్న  LED, LCD ల్లో రమ్మంటే వస్తాయా? ఏమిటో ఓ రిమోట్టూ, ఉన్న చోటునుండి లేవక్కర్లేకుండా మార్చుకోడం ట.. అసలు ఈ కొత్తరకం టీవీలొచ్చిన తరువాతే బధ్ధకంకూడా పెరిగిపోయింది.

అంతదాకా ఎందుకూ, టెలిఫోన్లే తీసికోండి, ఎంత అందంగా Telephone (1)  పుష్ఠి గా  ఉండేవో? ఇప్పుడూ ఉన్నాయి, ఎందుకూ ఓ అందమా చందమా, గుప్పెట్లో పట్టేస్తుందిట.ఆరోజుల్లో ఫోన్లు చేయడమే ఓ గొప్ప అందమైన అనుభూతి.

అవన్నీ ఈ తరం వారికి ” పాత చింతకాయ పచ్చళ్ళే”.. కానీ పథ్యానికి అదే కావాలి….

 

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు– ఆ సీలింగ్ ఫాన్లు ఏం చేశాయిట…

  దేశంలో ప్రతీవారూ, అంతస్థితిమంతులు కాదుగా.. ఒకానొకప్పుడు  తాటాకు విసినికర్ర లుండేవి. గాలి ఆడకపోయినా, ఉక్కబోత పోసినా, హాయిగా వాటితో పని కానిచ్చేసేవారు. శ్రీరామనవమి వచ్చిందంటే, రామాలయంలో, పానకంతో పాటు, తాటాకు విసినికర్ర కూడా ఇచ్చేవారు.. ( పెద్దవాళ్ళకు మాత్రమే ). HF 1  

 వంటింట్లో కుంపట్లోని బొగ్గులు మండాలంటే  వెదురు విసిని కర్రే గతి.HF 2

 కాలక్రమేణా ఫాషనుగా , చూడ్డానికి పొందిగ్గానూ, మడతపెట్టడానికి వీలుగానూ ఉండేవి వచ్చాయిHF3

ఎలెట్రిసిటీ రావడంతో  ఓపికున్నవాళ్ళందరూ  Table Fans TF లోకి దిగిపోయారు. ఇంట్లో హాల్ లో ఓ టేబుల్ మీద పెట్టి, మొత్తం ఇంటి సభ్యులందరూ దాని చుట్టూరా చేరేవారు.. రాత్రిళ్ళు ఎవరికివారే ఆ హాల్లోనే నిద్రపోయేవారు. ఈ పై చెప్పినవన్నీ కాల గర్భంలో కలిసిపోయాయి.  గోడలకి వేల్లాడతీసే  Air Circulatorలూ, అవేవో  Pedastal Fan లూ వచ్చాయి.AC1PF

 ఇవి కాకుండా  రైళ్ళలో ఇంకో రకం ఫాన్లు ఉన్నాయి. FAn Train   సాధారణంగా, ఏ పుల్లో, పెన్సిలో పెట్టి తిప్పితే కానీ, అవి తిరగడం మొదలెట్టవు. పైగా వాటికి ఒకే స్పీడు. తగ్గించడం, హెచ్చించడం లాటివి ఉండవు. ప్రయాణికుల్లో , ఫాన్ గాలి పడదని ఒకరూ, గాలాడటంలేదని ఇంకోరూ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు.  కాలక్రమేణా, సీలింగు ఫాన్లలోకి దిగాము.CFఈ రోజుల్లో సీలింగ్ ఫాన్ లేని ఇళ్ళుండవు.   వారి వారి ఆర్ధిక స్థోమతని బట్టి, అవేవో విండో ఏసీలూ, స్ప్లిట్ ఏసీలూ ఉన్నా సరే, సీలింగు ఫాన్ మాత్రం తప్పకుండా ఉంటుందే.

 మనందరికీ ధారాళంగా గాలి ఇస్తూన్న ఈ సీలింగు ఫాన్లని, కొంతమంది , ప్రాణాలు తీసికోడానికి కూడా ఉపయోగించుకోడం, చాలా విచారకరం. ఈమధ్యన ఆత్మహత్యలు చేసికోడానికి దీన్నో సాధనంగా ఉపయోగిస్తున్నారు.. ఆత్మహత్యలు ఎందుకు చేసికుంటున్నారూ అనేది కాదు విషయం.. ఎవరి కారణాలు వారికుంటాయి.   ప్రముఖులు ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడితే  అదో పతాక శీర్షిక. అదే ఏ రైతో తను చేసిన అప్పులు తీర్చలేక, ఆత్మహత్య చేసికుంటే, వార్తా పత్రిక లోని ఏ అయిదో పేజీలోనో… ఫలానా చోట… ఇంతమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసికున్నారూ, అని  చేతులు దులిపేసికుంటున్నారు. 

పరీక్షలో తక్కువ మార్కులొస్తాయేమో అని ఒకరూ, కార్పొరేట్ కాలేజీల్లో ragging  భరించలేక ఇంకోరూ, ఇలా చెప్పుకుంటూ పోతే, దేశంలో ఎక్కడో అక్కడ ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే,  చాలామంది ఈ సీలింగు ఫాన్లనే సాధనంగా ఉపయోగిస్తున్నారు.  అలాగని రాత్రికి రాత్రి ఈ సీలింగ్ ఫాన్లని, నిషేధించమంటే  ఎలాగండి బాబూ?   ఒంటిమీద తెలివుండి మాట్టాడే మాటెనా ఇది? ఏదో నోరుందికదా అని నోటికొచ్చినట్టు వాగడం. దానికి  ప్రసారమాధ్యమాలు publicity  ఇవ్వడం.   అప్పుడప్పుడు రైళ్ళు పట్టాలు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, రేపు ఏ తలమాసినవాడో  రైళ్ళు ఎత్తేయండంటే చెల్లుతుందా? అలాగే ఎన్నో ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతూంటాయి ప్రతీ రోజూ, అలాగని వాటిని మూసేయమంటే కుదురుతుందా? పురుగుమందులు  (pesticides) తాగి ఆత్మహత్యలు చేసికుంటున్నవారు ఎంతమందో. కానీ, వాటిని నిషేధిస్తే, పంటలకు పట్టే చీడ ఎలా తగ్గించడం?  ఇప్పుడేదో ఆ తింగరి బుచ్చెవరో ఇచ్చిన ఉచిత సలహాని ప్రభుత్వం అంగీకరించేస్తుందని కాదు. 

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు…సర్వే జనా సుఖినోభవంతూ..

 అదేమిటో కానీ, నిన్న రాత్రి 11.30 తరువాత దేశం అంతా ఓ శ్మశాన నిర్లిప్తత ఆవహించింది. కారణం అందరికీ తెలిసిందే. ఏదో ఇంట్లోవాళ్ళెవరో పోయినంత బాధపడిపోతున్నారు. ఏమయిందిటా, అదేదో  T20  World Cup  లో మనవాళ్ళని,  afterall  West Indies  ఓడించిందిట.  So what?  ఆయినా మన అభిమానులది ఓ వేలం వెర్రి–పాకిస్తాన్ ని ఓడించేసరికి  Champion  అయిపోయారనుకున్నారు.కెప్టెన్ గారి కూతురు నిద్రకూడా చెడకొట్టారు పాపం. బంగ్లాదేశ్ తో చావు తప్పి కన్ను లొట్టోయింది.  అతనెవరో గుండె ఆగి పోయాట్టకూడానూ, ఆ ఉత్కంఠభరిత ముగింపు భరించలేక. అప్పుడు నెగ్గితే, మనంతటివాళ్ళు లేరనీ, ఆ కొహ్లీయో ఎవరో, దేశానికి అదేదో వెన్నెముక అనీ, తన girl friend  ఇతన్ని వదిలేసి చాలా మంచిపనిచేసిందనీ, ఏమిటో ఏమిటో అనేశారు. పైగా ఆ మ్యాచ్ లో మన ఇంగ్లీషు  commentators,  మనవాళ్ళని మానేసి, ” శత్రు పక్షం” వారినే పొగిడారని ఈ సెలెబ్రెటీసులకి  కోపంకూడా వచ్చేసింది.” శత్రు పక్షం ” అని ఎందుకన్నానంటే, మన  ఎగస్ పార్టీవాడు, మనకి శత్రువే అని , మన దేశ నాయకుల ఉవాచ. అందుకనే కాబోలు నిన్నటి match  లో, చివరి ఓవర్ కి, ఆ కొహ్లీ బాల్ తీసేసికున్నప్పుడు, అప్పుడెప్పుడో, భారతరత్న గారు ఇలాటి పరిస్థితుల్లోనే, ఇ‍క్ష్వాకుల కాలంలో, తనే బాల్ తీసేసికుని, బౌలింగు చేసి, మన జట్టుని నెగ్గించారట.  So what?. చివరి ఓవరో, అంతకుముందుదో, మైదానం బయటకి వెళ్ళిన బంతిని లోపలకి విసిరేసి, ఇంకోడెవడో పట్టుకుని, ఎపీల్ చేయడం. బౌండరీ ని చేతిలో బాల్ ఉండగా తాకినట్టు ఆ పట్టుకున్నవాడికీ తెలుసు.. అయినా ఎపీల్ చేయడం.. లక్కుంటే ఔటిచ్చేస్తారు అనుకునే కదా? అయినా కొత్త టెక్నాలజీ ధర్మమా అని అసలు విషయం బయట పడింది. ఇంకో సంగతి– Chris Gayle  ఔటవగానే మ్యాచ్ నెగ్గేసినంత హడావిడి చేసేశారు. తను పోతే ఇంకోడొస్తాడనే విషయం మర్చిపోయి. మనకున్నట్టే, ప్రతీ జట్టులోనూ ఎవరో ఒక  Rescuer  ఉంటాడని మర్చిపోయారా? 

 ఆడేవాళ్ళ కంటే , మనదేశంలో వ్యాఖ్యానించేవారే ఎక్కువ.  న్యూజిలాండ్ తో ఓడిపోతే, ” ఏమీ ఫరవాలేదూ.. ఇదివరకోసారి మొదటి match  లో ఇదే న్యూజిలాండ్ తో ఓడిపోతే, అప్పుడు మనం finals  నెగ్గామూ.. ఇదో శుభసూచకమూ అన్నా, మనవాళ్ళకే చెల్లింది.. ” ఆట ని ఆట ” లా చూడ్డం మనవాళ్ళకి ఎప్పుడొస్తుందట?  

 ఇవన్నీ ఒకెత్తైతే, ఇంకో గమ్మత్తు.. ప్రస్థుత కెప్టెన్ వల్లనే, తన కొడుకుని పైకి రానీయడం లేదని, ఓ ఆటగాడి తండ్రిగారి ఉవాచ.. ఇదివరకటిరోజుల్లో ఓ ఆటగాడి తల్లిగారొచ్చేది. ఇప్పుడు ఇంకో ఆటగాడి తండ్రి.. పైగా కెప్టెన్ గారిని, కమండలంలోంచి నీళ్ళు తీసి శపించేశాడు కూడానూ….  ” చూస్తూ ఉండండి.. ఈ దుర్మార్గ కెప్టెన్ రోజులు దగ్గరకొచ్చేశాయి.. వీడు వెళ్ళడం ఏమిటీ, మావాడెలా దూసుకొస్తాడో..” అంటూ.. పైగా ఆ తండ్రిగారి పుత్రుడుగారు,  ఒకానొకప్పుడు   చేసే అదేదో  Revital  యాడ్ ని కాస్తా, ఇప్పుడు కెప్టెన్ గారు చేస్తున్నారు.  Needle of suspicion points to….ఆ poor  తండ్రి అన్నాడంటే అనడు మరీ? ఇంత అన్యాయమా?.

మనదేశంలో ఉండే ఇంకో సదుపాయం ఏమిటంటే, ఎన్ని  Match Fixings  ఆరోపణలుండనీయండి, ఏమీ ఫరవాలేదు. ఇదివరకు ఒకాయన పార్లమెంటు సభ్యుడయ్యాడు. ఇప్పుడేమో ఇంకోడు వచ్చే కేరళ ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున పోటీ చేస్తాడట.. ఇవన్నీ  अछ्छे दिन  కి శుభసూచకాలు కాపోతే మరేమిటీ?

 అయ్యా ఇదీ విషయం. మన జట్టు ఎలాగూ బయటకొచ్చేసింది. ఇంక ఒక్కడూ టీవీ పెట్టడు. ఎవరి పనులు వాళ్ళు చేసికుంటారు.

శుభం భూయాత్…

%d bloggers like this: