బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–పామును మింగిన కప్ప

20091030aA001101006

బలేగా ఉంది కదూ !!

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–“దేశభాషలందు తెలుగు లెస్స్”

    తెలుగు భాష బ్రష్టు పడిపోతూందని అందరూ వ్రాస్తున్నారు కాబట్టి నేను కూడా వ్రాద్దామని, నిన్న ఒక ” పోస్ట్” చేశాను. నేను అందులో వ్రాసినట్లుగా ఈ జాడ్యం,మేము చదువుకొనే రోజుల కంటే మేము వివాహాలయ్యి తల్లితండ్రులు అయేసరికి అంటే 1970 తరువాత నుండీ ఎక్కువ అయింది.ప్రస్తుత రోజుల్లో ఎన్ని ఇళ్ళల్లో పిల్లలు అంటే ప్రస్తుతం 25-30 సంవత్సరాలున్న యువతీ యువకులు తమ తల్లితండ్రుల్ని అమ్మా, నాన్నా అని పిలుస్తున్నారు? దీనికి మేమూ,మా పిల్లలూ ఏమీ మినహాయింపు కాదు. మా అబ్బాయి నన్ను డాడీ అని, వాళ్ళ అమ్మను అమ్మా అని పిలుస్తాడు. ఇంక మా అమ్మాయైతే డాడి,మమ్మీ అనే పిలుస్తుంది. అలా చూసుకుంటే నేను ఈ విషయం మీద వ్రాయడానికి పూర్తిగా అనర్హుడిని. నేనే కాదు, ఇప్పుడు గొంతెత్తి అరుస్తున్న వారిలో చాలా మంది అనర్హులే. అయినా మనకి భారత రాజ్యాంగం ” నోటికి వచ్చినట్లు మాట్లాడే” హక్కు ఇచ్చింది కాబట్టి ఏదో పేలుతున్నాం.అభిప్రాయాలు చెప్పడానికి ఏమీ ఖర్చు పెట్టఖ్ఖర్లేదుగా !!

వచ్చిన గొడవేమిటంటే ఎక్కడో ఎవడో ఏదో చేస్తాడు. వాడు చేసిన పని ప్రసార మాధ్యమాల ధర్మమా అని ఆంధ్ర దేశం అంతా టముకు అవుతుంది. ఇంక ప్రతీ తలమాసిన వాడూ ( నా తో సహా) ఏదో ఉధ్ధరించేవాడిలాగ, పేపర్లలోనూ,టి.వీ ల్లోనూ, ఈ బ్లాగ్గులొచ్చిన తరువాత వీటిలోనూ ఉచిత సలహాలు ఇచ్చేస్తారు. ఓపిక ఉన్నవాళ్ళు చదువుతారు. ఓ రెండు మూడు రోజులు కాలక్షేపం, పేపర్లవాళ్ళకీ, మనకీ, ట్.వీ ల వాళ్ళకీ. “దేశభాషలందు తెలుగు లెస్స” అని పురాణం సీత గారు ఆ రోజుల్లోనే ఏమి వ్రాసేరో చదవండి…..

    ” మమ్మీ డాడి ” చదువులొచ్చాక ‘తల్లీ నిన్ను దలంచి పుస్తకము’ ఎగిరిపోయింది.నన్నడిగితే ‘వేయి పడగలు’ విలువ పెరిగిందంటాను.కాన్వెంట్ చదువులొచ్చాక,అన్ని పడగలూ పోయి ఉన్న ఆ ఒక్క పడగ కూడా ఎగిరిపోయింది.తెలుగు ‘మమ్మీల’ వ్యామోహం పుణ్యాన విశ్వనాథ వారు వేయిపడగల్లో తిట్టినదానికన్నా ఎక్కువ తిట్టాలి,’మమ్మీ డాడి కల్చరు’ కోసం తెలుగుతనాన్నీ, తెలుగు ఆత్మాభిమానాన్నీ,తెలుగు పౌరుషాన్నీ మంట కలిపేస్తున్న తెలుగు ‘మమ్మీల్ని’.

భాగవతంలో శ్రీ కృష్ణుడు మన్ను తిన్నాడని యశోద నోరు తెరవమన్నప్పుడు ఆ చిన్ని కృష్ణుడు ‘మమ్మీ మన్నుతినగం నేశిశువునో ఆకొంటినో వెర్రినో’ అని చదవాల్సిన పరిస్థితి ఇప్పుడొచ్చింది.నోరారా ఇంటికి రాగానే పిల్లలు ‘అమ్మా’ అనకుండా ఈ ‘మమ్మీ’గోల ఎక్కడినించొచ్చిందిరా అని మా మేనత్తగారు ‘మమ్మీ-డాడీ’ గాళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా దులిపేస్తూంటారు.’మమ్మీ డాడీ’గాళ్ళకు ‘డింగ్డాంగ్ బెల్లు’ తెలిసినట్లుగా కృష్ణ శతకం, సుమతీ శతకం తెలవ్వు కదా;
అంచేత విశ్వనాథ వారు ఇంకా రెండు పడగలున్నాయని ఆ నవల్లో పొంగిపోయారు,కానీ కాన్వెంట్ల పిచ్చి గురించి వారు కాసుకోలేకపోయారు.ఆ రెండు పడగలనీ కూడా తెలుగు మమ్మీలు ఊడగొట్టేశారు.

శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో’మాలదాసరి’ కథలో మాలదాసరి చేత రాక్షసునికి జ్ఞానోపదేశం చేయిస్తారు. అంత గొప్ప కథ చదువుకునే అదృష్టం మనవాళ్ళకి ఉండొద్దూ?దసరా వచ్చిందంటే దసరా ఊరేగింపుల్లేవు. చిన్నపిల్లలు ఇంటింటికీ వెళ్ళి నిలబడి చదివే పద్యాలు విని ఆనందించని తెలుగు తల్లి ఉండేదా?

ఇంగ్లీషు గ్రామర్ సరీగ్గా రాకపోయినా’ఫాక్స్ టైల్ కాన్వెంటనో” ఆక్స్ఫొర్డ్ లిటిల్ కాన్వెంటనో’ పేరు కనబడ్డంతో శ్వేతవస్త్రాంభరధారులైన మలయాళీ రోమన్ కథొలిక్ నన్నమ్మలు, రుసరుసమంటూ,విసుక్కుంటూ తిరుగుతూ కనిపిస్తే చాలు,మన వాళ్ళకి ‘స్క్రూ’ లూజై వాళ్ళకి పాదాభివందనలు చేస్తారు. చిత్రం ఏమిటంటే విదేశాలలో ఉన్న తెలుగు వారు మన మతం,సంస్కృతి,ఆచారవ్యవహారాలూ అంటే పడి చస్తారు.పద్యం ఎలా తెలుగు వాడి సొత్తో, పచ్చడి అలాగ తెలుగువాడికి ప్రియాతి ప్రియమైనది.

పోతన్న గారు ‘అమ్మల గన్న యమ్మ’ అని భక్తితో అన్నారు కానీ,’మమ్మీల గన్న మమ్మీలు’ అనలేదుకదా. నాన్నా అని పిలిపించుకోవడంలో ఉన్న ఆప్యాయత దాడి,చాడి లాగ డాడీ అంటే వస్తుందా? ఈ చదువులు మన జీవితం నుంచి మనల్ని వేరు చేస్తున్నాయి.మన పిల్లల్ని జ్ఞానశూన్యులుగా చేస్తున్నాయి.తెలుగు భాష ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కుటుంబాల్లోని ఆడవాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందనేవారు ఒకప్పుడు. మరి ఇప్పుడో?.

లండన్ లో ఉద్యోగం చేస్తున్న ఓ కుర్రాడు గోంగూర పచ్చడి వడ్డిస్తే దాన్నేవంటారు, గుర్తు లేదన్నాడుట.అలాటి వెధవల్ని నాలిక చీరేసి గొతిలో కప్పేయాలంటారు డాక్టర్ గూటాల కృష్ణమూర్తి గారు.విశ్వనాథ వారిచేత ఇంకా తిట్లు తినదగిన స్థాయిలోనే ఉంది మన సమాజం–వేయి పడగలూ జిందాబాద్. “

    ఈ వ్యాసాన్ని పురాణం వారు 70 ల్లోనే వ్రాశారు. తల్లితండ్రులకి తమ బిడ్డ తెలుగులోనే మాట్లాడి తగలడిపోతున్నాడేమో అన్న భావం ఉన్నంతవరకూ ఈ సమస్యకి అంతులేదు.మన దేశం లో ‘లంచగొండి’ తనం ఎలాగ పాతిపెట్తుకుపోయింది,
దానిని నిర్మూలించకలమా, అలాగే మన పిల్లలకి తెలుగు నేర్పించడమూనూ.’లంచం’ ఆపకలిగితే తెలుగు కూడా నేర్పగలము
.

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు –” తెలుగు గోల”

    గత రెండు మూడు రోజులుగా ప్రసార మాధ్యాల్లోనూ, బ్లాగ్గుల్లోనూ అక్కడెక్కడో స్కూల్లో తెలుగు లో మాట్లాడినందుకు పిల్లల్ని శిక్షించారనిన్నూ,దానికి ఆ స్కూలును మూయించేయాలనిన్నూ, అందరూ తమ తమ అభిప్రాయాలని
వెలిబుచ్చారు. దీనిమీద నేను కూడా వ్రాసి అందరినీ ” బోరు” కొట్టడం ఎందుకని, బ్లాగ్గుల్లో నా అభిప్రాయాన్ని కూడా వ్రాయలేదు. అయితే ఈ విషయం గురించి 30 ఏళ్ళక్రితం “ఇల్లాలి ముచ్చట్ల”లో పురాణం సీత గారు వ్రాసిన ఒక
ఆణిముత్యం చదవడం తటస్థించింది. ఆ వ్యాసంలో వారువ్రాసిన విషయం మీ అందరితోనూ పంచుకోవాలనిపించింది.
….

   తెలుగు గోల” అనే శీర్షిక క్రింద వ్రాశారు…రైళ్ళలొ కానీ,బస్సులలో కానీ మనకి ఒక రకమైన మాటలు వద్దన్నా వినిపిస్తూంటాయి.అరటిపళ్ళని అలా పిలవకుండా “కేళా కేళా” అని అరుస్తూంటాడు. అరటిపళ్ళని అరటిపళ్ళని పిలవడానికి సిగ్గు పడే జాతి మనది.శుభ్రమైన మామిడితాండ్రని –తాండ్ర తాండ్ర అని తాండ్ర పాపారయుళ్ళా గర్వంగా అరవక ఆంగ్లో ఇండియన్ లాగ ” మాంగో జెల్లీ మాంగో జెల్లీ ” అని అరుస్తాడు, అదీ తాండ్ర తయారుచేసే గోదావరి జిల్లాల్లో,
తాండ్ర అని పిలవడానికి నామోషీయేమో. జెల్లీ అని అరిచినవాడిని పిలిచి పూచి పుచ్చుకొని ఓ జెల్ల కొట్టాలి దిమ్మ తిరిగేలా. జీడిపప్పు అమ్మేవాడు “కాజూ కాజూ” అంటాడు. జీడిపప్పు అంటే వాడి హోదా ఏమిటో పోయినట్లు.

ఇంక రైల్లో భోజనం తెచ్చేవాడైతే “మీల్స్ మీల్స్” అని చెవి కోసిన మేకలా అరుస్తాడు కానీ, భోజనం అనడు. “పల్లీ పల్లీ ” అంటాడు కానీ హాయిగా వేరుశనగ పప్పూ అనడు.ఇడ్లీ వడా అంటాడు కానీ శుభ్రంగా గారె అనడు.ఎప్పుడైనా ఉడకపెట్టిన కోడి గుడ్లు తెస్తే ” అండా” అంటాడు. అండా ఏమిటీ వాడి పిండాకూడు !! ఆవడ అంటే హోటల్లో వాడికి అర్ధం అవదు, దహీవడా అనాలి.

ఇక మనవాళ్ళు భోజనాల దగ్గిర ” మీల్స్ ” తో ప్రారంభించి అరటికాయ కూర, వంకాయకూరా అని రామనామం జపించినట్లనలేరు, బేంగన్ అంటాడు, చట్నీ అంటాడు కానీ పచ్చడి అనడు. వంకాయ కూర అంటే వీడి పరువేమైనా గంగలో కలుస్తుందా,వీడి పిల్లనెవరూ చేసుకోరా, వీడి పెళ్ళాం వీడితో కాపురం చెయ్యనందా? ఈ తెలుగూస్ కి నోటిమీద వాతలు పెట్టించండి, తల్లి భాషలో మాట్లాడ్డానికి సిగ్గిల్లే దుర్మదాంధుల్ని. పులుసన్రా అంటే గ్రేవీ అంటాడు,పులుసులో ముక్కలు వేయడానికి కొంచెం సాఫ్ట్ పీసెస్ వేయండంటాడు.
ముష్టివాడు కొంచెం రైస్ వేయండనడు, అన్నం పెట్టు తల్లీ అంటాడు నోరారా.మన ఇంటి హీరో గారు ” రైస్ ఇలా అందుకో, కర్రీ ఇలా జరుపు,చట్నీ కాస్త రుబ్బూ,ఘీ ఉందా, పాప్పడ్ మరోటి వడ్డించమనూ” ఇలా సాగిస్తాడు కానీ
“తేనె పోక నోరు తీయన యగు రీతి” అన్నం అందుకోమనడు, కూర ఏమిటీ అనడు. మేంగోస్ అంటాడు కానీ మామిడిపండు అనలేడు.పెరుగంటే గుర్తొచ్చింది కర్డ్ అంటాడు.కారం ఎక్కువైతే చిల్లీస్ ఎక్కువ అని అఘోరిస్తాడు. భోజనం దగ్గర ఇంగ్లీష్ మాట్లాడేవాడి మూతిపళ్ళు రాలగొట్టాలని ఓ బిల్లు అసెంబ్లీ లో పాస్ చేయండి.

పట్టుచీరని సిల్క్ శారీ అనీ, రవికల గుడ్డని బ్లౌజ్పీస్ అనే స్థితికి దిగజారిపోయాము.మరి ఈ దేశాన్ని బాగుచేయలేం అని ఆత్మహత్య చేసికుంటారా లేక హత్యలు చేస్తారా, మీరే నిర్ణయించుకోవాలి.

    ఇదండీ ఆయన ఆత్మఘోషా.ఆయన చెప్పినట్లుగా ఈ పైత్యం అంటే మాతృభాషలో మాట్లాడడానికి నామోషీ అనుకోవడం మనవారికే చెల్లింది.మా చిన్నతనంలో మేమేమీ కాన్వెంటులకు వెళ్ళలేదు, తెలుగు లోనే నేర్చుకున్నాము, దానితో పాటు ఇంగ్లీష్ నేర్పారు.ఇప్పుడు దానికి వ్యతిరేకం–ఇంగ్లీషుతో పాటు వీలుంటేనే మాతృభాష. మిగిలిన రాష్ట్రాల్లో మరీ ఇంత అన్యాయం కాదు.మహరాష్ట్రలో మరాఠీ స్కూల్లో నేర్చుకోవాల్సిందే.

నేను ఇదివరకోసారి బ్లాగ్గులో చెప్పినట్లు “స్పోకెన్ ఇంగ్లీష్” సంస్థలు వచ్చిన తరువాత, ఈ వేలంవెర్రి ఇంకా ఎక్కువైపోయింది.పోనీ వాళ్ళేమైనా పొడిచేస్తున్నారా? మా స్నేహితుడు, నాతో పనిచేసినవాడు, ఇంగ్లీష్ లో లీవ్ లెటర్ వ్రాయడం వచ్చేదికాదు. మాచేత వ్రాయించుకొనేవాడు. తను వాలంటరీ రిటైర్మెంట్ తీసికొని మన ఆంధ్ర దేశం లో “స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ” తెరిచి రెండు చేతులా డబ్బు చేసికుంటున్నాడుట. సర్వే జనా సుఖినోభవంతూ…

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–ఈ పధ్ధతి బాగుంది

novel method

నిజమే కదండీ, ఈ పధ్ధతి మహబాగ్గా ఉంది.మరచిపోవడానికి ఆస్కారమే లేదు. ఇదివరకటి రోజుల్లో ” మీ పెద్దాడి పెళ్ళి ఎప్పుడయిందీ ” అంటే ” అప్పుడు గోదావరి పుష్కరాల ముందర అయిందే ” అనేవారు కానీ, సరైన తేదీ చెప్పలేకపోయేవారు.పైన సూచించిన పధ్ధతిలో , మన ఇంటికి వచ్చేవారికి కూడా తెలుస్తుంది !!

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–పెళ్ళిళ్ళలో క్రొత్త పోకడలు !!

chennai wedding

మా చిన్నప్పుడు పెళ్ళి అయిదు రోజులు జరిపేవారు. ఆ తరువాత మూడు రోజులకి తగ్గించారు. అక్కడినుండి ఒక రోజులోకి దిగింది. ఈ మధ్యన వధూవరులు హాయిగా రిజిస్టార్ ఆఫీసుకి వెళ్ళి ఓ రండు సంతకాలు చేస్తే, మరు నిమిషంనుండీ, కాపురం పెట్టేయొచ్చు.ఇందులో వచ్చిన గొడవేమిటంటే మంత్రాలూ వగైరా ఉండబవు. పైన ఇచ్చిన న్యూస్ ఐటం చదివితే పుణ్యం,పురుషార్ధం ఉండే సౌకర్యం కూడా ఉంది.దేముడిమీద నమ్మకం ఉన్నవాళ్ళకి కూడా ఇది హాయిగా ఉంది !

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు

ajyajy

ఇంతకు ముందు ఒక పోస్ట్ వేశాను ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో వచ్చిన ఒక మంచి వార్త గురించి. లింకు సరీగ్గా రాలేదేమో అనిపించింది. అందువలన ఆ వార్తకు సంబంధించిన వివరాలు ఇస్తున్నాను. చదివి ఉపయోగించుకోండి.

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు

ఇప్పుడు తెలుస్తోంది రాజమండ్రీ నుండి వచ్చేసిన తరువాత ఏమేమి మిస్స్ అయ్యేమో!!

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–పాత సరుకులూ, సెంటిమెంట్లూ

    ఇదివరకటి రోజుల్లో అమ్మాయి కొత్త కాపురానికి వెళ్ళేటప్పుడు, సంసారానికి కావలిసిన వస్తువులన్నీ ఇచ్చి పంపేవారు. ఓ మంచం, పరుపూ, బీరువా,ఓపిక ఉన్నవాళ్ళు ఇంకా కొన్ని విలాస వస్తువులూ అమర్చేవారు.ఏంలేదూ, అమ్మాయి సుఖంగా కాపురం చేసికోవాలనే సదుద్దేశ్యంతో. ఆ ఆచారం కొద్దిరోజులు పోయిన తరువాత, అల్లుడిగారి దగ్గర ఏమేమి ఉన్నాయో చూసి, ఇంకా ఏమైనా కొనవలసినవి ఉంటే దానికి సరిపడే రొఖ్ఖం ఇచ్చేవారు.వీళ్ళకి కావలిసినవి కొనుక్కునేవారు.
కాపురానికి వచ్చేసరికే ఇక్కడ కొన్ని సరుకులు–గ్యాస్, కబ్బోర్డ్,డబల్ కాట్ లాటివి( ఎప్పటికైనా పెళ్ళి అవకపోతుందా, కాపురం పెట్టలేకపోతామా అనే ఉద్దేశ్యంతో) అమర్చుకొంటాడు. మామగారు ఇచ్చిన డబ్బుతో కొత్త దంపతులు కలిసి,ఇంకా కావలిసిన వస్తువులు కొనుక్కోవడం ఓ సరదా !! రోజులు గడిచే కొద్దీ ఇలాటి సరదాలన్నీ కొండేక్కేశాయి.

ఇవేకాకుండా కొంతమంది అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో ఉన్న పందిరిమంచమో, పడక్కుర్చీయో, అదీకాకపోతే మడత మంచమో ఏదో ఒకటి తన పాత జ్ఞాపకాలకి గుర్తుగా తెచ్చుకుంటాడు. అవన్నీ ముందరలో బాగానే ఉంటాయి, సంసారం పెరిగేకొద్దీ, ఇలాటివన్నీ పేరుకుపోయి ఇల్లంతా ఇరుకైపోయినట్లు కనిపిస్తుంది.అవన్నీ అమ్మడమో, ఎవరికో ఇచ్చేయడమో చేయవలసి వస్తుంది. ఇలా ఇచ్చేయవలసిన వస్తువుల్లో ముందరి విక్టిం కుర్చీయో,మడత మంచమో తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ భర్త వాళ్ళ ఇంటినుండి తెచ్చినవి.ఈ మడతమంచం కానీ, పడక్కుర్చీ కానీ ఇంట్లో ఎటువంటి స్పేస్సూ ఆక్రమించవు, ఏదో ఒక మూలని ముంగిలా కూర్చుంటాయి, అయినా పాపం,రెసెషన్ టైములో, వీటికే ముందరి ” పింక్ స్లిప్” వస్తుంది. ఆ వస్తువులు కొన్ని సంవత్సరాలు చేసిన నిస్వార్ధ సేవ ఎవరికీ గుర్తు రాదు!!

ఇప్పుడొస్తున్న ప్లాస్టిక్ ఫర్నిచర్ కానీ, బీన్ బ్యాగ్ కానీ, సోఫాలు కానీ మడతమంచం, పడక్కుర్చీ ఇచ్చే సుఖం ఈయగలవా? ఇదివరకటి రోజుల్లో సంసారాలు పెద్దవి కాబట్టి, చిన్న పిల్లలికి వేసే ఉయ్యాలలు పదికాలాల పాటు ఇంట్లో శోభాయమానంగా ఉండేవి. మొత్తం మూడు, నాలుగు తరాల వాళ్ళకి ఉపయోగించేవి.ఆ ఉయ్యాలకి నవారో, లేక ప్లాస్టిక్ చక్కీయో ఉండేది. ఎవరైనా అదృష్టం బాగోక, ఆ ఉయ్యాలక్రింద పడుక్కున్నారా, తెల్లారేటప్పడికి వాళ్ళ బట్టలు కూడా తడిసిపోయేవి (ఉయ్యాలలో పడుక్కున్న చిన్నిపాపాయి ధర్మమా అని!). ఖాళీ ఉయ్యాలని ఊపనిచ్చేవారు కాదు పసిబిడ్డకి కడుపునొప్పి వస్తుందనేవారు!ఏ కారణం చేతైనా ఉయ్యాల ఖాళీ ఉన్నట్లైతే దాంట్లో ఓ ఎర్రచందనం బొమ్మ ఉంచేవారు! ఆ ఉయ్యాలకి గిలకలూ అవీ కట్టేవారు, అవి చూసి పసిబిడ్డ ఆడుకోవడానికి.
ఇప్పుడో ఓ ఫోల్డింగ్ ఉయ్యాల తెచ్చుకోవడం, అదికూడా ఓ రెండు మూడు సంవత్సరాల్లో రిటైర్మెంట్ ఇచ్చేయడం, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికీ, ఒకటి రెండు కంటే ఎక్కువ బిడ్డల్ని కనే ఓపికా లేదు, పెంచే సామర్ధ్యం లేదు.ఆ రోజుల్లో చిన్నపిల్లలు నడక నేర్చుకోవడానికి, చెక్కతో ఓ బండి తయారుచేసేవారు, దానికి చక్రాలుండేవి.ఇప్పుడైతే అవేవో వాకర్లొచ్చాయి.ఈ రోజుల్లో పిల్లో,పిల్లాడో తొక్కడానికి సైకిలొకటి కొంటారు, కొత్తమోజు తీరిపోగానే దానికి బేస్మెంట్ లో కారు పక్కనో, బైక్ పక్కనో చైన్ వేసి కట్టేయడమే. అది అక్కడే మట్టి పట్టేసి, కృంగి కృశించిపోవాల్సిందే.

మామూలుగా వయస్సు పై బడ్డ వాళ్ళను అంటే అమ్మా నాన్న, అత్తా,మామ లను పక్కకు పెట్టినట్లే, వారు సంవత్సరాలు తరబడి, అభిమానం పెంచుకున్న వస్తువులు కూడా కొద్ది రోజుల్లోనే అదృశ్యం అయిపోతున్నాయి. ఏమైనా అంటే
ఇంట్లో స్పేస్ లేదుకదా అనే ఓ కుంటి సాకు చెప్తున్నారు. కనీసం వీళ్ళు బ్రతికి ఉన్నంతవరకైనా, వాళ్ళు అభిమానించే కొన్నైనా వస్తువులు ఉంచితే వీళ్ళకీ సంతోషంగా ఉంటుందని ఎందుకు గ్రహించరో తెలియదు.
ఏది ఏమైనా మనుష్యులకే విలువివ్వని ఈ రోజుల్లో, ప్ర్రాణం లేని వస్తువులకీ, సెంటిమెంట్లకీ విలువ ఇస్తారని ఆశించడం పొరబాటేమో!!

బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు –పూణే విశేషాలు

    ఈ వేళంతా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో టైము గడిచిపోయింది. ఇంకో విషయమండోయ్–బి.ఎస్.ఎన్.ఎల్ వాళ్ళు ఇవ్వననడం చేత, బుధ్ధిమంతుడిలా రిలయెన్స్ వాళ్ళ బ్రాడ్బ్యాండ్ తీసికొన్నాను.ప్రస్తుతం బాగానే పనిచేస్తూంది, స్పీడ్ కూడా బాగానే ఉంది.

    ఇంట్లోకి నెట్ వచ్చేసిందిగా, మాఇంటావిడ కూడా బ్లాగ్గు పోస్ట్ చేసేసింది. ఇంక కావలిసినంత కాలక్షేపం. బయటకు వెళ్ళాలంటే మాస్కులూ అవీ పెట్టుకోవాలేమో అనుకున్నాను. కానీ జనజీవితం మామూలుగానే జరుగుతోంది, స్వైన్ ఫ్లూ దారి స్వైన్ ఫ్లూదే. ఎందుకు చెపుతున్నానంటే గత 15 రోజుల్లోనూ, లోకల్లోనూ, బస్సు లోనూ కూడా వెళ్ళాను. పెట్టుకునేవాళ్ళు మాస్కులు పెట్టుకుంటున్నారు, లేని వాళ్ళు ( నా లాటి వాళ్ళు) భగవంతుడి మీద భారం వేసేస్తున్నారు. సర్వేజనా సుఖినోభవంతూ !!

    నిన్న నా మిస్టరీ షాప్పింగ్ సందర్భం లో ఆప్టెక్ వాళ్ళ ఆన్ లైన్ టెస్ట్ కి ఇన్విజిలేటర్ గా వెళ్ళాను. వాళ్ళ సర్వర్ డౌన్ అవడం వలన టెస్ట్ జరగలేదు. ఓ నాలుగు గంటలు వెయిట్ చేసి, రిపోర్ట్ ఇచ్చాను.టెస్ట్ జరగలేదు కనుక, సగం ఫీజే ఇస్తామన్నారు. క్రిందటి వారం లో కంప్యూటర్లూ, లాప్ టాప్ లూ అమ్మే ఔట్లెట్ కి ఆడిట్ కి వెళ్ళాను. అక్కడ వాడు ఎటువంటి ఉత్సాహం చూపలేదు. అదే సంగతి నా రిపోర్ట్ లో వ్రాసి, ఆ షాప్ ఫొటో ఒకటి తీసి ఆన్లైన్ లో పంపాను. నా రిపోర్ట్ బేర్ వాళ్ళకి మహా నచ్చేసింది–చాలా బాగుందని 10 కి 8 మార్కులు ఇచ్చేశారు. సో కాలక్షేపానికి ఏమీ లోటు లేదు.

    పూణే వచ్చిన తరువాతున్న సుఖమేమిటయ్యా అంటే, ఎంత ఎండ లో తిరిగినా చమట పట్టదు, అలసిపోము. రాజమండ్రీ లో ఓ పావుగంట బయట తిరిగి వస్తే బట్టలన్నీ తడిసిపోయేవి. ఇది తప్పించి మిగిలిన విషయాలన్నింటిలోనూ రాజమండ్రీ యే చాలా సుఖమండి బాబూ !! ఆటో వాడికి ఎక్కడకు వెళ్ళినా 20 రూపాయలకంటే ఇవ్వఖ్ఖర్లేదు. ఈ ఊళ్ళో మీటర్ ఉన్నా వెయ్యరు, వేసినా ఎవేవో లెఖ్ఖలు చెప్పి 50 రూపాయలదాకా లాగించేస్తాడు. మన దేశంలోనే ట్రాన్స్పోర్ట్ చవక.

ఏమైనా కోరిక కలిగి ఏ ఇడ్లీయో, వడో తిందామని హొటల్ కి వెళ్తే కొంప కొల్లేరైపోతుంది. ఇంక సినిమా ల సంగతి–మల్టిప్లెక్స్ కి వెళ్తే తెలుసునుగా !!

    మరీ పిల్లలకి దూరంగా ఉండి ఏం బావుకుంటామని కానీ, అక్కడే హాయిగా ఉంది ( నా మట్టుకి) , మా ఇంటావిడకి పిల్లలూ, తాపత్రయం ఎక్కువ. నేను అడగ్గానే నాతో రాజమండ్రీ కి వచ్చేసిందికదా, అందుకోసమని, ఆవిడ అడగ్గానే తిరిగి పూణే వచ్చేశాను.

ఇటుపైన అప్పుడప్పుడు పూణే విశేషాలు వ్రాస్తూ ఉంటాను.

బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు–నాగార్జున మీద కేసు !!