బాతాఖాని ఖబుర్లు—14

                                                  

    నేను ఉండే ఇంటాయన పేరు శ్రీ బాజీరావు జోషి. ఎంత జాగ్రత్త తీసికొనేవారో నా గురించి. పొద్దున్నే వేడి నీళ్ళు పెట్టి ముందర నన్నే లేపేవారు. పొద్దున్నే ఓ గ్లాసు లో పాలొకటి ఇవ్వడం ఎప్పుడూ మర్చిపోలేదు. మన ఇంట్లో వాళ్ళు కూడా ఇంత శ్రధ్ధ తీసికొంటారనుకోను. సాయంత్రం వచ్చేసరికి ఆరోజు పేపరూ, వచ్చిన ఉత్తరాలూ అన్నీ నీట్ గా సద్దేసి ఉంచేవారు. మా లాడ్జి కి దగ్గర్లోనే బస్ స్టాండ్ ఉండేది.స్టేషన్ నుంచి హోల్కార్ వాటర్ వర్క్స్ దాకా బస్సూ, అక్కడనుంచి ఫాక్టరీ దాకా నడక. ఆ దారిలో ఎవరైనా ఎక్కించుకొంటే సైకిలు. నాకు సైకిలు తొక్కడం రాదు. 42 సంవత్సరాలూ సైకిలు తొక్కకుండానే లాగించేశాను.

   ఇలాగే ఒకసారి తెలుగతనే సుందరరామయ్య అని నన్ను సైకిలు మీద వెనక్కాల కూర్చోపెట్టుకొని బస్ స్టాప్ దాకా తీసికెళ్తున్నాడు. కొచెం దూరం లో ఓ పోలీస్ ని చూశాడు. ఆ రోజుల్లో పోలీసులు చాలా స్ట్రిక్ట్. సైకిల్ మీద డబల్ రైడింగ్ చేస్తే పట్టుకొనేవారు. ఈ పెద్దమనిషి పోలీస్ ని చూసి నన్ను దిగిపోమని తను స్పీడ్ గా తొక్కుకొంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా దూరం నించి పోలీస్ చూశాడు. అతను నా దగ్గరకు వచ్చేడప్పడికి నేను ఒఖ్ఖడినే దొరికాను. ఎందుకు వదలడమూ అని నన్ను దగ్గరలో ఉన్న పోలీస్ చౌకీ కి తీసుకుపోయాడు. ఇదెక్కడి గొడవరా బాబూ ఇలా చిక్కడిపోయానూ అనుకొన్నాను. ఇంతట్లో పోలీస్ ఇనస్పెక్టర్ వచ్చి ” ఏమిటీ గొడవా, ఇతనెవరూ ” ( అంతా మరాఠీ లోనే అండి ) అన్నాడు. ఈ పొలీసాయనేమో కధ అంతా చెప్పాడు. ” అయితే సైకిలేది “అని అడగ్గానే “”ఆ సైకిలతను పారిపోయాడు ” అని చెప్పాడు.” వీడినేం చేసుకుంటాం” అని వదిలిపెట్టాసారు. అలాగ ” జువినైల్ డిలెక్వెంట్ ” లాగ పోలీస్ చౌకీ కి వెళ్ళే భాగ్యం కూడా కలిగింది. ఇదంతా మర్నాడు మా ఫ్రెండ్స్ కి చెప్తే ఇంకెవరూ నన్ను సైకిల్ మీద డబుల్స్ తీసికెళ్ళకూడదని డిసైడ్ అయిపోయారు !!

                                                 

     మా లాడ్జి కి దగ్గరలో ససూన్ హాస్పిటల్ ఉంది. అది దాటిన తరువాత జిల్లా పరిషద్ బిల్డింగ్ లో ఒక  సర్క్యులేషన్ లైబ్రరీ ఉండేది–అజంతా బుక్ స్టాల్ అని. అక్కడ అతను ప్రతీ రోజూ బొంబాయి అప్ డౌన్ చేశేవాడు( డెక్కన్ క్వీన్ లో). అతని దగ్గర తెలుగు మాస పత్రికలూ(  జ్యోతీ,యువా)వార పత్రికలూ ( ఆంధ్ర పత్రికా,ప్రభా) అన్నీ కొనుక్కునేవాడిని. ( చిన్నప్పుడు ఇంట్లో అయిన అలవాటు కదా–పుర్రె తో పుట్టిన అలవాటు పుడకలతోటి కానీ పోదంటారు).

   అలాగే ఇంగ్లీష్ మాగజీన్లు  ” లైఫ్,సాటర్దే రివ్యూ, టైమ్, న్యూస్వీక్, లాంటివన్నీ అద్దెకు తెచ్చుకొనేవాడిని.. ప్రతీ రోజూ రెండేసి చదివేయడమే!! చదువంటే రాలేదు కానీ ఇలాంటి వాట్లకి లోటు లేదు.ప్రతి రోజూ రూమ్ లో ” టైమ్స్ ఆఫ్ ఇండియా ” తెప్పించుకొనేవాడిని. నాకు చాలా పరిమితంగా హిందీ వచ్చేది, ఏదో అవసరానికి ఉపయోగించే పదాలు నేర్చుకొన్నాను. వారం వారం ఆ లైబ్రరీ కి వెళ్ళడం, పుస్తకాలు వచ్చేయాలేదా తెలిసికొని తెచ్చుకోవడం. ఓ రోజున వెళ్ళి ” జ్యోతి,యువా ఆయా క్యా ?” అని అడిగాను. ఆ రోజున నేను రెగ్యులర్ గా చూసే మనిషి లేడు– నేనడిగిన ప్రశ్నకి  యువా,జ్యోతీ ఏదో అమ్మాయిల పేర్లనుకొని ” ఓ లోగ్ అభీ తక్ ఆయా నహీ ” అన్నాడు. ఇంక అప్పడినుంచీ నా హిందీ జ్ఞానం ప్రదర్శించడం తగ్గించుకోవాలని డిసైడ్ అయిపోయాను.

                                                 

    మా రూం లో ఉన్న  మా ఫ్రెండు, నేనూ కలసి ఓ రేడియో కొందామని ప్లాన్ చేశాము. ఇద్దరం సగం సగం వేసికోవడమూ,ఎవరు ముందర రూమ్ ఖాళీ చేస్తే  రేడియొ కావల్సిన వాళ్ళు ఆ సగం రెండో వాడికి ఇచ్చేసి దానిని అచ్చంగా స్వంతం చేసేసుకోవడమూ. లక్ష్మీరోడ్ కెళ్ళి ఓ రేడియో కొనుక్కున్నాము. రాస్తా పెట లో సింగ్ హొటెల్ అని ఉండేది. అక్కడ చాలా రష్ గా ఉండేది. నెలకీ 35 రూపాయలు. పగలు ఫాక్టరీకి డబ్బా ( అంటే మన భాషలో కారీర్) పంపేవాడు. ఆ ప్రాంతాల్లో ఉన్న దక్షిణభారతీయులందరూ చాలామంది అక్కడే భోజనం చేసేవారు. ఎంత రష్ అంటే ముందరే వెళ్ళి టోకెన్ తీసికోవాల్సి వచ్చేది. ముందుగా అక్కడికి వెళ్ళి టోకెన్ తీసేసుకోవడమూ, భోజనం టైమ్ అయ్యేదాకా తిరగడమూ,

                                            

    ఇంక సినిమాల సంగతి అడగఖర్లేదు. సంవత్సరం పూర్తి అయిన తరువాత చూసుకొంటే ( చూసిన సినిమాలు అన్నీ లిస్ట్ చేసేవాడిని, అది ఇప్పడికీ ఉంది) 300 లెఖకి వచ్చాయి !!. ఈ సింగ్ హొటల్ దూరం అయిపోయిందీ, పైగా ఈ సినిమాల గొడవలో చాలా సార్లు వేళ్ళేవాళ్ళం కాదు. ఇలా కాదని, మా లాడ్జ్ దగ్గరలో ” బాద్షాహీ ” అని ఒక హొటెల్ ఉండేది. దానిలో భోజనం గుజరాతీ పధ్ధతిలో ఉండేది . చాలా బాగ పెట్టేవాడు.వేడి వేడిగా చపాతీలూ, దాంట్లోకి నెయ్యీ, ఎంత కావలిస్తే అంత తినడమూ. ఫాక్టరీలో మేము అందరమూ కలసి భోజనం చేసేవాళ్ళం. చెప్పేనుగా నాకూ, మా ఫ్రెండు కీ బాద్షాహీ నుంచి వచ్చేది.డబ్బా, మావాళ్ళందరూ మాది లాగించేసేవారు. పైగా వారంలో ప్రతీ రోజూ ఎవరో ఒకరు మా రూమ్ కి రావడం, మాతోపాటు భోజనానికి రావడం ( గెస్ట్ ఛార్జీలు నెలాఖర్లో తీసికొనేవాడు). ఇలా నెలయ్యేసరికి బిల్లు తడిపి మోపెడయ్యేది. ఈ బాధలన్నీ భరించలేక మా ఫ్రెండ్ ( అతని స్నేహితులే చాలా మంది వచ్చేవారు)  డెక్కన్ జింఖానా లో ఇంకో లాడ్జ్ కి మార్చేశాడు. ఇప్పుడు రేడియో వ్యవహారం తేల్చుకోవాలిగా , నేను ఆ మిగిలిన 80 రూపాయలూ ఇచ్చేసి ఆ రేడియో ని స్వంతం చేసికొన్నాను. ( జీవితం లో కొన్న మొదటి వస్తువు) ఇంటికి రాయాలంటే , మా నాన్నగారు ఏమంటారో అని భయం. ఆ తరువాత నెలలో లక్ష్మీరోడ్ కి వెళ్ళి ” టిటోనీ ” వాచ్ స్మగుల్డ్ గూడ్స్ వాడి కొట్లో కొన్నాను. ఖరీదు 150 రూపాయలు. రిటైర్ అయ్యేదాకా దానినే వాడాను.

                                            

    అంతా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతందనుకోకండి. చెప్పానుగా శ్రీ శాస్త్రి గారింటికి ప్రతీ శనివారం వెళ్ళి హాజరీ వేసుకోవాల్సిందే. ఆయనెమో నేను ఏదో సుఖ పడిపోతున్నాననుకొని ఇంకా చిన్నవాడివే  ఏ.ఎమ్.ఐ.ఈ  పరీక్షకి వెళ్ళూ, శని, ఆది వారాలు నా దగ్గరకు వస్తూండూ, నేను చెప్తాను, అన్నారు. కాదంటే ఉద్యోగం పీకేస్తారేమో అని భయ పడి సరేనండీ అనేసి ప్రతీ శనాదివారాలు అక్కడికి వేళ్ళేవాడిని.. ఆయన ఫాక్టరీ లైబ్రరీ నుంచి పుస్తకాలు తిసికొచ్చి నాకు చెప్పేవారు. ఏమిటొ చదువు గొడవ వదిలిందికదా అనుకొన్నంత టైము పట్ట లేదు , మళ్ళీ ఊబిలో పడిపోయాను. ఇంతలో మా నాన్నగారు నాకు ఒడుగు చేస్తామూ, ఫలానా రోజున తిరుమల లోనూ అని ఉత్తరం వ్రాశారు. ఇది బాగుందనుకొని గురువు గారికి చెప్పకుండా తిరుపతి వెళ్ళిపోయాను ( మెడ్రాస్ మెయిల్లో)

   కొండమీదకు వేళ్ళడానికి బస్సులు దొరకలేదు అందుకని నడిచి కొండ ఎక్కేశాను ( గంటన్నర పట్టింది ) అప్పడినుంచీ , ఈవాళ్టిదాకా (ఏదో ఒకసారి తప్పించి ) కొండ నడిచే ఎక్కుతున్నాను (  ఆ పై ఆయన దయతో ). అక్కడ ఒడుగు పూర్తి అయినతరువాత మా అమ్మగారు, నాన్నగారు నన్ను బొంబాయి మెయిల్ ఎక్కించేసి వెళ్ళిపోయారు.. ఏదో హోటల్ లో తిండి తింటున్నాను కదా అని మా అమ్మ గారు కొత్త ఆవకాయ అదీ తీసుకొచ్చారు.  ఓ బాటిల్ నిండా వేసి దాన్ని ఓ గుడ్డ లో కట్టి ఇచ్చారు. అదేమో దార్లో లీక్ అయినట్లుందీ, పూనా లో రైలు దిగేసరికి, నేనూ, నా గుండూ, చేతిలో ఎర్రగా గుడ్డా. ఇంక చూసుకోండి ఏదో మర్డర్ చేసి పారిపోయి వచ్చిన వాడిలా కనిపించాను, పోలీసుల్ని,రైల్వే వాళ్ళని  ఊరుకోపెట్టడం కోసం నా పెట్టి తెరిచి తిరుపతి లడ్డూ పెడితేనేకానీ నన్ను నమ్మలేదు వాళ్ళు. ఇదంతా అర్ధరాత్రి రెండు గంటలకి.

                                       

     ఆ మర్నాడు ఫాక్టరీ కి వేళ్ళేసరికి మా గురువు గారి దగ్గర్నుంచి ఖబురూ,ఎక్కడికి పోయావూ ఇన్ని రోజులూ అని కోప్పడ్డారు ‘ ఇలా ఒడుగు చేస్తానంటే తిరుపతి వెళ్ళానండీ ‘ అన్నాను. నాతో చెప్పఖ్ఖర్లేదా అని, ఇప్పుడు ఒడుగు అంతఅర్జెంటా అని అక్షింతలు వేసేశారు.

బాతాఖానీ –(తెరవెనుక) లక్ష్మి ఫణి ఖబుర్లు

                                      

     ఈ మధ్యన చెప్పెనుగా మా ఇంట్లో  కంప్యూటర్ దగ్గర ” మ్యూజికల్ చైర్స్” ఆడుతున్నాం!!ఒకళ్ళు వదలడం తరవాయి రెండో వాళ్ళు గబుక్కున  ఆ చైర్ లాగేసుకోవడమే . అలాంటి ఒకానొక శుభసందర్భం లో నేను అక్కడ కూర్చొన్నానండీ. ఈవిడ వంటింట్లో కి వెళ్ళి, బయటకు వచ్చి ఫ్రిజ్ తెరిచింది. నా దగ్గరకు వచ్చేసి,  ” ఏదీ ఈ రెండు వేళ్ళలోనూ ఒకటి పట్టుకోండి ” అంది. మా పెళ్ళైన కొత్తలో డైలాగ్ ఏదో గుర్తుకొచ్చి ” ఛా ! మరీ ఈ వయస్సులో ఇలా అడుగుతామేమిటీ ” అని ఓ రొమాంటిక్ డైలాగు వేశాను. ఆవిడ ” వెధవ్వేషాలు వెయ్యకుండా ఏదో ఒకటి పట్టుకోండి ” అంది. సరేనని పట్టుకొన్నా. ఆవిడ ” సరే ఇవాళ బీట్రూట్ ” అంది. సంగతి ఏమిటంటే , ఈ మద్యన మేము పిల్లల్ని చూడ్డానికి పూణే వెళ్ళినప్పుడు ఓ డాక్టర్ గారిని కంసల్ట్ చేశాము. ఈవిడకి అస్తమానూ అరికాల్లో నొప్పి వస్తోంది. ఆయనేమో ఏవో టెస్ట్ లు చేసి, మందులు రాసిచ్చి,  బరువు తగ్గించుకొంటే మంచిదీ అని చెప్పారు.అలాగని ఆవిద బరువు క్వింటాల్లలో లేదు, 65 కిలోలనుండి 55 కిలోలకి తేవాలిట.. ఇంక అప్పటినుంచీ క్యారెట్లూ, బీట్రూట్లూ, మొలకలెత్తిన పెసలూ , ఇలాంటివన్నీ తినడం మొదలెట్టింది. దీనికి సాయం ఆవుపాలొకటి, ఇన్నాళ్ళూ ఆవునెయ్యి దేముడిదగ్గర దీపానికీ, ఆవుపాలు నైవేద్యానికీ మాత్రమే ఉపయోగిస్తారనుకొనేవాడిని. అవి కూడా తాగితే మంచిదిట.  ఆ వ్యవహారం ఆవిడకే సీమిత్ అయితే పర్వా లేదు. ఇద్దరమే ఉన్నాముగా, మీకు మళ్ళీ ఇంకో వంట ఎందుకూ, నాతోనే లాగించేయండి అన్నది. ఇంక తప్పుతుందా’ ” ఎస్ మేడం ” అన్నాను.

                                      

   నేను ఏదో అరటికాయ ఆవ పెట్టిన కూరా, పనసపొట్టు కూరా లాంటివి తినొచ్చుకదా అని ఇక్కడకు వచ్చాను ( ఇవి అన్నీ పూణే లో దొరకవు).  ఇదిగోనండీ ఇలా కష్టాల్లో పడిపోయాను. నామీద బోల్డంత జాలి పడిపోయి వారం లో ఒకరోజు ఎదో సామాన్యులు ( నాలాంటి వాళ్ళు )తినే కూరలు చేయడానికి ఒప్పుకుంది( వాళ్ళెవరో వారానికి ఒక సారి ఎన్.వీ చేసికొన్నట్లు) .అందుకని నేను కొంచెం కొంచెం ( పావు కిలో కంటే ఎక్కువ అవకోడదు) తెస్తూ ఉంటాను. ఈ బాతాఖానీ ఖబుర్లు రాయడం హడావిడి లో ఈ కూరల సంగతి, కొంచెం అశ్రధ్ధ చేశాను. దాని పరిణామం ఇదిగో  ” ఓ వేలు పట్టుకో “. ఈ వూళ్ళో ఇంతమంది చుట్టాలున్నారూ, ఎవరో ఒకరు భోజనానికి పిలుస్తారా అంటే, వాళ్ళు మాత్రం ఎదో కొత్తలో వచ్చినప్పుడు పిలిచారు కానీ అస్తమానూ ఎందుకు రమ్మంటారూ?

                                      

    కంప్యూటర్  కొన్న కొత్తలో  ” తెలుగుదనం.కాం” లో వంటలూ అవీ చూసి ఏది కావాలంటే అవి చేశేది. నిన్న మా అన్నయ్య గారు ( కజిన్ ) ఆయన 80 వ పుట్టినరోజూ, భోజనానికి రండి రా అని పిలిచారు. అంతే చంకలెగరేసుకొంటూ పేపర్ మిల్లు దగ్గర వాళ్ళింటికి వెళ్ళాము. భోజనాల దగ్గిర ఆవిడకు దూరంగా కూర్చొని వాళ్ళు వడ్డించిన అరటికాయ( ఆవ పెట్టింది),వంకాయ కూరా, కొత్తావకాయితో , బాశింపట్టేసుకొని లాగించేశాను. అంత సేపు అలా కూర్చోవడం తో

రాత్రి అంతా కాళ్ళు నొప్పి. ఇంక ఇవాళ బయటకు వెళ్ళలేక ఇలా కంప్యూటర్ ముందర సెటిల్ అయిపోయి నా గోల రాస్తున్నాను !

                                      

   ఈ కథలో నీతి ఏమిటయ్యా అంటే ఇంటావిడ చెప్పింది విని ‘ వెర్రి వేషాలు వెయ్యకుండా, జిహ్వ చాపల్యం పక్కకు పెట్టుకొంటే  పుణ్యం, పురుషార్ధం దక్కుతాయి “

బాతాఖాని ఖబుర్లు —13

     ఆ డాక్టర్ గారు నా వైపు ఓ సారి ఎగా దిగా చూసి ” టేక్ ఆఫ్ యువర్ క్లొథ్స్  ” అన్నారు. పోన్లే అనుకొని పాంటూ, షర్టూ, బనీనూ తిసేశాను. ఆయన ఊరుకొంటారా మిగిలనది కూడా తీశేయ్ అన్నారు. వామ్మో ఇదెక్కడి గొడవరా బాబూ అని బోల్డంత సిగ్గు పడిపోతూ అదికూడా తిశేసాను. ఇదంతా చూస్తూంటే నాకు వణుకు ప్రారంభం అయ్యింది. ఆయనేమో నిర్వికారంగా, ఓచేత్తో స్టెతస్కోప్ పట్టుకొని నా గుండెఛప్పుడూ, రెండో చేత్తో నా పల్సూ చూడడం మొదలెట్టారు. 18 ఏళ్ళు వచ్చిన తరువాత అలా పూర్తి బట్టలు విప్పుకొని ఇంకోళ్ళ ముందు నుంచునేసరికి నాకు భయమూ, దడా మొదలయ్యాయి, అది ఆయనకి, పల్స్ ద్వారానూ, స్టెత్ ద్వారానూ తెలిసింది. ఆ రీడింగ్స్ చూసేసరికి ఆయనకి దడ వచ్చేసింది-” వీడు నా చేతుల్లో పోతాడేమో ” అని. ఏమిటి అంత ఖంగారు పడతావేమిటీ అన్నారు. భోరుమని ఏడిచేసి  ” ఎప్పుడో బాగా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు మడి గా ఉండాలంటే బట్టలు విప్పుకొని భోం చేశాను కానీ ఇలా పరాయి వాళ్ళ దగ్గర వస్త్ర సన్యాసం  చేయలేదు” అన్నా. ఈయన అప్పటి రీడింగ్స్ ని బట్టి నన్ను ” మెడికల్లీ ఫిట్” చేయలేను అన్నారు. ఇంకేముందీ మళ్ళీ ఏడుపు మొదలెట్టాను, నేను ఉద్యోగం లో చేరకుండా ఇంటికి వెళ్తే నన్ను బయటకు తోలేస్తారూ అని. ఈ యనకేమో నన్ను ఎలా ” ఫిట్” చేయాలో అర్ధం అవలేదు. ఏమైనాఅంటే మళ్ళీ ఏడ్చేస్తానేమో  అని భయం ! ఇది కాదు పధ్ధతీ అని,ఏవో ఓ రెండు    టాబ్లెట్లు నా నోట్లో పడేసి, బట్టలు వేసుకొని టేబిల్ మీద పడుక్కోమన్నారు.

కొంచెం సేపు  ( ఓ గంట తరువాత) అయిన తరువాత, అక్కడ ఉన్న నర్స్ నన్ను లేపి, ఇంక నువ్వు వెళ్ళిపో డాక్టర్ గారు నిన్ను” ఫిట్ ” చేశాశారు. ఆయన ఏరీ అని వెతికితే తెలిసింది– నేను నిద్ర లో ఉండగా ఆయన నన్ను చెక్ చేసేసి “ఫిట్ ” డిక్లేర్ చేశారు,  మెళుకువ గా ఉండగా చెక్ చేస్తే మళ్ళీ ఏం ప్రాణం మీదకు తెస్తాడో అని.

ఎలాగైతే నన్ను మెడికల్లీ ఫిట్ అన్నారండీ.  ఆ కాగితాలన్నీ తీసికొని మా ఫాక్టరీ కి  అఘమేఘాల మీద పారిపోయాను.

అట్టి విధంబున నేను  02/03/1963 న గవర్నమెంట్ ఉద్యోగస్థుడయ్యానండీ. మా ఫాక్టరీ పేరు  ” హై ఎక్స్ ప్లోజివ్స్ ఫాక్టరీ  ” ఇది పూనా లో కర్కీ అన్న ప్రాంతంలో ఉంది. ఆ రోజు నాకు ఎవరితోటీ పరిచయం అవలేదు. ఏదో ఒక చోట కూర్చోపెట్టి రూల్సూ, రెగ్యులేషన్సూ చదవమన్నారు. కేంటీన్ కి వెళ్ళి భోజనం చేశాను. నేను ఫాక్టరీ లో తిరుగుతూంటే నన్ను ఎదో మెసెంజర్ బోయ్ అనుకొన్నారు, ఏమ్ చెయనూ నా షేప్ అలా ఉండేది !! ఎవడూ నమ్మడే నేను సూపర్వైజర్ అని. మనికేంటిలే జీతం ఇస్తారు కదా అని నేనూ ఏమీ పట్టించుకోలేదు . ఆ రోజు సాయంత్రం మా కజిన్ హాస్టల్ కి వెళ్ళి నా బిచానా అంతా తీసేసుకొన్నాను. అక్కడ నుంచి ఫాక్టరీ దాకా రోజూ రావాలంటే బాగా దూరం అవుతందని. పూనా స్టేషన్ ఎదురుగుండా ” నేషనల్ హొటెల్ ” అని ఉంది. నా సంసారం అంతా తీసికొని అక్కడ చేరిపోయాను. రోజుకి 10 రూపాయలు. ఆ రాత్రి అంత పెద్ద రూమ్ లో ఒక్కడినీ పడుక్కోడానికి భయం వేసింది.

మర్నాడు పొద్దుటే ఫాక్టరీ కి వెళ్ళాను. గేట్ దగ్గరే అదేదో కార్డ్ ఇచ్చి ఓ క్లాక్ లో పెట్టి పంచ్ చేయమన్నారు, నేను వచ్చిన సమయం సెకండ్ల తో సహా వచ్చేసింది. అంతకు ముందు అలాంటివేమన్నా చూస్తేనా అన్నీ వింతలే. కాంటీన్ కి వెళ్ళినప్పుడు ఓ ఇద్దరు తెలుగు వాళ్ళ మాటలు విన్నా. నావేపు చూపించి నాగురించే మాట్లాడుకొంటున్నారు, నవ్వుకొంటూ. ఇలా వదిలేస్తే ఇంకా దేంట్లోకి వెడతారో అని నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసికొన్నాను. వాళ్ళూ నా లాగే ఉద్యోగం లో చేరారు . పైగా నన్ను పలకరించినతనిది కాకినాడ. ఇంకేం మన ఊరు వాడు ఒక్కడైనా దొరికేడురా బాబూ అని. ఏదో ఖబుర్లు చెప్పేసుకొని ఎక్కడ ఉంటున్నారూ అని అడిగాడతను. ఫలానా నేషనల్ హొటెల్ లో అన్నాను. అక్కడ ఖరీదు ఎక్కువా, నీజీతం అంతా రెంట్  కే అయిపోతుందీ, మేము ఉండే లాడ్జి లో ముందర గెస్ట్ గా చేరు– దానికైతే రోజుకి ఒక్క రూపాయే, ఓ నెల తరువాత బెడ్ ఇస్తాడూ, దానికి నెల కీ 35 రూపాయిలూ  అని చెప్పారు. ఆ సాయంత్రం నేనూ, అతనూ కలసి నా సామాను వీళ్ళ రూం లోకి మార్చేశాము. ఇంటి అతను చూసి ” ఏ బచ్చా కౌన్ హై ” అన్నాడు. ఇలా మా ఫాక్టరీ లో ఇవాళే చేరాడూ అంటే నమ్మడే!! ఏమైతేనే ఓ గూడు సంపాదించేసేమండీ. ఎదురుగుండా స్టేషన్ కాంటీన్ లో భోజనం. అలా సత్రం భోజనం మఠం నిద్రా ప్రారంభం అయ్యాయి.

ఈ విషయాలన్నీ వివరంగా మా ఇంటికి రాసేశాను. ఆ వారం లోనే మా నాన్నగారు  పూనా వచ్చి నా అరేంజిమెంట్స్ చూసి, సంతృప్తి పడి ఆ ఇంటాయనతో మాట్లాడేసి తిరిగి వెళ్ళిపోయారు.  అలా నెల తిరిగేసరికి నా మొదటి జీతం చేతికి వచ్చేసిందండీ అక్షరాలా 205రూపాయల, 50 పైసలు. ఆ విషయం మా నాన్నగారికి రాస్తే ఆయన తిరుగు టపాలో రాశారూ ” పోన్లేరా నాకు ఇప్పడికి నెలకి 275 రూపాయలే జీతం, నీకు మొదట్లో నే 205 వచ్చిందీ” అని !!

ఆ నెల అద్దె ఇద్దామని మా ఇంటాయన దగ్గరకు వెళ్తే ఆయన మొత్తం 70 రూపాయలు ఇమ్మన్నారు. ఇదేమిటీ 35 అన్నారు కదా అంటే ” కాదు నీకైతే 70 అన్నారు.”

మా నాన్నగారు వచ్చినప్పుడు ఈయనతో చెప్పారుట ” మా వాడిని నీ చేతిలో పెడుతున్నానూ, చాలా చిన్నవాడు, వాడి చేత ప్రతీ నెలా కొంత బాంక్ లో వేసేటట్లు చూసే బాధ్యత మీదే “. అందుకని ఈయనగారు 35 రూపాయలు నా పేర ” సారస్వత్ బాంక్ ” లో అక్కౌంట్ ఓపెన్ చేయించి ప్రతీ నెలా వేసేవారు.

.

బాతాఖాని ఖబుర్లు—12

                                        

    ఈ ఇంటర్వ్యూ వ్యవహారం అయిన తరువాత, ఎవరినైనా అడుగుదామంటే,భయం.ఇచ్చేది మానేస్తారేమో నని !! మెల్లిగా అన్ని బస్సులూ ఎక్కి, హాస్టల్ కి తిరిగి వెళ్ళాను. అక్కడ అందరికీ ఆత్రుత, మనవాడి ఉద్యోగం సంగతి ఏమయ్యిందో అని. ఆ రోజు సాయంత్రం మళ్ళీ శ్రీ శాస్త్రి గారింటికి థాంక్స్ చెప్పడానికి వెళ్ళాము. పోనీ అప్పుడైనా ఏమైనా తెలుస్తుందేమోనని పెద్దాళ్ళిద్దరూ మాట్లాడుకొంటుంటే విందామని ప్రయత్నించాను. అబ్బే అంతా సీక్రెట్.

                                         

    ఆ రోజు బయల్దేరి మెడ్రాస్ వెళ్ళాము. మా నాన్నగారు నన్ను అక్కడ మా బాబయ్య గారింట్లో వదిలేసి ఆయన అమలాపురం వెళ్ళిపోయారు. చెప్పానుగా ముందర– నాకు కొద్ది కొద్దిగా కాళ్ళ మీద తెల్లగా మచ్చలు ప్రారంభం అయ్యాయి అని–ఆ విషయమై ఎవరో డాక్టర్ల దగ్గరకు తీసికెళ్ళారు.వాళ్ళు ఎదో ట్రీట్మెంట్ చెప్పారు. జనవరి 30 తారీకు దాకా అక్కడే ఉండి ఇంక బయలుదేరాను. నేను ఏదో పెద్దవాడినైనట్లు మా బాబయ్య గారు సెంట్రల్ స్టేషన్ కి నన్ను ఒక్కడినీ పంపించారు. అంత పెద్ద స్టేషన్ లో ఏ రైలు ఎక్కడ ఉంటుందో  తెలియదు.  రాజమండ్రి లో మెడ్రాస్ మెయిల్ ఎక్కితే అక్కడికి వెళ్తామని తెలుసు. నాకు తెలిసినదల్లా ఆ పేరు ఒక్కటే ( మెడ్రాస్ మెయిల్).ఎప్పుడూ ఒక్కడినీ రైల్ ఎక్కలేదుకదా. అందర్నీ అడగడం మొదలెట్టాను–మెడ్రాస్ మెయిల్ ఏ ప్లాట్ఫారం మీద అని. ప్రతీవాడూ నవ్వడమే !! చివరకి ఓ ధర్మాత్ముడు  నా మీద జాలి పడి ఎక్కడకు వెళ్ళాలి అని అడిగాడు.నేను రాజమండ్రీ వెళ్ళాలన్నాను. మరి ఐతే మెడ్రాస్ మెయిల్ అంటావేమిటీ– ఇక్కడ అన్నీ మెడ్రాస్ మెయిళ్ళే. నువ్వు ఎక్కడకు వెళ్ళాలంటే ఆ ఊరి మెయిల్ ఎక్కాలి అని జ్ఞానోదయం చేశాడు.

                                       

      మా నాన్నగారు అప్పుడు ముంగండ లో చేస్తున్నారు. అందువలన నేను అక్కడికే వెళ్ళాను. ఇంకో సంగతి ఏమిటంటే నాకు ఉద్యోగం వచ్చిందా లేదా అనే విషయం ఎవరికీ చెప్పఖర్లేదు !! నా వాలెన్సీ గొడవలన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ ఎందుకూ? ఓ పదిహేను రోజులు ఇలా అజ్ఞాతవాసం లో గడిపిన తరువాత, మా అన్నయ్య గారు అమలాపురం నుంచి ఖబురు పెట్టారు, నా ఉద్యోగం ఆర్డర్ వచ్చేసిందోయ్ అని. అమ్మయ్య ఇంక పర్వాలేదు అందరి దగ్గరా పెద్ద్ పోజు కొట్టెయ్య వచ్చూ అని అమలాపురం వచ్చేశానండీ.  మా క్లాస్మేట్స్ అందరికీ నన్ను చూశేసరికి చాలా ” జలసీ ” వచ్చేసింది ( అని నా భావన !!). కొంతమంది అయితే “ఒరే నువ్వు అక్కడికి వెళ్ళిన తరువాత మాక్కూడా ఏదైనా చూడరా “. ఇలాంటివి వినీ కొద్దీ నేనేదో పెద్ద గొప్ప వాడినయిపోయినట్లు గా ఉండేది. పైగా మా ఫ్రెండ్స్ అందరూ నా కంటే చాలా పెద్దవాళ్ళు ( వయస్సులో). వాళ్ళ పేరెంట్స్ కూడా ” చూడు అంత చిన్న వయస్సు లోనే ఉద్యోగస్తుడైపోయాడు, చూసి సిగ్గు తెచ్చుకోండి”అనడం. పైగా బొంబాయి దగ్గర, ఇంక నా ఇమేజ్ చాలా గొప్పదైపోయింది. జీతం 150 + అలవెన్సులు, (ఎంతో నాకూ తెలియదు.).

                                        

    ఇంక నన్ను పూనా పంపే కార్యక్రమం ప్రారంభం అయ్యిందండీ. ఇంకో నాలుగు జతల బట్టలూ, అలాంటివన్నీ అన్న మాట. ఓ ట్రంక్ పెట్టీ( కొత్తది),ఓ బాగ్గూ, ఆ బట్టల కాంబినేషన్ ఇప్పుడు తలుచుకొంటె నవ్వు వస్తుంది– ఏదో దసరా బుల్లోడి లాగ తయారు చేశారు. అందరూ అన్ని రకాల జాగ్రత్తలూ చెప్పడమే. డబ్బులు వృధా చెయ్యకు, వేళకు భోజనం చేయి, రాత్రిళ్ళు ఒక్కడివీ తిరగకూ, ఎవరినీ ఎక్కువగా నమ్మకూ వగైరా వగైరా. ఎవర్నీ కాదనకుండా బుద్దిమంతుడి లా అన్నింటికీ తల అవసరమైనదానికన్నా ఊపేసి హైదరాబాద్ ప్రయాణం అయ్యానండి. మా నాన్న గారు నాతో కొవ్వూరు దాకా వచ్చేరు. పాపం పిల్లాడు ఇంత దూరం వెళ్తున్నాడే అని కన్నీళ్ళు పెట్టేసుకొన్నారు. అప్పుడు నాకూ ఏడుపు వచ్చేసిందండి. అంత దూరం లో ఒక్కడినీ ఎలా ఉండాలో తెలియదు, భాష తెలియదు. అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళకి అర్ధం అవుతుందో లేదో తెలియదు.  ఇంక చదువుకోనఖర్లేదు అన్న ఆ ఫీలింగే నన్ను ధైర్యంగా ముందుకు తీసికెళ్ళింది !! నామీద ఎవరూ అజ్మాయిషీ చెయ్యరూ, నా ఇష్టం వచ్చినట్లు ఉండచ్చూ , అబ్బ అసలు అవి అన్నీ ఊహించుకొంటేనే హాయిగా ఉంది.

                                     

    హైదరాబాద్ లో మా చిన్నన్నయ్య గారు నన్ను స్టేషన్ లో రిసీవ్ చేసుకొన్నారు. ఓ రెండు రోజులు అక్కడ గడిపాను. జీతం వచ్చేదాకా ఖర్చు కని నాకు ఆయన ఓ రెండు వందలు ఇచ్చారు. ఇంటి దగ్గర బయల్దేరేముందర అందరూ కలిపి ఓ రెండు వందలు చేతిలో పెట్టారు.

                                        అలా 18 ఏళ్ళు నిండకుండా, ఉద్యోగం లో చేరడానికి ( 18 ఏళ్ళు నిండిన మర్నాడు) పూనా లో అడుగు పెట్టానండీ. క్రిందటి సారి అయితే మా నాన్న గారు ఉన్నారు అన్నీ చూసుకోవడానికి, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, అన్నీ కొత్తే, ఆ ఉత్సాహం లో వచ్చేశానుకానీ అంతా భయం భయం గా ఉంది,

   ఇంత పెద్ద ఊళ్ళో నెగ్గుకు రాగలమా అని, ఓ భాష తెలియదు. ఒక్కసారిగా ఒంటరి వాడినైపోయాను.ఇంటి మీద బెంగఒచ్చేసింది. నాకొచ్చిన ఇంగ్లీష్ లో ఓ పేద్ద ఉత్తరం రాశేశాను, ఇంటికి. ఆ రోజు రెస్ట్ తీసికొని మర్నాడు ఫాక్టరీ కి వెళ్ళానండి. ఆ రోజు  మాజీ భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు స్వర్గస్థులైనారని శలవు ట. ఇదెక్కడి ప్రారంభం రా బాబూ , మొదటి రోజే ఇలా అయిందీ అని . నేను ఉద్యోగం లో జాయిన్ అవగానే టెలిగ్రాం ఇమ్మన్నారు. ఇంకెక్కడ ఇవ్వడం. జాయిన్ అవలేదు అని ఇస్తే అదో ఖంగారు వాళ్ళకి. ఆ రోజుల్లో ఈ ఫోన్లూ అవీ అంతగా ఉండేవి కాదు, ఉన్నా నాకు ఎలా చేయాలో తెలియదు ( ఫొటొల్లో తప్ప ఒక్కసారి మాత్రమే ముట్టుకొన్నాను)

   మర్నాడు పొద్దున్నే బయల్దేరి నా జైత్రయాత్ర మళ్ళీ మొదలెట్టి ఎలాగైతేనే ఫాక్టరీ కి చేరానండి. ఏదో రూమ్ లో కొంతసేపు కూర్చోపెట్టి పక్కన ఉన్న ఇంకో పెద్ద ఫాక్టరీ కి వెళ్ళి మెడికల్ ఎక్జామినేషన్ చేయించుకు రమ్మన్నారు, అది పూర్తయితేనే నాకు ఉద్యోగంట. నాకు ఉన్న ఈ తెల్ల మచ్చల వల్ల అన్ఫిట్ చేస్తారేమోనని మళ్ళీ భయం.

అక్కడికి వెళ్ళగానే ఆ డాక్టర్ గారు ” అదేం ప్రోబ్లం కాదనేశారు”. అమ్మయ్య ఫర్వాలేదు మనకి ఉద్యోగం వచ్చేసినట్లే అనుకొన్నంత సేపు పట్టలేదు…….

బాతాఖానీ ఖబుర్లు — 11

                                                    

    పూనా లో ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి నన్ను అన్నిరకాల ముస్తాబులూ చేశారు. అమలాపురం లో ఆరోజుల్లో పెద్ద పెద్ద షాప్ లు ఉండెవి కాదు. అందువలన ఒక రోజు ముందుగా రాజమండ్రి వచ్చి , కొత్త బూట్లూ, కొత్త పాంటు, కొత్త చొక్కా కొనుక్కొని హైదరాబాద్ వెళ్ళామండీ. ఆ రోజుల్లో బొంబాయి వెళ్ళడానికి ఒక్క కంపార్ట్మెంట్ మాత్రం ఉండేది. దాన్ని ” వాడీ ” లో ఇంకో ట్రైన్ కి కలిపేవారు. ఎలాగోలాగ అది ఎక్కి మర్నాడు పొద్దున్న పూనా చేరాము. మా పెదనాన్న గారి అబ్బాయి అక్కడ   ఏ.ఎఫ్.ఎమ్.సీ. లో మొదటి సంవత్సరం లో ఉండేవాడు. మేం ఇద్దరం క్లాస్ మేట్లమే– బాగా చదువుకుంటే వాడిలాగ ఉండే వాడి నన్న మాట, మన కి ఆ యోగం లేదు ఏమైతేనే తను స్టేషన్ కి వచ్చి వాళ్ళ హాస్టల్ కి తీసికెళ్ళాడు. ఓ యమ్మో ఆ  మిలిటరీ డిసిప్లీన్ అవీ చూసిన తరువాత పోన్లే నేను ఇలాంటి కష్టాలు పడఖర్లేదు అని సంతోషించాను.

                                                    

    ఆ రోజు సాయంత్రం మేము ముగ్గురూ కలసి ( మర్చిపోయాను నా తో మా నాన్న గారు కూడా వచ్చేరండోయ్, పిల్లాడు ఒక్కడు వెళ్తున్నాడూ అని మా అమ్మమ్మ గారు పంపించేరు !!). ఆ పెద్దాయన శ్రీ శస్త్రి  గారి ఇంటికి వెళ్ళామండీ. ” అరే ఈ మాత్రం దానికి మీరు పెద్దవారు ఇంత దూరం రావాలా, అబ్బాయిని పంపితే సరిపోను గా” అన్నారు ఓ హో మనకి ఉద్యోగం వచ్చేసినట్లే ఉంది అనుకొన్నాను. ఓ గంట సేపు అదీ ఇదీ ఖబుర్లు చెప్పుకొన్న తరువాత, ఇంక నా మీదకు దృష్టి పెట్టారు. ” బాగా ప్రిపేర్ అయ్యావా” అన్నారు. ఏదో ” హై ఎక్స్ప్లోజివ్స్ ఫాక్టరీ”లో ఇంటర్వ్యూ కదా అని గొప్పగా ఆల్ఫ్రెడ్ నోబల్, అవీ ఇవీ అన్నీ బట్టి పట్టేసి , ” ఆ బాగానే చదివానండీ” అన్నాను. ఆయన వాలెన్సీ, మాలిక్యులర్ వైట్,  అలాంటివి అడగడం మొదలెట్టారు. డిగ్రీ చేతిలోకి రాగానే వాటి గురించి మరచి పోయాను ( అలాంటివి గుర్తు పెట్టుకోవడం నామోషీ అనిపించి ). పరీక్ష పాస్ అయి ఇంకా రెండు నెలలు కాలేదు. నాకేమైనా జ్ఞాపకం ఉంటెకదా ఆయన ప్రశ్నల కి సమాధానం చెప్పడానికీ. నేను మిగిలనవి అన్నీ ప్రిపేర్ అయ్యానండీ అన్నాను, పెద్ద పోజు పెట్టి.  వాటి గురించి నేర్చుకోవడానికి ఉద్యోగం లో చేరిన తరువాత ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారూ, నువ్వు ముందర ఇప్పుడు నేను అడిగిన వన్నీ గుర్తు పెట్టుకొని రేపు ఇంటర్వ్యూ లో సమాధానాలు ఇయ్యి. అన్నారు.

                                                 

     అక్కడ నుంచి హాస్టల్ కి తిరిగి వచ్చిన తరువాత ఇంక చూడండీ నా అవస్థా!! కాలేజీ లో ఫస్ట్ యియర్ లో ఉన్నారు కదా, అక్కడ మా కజిన్ గారి ఫ్రెండ్స్ అందరూ అన్ని రకాల కెమిస్ట్రీ  పుస్తకాలూ తీసి నన్ను  తోమేశారండి ఆ రాత్రంతా. వాళ్ళకెంత సంబరమో. ఆ కాలేజీ కి అదే మొదటి బాచ్, రాగ్గింగ్ గురించి వినడమే కానీ చేయడానికి ఎవరూ  లేరు, నేనో బక్రా గాడిని దొరికాను వాళ్ళకి. ఎలాగో రాత్రి మూడింటి దాకా నాకు<b. " సర్వ శిక్షా అభియాన్" స్కీమ్ లో లాగ నన్ను తయారు చేశారు. ఈ హాస్టల్ నుండి నేను ఇంటర్వ్యూ కి వెళ్ళే ప్లేస్ 10 కిలోమీటర్లు ఉంది. ఎలాగో ఆ ముందర రోజు వెళ్ళిన రూట్ గుర్తు పెట్టుకొని బయల్దేరానండీ ( కొత్త పాంటూ, షర్టూ, కొత్త బూట్లూ –చప్పుడు చేశేవి  ). బస్సు దిగిన తరువాత ఓ కిలో మీటర్ నడవాలండి. కొత్త బూట్లు కదా కరవడం మొదలెట్టాయి. ఎలాగో లాగ అవస్థ పడి ఆ చోటకి చేరానండి.  సెక్యూరిటీ  వాళ్ళు గేట్ దగ్గర ఆపేశారు. అది రక్షణ శాఖ లో ఉన్న ఒక ఆర్డినెన్స్ ఫాక్టరీ, చేతిలో గన్స్ తో సెక్యూరిటీ అదీనూ. సమాధానం చెప్పి నా ఇంటర్వ్యూ లెటర్ చూపిస్తే లోపలికి వదిలారండి. నేనూ, నా వేషం, కుంటుకుంటూ ( బూట్లు కరుస్తున్నాయి గా ) ఓ రూమ్ లో కూర్చోపెట్టారండీ. ఓ అర గంట పోయిన తరువాత ఆయనెవరో మేనేజర్ ట ఆయన గదిలోకి పంపించారు. బూట్లు చప్పుడు చేసికొంటూ ఆయన రూం లోకి వెళ్ళాను. ఈ చప్పుడు విని ఆయనకి చిరాకు వచ్చినట్లుగా అనిపించింది నాకు( మనకేంటి అనుకున్నా). టేక్ యువర్ సీట్ అన్నవెంటనే  నా చేతిలో ఒక ఫైలూ అవీ ఉన్నాయి గా

అందులోంచి నా డిగ్రీ సర్టిఫికేట్ , ప్రిన్సిపాల్ గారిచ్చిన  “  రాముడు మంచి బాలుడు” లాంటి  సర్టిఫికేట్లు ( చాలా మంది దగ్గర బలవంతం చేసి తీసికొన్నాను), స్కొట్, గేమ్స్ససర్టిఫికేట్లూ. ఆయన అదృష్టం బాగుండి కాన్వకేషన్ అయిన తరువాత విశాఖపట్నం లో తీయించుకొన్న ఫొటో ఒకటీ మర్చిపోయాను !!

                                                

    ఆయన ఇంటర్వ్యూ మొదలెట్టారండి, — ” నీ పేరేమిటి, మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం, మీ అన్న దమ్ములెంత మందీ,శ్రీ శాస్త్రి గారు మీకు చుట్టమా” ఇలాంటివి అన్నీను. ఆ వాలెన్సీలు గొడవలు అన్నీ రాత్రంతా నా చేత బట్టీ పట్టించారే అవి తొందరగా అడిగేస్తే ఒక గొడవ అయిపోతుందికదా అని , లేకపోతే మళ్ళీ మర్చిపోతానేమో అని భయం. ఈ యనకేమో ఆ వ్యవహారమే పట్టదు. నా ఖంగారు నాది. ఇంతట్లో ఇంకొక చిన్న అఫీసర్ ( అడ్మిన్ ఆయన ) వచ్చి –” సార్ ఈ అబ్బాయికి ఇంకా 18 ఏళ్ళు నిండలేదూ, అప్పుడే ఉద్యోగం ఎలా ఇస్తామూ” అన్నారు( అంతా ఇంగ్లీష్ లోనే అయింది లెండి ). ఓరి నాయనో ఇదెక్కడి గొడవరా బాబూ అని నాకు టెన్షన్ వచ్చేసింది. 18 ఏళ్ళు నిండగానే వచ్చి జాయిన్ అవూ అన్నారు. ఉద్యోగం వచ్చినట్లా లేదా. అమలాపురం వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్పాలీ — అన్నీ వర్రీలే.

బాతాఖాని–తెరవెనుక ( లక్ష్మి ఫణి ) ఖబుర్లు

                      

     నేను, ప్రతి రోజూ నా ఖబుర్లే రాస్తున్నాను కాబట్టి ఏదో వారం లో ఒక రోజు మా ఇంటావిడ తో కలిపి రాయచ్చు కదా అని పెద్ద గొప్పగా ఈ కాలమ్ కి

లక్ష్మిఫణి ఖబుర్లు అని పేరు పెట్టినంత సేపు లేదు, ఆవిడ స్వంతంగా ఒక బ్లాగ్ ప్రారంభించేసింది !! ఆ రోజున ఈ–తెలుగు మీద దూర్ దర్సన్ లో ప్రసారమైన కార్యక్రమం చూసి తను కూడా అర్జెంట్ గా తెలుగు టైపింగ్ నేర్చేసుకొని రాయడం మొదలుపెట్టేసింది. ఊరికే పేరు పెట్టానుగా అని అదే కంటిన్యు చేస్తున్నాను. ఈ మధ్యన ఏమౌతోందంటే ఆవిడ కంప్యూటర్ ని వదలడం లేదు. నాకు ” భ క్తి ” టీ.వీ. లో గరికపాటి నరసింహారావు గారి ” మహా భారతం” కార్యక్రమం అయిన తరువాత “స్లాట్ ” ( అంటే రాత్రి  11.30 తరువాత అన్న మాట) దొరుకుతోంది !!. భోజనానికి లేవదు, సీట్ వదిలేస్తే నేను వచ్చేసి కూర్చుంటానేమో అని భయం.ఇదివరకే బాగుండేదండీ, ఏమి కావల్సినా నన్ను అడిగేది, ఇప్పుడో తనే సెర్చ్ చేసేసుకుంటోంది. పైగా  ” ఈ విష యం విన్నారా  ” అంటూ మొదలెడుతుంది. వంట లోకి నాకేమైనా కావల్సి ఉంటే ” తెలుగుదనం.కాం ” లో చూసి చెప్పండి  అది చేసిపెడతాను అంటూంది.

                    

    ఇది కాదు పధ్ధతీ అని ఇవాళ మా పక్కనే ఉన్న ” కుమారీ ” టాకీస్ లో  ” ఆకాశమంత ” సినిమా కి వెళ్ళాము. ఎంత అద్భుతంగా తీశాడండీ ఆ సినిమా!! ఇందులో మేము ఆనందించిన విషయమేమిటంటే అదేదో మా ఇంట్లో జరిగిన కథ లాగానే ఉంది. సినిమా లో లాగ మేమేదో ఎస్టేట్ ఓనర్స్ మి మాత్రం కాదు.

సినిమాలో లా కాకుండా మాకు ఇద్దరు పిల్లలు–ఒక అమ్మాయి, అబ్బాయి. ఇద్దరిదీ ప్రెమ వివాహాలే. మా అల్లుడు కూడా పంజాబీ (సర్దార్ కాదు). మా అనుమతితో జరిగిన పెళ్ళిళ్ళే. ఆ కారణాల వల్ల మాకూ ఆ సినిమా బలేగా నచ్చేసింది.

                    ఒక్కటె నచ్చలేదు– సినిమా ఇంటర్వెల్ లో అదేదో పిచ్చి సినిమా ట్రైలర్ వేసి ఈ సినిమా ఆనందం పాడిచేశాడు. అందువలన ఆ సినిమా సి.డి. రాగానే కొనుక్కొని మళ్ళీ మళ్ళీ చూస్తాను.

బాతాఖాని ఖబుర్లు —10

                              

     ఇంక అమలాపురం వదలి వెళ్ళే సమయం చాలా దగ్గరకు వచ్చేస్తోందండి. ఒక సంగతి మరచిపోయాను. మా ఇంట్లో మా అమ్మగారూ, వదిన గారూ , ఒకళ్ళ తరువాత ఒకరు ” లీవ్” తీసికొనేవారు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నేనే వంట చేయాల్సి వచ్చేది !!ఇత్తడిగిన్నెలో అత్తెసరు వేయడమూ,అది ఉడికిన తరువాత ఇత్తడి పళ్ళెం నాలుగు పెంకు ముక్కలతో పట్టుకొని గంజి వార్చడమూ, వంట అంతా మామూలు పొయ్యి మీద కట్టెలతో చేసేవాడిని. ఒకరోజు బీరకాయ కూర, దాని తొక్కు తో పచ్చడీ ( అదీ రుబ్బురొలు లో). పదార్ధాలు ఎలా ఉన్నా మాట్లాడకుండా తినేవారు. ఇవి అన్నీ నాకు వచ్చని మా ఆవిడకి, పిల్లలకీ ఎన్ని సార్లు చెప్పినా నమ్మలేదు. కారణం పెళ్ళి అయిన తరువాత ఎప్పుడూ వంట చేయలేదు . ఇంకొక సంగతి ఏమిటంటే మా నాన్నగారు ఆస్త్మా పేషంట్. ఆయనకి ఇంజెక్షన్ చేసికోవడం ఒక డాక్టర్ గారు నేర్పేరుట. దానికి ప్రిపరేషన్ అంతా నేనే చెయ్యడం, అంటే సిరంజి లో మందు ఎక్కించడం వరకూ. ఆయన పక్కనే పడుక్కొనేవాడిని.

                             

     బి.ఎస్.సి  రిజల్ట్స్ వచ్చే టైముకి నేను మా చిన్నన్నయ్య గారి దగ్గరకు వెళ్ళేను. అప్పుడు ఆయన వాల్తేర్ లో డి.ఎస్.సి రిసెర్చ్ చేస్తూండేవారు. పేపర్లలో కంటే ఒక రోజు ముందర అక్కడ రిజిస్టార్ ఆఫీస్ లో మార్కులు కూడా తెలుస్తాయని నన్ను తీసికొని అక్కడికి వెళ్ళారు. నా మార్కులు చూసిన తరువాత మా అన్నయ్య గారికైతే ఓ వైరాగ్యం వచ్చేసింది ( మార్కులు ఇలా కూడా వస్తాయా అని), ఆయన మొత్తం చదువంతా డిస్టింక్షన్ తోటే పాస్ అయ్యారు. నా మార్కులు తెలుసుకోవాలిగా మీరందరూ  మాథ్స్  99/300,  ఫిజిక్స్  140/300, కెమిస్ట్రి –160/300.  రెండు సబ్జెక్టల్లో కొంచెం బాగా వచ్చాయి కనుక మోడరేషన్ లో పాస్ చేశారు !! ఆ రెండూ కూడా ఆ ఎక్సామినర్స్ ప్రాక్టికల్స్ లో పూర్తి మార్కులు ఇచ్చిన ధర్మమా అని!!   ఆ 99 అంకె  నాకు చాలా నచ్చింది. పర్సెంట్ అయితేనే లేక 300 కి అయితేనే ఆ ఫిగర్ వచ్చిందా లేదా ? నేను అలా అనుకొంటే పర్వా లేదు , గొప్పగా మా నాన్న గారికి ఓ ఉత్తరం వ్రాశాను. వీడిని ఉప్పు పాత్ర వేసినా బాగు పడడు అనేసి అమలాపురం వచ్చేయమన్నారు. నిండా మునిగిన వాడికి చలేమిటండీ !!  ఊరుకోవచ్చా నేను గొప్పగా ” లెఖలు పోనీ రీవాల్యుఏషన్ కి పెడదామా” అన్నాను,

ఏదో ఒకటి అనక పోతే బావుండదు కదా అని. మా అన్నయ్య, నాన్నగారు ఏక కంఠం తో ” అలా చేస్తే ఉన్న మార్కులు మరచిపోయి వేశామూ, అని ఫేయిల్ చేసేస్తారు. పోన్లే అని ఇంక వదిలేశాను. ఇట్టి విధంగా నాకూ డిగ్రీ వచ్చేసిందండి. ఉద్యోగానికి అర్హుడయ్యానన్నమాట !!

                            

     ఆరోజుల్లో మా మామయ్య గారు అమలాపురం వచ్చేరు. ఇంట్లోవాళ్ళంతా అత్యవసర సమావేశం జరిపి నన్ను ఏం చెయాలా అని ఆలోచించారు. అప్పుడు ఆయన ఓ బ్రహ్మాండమైన సలహా ఇచ్చారు–పూనా లో మా చుట్టం ఒకాయన పెద్ద పొజిషన్ ( జనరల్ మేనేజర్ అన్న మాట ) లో ఉన్నారుట. ఆయన మా అమ్మగారికి పాక బడి లో క్లాస్ మేట్ ట, మా అమ్మమ్మ గారికైతే ” ఏరా సుబ్బులూ ” అనేంత చనువుట. అన్ని నాకు అనుకూలంగా నే ఉన్నాయి. ఇంకేముంది

   ఈ చుట్టరికాల వివరాల తోటి ఆయనకు ఓ ఇన్లాండ్ లెటర్ రాసేశారు ( అది నా చేతే రాయించారు, మా నాన్నగారు సంతకం పెట్టారు). ఏదో మొహమ్మాటానికి ఇంట్లో వాళ్ళందరూ ‘ పాపం వెధవకి ఇంకా 18 ఏళ్ళైనా నిండలేదూ అప్పుడే ఉద్యొగానికి అంత దూరం పంపడమేమిటీ ” అని బుడి బుడి ఏడ్పులు. ఈ హడావిడి లో వీళ్ళు ఈ ప్రొగ్రామ్ మానేసి నన్ను మళ్ళి చదువులో పెడతారేమో అని నాకు బెంగ. ఏలాగైతేనే నా అదృష్టం బాగుండి, ఆ పూనా ఆయన ఏకంగా ఇంటర్వ్యూ లెటర్ పంపేశారు.

 ఈ రోజుల్లో జడ్జీలు ఏదైనా మామూలు ఉత్తరం వ్రాసినా అది  కోర్ట్ లో అనుమతించినట్లుగా !!

బాతాఖానీ ఖబుర్లు —-9

                                  

    బి.ఎస్.సి ఎలాగోలాగ సెకండ్ యియర్ పాస్ అయ్యాను. ఆ రోజుల్లో మా నాన్న గారికి ఎమ్.ఎల్,సి కి పోటీ చేద్దామని ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది.  నా ఉద్దేశ్యం లో మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి వాటి జోలికి పోవడం అంత ఆరోగ్యకరం కాదు. ముఖస్తుతి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అరచేతిలో కైలాసం చూపించేస్తారు. మనం అది అంతా నిజం అనుకొని ఆ మత్తు లోకి వెళ్ళిపోతాము. ముందుగా ఐయినవిల్లి శ్రీ గణేశుడి పూజ చేయించి పాంఫ్లెట్లు అచ్చేయించి, హడావిడి అంతా మొదలుపెట్టారు. ఈ గొడవలలో పడి నా చదువు గురించి పెద్ద పట్టించుకొనేవారు కాదు. అదే కాకుండా నాకు చదువుకోడానికి కావలిసిన సదుపాయాలన్నీ సమకూర్చేరు. నాకు విడిగా ఒక రూమ్ ( మా ఇంట్లో మొత్తం  16 రూమ్ లు ఉండేవి) . చదువుతున్నాననే అందరి నమ్మకమూనూ.

ఇంట్లో అందరిదీ ఎలక్షన్ల ఖబుర్లే. వీడెవడో ఇన్ని వోట్లు చూసుకొంటాడూ, వాడెవడో ఇన్నీ అంటూ  రోజూ ఇవే విషయాల మీద చర్చలే.

                                

     నేను చెప్పానుగా నాకు చదువు మీదకంటే మిగిలిన విషయాలమీద ఆసక్తి ఎక్కువ అయ్యింది. ఎప్పుడు చూసినా క్రికెట్ కామెంటరీలూ, సినిమాలూ, పత్రికలూ ( ఇవేమైనా తిండి పెడతాయా ? ). ప్రతీ రోజూ గుడికి వెళ్ళడం, శనివారం అయితే మోబర్లీపేట లోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడమూ ఎప్పుడూ మానలేదు. అయినా మనం చదవకుండా దేముడు మీద భారం వేస్తే ఎలాగండీ ?

                              

       ఆ రోజుల్లో సినిమాల లో  ఎన్టీవోడూ, నాగ్గాడూ హీరోలు. కాలేజీ లో రెండు పార్టిలు. మాది నాగ్గాడి పార్టీ. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు– కొల్లి సుబ్రహ్మణ్యం అని వాడు ఎన్టీవోడి పిచ్చ అభిమాని. వాళ్ళ తమ్ముడు కృష్ణశాస్త్రి  మా పార్టీ.  ఇదే కాకుండా మా కాలేజ్ లో మంచి మంచి అమ్మాయిలు కూడా ఉండేవారు. ఎవరినో ఒకరిని అభిమానించడమూ, రోజూ ఆ గ్రూప్ వాళ్ళు వచ్చేదాకా ఇంట్లో కటకటాలలొంచి వెయిట్ చేసి, సరిగ్గాఇంట్లోంచి బయలుదేరి వాళ్ళ ముందర గా పెద్ద పోజ్ కొట్టుకొంటూ నడవడమూ( ఎంతైనా డిగ్రీ ఫైనల్ యియర్ వాళ్ళం కదా). గట్టిగా ఆ అమ్మాయిల తో కళ్ళెత్తి మాట్లాడేధైర్యం కూడా ఉండేది కాదు. ఉత్తిత్తినే మనసులో ఇష్టపడడం అన్నమాట !! ఎంతైనా వయస్సు అలాంటిది కదండీ !!  ఇన్నిన్ని వ్యవహారాలలో మునిగితే చదువు ఎలా అబ్బుతుందీ ?

                                 

    ఇంకో విషయమండోయ్  ఆ రోజుల్లో ఫైనల్ యియర్ లో ఓ కొత్త ” జాడ్యం” ప్రవేసించింది– పరిక్ష (మంచి ) మార్కులతో పాస్ అవుతామని ధైర్యం లేని వాళ్ళు ఆ ఏడాది ” విత్ డ్రా ” చేసేసికోవడం, మళ్ళీ సెప్టెంబర్ లో వెళ్ళడం. మా కాలజీ లో ఆ ముందటేడాది కొంత మంది ” బ్రిలియంట్” విద్యార్దులు అలా చేసి నిజంగా సెప్టెంబర్ లో “ఫస్ట్ క్లాసులు” తెచ్చుకొన్నారు. లెక్చరర్లూ దీనిని సమర్ధించేవారు. అందువలన అదో మంచి ఫాషన్ అయింది.  ఈ పధ్ధతేదో బావుందనుకొన్నాను. ఎలాగూ నాకు ఏమీ అర్ధం అవడం లేదు. ఎలక్షన్ల హడావిడి వలన నన్ను అడిగే వాళ్ళూ లేరు. పరిస్థితులు కూడా అనుకూలించాయి. ఒక సారి ఇలా నిశ్చయించుకొన్న తరువాత  పుస్తకాలు అన్నీ నీట్ గా  అలమార్లో పెట్టేసాను. పరీక్ష కి వెళ్ళడమూ, 90 నిమిషాలలో బయటకు వచ్చేయడమూ, ఎవరైనా అడిగితే

” విత్ డ్రా ” అయ్యేనని పోజు కొట్టడమూ. మా అమ్మ గారు అడిగితే అదే సమాధానం చెప్పాను. సెప్టెంబర్ లో వెళ్ళి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవచ్చు అని కోసేసాను. పాపం ఆవిడ కూడా నమ్మేసింది. పరీక్ష మానేసిన తరువాత ముందరగా మా నాన్నగారు గోదావరికి అవతలే ఉన్నారని కన్ ఫర్మ్ చేసికొని ఆరోజు సెకండ్ షో సినిమా ” జిస్ దేస్ మే గంగా బహతీహై ” సినిమాకి చెక్కేశాము.  పొద్దుటే లేచేసరికి ఇంకేముందీ, మా నాన్నగారు రాత్రే వచ్చారుట, రాగానే నేను చేసిన ఘనకార్యం మా అమ్మ గారు చెప్పేశారు. ఆరోజు తగిలాయండీ చివాట్లూ,జీవితం మీద విరక్తి వచ్చేసింది. నా మాట మీద ఎవరికీ నమ్మకం లేదే. అక్షింతలు వేయడం  అయిన తరువాత ఇంక వార్నింగ్ ఇచ్చేశారు . బయటకు వెళ్తే కాళ్ళు విరగ్గొడతామని ( కాలేజీ లో డిగ్రీ పుచ్చుకోవడానికి సిద్ధం గా ఉన్న పిల్లాడితో ఇలాగేనా ఉండేది?)

                                

     ఏమైతేనే సెప్టంబర్ వచ్చిందండీ. ఏది చదివినా అంతా వచ్చేసినట్లుండేది. పరిక్ష హాల్ లోకి వెళ్ళేటప్పడికి ఏమీ గుర్తొచ్చేదికాదు. అదేం ఖర్మమో!! ప్రాక్టికల్స్ కి ఆరోజుల్లో బయటనుంచి ఎక్జామినర్స్ వచ్చేవారు. నా అదృష్టం కొద్దీ ఫిజిక్స్, కెమిస్ట్రీ లకి మా నాన్నగారి శిష్యులే వచ్చారు. వాళ్ళకి నా నంబర్ ఇచ్చి ” కొంచెం వీడిని చూడండి థీరీ బాగానే రాశాడు( అలాగని నేను చెప్పాను!!) ప్రాక్టికల్స్ కొంచెం సహాయం చేసేరంటే క్లాస్ వస్తుంది ” ఈయన మాట కాదనలేక పాపం వాళ్ళు చేసేదేమిటో చేశారు, అంటే ఫుల్ మార్కులు ఈయడం అన్న మాట. ఇంతలా అందరూ సాయం పట్టినా చివరికి చావు తప్పి కన్ను లొట్టోయినట్లు గా థర్డ్ క్లాస్ లో పాస్ అయ్యాననిపించాను. అప్పడికి నా వయస్సు అక్షరాలా 17 సంవత్సరాల 7 నెలలు. చెప్పేనుగా ఆరోజుల్లో  ” ఏజ్ రెస్ట్రిక్షన్లు ” ఉండేవి కాదని.

బాతాఖానీ ఖబుర్లు–లక్ష్మీఫణి

  

    ఈ వేళ పొద్దున్నే వెళ్ళి రాజమండ్రి నియోజక వర్గం లో మేమిద్దరమూ మా ఓటు హక్కుని వినియోగించుకొన్నాము. ముందర ఏజంట్లు మా పేర్లే లేవు పొమ్మన్నారు. మా స్నేహితుడు ఒకాయన చాలా ఓర్పుతో ఆ లిస్ట్ అంతా వెదికి, మొత్తానికి మా పేర్లు పట్టుకొన్నారు.

        

     ఇంకో విషయం ఏమిటంటే, నా అభిమాన రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారు ” స్వాతి ” వీక్లీ లో రాస్తున్న కోతి కొమ్మచ్చి మీద నా అభిప్రాయం , ఆ పత్రిక వారు ప్రచురించారు. ఈ సంగతి మన బ్లాగ్ మిత్రులందరితోనూ పంచుకుంటున్నాను.

 

picture-0015

బాతాఖాని ఖబుర్లు –8

                                              

       మా అన్నయ్య గారు పడ్డ శ్రమకి నేను మంచి మార్కులతో ఎస్.ఎస్.ఎల్.సి పరీక్ష పాస్ అయ్యాను. ఆయనకి ఎక్కడ సంతోషం అనిపించిందంటే నాకూ, మా చిన్నన్నయ్య గారికి ( ఆయన చాలా తెలివైనవారు) వచ్చినన్ని మార్కులు రావడం. ఎలాగైతేనే కాలేజీ లో చేరడానికి అర్హత సంపాదించానండీ !!  ఏదో పేధ్ధ పొజిషన్ వచ్చినట్లు అనుకోవడం. ఇంట్లో మనకి పాంట్లు అవీ కుట్టించారు. అప్పడిదాకా నిక్కర్లే !! కాలజీ లో చేరేడప్పటికి నా వయస్సు 14 సంవత్సరాలు. ( ఆ రోజుల్లో ఏదో సర్టిఫికేట్ ఇచ్చేస్తే గొడవ ఉండేది కాదు).

    అప్పుడే నాకు కొంచెం సమస్య ( శారీరికంగా ) వచ్చింది. నాకు మోకాళ్ళ మీదా, చీలమండమీదా చిన్న చిన్న తెల్ల మచ్చలు కనిపించాయి ). వాటి సంగతి  చూసి మా డాక్టర్ గారు” ఏం పర్వాలేదు” అన్నారు. ఇంట్లో కూడా అంతగా పట్టించుకోలేదు.

కానీ అవే కొంతకాలానికి పెద్ద సమస్య అవుతుందని మా అమ్మ గారు, నాన్నగారు అనుకోలేదు. మా అమ్మమ్మగారైతే  ఏవో బావంచ గింజలు పొడి చేసి నీళ్ళతో తాగించడమూ, దానితో పేస్ట్ చేసి ఆ మచ్చల మీద రాయడమూ చేసేవారు. ఇది ఇలాగుండగా మా డాక్టర్ గారైతే ఆ స్పాట్ ల మీద ఏదో ఇంజెక్షన్ ఇచ్చి అల్ట్రా వైలెట్ లైట్ వేసేవారు. మొత్తానికి ఆడుతూ పాడుతూ ఉండవలసిన వయస్సు లో ఒక గులక రాయి పడింది. దీని వలన నాకు ఇతర సమస్యలు ఏమీ రాలేదు.కాని  అదొక ఫీలింగ్– మనకి ఎవరికీ రాకూడనిది ఎదో వచ్చిందీ అని.పాంట్ వేసికోవడం కంపల్సరీ అయిపోయింది( ఆ మచ్చలు ఎవరికైనా కనిపిస్తాయేమో నని). ఇదంతా ఎందుకు చెప్తున్నానంటె — ఆ రోజుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరితోనైనా షేర్ చేసికొంటే దాని పరిష్కారం ఉంటుందని ఆలోచించేవారు కాదు,దాచుకోవాలనే అనుకొనేవారు– దీని వలన నష్టాలే ఎక్కువ, ఈ సంగతి తెలిసేటప్పడికి చాలా  ఆలశ్యం అయి పోయింది.

                                                

     ఆ గొడవ ఒదిలేయండి, నా కాలేజీ జివితం బాగానే స్టార్ట్ అయ్యింది. ఉన్న సమస్య అల్లా ఏమిటంటే, అక్కడ ఉన్న లెక్చెరర్లు అంతా మా నాన్న గారికి తెల్సిన వారే. అదేదో గ్రూప్  ( ఎం. పీ.డబ్ల్యు.)  తీసికొన్నాను. దానికి నేనొక్కడినే ఉండే వాడిని. కాలేజీ లో ఏమైనా వెధవ్వేషాలు వేస్తే ఆ సాయంత్రానికి ఇంట్లో తెలిసిపోయేది.ఇదొక్కటే బాగుండలేదు. క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ కామెంటరీలు వినడం ఒక కార్యక్రమం. సినిమా లైతే అస్సలు అడగఖర్లేదు. ఆ రోజుల్లో హిందీ సినిమాలైతే రిలీజ్ అయిన 4 నెలలకి వచ్చేవి.శంకర్ జైకిషన్ పాటలంటే విపరీతమైన ఇష్టం. అందుకని వాళ్ళు మ్యూజిక్ ఇచ్చిన ప్రతీ సినిమా చూడడమే,ఆ సినిమాలకి ఒక ట్రాన్స్లేటర్  ( శ్రీ వేమూరి రామకృష్ణ గారు) ఉండేవారు. ఆయన అన్ని సినిమాలకీ  ” అది బొంబాయి మహానగరం” అని మొదలెట్టేవారు. అన్నికథలూ అక్కడే జరుగుతాయనుకొనేవాళ్ళం !! ఆయనకి ఇంత హిందీ ఎలా వస్తూందా అని ఒక ఆరాధన !!

                                                 

     ఎలాగైతేనే పి.యూ.సీ పూర్తిచేసి ఇంక డిగ్రీ లోకి వచ్చామండీ ( ఇప్పటి దాకా బుర్రకెక్కినదేమీ లేదు ). ఎమ్.పి.సి. గ్రూప్ తీసికోమన్నారు, ( ఏదొ పెద్ద ఇంజనీర్ చేశేద్దామని ), ఈ మధ్యలో బలవంతం ఛేసి  ఐ. ఐ.టి పరీక్ష కూడా రాయించేరు,  అవి అన్నీ కూడా లాటిన్, గ్రీక్ లా ఉండేవి. అందువలన అలాంటి కోర్స్ లలో చేరే అవకాశం రాలేదు. ఫస్ట్ ఇయర్ లో పరీక్ష ఉండేదికాదు. సెకండ్ ఇయర్లొ లాంగ్వేజెస్, జనరల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉండేది.అవి నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టులు. శ్రమ లేకుండా పాస్ అయ్యాను.

                                                  

    నేను ఎదో బాగుపడతానని శ్రీ రామకోటేశ్వర్రావు గారి దగ్గర ట్యూషనోటి !! అదీ రాత్రి  తొమ్మిదినుంచి పదకొండు దాకా. ఈ మధ్య లో మా కజిన్ ఒకడు వచ్చాడు కాలేజీ లో చేరడానికి. వాడు చాలా తెలివైన వాడు. తను మా అక్కయ్య గారింట్లో ఉండేవాడు, ( ఆవిడ మాకు మాథ్స్ చెప్పేవారు)

ఒకసారి ఎవో యూనిట్ టెస్ట్ అయితే వీడు ఆ ప్రశ్నలన్నీ ముందరే నాకు చెప్పేశాడు.. ప్రశ్నలు తెలిస్తే లాభం ఏమిటీ, ఆన్సర్లు కూడా చెప్పమన్నాను. అవి ఎలాగో బట్టీ పట్టేసి, మర్నాడు రాశేసాను. ఇంకేముందీ నాకేదో లెఖ్ఖలు చాలా బాగా వస్తాయని ఓ పెద్ద నమ్మకం వచ్చేసింది అందరికీ ను. నిజం చెప్పాలంటే నాకు ఆ మూడు సబ్జెక్టులూ ఏది రాదు. అస్తమానూ  క్రికెట్ కామెంట్రీలూ, సినిమాలూ ఐతే చదువు ఎక్కడినుంచి వస్తుందండీ? ఫిజిక్స్  ప్రాక్టికల్స్ లో అయితే యాక్సిలరేషన్ డ్యు టు గ్రేవిటీ ఎప్పుడూ 780 కి కుప్పించేయడమే !!స్టాప్ వాచ్ చూడడం కూడా తెలిసేది కాదు. ఎవడిదైనా రికార్డ్ చూసి రాసేసి గట్టు ఎక్కెయ్యడమే !!

                                                

     ఉన్నవి సరిపోనట్లుగా నాకు మోకాలి నొప్పి ఒకటి ఉండేది, ఇదివరకు బ్లాగ్ లో చెప్పేనుగా  తరవాణీఅన్నం, చక్రకేళీ,పెరుగూ కలిపి

కట్లూ ,అదంతా నేను ఆకలేసి తినేయడమూ--దీని వలన నన్ను క్రికెట్ ఆడనిచ్చేవారు కాదు. చెప్పకుండా ఎలాగోలాగ ఆడేసేవాడిని ( అంతే కాదు మా టీమ్ కి కెప్టెన్

కూడానూ). ఒక రోజు సాయంత్రం చీకటి పడేదాకా ఆడుతున్నాను, ఆఖర్లో కుడి పాదం మీద బాలు పడి దెబ్బ తగిలింది. ఇంట్లో చెప్తే ఇంకా దెబ్బలూ, ఎలాగరా భగవంతుడా అనుకొని, ఎలాగోలాగ ఇల్లు చేరికొని , ఓ పెద్ద కేక పెట్టేశాను. ఏమయ్యిందంటూ, మా అమ్మ గారు వచ్చేసరికి ” నా కాలు తలుపు లో పడిందీ, బెణికిందీ ”

అన్నాను.మా అన్నయ్య గారు హరి హర స్వామి గారి దగ్గరకు తిసికెళ్ళారు, ఆయనకీ ఈ కథే చెప్పాను, ” తలుపు కాల్లో పడిందా, కాలు తలుపులో పడిందా ” అని వేళాకోళం చేసి ఏదో కట్టారు. మన రోజు బాగుండక ఆ రాత్ర్ నిద్ర లో కలవరింతల్లో ” ఏయ్ సాంబూ బాల్ మెల్లిగా వెయ్యి అన్నానుట” ఇంకేముందీ నా దెబ్బలకి కారణం తెలిసిపోయి చివాట్లు పడ్డాయి.

%d bloggers like this: